అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/నేల
నేల
ఓ నేలా! మా తల్లీ! నీ కెంత దగ్గిరమ్మా మేము! నీకూ మా సుబ్బన్నకూ మధ్య చాపన్నాలేదు. నీకూ మా సుబ్బన్న దేహానికి ఒక చొక్కాగాని ఓ పంచగాని అడ్డంలేదు. నీకూ మా సుబ్బన్నకూ మధ్య నీలో నుంచి తీసిన ఓ నాపరాయన్నా లేదు.
మా సుబ్బన్న ఎక్కడినుంచి వచ్చాడు తల్లీ! నీ పిల్ల లందరూ నీలోంచే వచ్చారు. ఆకాశంలోంచి వచ్చిన కోటీశ్వరులు నీ రొమ్ముమీద నించోలేక, పడుకోలేక, కూర్చోలేక ఏ మూడంతస్తుల మేడలో కట్టుకుంటే ఏమి?
మా సుబ్బన్న తల్లెవరు? తండ్రెవరు? మా సుబ్బన్న దేవూరు, ఏ జిల్లా, ఏనాడు? మా సుబ్బన్న నడిగినా వాడే చెప్పలేకపోయాడు! హైదరాబాదు వీధుల్లో పెరిగాడు, హైదరాబాదు హోటళ్ళలో బల్లలు కడిగాడు, “చా లు” అందిచ్చాడు, హైదరాబాదు రిక్షాలు లాగాడు, హైద్రాబాదులో పేపర్లు ఇంటి ఇంటికీ పంచాడు!
మా సుబ్బన్న క్రింద పడుకుంటాడు. వాడువేసుకునేందుకు చాపలేదు, పక్కలేదు, పరుపులేదు, మంచంలేదు! వానవస్తే, ఎండకాస్తే; తడుస్తాడు, ఎండుతాడు. ఏ పంచనో నిలుచుంటాడు, ఏమూలనో పండుకుంటాడు!
హైదరాబాదు సిమెంటు రోడ్లు, హైదరాబాదు గల్లీలు మురుకు తూములు, సారాదుకాణాలు, పానుదుకాణాలు, కంపులు, ఈగలు, దోమలు, చేతులకఱ్ఱలు, బాకులు జంబియాలు సుబ్బన్నను అరికట్టలేకపోయాయి! దీనికి కారణం పద్దెనిమిదేళ్ళ ఈడువాడయిన సుబ్బన్న 1942వ సంవత్సరంలో మొట్టమొదట ఉద్భవించిన సైకిలు రిక్షాలలో ఒక దానిని తొక్కుతూ అద్దెవసూలు చేయడంలో వచ్చింది.
2
సుబ్బన్నకు ఉరుదూ తెలుగు, తెలుగు ఉరుదూ, తెలుగు కన్నడం, కన్నడం ఉరుదూ, ఉరుదూ కన్నడం, మహారాష్ట్ర కన్నడం, కన్నడ మహారాష్ట్రం - మహారాష్ట్ర ఉరుదూ, తెలుగు మహారాష్ట్రం, మహారాష్ట్ర తెలుగు, తెలుగుకన్నడ ఉరుదు - తెలుగు కన్నడం, తెలుగు కన్నడ ఉరుదువగైరా వగైరా అన్ని భాషలు వచ్చును.
ఆరోజు రిక్షాలో ఇద్దరు మహారాష్ట్ర బాలికలను తీసుకుపోతున్నాడు. మాట్లాడుకున్నది పాంచణా పైసలు. అక్కడ దిగగానే ఒక అణా ఎక్కువడిగాడు! ఆ బాలిక లిద్దరూ మండిపడ్డారు. “ఏమిరాపందీ! నువ్వు చదువుకోక పోవడం మూలాన నీబుద్దులు మురికిలో పొర్లేపందిబుద్దులు" అని ఆ బాలిక లిద్దరూ ఆ అయిదణాలు రిక్షాముందు నేలమీదపడేసి విద్యాలయంలోనికి చక్కాబోయారు.
అలాగే మా సుబ్బన్న నిలబడిపోయాడు! వాడికున్న ఆ కొంచెం మనస్సు ముక్కముక్కలై పోయింది. “నేను పందిని! నేను మురికిలో పొర్లుతాను! నేను పందిని! నావి పంది బుద్ధులు!” వాడి ఆలోచన, వాడి మానసిక ప్రపంచం చుట్టూ రెచ్చకొట్టబడిన తేనెటీగలా తిరిగింది.
ఓ నేలతల్లీ, నీ కుమారుడు సుబ్బన్న కళ్ళళ్ళో వేడినీళ్ళు తిరిగిన సంగతి నువ్వు చూశావమ్మా! ఓ నేలతల్లీ ఎంతమందమ్మా నీ బిడ్డలకు ఈలాంటి అవమానాలు?
కోటీశ్వరుల దొంగమార్కెట్టులలో వర్తక నీతి ప్రకారం తమ ఆత్మలకు విషం, మకిలీ, దుర్గంధము పూసుకొని మానవ జీవిత కల్మశంలో పందుల కన్న అధ్వాన్నంగా, లుకలుక పురుగులకన్న నీచంగా ఓ లాడినవారు ఆకాశంలో ఎగిరే అందమయిన పక్షులాతల్లీ! ఈ ఆలోచన సుబ్బన్న హృదయంలో పుట్టుదామని ప్రయత్నించింది కాని వాడు చదువుకోలేదు, వాడు కవిగాడు, ప్రభుత్వోద్యోగికాడు!
సుబ్బన్న వేడి కంటినీరు తుడుచుకునేందుకు పైనకండువా అన్నాలేదు. జుమారత్ బజారులో అమ్మేబట్టలు నేల సంబంధమైనబట్టలే. అవి ఇస్త్రీలు ఎరగవు, మా సుబ్బన్న చొక్కా చిరుగులతో ఇరవైఏళ్ళ జీవితంతో, ఇరవై ఏళ్ళ చెమటలతో, మురికితో మానవజీవిత కష్టనిష్టూరాలతో చివికి చచ్చుదారాలపోగులైన పాత! రెండణాలకు జుమారత్ బజారులో సుబ్బన్న కొన్నదే.
“నేను పందిని, సదువురాదు!” ఆ రిక్షాను సుబ్బన్న ఆ రిక్షా యజమానికి తిరిగి ఇచ్చేశాడు.
ఓ నేలతల్లీ! గోలుకొండ పోయేదారిలో పొలంలో నీ హృదయంపైన పండుకొని మా సుబ్బన్న వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి నీకు జ్ఞాపకంలేదూ! ఓ నేలతల్లీ! నీ మనస్సులో నిర్మలంగా ప్రత్యక్షం అయ్యే ఉస్మాన్ సాగరులోనా నీ సుబ్బన్న చచ్చిపోదామని దిగాడు? దిగినమాట వాస్తవమే మోకాలు లోతుకుపోయాడు; నడుంవరకు దిగాడు. రొమ్ము ములిగేటంతవరకూ ముందుకు నడిచాడు. కంఠం నీళ్ళతో మేలమాడింది. అటు చూచాడు ఇటు చూచాడు, దూరంలో ఉన్న నీ వక్షోజాలయిన కొండలు చూచాడు, నీ నవ్వు లైన పువ్వుల చెట్లు చూశాడు. నీ ఆలోచనలైన పొలాలు చూచాడు! "రామ రామా” అని ముందుకు నడిచాడు.
3
కాని ఓనేలతల్లీ! అక్కడ నువ్వు కొంచెం పైకిఉబికి వున్నావని వాడికేం తెలుసు! నీరు కంఠంనుంచి రొమ్ముకిందకు దిగింది. ఇంకా ముందుకు వెడితే నడుం కిందకు వచ్చింది. మాసుబ్బన్న ఎదురుగుండా దూరంగా ఉన్న ఆ కొండలు చూచాడు. ఆ గుట్టలావతల యేమి వుంటుంది? పొలాలు, గుట్టలు, వాని అవతల ఇంకా పొలాలు, గుట్టలు, అరకలు కట్టుకొని వ్యవసాయాలు, పశువులు, పొలాలు, పూలచెట్లు, గ్రామాలు, హైదరాబాదు వంటి పట్టణాలు, రైళ్లు, మోటార్లు అట్లా అట్లా తాను వెడతాడు. ఎక్కడ, భూమి ఆఖరైతే అక్కడ ఆగుతాడు. ఆ తర్వాత ఆకాశమో యేమో!
మా సుబ్బన్న వెనక్కి తిరిగి గట్టెక్కాడు ఓ నేలతల్లీ! నీ హృదయం మీదే నడిచాడు మా సుబ్బన్న. ఉన్న రెండు పాతలు వంటిమీద ఆరాయి. కడుపులో ఆకలి దావానలం అయినా చెయ్యిచాచి దేహి అని ఒక్కణ్ణి అడుగలేదు. కాని ఓ నేలతల్లీ! నీ బిడ్డలింకా అక్కడక్క డున్నారుసుమా! మా సుబ్బన్న కింత గంజో, ఇంత పిడచో నాయనా తాగు తిను అన్నారు. మా సుబ్బన్న ముందుకు సాగిపోయాడు.
ఓ నేలతల్లీ! నీ బిడ్డలైన తేళ్ళు మా సుబ్బన్నను కుట్టలేదు! పాములు కరువాలేదు! పెద్దపులులు ఘాండ్రుమనలేదు. కాని నీ సవితిబిడ్డలైన పోలీసు వాళ్ళు, భూకామందులు, ఏదో చదువుకొన్నవాళ్ళు మా సుబ్బన్నను చూచి ఎవడురావీడు అనుకున్నారు. కోటీశ్వరులకోసం వేసుకొన్న రైలుపట్టాలు కూడా నీ బిడ్డలకు పనికివస్తాయా ఓ నేలతల్లీ! అలా రైలు పట్టా మార్గమే పుచ్చుకొన్నాడు మా సుబ్బన్న. కతిపయ ప్రయాణాలు చేస్తూ హైదరాబాదు చెల్లెలైన పూనాచేరుకున్నాడు.
ఓ నేలతల్లీ! నీ అనుగు కుమారుడు సుబ్బన్న పూనాలో ఏమి చెయ్యాలి? రైలుదగ్గిరనుండి ఊళ్ళోకి సామాను తీసుకువెళ్ళే కూలివాడయ్యాడు. సుబ్బన్న బట్టలు చూస్తే దొంగ అనుకున్నారు. మొహంచూస్తే హరిశ్చంద్ర సంతతి అనుకున్నారు ప్రజలు.
ఒక మహారాష్ట్రుడు తన ఇంటిలో పనివానిగా ఉండమన్నాడు. ఓ నేలతల్లీ! ఆ యజమాని నీ సుబ్బన్నకు గుండులాంటి ఖద్దరు పొట్టిలాగూ, చొక్కా ఖాకీరంగువి ఇచ్చాడు. కాని ఆ బట్టలు నీరూపమే, నీరంగే! నువ్వే నీ ప్రియపుత్రుణ్ణి పొదువు కొన్నావు.
నువ్వు నీలో నవ్వుకున్నావు నేలతల్లీ! నీమీదే పడుకొని నీ పుత్రుణ్ణి హృదయానకు అదుముకునేదానవు. ఇంటివారు క్రిందపడుకునే సుబ్బన్నను చూచి తిట్టేవారు, చివాట్లు పెట్టేవారు వాళ్ళకేమి తెలుస్తుంది మీ ఇద్దరి మధ్యనా ఉన్న చుట్టరికం?
క్రిందపడుకొనే మనుష్యుడు దొంగ అవుతాడా నేలతల్లీ! వర్తకమని, వడ్డీ అని, పెట్టుబడి అని, పెత్తనమని; కొట్టుపెట్టి, రవాణాలుచేసి, దిగుమతులు దింపి, మిల్లులు, పరిశ్రమలు పెట్టి నీ బిడ్డల రక్తం త్రాగే కోటీశ్వరులు దొంగలుకారు? వాళ్ళు దొరలు, యజమానులు, ఖామందులు, మాలిక్‌లు, జమీందారులు, సంస్థానాధీశ్వరులు, ఫోర్డులు, రాఖ్ ఫెల్లేరులు, బీవర్బ్రూకులు, చర్చిల్లులు, అమెరీలు, హిట్లరులు, ప్రాంకోలు, నవాబులు, జాగీర్దారులు, వారు దేవతాపుత్రులు, నీ బిడ్డ సుబ్బన్న నేలపుత్రుడు.
సుబ్బన్న దొంగతనం చేయగలడా నేల తల్లీ? అతని యజమాని యింట్లో వెండిగిన్నె పోయిందే అనుకో! అది సుబ్బన్న కెందుకు? నీలోనుంచి ఉద్భవించిన మోదుగ, అడ్డ. అరటి, తామర, మఱిఆకులలో తినే సుబ్బన్నకు వెండి గిన్నా? నేల తల్లీ! నీ గర్భంలోంచి వచ్చిన వెండి, బంగారము, రేడియము, ప్లాటినము దేవతలు లాక్కొన్నారు కాదూ. అవన్నీ సత్యవంతులయిన నీ బిడ్డలు కూలీలు, పొలం కాపులు, బిచ్చగాళ్ళు, గుంపుల వాళ్ళు, అడవి వాళ్ళు, ఊరిబయట విసరి వేయబడ్డ వాళ్ళు, బట్టలుదికే వాళ్ళు, పాయిఖానా ఎత్తేవారు, కుండలు చేసేవారు, దేవతల ముఖాలు నిష్కురం చేసేవాళ్ళు వాళ్ళకందరికీ ఉపయోగించిననాడు కాదూ నీ సొమ్ము నీ కవడం! నీ సుబ్బన్న మాలిక్ ఇంట్లో వెండి గిన్నె పోగానే సుబ్బన్న తీశాడని అన్నారే, వారి హృదయం రాయి కాదు, రప్పకాదు, కెమికల్ లేబరేటరీలో తయారయ్యిన విషపుబాంబుగాని!
అల్లాఅంటే ఊరు పేరులేని నీ అనుగు కుమారుడైన సుబ్బన్నకు వారేమంటున్నారో అర్థమయిందా నా నేలతల్లీ!
ఎన్ని దెబ్బలు కొట్టారువాళ్ళూ, దేవతలయిన పోలీసులూ! నీ సుబ్బన్నకు తిండి ఉందా? వంటినిండా పడిన గాయాలకూ, ఆ గాయాలవల్లా, పై గాయాలు కాకుండా కమిలిపోయిన దెబ్బలవల్లా వచ్చిన జ్వరానికి మందు వుందా నేలతల్లీ?
మేజస్ట్రీటు కోర్టులో కేసు పెట్టారా? ఆ కేసు జరుగుతుండగానే ఆ గిన్నె - ఆ వెండి గిన్నె యజమానురాలు జాగ్రత్త కోసం ఇనప్పెట్టెలో పెట్టి ఆ విషయం మరిచి పోయిందా? అది మళ్ళీ కనబడిందా. ఆ విషయానికి ఆ యిల్లాలు ఒణికి వెండి గిన్నె దొరికిందని మేజస్ట్రీటుగారికి కబురు పంపిందా? అయ్యో నేలతల్లీ! సుబ్బన్న ధర్మం నీకు తెలుసును.
తాము చేసిన అన్యాయానికి తలెత్తుకు తిరిగిన ఆ మాలిక్ హృదయంలో ఇంత సీసం ఉందేమో! సీసం ఉన్నా నయమే తల్లీ! మనుష్యుల తెలివితనపు రాక్షసత్వం ఉంది. అది నిజం!
4
ఓ నేలతల్లీ! నీ సుబ్బన్న ఆ యజమానుణ్ణి వదలి నడచి నడచి బొంబాయిచేరేడూ! బొంబాయిలో కొందరికూలీల ధర్మమా అని ఓ మిల్లులో చేరాడూ! ఆ మిల్లులో ఎన్ని గడబిడలు ఆ మిల్లు కొందరి ధనేశేశుల కడుపులదా? వాళ్ళు ఈ కూలికీటకాల ధన మాన ప్రాణాలకు అధికారులా తల్లీ! నీ బిడ్డడు సుబ్బన్నకూ అదే గతి! పని చేయడానికి చీమకూ కూలీకి అతని కడుపు గుప్పిడా! తల్లీ, ఇదా మీ కాపరం. అతడు ఏ వీధిలోనో ఏ నాలుగంతస్తుల మేడముందో నీ ఒడిలోనే పడుకుంటాడు. ఏ రెస్టారెంటులోనో ఇంత రొట్టె తింటాడు.
ఓ నేలతల్లీ! ఒకనాడు సుబ్బన్న ఇంకో కూలి కుటుంబంతో స్నేహం చేశాడా? వాళ్ళూ హైదరాబాద్ వాళ్ళేనా! అవును, నీలో ఉండే గమ్మత్తు అది. నీ హృదయంలో ఏ భాగంలో ఉన్నవాళ్ళు ఆ భాగం వాళ్ళతో కలిసి మెలిసి ఉంటారుకాదూ!
ఆ కూలీ కుటుంబమూ ఎల్లాగో అనేకరకాల కూలిచేసి చిరిగినగుడ్డలు కట్టుకొని, వీలయితే ఆ బొంబాయి గల్లీలలో ఏ నల్లాకిందో స్నానంచేస్తారు తల్లీ. వాళ్ళూ నీవాళ్లేనటమ్మా! ఆ కుటుంబంవాళ్ళు సుబ్బన్నను దగ్గిరకు తీశారు. ఏ తల్లి, ఏ తండ్రికి పెండ్లి ధర్మంలోనో, పెండ్లికి మించిన కామ మహాధర్మంలోనో కన్న సుబ్బన్నకు కాస్త మెదడు ఉంది సుమా! కళ్ళకాంతి కొంచెం నిశితమే!
అలా కాలంలో చుక్కానిలేని పడవలా కొట్టుకువెళ్ళే సుబ్బన్నకు, ఆ ఇంకో నేల కుటుంబంలో ఓ చుక్కాని - ఓ చుక్క ఓ చక్కని చుక్క తలవంపులు, వాలుగన్నులవీధి కూలీ మిఠారి ఆ మేడల్లో ధన కుటుంబాలకు పనిచేసే వయ్యారి అతనికి నేస్తం అయిందా! నేలతల్లీ నీ సుబ్బన్న కప్పుడు నువ్వు లోకానికి ప్రసాదించిన సుగంధాలు, సౌందర్య స్వరూపాలు హృదయానికెక్కాయా?
ఓ నేలతల్లీ కల్తీలేని ప్రేమ నీ సుబ్బన్న హృదయంలో ప్రవేశించిందా? వాళ్ళిద్దరూ లోకంలో మానవులందరికి ఉన్న జంటధర్మం నిర్వర్తింప సాగారా? నేలతల్లీ నువ్వు వాళ్ళ ఇద్దరి మహదానందమూ, ఓర్వలేని మానవ కఠినత్వం కళ్ళ కనబడకుండా చీకటని, దౌవతీఇసుక అని, సందని, తూమని పార్కని ఆ మహానగరంలో వారికోసం సృష్టించావా తల్లీ!
ఆ సుబ్బన్నకు, సీతకు ఉన్న పవిత్రమైన చుట్టరికం సీత తల్లీ తండ్రీ గ్రహించారు. అది వాళ్ళిద్దరూ కోరిందే కాదూ. నేలతల్లీ! ఓ మంచిరోజున వాళ్ళిద్దరకు పెళ్ళి అని మూడుముళ్ళూ వేయించారా తల్లీ!
సుబ్బన్న సీత ప్రేమలో లోకాలు ఆవరించాడా! అతని హృదయమూ జ్ఞానమూ, మనస్సూ పువ్వులులా వికసించాయా నేలతల్లీ!
5
ఓ నేలతల్లీ, ఏ ముందులోకం కోసం సుబ్బన్న సీతలు సూర్యోదయంచూస్తూ మలబారు కొండమీద నిలబడ్డారు?
నువ్వు ఆ బంగారు ఎరుపుల సూర్యకిరణాలు నీవు ధరించిన వస్త్రం కాగా ఆ నీ యొక్క ఇద్దరి బిడ్డల ఆనందమూ చూస్తూ ఉన్నావా? వాళ్ళిద్దరికీ ఈ నీ దేశానికి సంబంధం వాళ్ళు ఇక్కడ ఎలాగో బ్రతకడమేనా? ఈ రాజ్యంలో వాళ్ళకు భాగంలేదా? ఈ దేశం సొమ్ములో ఈ దేశంలో ఉద్భవించే పంటలో, ఈ దేశంలో రూపం పొందే వస్తువులలో వారికి భాగం లేదా?
వారిద్దరూ చూచే ఆ సూర్యబింబంలో వారి భవిష్యత్తును యేమిచూచారు! వారిద్దరి చెమటా, వారి మురికి గుడ్డలు, వారికి వచ్చే గట్టి కష్టాలు స్వచ్ఛమైన దుఃఖాలూ, అమృతము రంగరించిన ఆనందాలూ మాత్రమే వారి ఆస్తిపాస్తులా నేలతల్లీ.
ఆ రాత్రి సుబ్బన్న సీతను, ఆ బట్టల మిల్లువారు కట్టించిన పేటలో వాళ్ళవంతుకు వచ్చిన ఇంటిలో గట్టిగా (నిన్ను కౌగలించుకునే ఎండలా) వెన్నెలలా గాలిలా కౌగలించుకొన్నాడా? నిన్ను గాఢంగా చుంబించే వానలా సుబ్బన్న సీతను ముద్దుపెట్టుకున్నాడా? ఆ రాత్రే సీతమ్మ గర్భంలో సర్వదేశాలకూ మకుటం కాబోయే నీ భారతదేశానికి నిజపౌరులలో ఒకడు కాదలచుకున్న ఇంకో చిన్న సుబ్బన్న అవతరించాడా? నువ్వు ఉప్పొంగి పోయావా?
సుబ్బన్న తనచుట్టూ ఉన్న అర్థంకాని ఏవో ఇనప గోడలు పగల గొట్టాలన్న ఆవేదన పడేవాడా నేలతల్లీ? అందుకు అతనిలో బాంబు శక్తి విజృంభించగలదా?
మిల్లులో యుద్ధావసరాలకు తగినట్లు కూలీలకు కూలీ సరిగా ఎక్కువచేయలేదూ, అందుకు నాయకుడు కూలీల సభ చేశాడూ, ఆ సభలో సుబ్బన్న అంత అద్భుతంగా, మహా వేగంతో, గంగానదిలా వర్షవాయువులా మాట్లాడుతూంటే నువ్వు నీ పుత్రుని విని ఎంత ఆనందించావు?
కూలీలు దేశానికి రక్ష అన్నావా సుబ్బన్నా! విమానాలు, టాంకులు, రైళ్ళు, ఓడలు, బాంబులు, తుపాకులు, వస్త్రాలు, సామానులు, కాగితాలు, కలాలు, మేడలు, మిద్దెలు, రోడ్లు, మోటార్లు తయ్యారు చేసేవారు కూలీలు వారు మాత్రం బ్రతక అక్కరలేదూ అన్నాడా సుబ్బన్న; సీత తన వయసు కాని గంభీర వచనాలకు ఆనందంతో ఊగిపోయిందా కూలి తల్లీ.
యజమానులు కూలీల కోర్కె పాలించరో, కూలీలందరూ సమ్మెచేశారా? అందుకు నీ బిడ్డడు ఒక ముఖ్య నాయకుడా నేలతల్లీ! అతన్ని అరెస్టు చేశారా? ఆ రోజు సీతమ్మ కుంగిపోతే, నువ్వే కాదూ అపరిమితమైన ధైర్యము చెప్పి, ఆ బాలను వీర బాలికను చేశావు!
సుబ్బన్నను వదలి వేయడానికి కారణం దేశ నాయకులు కొందరు మిల్లు యజమానులతో రాయబారాలు సలపడం వల్లా నేలతల్లీ!
సుబ్బన్న జీతమూ వృద్ధి అయింది. సీతమ్మ జీతమూ వృద్ధి అయింది. నేలతల్లీ, అప్పుడు మాత్రం నీకు తృప్తి అయిందా?
ఆ ఆదివారం నీ పుత్రుడు సుబ్బన్నా, సుబ్బన్న హృదయమూ, ప్రాణమూ, ఆత్మా అయిన సీతా రైలెక్కి జుహూ గాంధీ మహాత్ముణ్ణి దర్శించడానికే వెళ్ళారు కాదూ!
ఆ స్వాతంత్య్ర పరావతారాన్ని చూచి నమస్కరించి, అక్కడ సముద్రం ఒడ్డున సాయంత్రం కూచొని ఒకరి దగ్గిర ఒకరుగా ఇద్దరూ ఒకరుగా సీతమ్మ గర్భంలో భావి భారత పురుషుడైన సుబ్బన్న ద్వితీయ రూపం నృత్యం చేస్తూ ఉండగా - ఇద్దరూ - ఆకాశం - చీకట్లు - సముద్ర - తీరాలు - భవిష్యత్తు - భారతీయ మానవుల హృదయ ప్రళయం దర్శిస్తూ కూర్చుని ఉన్నారు కాదూ? వారిద్దరినీ ఆ రాబోయే మూడవ వానిని నీ వొడిలో వుంచుకొని నేలతల్లీ! చిరునవ్వుతో నువ్వూనా?
ఇంకో కొత్తరోజు ఉదయిస్తుంది కాదూ?
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse