అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/నాగలి
నాగలి
మొదటి భాగము
హృదయంలోని కల్మషాన్ని ఈవలావలికి త్రోసివేసి, దాగిఉన్న సౌందర్యాన్ని బయటపెట్టే మంచి పాటలా నాగలి సాగిపోతూంది. సారింపబడి శ్రుతిస్వరాలు హాయిమంటూ పలుకుతూ ఉన్న వీణతీగెలులా ఆ పొలంలో నాగేటిచాళ్ళు ప్రత్యక్షమవుతూ ఉన్నవి. తెరచాపల్లా, ఆకాశంలో చొచ్చుకుపొయ్యే పక్షి రెక్కల్లా, తెల్లటి ఆ దుక్కి టెద్దులు రెండూ ముందుకు నడుస్తూ ఉన్నవి శిష్యుని మనస్సు వ్యవసాయంచేసే పూజ్యుడైన గురువులా, రైతు నాగలి వెనకాలే కొరడాతో ఎద్దులను అదలిస్తూ తోలుతూ ఉన్నాడు. గట్టు మీద కూర్చొని తనచిత్రలేఖన పుస్తకంలో ఆ పొలం పొలం వెనకాల కొండలు, కొండలపైన మేఘాలు, ఆకాశాన్ని, ఆ మబ్బుల్ని, ఆ కొండల్ని అంచుల్ని ఎరుపురంగులు చిత్రిస్తూన్న అరుణ కిరణాల్ని, చెట్లని పక్షుల్ని శ్యామలరావు కుంచెతో బొమ్మవేస్తున్నాడు. శ్యామలరావు లోగొంతుకలో ఒకపాట పాడుకుంటున్నాడు.
"తల్లి పెదవుల నృత్యదర్శనమయ్యేటి
నవ్వులే తెల్లన్ని పువ్వులే దేవి!
తళతళా కన్నులా మెలయించుకాంతులే
నాగేటిచాలులో నవ్యాంకురముదేవి!"
అలుముకుంటూ ఉన్న చీకట్లో ఎద్దులను విప్పుతూ ఉన్న రైతునుచూసి శ్యామలరావు మళ్ళీ మళ్ళీ ఆ చరణాల్నే పాడుకుంటూ తన రంగులపెట్టె, చిత్రలేఖన పుస్తకమూ సర్దుకొని తన స్నేహితుని యిల్లు చేరుకున్నాడు. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల మనిషి. కొంచెం వంగి గుమ్మందాటి ఆ పర్ణశాలలోని ముందరహాలులోకి అడుగుపెట్టేటప్పటికి “హల్లో శ్యామ్ ! చీకటయ్యేదాకా చిత్రిస్తూ ఉన్నావే!” అంత సౌందర్యవంతమయిన వస్తువు యేంకనపడిందయ్యా!" అంటూ వదులు జడను వేసుకుంటూ ఉన్న స్వర్ణకుమారిదేవి తడిక చాటున ఉన్న గదిలోంచి చక్కా వచ్చింది. శ్యామలరావు స్వర్ణకుమారిని చూసి పెదవుల్ని ప్రసరించే చిరునవ్వు హరికేన్ దీపపు వెలుగులో కలిసిపోతూండగా, ప్రేమకాంతులు కళ్ళల్లో తొణికిస లాడుతూండగా. “అనేక వేల సంవత్సరాలనుంచి ఉన్న పురాతన విషయమే చిత్రిస్తూ ఉన్నాను - మీ పొలం దున్నడమే!”
"వ్యవసాయం మనస్సుని పాతేస్తుంది, మెదడును కఱ్ఱ బారుస్తుంది. - అంటావే! వ్యవసాయపు దృశ్యాలు, చిత్రలేఖనపు విషయాలు యెట్లా అవుతాయయ్యా? వ్యవసాయంలో రసస్వరూపం ఉందా మరి?”
“వస్తువులో మొరకుతనం ఉండవచ్చుగాక! వస్తువు తుచ్ఛమైంది కావచ్చుగాక! ఆ వస్తువు కళా వస్తువు కాగూడదనే ధర్మంఎక్కడ?”
“సుభావ ప్రసన్నమైన వస్తువే కళావస్తువు అవుతుందని వాదిస్తావుగా!”
“ఒక నీచవస్తువు ప్రత్యేకార్థమును ఉత్తమమైన భావంలో ఈయలేక పోవచ్చునుగాని, ఆ వస్తువు ఇతర విషయముల సంబంధంచేత ఉత్తమ భావపూరితము కావచ్చుకాదా సొన్నసానీ!”
“నన్ను సొన్నసానీ గిన్నసానీ అని పిలవకు! నాకు ఒళ్ళుమండిపోయే కోపం వస్తుంది. పూర్ణమైన పేరుపెట్టి పిలవరాదూ?”
ఏదో కోపం మనస్సులో ఉంచుకొని, గాన మాధుర్యమైన పేరుతో పిలిస్తే కోపం ఎందుకు స్వర్ణసానీ!”
"ఛీ! నీతో మాట్లాడడం బుద్ధితక్కువ. నీకు మా వ్యవసాయం ఇష్టం లేకపోతే, నాకెందుకు కోపం? అదుగో మా అన్నయ్య వస్తున్నాడు.”
ఇంతట్లో స్వర్ణకుమారి అన్నగారు శ్రీనివాసరావు గుమ్మం దగ్గిర తల వంచి లోపలికి వచ్చినాడు.
"ఏమిటి పిల్లకాయలిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు? బుద్ధి తక్కువ! కోపం అంటున్నావేమిటి, చెల్లీ?”
“ఈ స్నేహితుడుగారి మాటలు నీకు పథ్యం. నేను బుద్ధితక్కువ దాన్నని అందరికీ తెలియనే తెలుసు. అదే అంటున్నాను!”
అని స్వర్ణకుమారి విసవిస లోపలికి వెళ్ళిపోయింది.
“ఆడవాళ్ళకి కోపం కూడా అందమేనోయ్” అన్నాడు శ్యామలరావు, నవ్వుతూను.
"విన్నావా సోన్, శ్యామం అనేమాట! కుక్కరులో భోజనం అంతా ఉడికిందో లేదో చూశావా, లేదా? బొమ్మలతో కడుపు నిండిన శ్యామానికి అన్నం కావాలో అక్కరలేదో కాని వ్యవసాయ దారుణ్ణయిన నాకు వృకోదరత్వం అలవడింది. మొక్కపాతే కాలంలో స్నానం చేసి వస్తున్నాను” అని శ్రీనివాసరావు స్నానాలగదిలోకి వెళ్ళిపోయాడు.
“ఇదో క్రొత్త కవిత్వ రకపు వ్యవసాయదారుల భాషలా ఉందే” అంటూ శ్యామలరావు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు దొడ్లోకి వెళ్ళాడు. 2
కుంతలూరు గ్రామానికి పదిమైళ్ళ దూరంలో రెండు కొండల మధ్య ప్రవహించే ఒక వాగుకి పెద్ద ఆనకట్టకట్టి బ్రహ్మాండమైన చెరువు నిండించారు ప్రభుత్వంవారు. ఆ చెరువు క్రింద ఒక వెయ్యి ఎకరాల భూమి మాగాణి మొదలైన సాగుకావడానికి నీళ్ళున్నవి. ఆ భూమి అంతా అడివిలా ఉండే రోజుల్లో ఇంగ్లీషు విద్యాపండితులైన యువకులనేకులు నిరుద్యోగపు సైతాను పాలనుపడి ఉండేవాళ్ళకి ఆ భూమంతా పంచి యివ్వవలెనని అలజడిపుట్టింది. ప్రభుత్వంవారు మొట్టమొదట నూరుఎకరాలు పదిమంది పట్టభద్రులకు పంచి యిచ్చేటట్టున్ను, వ్యవసాయం పెట్టుబడికిగాను ఒక్కొక్కరికి అయిదేసి వందల రూపాయలు అప్పు ఇచ్చేటట్లును, భూమి హక్కు పదిఏళ్ళవరకు ప్రభుత్వం వారికే ఉండేటట్లును, చివర అయిదు సంవత్సరాలు నూటికి పది రూపాయల వంతున పన్ను యిచ్చేటట్లును, అడ్వాన్సు సొమ్ము యావత్తూ పదియేళ్ళల్లో తీర్చుకొనేటట్లున్ను మొదలైన షరతులతో భూమి యిచ్చునట్లు ఏర్పాటు చేశారు. దేహదారుఢ్యము, మనోదారుఢ్యము, కూర్చుకొన్న పదిమందిని వేలకొలది వచ్చిన అభ్యర్థులలో ఏరుకున్నారు. అందులో శ్రీనివాసరావూ, శ్యామలరావు కాశీ విశ్వవిద్యాలయంలో సహాధ్యాయులు, ఎమ్.ఎస్.సి. పట్టాలు పొందిన తరువాత వారిద్దరూ విడిపోయినారు. తనలో ఉండే లలిత కళాచతురత్వాన్ని పైకి మొలిపించి విజృంభింప జేయడానికి ప్రసిద్ధి కెక్కిన శాంతినికేతన లలిత కళాశాలకు శ్రీ నందలాలు మహాశిల్పి పాదాలు పూజింప పోయినాడు. శ్యామలరావు. నాలుగేళ్ళు అయిన తర్వాత చిత్రకళాకోవిదుడై అనేక ప్రదర్శనాలలో బహుమతీలంది అతడు ఆంధ్ర దేశోన్ముఖుడైనాడు, చిన్నతనాన్నించి సహాధ్యాయుడైన శ్రీనివాసరావు చెల్లెలు స్వర్ణకుమారిని తన హృదయ సింహాసనంలో అధివసింప జేసుకున్నాడు. స్నేహితులిద్దరి కన్నా అయిదేండ్లు చిన్నదైన ఆ బాలిక వీరిద్దరూ ఎమ్.ఎస్.సి. కాశీలో చదివేరోజుల్లో వారితోపాటే మకాంచేసి ఇంటర్ చదువుతూ ఉండేది.
స్వర్ణకుమారి ఏడాది క్రిందనే బి.ఏ. పూర్తిచేసుకుని అన్నగారి వ్యవసాయంలో సాయం చేయడానికి తలిదండ్రుల అనుమతిమీద కుంతలూరు గ్రామంలో ఉన్న నూత్న వ్యవసాయాశ్రమానికి చేరుకుంది. అప్పుడామెకు పందొమ్మిదేళ్ళు. నవయౌవని. దివ్యసుందరి. అలాంటి స్వర్ణకుమారిని మంచి ముహూర్తంలో వివాహం చేసుకుని తన లలితకళకు వన్నెలుదిద్ది, తన జీవితం దివ్యానందపూరితం చేసుకుందామని శ్యామలరావు ఉవ్విళ్ళూరుతుండడంచేత ఇంటికి వెళ్ళగానే తల్లిగారి హృదయం చల్లబడేటట్లు వారంరోజులయినా ఉండకుండానే శ్యామలరావు కుంతలూరుకు ప్రయాణమయ్యాడు. శ్యామలరావు అంటే స్వర్ణకుమారికి చిన్నతనంలోనే అయిదేళ్ళ బాలికగా ఉన్నప్పటి నుంచీ ప్రేమే. తియ్యని సుందరమైన అతని గొంతుక విన్నా, గురుశిక్షణ లేకపోయినా అందాలు సేకరించుకోబోయే అతని చిత్రలేఖనాలు చూసినా ఆమె గుండె మధురంగా కొట్టుకొనేది. చదువుకునే రోజుల్లోను, శలవురోజుల్లోను తన ఊళ్లో ఉన్న ప్రసిద్ధికెక్కిన ఒక గాయకునిచేత ఆమె వీణపాట చెప్పించుకొన్నది. శ్యామలుని కళకు తన వీణ దివ్యార్పణగా సంకల్పించుకున్న దా బాలిక.
శ్రీనివాసరావుకి చిన్నతనాన్నుంచి వ్యవసాయం అంటే మహాఇష్టం. పాతబడి నష్టదాయకమైన వ్యవసాయపు రీతులన్నీ నెమ్మది నెమ్మదిగా మార్చి శాస్త్రపరిశోధనా పూర్వకమైన మంచి పంటలు పండించే కొత్త మార్గాలు అవలంబించాలని అతని వాదన. కొద్ది రైతాంగమైన తండ్రిగారి కర్షకత్వానికి అనేక మార్పులు తీసుకువచ్చి, వీలైనప్పుడల్లా శ్రీనివాసరావు చక్కని వ్యవసాయపు పద్ధతులు ప్రవేశపెట్టించాడు. ఉద్యోగం లేకుండా వీధుల వెంబడి తిరుగుతూ, లోకాన్ని తిట్టుకుంటూ జమీందారుల్నీ ధనాడ్యుల్నీ పేరు తల్చుకుని పళ్ళు కొరుకుతూండే చదువుకున్న వాళ్ళంతా తిరిగి వ్యవసాయంలోకి చేరిననాడే భరతదేశం బాగుపడుతుందని ఛాతీ విస్ఫారితంచేసి కళ్ళల్లో కాంతులు ప్రసరిస్తుండగా శ్రీనివాసరావు వాదిస్తూంటాడు.
ఈ విషయంలోనే శ్రీనివాసరావుకీ, శ్యామలరావుకీ భేదాభిప్రాయాలు కలిగాయి. నేల దున్నుకోడానికి మెదడు దున్నుకోడానికి ఉత్తరపు ధ్రువానికి, దక్షిణపు ధ్రువానికి ఉండే తేడాఉంది అంటాడు శ్యామలరావు. ఒక దాని కొకటి సంబంధం ఉంటే ఒకదాని సహాయంవల్ల యింకొకటి విజృంభిస్తుందని శ్రీనివాసరావు వాదిస్తాడు. అన్నగారి వాదన దిట్టంగా బలపరుస్తుంది స్వర్ణకుమారి. ఏ 'యల్.టి' పట్టానో చేతిలో పుచ్చుకొని “మేష్టరీపని మేష్టరీపని”అని దేశాలు తిరగడంకన్న భారత నారీమణి ఎంత చదువుకున్నా భర్తకు సహాయంగా వ్యవసాయవృత్తే అవలంబించాలని తన తియ్యటి గొంతుకతో చక్కగా వాదిస్తుంది.
ఆ కారణంచేతనే పట్టభద్రురాలు కాగానే, నాగలి పట్టుకున్న అన్నగారికి అన్నం పట్టుకెళ్ళే ఆడబడచు అయ్యింది. అన్నగారి పదిఎకరాల భూమిలోను ఒక ఎకరం తన స్వంత సేద్యానికి ఉంచుకుంది. రాత్రింబవళ్లు కష్టపడి ఆ ఎకరంభూమి, పూలచెట్లుతోను కూరగాయల మొక్కల పాదులతోను, పండ్ల అంటులతోను, తిరిగి అమ్మేందుకు మొక్కలున్న కుండలతోను నింపివేసింది.
3
తనకూ, స్వర్ణకుమారికీ జరిగిన వాదనను గూర్చి ఆలోచించుకుంటూ భోజనం దగ్గిరికి వచ్చికూర్చున్నారు శ్యామలరావు. వచ్చిన వారం రోజులనుంచి ఎప్పుడూ పాటలు పాడుతూ తాను నవ్వుతూ. యితరులను నవ్విస్తూండే శ్యామలరావు చప్పగా చల్లగా భోజనందగ్గర కూర్చుని తనవేపైనా చూడకుండా తలవాల్చుకొని ఉండడం స్వర్ణకుమారి చూసింది. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఒత్తయిన జుట్టుతో వికసించివున్న అందమైన అతని తలను తనహృదయానికి అదుముకుని “నీమీద నా కెప్పుడూ కోపం కలగదు శ్యామం! నీ భావాలకు తీరని విచారమేకాని” అని అందామని ఆమెకు గాఢమయిన కాంక్ష కలిగింది. "నా మాటలకు కోపం వచ్చిందా యేమిటి. భోజనం తిన్నగా చెయ్యడంలేదు, శ్యామ్” అని స్వర్ణ అన్నది.
"నీ మాటలకు కోపం ఎందుకు స్వర్ణా? గంగాకూలంలోని వెన్నెలలాంటి నీ హృదయం తల్చుకుంటూ యిక్కడికి వచ్చాను. ఆ వెన్నెలలో ఎప్పుడు తేలిపోదామా అని ఆలోచిస్తున్నానంతే.”
స్వర్ణకుమారి కళ్ళల్లో మెరుములు మెరిసినవి. శ్రీనివాసరావు శ్యామలరావుని చూసి-
“ఒరే శ్యామ్! నేను ఇంజనీరుతో మాట్లాడి ఏర్పాటుచేసి ఉంచాను. నువ్వు దరఖాస్తు పెట్టగానే నీ పది ఎకరాలు నీకు యిస్తారు. నువ్వు వ్యవసాయం ప్రారంభించగానే నిజమయిన భాగస్వామిని అవుతూ నీ గృహిణి నీ యింటికి అవతరిస్తుందని ఓ తాయిలంగారు నీతో చెప్పమన్నారు” అని అన్నాడు.
శ్యామలరావు మాట్లాడలేదు, అన్నగారి మాటలకు చిరునవ్వు నవ్వుకుంటూ ఉన్న స్వర్ణకుమారి శ్యామలుని మౌనానికి నివ్వెరపోయి చూచింది.
భోజనాలయి కూర్చున్నారు. శ్యామలరావు సిగరెట్టు, శ్రీనివాసరావు చుట్టా కాల్చుకుంటూండగా స్వర్ణకుమారి తన తోటలో తయారైన తమలపాకులు రాసి చుడుతూంది. శ్యామలరావు తలవంచుకునే, “శీనూ! వ్యవసాయం చేయడం నాకిష్టంలేదు. చదువుకూ, వ్యవసాయానికి సంబంధంలేదని నేను మొదటినుంచి వాదిస్తున్నాను. శ్రీనివాసరావు ఒకడు తప్పబుట్టవచ్చుగాక! తక్కినవాళ్ళంతా కొద్దిరోజుల్లో నిజం గుర్తెరిగి నాగళ్లు నడమధ్యాన వదలి స్వగ్రామాలకి వేంచేస్తారని నా గట్టి నమ్మకం. వ్యవసాయం చేసేవాళ్ళువేరు; చదువుకున్నవాళ్లు పరిశోధనలు చేసి శాస్త్ర పరిశోధనకు కొత్త అధ్యాయాలుచేర్చాలి. కళాదేవిని నూత్నపంధాలలో నడపాలి. ఆమెకి నూత్నాలంకారాలు సమకూర్చాలి. అదీ నా ఉద్దేశ్యం. స్వర్ణకు ఈ వ్యవసాయంవల్ల అద్భుతమైన అందంపోయి కర్కశమైన అదోరకపు అందం వచ్చింది. అయితేయేమి? తెలిసున్నవాడవు నువ్వైనా ఆమెకి బోధించి, నావెంట పంపు. నేను బెజవాడలో ఒక లలితకళాశాలను యేర్పాటు చెయ్యదల్చుకున్నాను. వెన్నెల కిరణాల్లా ప్రసరిస్తూ వీణతీగెల్లోంచి దివ్య గాంధర్వాన్ని ఉద్భవింపజేసే ఆమె వేళ్ళు మొరటుబారి యెల్లా ఉన్నాయో చూడు! ఇంటికి రాగానే మీ నాన్నగారు ముహూర్తం పెట్టిస్తామన్నారు” అని అన్నాడు. ఈ మాటలు వింటూన్న కొద్దీ స్వర్ణకుమారికి మొహం జేవురించింది. చేతులు వణికినవి.
“అన్నయ్యా! శ్యామలరావు యిక్కడ వ్యవసాయం చెయ్యనక్కరలేదు. స్వర్ణకుమారి పెళ్ళి చేసుకోకుండానే అన్నగారికి సహాయం చేస్తూ యిక్కడే వుంటుందని చెప్పు. రేపు రెండెడ్లబండి రైలుకు మీ శ్యామలరావుని తీసుకువెళ్ళే యేర్పాటు చేయించు” అని కళ్ళనీళ్ళు తుడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. 4
ఈ నూతన కర్షకాలయంలో ఒక వివాహంకాని యువకుడు ఉన్నాడు. భూపుత్రిలా ఉండే స్వర్ణకుమారి, నిజమైన బంగారు ప్రోవని అతని నమ్మకం. తన యింట మహారాణిలా ఆమెకు అధికారం ఇవ్వడానికి అతడు ఆశిస్తున్నాడు. ఈ రెండేళ్ళనుంచి తన హృదయ దుర్గానికి ముట్టడివేస్తూన్న ఈ వీరుణ్ని దూర దూరంగానే ఉంచింది స్వర్ణకుమారి. ఈనాడు శ్యామం తన్నునట్టేటిలో వదలి వెళ్ళిపోయినట్లు ఆమెకు తోచింది. దివ్యమూర్తి అనుకున్న తన శ్యామం యింక తనవాడెట్లా అవుతాడు? తన హృదయం గ్రహించలేనివాడు తనకు కాదన్నట్లే ప్రేమ అనేది ఉట్టి మాయ. అది మనుష్యులకు ఉండే హృదయ దౌర్భల్యంగాని, ఉత్తమగుణం కానేకాదు. ఆశయాలకు అందలేని ప్రేమ తుచ్ఛమే అవుతుంది. వ్యవసాయంచేస్తూ తన అన్నగారితో బాటు నడుం కట్టుకున్న ఆ ఆశ్రమవాసి నిజమైన వీరుడు. అతన్ని తనకు స్వామిగా చేసుకుంటే అంతకన్న పవిత్రమయిన త్యాగం ఇంకొకటిలేదు. తన హృదయవనంలో శ్యామలరావు విషపుమొక్క అయిపోయినాడు. ఆ మొక్కను కలుపుకింద తీసివెయ్యవలసిందేకదా! కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, నిద్రలేకుండా పక్కమీద దొర్లుతూ రాత్రంతా స్వర్ణకుమారి జాగరంచేసింది.
తెల్లవారగట్లే శ్రీనివాసరావు చెల్లెలి గదిలోకి వచ్చి చూసేటప్పటికి వడిలిపోయిన పువ్వులా ఉన్న తన ముఖం అన్నగారివైపు త్రిప్పి, స్వర్ణ,
“తోటలోకి వెళ్ళే వేళ అయిందా అన్నయ్యా?” అని ప్రశ్నించింది.
“చెల్లీ! నిన్ను చూసి మరీ వెళ్ళమన్నా. శ్యామ బండెక్కి వెళ్ళిపోయినాడు. ప్రాణంలేని కఱ్ఱలా ఉన్నాడు. మనస్సులో ఉండే ఆవేశాలవల్ల వచ్చే మాటలకు అర్థంలేదు. ప్రేమ అంటే భగవంతునియొక్క అవతారం అని నా నమ్మకం చెల్లీ! అలాంటి ప్రేమను చేతులార త్రోసిబుచ్చుకోడం మన దేవాలయం మనమే మననెత్తిమీద కూలదోసు కున్నట్లవుతుంది. నిన్ను విడిచిపెట్టి శ్యామలం నిజంగా ప్రాణం విడుస్తాడేమోనని భయం వేస్తోంది. ఎప్పటికైనా భార్యభర్త ననుసరించవలసిందే కదా చెల్లీ! నేను శ్యామానికి ఉత్తరం వ్రాస్తాను. నిన్ను యింటికి తీసుకువెళ్ళి దిగబెడతాను.”
“అన్నయ్యా! నన్ను ఇంటి దగ్గిర దిగబెట్టే దారిలోనే ప్రాణాలూ దిగబడతాయి.”
“అంత వెఱ్ఱితనం ఉండకూడదు తల్లీ!”
“నాకు వెఱ్ఱితనమా? నీకా?”
కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ స్వర్ణకుమారి దిండులోకి ముఖందూర్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. మంచంమీద పక్కనే కూర్చుని శ్రీనివాసరావు చెల్లెలి వీపు నిమురుతూ.
“చెల్లీ! నేను పొలంలోకి వెడుతున్నాను! తోటపని చూసుకో! ప్రయాణాల మాటలులేవు. అన్నమాటలు ఉఫ్న ఊదేస్తున్నాను” అని అన్నాడు.
చెల్లెలివైపు పదినిమిషాలు చూసి తల ఊపుకుని పెదవి విరుచుకొని నెమ్మదిగా అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. 5
స్నేహితుడైన శ్యామ్ని ఎలా ఒప్పించగలడు? చెల్లెలి మనస్సు ఎల్లా తిప్పగలడు? చిన్నతనాన్నుంచీ వీళ్ళిద్దరి దాంపత్యమూ అతని ఊహాపథంలో ఎంతో ఆనందం సమకూరుస్తూ ఉండేది. శ్యామసుందరంమీద శ్రీనివాసురావుకు వెఱ్ఱి కోపం వచ్చింది. ఆడవాళ్ళ హృదయాలు ఎంతకాలం మగవాళ్ళ చేతుల్లో నలిపేస్తారు? పురుషుల ఆశయాలకూ, ఆశలకు, కాంక్షలకూ బానిసలై ఆడవాళ్ళు యెంతకాలం తుచ్ఛ జీవితాలు గడుపుతూ ఉండాలి?
తన కింతవరకు ఏ బాలికపైనా ప్రేమ ఉద్భవించలేదు. అట్టిప్రేమ విధానమైన బాలిక తన్ను వ్యవసాయం మానివేయమంటే మానివేయవలసిందేనా? అవును. అలాంటి దివ్యబాలిక తన్ను మానివేయమంటే తలవంచి ఒప్పుకోవలసిందే!
ఈ ఆలోచనలతో శ్రీనివాసరావు పరధ్యానంగా వ్యవసాయం సాగించాడు. ఆయన పరధ్యానం పెద్దపాలి చూసి “ఏమండి అయ్యగారూ! ఈవాళ అదేంటోగా ఉన్నారు?” అన్నాడు.
“అదీలేదు, ఇదీలేదు, పొలం దున్నటం ఈవాళ పూర్తి చెయ్యాలి సోమన్నా.”
"మీ అఱక నిద్రపోతోందండి బాబూ!”
“నా నిద్రే ఎద్దులలో ప్రతిఫలిస్తోంది సోమాలూ!”
రెండవ భాగము
నెలలు గడిచాయి. శ్యామ్ దగ్గిరనుంచి స్వర్ణకుగాని, శ్రీనివాసులకు గాని ఉత్తరం లేదు. స్వర్ణ ఇంతవరకు శ్యామ్ తనకురాసిన ఉత్తరాలన్నీ తిరిగి చదువుకుంది. ఆ భాషా మాధుర్యమూ, ఆ చిత్ర విచిత్ర భావాలూ ఆమె హృదయాన్ని దహించి వేశాయి. నిజంగా తన శ్యామ్ తనకు దూరమైపోతాడా? అతణ్ణి మళ్ళీ చూడడమే పడదా! "నిన్ను సర్వకాలాలయందూ హృదయంలో అధివసింప చేసుకుని పూజిస్తూ ఉంటాను” అనే వ్రాతలు మాటలూ వట్టి గాలి కబుర్లేనా! ఛీ దొంగ స్నేహాలూ దొంగ ప్రేమలూ ఎవరిక్కావాలి? అతడు శాంతినికేతనంలో ఉన్నప్పుడు కాశీలో ఉన్న తనకడకు రాని నెలలేదు. తనకు శలవలు వచ్చేటప్పటికి శాంతినికేతనాన్నుంచి మహావాయువులా తనకడకు చేరుకుని శ్యామ్ తన్ను ఎంత ప్రేమతో అజంతా మొదలైన దివ్య కళాక్షేత్రాలకు తీసుకొని వెళ్ళేవాడు. అలాంటి ఆ ప్రేమికుడు తనకు ఇంక కానివాడేనా? తన ఆశయాలనూ తన్నూ ఎంత గౌరవిస్తున్నాడు. ఈ సుబ్రహ్మణ్యం! వెఱ్ఱి మొఱ్ఱి బొమ్మలూ వెఱ్ఱి మొఱ్ఱి కవిత్వమూ సృష్టింప లేకపోతే మనుష్యుడు కాడా ఏమిటి?
తన అన్నగారు కవా? గాయకుడా? చిత్రకారుడా?
- * * *
“స్వర్ణా! నానాటికి చిక్కి శల్యమైపోతున్నావు - నాలుగు రోజుల పాటు యింటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ రాకూడదూ? అమ్మచేతి పాకము రుచిచూస్తే మళ్ళీగులాబి బుగ్గలు వేసుకు రావచ్చుగా?”
“నా వంట బాగాలేదనా? పోనీ నువ్వు తినకు. ఆ ముక్కే మొదట చెప్పలేకపోయావూ!”
“ఇంతట్లో కోపమా? ఎవరివంట వారికి రుచి కాదంటారుగా!”
“అమ్మకు ఎవరు వంటచేసి పెడుతున్నారు? అమ్మ చిక్కి పోయిందా? నా వంట నీకు సహించక పోవచ్చును - వంటవాణ్ణి పెట్టుకో!”
"ఈ మధ్య నీకు మాటలాడితే కోపంవస్తూంది - కోపదేవత వయిపోతున్నావు. నీ వంట నాకు ఎంతో అద్భుతంగా ఉంటుంది చెల్లి! ఇంక శ్యామ్ఉన్నన్నాళ్ళు ఒకటే పొగిడేవాడు నీ వంటని -”
"శ్యామ్ పేరు నా దగ్గర తీసుకురాకు - ఎంత చెప్పినా నువ్వా శ్యామ్ పక్షమే” అని నీళ్ళురాని ఎఱ్ఱని పొడికళ్ళతో లోపలికి వెళ్ళిపోయింది స్వర్ణ కుమారీదేవి.
శ్యామలరావు వెళ్ళిపోయినప్పటినుంచీ ఆమెకు తోట అంటే భక్తి యెక్కువైంది. ఆమెలో వికసించవలసిన ప్రేమంతా ఆమె పూలవన వాటికలో సర్వవర్ణ స్వరూపాలైన పూవులై వికసించినది. ఆమెలోని ఆశాసాఫల్యత బొప్పాసి పళ్ళయి, నిమ్మపళ్ళయి, దానిమ్మ పళ్ళయి ఫలించినది. ఆమె తోట కలకలలాడిపోతూన్నది.
ఆ తోట విషయంలో సుబ్రహ్మణ్యము స్వర్ణకుమారికి సైదోడు వాదోడైనాడు. ఆమె మాటే అతనికి రాజశాసనము. ఆమె ఎంత చిన్న కోర్కె కోరినా అతడు తన మహద్భాగ్యం క్రింద ఎంచుకొని నిర్వర్తిస్తూన్నాడు. తన వ్యవసాయ స్థితి తగ్గిపోతున్నదని అతడు గమనించటము లేదు. స్వర్ణకుమారికి నానాటికి అతడన్న గౌరవము హెచ్చిపోయినది.
2
శ్రీనివాసరావు వ్యవసాయం దినదినాభివృద్ధి పొందుతున్నది. చెల్లెలు వేసిన తోటతోపాటు పక్కనే మరిమూడు ఎకరాలు అన్నిరకములైన ఫలవృక్షములతోనూ నృత్యాలు చేయించినాడు. చెట్లతో ఆడుకుంటాడు. చెట్లతో మాట్లాడుకుంటాడు. అతని మాటలు విని చెట్లు తలయెత్తి అతని వంక చూచి కిలకిల నవ్వుతవి. కాయలుకాచిన అతని చేతులు తల్లి ప్రేమతో చెట్లను స్పృశించుతవి.
తన పదియెకరాల పొలము చుట్టూ కొబ్బరితోట వేసినాడు శ్రీనివాసరావు. ఒక యెకరము చెఱకు, ఒక యెకరము అరటితోట, ఒక యెకరము పాదులతోనిండి సర్వకాలాల యందూ చుట్టుపక్కల పట్టణాల మార్కెట్టులను కూరలతో నింపుతుంది. తక్కిన మూడు యెకరాలూ ధాన్యం పండిస్తాడు. పది బస్తాలు తనకు సహాయంచేసే పాలివానికిపోయి తక్కిన యిరవై తనకూ తన చెల్లెలికి తిండికి మిగులుతున్నవి. తోటలో వచ్చిన రాబడులవల్ల పై ఖర్చులూ కొదవ జీతాలూ వస్తూన్నవి; ప్రభుత్వం వారిచ్చిన బాకీ తీరుతున్నది.
ఓ రోజున తోటలో పనిచేసుకుంటున్న శ్రీనివాసరావు దగ్గరకు సుబ్రహ్మణ్యం తల్లి వొచ్చింది.
"శ్రీనివాసరావూ! ఈ ప్రకారంగా వెళ్ళితే పదేళ్లుదాటితే పొలం నీదై పోతుందికదా?”
“మీ ఆశీర్వచనంవల్ల మా పదిమందికీ యీ భూసంపాదన మిగులుతుందనే అనుకుంటున్నాను”.
"ఐతే ఓ ప్రశ్న అడుగుతాను తండ్రీ! కోప పడకుంటే నీ కనేక సంబంధాలు వొస్తూన్నవి. ఓ చక్కనమ్మాయిని తీసుకొచ్చి మా కళ్ళకరువు తీరుద్దూ!'
"మీ అబ్బాయికేమైనా సంబంధం ఆలోచించారా యేమిటండీ!”
“అందుకనే వొచ్చాను తండ్రీ! నన్నీ రొండేళ్ళనుంచి మావాడు వేపుకు తింటున్నాడు. స్వర్ణకుమారిని శ్యామలరావు కిస్తారు గదా అనే వుద్దేశంతో ఆ మాటెత్తకుండా వూరుకున్నాము. ఇప్పుడలాంటిదేమీ లేదని మావాడు చెప్తాడు. మంచి ముహూర్తం చూసి ఇవ్వాళ నన్ను పోరి పంపించాడు. మావాడికి మా వూళ్లో ఓ యిరవై యెకరాల భూమి కూడా వుంది. ఆ సంగతి నీకుతెలిసేవుంది. మా చిన్నతనంలో పెద్దలు పెళ్ళికూతుళ్ళనే అడిగేవారు. మీ స్వర్ణను మా సుబ్రహ్మణ్యాని కియ్యవలసిందని, నాయనా, నీ రెండుచేతులు పట్టుకు అడుగుతున్నాను. అమ్మాయి అభిప్రాయం తప్పకుండా కనుక్కో”
“అదికాదండి దొడ్డమ్మగారూ! ఆస్తులకి దానికీ చూడము. మా చెల్లిలి యిష్టం యెలావుంటే అలా మేము తప్పకుండా జరపవలసినవారమే" అని శ్రీనివాసరావు లేచాడు. సుబ్రహ్మణ్యం తల్లి చల్లగా వెనక్కు వెళ్ళిపోయింది.
"శ్యామ్ వుట్టి వెర్రివాడు. వాడు వుట్టిపూల్, ఇంతప్పటినుండీ ప్రేమించిన అమ్మాయిని కుక్కిన పేనులాగ కిక్కురుమనకుండా ఇక్కడ వదలివేసి వెళ్ళిపోయాడు. ఇంతైనా వాడికి పౌరుషం లేదు. వాడి ప్రేమ ఒఠ్ఠి హుళక్కి వీళ్ళిద్దరి ప్రేమా చూస్తూ ఎంత ఆనందం పడేవాడు తాను. స్వర్ణ హృదయంవాడేమి తెలుసుకున్నాడు. ఆఁ! కళలట! కళోపాసకుడికి అందరి హృదయాలు తెలుస్తాయంటారు, వట్టి బూటకము. ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ దాపురించాడు బాబూ! ఇంతకూ ఎవరికర్మ వారిది” అనుకుంటూ ఆరడుగుల శ్రీనివాసరావు ఏనుగుగున్నలా విసవిస యింటివైపు నడిచిపోయాడు.
3
శ్రీనివాసరావు యిల్లు తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. స్వర్ణ దాన్ని అలంకరించింది. తోటలమధ్య ఆ యిల్లు మణిపూసలా మెరిసిపోతూన్నది. శ్రీనివాసరావు జీవితంలో ధ్వనిలేదు. అంతా వాచ్యమే. ఏది చెప్పదలచుకున్నా డొంక తిరుగుళ్ళు తిరక్కుండా, మొహమాటం లేకుండా కర్ర విడిచినట్టు చెప్తాడు. కోపమంటే ఎరుగడు. కోపం వస్తే లయకాల రుద్రుడే. అసత్యవాదులంటేనే అతనికి కోపం. అతనంటే అందరికీ భయమూ, భక్తి కూడాను. అలాంటి శ్రీనివాసరావు ఏదో గొణుక్కుంటూ ఇంటిలో ప్రవేశించాడు. తన పడుకునే గదిలోకి వెళ్ళి తక్లిన్నీ యేకులూ తీసుకుని వినోబాభావే విధానాలతో త్వరత్వరగా దారం వడకడం ప్రారంభించాడు. ఏ ఆలోచనా తోచనప్పుడాతడు దారం వొడుకుతుంటాడు. తన కట్టుబట్టలన్నీ అతడు వొడికినదారమే. "స్వర్ణా స్వర్ణా” అని చెల్లెలిని తన గంభీరకంఠంతో పిలిచాడు. తోటలో చెట్లకు నీళ్ళు పోస్తున్న ఆ బాలిక వనలక్ష్మిలా పరుగెత్తుకు వచ్చింది.
"ఎందు కన్నయ్యా పిలిచావు?”
"పిలిచానమ్మా! చాలా ముఖ్యమైన కారణమే వున్నది. నీకు పెళ్ళివారు వొచ్చారు- ఇదివరదాకా దూరంగా వున్న వారు యివ్వాళ దగ్గరకు వొచ్చారు. నన్నుద్ధరించటానికి!”
“ఏమిటన్నయ్యా? అలా వున్నావేమిటి? ప్రసన్నంగా వుండే నీనుదురలా ముడతలు పడిపోయిందేమిటి? ఏదో కోపంగా వున్నావు. నాకు పెళ్ళివొద్దని యిదివరకే నీతో గట్టిగా చెప్పివున్నాను. ఈ భూమంతా నీదైనప్పుడు అప్పుడు చూసుకుందాములే!”
“నా కదంతా తెలియదమ్మాయ్, శ్యామానికీ నీకూ చెడిపోయిందటగా. ఇంక అడగవచ్చునట! ఆ సంగతి వాళ్ళకు తెలిసిందట. తెలిసిందటమ్మా! సుబ్రహ్మణ్యం తల్లి తన కుమారుడికి నీ పాణిగ్రహణంకోరి రాయబారం వొచ్చింది. నీ యిష్టం!”
ఇంత విరసంగా తన అన్నగా రెప్పుడూ తనతో మాటాడలేదు. అతడు చెప్పినమాట లామెకు తిన్నగా యెక్కనేలేదు. ఆరునెల్ల క్రిందట శ్యామం తనతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమయినాడు? చెవులు అడ్డంపెట్టుకున్నా తనతోటలోని పువ్వులలోనుంచి అతని పాటలు వినవస్తూనే వున్నవి. కళ్ళకు అడ్డంపెట్టుకున్నా నాగలి, నాగేటిచాలు, ఆ దూరాన కొండలూ అతని చిత్రాలను ప్రతిఫలిస్తూనే ఉన్నవి. తన హృదయంలోని అతని విగ్రహము స్పష్టరేఖామూర్తిగా చిరునవ్వులు నవ్వుతునే ఉన్నది.
తోటపని చేసికొనివచ్చి ఎంత తియ్యగా శ్యామలరావు నవ్వుల్ని కలలుగంటూ వుండేది. ప్రతి పుట్టినరోజుకీ తన కొక బహుమతి యిచ్చేవాడు. చిత్రాలు, చిత్రవస్తువులు, చీరెలు, కుంకుమ భరిణెలు, వెండివస్తువులు, గంధపు చెక్కడాలు శ్యాము ప్రేమతో అర్పించినవి కావూ?
“నిన్ను పూజిస్తానె స్వర్ణసానీ!
నీవు నా ఆశవే స్వర్ణసానీ!”
అన్న అతనిపాట తన నరనరాలలో తీగలు మీటుతున్నది. ప్రత్యూష పవనాలే అతని ముంగురులై, సాయంసంధ్యా కిరణాలే అతని మాటలై, నిర్మలజ్యోత్స్నలే అతని ఆటలై తన జీవితమంతా నిండుకొన్న శ్యామ్ తన చేయివదలి ఒక్కడూ, ఒక్కడూ వెళ్ళిపోయాడు.
తల్లిదండ్రుల అనుమతి అడిగి ఏ సంగతీ చెప్తానని సుబ్రహ్మణ్యము తల్లితో చెప్పమని అన్నగారిని కోరినది స్వర్ణ. 4
శ్యాముకు జీవితమే భగ్నమైనది. స్వప్నాలు శకలములైనవి. ఒంటిగా ఈ బ్రతుకుటెడారిలో వేడిగాల్పులు వీస్తూ ఉంటే ఇసుకలో కాళ్ళు దిగబడుతూ ఎంతదూరం నడవగలడు తాను? కుంచెలకు చివరవున్న “సేబులు” వెండ్రుకలలోని ఎర్రటి రంగు ఆకాశమంతా ఎర్రటి మరకలతో నింపింది. గొట్టాలలోని రంగులు కర్రబారినవి. చిత్రలేఖనపు కాగితాలు ఎండి పొడి పొడిగ రాలినవి. ఎప్పుడూ తనకు చెలికత్తెలావున్న అలంకారదేవత మాసిన చీరకట్టుకొని వివర్ణవదనంతో వెడలిపోయింది.
"ఆనంద మేలనే,
అమృత వీచిక లేల?
అడు గడుగునా తగులు
నిడివి ముల్లుల దారి!
ఆనందమేలనే?
కలలేల బ్రతుకులో?
సెలయేటి ఝరియేల?
ధూళినిండిన బ్రతుకు
తూళి విరుచుకుపడెనె!
ఆనందమేలనే?
అమృతవీచిక లేల?
కారు రంగుల వచ్చు
కల్లోల ఫేనాన
తడిలేని కణమైన
ధావళ్యమే కళలు
ఆనందమేలనే?
అమృతవీచిక లేల?
పరికిణీ కుచ్చులు జారాడగా పరుగెత్తుతూ, మెళ్ళో హారాలు గలగలా పాటలు పాడుతూ చిక్కులు పడుతూంటే తనతో ఆడుకున్నప్పుడు చిన్నతనంలో స్వర్ణలోని ఈ కర్కశత్వపు బీజాలు ఎక్కడా కనబడలేదే!
అప్పుడే పయ్యద సవరించుకొన్న నలుతాల్పు నవయౌవనపు తొలి పొద్దులలో ఆమెలోని వినూత్న పరిమళాలు ఈలాటి కటువువాసనలతో మిశ్రమము కాలేదే! ఆమె అన్నగారు తన ఊరు తన స్నేహవాంఛకై వచ్చినప్పుడు ఆ బాలిక తనలోని దివ్య సౌందర్యము వికసించే రోజులలో ఏవో కొత్త అందాలు సేకరించుకొనే గాఢ సురభిళ ఘటికలలో తనకై అన్నతో ఆమె వెన్నంటి వచ్చిన శుభముహూర్తాలకు అర్థమే లేదా? తనకూ, తన స్నేహితుడు శ్రీనికీ వాదాలు మ్రోగిపోయినప్పుడు అన్నగారికి వ్యతిరేకంగా ఆ బాలిక తనపక్షం వహించి వాదించిన తియ్యటి వాదనలకు ప్రయోజనమే లేదా! తన జన్మలో జన్మ. తన ప్రాణములో ప్రాణమూ, ఆత్మలో ఆత్మా ఐన కళను వదలాలా? తన జన్మలో జన్మ, ప్రాణములో ప్రాణమూ, ఆత్మలో ఆత్మ ఐనప్రేమను వదలాలా?
కళ తన ఆశయమూ నిదానమూ! కళ కోసమే కదా ఉద్యోగ వాంఛ పూర్తిగా నాశనం చేసుకున్నది? ఈ ప్రేమ బాలిక స్వర్ణకుమారి, ఆ కళతో రేఖకురేఖా, వర్ణానికి వర్ణమూ, మూర్తికిమూర్తీ రూపము పొందినదే. కళవల్ల కళాస్రష్ట లోకానికీ, లోకస్వరూపుడైన భగవంతునికి సేవ చేస్తాడు. ఆ సేవలో కళాస్రష్ట తన సర్వస్వమూ ఆహుతి చేయవలసి వుంటుంది. అదే మహా యజ్ఞము - ఈ దివ్య త్యాగమే కళను ఉత్కృష్టపథాలకి తేల్చి వేస్తుంది.
ఒక కళావ్యక్తి తన కళవల్ల లోకానికి సేవచేస్తున్నాననుకోవటము తన్ను తాను మోసం చేసుకోవటం కాదా? కళ లోకానికి సేవ ఔతుందా? కళాకారుడని పేరు వొస్తుంది - అలా పేరు రావడం ఒకని అహంకారానికి అలంకారం ఔతుందిగాని, పూజా స్వరూపము కాగలదా? తాను బూదిలో కలిసిన వెనుక కూడా తన పేరు నిలిచివుందనే భావము అహంకారానికి అధిస్థితి.
జీవించి ఉన్నన్నాళ్ళూ కలిగే అనుభవాలే మోక్షస్వరూపాలౌతవి. జీవితానికి ఉత్తమానుభవము ప్రేమ. ప్రేమ కోసం రాజ్యాలు వొదిలి పెట్టారు - ఎనిమిదవ ఎడ్వర్డు మొదలైన చక్రవర్తులు చిన్నతనాన్నుంచి తాను నమ్మిన ఒక బాలిక - తన జీవిత సర్వస్వమూ, తన సౌందర్య సర్వస్వము తనకు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఒక బాలిక, ఇవాళ తన విషయంలో నిస్పృహ చెంది కృశించిపోవలసిందేనా?
ఐతే ఆమె మాత్రం తన ఆశయాలు ప్రేమకోసం ఎందుకు ఆహుతించకూడదు? యుగయుగాలనుంచీ ఆడవాళ్ళను కాలిక్రింద నేలరాశారు మగవాళ్ళు. వాళ్ళ సర్వస్వమూ భర్తలకోసము ఇదివరదాకా త్యాగాగ్నుల కింధనం పోశారు. దివ్యసౌందర్యవతియైన ఒక బాలికకోసం తన సర్వస్వమూ త్యాగము చేసికోవటములో ఉత్తమత్వం ఉన్నదిగానీ, ఆమెను త్యాగం చేసుకొని రమ్మనటంలో లోకసాధారణగాథే ప్రత్యక్షమౌతున్నది.
తనతో ఆమె ఒంటిగ వాహ్యాళికి, సినిమాకు వొచ్చినరోజులు, తన మాట వినేటప్పటికే ఆమె ఉప్పొంగిపోయిన ఘడియలు, తన్నామె స్పృశించిన మాత్రాన తన దేహమంతా తన మనస్సంతా విద్యుత్తరంగాలు ముంచివేసిన శుభముహూర్తాలూ ఇప్పుడు అర్థంలేనివై పోవలసిందేనా”?
5
“నాన్నగారూ! నేను వ్యవసాయం చెయ్యాలని సరదా పుట్టింది. మన మెరక పొలంలో రెండెకరాలు నాకివ్వండి. అందులో మంచి తోట వెయ్యాలని వుంది” అని తండ్రి నడిగాడు శ్యామలరావు. శ్యామలరావు వూరు బెజవాడ బందరు రోడ్డు ప్రక్క కంకిపాడుకి ఇవతలనున్న ఇందుపల్లి గ్రామం. శ్యామలరావు తండ్రి సుబ్బయ్యగారు కుమారుణ్ణి చూసి "అబ్బాయీ! వ్యవసాయం యేమిట్రా? రెండు మూడు మంచి ఉద్యోగాలకు వీళ్ళు వస్తే అక్కరలేదని తోసేశావు. బెజవాడలో ఏదో కాలేజీ పెట్తానన్నావు, నీకు నిమిషాని కో ఆలోచన. మనస్సు నిలకడ లేదాయెను” అని కొంచెం కోపంగా అన్నారు.
“మీరు గట్టిగా వొద్దంటే మానేస్తాను నాన్నా! నా కోర్కె ప్రతీదీ మీరు సంభవించేటట్టు చేశారు. మీ ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి. ఈ ఒక్కకోరికా తీర్చండి. ఈ కోర్కెకూ, నా జీవితానికి చాలా సంబంధం వుంది.”
"అబ్బాయీ! తోటవేయడమంటే చాలా డబ్బు ఖర్చౌతుంది.”
"ఏదో కొద్ది ఖర్చుతో తోటవేయాలని వుందండీ మనకున్న స్థితిలో మన కుటుంబాలకు డబ్బు కష్టసాధ్యమే. చదువుకోసం మీరు పంపించిన రూపాయలలో కొన్ని ఖర్చుచేయకుండా బ్యాంకులో ఉంచాను. అదే నా నాగలి దున్నటానికి పెట్టుబడి.”
“నాన్నా! నీ ఆరోగ్యం అంత బండరకపుదికాదురా! ఈ బండపనిలో ఎందుకూ పనికిరాకుండాపోతావు. సందేహంలేదు.”
“డాక్టర్లు, దేశనాయకులూ మళ్ళీ భూమాత పాదాల కడకు చేరండి. దేశ సౌభాగ్యమూ ఆరోగ్య సౌభాగ్యమూ. అక్కడే ఉన్నది' అంటున్నారండి నాన్నగారూ!”
“ఉల్లికోడుపొలం నూతిదగ్గర ఒక యకరందొడ్డికి చుట్టూ వెదురుకంచె కట్టమంటాను వెంకన్నని. మొదలెట్టు ఇదో మూన్నాళ్ళ ముచ్చట. తర్వాత నేను చెప్పలేదని మాత్రం అనకు.”
ఉల్లికోడుపొలంలో యెకరంతోట విభాగించారు. ఆ తోటలో నాగేటి చాలు నవ్వింది. బెజవాడు ముష్టివారి దుర్గానర్సరీనుండి అంట్లు విత్తులూ బళ్లమీద వొచ్చి తోటంతా ముట్టడించాయి. అద్దెకు తీసుకు వచ్చిన మోటారు పంపు అమిత వేగంతో పాతాళ గంగాగానాన్ని శ్యామలుని కంఠానికి శ్రుతి కలిపింది.
తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర మళ్ళు ఒక ప్రక్కన. కాబేజీ, కాలీ, ముల్లంగి, కారెటు విత్తనాల మళ్ళొకప్రక్క పచ్చని మొక్కలతో పకపకమన్నాయి. మామిళ్ళు, సపోటాలు, తీపినిమ్మలు, బత్తాయిలు, నిమ్మలు బలమైన అంట్లు బార్లు తీర్చినవి. బొప్పాసి మొక్కలు, కొబ్బరి మొక్కలు తొటచుట్టూ కంచె పక్కనే కాపలాకాస్తున్నవి. ఒక మడిలో ముప్ఫైరకాల గులాబీలు, కేర్లయిన్డి ఆర్డెన్, పాల్నెరాన్, తెల్ల అమెరికను సుందరి పువ్వులతో అలంకరించుకొని గాలిలో నృత్యాలు సల్పుతున్నది.
మూడు నెలలు ఒళ్ళు తెలియకుండ స్వర్ణకుమారిపేరు మంత్రం కాగా శ్యామలుడు ఆరోగ్యం అంతా హూనం చేసుకున్నాడు. అతని చిత్రలేఖనం బొగన్ విల్లాలలో, అతని కవిత్వం తీగెసంపెంగలో, అతని మధుర కంఠం మాలతీ మాధవీ లతలలో రంగులుదాల్చి ఛందోగతుల నడిచి తాళగతియై ప్రసరించిపోయినవి.
పెద్దపాలి వెంకన్న ఎంతో సాయముచేశాడు. పలుచని సున్నితమైన అతని శరీరము తన పాత బంగారుఛాయ త్రోసిపుచ్చుకొని ఎర్రపడి నల్లబడి పోయింది. అతని ఫాలంలోని కాంతీ, కళ్ళలోని నృత్యము, పెదవుల్లోని హాసము మటుమాయమైపోయి నాగేటిచాళ్ళకు ఎరువుగా రాలినవి.
6
స్వర్ణకుమారి కనులక్రింద క్రీనీడలు బయలుదేరినవి. అందమైన పంపులు సేకరించుకొన్న - ఆమె పెదవులు తడిరబ్బరుతో చెరిపిన రేఖలులా మరకలుపడినవి. కొద్దివంపు తిరిగిన ఆమె చిత్రమైన ముక్కు సన్నగించి నిజముగ శుకనాశికయైనది.
శ్రీనివాసరావు ఆమె భుజములు రెండు అదిమిపట్టుకొని “చెల్లీ! నీకు మతిలేదు- నాకు పౌరుషంలేదు. మనిద్దరికీ బుద్ధిలేదు. నీ వీ సుబ్రహ్మణ్యాన్ని పెండ్లి చేసుకుందామనేనా? నాన్నా అమ్మా దగ్గరనుంచి నీకిష్టమైతే సంబంధం వొప్పుకోవచ్చునని నాకు మూడుదినాలై వుత్తరం వొచ్చిన సంగతి యెరుగుదువుకదా? అంతభారం నీనెత్తిమీదే పడింది. వాళ్ళమ్మ నన్ను రోజూ అడుగుతోంది. ఏదో జవాబు చెప్పకపోతే నేను వొఠ్ఠి మూర్ఖుణ్ణవుతాను. ఇప్పటికైనా -”
"ఏంచెయ్యమంటావన్నయ్యా! లోకం అంతా ఆడవాళ్ళని పళ్ళూడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే వుంటుంది. నువ్వుకూడ లోకముతోపాటు వాడివే అయ్యావు. నాన్నా అమ్మా యిచ్చిన అధికారం నీ నెత్తిమీదే పెట్టాను. నువ్వే చెయ్యి.”
“ఇదిగో సోనూ! నన్ను పిచ్చివాణ్ణి చెయ్యకు. చిన్నప్పటి నుంచీ నువ్వు కొండమీద కోతిని తీసుకువచ్చి యివ్వమంటే తెచ్చియిచ్చాను. నా ఆలోచనలు మగవాడి ఆలోచనలు.”
“నేను వొట్టి దద్దమ్మ ఆడదానిని.”
“నీ కెప్పుడూ సహజంగా వుండే విధానమంతా యేమైపోయింది? మాట్లాడితే తోకతొక్కిన తాచుపాములా లేస్తున్నావు.”
“మాటలతో నన్ను బాధించకపోతే ఒక కొరడా తీసుకోరాదు?”
"అయ్యో! వెర్రితల్లీ! నువ్వేది చెయ్యమంటే అదే చేస్తాను. నీ యిష్టంవచ్చినట్టుగ ఆలోచించుకొని నువ్వు ఆజ్ఞ యిస్తే పాలించడం నావంతు. దీనికి మిన్ను వొచ్చి మీదపడి నా సాలెగూడును దులిపి వేసినట్టు దులిపి వేస్తాను.”
స్వర్ణ కుమారికి కళ్లు చెమరించినై. “అన్నయ్యా! క్షమించు. నాకు మతిపోతున్నది. సుబ్రహ్మణ్యం తల్లితో సంబంధం ఖాయమని చెప్పు. నాన్నకూ అమ్మకూ ఉత్తరం వ్రాయి-”
"తల్లీ! ఆలోచించుకొని చెప్పమన్నాడు.”
"మళ్ళీ మొదలుపెట్టావూ! ఐతే నీ యిష్టమే ”
“అబ్బా! ఎంతకోపం వచ్చేస్తుందమ్మా నీకు? ఈ తక్షణం వెళ్ళి సుబ్రహ్మణ్యం తల్లితో చెప్తాను. అమ్మకి నాన్నకి ఉత్తరం వ్రాస్తాను. నువ్వు తొందరగా పెట్టించమంటే తొందరగా, ఆలస్యంగా పెట్టించమంటే ఆలస్యంగా ముహూర్తం పెట్టిస్తాను.”
“ఎంత తొందరగా ముహూర్తం పెట్టించగలిగితే అంత తొందరగా పెట్టించు. భారత సౌభాగ్యం ఆలోచనలతోనూ ఆలస్యాలతోనూ వెనక్కు పోతున్నది. ఒక వ్యవసాయదారుని అర్ధాంగిని హ్హా హ్హా హ్హా.” ఆమె వొళ్ళు తెలియని నవ్వు నవ్వుకుంటూ ఆ నవ్వులో విరుచుకుని మూర్ఛలో పడిబోయింది. పడబోయే చెల్లెల్ని చివాల్న ఎత్తుకొని రెండంగలలో ఆమె గదిలోకి తీసుకువెళ్ళి మంచంమీద పడుకోబెట్టి, ప్రక్కనున్న కుజాలోని నీళ్ళు ముఖంమీద చల్లి, ప్రక్కలునొక్కి నవ్వాపాడు. ఆమె గజగజ వణికింది.
“సోన్, కంగారు పడకమ్మా! మేమంతా కలిసి నీకు రాక్షసుల మయినాము. శ్యామసుందరు డొక పంద. ఇదిగో ఈ మందు పుచ్చుకొని పలకకుండా పడుకో. మామూలు దానవౌతావు" అంటూ శ్రీనివాసరావు తనగదిలోకి పరుగెత్తి కెళ్ళి తనవద్ద యెప్పుడూ సిద్ధంగా ఉన్న మందులపెట్టె పట్టుకు వచ్చి యింత బ్రొమైడు యిచ్చి తల నిమురుతూ ఆమె నిదురబోయే వరకు కూచున్నాడు. బలపూర్ణములయిన సమ్మోహనశక్తిగల అతని హస్తతల స్పర్శలో ఆ బాలిక నెమ్మదిచెంది చల్లగా నిద్రాదేవిఒడిలో మైమరచినది.
ఆ సాయంత్రం బండికట్టించి ఐదుమైళ్ళలోవున్న రైలు స్టేషను చేరుకున్నారు. అన్నా చెల్లెళ్లు; శ్రీనివాసరావు తన చెల్లెల్ని స్వగ్రామమయిన బెజవాడ తీసుకువెళ్ళాడు.
మూడవ భాగము
స్వర్ణకుమారితండ్రి తన కుమార్తె సుబ్రహ్మణ్యాన్ని పెండ్లి చేసుకోవటానికి నిశ్చయించుకుందని సుబ్బయ్యగారికి ఇందుపల్లి ఉత్తరం వ్రాశాడు. ఆక్రిందటిరోజునే వొంట్లో బాగాలేదని శ్రీనివాసరావు చెల్లెల్ని తీసుకువొచ్చి ఆమె ఆరోగ్యంతో తిరుగుతూవుండటం చూచి వారం రోజుల్లో వెళ్ళిపోయాడు.
స్వర్ణకుమారికి వచ్చిన అనారోగ్యం విషయంలో సుబ్రహ్మణ్యం మాటే మరచిపోయిన శ్రీనివాసరావు కొంతకాలమయిందాకా యేమాటా సుబ్రహ్మణ్యంతో తేల్చకూడదని నిశ్చయం చేసుకున్నాడు. ఈ సంగతి స్వర్ణకుమారికి గాని వారి తండ్రి రాధాకృష్ణయ్యగారికి గాని తెలియనీయలేదు. అన్నగారి సంగతి సుబ్రహ్మణ్యముతో చెప్పినట్లే భావించుకోన్నది స్వర్ణకుమారి. ఆమె హృదయంలోనుంచి ఎంత చెరిపి వేసుకుందామనుకున్నా శ్యామలుని చిత్రం మాయంకాదు. నవ్వుతూ నాట్యంచేసే కళ్ళతో పెదవులతో అతడామెకు సర్వకాలమూ ప్రత్యక్షమౌతూనే ఉన్నాడు.
రెండేండ్లనాడు తన పుట్టినరోజుకు అతడు బహూకరించిన 'విశాల భారత' అనే ఉత్కృష్ట చిత్రము తన పడకగదిలో ఎట్టఎదుట గోడకు వ్రేలాడుతూ ఉన్నది. రెండెడ్లబండి కొండలూ పొలాలూ మధ్య పుంతలో వెళ్తూన్నది. బండిపైన బస్తాలమీద చిన్నకుర్రవాడొకడు ధాన్యపు వెన్నులలోని గింజలు తీసుకుని నములుతున్నాడు. కొండలూ, పొలమూ చెట్లయొక్క సౌందర్యము అలవరచుకొన్న బలిష్ఠుడైన రైతు బండి తోలుతున్నాడు. ఆకాశమూ, తీగెలూ, పువ్వులూ, అందాలు పుణికిపుచ్చుకొన్న ఆ రైతుభార్య బండివెనుకనే నెత్తిమీద తట్టతో నడిచి వొస్తూన్నది. దూరాన ఆ లోయలో ఒకవూరు. సూర్యుడస్తమిస్తున్నాడు. ఆకాశంలో పైన తదియనాటి చంద్రవంక. ఈ రెండూనూ “విశాలభారత”లోని వృద్ధత్వమూ నవ్యత్వమూ చాటూతూన్నవి. భారతీయ విధానాన్ని చిత్రించిన అద్భుత చిత్రమిది. లక్నో ప్రదర్శనంలో ప్రథమ బహుమతి నందినది.
ఆ చిత్రము దివ్యము. ఆ చిత్రించిన చిత్రకారుడు తనకు దూరమయి పోయాడు. అల్లరివాడు. ఎప్పుడూ తనను నవ్వించేవాడు. అతడు తన జీవితాన్ని ప్రతి అణువూ స్పృశించి తన కైవశం చేసుకున్నాడు. తానాతని కళ్ళలో కాంతులు పొందింది. అతని నవ్వుల్లో నాట్యమాడింది. “నువ్వు నాకు స్వర్గదేవివి. నీ మందహాస పవిత్రకిరణంలో నా జీవితమూ, నా శక్తి, పుష్టిచేర్చుకుంటవి స్వర్ణసానీ” అని తన్ను అతని హృదయానికద్దుకొన్న గంగానదికడ ఒక దివ్యక్షణ మామెకు స్ఫురణకు వొచ్చింది. ఆ నా డామె పొందిన మహదానందము క్షణికమాత్రమే ఐంది. తన మాటలకే కోపంవచ్చి అతని సహజామృత రసప్రవాహంలో తనకోపం తీర్చక పిరికి వానిలా వెళ్ళిపోయాడు.
తాను కోరేది దేశ సౌభాగ్యం. దేశ సౌభాగ్యాని కాధారం నాగలి. నాగలీ! నువ్వు వేదానివి, నువ్వు పురాణగీతికవు, నువ్వు భగవద్గీతవు, నువ్వు భారతీయ హృదయానివి. నీవల్ల పాశ్చాత్య నీచభావ నీరసంలో పడ్డ మా దుర్బలత్వాన్ని ఏనాటికానాడు పటాపంచలు చేస్తున్నావు. శ్యామసుందరుడు నాగలి పట్టకపోతేనేమి? నాగలిని కీర్తించే కళాస్రష్టకు తావులేదా? లలితంగా కుంచెపట్టుకునేచేయి కర్కశంగా మేడితోకను పట్టవలసిందేనా? నాగలినీ నాగేటిచాలునీ కీర్తించటము దేశసేవకాదా? శ్యామసుందర్ ! నువ్వేమిచేస్తూ వుంటావు. గంగవొడ్డున నీవు చేసిన బాసలు, అన్నగారి పొలంలో నీ డగ్గుత్తిక కంఠం అర్థంలేనివేనా శ్యామం?
2
అనవసరమైన పౌరుషాలకు అవతల, అర్థవత్కృతమైన శాంతి కాంతి వెలుగుతూ ఉంటుంది. మనుష్యుని జీవితంలో ఎంత లోతైనా తవ్వి నూతులలో పాతాళగంగా ప్రవాహాలు పారకిస్తాడుగాని తన హృదయంలో కటినమైన పైభాగం తవ్వుకొని తన ఉత్తమత్వం తాను తెలుసుకోలేడు, తన చెల్లిదాలోటు, తన ప్రాణమిత్రుడు శ్యామలునిదా? ఈ రెండు జీవితాలు భగ్నమయితే తాను బాధ్యుడుగాక ఎలాగు? అసలు సత్యానికి దూరమైన వంకరలు భావాలు నిజమని తోస్తే, వాటినే నమ్మి జీవితం భగ్నంచేసుకోవడంలో ఎంత మంది ఆరితేరినారో!
శ్రీనివాసరావుకి వ్యవసాయంపైని మనస్సు పోవటంలేదు. సుబ్రహ్మణ్యం వచ్చి మాట్లాడడమే అపశ్రుతిగా తోచేది. వ్యవసాయమంతా వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలను కొన్నాడు.
బెజవాడలో అటూ ఇటూ తోచక తిరుగుతూ, వ్యవసాయంలో అన్నగారు ఒక్కరూ ఉన్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదా అనుకుంటుంది స్వర్ణకుమారి. అక్కడ ఆ సుబ్రహ్మణ్యం వచ్చి పలుకరిస్తాడు. వెఱ్ఱివాడు; పాపం! అతనికేమి తెలుసును, తన హృదయంలోని గాఢమయిన భయంకరమయిన ఈ ఆవేదన ఆ శ్యామంమీద కోపం కొద్ది ఈతన్ని తన జీవితంలోకి రానిచ్చింది. అవును. అందువల్ల తనతప్పేమి? తన జీవితపథమూ, తన ఆశయాలు; తన స్వప్నాలు గుర్తించలేని ఒక మూఢుడు తన జీవిత భాగస్వామి ఎట్లా అవుతాడు! ధైర్యమూ పట్టుదలా గట్టితనమూ లేని నీరసత్వపు ఆడది అవటంచేత తానిల్లా బాధపడుతోందిగాని, ధీరస్వభావలగు ఉత్తమ స్త్రీలు ఈ అటు నిటు ఆవేదనలలో అల్లాడి పోనేపోరు.
తన వ్యవసాయం ప్రారంభం అయి నాలుగు నెలలయింది. ఈ తోట వేయడంలో ఏమి కొత్తదనం ఉంది?
కళలో సర్వకాల నవ్యత్వముంది. విధానాలు కొత్తవి. కళలో పరిశోధన చెయ్యవచ్చును. “డాడాఇజమో, ప్యూచరిజమో, ఇంప్రష నిజమో, ఎప్పుడూ కళా ప్రపంచంలో ఉద్భవిస్తూ ఉంటవి.
వ్యవసాయంలో నవ్యత్వం లేదా! ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీతులు రావటంలేదా? కృషీవలుడు మాత్రం ఒక రకమయిన కళాస్రష్ట కాడా? కొత్తరకపు పంటలు అనేకులు పండిస్తున్నారు. స్రష్ట అయినవాడు తోటలు వేయడంలో కొత్తరకపు పూలు, పండ్లు ఎప్పటికప్పుడు కల్పించడంలేదా?
కళ మాయ! ఊహా ప్రపంచం మాత్రం వట్టి కల్పన ధరిత్రీ మాతృకృషి సత్యమయినది. అందువల్ల వచ్చే ఫలితం కళ్ళ ఎదుట మూర్తిస్తుంది.
ఈ ఆలోచనలతో శ్యామలరావు నుదురున చెయ్యి పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే సుబ్బయ్యగా రాయనదగ్గరకు వచ్చారు.
“నాన్నా! నానాటికి తీసికట్టు నాగంబొట్టు ఔతున్నావురా! ఏమీ తోచనమ్మ ఏతామెత్తటం ప్రారంభించిందట. డబ్బిచ్చి తద్దినంకొని తెచ్చుకుంటే వేయిచ్చినా వెళ్ళదట; అలా ఉన్నది నీ విషయం. కళ్ళు నూతులై పోయాయి. బోర యెండిపోయింది. రాత్రిళ్ళు దగ్గుతూ వుంటే నా గుండె గుభేల్లుమంటుంది.”
“నా వొంట్లో బాగానే వున్నదండీ నాన్నగారూ!”
“ఈ రోజుల్లో పెద్దవారు చెప్పటం చిన్నవాళ్ళు వినడం పోయిందిగా! అంతా జోల్షివిష్టులు, 'మేం చేతుల్తో నడుస్తాము; అది అందం' అంటారు. ఏక్షయయైనా వొచ్చిందంటే నుయ్యో గొయ్యో చూసుకోవాలి మేము వరప్రసాదులాంటి కొడుకని మీ అమ్మ గోలపెట్తోంది. మా కడుపున పుట్టింది నీ వొక్కడవు.”
“మీకు చాదస్తమండీ!”
"ఔను మాకు చాదస్తం. నీకు నిదానం. నువ్వెందుకు వ్యవసాయం తీసుకున్నావో నాకు తెలియకపోలేదు. బెజవాడలో రాధాకృష్ణయ్యగారి కుమార్తె స్వర్ణకుమారి అన్నగారితోపాటు వ్యవసాయం చెయ్యటానికి కుంతలూరు వెళ్ళింది కదా! ఆ అమ్మాయితోపాటు నువ్వూ ఎందుకు వ్యవసాయం చెయ్యకూడదని నీకు బుద్ధిపుట్టింది.”
“నాన్నగారూ! మీ రనవసరంగా నన్ను బాధపెట్టడానికివ్వాళ తలచుకున్నట్టుంది.” “ఓయి వెర్రివాడా! నేను బాధపెట్టటమేమిటి? చిన్నతనాన్నుంచీ ఆ అమ్మాయిని నీ కిస్తాననటం, నేనూ రాధాకృష్ణయ్యా ఈ విషయం నిశ్చయించుకోవడం, అందరు పెద్దలు ఆశీర్వదించటం జరిగింది. నువ్వు చదివే కాశీలోనే ఆ అమ్మాయి చదవటం, మీరిద్దరూ ఒకరినొకరు పెండ్లి చేసుకుంటామని ఉవ్విళ్ళూరిపోవటం లోకమంతా ఎరుగును.”
శ్యామలుడు మౌనం.
“నెలరోజుల క్రిందట ఆయన ఓ ఉత్తరం వ్రాశాడు. వాళ్ళమ్మాయి స్వర్ణకుమారి శ్రీనివాసరావుతోపాటు వ్యవసాయంచేస్తూన్న ఒక అబ్బాయిని పెండ్లిచేసుకోవడానికి నిశ్చయించుకుందనీ, తన కుమార్తె గట్టిపట్టుపట్టడం చేత తాము ఆమోదించవలసి వచ్చిందనీ, తన్ను క్షమంచవలసిందని ఆయన వ్రాశారు. నీ మనస్సు బాధపడి పోతుందని నీ కప్పుడా ఉత్తరం చూపలేదు.”
శ్యామలుని మోము వివర్ణం చెందింది. నీరసించి వున్న శ్యామలుడు తల దిమ్మిపట్టి ఫెళ్ళున విరుచుకొని పడిపోయాడు. “నాయినా!” అంటూ కొడుకును రెండు చేతులతో యెత్తి మంచం మీద పడుకోబెట్టి సుబ్బయ్యగారు “ఏమే, నీళ్ళే” అని కేకపెట్టాడు. “ఏమిటండీ! ఏమిటండీ!” అంటూ తల్లి కంగారుపడుతూ వచ్చింది. మంచంమీద శవంలా పడివున్న కొడుకును చూచి “ఓయి నాయనో, అమ్మో” అని కేకలుపెట్టింది.
“నోరు మూసుకో! వాడిప్రాణం కడగట్టింది. పరుగెత్తుకు వెళ్ళి డాక్టరు గారిని అర్జంటుగా రమ్మని కబురు పంపించు” అని సుబ్బయ్యగారు కొడుకు మొహంమీద నీళ్ళు గట్టిగచల్లి కుమారుడి నాడి పరిశీలిస్తూ అతని మొహం వకం పారచూచి కళ్లు చెమరించటం వల్ల పైమీద కండువాతో ఎడమచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు.
3
శ్యామలరావు కళ్ళు తెరిచాడు. తల్లివంక మొహం తిప్పి “ఏమీ లేదమ్మా! కంగారుపడకు!" అని లేవబోయాడు.
తండ్రి “నాయనా! వద్దు” అని వారించి కుమారుని మంచంమీద పడుకోబెట్టాడు. ఇంతట్లో డాక్టరుగారు వొచ్చారు. శ్యామలుని పూర్తిగ పరీక్షచేసి అతి బలహీనతవల్ల గుండె కూడ బలహీనంగా ఉందని, శ్యామలుని నరాలకుదెబ్బ తగిలిందనీ, పూర్తి విశ్రాంతీ, జాగ్రత్తగ వైద్యం చేయటం ముఖ్యమనీ చెప్పి “గ్లూకోజు” మందు ఇంజక్షను ఇచ్చి ఇంటికి వెళ్ళి మందులు పంపిస్తానని వాళ్ళందరకు ధైర్యం చెప్పి వెళ్ళాడు.
శ్యామలరావు లేవలేడు. కాళ్ళూ చేతులు సళ్లుకుపోయినవి. అధికాచమాన అల్పాచమానాలు మంచంమీదనే “నీరసం! నీరసం! కాఫీ" అని గంట గంటకూ నీరస స్వరంతో అడగడము ప్రారంభించాడు. అతని కేదో అపరిమిత భయం ఉదయించింది. మాట్లాడితే డాక్టర్ను పిలవమంటాడు. డాక్టరు ధైర్యం చెపుతూంటే ధైర్యంగా వుంటాడు.
ఒకసారతనికి వేగనాడి (Trachycordia) ఒకసారతనికి మందనాడి (Bradycordia) ఏమీ ఈప్రాణానికింతకంగారూ? తాను ప్రేమించిన స్వర్ణకుమారి ఇంకో అదృష్టవంతుని జీవితంలో భాగస్వామిని ఔతుంటే భగవంతు డేదో మంచిదారే చూపిస్తున్నాడు. బాధలేకుండ జీవితం మాయమైపోతే ఆ బాలిక దారి నిష్కంటక మౌతుంది. తాను లోకంలో లేని భావం ఆమెకు తోచినప్పుడు తన కోసం ఒకసారైనా విచారించకుండా వుంటుందా? ఈప్రేమ కాశించడం తుచ్ఛమా! పురుషునికి స్త్రీమీదనూ స్త్రీకి పురుషుని మీదనూ వుండే ప్రేమే జీవితంలోకల్లా ఉత్కృష్టమైనప్రేమ. ఆ ప్రేమ నిష్కల్మషమైతే భగవంతుని మీద ప్రేమే ఔతుంది. ప్రేమ - జీవితం భగ్నం చేసి పెట్టుకోడానికి తెచ్చిపెట్టుకున్న విషం! బంగారుపు గిన్నెతో నింపుకొని తాను తాగుతూన్నాడు - వ్యవసాయం- కళలు, ప్రేమ -
డాక్టరుకి శ్యామలరావు సంగతి చూస్తే కొంచెం భయమే వేసింది. మదరాసో, విశాఖపట్టణమో తీసుకెళ్ళితే ఉత్తమమని సుబ్బయ్యగారికి సలహా చెప్పాడు. తానుకూడా వస్తానన్నాడు. సుబ్బయ్యగారు కొడుకుతో నెమ్మదిగా “నాన్నా! విశాఖపట్టణం వెళ్దాంరా” అన్నాడు.
నీరస కంఠధ్వనితో శ్యామలుడు "ఏమీ జబ్బులేదండీ! రెండురోజుల్లో నెమ్మదిస్తుంది” అని అన్నాడు. కుమారుని కంఠంలోని నిస్పృహా, హృదయంలోని బాధా సుబ్బయ్యగారు కనిపెట్టకపోలేదు.
“నాన్నా నీ యిష్టం వచ్చినపని చేసుకో! నీకు కావలసిన డబ్బిస్తాను. బెంగపెట్టుకోకు. అనవసరమైన హృదయంలోని బాధ నిన్ను క్రుంగదీయుట అటు వుండగా కడుపున పుట్టిన నీవొక్కడమీదా ఆధారపడివున్న నన్నూ. మీ అమ్మనీ మహా బాధా నరక కూపాల్లో పడదోస్తుంది. నా జన్మంతా నీ మీదే ఆధారపడి వున్నది. ధైర్యం తెచ్చుకొని నన్ను రక్షించుకో!”
తన హృదయంలోని బాధతోపాటు, తండ్రిగారి బాధకూడా శ్యామసుందరునకు జబ్బును ఇబ్బడి చేసింది.
ఆనాడు అతి ఆవేశంతో సుబ్బయ్యగారు పెద్దఉత్తరం వ్రాసి రాధాకృష్ణయ్యగారికి బెజవాడ పంపించారు.
4
వెళ్ళిన దగ్గరనుంచి అన్నగారి దగ్గరనుండి వుత్తరాలే లేవని స్వర్ణకుమారి ఆలోచించుకుంటూ ఒక ఇంగ్లీషు నవల చదువుకొంటోంది. రాధాకృష్ణయ్యగారు కూతురు దగ్గరకు వచ్చి “స్వర్ణా! మీ చదువులన్నీ మా పెద్ద వాళ్ళ ప్రాణాంతకాలైనాయి” అని అన్నారు.
"ఏమిటండీ నాన్నగారూ! మీరు గూడ మా చదువులమీదే కత్తికట్టారా! నేను చదువుకుంటానని ముచ్చటపడితే మీకు చెప్పించమని ఎక్కడ వుంది?”
“అవును, నా నెత్తిమీదకుండ నేనే బోర్లించుకున్నానులే.”
"అలా మాటలాడుతున్నారేమిటండీ నాన్నగారూ!”
"ఏమీలేదు; ఇందుపల్లినుంచి ఉత్తరం వచ్చింది.” స్వర్ణకుమారి మౌనము.
“నాకేమిచేయాలో తోచకుండా వున్నది.”
"శ్యామలరావు తండ్రి సుబ్బయ్యగారు వ్రాశారు.”
స్వర్ణకుమారి తలవంచుకొని కాలి బొటన వ్రేలితో నేలరాస్తూన్నది.
"శ్యామలునికి చాల జబ్బుగ వుందిట!”
"ఏమిటండీ!”
"కుంతలూరునుంచి వొచ్చినప్పటినుంచీ శ్యామలరావు వ్యవసాయం ప్రారంభించాట్ట! చిక్కి శల్యమైపోయాట్ట. తండ్రి ఎంత చెప్పినా వినలేదట. నేను వెనక సుబ్బయ్యగారికి నువ్వు సుబ్రహ్మణ్యాన్ని పెళ్ళి చేసుకుండే విషయం ఉత్తరం వ్రాశాను. ఆ సంగతి యిన్నాళ్ళదాకా కొడుకుతో చెప్పకుండా మూడురోజుల క్రిందట, తండ్రి శ్యామలరావుతో చెప్పాట్ట. ఆవార్త వినటంతోనే శ్యామలుడు విరుచుకుపడిపోయాట్ట.”
“ఎలా వుందండీ!”
"డాక్టరు వైద్యం చేస్తున్నాడట! విశాఖపట్టణం తీసుకు వెడదామని అనుకుంటూన్నారట. మీ యిద్దరి చిన్నతనంలో నేనిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోవలసిందని సుబ్బయ్యగారు వ్రాశారు.”
“నాన్నా, మీరు కారు మాటాడించి ఇందుపల్లి ప్రయాణంకండి. అమ్మా, మీరూ, నేనూ తత్క్షణం బయలుదేరి వెళ్ళాలి. అన్నయ్యకీ శ్యామలరావుకీ స్నేహితుడు ఈ వూళ్లో డాక్టరు జగన్నాథరావుగారున్నారే ఆయన్నికూడ తీసుకు వెడదాం అన్నయ్యని తత్క్షణం రమ్మనిఉత్తరం వ్రాసి ఇందుపల్లి నుంచి వొచ్చిన ఉత్తరం జతపర్చి మనిషికిచ్చి పంపండి” అని కన్నీళ్ళతో కంగారుతో బట్టలు సర్దుకొంటోంది. రాధాకృష్ణయ్యగారు విసవిస వెళ్ళిపోయారు.
స్వర్ణకుమారి హృదయంలో "కాశీవిశ్వేశ్వరా! నీ సాక్షిగా మే మిద్దరం ప్రేమ ప్రతిజ్ఞ తీసుకున్నాము. నా శ్యామలుని రక్షించు. మేమిద్దరం కలిసి నీ దగ్గరకు వస్తాము, తండ్రీ” అని ఏడ్చినది. ఆమె కన్నులూ ఏడ్చినవి.
5
ఏదో నల్లని మత్తుకలలతో, మండే బాధతో ఈతకందని లోతులుగల నీరసంతో “అమ్మా” అంటూ ఓ మాటు తల్లిని కాళ్ళు పిసకమంటాడు. ఓ మాటు వొద్దంటాడు శ్యామం.
శ్యామలుడు ఆ అతినీరసములోనే ఏదో కారు చప్పుడు విన్నాడు. ఇంతటిలో డాక్టరుగారు వొస్తున్నారని సుబ్బయ్యగారు వచ్చి కొడుకుతో చెప్పాడు.
“స...రే...లెండీ....” అని శ్యామలుడు కళ్లు తెరిచాడు.
డాక్టరు విశ్వనాధంగారు డాక్టరు జగన్నాథరావుతో గది గుమ్మంవద్ద ప్రత్యక్షమయ్యాడు. జగన్నాధరావు గది గుమ్మంనుండి లోపలికి గబగబ వచ్చి "ఏమిరా, శ్యామ్! మహామొనగాడ వయ్యావుట! నీ స్నేహం యేడ్చినట్టే వుంది. కాస్త కబురు పంపకూడదు కాబోలు! ఏదీ, చెయ్యేదీ!”
జగన్నాథరావు చిన్నతనంలోనే ప్రసిద్ధి సంపాదించుకున్న డాక్టరు. శ్యామలునికన్న నాలుగేళ్ళు పెద్ద. శ్యామలుని గుండె బాగా పరీక్ష చేశాడు రక్తపుపోటు యంత్రంతో. ముంజేతినాడి పరీక్ష చేశాడు.
“గుండెలో జబ్బేమీలేదు. నరనీరసత్వమూ, బెంగా తప్ప ఏమీలేదు. పదిరోజులపాటు నా దగ్గర వుండటము, నాతో సినిమాలకు రావడము నేనివ్వాళ నాతో తీసుకువచ్చిన మంచి నర్సు చేతుల్లో ఉపచారం పొందటము ఇదీ వీడికి వైద్యము. ఒరే శ్యామ్! ఈ నర్సుని చూశావూ! చాలా ప్రజ్ఞావంతురాలు. నువ్వెరుగున్నమ్మాయేట. జనరల్ ఆస్పటలులో నర్సుల చేతిలో ఎప్పుడూ పడలేదు కాబోలు!”
శ్యామలుడు ఆనందము, బాధ సమ్మిళితమయ్యే నవ్వుతో స్నేహితుని అరచెయ్యి తన ముఖానికి అద్దుకున్నాడు.
“ఔరే శ్యామ్! మా నర్సు చాల అందమైనది సుమా! జాగ్రత్తగా వుండు, లేకపోతే నాకు ఈర్ష్యవొస్తుందిసుమా!”
"నీ మొహం! ఎప్పుడూ ఇలాంటి మాటలే” అని నవ్వుతూ అన్నాడు శ్యామలుడు. ఆ నీరసత్వంలో బలం కలుగుతున్న ఛాయలూ వున్నవి.
“నువ్వు కంగారు పడకపోతే ఆ అమ్మాయి ఎవ్వరో చెప్తాను.”
“నాకు నర్సెందుకురా!” మాట యింకా దిటవుగా వున్నది.
“ఈ రోజుల్లో జబ్బులకి నర్సులు లేకపోతే లాభంలేదు. అంచేత ఆ నర్సు పేరు చెప్తున్నాను. ఆమె పేరు బంగారం!”
శ్యామసుందరుని కళ్ళు మెరిసినవి. అతని గుండె దడదడ కొట్టుకున్నది. శ్యామసుందరుని చేయి తన చేతితో పట్టుకుని నాడిపై వ్రేళ్ళు యింతవరకూ వుంచివున్న జగన్నాథరావు.
"ఒరే! నాడి ఎంత వేగంగా కొట్టుకొంటోంది. తగ్గు తగ్గు. అబ్బా! ఏమి సంతోషమండీ, మా వాడికి బంగారు నగలుచూట్టం బంగారు రంగులుచూట్టం మా యిష్టం! ఈ నర్సు పేరు వొట్టి బంగారం కాదురోయి, బంగారపు కుమార్తె, స్వర్ణకుమారీదేవి. సుబ్బయ్యగారూ! ఆ నర్సునిలా పిలవండి!" గుమ్మం బైటనుండీ ఈ మాటలన్నీ వింటూన్న స్వర్ణకుమారి చిరునవ్వు నవ్వుకుంటూ గదిలోనికి వచ్చింది. స్వర్ణకుమారి చూపులూ, శ్యామసుందరుని చూపులూ జగత్సర్వమూ మరచి ఒకదానిలో ఒకటి లీనమైపోయాయి.
"మా నర్సుని చూస్తేనే నాడి బాగా ఇంప్రూవైందే; ఆవిడ పరిచర్యచేస్తే రేపే లేచి నడుస్తాడు, నీ డ్యూటీలో చేరమ్మా నర్సూ!”
ఇంతట్లో రాధాకృష్ణయ్యగారు, స్వర్ణకుమారి తల్లి మహలక్ష్మమ్మ గారు లోపలికి వొచ్చారు.
రాధాకృష్ణయ్యగారు, “ఏమోయ్ శ్యామం! జగన్నాథరావు రేపు ప్రొద్దున్నే మనమంతా బెజవాడ వెళ్ళాలని దారిలో చెప్పాడు. నీ వెనకటి మిసిమిదనం వొచ్చేవరకూ మా యింటిలో వుండాలి సుమా! తర్వాత నీ యిష్టం ముహూర్తానికి తరలి వచ్చేవరకూ మా యింటికి వచ్చినా సరే, లేకపోయినా సరే!”
ఆ రాత్రికి శ్రీనివాసరావు వచ్చాడు. శ్రీనివాసరావు జగన్నాథరావు. శ్యామలరావు ఉత్తమ స్నేహానందంలో తరంగాలులా పైకుబికారు. సుబ్రహ్మణ్యానికి మాట యివ్వలేదని వారందరితో చెప్పాడు శ్రీనివాసరావు. ఈ ఆనందంలో నీరసంమాట మరచిపోయి శ్యామలరావు కూర్చునే మాట్లాడుతూన్నాడు. స్వర్ణ దివ్యదేవతలా పడుకోమంటూ శ్యామలుని కేకలువేస్తూ అతని ఫాలంపై హస్తతలంవేస్తూ తన నర్సుపని బాగా చేస్తూన్నది.
మర్నాడు ఉదయం శ్యామలరావు గదిలోనికి నవ్వుతూ అతని నర్సు కాఫీ మందూ పట్టుకు వచ్చింది.
"శ్యామ్! మందు పుచ్చుకొని, కాఫీ పుచ్చుకో.”
“నువ్వు రావటమే మందు.”
"పొద్దున్నే అన్నయ్య నువ్వు వేసినతోట చూసి వచ్చాడు. నాకోసమే ఆ తోట వేశావు! నీ ప్రేమంతా ఆ తోటలోనే అన్నయ్యకు కన్పడిందట. నీ ప్రేమకు నేను పాత్రురాల నౌతానా శ్యామ్!”
"ఇలారా సొన్నసానీ! నా గుండెలు ఎలాంటి రాగాలు పాడుతున్నాయో విందుగానీ. స్టెథస్కోపుతోకాదు! నీ చెవితోనే విను.” ప్రపుల్లమైన కన్నులతో, మోముతో ఆమె అతని కౌగిలిలో చేరింది.
“మనం ఇద్దరం కాశీ వెళ్ళాలి, నేను. మొక్కుకున్నా”
“అత్మేశ్వరీ! సొన్నసానీ! నా సొన్నసానీ! కాశీకేకాదు సర్వ దివ్యక్షేత్రాలకు నీతో యాత్రలు సలుపుతాను. ఇది కలే అనుకుంటున్నాను.
"కలా, కళా?”
“సోన్! నిన్ను వదలి ఎలా ఉండగలుగుతున్నానో!”
“మనం బెజవాడలో లలిత కళాశాల ఎప్పుడు ప్రారంభించడం?”
"వ్యవసాయంలోని అందం రంగరిస్తూ త్వరలోనే”
శ్యామసుందరుడు ఆమె చెంపలుపట్టి కళ్ళల్లోకి చూసి ఆమె ఫాలం ముద్దు పెట్టుకున్నాడు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse