Jump to content

అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల

వికీసోర్స్ నుండి
​
​

శైలబాల

శిథిలమై ఒరిగిపోయిన మండపాలు; ముక్కలై భూపతనమైన అంతఃపురాలు; కూలి వ్రీలిపోయిన గోపురాలు; పొడవడగి ప్రోగులుపడ్డ దేవాలయాలు; తలక్రిందులైన శిఖరాలు; రాలిన విగ్రహాలు; ఒకనా డాంధ్ర ప్రపంచానికి శిరోమణియైన శత్రురాజ్యాలకు నిర్భేద్యమైన సమస్త దక్షిణా పథాన్ని ఏకఛత్రంగా ఏలిన విద్యానగర మహాపురము నేడు నామమాత్రమై పెద్ద వస్తుప్రదర్శనశాలయై యాత్రికులను నిశ్చేష్టులను చేసి, కళ్ళనీరు నింపుతున్నది.

తన ఆనందాన్ని చీకుసల్పుతూన్న ఆ శిధిలత్వంలో ఏదారిని నడుస్తున్నాడో తెలియక, తిరిగిన దారినే తిరుగుతూ, ఏది చూస్తున్నాడో తెలియక చూచినదాన్నే చూస్తూ, కళ్ళ కాంతులు శిలాత్వము పొందగా తుంగభద్రానదీ తీరాన, పెద్ద ముళ్ళపొద ప్రక్కనే నాగచంద్రుడు చదికిలపడ్డాడు.

నాగచంద్రుడు చిత్రకారుడు. రసానంద తన్మయుడు. మహా శిల్పగానంలో ఆ భయంకరాపశ్రుతి అతని జీవితాశయాలను భగ్నం చేసింది.

ఇంతలో వెనుక ఎవరో అతన్ని తీవ్రదృష్టులతో పరికిస్తున్నట్లుంది. చైతన్యరహితుడై ఉన్న నాగచంద్రునికి ఆచూపుల తీవ్రత చురుక్కుమని తగిలి మత్తు విరిగే మందిచ్చినట్లయింది. అతడు లేచాడు. వెనక్కి పరికించి చూచాడు. పెద్దపొద; మరేమిన్నీ కనబడలేదు. ఆ అదృశ్యవ్యక్తి చూపులు చల్లనై తోచినవి. నాగచంద్రుడు ఇదేమని పొదచుట్టూ చూచి యేదిన్నీ కానక, పొగమంచు కమ్మిఉన్న హృదయపథం మరిన్నీ చీకట్లు అలుముకోగా, వెఱ్ఱివాని విస్మయం పొందుతూ మళ్ళీ నది ఒడ్డున కూర్చున్నాడు. ఈసారి అతనికి నిట్టూర్పు వినబడింది. నాగచంద్రుడు లేచి, సగము నిద్ర మత్తు తెలుస్తున్నవానిలా తూలుతూ, పొదదగ్గిరే నిల్చుని, పొదలోనికి పార చూచినాడు, అస్పష్టంగా మెడలోహారాల చప్పుడు. నాగచంద్రుడు తూలి ముళ్ళడొంకలో పడబోయినాడు. స్పష్టంగా మళ్ళీ నిట్టూర్పు, అది ఘంటారావమై అతని మెదడులో మోగింది. నాగచంద్రునికి పూర్తిగా మెళకువ వచ్చింది. పక్కనేఉన్న సంచిలోనుంచి చేతిగొడ్డలితీసి పొద నరకడం ప్రారంభించాడు.

బర్రెంక, రక్కెస, నాభిలత, అడవిమల్లె, పురుగుడు, పాలకర్ర, చిట్టిరేగూ విసవిసా వీరభద్రుడై నాగచంద్రుడు అరజాములో నరికిపారవేసినాడు. సగము నరికిన ఆ పొదమధ్య నృత్యము చేయబోయే శిలాబాలిక! పరువము పండించుకొన్న కోటి కోటి సంవత్సరాల యీడు కలిగిన దక్కను పీఠభూమి నల్లరాయిలో, స్నిగ్ధతిస్నిగ్ధమైన చెక్కడం. స్త్రీ ప్రపంచాన అందం ఏరితెచ్చి, చేర్చి ముద్దపోసి ఆ బాలికామూర్తిని శిల్పించినారు. కోలమోము, ​లోతెరుగని నాసికామూలము సమప్రవాహపతనమైనరేఖ. రేక మందార మొగ్గవంపులో తిరిగి ఓష్ఠాంచలముపైన సుడితిరిగిపోయింది. చిరునగవున వికసించబోయే ఆమె పెదవులు కొద్దిగా విడివడి స్విన్నాలై, ఈవలావల కాశీరత్న పూవుల చెక్కిలి గుంటలను అలంకరించుకొన్నవి. అధరముదిగువ నిమ్నమై, చిరురసాల ఫలమైన ఆమెచిబుక మాధుర్యముగ్రీవ శంఖాన ధారై చేరుకొన్నది.

ఆమె చతుర్భంగాభిరామ. ఆమె పరమవశనర్తకి. సన్నని బంగారు దుకూలమో ఏమో కటి ప్రదేశాన వ్రేలాడే మొలనూలు మెలపులలో కలిసి పోయి విద్యున్మాల అయినది. మంజీరములున్నూ, చిరుగంటలున్నూ అలంకరించిన ఆమెపాదము తరులతై భూమిమీద వాలబోతున్నట్లున్నది. ఆమె ఎడమపాదపు వేళ్ళపైన ఎగరబొయ్యే పక్షిలా నృత్యగతిలో ఆకాశ పథభంగిమతో ఉన్నది. ఆటాడే తాచుబాము దక్షిణహస్తము, అర్ధచంద్రికాముద్ర: సవ్యహస్తము లోలముహంసముద్రిక; కంకణాలతో, గాజులతో, భుజభూషణాలతో, చెదిరిపోయే వేణీబంధముతో, పొంకాలయి ప్రేమ వాహినీమూలాలై, కదంబపుష్పాలై కలలవిధులైన వక్షాలపైన ఉబికె అనేక హారాలతో నృత్యావేళ దివ్యసుందరియైన కాలాన ఒకక్షణికంలో శిల్పి ఒకడు శాంబరీవిద్యచేత శిలగా మార్చినట్లు ఆమె ప్రత్యక్షమైంది.

2

నాగచంద్రుడు అలాగే నిలుచుండిపోయినాడు! అతని ఊహాపథాలు దాటిపోయిన శిల్పసౌందర్యం తొందర తొందరగా ఆవిగ్రహంచుట్టూ ఉన్న డొంకలు నరికిపారవేసి, ఆ ప్రదేశం అంతా శుభ్రంచేసి, తంగభద్రలో నుంచి తన సంచిలో కలశంతో నీళ్ళు తెచ్చి ఒత్తుగా చల్లినాడు. వివిధ పుష్పాలు సేకరించి, దండలు గుచ్చి ఆమె మెడలోను వేణీభరంపైన అలంకరించాడు. పూవులతో ఆమె పాదాలు పూజచేసినాడు. తనివితీర చూపులతో ఆమెనుచూస్తూ మోకరిల్లాడు. అప్రయత్నంగా అతనిఫాలం చివురు జొంపాలలాలిత్యం చూపిస్తూ కఠినమైఉన్న ఆమెపాదంపైని చేరింది. లోతెరుగని ఉత్కంఠ నాగచంద్రుని వణికించింది.

ఏమిది? అతని శిరస్సుపైన నాతిదూరాన ఉన్న ఆమె కుడిపాదము నెమ్మదిగా దిగుతూ అతనిమూర్ధానికి కొంచెం తగిలింది. నాగచంద్రుడు ఉలిక్కిపడిలేచి ఆమె మోముపైన తీక్షణదృష్టులు పరిపినాడు. అతని కుడిచేయి ఆమె ఎడమమీగాలిపైన నఖంపచస్పర్శ నందింది. ఇంతలో ఆ బాలిక చిరుపులుగు ఎలుగుల నవ్వి ఒడలు కొంచెం కదలించింది. బిగిసిపోయే హృదయంతో నాగచంద్రుడు లేచి నిలుచున్నాడు.

చైతన్యోదయ మవుతూఉన్న అస్నిగ్ధ నీలోపల శరీరాన నులివెచ్చ రక్తము జలజల పోటెత్తి సమవిషమతలాల క్రొమ్మెరుగులు పులకించి సమస్త నాడుల స్పందించి మెత్తనిదారులై, కొంజివురై నవనీతమై పోయింది. చూస్తూ ఉండగానే ఆ శరీరము ఉదయ సంధ్యాకాశములో క్షణక్షణం వన్నెలు మారుస్తూ, కపిశమై, పిశంగమై, శ్వేతమయి, పాటలమయి, పీతమయి పుటములో బంగారమయిపోయినది. కర్కశమయిన ఆమె కబరీభరమునల్లపట్టుకుచ్చుల వేణీభరమయినది. నగలు బంగారులై తళుకులాడినవి.

“తణికిటతోం” అని ఆ బాలిక నాట్యమాడ ప్రారంభించింది. కాళ్ళ చిరుగంటలు చతురస్రగతి త్రిపుటతాళము వేసినవి. రానురాను స్ఫుటమయిన కంఠంతో ​


లలిత లవఙ్గలతా పరిశీలన కోమల, మలయసమీరే
మధుకరనికర కరచ్యుత కోకిల కూజిత కుంజకుటీరే
విహరతి హరిరిహ సరసవసంతే
నృత్యతి యువతిజనేన సమంసఖి!


అని పాడుతూ ఆ బాలిక అభినయిస్తున్నది. నాగచంద్రుని ముఖము విరిసిపోయిన దిరిసెనచెట్టులా ప్రఫుల్ల మయింది. పొంకాలయి పొలుపు మీరిన ఆమె హస్తాల విన్యాసవేగము అడవి నిమ్మపూవుల పరిమళమయింది. చిరుచెమ్మటలు నఖాగ్రాలతో తుడుచుకుంటూ నాట్యమాడి, మధురమయిన ఊర్పులు విడుస్తూ ఆ బాలిక వచ్చి, నాగచంద్రుని భుజాల పైన చేతులు ఉంచింది. అతని దేహాన గగుర్పాటులు మలయసమీరము రివ్వున ప్రవహించినప్పటి చెరువులో నీటికెరటాలలా పరువులిడినవి. విడివడి ఆమె పెదవులు పరిమళములో అతని కపోలాలపైన అలమిపోయినవి. దివ్య యౌవనం విరిసిపోతూ పరమసౌందర్యం విరజల్లుతూ ఆ బాలిక చటుక్కున తనను ఆవరించినప్పుడు నాగచంద్రుని చేతులు అప్రయత్నంగా ఆమెను కౌగలించుకోబోయి మరల వాలినవి.


"ఏమయ్యా! తుంగభద్రాతీరాన కూర్చుందాము రా” అని ఆమె అతని కుడిచేయి పట్టుకొని నదిగట్టుదగ్గిరికి అతనికి దారిచూపుతూ అక్కడే ఉన్న ఓ నల్లరాళ్ళ గుట్టమీద అధివసింపజేసింది. అతని పక్కనే ఆమె ఆసీనమయింది.


"నీ హృదయంలో నే నెవరా? అన్న ప్రశ్న మొలకెత్తింది! ఈ రాళ్ళన్నీ ఒకరకం చుట్టాలు నాకు. ఈ సంధ్యాశబల రాగంలో అవ్యక్తంగా కనబడే అమాతంగగిరి ఒక్క చిన్నశిల నా పూర్వరూపం. ఈ కథ విను!


“ఆనాడు ఎందుకో సార్వభౌముడు విచారమేఘంతో పొదువబడ్డ మలయగిరిశృంగం అయ్యాడు. అప్పాజీ పలుకులు ఆ ధీరుని హృదయానికి ఉపశమనం కూర్చలేదు. పెద్దన్నగారి పద్యాలు మేఘంలో ఉరుములయ్యాయి. పేరుపొందిన అందకత్తెల్ని వెలవెల పోవచేసే మావాళ్ళు భరతపయోరాశి మథించగా పుట్టిన అప్సరసలు, రాజులో రసజ్ఞతా చంద్రికలను వుదయింప చెయ్యలేక పోయినారు.


“ఒక నృత్యాంగన చెంగల్వరాయ సేనానాయకుల వలపుకత్తె. శ్రీకృష్ణరాయసార్వభౌములవారి ఆదరణ పొంది శ్రీవారి ఆగ్రహానికి గురియైన తన స్వామికి ఉపకారం చేయ చూస్తూ ఉన్నది. ఆమె తన కుమార్తెను పిలిపించి గజ్జెకట్టించింది. ఆ బాలిక తిలోత్తమకు అందం వంకలు దిద్దగలదు. ఆటలో ఊర్వసికి అపరావతారం, అంతవరకూ, ఆమె కన్నె చెర వీడలేదు. ఆ బాలికను సార్వభౌమునికి సమర్పింపడానికి తల్లి చెంగల్వరాయనితో మంతనం సలిపి అదను చూస్తున్నది. ఇంతకన్న వేరేసమయంరాదని ఊహించి ఆ నట్టువరాలు తనకుమార్తెను సభలోకి ఉత్సవములతో కొనివచ్చింది.


ఆ మేళానికి గురువు అమ్మనాచార్యులవారు. చక్రవర్తికి జోహార్లు చేసి, మహాప్రభూ! దివ్యనృత్యేశ్వరు పాదాలకడ పూజచేస్తూ విద్యనభ్యసించిన ఓ అప్సరాంగన దేవరరాజ్యంలో ఉద్భవించింది. ఆ బాలిక భరతంలో పదహారు సంప్రదాయాలూ నేర్చుకొన్నది ఆమె ​విద్య అపర దేవేంద్రులైన సార్వభౌములు దివ్యచిత్తాన అవధరింతురుగాక! రాజరాజేశ్వరుల హాసాంచనుషను లా కన్నెపైన ప్రసరించి ఆమెను పవిత్రను చేయుగాక!” అని నివేదించుకొన్నాడు. మహారాజులుంగారు అంగీకార సూచకంగా తల పంకించారు.

“అర్ధచిటికలో క్రొక్కారు మెరుగుతీగలా ఆ బాలిక చక్రవర్తి ఎదుట నాట్యాన సాగిలపడి. ప్రభువు “లే” అనేవరకూ భూమిపైన వ్రాలిన చంద్రకళలా, పచ్చికలో ప్రసరించే కేతకి పన్నగిలా ఆ సభాచంద్రశిలాతలము పైన అట్లే పడి ఉన్నది. మహారాజు కనుసన్న అయినది. ఒక్కుమ్మడిగా తోలుతిత్తిశ్రుతులతో ఒక విపంచి, ఒక కిన్నెర, ఒక సైరంధ్రి పక్క వాద్యాలయినవి. దశావతార కథనము ఎత్తుకొని హంగుచేసే గణికలు తాళాలు వాయిస్తున్నారు. మృదంగం పూర్ణలయావతారమైనది రసము తొలుకాడే ఒక్క విహంగవృత్తగతిలో ఆ బాలిక సుడిగాలిలా లేచి :


“ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం
విహిత వహిత్ర చరిత్ర మభేదం ధృతవానసి వేదం.
కేశవ, ధృతమీనశరీర, జయ జగదీశ హరే!
క్షితి రతి విపులతలే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణి ధరణి కిణ చక్రగరిషే తవ తిష్టతి పృష్టే
కేశవ, ధృత కచ్ఛపరూప, జయజగదీశ, హరే!...


అని పాడుతూ అభినయించి సభను సమ్మోహనం చేసింది.”

3

నాగచంద్రు డా బాలిక మాటలు వింటూ, సంభ్రమాశ్చర్యాలకు లోనౌతూ, తుంగభద్రనీళ్ళు చీకట్లు తాలుస్తూ ఉండడం కనుగొంటూ, ప్రణయ పూజాసేవకుడౌతూ, ఆ బాలిక అందాల మోము పరికించి చూస్తూ, దగ్గిరగా అధివసించిన ఆమె యౌవనానందానికే సమ్మోహితుడౌతూ, నిలువునా పులకిస్తున్నాడు.

"ఈ ప్రదేశం నన్ను దివ్యానందంలో పరవశుణ్ణి చేస్తున్నది!”

“సార్వభౌముల కాలంలో ఇక్కడే ఒక్క శిల్ప మందిరం ఉండేది.”

నాగచంద్రు డామెవంక చకితుడై చూస్తూ “ఈ తుంగభద్రా నదీ సౌందర్యము ఏలాంటి దివ్య స్మృతులు మొలకలెత్తిస్తున్నది!” అన్నాడు.

"నీ హృదయ సౌందర్యమున్ను అలాంటిదే.”

“సుందరతరమైన నీరూపజ్యోతి నన్ను పాదాక్రాంతుణ్ణి చేసుకుంటూంది!”

"అయితే నాకు హృదయం లేదంటావా, ప్రభూ?”

“ప్రభూ! ప్రభూ!” అనుకుంటూ నాగచంద్రుడు విస్మయం పడ్డాడు.

"నీ హృదయం నా ఊహ కందరానిది.”

"పణ్యస్త్రీకి హృదయం ఉంటుందా స్వామీ?”

“సర్వ ప్రపంచానికి సౌరభాలు చూరలిచ్చిన పణ్య స్త్రీల హృదయాలు వందనీయాలు.” ​“హేళనా ప్రభూ?”

"హేళనా? నీ ఆవిర్భావం ఇంతవరకు నన్ను అచేతనుణ్ణి చేసింది. ఏ అందాన్ని నేను ఊహచేసుకోలేకుండా ఉన్నానో. ఏ అందం నాకు ఇంత వరకూ ప్రత్యక్షంకాలేదో, ఏ అందం ఉంటుందని భావించి భావించి, దేహం పరవశంకాగా, హృదయం ద్రవించి పోగా, నా ఆత్మ స్వార్పణకోసం ఎదురుచూస్తున్నదో, ఆ అందం ఈనాటికి నీలో చూపిన నాకు హేళనా ప్రణయ దేవీ?”

ఆ బాలిక అతని ఒడిలోకి వాలిపోయింది.

నాగచంద్రుడు ఆవేశంతో, పూజ్యభావంతో ఆమెను బిగియార కౌగలించుకొన్నాడు. ఆ ముహూర్తము అతి పవిత్రమైనది. ఆ సంశ్లేషములో వారిప్రేమ మరీ గాఢమై మధురాతి మధురమైనది.

“దేవీ! దేవీ!” - గద్గదమైన అతని గొంతుక అతిప్రేమ పూర్ణమైనది. ఆమె కంఠంనుంచి అదృష్టమైన విచారస్వనము వినిపించి అతని శ్రవణాలకు భూకంప నిస్వనమైంది!

"ఏమీ! ఏమిటిది! కళ్ళనీళ్ళు నింపుతున్నావే? నీబంగారు దేహలత వణుకుతూ ఉన్నదేమిటి? ఈ విచారమెందుకు పవిత్రమూర్తీ!”

“నీ పూజ నన్ను మూలానికి కదులుస్తున్నది. రూపం అమ్ముకొని బ్రతికే మేము ప్రేమమాధుర్యము రుచియైనా ఎరగం. నన్ను పూజాపీఠ మెక్కించి పరవశురాల్ని చేస్తున్నావు!”

"విద్య నాలో వ్యక్తమౌతూవున్న ఇంతనాటినుంచీ ఒక అద్భుత మూర్తినీ, ఆ మూర్తిని ఆవరించి ఉండే ఓ విచిత్ర హృదయాన్నీ, ఆ సర్వాన్ని ఆవరించి పూర్ణించుకొని ఉన్న పవిత్రాత్మను ఉత్కృ ష్ణాశయం చేసుకొని నేను ఆ దేవికోసం లోకాలు గాలిస్తూ, నా హృదయం దేవాలయం చేసుకొని పూజాద్రవ్యాలతో అంతులేని యాత్ర చేస్తున్నాను.”

"ఆ ఆశయం మృగతృష్ణ మాత్రమేకదా ప్రభూ!”

“నిజమనుకొనే ఈ ప్రపంచానికన్న మృగతృష్ణ ఎక్కువ నిజంకాదా దేవీ!” అంటూ నాగచంద్రు డా విచిత్ర బాలికను మరీగాఢంగా కౌగలించుకొన్నాడు. ఆ అమృతమూర్తిని అలముకొన్న పరీమళాలతో వివశుడయ్యాడు.

చక్రవర్తి పరమేశ్వరపదజనితమైనట్టిన్నీ, నందికేశ్వర సముపదిష్టమైనట్టిన్నీ, భరతమహర్షి ప్రచారితమైనట్టిన్నీ ఏ విద్య ఉన్నదో, ఆ మహాకళ నాడు ఆ బాలికలో మూర్తీభవించి, వికసించడం కనుగొన్నాడు.

నాగచంద్రుడు విప్పారిన నయనాలతో ఆమెను తిలకిస్తూ, “దేవీ! ఆ బాలికవు నువ్వుకావుగదా” అని అడిగినాడు.

"ప్రభూ! నేను కానని చెప్పనా, అవుదునని చెప్పనా?”

ఈషవదనమైన ఆమె మోమును నాగచంద్రుడు చుబుకముపట్టి లేవనెత్తుచు దేవీ! నీ పెదవుల్లో మందహాస లేశమన్నా నర్తింపకుండా నన్నీ విచిత్రస్వప్నంలో తేలుస్తున్నావా?” అన్నాడు. ​ప్రభూ! నా సర్వస్వము నీకుపూర్ణార్పణం చేస్తున్నా. ఆదివ్య క్షణాలు స్వప్నమో నిజమో నాకే తెలియకుండా ఉన్నవి.”

“ఆ దివ్యస్వప్నమే ఎప్పుడూ నిలిచిఉండరాదా!”

“అవును ప్రభూ!”

అని విశ్వసిస్తూ ఆ బాలిక "ఆ నృత్యము సార్వభౌమునికి ఆనందం నివేద నిచ్చింది. ఆ రాత్రి -” అన్నది.

"ఆ రాత్రి?"

“సార్వభౌముని అంతఃపురానికి ఆ బాలికను పంపడమయింది” నాగ చంద్రుడు కూలిపోయినాడు. అతని చేతులు వాడిపోయిన తామరతూళ్ళయి వాలిపోయినవి. అతడు నిట్టూర్పు విడుస్తూ ఆ నల్లరాతిమీద తల వాల్చాడు. “ఇక వినలేను దేవీ!”

“ప్రభూ, నేను పణ్యస్త్రీని.”

"నిన్నారాత్రి పంపిన పాతకులు భ్రష్టులు, పిశాచాలు!”

“ప్రభూ! అతి హీనకులంలో జన్మించిన మా పాప హృదయాలు పవిత్రం కాగలవా? సార్వభౌముని క్రీగంటిచూపు మమ్మల్ని అప్సరసల్ని చేయదా!”

"మీవి దివ్యజన్మలే దేవీ! మిమ్మల్ని అనుభవించే ఆ నీచాతి నీచులు- ”

"ప్రభూ, విను- సర్వాలంకారాలతో వాసకనజ్జికనై, మహారాణినైనట్లు ఉప్పొంగిపోతూ, చక్రవర్తి రాకకై ఎదురు చూస్తుంటిని. ముహూర్తాలూ గడచినవి. కోటలో ఘంటారావాలు మోగుతున్నవి. అర్ధరాత్ర తూర్యారావాలు తృతీయ యామపు ఢంకా నినాదాలూ వినబడుతూనే ఉన్నవి. అంతఃపురాలన్నీ నిశ్శబ్దంలో జోగిఉన్నవి. ఆ చిన్నమాంబారసికుడు రాలేదు. నా హృదయంలో దావానలం చిగురించింది. లజ్జతో కుంగి పోయాను. ఆ మహాపరాభవంలో వైతాళికుల హెచ్చరికలు, వందిమాగధుల పాటలు నా హృదయకుహరంలో బ్రహ్మాండము పగిలినట్లు ప్రతిధ్వనించి, ఒళ్ళు తెలియని మూర్ఛలో మునిగిపోయినాను.

నాగచంద్రుడు చివుక్కునలేచి కూర్చున్నాడు.

"సార్వభౌముని సౌజన్యము నే నొక్క క్షణమాత్రం సందేహించాను. నువ్వంతఃపురంలోకి వెళ్ళిన సంగతి మహారాజుకు తెలుసునా?”

“ఈ పణ్యస్త్రీకి అంత విచారణచేసే యోగ్యత కలదా ప్రభూ! చిన్నమాంబాదేవి సరసల్లాపానందుడైన చక్రవర్తికి ఆ దేవిపైన యేదో కారణంచేత కొంచెం కోపం వచ్చిందనీ, ఆనాటి నా నాట్యం ఆయన హృదయంలో సందేహాన్ని వెన్నెలై చీకట్లు పారదోలిందనీ, సభనుంచే, ఆ పట్టునే మహాప్రభువు చిన్నమాంబాదేవి అంతఃపురానికి పోయి క్షమాపణ వేడి ఆమెను అనునయించినాడనీ తరువాత నేను విన్నాను.”

“చెంగల్వరాయని దుశ్చేష్టితంసుమా దేవీ ఇది!”

“అయిదురోజుల వెనుక, తీవ్రజ్వరంలో ఉన్న నాకు స్ఫుటాస్ఫుటంగా మెలకువ వచ్చింది. నృత్యంనాటి ఆ సభలో రాజశిల్పి శిష్యులతో వచ్చి ఉన్నాడట. ఒక శిష్యుడు - ఆనందరసైక జీవి, దివ్య సౌందర్యానందుడు - ఈ పాపినీ ఈమె నాట్యాన్నీ చూచి వెర్రి ప్రేమలో మునిగిపోయినాడట -” ​“మునిగిపోవటం అబ్బురమా దేవీ?”

“ఆ బాలిక ఆ జ్వరంతో కృశించి కృశించి అసువులను నాలో కలయించు" ఆ మాట ముగించకుండానే నాగచంద్రుడు ఆ శిలాబాలను, చెమర్చే కన్నులతో దరికి చేరదీసుకొని ఆ మోము తన హృదయాని కద్దుకొని, ఆమె తల కన్నీటితో తడిపినాడు.

తూర్పున కొండలపై ప్రక్కనే ఎర్రనై నాగచంద్రుని సంతోష రాగములా చంద్రబింబము ఉదయించింది. తుంగభద్ర నీళ్ళు శిలాబాల హృదయములా కెంపుజీరలు సాగినవి. సర్వప్రపంచము జోత్స్నానందంలో వివశత్వమొందింది.

ఆ శిలావేదికపైన నాగచంద్రుడు మెత్తని తల్పము అమరించి ఆ బాలికను అధివసింపచేసినాడు. ఆమె మోమును తనివితీరగా పారకిస్తాడు. ఆమె సౌందర్యరేఖల చేతులు హృదయాని కద్దుకొని దూరాన్నుండి దగ్గర నుండి గమనిస్తాడు. ఆమె లావణ్యము పుడిసిళ్ళ కన్నుల కద్దుకుంటాడు. ఆమె ఇంకనూ శిలాబాల కాదుకదా అన్న అనుమానము వీడనిచూపులతో, స్పర్శతో కదుష్ణతను, కాంతులను పరిశీలిస్తాడు.

ఆమె చిరునవ్వుతో, సిగ్గుతో కొంచెం వంచిన మోముతో నీలాలజాలరులైన కనురెప్పలచాటున నుండిన అతని ఆనందము తనహృదయాన్ని నింపుకుంటూన్నది.

నాగచంద్రుడు ఆమెయెదుట మోకరించి “నువ్వు నా స్వప్నబాలవు. నా జీవితాధిష్ఠాన దేవతవు. నేను తుంగభద్రను, నీవు కృష్ణవు" అని ఆమె ఒడిలో వాలినాడు.

4

అతడా ఆనంద తన్మయత్వంలో, తమి నిండిన హృదయముతో, అరుణావిర్భావమును గుర్తింపలేదు. మాల్యవత్పర్వత సానువులపైన ఒక రెప్పపాటు తన రథము ఆపి కర్మసాక్షియైన సూర్యభగవానుడు ఆ నూత్న దంపతులపైన తన అరుణకిరణ కుంకుమాక్షంతలు చల్లినాడు. సుఖపారవశ్యముద్రితాలయిన కనుదమ్ములతో, చెదరిన ముంగురులతో సడలిన వేణీ భరంతో, తన హృదయతలముపైన కలువపూదండలా వాలి ఉన్న శైలబాలలోని తీయని వన్నెను నాగచంద్రుడు అరమోడ్పు కనులతో ఆస్వాదిస్తున్నాడు. ఆలసాలసాలయిన వేబోక తెమ్మెరలు తుంగభద్రాతరంగ శీకర శైత్యాలలో ఆయితమైవచ్చి శైలబాల ముంగురులను పాపటకు చక్కనొత్తుతూ కనుదమ్మిరేకులను ఇంచుమించు విప్పసాగినవి. నాగచంద్రుని కంఠాన పెనవేసికొన్న బాహులత ఇంచుక సడలించి చటుక్కున కళ్లు తెరచి తల ఇంచుక ఎత్తి ఆమె అతని మోము తిలకించినది. ఆమెచూపులలో నునుసిగ్గులు చిరుకెరటాలై ఆనందకాంతుల మిలమిలలాడి, అంతలో ఆమె రెప్పలమాటున అదృశ్యములైనవి. అర్ధపూరితాలైన చిరునవ్వులు ప్రసరిస్తూ అతడామెను గట్టిగా హృదయాని కదుముకున్నాడు.

రూపవిలాస ముగ్ధలైన శిల్పుల ఆనందము రూపలయాన్ని కోరుతుందా? ఉత్కృష్ట రూపాన్ని సృష్టించే ఆశయం మాత్రం శిల్పుల తపస్సు కాదా? అల్పదోషమైనా ఎరుగని రూపౌత్కృష్టాన్వేషణకు ఫలము ప్రాకృత జనులు కోరే దేహానందము మాత్రమేనా? రూపురేఖలు పొదిగించుకొనే వికాసము నులివెచ్చని దేహంచే బంధితమైనదా! ఏమిటీ విచిత్ర సంఘటనం! ​"ప్రభూ! మీ శంకిత హృదయాన్ని ఆవరించిన తెరను తీయలేను. కాని, సంశయా లెరుగని ఆ తరుణశిల్పి సభలో నన్ను చూచిన మరుక్షణాన్నుండి ఉన్మత్తుడై పోయినాడట!”

“నువ్వు మూర్తీభవించిన సౌందర్య సర్వస్వానివి!”

"అపశ్రుతిలేని దివ్య సౌందర్యము స్వప్న మాత్రము ప్రభూ!”

“మనోరథప్రాయమైన రూపానికి రేఖలులేవు. మూర్తిలేదు. మూర్తించుకోగలిగిన ఉత్కృష్ట రూపమే శిల్పికి ఆశయం. తీర్థాలు తిరిగిన ఈనాకు ఈనాడు ప్రత్యక్షమైనావు.”

“ఆనాడు కాదా ప్రభూ!” అంటూ కంఠాన భుజలతలు పెనవేసి కన్నులలోకి చూపులు చొనిపి హృదయాన్ని మేలుకొలుపుతున్న శైలబాలను కంపించిపోతున్న కరములతో ఎడంగా చాచిపట్టి దేహమనః ప్రాణాల్ని చూపులలోకి తెచ్చుకొని, ఒక్క నిమేషం ఒరసిచూస్తూ, సుఖ స్వప్నంనుంచి లేవలేక నిద్రలేస్తున్నవానిలా "దేవీ! ఎన్నాళ్ళకు! ఎన్నాళ్ళకు!" అంటూ ఆనందమూర్ఛితుడైనాడు నాగచంద్రుడు.

తుంగభద్రా తరంగాలవంటి కరతలాలతో ప్రియుడి మేను నిమురుతూన్న శైలబాలను - ఒక్క నిట్టూర్పుపుచ్చి, “దేవీ, స్వప్నం కాదుకదా?" అంటూ హృదయానికి అదుముకుని "దేవీ! మధురతరమైన మన కథనము నన్నింక చెప్పనీ” అని నాగచంద్రుడన్నాడు -

"నిన్ను చూచిన నాటినుంచీ నీ స్వరూపాన్ని పరువాలు నింపుకొన్న నీలగ్రామంలో మూర్తింప నారంభించాను.

"ధన్యను!”

"నీ జబ్బులో ఎప్పుడున్నూ, మీ యింటికి వచ్చేవాడను. జీవవర్ణాలు వెలిగే వివిధ పుష్పాలు సేకరించి, రసహృదయాలయిన ఫలముల కాన్కలతో దినదినమూ మీ మేడకు వస్తూ, నీ కవి అర్పించుకొన్నాను.”

"ఫలములే కాదు, నీ ప్రణయమే ఔషధానికి అనుపానం చేశావు.”

"దేవీ, నేను సంకల్పించిన శిల్పమూర్తికి నా ప్రేమరసంతో మెరుగులు దిద్దుకొన్నాను. ఎంత రసభావన ధారపోసినా, మూలానికి నా నిర్మించిన ప్రతిమబింబ మాత్రమే అయిపోయిందని సిగ్గుపడ్డాను. నీ నయనాంచలాల మెరుపులూ, నీ మందహాసాల శీతద్యుతులూ, ఆనాటి నీనాట్య భంగిమలో సౌకుమార్యమూ, హృదయానపదిలించుకొని తెచ్చి నాటకంపు మొనతోముంచి, నా శిలాబాలకు అందిచ్చుకున్నాను. నా పూజా కల్పనం నీ యెదుట నిలపడానికి నాకు ధైర్యం చాలింది కాదు.”

"శిల్పి శేఖరా! నీ పత్ని యేది? అని నేను దినదినం ప్రశ్నించేదాన్ని ప్రభూ!”

"తేరుకొంటున్న నీ ఆరోగ్యానికి భంగం కలిగించలేక”

“దినములు గడుపుతూండే నేనొకనాడు పట్టుపట్టినాను చూస్తానని కదా ప్రియా?”

"దేవీ! ఆ దారుణ కథ మళ్ళా ఎందుకు స్మరిస్తావు?”

"ప్రభూ! ఉండు. నేను ఎవరు వాదించినా వినక, ఒకనాడు పల్లకీలో బయలుదేరాను. నువ్వు నరికివేసిన పెద్దపొదే నీ శిల్పమందిరం కూలగా బయలు దేరినది. ఆ శిల్పమందిరానికి ఆపరాని ఉద్వేగంతో, నిలుపలేని ఉత్కంఠంతో పల్లకీ దిగివచ్చి నా ప్రతిబింబాన్ని చూచాను. నా రూపంలో నాలో ఉండే లోపాన్ని సవరించుకొని దివ్యత్వం దాల్చిన సౌందర్యం ముందు లజ్జించి నిశ్చేష్టనై చాపకట్టులా పడిపోయాను.” ​"దేవీ! నా శిల్పబాలకు నేను పోయలేని ప్రాణాన్ని నీ వప్పుడర్పించి నన్ను ధన్యుణ్ణి, అధన్యుణ్ణి కూడా చేశావు.”

"ప్రభూ! ఆ విగ్రహాన్ని చూచి నేను నీప్రేమ గంభీరతనూ విశ్వరూపాన్నీ తెలుసుకొన్నాను. నా తుచ్ఛదేహాన్ని వదిలేసి, నా దివ్యరూపంలో చేరుకొని తరతరాలనుంచీ నీకోసం ఈ మందిర శిథిలాల్లో ఈ నదీతీరాన తపస్సు చేశాను.”

5

పవిత్రాలయిన మూడురాత్రిళ్ళు లిప్తలై జరిగినవి. దీర్ఘాలు అర్ధనిమీలితచకోరాలు, బెళుకులీను కురంగనయనాలైన ఆమె వెడదకన్నులు తనివి తీరని చూపుల పూవులపూజతో తన్ను నింపివేస్తున్నప్పుడు, సరసమై, స్పష్టమై, సున్నితమై, దివ్యరేఖలు కలదై, నులువెచ్చనై, ఉదయారుణ కాంతిలా మెరిసిపోతున్న ఆమె శరీర సౌందర్యము తన్ను సుడిగుండంలా, చంద్రకిరణంలా వికసించిన మల్లికా వనంలో సువాసనలా చుట్టివేస్తున్నప్పుడు, ఆమె తనలో లీనమైపోతున్నప్పుడు, కోటిపాటల కుసుమాలలో మధువుల వాకలు ఆమె పెదవులు తన పెదవుల గాఢమైన తమిలో చుంబించేటప్పుడు నాగచంద్రుని దివ్యానంద తన్మయత్వము. కోటిఉద్యానాల సౌరభాలొక్క బిందువులో సమాహృతాలయినట్లయినది.

అది నాల్గవనాటి రాత్రి - సంపూర్ణ పూర్ణిమాజ్యోత్స్న తుంగభద్రా తోయాలపై పన్నీటిపరిమళాల తుంపురు చల్లుతున్నది.

ఆ ఉత్కృష్ట యువయుగ్మానందంలో లయమై లోకమంతా నిశ్శబ్దమైంది.

వారిరువురూ యుగాలనాడు ఏ మహాతారలలో ఉద్భవించి యాత్ర చేస్తూ భూమి కవతరించిన కిరణద్వయమో!

"ఓ కళాదిష్టానదేవా, సుధాకర సార్వభౌమా! పూర్ణతతో తూగే సౌందర్యబాలకై కల్పాలలో తపస్సు చేసుకొన్నాను. ఆమెను సందర్శించుకున్నాను. పరిపూర్ణతనుచేరే సౌందర్యమూర్తిగా సృష్టించుకొన్నాను. రూపరేఖాకాంతి సౌందర్య సంపూర్ణత్వాన కలిగే అద్భుతానందం ఒక క్షణికము మాత్రము. ఈ సౌందర్యం, ఈ ఆనందం, ఈ దివ్యనిమేషమూ అనంతం చెయ్యివోయి ప్రభూ!” అని మహాయోగవంతమైన అభ్యర్థనము చేశాడు నాగచంద్రుడు!

ఒక చిరుమబ్బు చంద్రబింబాన్ని ఒక లిప్తమాత్రం కప్పినది. ఒక లిప్తమాత్రము గాంఢాంధకారమయినది.

ఇంతలో దిక్కులు స్పష్టాలై మళ్ళీ చంద్రకాంతులతో తళతళ లాడినవి.

శిల్పబాల యధాప్రకారం శిలావిగ్రహమై అనంతనాట్యమొనరిస్తున్నది. నాగచంద్రుడు మోకరించి దివ్యానంద భంగిమలో ప్రణయ శిల్పి స్వరూపాన ఆమె ఎదుట కాలశిలా విగ్రహమూర్తిలో ఘనీభూతుడై నాడు -

తుంగభద్ర ప్రవహిచింది.

తుంగభద్ర ప్రవహించింది.


​

నాగలి

మొదటి భాగము

హృదయంలోని కల్మషాన్ని ఈవలావలికి త్రోసివేసి, దాగిఉన్న సౌందర్యాన్ని బయటపెట్టే మంచి పాటలా నాగలి సాగిపోతూంది. సారింపబడి శ్రుతిస్వరాలు హాయిమంటూ పలుకుతూ ఉన్న వీణతీగెలులా ఆ పొలంలో నాగేటిచాళ్ళు ప్రత్యక్షమవుతూ ఉన్నవి. తెరచాపల్లా, ఆకాశంలో చొచ్చుకుపొయ్యే పక్షి రెక్కల్లా, తెల్లటి ఆ దుక్కి టెద్దులు రెండూ ముందుకు నడుస్తూ ఉన్నవి శిష్యుని మనస్సు వ్యవసాయంచేసే పూజ్యుడైన గురువులా, రైతు నాగలి వెనకాలే కొరడాతో ఎద్దులను అదలిస్తూ తోలుతూ ఉన్నాడు. గట్టు మీద కూర్చొని తనచిత్రలేఖన పుస్తకంలో ఆ పొలం పొలం వెనకాల కొండలు, కొండలపైన మేఘాలు, ఆకాశాన్ని, ఆ మబ్బుల్ని, ఆ కొండల్ని అంచుల్ని ఎరుపురంగులు చిత్రిస్తూన్న అరుణ కిరణాల్ని, చెట్లని పక్షుల్ని శ్యామలరావు కుంచెతో బొమ్మవేస్తున్నాడు. శ్యామలరావు లోగొంతుకలో ఒకపాట పాడుకుంటున్నాడు.


"తల్లి పెదవుల నృత్యదర్శనమయ్యేటి
నవ్వులే తెల్లన్ని పువ్వులే దేవి!
తళతళా కన్నులా మెలయించుకాంతులే
నాగేటిచాలులో నవ్యాంకురముదేవి!"


అలుముకుంటూ ఉన్న చీకట్లో ఎద్దులను విప్పుతూ ఉన్న రైతునుచూసి శ్యామలరావు మళ్ళీ మళ్ళీ ఆ చరణాల్నే పాడుకుంటూ తన రంగులపెట్టె, చిత్రలేఖన పుస్తకమూ సర్దుకొని తన స్నేహితుని యిల్లు చేరుకున్నాడు. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల మనిషి. కొంచెం వంగి గుమ్మందాటి ఆ పర్ణశాలలోని ముందరహాలులోకి అడుగుపెట్టేటప్పటికి “హల్లో శ్యామ్ ! చీకటయ్యేదాకా చిత్రిస్తూ ఉన్నావే!” అంత సౌందర్యవంతమయిన వస్తువు యేంకనపడిందయ్యా!" అంటూ వదులు జడను వేసుకుంటూ ఉన్న స్వర్ణకుమారిదేవి తడిక చాటున ఉన్న గదిలోంచి చక్కా వచ్చింది. శ్యామలరావు స్వర్ణకుమారిని చూసి పెదవుల్ని ప్రసరించే చిరునవ్వు హరికేన్ దీపపు వెలుగులో కలిసిపోతూండగా, ప్రేమకాంతులు కళ్ళల్లో తొణికిస లాడుతూండగా. ​“అనేక వేల సంవత్సరాలనుంచి ఉన్న పురాతన విషయమే చిత్రిస్తూ ఉన్నాను - మీ పొలం దున్నడమే!”

"వ్యవసాయం మనస్సుని పాతేస్తుంది, మెదడును కఱ్ఱ బారుస్తుంది. - అంటావే! వ్యవసాయపు దృశ్యాలు, చిత్రలేఖనపు విషయాలు యెట్లా అవుతాయయ్యా? వ్యవసాయంలో రసస్వరూపం ఉందా మరి?”

“వస్తువులో మొరకుతనం ఉండవచ్చుగాక! వస్తువు తుచ్ఛమైంది కావచ్చుగాక! ఆ వస్తువు కళా వస్తువు కాగూడదనే ధర్మంఎక్కడ?”

“సుభావ ప్రసన్నమైన వస్తువే కళావస్తువు అవుతుందని వాదిస్తావుగా!”

“ఒక నీచవస్తువు ప్రత్యేకార్థమును ఉత్తమమైన భావంలో ఈయలేక పోవచ్చునుగాని, ఆ వస్తువు ఇతర విషయముల సంబంధంచేత ఉత్తమ భావపూరితము కావచ్చుకాదా సొన్నసానీ!”

“నన్ను సొన్నసానీ గిన్నసానీ అని పిలవకు! నాకు ఒళ్ళుమండిపోయే కోపం వస్తుంది. పూర్ణమైన పేరుపెట్టి పిలవరాదూ?”

ఏదో కోపం మనస్సులో ఉంచుకొని, గాన మాధుర్యమైన పేరుతో పిలిస్తే కోపం ఎందుకు స్వర్ణసానీ!”

"ఛీ! నీతో మాట్లాడడం బుద్ధితక్కువ. నీకు మా వ్యవసాయం ఇష్టం లేకపోతే, నాకెందుకు కోపం? అదుగో మా అన్నయ్య వస్తున్నాడు.”

ఇంతట్లో స్వర్ణకుమారి అన్నగారు శ్రీనివాసరావు గుమ్మం దగ్గిర తల వంచి లోపలికి వచ్చినాడు.

"ఏమిటి పిల్లకాయలిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు? బుద్ధి తక్కువ! కోపం అంటున్నావేమిటి, చెల్లీ?”

“ఈ స్నేహితుడుగారి మాటలు నీకు పథ్యం. నేను బుద్ధితక్కువ దాన్నని అందరికీ తెలియనే తెలుసు. అదే అంటున్నాను!”

అని స్వర్ణకుమారి విసవిస లోపలికి వెళ్ళిపోయింది.

“ఆడవాళ్ళకి కోపం కూడా అందమేనోయ్” అన్నాడు శ్యామలరావు, నవ్వుతూను.

"విన్నావా సోన్, శ్యామం అనేమాట! కుక్కరులో భోజనం అంతా ఉడికిందో లేదో చూశావా, లేదా? బొమ్మలతో కడుపు నిండిన శ్యామానికి అన్నం కావాలో అక్కరలేదో కాని వ్యవసాయ దారుణ్ణయిన నాకు వృకోదరత్వం అలవడింది. మొక్కపాతే కాలంలో స్నానం చేసి వస్తున్నాను” అని శ్రీనివాసరావు స్నానాలగదిలోకి వెళ్ళిపోయాడు.

“ఇదో క్రొత్త కవిత్వ రకపు వ్యవసాయదారుల భాషలా ఉందే” అంటూ శ్యామలరావు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు దొడ్లోకి వెళ్ళాడు. ​

2

కుంతలూరు గ్రామానికి పదిమైళ్ళ దూరంలో రెండు కొండల మధ్య ప్రవహించే ఒక వాగుకి పెద్ద ఆనకట్టకట్టి బ్రహ్మాండమైన చెరువు నిండించారు ప్రభుత్వంవారు. ఆ చెరువు క్రింద ఒక వెయ్యి ఎకరాల భూమి మాగాణి మొదలైన సాగుకావడానికి నీళ్ళున్నవి. ఆ భూమి అంతా అడివిలా ఉండే రోజుల్లో ఇంగ్లీషు విద్యాపండితులైన యువకులనేకులు నిరుద్యోగపు సైతాను పాలనుపడి ఉండేవాళ్ళకి ఆ భూమంతా పంచి యివ్వవలెనని అలజడిపుట్టింది. ప్రభుత్వంవారు మొట్టమొదట నూరుఎకరాలు పదిమంది పట్టభద్రులకు పంచి యిచ్చేటట్టున్ను, వ్యవసాయం పెట్టుబడికిగాను ఒక్కొక్కరికి అయిదేసి వందల రూపాయలు అప్పు ఇచ్చేటట్లును, భూమి హక్కు పదిఏళ్ళవరకు ప్రభుత్వం వారికే ఉండేటట్లును, చివర అయిదు సంవత్సరాలు నూటికి పది రూపాయల వంతున పన్ను యిచ్చేటట్లును, అడ్వాన్సు సొమ్ము యావత్తూ పదియేళ్ళల్లో తీర్చుకొనేటట్లున్ను మొదలైన షరతులతో భూమి యిచ్చునట్లు ఏర్పాటు చేశారు. దేహదారుఢ్యము, మనోదారుఢ్యము, కూర్చుకొన్న పదిమందిని వేలకొలది వచ్చిన అభ్యర్థులలో ఏరుకున్నారు. అందులో శ్రీనివాసరావూ, శ్యామలరావు కాశీ విశ్వవిద్యాలయంలో సహాధ్యాయులు, ఎమ్.ఎస్.సి. పట్టాలు పొందిన తరువాత వారిద్దరూ విడిపోయినారు. తనలో ఉండే లలిత కళాచతురత్వాన్ని పైకి మొలిపించి విజృంభింప జేయడానికి ప్రసిద్ధి కెక్కిన శాంతినికేతన లలిత కళాశాలకు శ్రీ నందలాలు మహాశిల్పి పాదాలు పూజింప పోయినాడు. శ్యామలరావు. నాలుగేళ్ళు అయిన తర్వాత చిత్రకళాకోవిదుడై అనేక ప్రదర్శనాలలో బహుమతీలంది అతడు ఆంధ్ర దేశోన్ముఖుడైనాడు, చిన్నతనాన్నించి సహాధ్యాయుడైన శ్రీనివాసరావు చెల్లెలు స్వర్ణకుమారిని తన హృదయ సింహాసనంలో అధివసింప జేసుకున్నాడు. స్నేహితులిద్దరి కన్నా అయిదేండ్లు చిన్నదైన ఆ బాలిక వీరిద్దరూ ఎమ్.ఎస్.సి. కాశీలో చదివేరోజుల్లో వారితోపాటే మకాంచేసి ఇంటర్ చదువుతూ ఉండేది.

స్వర్ణకుమారి ఏడాది క్రిందనే బి.ఏ. పూర్తిచేసుకుని అన్నగారి వ్యవసాయంలో సాయం చేయడానికి తలిదండ్రుల అనుమతిమీద కుంతలూరు గ్రామంలో ఉన్న నూత్న వ్యవసాయాశ్రమానికి చేరుకుంది. అప్పుడామెకు పందొమ్మిదేళ్ళు. నవయౌవని. దివ్యసుందరి. అలాంటి స్వర్ణకుమారిని మంచి ముహూర్తంలో వివాహం చేసుకుని తన లలితకళకు వన్నెలుదిద్ది, తన జీవితం దివ్యానందపూరితం చేసుకుందామని శ్యామలరావు ఉవ్విళ్ళూరుతుండడంచేత ఇంటికి వెళ్ళగానే తల్లిగారి హృదయం చల్లబడేటట్లు వారంరోజులయినా ఉండకుండానే శ్యామలరావు కుంతలూరుకు ప్రయాణమయ్యాడు. శ్యామలరావు అంటే స్వర్ణకుమారికి చిన్నతనంలోనే అయిదేళ్ళ బాలికగా ఉన్నప్పటి నుంచీ ప్రేమే. తియ్యని సుందరమైన అతని గొంతుక విన్నా, గురుశిక్షణ లేకపోయినా అందాలు సేకరించుకోబోయే అతని చిత్రలేఖనాలు చూసినా ఆమె గుండె మధురంగా కొట్టుకొనేది. చదువుకునే రోజుల్లోను, శలవురోజుల్లోను తన ఊళ్లో ఉన్న ప్రసిద్ధికెక్కిన ఒక గాయకునిచేత ​ఆమె వీణపాట చెప్పించుకొన్నది. శ్యామలుని కళకు తన వీణ దివ్యార్పణగా సంకల్పించుకున్న దా బాలిక.

శ్రీనివాసరావుకి చిన్నతనాన్నుంచి వ్యవసాయం అంటే మహాఇష్టం. పాతబడి నష్టదాయకమైన వ్యవసాయపు రీతులన్నీ నెమ్మది నెమ్మదిగా మార్చి శాస్త్రపరిశోధనా పూర్వకమైన మంచి పంటలు పండించే కొత్త మార్గాలు అవలంబించాలని అతని వాదన. కొద్ది రైతాంగమైన తండ్రిగారి కర్షకత్వానికి అనేక మార్పులు తీసుకువచ్చి, వీలైనప్పుడల్లా శ్రీనివాసరావు చక్కని వ్యవసాయపు పద్ధతులు ప్రవేశపెట్టించాడు. ఉద్యోగం లేకుండా వీధుల వెంబడి తిరుగుతూ, లోకాన్ని తిట్టుకుంటూ జమీందారుల్నీ ధనాడ్యుల్నీ పేరు తల్చుకుని పళ్ళు కొరుకుతూండే చదువుకున్న వాళ్ళంతా తిరిగి వ్యవసాయంలోకి చేరిననాడే భరతదేశం బాగుపడుతుందని ఛాతీ విస్ఫారితంచేసి కళ్ళల్లో కాంతులు ప్రసరిస్తుండగా శ్రీనివాసరావు వాదిస్తూంటాడు.

ఈ విషయంలోనే శ్రీనివాసరావుకీ, శ్యామలరావుకీ భేదాభిప్రాయాలు కలిగాయి. నేల దున్నుకోడానికి మెదడు దున్నుకోడానికి ఉత్తరపు ధ్రువానికి, దక్షిణపు ధ్రువానికి ఉండే తేడాఉంది అంటాడు శ్యామలరావు. ఒక దాని కొకటి సంబంధం ఉంటే ఒకదాని సహాయంవల్ల యింకొకటి విజృంభిస్తుందని శ్రీనివాసరావు వాదిస్తాడు. అన్నగారి వాదన దిట్టంగా బలపరుస్తుంది స్వర్ణకుమారి. ఏ 'యల్.టి' పట్టానో చేతిలో పుచ్చుకొని “మేష్టరీపని మేష్టరీపని”అని దేశాలు తిరగడంకన్న భారత నారీమణి ఎంత చదువుకున్నా భర్తకు సహాయంగా వ్యవసాయవృత్తే అవలంబించాలని తన తియ్యటి గొంతుకతో చక్కగా వాదిస్తుంది.

ఆ కారణంచేతనే పట్టభద్రురాలు కాగానే, నాగలి పట్టుకున్న అన్నగారికి అన్నం పట్టుకెళ్ళే ఆడబడచు అయ్యింది. అన్నగారి పదిఎకరాల భూమిలోను ఒక ఎకరం తన స్వంత సేద్యానికి ఉంచుకుంది. రాత్రింబవళ్లు కష్టపడి ఆ ఎకరంభూమి, పూలచెట్లుతోను కూరగాయల మొక్కల పాదులతోను, పండ్ల అంటులతోను, తిరిగి అమ్మేందుకు మొక్కలున్న కుండలతోను నింపివేసింది.

3

తనకూ, స్వర్ణకుమారికీ జరిగిన వాదనను గూర్చి ఆలోచించుకుంటూ భోజనం దగ్గిరికి వచ్చికూర్చున్నారు శ్యామలరావు. వచ్చిన వారం రోజులనుంచి ఎప్పుడూ పాటలు పాడుతూ తాను నవ్వుతూ. యితరులను నవ్విస్తూండే శ్యామలరావు చప్పగా చల్లగా భోజనందగ్గర కూర్చుని తనవేపైనా చూడకుండా తలవాల్చుకొని ఉండడం స్వర్ణకుమారి చూసింది. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఒత్తయిన జుట్టుతో వికసించివున్న అందమైన అతని తలను తనహృదయానికి అదుముకుని “నీమీద నా కెప్పుడూ కోపం కలగదు శ్యామం! నీ భావాలకు తీరని విచారమేకాని” అని అందామని ఆమెకు గాఢమయిన కాంక్ష కలిగింది. ​"నా మాటలకు కోపం వచ్చిందా యేమిటి. భోజనం తిన్నగా చెయ్యడంలేదు, శ్యామ్” అని స్వర్ణ అన్నది.

"నీ మాటలకు కోపం ఎందుకు స్వర్ణా? గంగాకూలంలోని వెన్నెలలాంటి నీ హృదయం తల్చుకుంటూ యిక్కడికి వచ్చాను. ఆ వెన్నెలలో ఎప్పుడు తేలిపోదామా అని ఆలోచిస్తున్నానంతే.”

స్వర్ణకుమారి కళ్ళల్లో మెరుములు మెరిసినవి. శ్రీనివాసరావు శ్యామలరావుని చూసి-

“ఒరే శ్యామ్! నేను ఇంజనీరుతో మాట్లాడి ఏర్పాటుచేసి ఉంచాను. నువ్వు దరఖాస్తు పెట్టగానే నీ పది ఎకరాలు నీకు యిస్తారు. నువ్వు వ్యవసాయం ప్రారంభించగానే నిజమయిన భాగస్వామిని అవుతూ నీ గృహిణి నీ యింటికి అవతరిస్తుందని ఓ తాయిలంగారు నీతో చెప్పమన్నారు” అని అన్నాడు.

శ్యామలరావు మాట్లాడలేదు, అన్నగారి మాటలకు చిరునవ్వు నవ్వుకుంటూ ఉన్న స్వర్ణకుమారి శ్యామలుని మౌనానికి నివ్వెరపోయి చూచింది.

భోజనాలయి కూర్చున్నారు. శ్యామలరావు సిగరెట్టు, శ్రీనివాసరావు చుట్టా కాల్చుకుంటూండగా స్వర్ణకుమారి తన తోటలో తయారైన తమలపాకులు రాసి చుడుతూంది. శ్యామలరావు తలవంచుకునే, “శీనూ! వ్యవసాయం చేయడం నాకిష్టంలేదు. చదువుకూ, వ్యవసాయానికి సంబంధంలేదని నేను మొదటినుంచి వాదిస్తున్నాను. శ్రీనివాసరావు ఒకడు తప్పబుట్టవచ్చుగాక! తక్కినవాళ్ళంతా కొద్దిరోజుల్లో నిజం గుర్తెరిగి నాగళ్లు నడమధ్యాన వదలి స్వగ్రామాలకి వేంచేస్తారని నా గట్టి నమ్మకం. వ్యవసాయం చేసేవాళ్ళువేరు; చదువుకున్నవాళ్లు పరిశోధనలు చేసి శాస్త్ర పరిశోధనకు కొత్త అధ్యాయాలుచేర్చాలి. కళాదేవిని నూత్నపంధాలలో నడపాలి. ఆమెకి నూత్నాలంకారాలు సమకూర్చాలి. అదీ నా ఉద్దేశ్యం. స్వర్ణకు ఈ వ్యవసాయంవల్ల అద్భుతమైన అందంపోయి కర్కశమైన అదోరకపు అందం వచ్చింది. అయితేయేమి? తెలిసున్నవాడవు నువ్వైనా ఆమెకి బోధించి, నావెంట పంపు. నేను బెజవాడలో ఒక లలితకళాశాలను యేర్పాటు చెయ్యదల్చుకున్నాను. వెన్నెల కిరణాల్లా ప్రసరిస్తూ వీణతీగెల్లోంచి దివ్య గాంధర్వాన్ని ఉద్భవింపజేసే ఆమె వేళ్ళు మొరటుబారి యెల్లా ఉన్నాయో చూడు! ఇంటికి రాగానే మీ నాన్నగారు ముహూర్తం పెట్టిస్తామన్నారు” అని అన్నాడు. ఈ మాటలు వింటూన్న కొద్దీ స్వర్ణకుమారికి మొహం జేవురించింది. చేతులు వణికినవి.

“అన్నయ్యా! శ్యామలరావు యిక్కడ వ్యవసాయం చెయ్యనక్కరలేదు. స్వర్ణకుమారి పెళ్ళి చేసుకోకుండానే అన్నగారికి సహాయం చేస్తూ యిక్కడే వుంటుందని చెప్పు. రేపు రెండెడ్లబండి రైలుకు మీ శ్యామలరావుని తీసుకువెళ్ళే యేర్పాటు చేయించు” అని కళ్ళనీళ్ళు తుడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ​

4

ఈ నూతన కర్షకాలయంలో ఒక వివాహంకాని యువకుడు ఉన్నాడు. భూపుత్రిలా ఉండే స్వర్ణకుమారి, నిజమైన బంగారు ప్రోవని అతని నమ్మకం. తన యింట మహారాణిలా ఆమెకు అధికారం ఇవ్వడానికి అతడు ఆశిస్తున్నాడు. ఈ రెండేళ్ళనుంచి తన హృదయ దుర్గానికి ముట్టడివేస్తూన్న ఈ వీరుణ్ని దూర దూరంగానే ఉంచింది స్వర్ణకుమారి. ఈనాడు శ్యామం తన్నునట్టేటిలో వదలి వెళ్ళిపోయినట్లు ఆమెకు తోచింది. దివ్యమూర్తి అనుకున్న తన శ్యామం యింక తనవాడెట్లా అవుతాడు? తన హృదయం గ్రహించలేనివాడు తనకు కాదన్నట్లే ప్రేమ అనేది ఉట్టి మాయ. అది మనుష్యులకు ఉండే హృదయ దౌర్భల్యంగాని, ఉత్తమగుణం కానేకాదు. ఆశయాలకు అందలేని ప్రేమ తుచ్ఛమే అవుతుంది. వ్యవసాయంచేస్తూ తన అన్నగారితో బాటు నడుం కట్టుకున్న ఆ ఆశ్రమవాసి నిజమైన వీరుడు. అతన్ని తనకు స్వామిగా చేసుకుంటే అంతకన్న పవిత్రమయిన త్యాగం ఇంకొకటిలేదు. తన హృదయవనంలో శ్యామలరావు విషపుమొక్క అయిపోయినాడు. ఆ మొక్కను కలుపుకింద తీసివెయ్యవలసిందేకదా! కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, నిద్రలేకుండా పక్కమీద దొర్లుతూ రాత్రంతా స్వర్ణకుమారి జాగరంచేసింది.

తెల్లవారగట్లే శ్రీనివాసరావు చెల్లెలి గదిలోకి వచ్చి చూసేటప్పటికి వడిలిపోయిన పువ్వులా ఉన్న తన ముఖం అన్నగారివైపు త్రిప్పి, స్వర్ణ,

“తోటలోకి వెళ్ళే వేళ అయిందా అన్నయ్యా?” అని ప్రశ్నించింది.

“చెల్లీ! నిన్ను చూసి మరీ వెళ్ళమన్నా. శ్యామ బండెక్కి వెళ్ళిపోయినాడు. ప్రాణంలేని కఱ్ఱలా ఉన్నాడు. మనస్సులో ఉండే ఆవేశాలవల్ల వచ్చే మాటలకు అర్థంలేదు. ప్రేమ అంటే భగవంతునియొక్క అవతారం అని నా నమ్మకం చెల్లీ! అలాంటి ప్రేమను చేతులార త్రోసిబుచ్చుకోడం మన దేవాలయం మనమే మననెత్తిమీద కూలదోసు కున్నట్లవుతుంది. నిన్ను విడిచిపెట్టి శ్యామలం నిజంగా ప్రాణం విడుస్తాడేమోనని భయం వేస్తోంది. ఎప్పటికైనా భార్యభర్త ననుసరించవలసిందే కదా చెల్లీ! నేను శ్యామానికి ఉత్తరం వ్రాస్తాను. నిన్ను యింటికి తీసుకువెళ్ళి దిగబెడతాను.”

“అన్నయ్యా! నన్ను ఇంటి దగ్గిర దిగబెట్టే దారిలోనే ప్రాణాలూ దిగబడతాయి.”

“అంత వెఱ్ఱితనం ఉండకూడదు తల్లీ!”

“నాకు వెఱ్ఱితనమా? నీకా?”

కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ స్వర్ణకుమారి దిండులోకి ముఖందూర్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. మంచంమీద పక్కనే కూర్చుని శ్రీనివాసరావు చెల్లెలి వీపు నిమురుతూ.

“చెల్లీ! నేను పొలంలోకి వెడుతున్నాను! తోటపని చూసుకో! ప్రయాణాల మాటలులేవు. అన్నమాటలు ఉఫ్‌న ఊదేస్తున్నాను” అని అన్నాడు.

చెల్లెలివైపు పదినిమిషాలు చూసి తల ఊపుకుని పెదవి విరుచుకొని నెమ్మదిగా అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ​

5

స్నేహితుడైన శ్యామ్ని ఎలా ఒప్పించగలడు? చెల్లెలి మనస్సు ఎల్లా తిప్పగలడు? చిన్నతనాన్నుంచీ వీళ్ళిద్దరి దాంపత్యమూ అతని ఊహాపథంలో ఎంతో ఆనందం సమకూరుస్తూ ఉండేది. శ్యామసుందరంమీద శ్రీనివాసురావుకు వెఱ్ఱి కోపం వచ్చింది. ఆడవాళ్ళ హృదయాలు ఎంతకాలం మగవాళ్ళ చేతుల్లో నలిపేస్తారు? పురుషుల ఆశయాలకూ, ఆశలకు, కాంక్షలకూ బానిసలై ఆడవాళ్ళు యెంతకాలం తుచ్ఛ జీవితాలు గడుపుతూ ఉండాలి?

తన కింతవరకు ఏ బాలికపైనా ప్రేమ ఉద్భవించలేదు. అట్టిప్రేమ విధానమైన బాలిక తన్ను వ్యవసాయం మానివేయమంటే మానివేయవలసిందేనా? అవును. అలాంటి దివ్యబాలిక తన్ను మానివేయమంటే తలవంచి ఒప్పుకోవలసిందే!

ఈ ఆలోచనలతో శ్రీనివాసరావు పరధ్యానంగా వ్యవసాయం సాగించాడు. ఆయన పరధ్యానం పెద్దపాలి చూసి “ఏమండి అయ్యగారూ! ఈవాళ అదేంటోగా ఉన్నారు?” అన్నాడు.

“అదీలేదు, ఇదీలేదు, పొలం దున్నటం ఈవాళ పూర్తి చెయ్యాలి సోమన్నా.”

"మీ అఱక నిద్రపోతోందండి బాబూ!”

“నా నిద్రే ఎద్దులలో ప్రతిఫలిస్తోంది సోమాలూ!”

రెండవ భాగము

నెలలు గడిచాయి. శ్యామ్ దగ్గిరనుంచి స్వర్ణకుగాని, శ్రీనివాసులకు గాని ఉత్తరం లేదు. స్వర్ణ ఇంతవరకు శ్యామ్ తనకురాసిన ఉత్తరాలన్నీ తిరిగి చదువుకుంది. ఆ భాషా మాధుర్యమూ, ఆ చిత్ర విచిత్ర భావాలూ ఆమె హృదయాన్ని దహించి వేశాయి. నిజంగా తన శ్యామ్ తనకు దూరమైపోతాడా? అతణ్ణి మళ్ళీ చూడడమే పడదా! "నిన్ను సర్వకాలాలయందూ హృదయంలో అధివసింప చేసుకుని పూజిస్తూ ఉంటాను” అనే వ్రాతలు మాటలూ వట్టి గాలి కబుర్లేనా! ఛీ దొంగ స్నేహాలూ దొంగ ప్రేమలూ ఎవరిక్కావాలి? అతడు శాంతినికేతనంలో ఉన్నప్పుడు కాశీలో ఉన్న తనకడకు రాని నెలలేదు. తనకు శలవలు వచ్చేటప్పటికి శాంతినికేతనాన్నుంచి మహావాయువులా తనకడకు చేరుకుని శ్యామ్ తన్ను ఎంత ప్రేమతో అజంతా మొదలైన దివ్య కళాక్షేత్రాలకు తీసుకొని వెళ్ళేవాడు. అలాంటి ఆ ప్రేమికుడు తనకు ఇంక కానివాడేనా? తన ఆశయాలనూ తన్నూ ఎంత గౌరవిస్తున్నాడు. ఈ సుబ్రహ్మణ్యం! వెఱ్ఱి మొఱ్ఱి బొమ్మలూ వెఱ్ఱి మొఱ్ఱి కవిత్వమూ సృష్టింప లేకపోతే మనుష్యుడు కాడా ఏమిటి?

తన అన్నగారు కవా? గాయకుడా? చిత్రకారుడా?

  • * * *
​ప్రతివ్యక్తి జీవితంలోనూ ఎవరో ఒకరు ప్రవేశించి ఆ జీవితాన్ని సర్వవిధాల భగ్నంచేస్తారు. ఎవరు ఈ శ్యామ్ ఎవరు తాను!

“స్వర్ణా! నానాటికి చిక్కి శల్యమైపోతున్నావు - నాలుగు రోజుల పాటు యింటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ రాకూడదూ? అమ్మచేతి పాకము రుచిచూస్తే మళ్ళీగులాబి బుగ్గలు వేసుకు రావచ్చుగా?”

“నా వంట బాగాలేదనా? పోనీ నువ్వు తినకు. ఆ ముక్కే మొదట చెప్పలేకపోయావూ!”

“ఇంతట్లో కోపమా? ఎవరివంట వారికి రుచి కాదంటారుగా!”

“అమ్మకు ఎవరు వంటచేసి పెడుతున్నారు? అమ్మ చిక్కి పోయిందా? నా వంట నీకు సహించక పోవచ్చును - వంటవాణ్ణి పెట్టుకో!”

"ఈ మధ్య నీకు మాటలాడితే కోపంవస్తూంది - కోపదేవత వయిపోతున్నావు. నీ వంట నాకు ఎంతో అద్భుతంగా ఉంటుంది చెల్లి! ఇంక శ్యామ్‌ఉన్నన్నాళ్ళు ఒకటే పొగిడేవాడు నీ వంటని -”

"శ్యామ్ పేరు నా దగ్గర తీసుకురాకు - ఎంత చెప్పినా నువ్వా శ్యామ్ పక్షమే” అని నీళ్ళురాని ఎఱ్ఱని పొడికళ్ళతో లోపలికి వెళ్ళిపోయింది స్వర్ణ కుమారీదేవి.

శ్యామలరావు వెళ్ళిపోయినప్పటినుంచీ ఆమెకు తోట అంటే భక్తి యెక్కువైంది. ఆమెలో వికసించవలసిన ప్రేమంతా ఆమె పూలవన వాటికలో సర్వవర్ణ స్వరూపాలైన పూవులై వికసించినది. ఆమెలోని ఆశాసాఫల్యత బొప్పాసి పళ్ళయి, నిమ్మపళ్ళయి, దానిమ్మ పళ్ళయి ఫలించినది. ఆమె తోట కలకలలాడిపోతూన్నది.

ఆ తోట విషయంలో సుబ్రహ్మణ్యము స్వర్ణకుమారికి సైదోడు వాదోడైనాడు. ఆమె మాటే అతనికి రాజశాసనము. ఆమె ఎంత చిన్న కోర్కె కోరినా అతడు తన మహద్భాగ్యం క్రింద ఎంచుకొని నిర్వర్తిస్తూన్నాడు. తన వ్యవసాయ స్థితి తగ్గిపోతున్నదని అతడు గమనించటము లేదు. స్వర్ణకుమారికి నానాటికి అతడన్న గౌరవము హెచ్చిపోయినది.

2

శ్రీనివాసరావు వ్యవసాయం దినదినాభివృద్ధి పొందుతున్నది. చెల్లెలు వేసిన తోటతోపాటు పక్కనే మరిమూడు ఎకరాలు అన్నిరకములైన ఫలవృక్షములతోనూ నృత్యాలు చేయించినాడు. చెట్లతో ఆడుకుంటాడు. చెట్లతో మాట్లాడుకుంటాడు. అతని మాటలు విని చెట్లు తలయెత్తి అతని వంక చూచి కిలకిల నవ్వుతవి. కాయలుకాచిన అతని చేతులు తల్లి ప్రేమతో చెట్లను స్పృశించుతవి.

తన పదియెకరాల పొలము చుట్టూ కొబ్బరితోట వేసినాడు శ్రీనివాసరావు. ఒక యెకరము చెఱకు, ఒక యెకరము అరటితోట, ఒక యెకరము పాదులతోనిండి సర్వకాలాల యందూ చుట్టుపక్కల పట్టణాల మార్కెట్టులను కూరలతో నింపుతుంది. తక్కిన మూడు యెకరాలూ ధాన్యం పండిస్తాడు. పది బస్తాలు తనకు సహాయంచేసే పాలివానికిపోయి తక్కిన యిరవై తనకూ తన చెల్లెలికి తిండికి మిగులుతున్నవి. తోటలో ​వచ్చిన రాబడులవల్ల పై ఖర్చులూ కొదవ జీతాలూ వస్తూన్నవి; ప్రభుత్వం వారిచ్చిన బాకీ తీరుతున్నది.

ఓ రోజున తోటలో పనిచేసుకుంటున్న శ్రీనివాసరావు దగ్గరకు సుబ్రహ్మణ్యం తల్లి వొచ్చింది.

"శ్రీనివాసరావూ! ఈ ప్రకారంగా వెళ్ళితే పదేళ్లుదాటితే పొలం నీదై పోతుందికదా?”

“మీ ఆశీర్వచనంవల్ల మా పదిమందికీ యీ భూసంపాదన మిగులుతుందనే అనుకుంటున్నాను”.

"ఐతే ఓ ప్రశ్న అడుగుతాను తండ్రీ! కోప పడకుంటే నీ కనేక సంబంధాలు వొస్తూన్నవి. ఓ చక్కనమ్మాయిని తీసుకొచ్చి మా కళ్ళకరువు తీరుద్దూ!'

"మీ అబ్బాయికేమైనా సంబంధం ఆలోచించారా యేమిటండీ!”

“అందుకనే వొచ్చాను తండ్రీ! నన్నీ రొండేళ్ళనుంచి మావాడు వేపుకు తింటున్నాడు. స్వర్ణకుమారిని శ్యామలరావు కిస్తారు గదా అనే వుద్దేశంతో ఆ మాటెత్తకుండా వూరుకున్నాము. ఇప్పుడలాంటిదేమీ లేదని మావాడు చెప్తాడు. మంచి ముహూర్తం చూసి ఇవ్వాళ నన్ను పోరి పంపించాడు. మావాడికి మా వూళ్లో ఓ యిరవై యెకరాల భూమి కూడా వుంది. ఆ సంగతి నీకుతెలిసేవుంది. మా చిన్నతనంలో పెద్దలు పెళ్ళికూతుళ్ళనే అడిగేవారు. మీ స్వర్ణను మా సుబ్రహ్మణ్యాని కియ్యవలసిందని, నాయనా, నీ రెండుచేతులు పట్టుకు అడుగుతున్నాను. అమ్మాయి అభిప్రాయం తప్పకుండా కనుక్కో”

“అదికాదండి దొడ్డమ్మగారూ! ఆస్తులకి దానికీ చూడము. మా చెల్లిలి యిష్టం యెలావుంటే అలా మేము తప్పకుండా జరపవలసినవారమే" అని శ్రీనివాసరావు లేచాడు. సుబ్రహ్మణ్యం తల్లి చల్లగా వెనక్కు వెళ్ళిపోయింది.

"శ్యామ్ వుట్టి వెర్రివాడు. వాడు వుట్టిపూల్, ఇంతప్పటినుండీ ప్రేమించిన అమ్మాయిని కుక్కిన పేనులాగ కిక్కురుమనకుండా ఇక్కడ వదలివేసి వెళ్ళిపోయాడు. ఇంతైనా వాడికి పౌరుషం లేదు. వాడి ప్రేమ ఒఠ్ఠి హుళక్కి వీళ్ళిద్దరి ప్రేమా చూస్తూ ఎంత ఆనందం పడేవాడు తాను. స్వర్ణ హృదయంవాడేమి తెలుసుకున్నాడు. ఆఁ! కళలట! కళోపాసకుడికి అందరి హృదయాలు తెలుస్తాయంటారు, వట్టి బూటకము. ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ దాపురించాడు బాబూ! ఇంతకూ ఎవరికర్మ వారిది” అనుకుంటూ ఆరడుగుల శ్రీనివాసరావు ఏనుగుగున్నలా విసవిస యింటివైపు నడిచిపోయాడు.

3

శ్రీనివాసరావు యిల్లు తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. స్వర్ణ దాన్ని అలంకరించింది. తోటలమధ్య ఆ యిల్లు మణిపూసలా మెరిసిపోతూన్నది. శ్రీనివాసరావు జీవితంలో ధ్వనిలేదు. అంతా వాచ్యమే. ఏది చెప్పదలచుకున్నా డొంక తిరుగుళ్ళు తిరక్కుండా, మొహమాటం లేకుండా కర్ర విడిచినట్టు చెప్తాడు. కోపమంటే ఎరుగడు. కోపం వస్తే లయకాల రుద్రుడే. అసత్యవాదులంటేనే అతనికి కోపం. అతనంటే అందరికీ భయమూ, భక్తి కూడాను. అలాంటి శ్రీనివాసరావు ఏదో గొణుక్కుంటూ ఇంటిలో ​ప్రవేశించాడు. తన పడుకునే గదిలోకి వెళ్ళి తక్లిన్నీ యేకులూ తీసుకుని వినోబాభావే విధానాలతో త్వరత్వరగా దారం వడకడం ప్రారంభించాడు. ఏ ఆలోచనా తోచనప్పుడాతడు దారం వొడుకుతుంటాడు. తన కట్టుబట్టలన్నీ అతడు వొడికినదారమే. "స్వర్ణా స్వర్ణా” అని చెల్లెలిని తన గంభీరకంఠంతో పిలిచాడు. తోటలో చెట్లకు నీళ్ళు పోస్తున్న ఆ బాలిక వనలక్ష్మిలా పరుగెత్తుకు వచ్చింది.

"ఎందు కన్నయ్యా పిలిచావు?”

"పిలిచానమ్మా! చాలా ముఖ్యమైన కారణమే వున్నది. నీకు పెళ్ళివారు వొచ్చారు- ఇదివరదాకా దూరంగా వున్న వారు యివ్వాళ దగ్గరకు వొచ్చారు. నన్నుద్ధరించటానికి!”

“ఏమిటన్నయ్యా? అలా వున్నావేమిటి? ప్రసన్నంగా వుండే నీనుదురలా ముడతలు పడిపోయిందేమిటి? ఏదో కోపంగా వున్నావు. నాకు పెళ్ళివొద్దని యిదివరకే నీతో గట్టిగా చెప్పివున్నాను. ఈ భూమంతా నీదైనప్పుడు అప్పుడు చూసుకుందాములే!”

“నా కదంతా తెలియదమ్మాయ్, శ్యామానికీ నీకూ చెడిపోయిందటగా. ఇంక అడగవచ్చునట! ఆ సంగతి వాళ్ళకు తెలిసిందట. తెలిసిందటమ్మా! సుబ్రహ్మణ్యం తల్లి తన కుమారుడికి నీ పాణిగ్రహణంకోరి రాయబారం వొచ్చింది. నీ యిష్టం!”

ఇంత విరసంగా తన అన్నగా రెప్పుడూ తనతో మాటాడలేదు. అతడు చెప్పినమాట లామెకు తిన్నగా యెక్కనేలేదు. ఆరునెల్ల క్రిందట శ్యామం తనతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమయినాడు? చెవులు అడ్డంపెట్టుకున్నా తనతోటలోని పువ్వులలోనుంచి అతని పాటలు వినవస్తూనే వున్నవి. కళ్ళకు అడ్డంపెట్టుకున్నా నాగలి, నాగేటిచాలు, ఆ దూరాన కొండలూ అతని చిత్రాలను ప్రతిఫలిస్తూనే ఉన్నవి. తన హృదయంలోని అతని విగ్రహము స్పష్టరేఖామూర్తిగా చిరునవ్వులు నవ్వుతునే ఉన్నది.

తోటపని చేసికొనివచ్చి ఎంత తియ్యగా శ్యామలరావు నవ్వుల్ని కలలుగంటూ వుండేది. ప్రతి పుట్టినరోజుకీ తన కొక బహుమతి యిచ్చేవాడు. చిత్రాలు, చిత్రవస్తువులు, చీరెలు, కుంకుమ భరిణెలు, వెండివస్తువులు, గంధపు చెక్కడాలు శ్యాము ప్రేమతో అర్పించినవి కావూ?

“నిన్ను పూజిస్తానె స్వర్ణసానీ!

నీవు నా ఆశవే స్వర్ణసానీ!”

అన్న అతనిపాట తన నరనరాలలో తీగలు మీటుతున్నది. ప్రత్యూష పవనాలే అతని ముంగురులై, సాయంసంధ్యా కిరణాలే అతని మాటలై, నిర్మలజ్యోత్స్నలే అతని ఆటలై తన జీవితమంతా నిండుకొన్న శ్యామ్ తన చేయివదలి ఒక్కడూ, ఒక్కడూ వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రుల అనుమతి అడిగి ఏ సంగతీ చెప్తానని సుబ్రహ్మణ్యము తల్లితో చెప్పమని అన్నగారిని కోరినది స్వర్ణ. ​

4

శ్యాముకు జీవితమే భగ్నమైనది. స్వప్నాలు శకలములైనవి. ఒంటిగా ఈ బ్రతుకుటెడారిలో వేడిగాల్పులు వీస్తూ ఉంటే ఇసుకలో కాళ్ళు దిగబడుతూ ఎంతదూరం నడవగలడు తాను? కుంచెలకు చివరవున్న “సేబులు” వెండ్రుకలలోని ఎర్రటి రంగు ఆకాశమంతా ఎర్రటి మరకలతో నింపింది. గొట్టాలలోని రంగులు కర్రబారినవి. చిత్రలేఖనపు కాగితాలు ఎండి పొడి పొడిగ రాలినవి. ఎప్పుడూ తనకు చెలికత్తెలావున్న అలంకారదేవత మాసిన చీరకట్టుకొని వివర్ణవదనంతో వెడలిపోయింది.


"ఆనంద మేలనే,
అమృత వీచిక లేల?
అడు గడుగునా తగులు
నిడివి ముల్లుల దారి!
        ఆనందమేలనే?
కలలేల బ్రతుకులో?
సెలయేటి ఝరియేల?
ధూళినిండిన బ్రతుకు
తూళి విరుచుకుపడెనె!
        ఆనందమేలనే?
        అమృతవీచిక లేల?
కారు రంగుల వచ్చు
కల్లోల ఫేనాన
తడిలేని కణమైన
ధావళ్యమే కళలు
        ఆనందమేలనే?
        అమృతవీచిక లేల?


పరికిణీ కుచ్చులు జారాడగా పరుగెత్తుతూ, మెళ్ళో హారాలు గలగలా పాటలు పాడుతూ చిక్కులు పడుతూంటే తనతో ఆడుకున్నప్పుడు చిన్నతనంలో స్వర్ణలోని ఈ కర్కశత్వపు బీజాలు ఎక్కడా కనబడలేదే!


అప్పుడే పయ్యద సవరించుకొన్న నలుతాల్పు నవయౌవనపు తొలి పొద్దులలో ఆమెలోని వినూత్న పరిమళాలు ఈలాటి కటువువాసనలతో మిశ్రమము కాలేదే! ఆమె అన్నగారు తన ఊరు తన స్నేహవాంఛకై వచ్చినప్పుడు ఆ బాలిక తనలోని దివ్య సౌందర్యము వికసించే రోజులలో ఏవో కొత్త అందాలు సేకరించుకొనే గాఢ సురభిళ ఘటికలలో తనకై అన్నతో ఆమె వెన్నంటి వచ్చిన శుభముహూర్తాలకు అర్థమే లేదా? ​తనకూ, తన స్నేహితుడు శ్రీనికీ వాదాలు మ్రోగిపోయినప్పుడు అన్నగారికి వ్యతిరేకంగా ఆ బాలిక తనపక్షం వహించి వాదించిన తియ్యటి వాదనలకు ప్రయోజనమే లేదా! తన జన్మలో జన్మ. తన ప్రాణములో ప్రాణమూ, ఆత్మలో ఆత్మా ఐన కళను వదలాలా? తన జన్మలో జన్మ, ప్రాణములో ప్రాణమూ, ఆత్మలో ఆత్మ ఐనప్రేమను వదలాలా?

కళ తన ఆశయమూ నిదానమూ! కళ కోసమే కదా ఉద్యోగ వాంఛ పూర్తిగా నాశనం చేసుకున్నది? ఈ ప్రేమ బాలిక స్వర్ణకుమారి, ఆ కళతో రేఖకురేఖా, వర్ణానికి వర్ణమూ, మూర్తికిమూర్తీ రూపము పొందినదే. కళవల్ల కళాస్రష్ట లోకానికీ, లోకస్వరూపుడైన భగవంతునికి సేవ చేస్తాడు. ఆ సేవలో కళాస్రష్ట తన సర్వస్వమూ ఆహుతి చేయవలసి వుంటుంది. అదే మహా యజ్ఞము - ఈ దివ్య త్యాగమే కళను ఉత్కృష్టపథాలకి తేల్చి వేస్తుంది.

ఒక కళావ్యక్తి తన కళవల్ల లోకానికి సేవచేస్తున్నాననుకోవటము తన్ను తాను మోసం చేసుకోవటం కాదా? కళ లోకానికి సేవ ఔతుందా? కళాకారుడని పేరు వొస్తుంది - అలా పేరు రావడం ఒకని అహంకారానికి అలంకారం ఔతుందిగాని, పూజా స్వరూపము కాగలదా? తాను బూదిలో కలిసిన వెనుక కూడా తన పేరు నిలిచివుందనే భావము అహంకారానికి అధిస్థితి.

జీవించి ఉన్నన్నాళ్ళూ కలిగే అనుభవాలే మోక్షస్వరూపాలౌతవి. జీవితానికి ఉత్తమానుభవము ప్రేమ. ప్రేమ కోసం రాజ్యాలు వొదిలి పెట్టారు - ఎనిమిదవ ఎడ్వర్డు మొదలైన చక్రవర్తులు చిన్నతనాన్నుంచి తాను నమ్మిన ఒక బాలిక - తన జీవిత సర్వస్వమూ, తన సౌందర్య సర్వస్వము తనకు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఒక బాలిక, ఇవాళ తన విషయంలో నిస్పృహ చెంది కృశించిపోవలసిందేనా?

ఐతే ఆమె మాత్రం తన ఆశయాలు ప్రేమకోసం ఎందుకు ఆహుతించకూడదు? యుగయుగాలనుంచీ ఆడవాళ్ళను కాలిక్రింద నేలరాశారు మగవాళ్ళు. వాళ్ళ సర్వస్వమూ భర్తలకోసము ఇదివరదాకా త్యాగాగ్నుల కింధనం పోశారు. దివ్యసౌందర్యవతియైన ఒక బాలికకోసం తన సర్వస్వమూ త్యాగము చేసికోవటములో ఉత్తమత్వం ఉన్నదిగానీ, ఆమెను త్యాగం చేసుకొని రమ్మనటంలో లోకసాధారణగాథే ప్రత్యక్షమౌతున్నది.

తనతో ఆమె ఒంటిగ వాహ్యాళికి, సినిమాకు వొచ్చినరోజులు, తన మాట వినేటప్పటికే ఆమె ఉప్పొంగిపోయిన ఘడియలు, తన్నామె స్పృశించిన మాత్రాన తన దేహమంతా తన మనస్సంతా విద్యుత్తరంగాలు ముంచివేసిన శుభముహూర్తాలూ ఇప్పుడు అర్థంలేనివై పోవలసిందేనా”?

5

“నాన్నగారూ! నేను వ్యవసాయం చెయ్యాలని సరదా పుట్టింది. మన మెరక పొలంలో రెండెకరాలు నాకివ్వండి. అందులో మంచి తోట వెయ్యాలని వుంది” అని తండ్రి నడిగాడు శ్యామలరావు. ​శ్యామలరావు వూరు బెజవాడ బందరు రోడ్డు ప్రక్క కంకిపాడుకి ఇవతలనున్న ఇందుపల్లి గ్రామం. శ్యామలరావు తండ్రి సుబ్బయ్యగారు కుమారుణ్ణి చూసి "అబ్బాయీ! వ్యవసాయం యేమిట్రా? రెండు మూడు మంచి ఉద్యోగాలకు వీళ్ళు వస్తే అక్కరలేదని తోసేశావు. బెజవాడలో ఏదో కాలేజీ పెట్తానన్నావు, నీకు నిమిషాని కో ఆలోచన. మనస్సు నిలకడ లేదాయెను” అని కొంచెం కోపంగా అన్నారు.

“మీరు గట్టిగా వొద్దంటే మానేస్తాను నాన్నా! నా కోర్కె ప్రతీదీ మీరు సంభవించేటట్టు చేశారు. మీ ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి. ఈ ఒక్కకోరికా తీర్చండి. ఈ కోర్కెకూ, నా జీవితానికి చాలా సంబంధం వుంది.”

"అబ్బాయీ! తోటవేయడమంటే చాలా డబ్బు ఖర్చౌతుంది.”

"ఏదో కొద్ది ఖర్చుతో తోటవేయాలని వుందండీ మనకున్న స్థితిలో మన కుటుంబాలకు డబ్బు కష్టసాధ్యమే. చదువుకోసం మీరు పంపించిన రూపాయలలో కొన్ని ఖర్చుచేయకుండా బ్యాంకులో ఉంచాను. అదే నా నాగలి దున్నటానికి పెట్టుబడి.”

“నాన్నా! నీ ఆరోగ్యం అంత బండరకపుదికాదురా! ఈ బండపనిలో ఎందుకూ పనికిరాకుండాపోతావు. సందేహంలేదు.”

“డాక్టర్లు, దేశనాయకులూ మళ్ళీ భూమాత పాదాల కడకు చేరండి. దేశ సౌభాగ్యమూ ఆరోగ్య సౌభాగ్యమూ. అక్కడే ఉన్నది' అంటున్నారండి నాన్నగారూ!”

“ఉల్లికోడుపొలం నూతిదగ్గర ఒక యకరందొడ్డికి చుట్టూ వెదురుకంచె కట్టమంటాను వెంకన్నని. మొదలెట్టు ఇదో మూన్నాళ్ళ ముచ్చట. తర్వాత నేను చెప్పలేదని మాత్రం అనకు.”

ఉల్లికోడుపొలంలో యెకరంతోట విభాగించారు. ఆ తోటలో నాగేటి చాలు నవ్వింది. బెజవాడు ముష్టివారి దుర్గానర్సరీనుండి అంట్లు విత్తులూ బళ్లమీద వొచ్చి తోటంతా ముట్టడించాయి. అద్దెకు తీసుకు వచ్చిన మోటారు పంపు అమిత వేగంతో పాతాళ గంగాగానాన్ని శ్యామలుని కంఠానికి శ్రుతి కలిపింది.

తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర మళ్ళు ఒక ప్రక్కన. కాబేజీ, కాలీ, ముల్లంగి, కారెటు విత్తనాల మళ్ళొకప్రక్క పచ్చని మొక్కలతో పకపకమన్నాయి. మామిళ్ళు, సపోటాలు, తీపినిమ్మలు, బత్తాయిలు, నిమ్మలు బలమైన అంట్లు బార్లు తీర్చినవి. బొప్పాసి మొక్కలు, కొబ్బరి మొక్కలు తొటచుట్టూ కంచె పక్కనే కాపలాకాస్తున్నవి. ఒక మడిలో ముప్ఫైరకాల గులాబీలు, కేర్లయిన్‌డి ఆర్డెన్, పాల్నెరాన్, తెల్ల అమెరికను సుందరి పువ్వులతో అలంకరించుకొని గాలిలో నృత్యాలు సల్పుతున్నది.

మూడు నెలలు ఒళ్ళు తెలియకుండ స్వర్ణకుమారిపేరు మంత్రం కాగా శ్యామలుడు ఆరోగ్యం అంతా హూనం చేసుకున్నాడు. అతని చిత్రలేఖనం బొగన్ విల్లాలలో, అతని కవిత్వం తీగెసంపెంగలో, అతని మధుర కంఠం మాలతీ మాధవీ లతలలో రంగులుదాల్చి ఛందోగతుల నడిచి తాళగతియై ప్రసరించిపోయినవి.

పెద్దపాలి వెంకన్న ఎంతో సాయముచేశాడు. పలుచని సున్నితమైన అతని శరీరము తన పాత బంగారుఛాయ త్రోసిపుచ్చుకొని ఎర్రపడి నల్లబడి పోయింది. అతని ఫాలంలోని ​కాంతీ, కళ్ళలోని నృత్యము, పెదవుల్లోని హాసము మటుమాయమైపోయి నాగేటిచాళ్ళకు ఎరువుగా రాలినవి.

6

స్వర్ణకుమారి కనులక్రింద క్రీనీడలు బయలుదేరినవి. అందమైన పంపులు సేకరించుకొన్న - ఆమె పెదవులు తడిరబ్బరుతో చెరిపిన రేఖలులా మరకలుపడినవి. కొద్దివంపు తిరిగిన ఆమె చిత్రమైన ముక్కు సన్నగించి నిజముగ శుకనాశికయైనది.

శ్రీనివాసరావు ఆమె భుజములు రెండు అదిమిపట్టుకొని “చెల్లీ! నీకు మతిలేదు- నాకు పౌరుషంలేదు. మనిద్దరికీ బుద్ధిలేదు. నీ వీ సుబ్రహ్మణ్యాన్ని పెండ్లి చేసుకుందామనేనా? నాన్నా అమ్మా దగ్గరనుంచి నీకిష్టమైతే సంబంధం వొప్పుకోవచ్చునని నాకు మూడుదినాలై వుత్తరం వొచ్చిన సంగతి యెరుగుదువుకదా? అంతభారం నీనెత్తిమీదే పడింది. వాళ్ళమ్మ నన్ను రోజూ అడుగుతోంది. ఏదో జవాబు చెప్పకపోతే నేను వొఠ్ఠి మూర్ఖుణ్ణవుతాను. ఇప్పటికైనా -”

"ఏంచెయ్యమంటావన్నయ్యా! లోకం అంతా ఆడవాళ్ళని పళ్ళూడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే వుంటుంది. నువ్వుకూడ లోకముతోపాటు వాడివే అయ్యావు. నాన్నా అమ్మా యిచ్చిన అధికారం నీ నెత్తిమీదే పెట్టాను. నువ్వే చెయ్యి.”

“ఇదిగో సోనూ! నన్ను పిచ్చివాణ్ణి చెయ్యకు. చిన్నప్పటి నుంచీ నువ్వు కొండమీద కోతిని తీసుకువచ్చి యివ్వమంటే తెచ్చియిచ్చాను. నా ఆలోచనలు మగవాడి ఆలోచనలు.”

“నేను వొట్టి దద్దమ్మ ఆడదానిని.”

“నీ కెప్పుడూ సహజంగా వుండే విధానమంతా యేమైపోయింది? మాట్లాడితే తోకతొక్కిన తాచుపాములా లేస్తున్నావు.”

“మాటలతో నన్ను బాధించకపోతే ఒక కొరడా తీసుకోరాదు?”

"అయ్యో! వెర్రితల్లీ! నువ్వేది చెయ్యమంటే అదే చేస్తాను. నీ యిష్టంవచ్చినట్టుగ ఆలోచించుకొని నువ్వు ఆజ్ఞ యిస్తే పాలించడం నావంతు. దీనికి మిన్ను వొచ్చి మీదపడి నా సాలెగూడును దులిపి వేసినట్టు దులిపి వేస్తాను.”

స్వర్ణ కుమారికి కళ్లు చెమరించినై. “అన్నయ్యా! క్షమించు. నాకు మతిపోతున్నది. సుబ్రహ్మణ్యం తల్లితో సంబంధం ఖాయమని చెప్పు. నాన్నకూ అమ్మకూ ఉత్తరం వ్రాయి-”

"తల్లీ! ఆలోచించుకొని చెప్పమన్నాడు.”

"మళ్ళీ మొదలుపెట్టావూ! ఐతే నీ యిష్టమే ”

“అబ్బా! ఎంతకోపం వచ్చేస్తుందమ్మా నీకు? ఈ తక్షణం వెళ్ళి సుబ్రహ్మణ్యం తల్లితో చెప్తాను. అమ్మకి నాన్నకి ఉత్తరం వ్రాస్తాను. నువ్వు తొందరగా పెట్టించమంటే తొందరగా, ఆలస్యంగా పెట్టించమంటే ఆలస్యంగా ముహూర్తం పెట్టిస్తాను.”

“ఎంత తొందరగా ముహూర్తం పెట్టించగలిగితే అంత తొందరగా పెట్టించు. భారత సౌభాగ్యం ఆలోచనలతోనూ ఆలస్యాలతోనూ వెనక్కు పోతున్నది. ఒక వ్యవసాయదారుని అర్ధాంగిని హ్హా హ్హా హ్హా.” ​ఆమె వొళ్ళు తెలియని నవ్వు నవ్వుకుంటూ ఆ నవ్వులో విరుచుకుని మూర్ఛలో పడిబోయింది. పడబోయే చెల్లెల్ని చివాల్న ఎత్తుకొని రెండంగలలో ఆమె గదిలోకి తీసుకువెళ్ళి మంచంమీద పడుకోబెట్టి, ప్రక్కనున్న కుజాలోని నీళ్ళు ముఖంమీద చల్లి, ప్రక్కలునొక్కి నవ్వాపాడు. ఆమె గజగజ వణికింది.

“సోన్, కంగారు పడకమ్మా! మేమంతా కలిసి నీకు రాక్షసుల మయినాము. శ్యామసుందరు డొక పంద. ఇదిగో ఈ మందు పుచ్చుకొని పలకకుండా పడుకో. మామూలు దానవౌతావు" అంటూ శ్రీనివాసరావు తనగదిలోకి పరుగెత్తి కెళ్ళి తనవద్ద యెప్పుడూ సిద్ధంగా ఉన్న మందులపెట్టె పట్టుకు వచ్చి యింత బ్రొమైడు యిచ్చి తల నిమురుతూ ఆమె నిదురబోయే వరకు కూచున్నాడు. బలపూర్ణములయిన సమ్మోహనశక్తిగల అతని హస్తతల స్పర్శలో ఆ బాలిక నెమ్మదిచెంది చల్లగా నిద్రాదేవిఒడిలో మైమరచినది.

ఆ సాయంత్రం బండికట్టించి ఐదుమైళ్ళలోవున్న రైలు స్టేషను చేరుకున్నారు. అన్నా చెల్లెళ్లు; శ్రీనివాసరావు తన చెల్లెల్ని స్వగ్రామమయిన బెజవాడ తీసుకువెళ్ళాడు.

మూడవ భాగము

స్వర్ణకుమారితండ్రి తన కుమార్తె సుబ్రహ్మణ్యాన్ని పెండ్లి చేసుకోవటానికి నిశ్చయించుకుందని సుబ్బయ్యగారికి ఇందుపల్లి ఉత్తరం వ్రాశాడు. ఆక్రిందటిరోజునే వొంట్లో బాగాలేదని శ్రీనివాసరావు చెల్లెల్ని తీసుకువొచ్చి ఆమె ఆరోగ్యంతో తిరుగుతూవుండటం చూచి వారం రోజుల్లో వెళ్ళిపోయాడు.

స్వర్ణకుమారికి వచ్చిన అనారోగ్యం విషయంలో సుబ్రహ్మణ్యం మాటే మరచిపోయిన శ్రీనివాసరావు కొంతకాలమయిందాకా యేమాటా సుబ్రహ్మణ్యంతో తేల్చకూడదని నిశ్చయం చేసుకున్నాడు. ఈ సంగతి స్వర్ణకుమారికి గాని వారి తండ్రి రాధాకృష్ణయ్యగారికి గాని తెలియనీయలేదు. అన్నగారి సంగతి సుబ్రహ్మణ్యముతో చెప్పినట్లే భావించుకోన్నది స్వర్ణకుమారి. ఆమె హృదయంలోనుంచి ఎంత చెరిపి వేసుకుందామనుకున్నా శ్యామలుని చిత్రం మాయంకాదు. నవ్వుతూ నాట్యంచేసే కళ్ళతో పెదవులతో అతడామెకు సర్వకాలమూ ప్రత్యక్షమౌతూనే ఉన్నాడు.

రెండేండ్లనాడు తన పుట్టినరోజుకు అతడు బహూకరించిన 'విశాల భారత' అనే ఉత్కృష్ట చిత్రము తన పడకగదిలో ఎట్టఎదుట గోడకు వ్రేలాడుతూ ఉన్నది. రెండెడ్లబండి కొండలూ పొలాలూ మధ్య పుంతలో వెళ్తూన్నది. బండిపైన బస్తాలమీద చిన్నకుర్రవాడొకడు ధాన్యపు వెన్నులలోని గింజలు తీసుకుని నములుతున్నాడు. కొండలూ, పొలమూ చెట్లయొక్క సౌందర్యము అలవరచుకొన్న బలిష్ఠుడైన రైతు బండి తోలుతున్నాడు. ఆకాశమూ, తీగెలూ, పువ్వులూ, అందాలు పుణికిపుచ్చుకొన్న ఆ రైతుభార్య బండివెనుకనే నెత్తిమీద తట్టతో నడిచి వొస్తూన్నది. దూరాన ఆ లోయలో ఒకవూరు. సూర్యుడస్తమిస్తున్నాడు. ఆకాశంలో పైన తదియనాటి చంద్రవంక. ఈ రెండూనూ “విశాలభారత”లోని వృద్ధత్వమూ ​నవ్యత్వమూ చాటూతూన్నవి. భారతీయ విధానాన్ని చిత్రించిన అద్భుత చిత్రమిది. లక్నో ప్రదర్శనంలో ప్రథమ బహుమతి నందినది.

ఆ చిత్రము దివ్యము. ఆ చిత్రించిన చిత్రకారుడు తనకు దూరమయి పోయాడు. అల్లరివాడు. ఎప్పుడూ తనను నవ్వించేవాడు. అతడు తన జీవితాన్ని ప్రతి అణువూ స్పృశించి తన కైవశం చేసుకున్నాడు. తానాతని కళ్ళలో కాంతులు పొందింది. అతని నవ్వుల్లో నాట్యమాడింది. “నువ్వు నాకు స్వర్గదేవివి. నీ మందహాస పవిత్రకిరణంలో నా జీవితమూ, నా శక్తి, పుష్టిచేర్చుకుంటవి స్వర్ణసానీ” అని తన్ను అతని హృదయానికద్దుకొన్న గంగానదికడ ఒక దివ్యక్షణ మామెకు స్ఫురణకు వొచ్చింది. ఆ నా డామె పొందిన మహదానందము క్షణికమాత్రమే ఐంది. తన మాటలకే కోపంవచ్చి అతని సహజామృత రసప్రవాహంలో తనకోపం తీర్చక పిరికి వానిలా వెళ్ళిపోయాడు.

తాను కోరేది దేశ సౌభాగ్యం. దేశ సౌభాగ్యాని కాధారం నాగలి. నాగలీ! నువ్వు వేదానివి, నువ్వు పురాణగీతికవు, నువ్వు భగవద్గీతవు, నువ్వు భారతీయ హృదయానివి. నీవల్ల పాశ్చాత్య నీచభావ నీరసంలో పడ్డ మా దుర్బలత్వాన్ని ఏనాటికానాడు పటాపంచలు చేస్తున్నావు. శ్యామసుందరుడు నాగలి పట్టకపోతేనేమి? నాగలిని కీర్తించే కళాస్రష్టకు తావులేదా? లలితంగా కుంచెపట్టుకునేచేయి కర్కశంగా మేడితోకను పట్టవలసిందేనా? నాగలినీ నాగేటిచాలునీ కీర్తించటము దేశసేవకాదా? శ్యామసుందర్ ! నువ్వేమిచేస్తూ వుంటావు. గంగవొడ్డున నీవు చేసిన బాసలు, అన్నగారి పొలంలో నీ డగ్గుత్తిక కంఠం అర్థంలేనివేనా శ్యామం?

2

అనవసరమైన పౌరుషాలకు అవతల, అర్థవత్కృతమైన శాంతి కాంతి వెలుగుతూ ఉంటుంది. మనుష్యుని జీవితంలో ఎంత లోతైనా తవ్వి నూతులలో పాతాళగంగా ప్రవాహాలు పారకిస్తాడుగాని తన హృదయంలో కటినమైన పైభాగం తవ్వుకొని తన ఉత్తమత్వం తాను తెలుసుకోలేడు, తన చెల్లిదాలోటు, తన ప్రాణమిత్రుడు శ్యామలునిదా? ఈ రెండు జీవితాలు భగ్నమయితే తాను బాధ్యుడుగాక ఎలాగు? అసలు సత్యానికి దూరమైన వంకరలు భావాలు నిజమని తోస్తే, వాటినే నమ్మి జీవితం భగ్నంచేసుకోవడంలో ఎంత మంది ఆరితేరినారో!

శ్రీనివాసరావుకి వ్యవసాయంపైని మనస్సు పోవటంలేదు. సుబ్రహ్మణ్యం వచ్చి మాట్లాడడమే అపశ్రుతిగా తోచేది. వ్యవసాయమంతా వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలను కొన్నాడు.

బెజవాడలో అటూ ఇటూ తోచక తిరుగుతూ, వ్యవసాయంలో అన్నగారు ఒక్కరూ ఉన్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదా అనుకుంటుంది స్వర్ణకుమారి. అక్కడ ఆ సుబ్రహ్మణ్యం వచ్చి పలుకరిస్తాడు. వెఱ్ఱివాడు; పాపం! అతనికేమి తెలుసును, తన హృదయంలోని గాఢమయిన భయంకరమయిన ఈ ఆవేదన ఆ శ్యామంమీద కోపం ​కొద్ది ఈతన్ని తన జీవితంలోకి రానిచ్చింది. అవును. అందువల్ల తనతప్పేమి? తన జీవితపథమూ, తన ఆశయాలు; తన స్వప్నాలు గుర్తించలేని ఒక మూఢుడు తన జీవిత భాగస్వామి ఎట్లా అవుతాడు! ధైర్యమూ పట్టుదలా గట్టితనమూ లేని నీరసత్వపు ఆడది అవటంచేత తానిల్లా బాధపడుతోందిగాని, ధీరస్వభావలగు ఉత్తమ స్త్రీలు ఈ అటు నిటు ఆవేదనలలో అల్లాడి పోనేపోరు.

తన వ్యవసాయం ప్రారంభం అయి నాలుగు నెలలయింది. ఈ తోట వేయడంలో ఏమి కొత్తదనం ఉంది?

కళలో సర్వకాల నవ్యత్వముంది. విధానాలు కొత్తవి. కళలో పరిశోధన చెయ్యవచ్చును. “డాడాఇజమో, ప్యూచరిజమో, ఇంప్రష నిజమో, ఎప్పుడూ కళా ప్రపంచంలో ఉద్భవిస్తూ ఉంటవి.

వ్యవసాయంలో నవ్యత్వం లేదా! ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీతులు రావటంలేదా? కృషీవలుడు మాత్రం ఒక రకమయిన కళాస్రష్ట కాడా? కొత్తరకపు పంటలు అనేకులు పండిస్తున్నారు. స్రష్ట అయినవాడు తోటలు వేయడంలో కొత్తరకపు పూలు, పండ్లు ఎప్పటికప్పుడు కల్పించడంలేదా?

కళ మాయ! ఊహా ప్రపంచం మాత్రం వట్టి కల్పన ధరిత్రీ మాతృకృషి సత్యమయినది. అందువల్ల వచ్చే ఫలితం కళ్ళ ఎదుట మూర్తిస్తుంది.

ఈ ఆలోచనలతో శ్యామలరావు నుదురున చెయ్యి పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే సుబ్బయ్యగా రాయనదగ్గరకు వచ్చారు.

“నాన్నా! నానాటికి తీసికట్టు నాగంబొట్టు ఔతున్నావురా! ఏమీ తోచనమ్మ ఏతామెత్తటం ప్రారంభించిందట. డబ్బిచ్చి తద్దినంకొని తెచ్చుకుంటే వేయిచ్చినా వెళ్ళదట; అలా ఉన్నది నీ విషయం. కళ్ళు నూతులై పోయాయి. బోర యెండిపోయింది. రాత్రిళ్ళు దగ్గుతూ వుంటే నా గుండె గుభేల్లుమంటుంది.”

“నా వొంట్లో బాగానే వున్నదండీ నాన్నగారూ!”

“ఈ రోజుల్లో పెద్దవారు చెప్పటం చిన్నవాళ్ళు వినడం పోయిందిగా! అంతా జోల్షివిష్టులు, 'మేం చేతుల్తో నడుస్తాము; అది అందం' అంటారు. ఏక్షయయైనా వొచ్చిందంటే నుయ్యో గొయ్యో చూసుకోవాలి మేము వరప్రసాదులాంటి కొడుకని మీ అమ్మ గోలపెట్తోంది. మా కడుపున పుట్టింది నీ వొక్కడవు.”

“మీకు చాదస్తమండీ!”

"ఔను మాకు చాదస్తం. నీకు నిదానం. నువ్వెందుకు వ్యవసాయం తీసుకున్నావో నాకు తెలియకపోలేదు. బెజవాడలో రాధాకృష్ణయ్యగారి కుమార్తె స్వర్ణకుమారి అన్నగారితోపాటు వ్యవసాయం చెయ్యటానికి కుంతలూరు వెళ్ళింది కదా! ఆ అమ్మాయితోపాటు నువ్వూ ఎందుకు వ్యవసాయం చెయ్యకూడదని నీకు బుద్ధిపుట్టింది.”

“నాన్నగారూ! మీ రనవసరంగా నన్ను బాధపెట్టడానికివ్వాళ తలచుకున్నట్టుంది.” ​“ఓయి వెర్రివాడా! నేను బాధపెట్టటమేమిటి? చిన్నతనాన్నుంచీ ఆ అమ్మాయిని నీ కిస్తాననటం, నేనూ రాధాకృష్ణయ్యా ఈ విషయం నిశ్చయించుకోవడం, అందరు పెద్దలు ఆశీర్వదించటం జరిగింది. నువ్వు చదివే కాశీలోనే ఆ అమ్మాయి చదవటం, మీరిద్దరూ ఒకరినొకరు పెండ్లి చేసుకుంటామని ఉవ్విళ్ళూరిపోవటం లోకమంతా ఎరుగును.”

శ్యామలుడు మౌనం.

“నెలరోజుల క్రిందట ఆయన ఓ ఉత్తరం వ్రాశాడు. వాళ్ళమ్మాయి స్వర్ణకుమారి శ్రీనివాసరావుతోపాటు వ్యవసాయంచేస్తూన్న ఒక అబ్బాయిని పెండ్లిచేసుకోవడానికి నిశ్చయించుకుందనీ, తన కుమార్తె గట్టిపట్టుపట్టడం చేత తాము ఆమోదించవలసి వచ్చిందనీ, తన్ను క్షమంచవలసిందని ఆయన వ్రాశారు. నీ మనస్సు బాధపడి పోతుందని నీ కప్పుడా ఉత్తరం చూపలేదు.”

శ్యామలుని మోము వివర్ణం చెందింది. నీరసించి వున్న శ్యామలుడు తల దిమ్మిపట్టి ఫెళ్ళున విరుచుకొని పడిపోయాడు. “నాయినా!” అంటూ కొడుకును రెండు చేతులతో యెత్తి మంచం మీద పడుకోబెట్టి సుబ్బయ్యగారు “ఏమే, నీళ్ళే” అని కేకపెట్టాడు. “ఏమిటండీ! ఏమిటండీ!” అంటూ తల్లి కంగారుపడుతూ వచ్చింది. మంచంమీద శవంలా పడివున్న కొడుకును చూచి “ఓయి నాయనో, అమ్మో” అని కేకలుపెట్టింది.

“నోరు మూసుకో! వాడిప్రాణం కడగట్టింది. పరుగెత్తుకు వెళ్ళి డాక్టరు గారిని అర్జంటుగా రమ్మని కబురు పంపించు” అని సుబ్బయ్యగారు కొడుకు మొహంమీద నీళ్ళు గట్టిగచల్లి కుమారుడి నాడి పరిశీలిస్తూ అతని మొహం వకం పారచూచి కళ్లు చెమరించటం వల్ల పైమీద కండువాతో ఎడమచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు.

3

శ్యామలరావు కళ్ళు తెరిచాడు. తల్లివంక మొహం తిప్పి “ఏమీ లేదమ్మా! కంగారుపడకు!" అని లేవబోయాడు.

తండ్రి “నాయనా! వద్దు” అని వారించి కుమారుని మంచంమీద పడుకోబెట్టాడు. ఇంతట్లో డాక్టరుగారు వొచ్చారు. శ్యామలుని పూర్తిగ పరీక్షచేసి అతి బలహీనతవల్ల గుండె కూడ బలహీనంగా ఉందని, శ్యామలుని నరాలకుదెబ్బ తగిలిందనీ, పూర్తి విశ్రాంతీ, జాగ్రత్తగ వైద్యం చేయటం ముఖ్యమనీ చెప్పి “గ్లూకోజు” మందు ఇంజక్షను ఇచ్చి ఇంటికి వెళ్ళి మందులు పంపిస్తానని వాళ్ళందరకు ధైర్యం చెప్పి వెళ్ళాడు.

శ్యామలరావు లేవలేడు. కాళ్ళూ చేతులు సళ్లుకుపోయినవి. అధికాచమాన అల్పాచమానాలు మంచంమీదనే “నీరసం! నీరసం! కాఫీ" అని గంట గంటకూ నీరస స్వరంతో అడగడము ప్రారంభించాడు. అతని కేదో అపరిమిత భయం ఉదయించింది. మాట్లాడితే డాక్టర్ను పిలవమంటాడు. డాక్టరు ధైర్యం చెపుతూంటే ధైర్యంగా వుంటాడు.

ఒకసారతనికి వేగనాడి (Trachycordia) ఒకసారతనికి మందనాడి (Bradycordia) ఏమీ ఈప్రాణానికింతకంగారూ? తాను ప్రేమించిన స్వర్ణకుమారి ఇంకో ​అదృష్టవంతుని జీవితంలో భాగస్వామిని ఔతుంటే భగవంతు డేదో మంచిదారే చూపిస్తున్నాడు. బాధలేకుండ జీవితం మాయమైపోతే ఆ బాలిక దారి నిష్కంటక మౌతుంది. తాను లోకంలో లేని భావం ఆమెకు తోచినప్పుడు తన కోసం ఒకసారైనా విచారించకుండా వుంటుందా? ఈప్రేమ కాశించడం తుచ్ఛమా! పురుషునికి స్త్రీమీదనూ స్త్రీకి పురుషుని మీదనూ వుండే ప్రేమే జీవితంలోకల్లా ఉత్కృష్టమైనప్రేమ. ఆ ప్రేమ నిష్కల్మషమైతే భగవంతుని మీద ప్రేమే ఔతుంది. ప్రేమ - జీవితం భగ్నం చేసి పెట్టుకోడానికి తెచ్చిపెట్టుకున్న విషం! బంగారుపు గిన్నెతో నింపుకొని తాను తాగుతూన్నాడు - వ్యవసాయం- కళలు, ప్రేమ -

డాక్టరుకి శ్యామలరావు సంగతి చూస్తే కొంచెం భయమే వేసింది. మదరాసో, విశాఖపట్టణమో తీసుకెళ్ళితే ఉత్తమమని సుబ్బయ్యగారికి సలహా చెప్పాడు. తానుకూడా వస్తానన్నాడు. సుబ్బయ్యగారు కొడుకుతో నెమ్మదిగా “నాన్నా! విశాఖపట్టణం వెళ్దాంరా” అన్నాడు.

నీరస కంఠధ్వనితో శ్యామలుడు "ఏమీ జబ్బులేదండీ! రెండురోజుల్లో నెమ్మదిస్తుంది” అని అన్నాడు. కుమారుని కంఠంలోని నిస్పృహా, హృదయంలోని బాధా సుబ్బయ్యగారు కనిపెట్టకపోలేదు.

“నాన్నా నీ యిష్టం వచ్చినపని చేసుకో! నీకు కావలసిన డబ్బిస్తాను. బెంగపెట్టుకోకు. అనవసరమైన హృదయంలోని బాధ నిన్ను క్రుంగదీయుట అటు వుండగా కడుపున పుట్టిన నీవొక్కడమీదా ఆధారపడివున్న నన్నూ. మీ అమ్మనీ మహా బాధా నరక కూపాల్లో పడదోస్తుంది. నా జన్మంతా నీ మీదే ఆధారపడి వున్నది. ధైర్యం తెచ్చుకొని నన్ను రక్షించుకో!”

తన హృదయంలోని బాధతోపాటు, తండ్రిగారి బాధకూడా శ్యామసుందరునకు జబ్బును ఇబ్బడి చేసింది.

ఆనాడు అతి ఆవేశంతో సుబ్బయ్యగారు పెద్దఉత్తరం వ్రాసి రాధాకృష్ణయ్యగారికి బెజవాడ పంపించారు.

4

వెళ్ళిన దగ్గరనుంచి అన్నగారి దగ్గరనుండి వుత్తరాలే లేవని స్వర్ణకుమారి ఆలోచించుకుంటూ ఒక ఇంగ్లీషు నవల చదువుకొంటోంది. రాధాకృష్ణయ్యగారు కూతురు దగ్గరకు వచ్చి “స్వర్ణా! మీ చదువులన్నీ మా పెద్ద వాళ్ళ ప్రాణాంతకాలైనాయి” అని అన్నారు.

"ఏమిటండీ నాన్నగారూ! మీరు గూడ మా చదువులమీదే కత్తికట్టారా! నేను చదువుకుంటానని ముచ్చటపడితే మీకు చెప్పించమని ఎక్కడ వుంది?”

“అవును, నా నెత్తిమీదకుండ నేనే బోర్లించుకున్నానులే.”

"అలా మాటలాడుతున్నారేమిటండీ నాన్నగారూ!”

"ఏమీలేదు; ఇందుపల్లినుంచి ఉత్తరం వచ్చింది.” ​స్వర్ణకుమారి మౌనము.

“నాకేమిచేయాలో తోచకుండా వున్నది.”

"శ్యామలరావు తండ్రి సుబ్బయ్యగారు వ్రాశారు.”

స్వర్ణకుమారి తలవంచుకొని కాలి బొటన వ్రేలితో నేలరాస్తూన్నది.

"శ్యామలునికి చాల జబ్బుగ వుందిట!”

"ఏమిటండీ!”

"కుంతలూరునుంచి వొచ్చినప్పటినుంచీ శ్యామలరావు వ్యవసాయం ప్రారంభించాట్ట! చిక్కి శల్యమైపోయాట్ట. తండ్రి ఎంత చెప్పినా వినలేదట. నేను వెనక సుబ్బయ్యగారికి నువ్వు సుబ్రహ్మణ్యాన్ని పెళ్ళి చేసుకుండే విషయం ఉత్తరం వ్రాశాను. ఆ సంగతి యిన్నాళ్ళదాకా కొడుకుతో చెప్పకుండా మూడురోజుల క్రిందట, తండ్రి శ్యామలరావుతో చెప్పాట్ట. ఆవార్త వినటంతోనే శ్యామలుడు విరుచుకుపడిపోయాట్ట.”

“ఎలా వుందండీ!”

"డాక్టరు వైద్యం చేస్తున్నాడట! విశాఖపట్టణం తీసుకు వెడదామని అనుకుంటూన్నారట. మీ యిద్దరి చిన్నతనంలో నేనిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోవలసిందని సుబ్బయ్యగారు వ్రాశారు.”

“నాన్నా, మీరు కారు మాటాడించి ఇందుపల్లి ప్రయాణంకండి. అమ్మా, మీరూ, నేనూ తత్క్షణం బయలుదేరి వెళ్ళాలి. అన్నయ్యకీ శ్యామలరావుకీ స్నేహితుడు ఈ వూళ్లో డాక్టరు జగన్నాథరావుగారున్నారే ఆయన్నికూడ తీసుకు వెడదాం అన్నయ్యని తత్క్షణం రమ్మనిఉత్తరం వ్రాసి ఇందుపల్లి నుంచి వొచ్చిన ఉత్తరం జతపర్చి మనిషికిచ్చి పంపండి” అని కన్నీళ్ళతో కంగారుతో బట్టలు సర్దుకొంటోంది. రాధాకృష్ణయ్యగారు విసవిస వెళ్ళిపోయారు.

స్వర్ణకుమారి హృదయంలో "కాశీవిశ్వేశ్వరా! నీ సాక్షిగా మే మిద్దరం ప్రేమ ప్రతిజ్ఞ తీసుకున్నాము. నా శ్యామలుని రక్షించు. మేమిద్దరం కలిసి నీ దగ్గరకు వస్తాము, తండ్రీ” అని ఏడ్చినది. ఆమె కన్నులూ ఏడ్చినవి.

5

ఏదో నల్లని మత్తుకలలతో, మండే బాధతో ఈతకందని లోతులుగల నీరసంతో “అమ్మా” అంటూ ఓ మాటు తల్లిని కాళ్ళు పిసకమంటాడు. ఓ మాటు వొద్దంటాడు శ్యామం.

శ్యామలుడు ఆ అతినీరసములోనే ఏదో కారు చప్పుడు విన్నాడు. ఇంతటిలో డాక్టరుగారు వొస్తున్నారని సుబ్బయ్యగారు వచ్చి కొడుకుతో చెప్పాడు.

“స...రే...లెండీ....” అని శ్యామలుడు కళ్లు తెరిచాడు.

డాక్టరు విశ్వనాధంగారు డాక్టరు జగన్నాథరావుతో గది గుమ్మంవద్ద ప్రత్యక్షమయ్యాడు. జగన్నాధరావు గది గుమ్మంనుండి లోపలికి గబగబ వచ్చి "ఏమిరా, ​శ్యామ్! మహామొనగాడ వయ్యావుట! నీ స్నేహం యేడ్చినట్టే వుంది. కాస్త కబురు పంపకూడదు కాబోలు! ఏదీ, చెయ్యేదీ!”

జగన్నాథరావు చిన్నతనంలోనే ప్రసిద్ధి సంపాదించుకున్న డాక్టరు. శ్యామలునికన్న నాలుగేళ్ళు పెద్ద. శ్యామలుని గుండె బాగా పరీక్ష చేశాడు రక్తపుపోటు యంత్రంతో. ముంజేతినాడి పరీక్ష చేశాడు.

“గుండెలో జబ్బేమీలేదు. నరనీరసత్వమూ, బెంగా తప్ప ఏమీలేదు. పదిరోజులపాటు నా దగ్గర వుండటము, నాతో సినిమాలకు రావడము నేనివ్వాళ నాతో తీసుకువచ్చిన మంచి నర్సు చేతుల్లో ఉపచారం పొందటము ఇదీ వీడికి వైద్యము. ఒరే శ్యామ్! ఈ నర్సుని చూశావూ! చాలా ప్రజ్ఞావంతురాలు. నువ్వెరుగున్నమ్మాయేట. జనరల్ ఆస్పటలులో నర్సుల చేతిలో ఎప్పుడూ పడలేదు కాబోలు!”

శ్యామలుడు ఆనందము, బాధ సమ్మిళితమయ్యే నవ్వుతో స్నేహితుని అరచెయ్యి తన ముఖానికి అద్దుకున్నాడు.

“ఔరే శ్యామ్! మా నర్సు చాల అందమైనది సుమా! జాగ్రత్తగా వుండు, లేకపోతే నాకు ఈర్ష్యవొస్తుందిసుమా!”

"నీ మొహం! ఎప్పుడూ ఇలాంటి మాటలే” అని నవ్వుతూ అన్నాడు శ్యామలుడు. ఆ నీరసత్వంలో బలం కలుగుతున్న ఛాయలూ వున్నవి.

“నువ్వు కంగారు పడకపోతే ఆ అమ్మాయి ఎవ్వరో చెప్తాను.”

“నాకు నర్సెందుకురా!” మాట యింకా దిటవుగా వున్నది.

“ఈ రోజుల్లో జబ్బులకి నర్సులు లేకపోతే లాభంలేదు. అంచేత ఆ నర్సు పేరు చెప్తున్నాను. ఆమె పేరు బంగారం!”

శ్యామసుందరుని కళ్ళు మెరిసినవి. అతని గుండె దడదడ కొట్టుకున్నది. శ్యామసుందరుని చేయి తన చేతితో పట్టుకుని నాడిపై వ్రేళ్ళు యింతవరకూ వుంచివున్న జగన్నాథరావు.

"ఒరే! నాడి ఎంత వేగంగా కొట్టుకొంటోంది. తగ్గు తగ్గు. అబ్బా! ఏమి సంతోషమండీ, మా వాడికి బంగారు నగలుచూట్టం బంగారు రంగులుచూట్టం మా యిష్టం! ఈ నర్సు పేరు వొట్టి బంగారం కాదురోయి, బంగారపు కుమార్తె, స్వర్ణకుమారీదేవి. సుబ్బయ్యగారూ! ఆ నర్సునిలా పిలవండి!" గుమ్మం బైటనుండీ ఈ మాటలన్నీ వింటూన్న స్వర్ణకుమారి చిరునవ్వు నవ్వుకుంటూ గదిలోనికి వచ్చింది. స్వర్ణకుమారి చూపులూ, శ్యామసుందరుని చూపులూ జగత్సర్వమూ మరచి ఒకదానిలో ఒకటి లీనమైపోయాయి.

"మా నర్సుని చూస్తేనే నాడి బాగా ఇంప్రూవైందే; ఆవిడ పరిచర్యచేస్తే రేపే లేచి నడుస్తాడు, నీ డ్యూటీలో చేరమ్మా నర్సూ!”

ఇంతట్లో రాధాకృష్ణయ్యగారు, స్వర్ణకుమారి తల్లి మహలక్ష్మమ్మ గారు లోపలికి వొచ్చారు.

రాధాకృష్ణయ్యగారు, “ఏమోయ్ శ్యామం! జగన్నాథరావు రేపు ప్రొద్దున్నే మనమంతా బెజవాడ వెళ్ళాలని దారిలో చెప్పాడు. నీ వెనకటి మిసిమిదనం వొచ్చేవరకూ మా యింటిలో ​వుండాలి సుమా! తర్వాత నీ యిష్టం ముహూర్తానికి తరలి వచ్చేవరకూ మా యింటికి వచ్చినా సరే, లేకపోయినా సరే!”

ఆ రాత్రికి శ్రీనివాసరావు వచ్చాడు. శ్రీనివాసరావు జగన్నాథరావు. శ్యామలరావు ఉత్తమ స్నేహానందంలో తరంగాలులా పైకుబికారు. సుబ్రహ్మణ్యానికి మాట యివ్వలేదని వారందరితో చెప్పాడు శ్రీనివాసరావు. ఈ ఆనందంలో నీరసంమాట మరచిపోయి శ్యామలరావు కూర్చునే మాట్లాడుతూన్నాడు. స్వర్ణ దివ్యదేవతలా పడుకోమంటూ శ్యామలుని కేకలువేస్తూ అతని ఫాలంపై హస్తతలంవేస్తూ తన నర్సుపని బాగా చేస్తూన్నది.

మర్నాడు ఉదయం శ్యామలరావు గదిలోనికి నవ్వుతూ అతని నర్సు కాఫీ మందూ పట్టుకు వచ్చింది.

"శ్యామ్! మందు పుచ్చుకొని, కాఫీ పుచ్చుకో.”

“నువ్వు రావటమే మందు.”

"పొద్దున్నే అన్నయ్య నువ్వు వేసినతోట చూసి వచ్చాడు. నాకోసమే ఆ తోట వేశావు! నీ ప్రేమంతా ఆ తోటలోనే అన్నయ్యకు కన్పడిందట. నీ ప్రేమకు నేను పాత్రురాల నౌతానా శ్యామ్!”

"ఇలారా సొన్నసానీ! నా గుండెలు ఎలాంటి రాగాలు పాడుతున్నాయో విందుగానీ. స్టెథస్‌కోపుతోకాదు! నీ చెవితోనే విను.” ప్రపుల్లమైన కన్నులతో, మోముతో ఆమె అతని కౌగిలిలో చేరింది.

“మనం ఇద్దరం కాశీ వెళ్ళాలి, నేను. మొక్కుకున్నా”

“అత్మేశ్వరీ! సొన్నసానీ! నా సొన్నసానీ! కాశీకేకాదు సర్వ దివ్యక్షేత్రాలకు నీతో యాత్రలు సలుపుతాను. ఇది కలే అనుకుంటున్నాను.

"కలా, కళా?”

“సోన్! నిన్ను వదలి ఎలా ఉండగలుగుతున్నానో!”

“మనం బెజవాడలో లలిత కళాశాల ఎప్పుడు ప్రారంభించడం?”

"వ్యవసాయంలోని అందం రంగరిస్తూ త్వరలోనే”

శ్యామసుందరుడు ఆమె చెంపలుపట్టి కళ్ళల్లోకి చూసి ఆమె ఫాలం ముద్దు పెట్టుకున్నాడు.


​

పాడు దేవాలయం

ఆ ముసలితాత రోజూ ఊళ్ళోకి ముష్టికి వచ్చేవాడు. ఎక్కణ్ణుంచి వస్తున్నాడో ఎవళ్ళకి తెలియలే. పాటపాడడు. “బిచ్చంవేయమ్మా” అనన్నా అనడు. ఏమి మాట్లాడకుండా గుమ్మందగ్గర నిలబడ్తాడు. పొమ్మంటే పోతాడు. పొమ్మన్నదాకా నవ్వైనా లేకుండా ఆ గుమ్మం దగ్గిరేనుంచుంటాడు. ఊరంతా అడుక్కొని సాయంత్రందాకా మావూళ్లో చెరువుగుట్టమీద కూర్చుంటాడు. ఎప్పుడైనా యిటు అటూ కదుల్తాడేమోగాని సాధారణంగా ఎల్లా కూచుంటాడో అలాగే వుంటాడు. అతని గడ్డం మొక్కజొన్న కండి పీచులా తెల్లగా నెరిసిపోయింది. చిరిగిన పేలికలు కట్టుకున్నా అవి శుభ్రంగా వుంటాయి.

అతగాడి కళ్ళు చూస్తే మాత్రం ఆ తాత అంటే అందరికీ ప్రేమ పుట్టుతుంది. వాటిల్లో ఎన్నో ఆపేక్షలు తిరిగిపోతూ వుంటాయి. ఆ తాత వుండగా బాధపడుతూన్న జంతువేదైనా కనబడితే లేచి తన సంచిలోనుంచి గచ్చాకు వేవో పుచ్చాకు తీసి కట్లుకట్టాడు. అతను కట్లుకట్టిన జంతువులన్నీ రోగంపోయి ఆరోగ్యంగా వున్నాయన్నమాటే చెరువుగట్టుమీదా ఆ తాత కూర్చున్నప్పుడే రోగాలతో బాధపడుతున్న పశువుల తోలుకొని అక్కడకు చుట్టుపక్కల వూళ్ళవాళ్ళంతా వచ్చేవారు.

తిండిలేక మాడిపోయే అనేకమంది బీదవాళ్ళకి ఆ తాత కుంచాల కొద్దీ బియ్యం యివ్వడం మేం ఎరుగుదుం.

తన బియ్యం ఎక్కడ దాస్తాడో వంటచేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎవళ్ళకీ తెలవదు.

2

ఒక రోజున నేనూ నా స్నేహితుడూ బయలుదేరి మా వూరుకు దక్షిణంగా వున్న అడవిలోకి పోయాం. ఆ అడవిలో ఒక పాడు దేవాలయం ఉందని నాకు తెలుసును. ముళ్ళడొంకలు, పల్లేరు చిట్టడవి దాటి గుడిలోపడ్డాం. అక్కడ అన్నీ ఇటికెలే. ఉట్టిగోడలు మధ్య అసలు గుడితప్ప ఇంకేమీలేవు. నాలుగైదు విగ్రహాలుంటే అవన్నీ మా వూళ్లో కొత్తగా కట్టించిన గుళ్లోకి తీసికెళ్ళారు. కాని ఇంకా అక్కడ ఎన్నో రాళ్ళస్తంభాలు శాసనాలు చెక్కిన రాళ్ళు ఉన్నాయి. విరిగిపోయిన విగ్రహాలు చెక్కడాలు చాలా ఉన్నాయి. అందుకనే పురాతన శిల్ప పరిశోధక సంఘమువారు "ఇక్కడుండే వస్తువులు ఒక్కటీ ముట్టుకోకూడదని” గవర్నమెంటు ఉత్తరువు ఒక బల్లమీద రాయించి అక్కడ పాతేయించారు. ఆ గుడి చాల పెద్దది. ఆ చిత్రాలన్నీ చూపిస్తో నాకు తెలిసిన ఆ పాడు దేవాలయగాథ లేవేమిటో మా స్నేహితుడికి చెపుతూంటే సాయంత్రమైంది. ​సప్తమినాటి చంద్రుడు బాగా కాంతులు చిమ్మాడు. ఆ వెన్నెల్లో ఆ పాడు దేవాలయం మాకు చాలా అందంగా కనబడింది.

3

ఇంతట్లో ఒక గంట వినబడింది. ఇద్దరం హడలిపోయాము. ఆ అడవిలో ఖంగు ఖంగుమని గంటెక్కణ్ణుంచి వచ్చింది. ఎద్దులగంటేమో అని అనుకుని దేవతలు దెయ్యాలు జ్ఞాపకం వచ్చి ఇక యిక్కడ ఉండకూడదని అనుకుంటూ ఆ గోడలన్నీ దాటి బయటపడ్డాం. ఇంటికి వెడదామని దారిపట్టాం. చటుక్కున మళ్ళీ వినిపించిందయ్యా ఆ గంట! ఈ పట్టుగుళ్ళోంచే స్పష్టంగా మాకు వినుపించింది. ఒకళ్లమొఖాలు ఒకళ్లు చూసుకొన్నాం తప్ప కుండా ఇది ఏమిటో - అనే అనుకున్నాం.

గబ గబ దారిలోకి వచ్చి నిలిచాం. అయినా ఆ స్థలం వదల్లేక అక్కడే నిల్చొని చెవి యిచ్చి వినడం ఆరంభించాం. మాకు మంచి స్థాయిలో పాటలు వినిపించడం ప్రారంభించాయి. ఏమయితే అయింది, ఇంగ్లీషు చదువుకున్నాం, మా నిఘంటువుల్లో పిశాచాలు లేవు; మనకి మాత్రం భయం ఎందుకురా! తెల్లవాడైతే భయపడ్తాడా? పదంటే పదనుకొని ఇటూ అటూ చూస్తూ నెమ్మదిగా ఆ పాడుగుళ్ళో ప్రవేశించాం. గర్భగుడి ముందరికి వెళ్లాం. అక్కడ మాకు నీడల పంపిస్తూ అఖండం లాంటి దీపం కనబడింది. యిది కొరివిదెయ్యం కాదుగదా అనిపించింది.

గర్భగుడి మొదటి గుమ్మం దాటేప్పటికి పూర్వం విగ్రహం వుండే పీఠాని కెదురు గుండా పూజచేస్తూ ఒక మనుష్య రూపం కనిపించింది. లోపలి గుమ్మం దాటి వెళ్ళాం.

అక్కడ మాకు కలిగిన ఆశ్చర్యం ఏమిటంటే; మా వూళ్ళో ముష్టెత్తుకొనే ముసలితాతే అక్కడ పూజ చేస్తున్నాడు. స్పష్టంగా ఏమీ శబ్దస్వర దోషాలు లేకుండా సంస్కృత మంత్రాలు మహా ప్రవాహంలో ఉచ్ఛరిస్తున్నాడు. స్తంభాల్లా అలాగే నిలబడ్డాం ఇద్దరమూ. ఆ విగ్రహం లేని ఆ పీఠానికే పువ్వులతో పూజ చేశాడు. హారతి యిచ్చాడు, నైవేద్యం పెట్టాడు.

4

అందాకా అలాగే నిలబడ్డ మమ్మల్ని చూసి లేవగానే మాకా పువ్వులు ఇచ్చాడు. తలవంచుకొని ఆ ప్రసాదం శిరస్సుమీద ఉంచుకున్నాం.

నేను: ఎవరు నువ్వు? ఇక్కడేనా ఏమిటి నువ్వు వుండడం?

ముసలితాత మాట్లాడలేదు.

నా స్నేహితుడు: అయ్యా ఎన్నాళ్ళనుంచి పూజ చేస్తున్నారండి మీరు?

ఆ ముసలిభక్తుడు బ్రాహ్మణుడని కనిపెట్టాడు మావాడు.

మా ఇద్దరికేసి ఒక పదినిముషాలు చూశాడు తాత.

ఆ చూపులో ఏమీ కోపంలేదు.

ఇద్దరం ఎందుకో ఆయనకి నమస్కారాలు చేశాం. ​కూచోమని సైగచేసి మేం కూచున్న తరువాత అక్కడ పద్మాసనం వేసి కూచున్నాడు. మా ముసలితాత.

“నా పూర్వీకులు ఈ దేవాలయానికి పూజార్లు. ఎన్ని శతాబ్దాలనుంచి మా కుటుంబం తరతరంగా ఈ దేవుడికి నిత్యనైవేద్యాది పూజలు చేస్తోందో నాకు తెలవదు. చెడుకాలమున ఈ గుడి పాడైపోయింది. ఈ గుడిచుట్టూ ఒక పెద్ద పట్టణం వుండేది. ఆ సంగతి మీకు తెలుసుననుకుంటా. ఆ పట్టణం దానికి తోడుగా ఈ గుడి పాడైపోయిన తర్వాత మా పూర్వీకుల కుటుంబం ఈ సమీపాన్నే ఒక పూరిల్లు వేసుకొని దేవుడికి నైవేద్యాలు, పూజలు నిత్యంగా జరుపుతూ ఉండేవారు. చుట్టుపక్కల వూళ్ళవాళ్ళు ఏడాదికొకమాటు ఇక్కడ ఒక తిరునాళ్ళు వుత్సవం చేసేవారు. అల్లా నాలుగైదు తరాలు పోయేటప్పటికి నెమ్మదిగా ఆ తిరునాళ్ళు మాయమయ్యాయి..... మా పూర్వీకుల కుటుంబం ఇక్కణ్ణుంచిపోయి ఇక్కడికి పదిమైళ్ళలో వున్న... గ్రామం వెళ్ళారు. నువ్వెరుగుదువా వూరు. కాని వారు ప్రతి ఏకాదశికి వచ్చి ఇక్కడ పూజలు చేసేవారు. రానురాను మాముత్తాతగారి కాలం వచ్చేటప్పటికి ఆయన కుటుంబంతో ఏడాదికి ఒకసారి ఆ తిరునాళ్ళరోజులకి మాత్రం ఇక్కడకు వచ్చి మూడురోజులు పూజలు జేసి వెళ్ళిపోయేవాడు. అల్లాగే మా తాతగారు మా నాన్నగారు విధికృతంగా పూజలుచేసేవాళ్లు.

"నేను బియే చదువుతూండగా నా తండ్రిగారుపోయారు. చచ్చిపోయేటప్పుడు నన్ను పిలిచి ఏమో చెప్పాలని అనేక మాట్లనుకొని మళ్ళీ మానేస్తూ చివరకు ప్రాణం పోయే సమయంలో నన్ను దగ్గిరకు పిలిచి అస్పష్టంగా నాలుగు మాట్లాడి ప్రాణం వదిలాడు.

"నేను గుడిమాటే మరిచా. ఏభై ఐదేళ్ళదాకా గవర్నమెంటు ఉద్యోగాలుచేశా. చివరకు డిప్యూటి కలెక్టరు పనిచేస్తూ పిన్షను పుచ్చుకొన్నా, ఆ ఉద్యోగాలు చేసేరోజుల్లో ఆ తిరునాళ్ళ రోజుల్లో వైద్యులు చెప్పుకోలేని రోగం వచ్చేది. పెన్షను పుచ్చుకొని మా వూరు వచ్చాను. పూజలు పునస్కారాలు ఎన్నిచేసినా, ఎన్ని తీర్థయాత్రలు సలిపినా నాకు ఒక విధమైన మనో చాంచల్యము కలిగింది. మా చుట్టాలు మతిపోయిందనుకున్నారు.”

“ఇప్పటికి నాలుగేళ్ళ క్రితము మా కిక్కడవున్న దేవాలయం బాపతు వచ్చిన పొలము చూడడానికి ఈ వూరు వచ్చాను. ఆ సమయంలో ఈ గుడి చూశాను.”

"గుళ్లో అడుగుపెట్టానో లేదో ఏదో రాయి తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు ఏమి చెప్పను! ఈ గుడి అంతా కలకలలాడిపోయింది. అన్ని వెండి దీపస్థంభాలలో ఆవునేయి దీపాలు, గంటలు, ధూపాలు, బంగారు విగ్రహాలు కనబడ్డాయి. “వత్సా - ఎన్ని వత్సరాలు పూజలు లేక వుండనయ్యా?” అని స్పష్టముగా వినబడ్డాయి మాటలు!"

“అప్పటినుంచి నా ఆస్తి దాన ధర్మాదులు చేశాను. కొంత నాదూరపు చుట్టాలకు ఇచ్చాను. నా కుమారుడు చెన్నపట్టణంలో చదువుతున్నాడు. అతనికి కొంత ఆస్థి ఇచ్చాను. ఇక్కడకు వచ్చి ఈ విధంగా ఉంటున్నా!”

ఆ భక్తుడు మానివేశాడు. మేం బయటకువచ్చాం. మా ఆత్మలు అద్భుతానందంతో నిండాయి! దేశమంతా వెన్నెల నిండింది.


​

సూర్యసుత

ఆనాడు నేను త్రివేణీ సంగమం కడకు పోయినాను. యమునానదీ నీలప్రవాహంలో ఈదులాడే పెద్దపెద్ద తాంబేళ్ళు పడవల్లోనుండి యాత్రికులు జల్లు మరమరాలను గబుకు గబుక్కున మ్రింగివేస్తూ నీటి క్రిందికి ముత్యాల బుడగలలో మాయమవుతున్నవి. ఎన్ని యుగాలనుండి ఈ కూర్మాలు యమునాజలాల విహరిస్తున్నవో, ఆ నదీమతల్లికి కూర్మవాహిని అనిపేరు వచ్చింది. తెల్లని సుడిగుండాల గంగాప్రవాహం. నీలస్రవంతీ రమణీమణిని కౌగలించుకొనే ప్రదేశానికి మా పడవ వచ్చింది. నేను మంచి ఈతగాణ్ణి. పడవ యమునా కృష్ణగభీరాలపై పోతున్నప్పుడే తటాలున నీటిలోకి ఉరికి మునిగి లోతులకు దిగిపోయాను. నీలమణులకాంతి స్వచ్ఛగగనాంశుజాలము నన్ను పొదిగి వైచినట్లయింది. మందగజయానములగు కచ్ఛపాలు ఇటునటు నన్ను చూచుకొనిపోయినవి, ఆ నిర్మల శీతలజల ప్రదేశాలలో చిన్నపాపలా చిట్టిమీనంలా చేతులాడిస్తూ కాళ్ళు కదుపుతూ విహరించాను.

నీటిలోపలి లోతులలో ముందు కొంతదూరము సాగిపోయేసరికి శ్వేతరేఖాపుంఖాలు అతివడిగా నావైపునకు చొచ్చుకొని వచ్చుచున్నట్లయింది. నేను భ్రమించి నిస్తబ్ధుడనై చేతన ముడిగి ఆగిపోయినాను. ఆ వడుల్లో నేను వానాలపై గిరగిర తిరుగ నారంభించాను. భయముచే ఊపిరాడక ఒక్కనిమేషమాత్రం తన్నుకొని జలప్రవాహంపైకి వచ్చా. పడవలోని నా స్నేహితులు “అబ్బా, ఏమిరా! నువ్వింక కనపడవనే అనుకున్నాం. ఒక నిముషంపైగా నీటిలోవున్నావే!” అని అన్నారు. నావ దగ్గరకు వచ్చింది. అంచు పట్టుకొని నావతోపాటు గంగానదీ యమునానది కలిసే ప్రదేశంలోనికి వచ్చాను. గంగానది లోతులేదు. యమునలోతు.యాత్రికులు స్నానమొనరించే వీలుకోసం పురపాలకసంఘంవారు ఆ ప్రదేశాల నదికి చాలా లోపలిభాగం వరకూ కఱ్ఱలపాతి వానిపై పలకలను బిగించి నీటిపైనే దారి ఏర్పరచినారు. ఒక పురోహితుడు “త్రివేణీ సంగమస్థానే సకలపాప పరిహారార్ధం గంగా యమునా సరస్వతీ సంగమ స్నానం కరిష్యే" అని మంత్రాలు చదువుతుండగా మేమందరం స్నానాలుచేసి పవిత్రులమయ్యాము.

2

త్రివేణీ సంగమచిత్రం నామనస్సు కలచివైచినది. మరునాడు సాయం సమయాన మరల పోయి అంతర్వాహినియగు సరస్వతీధునీమతల్లిని దర్శించుదాముగాక! అని ​నీటిలోనికి ఉరికినాను. ఆ పవిత్ర ప్రదేశమంతా వెదికినాను. ఊపిరాడక బయటకువస్తూ మళ్ళా మునుగుతూ బంగారువర్ణ మెరసికొనిపోవు ప్రవాహమాల ఆ నీలిసుడుల్లో ఏ తెలివడుల్లో ఎక్కడైనా ప్రత్యక్షం అగునాయని ఈదులాడినాను. విసిగివేశారి ఒక్కయామం ప్రయత్నించి సంగమస్థానం కర్రలకడ తేలినాను. తలనుండి ప్రవహించే కాలువల్ని వేళ్ళతో తుడిచుకొంటూ నీటిపొరలు క్రమ్మిన కనుల మిటుకరిస్తూ ఎదుటచూస్తే ఎవ్వరూలేని ఆ ప్రదేశాన ఆప్రవాహాన ఈదుతూ ఒక బాలిక కానవచ్చింది.

కన్నులు తుడిచికొని మరలచూచా, నల్లని పట్టుకుచ్చుల వేణీభరం యమునా నీలజల ప్రవాహాల ఒరిసికొని కలిసిపోవగా మిరుమిట్లు గొలిపే బంగారం తీగె చేతులతో నీటిని వెనుకకు త్రోసుకుంటూ, నవ్వుమొగముతో ఆమె ఆ నీట తేలుతూయున్నది. ఇటూ అటూ ఏదైనా పడవ ఉందా అని చూచాను. నావలు గాని తీరాలబండిగాని, ఇతర మనుష్యుల దర్శనం గాని నాకు కనుచూపుమేర ఏవైపునా కనబడలేదు. కొంచెము ఆశ్చర్యం పొందాను. కోటసంగతి జ్ఞప్తికి వచ్చింది. అలహాబాదుకోటలో ఆంగ్లేయ కుటుంబాలు అనేకం ఉన్నవి. ఆంగ్లేయబాలిక ఎవరో ఈదులాడుతున్నది కాబోలు అనుకొని, మన దేశ స్త్రీలట్టి సంతోషాలకు పెట్టిపుట్టరుకదా అని నిట్టూర్పు పుచ్చి, ఆశ్చర్య హృదయాన ఆ బాలికనే చూస్తే నీటిలో నిలిచి ఉన్నాను.

ఇంతట్లో ఆమె నన్ను తనకడకురమ్మని సైగచేసింది. హృదయం దడదడమంది అది యేమిటనీ! నన్ను కాదు, నావెనుక ఎవ్వరైనా ఉన్నారేమో అని వెనక్కుచూచా. ఒక్కరి జాడాలేదు. మళ్ళీ ఆమె వైపే చూచా. ఆమె స్పష్టంగా నా వైపుచేయి విసిరింది. ఆ సాయంసమయాన ఆ ప్రవాహాల బంగారు సూర్యకిరణాలు ఆమె బాహువుల తళుకులకు ఎంతమాత్రం తులతూగలేవు. కొంచెము భయపడుతూనే బార యీతలో మకరంలా ఆమెకడకు పోయినాను.

ఆమె ఆంగ్ల బాలిక కాదు. చెవులకు కాంతుల మెరయు వజ్రాల కర్ణాభరణము లున్నాయి, మనోజ్ఞమైన మేఘాల మాటునుండి మేలమాడుతూ నవ్వే బాలభానుబింబంలా ఆమె ఫాలానముత్యాల పాపటబొట్టు వ్రేలాడుతోంది. మెలికలలో, నీలి తళుకులలో, వంపులమృదువులలో ముంగురులు, నీలి చాయలలో కలుస్తూ చెట్ల నీడల తిరుగాడే సూర్యకిరణంలా, బంగారు పట్టులా ఆమె వెనకనే వేణీభరం ఆ నీటిలో ఆమె చుట్టూ వ్యాపించి ఉంది. నీట ప్రతిఫలించే సంధ్యాంశువులులా ఆమె కన్నుల నవ్వుతూ పక్ష్మాల మాటునుండి నన్ను చూచాయి.

ఈమె ఒక గొప్ప బ్రహ్మసమాజక కుటుంబం బాలిక అనుకొన్నా! ఇంగ్లీషుభాష రాని బాలిక ఈత నేరుస్తుందా అని "ఎందుకు పిల్చినారండి!" అని ఆంగ్లంలో ప్రశ్నించాను. “నాకు భాషలన్నీ వచ్చునండీ! మీ తెలుగుభాష చాలా తియ్యనైన భాష. అందులోనే నాతో మాటాడవచ్చునులేండి” అని యామె అంది. నాకు కలిగిన ఆశ్చర్యానికి పరిమితి లేదు.

నేను: మీరెవరు? ఎందుకు నన్ను పిలుస్తా?

ఆమె: నువ్వు కంగారుపడకపోతే చెపుతా.

నేను: చాలా ధైర్యస్తుణ్ణి! ​ఆమె: - నేను సూర్యదేవుడి కూతుర్ని.

ఆ బాలిక నన్ను వేళాకోళాలు చేస్తోంది కాబోలు అనుకొన్నాను. తెలుగువచ్చిన ఈ బాలిక ఎవరు? ఈ ప్రయాగలో నివసించడానికి కారణం ఏమిటి? అని నా మనస్సు పరిపరివిధాలపోయింది.

ఆమె : నేను ఆంధ్రబాలికను కాదయ్యా! నువ్వు సరస్వతీనదీ ప్రవాహముచూడాలి అని వచ్చావు. నువ్వు చదువుకొన్నవాడవుకదా! సరస్వతీ ప్రవాహము కథలలో ఉంది కాని, ఇక్కడ కనబడుతుందా ఎందుకయ్యా ఇంతవరదాకా ఒకటే నీటి లోతుల్లో ప్రాకులాడుతున్నావు నువ్వూ?

నా హృదయంలో ఏదియో ప్రతిధ్వనించిపోయింది. నా మనస్సులోని సంగతు లీమె కెట్లా తెలిసినాయి? నా గుండె మహావేగంతో లోకాలు చరింపసాగినది.

నేను: మీరు చెప్పే సంగతులు నాకు అర్థంకావటంలేదండీ?.

“నేను సూర్యుని పుత్రికను. యమున మా అక్క! నేను రంగులమ్మాయిని. అప్పుడప్పుడు మా అక్క కెరటాలల్లో ఆడుకుంటూ ఉంటాను. నీకు నిజంగా అంతర్వాహినియగు సరస్వతే కనపడాలంటే నాతో రా!”

అని ఆమె నీటిలోనికి మునిగినది. ఆ నిర్మల నీరాలలో స్నిగ్ధమై, బంగారుచేపలా దిగంబరియై ఆ బాలిక స్వర్ణకాంతుల ఒరసికొనిపోతూ తన దేహం చుట్టూ వివిధ వర్ణాల వెలిగొందు వేణీభరవీచికలు వ్యాపిస్తూ ఉండగా మునిగిపోయింది. నాచేయిపట్టుకొని తనవెంట లాగికొంటూ నీటి లోతుల్లోకి దిగిపోయింది' ఆమె హస్తతలం నాచేతినిపట్టగానే, నా ఒళ్ళంతా విద్యుల్లతలు ప్రాకిపోయినాయి. అత్యంత శీతలమైనట్లుగా, మహోష్ణ ప్రవాహమైనట్లుగా శుభ్రమోహన గంధాలు అలమినట్లుగా, ఆమె స్పర్శ నన్ను ఏదో వివశత్వంలో ముంచింది. అలా ఆకర్షింపబడి ఆమె వెనుకే ఈదుకొంటూ నీటిలో మునిగిపోయినాను.

ఇరువురం ఈదుకొంటూ ఎన్ని లోతులకుపోయినామో! కొంతసేపటికి ఆమె భూమిపై నిలిచింది. నేనూ అచ్చటే ఆమె ప్రక్క నిలిచాను. ఆమె నా సర్వస్వం లాగుకొని చిరునవ్వునవ్వి, నాఫాలము స్పర్శించింది. నా ముఖాంచలాల చుట్టు వేళ్ళతో స్పర్శించి నా చుంబకంపైకెత్తి “ఏమయ్యా రసపిపాసీ! నీ హృదయంలో సరస్వతీనదీ ప్రవాహాలు దర్శించాలని దివ్యకాంక్ష కలిగిందికాదూ! నేను సూర్యసుతను. చంద్ర సూర్య మండలమధ్యస్థ శీతల పారాల సర్వరసాత్మకుడైన సూర్యదేవుడు అధివసించి ఉంటాడు. అతనికి నేనూ మా యమునా ఉద్భవించాము. గంగ సూర్యసహోదరి. సరస్వతీ నదీమతల్లిని సావిత్ర్యాత్మయైన సూర్యతనయ, గంగా యమునా సరస్వతీ సంగమం కావ్యచిత్రాగాన సంగమమే! ఈ త్రివేణీ సంగమ రహస్య జిజ్ఞాసువువైన నీయందునా మనస్సు లగ్నమైంది. నీకు నేను ప్రత్యక్షమైనాను!" అని ఆ బాలిక కిలకిల నవ్వింది.

నాకు అంతా అగమ్యగోచరం అయింది. ఈ బాలిక ప్రత్యక్షం అవడం ఈ రోజులలో ఎలా సాధ్యం? అది కథలలో మాత్రం ఉన్నది.

“అనుమానం ఎందుకు స్వామీ?” ​“ఇప్పటికే నాకు ఇదంతా మాయా! లేక ఈదలేక నేను నా ప్రాణాలు భౌతికంగా వదిలేస్తే నాకు నీ దివ్యదర్శనం అయిందా? ఏమీ తెలియక ఈలా నిలుచుండిపోయాను!”

“ఓయి వెఱ్ఱివాడా, నువ్వు కళాతపస్వివికావా?”

"కళకోసం, కళావధికోసం, కళాపరమార్థం కోసం ఎన్ని సంవత్సరాలనుండో మనస్సులో, భౌతిక జీవితంలో, హృదయంలో వెదుకుతున్నాను.”

"అందుకనేకాదా! నేను నీ ఎదుట సాక్షాత్కరించింది. రాత్రి త్రివేణీ సంగమ పవిత్ర దర్శనము చేతువుగాని!”

3

సూర్యసుతా! నువ్వు లలితకళాస్వరూపిణివి. నువ్వు కావ్యానందానివి. నీరూపమే గీతమై, నీచూపులే నుడికారమై నీ దేహలావణ్యమే మధురమత్తతారీతియై. నీ కాకలీస్వనాలే ఛందస్సులై, నీవే భావమై, నీ ప్రేమే రసమై నాకు దర్శనం ఇచ్చింది.

"ఓ సూర్యసుతా! ప్రణయదేవీ! ఈలా నాకీ త్రివేణీ సంగమం దగ్గిర ఎలా ప్రత్యక్షమైనావు? నేను మనుష్యుణ్ణి. నువ్వు దేవవనితవు! నాకు కల అయి వుండవచ్చును. సరస్వతీనదీ దర్శనం చేసి, ఆ చీకట్లో మేం ఇద్దరం పైకితేలి ఈదులాడుతూ, ఆమెచే ఆజ్ఞాపితుడనై అలహాబాదులో మా మకాముకు వచ్చాను.

“ఎక్కడికి వెళ్ళావురా?” “ఇంతసేపు ఈతేనా!” “మతి ఉన్నదా!” అనే ప్రశ్నలు స్నేహితులు వర్షం కురిపించారు.

నా రహస్యం ఎవరికి చెప్పను? ఇంత చిన్నతనంలో నాకు మతి పోయిందనుకుంటారా? అవి కాలేజీలు విడిచిన కొత్త సంవత్సరాలు. “బాపిరాజును మదరాసు మోదవాకం ఆస్పత్రిలో చేర్చండిరా” అంటారా!

ఆమె వారికెందుకు ప్రత్యక్షం కాకూడదు? నాతో మాటలాడిన విషయాలు వారితో ఎందుకు వ్యక్తం చేయరాదు.

కాని ఆమెను కలుసుకొన్నాను! ఆ నీటిలోతుల్లో బంగారు వెలుగులు ప్రసరించిపోతూ ఉండగా, బంగారు పద్మాలు తనబంగారు వేణీభరంలో దరించి తెల్లని హిమస్వచ్ఛ శరీరయై మకరవాహనయై, తెల్లని పద్మాలు అలంకరించుకొన్న జాహ్నవి కుడిచేత పట్టుకొని, నీలికలువలు నీలి జడలలో అలంకరించుకొని నిర్మలనీలాకాశ దృశరీరయై, కూర్మవాహనయైన యమునా దేవిచేతిని ఎడమచేత పట్టుకొని నాకు ప్రత్యక్షమైన సరస్వతీదేవీ, ఆ త్రివేణీ దర్శనము నిజముకాదా?

నా కా దర్శనం కాగానే ఆ నీటి లోతుల్లో ఆమెతో వారి ఎదుట మోకరించాను! వారు మమ్ము ఆశీర్వదించినారు. ఆ తర్వాత వారు మువ్వురూ మాయమయినారు. మేము ఇరువురమూ పైకి తేలివచ్చినాము.

“ఓయి శిల్పీ, మేము దివ్యవనితలం. మాలో కొందరికి మానవులపై ప్రణయ విలసనం కలుగుతుంది. నిన్ను నేను ప్రేమించినాను. ఇది విచిత్రమని అనుకోకు. కవివైన నీకు నా ప్రేమలోని నిజం తెలియదా రాజా!" అని ఆ బాలిక అన్నది. అప్పుడు నేను ​


“మర్త్యుడను నేనటే
అమరకాంతవు నువ్వటే
    నీకు నాకూ పొందు ఎట్లు?
కలల మునిగిన నేనటే
కలల మధ్యన నీవటే
    నాకు నీకూ చెలిమి ఎట్లు?
దైహికమ్మున నేనటే
దేహాన కావల నీవటే
    నీకు నాకూ కౌగిలెట్లు?”


అని నేను ఎవరో ఒక ఆశయకాంతను చంద్రికగా దూరాన నా స్వప్నాల దర్శించి నా చిన్నతనంలో గోదావరీ తీరాంగ్ల విద్యాశ్రమవాసినై పాడుకొన్నాను.

ఆ పాట ఇప్పుడు మళ్ళీ పాడితే ఆ బాలిక విని నవ్వుతూ నాతోపాటు యమునా జలాల తేలియాడుతూనే పాడింది.


“ఒక తారకాకాంతి
ఒక దివ్యలిప్తలో
వీడి నేలకు వచ్చె
    ఆ కాంతిపుంజమే
    ఆనాడు రెండయ్యె
రెండు కిరణాలలో
    ఒకటి నేనేనోయి
    ఒకటి నువ్వోయీ!
నువ్వు మర్త్యుడవైతి
నేను దివిజను సుమ్ము
    జన్మ జన్మాలుగా
    తన్మయకళాపూజ
    శిల్పిగా భిక్కుగా
    కవివౌతు నటుడౌతు
    పాటలో పదగతిలొ
    నన్ను గూర్చే పాడినావూ
    నన్ను గూర్చే ఆడినావూ
ఒకనా డజంతాను
ఒకనాడు ఆంధ్రపురి
    ఒకనాడు బెన్వొంటొ
    ఒకనాడు రోజెట్టి

​


    నాబొమ్మలే వేసి
    నన్ను శిల్పముచేసి
ఆరతిచ్చావురా
    ఆత్మనర్పించావు
    వెదుకుతూ వెదుకుతూ
    నిదరలేనీ కలల
నన్ను గూర్చే పాడినావూ
నన్ను గూర్చే ఆడినావూ
    ఈ నాటికీ జన్మ
    ఈ రూపు ఈ ప్రేమ!
ఈ త్రివేణిలో వచ్చినానూ
ఈవు నేనే సుమ్ము ఇచటా!”


అని పాడి పకపక నవ్వింది.

ఈ మాటలన్నీ స్నేహితులకు ఎలా వర్ణించి చెప్పగలను.

4

నా ఈ యౌవనంలో నాలోని ఏదోశక్తి నన్ను పరవశుణ్ణి చేస్తూ నా హృదయంలో రాగాలు పాడిస్తూ ఈలా ఈ త్రివేణి సంగమంకడకు కొనివచ్చింది.

అక్కడ ఈ బాలిక నాకేలా ప్రత్యక్షమైనది. నమ్మనా, నమ్మగలనా? నమ్మక ఏమిచేయను? ఈ బాలిక తన వేణిలో అలంకరించుకొనిన నీలి కలువను నాకు ప్రేమతో తీసి ఇచ్చింది. ఆ కలువపూవు పట్టుకునే మా బసకు వచ్చాను "అది ఎక్కడిదిరా ఇంత అందమైన నీలికలువ మన ఆంధ్రదేశంలో లేదు" అన్నారు స్నేహితులు. ఆ పూవునిజమే! ఆమె నిజంకాదా?

మేము ఇద్దరం ఆ రాత్రి విడిపోయినప్పుడు పకపక నవ్వుతూ ఒక్కసారి నన్ను గాఢంగా తన హృదయానికి అదుముకొని నా కనులమధ్య ముద్దిడి నీటిలో ఉరికి మునిగిపోయింది.

ఆ మరునాడు సాయంకాలం ఒక్కణ్ణి వెళ్ళినాను! ఆమె దర్శనమే లేదు. ఒక్కణే! అక్కడ ఆమెను "సూర్యసుతా! సూర్యసుతా!” అని పిలిచినాను.

ఏదో తీరని ఆవేదన. నేను చల్లగా మూర్చపోయాను కాబోలు.

నాస్నేహితులు నా కోసం వెదుకుకుంటూ వచ్చారు. నన్ను మూర్ఛలోనుంచి లేపడానికి ప్రయత్నించారు. నిష్ఫలం అయి, వెంటనే బండిలో మకాముకు తీసుకువెళ్ళి ఒక వైద్యుణ్ణి తీసుకువచ్చారు. ఆయన ప్రయత్నించి విసిగి వేశారి వెళ్ళిపోయాడు.

ఉదయం నాకు మెలకువ వచ్చింది. బలహీనతలేదు. జ్వరంలేదు ఒక స్నేహితుడు సూర్యసుత నా కిచ్చిన నల్లకలువను చూపిస్తూ "ఒరే! బాపన్నా!! ఎక్కడ సంపాదించావురా చెక్కుచెదరలే దిది?” అన్నాడు. ​నా గుండె మహావేగంతో మోగిపోయింది. బలవంతంగా నా స్నేహితులను ఆ పట్టణంలో నెలరోజులాపాను. ఆమె దర్శనం మాత్రం సున్న.

త్రివేణీ సంగమంలో ఈదాను. నీటిలోతుల్లో ఊపిరాడనంతవరకూ నిలిచాను! ఆ దినాన గంటలు ఊపిరాడింది. ఈ దినాన ఒక నిమేషమూ నీటిలో ఉండలేకపోతున్నాను.

5

మేమంతా తిరిగి మా ఊరు వచ్చి వేశాము. నేను చిక్కిపోయినానట. నాకళ్ళు గుంటలు పట్టెనంట. నా పెదవులలోని నవ్వులు ఇంకేడకో ఇంకిపోయినవంట!

నా ప్రేమ! దేహ సంబంధమైనదికాదు. అవునుకూడా! కామతృప్తి నేను వాంఛించానా? ఆ దివ్యబాలిక ఆ పరమసుందరి. నా సూర్యసుత నా చిన్ననాటినుండి నా కలలలో నా ఎదుట దూరాన తోచే వెన్నెలలరాణి సౌందర్యరసాదిదేవి. త్రివేణికడ దర్శనమిచ్చి నాకు తన పరమ సౌందర్య రూపంతో ప్రత్యక్షమై అలా మాయమైన ఆ బాలిక దేహము నేనెలా వాంఛించను? ఆమె నిజము కాదన్న ఆమె నాకు ప్రేమాంకితము చేసిన నీలికలువ వాడక, పరీమళమువీడక నా మంజూషలో దాగివున్నదే!

గయా కాంగ్రెసుకు సభ్యునిగా పోయి తీర్థయాత్ర సేవితుడనైన నా కీ పరమరహస్య సందర్శన మేమిటి? యీ ఆవేదనా జీవిత మేమిటి?

అవును, నా చిన్నతనాన్నుండి చంద్రకాంతి రూపిణియైన వెన్నెల బాలికను ప్రేమించాను. ఆమెకై పాటలు పాడాను. ఆమె నా హృదయంలో సౌందర్య పరమావధి. నా ఎదుట నేను దర్శించే బాలలు మామూలువారు. కొందరు ఎక్కువ అందాలవారు!

వట్టి దేహ సౌందర్యమా మనుష్యుడు జీవితంలో వాంఛించేది?

దేహ సౌందర్యము మనుష్యుడు కోరతాడు. అతనికి ఆశయమైన దేహ సౌందర్యము అతడు వాంఛిస్తాడు. కాని ఏ దివ్యముహూర్తంలోనో ఎవరో ఒక బాలిక, అతనికి సందర్శన మిస్తుంది. అతడు ప్రేమించక మునుపు అతని హృదయాన, అతని స్వప్నాల ప్రత్యక్షమయ్యే బాలికకు ఉన్నరూపం వేరు. యీనాడు తన సర్వస్వమునూ అద్భుతమై మహాశక్తివంతమైన ఆ ప్రేమాకర్షణ చేసిన వ్యక్తి రూపం వేరు.

నా కలలో ఉన్నవ్యక్తి మసక మసక చీకటి వెనక ఉండేది. నేడు త్రివేణి సంగమంకడ ప్రత్యక్షమైన ఆ నగ్నబాలిక ఈనాడు సుస్పష్టమైన ఆనాటి తెరవెనక బాలికే!

ఎవరీ మూర్తి? సూర్యసుత అనే పేరు ఏమిటి? నేను వర్ణ విన్యాస లీలాయోగిని, ఆమె వర్ణ విన్యాస కళాధిదేవి! నేనా? నేను కంఠాన మధురాలు సాగ, పుల్కల పొందుతూ గీతికల పాడుకొనే యువకుడను. ఆమె శబ్ద బ్రహ్మయైన సూర్యదేవుని అనుఁగు తనయ.


“సూర్యతనయవు నువ్వు దేవీ
సొబగులాడివికాదె నీవూ,
నీలోచనాలలో నీలిచూపులలోన
నిత్యభాసితమంట నిఖిలవర్ణాలటే ॥సూర్య॥

​


నీ నవ్వులో విరిసె నీ మాటలో వెలసె
నిర్మలరసానంద నిరతిశయకావ్యాలు!”


మేము బాలకులం ఒక కొత్తలోకం, ఒక కొత్తవేగం, ఒక కొత్త శక్తి ఎదుట. వెనకకువెళ్ళ మనస్సు ఒప్పదు. ముందుకు సాగిపోవ ధైర్యం చాలదు. ఆ ముందులో త్రివేణి ఉన్నది. ఆ వెనకలో త్రివేణి ఉన్నది. నేడు నేను దర్శించిన త్రివేణికి అర్థమున్నదా?


నదులుగా ప్రవహించే మా హృదయాలు నదములై పాశ్చాత్య దిశోన్ముఖాలైనాయి. హిమాలయ శిఖర సౌందర్యంలో భాగస్వాములమైన మాకు బయళ్ళు, అడవులు, రోగాలు, క్షుద, సిద్ధార్థ రాజకుమారునికి మల్లే దర్శనం అయ్యాయి.


పొలంలో కర్షకుడు, పొగగొట్టం పక్క కూలివాడు, ప్రాణంపోసిన ఇనప వస్తువులు, ప్రకృతిని కైవసం చేసుకొనబోయే ప్రజా హృదయం.


సూర్యసుతా! అగ్ని స్వరూపిణీ! ఆనందమూర్తీ! ఎక్కడే నువ్వు?

6

ఏ చదువు లానాటివి? ఈనాడు దేవతామూర్తివంటి నా గురువు నన్ను గంగా యమునా సరస్వతీ సంగమ సౌందర్య రహస్యం తన నిడివైన వెన్నెలలో గులాబి మొగ్గవంటి దేశికాంగుళితో చూపించినాడు.


“నీ వెవరవో బిడ్డ నిలిచినా వీ బయలులో
నీ జన్మవెనకేమి నీ జాతివెనకేమిరా?
వెనుక తెలియని నీకు వేగమెందుకు బాల
వెనక ముందుల శ్రుతికి వేయి అడుగులు ముందు!"


అన్న అతని ఆంగ్ల గీతము నాకు ఝల్లుమనిపించింది.


నీపరునది లేక నీవరు ఆనకట్ట లేదు, టెన్నెసీనది లేక టెన్నెసీ ఆనకట్టలు లేవు. అనేక యుగాలనాటి గోదావరికి ఈనాటి ఆనకట్ట ధవళేశ్వరం దగ్గిర! ఇంక ముందెన్ని ఆనకట్టలై సర్వప్రపంచమూ సస్యశ్యామలమౌనో!


నా సూర్యసుత మాయమైన యీ ఆవేదనతో మా వూరునకు పది మైళ్ళదూరంలో ఉన్న సముద్రతీరంలో కూర్చుండి ఉన్నా! నా పక్క ఎవరో కూర్చున్నట్లే తోచింది.


ఏదో మధురమత్తత నన్నలమివేసింది. ఏవో దివ్య పరీమళాలు నాకు వివశత్వం కలుగ జేస్తున్నవి. గజ గజ వణికినాను. తల నెమ్మదిగా తిప్పినాను. నా ప్రక్క సూర్యసుత నా వైపు ప్రేమపూరిత వీక్షణాలు పరుస్తూ కూచుని ఉన్నది.


“ను... ను... వ్వేనా!” అని నేను గద్గదస్వరంతో పలికాను.


“ఏమిటి అలా వణుకుతావు స్వామీ!” అని ఆమె ప్రశ్నించి నా మెడచుట్టూ తన వెన్నెల కిరణాల చేతులు పెనవైచినవి.


అది ప్రేమా! అది మహాద్భుత సౌందర్యానుభవమా? అది సర్వమానవ హృదయ ప్రవాహమా? ​ఆమె నాకు ప్రసాదించిన అథరోష్టామృతము ఆకాశ తేజస్వరూప క్షీరసముద్ర మథనజనితమేనా?

ఆమె మాటలు త్యాగరాజుస్వామి గీతాలా? పొలాల సాయంతనాల ఎరుపు వెలుగు అంచులు కలిసిపోవు పొలము పడుచుల వలపుల పాటలా? గోధూళిదూసరిత గోపబాలకుని పిల్లంగ్రోవిస్వనాలా? పాలకై కాలకుకట్టిన చిట్టిపగ్గాల లెక్కగొనక ముందుకురుకు ఆవుదూడల అంబారవాలా? గడ్డి కోసిన మాలెతల పవిత్ర కంఠగతక్రమ గాంధర్వమా? ధాన్యయంత్రాన పనిచేసి ఇంటికరుగు కూలీలజట్టుల గంభీర సంతోష నాదాలా?

"బాపూ! వచ్చానా? అంత ఆవేదన ఎందుకు, రానని?”

“నువ్వు దేవవనితవు, నా పూజ కైకొంటావు! నాకు సహధర్మిణివి కాగలవా దేవీ?”

“ఓయి అమాయక బాలకుడా! లేకపోతే నీకు త్రివేణీ సంగమంకడ ఎందుకు కనుపించాను?”

"కనుపించావు, నా హృదయాన్ని పువ్వు నలిపినట్లు నలిపావు.”

“ఓయి కళాతపస్వి! విను, అనుమానం నీ హృదయంలో ప్రవేశించింది. నేను మాయమయ్యాను. ముందుకు పోయేవాడు వెనక్కు చూచి, వెనక సంగతి తెలుసుకొని, వెనక్కు శ్రుతిగా ముందుకుపోవాలి. బయలుదేరే వూరు ఉంది. చేరే ఊరు ఉంది. విశ్వకళాకారునికి బయలుదేరిన ప్రదేశం తెరవెనక, చేరవలసిన ప్రదేశం తెరవెనుక, కాని వెనుక ప్రదేశాలు తెలుసును. ముందుచూపుకు గోచరమయ్యే ప్రదేశాలున్నాయి. అంతేకాని వదిలిన మజిలీకే మళ్ళీ చేరుతావా?”

"ఓసి దివిజబాలికా! నాకు వేదాంతం రాదు. కాని కళాతపస్వినై నిన్ను ప్రేమింపగలను. నీ దివ్యవినీలలోచనాలోని పరమ సౌందర్యాలు దర్శిస్తూ యుగాలు ఉండిపోగలను. నీ అద్భుత రేఖాసమన్వితాశయరూపం ఎదుట పవిత్రార్చనలో కాలాంతమువరకూ ఉండిపోగలను. నీ కాశ్మీర జామృతమసృణాధరాల నా కరకు పెదవులు అనంతముగా గాఢచుంబనా లీయగలను. సౌందర్యభావ దివ్యమూర్తమైన నిన్ను అదిమే నాయీ కఠిన దృఢతరాశ్లేషంలో నిత్యుడను కాగలను దేవీ! దేవీ!!" అన్నాను.

“అలాగునా! అయితే సందేహం ఎందుకు? నేను కళను, నువ్వు కళాతపస్వివి. మన సంయోగము లోకకల్యాణప్రదం కాదా?" అన్నది.

పిపాసార్తుడనైన నేనా సుధాకలశిని పొదవుకొన్నాను.


​

మెట్లు

ఆ మాలపిల్ల తెల్లబోయి చూచింది, తమ గూడెం బయట ఆగిన కారులోంచి దిగిన ముగ్గురు బాలికలనూ, ఒక యువకుడ్నీ! ఎంత చిత్రమైన బట్టలు కట్టుకున్నారు. ఎంత తెల్లగా ఉన్నారు. వాళ్ళు కారులోంచి దిగగానే ఏదో గుమ్మైన వాసన ఆ చుట్టుపక్కలంతా ప్రసరించింది!

ఈలా అనుకుని ఆ పదునాలుగేళ్ళ ఈడుగల బాలిక తనవైపు చూచుకుంది. ఉతుకు ఎరగని చిరిగిపోయిన తన పాత పోగులు పరిశీలించుకొంది. ఆ చిరుగుపాతే చీరలా వల్లెవేసుకుంది. అప్పుడప్పుడు తానూ తలగడుగు పోసుకుంటుంది. అయినా తన వొళ్ళు అలా గుమ్మున వాసనేస్తుందా.

ఆ దిగిన బాలికల బంగారపు ఒడలి కాంతులు చూచింది. తనదేహం కారు నలుపు! పళ్ళు మాత్రం తెలుపు. ఆ బాలికలు జుట్టు ఎంత అందంగా దువ్వుకొన్నారో! ఆ పూలో! అలాటి పూలే పూయవు తమ గూడెంలో.

వాళ్ళు వేసుకొన్న బంగారుహారం, చెవులకు పెట్టుకొన్న ఆ లోలాకులు, చేతుల ఆ సన్నని బంగారు గాజులు, అమ్మో, వాళ్ళు తొడుగుకొన్న ఆ చెప్పులేమిటి? కిరస్తానీమిసమ్మ తొడుక్కునే జోళ్ళకన్న ఎంత అందంగా ఉన్నాయో!

వాళ్లు కారెక్కివచ్చారు. అప్పుడప్పుడు దున్నపోతు స్వారి తప్ప తన కేముంది. వాళ్ళు ఎంత తియ్యగా మాటాడుకొంటున్నారు? మధ్య మిస్సమ్మ మాట్లాడే ఇంగిలీషూ మాటాడుతున్నారు.

తనతల సంతనాడు తప్ప నూనేమెరుగును. తంగేడు పూలు, పొలం గట్టున బంతిపూలు తప్ప తానుపూలేమెరుగును. శివరాత్రి తీర్ధంరోజున తాను గడ్డికోసి బజారులో జట్కావాళ్ళ కమ్మితే వచ్చిన డబ్బులో అప్పుడప్పుడయ్యకియ్యకుండా దాచుకొన్న అణా, అర్ధణా, కానీలు పోగుచేసుకొన్న పదణాల మూడుకానులతో కొన్న మాయ వెండి కడియాలు, మురుగులేగా తనకు!

ఆ బాలికకు యౌవనం తొంగిచూస్తున్నది. పదునాలుగేళ్ళయినా కాయకష్టంచేసే జాతి కాబట్టి త్వరగా ఈడురాదు. యౌవనం పొంగి పొర్లే ఆ ముగ్గురు నాగరక బాలికలకు కనుముక్కు తీరు లెట్లా ఉన్నా వయ్యారం దేహమసృణత్వము బంగారురంగు ఆ ప్రదేశం అంతా కాంతించాయి. ​ఈ మాలపిల్ల మాచి మోమురేఖలు శిల్ప సౌందర్యాలు, విశాల నయనాలు సినీమా తారలు చూచి ఉడుకుబోతు తనంతో కుంగిపోవలసినదే.

ఈనాడు మాలమాచి ఆ అందాల బాలికల చూచి తెలియరాని ఆవేదనలో కుంగిపోయి కన్నులనీరు తుడుచుకుంది.

ఆ రాత్రి మాచికి నిద్రలేదు. మాచికి పోతిగాడి సంబంధం కుదిర్చాడు తండ్రి. పోతిగాడు దున్నపోతులా ఉంటాడు. పోతిగాడు తనకు వద్దు. యీ మాలగూడెం తనకు వద్దు! చదువు. ఆ పిల్లలులా అవ్వాలి. అలా కారు ఎక్కాలి. అలాంటి నగలు, అలాంటి చీరెలు, అలా! అలా!

2

మాచెమ్మ స్కూలు ఫైనలు పరీక్షలో నెగ్గింది; తన ఊరు వచ్చింది.

"బాబూ! యీ వూరులో ఉండలేను" అంది. ఎంతమంది బతిమాలినా ఉండనంది. ఇరవదవ ఏడున ఖద్దరు చీరా, ఖద్దరు రయికా తొడుక్కొని హరిజనసుందరి మాచెమ్మ సంపూర్ణ యవ్వనంతో మాలపల్లి చివర కరణం గారి మామిడితోటలోని పూతపూచిన గున్న మామిడిలా ఉన్నది. కాకతిసీమ కాలోత్పల విగ్రహంలా ఆమె వికసించింది.

ఆమె ఎంత చదువుకున్నా రంగేమి మారుతుంది? ఎంత చక్కని చీరలు కట్టుకున్నా నల్లరంగును బంగారం చేయలేవు, రహస్యంగా ఇంగ్లీషు మాసపత్రికలు కొనుక్కొంటూ, అందు ఆంగ్ల అమెరికను స్త్రీలు అందాలు ఏలా సేకరించుకుంటారో చదివేది.

ఇంటిదగ్గిర పోరుపెట్టి తనగ్రామపు హరిజనసంఘంవారి సహాయంతో చెన్నపట్నం దుర్గాబాయమ్మగారి ఆంధ్ర మహిళాసభ విద్యాలయంలో ఎనిమిదేళ్ళు చదివి, మొదటి తరగతిలో కాశీ విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్షలో కృతార్థురాలైంది.

ఉచిత విద్యావేతనం సంపాదించింది, ఇంటరు చదవడానికి.

చదివే రోజుల్లో రెండు మూడు సంబంధాలు తండ్రి తీసుకొని వచ్చాడు. ఒక హరిజన బాలుడు ఇంటరులో నెగ్గినాడు. తాలూకాఫీసులో గుమాస్తా ఉద్యోగానికి, ప్రభుత్వపు ఉద్యోగాల సమితివారు ఎన్నుకొన్నారు. మాచమ్మ ససేమిరా నేను పెళ్ళిచేసుకోనంది.

ఆరోజు సాయంకాలం తన ఊరుబయట కనబడిన కారు, కారునుంచి దిగివచ్చిన అప్సరసలు, ఆ వయసుకాడు, వారి కిలకిల సంభాషణలు, ఆ పడుచుల వయ్యారినడకలు, వారిచీరలు, వారి నగలు, వారిదేహపు మిసిమితనం, ఆహా - ఆమె గజగజ వణికింది.

చిన్న బాలికగా స్నానం అంటే అసహ్యించుకొనేది. దుర్వాసన కొట్టే తాను చుట్టబెట్టుకొన్న పాత పేలిక తడపడం అంటే ఆమెకు రోషం వచ్చేది. సంతలో తెచ్చుకొన్న నూనె రాసుకోవడమూ అసహ్యమే!

అలాంటి బాలికకు ఆ మోటారుకారు ఆ మూవురు బాలికలు ప్రథమసోపానం పంక్తి అయ్యారు. ​ఆమెలో ఏమి స్పందించినదో! అదివరదాకా ఉన్న గూడెం మండిపోయింది. ఆమె చూపులో - ఆ పొలాలు నేలలోకి కుంగిపోయాయి. కాల్చిన పందిమాంసం ఎండుచేపలు రొయ్యలు కాలకూట విషాలై గంజి విషధార అయ్యింది.

మూడురోజులూ మాలగూడెంలో యమయాతన సలిపి, నాల్గవ రోజున మదరాసు వెళ్ళిపోయింది.

3

మాచమాంబ అనిపేరు మార్చుకున్నది. ఇంటరుపరీక్ష ప్రథమ తరగతిలో నెగ్గి విద్యార్థి వేతనంతో వైద్యకళాశాలలో చేరింది.

అందరితోనూ మాట్లాడేదికాదు మాచమాంబ. చదువుకొన్న కళాశాలలో అతి జమీందారికంగా మెలిగింది. ఎవ్వ రీ బాలిక, ఎవ్వ రీ మాచమాంబిక అని ఇంటరు విద్యార్థులు విద్యార్థినులు కళ్ళతో ప్రశ్నిస్తే, తాను మాలపిల్లనని చెప్పుకోలేకపోయింది. మంచి టాల్కం చూర్ణం, పలచని పెదవులరంగు, చక్కని సెంట్లు, పాముకుబుసములాంటి చీరలూ అవి కొనేందుకు వచ్చిన విద్యార్థి వేతనం చాలకపోతే, తిండి తక్కువ తిని అవన్నీ సంపాదించుకొన్నది.

వార్దా ఆశ్రమం వెళ్ళినప్పుడు హరిజన బాలిక అవడంవల్ల మహాత్ముని ఆశీర్వాదాలు, ఇతర నాయకుల అభినందనాలు పొంది, కొంత వేతనం సముపార్జించుకొని మదరాసు వచ్చింది. అక్కడ స్త్రీల వేషభాషాదులలోని నిరాడంబరత, స్నిగ్ధసౌందర్యమూ చూచి, సేవాగ్రామ ఆశ్రమంలో ఉన్నంత సేపూ ఏదో బాధకు లోనయింది. కాని ఏ దర్శనమైతే ఆమెను మాలపల్లికి దూరంచేసిందో ఆ ఆశ తిరిగి మదరాసుకు రాగానే ఆమెను తన పంధానే నడిపింపజేసింది.

బాలకుల పొగడ్తలలో "ఈ చీర బాగున్నది, నీవేషం మహాద్భుతం" అన్న ముక్కలే వినేదికాని “నువ్వు సౌందర్య రాణిని” అన్నమాట ఒక నాడూ వినలేదు.

ఒక తోటి విద్యార్థి ఎప్పుడూ మాచమాంబను అనుసరించేవాడు. అతడు ఆమెతో ఎంతో స్నేహం చేశాడు. ఆమెను సినిమాలకు తీసుకు వెళ్ళాడు. ఆమె దగ్గరగాచేరి రెండు మూడుసార్లు ఆమె ధృఢవక్ష నిధులపై హస్తతలం పారించి స్పర్శించి, అదిమినాడు. అప్పుడా బాలికకు వివశత్వం కలిగింది. ఒళ్ళంతా విద్యుల్లతలు ప్రసరించాయి. కాని ఆ బాలుడు తన్ను ప్రేమించి అలా చేయలేదనీ తన్ను క్షుద్రజాతి బాలికగా ఎంచి క్షుద్రజాతివారికి నీతి నియమాలుండవని యెంచి, వాడు ఈలా తన్ను అవమానం చేశాడనే భావం కలిగిందామెకు.

ఆమె అవమానంతో కుంగిపోయింది. తోకతొక్కిన భుజంగిలా బుస్సుమన్నది. మరునా డా బాలుడు సంతోషంతో పల్కరించగానే వానితో "ఓరి దుర్మార్గుడా, నేను హీనజాతిదాననుకదా, నీ పశుత్వానికి అడ్డంపెట్టననుకున్నావా? ఇక్కడనుంచి నాతో మాట్లాడకు, నువ్వు విషపు జంతువవు!" అని మండిపోయింది. ఆ యువకుడు తెల్లబోయి తలవాల్చుకుని వెళ్ళిపోయినాడు. ​ఆమె ఆనాటినుంచి తన తరగతిలో బాలకులతోగాని, తన కాలేజీలోని యితర తరగతుల యువకులతో గాని మాటలాడటం మానివేసింది.

ఒకనాడు మాచమాంబిక ఒక ఆచార్యుని ఇంటికి వెళ్ళింది. అప్పుడప్పుడు తెలియని విషయాలు చెప్పించుకొనడానికి విద్యార్థులు, విద్యార్థినులు తమకు వివిధ పాఠాలు చెప్పే వివిధ ఆచార్యుల ఇళ్ళకు వెళ్ళే అలవాటు ఉంది.

ఆ అలవాటు చొప్పున మాచమాంబ తానున్న బాలికా వసతిగృహం నుంచే బయలుదేరి తమ తరగతికి ఆచార్యులలో ఒకరి బసకు ఏదో పాఠం చెప్పించుకోడానికి వెళ్ళింది. ఆమె చదువుదీక్ష ఆ ఆచార్యులకు తెలుసును. ఆమె గ్రహణశక్తి తక్కువే, కాని, అది తెలుసుకొన్నంతవరకు నిద్రాహారాలు మానివేస్తుంది. తెలుసుకొని కాని ముందుకు అడుగులేయదు.

ఆ ఆచార్యులు మధ్యవయస్సు కలవాడు. ఆమె సౌందర్యం అతన్ని ఆకర్షించలేదు. ఆమె యవ్వనం, ఆమె దీక్ష, ఆమె దేహపుజిగి అతని హృదయాన్ని కలతపెట్టాయి. ఈ బాలిక ఎవరో పేదవారిబిడ్డ. కొంచెం అనునయిస్తే తన కోర్కెను ఎందుకామె తీర్చరాదు?

ఆ రాత్రి ఎనిమిది గంటలకు పాఠం ఆ ఆచార్యులు ఆమెను తన ప్రక్కనే సోఫాపై కూర్చుండబెట్టుకొని బోధిస్తున్నాడు. ఏ యదాలాపంగా వేసినట్లో తనచేయి ఆమెతొడపై వేసినాడు. ఆమె పాఠం చదివే దీక్షలో ఆ చేయి నంతగా గమనించలేదు. ఆ చేయి - ఆ చేయి నెమ్మదిగా ఆమె బొడ్డు క్రిందకు జరిగింది. ఆమెకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఆమె గబుక్కున అతనిచేయి తీసిపారవేసి, లేచి, ఆడు పులై “మీకు బుద్ధిఉందా, ఇదా మీరు పాఠం చెప్పడం!" అని ఆ పుస్తకాలన్నీ అక్కడే ఉంచి విస విస గది విడిచి వెళ్ళిపోయింది.

తన సొమ్ముసంచీ మొదలైనవి ఉంచుకొన్న అలంకరణపు సంచీ అక్కడే ఉండిపోయినందున తిన్నగా నడిచే తన వసతి గృహం చేరింది.

అందరు ఆచార్యులు అందరు విద్యార్థినులూ అలాగే చేస్తారా? లేక తనకొక్కర్తికే ఈ పరాభవమా? ఆమె కుంగిపోయింది. ఆ మరునాడు ఉదయం ఆ ఆచార్యులు ఆమె గ్రంథాలు, సంచీ అన్నీ పంపిస్తూ ఆ అలంకరణపు సంచిలో ఒక లేఖ ఉంచాడు.

"అమ్మాయీ, క్షమించు! ఇది నా అపచారం కాదు! నేను ఒంటివాడను. భార్యపోయిన మధ్యకాలపువాణ్ణి. వైద్యాలయంలో దాదులు నా కో విధమైన తృప్తి తీరుస్తున్నారు కాని సరియైనమందుకూ, ప్రకటనపు మాయమందుకు నాకు తేడా తెలిసిందికాదు. రాత్రంతా నిదరపట్టలేదు. నేను పడిన బాధ అనంతము! కంచె చేనుమేస్తే లోకం నాశనమే! నేను నలభై ఒక్క ఏళ్ళవాడిని నాకు భార్యలేదు. ఇద్దరు బిడ్డలు. ఇద్దరూ మేనమామలకడ బెంగుళూరులో చదువుకొంటున్నారు. నిన్ను గురించి విచారిస్తే నువ్వు హరిజన బాలికవనీ చెక్కు చెదరని శీలం కలదానివనీ తెలుసుకున్నాను. నువ్వు నన్ను వివాహం చేసుకో - నేను తెలుగు బ్రాహ్మణుణ్ణి! నువ్వు నన్ను ప్రేమింపలేకపోవచ్చును. కాని ఉత్తమ గృహిణీ ధర్మమే ప్రేమకాగలదని నా నమ్మకము. నీకు ఇష్టముంటే నీకున్న కుంకుమ పువ్వురంగు చీర కట్టుకొనిరా! లేకపోతే ఏచీర కట్టుకున్నాసరే! ఆలోచిస్తాను ​అనదలుచుకుంటే పువ్వులులేని తెల్లచీర కట్టుకురా! ఇట్లు క్షంతవ్యుడైన రావు" అని అతడు ఉత్తరం వ్రాశాడు. ఆయన పేరు డాక్టరు సి.పి.రావు.

4

మాచమాంబిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలయినది. భర్త డాక్టరురావుగారు నెల్లూరులోనే జిల్లా ముఖ్యవైద్యాధికారి అయినాడు. మాచమాంబ పేరు డాక్టరు మాచమాంబరావు. ఆమె అసిస్టంటు సర్జనుగా ఉన్నది. ఆమెకు ఆమె కాలేజీ విద్యార్థినిగా ఉన్నప్పుడే వివాహం అయింది.

డాక్టరురావు గురువుల వివాహ ఉత్తరం పదేపదే చదువుకొని మాచమాంబ ఆలోచించుకొన్నది. ఉత్తరము వచ్చిన మూడురోజులవరకు ఆమె కదే ఆలోచన. తాను హిందూ జాతి కాలికింద నలపబడుతూ ఉన్న మాలపిల్ల. డాక్టరురావుగారు బ్రాహ్మణుడు. పెద్దవాడయితే ఏమి. పదమూడు పన్నెండు సంవత్సరాలతేడా పెద్దతేడాకాదు. తనతోటి యువకులు తన్ను వివాహం చేసుకుంటారా? ఆరేడువందల జీతము. కారు కలిగిఉన్న భర్త - తన చదువుపూర్తి - తనకు కావలసిన చీరలు - నగలు కారు - తనచదువున కాయన కిరీటం కాగలడు!

ప్రేమా? తనకు ప్రేమ అంటే ఏమీ తెలియదు. డాక్టరురావు అంత అందమైనవాడు కాడు. అతన్ని తాను ప్రేమించగలదా? ప్రేమ అనేది జంతుధర్మానికి మానవ మనస్తత్వం రంగరించిన ఒక మందు. తాను ప్రేమించగలుగునోలేదో! ఏదైనా ఆయన్ను వివాహం ఆడడంవల్ల తనకు అన్నీ లాభాలే!

ఏకారణంవల్లనయితే ఏమి ఆ ఉత్తముడు తన్ను వివాహం చేసుకుంటానన్నాడు.

ఆమె మూడవనాడు కుసుంబాచీరకట్టుకు వెళ్ళింది. అందాకా వట్టి తెల్లచీర కట్టుకొని వెళ్ళేది. ఆ మరునాడు సాయంకాలం ఆమె పుస్తకాలు పట్టుకొని డాక్టరు రావుగారింటికి వెళ్ళింది, వారు పెళ్ళి విషయం అన్నీ మాట్లాడుకున్నారు.

పెళ్ళి రిజిష్టరూ అయింది, హిందూ వివాహం చొప్పున అయింది. వైద్యకళాశాలాచార్యులు, వైద్యాధికారులు మొదలైన వారెందరో వచ్చినారు. కాని ఆమె తన తల్లిదండ్రులనూ, చుట్టాలను ఎవ్వరినీ రావద్దంది.

భర్త తనకు ఈనాడు అన్ని సౌకర్యాలు పొందడానికి కారణం అయ్యాడు. కావలసినవి ముద్దినిసు ముక్కాలు చీరలూ ఉన్నాయి. చక్కని అతినవీనకరపు నగలు, అందమైన కారు, జిల్లా వైద్యాధికారి బంగాళా, ఇంగ్లీషు క్లబ్బు. అనుకున్నవి జరుగుతున్నాయి. కాని! కాని!

భర్తకు మొగం అందం కాకపోయినా ఇరవయ్యోవన్నె బంగారు చాయ. తాను గర్భవతి కావచ్చు. పురిటికి సెలవు పుచ్చుకొంటుంది. తన పై అధికారైన భర్త పురుడుపోయగలరని ఆమె కలలుగన్నది.

ఆమెకు కామతృప్తీ, భర్తకు కామతృప్తీ అవుతున్నది. భర్త ఒక విధంగా రసికుడే. తనకేమి తెలియదు రసికత! అందుకై ఎన్నో స్త్రీపురుష సంబంధ గ్రంథాలు చదివినది. కష్టపడే విద్యార్థినిగా తయారయింది. యీ విషయంలో కష్టపడే విద్యార్థినే. ​వారి వివాహం అయి మూడేళ్ళు నడిచింది. కాని వారిద్దరిలో యేదో అసంతృప్తి ఉన్నదని ఆమె గ్రహించేది. ఆమె యవ్వనంచూచి ఉద్భవించిన వాతావరణం చూడక, తొందరపడి ఆ బాలికను చేసుకొన్నాడు. తరగతి నల్లకుక్కను తెల్లకుక్కను చేసే ప్రయత్నం అయింది. మంగలి బ్రాహ్మణుడెట్లా అవుతాడు? అనాగరకజాతి స్త్రీ ఎంత చదువుకుంటే ఉత్తమ సంస్కారుని భార్య కాగలదు? అతని మొదటి భార్య జ్ఞాపకం వచ్చింది. బిడ్డలను అప్పుడప్పుడు బెంగుళూరు వెళ్ళి చూచి వచ్చేవాడు.

భార్య తన కౌగిలింతకు వచ్చిన మొదటి సంవత్సరం అతడు కామ తృప్తినందేవాడు. తరువాత అతడు ఆమెలో యేదోలోటును గుర్తింప సాగినాడు. ఆమె తన దేహం అతనికి అర్పించేది. కాని ఆమె ఎక్కడోఉండేది! ఆమెలేని ఆమె - దేహమాత్రమూర్తిగా తోచి అతడు వ్యధనొంది భార్యను తన పడకగదికి పిలిచేవాడుకాదు.

ఆమె బాధపడేది. అతడు వట్టి పురుషుడుగా తన్ను కోరేవాడు. తాను పూర్ణపురుషుని వాంఛించింది. అతడు పశువులా వచ్చి పశు తృప్తి పొంది తన్ను తన పడకగదికి పొమ్మనేవాడు.

5

ఒకనాడు లేడీ ఆస్పత్రిలో లేడీ అసిస్టంటు సర్జను డాక్టరు మాచమాంబారావుగారు ఒక స్త్రీ రోగిని వైద్యాలయంలో చేర్పించవలసి వచ్చింది. ఆమె గర్భవతి. ఆ రోగికి ప్రతిపురుడు అసాధ్యమై ప్రాణాంతమువరకూ వస్తున్నది. ఆ వచ్చిన స్త్రీ ఖద్దరు ధారిణి. ఆమెకు యేరోగమూ లేదు. కాని పురుడు మాత్రమే కష్టం. ఆమె ముగ్గురు ముత్యాలలాంటి బిడ్డలతల్లి!

వారిద్దరు ఈమాటా ఆమాట చెప్పుకొనడం ప్రారంభించారు. ఆ గర్భగుర్విణికూడా తన భర్తకు రెండవ భార్య. ఆమె తన భర్తను గూర్చి మాటకు రెండుసారులు చెప్పుకొని ఆనందించింది. ఆమె మహదానందము వైద్యురాలు మాచమాంబకు ఆశ్చర్యం కలుగజేసింది.

రోగి: డాక్టరుగారూ, మా వారికి వచ్చుజీతం అరవై రూపాయలయినా మా సంసారం యేదో గుప్తంగా లోట్లు లేకుండా జరుగుతున్నాదండి. ఈ యుద్ధంవల్ల ఖర్చు ఎక్కువైనమాట నిజమే. కాని యుద్ధభత్యం ఇంకో పదిరూపాయ లిస్తున్నారు. మాకు భూములవల్ల సాలుకు ఆరువందలు వచ్చునవి పంటలకు ఖరీదులు ఎచ్చి ఇప్పుడు పదిహేనువందలు వస్తున్నాయి.

డా. మాచ: ఇప్పుడు మీ సంసారం చక్కగా జరుగుతోందన్నమాటా?

రోగి: ఆ!

డా.మా: ఒక వారం రోజులలో మీకు పురుడు వస్తుంది. ఇంతవరకూ ఆలస్యం చేశారేమమ్మా?

రోగి: నేను మా వారిని ఏలా వదిలి ఉండగలను డాక్టరుగారూ. వారు వండుకొంటారు. పిల్లలను చూసుకోగలరు. మా సవతి పోయినయేడే నా పెళ్ళి. తర్వాత మూడేళ్ళవరకూ ​నేను కాపురానికి రాలేదు. తాలూకాఫీసు పని - ఎన్ని తాలూకాలో బదిలీ - తామే తమకూ, తమ ఇద్దరి బిడ్డలకూ వంట చేసుకొనేవారు. ఇప్పుడు నేను వారి నెల్లా వండుకోనివ్వగలను చెప్పండీ?

డా.మాచ: మీకు ఇద్దరు సవితిబిడ్డలా?

రోగి: అవునండి! నేను కాపురానికి వచ్చినప్పటినుంచి ఆ పిల్లలు “అమ్మా, అమ్మా” అంటూ నన్ను వదిలితేనా? నా బిడ్డలమీదకన్న వాళ్ళమీదే నా కెక్కువాపేక్షండి.

ఆమె పురుడు మాచమాంబరావు తానే స్వయంగా పోసింది. ఆమె భర్త కాపురంచేసే ఇద్దరు సవితి కూతుళ్లు, ఆమె స్వంతబిడ్డలు అందరూ ఆ బాలింతను చూడడానికి వచ్చారు. వారి ఆనందము వర్ణనాతీరము. డాక్టరు మాచమాంబారావు కన్నులనీరు తిరిగింది.

గర్భవతి అవడం ఎంత ఆనందం? గర్భవతులుగా ఉన్నప్పుడు స్త్రీలు అందవికారాలు పొందుతారు. అది అందవికారమా? అలా పాలిపోయి, లావెక్కి నీరుపట్టి కదలలేక ఆ స్త్రీలు దేవతా మూర్తులులా ఉంటారే! బిడ్డల కనడం పశుధర్మం. బిడ్డలకు పాలివ్వడం పశుధర్మం, బిడ్డలను రక్షించడం పశుధర్మం, బిడ్డలు పాలు తాగేటంతవరకు ప్రేమించడం పశుధర్మం. కాని అలా పెద్దవారైన బిడ్డలను, తల్లిదండ్రులను, చుట్టాలను? స్నేహితులను ప్రేమించడం? అది మానవధర్మం, దివ్యధర్మం.

అది వర్ణనాతీతం తన పొంకారైన వక్షోజాలు బిడ్డలకు ఎప్పుడు పాలియ్యగలవు? తెల్లని ఆ అమృతధారలు గబుకు గబుకున పుణుకగలదు?

ఆ బిడ్డలతండ్రి, ఆ బిడ్డలు తన గర్భాన మూర్తించడానికి కారణం తన భర్త! జిల్లా వైద్యాధికారి! ఒక బ్రాహ్మణుడు. తనకై క్రిందకు దిగినవ్యక్తి! తన్ను చేయిపట్టి మెట్లెక్కించిన దేవతామూర్తి - తన బిడ్డలకు తండ్రికావాలి. తన బిడ్డలు తన్ను “అమ్మా” అని పిలవరూ! డాక్టరుగారిని “నాన్నా” అని పిలవరూ! వారు తనకు సర్వనాగరికతలు ధారపోశారు. వారు దేవతామూర్తి. వారు భగవంతుడు. తానెవరు?

ఆ రాత్రి ఆమె సాధారణంగా అలంకరించుకొనే విధానంగా అలంకరించుకోలేదు.

ఆమె సాయంకాలమే తలంటుకొన్నది. నల్లటి తన పొడుగాటిజుట్టు వదులవాల్టడ వేసుకొంది. కనకాంబరాలను తలలో ధరించింది. చెవులదుద్దులు మాత్రం. మెళ్లో పుస్తెలతాడు, ఒక సన్నని బంగారు గొలుసు నుదట ఇంత కుంకుమ బొట్టు, బంగారు రంగురవిక, కుసుంబారంగుచీర కుసుంభారంగు గాజులు ధరించింది.

నల్లటి ఆమె మొగాన పౌడరు లేదు. పెదవులెఱుపు రంగు లేదు.

ఆమె రాత్రి వారిద్దరి గదికీ మధ్యనున్న తలుపు తెరవబోయి, అది వేసి ఉండటంవల్ల, వారి గదిలోకి వెళ్ళే ముఖ్య ద్వారంవెంటనే లోపలికి వెళ్ళింది.

ఆ జిల్లా వైద్యాధికారి పురుషుడు. కుంగి సోఫాలో కూర్చుండి చుట్టకాలుస్తూ ఏదో వైద్యపత్రిక చూస్తున్నారు.

మాచమాంబ తిన్నగా భర్త దగ్గిరకువెళ్ళి సోఫాదగ్గిర భూమిమీద మోకరించి భర్తవొళ్లో తలవుంచింది.

ఆయన తెల్లపోయాడు. ఎవరీమె? ఆ మాలపిల్లా! ​ఆమె సంపూర్ణమూర్తిగా, పూర్ణ భార్యగా వచ్చినదన్న ఒక పరమ శ్రుతి ఆయన హృదయంలో మారుమ్రోగింది. ఆయన గడగడలాడిపోయాడు! ఆమె ఎక్కడో ఏదో గ్రామంలో ఊరిచివర ప్రపంచాన్ని తెల్లబోతూ చూస్తూ ఉన్న అనాధ బాలికయై ఒక దేవునికై, ఒక పరమపవిత్ర నాధునికై, జీవితానికై చేతులు చాచి నిలుచుండిపోయిన బాలికయై ఆయనకు గోచరించింది.

ఆయనలోని పురుషత్వము, మానవత్వము, దివ్యత్వము భర్తుత్వము, జనకత్వం ఒక మహాపుష్పంలోని అన్ని రేకులై విప్పారింది.

అతడామెను తన హృదయయానికి గాఢంగా, లలితంగా, తమిగా గౌరవంగా, కామంగా, ప్రేమగా అదుముకొన్నాడు!

6

డాక్టరు మాచమాంబకు పండులాంటి ఆడపిల్ల పుట్టింది. భర్తగారి తల్లి పోలిక అట.

జిల్లా వైద్యాధికారి డాక్టర్ సి.పి. రావుగారు నల్లని తన మాలపిల్లలో భారతజాతియొక్క అడుగుమెట్టు చూచినాడు. పైమెట్టు అడుగుమెట్టు ఒకటే. భారతదేశంలో పంట పండవలసిన శాలిభూమి తన భార్య. ఆ నలుపు బంగారానికి రెండవఛాయ!

ఆమె హృదయం కోటిబంగారాల విలువ. ఆమె అమృతమూర్తి అయిపోయినది. ఆమె నీలనీరదగాత్ర అయిన పార్వతి! ఆమె ధరిత్రీమాత! ఆమె ప్రపంచాన్ని కరిగించే ప్రేమతో తన సవతి బిడ్డలను హృదయానికదుముకొన్నది.

తన బిడ్డకు తానే రొమ్ముకుడుపుతూ వైద్యరాజయిన భర్తను బ్రహ్మానంద వీక్షణాలతో చూస్తున్నది.


​

నేల

ఓ నేలా! మా తల్లీ! నీ కెంత దగ్గిరమ్మా మేము! నీకూ మా సుబ్బన్నకూ మధ్య చాపన్నాలేదు. నీకూ మా సుబ్బన్న దేహానికి ఒక చొక్కాగాని ఓ పంచగాని అడ్డంలేదు. నీకూ మా సుబ్బన్నకూ మధ్య నీలో నుంచి తీసిన ఓ నాపరాయన్నా లేదు.

మా సుబ్బన్న ఎక్కడినుంచి వచ్చాడు తల్లీ! నీ పిల్ల లందరూ నీలోంచే వచ్చారు. ఆకాశంలోంచి వచ్చిన కోటీశ్వరులు నీ రొమ్ముమీద నించోలేక, పడుకోలేక, కూర్చోలేక ఏ మూడంతస్తుల మేడలో కట్టుకుంటే ఏమి?

మా సుబ్బన్న తల్లెవరు? తండ్రెవరు? మా సుబ్బన్న దేవూరు, ఏ జిల్లా, ఏనాడు? మా సుబ్బన్న నడిగినా వాడే చెప్పలేకపోయాడు! హైదరాబాదు వీధుల్లో పెరిగాడు, హైదరాబాదు హోటళ్ళలో బల్లలు కడిగాడు, “చా లు” అందిచ్చాడు, హైదరాబాదు రిక్షాలు లాగాడు, హైద్రాబాదులో పేపర్లు ఇంటి ఇంటికీ పంచాడు!

మా సుబ్బన్న క్రింద పడుకుంటాడు. వాడువేసుకునేందుకు చాపలేదు, పక్కలేదు, పరుపులేదు, మంచంలేదు! వానవస్తే, ఎండకాస్తే; తడుస్తాడు, ఎండుతాడు. ఏ పంచనో నిలుచుంటాడు, ఏమూలనో పండుకుంటాడు!

హైదరాబాదు సిమెంటు రోడ్లు, హైదరాబాదు గల్లీలు మురుకు తూములు, సారాదుకాణాలు, పానుదుకాణాలు, కంపులు, ఈగలు, దోమలు, చేతులకఱ్ఱలు, బాకులు జంబియాలు సుబ్బన్నను అరికట్టలేకపోయాయి! దీనికి కారణం పద్దెనిమిదేళ్ళ ఈడువాడయిన సుబ్బన్న 1942వ సంవత్సరంలో మొట్టమొదట ఉద్భవించిన సైకిలు రిక్షాలలో ఒక దానిని తొక్కుతూ అద్దెవసూలు చేయడంలో వచ్చింది.

2

సుబ్బన్నకు ఉరుదూ తెలుగు, తెలుగు ఉరుదూ, తెలుగు కన్నడం, కన్నడం ఉరుదూ, ఉరుదూ కన్నడం, మహారాష్ట్ర కన్నడం, కన్నడ మహారాష్ట్రం - మహారాష్ట్ర ఉరుదూ, తెలుగు మహారాష్ట్రం, మహారాష్ట్ర తెలుగు, తెలుగుకన్నడ ఉరుదు - తెలుగు కన్నడం, తెలుగు కన్నడ ఉరుదువగైరా వగైరా అన్ని భాషలు వచ్చును.

ఆరోజు రిక్షాలో ఇద్దరు మహారాష్ట్ర బాలికలను తీసుకుపోతున్నాడు. మాట్లాడుకున్నది పాంచణా పైసలు. అక్కడ దిగగానే ఒక అణా ఎక్కువడిగాడు! ఆ బాలిక లిద్దరూ మండిపడ్డారు. “ఏమిరాపందీ! నువ్వు చదువుకోక పోవడం మూలాన నీబుద్దులు ​మురికిలో పొర్లేపందిబుద్దులు" అని ఆ బాలిక లిద్దరూ ఆ అయిదణాలు రిక్షాముందు నేలమీదపడేసి విద్యాలయంలోనికి చక్కాబోయారు.

అలాగే మా సుబ్బన్న నిలబడిపోయాడు! వాడికున్న ఆ కొంచెం మనస్సు ముక్కముక్కలై పోయింది. “నేను పందిని! నేను మురికిలో పొర్లుతాను! నేను పందిని! నావి పంది బుద్ధులు!” వాడి ఆలోచన, వాడి మానసిక ప్రపంచం చుట్టూ రెచ్చకొట్టబడిన తేనెటీగలా తిరిగింది.

ఓ నేలతల్లీ, నీ కుమారుడు సుబ్బన్న కళ్ళళ్ళో వేడినీళ్ళు తిరిగిన సంగతి నువ్వు చూశావమ్మా! ఓ నేలతల్లీ ఎంతమందమ్మా నీ బిడ్డలకు ఈలాంటి అవమానాలు?

కోటీశ్వరుల దొంగమార్కెట్టులలో వర్తక నీతి ప్రకారం తమ ఆత్మలకు విషం, మకిలీ, దుర్గంధము పూసుకొని మానవ జీవిత కల్మశంలో పందుల కన్న అధ్వాన్నంగా, లుకలుక పురుగులకన్న నీచంగా ఓ లాడినవారు ఆకాశంలో ఎగిరే అందమయిన పక్షులాతల్లీ! ఈ ఆలోచన సుబ్బన్న హృదయంలో పుట్టుదామని ప్రయత్నించింది కాని వాడు చదువుకోలేదు, వాడు కవిగాడు, ప్రభుత్వోద్యోగికాడు!

సుబ్బన్న వేడి కంటినీరు తుడుచుకునేందుకు పైనకండువా అన్నాలేదు. జుమారత్ బజారులో అమ్మేబట్టలు నేల సంబంధమైనబట్టలే. అవి ఇస్త్రీలు ఎరగవు, మా సుబ్బన్న చొక్కా చిరుగులతో ఇరవైఏళ్ళ జీవితంతో, ఇరవై ఏళ్ళ చెమటలతో, మురికితో మానవజీవిత కష్టనిష్టూరాలతో చివికి చచ్చుదారాలపోగులైన పాత! రెండణాలకు జుమారత్ బజారులో సుబ్బన్న కొన్నదే.

“నేను పందిని, సదువురాదు!” ఆ రిక్షాను సుబ్బన్న ఆ రిక్షా యజమానికి తిరిగి ఇచ్చేశాడు.

ఓ నేలతల్లీ! గోలుకొండ పోయేదారిలో పొలంలో నీ హృదయంపైన పండుకొని మా సుబ్బన్న వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి నీకు జ్ఞాపకంలేదూ! ఓ నేలతల్లీ! నీ మనస్సులో నిర్మలంగా ప్రత్యక్షం అయ్యే ఉస్మాన్ సాగరులోనా నీ సుబ్బన్న చచ్చిపోదామని దిగాడు? దిగినమాట వాస్తవమే మోకాలు లోతుకుపోయాడు; నడుంవరకు దిగాడు. రొమ్ము ములిగేటంతవరకూ ముందుకు నడిచాడు. కంఠం నీళ్ళతో మేలమాడింది. అటు చూచాడు ఇటు చూచాడు, దూరంలో ఉన్న నీ వక్షోజాలయిన కొండలు చూచాడు, నీ నవ్వు లైన పువ్వుల చెట్లు చూశాడు. నీ ఆలోచనలైన పొలాలు చూచాడు! "రామ రామా” అని ముందుకు నడిచాడు.

3

కాని ఓనేలతల్లీ! అక్కడ నువ్వు కొంచెం పైకిఉబికి వున్నావని వాడికేం తెలుసు! నీరు కంఠంనుంచి రొమ్ముకిందకు దిగింది. ఇంకా ముందుకు వెడితే నడుం కిందకు వచ్చింది. మాసుబ్బన్న ఎదురుగుండా దూరంగా ఉన్న ఆ కొండలు చూచాడు. ఆ గుట్టలావతల యేమి వుంటుంది? పొలాలు, గుట్టలు, వాని అవతల ఇంకా పొలాలు, గుట్టలు, అరకలు కట్టుకొని వ్యవసాయాలు, పశువులు, పొలాలు, పూలచెట్లు, గ్రామాలు, ​హైదరాబాదు వంటి పట్టణాలు, రైళ్లు, మోటార్లు అట్లా అట్లా తాను వెడతాడు. ఎక్కడ, భూమి ఆఖరైతే అక్కడ ఆగుతాడు. ఆ తర్వాత ఆకాశమో యేమో!

మా సుబ్బన్న వెనక్కి తిరిగి గట్టెక్కాడు ఓ నేలతల్లీ! నీ హృదయం మీదే నడిచాడు మా సుబ్బన్న. ఉన్న రెండు పాతలు వంటిమీద ఆరాయి. కడుపులో ఆకలి దావానలం అయినా చెయ్యిచాచి దేహి అని ఒక్కణ్ణి అడుగలేదు. కాని ఓ నేలతల్లీ! నీ బిడ్డలింకా అక్కడక్క డున్నారుసుమా! మా సుబ్బన్న కింత గంజో, ఇంత పిడచో నాయనా తాగు తిను అన్నారు. మా సుబ్బన్న ముందుకు సాగిపోయాడు.

ఓ నేలతల్లీ! నీ బిడ్డలైన తేళ్ళు మా సుబ్బన్నను కుట్టలేదు! పాములు కరువాలేదు! పెద్దపులులు ఘాండ్రుమనలేదు. కాని నీ సవితిబిడ్డలైన పోలీసు వాళ్ళు, భూకామందులు, ఏదో చదువుకొన్నవాళ్ళు మా సుబ్బన్నను చూచి ఎవడురావీడు అనుకున్నారు. కోటీశ్వరులకోసం వేసుకొన్న రైలుపట్టాలు కూడా నీ బిడ్డలకు పనికివస్తాయా ఓ నేలతల్లీ! అలా రైలు పట్టా మార్గమే పుచ్చుకొన్నాడు మా సుబ్బన్న. కతిపయ ప్రయాణాలు చేస్తూ హైదరాబాదు చెల్లెలైన పూనాచేరుకున్నాడు.

ఓ నేలతల్లీ! నీ అనుగు కుమారుడు సుబ్బన్న పూనాలో ఏమి చెయ్యాలి? రైలుదగ్గిరనుండి ఊళ్ళోకి సామాను తీసుకువెళ్ళే కూలివాడయ్యాడు. సుబ్బన్న బట్టలు చూస్తే దొంగ అనుకున్నారు. మొహంచూస్తే హరిశ్చంద్ర సంతతి అనుకున్నారు ప్రజలు.

ఒక మహారాష్ట్రుడు తన ఇంటిలో పనివానిగా ఉండమన్నాడు. ఓ నేలతల్లీ! ఆ యజమాని నీ సుబ్బన్నకు గుండులాంటి ఖద్దరు పొట్టిలాగూ, చొక్కా ఖాకీరంగువి ఇచ్చాడు. కాని ఆ బట్టలు నీరూపమే, నీరంగే! నువ్వే నీ ప్రియపుత్రుణ్ణి పొదువు కొన్నావు.

నువ్వు నీలో నవ్వుకున్నావు నేలతల్లీ! నీమీదే పడుకొని నీ పుత్రుణ్ణి హృదయానకు అదుముకునేదానవు. ఇంటివారు క్రిందపడుకునే సుబ్బన్నను చూచి తిట్టేవారు, చివాట్లు పెట్టేవారు వాళ్ళకేమి తెలుస్తుంది మీ ఇద్దరి మధ్యనా ఉన్న చుట్టరికం?

క్రిందపడుకొనే మనుష్యుడు దొంగ అవుతాడా నేలతల్లీ! వర్తకమని, వడ్డీ అని, పెట్టుబడి అని, పెత్తనమని; కొట్టుపెట్టి, రవాణాలుచేసి, దిగుమతులు దింపి, మిల్లులు, పరిశ్రమలు పెట్టి నీ బిడ్డల రక్తం త్రాగే కోటీశ్వరులు దొంగలుకారు? వాళ్ళు దొరలు, యజమానులు, ఖామందులు, మాలిక్‌లు, జమీందారులు, సంస్థానాధీశ్వరులు, ఫోర్డులు, రాఖ్ ఫెల్లేరులు, బీవర్‌బ్రూకులు, చర్చిల్లులు, అమెరీలు, హిట్లరులు, ప్రాంకోలు, నవాబులు, జాగీర్‌దారులు, వారు దేవతాపుత్రులు, నీ బిడ్డ సుబ్బన్న నేలపుత్రుడు.

సుబ్బన్న దొంగతనం చేయగలడా నేల తల్లీ? అతని యజమాని యింట్లో వెండిగిన్నె పోయిందే అనుకో! అది సుబ్బన్న కెందుకు? నీలోనుంచి ఉద్భవించిన మోదుగ, అడ్డ. అరటి, తామర, మఱిఆకులలో తినే సుబ్బన్నకు వెండి గిన్నా? నేల తల్లీ! నీ గర్భంలోంచి వచ్చిన వెండి, బంగారము, రేడియము, ప్లాటినము దేవతలు లాక్కొన్నారు కాదూ. అవన్నీ సత్యవంతులయిన నీ బిడ్డలు కూలీలు, పొలం కాపులు, బిచ్చగాళ్ళు, గుంపుల వాళ్ళు, అడవి వాళ్ళు, ఊరిబయట విసరి వేయబడ్డ వాళ్ళు, బట్టలుదికే వాళ్ళు, పాయిఖానా ఎత్తేవారు, కుండలు చేసేవారు, దేవతల ముఖాలు నిష్కురం చేసేవాళ్ళు వాళ్ళకందరికీ ఉపయోగించిననాడు కాదూ నీ సొమ్ము నీ కవడం! ​నీ సుబ్బన్న మాలిక్ ఇంట్లో వెండి గిన్నె పోగానే సుబ్బన్న తీశాడని అన్నారే, వారి హృదయం రాయి కాదు, రప్పకాదు, కెమికల్ లేబరేటరీలో తయారయ్యిన విషపుబాంబుగాని!

అల్లాఅంటే ఊరు పేరులేని నీ అనుగు కుమారుడైన సుబ్బన్నకు వారేమంటున్నారో అర్థమయిందా నా నేలతల్లీ!

ఎన్ని దెబ్బలు కొట్టారువాళ్ళూ, దేవతలయిన పోలీసులూ! నీ సుబ్బన్నకు తిండి ఉందా? వంటినిండా పడిన గాయాలకూ, ఆ గాయాలవల్లా, పై గాయాలు కాకుండా కమిలిపోయిన దెబ్బలవల్లా వచ్చిన జ్వరానికి మందు వుందా నేలతల్లీ?

మేజస్ట్రీటు కోర్టులో కేసు పెట్టారా? ఆ కేసు జరుగుతుండగానే ఆ గిన్నె - ఆ వెండి గిన్నె యజమానురాలు జాగ్రత్త కోసం ఇనప్పెట్టెలో పెట్టి ఆ విషయం మరిచి పోయిందా? అది మళ్ళీ కనబడిందా. ఆ విషయానికి ఆ యిల్లాలు ఒణికి వెండి గిన్నె దొరికిందని మేజస్ట్రీటుగారికి కబురు పంపిందా? అయ్యో నేలతల్లీ! సుబ్బన్న ధర్మం నీకు తెలుసును.

తాము చేసిన అన్యాయానికి తలెత్తుకు తిరిగిన ఆ మాలిక్ హృదయంలో ఇంత సీసం ఉందేమో! సీసం ఉన్నా నయమే తల్లీ! మనుష్యుల తెలివితనపు రాక్షసత్వం ఉంది. అది నిజం!

4

ఓ నేలతల్లీ! నీ సుబ్బన్న ఆ యజమానుణ్ణి వదలి నడచి నడచి బొంబాయిచేరేడూ! బొంబాయిలో కొందరికూలీల ధర్మమా అని ఓ మిల్లులో చేరాడూ! ఆ మిల్లులో ఎన్ని గడబిడలు ఆ మిల్లు కొందరి ధనేశేశుల కడుపులదా? వాళ్ళు ఈ కూలికీటకాల ధన మాన ప్రాణాలకు అధికారులా తల్లీ! నీ బిడ్డడు సుబ్బన్నకూ అదే గతి! పని చేయడానికి చీమకూ కూలీకి అతని కడుపు గుప్పిడా! తల్లీ, ఇదా మీ కాపరం. అతడు ఏ వీధిలోనో ఏ నాలుగంతస్తుల మేడముందో నీ ఒడిలోనే పడుకుంటాడు. ఏ రెస్టారెంటులోనో ఇంత రొట్టె తింటాడు.

ఓ నేలతల్లీ! ఒకనాడు సుబ్బన్న ఇంకో కూలి కుటుంబంతో స్నేహం చేశాడా? వాళ్ళూ హైదరాబాద్ వాళ్ళేనా! అవును, నీలో ఉండే గమ్మత్తు అది. నీ హృదయంలో ఏ భాగంలో ఉన్నవాళ్ళు ఆ భాగం వాళ్ళతో కలిసి మెలిసి ఉంటారుకాదూ!

ఆ కూలీ కుటుంబమూ ఎల్లాగో అనేకరకాల కూలిచేసి చిరిగినగుడ్డలు కట్టుకొని, వీలయితే ఆ బొంబాయి గల్లీలలో ఏ నల్లాకిందో స్నానంచేస్తారు తల్లీ. వాళ్ళూ నీవాళ్లేనటమ్మా! ఆ కుటుంబంవాళ్ళు సుబ్బన్నను దగ్గిరకు తీశారు. ఏ తల్లి, ఏ తండ్రికి పెండ్లి ధర్మంలోనో, పెండ్లికి మించిన కామ మహాధర్మంలోనో కన్న సుబ్బన్నకు కాస్త మెదడు ఉంది సుమా! కళ్ళకాంతి కొంచెం నిశితమే!

అలా కాలంలో చుక్కానిలేని పడవలా కొట్టుకువెళ్ళే సుబ్బన్నకు, ఆ ఇంకో నేల కుటుంబంలో ఓ చుక్కాని - ఓ చుక్క ఓ చక్కని చుక్క తలవంపులు, వాలుగన్నులవీధి కూలీ మిఠారి ఆ మేడల్లో ధన కుటుంబాలకు పనిచేసే వయ్యారి అతనికి నేస్తం అయిందా! ​నేలతల్లీ నీ సుబ్బన్న కప్పుడు నువ్వు లోకానికి ప్రసాదించిన సుగంధాలు, సౌందర్య స్వరూపాలు హృదయానికెక్కాయా?

ఓ నేలతల్లీ కల్తీలేని ప్రేమ నీ సుబ్బన్న హృదయంలో ప్రవేశించిందా? వాళ్ళిద్దరూ లోకంలో మానవులందరికి ఉన్న జంటధర్మం నిర్వర్తింప సాగారా? నేలతల్లీ నువ్వు వాళ్ళ ఇద్దరి మహదానందమూ, ఓర్వలేని మానవ కఠినత్వం కళ్ళ కనబడకుండా చీకటని, దౌవతీఇసుక అని, సందని, తూమని పార్కని ఆ మహానగరంలో వారికోసం సృష్టించావా తల్లీ!

ఆ సుబ్బన్నకు, సీతకు ఉన్న పవిత్రమైన చుట్టరికం సీత తల్లీ తండ్రీ గ్రహించారు. అది వాళ్ళిద్దరూ కోరిందే కాదూ. నేలతల్లీ! ఓ మంచిరోజున వాళ్ళిద్దరకు పెళ్ళి అని మూడుముళ్ళూ వేయించారా తల్లీ!

సుబ్బన్న సీత ప్రేమలో లోకాలు ఆవరించాడా! అతని హృదయమూ జ్ఞానమూ, మనస్సూ పువ్వులులా వికసించాయా నేలతల్లీ!

5

ఓ నేలతల్లీ, ఏ ముందులోకం కోసం సుబ్బన్న సీతలు సూర్యోదయంచూస్తూ మలబారు కొండమీద నిలబడ్డారు?

నువ్వు ఆ బంగారు ఎరుపుల సూర్యకిరణాలు నీవు ధరించిన వస్త్రం కాగా ఆ నీ యొక్క ఇద్దరి బిడ్డల ఆనందమూ చూస్తూ ఉన్నావా? వాళ్ళిద్దరికీ ఈ నీ దేశానికి సంబంధం వాళ్ళు ఇక్కడ ఎలాగో బ్రతకడమేనా? ఈ రాజ్యంలో వాళ్ళకు భాగంలేదా? ఈ దేశం సొమ్ములో ఈ దేశంలో ఉద్భవించే పంటలో, ఈ దేశంలో రూపం పొందే వస్తువులలో వారికి భాగం లేదా?

వారిద్దరూ చూచే ఆ సూర్యబింబంలో వారి భవిష్యత్తును యేమిచూచారు! వారిద్దరి చెమటా, వారి మురికి గుడ్డలు, వారికి వచ్చే గట్టి కష్టాలు స్వచ్ఛమైన దుఃఖాలూ, అమృతము రంగరించిన ఆనందాలూ మాత్రమే వారి ఆస్తిపాస్తులా నేలతల్లీ.

ఆ రాత్రి సుబ్బన్న సీతను, ఆ బట్టల మిల్లువారు కట్టించిన పేటలో వాళ్ళవంతుకు వచ్చిన ఇంటిలో గట్టిగా (నిన్ను కౌగలించుకునే ఎండలా) వెన్నెలలా గాలిలా కౌగలించుకొన్నాడా? నిన్ను గాఢంగా చుంబించే వానలా సుబ్బన్న సీతను ముద్దుపెట్టుకున్నాడా? ఆ రాత్రే సీతమ్మ గర్భంలో సర్వదేశాలకూ మకుటం కాబోయే నీ భారతదేశానికి నిజపౌరులలో ఒకడు కాదలచుకున్న ఇంకో చిన్న సుబ్బన్న అవతరించాడా? నువ్వు ఉప్పొంగి పోయావా?

సుబ్బన్న తనచుట్టూ ఉన్న అర్థంకాని ఏవో ఇనప గోడలు పగల గొట్టాలన్న ఆవేదన పడేవాడా నేలతల్లీ? అందుకు అతనిలో బాంబు శక్తి విజృంభించగలదా?

మిల్లులో యుద్ధావసరాలకు తగినట్లు కూలీలకు కూలీ సరిగా ఎక్కువచేయలేదూ, అందుకు నాయకుడు కూలీల సభ చేశాడూ, ఆ సభలో సుబ్బన్న అంత అద్భుతంగా, ​మహా వేగంతో, గంగానదిలా వర్షవాయువులా మాట్లాడుతూంటే నువ్వు నీ పుత్రుని విని ఎంత ఆనందించావు?

కూలీలు దేశానికి రక్ష అన్నావా సుబ్బన్నా! విమానాలు, టాంకులు, రైళ్ళు, ఓడలు, బాంబులు, తుపాకులు, వస్త్రాలు, సామానులు, కాగితాలు, కలాలు, మేడలు, మిద్దెలు, రోడ్లు, మోటార్లు తయ్యారు చేసేవారు కూలీలు వారు మాత్రం బ్రతక అక్కరలేదూ అన్నాడా సుబ్బన్న; సీత తన వయసు కాని గంభీర వచనాలకు ఆనందంతో ఊగిపోయిందా కూలి తల్లీ.

యజమానులు కూలీల కోర్కె పాలించరో, కూలీలందరూ సమ్మెచేశారా? అందుకు నీ బిడ్డడు ఒక ముఖ్య నాయకుడా నేలతల్లీ! అతన్ని అరెస్టు చేశారా? ఆ రోజు సీతమ్మ కుంగిపోతే, నువ్వే కాదూ అపరిమితమైన ధైర్యము చెప్పి, ఆ బాలను వీర బాలికను చేశావు!

సుబ్బన్నను వదలి వేయడానికి కారణం దేశ నాయకులు కొందరు మిల్లు యజమానులతో రాయబారాలు సలపడం వల్లా నేలతల్లీ!

సుబ్బన్న జీతమూ వృద్ధి అయింది. సీతమ్మ జీతమూ వృద్ధి అయింది. నేలతల్లీ, అప్పుడు మాత్రం నీకు తృప్తి అయిందా?

ఆ ఆదివారం నీ పుత్రుడు సుబ్బన్నా, సుబ్బన్న హృదయమూ, ప్రాణమూ, ఆత్మా అయిన సీతా రైలెక్కి జుహూ గాంధీ మహాత్ముణ్ణి దర్శించడానికే వెళ్ళారు కాదూ!

ఆ స్వాతంత్య్ర పరావతారాన్ని చూచి నమస్కరించి, అక్కడ సముద్రం ఒడ్డున సాయంత్రం కూచొని ఒకరి దగ్గిర ఒకరుగా ఇద్దరూ ఒకరుగా సీతమ్మ గర్భంలో భావి భారత పురుషుడైన సుబ్బన్న ద్వితీయ రూపం నృత్యం చేస్తూ ఉండగా - ఇద్దరూ - ఆకాశం - చీకట్లు - సముద్ర - తీరాలు - భవిష్యత్తు - భారతీయ మానవుల హృదయ ప్రళయం దర్శిస్తూ కూర్చుని ఉన్నారు కాదూ? వారిద్దరినీ ఆ రాబోయే మూడవ వానిని నీ వొడిలో వుంచుకొని నేలతల్లీ! చిరునవ్వుతో నువ్వూనా?

ఇంకో కొత్తరోజు ఉదయిస్తుంది కాదూ?


​

పిల్లంగ్రోవి

ఆ బాలకుని పిల్లంగ్రోవి పొలంగట్టులు, చేలు, కాలవలు, కొద్ది దూరాన ఉన్న కొండలు నిండుతూ ఉన్నది.

అతనికి రాగజ్ఞానంలేదు! అతడు స్వరవిద్య నేర్చుకోలేదు. అతని గురువులు కోకిల, తుమ్మెద, సెలయేరు ఆవుల అంబారవం, చేలమీదనుంచి తేలిపోయే మలయబాలకుడు, ఉఱుము, కీచురాయి, లవంగి పిట్టలు.

అతనికి ఉన్న జ్ఞానమే గాంధర్వము. ఒక స్వరం ఇంకో స్వరం శ్రుతి చూస్తాడు. అతని ఊపిరే లయ! ఆ లయలోంచి వచ్చిన తాళాలు మూడే. ఆది, ఏక, రూపక తాళాలు.

అతడు కల్పించిన గీతాపథకాలు విచిత్ర మూర్ఛనలు.

2

గొడ్లకాపు కుఱ్ఱవాడు, తొమ్మిదేండ్లు ఈడువాడు. చలిదివన్నం గంజి ఉప్పుచేప నంజుకుంటూ మెక్కి, ముంతలో గంజివన్నం పెట్టుకొని, ఉప్పులో ఊరవేసి ఎండబెట్టిన మామిడికాయ బద్ద, కంచమూ మూటకట్టుకొని గేదెపై స్వారి అవుతూ ఏటిగట్టుకు వస్తాడు.

అతని సింహాసనం వేపచెట్టు నీడ, అతని ప్రజలు పశువులు, అతని ఆయుధం పిల్లంగ్రోవి!

అతని పట్టుపీతాంబరాలు చినిగిన గోచీ, చినిగిన తలపాగాగుడ్డ! వానవస్తే రెండు గేదెల్ని నిలబెట్టి వాటి అడుగున కూచుంటాడు. ఏరుపొంగితే గేదెలమీద దాటుతాడు. అతని రక్షకభటులు ఆవులు గేదెలు. పెద్దపులినైనా దూరాన నిలబెట్టుతాడు.

3

పశువులతో మేతబయలుకు రాగానే “పొండఱ్ఱా” అని చెట్టుకింద మకాం వేస్తాడు. ఆటలు ఆడుతాడు, పాటలు పాడుతాడు.

పిల్లంగ్రోవి తీసి భువనమోహనంగా వాయిస్తాడు. ఆ పాటలకు సాహిత్యం అతని హృదయమే!

ఒకసారి అతనిపాట ఎగిరి గంతులువేస్తుంది. పూవులుపూస్తుంది. చిరుసువాసనలు వెదజల్లుతుంది. చిట్టిచిట్టి ఊటలా జలజలలాడుతుంది. ​ఒకసారి అతని పాట లోకాన్ని చూచి ఆశ్చర్యం పడుతుంది. తెల్లబోతుంది, వణుకుతుంది.

ఒకసారి అతని గీతం ఏదో వెదుకుతుంది. ఆకాశాన్ని పారకించి చూస్తుంది. భూమిలోతులు చొచ్చిపోతుంది. నదీ నీరాంబుకణాలు లెక్క బెడుతుంది.

మరి ఒకసారి కంటనీరు నింపుతుంది. ఏదో ఎరగని భయంచే ముడుచుకుపోతుంది, ఆకలై శుష్కిస్తుంది, మానవుని సర్వబాధలై విలపిస్తుంది.

ఇంకొకసారి అన్నీ తెలిసిన జ్ఞానిపద్మంలా యోగముద్ర వహిస్తుంది. గడ్డిపూవుల నివేదనలిస్తుంది. ఏటిలోని చేపలులా లోతులు కనిబెట్టుతుంది.

ఆ బాలుడు పిల్లంగ్రోవి పెదవులతో చుంబిస్తూ తన సృష్టి తనకే తెలియని బాలుడౌతాడు.

4

ఒకరోజు ఆ పక్క పొలంలోనుంచి పొలంకూలీ బాలిక ఒకతె అతని పాటదారినే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది.

ఆ బాలిక ఎనిమిదేళ్ళబిడ్డ! అతనికి ఎదురుగా అతని పాట వింటూ కదలకుండా కూరుచుంది.

ఆమెవచ్చి అతని రాజ్యాన్ని హరించలేదు, భాగించలేదు.

ఆమె అతని రాజ్యంలో, అతని పాటలో, అతనిలో భాగమయింది.

ఆమెకూడా ప్రతిరోజూ అతడు పాటబాడేవేళకు వచ్చి అతని ఎదురుగుండా కూచునేది.

ఆ బాలికకు ఓ చింపిగుడ్డ మొలకు ఆగుడ్డ. ఆమె నగ్నతను పూర్తిగా కప్పనేలేదు. ఆమె చేతికి రెండు గాజు గాజులు, ఆమెకాళ్ళకు రెండు అల్యూమినియం కడియాలు.

ఆ బాలుని మోము సూర్యబింబం అవుతే, ఆమె మోము ఆ పక్క చెరువులోని పద్మమే!

5

ఒకదినాన అతడు పిల్లంగ్రోవి వాయిస్తున్నాడు. లోకం అంతా సమ్మోహనమై అతని పాట వింటోంది. ఆ బాలిక ఆ పాటే అయింది.

ఇంతలో లోకాలు బద్దలుచేసే ధ్వనితో ఆకాశంలో ఏదో పెద్దపక్షి.

ఆ చప్పుడుకు అదిరిపడి ఆ బాలకుడు పిల్లంగ్రోవి ఆపి గభాలున భూమిమీద పడిపోయాడు. ఆ బాలిక దద్దరిల్లి హోరుమంటూ అతనిపక్క వాలి అతన్ని కౌగలించుకొంది.

ఆ రాక్షసి పక్షి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆ పసికందు లిద్దరూ లేచి తమచుట్టూ అంతా కళ్ళనీళ్ళతో పాఱచూచారు. ​అతని ఆవులు, గేదెలు నిశ్చలంగా మేస్తున్నాయి. పువ్వులు వికసించివున్నాయి. వేపచెట్టు ఆవరించే ఉన్నది. సెలయేరు జలజల ప్రవహిస్తూ ఉన్నది.

అతడు ధైర్యం వహించి పిల్లంగ్రోవి తీసి మళ్ళీ మూడు పవిత్ర స్వరాలు కలిపాడు. ఏమీ విశ్వం అన్నట్టుగా ఒక్క మూర్ఛన వచ్చింది. ఆ బాలిక అతన్ని కౌగలించుకునే ఉంది.

దూరంగా యూరపులో యుద్ధం జరుగుతున్నది. జపాను పెరల్ హార్బరుపై విరుచుకుపడింది.

ఆ బాలకుడు అదటుతీరి రోజూ ఆకాశంలో వచ్చిపోయే ఆ రాక్షస పిట్టల మ్రోతకు శ్రుతికలిపి ఒక కొత్త మూర్ఛన మ్రోయించాడు. ఆ బాలిక చిరునవ్వుతో అతని పాట పరవశయై విన్నది.


​

వింధ్యాచలం

మొదటి రంగం

నాకిది ఎన్నోసారో వింధ్యాచలం దాటి ఉత్తరాదికి వెళ్ళటం! నేను అగస్త్యుణ్ణి మాత్రం కాను! అగస్త్యుడే పుట్టకపోయి ఉంటే, ఆంధ్రులు దక్షిణానికి వలస వచ్చి కృష్ణా గోదావరీ మధ్యస్థ భూమిలో ఏలా వలస ఏర్పరచుకొని ఉందురు?

హిమాలయపర్వతం కన్న మేరుపర్వతం కన్న పైకెగసి, ధ్రువపథందాటి, సూర్యపథందాటి, సూర్యదేవకక్షకు అడ్డంగా పెరిగి సగర్వంగా నిలుచున్నాడట వింధ్యపర్వతేశ్వరుడు. ప్రతి సంవత్సరం దక్షిణాయనంలో యవద్వీప ప్రాంతాకాశపథాల సంచరించే సూర్యదేవుడుగారు ఆ ఏడు మళ్ళీ ఉత్తరాకాశ పథాల సంచరించటానికి వస్తూంటే ఈ వింథ్యాచలం గారు అడ్డంవచ్చారు. దక్షిణానికి ఒకటే రోహిణీకార్తి అవతరించింది. ఉత్తర భారతవర్షానికి ఒకటే మంచుమయమైన చీకటి. అప్పుడు ఈ దేశభక్తుడైన అగస్త్యుడుగారిని దేవతలంతా రక్షించవలసిందని ప్రార్థించారుట! అగస్త్యమహర్షిగారు దక్షిణాపథయాత్ర సంకల్పించి బయలుదేరారు. వింధ్యాచలంగారు ఆయనకు భక్తితో గురుపాద నమస్కారం చెయ్యటానికి సాష్టాంగమాతుడైనాడు. "నేను తిరిగి వచ్చేవరకూ ఇలాగే ఉండు నాయనా!" అని ఆ దివ్య ఋషి దక్షిణానికి వెళ్ళినాడుట! వింధ్యగారు అలాగే ఉన్నారుట!

ఇక నేను ఉత్తరాదికి వెళుతూంటే పొరపాటున ఈ వింధ్యధరాధరేంద్రుడు మా బండిలోంచి తొంగిచూస్తోన్న నన్నుచూచి, వీడే ఒక అభినవ అగస్త్యుడనుకొని, “అగస్తుల్యవారు తిరిగి ఉత్తరానికి వెళ్ళిపోతున్నారు. ఇంక మనం ఒకనాడాక్రమించిన మహోన్నతోన్నతోన్నతోనత గగన పథాలకు ఉప్పొంగిపోదా” మని విజృంభించాడా, ఇంక ఉత్తర భారతదేశంలో జరిగే అల్లరి వర్ణనాతీతమై చక్కాపోతుంది. ద్రావిడైర్ కషగంవాళ్ళు వింధ్య పర్వతంతో కుట్రచేసి, ఆ వింధ్యపర్వతంగారికి ప్రోత్సాహమిచ్చి "నువ్వు నిక్కమైన తమిళుడవోయి వింధ్య అన్నా! హిమవత్పర్వతంగారు వట్టి శుద్ధమైన ఆర్యుడు. భారతప్రధాని నెహ్రూగారు హిమాలయపర్వత మధ్యస్థభూమి అయిన కాశ్మీరంలోంచి వచ్చిన నిఖారసుడైన ఆర్య బ్రాహ్మణుడు. కాబట్టి నువ్వు మనద్రావిడ సంస్కారముయొక్క మహోన్నతోన్నతత్వము కశ్మలం కాకుండా ఆకాశానికి ఎగిరి అడ్డంగా నిలువు” అని ​రామస్వామినాయకరు ఈ వింధ్యమలై గారికి బోధించి ఉంటాడని ఏ 'హిందూస్థాన్ టైమ్సో' వ్రాయవచ్చును.

అది కాదంటారా కొంప ముంచి, ఈ కుట్ర అంతా ఆంధ్రుల నెత్తిమీద పడవేసే సావకాశాలూ ఉన్నాయి. ఏ ఉత్తరాది కాంగ్రెసు నాయకుణ్ణి పత్రికా విలేఖరులు సందర్శించి "ఈ వింధ్య పర్వతము ఇలాపైకి పాకిపోవడానికి కారణం ఏమిటండీ?" అని అడిగారనుకోండి. అప్పు డా ఉత్తరాది నాయకుడు ఇలా చెప్పి తీరుతాడు. "ఈ మధ్య థార్ నివేదిక కాదండీ వచ్చింది! తత్ నివేదిక ఆంధ్రులనందరినీ రోషానల సంతప్త హృదయాంతరంగులచేసి పారవేయడంచేత, ఏ సాంబమూర్తిగారో ఈ వింధ్య పర్వతం గారికి ప్రోత్సాహమిచ్చి యుండవచ్చును. దానితో పట్టపగ్గాలు లేకుండా ఈ అచలంగారు - చలంగారో - ఆకాశంలోకి చొచ్చుకుపోయి ఉండాలి” అని ఉద్ఘాటించి తీరుతాడు. ఇంకేముంది కొంపలు మునిగిపోతాయి. ఈలాంటి ఆలోచనలు ఆ వింధ్య పర్వతపులోయలో మహావేగంతోపోయే కలకత్తా మెయిలులో కూర్చున్న నాకు వచ్చిన మాట సత్యం. జబ్బల్‌పూరు దాటినాము. నర్మదానదము దాటినాము. మా రైలు సిహోలీ రోడ్డుస్టేషన్ దాటినది. ఒక్కొక్క స్టేషన్ మా రైలు సమీపించింది అనగానే, నా హృదయం మింటికెగసి లోతులకుపోతూ ఉంటుంది. నర్మద దాటేటప్పుడు పాలరాతి కొండలు, మాహిష్మతీ నగరం జ్ఞాపకం వచ్చినవి. అటు ఢిల్లీ వెళ్ళే దారిలో సాంచీ స్థూపము జ్ఞప్తికి వచ్చింది. ఆ దారిని ఢిల్లీ వెళ్లివుంటే అవన్నీ చూచి ఉండేవాణ్ణి! ఉజ్జయినీ ఆ పక్కనే వుంది. వుదయనుడు, విక్రమార్కుడు, కాళిదాసు వుజ్జయినీ భావ సంబంధాలు; ఇక్కడ నుంచి ఉత్తర భూమి పూర్ణరూపంతో ప్రత్యక్షమౌతుంది. ఆ ఉత్తరభారత భూమాత పోలికలన్నీ పుణికి పుచ్చుకున్న ఆమె అనుగుబిడ్డ ఒక బాల, కాట్నీ స్టేషన్‌లో మాసెకండ్ క్లాస్‌పెట్టె ఎక్కింది.

̼

2

ఆ అమ్మాయి వెనకే, ఈనాటి ఈ క్షణం ఫేషన్‌లో ఉన్న అతి నవీన దుస్తులతో పెట్టె ఎక్కాడు ఓ యువకుడు. నేను ప్రయాణం చేస్తున్న పెట్టె నాటి ఇంటరు తరగతి, ఈనాటి తరగతి రెండు. పెట్టంతా పూర్తిగా నిండిఉన్నారు. ప్రయాణీకులు, అది శీతాకాలం కాబట్టి సరిపోయింది. గడచిన రాత్రి అంతమంది ఉన్నా కూచున్నవాడు కూచున్నట్టూ, ఒరిగినవాడు ఒరిగినట్టుగానూ కాలం గడిపినాము! అదృష్టవంతుడు పైన పక్క వేసుకొన్నాడు.

రెండు బెంచీల మధ్యనూ, గేట్ల దగ్గరనూ, ఎల్లాపడితే అల్లా నిదురబోయాము తక్కినవాళ్ళం. ఉత్తరానికి వెళ్ళినకొలదీ జనం ఎక్కువవుతూ ఉన్నారు. నేను సంస్కారమూ, స్త్రీ భక్తీ కలవాణ్ణి కాబట్టి సౌందర్యపు పోగైన ఆ అమ్మాయి కాట్నీ జంక్షన్ స్టేషన్‌లో మా పెట్టెలోకి ఎక్కగానే ఎత్తుమడమల జోడుతోనూ, అతి నవీనమైన చీరకట్టు విధానముతోనూ ప్రత్యక్షమగుటచేత, ఆమెకాలేజీలో చదువుకున్న బాలికయని నిర్ధారణ చేసుకున్నవాడనై చటుక్కునలేచి, ఆమె ఇటూ అటూ చూస్తూ 'ఎక్కడ కూర్చుందామా' అని ఆలోచిస్తున్న సమయంలో "మీ రిక్కడ కూర్చోవచ్చును” అని ఇంగ్లీషు భాషలో ఆమెను కోరినాను. ​“కృతజ్ఞురాలను” అని ఇంగ్లీషులో అంటూ, నాల్గు చిరునవ్వులు నాపై విలాసంగా విసరివైచి, నా స్థలంలో ఆమె కూర్చున్నది. ఆమె వెనకాలే వచ్చిన యువకుడు ఆమె ప్రక్కనే చటుక్కున సర్దుకు కూర్చున్నాడు.

నాకు వళ్ళు మండిపోయింది. నేను కూర్చుందామనుకొన్న స్థలం కాదా అది? నేను లేచి హాయిగా వున్న నా స్థలం ఆమెకిస్తే ఈయనగా రెవరూ నా స్థలం ఆక్రమించడానికీ?

నేను ఆ క్రిందటిరోజు సాయంత్రమే ఇటార్సీలో గ్రాండ్‌ట్రంక్ ఎక్సుప్రెస్‌లో దిగాను. 'నర్మదానదిని చూచినట్లూ ఉంటుంది. జబ్బల్‌పూరు నగరాన్నీ రైల్లోంచి దర్శించవచ్చును' అని మరునాడు కలకత్తా మెయిల్ వచ్చేవరకూ ఉండి పదకొండు గంటలకు ఏలాగో మంచి తెలివితేటలు చూపించి ఆ బండిలో చేరాను. కాట్నీ వచ్చేటప్పటికి సాయంకాలం అయిదున్నర అయింది. ఇంకా అయిదుగంటలు ఆ బండిలో ఉండాలి, 'ఇన్ని గంటలూ ఆ అమ్మాయికీ ఆ అబ్బాయికీ నా స్థలం ఇచ్చేసుకుని నుంచోవలసిందేనా' అని మరీ బాధ ఎక్కువైంది. ఒక నిట్టూర్పు విడిచి అలాగే నుంచున్నాను. పైగా నుంచోడానికి కారణం నా చుట్టుప్రక్కన ఉన్న బెంగాలీవారికీ, యు.పి. వాళ్ళకూ ఇంకోరకంగా స్ఫురించకుండా ఉండాలని, ఇంగ్లీషులో, “ఎంతసేపని కూచోగలం, కాళ్లు గుదులు పెడితే? ఓ అరగంటైనా నిలుచుంటేగాని మళ్ళీ రక్తం స్రవించదు” అని పైకి అన్నాను. నాకూ గౌరవము దక్కింది. కానీ నేను అరగంటా నిల్చుంటానని గంటన్నర నిల్చున్నాను, తలుపు దగ్గరే పరుగెత్తే ప్రకృతి దృశ్యం గమనిస్తూ. ఆ అమ్మాయి పక్కన కూర్చున్న యువకుడు మేమిద్దరం ఎంతోకాలం నుండి స్నేహితులమైనట్లూ, నే నేదో గౌరవం చేసుకోడానికని లేచి నిలుచుండినట్లు భావించాడు కాబోలు, నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం ప్రారంభించాడు.

యువకుడు: మీరు బొంబాయినుంచి వస్తున్నారా?

నేను: కాదు, బెజవాడనుంచి గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి నిన్నల్లా యిటార్సీలో కాలం వెళ్ళబుచ్చి ఇవాళ ఈ కలకత్తా మెయిలు ఎక్కినాను.

యువతి: మీరు ఆంధ్రులా అండీ?

నేను: ఔనండీ. మీరు బెంగాలీవాళ్ళలా లేరే?

యువ: మేము యు.పి. వాళ్ళము. మాది అలహాబాదు.

నేను: నేనూ అలహాబాదు వెడుతున్నాను.

యువ: మేమూ అలహాబాదే వెడుతున్నాము. ఇక్కడ కాట్నీలో మా యింటికి వచ్చి ఈ సెలవులు గడిపి అలహాబాదు వెడుతున్నాము.

నేను: మీకు అక్కడ ఉద్యోగమా అండీ? (యువకుణ్ణి ప్రశ్నించాను.)

యువ: ఔను! కలక్టరేటులో అసిస్టెంట్ కలక్టరుగా పనిచేస్తున్నాను లెండి. ఈవిడగారు మిసెస్ సుప్రియా త్రిపాఠీ. నేను సుప్రియా త్రిపాఠిని లెండి. మాది కాట్నీ నగరం. మీరెందుకు వస్తున్నారు అలహాబాదు? మీపేరు తెలుసుకోవచ్చునా? ​నేను: ఆ తప్పకుండా! నా పేరు ఎం. చతుర్వేది. ఆంధ్రంలో చతుర్వేదుల మల్లికార్జునశాస్త్రి. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్‌సి. మొదటిగా కృతార్థుడనయ్యాను. అలహాబాదు యూనివర్సిటీవారు డి.ఎస్‌సి. పరిశోధనకు స్కాలర్‌షిప్పుతో సీటు ఇచ్చినారు. అది పూర్తి కావచ్చినది. ఇది ఆఖరు సంవత్సరం. శీతాకాలం సెలవులకు ఇంటికి పోయి ఇప్పుడు వస్తున్నాను.

యువ: మీరు చతుర్వేదులా? మా నాన్నగారి ఇంటిపేరు త్రివేది వారు! హైకోర్టులో మా నాన్నగారు ఎడ్వకేటుగా ఉన్నారు. ఈ పెద్దమనిషి గారు అలహాబాదులోనే అయిందికదా ఉద్యోగమని అత్తవారింట్లోనే మకాం పెట్టారు లెండి!

యువ: అయితే, చతుర్వేదిగారూ! అసలు నేను అలహాబాదు వేయించుకోవటానికి కారణం ఏమిటో ఆవిణ్ణి అడగండి.

యువ: నా పేరు జ్యోతిర్మయి లెండి. అందుకనే వెలుగును గురించిన రహస్యాలన్నీ తెలుసుకుందామని అలహాబాదు యూనివర్సిటీ బి.ఎస్.సి. ఆనర్సు ఫిజిక్సులో చేరాను. తానేమో నాచదువు పాడు చేయకూడదనిట, అలహాబాదులోనే వేయించుకున్నారట ఉద్యోగం. ఈయనగారు 1945 సంవత్సరంలో తయారై వచ్చిన ఐ.సి.ఎస్. లెండి.

నేను: త్రివేదులూ, త్రిపాఠులూ, చతుర్వేదులూ! బాగానే ఉంది మన స్నేహం.

3

ఇంతట్లో శాత్నా పట్నం వచ్చింది. నా అదృష్టం కొద్దీ జ్యోతిర్మయి పక్కనే కూర్చున్న ఒక ముసలాయన, ముసలావిడ లేచి రైలుదిగి వెళ్ళిపోయినారు. వాళ్ళు లేచి వెళ్ళడమేమి, నేను గబుక్కున వారిస్థానంలో కూర్చోటమేమిటి. మేము ముగ్గురం చక్కగా, హాయిగా సర్దుకు కూర్చున్నాము.

మాకు ముగ్గురకు సంతోషం కలిగింది.

“మీరు మాకు ఏవిధంగానైనా చుట్టాలు కారుకదా!" అని జ్యోతిర్మయి పకపకా నవ్వుతూ నావైపు తిరిగింది.

“ఆంధ్రులు ఆరువేల సంవత్సరాల క్రితం మనదేశం నుంచి కదిలి కృష్ణా గోదావరీ దేశానికి వలస వెళ్ళినవారేగా?” అని ఆ యువకుడు సుప్రియుడన్నాడు.

ఉత్తరాది వాళ్ళకూ, దక్షిణాది వాళ్ళకూ ఇలా రైల్లో స్నేహం కుదరటం విచిత్రంగానే ఉంది. వాళ్ళు గంగానది వాళ్ళు, నేను గోదావరి నదివాణ్ణి. గోదావరి, గంగానది పూర్వావతరము. గోదావరే ప్రాచీన జన్మఅట. త్రయంబకేశ్వరుడే గంగోత్రికడ, జటామకుటేశ్వరుడయ్యాడట. అలాగే కృష్ణ నుద్భవింపజేసిన మహాబలేశ్వరుడు. యమునా కృష్ణానదులొకే అవతారములు.

రైలు మాణిక్యపూర్ దాటిన తర్వాత ఏదో మాటల సందడిని "మీకేం, మీరు చాలా అదృష్టవంతులుగుటచేత మీ రాష్ట్రం మీకు ఇదివరకే వచ్చి వుంది. కాని మీ రాష్ట్రం వాడయిన నెహ్రూగారికి మాయందు ప్రేమ లేకపోవడంవల్ల థార్ నివేదికపై ఏమీ చెప్పకుండా ఊరుకొన్నారు” అనికొంచెం తీక్షణంగానే అన్నాను. ఆ యువకునికి చాలా ​కోపం వచ్చినట్లున్నది, “మీకు రాష్ట్రం రాకపోతే ఏమి లోటు వచ్చింది చెప్పండీ? మీ ఒక్కరిమీద ఇంకా రాజ్యంచేస్తున్నారా?” అని అడిగినాడు.

నేను: ఎంత చక్కని భావం వెల్లడించారు! మీ రాష్ట్రం అవతలున్న పంజాబుతోనో, ఇవతలున్న బీహారుతోనో, అడుగున ఉన్న మధ్యరాష్ట్రాలతోనో కలిసిపోకూడదా? అలా కలిస్తే మీలో ఉన్న ఇంగ్లీషు తత్వము ఒదిలి పోవునేమో?

యువ: ఇంగ్లీషు తత్వమంటే?

నేను: సామ్రాజ్య తత్వం.

యువ: అంటే తక్కిన దేశాన్నంతా మా చెప్పుచేతల్లో ఉంచుకొని, తక్కిన రాష్ట్రాలన్నీ మా సామ్రాజ్యం క్రింద ఉంచుకొన్నామనేనా? మీ మాటల్లో ధ్వని అదేగా?

నేను: నిజమైన ప్రజాపరిపాలన అయ్యేటట్లయితే, ఈ ముప్ఫై సంవత్సరాలు వాదించి ఒప్పుకొన్న ధర్మసూత్రాలలో ఒకటి కదా భాషా రాష్ట్ర విభజన. అది వెంటనే స్వతంత్ర భారతం ఎందుకు అమలులో పెట్టలేదు చెప్పండీ?

జ్యోతి: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అనేక విధాల కష్టాలు పడేటప్పుడు దానితో సహకరించక, అతి ముఖ్యంకాని భాషా రాష్ట్ర సమస్య ఎందుకండీ?

నేను: ఇంగ్లీషువారు కాస్తకాస్త స్వరాజ్యం ఇస్తానంటే మహాత్మాగాంధీజీ ఒప్పుకున్నారా? స్వరాజ్యం వచ్చినప్పుడు సంపూర్ణ స్వరాజ్యం రావాలి. దేశంలో ఒక భాగానికి స్వరాజ్యం వచ్చి రెండో భాగానికి రాకుండా ఉండటమా?

యువ: అయితే ఆంధ్రులకు స్వరాజ్యం రాలేదంటారా?

నేను: ముమ్మాటికీ రాలేదంటాను. మీ భార్యాభర్త లిద్దరూ బయలుదేరి ఆంధ్రదేశం వెళ్ళి ప్రతి ఆంధ్ర స్త్రీనీ పురుషుణ్ణి ప్రశ్నించండి! ఎంత బాధతో ఆంధ్రులు యావన్మందీ క్రుంగిపోతున్నారో?

శంకర్‌ఘర్ స్టేషన్ వచ్చి వెంటనే వెనక్కు వెళ్ళిపోయింది.

యువ: ఈ రాష్ట్రాల సంగతి అలా ఉంచి మా ప్రార్థన ఒకటి ఉంది. వింటారా? నేనూ, మా వారూ కలసి అడుగుతున్నాము. మన బండి అలహాబాదు చేరేసరికి పదిన్నర అవుతుంది. మీరు మాతో మా యింటికి రావలసిందని కోరుతున్నా, నా తరపునా, మా ఆయన తరపునా.

యువ: మా రాణీగారు నా మనసులో ఉన్నది నిమిషంలో గ్రహించారు. మా అత్తగారు ఇల్లు పెద్దమేడ. మీరు యూనివర్సిటీ హాస్టలులో మీ బసకు పోయేలోపున మా ఇంట్లో నాలుగు రోజులపాటు ఉండాలని మనవి. మా మామగారు కొంచెం పూర్వసాంప్రదాయం వారు. మీరు మాకు అతిథులుగా ఉండమని కోరుతున్నాము.

యువ: మేము పూర్తిగా శాకాహారులమే నండోయ్!

నేను: మిమ్ము ఇబ్బంది పరుస్తానని భయం.

యువ: ఏమీ భయంలేదు. మా చెల్లెలు ఉంది. నాకన్న అందంగా ఉంటుంది. నాకన్న మధురంగా పాడుతుంది. రెండోఏడు బి.ఎస్.సి. కెమిస్ట్రీ చదువుతోంది. ​యువ: కాని మా ఆవిడలా చిలకలా గంటలకొలదీ మాట్లాడదు. బాపూజీ మౌనవ్రతంలో ఏ శుభముహూర్తంలోనో పుట్టి ఉంటుంది. ఆవిడ గారు.

యువ: మీరు ఏమీ మాట్లాడలేని నంగనాచులు!

4

ఏవేవో ఆలోచనలలో పడినాము. రైలు వేగంగా వెడుతూ ఉన్నది. మా కందరికీ కొంచెం నిద్రమైకంకూడా వచ్చింది. ఇంతట్లో నైనీ జంక్షన్ వచ్చింది. మా కలకత్తా మెయిలు అక్కడ ఆగకుండా అలహాబాదుకే వెళ్ళిపోయింది. వచ్చింది మాస్టేషన్. మేమందరమూ త్రివేది గారింటికే వెళ్ళినాము. నాకు వారి తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని భయం. కాని వారందరూ ఏదో దగ్గరచుట్టం వచ్చినట్లే చూచినారు.

వింధ్యాచలం వెనకనే ఉండిపోయినాడు. నర్మదానది భారతమాతకు మొలనూలై ప్రవహిస్తూనే ఉన్నది. నేనీ త్రివేణీ సంగమ పవిత్ర స్థలానికి వచ్చిచేరినాను. ఇక్కడి వారికీ ఆంధ్రులకూ అన్ని ఆచారాలూ తేడాగానే ఉన్నాయి. వారి భోజనాలు వేరు. వారు గోధుమరొట్టెలు ఎక్కువ తింటారు. వారి తర్కారీలకు మన కూరలకు సంబంధంలేదు. వారు పులుసులలో చింతపండువేయరు. కొందరు మామిడిఒరుగు, కొందరు ఆల్బకరావేస్తారు. వారికి పచ్చళ్ళు ముఖ్యంకాదు. ఆవకాయ ముఖ్యంకాదు. ఊరగాయలు అవోరకం.

కాని ఇవన్నీ వింధ్యాచలం వేరుచేసిందా? అయితే అరవవారి భోజనానికీ తెలుగువారి భోజనానికీ అంతతేడా ఉందేమి? ఆచారాలు మాత్రం పైపైన తేడాలేగాని అసలు మడీ గిడీ, స్నానం శుద్ధీ, జపం తపం వారికీ వీరికీ ఒకటే.

త్రిపాఠీ ఐ.సి.ఎస్. గనుక ఆ యువకునకు ఛాందసాలు ఏమీలేవు. భారతీయుని హృదయం ఒకటే! సంస్కృతి ఏలాంటి మహారాజ పథాలు నిర్మించలేదు గనుకా! భారతజాతికి విముక్తి వచ్చిన ఈ దినాల్లో సర్వదేశాలకూ ఆదర్శముకాగల రాజ్యాంగ చట్టం భరతదేశం నిర్మించుకుంటోంది. భాషలు తేడా అయితే హృదయాలు తేడాలు కావాలా! పంజాబు, బెంగాలు అల్లరులు, తూర్పు పశ్చిమ పాకిస్థానుల నుండి కోట్లకొలది హిందువులను భరతదేశానికి తరిమివేశాయి. ఆ కాందిశీకులు భరతదేశం అంతా వలస ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. వారి ఆచారాలు, వలసరాష్ట్రం ఆచారాలూ సంస్కృతులు పవిత్రప్రయాగ అవుతున్నాయి. ఒక మహాకష్టంలోంచి ఒక దివ్యమైన శుభమూ అవతరిస్తున్నది. ఈ ఆలోచనలతో నిదుర కూరినాను.

5

నేను త్రివేదీ గారింట్లో ఉన్న మూడవ దినాన సాయంకాలం జ్యోతిర్మయి చెల్లెలు ఆనందమయి నేను అతిథిగా మకాం చేసి ఉన్న గదిలోనికి వచ్చి, “నమస్కార్ చతుర్వేదిజీ!” అని రెండుచేతులూ జోడించి నమస్కరిస్తూ, నా సోఫాకు యెదురు గుండా ఉన్న ఆసనం అధివసించింది. ​ఆనంద: మీ చదువేమీ పాడుచేయటం లేదుగదా?

నేను: ఎబ్బెబ్బె, నేను ఏవో ఆలోచనలో తేలిపోతున్నాను లెండి. వాటికీ నా చదువుకీ ఏమీ సంబంధంలేదు.

ఆనం: అలాంటి ఆలోచనలలో తేలిపోయారంటే, భూగ్రహణ శక్తికి మీరిపోయిన విశ్వపథంలో పడిపోయి మళ్ళీ ఈ లోకానికి రారేమో?

నేను: (నాకు నవ్వు వచ్చి పక పక నవ్వినాను) అప్పుడు యితర లోకాలేవైనా కొత్తవి కనుక్కుని రాడార్ ద్వారా మీకు కబురు పంపుతాను!

ఆనం: అప్పుడు మీకు నెహ్రూమీద కోపం పోతుందనుకుంటాను.

నేను: నాకు నెహ్రూమీద కోపమేమిటండోయ్!

ఆనం: మొన్న ప్రయాణంలో వస్తూదారంతా అదేటగా మీ వాదన!

నేను: రామ రామ! నాకు నెహ్రూజీ మీద ఉన్న భక్తి అపారం. నా హృదయంలో ఆయన మహాత్మాజీకి నిజమైన ఆశయ పుత్రుడన్న సంపూర్ణ నమ్మకం. ఏటు వచ్చినా మా ఆంధ్రులకు అన్యాయం చేసేవారి కుట్రలకు నెహ్రూ పండితులు, అన్ని విషయాలూ తెలిసి ఉండి, చేయూత ఇస్తున్నారని బాధపడుతున్నాను.

ఆనం: తెలిసిఉండి చేయూత యిస్తున్నారనా మీ అభిప్రాయం?

నేను: తెలిసిఉండి సహాయం చేస్తున్నారా, అది తీరని తప్పు. తెలుసుకోకుండా సహాయం చేస్తున్నారా, అది మరీ తప్పు.

ఆనం: అలాంటి దోష విషయాలకు ఆయన చేయూత ఇస్తున్నారనే మీ నమ్మకం?

నేను: చేయూత ఇస్తున్నారంటే తాను చేయాలని సహాయం చేస్తున్నారని నా అభిప్రాయంకాదు. అందరూ గాంధీజీ శిష్యులనీ, అందరూ ధర్మపథాన్ని నడపవలసి ఉందనీ, అలా వివిధాభిప్రాయాలవారూ ధర్మం నెరవేర్చడానికి సంకల్పం వహిస్తే ఉత్తమ మార్గం అప్పుడే ద్యోతకం అవుతుందనీ, నెహ్రూగారి అభిప్రాయమని నా నమ్మకం. అదేగా వారు మద్రాసునకు వెళ్ళి మంత్రివర్గం వారికి బోధచేసింది.

ఆనం: ఇంక మీరు బాధపడవలసిన అవసరం ఏమిటి? మీ ఆంధ్రుడైన పట్టాభిగారు రాష్ట్రపతి అయినాడు. మీ ఆంధ్రుడే కళా వెంకట్రావుగారిని ఆయన ఒక కార్యదర్శిగా చేసుకున్నారు. ఇక మీకు ఆంధ్ర రాష్ట్రం సత్వరంగా రావచ్చుకాదా?

నేను: నిజమే, మీ రన్నదానిలో నిజం లేకపోలేదు. ఆంధ్రుడు రాష్ట్రపతికావడం మాకు అదృష్ట కారణమే అవుతుందో, దురదృష్ట కారణమే అవుతుందో! భవిష్యత్తు భగవంతుని చేతిలో ఉంది.

ఆనందమయి తాను కూర్చున్న కుర్చీలోనుండి లేచి నా దగ్గరకువచ్చి నా భుజంమీద చేయివైచి “ఆంధ్రులకు రాష్ట్రం విషయంలో ఎంత గాఢకాంక్ష ఉందో, ఆశ్చర్యమే! మీ బాధ మాకేం తెలుస్తుంది చెప్పండి. మాకా సమస్య ఎన్నడూ ప్రత్యక్షం కాలేదు” అని అంటూ "చతుర్వేదిగారూ! మీరీ రెండేళ్ళన్నరనుండీ ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు కదా, మా యు.పి. వారు, మీ విషయంలో ఏలా సంచరించారు?” అని ప్రశ్నించింది. ​ఆ బాలిక ఇరువది ఏడుల ఎలప్రాయపు జవ్వని. ఆంధ్రులలో సాధారణంగా కానరాని స్వచ్ఛసువర్ణచ్ఛాయ శరీర కాంతిగల మహోజ్జ్వలాంగి. ఒయ్యారాల హంసయాన. నా భుజంపైన చేయివైచినప్పుడు నాకు ప్రపంచమంతా మత్తిల్లి ఒరిగిపోయినట్లయినది. నాకు మాటరాలేదు. నా ప్రజ్ఞ అంతా పటాపంచలైనది.

నా హృదయావేదనాభరిత మౌనం ఆమె అపార్థం చేసుకున్నది కాబోలు, నా ప్రక్కనే సోఫాలో కూర్చుండి, “మిమ్ము మా రాష్ట్రం సరిగా ఆదరించలేదా? చెప్పండి” అని ఆదుర్దాగానే ప్రశ్నించింది.

మీద చేయివేస్తేనే, నేను మైమరచినవాణ్ణి, ఆమె నా దగ్గరగా సోఫాలో కూర్చుంటే నా స్థితి ఎవరికి గ్రాహ్యం కాగలదు? మాటరాలేదు. జవాబు చెప్పాలని ప్రయత్నం చేశాను. నోరు తడియారిపోయింది. హృదయ మృదంగం భేరీభాంకారమై ద్రుతకాలమైపోయింది. ఏలాగో తెప్పరిల్లగలిగాను. మాట తడబడుతోనే,

“ఆ... ఆ... ఆనంద... ఆనంద.... మయీ దేవిగారు... అబ్బే ఏదో... ఆలోచనలలో... మాట్లాడలేదు... మీ... మీ రాష్ట్రం నా యెడల చూపించిన ప్రేమ.... ప్రేమ.... అపారం! మీ కుటుంబమే దానికి.... దాని.... చిహ్నం అనుకోండి" అని అన్నాడు.

అనాలోచితంగా జరిగే అనేక సంఘటనలు జీవితంలో విప్లవాలు తీసుకు రావచ్చును. ఆనందమయి, నా హృదయంలో అవతరించిన తుఫాను ఏమి అర్థం చేసుకోగలదు?

నేను ఇరవై ఆరేళ్ళ యువకుణ్ణి. చదువులలో మాత్రం ముందంజ గలవాడిని. లోకం నా చదువు చూచి నాకు సహాయం చేయ సంకల్పించింది. నేను 'దేహి' అని ఇతరులను యాచించలేదు. హైస్కూలులో మా ప్రధానోపాధ్యాయుడు నాచదువుచూచే నాకు ఉచిత వేతనం ఇప్పించినాడు. మా తండ్రి పురోహితుడు, స్వంత వ్యవసాయదారుడు. మాకున్నది రెండెకరాల మాగాణి. అదే మాకు జమీ. ఎలా సంసారం ఈదేవాడో, ఎలా నాకు చదువునకై ఖర్చులు పంపేవాడో! కాలేజీలో అర్థ ఉచిత వేతనం వచ్చింది. ఆంధ్రా యూనివర్శిటీవారు పూర్తిగా ఉచిత వేతనం ఇచ్చారు. అదే ఆశ్చర్యమన్నారు మావాళ్ళు.

మా ఆంధ్రదేశం బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యతో మండిపోతోంది. గట్టిగా చూస్తే బ్రాహ్మణులలో లక్షాధికారులు పదిమంది ఉండరు. నూరు ఎకరాల మాగాణి ఉన్నవారు రెండు డజన్లుకూడా ఉండరు. ప్రజారాజ్య విధానంలో బ్రాహ్మణుల ఓట్లు నూటికి ఒక్కటికూడా ఉంటుందో ఉండదో! గ్రామాలలో వారికి ఏమీ బలంలేదు. అయినా వారిమీద రెడ్డి, కమ్మ, కాపుకులాల వారికున్న కోపం ఇంతింతనికాదు. అయినా ఆ కోపం పైపైనే అనే నా నమ్మకం. సంస్కృతిలో పైకి విజృంభించిపోవాలన్న ఆవేదనతో వారిపైన వారికే ఉద్భవించిన క్రోధం బ్రాహ్మణ ద్వేషం అని అనుకుంటున్నారని నా నమ్మకం. కాని ఈలోగా దేశంపొందే సంక్షోభం ప్రజాజీవితాన్ని కలచివేస్తున్నది. బ్రాహ్మణులపైన ఉన్న ద్వేషం మానసిక నైర్మల్యాన్ని ధ్వంసంచేసి వారిలో వారికే ద్వేషం ఉద్భవింపజేసినది. అయినా ఇవన్నీ హృదయగతం కాకపోవడంవల్ల, న్యాయం చేయవలసి వచ్చినప్పుడు ఆంధ్రులు న్యాయపథము అనుసరించి తీరుతూనే ఉన్నారు. అందుకనే నాకు మా ఆంధ్రా యూనివర్శిటీవారు విద్యావేతనం దయచేయించినారు. ​నేడు అలహాబాదువారూ విద్యావేతనమిచ్చి నన్ను డి.ఎస్.సి.కి పరిశోధన చేయడానికి సావకాశం ఇచ్చారు. దేశంలో ఎవరికి ఉన్న భావాలు వారు ఫలవంతం కావాలని ఆశిస్తారు. అవి కాకపోతే జరగలేదని విషాదం పొంది, అక్కడనుంచి ద్వేషాగ్ని ప్రజ్వరిల్ల చేసుకొని ఈ సంస్థనూ ఆ సంస్థనూ, ఈ వ్యక్తినీ, ఆ వ్యక్తినీ ఆడిపోసుకుంటారు. ఇతరుల జీవితాలు విచ్ఛిన్నం చేస్తారు.

“మీరు నాకు కాస్త ఇంటిదగ్గర పాఠాలు చెబుతూ ఉంటారా? మా నాన్న మీకు తగిన పారితోషికం ఇస్తారు. మీరీ విషయంలో మోహమాట పడకండి.”

"అయ్యయ్యో! అదేమిటండీ, అలాంటి మాటలని నన్ను బాధపెట్టకండి. నాకు వీలయినప్పుడు హాస్టలునుంచి వచ్చి సంతోషంతో మీకు పాఠాలు చెప్తాను.”

“ఆ వీలు ఏ నెలకు ఒకమాటో అవుతుంది కాబోలు.”

"వా! వా! అదా నా ఉద్దేశం.”

ఈ బాలిక పేరు ఆనందమయి. ఆనందపూర్ణమైన జీవితమే రూపం కట్టిందా యీమె!

ఈ ఆలోచనలన్నీ రెండుమూడు నిమేషములలోనే నా హృదయాన ప్రసరించి పోయినవి. ఆనందమయి నన్ను చూచి "ఏమిటండీ మీ ఆలోచనలు ఏండ్లు యిక్కడ చదువుకుంటూ ఉండికూడ మీ దర్శనభాగ్యం యెప్పుడూ మాకు కలుగనిచ్చారు కాదు. మీ దక్షిణాది వాళ్ళెప్పుడూ యింతేలెండీ!" అని ఆ బాలిక పకపక నవ్వింది.

"మేము దక్షిణాదివాళ్ళము కాదండి. మేము తెలుగు వాళ్ళము!”

"తెలుగువాళ్ళు దక్షిణాది వాళ్ళు కాకపోతే ఉత్తరాది వాళ్ళ! నా కెప్పుడూ తెలియదే యీ విషయం!"

“మేము ఉత్తరాది వాళ్ళమూ కాదండీ.”

“అయితే మీరే ఆది వాళ్ళు? తూర్పాది వాళ్ళ? పడమటి అది వాళ్ళా?”

"మీకు తూర్పు ఆది వాళ్ళు బెంగాలీవాళ్ళూ, అస్సాము వాళ్ళూ, పడమటి ఆదివాళ్ళు రాజపుత్రులూ, గుజరాతీ వాళ్ళూ, నా ఉద్దేశ మేమిటంటే దక్షిణాదివాళ్ళంతా దక్షిణ పెన్నకి దక్షిణంగా వుండేవాళ్ళు మాత్రమే. వాళ్ళు అరవవారు, మళయాళీ వాళ్ళూను. మేము దక్కనువారము.”

“మీరూ, తమిళులూ, మలయాళీలూ, కన్నడులూ ఒక జాతికి చెందినవారు కదా?”

“ఇలా జాతీ జాతీ తేడాలగా చెప్పలేము. ఒకే భాషవారు ఒకే జాతి అని ఎలా చెప్పగలను? ఒకే భాష మాట్లాడేవారిలో అనేక జాతులవారు కలిసిపోయి యుండవచ్చును. విడివిడిగాను ఉండవచ్చును. ఒకేజాతికి చెందిన వారు వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు మాట్లాడుతూ వుండవచ్చును. వివిధ భాషలలో వున్న సౌందర్యము ఉన్నతస్థాయిని పొంది సర్వభారతీయమైన సంస్కృతిలో శ్రుతియుక్తమైన భాగమౌతుంది. అప్పు డాసంస్కృతి మహత్తరమైన లాభము పొందగలదు.”

“మీరు చెప్పింది నిజం.” ​నాకు ఆశ్చర్యమెక్కువైంది. నేను ఉత్తరాది వారికీ, దక్షిణాదివారికీ చాలా తేడాలున్నాయని వాదించడానికి సంసిద్ధుడనై యుంటిని. కాని ఆనందమయిదేవి నావాదన తీసుకోవడము, నేను ఆమె వాదన బలపర్చడమైనది. ఈ సంగతి యిద్దరం ఒకేసారి గ్రహించాము. గ్రహిస్తూనే యిద్దరం పకపకా నవ్వుకున్నాము.

6

నేను మా విశ్వవిద్యాలయం హాస్టలుకు వెళ్ళిపోయాను. వెళ్ళి వారం రోజులవరకు త్రివేదిగారి యింటికిరాలేదు. తొమ్మిదవరోజు సాయంకాలం త్రిపాఠీ దంపతులూ, ఆనందమయీ త్రిపాఠీగారి కారుమీద మా వసతి భవనానికి చక్కావచ్చారు. నాగది నంబరు తెలిసిన త్రిపాఠీగారు రెండవమేడలో మూడవ అంతస్థులో ఉన్న నా 20వ నంబరు గదికి గబగబా వచ్చి "హల్లో, చతుర్వేది” అని పిలిచారు. నేను అప్పుడే లైబ్రరీ నుంచి వచ్చి టీతాగి, పడక కుర్చీలో మేను వాల్చి, ఆనందమయీ సౌందర్యం తలపోసుకుంటూ ఏవేవో అంతులేని కలలు కంటున్నాను. త్రిపాఠీగారి పిలుపుకు ఉలికిపడి లేచి "మీరా త్రిపాఠీగారు! రండి, ఆ పడకకుర్చీమీద దయచేయండి. రెండు నిమిషాలలో టీ ఆర్డర్ చేసి చక్కా వస్తాను” అని అన్నాను. ఆయన రాకకు నా ముఖం ప్రఫుల్లమైనట్లు నాకే స్పష్టమైనది.

“నాకు 'చా’వద్దు, ‘చీ’వద్దు. మీరు వెంటనే దుస్తులు ధరించి నాతో రావాలి. ఇవి ప్రభుత్వంవారి ఆజ్ఞలు” అని త్రిపాఠీ చిరునవ్వుతో హెచ్చరించాడు.

“ఏ ప్రభుత్వంవారు!' అన్నాను నేను.

“ఆ ఆజ్ఞలు మీకేమీ తెల్పడానికి వీలులేదు. రహస్యపు టపాలో వచ్చాయి.

గబగబా ఉచితమైన వేషం వేసుకొని ఆయనతోపాటు కిందకుదిగి హాస్టలు భవనాల ముందున్న తోటలోనికి వస్తిమి గదా - అక్కడ తోట రోడ్డుమీద త్రిపాఠీగారి కారు సిద్ధంగా ఉంది. ఆ కారులో జ్యోతిర్మయీ, ఆనందమయీ ఇద్దరూ కూర్చుని ఉన్నారు. త్రిపాఠీగారు నన్ను వెనుక సీటులో ఆనందమయి ప్రక్కన కూర్చుండమని తాను తన భార్య ప్రక్క ముందు సీటులో కూర్చుని ఉన్నాడు. జ్యోతిర్మయి కారును మేల్కొలిపి, గుర్రున నడక సాగింపించినది. నేను ముందుకుపడబోతే ఆనందమయి నన్ను రెండు చేతులతో ఆపుచేసి తనవైపునకు లాగుకొంది.

“కొంచెమయితే పడిపోయి ఉందురు. మా అక్క ఎప్పుడూ ఇంతే లెండి. ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉంటే కొత్తవాళ్ళయితే ప్రాణాలు ఎప్పటికప్పుడు ఎగిరిపోయినవనే అనుకుంటారు. మాకు అలవాటు అయింది లెండి” అని అంటూ ఆనందమయి కొంచెం దూరంగా జరిగింది.

“అయితే దారిపొడుగునా మీరు నన్నిలా రక్షిస్తూ ఉండవలసినదేనా యేమిటి?” అని నవ్వుతూ అన్నాను.

“అలా అని, అవసరం కలగకపోయినా నాకు పని కలిగించేందుకు ముందుకు వాలిపోకండేం!”

“పని కలిగిస్తే మీకు...” ​“టర్నింగ్ వస్తున్నది. జాగ్రత్త చతుర్వేదిగారు, గట్టిగా పట్టుకోండి.”

మళ్ళీ టర్నింగ్ రానేవచ్చింది. ఆమె వొళ్లోకి నేను పడ్డాను. పాపం మళ్ళీ నన్ను గట్టిగా ఆనందమయి పట్టుకొన్నది. మా ప్రయాణం లక్నో రోడ్డుమీద సాగుతున్నది. నేను ప్రాణాలు బిగపట్టుకునే ఉన్నాను. అయిదు మైళ్ళు ఆ రీతిగా మా ప్రయాణం సాగింది. అక్కడ రోడ్డు ప్రక్కనే మంచి తోటలోనికి మా కారును పోనిచ్చింది జ్యోతిర్మయి. నాకు తుపానులో కొట్టుకుపోయిన విమానము జాగ్రత్తగా భూమిని వాలింది అనిపించింది.

త్రిపాఠి: ఈతోట మా మామగారిది చతుర్వేదిగారూ! ఆయన ఈ తోటలో యెక్కడో పనిచేస్తూనే ఉంటారు. మనం నలుగురం కలసి కాసేపు టెన్నిస్ ఆడుకొని, కాసేపు బ్రిడ్జి ఆడుకొని ఇక్కడే భోజనాలు చేయడం. ఇక్కడే ఈ రాత్రి మకాం. మా మామగారు కాసేపటికి వెళ్ళిపోతారు.

నేను: అయ్యో! నేను హాస్టలులో చెప్పిరాలేదే.

జ్యోతి: దానివల్ల మీకు నష్టమా?

నేను: నష్టంకాదనుకోండి.

త్రిపా: ఉండవయ్యా! టెన్నిసు ఆట కాగానే నేను కారు మీదపోయి టెలిఫోనుచేసి వస్తానులెండి.

నేను: మరి... మరి....

ఆనం: నత్తివస్తోందేమిటి చతుర్వేదిగారూ!

జ్యోతి: చతుర్వేదిగారు హాస్టలులో ఉండటం నాకేమీ బాగుండలేదు.

త్రిపాఠి: ఈ నెలాఖరునుంచి మన ఇంటిలోనే మకాం పెడతారులే.

నేను: అప్పుడు నాకిచ్చే ఉచితవేతనంలో కొంత తగ్గిస్తారు.

ఆనం: ఎంత తగ్గిస్తారు? మీ హాస్టలుచార్జీ వారే కట్తున్నారు. అది మాన్తారు ఏమిటి నష్టం?

నేను: అయ్యో! మీ ఇంటిలో ఉండడం యేమి బాగుంటుందండి?

జ్యోతి: ఎందుకు బాగా ఉండదు? మీరు వ్రాసే వ్యాసం వ్రాతకు మేమెవ్వరం అడ్డురాము. మీరు లేబరేటరీకి వెళ్ళాలన్నా, లైబ్రరీకి వెళ్ళాలన్నా మా ఆనందమయి తా నెల్లాగూ వెళ్ళాలి కనక కారులో మిమ్ములను తీసుకొని వెడుతుంది. మళ్ళీ సాయంత్రం కాగానే కారులో తీసుకువస్తుంది. రాత్రిళ్ళు మా అమ్మాయికి మీరు పాఠం చెప్పితీరాలి.

త్రిపా: అసలు రహస్యం చెప్పేయరాదూ?

జ్యోతి: ఏముంది లెండి, చతుర్వేదిగారు! హాస్టల్లో ఉండరనీ, మా ఇంట్లోనే ఉంటారని మేము విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునికి చెప్పాము. హాస్టల్ వార్డనుకు చెప్పాము. ఈ సాయంత్రం నుంచే రారని చెప్పామండోయి.

త్రిపా: మీ సామానంతా రేపు మా యింటికే వచ్చేస్తుంది. మీరు అసలు హాస్టల్‌కే వెళ్ళనవసరంలేదు.

ఆనం: మీ గదిని వార్డెన్‌గా రెవ్వరికో ఇచ్చి వేయడం కూడా జరిగింది.

వీరందరూ ఇలా అంటుంటే నాకు మతిభ్రమణమే కలిగిందనుకొన్నాను. ​నేను: ఏమిటండీ! బ్లిట్జ్‌క్రీగ్.

జ్యోతి: బ్లిట్జ్ అని వెనుకటి యుద్ధం సంగతి మాట్లాడతారేం. వచ్చే యుద్ధంలో ఇది ఆటం క్రీగ్.

టెన్నిస్ ఆడుకొన్నాం. బ్రిడ్జి ఆటకు కూర్చున్నాం. నేనూ ఆనందమయీ ఒకటి; జ్యోతిర్మయీ త్రిపాఠీ ఒకటి. ఇంతట్లో ఆనంద, జ్యోతిర్మయిల తండ్రి, త్రివేదిగారి కారు వెళ్ళిపోతున్న చప్పుడయింది. మేము బ్రిడ్జి కల్‌బర్‌స్టన్ విధానాన్నే ఆడాము. వారు ముగ్గురూ ఆ ఆటలో నిధులు. నేనంత పెద్ద ఆటకాణ్ణికాను. అందులో నా మనస్సు యే మాత్రమూ నిలకడ లేకుండా పోయింది. ఆలోచనలు ఒకపక్క; ఆటలు ఒకప్రక్క నేను రెండు ఆటలు అలా పాడుచేసేసరికి చాలా సిగ్గు వేసింది. “ఇవాల్టికి ఈ ఆటతో చాలు నండీ!" అని వారి ముగ్గురికీ కొంత సిగ్గుతో మనవి చేసుకున్నాను. ఆనందమయి లేచి నా దగ్గరకువచ్చి "మీరు ఇంతమాత్రము ఆడుతారనుకోలేదండీ. రండి, అలా తోటలోకి షికారు వెడదాము” అని చేయి పట్టుకు లేవదీసింది.

ఆ అమ్మాయి ఇంత చనువుగా నాతో సంచరించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది. మేమిద్దరం పూలతోటలో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి నా ఆలోచన గ్రహించింది కాబోలు - “చతుర్వేదిగారూ! మా కందరికీ ఎందుచేతనో మీరు చాలా దగ్గరి చుట్టమైనట్లు భావం కలిగింది. నే నందరితోను ఇలా చనువుగా ఉండను. మా బావగారంటేనే దూరదూరంగా ఉంటాను. ఒక్క మా అన్నయ్య అంటే చాలా చనువు. మా జ్యోతి మీరు తనకు కాస్తా అన్నగారయినట్లే భావిస్తుంది. మా చనువుకు మీరేమీ అనుకోవద్దేం” అని అంటూ నా మొగంవైపు చూపులు ప్రసరించింది.

ఆనందమయి సాన్నిధ్యము నాకు నిజంగా మతి పోగొడుతున్నది. ఏమి మాట్లాడాలో నాకు తోచదు. ఆమెతోకూడా మౌనంగా తిరుగుతున్నాను. ఆమె కూడా మౌనం తాల్చింది.

నేను బ్రహ్మచారిని, అతిబీదవాడిని; కాస్త చదువులో పదిమందికన్నా నయమవడం చేత పరీక్షలో మొదటి వాణ్ణిగా నెగ్గుతూ వచ్చాను. నాకు వివాహం సంగతి ఎప్పుడూ తట్టలేదు. నేను చదువుకొనేటప్పుడు నా తోటి విద్యార్థినులు కాని, యితర బాలికలుగాని నన్నే విధంగా ఆకర్షించలేదు. వారిలో చాలామంది అందమైనవారేకాని నా బుద్ధి ఆడవాళ్ళమీదనే ప్రసరించని రోజులలో వాళ్ళ అందచందాలు కాని, వాళ్ళ తెలివితేటలుకాని నన్నేమి ఆకర్షించగలవు. కనక? బి.ఎస్‌సి. పట్టం పొంది ఏ మంచి ఉద్యోగమో సంపాదించుకొన్న తర్వాత వివాహం మాట ఆలోచిస్తానన్నాను, మా పెద్దలందరితోను, డబ్బుకలవాళ్ళ పిల్లల సంబంధాలు వచ్చినవని నా తల్లితండ్రులూ, నా మేనమామా చాలా సార్లు ఒత్తిడిచేశారు. కాని నా నిశ్చయం ఏ మాత్రం వదలినాను కాను. ఇప్పుడీ ఆలోచనలన్నీ రావడం దేనికి? హిందూదేశంలో వింధ్యపర్వతేశ్వరుడు లేనేలేడా? గంగా గోదావరులు ఒకేచోట పుట్టాయా? సర్వసమమైన భావాలు మానవ జీవితంలో చొచ్చుకు వచ్చినప్పుడే ఇది గంగ, అది గోదావరి అవుతుంది. ఇది తూర్పు కనుమా అది పడమటి కనుమా అవుతుంది. ఆనందమయి చటుక్కునాగి 'చతుర్వేదిగారూ! మీకు మా ఎవ్వరిమీద కోపం కలగలేదుకదా? నేను ఎప్పుడు మీతో మాట్లాడుదామని వచ్చినా, మీరు ఏదో ​ఆలోచిస్తూ ఉంటారేమి? మీరు మాయింట్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసింది మా అక్కే సుమండి. ఆవిడకు నిజంగా మీవద్ద కొన్ని విషయాలు నేర్చుకోవాలనిఉంది. నాకు కొన్ని విషయాలు, మా అక్కకు కొన్ని విషయాలు నేర్పుతూ కూర్చున్నారంటే మీ కాలమంతా భగ్నమై మీ చదువుకు అంతరాయం కలగవచ్చు. అయినా మా అక్క మాటను ఎవ్వరం కాదనలేము. ఆవిడ ఒకటి చెప్పిందంటే అది అశోకాజ్ఞ” అని తలవాల్చుకొని తొందరగా చెప్పింది.

మే మిద్దరం ఆ ప్రక్కన నున్న ఒక ఉద్యానవనాసనంపై కూర్చున్నాం.

“ఆనందమయీదేవిగారూ! మీరు నాకేమీ కష్టం కలిగించలేదు పైగా పూర్తికావచ్చిన నా వ్యాసాన్ని బాగా ముగించడానికిన్నీ, వ్యాసమంతా మళ్ళా మొదట్నించీ సరిచేసుకోడానికీ హాస్టల్ వీలైన ప్రదేశంకాదని అనుకొంటూ ఉన్నాను. పైగా నావ్యాసం అంతా ఎప్పటికప్పుడు ఊళ్ళో ఉన్న ఒక టైపు షాపుకు వెళ్ళి టైపు కొట్టుకుంటున్నాను. అది రాత్రిళ్ళు వీలుకాకుండా ఉన్నది. నేను టైపుమిషను కొనుక్కోలేను. వీలుగావుంటే ఆ టైపుపెట్టెను నేను ఉపయోగించుకోగలను” అని ఆమెతో నెమ్మదిగా అన్నాను.

7

ఆ రాత్రి భోజనాలయిన వెనుక ఆ తోట భవనంలో మేము చాలా సేపు రాజకీయాలు, సారస్వతాలు, కళలు, శాస్త్రవిషయాలు చర్చించుకున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చితీరాలని నావాదన. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే భావమే సకలభారతావని ఒక్క మహాశక్తితో విజృభించడానికి అన్ని విధాలా అడ్డమని త్రిపాఠీ వాదన.

నేను: ఉన్న భాషలు తీసివేయలేము. ఒకే భాష మాట్లాడేవారు సన్నిహితంగా రావడం తప్పించలేము; బ్రాహ్మణా బ్రాహ్మణ విభేదాలు మా రాష్ట్రంలో వున్నమాట నిజమే. అవి మీ రాష్ట్రాలలో తక్కువ ఉండవచ్చును. అయినా మా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు ఇతర రాష్ట్రాలలో ఉన్న బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులకన్నా తమలోతాము ఎక్కువ సన్నిహితంగా ఉంటారు.

త్రిపా: అది నేను నమ్మను. మీ మద్రాసు శాసన సభ సంగతులు చూస్తూవుంటే, మీ మంత్రిత్వపు గడబిడలు గమనిస్తూ వుంటే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, బ్రాహ్మణేతరులంతా ఒకటై ప్రకాశంగారి మంత్రివర్గాన్ని పడగొట్టారని స్పష్టంగా తెలుస్తున్నది.

నేను: అది అంతా పూర్తిగా నిజంకాదు, మొదటిసారి ప్రకాశంగారిని ఓడించడంలో ఎవరో ఒకరిద్దరు తప్ప చాలామంది తమిళ బ్రాహ్మణులు ప్రకాశంగారికి వ్యతిరేకులయ్యారు. తెలుగు వారిలో ప్రకాశంగారి తరఫున చాలామంది బ్రాహ్మణేతరులున్నారు. ఈ కక్షలన్నీ నా ఉద్దేశంలో వ్యక్తి సంబంధమైనవని మాకు ఆనాడు కావలసింది కాంగ్రెసువారిరాజ్యం. అందులోకల్లా యీ పక్క పెద్ద ప్రకాశంగారు, ఆ ప్రక్క రాజగోపాలచారిగారు. ఈ ఇద్దరూ కలసి మంత్రివర్గం ఏర్పాటు చేసివుంటే ​మద్రాసురాష్ట్ర వ్యవహారాలు చాలా అద్భుతంగా వుండి వుండును. కాని ఇక్కడ కూడా భాష అడ్డు వచ్చింది. రాజగోపాలాచారిగారూ, ప్రకాశంగారూ కలవడానికి ఏవో అడ్డువచ్చాయి. ఇంతకూ నా వాదన సత్వరంగా ఆంధ్రరాష్ట్రం వచ్చితీరాలి.

జ్యోతి: అయ్యయ్యో! మీరలా అంటారు. మారాష్ట్రమంతా ఒకే భాషేనా, అయినా చూడండి! కాంగ్రెసు వారిలో ఎన్ని ముఠాలున్నాయో?

ఆనం: నిన్నటివరకూ రాక్షసుల్లా కష్టపడ్డారు కాంగ్రెసువారు; స్వరాజ్యం సంపాదించారు; రాజ్యరథం నడపడానికి పగ్గాలు చేతపట్టారు. ఇంక తమదేశం మాట మరచిపోయారు.

నేను: ఎవరో నెహ్రూ, పటేలు, రాజేంద్రబాబు, అజాద్ ఇంకా అలాంటి పెద్దలు తప్ప తక్కినవారందరూ తామింకా అసలైన గమ్యస్థానం చేరలేదన్న విషయాన్ని మరచిపోయారు.

త్రిపా: అది మరచిపోవడం కాదేమో. వారు అనుకోని ఊహించలేని ప్రళయాలు వచ్చిపడ్డం చేత ఈ మోస్తరుగా సంచరించవలసి వచ్చిందేమో ఆలోచించారా?

నేను: మీరన్నదానిలోనూ నిజం లేకపోలేదు. కాని అసలు గాంధీతత్వం వెనుక పడిందంటారా లేదా?

ఆనం: నేను తప్పకుండా నిజమంటాను.

జ్యోతి: నేను పూర్తిగా నిజం కాదంటాను. ఎందువల్ల నంటారా బ్రిటిష్ వారి పరిపాలనవల్ల నేమి, మరి భారతీయుల సంప్రదాయ ఛాందసంవల్లనేమి మనలో మధ్యయుగపు భావాలన్నీ కరడుకట్టి వున్నవి, గాంధీగారిని అనుసరించిన రోజులలో కూడా ప్రతి కాంగ్రెసు వీరుడూ నూటికి పది పాళ్ళు మాత్రమే అనుసరించాడు. ఆ మాత్రానికే అతడు వీరుడనుకున్నాడు.

ఆనం: లేకపోతే స్వరాజ్య మెలా వచ్చింది.

నేను: ఇది నిజమైన స్వరాజ్యమంటారా ఆనందమయిగారూ! నిజమైన స్వరాజ్యమయితే పాకిస్థాన్ విడిపోనేపోదు. కాంగ్రెసులో జైలుకు వెళ్ళినవాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, ప్రాణాలు కోల్పోయినవాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళు, ఎందుకూ పనికిరాకుండా పోయినవాళ్ళు నూటికి పదిపాళ్ళు అనుసరించిఉండినా పంజాబు హత్యలు నవఖాళి హత్యలురానేరావు.

ఆనం: అవతారమూర్తి అయిన ఒక మహానుభావుడు వుద్భవించినప్పుడు ప్రజలు ఆయనను నూటికినూరుపాళ్ళు ఎప్పుడూ అనుసరించలేరు. నూటికి ఏ అయిదుపాళ్ళు అనుసరించినా మానవ సంస్కృతి ఎన్నోమెట్లు పైకి నడిచిపోగలదు.

నేను: ఇంతకూ మీరు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటారా అక్కర్లేదంటారా?

త్రిపా: కొంత కాలానికైనా అవి పోవాలి. రాజ్య పరిపాలనా సౌకర్యం మాత్రం కోసమే రాష్ట్రాలు ఏర్పడాలి.

నేను: అలా ఏర్పడ్డంవల్ల రష్యాలో ఏమీ నష్టం కాలేదే? స్విట్జర్లాండులో ఏమీ కష్టాలు కలుగలేదే? ​ఇలా మా సంభాషణ సాగించి మేమింత గట్టిగా వాదించుకొనడం వల్ల ఆంధ్రదేశానికి ప్రత్యేక రాష్ట్రం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. దక్షిణాదిన ఉండే ఆంధ్రులే ఆంధ్రరాష్ట్రానికి వ్యతిరేకమయినారు. భాష ఒకటైనంత మాత్రాన అందరినీ ఏకోన్ముఖంగా చేస్తుందా ఏమన్నానా? ఆ రాత్రి రెండుగంటలకు నిద్రపోయాం.

తెల్లవారి ఆరుగంటలకు నాకు మెళకువ వచ్చింది. కళ్ళు తెరిచేటప్పటికి నా గదిలో గుమ్మం దగ్గర నన్ను గమనిస్తూ ఆనందమయి నిలుచుని వుంది. నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. “రాత్రి ఎంత నిద్రలేకపోయినా, నాకు పెందలకాడె మెలుకువ వచ్చేదండి. ఈవాళ నాకిలా వొళ్ళు తెలియకుండా నిద్రపట్టిందేమిటో” అని కొంచెం సిగ్గుతోనే అన్నాను.

“మీరేమీ కంగారుపడకండి. నేను ఒక్కతెనే లేచాను. బావా, అక్కా ఇంకా నిదురపోతూనే ఉన్నారు. మీరు లేచారేమో, మీకు కాఫీ కావాలా, టీ కావాలా అని అడగటానికి వచ్చాను” అని ఆనందమయి అంటూ “మీరు ముఖం కడుక్కుని హాలులోకి రండి" అన్నది.

“నాకు కాఫీ అంటేనే యిష్టం. మీ దేశానికి వచ్చాక టీకూడా అలవాటులెండి. అయినా ప్రొద్దున్నప్పుడు కాఫీయే పుచ్చుకుంటాను" అని అన్నాను.

"మీ హాస్టల్లో కాఫీ తయారు చేస్తారాండీ?”

“తెలుగువాళ్ళము, అరవవాళ్ళము, కన్నడవాళ్ళము అంతా కలసి పదిమందున్నాము హాస్టల్‌లో. మా వంటవాళ్ళకి కాపీ చేయడంకూడా నేర్పాము.”

“అయితే మీరు నాకు కూడా నేర్పండి. నేను మా వంటవాళ్ళకి నేర్పుతాను.”

మే మిద్దరమూ నవ్వుకున్నాము. ఆమె వెళ్ళిపోయింది.

హాలులో మే మిద్దరమూ ఉపహారాలు పుచ్చుకొనే సమయంలో జ్యోతిర్మయీ సుప్రియా త్రిపాఠీ మేడమీదనుంచి కిందకు దిగివచ్చారు.

8

నా పరిస్థితి చిత్రంగానే ఉంది. త్రివేదీగారింట్లో నేను చుట్టాన్నయ్యాను. ఆ యింట్లో నన్నందరూ ఎంతో గౌరవంగానూ, ప్రేమతోనూ చూస్తున్నారు. జ్యోతీంద్రనాథ త్రివేదీగారు ఉత్తముడైన అడ్వొకేటు. నెలకు ఇరవై ముప్ఫైవేలు ఆదాయం వస్తుంది. ఆయన మొదట మోతీలాల్ నెహ్రూగారి దగ్గిర జూనియర్‌గా చేరినారు. భారత ప్రధాని నెహ్రూజీతో ఆయన సమకాలికుడు. మొదటనుండీ కాంగ్రెసు అభిమాని. నెహ్రూ కుటుంబం దేవతల కుటుంబం అని ఆయన నమ్మకం.

ఆయన సంప్రదాయాభిమాని. జప తపాదులు దైనందిన ధర్మంగా నిర్వహించే సనాతనవాది. అయినా సంఘంలో వచ్చే మార్పులంటే ఆయనకు ఇష్టమే! మరీ పెద్దమార్పులు తార్కికంగా ఆయన ఒప్పుకున్నా వచ్చే ఉద్యమ విషయంలో ప్రథమ సమయంలో ఆయన విముఖంగానే ఉండేవారు. హరిజనులు దేవాలయాలకు రావడం ఆయనకు కిట్టలేదు. హిందూ వివాహానికి విడాకుల శాసనం తీసుకురావడం ఆయన మనస్సుకు ​వజ్రాఘాతంలా తగిలింది. మదరాసు రాష్ట్రం సనాతన ధర్మ పూర్ణము అని ఆయన భావించుకొనేవారు. మదరాసు రాష్ట్రవాసుల ఆచారాలు సనాతన ధర్మపూర్ణాలనుకొన్నాడాయన. కాని అక్కడ విడాకుల చట్టం ఆయనకు ఆశ్చర్యం వేసింది.

అయినా ఆయనకు వేదకాలపు మహాఋషుల శక్తి అంటే అపారమైన నమ్మకం. ముందు యుగాలలో అవసరమైన మార్పులు వస్తూఉండేటట్లే వారు నిర్ణయించారనీ, రాను రాను యుగాలు అవతరించిన కొలదీ, ప్రపంచంలో అన్నిభాగాలూ వేద ధర్మానుసరణమైన దివ్యభావాలు గ్రహించి, భారతీయ సంస్కృతిలో చేరిపోతాయని ఆయనకు గాఢ విశ్వాసం. మార్పు వచ్చినప్పుడు బాధపడతాడు. వచ్చిన కొద్ది సంవత్సరాలకు సమన్వయం చేసుకుంటాడు. 'మహాత్మాగాంధీ అవతార పురుషుడే కాని మాలవ్యా శివుని అవతారం. వీరిద్దరూ లోక సంగ్రహణానికి అవసరం' అని ఆయన వాదించుకుంటాడు; ఇతరులతో వాదిస్తాడు. శారదా శాసనం వలదని వాదించాడు. వచ్చిన వెనక చాలా బాగుందన్నాడు. హిందూ మహమ్మదీయ సమన్వయం కూడదన్నాడు. కాని రానురాను మహాత్మాజీని బాగా అర్థం చేసుకున్నాడు.

ఇంతకూ ఆయనకు ఉత్తర రాష్ట్రాల బ్రాహ్మణులే నిజమైన ఆర్య ఋషి సంజనితులనీ, దక్షిణాది పంచద్రావిడులు, ఎవరో తురేనియన్ జాతులలోనుండి ఉద్భవించి వుంటారనీ నిశ్చితమైన సిద్ధాంత సూత్రం! అందుకనే చతుర్వేది తన పంక్తిలో ఎప్పుడూ భోజనం చేయడం ఆయనకు ఇష్టంలేదు. త్రిపాఠీ ఆంగ్ల దేశాది పాశ్చాత్య దేశాలలో సంచరించి రావడంవల్ల అతడూ పంక్తి బాహ్యుడే. అతని భార్య, తన పెద్దకూతురు జ్యోతిర్మయీ అంతే! ఒక్క ఆనందమయి మాత్రం తన ప్రక్కను కూర్చుని భోజనం చేయవచ్చును.

ఒకరోజు రాత్రి త్రివేదీగారి భవనంలోని హాలులో నవజవాన్‌లము మేము నల్వురమూ కూర్చుండి హోరాహోరీ వాదించుకుంటూ ఉంటే త్రివేదీగారు అక్కడకు వచ్చి ఒక ఆసనం అధివసించినాడు. యువతీ యువకులమైన మేము నల్వురం మౌనం తాల్చినాము. ఆయన నవ్వుతూ ఆనందమయి వంకచూచి "బేటీ! ఏమిటి మీరు వాదించే విషయం?” అని ప్రశ్నించాడు. ఆనందమయిని ఆయన గాఢంగా ప్రేమించాడు. అలా అని జ్యోతిర్మయి అంటే తక్కువ ప్రేమకాదు. బ్రూటను చెప్పినట్లు అతడు “సీజరును తక్కువ ప్రేమించుట లేదు; రోము అంటే ఎక్కువ ప్రేమ.”

ఆనం: దాదాజీ! చతుర్వేదిగారంటారు దక్షిణాది బ్రాహ్మణులు అసలైన ఆర్యఋషి సంతతివారని, అక్క ఉత్తరాది పంచ గౌడులే సిసలైన వారంటుంది.

త్రివే: నీ వాదన?

ఆనం: నేను విద్యార్థినిని; అందుకని వాదనలన్నీ విని నా అభిప్రాయం నిశ్చయం చేసుకుందామని అనుకున్నాను.

జ్యోతి: దాదాజీ! చతుర్వేదిగారంటారు: రామాయణకాలంలో దక్షిణాదికి వలసవెళ్ళి, మహర్షులు ఆశ్రమాలు స్థాపించినారని సిద్ధాంతం ఉందిగదా! ఆ ఋషుల సంతతిలో తాము ఉద్భవించినారట. ఇక్కడ ఉత్తరాది శకులు, హూణులు, పహ్లవులు తండాలు ​తండాలుగా వచ్చి ఆర్యులలో కలసిపోయారట. వారిలో కొందరు క్షత్రియులైనారట; కొందరు బ్రాహ్మణులైనారట!

త్రివే: నీ అభిప్రాయం సుప్రియా?

త్రిపా: ఆ వాదనా ఈ వాదనా రెండూ శుద్ధ నిష్ప్రయోజనాలే. చరిత్రాత్మకంగా నిజం గ్రహించలేము. వట్టి అంచనాలు, ఊహాగానాలు చారిత్రక సత్యంకాజాలవు. మన పంచగౌడులలో కాశ్మీరులు, బెంగాలీలు, ఓడ్రులు, సారస్వతులు, మత్స భుక్కులు, మాంస భుక్కులు, మైథిలులు, ఘూర్జరులూ మాత్రం శాకాహారులుకదా? పంచద్రావిడులైన ఆంధ్రులు, కన్నడులు, తమిళులు, మహారాష్ట్రులు, మలయాళ నంబూద్రీలు - అందరూ శాఖాహారులే.

త్రివే: చతుర్వేదిగారూ! మీ సిద్దాంతం అంతా పూర్తిగా చెప్పండి.

చతు: దక్షిణాదిని ఋష్యాశ్రమాలు రామాయణకాలంలో బాగా వెలిశాయి. అప్పటికి ఆర్యావర్తమైన ఉత్తరాది అంతా జనాకీర్ణమైన గ్రామాలతో పట్టణాలతో నిండిపోయింది. కాబట్టి ఆర్యఋషులు ఆశ్రమాలు హిమాచలంలోనన్నా నిర్మించుకోవాలి. లేదా దండకారణ్యంలో నన్నా నిర్మించుకోవాలి.

జ్యోతి: అయితే అప్పటి ఋషులకు దండకారణ్యం అపవిత్రమూ, నివాసయోగ్యతా రహితమూ అయిన ప్రదేశమని భావం వుంది కాదా అండి.

చతు: ఆర్యావర్తం ఎందుకు పవిత్రమైనదీ? ఆర్యఋషులు వర్తించడంవల్ల యజ్ఞయాగాది పవిత్రకర్మలు జరపడంవల్లా, తద్వారా ఆ ప్రదేశాలకు దేవతలు దిగిరావడంవల్ల కదా!

త్రివే: అవును.

చతు: అయినప్పుడు వింధ్య దాటి శరభంగుడు, మతంగుడు, ఇంకా అనేకులు దండకారణ్యానికి పోయి ఆశ్రమాలు ఎందుకు నిర్మించుకొన్నారు? ఆ ప్రదేశాన్ని కూడా తమ యజ్ఞయాగాదులచే పవిత్రం చేయాలనికదా! కాని అచ్చటి రాక్షసులైన నీగ్రోజాతి అడవి మనుష్యులు ఆ ఆశ్రమాలను నాశనం చేస్తూవుంటే వాటిని కాపాడేందుకు శ్రీరామచంద్రుడు రావలసి వచ్చింది. రాక్షసులను నాశనం చేసి ఆశ్రమాలు సుస్థిరం చేశాడు శ్రీరామమూర్తి.

ఎవరు లొంగుతారు! పూర్వకాలంలో వాదనలో ఓడిపోతే తమ మార్గం కూర్చుకునేవారని చరిత్ర చెబుతుంది. ఈనాడు న్యాయంగా వాదించుకోడాలు అవతలవారిని ఏడిపించడానికే. అలా అని తెలుసుకోవాలని వచ్చి ఆ విషయం అర్థమయ్యే వరకూ పిడుగులా వాదించి, ఆవెనక తమకు నచ్చితే ఆ వాదన ఒప్పుకునేవారూ ఉన్నారు..

9

ఇంత వాదనలలోనూ ఆనందమయి మాట్లాడకుండా కూర్చుండి, ఎవరు మాట్లాడుతో ఉంటే వారిని తీక్షణంగా గమనిస్తూన్నది. ​ఆనందమయి జ్యోతిర్మయీదేవికన్న చాలా అందమైన అమ్మాయి. జ్యోతిర్మయే చాలా చక్కని బాలిక. ఇద్దరు అక్క చెల్లెళ్ళూ సరస్వతీ, శారదలు. ఒకరికన్న ఒకరు అందంగా కనబడతారు. జ్యోతిర్మయికన్న ఆనందమయి ఒక ఛాయ ఎక్కువ. జ్యోతిర్మయి పూర్ణిమ ముందు చతుర్ధశినాటి వెన్నెలైతే, ఆనందమయి పూర్ణిమాజ్యోత్స. ఎంతో జాగ్రత్తగా గమనిస్తే గాని ఈ తేడా తెలియదు. ఇద్దరూ వికసించిన దేహసౌష్ఠవం కలవారు. ఆనందమయికన్న జ్యోతిర్మయి రెండేళ్ళు పెద్ద. ఆతేడా మాత్రం వాళ్ళిద్దరిలో కనిపిస్తుంది.

ఇద్దరివీ సమనాసికలు, ఇద్దరివీ విశాలమైన కళ్లు. కాని జ్యోతిర్మయి పెదవులు కొంచెం పెద్దవి. ఆనందమయి పెదవులు సమంగా ఉంటాయి. జ్యోతిర్మయి పెదవుల అంచులు నవ్వుతున్నట్లు పైకి తిరిగి ఉంటాయి, ఆనందమయి పెదవుల అంచులు సమరేఖాంచలములై ఏదో ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లుంటాయి.

నాకు కళలలో ఏమీ ప్రజ్ఞలేదు. నేను సంగీతం పాడలేను; బొమ్మలు వేయలేను; పాటలూ పద్యాలూ సృష్టించలేను. కాని నవలలన్నా, నవలలకన్న నాటకాలన్నా, నాటకాలకన్న కథానికలన్నా, కథానికలకన్న పాటలన్నా, పాటలకన్న పూర్వకవుల కవిత్వమంటేనూ మహాఇష్టం. నా చిన్న లైబ్రరీలో ఎన్నో తెలుగు ప్రబంథాలు, భారత సంపుట భాగాలు, పోతనామాత్యుని భాగవతమూ ఉన్నాయి.

జ్యోతిర్మయి, ఉత్తరాది బాణీ సంగీతంలో ఘటికురాలు; కథక నృత్యంలో మంచి ప్రజ్ఞావంతురాలు. ఆనందమయికి బొమ్మలంటే ఇష్టం. ఆవిడ స్వంత గ్రంథాలయంలో భారతీయ చిత్రలేఖనాన్ని గూర్చీ, శిల్పాన్ని గూర్చీ, వాటి ఆశయాలను గూర్చీ ఎన్నో గ్రంథాలున్నాయి. ఆమె సంగీతం పాడుతుంది. కాని శాస్త్రంగా నేర్చుకోలేదు. అక్కగారు కథక విధాన నృత్యం నేర్చుకుంటూ ఉన్నప్పుడు తానూ కొన్ని కరణాలు అలవరచుకొన్నది.

ఆనాడు బ్రాహ్మణత్వాన్ని గూర్చి అలా వాదించుకొంటూ ఉంటే, దక్షిణాపథదేశాల - బ్రాహ్మణేతర బ్రాహ్మణ ప్రశ్నను వాదనలోనికి తీసుకువచ్చి జ్యోతిర్మయి "ఒకవేళ మీ తమిళ సోదరులు కొందరు వాదించిన రీతి దక్షిణాది బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణులైతే అయి ఉండవచ్చును.”

నేను: నేను ఆ వాదము ఒప్పుకోను. దక్షిణాది బ్రాహ్మణేతరులలో అనేకులు ఆర్యులే. మా రెడ్లూ, కమ్మవారూ, రాజులూ, బలిజలూ ఒకనాడు బ్రాహ్మణులే. బౌద్ధమత జైనమత సంఘాతంవల్ల బ్రాహ్మణత్వం కోలుపోయి సచ్ఛూద్రులయ్యారు. అలాగే దక్షిణాది వెల్లాలులా అంతే. కూర్గువారిలో చాలామంది అంతే!

త్రిపా: ఇంతకూ ఈ వాదన ఏమి తేలినట్లు? నేడు మనకు కావలసి నది, బలమైన భారతము. అజేయమైన భారతము, మతాలూ, కులాలూ అన్నీ ఏకమైపోవాలి.

త్రివే: హరహరా, ఇన్ని యుగాలనుండీ హిమాలయంకన్న శాశ్వతంగా నిలిచిన సనాతనధర్మం నాశనమయి పోవలసిందే?

నేను: నిజం మీరు చెప్పింది. ఆ ధర్మాన్ని ఎవరు నాశనం చేయగలరు?

త్రిపా: అసలు ధర్మం మంటగలిపినా, సనాతన ధర్మం మాత్రం ఎందుకు నిలవాలి దాదాజీ?

త్రివే: సనాతనధర్మమే అసలు ధర్మం! ​త్రిపా: మానవధర్మం అంటూ వేరేలేదూ? ఈ మతాలు ఈ భారతదేశం, ఈ ఋషిప్రోక్తమూ ఇదేనా మానవధర్మం?

నేను: సర్వకాలాలకు సర్వదేశాలకు సత్యమయిన ధర్మమేదో అదే ఋషులకు తపస్సులో దర్శనమిచ్చింది. కాని ఆ ధర్మం వేదంలోనూ, ఉపనిషత్తులలోనూ వ్యక్తం అయి ఉంది. తక్కిన ధర్మశాస్త్రాలు కాలానుబద్ధాలు. అదీ మా రాధాకృష్ణపండితులు తెలిపింది.

ఆనం: వారి పుస్తకం నాకు చదివి వినిపించి, అర్థం చెప్పండి చతుర్వేదిగారూ!

జ్యోతి: సైన్సు చదువు త్రివేణీలో సంగమించాలా?

త్రివే: ఏమో, చతుర్వేదిగారు అన్న ముక్కా నాకు నచ్చలేదు. ధర్మశాస్త్రాలే వేదోపనిషత్తుల భాష్యాలు.

త్రిపా: అంతేనంటారా దాదాజీ! మీరు పేరుపొందిన అడ్వకేట్లు. ధర్మశాస్త్రాలను లా పుస్తకాలలోనికి దింపినవారిలో దిట్టమయినారు. ధర్మ శాస్త్రాలు కాలానుసారంగా మారలేదంటారా?.

త్రివే: మారినాయి. కాని మూలధర్మం ఇంతైనా మారలేదు.

త్రిపా: కులాలూ మతాలూ కలిసిపోతే మూలధర్మమయిన బ్రహ్మ పదార్థం మారుతుందా?

ఈ వాదన అంతటితో ఆగిపోయింది. హాలు గడియారం సంగీతంలా పదకొండు గంటలు కొట్టింది. “ఇంక పడుకోండి; చాలా ప్రొద్దుపోయింది” అంటూ త్రివేదిగారు లేచినారు. అందరం లేచినాము, ఎవరి గదులలోనికి వారు వెళ్ళడానికి, “మూలధర్మం అనేది బ్రహ్మపదార్థం కాదనుకుంటాను. జీవితాన్ని ఆధ్యాత్మిక సత్యాన్నీ సమన్వయం చేయడంలో ఉద్భవించిన వరవడిరాయే మూలధర్మం అవుతుందనుకుంటాను. అదే భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి దేశమంతా నిండి ఉందని నా నమ్మకం" అన్నాను.

త్రివేదిగారు మేడమెట్లు ఎక్కబోతూ, “ఒకే సంస్కృతి భారతం అంతా నిండి ఉందని నేననుకోను. దక్షిణ భారత సంస్కృతికీ, ఉత్తర భారత సంస్కృతికీ చాలా తేడా ఉంది” అన్నారు.

“ఆ రెండూ ఒకే మహా సంస్కృతికి కవలపిల్లలలాంటివి కావాలండి?”

“తరువాత మాట్లాడువచ్చులెండి" అని అంటూ ఆయన మేడమెట్లక్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే మేమందరం వారికి నమస్కారాలు చేసినాము.

ద్వితీయ భాగము

ఏప్రిల్ వచ్చింది. నేను వ్యాసం విశ్వవిద్యాలయం వారికి సమర్పించాను. జ్యోతిర్మయి ఆనందమయిల పరీక్షలయ్యాయి. నేను బాగా సహాయం చేశానట. అందుచే వాళ్ళిద్దరూ మొదటి తరగతిలో కృతార్థలవుతారట. ఆ సహాయానికి వారు తాము నాకు తీరని బాకీకి లోబడి ఉన్నారట. ​ఆ నాలుగు నెలలు ఎంత హాయిగా గడిచిపోయాయో! ఆ కుటుంబంలో ఒకణ్ణయిపోయాను. ఆనందమయి నేనంటే నానాటికి విపరీతమైన భక్తిలోకి దిగింది. మొట్టమొదటి రోజుల్లో చనువు తగ్గించుకుంది. పాఠం అవసరం ఉన్నప్పుడే ఆమె చదువుకునే మేడమీదహాలులో మేమిద్దరం కలిసేవాళ్ళం, సాయంకాలాలు మేము నలుగురమూ టెన్నిసు ఆడుకునేవాళ్ళం. ఎప్పుడైనా మేము నలుగురమూ వారి తోటకు వెళ్ళేవాళ్ళం.

మార్చి నెలలో త్రిపాఠీకి బారైలీ జిల్లా బదిలీ అయింది. అతడు తన వంట మహారాజుతో, పరివారంతో బదిలీ ప్రదేశానికి పోయాడు. పరీక్షలు కాగానే నేనూ, జ్యోతిర్మయీ, ఆనందమయిలూ కలిసి ఆయన ఉద్యోగ నగరానికి వెళ్ళవలసి ఉన్నదట.

మాది గోదావరీ తీరం, పశ్చిమ గోదావరి జిల్లా, పెద్ద కుటుంబం. మేము అయిదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ణి. నాకన్న పెద్ద వాళ్ళిద్దరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకడు రేడియోలో అసిస్టెంటు ఇంజనీరుగా ఉన్నాడు. తిరుచునాపల్లిలో పని. రెండవ అతడు బి.ఏ. ఆనర్సు ఆంగ్లభాష విషయంగా మొదటి తరగతితో కృతార్థుడై, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో సహాయ ఆచార్యపదవిని పొంది కాలక్షేపం చేస్తున్నాడు. నాకన్న చిన్నవాళ్ళిద్దరూ ఒకడు ఇంటరూ, ఒకడు వ్యవసాయ కళాశాలలోనూ చదువుతున్నారు.

మాకు ఒక్కత్తే సహోదరి, ఆమె మా అందరికన్న పెద్దది. ఆమె నలుగురు బిడ్డల తల్లి. నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కాని ఉద్యోగం లేకుండా, ఏవో నాలుగురాళ్ళు సంపాదించుకుంటూ ఉండకుండా వివాహం చేసుకోనని పట్టుపట్టాను. నాకు ఇరవై ఆరోఏడు జరుగుతూ ఉన్నది. నేను పరిశోధించిన విషయం చాలా ముఖ్యమైన విషయం. అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో, నేను పాశ్చాత్య దేశాలలోని సైన్సు మాసపత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ ఉన్నాను. అవి చాలా మెచ్చుకుంటూ ఉద్దండులైన పాశ్చాత్య పండితు లెందరో నాకు ఉత్తరాలు వ్రాసినారు, వ్రాస్తూ వున్నారు.

మేమంతా కుమాయూన్ జిల్లా వెళ్ళి, త్రిపాఠీతో ఆ హిమాలయ కీకారణ్య ప్రదేశమైన జిల్లా అంతా తిరిగినాము. పెద్దపులులు బరిమీద తిరుగుతూ ఉంటే కనుక్కొన్నాము. ఆ హిమాచల ప్రజల ఆచార వ్యవహారాదులు గమనించాం. వారి దైనందిన జీవితంలోని కష్ఠనిష్ఠురాలు, దుఃఖానందాలు గమనిస్తూ ఈప్రజలకూ భారతమందు ఇతర ప్రజలకూ ఎన్ని పోలిక లున్నాయో అవి అనుకున్నాను. మామిడి జాతులు ఎన్నివేలున్నా అవి రుచులలో, అసలు తత్వంలో ఒకటేకదా!

నేను తిరిగి వెళ్ళేసమయం వచ్చింది. నేనూ, ఆనందమయీ, వాళ్ళ దాదీ ముగ్గురం కలిసి తిరిగి అలహాబాదు వచ్చి, అక్కడనుంచి నేను దక్షిణానికి రావడం నిశ్చయం చేసుకున్నాము. త్రిపాఠీ, జ్యోతిర్మయీ ఎంతో ప్రేమ పూర్ణమైన వీడికో లిచ్చారు నాకు.

జ్యోతి: చతుర్వేదిగారూ! ఆంధ్రరాష్ట్రంకోసం మీరేమి ప్రయత్నాలు చేయదలచుకొన్నారు? ఆంధ్రరాష్ట్రం సంగతి తేల్చవలసిందని కాంగ్రెసు కార్యవర్గానికీ, కాంగ్రెసు పెద్దపెద్దలకూ మీ ప్రకాశంగారూ, రంగాగారూ గట్టిగా వినతిచేశారా? ఏంచేయగలరు వారు? ​నేను: గవర్నరు జనరల్‌చే వారు ఆర్డరు వేయించవచ్చును. పై సంవత్సరం జనవరినుంచి కొత్త రాజ్యాంగపు బిల్లు శాసనం అవుతుందట. అప్పటినుంచీ అమలులోనికి వస్తుందట. అది రాకమునుపే ఆంధ్రరాష్ట్రం రావాలి.

ఆనం: వస్తుందని మీకు ధైర్యంగా వుందా?

నేను: రాజగోపాలాచారిగారు రానియ్యరండి.

త్రిపా: అదేమిటండీ, ఆయనకు ఆంధ్రులుమీద కోపమా?

నేను: కోపమనికాదు. ఆయన గాఢమైన రాజకీయ పరిజ్ఞానం కలవారు. తమిళులందరికీ మదరాసు విషయంలో చాలా పట్టుదల వుంది. కాని మదరాసు తమిళ రాష్ట్రానికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికే పూర్తిగా వెళ్ళినా, ఎవరికో ఒకరికి నష్టం. అందరికన్న ఎక్కువ నష్టం తమిళ బ్రాహ్మణులకు, మరీనష్టం వర్తకానికీనూ.

ఆనం: మీరెలా అయితే బాగుంటుందంటారు?

నేను: చరిత్ర అలా వుంచండి. ఆ విషయమే తేల్చాలంటే వీరివాదనా నిజమే, వారి వాదనా నిజమే. కాని ఈనాటి పరిస్థితులు గమనిస్తే మదరాసు రెండు రాష్ట్రాలకి సమంగా పంచితే రాజ్యాంగనీతి మొదటిరకంగా నిర్వహింపబడుతుందని నాకు గట్టినమ్మకం.

త్రిపా: ఇదెక్కడి తీర్పయ్యా! ఒక మహానగరం రెండుగా విభజిస్తే వచ్చే కష్టాలు మనం తీర్చలేనివౌతాయి.

నేను: అది వట్టిమాటలెండి, కాదంటారా, రెండో రకం, మదరాసు నగరం కేంద్ర ప్రభుత్వ పాలనలోనే ఉండాలి. అప్పుడు తమిళ బ్రాహ్మణులకూ, ఆంధ్రులకూ, మదరాసులో ఉన్న ఇతర ప్రాంతాల వారికి అన్యాయం జరగదు.

జ్యోతి: పండిట్టీ యిప్పుడప్పుడే రాష్ట్రాల సంగతి తలపెట్ట వద్దంటారు.

నేను: అదే పెద్దలకు ప్రజల హృదయం కొంచెమైన తెలియదన్న మాటకు సాక్ష్యం. ఆంధ్రులందరూ స్వరాష్ట్రం కావాలంటున్నారు. కాంగ్రెసు పెద్దలు ఆ విషయంలో జాప్యంచేసిన కొలదీ ఆంధ్రులలో నిస్పృహ, నిరాశ, కాంగ్రెసంటే నిరసనా ఉద్భవిస్తున్నవి. మా దేశంలో కమ్యూనిస్టులు దుష్టచర్యలకు పూనుకున్నారు. కాని, వారే సరియైన మార్గంలో నడుస్తూ వుంటే తప్పకుండా ఎన్నికలలో నెగ్గితీరుతారు.

త్రిపా: సరి. మార్గం లేదుగనుకనే కమ్యూనిస్టు దురంతాలను అణచివేయడానికి వీలుగా వుండడానికి రాష్ట్రవిభజన పనికిరాదన్నారు, ఆ కాంగ్రెసు పెద్దలే.

నేను: అవునండీ! ఉత్తరాదివారికీ, దక్షిణాదివారికీ వింధ్యాచలం అడ్డురావడం అదే అంటాను.

ఆనం: అడ్డురావడంలేదుగా ఇప్పుడు. అగస్త్యుడు ఇంకా దక్షిణాపథంలోనే ఉన్నాడు.

త్రిపా: కాంగ్రెసు వర్కింగు కమిటీవారు పటేల్ గారికీ, నెహ్రూ గారికీ, రాజేంద్రబాబుకూ తుదినిర్ణయం వదలుతారుటగాదా. అదేమి జరుగునో చూద్దాము.

ఆనం: దేశమంతా మాకు రాష్ట్రం కావాలని వాంఛించేవారే. కాని సమయం ఉందికాదా చతుర్వేదీ! ​

2

రైలు బయలు దేరేవేళ అవుతున్నది. మేమంతా స్టేషనుకు వచ్చాము. బారైలీనుండి అలహాబాదుకు మేము ఇద్దరం రెండవ తరగతిలో ఎక్కినాము. ఆనందమయి నా దగ్గిరగా కూర్చుంది. మాతో వచ్చే దాది మూడవతరగతిలో ఎక్కింది. ఆనందమయి ఒక అరగంటసేపు మౌనంగా కూర్చుంది. నేనూ ఏదో ఆలోచనలకులోనై మాటలులేకుండా కూర్చున్నాను. నేనెక్కడ? ఈ త్రివేదీ కుటుంబం ఎక్కడ? ఏ పురాతనానుభూతివల్ల ఈ కుటుంబానికీ నాకూ ఈలాంటి సన్నిహిత స్నేహం ఏర్పడిందో! నేనున్న ఇన్నాళ్ళూ నాకు ఈ కుటుంబం ఉందనే తెలియదే? వీరందరినీ వదలి తిరిగి వింధ్యాచలందాటి దక్షిణాపథానికి వెళ్ళిపోతాను.

“ఏమిటండి చతుర్వేదిజీ మీరాలోచించేది?”

"మిమ్మిందరినీ వదలి వెళ్ళిపోవడం ఎట్లాగా? అని అనుకుంటున్నాను.”

“మిమ్మల్ని కొన్ని అంతరంగికమైన విషయాలు నే నడగ దలచుకొన్నాను. సిగ్గుపడకుండా నిజం చెప్పాలని ప్రార్థిస్తున్నాను. మీ వివాహ విషయమై ఏదైనా సంబంధం ఏర్పాటై ఉందా?”

నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ అమ్మాయి నన్నీ ప్రశ్నలు వేస్తూంది. ఆ అమ్మాయి నాజూకుగా పొడుగుగా ఉన్న బాలిక, ఆమె ఒంటిపై బంగారం నల్లగా కనబడేటంత తెలుపు పసిమిఎరుపుల రంగుతో వెలిగిపోయే బాలిక. పెద్దకళ్ళు, కాటుక అంచులతో సగం దాగుకొనిన పెద్ద నీలి కనీలికలతో గంభీరమైన ఆలోచనలు లోన దాచుకునే బాలిక. ప్రతి అవయవమూ తీర్చిదిద్దినట్లు, మేలిమి బంగారంతో పోతపోసిన విగ్రహంలా ఉంటుంది. కోలమోము, సమనాసిక, నిండు పెదవులతో విలువంపులు తిరిగిన నోరు. ఆ పెదవు లెప్పుడూ కాశ్మీర కుసుమాలవలె ఎరుపు లలమి ఉంటాయి.

నేను ఆ బాలికను ఏదో దివ్యానురాగంతో నా హృదయాంతరంలో పూజిస్తున్నానని నేనే అనుకొనడానికి భయపడి, అలాంటి ఆలోచనలు రానిచ్చేవాణ్ణికాను. ఆమెకు చదువు చెప్పేటప్పుడు ఎంతో మధురమయిన తన కంఠంతో ప్రశ్నలు వేసే సమయాల, ఆమె వాక్కులలోని ప్రతి చిరు స్పందనమూ నా హృదయాన్ని 'మైక్కు'ను చేసి ప్రతి స్పందనమై నాజీవితం అంతా ఆ అమృత శబ్దాలతో తరంగితమైపోయేది. వారింటిలో ఉన్న ఆమూడు నెలలూ నా విషయమై స్వయంగా ఆ బాలికే అన్ని ఏర్పాట్లు చేసేది. ఏలోటూ జరగనిచ్చేదికాదు.

నాకూ, ఆమెకూ వింధ్యాచలం అడ్డం. 'ఆ పర్వత శిఖరాలూ, లోయలూ, నర్మదా తపతులూ నా జీవితానికీ, ఆమె జీవితానికీ నా ఆలోచన పథంలో శాశ్వతంగా అడ్డం వచ్చినవి' అనే నిశ్చయం నాకు మొదటనే ఉద్భవించింది.

“నాకే వివాహ సంబంధం ఏర్పాటైలేదు ఆనందమయీ! నేను ఎప్పుడూ ఆ విషయమయి ఆలోచించుకొనేలేదు.”

“మీరు ఏ బాలికనైనా ప్రేమించినారా?” ​"ఆఁ! నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. నా పరిశోధనా, నేను అంతే నాబ్రతుకు. నేను ప్రేమిస్తే గీమిస్తే నా పరిశోధననే.”

“అబద్దం ఆడకండి. ఒకరోజు మీరు తెలుగుభాషలో ఏదో పాటపాడుతున్నారు. ఆ పాట చాలా అందంగా ఉంది. ఏమిటండీ ఆపాట అని అడిగినాను. మీరు సిగ్గుపడుతూ ఆ పాట కర్ధం చెప్పినారు. మీ కవులలో కిషన్ శాస్త్రి పాట అన్నారు. ఇదంతా జ్ఞాపకం ఉందా?

"ఉంది, ఆనందమయీ!"

“ఆ పాట అర్థం వినగానే, మీ హృదయంలో కొన్ని రహస్యస్థలాలు నాకు దర్శన మిచ్చాయి. నిజం చెప్పండి! ఎవరా అమ్మాయి?

“నిజం చెపితే నీకుకోపం రాదుకదా!” నా గుండె ఝంఝావేగం దాల్చింది.

“నాకుకోపం ఎందుకండీ?”

"నీ ప్రశ్నకు జవాబు చెప్పేముందు ఎందుకు నీ వీ ప్రశ్నలు వేస్తున్నావో అడగవచ్చునా?”

“అడగండి. నాకు కారణం ఉంది. అయినా తర్వాత చెప్తాను. ముందు మీరు నాప్రశ్నకు జవాబు చెప్పండి!”

“నిన్ను గురించే?” అనేశాను. ఏం చేయను? నన్నా పరిస్థితిలోనికి ఆ అమ్మాయి తీసుకు వచ్చింది.

"నిజం ?”

“నిజం!"

“సరే! నేను చెప్పే కారణం వినండి. మీ హృదయంలో నన్ను ఎందుకు తలపోసుకుంటున్నారో, ఏమో? నేనుమాత్రం మిమ్మల్ని, మీరు మాయింటికి వచ్చిన మొదటి క్షణంలోనే ప్రేమించాను, నాసర్వస్వమూ ఆక్షణంలో మీకు దత్తమయిపోయింది. మీరు చూపులోగాని మాటలోగాని మీ హృదయం ఏమిటో నాకు ఎంతకాలమో అర్థంకానియ్యలేదు. ఆ పాటతో నాకు కొంత అర్థమయింది. 'తొలి ఉషస్సును నేనె, తొలి ప్రేయసిని నేనె!” అని.”

ఆ మాట లా బాలిక అంటున్నది, నాగుండె ఆగిపోయింది! ఎక్కడ వింధ్యాచలం! కలలోనన్నా అంత దివ్యమయిన పవిత్రనాదంతో నిండిన మాటలు వింటానని ఊహించుకోలేదు.

“నిజమేనా! ఆనందమయీ.... ని... ని... నిజమేనా!"

ఆ అమ్మాయి మోము ఏదో పరమాద్భుత కాంతులతో వికసించిపోయింది. స్వచ్ఛమయిన చెంపలు అరుణరాగ రంజితమై ఆమె కన్నులు జ్యోత్స్నాపూర్ణ కిరణాంకితమై ఆమె ఫాలము ఆనందక్షీరవీచీ మూర్తిమంతమై నాకు దర్శన మిచ్చింది.

'ఆనందమయీ ఏమి చెప్పను! ఈ ఆలోచన ఆలోచించడానికయినా తగనివాడిని. నువ్వు దివ్య సౌందర్యవతివి. ఉత్తరాది బాలవు, భాగ్యవంతుల బిడ్డవు.' ​'అయితే! అవి మీ ప్రేమకు అడ్డాలా!' ఆనందమయి నా వంక ఆశ్చర్యంగా చూచింది. ‘కాబట్టి మీరు భయపడిపోయారా!'

ఎవరైనా నా మాటలు వింటున్నారేమోనని భయపడినాను. మాతో పాటు ఆ ప్యాసింజరులో ఆ సెకండు స్పెషల్ తరగతిలో ఇద్దరో ముగ్గరో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు మమ్ము భార్యాభర్తలే అని అనుకున్నారు కాబోలు. మాయిద్దరికి ఒక సీటు వదలివేసి తాము ఇతర సీట్లు ఆక్రమించినారు. వారు మాకు దూరంగానే వున్నారు.

“కాదా ఆనందమయీ! మీ నాన్నగారూ! అమ్మగారూ ఒప్పుకుంటారా? మీ అక్కగారూ, బావగారూ తెల్లబోరూ.”.

"నిజమే!”

“తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టిన కృతఘ్నుడను అయిపోనూ, వారి దృక్పథంలో!”

విషాదచ్ఛాయలు ఆక్రమించిన చిరునవ్వు ఆమె మోముపై ప్రసరించింది. “మా అక్కకూ నా హృదయం తెలియజేశాను. ఆమె మా బావతో చెప్పింది. మా బావకూ చాలా ఆనందం కలిగింది. అందుకనే మా బావ మిమ్మల్ని కూడా బారైలీ రమ్మన్న కారణం. మా అక్కో, బావో ఈ సంగతి మీతో మాట్లాడుదాము అనుకున్నారు. నేనే వద్దన్నాను. నేనే మీతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. మా తండ్రిగారు ఇష్టపడకపోవచ్చును. కాని నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. నా కిప్పుడు పందొమ్మిది. నేను మేజరు నయ్యాను.”

“ఆనందమయీ!”

“ఏమండీ?”

“నువ్వు - నువ్వు అవతరించిన దేవతవు - నన్ను - ఈ వికారిని నిజంగా -”

“ప్రేమిస్తున్నానా, అంటారా? మీకు నమ్మకంలేదా? వాళ్ళంతా చూస్తున్నారుగాని, మిమ్ము గాఢంగా నా హృదయానికి -”

“నేను నిన్ను దరికైనా తీసుకోలేని దద్దమ్మను ”

"మీకు ధైర్యం లేదు. మీ హృదయాన్నే మీరు నమ్మలేరు.”

"ఒక దేవకన్య -"

"నేను దేవకన్యనూ కాను, మీరు దేవులూ కారు. మనమిద్దరమూ మానవత్వము పూర్ణంగా స్పందించే మానవులం. మీ అభిప్రాయం చెప్పండి.”

“ఎక్కడ నిన్ను ప్రేమించిపోతానో అని భయపడిపోయాను. నా సంగతి ఎవరు గ్రహిస్తారో అని భయపడిపోయాను. పాఠం చెప్పేటప్పుడు, నువ్వూ నేనూ ఒంటిగా ఉన్నప్పుడు నా పూజ ఎక్కడ బయలుపడిపోతుందో, నీవేమి గ్రహించిపోతావో, నిన్నేమి బాధపెట్తానో అని లోలోన గజగజ వణికిపోయాను దేవీ!"

'అంత గాఢంగా ప్రేమిస్తున్నారుటండీ నన్ను! ఎంత ఆనందం! మీ హృదయం ఏమీ గ్రహించలేక పోయాను. మీరు గొప్ప శాస్త్రవేత్తలేకాకుండా, మంచినటకులు కూడా!'

“నాకు నిన్ను ముట్టకోవడమే భయంవేసేది. నువ్వు నన్ను స్పర్శించినప్పుడు ఏం మూర్ఛపోతానో అని బిఱ్ఱబిగుసుకుపోయేవాణ్ణి.” ​“అదా అసలు విషయం! నేను మిమ్ము ముట్టాలనే ముట్టుకునేదాన్ని, ఏ వంకనో మీ చెయ్యి, భుజం స్పృశించేదాన్ని. ఏ మాత్రం వీలు దొరికినా మీ దగ్గిరగా కూర్చునేదాన్ని. మీరు బిగుసుకు ఉన్నారు. మీ హృదయంలో ప్రేమలేదు. ఎందుకు నన్ను నేను ఇంత చులకన చేసుకుంటున్నాను అని ఒంటిగా ఉన్నప్పుడు బాధపడేదాన్ని సుమండీ! ఈనాటికి నాజన్మ సాఫల్యం అయింది.”

"అయ్యో వెఱ్ఱిదానా! మీ నాన్నగారు ఒప్పుకోరే. మనగతి ఏమిటి ఇకముందు?”

“ఆయన ఒప్పుకున్నాసరే, లేకపోయినా సరే, మన వివాహం తథ్యం.”

మా ప్రయాణం మహదానందపూర్ణమై సాగిపోయింది.

మేం అలహాబాదు వెళ్ళినరాత్రే తల్లిదండ్రులతో తన వివాహం సంగతి చెప్పింది కాబోలు. అప్పటికి తొమ్మిది గంటలయింది. చరచరా నేనున్న గదిలోనికి త్రివేదీగారు చక్కావచ్చారు. “ఇంత ద్రోహివని అనుకోలేదే నిన్ను? ఇంత కుట్రపన్నుతావురా? నువ్వు మా ఇంటిలోంచి వెంటనే వెళ్ళిపో. తలక్రింద మూడు తలల శిఖండిని పెట్టుకున్నా. ఓ రాక్షసుడా!” అని అగ్ని బాణాలవంటి మాటలు తుపాకీ పేల్చారాయన. నేను నిలువునా నీరైపోయా. తుపాకీ పేలుస్తే నీరెల్లా అవుతానులెండి. శాస్త్రనిజం కాదామాట. గుండె దూసుకుపోయి రక్తహీనుణ్ణయి ఉంటాను. వారు రాగానే నిలుచుండి నమస్కరించాను, ఏవేవో భావాలతో ఆయనకు నచ్చచెబుదామనుకున్నాను. ఆయన అగ్నిహోత్రుడే. మాటలూ, వాదనలూ వినే శాంతమేలేదు.

"వెంటనే వెళ్ళు. సిగ్గూలేదు, లజ్జాలేదు, ఇంటిలో మదరాసీవాణ్ణి ప్రవేశపెట్టుకోడానికి నాకేమీ ఇష్టంలేదు. కాని ఆ మూర్ఖురాలు జ్యోతిర్మయికి మంచీ, చెడ్డా ఏమన్నా తెలుస్తేనా?”

నేను మౌనం వహించి తలవాల్చుకొని నిలబడి ఉన్నాను.

“నువ్వు బందిపోటువు, వెనుకనుంచి బాకుతో పొడిచి చంపే నీచహంతకుడవు. ”

నా హృదయం పాతాళాలకు క్రుంగిపోయింది.

“నువ్వు థగ్గువు, పిండారీవి!”

ఇంతట్లో ఆ గదిలోకి ఆనందమయి క్రోధ సంతప్తవదనంతో విసవిస నడిచివచ్చింది.

“నాన్నగారూ! ఇక నోరు మూయండి. నా భర్తను నోటికి వచ్చినట్లు తిట్టడానికి మీ కధికారం ఎవరిచ్చారు?”

“నీ భర్తా? అప్పుడే పెళ్ళి కూడా అయిందీ? ఎంత కొంప ముంచావు?”

“నేను కొంపముంచలేదు. మీ కొంప తరింప చేశాను. మీరు వేయి సంవత్సరాలు తపస్సు చేసినా ఇటువంటి అల్లుణ్ణి సంపాదించలేరు. మీ ఇంటిలో ఒక్క నిముషం మేమిద్దరమూ ఉండం. రండి చతుర్వేదిగారూ! మీ సామాను సర్దుకోండి. నా సామాను సర్దుకొని నేనూ వస్తున్నాను.”

“నీ సామానేముంది? అంతా నేను కొని ఇచ్చిందే!” ​“నాకిచ్చిన వెనుక నా సామానే! అయినా మీరిచ్చినది నేనేమీ తీసుకు వెళ్ళదలచుకోలేదు. మాయి తన భూముల రాబడిలోంచి వచ్చిన అయిదువేలలో నాకు రెండువేలిచ్చింది. అవి పట్టుకువెళతాను. ఇవిగో మీరిచ్చిన నగలు.”

ఆ బాలిక నెమ్మదిగా తన మెడలో నుండి చేతుల నుండి కొన్ని నగలు తీసి బల్లమీద పెట్టింది. నాచేయిపట్టుకుని గదిలో నుండి, హాలులో నుండి, మెట్లమీద నుండి క్రింది హాలులో నుండి వీధిలోనికి నడిచి వెళ్ళిపోయింది. వీధిలో మేమిద్దరమూ అలా చేయిచేయి పట్టుకునే అలహాబాదు స్టేషన్‌వరకూ నడిచిపోయాం.

ఆనందమయి హృదయంలో ఏ తుపానులు వీస్తున్నాయో నాకు తెలియదు. నా హృదయంలో వేసవికాలపు గాడ్పులో ఏవో నిండిపోయాయి. ఈ బాలిక జీవితము భగ్నం చేశానా? వింధ్యాచలం ఎంతపని చేశాడు. ఎందరి జీవితాలు విచ్ఛిన్నం చేస్తున్నాడు, కాదు. దేశంలో ఎన్ని త్రివేణీ సంగమాలు సాధ్యం చేస్తున్నాడో!

'ఆనందమయీ, నీ తల్లిదండ్రుల్ని, నీ భాగ్యభోగాలను అన్నీ వదలి ఇలా నాతో వచ్చేస్తున్నావే!”

మీతో నేను రావడమేమిటీ, మీరే నాతో వచ్చేస్తున్నారు. మీ భావి ఆంధ్రబాలికా వధువును, మీ చుట్టాలను, పక్కాలను మీ దేశంలో మీకు మీ చుట్టాలలో కలుగబోయే గౌరవాన్నీ, అన్నీ వదిలి నాతో వచ్చేస్తున్నారు.”

మేమిద్దరమూ అంత దూరం నడిచే వెళ్ళినాము. స్టేషన్‌లోకి వెళ్ళి మొదటితరగతి విశ్రాంతి మందిరం ముందున్న కుర్చీలలో కూర్చున్నాము. ఎక్కడికి పోవాలి? మాఊరు పోవాలా? ఎక్కడికి? నాకేమీ ఆలోచనలే లేవు. అనుకున్నంతా అయింది. ఆ దేవి తనంతతాను తన ప్రేమ నాకు తెలిపింది కొన్ని గంటల ముందే కాదూ, ఆనందతరంగము ఏ ఆకాశపథాలలో మమ్మిద్దరినీ ఎత్తుకుపోయింది. ఆ కల్లోలము అక్కడే మాయమైంది. ఆ ఎత్తునుంచి ఎంతో లోతుకు గభీమని పడిపోయాము.

ఆనందమయి మాట్లాడక అతితీక్షణంగా చూడని చూపులతో ఏవో చూస్తున్నది.

ఇంతట్లో గబగబ జోడు చప్పుడు అవుతుండగ త్రివేదిగారు మేము కూర్చునిఉన్న కుర్చీలదగ్గరకు చక్కావచ్చారు. “చతుర్వేదిగారూ! నాకోపానికి మీరు క్షమించాలి. మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. ఈ నవ్యయుగంలోకూడా నేను మహా తెలివైనవాడిలా ప్రవర్తించాను. నన్ను మీరు సంపూర్ణంగా క్షమించాలి. బేటీ, నీ ముసలితండ్రి తెలివితక్కువగా అన్న మాటలు పాటించక, నన్ను క్షమించి ఇంటికి రా తల్లి” అని అంటూ ఆయన కుడిచేతిలో కొమరిత చేతిని, ఎడమ చేతిలో నాచేయిని పట్టుకొని, మా ఇద్దరినీ లేవదీసి నడిపించుకు తీసుకువెళ్ళాడు.

బైట వారి పెద్దకారు సిద్ధంగా ఉన్నది. కారులో త్రివేదిగారి సతి కాళిదాసి గారున్నారు.

"చతుర్వేదిగారూ! మీరు ముందు కూచొండి. నేను, అమ్మాయి వెనకాల కూచుంటాము” అని అంటూ త్రివేదిగారు నన్ను ముందుసీటులో కూర్చోబెట్టి తానూ ఆనందమయీ వెనుకసీటులో కూర్చున్నారు. ఆనందమయి ఏమీ మాట్లాడలేదు. నేనూ ఏమీ మాట్లాడలేదు. ​ఇంత తొందరలో ఆయనలో మార్పు కలిగిందేమిటి? ఆనందమయి తల్లి త్రివేదిగారికి గట్టిగా ఏమయినా చెప్పిందా? నా చరిత్ర సుఖాంతం కాదలచుకొని ఉన్నదా? ఇంత మార్పు ఇంతలో ఆయనకు కలగడం అత్యాశ్చర్యకరమే. ఆయన సహజంగా చాలా సున్నితమైన మనసు కలిగినవాడై ఉండాలి. ఒకసారి వింధ్య ప్రాంతానికి ఉత్తర దక్షిణాలకు వివాహ సంబంధం కలుగడం ఆయన మనస్సుకు వజ్రాఘాతంలా తగిలి ఉండవచ్చు. కాని ఉత్తమ హృదయం కలవాడవడం బట్టి ఆశయాలూ అభిప్రాయాలు ఎన్ని ఉన్నా మనసు మార్చుకోక తప్పిందికాదు, అని అనుకున్నా.

ఇంతలో వారిభవనం ముందర మా కారు ఆగింది. మేమంతా దిగి లోనికి వెళ్ళిపోయాం. ఆ రాత్రికి నేను ఆనందమయిని కలుసుకొనడానికి వీలులేకపోయింది. నాకు రాత్రి ఏమీ నిద్రపట్టలేదు. లేచి కూర్చున్నాను, పడుకున్నాను. గది అంతా బోనులో వున్న జంతువులా పరిక్రమించాను. మనసులో ఏదో తెలుసుకోలేని ఆవేదన. ఏంచేస్తారు త్రివేదిగారు? ఇంతత్వరలో మార్పు రావడం నిజమైన విషయమేనా? ఏదైనా భయంకర రహస్యం వెనకాల దాగి వున్నదా? ఏముంటుంది! నాయీ నీరసపు మనసులో ఏవో వికృతమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి.

గంటలు వరసగా కొట్టుకొంటూ గడచిపోతున్నవి. నాకు కాలం ఆగిపోయినట్లే కనబడింది. అంతుతెలియని ఆలోచనలు. చూపు ప్రసరింపలేని అగాధమైన స్థలాలు, దారి కనపడరాని కంటకభూయిష్టమైన చీకటి అడవులు. ఎక్క వీలులేని ప్రాంతాలు కలిగిన ఎత్తయిన కొండలు. ఆటంలో అంతర్గర్భితమైన సాక్ష్యస్వరూపుడైన ప్రోటనులోని మహాశక్తి, కాలాంతక గర్జనతో విచ్ఛిన్నమైపోయిందా?

తెల్లవారింది, నేను స్నానాదికాలు నిర్వర్తించుకుని గదిలో కూర్చున్నాను. వంటమహారాజు కాఫీ, పండ్లు, పూరీలు, తర్కారీ పట్టుకు వచ్చాడు. ఏదో కతుక్కతుగ్గానే తిన్నాను. ఈ సమయంలో త్రిపాఠీగారువుంటే ఎంత సంతోషంగా వుండేది. చల్లగా హాయిగా ఒడుదుడుకులు లేకుండా సాగిపోయే నాజీవితం పతనాలై, ప్రభంజన తాడిత కల్లోలాలై, రాళ్ళల్లో గుట్టల్లో, మెరక పల్లాల ప్రవహించడానికి సిద్ధమైపోయింది. అంత దారిద్ర్యం లోనూ చెక్కు చెదరని ధైర్యంతో కలో గంజో తాగుతూ గౌరవంగా బ్రతికి వచ్చిన నేను యేమికష్టాలకు లోబడాలో అన్న ఆలోచన కలిగింది.

ఏమికష్టాలయితే నేమి? ఎన్ని హింసలకు లోనయితేనేమి, జీవితం ప్రచండపూరిత సమస్యలను ఎదుర్కొనవలసి వస్తేనేమి, యీ సర్వసౌందర్యరాశి, ప్రేమమయి, ఆనందమయి నన్ను తన్నుతా వలచి వచ్చినప్పుడు, ఆ పవిత్రాదృష్టాన్ని జీవితం మధ్య దాచుకొంటానుగాక!

ఈ ఆలోచన వచ్చింది. ఏదో చప్పుడు విని తలెత్తాను. నా దేవి, నా ఆత్మేశ్వరి, ఆనందమయి వస్తున్నదని గుమ్మం దీక్షగా చూచాను. గుమ్మంలో ఇద్దరు పోలీసు ఇన్‌స్పెక్టర్లు ప్రత్యక్షమయినారు. అందులో పెద్ద అతను "హల్లో! చతుర్వేదిగారూ, గుడ్‌మార్నింగ్; మీమీద ఒక వారంటు జారీ అయింది. మిమ్ములను అరెస్టు చేస్తున్నాను. క్షమించాలి. మీరు మాట్లాడకుండా నాతోరండి. మేమేమీ గడబిడ చెయ్యం. మా పోలీసుకారు ఆవరణలోకే తీసుకొచ్చాం. ఎవ్వరికీ తెలియకుండా చడీచప్పుడూ కాకుండా వెళ్ళిపోదాం. ​మా డిప్యూటీ కమీషనర్ త్రివేదిగారితో మీ అరెస్టు విషయమై మాట్లాడుతున్నారు” అని చలిపిడుగులలాంటి నాలుగుమాటలూ అని నవ్వుతూ నిలుచున్నాడు. నా స్థితి వర్ణించుకోలేను. తల తిరిగిపోయింది. తూలి పడబోయాను. రెండవ ఇన్‌స్పెక్టరు గబుక్కున వచ్చి నన్ను అదిమి పట్టుకొన్నాడు. నే నింతటిలో ధైర్యం తెచ్చుకొని “ఎందుకండీ వారంటు” అని ప్రశ్నించాను.

“మీరు హాస్టల్‌లో యేవో అరాచకపు పనులు చేసేందుకు కుట్ర పన్నారట!” అని ఏదో కాగితం తలపట ఆడిస్తూ చూపించినాడు.

“ఇదేదో చాలా పెద్ద పొరబాటు. మీరు వైస్‌ఛాన్సలర్ గారిని అడగండి. మీరు చాలా భ్రమపడుతున్నారు, ఆ వారంటు నామీద అయివుండదు. ఈ విషయంలో త్రివేదిగారు ఏమన్నారు?”

“త్రివేదిగారు ఏమంటారో మాకిప్పుడు ప్రస్తుతం అవసరంలేదు. మిమ్మల్ని ఈ రాష్ట్రాన్నుంచి పంపించి వేయడమే ఈ వారంటులో వున్న విషయం. ఆలస్యమైపోతున్నది రండి, లెండి" అని అంటూ అతడు నా దగ్గరకు వచ్చి చేయిపట్టుకొన్నాడు. నేనిక మాట్లాడకుండా వారితో నడచి వెళ్ళి త్రివేదిగారి భవనంముందు పోర్చిలో నిలుచుని వున్న పోలీసు కారులో ఎక్కి కూర్చున్నాను. నా ఇరుప్రక్కలా ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు కూర్చున్నారు. మాకారు సాగిపోయింది.

4

ఆ కారు ఎంతదూరం వెళ్ళిందో ఎంతకాలం నడిచిందో నేను గమనించే స్థితిలోలేను. నేను ఏదో అని భయపడినది నిర్ధారణ అయింది. “నేనేమిటి, కుట్ర చేయడమేమిటి! ఇది త్రివేదిగారు పన్నిన పన్నుగడ" అని తళుక్కుమని నాకు ఆలోచన హృదయంలో మెరుపు మెరిసింది.

ఆనందమయి గతి ఏమవుతుంది? ఆ బాలికకు ఈ విషయం తెలిసిందా? నా మీద నిజంగా ఏదయినా కృత్రిమపు, ఘోరమైన నేరం ఆరోపించారా? నా గతి ఏమౌతుంది? దీనివల్ల నా డి.ఎస్‌సి. పరీక్షకు అంతరాయమేమైనా కలుగుతుందా? ఆనందమయిని ప్రేమించడమే తప్పు. ఆ బాలిక తనంత తాను తన ప్రేమను తెలుపుకోకపోతే నాప్రేమను నేను తెలిపి వుండేవాణ్ని కాదే? ఉత్తమంగా, ధర్మంగా ప్రేమించుకొన్న ఇద్దరు యువతీ యువకుల మధ్య వింధ్యాచలేశ్వరుడు అడ్డంవస్తాడని నాకు ఈషణ్మాత్రం ఆలోచన తట్టలేదే? వింధ్యాచలేశ్వరుడే నా కీ దివ్యప్రేమను ప్రసాదించాడు. ప్రేమ అణుశక్తికన్న మహత్తరమైన శక్తికలది. సీసంవంటి నా బ్రతుకును బంగారం కింద మార్చివేసింది.

మాకారు సాగిపోతూవుంది. నేను కారులో ఒళ్లు తెలియని నిద్రకు లోనయ్యాను. మెలుకువ వచ్చేసరికి మేము కాశీకి వచ్చినాము. మాకారు బెనారస్ కాంటౌన్మెంటు స్టేషనుదగ్గిర ఆగింది. మేము ముగ్గురం దిగాము. అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టరు నన్ను చూచి, “చతుర్వేదిగారూ! మీ పైన వారంటుమాట అబద్ధం. త్రివేదిగారు మాకు గాఢమైన స్నేహితులు. వారికీ సహాయం చేయమంటే మేము చేశాం. మీ సామాను. పుస్తకాలు ​వగైరా అన్నీ వారి బంట్రోతు సేతూరాం పట్టుకువస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, మీకు ఖర్చులకై ఈ రెండువందలు ఇయ్యమని త్రివేదిగారు మాచేతికిచ్చారు. ఈ కారు వారి స్నేహితునికారు. మీరు మామీద రిపోర్టు వగైరాలు చేయకండి, మీ పుణ్యం. మా ఉద్యోగాలు పోతాయి. ఆయన చేసినపని మాకేమీ నచ్చలేదు. ఈ రోజుల్లో కూడా త్రివేదిగారు ఇలాచేయడం చాలా పొరపాటు. ఈ విషయం ఇంతటితో వదలదు. ఆనందమయి అంటే మా కందరికీ ఎంతో ఆపేక్ష" అని అంటూ రెండు నూరు రూపాయిల నోట్లు నా చేతిలో పెట్టబోయాడు.

"ఇన్‌స్పెక్టరుగారూ, నాకానోట్లు వద్దు. త్రివేదిగారికీ మీకూ నాగాఢ అభివందనాలు. మీరంతా చాలా గొప్పనాటకం ఆడారు. మీరంతా యేదైనా సినిమా కంపెనీపెట్టి, అందులో వేషాలు వెయ్యవలసినవారే. నెహ్రూగారి కొమరిత ఇందిరాదేవి ఒక పార్సీ యువకుని పెళ్ళిచేసుకుంటే తండ్రి వద్దన గలిగారా? రోజులు మారిపోయాయి. మనకు పూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది. కాని మనదేశం హిట్లరు రాజ్యంకాదే. అయినా మీరు కోరినారు గనుక మీ పైన రిపోర్టు చేయను” అని నేను వారిని వదలి ప్లాటుఫారంమీద వేరేచోటికి వెళ్ళి, వెంటనే అలహాబాదుకు పోయే బండికి టిక్కెట్టుకొని ఆ బండిరాగానే వెళ్ళి అందులో కూర్చున్నాను. పోలీసు వారిద్దరూ తిరిగి కారులో వెళ్ళిపోయారు. నేను అలహాబాదుకు తిరిగివస్తానని వారికి తెలియదు. అలహాబాదుకు సాయంకాలం చేరుకున్నాను. స్టేషన్ నుండి ఒక హోటలుకుపోయి భోజనంచేసి, టాక్సీ చేసుకొని మా గురువుగారైన రాంప్రసాద్ విద్యాలంకార్ గారి ఇంటికి వెళ్ళాను. మా గురువుగారు ఎంతో ఆదరంగా నన్ను ఆహ్వానించారు. డాక్టరు విద్యాలంకార్ ఇంగ్లండు, అమెరికా 'డాక్టర్ ఆఫ్ సైన్సు' డిగ్రీలు పొందివచ్చిన ప్రజ్ఞావంతులు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఆచార్యోత్తములు. ఆయన నన్ను తమ పుత్రునికన్న ఎక్కువగా ఆదరించేవారు. వారి శిష్యునిగా ఉన్న ఈ రెండేళ్ళూ నన్ను అత్యంత ప్రేమతో వేయికళ్ళ కనిపెట్టి ఉండేవారు.

"ఎక్కడనుండి వస్తున్నావు చతుర్వేదీ!”

"కాశీనుంచి పితాజీ!”

"కాశీకి ఎప్పుడు వెళ్ళావు? బారైలీ వెడుతున్నానని చెప్పావుగా! అక్కడనుండే తిన్నగా కాశీకి వెళ్ళావా?”

“లేదండి. ఆ కథ అంతా రామాయణం అంత ఉంది!” అని జరిగిన విషయాలన్నీ మనవి చేశాను.

"రాం! రాం! త్రివేది ఇంతటి పనిచేశాడా! వారి కుటుంబం నాకు బాగా పరిచయమే! జ్యోతిర్మయినీ, త్రిపాఠీని, ఆనందమయినీ బాగా ఎరుగుదును. వారంటే నాకు ప్రాణం! సరేకాని ఆ ఇన్‌స్పెక్టర్లను చివాట్లు పెడతాను. నువ్వు ఇక్కడే నా యింట్లో ఈ విషయం ఏదో తేలేవరకూ ఉండు. ఇల్లు నీదే. ఏమీ మొహమాటం పడకు. మీ గురుపత్ని నీవంటే ఎంతో ఆనందపడుతుంది.”

అని తన భార్యకడకు తీసుకువెళ్ళినారు. ​అక్కడ ఆయన నా కథ అంతా భార్యతో చెప్పినారు. ఆమె చాలా ఆశ్చర్యం పొందింది. ఆమెకు నలుబది ఏళ్ళుంటాయి. నన్ను “బేటా, చతుర్వేదీ!” అని పిలుస్తారామె. ఆమె ఇంటరు ప్యాసయిన ఇల్లాలు, హిందీలో కవయిత్రి, రేడియోలో తాము రచించిన గీతాలు తీయని కంఠంతో పాడుతూ ఉంటారు. జ్యోతిర్మయి, ఆనందమయిలంటే ఎంతో ఇష్టం ఆమెకు. ఆనందమయి నేనూ మా ఆచార్యులవారి దగ్గిరకు ఎన్నిసార్లో వచ్చేవారం. ఆనందమయి మా గురుపత్నితో అరగంటైనా సంతోషంగా కాలం వెళ్ళబుచ్చకుండా ఇంటికి ప్రయాణం కాదు. మాగురుపత్ని పేరు ఉమాసుందరీదేవి.

ఉమాసుందరీదేవి: ఏమయ్యా చతుర్వేదీ! లోకమోహిని అయిన బాలికను వశపర్చుకున్నావే. ఏమన్నా వశీకరణమంత్రం ఉపదేశ మయ్యావా!

నేను: మీ ప్రయాగ త్రివేణి సంగమములో స్నానం చేయగానే మా కెన్నో మహత్తరశక్తులు సన్నిహితం అవుతాయి మాతాజీ!

ఉమ: కాదయ్యా! మీ దక్షిణాదివారికి చాలా మంత్రతంత్రాలు వచ్చునని మావైపు ఎంతో ప్రతీతి.

నేను: అలాగే మా వైపున ఉత్తరాది వారంతా మహర్షులనీ, వారి ఇళ్ళలో దేవతలు పరిచారకులుగా తిరుగుతూ ఉంటారని మావాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మ నేను మీ విశ్వవిద్యాలయంలో జేరడానికి వచ్చేముందు, 'నాయనా మాయచేసి తీసుకుపోయి దేవికి బలియిస్తారు జాగ్రత్త' అని చెప్పింది.

ఉమ: రాకపోకలు తక్కువై, పరిచయాలు ఏమాత్రమూ లేక ఈలా అవకతవక అభిప్రాయాలు ప్రచారంలోకి వస్తాయి.

గురూజి: చతుర్వేదీ! నువ్వు బాగా విశ్రాంతి తీసుకో. నీకో గది సిద్ధం చేయిస్తాను. రేపు ఉదయం అన్ని విషయాలు మాట్లాడుకొందాము.

వారి ప్రేమ నా హృదయానికి వర్ణింపలేని శాంతి ప్రసాదించింది. నాకు ఒళ్ళు తెలియని నిదుర పట్టింది. సాయంకాలము ఉలిక్కిపడి లేచాను. ఆనందమయి వచ్చి నన్ను తన హృదయానికి అదుముకొన్నట్లు కలవచ్చింది. ఆ కలలో నా కౌగిలిలోనుండి ఆ బాలికను ఆమె తండ్రి బరబరా లాక్కొని పోయినట్లు వచ్చి “ఓ” అని గుండె దడ దడమంటూ ఉండగా లేచాను.

ఎంతవరకోగాని నా కా దడ దగ్గలేదు. లేచి స్నానాల గదికి వెళ్ళి వచ్చాను. మా గురువుగారి దుస్తులు నా గదిలో సిద్ధంచేసి ఉంచారు. అవి ధరించి నా గదిముందు హాలులోనికి వచ్చేసరికి ఆనందమయి ఎదురుగుండా నన్ను రక్షింపవచ్చిన పరమ సాన్నిధ్యంలా నిలుచుని ఉంది. ఇంకెవ్వరూ ఆ హాలులో లేరు.

నన్ను చూడడమేమిటి ఆమె రెక్కలు వచ్చినట్లు నా దగ్గిరకు వాలి నా కౌగిలిలో ఒదిగిపోయింది.

“నా దివ్యదేవీ!”

నా పరమదేవా!” ​

5

ఆమెను నా గదిలోనికి తీసుకొనిపోయాను. అలా ఒకరి కౌగిలిలో ఒకరం ఒదిగిపోయి వున్నాము. మా ప్రేమకు మాటలులేవు.

ఇంతట్లో తలుపు దగ్గిర “పండిజ్జీ!” అని వంట మహారాజ్ మాట వినబడింది.

మేము ఇద్దరమూ కౌగిలిలోనుండి విడిపోయి చెరి ఒక కుర్చీమీద కూర్చున్నాము. మహారాజ్ బల్లమీద ఫలోపహారాదులు, కాఫీ, అన్నీ ఉంచి “ఇద్దరూ సేవించండి” అంటూ తలుపు దగ్గిరగా వేసి వెళ్ళిపోయాడు.

“ప్రీతమ్ ! మిమ్ము పోలీసువారు తీసుకువెళ్ళడం అదీ నాకు ఉమామయి చెప్పింది. నాన్నగారు అంత క్రూర హృదయులని కలలోనన్నా అనుకోలేదు. నన్ను స్టేషనునుండి ఇంటికి చేరాక లోపలికి తీసుకుపోయి ఒక గదిలోపెట్టి తాళంవేశారు. అప్పటినుండి ఇంతవరకూ నాకు భోజనంలేదు. ఇంతవరకూ మా అమ్మతోగాని, నాయన గారితోగాని మాట్లాడలేదు. యేం చెయ్యాలో నేను నిశ్చయం చేసుకొన్నాను. తలుపు తాళం వేసినన్నాళ్ళు భోజనము చేయను. ప్రాణం పోతుందని భయపడలేదు.”

"ప్రాణకాంతా! మహారాజీ! ఓహో! యెల్లా వచ్చా విక్కడకు?”

“పక్షిలా మారిపోయి, కిటికీలోంచి దూరి ఇక్కడకు ఎగిరి వచ్చి ఇక్కడ మామూలు రూపం పొందాను.”

“నేనిక్కడ ఉన్నానని ఎలా తెలిసింది?”

“చెప్తా ఉండండి” అంటూ నా ఒళ్లో కూర్చుంది. “నాకు చాలా ఆకలిగా ఉంది. నా చేత మీరు తినిపిస్తేగాని ఏమీ సహించదు” అని నా మెడచుట్టూ తన ఎడంచేయి వేసింది. కుడిచేత్తో నాగడ్డం పట్టుకొని తనవైపు తిప్పుకొని "ప్రభూ! నేను నా నిరశనవ్రతదీక్ష మానివేసేముందు మొదటి ముద్దుగా మీ ముద్దు ఆరగిస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాను. నాకు మీ ప్రథమ చుంబనము ప్రసాదించండి!" అని నవ్వుతో, ప్రయాణము అయిన కంటి నీటితో నావైపు చూచింది.

నాకూ కన్నుల నీరు తిరిగింది. ఆమెను గాఢంగా అదుముకొని, మాటలు లేక కాశీ విశ్వేశ్వరుని మనస్సులో తలచుకొంటూ, ఆమె పెదవులు చుంబించాను. ఆమె నాకు ప్రతిఫలం ప్రసాదించింది. మాకంటి నీటి ప్రవాహాలు త్రివేణీ సంగమం అయ్యాయి.

ఆమెచే నెమ్మదిగా చా తాగించాను. తర్వాత పాలలో నానవేసిన రొట్టె కొంత తినిపించాను. పళ్ళరసం త్రాగించాను.

“ఏం చేస్తున్నారు పిల్లకాయ లిద్దరూ” అని చటుక్కున తలుపు త్రోసికొని మా గురుపత్ని లోనికి చక్కావస్తూ “ఎల్లా ఉన్నవారు అలాగే ఉండాలి. నేను చూడాలి. నా కళ్ళు చల్లబడాలి, నా జన్మ తరించాలి” అని అన్నది.

నా ఒడిలోనుండి ఆనందమయీ, నేను కుర్చీ మీదనుండీ, సిగ్గుపడుతూ లేచి నిలుచున్నాము.

"ఎందుకు లేచారు? నాకు కోపం వచ్చింది, మళ్ళీ యథాప్రకారం కూర్చోండి. మీ ప్రొఫెసర్ సాబ్ ఎన్ని అల్లర్లో చేసేవారు.” ​ఏం చేస్తాం! అలాగే యథాతథంగా కూర్చున్నాం. మాఎదురు గుండా ఉమామయి కూర్చున్నారు. చెప్పవద్దూ నేను సిగ్గు అణచుకోడానికి విశ్వప్రయత్నం చేశాను. ఆనందమయి విజయం పొందింది. అల్లరిపిల్ల! చెయ్యాలని నా జుట్టు సవరించింది. నా మోము అదిమిపట్టి తనవైపు త్రిప్పుకుని, ఒకనిమేషం తేరిపారచూచి, ఉమామయివైపు త్రిప్పి, “ఏమండీ పిన్నీ! ఈ అబ్బాయి మోము బాగానే ఉందనుకుంటాను. దక్షిణాది వారంతా కోతులనుకున్నాము. కాదని కొంచెం నిర్ధారణ అయింది సుమండీ!" అని అంటూ మోములో గంభీరముద్ర దాల్చింది.

ఉమామయి పకపక నవ్వుతూ “అల్లరిపిల్లా! అతని ముందు దివ్విటీ ముందు దీపంలా ఉన్నావు. కాస్తరంగు ఉంటే సరేనా? నాకొడుకు మన్మథుడు. నువ్వో” అని నవ్వి ఆమె కూడా మోములో గంభీర ముద్ర ధరించింది.

నేను: “ఇంతకూ మేమాంధ్రులం. ఆంధ్రులెవ్వరో నిర్ధారణ చేశారా!" అన్నాను.

ఆనందమయి “రాక్షసు”లని అన్నది.

ఉమామయి “దేవతలు, దేవతలే!” అని దృఢంగా చెప్పింది.

మేము ఇద్దరమూ లేచి ఆ తల్లికి పాదాభివందనాలు చేశాం. ఆమె మా తలపై చేతులుంచి ఆశీర్వదించి, “చతుర్వేదీ! నీ వధువును వాళ్ళ తలిదండ్రులతో మాయ మాటలు చెప్పి తెల్లవారుతూనే తీసుకువచ్చాను. నువ్వు ఈ ఊరు తిరిగి వచ్చేశావని వారెవరికీ తెలియదు. నువ్వు ఇంటినుంచి కదిలి బయటికి వెళ్ళు. ఆనందమయి ఇక్కడే ఉంటుంది. ఆమె పెట్టే బేడా తర్లించుకు వచ్చేటట్లు చేశాను. మీ ప్రొఫెసర్‌గారు జ్యోతిర్మయికీ, త్రిపాఠీకి టెలిగ్రాము ఇవ్వడానికి వెళ్ళారు. వీలయితే ట్రంకు ఫోనులో మాట్లాడతానన్నారు. ఈలోగా లక్నో రిజిస్ట్రారుతో మాట్లాడి అక్కడ మీ ఇద్దరికీ రిజిష్టరు వివాహం జరిగే ఏర్పాట్లు చేస్తూఉన్నారు. మధ్యాహ్నం లక్నోకు వెళ్ళివస్తారు. ఆ పైన సంగతులు ఆలోచిద్దాం" అని ఆమె లేచి "జాగ్రత్తగా ఉండండి. రెండు మూడురోజులలో వివాహం. నేనూ, ప్రొఫెసరూ ఇతర సైన్సు ఆచార్యులూ ఇద్దరో ముగ్గురో భార్యలతో లక్నో వస్తాము. ఈ విషయం ఏమాత్రం ఎవరికీ తెలియకుండా ఉంచదలచుకొన్నాం” అని అంటూ ఆమె తలుపు దగ్గిరగా వేసి వెళ్ళిపోయింది.

మా ఆనందం సుధాసముద్రం అయిపోయింది. ఆనందమయి నా శ్రీమహాలక్ష్మి!

6

ఆ సాయంకాలానికి జ్యోతిర్మయీ, త్రిపాఠీ మాప్రొఫెసర్‌గారి ఇంటికి చక్కావచ్చారు. జ్యోతిర్మయి చెల్లెలిని కౌగిలించుకొని, “చెల్లీ ఎంత అదృష్టవంతురాలివే!” అన్నది.

రాగానే నా చేయి విరిగేటట్లు జాడించిన త్రిపాఠీ “నువ్వు దురదృష్టవంతురాలవా!” అన్నాడు కోపం నటిస్తూ. “నేనేగాక నా చెల్లి కూడా అదృష్టవంతురాలు” అని జ్యోతిర్మయి మూతిముడిచింది.

త్రిపా: అంతేకద!

జ్యోతి: మీరు మరీనండి. ఏమో, నాకన్న నాచెల్లే అదృష్టవంతురాలేనేమో? ఆలోచిస్తే అలాగే కనబడుతోంది. ​ఉమా: ఒకరికన్న ఒకరు అదృష్టవంతులు లెద్దురూ!

ఆ మర్నాడు మేమంతా లక్నో వెళ్ళాం. నాకూ ఆనందమయికీ రిజిష్టరు వివాహమయింది.

దారిలో త్రిపాఠీ నాతో రహస్యంగా “మామగారికి నీమీదకోపం ఏమీ తగ్గలేదు భాయ్! అంతా నీపనే అంటారు. నేను జ్యోతి ఎన్నో చెప్పాం. ఆయన మనస్సు తిప్పలేక పోయాం. కాని అత్తగారి మనస్సు తిరిగింది” అని చెప్పినారు.

వివాహం కాగానే లక్నోనుండి వెంటనే అలహాబాదు వచ్చి వేశాం. నేను తక్క తక్కినవారందరూ త్రివేదీ గారింటికి వెళ్ళారు.

మాటలమధ్య నెమ్మదిగా మా గురువుగారు త్రివేదీ గారితో అంతా చెప్పారట. ఆయన నోట మాటరాక కుర్చీలో కూలబడిపోయారట. కొమరిత పాదాభివందనం చేయడానికి వెడితే “ఛీ దుర్మార్గురాలా! నీ మొహం చూపకు నాకు” అని ఆమెను కాలితో తన్నినారట. అంతతో మాగురువుగారు ఉగ్రుడైలేచి “నీ సంగతి దేశదేశాలా చాటుతాను. ఏ యుగంలో ఉన్నావు నీవు? వింధ్యాచలం ఇంకా ఆకాశం అంటే ఉందనుకున్నావా!” అని లేచినారట.

త్రిపా: “మామగారు! మీరంత తెలిసిన వారూ, భక్తులు, గాంధీజీ, జవహర్ పండిజ్జీల శిష్యులే, ఇలాంటివారవుతారని కలలోనన్నా అనుకోలేదు, కూతుర్ని తన్నారా? నన్నూ జ్యోతిర్మయినీ తన్నండి. ఈ పరిణామానికి కారకులం మేము. ఆనందమయి చతుర్వేదిని ప్రేమించేటట్లు చేశాము. అతడు ఉత్తముడు. మహోదారచరిత్రుడు. అలాంటివాడు అల్లుడవడం మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం" అని విసవిస ఆవలకు నడిచిపోయాడట. అందరూ అన్ని విధాలా చెప్పినారట. ఆనందమయి తండ్రిపాదాలకడనే పడివుందట. ఆనందమయి తల్లి కాళీమాయివచ్చి కూతుర్ని లేవదీసి "అమ్మడూ! నాన్న గారు తన్నినారా? నీ కర్మమేమి, నేనూ నీతో వస్తాను పద. ఇంత ఉత్తములే ఇలా అయ్యారేమి? అది నా కర్మ” అంటూ కౌగలించుకుందట ఆ బాలికను తల్లి.

మా మామగారు సింహంలా లేచారట. “సరే! మీరంతా సంస్కృతి కలవారు. నేను మాత్రం పరమఛాందస్తుణ్ణి! అనుకోండి, కన్నతల్లీ, నీకూ చతుర్వేదికే నిజమైన వివాహం చేస్తాను. ఆచార్యా! మీరు ఆ శుభకార్యం వైభవంగా జరిపించండి. తల్లీ! నిన్ను తన్నిన పాపానికి నివృత్తి ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుందో!” అని ఆనందమయిని తన హృదయానికి అదుముకొని వెక్కి వెక్కి ఏడ్చినారట! అప్పుడందరి కళ్ళూ చెమర్చినాయట! జ్యోతిర్మయీ త్రిపాఠీ, ఆనందమయీ తండ్రికడ సాష్టాంగ పడినారట.

నా వివాహం పరమాద్భుతంగా జరిగింది. మా వాళ్ళంతా ప్రయాగ తర్లి వచ్చారు.

వింధ్యాచలేశ్వరుడు పకపక నవ్వుతున్నాడు. భారతదేశంలో అన్ని నదీ నదములూ త్రివేణీ సంగమానికి చుట్టాలై వచ్చినాయి.


"ఓం అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.”


​

వడగళ్ళు

వడగండ్ల వాన కురిసి పంటంతా పాడైంది. అంతటితో పతంజలి మనసు కుంగిపోయింది. ముదుసలి తల్లీ, పెళ్ళీడు వచ్చిన చెల్లెలూ, చదువుకుంటూన్న తమ్ముడు, అయిదెకరాలమీదా సొంత వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు ఈ ఏడు. నూతిక్రింద ఒక ఎకరం వరిఊడ్చినాడు. తక్కిన నాలుగెకరాలు జొన్నవేశాడు. ఎంతవుతుందీ? ఏమవుతుందీ? ఆనూతి దగ్గరే ఒక చిన్నపంపులో పాదులుచేసి తోటకూరా, పాలకూరా మొదలైన ఆకుకూరలూ, ఓ సన్న జాజిపందిరీ పెంచుతున్నాడు. ఏడాది జైలుకు వెళ్ళి వచ్చినాడు. జైలులో ఉన్నప్పుడే గ్రామస్థులు కొందరు సహాయంచేసి వ్యవసాయం సాగించారు. అతడు పందొమ్మిది వందల నలుబది ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబరులో విడుదలైన దగ్గరనుంచీ గ్రామస్థుల సహాయానికి కృతజ్ఞత చూపిస్తూ వారిని రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించుకొన్నాడు. పంటకోసే బంగారం వంటి పంటకాలం ముందర మిత్తిలా ఈ వడగళ్ళవాన చక్కా వచ్చింది. పతంజలిశాస్త్రి జీవితం మూలమంతా కదలిపోయింది. జీవితంలో ఏలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే స్వభావంగల శాస్త్రికి ప్రపంచములో విరోధులనేవాళ్ళు ఎవరూలేరు. అతన్ని హింసించిన రజాకార్లకే అతనియందు కోపంలేకపోయింది. వరంగల్లు కాలేజీలో చదువుకున్నాడు. ఇంతలో తండ్రిపోవడం వల్ల జన్మభూమి అయిన జనగామ వచ్చి చేరుకున్నాడు. పతంజలి శాస్త్రికి ఆంధ్రభూమి అన్నా, ఆంధ్రత్వమన్నా ఆకాశమంత అభిమానం. చదువుకున్నన్నాళ్ళూ ఆంధ్రదేశంమీద పాటలు రాస్తూ తెలంగాణా రాయలసీమా కోస్తాజిల్లాలూ సిరివంచా చాందా బస్తరుఅన్నీ కలసి అఖండాంధ్రరాష్ట్రము స్థాపితమై ఆ రాష్ట్రానికి ముఖ్యపట్టణము హైదరాబాదు కావాలని అతని కోరిక.

పతంజలి శాస్త్రి అఖండాంధ్రస్వప్నము అతడు చదువు మానగానే ఒక మహాకెరటము చిన్ననావను తీసుకువెళ్ళినట్లు అతన్ని తీసుకువెళ్ళి ఆంధ్ర మహాసభలో సభ్యుణ్ణి చేసింది. ఇంతట్లో ఆంధ్ర మహాసభలోనే చీలికలు వచ్చాయి. అసలాంధ్రమహాసభ కమ్యూనిస్టుల పాలైంది.

ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మందుములు నరసింగరావు, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మందుముల రామచంద్రరావు మొదలైన నాయకులు పోటీ ఆంధ్ర మహాసభ పెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పతంజలి గాంధీ పూజా నిరతుడు కాబట్టి కోటి ఆంధ్ర మహాసభలలో చేరాడు. ​సకల భారతావనికీ పందొమ్మిది వందల నలభైఏడు ఆగష్టు శుభ ముహూర్తము నందు పవిత్ర స్వాతంత్ర్యం ఉదయించింది. కాని హైదరాబాదుకు మాత్రం నిజమైన స్వాతంత్ర్యం లేకపోయింది. పతంజలి హృదయం తల్లడిల్లిపోయింది. భారతమాత గర్భంలో హైదరాబాదు స్వాతంత్ర్యం ఒక వ్రణం అనుకున్నాడు ఆ యువకుడు. తనబాగు తనకు తెలియదు నైజాం ప్రభువుకి. ప్రపంచంలో ప్రభువులు దూదిపింజలై ప్రజాభ్యుదయ ప్రభంజనంలో దిశాంతాలకు కొట్టుకొనిపోతూంటే ఇత్తేహాద్ ముసల్మీన్‌కి ఇంత మూర్ఖత ఏమిటి అనుకున్నాడు పతంజలి.

రాష్ట్ర కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభమైంది. తన కుటుంబపు దైన్యస్థితి, తన నిస్సహాయతా ఆలోచించకుండా ఆ శాంతరణంలోనికి వీరుడై ముందుకు ఉరికాడు. మరుసటి క్షణంలో పోలీసులు లాఠీ ప్రయోగానికి గురియై గుల్బర్గా జెయిలులో ప్రవాశి అయిపోయినాడు.

2

వడగళ్ళ వాన పెనుభూతంలా వచ్చిపడింది. వడగళ్ళకు దయాంతఃకరణలు లేవు. దేశంలో ఆహారపదార్థాలు తక్కువగా వున్నాయని ఆ వడగళ్ళవాన ఆలోచించదు. అసలే హిమగర్భమూర్తి వడగళ్ళవాన; కర్కశరూపి. అశనిపాతం ఒక చిన్న ప్రదేశం మాత్రమే నాశనంచేస్తుంది. వడగళ్ళపాతం పంటలకు కోటి అశనిపాతాలు! పతంజలి ఏడుపు రంగరించిన నవ్వు నవ్వుకున్నాడు.

దేశానికి భారతీయ సైన్యదళాలు విముక్తి సముపార్జించి, స్వేచ్ఛను నెలకొల్పినా, రజాకారుల దురంతాలు అణగిపోయినా కాంగ్రెసులోనే వడగళ్ళ వాన కురిసింది. రెండు కాంగ్రెసు పక్షాలయ్యాయి. ఒకదానికి రామానందతీర్థ అధ్యక్షుడు. రెండవదానికి దేశాయిగారధ్యక్షుడు. దేశాయిగారి వెనకాల పెట్టనికోటలా రామకృష్ణారావుగారు, నెహ్రూగారు వచ్చి వెళ్ళినా రెండు పార్టీలలో రాజీ కుదరలేదు. పతంజలి రామకృష్ణారావుగారిని 'కాకతీయకటకసన్నాహా' 'తెలంగాణా దక్షిణభుజదండా' అని పొగడుకొన్నాడు. అతడు రామకృష్ణారావుగారి పక్షం తరపున వేలకువేలు కాంగ్రెసు సభ్యులను చేర్పించాడు. ఇంతట్లో పటేలుగారి రాక మంత్ర ప్రయోగమై రెండుపార్టీలూ కలుసుకున్నాయి. అదివరకే వడగాళ్ళవాన కురవటమూ, పంటలు పాడవటమూ అయిపోయింది. తన ఇంట్లో జొన్నకూడే! తెలంగాణా తెల్ల జొన్నలు పిండి విసురుకొని రొట్టె కాల్చుకొని తింటారు.

వడగళ్ళు రాల్పగా మిగిలిన కొద్ది పంటా ఈనాటికి అయిపోయింది. ఏలాగో హైదరాబాదు స్కూలు ఫైనలు పరీక్ష రెండవతరగతిలో కృతార్థుడయ్యాడు. వరంగల్లులో ఇంటరు చదువుతూండగా తండ్రిపోవడం, స్వగ్రామమైన జనగామ చేరుకోవటం తటస్థించింది.

తన చెల్లీ, తల్లీ, తమ్ముళ్ళ దుఃఖాలను ఉపశమింపజేస్తూ తాను తన విషాదాన్ని శివునిలా దాచుకొంటూ గరళకంఠుడయ్యాడు. ​"తమ్ముడూ! నువ్వు చదువుమానకు! ఇరవైమూడేళ్ళు దాటిన నాబోటి అన్న ఉండీ నిన్ను చదువు మాన్పించటమా?" అన్నాడు.

తల్లి: నాయనా, ఈ సంసారం ఎట్లా ఈదను? ఈ దినంతో ఇంట్లో జొన్నలూ, జొన్నపిండీకూడా అయిపోయాయి.

చెల్లి మాలక్ష్మి: అన్నయ్యా! నేనూ చదువు మానేస్తాను. నన్ను బట్టి కూడా ఇంకా మనకు కొంత ఖర్చు. మనం భరించగలమా?

తమ్ముడు లక్ష్మీనరసింహశాస్త్రి : అన్నా, నేనూ చదువు మానేస్తాను. డాక్టరుగారి దగ్గర కాంపౌండరుగా వుంటే పదిరూపాయలు యిస్తామంటున్నారు.

పతంజలి: తమ్ముడూ, చెల్లీ! మీ ఇద్దరూ చదువుమానకండి. నారు పోసిన భగవంతుడు నీరు పోయక మానడు. మన వూళ్ళో పెద్దరెడ్డి ఓ ఎకరం మెరకపొలం పుచ్చుకుంటానన్నాడు. అది నూతిక్రింద పల్లపు పొలానికి దగ్గరగా వుండడంచేత మన పొలంకూడా పల్లంచేసుకుని అది కూడా నూతిక్రింద వ్యవసాయానికి తీసుకువస్తాడుట. తక్కిన నాలుగెకరాలూ అతనికే కవులుకు ఇస్తున్నాను. పొలం ఖరీదుకిచ్చే మూడు వందలూ, కవులుకోసం ముందరే ఇచ్చే వంద రూపాయలూ పట్టుకుని అందరం హైదరాబాదు పోదాం. సుల్తాన్ బజారులో ఓ కాంగ్రెసువాది తన కొట్టులో ఒక చిన్నభాగం వీథి అరుగుమీద ఆరునెల్లపాటు అద్దెలేకుండా ఇస్తానన్నాడు. తమలపాకుల బీడాలూ, సిగరెట్లూ, బీడీలూ అలాంటి వస్తువులేవో పెట్టి వర్తకం సాగిస్తాను. మన భుక్తి, చదువులు అవిచ్చిన్నంగా సాగిపోతాయనే ఆశిస్తున్నాను.

3

సుల్తాన్‌బజారులో పతంజలి శాస్త్రి పాన్ బీడాషాపు పెట్టాడు. కాంగ్రెసువాడవడమూ, ఉత్తముడూ, చాలా కష్టపడినవాడూ అని పేరు ఉండడమువల్ల అనేకమంది అతని దుకాణంలోనే తమలపాకు బీడాలు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు మొదలైనవి కొనసాగించారు. తమ్మునికీ, చెల్లెలుకూ పాఠశాలలో ప్రవేశం దొరికింది. తమ్ముణ్ణి ఆంధ్ర స్కూలులోనూ, చెల్లెలిని ఆంధ్ర బాలికా పాఠశాలలోనూ చేర్చుకొన్నారు.

‘ప్రతివాని జీవితంలోనూ ఎన్ని వడగళ్ళ వానలు వస్తాయో' అని పతంజలి నిట్టూర్పు విడిచినాడు. ఇది కర్తవ్యతా మూఢత్వం లేకుండా, ఏ తక్కువ కార్యమైతేనేమి, గౌరవప్రదంగా జీవించడం ముఖ్యంకదా! శక్తిలేని వానికి ఉదరపోషణ నిమిత్తం ఉద్యోగాపేక్ష! రాష్ట్ర పరిపాలన కాంగ్రెసువారి చేతికివస్తే తానేమన్నా మంత్రిత్వం చేస్తాడా? దేశపాలన ఎవరు ధర్మంగా నడిపిస్తారో వారు రాజకీయ నావకు చుక్కానిపట్ట అర్హులు అవుతారు. కాని, కాంగ్రెసులో వారిలో వారికి పోటీలుపడి అనేక ముఠాలు సిద్ధమై కాంగ్రెసు ఆశయాలూ మూలపడి, కాంగ్రెసు సంస్థబలం నానాటికీ విచ్ఛిన్నం అయిపోతున్నది. మదరాసు మొదలయిన అన్ని రాష్ట్రాలలోనూ ఇలా కాంగ్రెసుబలం అడుగంటిపోతున్నది.

ఎన్ని చీలికలు, ఎన్ని కక్షలు! ​దేశం అంతా గాంధీజీబోధ మరచిపోయిందా?

పూర్ణ పురుషుడు, అవతారమూర్తి, అనాసక్తి యోగరూపుడు మహాత్ముడు ప్రజల హృదయాలలోనుండి మాయమయ్యాడా?


"ఏ మహాకాంతి నీవుగా మూర్తించినదో?
ఏ దిశ్యశక్తి నీవుగా రూపం తాల్చినదో?
ఏ పవిత్రత కూడుకొని నీ వవతరించావో?
ఓ సత్యపురుషా! అవ్యయరూపాత్మా!
సర్వవేద మంత్రాలు నీ స్వరములో నినదించినవి
ఉపనిషత్ స్వరాలే నీ బోధనలలో ప్రకాశించినవి!
పార్థసారథి గీతాదివ్యోపదేశామృతం ఝరులుగా నీ వాక్యాల ప్రవహించినది!
మహాత్మా! ఏకై కావతారా! మా తండ్రీ! జాతిపితా!
మా జీవితం అంతా నీవు ప్రసరించి ఉండలేదా?
ప్రళయాగ్ని మధ్య నీవు హిమాచలశిఖర శీతలత్వానివి!
భయంకర ఝంఝామారుతంమధ్య నీవు సునిశ్చల శాంతివి; నాశనం మధ్య సృష్టివి.
అసత్తుమధ్య సత్యానివి.
ఘోరతమస్సులు మాయంచేసే పరమపవిత్ర కాంతివి!
మహాత్మా! మా బాపూ! జాతిపితా! లోకగురూ!”


ఈలా అతని ఆలోచనలు సుళ్ళు చుట్టుకుపోతున్నవి. హైదరాబాదుపై రాజకీయపు వడగళ్ళవాన కురవక పూర్వమే పంజాబులో, సింధులో నాశనదేవత భీభత్సతాండవం సలిపినది. నేడు హైదరాబాదుకు శాంతి రాగానే, పంజాబునుంచి, సింధునుంచి కాందిశీకులై వచ్చినవారు కొంతమంది హైదరాబాదులో నివసించడానికై భారతీయ ప్రభుత్వం యేర్పాటు చేసింది.


సింధునించి వచ్చినవారు కోటీశ్వరు లవడంచేత వారు పెద్దపెద్ద మేడలు కొనుక్కొని పెద్దపెద్ద వర్తకాలు ప్రారంభించినారు. కాని పంజాబునుంచి వచ్చిన కాందిశీకులు పతంజలి శాస్త్రి స్థితిలోనే ఉన్నారు.


4


పతంజలి శాస్త్రి అడిగెమెట్టుకు దిగువ బొగ్గులకుంటలో చిన్న పటకుటీరం నిర్మించుకొని కాపురం సాగించినాడు. బొగ్గులకుంటకు ప్రక్కనే మిలటరీ ప్రభుత్వం ఒక చిన్న శిబిరం ఏర్పాటుచేసి పంజాబు కాందిశీకులు నివసించడానికి ఏర్పాటు చేసింది. వారందరికీ భారత ప్రభుత్వమే అనేక విధాల సహాయం చేస్తున్నది. అలావచ్చిన పంజాబీ కుటుంబాలలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. పండిట్ కృష్ణకుమార గాయత్రీ అసలు అయోధ్య బ్రాహ్మణవంశంవాడు. అతని పూర్వులెపుడో అయోధ్య రాజవంశాలవారు పంజాబు వీరోద్యోగాలకు పోయినప్పుడు, వారు తమకు పురోహితులుగా గాయత్రీ వంశంవారిని తీసుకొనిపోయినారు. ఆ వంశంవారు రాను రాను అనేక కుటుంబాలుగా ​వృద్ధి పొందినారు. ఆ చుట్టుప్రక్కల హిందూ రాజకుటుంబాలకూ, హిందూ వర్తక కుటుంబాలకూ వీరు పురోహితులయ్యారు.

భారతదేశానికి 1947, ఆగష్టులో సంపూర్ణ స్వరాజ్యం రాగానే జరిగిన పంజాబు హత్యలలో పండిట్ కృష్ణకుమారగాయత్రీ తన ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయినప్పుడు, తనవారిలో చాలామంది హతమైనప్పుడు, ఏలా పారిపోయి వచ్చాడో కూతురుతోనూ, చిన్న కుఱ్ఱవాడితోనూ. భార్య దుర్మరణం పాలయింది. ఆ ఇద్దరే తనకు ఏడుగడా. తన సర్వస్వమూ అనుకొని గాయత్రీ పండితుడు ప్రవాహంగా వరదలు కట్టే కంటినీరు ఆపుకుని ప్రభుత్వంవారికీ ఇద్దరు బిడ్డలతోనూ అప్పగించుకొన్నాడు. చాలాకాలం ఆ ఇద్దరితో ప్రభుత్వంవారు ఏర్పరిచిన కాందిశీక శిబిరాలలో ఉన్నాడు. ఆ మహాప్రళయం వెనుక గాయత్రీ పండితుని పౌరోహిత్యం ఎవరికీ కావాలి? ఒక భయంకర బృందదుఃఖం కాందిశీక శిబిరాలన్నీ నిండి మహాసముద్రమై ఉన్నది. ఆ ప్రదేశాలు చూడలేక తోటివారి దుఃఖం భరించలేక గాయత్రీశాస్త్రి 'దక్షిణంలో ఏడుగడ ఏదైనా దొరకదా' అని హైదరాబాదు వచ్చాడు.

హైదరాబాదులోనూ ఎక్కడ చూచినా కాందిశీకులే, ఒక ప్రక్క భారత ప్రభుత్వంవారు తెచ్చి ఉంచిన పంజాబు కాందిశీకులు, వేరొకప్రక్క హైదరాబాదు లాయకాలీ ప్రభుత్వం తెచ్చిపెట్టిన ముస్లిం కాందిశీకులు. ఆ సమయంలోనే గాయత్రీశాస్త్రికి 1947, నవంబరు నెలలో పతంజలి శాస్త్రి స్నేహం లభ్యమైంది. ఆ శిబిరంకడ చక్కని వటకుటీరం నిర్మించుకొని బొగ్గులకుంటలో కాపురం చేస్తున్నాడు. సైకిలుమీద బజారుకుపోయి తన తమలపాకు బీడా - సిగరెట్టు - బీడీ దుకాణానికి వెడుతూ ఉంటాడు. తమ్ముణ్ణెక్కించుకొని వచ్చి ఆంధ్ర పాఠశాలలో వదులుతాడు. చెల్లెలు బొగ్గులకుంటనుంచి అన్నగారితో రోడ్డువరకూ నడిచివచ్చి అక్కడే కాపురం చేస్తున్న బోయినాగన్న రిక్షా సిద్ధంగా ఉంటే అది ఎక్కి నారాయణగూడాలో ఆంధ్ర బాలికా పాఠశాలకు పోతుంది.

పతంజలి శాస్త్రికి ధర్మశాస్త్రాలుకాని, చివరకు విఘ్నేశ్వరపూజైనా చేయించడముగాని ఏమీరాదు. వచ్చినదేదో ఆ కాస్తా ఉరుదూ భూయిష్టమైన చదువు. ఉర్దూలో మాత్రం ఆరితేరిన పండితుడు తెలుగు అంతంతమాత్రం. హైదరాబాదు వచ్చిన దగ్గరనుండీ పట్టుదలతో తెలుగు నేర్చుకుంటున్నాడు. అందుకు అతనికి దోహదమూ ఉత్సాహమూ ఇచ్చినది ప్రక్కనే ఇల్లు కట్టుకొని కాపురం చేస్తున్న వెంకటాచారి.

వెంకటాచారి రజస్థుడు: ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. భారతీయ సంస్కృతీ, ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతీ అంటే ప్రాణం అర్పిస్తాడు. కళలంటే ఆత్మే అర్పిస్తాడు. ఒక్కొక్క శిల్పమూ, చిత్రలేఖనముచూచి, ఆనందంతో మైమరచిపోతూ ఉంటాడు. అతనికి ప్రాచీన నాణేలు సమకూర్చడం, వాటినిగూర్చి పూర్తిగా పరిశోధించి తెలుసుకొనడం జీవితానందకర్మ! పాతబజార్లు జుమాదాత్ బజారు వ్రతంలా అంటుకొని ఉంటాడు. ఒక్కొక్క ప్రాచీననాణెం దొరికిందంటే ఇక ఆ రోజునుండీ నెలలతరబడి అతనికి పండగే! ఆ నాణెము స్నేహితులకు చూపిస్తూ వెఱ్ఱి ఆనందంలో మునిగిపోతూ ఉంటాడు. ​ఆ వెంకటాచార్యులతో పరిచయం ప్రథమంలోనే సంభవించింది పతంజలి శాస్త్రికి. అసలు అతని బొగ్గులకుంట కాపరానికి కారకుడు వెంకటాచార్యులు. హైదరాబాదు కాపురానికి రావడానికి ముందు పతంజలి శాస్త్రి మంచీ చెడ్డా చూచుకోవడానికి ఆ నగరం వచ్చినప్పుడు అనుకోకుండా ఒక కాఫీహోటలులో పతంజలి శాస్త్రి, వెంకటాచారి కలుసుకున్నారు. ఎందుకు వారిద్దరకూ మాటలు కలిసినచో మరి, పదినిమిషాలలో స్నేహితులయ్యారు. అరగంటలో ప్రాణమిత్రులయ్యారు. బొగ్గులకుంటలో గజం మూడురూపాయల చొప్పున స్థలాలు ఉన్నాయనీ, రెండువందల గజాలు పుచ్చుకొని వెంటనే ఒకపాక నిర్మించుకొని అందులో ప్రవేశించమనీ వెంకటాచార్యులు సలహా యిచ్చాడు.

వెంకటాచార్యులు తన దొడ్లో రకరకాల మొక్కలు వేసుకుంటాడు వేసవి శీతాకాలాలలో తానే నీళ్ళుతోడుకొని, మొక్కలకు పోసుకుంటాడు. భూమిబలము మంచి దవడంవల్ల మొక్కలు ఏపుగా వచ్చి అన్ని కూరలు పుష్కలంగా కాస్తవి. అతడీ కూరల వ్యవసాయం ప్రారంభించిన కడనుండీ బజారునుండి ఒక్క కూరగాని, పచ్చిమిరపకాయగాని కొనలేదు.

పతంజలి శాస్త్రి యీ నూత్నమిత్రుని సూచన వెంటనే అమలులోపెట్టినాడు. రెండువందల గజాలు స్థలంకొని పాక నిర్మించుకొన్నాడు. ఆ ప్రక్క ఒకదొడ్డి కౌలుకు పుచ్చుకొని కూరలు వేయడం సాగించాడు. అతని దుకాణమూ వృద్ధి అవుతున్నది; కూరలపంటా వృద్ధి అయింది. కాలీ, కాబేజీ పువ్వులు, వంకాయలు, బీర, పొట్లకాయలు, టొమాటోలు, పాలకూర మొదలయిన కూరలు, పచ్చిమిర్చీ, అన్నీ తనకొట్లో ఓ ప్రక్కగా పెట్టి వాటి అమ్మకమూ సాగించాడు.

5

1948 నవంబరు నెలలో గాయత్రీ పండితుడు బజారుకువచ్చి పతంజలి శాస్త్రి కొట్లో ఒక బీడీలకట్ట కొనుక్కొంటూ “మీరు మా శిబిరం ప్రక్కనే కాపురం చేస్తున్నారుకాదా?” అని ప్రశ్నించాడు.

"అవును. మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఏదైనా పని చూసుకున్నారా?”

పతంజలి ఉర్దూలో పండితుడు. అతని భాష వింటూ గాయత్రీ పండితు డాశ్చర్యం పొంది “మీరు ఉత్తరాదివారా?” అని ప్రశ్నించాడు.

"కాదండి, మేము అచ్చమైన ఆంధ్రులం. అయినా ఈ సంస్థానం తురక సంస్థానం అవడంవల్ల, రాజభాష ఉర్దూ అయింది మీకు అంగరీజువలె! కాబట్టి అన్ని భాషలు మేము నేర్చుకోవాలె. ఆంధ్రభాష మాత్రం మాకు దూరం! మేము ఉర్దూపత్రికలే చదువుతాము. నలుగురం కలుసుకుంటే తెలుగులో మాట్లాడుకోము. ఉర్దూ మాకు ఉగ్గుపాలలా వస్తుంది. మాట్లాడే తెలుగులోనూ ముప్పాతిక మాటలు ఉరుదూ మాటలే!”

“చాలాచిత్రమే! నాకేమీ పనిదొరకలేదు బాబూజీ! ఎంతకాలమని ఈలా ప్రభుత్వ సహాయం పొందుతూ ఉండను? పంజాబులో రాజ్యం ఏలినాను. ఈరోజు ఇక్కడ బానిస బ్రతుకుకన్న అధ్వాన్నంగా ఉంది.” ​పతంజలి శాస్త్రి పండిజ్జీ విషాదముఖం చూచినాడు. అతని హృదయం ద్రవించిపోయింది. కొంచెం గొంతుకు సవరించుకొని, అతడు గాయత్రీ పండితుని చూచి-

"పండిజ్జీ! మీరు నాతో భాగస్వాములు కండి. ఈ కొట్టు నేను ఒక్కణ్ణి చూసుకోలేకుండా ఉన్నాను!” అని గాఢ కంఠంలో ప్రార్థనగా అడిగినాడు.

"మీతమ్ముడు ఒక అబ్బాయి ఉన్నట్టున్నాడు.!”

"ఉన్నాడు. వాడికి చదువు బాగా వస్తోంది. వాడికి ఎంత చదువైనా చెప్పించ దలచుకొన్నాను.”

"మా అమ్మాయి లాహోరులో బాలికా పాఠశాలలో అయిదవఫారం చదువుతూ ఉండేది."

"మీకు సంతానం ఎందరు?”

గాయత్రీ పండిజ్జీకి కంటనీరు తిరిగింది. తలవంచుకొన్నాడు.

"మా అమ్మాయీ అయిదేళ్ళ చిన్నకుఱ్ఱవాడూనండి. మా పెద్దబ్బాయిని మీ యీడువాణ్ణి మాకళ్ళఎదుటే పొడిచేశారు. వాడు బ్రతికేఉన్నాడోప్రాణమే వదిలాడో! మేము ప్రాణాలకు వాణ్ణి అలావదిలి పారిపోయాము. ఆ దృశ్యం చూసి, గుండె ఆగి నాభార్య గతించింది. నా తమ్ముడి కుటుంబం సగం నాశనమైంది. తక్కినవాళ్ళందరూ “థెల్హీ” ప్రక్క శిబిరాలో వుంటున్నారు.”

“పండిజ్జీ, మీరు వెంటనే శిబిరంవదలి నేను కౌలు పుచ్చుకున్న దొడ్డిలో కాపురం పెట్టండి. నాలుగువందల గజాలస్థలం. ఆ స్థలం మీ పేర కొందాం. నేను ఎక్కడో అప్పు పట్టుకువస్తాను. మీరు నెమ్మదిగా ఆ అప్పు తీర్చుకోవచ్చును.”

“నాయనా! మీకు నేను మెడను కట్టినరాయిలా తయారవుతాను.”

"అలా మీరేమీ అనుకోకండీ! నేను ఏవో సబ్బులూ, తలనూనెలూ, ఇంకా ఇతర షాపుసామానులూ అమ్మడం ప్రారంభించాను. అవీ బాగా అమ్ముతున్నాయి. అదీకాక ఈమధ్య ఆంధ్రపత్రిక, భారతి, బ్లిడ్జి పత్రికల అమ్మకము సాగించాను. ఇవన్నీ ఒఖ్ఖణ్ణే చూసుకోలేకుండా ఉన్నాను పండిజ్జీ!"

"ఇంత చిన్నకొట్టు వ్యాపారానికి మనం ఇద్దరం ఏలా ఇముడుతాము శాస్త్రిజీ?”

"ఈ ప్రక్క ఓ పెద్దకొట్టు అద్దెకు వచ్చింది. దానికి బజానా ఇచ్చాను. అక్కడ సాగిద్దాము. ఈ కొట్టు ఇచ్చిన స్నేహితునకు ఇబ్బంది అవుతున్నది. అందుకనే ఆపనిచేశాను.”

“సరే, కానివ్వండి. తక్కిన మాటలు ఇంటి దగ్గిర మాట్లాడుకుందాం.”

ఒకనెలలో గాయత్రీశాస్త్రికోసం పటకుటీరం తయారైంది. ప్రభుత్వ సహాయంతోనూ, పతంజలి తెచ్చిన అప్పుతోనూ ఆ నాలుగు వందల గజాల భూమి కృష్ణకుమార గాయత్రీ పండితుడు కొనుక్కున్నాడు. పతంజలి, గాయత్రీ పండితులిద్దరూ కలిసి వ్యవసాయమూ, కొట్టూ రెండూ చూచుకొనడం సాగించారు.

గాయత్రీ పండితుని కొమరిత జయనందిని అందాల పుంజము. కోలమోము, తీర్చిదిద్దిన కనులు, ముక్కు, నోరు తీరు, పసిమి బంగారులో పాటలవర్ణము సమ్మిశ్రితమైన ​ఛాయ. పదునేడేండ్ల మిసిమి మిఠారీ పుత్తడి బొమ్మ. తేనెలు జీరలుకట్టి ఆవుపాల మీగడ తరగలు కట్టినట్టి చిక్కని మధుర కంఠధ్వనితో ఉరుదూ పంజాబీలు మాట్లాడుతూ ఉంటే పతంజలి హృదయం జల్లుమనేది. ఈ మధుర పుష్పంకోసం పంజాబీ కాందిశీకులలో యువకులు ప్రథమంలో అస్తమానమూ వస్తూ ఉండేవారేగాని గాయత్రీ పండిజ్జీకి అవేమీ గిట్టక వచ్చినవారిని తన తోట ఇంటిబయట రోడ్డుమీదనే నిలబెట్టి మాట్లాడేవాడు. తాను లేనప్పుడు కొమరిత పతంజలి ఇంట్లో ఉండేటట్లు కట్టుదిట్టం చేశాడు. ఆ కారణంవల్ల పంజాబీ యువకులు నిట్టూర్పులు విడిచి లాభం లేదనే నిస్పృహవల్ల గాయత్రీ పండితుని ఇంటికి రావడం నెమ్మదినెమ్మదిగా మానివేసినారు.

జయనందినికీ, పతంజలి చెల్లెలు మాలక్ష్మికీ నానాటికీ స్నేహం గాఢం అయింది. మాలక్ష్మి జయనందినికి తెలుగు నేర్పసాగించింది. జయనందిని లాగు, చొక్కా, వల్లెమాని, మాలక్ష్మి పరిష్కర్తృత్వంలో తెలుగు బాలికల రీతిని చీరా జంపరూ ధరించడం నేర్చుకున్నది. గాయత్రీ పండితుని కొడుకు రాధాకుమార్ ఐదేండ్ల బాలుడు. తెలుగుదేశం బాలకుడే అయినట్లు మాలక్ష్మి దగ్గిర తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒక్క నిమిషంకూడా మాలక్ష్మినీ, పతంజలి తల్లి సుందరమ్మగారినీ వదిలేవాడుకాదు. సుందరమ్మ గారికి రాధాకుమారుని పెంపకము పరమసంతోషం కలుగజేసే వ్రతం అయినది. ఆ బాలుడు ఈమే తన తల్లిగా ‘అత్తా' అంటూ ఆవిడ పక్కలోనే పండుకొనడం సాగించాడు.

జయనందిని ఆలోచనాపరురాలు. భయంకరమైన హృదయ విచారణ దృశ్యాలెన్నో పంజాబులో చూచింది. ఆమె పులుల గుంపులను చూచిన కురంగిలా వణికిపోయింది. ఎన్నిదినాలో ఆమెకు పీడకలలు వస్తూ ఉండేవి. పంజాబు విశ్వవిద్యాలయ ప్రవేశిక పరీక్షకు చదువుతూ ఉండగా ఆ దేశం ముక్కలయింది.

ఈనాడు పతంజలి శాస్త్రి ఆ బాలికకు నెహ్రూ అవతారంలా కనుపించినాడు. ఆ బాలికకు పతంజలిని చూచినప్పుడల్లా ఏదో శాంతి. ఏదో ధైర్యము, ఏదో వర్ణింపలేని ఆశా కలుగుతూ ఉండేది.

పంజాబూ, హైదరాబాదు రాష్ట్రం ఏదో కొద్ది తేడాలుగా ఉంది. కాని పంజాబులో తాను కోరిన ఏదో విచిత్ర సౌందర్యం ఈ తెలుగువారిలో దృశ్యమైనది. తల్లీ చీరే కట్టుకొనేది. కాని ఆ విధానం అయోధ్యవిధానం. తెలుగువారి కట్టూ, బొట్టూ ఏదో శాంతిపూరితంగా వున్నవి. వీరి శుచిత్వము లోతులనుంచీ ప్రవహించి జీవితం అంతా ప్రసరిస్తుంది. తెలుగువారిలో హుందాతనం భారతజాతికి వన్నెగా కనబడింది. జీవితం సౌందర్యవంతం చేసుకోవడం తెలుగువారికే తెలుసును. అలా సౌందర్యము పురుష జీవితానికి చిహ్నితంగా పతంజలి శాస్త్రి కనబడినాడు.

6

పతంజలిశాస్త్రి రాత్రిళ్ళు చెల్లెలికీ, జయనందినికి పాఠాలు చెప్పేవాడు. పాఠాలు చెప్పుతూవుంటే శాస్త్రి మోము పూర్ణిమాజ్యోత్నలా వెలిగిపోయేది. అతని మాటలలో ఉత్కంఠతా, అతడు చెప్పే ఉత్సాహమూ జయనందిని చూచేది. జీలంనదీ తీరంనుంచి ​వచ్చిన ఆ ఔత్తరాహ యౌవన హృదయానికి ఈ ముచికుంద నదీతీరవాసుడైన పతంజలి బాలికలను కష్టాల నుండి రక్షించే వీరుడై కన్పడినాడు. నరకాసురుని సంహరించి బదునారువేల రాజకుమారికలను రక్షించిన శ్రీకృష్ణు డీలాంటివాడేనా యని జయనందిని అనుకున్నది. జయనందిని గోధుమతోవండే పిండివంటలు మాలక్ష్మి నేర్చుకొనేది. తమ దేశపు పిండివంటలు జయనందినికి నేర్పేది; వీ రిరువురకూ చదువులు నేర్పే పతంజలి శాస్త్రి వీరిద్దరి ప్రాణస్నేహము చూచి పులకరించి పోయేవాడు.

గాయత్రీపండితుడు నెమ్మదిగా తన కష్టాలు మరిచిపోయాడు. తన యాభైరెండు సంవత్సరాల జీవితమూ దక్షిణాన కృష్ణా గోదావరీ మధ్య దేశంలోనే గడచినట్లయింది. వర్తకమునందూ, ఇంటిదొడ్డి కాయకూరల పెంపకమునందూ అతనికి విచిత్రమైన అనురాగం కలిగింది. అరటికాయ కూర, దోసకాయ పచ్చడి, ఆవకాయ, గోగుకూరపులుసు మొదలైన తెలుగు వంటకాలు అతని జిహ్వకు నూత్నరుచులు కొనితెచ్చి, అతని కలలో కనుపించే పంజాబు హత్యాదృశ్యాల్ని మాయంచేసినవి.

పతంజలీ, గాయత్రీ పండితుడూ కలిసి కాంగ్రెసూ, బాపూజీ బోధనలూ ముందు దేశంలో జరుగబోయే మార్పులూ చర్చించుకొనేవారు. వేదాంత విషయాలు మాట్లాడుకొనేవారు. వీరితో వెంకటాచార్యులు చేరుతూ వుండేవాడు. వీరి ముగ్గురి సంభాషణా జయనందినీ, మాలక్ష్మి చెవులార వింటూ ఆనందం పొందేవారు.

వెంకటాచారి: పండిజ్జీ, ఏదో రూపంగా మనుష్యుని మనస్సు ఆనందం కోరుతూ ఉంటుంది. రాజకీయాలలో, ఇతరులకు ఉపకారం చేయడమో, ధనం సేకరించడమో, అధికారంలో ఇతరులను పాలించడమో ఈలా మానవుని మనస్సునకు సంతత వ్యాపారమత్తత ఉంటోనే ఉండాలి.

పండిజ్జీ: అయితే, మనుష్యుని ఆత్మకు ఆనందం కలిగే విషయాలను మనుష్యుడు వాంఛించడా?

పతంజలి: ఆత్మ వ్యక్తంకాని వస్తువు. మనస్సు వ్యక్తం అయిన మానవ జీవితంలోని ముఖ్య వస్తువు.

పండిజ్జీ: మనస్సు అతిసున్నితమై పోనుపోను మనస్సు తత్వాన్ని మించి పొందే వ్యవస్థే ఆత్మవ్యవస్థ. ఆ వ్యవస్థకూ మించిన వ్యవస్థ సర్వాంతర్యామి స్థిత అయిన ఒక మహోత్కృష్టమైన అనిర్వచనీయావస్థ, పరమాత్మావస్థ భౌతిక విషయజ్ఞానమైన స్థితిలో ప్రాథమికమైన మనస్సు స్థితి.

వెంకటాచారి: కాబట్టే మహాత్ముడు ఈ మనస్సును ధర్మపరమైన కార్యాలలో నిమగ్నం చేయమన్నాడు. లోకోపకారమూ, స్వకీయానందమూ రెండూ మిశ్రమై మనుష్యుని జీవితం ఒక ఉత్తమమైనదీ ప్రవాహంలా ప్రవహించిపోతుంది.

ఈ సంభాషణలు జయనందినికి అర్థమైనట్లుండి అర్థం కానట్లయ్యేవి. పతంజలి మాట, పతంజలి కంఠము, పతంజలి మోము త్రిప్పటము, అతడు కూర్చొనే విధానము, చేతులుత్రిప్పే రీతులూ హృదయానికి ఏదో తెలియగారాని ఉప్పొంగు నిచ్చేవి. ​ఆ బాలికలో కలిగే పరివర్తనం, ఆ వాతావరణం పరిమళంలా కమ్ముకుని పతంజలి జీవితాన్ని స్పర్శించేది. ఆ బాలిక తన్ను చూడడం లేదనుకొన్నప్పుడల్లా పతంజలి ఆమెను తనివితీర గమనించేవాడు, ఆమె పంజాబీ పాటలు, ఆమె ఆటలు, ఆమె తోటపని చేసే అందమైన తీరులూ చిత్రాలై అతని హృదయ ఫలకంపైన నవనవలాడేవి. కాని అతని హృదయంలో ఆ బాలికపైన స్త్రీ వాంఛ అతనికి దర్శనముకాలేదు. ఆమె ఏదో అజంతా చిత్రలేఖనము; పాలంపేటతో సౌందర్య విన్యాసవంతమైన శిల్పము.

7

1949 మే నెల వచ్చింది. ఎండలు తీక్షంగా కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక ఆదివారంనాడు పతంజలి భోజనానికి ఇంటికి వచ్చిన సమయంలో పదునొకొండు గంటలకు ఆకాశం చటుక్కున మేఘాలతోనిండి ప్రపంచం అంతా ఒక్కసారి చల్లబడి వడగళ్ళవాన కురిసింది. పతంజలి స్నానానికని దొడ్డిలోనికిపోతూ బీర చిక్కుడు పాదులను చూస్తున్నాడు. ఆ ఎండలో మేలిముసుగు వేసుకుని ఏదో కూనిరాగం తీస్తూ, పందిరిఛాయల నిలుచుండి బీన్సుకాయలు కోస్తున్నది జయనందిని. వడగళ్ళవాన కురవబోయే ముందు ఆ చల్లదనానికి కంఠం ఎత్తి.

“మై గిరిధర ఘర్కేజాఊ" అని పాడుకుంటున్న జయనందిని పతంజలిని గమనించలేదు. పతంజలి ఆమెను చూస్తూ ఆనందముతో అలా నిలుచుండిపోయినాడు.

జల్లుమని వడగళ్ళు కురియడం ప్రారంభించాయి. జాజి పువ్వులులా, పారిజాతం పువ్వులులా, ఆణిముత్యాలులా చిన్నవై ఆ వడగళ్ళు కురిసినవి. అవి దేవతలు కురిపించే పూలవర్షంలా ఉన్నవి.

కాని పతంజలికి వెనుక తాను పొలంలో ఉన్నప్పుడు ఉసిరికాయ లంత వడగళ్ళు మహావేగంగా అశనికోటిపాతంలా పడిన రోజు మనస్సులో మెరుము మెరిసింది. అతనికి ఈ తోటలూ, ఈ ఇళ్ళూ, ఈ ప్రియబంధువులూ నాశనం అయిపోతున్నట్లు దిగ్భ్రమయుక్తమై విపరీత భయం ఆవహించింది. పిడుగు తగిలినవానిలా తూలి "అమ్మయ్యా!” అంటూ కూలిపోయాడు.

అతడు పడిన చప్పుడు విని చటుక్కున తిరిగి చూచి జయనందిని “ఏమిటది మామా!” అని అతని కడకు పరుగుడి వచ్చింది. అతని ప్రక్కనే చటుక్కున చతికిలబడి "ఏమిటి! దెబ్బ తగిలిందా? మాట్లాడు మామా!" అని గజగజ వణుకుతూ పతంజలిని తన వొళ్ళోకి తీసుకుని అతని తల తన హృదయానికి అదుముకున్నది.

అతడూ నిమేషంలో తెప్పిరిలి, ఆమె స్పర్శ సుఖం అనుభవిస్తూ మరి రెండునిమిషాలు అలాగేఉండినారు. ఇద్దరి హృదయాలలో తెరలు వీగిపోయినాయి. అతని జీవితానికి ఆమె ఆగష్టు పదిహేనవ తేదీ అయింది. ఆతడా బాలిక జీవితానికి రాబోవు పవిత్రాశయమూర్తియై గోచరించినాడు. తనకు తెలియకుండా పతంజలి బాహువు లామెను గాఢంగా చుట్టివేసినవి.

చుట్టూ వారిపైన వడగళ్ళు మల్లిమొగ్గలై జలజలా రాలుతున్నవి. ​రాధాకుమారుడూ, లక్ష్మీ నృసింహశాస్త్రి, మాలక్ష్మి వడిగళ్ళు ఏరుకోడానికి దొడ్లోకి వచ్చినారు, "ఏమిటి అక్కా!” అనీ, “ఏమిటి బహిన్" అని రాధాకుమారుడూ, “ఏం జరిగిన దన్నయ్యా? పడ్డావా? ఏమిటి జయాబహిన్" అని శాస్త్రి వీరిరువురి దగ్గిరకు పరుగిడివచ్చారు. మాలక్ష్మి "అమ్మో! ఏమి జరిగినదేమిటి?” అని ఒక్క గంతులో వీరిని సమీపించింది. ఇదంతా మూడునిమేషాల కాలం మాత్రం!

వడగళ్ళు అక్షతులులా, తలంబ్రాలులా ఇంకను చిన్నవై కురుస్తున్నవి.

చటుక్కున పతంజలి లేచి “తల తిరిగింది, తూలిపోయినాను చెల్లీ! జయ నన్ను పట్టుకోకపోతే, చాలా దెబ్బ తగిలిఉండును!" అంటూ నిలుచుండినాడు.

జయనందిని మోము పలాశపుష్పవర్ణకాంతితో వెలిగినది. సిగ్గుతో ఆమె మోము ఆర్ద్రత తాల్చినది.

జయనందిని లేస్తూ “మామకు కాలు జారింది కాబోలు!" అని నిలుచుండినది.

వడగళ్ళవాన వెలిసింది.

ఆ రాత్రి వెంకటాచార్యులు గాయత్రీ పండితుని కడకు వివాహ బేరానికి వచ్చినాడు. పండిజ్జీ హృదయానందానికి కడపలు లేకపోయినవి.

“ఆచార్యభాయ్! నా హృదయంలో ఈ కోర్కె మొదటినుండీ ఉంది నాయనా! ఇంతకన్న నా జన్మకు సంతోషం ఏముంది!" అనినాడు.

పతంజలి తల్లి సుందరమ్మగారు తన జన్మకు ఇంతకన్న మోక్షానందం ఏమున్నది అనుకున్నది. వారిద్దరికీ ఆ రాత్రి ఆమె కన్నులనుండి ఆనందబిందువులు రాలుతూ వుండగా ఒకచోట కూర్చోబెట్టి దృష్టితీసింది.

వడగళ్ళు, తుఫానులు, దావానలాలు, ప్రళయాలూ మానవజీవితానికి ఏలాంటి మార్పులు తీసుకొనివస్తాయి! హిమాలయ తనయ అంశలో ఉద్భవించిన ఈ జయ తన జీవితం వెతుక్కుంటూ ఈలా దక్షిణానికి వచ్చింది. ఆ మనోహర మూర్తికి కర్కశుడైన తాను తగిఉండడు. అయినా తెనుగునాట ఔత్తరాహశక్తి ప్రసరించే దివ్యముహూర్తం ఆసన్నమైంది. కాబోలుననుకొన్నాను, జయకు తానే దైవమట, తానే చక్రవర్తి ఆట, తానే నాయకుడట! అని మాలక్ష్మి ఆనందంతో పొంగిపోతూ అన్న చెవిలో గుసగుసలు పలికినది.

జయ తేరిచూడజాలని సౌందర్యంతో నందనవన పారిభద్రపుష్పంలా వికసించిపోయింది.

అవతారమూర్తి తన గురువు! అతని మోము తన హృదయంలో దాచుకొని ఆదుముకొన్నప్పుడు వర్ణింపలేని అంత ఆనందం తన్ను ముంచి వేసినదేమి?

ఆమెను మాలక్ష్మి "మా అన్నను వివాహ మాడగలవా వదినా?” అని అడిగినప్పుడు కలిగిన పులకరింపులతో మాలక్ష్మినే గట్టిగా కౌగలించుకొని, ఆమె చెంపలు గాఢంగా చుంబించింది. ఆమె కన్నులలో మధురత్రపాజ్యోత్స్నలు అలుముకు పోయినవి. "భాభీ! నాకేం తెలుసును? నీకే తెలుసును” అన్నది.

వడగళ్ళు అమృత బిందువులై కురిసి వెలిసినవికదా!


​

బండరాళ్ళు


బండరాళ్ళ బ్రతుకులన్నీ
ఎండిపోవు కాల్వదరిని
మండిరాలు బూదియడవి
లెండన్నను లేవ నెవరు
రండన్నను రానెవరో


అని పాడుకుంటూ బోనగిరిరెడ్డి కొండపక్క అడివిలో వాగుపక్క బండరాతిమీదను కూర్చున్నాడు. అతడు కమ్యూనిస్టూ కాదు, కాంగ్రెసువాదీ కాదు. అతడు తెలంగాణా వీరుడు.


తెలుగుతల్లీ! చెట్లతో జొంపాలతో
నిండిపోయిన పచ్చని కొండలుగలదానా!


ఆకాశానికంటే ఒకటి రెండు బండరాళ్ళను కలిగి ఉన్న గుట్టలుగలదానా! జీవనదులు, ఎండిపోయిన వాగులూ ప్రవహించేదానా! కాకైనా చొరరాని కారడవులు గలదానా! సర్వలోహాలు, నవరత్నాలు, కారునలుపు రాక్షసి బొగ్గూ గర్భంలో దాచుకొన్నదానా! తెలుగుతల్లీ! మహోత్తమదేవీ! అమృత వాక్కులదానా! ఆనందపూర్ణ శిల్పజీవీ! దివ్యసాహిత్య పరులారా! బానిసత్వంలో క్రుంగిపోతూ స్వేచ్ఛకై వెతలు చెందేదానా! వేదనలు హారాలుగా ధరించిన తల్లీ! అవమానాలు కీరీటంగా శృంగారించుకొన్న దేవీ! నీవు బౌద్ధభిక్కునివా? - జైన సన్యాసివా? సౌందర్యపూర్ణ యౌవనాంగివా? నీ గుళ్ళు కూల్చబడి, నీ గోపురాలు తూల్చబడి, నీ శిల్పాలు ఖండింపబడి, నీ సాహిత్యాలు మండింపబడి, సౌష్టవపూర్ణమైన నీ బంగారు అంగాలు ఔషధాలకు లొంగని గాయాలుపడి నువ్వు మాయమాటలకు లొంగిపోయి, నువ్వు వేషమే మార్చుకొని స్వచ్ఛకాంతీయత ప్రజ్వలితమైన నీ సౌందర్యము బురఖాలో ముసుగుపడిపోయి, నీ బిడ్డలు పరభాషలకు, పరవేషాలకు సలాములు పెట్టి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని శతాబ్దాలు .


ఈనాటికి మా ఆవేదన ఈ రజాకారు యుద్ధంగా పరిణమించి, తల్లీ ఈచేతికొక ఖడ్గాన్ని ప్రసాదించు!


మాతా ఈ కంఠానికొక ఉరుమును అందించు!
సహోదరీ ఈ హృదయానికొక ధైర్యం కవచంచేయి!

​వీరపత్నీ! సుమంగళీ! తెలుగుతల్లీ, నా చూపులలో చండభాను తైక్షణ్య కాంతులు ప్రసాదించు!

నా పెదవులకు ఆనంద హాసనృత్యము మాయం చేయించు! నేడు తెలుగుజాతి నశించడమో, నిజమయిన స్వాతంత్ర్యపథంలో విహరించడమో!

అని హృదయంలో అనుకొంటూ బోనగిరిరెడ్డి కళ్ళవెంట దొనదొన నీళ్లు కార్చినాడు.

2

తెలంగాణా వీరుడా! బోనగిరిరెడ్డీ! నీ కళ్ళయెదుట నీ చెల్లెలికి మానభంగమైనది. ఆమె నూతిలో పడి చచ్చిపోయినది. నీ భార్య మానభంగం కాకుండా తన హృదయ రక్తం జిమ్ముమని చిమ్మగా పొడుచుకొని నేల వాలింది.

నీకు దేశం వదలి తక్కిన ఆంధ్రసీమలకు పారిపోవడం ఇష్టంలేక పోయింది. నీగ్రామం తగులబడిపోయినా, నీపంటలు మంటగలిసినా, నీవాళ్ళ బ్రతుకులు కూలిపోయినా, అటు గాంధీజీమాటో, ఇటు నీ నాయకుల గర్జనో ధైర్యసాహసాలై ఈ అడవుల్లో, ఈ బండరాళ్ళమధ్య ఈ ఎండిపోయిన సెలయేళ్ళ ఇసుకలలో నిలుపుకొన్నవి.

రజాకార్లను ఎదిరించినావో, రాక్షసులను హతమార్చినావో, సహధర్మ చారిణిని పోగొట్టుకొన్న ఒంటి సింహానివై పొదలలో, గుట్టలలో కదులాడుతూ, విదిలించిన కేసరిలా నడిరేయిని విరోధి శిబిరాలు దద్దరిల్లేటట్టు గర్జనచేస్తూ నిలుచుండినావు.

3

బోనగిరిరెడ్డికి సహాయంగా భారతీయ సేనలు పోలీసు యాక్షనుచేస్తూ వేంచేశాయి.

మూడురోజుల పట్టపగలులో 200 ఏళ్ళు వృద్ధిపొందిన ఆసప్జాహి దౌర్జన్యం అంతరించిపోయింది. అమ్మ పెట్టవలసిన నాలుగూ పెడితే అబ్బాయికి బుద్ధివచ్చింది.

భారతీయ హిందూజాతి హృదయంలో కక్షలు పెట్టుకునే జాతికాదు. ముస్లిం సహోదరుల హృదయం ఉద్రిక్తత పొంగు చల్లారింది. వారి దౌర్జన్యాలకు వారే సిగ్గుపడి పోయినారు.

భారతీయ సైన్యపు బందూకు మీదనుండి తెలంగాణ హిందూ ముస్లిం సహోదరులు చేయిచేయి పట్టుకొని “ఆదాబ్ అరజ్ - నమస్కారము" అనుకున్నారు కాని బోనగిరిరెడ్డి ఒంటరితనం పోలేదు.

ఓ బోనగిరిరెడ్డీ ఇటు కమ్యూనిస్టులు నీవు ఎరగని ఊహించలేని నాశనపూరితమైన దౌర్జన్యాన్ని రేకెత్తించి తెలుగునాడును దగ్ధపటలం చేస్తారే మోనన్న భయమూ ఆవరించింది.

అటు కాంగ్రెసు బురఖా తగిలించుకొన్న దొంగలు, దోపిడీగాండ్రూ, దేశముఖులు, కౌలుదార్లు ఈ నలుగురూ పూజ్యుడైన బాపూజీ పవిత్ర సత్యవ్రతాన్ని హింసకు ఎరజేసి తెలుగునాటి ప్రజల బ్రతుకులను ఎడారి ముంచేస్తారేమోనన్న అనుమానమూ కలిగింది.

ఒంటివాడవై నీ ఇంటికిపోతే ఇంటిలో మసలిన సహధర్మచారిణిలేదు. నీయిల్లే మంటగలిసి పోయింది. నీ భూములు ఇతరులాక్రమించి, నీపశువులు పచనము ​గావింపబడి, నీ నాగలి ద్వేషపు భోగిమంటలో కలిసి, నువ్వు ఒంటి వాడవై నిట్టూరుస్తూ నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ బండరాళ్ళ మధ్యకే మళ్ళీ వచ్చి నిలుచున్నావు.

నీ ఆస్తి తెలంగాణకు పాతగొంగళి. నీ పాస్తి అడవులలోని సీతాఫలపు పళ్ళు!

4

ఒకరోజున భోనగిరిరెడ్డి తాను అడవుల్లో సంపాదించుకున్న ఆపిదప కాలంనాటి సీతాఫలపుపళ్ళూ, కట్టెడు మోదుగాకు వరంగల్లు బజారుకు వెళ్ళి అమ్ముకొని నల్లబజారులో సేకరించిన ఇన్ని జొన్నలు, ఇంత ఉప్పు కారం పట్టుకొని ఆ ఒంటిమిట్టకు 15 మైళ్ళ దూరంలో వున్న తన మూడుమిట్టల స్వగ్రామానికి వచ్చాడు.

స్వగ్రామం అంటే అతని వెనకటి గ్రామంకాదు. తాను ఒంటిగా నివసించిన ఆ కొండపక్క బండరాళ్ళే అతని స్వగ్రామం. అక్కడే అతడొక చిన్న గుడిసె వేసుకున్నాడు. ఏటిలోకి ప్రవహించి వచ్చే చిన్న సన్నని ఊటకు అడ్డంకట్టి, చిట్టిగుంట నిర్మించుకొని నీటితో తడుపుకుంటూ ఆ బండరాళ్ళ దత్తుకొడుకు బోనగిరిరెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు.

ఒకటి రెండు కూరగాయలైతే వరంగల్లుపోయి అమ్ముకునేవాడు. అతని కడుపుకింత అన్నంపెట్టిన తల్లులు సీతాఫలపుపళ్ళు, మోదుగాకు. అవి అమ్మగా వచ్చిన డబ్బులు అతని రొట్టెకు జొన్నపిండి ఇచ్చాయి. రుచికి ఉప్పు కారాలిచ్చాయి, ఆ అడవిలోనే ఉన్న ఇన్ని చింతకాయలేరి తొక్కు చేసుకున్నాడు.

ఆనాడు సాయంత్రమింటికి చేరుకుంటూవుంటే దూరంగా తన ఇంటి దగ్గర ఏదో చిన్న మంట కనిపించింది. అమ్మయ్యో! యింకా తన బ్రతుకులో కష్టాల మెయిళ్లు చెదరిపోయి ఆకసము తేటపడలేదా అనుకున్నాడు. అనుకుంటూ ఒగర్చుకుంటూ ఒక్క పరుగులో ఇంటి దగ్గర వాలాడు. ఇంటి కెదురుగుండా మూడురాళ్ళు పొయ్యిగా పెట్టి ఒక స్త్రీ రొట్టె కాలుస్తోంది. అతడు తెల్లబోయి అలాగే నిలుచుండి ఎవరు నువ్వు అని అడిగినాడు.

ఎవర్నినేను? ఆమె బదులు చెప్పినది.

"ఇక్కడ యేమిచేస్తుంటివి?”

“రొట్టె కాలుస్తున్నా అయ్యా! నీ బాంచను. కాలుమొక్కుతా.”

“రొట్టెకుపిండి ఎక్కడిది. ఈ కుండమూకుడు ఎక్కడిది?”

“ఈ గుడిసెలోవుంటే పట్టుకొచ్చినాను తెలియక. పిండి ఆ చిల్లు కుండలోవుంటే తడిపి రొట్టె కాలుస్తున్నాను.”

“ఇదేమిటి? అసలు నువ్వెవరంటే?”

"నే నెవర్నని చెప్పను అయ్యా? నే నెవర్నో! నాకు యాదుండేది? నా మగణ్ణి చంపినారు. నన్ను చెరిచినారు. బాదినారు. నేను పెయి తెలియక పడిపోయి, కండ్లు తెరిచేతలికి మా వూరు మండిపోబట్టింది. నేను చావక మిగిలినా. నావూరు నాకు యాదిలేదు. ఏదో తెరచాటు. ఈ వూరు ఆవూరూ బిచ్చమడిగి, ఈ కాయతిని ఆనీరు త్రాగి ఈడకు వచ్చినా. నీ బాంచను. కాలు మొక్కుతా!” ​బోనగిరిరెడ్డి చెట్టుమోడులా అలా నిలుచుండిపోయినాడు. అతని కళ్ళవెంట దొన దొన బాష్పబిందువులు దిగి కారిపోయినాయి.

రజాకార్ల రాకాసిరాజ్యం పోయింది. ఇండియా యూనియన్ బందూకుపై నుండి హిందూ ముస్లిములు చేయి చేయి కలుపుకున్నారు.

ఓ తెలుగునాటి స్త్రీ! నీ హృదయంలో మాయరాని గాయాలు తగిలినవా? నీబ్రతుకు ఖండ ఖండాలుగా గొడ్డలివ్రేటుపాలై దుమ్ములో రాలి పోయిందా?

భోనగిరిరెడ్డి హృదయంలో ఆ స్త్రీ చిన్న బిడ్డలా దర్శనమిచ్చింది. ఏకాకిగా ఎవరూలేని ఎడారిలో ఎలుగెత్తి ఏడ్చే పసిపాపలా కనిపించింది. తన్ను చూచి నిల్చున్న ఆ స్త్రీని పైకి ఉబికి రాలేని వెక్కి వెక్కి ఏడ్పుతో అతడు తన హృదయానికి గాఢంగా అదుముకున్నాడు.

“ఓ ఆడదానా! తల్లీ తండ్రీ భర్తా బిడ్డా చుట్టమూ దైవమూలేని ఓతెలుగునాటి ఆడదానా! ఈ బండరాళ్ళమధ్య ఈ కొండపక్క ఈ ఎండిపోయిన వాగుదరిని ఈ గుడిసెలో అన్నీ మరచి ఒళ్ళు తెలియక నిదురపో. ఒక కొత్త పొద్దులో కళ్ళు తెరిచి కొత్తరంగులుచూచి ఆనందించు. కొత్త సుగంధాలు వాసనచూస్తూ మైమరచిపో” అన్నాడు.

5

భోనగిరిరెడ్డి పేరులేని ఆ తెలుగునాటి స్త్రీకి ఒరంగలు బజారులో దొరికిన ఒక ముతకచీర ఒక ముతకరైక కొనుక్కు వచ్చాడు. అంత యుద్ధంలోనూ అతనిచేతిని దండకడియాలు పోలేదు. అన్ని అమ్మి బండరాళ్ళ మధ్య నిలుచున్న ఒంటివాడైన తన గుడిసె ప్రాంగణానికి దిక్కు తెలియక తన్ను మరచి నడిచివచ్చిన ఆ తెలుగునాటి స్త్రీకి కొనుక్కు వచ్చినాడు.

ఆ చీర అప్పుడే వికసిస్తున్న మోదుగుపువ్వుల ఎరుపు చీర.

ఆ రైక ఆనాటి నిర్మలాకాశపు నీలి రైక. దాని అంచులు చివుళ్ళు తొడిగి యవ్వనం తాల్చే ఇప్పచెట్టు పచ్చని ఆకురంగు.

ఆ బండరాళ్ళలో నవ్యాశామూర్తియైన భోనగిరిరెడ్డి, నవ్యశక్తి స్వరూపియైన ఆ తెలుగునాటి స్త్రీ ఈ సంక్రాంతి ఉదయంలో ఒక నూత్న యుగ ప్రవేశం గమనిస్తూ నిలుచున్నారు.

రెండు వందల సంవత్సరాలనాటి కాలము వెనక వేసుకొని నూత్న సౌందర్యము అలంకరించుకొన్న ఓ తెలుగునాటి స్త్రీ ఎండిపోయిన నీ దేహ సౌష్టవ సౌందర్యము నూతనార్ద్రత సముపార్జించుకొని నీ కాలి ముందు సెలయేరు కొత్తనీటి ప్రవాహాల నిండి నీ తెలుగునాడు ఇటు తూర్పు తీరము అటు మంజీర తీరాలుదాటి నీ తెలుగురెడ్డి బ్రతుకును పాలసముద్రము చేస్తుందా?

కొండవాగు పక్కన బండరాళ్ళు, పూరి గుడిసె పక్కన యెడదపొంగి అంచులు చాపుకుంటూ కిలకిలమనే భోనగిరిరెడ్డి సాగుచేసిన పొలం.

కొండపక్క అడవిలో వాగుపక్క బండరాతిమీద తెలుగునాటి ఆడుబిడ్డా, కొండపక్కన అడవిలో వాగుపక్క బండరాళ్ళు. ​

సంగమేశ్వరం

ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కాదా! ఇక భారతీయ నాయకులు ఈ రాష్ట్ర సమస్యను నూరుగజాల లోతు గోతిలోపెట్టి సిమెంటు కాంక్రీటు వేసి పూడ్చివేస్తారా? అని, పత్రిక చదువుకుంటూనే కృష్ణవేణి ఉద్రిక్త హృదయంతో కుర్చీనుండి ఆడపులిలా లేచింది.

కృష్ణవేణి ఇరవైమూడేండ్ల జవ్వనం పరిపూర్ణత తాల్చిన ఆంధ్రబాలిక. ఆమె మోము సౌందర్య యుతమూకాదు; ఛాయ బంగారుఛాయా కాదు; మాలతీ తీగలా కౌనుకలిగిన యువతీకాదు. ఆమె ముక్కు కొంచెం పొట్టిది. ఆమె కళ్లుకొంచెం చిన్నవి. ఆమె నుదురు చెప్పుకోతగిన స్నిగ్ధత్వం కలదికాదు, ఆమె మోము కోలనైనదీకాదు, గుండ్రనైనదీకాదు. కాని ఒక అవయవరేఖకూ ఇంకొక అవయవరేఖకూ ఏదోశ్రుతి వైచిత్యం సమకూడడంచేత గాఢంగా అందరి హృదయాలూ ఆకర్షిస్తుంది. ఆమెచూపులు వెన్నెల వెలుగులు, ఉదయారుణ కిరణాలు రంగరించి పోతపోసిన విలక్షణ సౌందర్య యుక్తాలై నా గుండె గుబగుబలాడిస్తూ ఉంటవి.

కృష్ణవేణి టెన్నీసు ఆటలో ఆరితేరిన దిట్ట. కాబట్టే ఆమెకూ నాకూ అనంతపురం కాలేజీలో పరిచయం లభ్యమైంది. ఆమె చెన్నపట్టణం ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతూ ఉండేది. నేను ఆ దినాలలో అనంతపురం కాలేజీలో బియ్యే చదువుతుండేవాడిని. ఆడ మగజట్టు పోటీ ఆటలలో చివరి పందెంలో మేమిద్దరం ఎదిరి బొదిరిగా నిలుచున్న వాళ్ళము ఆ బాలిక, ఇంకో ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థి ఒకవైపు - నేను, నా సహాధ్యాయురాలు ఒక వైపు ఆడాము. మాకన్న ఆ జట్టే దిట్టమైనది అనుకోండి. అయినా ఆ సాయంత్రం అల్లా ఎదిరిజట్టును ముప్పుతిప్పలు పెడితేనేగాని విజయం వారికి మేము చేకూర్పనీయలేదు. అందుకనే నాకూ కృష్ణవేణికీ ఎంతో గాఢమైన స్నేహం ఆరంభమైంది.

నేను రాయలసీమవాణ్ణి. నాకు ఆంధ్రదేశంలో రాయలసీమ లీనమై పోవటం ఏమాత్రం ఇష్టంలేదు. కృష్ణవేణి అసలైన సిసలైన ఆంధ్రబాలిక. ఆంధ్రమాతకు జై అంటుంది. భారతదేశంలోని రాష్ట్రాలన్నిటిలో ఆంధ్రదేశము మహోన్నతమంటుంది. భరతదేశానికి అఖిల ప్రపంచానికి ఆంధ్రదేశమే సంస్కృతిలో గురుపీఠం వహించిన దంటుంది. ఆంధ్రత్వం వెల్లివిరిసే ఏ సభకైనా కృష్ణవేణి స్వచ్ఛంద సేవకురాలుగాను, సభ్యురాలుగాను చేరుతుంది.

నాకు ఆంధ్రత్వమంటేనే మంట, నా నమ్మకంలో శాతవాహనులు మహారాష్ట్రులనీ, ఇక్ష్వాకులు ఉత్తరాదివారనీ, పల్లవులు అరవలనీ, చాళుక్యులు కన్నడులనీ, విజయనగరం ​వారూ కన్నడులేననీ నమ్మకం. ఈ నమ్మకానికి చరిత్ర ఆధారం అయితే అవుతుంది - కాకపోతే కాకపోతుంది. కోస్తా జిల్లాలవారి మీదుండే కోపమే యీనమ్మకానికి గల కారణం. కోస్తా జిల్లాల వారికి ఎంతగర్వమండీ? రాయలసీమ వాళ్ళంటే వాళ్ళకు గౌరవంలేదనీ, మమ్మల్ని చిన్న చూపుచూస్తారనీ నాకు ఏదో అనుమానం. ఈ అనుమానం సత్యాధారమైతే నేమి, అసత్యాధారమైతేనేమి నాకు అవసరం లేదు. నా అనంతపురం కాలేజీలో చేరటానికి కోస్తాజిల్లా విద్యార్థులు కొందరు వచ్చేవారు. కొందరు ఆచార్యులూ వచ్చేవారు. వాళ్ళని ఏడిపించటం అంటే మహాసరదాపడేవాణ్ణి. కాని అది చేతకాకపోయేది. అందుచేత మరీకోపం వచ్చేది. నాపేరు నరసింహారావు. మా యింటిపేరు కదిరివారు. ఇంతకూ నేను రాయలసీమవాసుణ్ణి.

2

ఇక్కడే మా కథ ప్రారంభమైంది. ఆమె కృష్ణాతీరంలో కృష్ణా జిల్లాలో పుట్టింది. అందుకనే వాళ్ళ వాళ్ళు 'కృష్ణవేణి' అని పేరుపెట్టారుట. కృష్ణవేణి అనంతపురం వచ్చి టెన్నీసు ఆట ఆడినప్పటినుంచీ నేను ఆమెకు బానిసనయ్యాను. ఆమె మాటలలో మెరపువేగం, నేను వట్టి మందప్రవాహాన్ని కాబట్టి యీ ఆంధ్రదేశాన్ని గురించి ఎప్పుడు వాదనవచ్చినా నేను చేతులు జోడించవలసి వచ్చేది. అందువలన ఆంధ్రవాదనంటే మరీ మంటగా ఉండేది నాకు.

అనంతపురం కాలేజీలో ప్రారంభమైన మా స్నేహం అనేక విధాలుగా వృద్ధిపొందింది. ఆమె నన్ను హృదయపూర్వకంగా మద్రాసుకు ఆహ్వానించింది. ఆమె పిలవటం తరవాయిగా నేను రెక్కలుకట్టుకొని అక్కడికి వాలేవాణ్ణి. ఆ బాలిక సెలవులలో మా ధర్మవరం వచ్చి నన్ను కలుసుకునేది. నేను ఆమె కలిసి పెనుకొండ, హిందుపురం, లేపాక్షి ఒకసారీ, హంపి ఇంకోసారీ, తాడిపత్రి, గుత్తీమరి ఒకసారీ - విజయనగర శిల్పోత్కృష్ట భాగ్యాన్ని సందర్శించటానికి వెళ్ళేవాళ్ళము.

నేను అనంతపురంలో బియ్యే పూర్తిచేసుకొని గిండీ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగు క్లాసులో చేరాను. ఆమె తన కళాశాలలోనే బి.యస్సి. ఆనర్సు క్లాసులో చేరింది. ఇంక మా స్నేహం శరత్కాల చంద్రికలా, వసంతసౌరభంలా వికసించిందంటే వికసించదా?

ఆమె బి.యస్.సి. ఆనర్సూ పూర్తిచేసింది. నేను ఇంజనీరింగూ పూర్తిచేశాను. ఆ సెలవుల్లో కృష్ణాతీరంలో వున్న వాళ్ళ వూళ్లోనే కలుసుకున్నాము. నేను వచ్చి వారంరోజులైంది. ఆ సాయంత్రం వాళ్ళ ఇంటి తోటలో కుర్చీలలో కూర్చొని ఉన్నాము. అప్పుడే పోస్టునుంచి పేపరు వచ్చింది. పేపరు నేలవేసికొట్టి; ఆడుపులిలా అయిపోయి ‘ఆంధ్రులు యీ విషయంలో చప్పగా ఊరుకోరు' అని కుర్చీమీదనుంచి లేచి నుంచుంది.

నేను: ఏం వార్త వచ్చిందేమిటి. అంతకోపం వచ్చింది నీకు? కూచో; చూస్తావేం! ఆ వార్త ఏమిటో నాకు చదివి వినిపించు. కాస్త కోపం తగ్గించు. ​కృష్ణవేణి: నీకేం? నీవు రాయలసీమ మనిషివి. మీనాయకులంతా కలిసి మాకు ఆంధ్రరాష్ట్రం అక్కరలేదని 'ధారుకమిటీ'ట - థారుకమిటీ చారుకవిటీ సాంబారుకమిటీ - దాని ముందర సాక్ష్యం ఇచ్చారుగా? ఆ చారుకమిటీ బోరుమని ఏడ్చిందిలే - ఆ రిపోర్టు వచ్చింది. ఆంధ్ర దేశానికి రాష్ట్రం అక్కరలేదట. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రం కోరటం చాలా తప్పట. ఇహ హాయిమనినీ గుండెమీద చేయివేసుకుని నిద్రపోవచ్చునులే!

నేను: ఏమిటమ్మా. నీకు అంతకోపం? దేశ సమస్యలలో మనస్సు చొప్పించటం మాని రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రం అని కూచుంటే భరతదేశం అథోగతిపాలుగాక ఏమవుతుంది?

కృష్ణ: హాహా! మా అమ్మమ్మ ఓ సామెత చెపుతూ ఉండేదిలే "చంటివాడు బెల్లంముక్క కావాలి” అని ఏడిస్తే “ఇంటి యజమాని పంటికి దెబ్బతగిలిందట” అని, అలాఉంది నీవాదన. రాష్ట్రానికీ భరతదేశ సమస్యలకీ సంబంధం ఏముంది?

నేను: ఏమీలేదు, అవతల కాశ్మీరు సమస్య అలా ఉంది; ఇవతల హైదరాబాదు సమస్య సంపూర్ణంగా పరిష్కారం కాలేదు; రాష్ట్రం కావాలట!

కృష్ణ: తగ్గవయ్యా! తగ్గు! కాశ్మీరు సమస్య అలాగే ఉంది. పటేలు గారు సౌరాష్ట్ర యూనియను, వింధ్యప్రదేశ రాజ్యం, హిమాచలప్రాంత్ రాష్ట్రం - ఇవన్నీ నిర్మాణం చేస్తూనే ఉన్నాడు. రాజ్యప్రముఖులు, ఉపరాజ్య ప్రముఖులు ఏర్పాటు అవుతూనే ఉన్నారు. బరోడాలో గిరోడాలో నూత్న మంత్రివర్గాలు నిర్మాణమవుతూనే ఉన్నాయి. హైదరాబాదు సమస్య అట్లాగే ఉందిట? ఆహాహా!

నేను: అవన్నీ భారతదేశ నిర్మాణానికి ముఖ్య సమస్యలు.

కృష్ణ: అంతకన్నా ముఖ్యసమస్య ఆంధ్రరాష్ట్ర నిర్మాణం

నేను: ఎట్లాగ?

కృష్ణ: ఈషణ్మాత్రం జ్ఞానంవుంటే! జ్ఞానం ఉండేలా - కాంగ్రెసు పెద్ద బిడ్డలా ఆంధ్రరాష్ట్ర సమస్య ఉద్భవించింది - మహాత్మాగాంధీ ఆశీర్వదించినది. కాంగ్రెసు విధానంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు నిర్మాణం అయిపోయాయి. అసలు రాజ్యాంగంలో ఆంధ్రులు అరవ వారికి దాసులుగా ఉండాలి.

నేను: ఆంధ్రులు రాయలసీమకి ఏమిచేశారు?

కృష్ణ; అరవలు రాయలసీమ నెత్తిమీద ఏమైనా ఇంత ఒలకపోశారా? రాయలసీమ వారంతా పెళ్ళికొడుకులూ, మాజిల్లాల వారంతా పెళ్ళికూతుళ్ళూనా?

ఆవేశంలో ఆమె అన్న మాటలు వినేటప్పటికి నా గుండె గుభేలుమంది. ఏదో మధురమైన భవిష్యత్తు నన్ను మత్తులా ముంచెత్తింది. బంగారు ఛాయగల నా మోములో కెంపురంగులు వచ్చినట్లు వేడిమి క్రమ్ముకున్న నా మోమునుబట్టి అనుకున్నాను. నేను కొంచెం ఖంగారు పడడం చూచింది - "ఏమిటీ ఆడపిల్ల మొఖంలా నీమొఖాన్ని గులాబీలు క్రమ్ముకుంటున్నాయి” అన్నది కృష్ణవేణి.

“ఏ... ఏ... ఏమీ లేదులే” అన్నా.

“ఏమిటా ఖంగారు? నామాటలు వినేటప్పటికి కోపం వచ్చిందా తమకు?” ​నాకు ఏదో ఒక విధమైన సిగ్గు వచ్చింది. ఆనందం వచ్చింది పెళ్ళికొడుకులు! పెళ్ళికూతుళ్ళు!

"ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు - నరసింహారావు! ఔను, ఆలోచించక ఏమిచేస్తావు! 28 జిల్లాల మహోత్తమ రాష్ట్రం. నాలుగుకోట్ల ఇరవై లక్షల జనాభా. టి.వి.ఎ. లాంటి అనేకానకట్టలు నిర్మించగల దేశం. సమస్త లోహములు తమగర్భంలో ఇముడ్చుకున్న కన్నతల్లి మన ఆంధ్రదేశం. ఉత్కృష్టశిల్పం, ఉత్తమ చిత్రలేఖనం, మహత్తరమైన సాహిత్యం, దివ్యమైన నాట్యసాంప్రదాయం ఆంధ్రమాత భరతమాతకు సమర్పించుకున్నది. ఇలాంటి ఆంధ్రదేశంలో పుట్టానని గర్వపడక రాయలసీమ రాయలసీమ అని ఎక్కడో దాక్కుంటా నంటావు? ఎక్కడిది యీ రాయలసీమ? ఆంధ్రదేశమంతా రాయలసీమే. ఈ దేశం అంతా విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగంకాదూ ఒకనాడు?" ఆమె మాటలు గంగా ప్రవాహంలా వచ్చాయి.

నేను: పెద్ద ఉపన్యాసం ఇచ్చావు. హైదరాబాదు మూడుభాగాలు చేసి, ఆంధ్ర జిల్లాలు ఆంధ్రదేశంలో కలవవలసి ఉన్నది కదా! ఆ విషయం ఏదీ నిర్ధారణ కాకుండా ఆంధ్రరాష్ట్రం ఏ మొగంపెట్టుకొని కోరుతారు మీ ఆంధ్రులు అని కొంచెం తీవ్రంగానే అన్నాను.

అంతకన్న తీవ్రంగా కృష్ణవేణి "లాయరుకున్న తెలివి తేటలుగా మాట్లాడావే? నిర్మాణమైన రాష్ట్రంలో నిర్మాణం కాని భాగాలు తర్వాత కలపకూడదేం? ఒరిస్సా రాష్ట్రం ఎప్పుడో నిర్మాణమైంది? ఇప్పుడు ఎన్ని సంస్థానాలు ఆ రాష్ట్రంలో కలవటంలేదు?" అని నాపైని తీక్షణదృష్టులు బరపింది.

3

ఇన్ని సంవత్సరాలు మేము ఇద్దరమూ ఎన్ని విషయాలలోనో ఏకీభవించక వాదించుకున్నాము. ఒక్కొక్క తడవ తీవ్రంగానూ కలతలుపడ్డాము. అయినా కృష్ణవేణి ఎప్పుడూ కలత పొందని హృదయంతో మాస్నేహ ప్రవాహానికి ఏ అడ్డుకట్టూ రానీయలేదు. కాని ఆరోజు సంభాషణలో నామీద ఏమి కినుక వహించిందో నాతో మాట్లాడటం మానివేసింది. నాకు చురుకుపాలు ఎక్కువే!నేను రాయలసీమవాణ్ణి. కొంచెం సున్నితమైన హృదయం. నన్ను తక్కువచూపు చూస్తున్నారనే అనుమానం తగిలితే కించపడిపోతాను. సాధారణమైన కోస్తాజిల్లాల వాళ్ళతోబాటే కృష్ణవేణి నాల్గుమాటలు ఝాడించింది. నాకు అయితే కోపం రావలసిందేకాని, తనకు కోపం రా పనేమిటి? అయినా నాలో దాగివున్న ఏదో ఒక పరీమళార్ధ్రమైన ఆశచేత నాకు నేను సమాధానం చెప్పుకొని ఆమెను వెంటనంటి తిరుగుతూనే ఉన్నాను కాని ఆమె నిర్లక్ష్యం ఏమాత్రం తగ్గలేదు. నేను కల్పించుకొని వేసే ప్రశ్నలకు ఆమె కటువుగా జవాబు చెప్పుతుంది. ఇద్దరం కలిసివెళ్ళే మాసాయంత్రపు వాహ్యాళికి ఆమెరావటం మానివేసింది.

ఎంతో సౌహార్ద్రతతో ప్రతినిమిషం నా సదుపాయాలు కనుక్కునే ఆ బాలిక నేడు వారింటి పనివాళ్ళను పంపించి నా విషయం కనుక్కోవటం సాగించింది. నా ఆశ ​క్రుంగిపోయింది. నా హృదయం ఆవేదనతో నిండింది. నాకు కోపం రాసాగింది. నేను రెండు రోజులు చూచాను. మూడురోజులు చూచాను. నాలుగోరోజున నాపెట్టే బేడా సర్దుకొని తెల్లవారగట్ల ఇంట్లో ఎవరితో చెప్పకుండా ఒక కూలివాడినెత్తిమీద నా పరుపూపెట్టా పెట్టి, తోలుసంచి అవీ చేత పుచ్చుకొని బస్సులు వచ్చే దగ్గర వూరు వెళ్ళి, బెజవాడ చేరుకొని రైలు ఎక్కి ధర్మవరం చక్కా వచ్చాను.

నాకు స్త్రీ జాతిమీద ఆ రోజులలో కలిగిన కోపం స్వామీ శివశంకరులైనా వర్ణించలేరు. వెఱ్ఱివాడనై యిన్నేళ్ళూ కుక్కలా ఆమె అడుగుజాడల నడిచాను. అంటే ఆమె దగ్గరకెళ్ళి వాలాను. అంత స్నేహమూ మరచిపోయి ఎత్త మడమల బూటుకాలితో నన్ను గెంటివేసింది.

4

నాకు వచ్చిన సంబంధములు నేను ఎందుకు త్రోసివేసుకున్నాను? తల్లిదండ్రులను లెక్కచేయలేదు. కొందరి బంధువులకు విరోధి నయ్యాను. ఏదో అంతరాంతరముల అవ్యక్తమైన మధురానుభూతిని వాంఛించి ఆమె మాటల తీయదనాలు పుడిసిళ్ళ తృప్తి ఎరుగని దాహంతో గ్రోలిగ్రోలి యీనాటికి యీ స్నేహం అంతరించిపోతే సిగ్గుమాలి ఇట్లా తిరుగుతున్నాను.

ఆడదాని హృదయం గ్రహించటం కష్టం! అందులో జవ్వని! అన్నింటికీ పైన ఆంధ్రబాలిక!

నా చిన్నతనంనుంచీ మా రాయలసీమ నాయకుల బోధవల్ల ఆంధ్రదేశం అంతా ఒక్క పరిపూర్ణదేశంక్రింద భావించుకోలేదు. ఆంధ్రులంటే కోస్తా జిల్లాలవారనీ, తెలుగువారంటే నైజాం రాష్ట్రంవారనీ, రాయలసీమ వారు రాయలసీమవారే అని సిద్ధాంతీకరించుకొన్నా. కోస్తా జిల్లాలవారు మమ్మల్ని పూసుకు తిరుగుతూవుంటే, వాళ్ళు ఆంధ్రరాష్ట్రం కోసంవేసే మాయయెత్తు అనే కొందరు పెద్దలవాదన నా అణువుఅణువునా హత్తుకు పోయింది. ఇందుకు వ్యతిరేకంగా పప్పూరి రామాచార్యులవారు వాదనగాని, గుత్తి రామకృష్ణ, విద్వాన్ విశ్వం, ప్రభాకరుల స్నేహం కాని నన్ను మార్చలేకపోయాయి. కల్లూరి సుబ్బారావుగారు గోడమీద పిల్లివాటం. అసలు ఆయన కన్నడిగ. రాయలసీమవాసి. తెచ్చిపెట్టుకున్న తెలుగుతనం ఆయనది. రాయలసీమ అంతా కన్నడరాష్ట్రంలో కలపాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నదేమోనని నా అనుమానం. సూర్యనారాయణరావు, మృత్యుంజయశాస్త్రులు హృదయంలో అరవలు. వారి నిలువెల్లా 'ద్వేషం' తప్ప నాకు ఇంకొకటి కనపడలేదు. అయినా కుర్రవాణ్ణి. కుర్రతనంలో ఏవో భావాలు హృదయాన్ని హత్తుకు పోయాయి. అవి పోవాలంటే గుడ్డనుపట్టుకొన్న మచ్చలు పెట్రోల్‌తో కడిగితే పోయినట్లుగ పోవాలి. ఆ పెట్రోలే మాకృష్ణవేణి మాటలు కావుకదా!

కృష్ణవేణిలోని అందం అంతా దేహగతం కాకపోవచ్చు. ఆమె వ్యక్తిత్వమే పరమ సౌందర్యమూర్తి మంతమైనది. ఆమెలోని కాంతి తారకారజను. మెఱుము తళుకు బెళుకు వెన్నజిడ్డు, వెన్నెల వెలుగు. ఆమె అమృత గుళిక, మా ఇద్దరి యెడబాటు కలిగిననాటినుండి ​రోజులు రోజులు నెలలు నెలలు తరలిపోతూ వుంటే, నాకామె మరీ దగ్గర అయి నేనామెను ప్రేమిస్తున్నాననుభావం దృఢమైపోయింది. ఇంతేనా? నన్నామెచేసిన అవమానం నేను మరచిపోగలనా?

5

శీతాకాలం వచ్చింది. చామంతుల సౌరభాలు నా దగ్గరగానన్నా రాలేదు. పెన్నానది ప్రవాహ రేఖలు నన్ను చుట్టుముట్టనన్నా చుట్టముట్టలేదు. పెనుకొండ కొండ రహస్యాలు నాచెవిలో గుసగుస లాడలేదు. లేపాక్షి బసవయ్య గంగడోలు నా చేతికందలేదు. కృష్ణవేణి కృష్ణాతీరంలో కృష్ణా జిల్లాలో వుండిపోయింది కాబోలు అనుకొన్నాను.

ఆసాయంత్రం రైలుదిగి మా యింటికీ కృష్ణవేణి, కృష్ణవేణి తండ్రి చక్కా వచ్చారు, ఒక్క నిమిషం నా హృదయస్పందనం ఆగిపోయింది....! ఆ బాలికను చూడటంతోటే. నాకు కోపం మరీఎక్కువయింది. నెహ్రూగారు, పటేలుగారు అన్న మాటలు, మున్షీగారి 'లింగూ' ఇజమూ అన్నీ జ్ఞాపకం వచ్చాయి. రాయలసీమను, కలుపుకునేందుకు ఆంధ్రరాష్ట్రం దండెత్తి వచ్చినట్లయింది. ఆమెరాకవల్ల కొంచెం అభిజాత్యం, మరికొంచెం ఉడుకుబోతుతనం, ఇంకా కొంచెం అవమానతత్వం, అసలు 'ఇన్‌పీరియారిటీ కాంప్లెక్సు’ మిశ్రమమై ఒక 'కోధ కొళంబు' నాలో తయారయింది. ఈ కొళంబే ఆమెచేత తినిపించ దలచు కొన్నాను.

మా అమ్మగారు, మా నాన్నగారు, మాచెల్లెలు వారినెంతో ఆదరించారు. మనం మాత్రం ఈషణ్మాత్రమూ లొంగలేదు. కృష్ణవేణి తండ్రితో ముభావంగా మూడో నాలుగో కబుర్లు చెప్పాను. కృష్ణవేణితో స్పష్టమైన మౌనం వహించా (ఈనాడు మా కథ రాస్తున్నాను గనుక ఈ మాటు ఆర్ద్రత అయినా దొర్లుతున్నదిగాని - ఆనాడు అసలే ఆర్ద్రతలేదు.)

నా మౌనం అర్థరాత్రి ఆకాశంలోకి చొచ్చుకొనిపోయే గుడి శిఖరం. నా మౌనం మిట్టమధ్యాహ్నం నడియెండ కనులు ముడుచుకొన్న లేపాక్షి బసవయ్య మౌనం. నేను ఎందుకు ఉపమానాలు చెబుతున్నానో నాకే అర్థం కాదు. ఆ ఉపమానాల ధ్వని నాకు గోచరించలేదు. 'కామకూరా'లోని 'డైబుట్సు'లా అంతర్దృష్టివంతుణ్ణయ్యాను. 'శ్రావణ బెలుగోలా' 'గోమటేశ్వరుడు'లా ఉత్తుంగోర్ధ్వదృష్టివంతుణ్ణయ్యాను.

కృష్ణవేణి మూడురోజులు నన్ను మాట్లాడించడానికి విఫల ప్రయత్న అయినది. తన్ను క్షమించమన్నది. శ్రీబాగ్ ప్యాక్టు తలుచుకోమన్నది. మనకు ఆంధ్రరాష్ట్రం గొడవలు అక్కరలేదన్నది. స్నేహమే ప్రధానమన్నది. నేను చలించలేదు. ఇంతైనా ధ్వనించలేదు.

ఒకనాడు కృష్ణవేణి ధర్మవరం ఊరుచివర వాగు ప్రక్క నేను ఒక్కణ్ణి కూర్చునివుంటే- అక్కడ వున్నట్లు ఎట్లా గ్రహించిందో - నిర్భయంగా నా దగ్గరకు వచ్చి కూర్చుంది.

“నరసింహం! నీ హృదయంలో అంతకోపం నిండివుందని నే నెప్పుడూ అనుకోలేదు. ఆంధ్రరాష్ట్రం అంటే నాకున్న ప్రేమ అలాంటిది. అంతేనేగాని నీమీదనాకేమి వున్నది? నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయిన తరువాత నేను పడిన బాధ నా కన్నతల్లి కృష్ణవేణి నన్ను ఓదార్చినా తీరలేదు.” ​“అయితే....!”

“నా హృదయంలోవున్న కొద్ది సిగ్గును తొలగించుకొని, నిన్ను అర్థించడానికి వచ్చాను.”

నేను మాట్లాడలేదు. కాని, ఏదో ఒక్క వెలుగు మెరుపు మెరసినట్లయింది.

“ఒక టెన్నిస్ పందెంతో ప్రారంభమైన మన స్నేహం ఒక రాష్ట్ర వాదనతో ఆఖరు కావలసిందేనా? నీ హృదయం ఏ రీతిగానూ కరగదా? క్షంతవ్యురాలనని ఎంత వేడుకొన్నా నీ పెదవుల్లో మందహాసరేఖలు ఇంతైనా చిగురించవా?”

“కృష్ణవేణీ! నువ్వు చేసిన దోష మేమున్నది? మేము రాయలసీమవాళ్ళం. సర్కార్ జిల్లావాళ్ళ స్నేహానికి ఎల్లా పాత్రులమవుతాం - ?”

“రాష్ట్రం నేను కావాలీ అంటే వచ్చేదీలేదు. నువ్వు అక్కరలేదంటే రాకనూపోదు. పట్టాభిగారు నేడోరేపో రాష్ట్రపతి కానున్నారు. అయినా ఆయనకు రాష్ట్రం అంటే ఏ మాత్రమూ పట్టింపూలేదు. ప్రకాశంగారు నేడు రాహువు క్రమ్మిన చంద్రునిలా వున్నారు. రంగాగారి మాటలు వృధాడంబర ఫెళఫెళార్భాటాలు...! అందుచేత రాష్ట్రం రాదనీ నాకు గట్టినమ్మకం కలిగింది. ఆంధ్రులు వొట్టి దద్దమ్మలు! తాటాకుమంటగాళ్ళు! పౌరుషహీనులు! కడుపు కక్కుర్తిగాళ్ళు! లంచాల దాసులు...! నాకు రాష్ట్రం అవసరంలేదు. మద్రాసు రాజధానిలో వుంటే ఏ అరవ హెడ్మాస్టరో, నాయరు కలెక్టరో, మంగుళూరు డాక్టరో, ఉడిపి కాఫీ హోటలో - వీరివల్ల కోస్తా జిల్లాల వాళ్ళం అంతా ఆంధ్రులమని ఉద్ధరింపబడగలం. అవన్నీ ఇప్పుడు మన కనవసరం. నాకు కావలసింది స్నేహం.”

"సరే...! కాస్త స్నేహంతీసికో...! నేను నీకు స్నేహితుణ్ణి కానని నీకు తోచడం ఎందువల్ల కలిగింది...? తెల్లవారుకట్ల మిమ్మల్ని లేపడం ఇష్టం లేక మొదటిబస్సు అందుకుందామని లేచి వెళ్ళిపోయాను. రాయలసీమవాళ్ళం ఎప్పుడూ బస్సులు మిస్సవుతూనే ఉంటాం. కాని నాకు ఆ బస్సు మాత్రం దొరికింది....!”

"అర్జున విషాదయోగం మాని, రాజకీయాలు అవతలకు త్రోసి, ఇన్నాళ్ళ స్నేహం యొక్క మధురానుభూతితో నేను అంజలిపట్టి నిన్ను అర్థించడానికి వచ్చాను. నీ కంఠాన కంఠహారంగా దాల్చుతావో, కాలిక్రింద రాచిపారవేస్తావో....!”

నేను మాట్లాడకుండా లేచాను. నేను అడుగులు సాగించాను. నా ప్రక్కనే కృష్ణవేణి నడిచివస్తూ వుంది.

నా రాయలసీమ ఆంధ్రలో అంతర్ధానం కాదా? కృష్ణవేణి హృదయంలో నేనులేనా! కృష్ణవేణి తుంగభద్రలు తెలుగునాటికీ రాయలనాటికీ అడ్డుప్రవాహాలా! ఈ రెండుసీమలను అనకట్టలవల్ల వరదలై పొంగి ప్రవహించి ఎండిపోయిన మామా బ్రతుకులను శేరీభూములను చేసి బంగారు పంటలను పండిచవా?

ఒక స్త్రీని ఇంతకలతపెట్టి ఒక పురుషుని కడకు అర్థించడానికి వచ్చే లాగు చేశాను. మూర్ఖుణ్ణి! తనంతట తాను పాల్కడలై ప్రవహించి వచ్చిన ఒక బాలికను నిరసించడానికి ఎవరికి ధైర్యం ఉండగలదు? ​నేను చటుక్కున ఆగి ఆమెవైపు తిరిగాను. ఆమె కనులనుండి నీరు ప్రవాహాలై ఆమె నాప్రక్కనే నడిచి వస్తూంటే భూమిమీద ఏటవాలుగా పడుతున్నది. ఆమెకూడా ఏదో వెడనవ్వుతో నావైపుచూచింది. చేరుమాలుతో కన్నులు తొందరగా తుడుచుకున్నది.

"కృష్ణవేణీ!” అని నా కంఠంలో నుండి రుద్ధమైన వాక్కు విని వచ్చింది. నాకేసిచూస్తూ, దీనమైన నవ్వునవ్వుతూ తలపంకించింది కృష్ణవేణి. ఆమెచేతులు నాచేతుల్లోకి తీసుకొన్నాను. ఆమె మోము నాచేతుల్లో దాచుకుంది.

కృష్ణవేణీ! ఆంధ్రదేశపు భావిచరిత్ర ఒక మహా సంగమేశ్వరం...! మన జీవితాలు కృష్ణ తుంగభద్రాది సంగమేశ్వరాలు చేయగలవా!”

“అందుకనే మహాబలేశ్వరం నుండి ప్రవహించి మీ దగ్గరకు వచ్చాను. నా ఆత్మప్రభువు...." అని అన్నది.

"ఈ భరత దివ్యక్షేత్రంలో - ఈ ఆంధ్ర మహాక్షేత్రంలో - ఎన్ని సంగమేశ్వరాలు ఉన్నవో...!



​

రాధారి బండ్లు

నా చిన్నతనంలో మా అన్నయ్య వివాహానికి మా ఊరునుంచి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామానికి తర్లి వెడుతున్నాం. ఏభై రెండెడ్ల బళ్ళు మా ప్రయాణానికి సిద్ధమయ్యాయి. రాత్రి పెందరాళే భోజనాలు చేసి బళ్ళెక్కాము.

బళ్ళ ఎద్దులు ఒంగోలు జతలు. కైలాస పర్వత శిఖరాలులా, నందీ భృంగులులా ప్రతీ బండికీ ఇటూ అటూ ఉన్నాయి. కొమ్ములకు నల్లతాళ్ళు నుదురున అలంకారపు పట్టీలు, మెడలలో గంటలు, చిన్న మువ్వలూ కలపట్టీలు. ఎత్తయిన బళ్ళు వెదురు చాపలు, గొంగళీలుకట్టి గూడులు, కూర్చునేందుకు మొదట వట్టిగడ్డీ, ఆపైన చాపా, పైన పరుపులో, తివాసీలో!

బళ్ళు సాగాయి. దాపటెద్దులకు పెద్ద గంటలు, వెలపల ఎద్దులకు చిన్న గంటలూ, మందర పంచమ స్వరాలు, శ్రుతి కలసి రాగాలాపనలు చేస్తున్నాయి. మువ్వలు తాళాలు చేస్తున్నాయి.

ఈవలా ఆవలా వరిచేలు. గట్లపైన కంది మొక్కల బారులు! - ఆ వెన్నెల నిండిన రాత్రివేళ ఈ బళ్ళబారు ప్రయాణం. చేలు ఇంకా మేలుకునే ఉన్నాయి. కీచురాయిలు ఏవో గీతాలు ఆలపిస్తున్నాయి. అప్పుడే కోతలు సాగుతున్నాయి. చిన్న వరులు కోతలై కుప్పలువేసి నూరుస్తున్నారు.

నూరుస్తూ ఆ కర్షకులు గొంతులెత్తి ఏదో తియ్యని పల్లెటూరు పదాలు మందర స్థాయిలో పాడుకుంటున్నారు, రోడ్డు పక్కవున్న మురుగు కాలవల్లో కలవ పువ్వులు చంద్రకిరణాలు తమపై ప్రసరిస్తూ యుండగా భక్తితో 'ముకుళించుకొని' నిలచియున్నవి. మా రాధారిబళ్ళు సాగుతున్నాయి.

ఇంతట్లో బళ్ళకు బళ్ళకు పందాలు వచ్చాయి. అచ్చట రాచబాట కొంచెం వెడల్పుగా వున్నది. వెనకబడి వాడొకడు తన బండిని ముందరబళ్ళని తప్పించి ముందుబోయి తన బండిని మొనగాడి బండిని చేయాలని ఆశించాడు. తక్కిన బండ్లు ఊరుకుంటాయా? అన్ని బళ్ళను ఉరక లెత్తడం సాగించారు బండివాళ్ళు, "హై! హై! పప్పప్పా డిడిడి...” నీ గంటలు వూడిపోను ముందుకునడే” అనే కేకలతో బండివాళ్ళు ఎద్దులను అదిలించి, కొరడాలు ఫెళ్ళుమనిపిస్తూ, తోకలు మెలిపెడుతూ, బళ్ళను దౌడుచేయిస్తున్నారు. అంతవరకు బండి కుదుపుకు ఉయ్యాల వూపు. బండిగంటలు మ్రోత లాలిపాటలు కాగా మొగవారు, ఆడవారు, చిన్నబిడ్డలు హాయిగా నిద్దుర కూరిమై మరచి వున్నారు. ఈ ​గడబిడకు ఎవరిబళ్ళలోవారు చటుక్కున లేచారు. బళ్ళవాళ్ళకే కాకుండా బండిలో వాళ్ళకుకూడ ఉషారెత్తింది. “మన బండి ముందరపోనివ్వోయి”, “మన బండి ముందరపోనివ్వోయి.అని పంతాలు సాగించారు. ఈలాసాగింది మా ప్రయాణం. తెల్లవారేసరికి ఓ వూరు దగ్గిరకు చేరుకున్నాం.

ఆ ఊరు చెరువుగట్టుని మా బళ్ళన్నీ విప్పారు. రాత్రే వంటచేసి ఒక బండిలో ప్రత్యేకంగా ఓ గుండిగ అన్నం, ఆవకాయ, దప్పలం, పులుసు, కందిపొడి, పెరుగు, పేరినెయ్యి మొదలైన వస్తువులు పెళ్ళి పెద్దలు తీసుకొచ్చి వుండడంచేత, చంటిపిల్లలకు బళ్ళవాళ్ళకు చల్ది భోజనాలు పెట్టారు. పెద్దలు చెరువులో స్నానాలు చేసి సంధ్యా వందనాలు వార్చుకుంటున్నారు. జపాలు కానిస్తున్నారు. ఇంతట్లో “చో చో చ్చో” అంటూ బాకాలు వైతాళికులు కాగా హో ఓం భోం” అంటూ బోయలూ పాటపాడుతూ ఉండగా పెళ్ళికొడుకు పల్లకీ చక్కా వచ్చింది. తెల్లవారగట్ట బయలుదేరి పల్లకీ ఈ మజిలీ దగ్గర మమ్మల్ని కలుసుకుంది.

మకాం చేసింది చెరువుగట్టో కాలవగట్టో అయితే ఆ దృశ్యం ఎంత అందంగా ఉండేది. గట్టంతా బళ్ళతో విప్పి వేసిన ఎద్దులతో అటూ ఇటూ తిరిగే మనుష్యులతో చెట్లతో తోపులతో నిండి వుంటుంది. అన్నన్ని కమలాలు కలవలూ వికసించివున్న ఆ చెరువు నీటిలో ఆ ఏటి ప్రవాహంలో, ఆ కాలువజాలులో ప్రతిఫలిస్తూ ఉంటాయి.

అలాంటి సమయంలో ఆ చలిది అణ్ణం తినడమూ సరదాగానే ఉండేది. కంది పొడుం, ఆవకాయ, గోంగూర పచ్చడి ఘుమఘుమలాడే నెయ్యి, పెరుగూ తినడానికి పెద్ద వాళ్ళే కక్కుర్తి పడేవారు.

ఈ పెళ్ళిళ్ళకు ఎంత గొప్పవాళ్ళయితే అన్ని ఎక్కువ బళ్ళు కడతారు. మాతాలుకాలో ఒక గొప్ప భూస్వామి ఇంట్లో పెళ్ళికి వెయ్యెకరాల మాగాణీ కలిగిన మగపెళ్ళివారు అయిదువందల రెండెడ్ల బండ్లు కట్టుకు వచ్చారు.

ఆడ పెళ్ళివారు పెళ్ళి జరిగేటంతకాలమూ ఎద్దులకు మంచిమేత, గడ్డిగాదమూ అన్నీ చక్కగా సరఫరా చేయాలి. బళ్ళవాళ్ళకు భోజనాలతోపాటు మంచి పొగాకు అందియ్యాలి ఆడ పెళ్ళివారు.

వేసవికాలంలో రాత్రిళ్ళూ, ఉదయాస్త మానాల చల్లబడిన కాలంలోనూ రాధారిబళ్ళ ప్రయాణాలు సాగేవి శీతాకాలం పగలంతా ప్రయాణం సాగుతూ ఉండేది. మెరక ఊళ్ళలో నూతులదగ్గర మకామూలు మజిలీలో. దారి వెంబడి సత్రములు ఉండేవి. పూర్వకాలంలో వైద్యశాలలూ, పశువైద్యశాలలూ ఉండేవి.

చుట్టాలను చూడాలన్నా, ఆడబడుచులను పుట్టింటికి తీసుకురావాలన్నా, అత్తింటికి కోడలును పంపాలన్నా ఇలా యీ రెండెడ్ల బళ్ళ ప్రయాణమే పూర్వం. చిన్న బిడ్డల తల్లి అయితే మేనాసవారీ ఎక్కి ఆవిడ బళ్ళతో ప్రయాణం చేసేది.

పూర్వం చెన్నపట్నం. కంపెనీ దొరలతో పని ఉన్నప్పుడు రైళ్ళురాని క్రితం రాయలసీమ నుంచీ, కోస్తా జిల్లాల నుంచీ ఈ రాధారి బళ్ళ ప్రయాణాలే, కోస్తా జిల్లాలవారు కొందరు ఓడలెక్కి చెన్నపట్నం వచ్చేవారట. ​భద్రాచలం శ్రీసీతారామచంద్ర కళ్యాణ మహోత్సవానికి పడవలమీద వెళ్ళేవారు. వెడుతూ వుండగా దేశ దేశాల నుండీ రాధారి బళ్ళమీదనే యాత్రలు సాగించుకు వచ్చేవారు. కోస్తా జిల్లాలవారు మొన్న మొన్నటివరకూ ఎఱ్ఱబాలెం దగ్గరరెండెడ్ల రాధారి బళ్ళమీదకే ప్రయాణాలు, శివరాత్రి మహోత్సవానికి శ్రీశైలం వెళ్ళాలన్నా చాలదూరం అలాగే ప్రయాణాలు సాగిస్తారు ఈ నాటికీ! పేట్రాయి, కదిరీ, పెంచలకోన, అహోబిలం, యాదగిరి నరసింహదేవేర్ల తిరునాళ్ళకు ఈనాటికీ ఈలాటి ప్రయాణాలే.

కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళకు కొండవీడు, పల్నాడు, వినుకొండ, అద్దంకి, ఒంగోలు సీమలనుండి పల్లె పల్లెలో తిరునాళ్ళు ఇంకా కొన్ని నెలలు వుందనగానే ఎద్దులను తయారు చేస్తారు. మంచి మేత, రోజూ సరియైన పరిశ్రమలతో అవతరించి బసవేశ్వరులులా సిద్ధం అవుతాయి ఎడ్లు. ప్రభలు రాతిచక్రాల బళ్ళమీదకూడ కడతారు తిరునాళ్ళు ముందుగ్గా సరిగ్గా ఉత్సవానికి కోటప్పకొండ ఎల్లమంద గ్రామం, చేరుకునేందుకు వీలుగా గ్రామం, గ్రామం అంతా బయలుదేరుతుంది. ముందు మొనగాడి గిత్తలు మేరు పర్వత శిఖరాలులా వెలిగిపోతుండగా, గంగిడోళ్ళు ఆడించుకుంటూ, తలలు తిప్పుకుంటూ అలంకారాలు, గంటలూ, మువ్వలూ మహాగానం చేస్తూ వుండగా మూపురాలు పాలసముద్ర మహావీచికలులా ఉప్పొంగుతూ వుండగా జరీపువ్వులు పచ్చడాలు వీపులను అలంకరించి వుండగా బయలుదేరుతాయి. నాలుగూ ఎనిమిదీ జతలుకూడా కడతారు. ఆ ప్రభలకు, ఆ వెనక ఊరి రాధారిబళ్ళన్నీ బయలుదేరుతాయి. మకాములు చేసుకుంటూ కోటప్పకొండ చేరుతాయి. ఆ కొండమీద నుంచి ఈ రాధారిబళ్ళ విడిదెలు చూస్తే ఒక మహాచిత్రంలా ఆ ప్రభలూ ఆ బళ్లూ ఆ జనసముద్రం ప్రత్యక్షమవుతారు.

ఏ వివాహానికి వెళ్ళినా, ఏ తిరునాళ్ళకు తరలినా, ఏ వర్తకానికి బేహారమైనా ఈ రాధారిబళ్ళవిడిదె ప్రదేశాలు ఏవో ఆనందానుభూతులతో నిండివుంటాయి. చెరువులు కాల్వలు, నదులు, బావులు, సత్రాలు తోపులు మజిలీలై విడిదిలై చైతన్య వంతాలవుతాయి.

మెరక ఊళ్లల్లో చెరువులు, కొండ వాగులు, బావులు, గోదావరి జిల్లాల్లో నల్ల చెరువు, తెలంగాణంలో పాకాల చెరువు, పాలంపేట చెరువు, రాయలసీమలో రాయ సముద్రమూ బుక్కపట్నం చెరువూ, అలాంటి మహత్తరమైన చెరువుగట్టుల మకాములు పల్లపు ఊళ్ళలో చెరువులూ, కాల్వగట్టులూ! చెరువులు ఎండిన వాగులు రాకపోయినా పక్కనే స్వచ్ఛమైన పాతాళ గంగలు ప్రవహించే బావులుంటాయి.

ఏ కృష్ణఒడ్డునో, గోదావరీ తీరాన్నో ప్రయాణాలైతే ఎక్కడ విడిది చేయకూడదు? ఈ రాధారిబళ్ళ ప్రయాణం, ఆ విడిదిలు నాటక కావ్యాలే అవుతాయి, ఎంత కొత్తవారు కలుసుకున్నా యాత్రా స్నేహాలుద్భవిస్తాయి. కాశీమజిలీల కథలు, కథాసరిత్సాగరం కథలూ చెప్పుకుంటారు. యువకుల జీవితాలలో ప్రణయ సంఘటనలు వెన్నెలు ప్రసరించి పోతూ వుంటాయి.

మోటార్లు, రైళ్ళు, బస్సులు, లారీలు, టాక్సీలు, కార్లు వచ్చిన ఈ నవ్యయుగంలో కూడా పల్లెటూర్లలో తెల్లటి మేఘాలులా, వెండి కొండలులా యెద్దులు కట్టినా రెండెడ్ల బళ్ళే గ్రామాలులా, వెండి కొండలులా యెద్దులు కట్టినా రెండెడ్ల బండ్లు, ఊరు ఊరికి ​ప్రయాణం రెండెడ్ల బండ్లు, ఎంత చిన్న వ్యవసాయ దారుడైనా ఒక బండైనా వుండి తీరాలి. గూడుకట్టకుండా పొలంపని చేసేబండి, గూడు కట్టగానే ప్రయాణం బండి అవుతుంది.

పల్లెటూరుకు వచ్చేసామానులు, పల్లెటూరు నుండి వెళ్ళే సామానులు చేరవేసే ఆ రాధారిబళ్ళు, ఆ గ్రామాలకు ప్రాణాధారాలే అవుతవి. ఆ గ్రామ శిల్పి అయిన వడ్రంగి చేవ తిరిగిన మంచిరకం కఱ్ఱతో నిర్మించిన బండి అలా దశాబ్దాలు పనిచేస్తూనే వుంటుంది. శాంతమూ, శక్తీ మానవ సన్నిహితత్వమూ మూర్తించిన ఎడ్ల వెంకటేశ్వరుని అవతారాలన్నా, బసవేశ్వరుని స్వరూపాలన్నా ఆ భావాలు మహాభావాలు కావా మరి!

చేననక, గట్టనక, ఏరనక, దారనక, నిదానంగా, నిశ్చలంగ గంటలు మువ్వలు మ్రోగించుకుంటూ ఈ రాధారి బళ్ళు తిరుగుతూనే వుంటాయి.

భారతదేశమంతా ఈ రెండెడ్ల బండ్లు నిండివున్నాయి కదా! పంజాబునుంచి, కన్యాకుమారి వరకు ద్వారకనుంచి గౌహతి వరకు రెండెడ్ల బళ్ళు భారతీయ జీవితానికి పునాదై దర్శనమిస్తాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కక్కరీతైన అందాలు కలిగి వుంటాయి. ఆకులు గల పెద్ద చక్రాలు చిన్న చక్రాలు, ఆకులులేని రాతి చక్రాలో గట్టికర్ర చక్రాలో ఈ బళ్ళు సాగుతూనే వున్నాయి. నైజామ్‌లో జనాన రెండెడ్ల బళ్ళు. వెదురు బద్దలతో గుండ్రంగా షానం కట్టిన బండ్లు, రధాలువలె నాలుగు చక్రాలు కలిగి ముందు రెండు చక్రాలు యెద్దులపాటు తిరుగుతూ పైన గుడి శిఖరం వంటి శిఖరం కలిగిన చిత్రమైన బళ్ళు ఉత్తరాదిని, తెలంగాణం, మరాటావాడలలో కనబడతాయి. ఆకాశం అంత యెత్తు కలిగి యెద్దులుగల బళ్ళు ఉత్తరాది బళ్ళు. వాటికి తగిన ఎత్తూ గల సింధీ ఎద్దులు, రాజపుత్ర స్థానంలో ఒంటెలే లాగుతాయి. గుడిలో చిన్న నందికేశ్వరునిలా పొట్టి అయిన గిత్తలుగల చిన్న రెండెడ్ల బళ్ళు మనరాష్ట్రంలో - జింక కొమ్ములవంటి అందమైన నిడువాటి కొమ్ములు గలిగి, పరుగు తప్ప నడకే ఎరుగని పెనుగొండ సీమ ఎద్దుల జతగలిగిన రాయలసీమ మైసూరు బళ్ళు, కొండ ఘాటీలు ఎక్కుతూ, దిగుతూవున్న నౌరంగపురం జయపురం బండ్లు - ఇలా దేశమంతా బండ్లు నిండివున్నాయి.

రాధారి బండి ఎంత అందమైనదో ఆ బండినిలాగే ఎద్దులు ఎంత గంభీరంగా, సౌందర్యమూర్తులై వుంటాయో అలాగే ఆ బండిని సారధి అయిన ఆ పల్లెటూరి కోడెకాడూ, అంత ఠీవిగా అంత హుషారుగా వుంటాడు, కోరతలపాగా చుట్టుకొని, వెనక కుచ్చు వీపుమీద అల్లల్లా ఎగురుతూ ఆడుతూ వుంటే, పైనకుచ్చు కిరీటంమీద తురాయిలా విడంచించిఉంటే, మహారాజులాగే దర్శనమిస్తాడు. అతను మెళ్ళో పులిగోరుతాడు. నాలుగు వెండి కాసులుంటాయి. కండలు చుట్టిన దండల కడియాలో బాటుపురులో, మొలను వెండి గోనతాడో బిళ్ళల మొలతాడో, ముంచేతులకు, ముడుగులూ, చేతులో ములుగోలు కమిచీ కర్ర. అతడు ప్రపంచమంతా రాజ్యం చేస్తూ కనపడ్డాడంటే అతిశయోక్తి ఏముంది.


“ఓరోరి బండివోడా? వొగలమారీ బండివోడా
ఆపవోయి నీబండీ, నిలపవోయి నీబండీ"

​అనేపాట ఏ వయ్యారి పడుచో అతనిపైన పువ్వులు చల్లేది. అతనికి తన ఎడ్లంటే ప్రాణం, వాటిని తన బిడ్డలుకన్న ఎక్కువగా చూస్తాడు. వాటికి పొద్దున్నే చిట్టూ, తవుడు, వులవలు పెడ్తాడు. స్వయంగా పచ్చిక కోసుకొచ్చి, ఆరగింప జేసినట్లు వాటిని మేపుతాడు. పచ్చిగడ్డితోపాటు, జనుముకట్ట, జొన్న దంటు, ఎండుగడ్డి వేస్తాడు. వాటిని చెరువుకి తీసుకువెళ్ళి దినదినమూ కడుగుతాడు. మంచినీళ్ళు తాగిస్తాడు. ముద్దు పేరు పెట్టుకుంటాడు. రాముడు, లక్ష్మణుడు, వెంకటగిరి, సింహాచలం, నంది భూంది అని

హృదయమారగ పిల్చుకుంటాడు. ప్రయాణాలకు వాటిని అలంకరించుకుంటాడు. అవిశ్రుతికాగా పాడుకుంటాడు.

పూర్వకాలంలో దొంగల భయముండే చోట, దూరపు ప్రయాణమైనప్పుడు, అడవుదారుల పులి, చిరుత, చిందువూ, కొరణాసి, వేగూలము సంచరించే ప్రదేశాల్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు పది పన్నెండు బండ్లు జట్టులుగా పోయేవారు. బళ్ళకు వెనుక వైపున దట్టమైన తడికలు కట్టేవారు ప్రతి బండి ఒక చిన్నకోట. ప్రతి యెద్దూ ఒక యుద్ధ వీరుడు.

కాశీయాత్ర కానీ, రామేశ్వరయాత్ర కానీ ఈ రాధారి బళ్ళే సాగించేవి. వర్తకుల ఎగుమతి దిగుమతి ప్రయాణాలు ఈ రాధారిబళ్లు నిర్వహించేవి.

ఎన్ని కథలు పుట్టాయి రాధారిబళ్ళను గురించి! నీతి చంద్రికలో మిత్రభేదంలో సంజీవకము ఈ రాధారిబండి యెద్దె, మా వైపున ఓ కథ ఉంది. ఒక పల్లెటూరి బాలిక. నవ యవ్వనంలో మిసమిసలాడి పోతున్న వలపులవయ్యారిని, సొగసుల మిటారిని, ఆ అమ్మాయి తండ్రి ఆ పడుచుకు ఇష్టం లేని ఓ నడిమి వయస్సువానికి ఇవ్వదలచుకున్నాడట. ఆ పెళ్ళి కొడుకు కొమ్మమీది కోతిలా వికారమైన అందం గలవాడట. ఆ వయ్యారిభామ అలాంటి పెళ్ళికొడుకు నాకు ఒద్దూ అని వాళ్ళ అమ్మ దగ్గర గోలపెట్టిందంటే పెట్టదూ! ఆ అమ్మాయికి బండితోలే బావంటే చాల ఇష్టం. అతను పొలానికి బండిలో వెళ్ళుతుంటే యెన్నిసార్లో తానూ ఆ బండి మీద వెళ్ళేది. ఊచబియ్యం తింటూ, పాటలు పాడుకుంటూ, ఏవో నర్మ అమాయికమైన వెంగపు మాటలతో ఉప్పొంగిపోయే వారు. పొలాలకు శ్రుతికల్పిన హాస్యాలు, హాస్యాలతో తాళం కల్పిన నవ్వులు వీటి అన్నిటిలో సామ్యమైన అకల్మషత వాళ్ళబండి గంటలతో కలసి వచ్చేది. పెళ్ళిరోజులు దగ్గరకు వస్తున్నాయి. వీళ్ళిద్దరి సంగతి గమనిస్తున్న వాళ్ళవ్వ వీళ్ళిద్దరికి మద్దతు, ప్రోత్సాహం. ఓ రాత్రిరాత్రి వీళ్ళిద్దరూ రాధారి బండ్లెక్కి, పుంతదారుల డొంకదారుల రాత్రి చుక్కల వెలుగులో వాళ్ళవ్వతో ఇంకా ఇద్దరు పెద్దలతో చిన్న తిరుపతి చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానంలో వాళ్ళిద్దరూ భార్యా భర్తలై చక్కాపోయారు. తల్లిదండ్రులు ఈరాధారి బండి ప్రయాణం పెళ్ళికి ఒప్పుకోక తప్పిందికాదు. కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం.

ఈలాంటి కధలు పల్లెటూరి ప్రపంచంలో ఎన్నో అడవి పూవులలా వికసించి వున్నాయి. ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయా? నేడు బస్సులూ, రైళ్ళూ వచ్చాయి. దిట్టమైన కంకర రోడ్లు నిర్మాణం అవుతున్నాయి. తెలంగాణంలోనూ, రాయలసీమలోనూ, మెరక ఊళ్ళల్లోనూ ఇప్పటికీ రోడ్లులేనిచోట ఈ రాదారి బళ్ళ ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ​వేదకాలంనుంచీ రాధారిబళ్ళ ప్రయాణం భారతదేశమంతా నిండి వుండేది, సంస్కృత సాహిత్యంలో, దేశభాష సాహిత్యాలలో, పద్యాలలో, పాటలలో, కథలలో, గాథలలో ఈ రాధారి బళ్ళ ప్రయాణం ఎంతో మనోహరంగా వర్ణించారు పూర్వకవులు.

అజంతా చిత్రలేఖనంలో, అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ మొదలైన శిల్పాల్లో ఈ రాదారి బళ్ళు విన్యసింపబడి ఉన్నాయి. పల్లెటూరి వారికనే నాలుగు గుఱ్ఱాలు పూన్చిన రథాలు. ఆ శిల్పాలలో నాలుగూ ఎనిమిది ఎద్దులు కట్టిన బళ్ళు వున్నాయి. రెండు మూడు కుటుంబాలు పట్టేంత రెండెడ్ల బళ్ళున్నాయి.

చిత్రకారుని హృదయానికి, కొండ ఘాటీ రాచబాటలలో, కొండశిఖరాలు, చరియాలూ, లోయలూ, సెలయేళ్ళు అడవులు చుట్టే వున్న ప్రకృతి సౌందర్యం ఆనంద తాండవంచేసే ప్రదేశంలో ఒకటో, రెండో రాధారి బళ్ళు ప్రయాణం చేస్తూ వుండే ఆ దృశ్యం ఆ సౌందర్యానికి లావణ్యం కూర్చినట్లు అందమైన పుష్పానికి తావి సమకూరినట్లు దర్శనమిస్తుంది. పూర్వకాలం నుంచీ ఎంతమందో చిత్రకారులుకు ఈ దృశ్యం విన్యసించడం ఎంతో ఆనందం, తెల్లని నల్లని మబ్బులు కూడిన నీలాకాశం, ఆకాశంలోకి చొచ్చుకుపోయి పడగలు విప్పి ఆడే పాములులా తాడిచెట్లు, ఆ చెట్లమధ్య ఆ పల్లెనాటి డొంక దారులు రెండెడ్ల బళ్ళు! ఆ వెనక దూర దూరంగా ఆ తోపులలో కోనేరూ, గుడీ పల్లెటూరు? ఎంత కళా పూర్ణమీ భావం!


తోలవోయి మన బండీ
త్రోవ దూర మెటనుండో
ఎటనుండో సాగెదారీ
ఏ దూరం విడిదిచేరు రాధారై.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse