అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/హిమాలయ రశ్మి
హిమాలయ రశ్మి
మొదటి భాగం
ఒకరోజు ఉదయాన్నే ఆనందస్వామీజీ హరిద్వారం స్నానఘట్టం దగ్గిర ఆ బాలికను చూశాడు. చూపుతోనే అతని హృదయంలో భయంకరమైన వేదనాజ్వాల ఆవిర్భవించింది. అతని ఒళ్లు కంపమెత్తింది; మొగం జేవురించింది. అతని తపస్సు అంతర్ధానమైపోయింది. స్వామి చూపులు ఆయన ఆజ్ఞల్లోంచి తప్పుకొని, స్నానంచేస్తూ అందాలముద్ద అయిన బాలికపైనే పదే పదే ప్రసరిస్తూ ఉన్నవి. ఆమె లాగు, చొక్కా, పై ఉత్తరీయం తడిసిపోయి ఆమె బంగారు పరువాలు ఫలించే దేహసౌష్ఠవం ప్రచురించినవి. ఆయన చూపులు శిశుత్వ, ముగ్ధత్వాలతో వియ్యాలందే ఒక విచారం, ఒక వినోదంలో వెలిగే ఆమె మొగంపైన వాలినవి; ఆమె కంఠం, బాహుమూలాలు, వక్షోజాలు, నడుము, నీళ్ళలో దాగుడు మూతలాడు కటివిలాసం పైనా ప్రాకులాడినవి.
సహజంగా ప్రశాంతం అయి, దివ్యతేజస్సుతో వెలుగు ఆ బాలయోగి మోము వివర్ణమైపోయింది.
ఇంతలో బాలశంకరునిలా మూర్తీభవించి స్నానంచేస్తూ ఉన్న ఆనందస్వామిని కనుగొన్నదా కాశ్మీర సుందరి.
2
ఆ బాలిక? శ్రీనగరంలో ఉన్న ఒక కాశ్మీర బ్రాహ్మణ బాలిక. హరిద్వారంలో తలవెండ్రుకలు తీయించి వేద్దామని ఆ అమ్మాయి తండ్రి కుమార్తెను తీసుకు చక్కావచ్చాడు. ఆరేళ్ళ పసికూనై ఉన్నప్పుడే అష్టదరిద్రుడికి బలిదారపోస్తే, ఎవరి అదృష్టమో ఎవరి దురదృష్టమో పెళ్ళయిన మూడోమాసానికే రాయంటి పెళ్ళికొడుకు తుపాకి మందు పేలితే బ్రద్దలైనట్లు ఆ అమ్మాయిని ఒంటిదాన్ని చేసి, అధోగతిలో పడేసి, అట్టే పొయ్యాడు.
ఆ చిన్నదానికి ఏమీ తెలియదు. తాను విగత భర్తృకనన్న విచారమూలేదు. “అయ్యో అమ్మా! నీ ఖర్మం ఎంతకాలిందే నా తల్లీ? నీ బ్రతుకు ఇంత చిన్నతనంలోనే బుగ్గి అయిందే” అని తల్లీ వాళ్ళూ కౌగలించుకొని అప్పుడప్పుడు ఏడుస్తే ఆమెకు అర్థముకాలేదు; మొగుడు లేకపోయినాడన్న బెంగా కలుగలేదు. పదహారేళ్ళు నిండి ఈడువచ్చింది; జీలం నదిలోని పద్మంలా మెరిసిపోతోంది. ఆమె మొగాన్ని వైధవ్యకళేలేదు. సౌభాగ్యదేవతా విగ్రహంలా ఉంది.
శిల్ప కళాశాస్త్రానికి ఉదాహరణంగా సృష్టించారా అన్నట్లు అపరిమిత సుందరాంగియై ఆ కాశ్మీర బ్రాహ్మణుని ఇల్లు వెలిగిస్తూ పద్దెనిమిదేళ్ళు నిండేటప్పటికి చూస్తే దృష్టి తగిలేటట్లు ముద్దులొలికి పోయింది.
'మా కళ్ళు పాపిష్టివి' అని భూమిమీద తల బద్దలుకొట్టుకొన్నాడు తండ్రి బ్రాహ్మణుడు. మేనత్త వితంతువు “అబ్బే, ఈ అందం మన యింటిలో వుంటే, అష్టపాపాలకి ఆసరువైపోతుంది. తలవెండ్రుకలు తీయించెయ్” అన్నది. తల్లి కుళ్ళిపోయింది
3
ఆనందస్వామిజీ? రాజమండ్రిలో బియ్యేలో నెగ్గి, కృష్ణా జిల్లా 'కలెక్టరేటు'లో యిరవైయైదు రూపాయలు జీతానికి కుదిరి, యిరవైయైదేళ్లు వచ్చేసరికి రివిన్యూ యినస్పెక్టరీ చేస్తూ భీమవరంలో కాపురం వున్నాడు రామచంద్రరావు. పరువుకన్న వెలనాటి కుటుంబంలో ఉద్భవించి, పరువుకన్న సంప్రదాయ సంబంధం చేసికొని, యిద్దరు బిడ్డల తండ్రయి, ఏమీ కష్టనిష్టూరాలు లేక, అందరికీ తల్లో నాలికలా మెలుగుతూ, సంసారంలో ఏమీ లోటులేకుండా కాపురం చేస్తున్నాడు. బంగారంలాంటి భార్య, పనసతొనల బొజ్జబాబులు ఇద్దరు బిడ్డలూ.
ఓ రాత్రి ఏ మాయ బుద్ధిపుట్టిందో, రెండో కంటివాళ్ళకు తెలియకుండా కటికి అమావాస్య చీకట్లో మాయమైపోయాడు.
తెల్లవారే లేచి భార్య అతడు వ్రాసిన ఉత్తరం చూసి “అమ్మో” యని గోలపెట్టి కాలవవతల శ్రీరాంపురంలో కాపురం ఉండటంచేత దగ్గిరగా ఉన్న యనమదుఱ్ఱు పెద్ద మురుగుకాల్వలో గుభాలున పడింది పిల్లల మాటైనా తలపెట్టకుండా. అప్పుడే బల్లకట్టుపైన ఊళ్ళోకి దాటుతూవున్న ఆసామీ ఒకడు గభిల్లున ఉరికి, ఈది గుటకలు వేస్తూ ఉన్న ఆమెను ఒడ్డుకు లాగేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళంతా మూగి అడ్డంపడి పట్టుకొని ఇంటికి లాక్కువచ్చినారు. ఆమె తండ్రికి అమలాపురం తంతి ఇచ్చారు. ఆయన వచ్చి తీసుకుపోయాడు కూతుర్ని, మనుమల్ని, వారం అయింది, నెల అయింది, సంవత్సరాలు అయినవి. ఎక్కడా రామచంద్రుని జాడే లేదు. కాలువలో పడ్డాడేమో అన్నారు. కాని ఉత్తరంలో ధ్వని అది కాదే! అతనికి భార్య అంటే ఇష్టం. ఇద్దరు పిల్లలూ అంటే ప్రాణం. ఎవళ్ళతో తగాదాలు లేవు. అధికార్లంటే ప్రాపకం. ఏవిధమైన కష్టాలులేవు. “కొందరు పిరికిపందలు శుంఠకార్యాలు చేస్తారు నిష్కారణంగా” అని రామచంద్రరావుని అతని స్నేహితులు తిట్టుకున్నారు.
4
ఈ సంగతంతా తెలిసిన ఒక పెద్దమనిషి కుటుంబంతో కాశీయాత్రకు వెళ్ళినప్పుడు "రామచంద్రరావు ఇక్కడ వున్నాడు. సన్యాసం పుచ్చుకొన్నాడేమో! భార్యను తీసుకుని మీరూ, అతనివాళ్ళూ కుటుంబాలతో రండి” అని రామచంద్రరావు మామగారికి టెలిగ్రాం ఇచ్చాడు. అంతా తండాలా ప్రయాణమై కాశీ చేరారు. అక్కడ రామచంద్రరావు సన్యాసుల్లో కలిసిపోయి వేదాంతం నేర్చుకుంటూ, యోగాలు అభ్యసిస్తూ ఉన్నాడు.
అది చూసి అతని భార్య కెవ్వున అర్చి మూర్ఛపోయింది.
అతని ముద్దుబిడ్డలు ఇద్దరూ గవ్వల్లా కళ్ళుచేసుకుని విస్తుపోతూ తండ్రిని చూశారు. ఎన్నివిధాలు ఎంతమంది ప్రయత్నించినా కాషాయాంబరాలు ధరించిన ఈ క్రొత్త సన్యాసి హృదయం కరగలేదు. "దివ్యాదేశం వచ్చింది. కారణం ఏమిటి? కారణం వుండదు. తరించడానికి వైరాగ్యం ముఖ్యసాధనం!" అంటూ శంకరభాష్యం ఏకరువు పెట్టాడు.
రాతితో వండారు అతని హృదయాన్ని. ఆయన గురువు శతవృద్ధు యతీశ్వరానందజీ రామచంద్రుని భార్యకు హృదయోపశమనం చేశారు. వారందరు తిరిగి ఇంటికి చేరారు. హిమాలయాలు పిలిస్తే ఎవరాగ్గలరు? ఆ రామచంద్రరావు నేటి ఆశ్రమంలో ఆనందస్వామిజీ!
రెండవ భాగము
ఆ బాలికను చూసినకొద్దీ ఆనందజీ దేహం నరం నరం వశం తప్పిపోయినవి. అతని గుండె రైలుమరలా మ్రోగుతోంది. అతని మనస్సు చెప్పుచేతల్లోంచి పూర్తిగా తప్పిపోయింది. ఎప్పుడూ అట్టి విపరీతం జరగలేదు.
భయపడుతూ స్నానం పూర్తికానిచ్చి హరిద్వారం సమీపంలో వున్న ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు ఆనందజీ.
ఏమిటిది? ఎక్కడి ఘోరపాపం! ప్రపంచం అధోలోకంలోనికి క్రుంగిపోతున్నదా? హిమాలయాలు విరుచుకు పడుతున్నవా? తల భూమిపైకొట్టుకున్నాడు.
ఇన్నాళ్ళ తపస్సు భగ్నమైపోయింది. మంట కలిసింది. మూడేళ్ళు గంగోత్రిదగ్గిర తపస్సు చేశాడు తాను. చవి ఉన్నదన్న 'ప్రకృతి సత్యము' మిథ్య అని అనుకోలేదా తాను.
తన మనస్సు ఆ రోజుల్లో విశ్వమంతా తిరిగేది. 'శివోహం' అనే ధ్యానంమీద మహాయోగం వల్ల దీక్షతో చివరకు నిలిచింది. కుండలిని లేపింది. షట్చక్రాలు దాటి విజృంభించి పైకి ఉబికింది. సహస్రారందాట ప్రయత్నం. ప్రాణశక్తి. వికల్ప సమాధి.
అంతా ఏక తపస్సు, అంతంలేని చీకటి. శబ్దంలేని కటిక నలుపు. ఏమీలేని ఘోరజీమూతం. దేహం కొయ్యబారింది. ఆకలి దహించింది. హృదయం పేరుకుపోయి గడ్డకట్టింది. కొన్ని వారాలు అలాగే చైతన్య రహితమై పడిఉన్నాడు. బాహ్యజ్ఞానమేలేదు. ఏమి జరిగినదో? అంతర్ధానమూ నశించిపోయింది.
చటుక్కున ఒక్కనాడు మెలకువ వచ్చింది తనకు. గురుభాయీలు “శివోహం” “శివోహం” జపిస్తూ ఉన్నారని తెలిసింది గంగోత్రికడ గుహల్లో. నెమ్మదిగా నెమ్మదిగా పండ్లు తిన్నాడు; పాలు చప్పరించినాడు; రొట్టె నమిలినాడు. గురుస్వామి యతీశ్వరానందజీ "మొదటిగడ్డు దాటింది. రెండవదానికి సిద్ధం అవు" అన్నాడు. అతని ఆత్మ మహాశాంతంలో దిగిపోయింది. ఒక విధమైన తేజస్సు అతన్ని ఫాలాన్ని వెలిగిస్తూ ఉన్నది. గురుస్వామికడ అనేక గ్రంథాలు చదివాడు. వేదాంత మహాభావాలు అవగతం చేసుకొన్నాడు. అవి అన్నీ తనకు ఇదివరకే తెలిసిఉన్నట్లు గోచరించాయి.
2
కైలాసగిరికడ ఒక గుహలో రెండవసారి తపస్సుకు పద్మాసనం వేసి కొన్నాడు.
ఇప్పుడు అతిత్వరలో వికల్ప సమాధిలోనికి పోయాడు. దేహం అంతా వేయి విద్యుల్లతలు పాకినట్లయింది.
“శివోహం’ ‘శివోహం!' 'శివోహం!' అంతా వెలుగే. 'తత్త్వం సర్వం'! 'తత్త్వమసి'!! 'అహం బ్రహ్మాస్మి'!!! 'సర్వంసత్'! 'సర్వంచిత్'! 'సర్వం ఆనందం'!
ఆరునెల్లు ఒకే యోగం, ఒకే సమాధి! ఒకే ఆనందం! ఓం, ఓం, ఓం!!!
ఆనందజీ కళ్ళు తెరిచినాడు. సంపూర్ణ చంద్రమండలమే ఆయన మోము.
ఆయన దేహాన్నుంచి వెలుగులు చిమ్ముతున్నవి.
ఆయన పెదవుల చివురుల సంతతానందహాసము, ఆయన కనుల్లో జ్ఞానజ్యోతిర్లతలు. “హరిద్వారంవద్ద ఆశ్రమం ఏర్పరచుకో, రోజూ స్వామి దేవాలయం ఎదుట స్నానాల రేవులో స్నానంచేసి, స్వామిదర్శనంచేసి ఆశ్రమంలోకిపోయి తపస్సు చేసుకో!” అని గురుస్వామి ఆజ్ఞ.
అలాంటి తనకు ఈ అవస్థ ఏమిటి?
3
ఆ బాలిక మోము కలకలలాడుతూ ఎదురుగా కనబడుతోంది. తల తిప్పివేసి పద్మాసనం వేసికొని ధ్యానంలో కూర్చున్నాడు. ఆ కాశ్మీరబాల ఎదుటకు వచ్చింది. పూలు ఫలాలు పళ్ళేన పట్టుకొనివచ్చి ఎదుట నిల్చొని నమస్కరించి తన సెజ్జనే కూర్చున్నది. ఆమె ఉష్ణాంగములు తన దేహాన్ని తాకినవి. ఆమె హృదయాలయాలు తన దేహాన్ని అదిమినవి. ఆమె తన ఫాలము ముద్దుకొన్నది :
‘అయ్యో!' అని ఆనందజీ చివాలున లేచినాడు. అక్కడ ఎవ్వరూ లేరు. పళ్ళెమూలేదు బాలికాలేదు. తానొక్కడే. చుట్టూ శూన్య కుటీరము.
తపస్సు భగ్నమైపోయింది. జీవితం ప్రక్కలై పోయింది. మళ్ళీ తాను ఎన్ని జన్మలు వెనక్కుపోవాలో! సత్ పదార్థముతో ఐక్యం అయిపోయినవాళ్ళు మళ్ళీ వెనక్కు వెళ్ళడం ఉన్నదా? పరమశివా! తాను తన గురుస్వామి మోము ఏలాగు చూడగలడు? తాను తనకే రోతయిపోయినాడే. "దేవా, ఏమిగతి? గురూ, నన్ను రక్షించు” తలక్రిందవేసి బద్దలు కొట్టుకున్నాడు; ఏడ్చినాడు; దండం పుచ్చుకొని దేహాన్ని బాదుకొన్నాడు కంగి, వాచి, కాయలుకట్టి ఎంతో బాధ పెట్టింది.
ఆ బాలిక తనవైపు చేతులుచాచి అతిప్రేమతో చేరవస్తున్నది. “శ్రీహరీ!” అంటూ, ఉన్నతుడై ఆనందజీ గంగ ఒడ్డునే పరుగెత్తినాడు.
“శ్రీహరీ!” అని గంగాప్రవాహం ప్రతిధ్వనించింది.
4
"అయ్యో తల్లీ! నీకర్మం కాలిపోయిందే, ఏమిచేస్తాం. ఎన్ని చుక్కలు ఆ తలవెంట్రుకల నుంచి రాలుతూ ఉంటాయో అన్ని జన్మాలు వైధవ్యం అనుభవించవలసి వస్తుందమ్మా. నేను తీయించుకోలేదూ. ఉన్నా ఎవరు ఆ తుమ్మెద రెక్కలు చూసి సంతోషించడం” అని నిరుపమాదేవి మేనత్త యామెను బలవంతాన లాగుతూ ఉన్నది. తల్లి మేలిముసుగు పూర్తిగా మోముమీదికి లాక్కొని వెక్కి వెక్కి వాపోవుతూ ఉన్నది. తండ్రి పండిత రామానంద్ కుమార్తె చేయిపట్టుకుని మంగలివైపు లాగుతూ ఉన్నాడు.
మంగలివాడు ఒంటి చిరునవ్వు నవ్వుతూ కత్తినూరుకుంటూ “ఎన్ని రకాల అందాలజుట్లు యీకత్తి మింగి ఈ గంగకు అర్పించిందో” అని అస్పష్టంగా అంటున్నాడు.
నిరుపమాదేవి "అబ్బా, నేను చేయించుకోలేనర్రా” అంటూ పులి దగ్గరకు తోసే లేడిలా వెనక్కుపోతూ ఎంత బలవంతాన లాగినా ముందుకు రాదు.
భర్త పోయినాడన్న దుఃఖమేమీ ఎరుగదు. తన్నందరు హీనంగా ఎందుకు చూసేవాళ్ళో ఆ బాలికకేమి తెలుసు? ఎప్పుడు వాళ్ళింటిలో శ్రీనగరంలో ఆడుకుంటూ ఉండేది. తండ్రి భాగ్యవంతుడు. ఆ బాలిక తప్ప పిల్లలెవ్వరూ లేరు. కాని తానొక గొప్ప సనాతన వాదినని అతని అభిప్రాయం.
వచ్చే కళ్ళనీళ్ళు వెనక్కు తరుముతూ లేని కోపంతో జేవురిస్తూ కుమార్తె రెండు బుజాలూ నొక్కిపెట్టి బలవంతాన మంగలి దగ్గిర కూచోపెట్టాలని తోస్తూ ఉండగా “స్వామీ, రక్షించు” అని ఆ బాలిక కింద పడింది.
గంగ ఒడ్డునే విసవిస పిచ్చవానివలె వస్తూ ఉన్న ఆనందస్వామిజీ అక్కడకే ఆ సమయంలో వచ్చాడు.
“ఎవరువారు?”
మంగలి: ప్రభూ! బాలవితంతువు శిరోజములు గంగాదేవి కర్పించపోతూ ఉన్నారు.
ఆ కాశ్మీర బాలికే చైతన్యం తప్పి కిందపడి ఉన్నట్లు చూశాడు.
చివ్వునపోయి ఆమెనుపట్టి లేవనెత్తి ఆమె శిరస్సు తన ఒళ్లో పెట్టి కొని “శివోహం, శివోహం” అన్నాడు. ఆమె కళ్ళు విప్పింది.
సిగ్గున ఆ బాలిక స్వామీజీ ఒళ్ళోనుంచి లేచి, జరిగి కూచుని మేలి ముసుగు సవరించుకున్నది.
పండిత రామానంద్ స్తబ్ధుడై విస్తుపోతూ చూస్తూ నుంచున్నాడు. స్వామిజీ ప్రళయకాలరుద్రునిలా గర్జిస్తూలేచి, “ఈ కసుగాయపాపను విరూపను చెయ్యడానికి నువ్వెలా ఒప్పుకున్నావయ్యా?" నీకు మోక్షం వస్తుంది అని అనుకున్నావా? ధర్మశాస్త్రాలు వప్పుకుంటాయనా నీ అభిప్రాయం! ఏ వ్యక్తికైనా బలవంతంగా వైరాగ్యం ఇవ్వవచ్చునా? మనస్సులో లేని వైరాగ్యం జుట్టులో వస్తుందా?" అంటూ శాస్త్రంలో కబుర్లు, శాస్త్రాతీతమైన యుక్తులూ ఏకరువు పెట్టేశాడు.
హృదయాంతరాంతరాళాల్లో ఇష్టంలేక లోకానికి వెరచిజుట్టు తీయించతలచుకొన్న పండిత రామానందుడు "స్వామిజీ, క్షమించండి. నాకుమార్తె తనంతటతాను యోగినీవేషం పూన్తానన్నదాకా వేణీభరం తీయించను. కాని తమ బోంట్లు ఈలాంటి బాలికలకు సంసారమందు రోత, వేదాంత విచారం మొదలయినవి బోధిస్తూ ఉంటే మా సంసారాలు తరిస్తాయి స్వామీజీ!" అన్నాడు.
మూడవ భాగము
ఆనందజీ హృదయం తుఫానునాటి మహాసముద్రమైంది. విశ్వామిత్రునకు తపోభంగం జరగలేదా? అది తాత్కాలికం అయినదే. కాని వారి తపోభంగం యొక్క అంతం, ఆ సుందర కాంతాపరిష్వంగంతోగాని కాలేదు. అది మహాపాపంకాదా? తనకేది కర్తవ్యం? ఒక్కనిమేషమేని ఆ బాలిక సుందర వదనం హృదయంలోంచి మాయంకాదే? ఆ దివ్యసుందరగాత్ర తన్ను ముట్టుకున్నప్పుడు తన దేహం పొందిన పులకరాలు, హాయి, ఆనందం, తాను సమాధిలో పొందిన ఆనందంకన్న ఉత్కృష్టమైందో సమమైందో?
తనపాపానికి నివృత్తి ఉన్నదా?
తన యీ అధఃపతనానికి చెలియలికట్ట ఎక్కడ?
దేహం తెలియకుండా ఎన్ని దేశాలు తిరిగాడో! గొప్ప స్వామి వచ్చాడని చాలామంది గృహస్థులు ఆతిథ్యం ఇస్తే వంకర నవ్వునవ్వుకుంటూ "మీ అమ్మాయిల్ని జాగ్రత్తచేసికోండో!” అని మనస్సులో చాటించుకున్నాడు. కసితో, వాళ్ళతో చార్వాకసిద్ధాంతం పూర్వపక్షంచేస్తే, అంతా అంతరార్థమే అని సంతోషించారు మానవులు.
అతని మొహంలోని కెరటాలు కొడుతూఉన్న మోహజలధి "పార లౌకిక కాంతినిధి” అని అనుకున్నారు విధవ స్త్రీలు.
ఎక్కడెక్కడో తిరిగాడు, ఏమేమో ఉపన్యాసాలు ఇచ్చాడు. మాట్లాడేదంతా మాయ సంసారపు విముక్తి ఉపన్యాసం. మనస్సు నిండినదంతా మాయామోహపు తీపివెఱ్రి.
తీర్థాలు, పుణ్యస్థలాలు, వర్తకపు పట్టణాలు, వ్యవసాయపు కేంద్ర స్థానాలు, రాజధానులు ఆరునెలలు తిరిగి తిరిగీ ఎక్కడ తిరిగాడో, ఎలా తిరిగాడో, పరివ్రాజకత్వమో భామరూపం నిండిన పరవశత్వమో, తిరిగి తిరిగి కళ్ళు తెరిచి చూసేటప్పటికి కాశ్మీరదేశం, శ్రీనగరం వీధిలో ఒక మేడముందు.
“స్వామీ! నమస్తే!” అని కాశ్మీర బ్రాహ్మణుడు నడుముకు తలపాగ చుట్టుకుని జోళ్ళు విప్పి సాష్టాంగపడ్డ దృశ్యం.
పదిమందీ జేరడం, లోనికి తీసుకువెళ్ళడం, గౌరవం చేయడం నిముషములో జరిగిపోయింది. ఆ బాలిక తండ్రి ఇల్లు, ఆ పండితుడు, ఆ దివ్య మంగళ విగ్రహం ఎదుట సర్వాంగాలింగితభూతల అయి ఉన్నది. 2
ఇంటి గురువు అయ్యాడు. తన్ని మూలమంటా కదిల్చివేసే ఆబాలిక తనకు పరిచర్యచేస్తూ ఉన్నది.
ఏరోజు తన్ను రక్షించాడా బాల సన్యాసి అనిచూసిందో ఆనాటి నుంచి అతడామె జీవితానికి ఈశ్వరుడయ్యాడు. హిమాలయ ధవళశృంగాలల్లో ఎర్రని పాదాంగుళులను మోపుతూ నృత్యంచేసే నటేశ్వరుడే ఆ బాల సన్యాసి ఆ బాలికకు, అతని వెడద ఫాలం హిమాలయ సానువైంది. తీక్షణమై లోతై నల్లనై చిన్ననైన అతని కళ్ళు తన మోక్షమార్గం చూపించే నక్షత్రాలయ్యాయి. సన్నని పొడుగాటి చామన చాయగల ఆ బాల సన్యాసి తన్ను తరింపచేయడానికి అవతరించిన కేదారేశ్వరుడు. అమరనాధుడు. అతని ఫాలంలో చంద్రవంక చూసుకుంది. అతని బోడితలలో జటాజూటాలు నర్తించినవి. అనుక్షణం ఆ బాలసన్యాసి వరద హస్తంతో ఎదుట తోస్తూనే ఉన్నాడు.
రాత్రిళ్ళు చీకట్లలో హరిద్వారంనుంచి వచ్చినప్పటించీ ఆస్వామిజీ దగ్గిర నిలుచుండి తనవైపు అభయముద్ర చాచినట్లే కనిపిస్తూ ఉన్నది.
ఆస్వామిజీ తలచుట్టూ కాంతిపుంజము ప్రసరించిందంట. ఆయన్నే తేజస్సు అలుముకు పోయింది.
సర్వకాలమూ ఆయనకు సేవచేస్తే తనజన్మ పవిత్రం అయిపోతుంది. ఆ అవతారమూర్తి మళ్ళీ కనబడతాడా? ఎప్పుడూ కళ్ళకు కనబడుతూనే ఉంటాడు. దేహంతో ప్రత్యక్షం కాకపోయినా పరవాలేదు.
ఆయన ఎప్పుడూ హరిద్వారం దగ్గిరేనా బస? ఎంత సుందరమూర్తి!
ఆయన ఒళ్ళో తాను పడివున్నప్పుడు, అంత ఒళ్ళు ఆనందంతో కరిగి పోయిందేమిటి?
ఆయన మొహంలో మందహాసాలు మంచు శిఖరంమీద వెన్నెలపడినట్లు వెలిగినవేమిటి?
ఆయన మనుష్యరూపం పొందిన భగవంతుడు కాడా మరి! ఆయన్ని నిత్యమూ కొలుస్తూ ఉన్నా, తనకు తృప్తి ఉంటుందా? ఆయన పాదాలు తాను పట్టాలి. ఆయన తనకుముక్తినిచ్చే మార్గము బోధిస్తూ, నెత్తిమీద చేయివేసి ఆశీర్వదిస్తాడా?
దినదినమూ ఈలాంటి ఆలోచనలతో నిండివున్న ఆ కాశ్మీరబాలికకు "స్వామిజీ వచ్చాడు” అన్న తండ్రికేక వినబడింది. గజగజ వణికి పోయింది. కన్నుల నీరు తిరిగినవి. ఆనందం ఒళ్ళంతా అలుముకుపోయింది. తనకోర్కె విన్నా డాస్వామి. తన తపస్సు ఫలించిందా? తన గురువు తన్ను వెదుక్కుంటూ వచ్చినాడా?
ఆ స్వామి ఇంట్లోకి వచ్చాడు. కాళ్ళపై పడింది. ఆ కాళ్ళక్రింద మన్ను తనతలపై వేసికొన్నది. 3
ఆ నగరంలో ఆబాలగోపాలం స్వామిజీకి పరిచర్య చేస్తున్నారు. ఫలాలు పట్టుకువచ్చేవాళ్ళు, పాలు పట్టుకువచ్చేవాళ్ళు, భిక్షలకు పిలిచేవాళ్లు, మిఠాయి వంటలు వండించేవాళ్ళు, ఒక్క నిముషం స్వామిజీకి తీరుబడి లేకుండా జనం ఎప్పుడూ ఆయన చుట్టూ మూగి ఉండేవాళ్ళు.
సంసారంలో దౌర్బల్యం బోధించాడు. కర్మ అనేది ఏమిటి? జ్ఞాన మార్గం యొక్క ఉతృష్టత. మానవుడు మనస్సు. మనువు మనస్సు. జీవితం మనస్సు. మనస్సు యొక్క వికల్పాలే ప్రపంచ సృష్టి, ఆనందం ఏమిటి? సత్ పదార్థం ఏమిటి? ఈశ్వరుడు పరాప్రకృతి. సాక్షీభూతమగు పురుషుడు, సృష్టిభూతమగు పురుషుడు, సమస్త పురుష స్వరూపుడగు పురుషోత్తముడు. భగవద్గీత పరమ వాక్కు, త్రిభాష్యాలకు ఉండు పరమసంయోగం, సమీకరణం ఎక్కడ? సాంఖ్యము, ఉపనిషత్తులు, బ్రహ్మగీత అన్నీ ఒకటే చెప్పుతాయి. హఠయోగం దేహనిర్మలతకోసం. మంత్రబలిమి. పరా, పశ్యంతీ, మధ్యమా వైఖరీ వాక్కులు, సృష్టిశక్తి, శక్తికి మహోత్కృష్ట స్వరూపమైన పరమ సూక్ష్మమగు ధ్వని. ఆ ధ్వని అక్షర సముదాయమైంది. కాబట్టి బీజాక్షరాలు. ఇంకా, ఇంకా ఈలాగే జ్ఞానముద్ర ధరించి తీపి వాక్కులతో వందలకొలది భక్తులకు బోధిస్తూనే ఉన్నాడు.
ఒకనాడు ఒక శిష్యుడు “స్వామీ, సంసారంలో ఉండి త్యజించే మార్గం చెప్పండి” అని పృచ్ఛచేసినాడు చేతులు జోడించి.
స్వామి అన్నాడు.
“ఒక నావ బయలుదేరింది. తెరచాపలెత్తారు. గాలి జోరుగా వీస్తూంది. తెడ్లువేశారు. గడలు మోపారు పడవ నడవదు. తర్జన భర్జన చేశారు. చివరకు అంతా కనిపెట్టింది ఏమిటి? లంగరే ఎత్తలేదట. ప్రపంచంలో ఉండి ఆ పాపాలన్నీ చేస్తూ మోక్షం ఎల్లా సంపాదించడం. బజారులో కూరగాయ వస్తువా మోక్షం?"
రాత్రిళ్ళు స్వామిజీకి పరిచర్య నిరుపమాదేవే. పరుపుపై ఔభ్రాదుప్పట్లు, ఔభ్రాశాలువలు, ఆయన జపానికి కృష్ణాజినం వగైరాలు. బట్టలు ఉతికి ఆరవేయుట పళ్ళు ఒలిచి సిద్ధం చేయుట. పాలుకాచుటా, కాళ్ళు పట్టేది. దేహము పట్టేది.
ఇద్దరూ ఆనందం పొందేవాళ్ళు. ఎప్పుడు పరిచర్య వస్తుందా అని ఇద్దరూ ఎదురు చూసేవాళ్ళు. మహాభక్తితో పరిచర్యజేస్తూ ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులకు పరమసంతోషం అయ్యేది. వైరాగ్యమార్గంలోపడి సమస్త దుఃఖమూ మరచిపోతుంది కాదా మరి.
4
ఇన్ని సంవత్సరాలూ చేసిన తపస్సు బలిమి ఇంకా ఉందేమో? ఆ బాలిక తన దగ్గిర కూర్చుండి పరిచర్య చేస్తూవుంటే తమిపట్టలేకపోయినాడు. ఆమెతో కామ సంబంధమగు సహచర్యం ఊహించు కొనటానికే స్వామిజీ భయపడినాడు. అయినా అతని మనస్సు, ఆధీనంతప్పి చుక్కాని తెంపుకొని భయంకరమైన సముద్రాల్లోకి దుమికి పోవడానికి సిద్ధపడివున్న నావలా ఉంది. ఏదోవంకతో ఆమెను స్పృశించేవాడు. ఆమె కురులు దువ్వేవాడు. ఆమెకు ఆధ్యాత్మికమైన రహస్యాలు నేర్పుతూ దగ్గిరకు లాక్కొని పక్కను జేర్చుకునేవాడు.
ఆమెకు స్వామిజీయన్న మోహముకాదు. స్వామిజీయే తనకు దైవము, సర్వస్వము, స్వామిజీ తనకు దేహమర్పించమన్న అతి ఆనందపూర్ణమున్ను అతి అమాయికమున్ను అయిన హృదయంతో అర్పించగలదు. స్వామిజీ జీలంనదికి ప్రాణం సమర్పించమన్న అంతే. నవ్వుతో వెళ్ళిచేయగలదు. “నీ తండ్రిని ఈకత్తిపుచ్చుకొని చంపివేయి” అని స్వామిజీ అంటే అలాగే చేయడానికి ఆమె ఏమాత్రం సందేహించదు; ఆ బాలిక సమస్తము విడిచేస్తుందిగాని స్వామిజీని ఆమె నిమేషమైనా విడిచి ఉండలేదు.
“అమ్మాయీ! ఇల్లా ఎందుకు నాకు పరిచర్య చేస్తున్నావు?”
“నా దైవానికి పరిచర్య చేయడం నాకు అబ్బరమా?”
“ఎవరిమట్టుకు వాళ్ళే దైవము. నా ఎక్కువ ఏముందమ్మా?”
“అది తెలుసుకున్న తర్వాత కదా. అందాకా గురువే పరమ దైవం.”
“సర్వ విధాల ఉత్కృష్టత పొందిన మానవుడే గురువుగా తగి ఉంటాడుకాని నాబోటివాడు-
“పాపం! పాపం! అల్లా అనకండి, మీరు భగవంతుని అవతారమే!”
నాలుగో భాగము
ఆనందజీ తపస్సంతా భగ్నమైపోయింది.
ఒక విచిత్ర ముహూర్తాన్ని ఆనందజీ తమి ఆపుకోలేక పోయనాడు. నిరుపమాదేవి అతని కౌగిలింతలో కరిగిపోయింది.
ఆ సంధాన ముహూర్తం పవిత్రమైనదో. పాపభూయిష్టమైనదో ఆ రాత్రియే ఆనందజీ తలవాల్చుకొని సిగ్గుచే, భయంచే వణికిపోతూ హృదయంలో పశ్చాత్తాపం దావానలం అయి జ్వాలలు ఎగుస్తూ ఉండగా దేహం కుమిలి బొగ్గు అవుతూ ఉండగా ఇల్లు విడిచి నడుస్తూ నడుస్తూ అదే వెళ్ళిపోయినాడు.
2
నిరూపమాదేవి తనజన్మం పవిత్రం అయిందని ఉప్పొంగిపోయింది. భగవంతుడు ప్రత్యక్షమైన భక్తురాలులా తేజస్విని అయింది. ఆమెను ఎవ్వరూ తేరిపార జూడ్డానికి వీలులేనట్లు మిరుమిట్లు కొలుపుతూ ఉంది.
తండ్రి: అమ్మా స్వామిజీ ఎక్కడ?
నిరు: తపస్సుకు వెళ్ళారు నాన్నా!
తల్లి: ఎప్పుడు వెళ్లారు?
నిరు: తెల్లవారుగట్ల. తండ్రి: అమ్మా నీ మొగము అల్లా ప్రజ్వరిల్లుతోంది. నీకన్నులు వెలిగిపోతున్నవి. స్వామి నీకు ఏమన్నా ఉపదేశం చేశారా ఏమిటి?
నిరు: (చిరునవ్వుతో ఊరకుండును.)
తల్లి: అమ్మా నువ్వు పరమేశ్వరుణ్ణి చేరే ఉమాదేవిలా ఉన్నావు. స్వామివారు నిన్ను కటాక్షించారా ఏమిటి?
నిరు: (ఇంకా చిరునవ్వునవ్వుతుండును.)
తండ్రి: ఎంత అదృష్టవంతురాలవమ్మా. పెద్ద పెద్ద వాళ్ళు తల్లక్రిందులా తపస్సు చేసినా దొరకని మహాభాగ్యం నీ పూర్వపుణ్యంవల్ల సమకూరింది.
తల్లి: నా తల్లి పరమపూజ్యురాలు.
3
వేగంతో తరుముకువస్తూ ఉన్న భయంకరమైన సింహం బారినుండి తప్పించుకు పారిపోతూ ఉన్న లేడిలా ఆనందజీ హిమాలయ పర్వతాల్లోకి పారిపోయాడు.
అతనికి ప్రపంచమంతా నల్లపడిపోయింది. పర్వత శిఖరం విరిగి అతనిమీద పడినట్లయింది.
స్వచ్ఛమైన హిమాలయ ఖండాన్నిచూచి నల్లపడికుళ్ళి ఉన్న తన జీవితాన్ని చూసుకున్నాడు!!
ఎందుకు తాను సన్యాసం పుచ్చుకున్నాడు?
బంగారం లాంటి భార్యను విడిచిపెట్టాడు.
ఊర్ధ్వరేతస్కుడని తన్ననుట మహా సత్యమన్న తపస్సు చేశాడు.
ఆలోచించుకొని ఏడ్వడానికిన్నీ మించిపోయిందే యీ దుఃఖం.
అసాధారణవేగంతో కొట్టుకునే ఈ హృదయం ముక్కలై పోరాదూ? జై! ఆనందజీ పాపానికి జై!
ఒక్క ఉరుకు ఉరికాడు. ఎంత దూరం ఆ పర్వతా ఘాతంలో పడ్డాడో! గిరగిర తిరిగాడు.
జయ్యిమని క్రింద దూరంగా ప్రవహిస్తూ పతనాల జలజల ధ్వనిస్తూ ఉన్న నది. దేవదారు చెట్లు, కొండరాళ్ళు, అన్నీ తన్ను చేరడానికి మహా వేగంతో వస్తున్నవి.
ఇంక ఒక్క నిమేషంలో పదోవంతు కాలంలో తల బద్ధలు, దేహం పిండి, మళ్ళీ తనస్వరూపం ఎక్కడా కనబడదు.
శివోహం! శివోహం!
ఆనందజీకి ఆ పతనంలోనే ఒళ్ళు మైకం కప్పి స్మృతి తప్పిపోయినది.
4
నిరుపమాదేవి నానాటికి మహాతేజస్విని అయినది. ఆమెను తేరిచూడ్డానికి ఎవరికిన్నీ చాలకున్నది.
ఆమె మోము ప్రఫుల్లమైంది. కళ్ళలో లోతులు కాంతులు సుళ్లుతిరిగి పోతూ ఉన్నవి. అరమూతలైన నయనాలల్లో ఎంత దివ్యప్రేమ ప్రవహిస్తూ ఉన్నదో? పాటలవర్ణ వర్ఛస్విని అయిన ఆ దివ్య సౌందర్యబాల శలాకలా ఉండేది. నేడామె సంపూర్ణ చంద్రునిలా అయ్యింది.
కుమార స్వామిని సర్వ విశ్వానికి అర్చించపోతూ వున్న దేవి, తధాగతుణ్ణి నెలలు నిండుగా గర్భమందు దాచుకున్న మాయాదేవి, ఆమెదేవకి, కౌసల్య.
ఇంట్లో అందరికి గప్పున వెల్లడి అయింది. గొల్లుమన్నారు. తల్లి నోరు మూసుకుంది, కూతురు మీద పడిఏడ్చింది. "నా తల్లీ, కొంపలు ముంచావే! తరతరాలకి మన కుటుంబాల్లో ముక్తి అనేది లేకుండా చేశావే! అమ్మయ్యో! ఆ సన్యాసి ముండాకొడుకేనా! చిరునవ్వు నవ్వుతావు. అయ్యో! అయ్యో!!"
తల్లి విచారం, ఏడ్పు, కంగారు నిరుపమాదేవికి అర్థము కాలేదు. పవిత్రమైన తన్ను చూసి ఎందుకు ఇంత దుఃఖం. తానేమి తప్పు చేసినది? స్వామి తనకుపదేశించిన మంత్రము పఠించు కొన్నది. ఆ వేళ కుమార్తెను తల్లి తేరిచూడజాల లేకపోయినది.
5
ఇంకొక వారం రోజులకు తండ్రికి తెలిసినది. ఆయన కోపము దక్షునికి రాలేదు; వీరభద్రునికి రాలేదు.
ఎంతటి దుర్మార్గుడు. పాపి! సన్యాసా వాడు? ఛండాలాతి ఛండాలుడు. క్రూరుడు. వాడితల వేయి ముక్కలు చేసి వాడిని మహామాయ వండి భోజనంచేయాలిగాక! రామారామా!
కంట నీరుపెట్టుకుని హోరుమని ఏడ్చినాడు. రామారామా! ఎంతటి ఆపత్తు తెచ్చి పెట్టినా వోయి? పవిత్రమయిన తనకుటుంబానికి వంశానికి, ఇట్టి కళంకమే?
కోపముతో మళ్ళీ మండిపోయాడు. పాడుముండ. ఆ వెధవవాడివల్లో పడింది. ఆడదానికి బుద్ధిఉంటే మగవాడు ఏమి చేస్తాడు. దీనికి ఆ రోజునే బుఱ్ఱ గొరిగించ వలసిందిరా దైవమా! ఆ రాక్షసి వెధవ దానిమీద కన్నువేసి వెధవ వేదాంతాలు చెప్పి అడ్డుపడ్డాడు. ఈ ప్రపంచంలో ఎంత పాపం ఉంది?
ఎల్లాగ తన బ్రతుకు? ఏమిటి కర్తవ్యం! ఈ పాడుపాపిని జీలంలో పడమంటే విషమిస్తే?....?
లేకలేక ఒక బిడ్డ!!! చేతులార ఎట్లాగురా? దైవమా? కుమార్తె దగ్గిరకుపోయినాడు. ఆనందమై ప్రఫుల్లమైన ఆమె మోము చూసేటప్పటికి అతడు గజగజ వణికినాడు. కాశీలో అన్నపూర్ణను చూసినట్లయింది. కొల్హాపురం దివ్యమూర్తి గజలక్ష్మి ప్రత్యక్షమైనట్లయింది. కాశీ ఘట్టపు మహాకాళి. తల్లీ నీవా ఈ పాపంచేసింది. ఇదంతా అబద్ధమేమో? తన భార్య తప్పు అభిప్రాయం పడిందేమో?
“అమ్మా ఏమిటి చేస్తున్నావు?”
"ఏమీలేదు నాన్నగారూ! స్వామి ప్రసాదించిన మంత్రము పునశ్చరణ చేసుకుంటున్నానండీ!”
“వాడి మొగం మండ, వాడిచ్చేదేమిటే మంత్రం వాడితల!”
స్వామి భగవంతుని అవతారం!" “వాడి అవతారం కూల! నా కొంపమాపేడే! బాబూ!"
"స్వామి పవిత్రమైన మహాఋషి!”
“అయ్యో నా తల్లీ! నిన్నూ నన్నూ రౌరవాది నరక కూపంలో దింపేడే! బాబూ! రామా!! దీనికి అర్థంకాదురా?”
“మీరు చెప్పిన వెనక కథల్లో వ్యాసుడు, ధృతరాష్ట్రుణ్ణి పాండురాజును ఎల్లా ప్రసాదించాడు నాన్నగారూ?”
“మ!.. మ!.. ప!....ప!....”
"జన్మం మనస్సు నాన్నా! ఆత్మ! పరమ తేజం అంతా నిండి ఉంటుంది! పాపంపుణ్యం! మనస్సే ఆరోపించుకుంటుంది! నిజం గోచరించుకుంటే! మనస్సు వికల్పం లేకుండా పవిత్ర భావంతో ఉన్నప్పుడు పాపందేనికి నాన్నగారూ!”
“.....” తలవంచుకొని నిలుచున్నాడు తండ్రి.
"స్వామి నాకు భగవంతుడు, సమస్తమూ ఆయన ప్రసాదము. నా గర్భం. వెలుగుతో నిండిఉన్నట్టు నాకు ప్రత్యక్షంగా ఈ కళ్ళకి కనుపిస్తో ఉంటుంది నాన్నగారూ!”
"..........."
“నాకు వచ్చేకలలు పవిత్రమై ఉంటున్నాయి! పవిత్రమైనది పాపం పాపం ఎట్లా? నిప్పుకు అంటున్నదా?
6
మరునాడు కాశీప్రయాణం, కాశ్మీర బ్రాహ్మణ కుటుంబం యావత్తూ. అక్కణ్ణుంచి రామేశ్వరం వెళ్ళుతూ మధుర, చిదంబరం, శ్రీరంగం, కన్యాకుమారి, అనంతశయనం, కంచి, ఉడిపి, తిరుపతి, తిరువన్నామలై, కాళహస్తి, పక్షితీర్థము, తంజావూరు, కుంభకోణం, రాణ్మహేంద్రపురం, జగన్నాధం, దర్భశయనం అన్నీ తిరిగి, అమ్మాయి పురిటికి కాళీఘట్టం చేరుకున్నారు.
ఒక పవిత్రమైన దినంలో, దివ్య ముహూర్తంలో, నిరుపమాదేవికి వెలిగిపోతూ ఉన్న పుత్రుడు జన్మించాడు. పేరు ప్రతిష్ఠా పాడుజేయడానికి పుట్టిన మలినం, మహాపాపానికి చిహ్నంగా పుట్టినముద్ద, ఆ శిశివును హుగ్లీ నదిలో పారవేద్దామని కాశ్మీర పండిజ్జి సంకల్పించాడు. పురుడు వచ్చిన మరునాడు ఎవళ్ళూ లేకుండా పురిటిగదిలోకి వెళ్ళాడు. కుమార్తె బాలకుణ్ణి పక్కను బెట్టుకొని యశోదలా నిద్రపోతూఉన్నది.
ఆ బాలకుడు తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు.
“ఓయి వెఱ్ఱి బ్రాహ్మణుడా, నీకు పిల్లలులేరు. భగవంతుడు ఈ బాలకుణ్ణి నీకు ప్రసాదించాడోయి” అని ఎవరో గంభీరస్వరములు తనచెవిలో పలికినారు.
ఆయన ఉలిక్కిపడ్డాడు.
ఎంతమంది ఎన్ని మాటలంటారో, ఎన్ని రకాలు సృష్టిస్తారో, ఎల్లాగు ఈ పసిపాపణ్ని తన ఊరు తీసుకుపోవడం. ఎంత అపఖ్యాతి? ఎల్లాగు? తలయెత్తి తిరగడం? “దైవమా ఏదయ్యా మా దిక్కు? పరువుగా బ్రతికిన మా కుటుంబం గంగలో కలియడమే?” అయితే పండులాంటి ఈచిన్న పాపను చేతులారా ప్రాణం తీయడమే! అమ్మయ్యో అది మాత్రం తాను చేయలేడు.
తన హృదయం కర్కోటకం కాదు! తాను కటికి వాడున్నూ కాడే! భగవంతుడా దారేది? తెన్నేది?
ఎవరికైనా పెంపకం ఇస్తే!!
ఎవరు తీసుకుంటారు?!
తానే పెంచుకొనాలా???
ఎల్లాగు????
ఎవరి పిల్లాణ్ణో పెంచుకునేందుకు తీసుకువచ్చానంటే ఎవరేమంటారు! దిక్కులేని పాపడు దొరికాడనచ్చుగా!!!!
7
స్వామికి చటుక్కున మెలకువ వచ్చేటప్పటికి ఆ హిమాలయపర్వతం లోతులోయలో ఆఖాతంలో గోడలాంటి ఆకొండచరియలో ఉన్న ఒక చెట్లగుంపులో వ్రేలాడుతూ ఉన్నాడు.
గుబురుగా ఉన్న ఆచెట్లు, ఒత్తయి ఉన్న ఆ కొమ్మలు ఆనందజీని రక్షించాయి.
ఒళ్ళంతా నొప్పులు, తల బద్దలైపోతూ ఉంది. కదలలేకుండా ఉన్నాడు.
తల్లిలా ఆ చెట్లకొమ్మలు అతన్ని ఉయ్యాల లూపినవి.
క్రింద లోతుగా ప్రవహిస్తూ ఉన్న నది సంగీతం పాడుతూ అతనికి ఉపశమనం చేసింది.
“శివోహం! శివోహం!” అన్నట్లుగా ఉన్నది.
నెమ్మదిగా మహా ప్రయత్నంతో కొమ్మల్లోంచి ఆ చరియ తలానికి దిగాడు. ఒళ్ళు దులుపుకున్నాడు. తనతోపాటు పడిన మంచుగడ్డలు కరిగి ఒళ్ళు చల్లగా జిమ్మమని తడిసి ప్రాణంలేచి వచ్చునట్లు చేసినవి. ఆకులు, చిరురెమ్మలు దులుపుకున్నాడు.
పైకి ఎక్కడానికి వీలులేదు. క్రింద దిగడానికి వీలులేదు. భగవంతుడు తన్నిక్కడ ఖైదువేశాడా?
ఏది ఎట్లయితే తనకు భయమేమిటి? అంతంవస్తే అంతకన్న మంచిదే. శివోహం! శివోహం!
శివ! శివ! శివ! హరిః ఓం! ఓం! ఓం!!
పద్మాసనం వేసుకున్నాడు. తపస్సు లోకి దిగాడు.
రెండునెల్లు మహాతపస్సు, రాతిలోరాయి. వాయువులో వాయువు. మంచులో మంచు. మహాతేజస్సు క్రింద ప్రవహించే నది గడ్డకట్టుకు పోయింది.
ఆ శీతాకాలంలో అతను వడకలేదు. సర్వసృష్టి స్తంభించిపోయింది. మహాప్రశాంతం చిదానందం.
అంగుటిలోని రంధ్రం పూడిపోయినది. అంతర్ముఖాన కుండలినీ శృతి! గురుపాదుకలు దివ్యకాంతులతో వెలిగిపోతున్నవి. షట్చక్రాలు దాటి బ్రహ్మరంధ్రం సమీపాన్ని, సహస్రార కమలనాళతీరాన్ని అతని ఆత్మ పరాశక్తిస్థాన ప్రస్థానమైంది. అయిదవ భాగము
శ్రీనగరంలో కాశ్మీరపండితుడు రామానందలాల్జీ పెంచుకుని తీసుకుని వచ్చిన కుఱ్ఱవాడు పండితుని మేడంతా వెలిగిస్తూ బాలకృష్ణునిలా పెరుగుతూ ఉన్నాడు.
నిరుపమాదేవి విగతకేశ యోగినీ రూపందాల్చి పరమ పవిత్రయగు భాగీరధివలె ప్రవహిస్తూ ఉన్నది.
చుట్టాలు పక్కాలు చట్టుపక్కలవారు రామానందలాల్జీకి కలకత్తాలో ఒకబీద కాశ్మీర బ్రాహ్మణ కుటుంబం వారు ఇచ్చిన ఆ బంగారు బాలకుణ్ణి చూచి విస్తుపోయారు.
ఏవో అనుమానాలు పడ్డారుగాని, దివ్యతేజ స్వరూపంతో తపస్వినిలా ఉన్న నిరుపమాదేవిని తేరిచూడ వాళ్ళకు భయము వేసి పోయింది. రామానందలాల్జీ చెప్పిన చరిత్ర ఒక్కరున్నూ అనుమాన పడలేక పోయినారు.
2
నిరుపమాదేవి అంతకన్న తపస్సులో మునిగిపోయింది. శ్రీ స్వామిజీ ఉపదేశించిన ఆమంత్రమే పరమమార్గము, స్వామిజీ గురువు, పునశ్చరణయే యోగము.
తపస్సులో మైమరచిపోయేది, పరవశమై కన్నులు అంతర్దృష్టిచే అర్ధనిమీలితాలూగా, ఆ పూజా గృహంలో అమ్మవారి పీఠం యెదుట కాంచన గంగా శిఖరమువలె యోగముద్రలో ఉండేది. ఆ సమయంలో ఆమెలోంచి ఒక కాంతి బయలుదేరి ఆగది, ఆగది దాటి చావిళ్ళు ఇతర గదులు అంతా ఆక్రమించినట్లు ఉండేది.
ఆమె అందం మరీ ఉత్కృష్టమైపోయింది. ఆమె మాట మరీ తీపి పడిపోయింది.
నిరుపమాదేవి తనగురువగు ఆనందజీ చెప్పిన వేదాంతపు కబుర్లన్నిటికి నిజమైన అర్థం గ్రహించింది. ఆయన ఆదేశానుసారం భగవద్గీత ఎప్పుడూ పారాయణంచేస్తూ, ఆ పరమ పవిత్ర వాక్కులకు నిజార్థం గోచరింప చేసుకునేది.
ఆ సుశీలకు కుమారుడన్న గురుప్రసాదమనే భక్తేగాని, కుమారుడన్న మమతయే లేదు. పాలివ్వదు. ఇతర పరిచర్య చేయదు. రామానందజీకి ఇష్టంలేదు. భయం కూడాను. పెంపుడుతల్లి అయిన అమ్మమ్మయే అమ్మ. ఊళ్ళో ఉన్న అమ్మలక్కలంతా మధ్యాహ్నం రామానందజీ ఇంటికి పల్లకీల మీద, పడవలమీద, నడకలమీద మేలిముసుగులతో వచ్చి నిరుపమాదేవి తన నిర్మలమాధుర్య గళంతో పాడి అర్థము చెబుతూఉన్న భగవద్గీతా రహస్యాలు విని ఉప్పొంగిపోయేవారు. సంస్కృత ఆధ్యాత్మ రామాయణం పరవశయై పాడుతూ ఉంటే వాళ్ళ మనస్సులు ఊగిపోయేవి.
3
రెండేళ్ళకు ఆనందస్వామిజీ మహాతపస్సంపన్నుడై చంద్రశేఖరునిలా హిమాలయ పర్వతం ఎత్తులున్న బండిదిగి వచ్చాడు కాశీపట్టణానికి. తలంతా జుట్టు జడలుకట్టి ఉంది. గడ్డము మీసము పెరిగి ఉంగరాలు చుట్టుకొనిపోయి ఉన్నది. ఆయన ఫాలం దివ్యదీప్తులతో కిరణాలు వెదజల్లుతూంది. ఆయన జాభ్రాగుడ్డలు చిరిగిపోయి ఉన్నవి. ఆయన ఎముకల పోగు. తిన్నగావెళ్ళి గురుస్వామి యతీశ్వరానందజీ కాళ్ళమీదపడ్డాడు. ఆ మహానుభావుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆశీర్వదించి “వత్సా, నీకు జరిగిన అనుభవం పరాశక్తి చిద్విలాసం సుమా! పడిలేచావు. పాపలోకం కళ్ళార పారకించావు. ప్రారబ్ధం విచ్ఛిన్నమైంది. హిమాలయ గౌరీశంకరశృంగం నీకు పూజాపీఠం అవుతుంది సుమా” అని సెలవిచ్చినాడు.
4
ఇంక రెండునెల్లకు ఒక ఉదయాన్న రామానందలాల్జీ జపం చేసుకుంటూండే వేళ ఎదుట ఆనందస్వామిజీ నిలుచున్నాడు.
పండిజ్జి కళ్ళు తెరచేటప్పటికి ప్రత్యక్షమై ఉన్న స్వామిజీని చూసి స్వామిజీని ఆనవాలు పట్టలేక కైలాసగిరి మీద సంచరించే దేవతల్లో ఎవరైనానేమోనని గజగజవణికి పోయాడు. ఆ విగ్రహం అల్లా దివ్యమైన చిరునవ్వు వేయి వాసనలులా ప్రవహింపచేస్తూ నిలుచునే ఉన్నది. పండిజ్జి కళ్ళునులుముకొన్నాడు. శివప్రార్థనా సూక్తాలను వణికే కంఠంతో పఠించుకోడం ప్రారంభించాడు.
ఆనం: పండిజ్జి క్షేమమా మీకు?
రామానందలాల్జీ ఆ గొంతుక ఒక క్షణంలో ఆనవాలు కట్టాడు.
“స్వా.... స్వా... మిజీ!"
“అవును! హిమాలయ పర్వతాలల్లోంచి బయలుదేరి కాశీలో గురుదర్శనం చేసికొని మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళే ముందు మీ దర్శనం చేసుకొందామని ఇల్లా వచ్చాను.”
“ఒక ఉదయాన్ని... ఆనందస్వామిజీ నిలుచున్నాడు”
మొదట జనించిన ఆశ్చర్యభావం మాయంకాగా మిగిలిన మహాకోపంతో పండిజ్జి
“నా కూతురుకోసం కాదుకదా!”
“పండిజ్జి! భగవంతుడు నన్ను మీమ్ములనందరినిన్నీ రక్షించాలి మహాపాపంచేశాను; అనుభవించాను.
“మహాపాపం చేశావు! అనుభవించావు! ఏమి అనుభవించావు? నువ్వు సన్యాసివా, సన్యాసివా? నీబోటివాళ్ళవల్ల మతానికి అపఖ్యాతా?ఛీ, రాక్షసికొడకా, నువ్వు మనుష్యుడవా? నా ఎదుటనుంచి లేచిపో, నీ బుఱ్ఱ చితికేయగలను.”
స్వామిజీ చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. "పండిజ్జి, నేను మీ విషయంలో సలిపిన ఘోరదోషం. ఎట్టి శిక్షకైనా నన్ను పాత్రుణ్ణి చేసింది. మీ ఇష్టం వచ్చినట్లు నన్ను శిక్షించి నన్ను పాపం నుంచి విముక్తుంచేస్తే నేను తమకు సర్వకాలం కృతజ్ఞుణ్ణి.”
"ఛీ ఛండాలుడా! నువ్వు నా ఇంట్లోంచిపో! నీ బుఱ్ఱ వేయిముక్కల కింద కొట్టేస్తా”నని మహారౌద్ర స్వరూపంతో ప్రక్కనున్న కర్రపుచ్చుకొని లేచి స్వామిజీవైపుకు దుమికాడు.
స్వామిజీ తలవంచినాడు.
రామానందలాల్జీ కాళ్ళు ఎవరో పట్టుకొని లాగినట్లయింది. రామానందలాల్జీ తలవంచి చూచునప్పటికి అతని ప్రియ దౌహిత్రుడు, పెంపుడు కుమారుడు పాకుతూవచ్చి “దాదా?” అని ముద్దుమాటలతో చేతులు చాచినాడు. రామానందలాల్జీ భార్య భర్తగారికోపం మాటలు విని ఏమిటా అని వంటింటిలోంచి పరుగునవచ్చింది.
నిరుపమాదేవి తపస్సు చాలించుకొని తండ్రి మాటలు విని అచ్చటకు వచ్చింది.
స్వామిజీ కనులుమూసుకొని తలవంచి అట్లనే నిలుచుండిపోయినాడు, అట్లనే సమాధిలో తన్మయుడై పోయినాడు. అతని ముఖాన్నుంచి వేయి వెలుగులు ప్రసరించినవి. అక్కడ నిలుచున్న వారందరికీ దివ్యసంగీత శ్రుతి వినవచ్చింది.
తన గురువు, తన భగవంతుడు స్వామిజీని చూచి నిరుపమాదేవి పులకరించి మైమరచి, ఆయన పాదాలకడ సాష్టాంగపడింది.
నిరుపమాదేవి తల్లి మేలిముసుగు సవరించుకొని తలవంచి స్వామిజీకి నమస్కారం పెట్టింది.
స్వామిజీ దేహాన్నుంచి ఉద్యత్ చంద్రకోటి ప్రభాకాంతమైన వెలుగు ఆవిర్భవించి ఆ మందిరాన్ని నిండి, గోడలలోంచి ప్రసరించి, విశ్వమంతా వెలిగించింది.
రామానందుని చేతులోంచి కఱ్ఱ కిందపడి పోయింది. అతని మోకాళ్లు పట్టువీడి పోయినవి. భూమిమీద కూలబడి "ప్రభూ, క్షమించు" అంటూ స్వామిజీ పాదాలకడ మూర్ఛపోయినాడు. స్వామిజీ ఆ మహదానంద సమాధిలో నిలుచునే ఉండిపోయినాడు.
“శివోహం! శివోహం!"
హిమపూరిత శృంగాలు, ఎత్తయిన పర్వత సానువులు, నందనవనంతో తులతూగే లోయలు, సువాసనలు వెదజల్లే విచిత్ర పుష్పలతలు, వివిధ శాద్వలజాతులు, వృక్షాలు, దేవదారువులు, నిర్మల నీలాకాశం హిమపాతాలు రంగురంగుల కలయికలు తెలుపు, నీలం.
ఆ దేవ పర్వతంలోనికి చొచ్చుకు పోతున్నాడు ఆనందస్వామిజీ. ఆ హేమంత పవిత్ర దినము పరమ నిర్మలమై, నిశ్చలయై వెలిగిపోతున్నది.
“పరమేశ్వర స్వరూపమైన ఈ మహాపర్వత పంక్తి లోకానికి తపోభూమి, అన్ని మతాలవారు ఇక్కడ ముముక్షువులు కావలసిందే. ఓహో పర్వతేశ్వరా, నీరశ్మి లోకహృదయాన్ని కాంతితో నింపి పులకరింపిస్తున్నది. శివోహం, శివోహం" అనుకుంటూ ఆనందస్వామిజీ అగమ్యమైన ఆ పర్వత భూమిలోకి చొచ్చుకుపోతున్నాడు.
“శివోహం! శివోహం!! శివోహం!!!"
“కదా ద్వైతం ప్రశ్యన్నఖిలమసి సత్యం శివమయం
మహావాక్యార్ధాన మవగతిసమాఖ్యానవశతః;
గతద్వైతాభావ శ్శివశివశివే"త్యేవ విలపన్
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమా.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse