అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/సంధ్యా నృత్యము
సంధ్యా నృత్యము
సూర్యుడు మనోవేగంతో పశ్చిమానికి దిగిపోతున్నాడు. ఆ నీలాకాశంలో నానావర్ణాలు సమ్మిళితం అవుతూ ఉన్నవి. ధూమ్రాలు, నీలలోహితాలు, కుసుంబారుణాలు, శబలాలు అయిన మేఘాలు మీగడతరకల్లా, క్షణక్షణం రంగు మారుతూ, ఆకాశాన తేలిపోతూ, సముద్రతరంగాలలో, నదుల్లో, చెరువుల్లో నీడలారుతున్నవి. తరుపర్ణాలు, పర్వత శిఖరాలు బంగారుపూతతో మిలమిలలాడుతున్నవి.
ఆకాశాన వంగపండుచాయ సూర్యుడస్తంగతుడైనాడు. ఉషాబాల నల్లని చీర యంచులు దెసలు ఆవరిస్తుండగా ఉదయించింది.
యోగనిద్రలాంటి చీకటి ఆవరిస్తున్నది. ఆ చీకటిలో వెలుగు చెట్టాపట్టాలు పడుతూంది. సంధ్యానాదములు, సర్వ కుసుమ పరిమళాల వియత్పథానికి నివేదన లవుతున్నవి.
ఓం, ననతోం, ధిమికిటతోం, ధింధిమికిటనాం కిణికిణీం.
అవి హిమధవళపాదాలు, అరుణ కమలదళాంతరతలాలు. తారకా కాంతులపైన అనంతపథాంచలాలమీద అంటీ అంటనట్లు నాట్యం చేస్తున్నవి. ఆ అంగుళులు సౌందర్య బాలికా ఫుల్లనయిన సౌభాగ్యాలు. పాదరేఖలు మహాత్ముల భావ ప్రవాహర్తాలు. ఆ వేగం తేజోరూపులైన సిద్ధుల సంకల్పం. ఆ తాండవం లయతాండవం.
2
పృథుకల్పాచార్యులు నాట్యమూర్తి. పెదవి కదల్పకే ఎంతటి సూక్ష్మ భావమునైన అభినయింపగలడు. తాండవంలో ఆవేశమూర్తి, నృత్తంలో లయబ్రహ్మ, లాస్యాన గాలికికదిలే కసటు చిగురాకు జొంపము కదలిక, దశావతారాలు, నాగనృత్యం, రాధికా హృదయం, సత్యభామా సంవాదము, వ్రజకన్యాప్రణయము, పార్వతీదేవి తపస్సు, పాలసముద్ర మథనము, జగన్మోహినీఘట్టం, శంపాలతా వేగంతో దేహభంగిమలు, కరప్రసారాలు, హస్తముద్రలు దృష్టి లౌల్యాలు, భావవ్యంజనాలు - పరీమళాలు వెదజల్ల ఆనంద మయుడై, తన్మయుడై కరిగిపోతాడు. వృద్ధుడైనా ఆతని నాట్య శక్తి ఆవంతయు తగ్గిపోలేదు, పృథుకల్పుడు కుమారవీరునకు నాట్యశాస్త్రమంతా నేర్పుతూ ఉన్నాడు. కుమారుడు ఆ దేశానికి ప్రభువు. ఏ పూర్వకర్మ సముపార్జితమైనదో అతనికి చిన్ననాటినుండి నృత్యకళాభిమానము! తడబడే అడుగులు నెలలనాటి ముద్దులతో తల్లి ఒడిలో నృత్యం జేసినాడట! నృత్యమూర్తులగు విగ్రహాలను చూచి మైమరచిపోయేవాడు. నర్తకీనర్తకులు మహారాజైన తననాయనగారి యెదుట నృత్యకళాశేముషీ వైభవము వెదజల్లేటప్పుడు బాలకుడైన కుమారవీరుడు తనివోని గాఢదీక్షతో పారకిస్తూ ఉండేవాడు. తానే యజమానుడైన వత్సరాలలో వివిధ దేశాల నృత్యవిధారాల పారకించి విమర్శించి పూజ్యభావాన పులకరాలు పొందేవాడు. కళయందుండే వెర్రి మమతా కళాప్రేక్షకుడు కావడంతో వదలక, కళాపీఠ పాద సన్నిధిని కళార్థిగా అతనిని సాష్టాంగపడజేసినది.
ఉన్నత వంశంవారు నృత్యకళాకోవిదులగుట మరచిపోయి ఎన్నో శకాలు గడిచినవి. తోటివారి పెదవుల దాగిలి మూతలాడే అపహాస్యపు చీకట్లకు భయపడిన్నీ, సిగ్గుచెందిన్నీ కుమారుడు రహస్యంగా పృథుకల్పునికడ హస్తాభినయం, నేత్ర, గ్రీవ, స్కంధాభినయాలు నేర్చుకున్నాడు. పదగతులు నేర్చుకొన్నాడు. అంగవిక్షేపాలు, హస్త విన్యాసాలు, రస ప్రదర్శన కౌశల్యము - నృత్యవిద్య యావత్తు దీక్షతో నేర్చుకొంటున్నాడు.
పృథుకల్పుడు ఆ మహాపురాన గణికలకు, ఉత్తమవంశ బాలికలకు కూడా గురువై నృత్యభిక్ష సంకల్పించాడు. అరనింద వారిలోకల్లా ప్రజ్ఞాశాలిని యగునర్తకి, ఉత్తమకుల సంజాత, బీదకుటుంబంలో వికసించిన పన్నీటి పువ్వు. యౌవనం బిగువులు తిరిగి మృదువైన ఆమె బాలికాత్వమునాట్యవిద్యలో జవజవను పుణికి పుచ్చుకొన్నది.
పృథుకల్పుని నాట్యమందిరానికి కొన్ని సందేహాలు తీర్చుకోదలచి వెళ్ళిన కుమారుడు, ఆ రోజు అరవింద లాస్యమూర్తి అయిన సమయాన ఆవిర్భవించినాడు. కైశికీవృత్తి మూర్తి అరవింద సిగ్గుతో యవనికాంతరాన మాయమైంది. అప్పుడామె అర్ధవస్త్రపాటలవర్ణస్నిగ్ధమగు వక్షః కాంతిని మరుగుపరచలేని దుకూల లాలిత్యము కుమారుని కంటిపాపలో ప్రతిఫలించింది. ఏడాది ఈడుగల ఏకశాఖామాత్ర కరవీరవృక్షంలా కదిలిపోతున్న ఆమె యౌవనం పరమ మంత్రంలా అతని హృదయానికి అద్దుకొన్నది. కనుమెరగిన మనోహర మేఖలా కాంతుల్ని స్మరిస్తూ, స్తబ్ధుడైన కుమారుడు గురువుగారికి ప్రణమిల్ల మరచిపోయినాడు. పృథుకల్పుని కన్నులు నవ్వుకొన్నవి. కాని ఆయన తన అధరోష్టాంచలాల బిగించుకొని "తెలియపరచని మీ రాక మర్యాద దూరముకాదా” అని కుమారుని హెచ్చరించినాడు.
“నమస్కరిస్తున్నాను; అందుకొని క్షమించండి. ఆ తెరల్లో మూల్య రహితమైన నిధి గుప్తమైనది. ఏ లోకాలనుండి ఇక్కడకు అవతరించిందో?”
"కుమారా! గోప్య ప్రకాశనము శాస్త్ర సమ్మతము కాదు. ఆ ప్రస్తావన అప్రస్తుతమని మనవి.”
"ఈ శిష్యునికడ ప్రచ్ఛన్నము కావలసిన నిగూఢ రహస్యాలు ఉన్నవా? అని ఈ వినయి గురువులను ప్రశ్నిస్తున్నాడు.”
"ప్రభూ! క్షమించు. హాస్యంలోనూ అనృతం ఆడలేను. నిజంగా అది నిగూఢ విషయమే.” 3
అరవింద త్రపామూర్తియై తెరలోనికి పరుగెత్తిన మరుక్షణాన వినవిన సత్యభామావేషాన్ని విసర్జించి రైకతొడిగి చీర ధరించి ఉన్న కొలది మాత్రపు నగలు అలంకరించుకొని, తోటమార్గాన దొడ్డితోవచేరి తనకై ఎదురు చూస్తున్న బండినెక్కి పాడైపోతూ ఉన్న తన భవనాన్ని చేరుకొన్నది.
మహోన్నతిని అనుభవించి చితికిపోయిన ఆ సంసారంలో తండ్రి విచారగ్రస్తుడు. తల్లి భూదేవత. తాను ఏకపుత్రిక. బీదతనంలో గారామున పెరిగిన దురదృష్టవంతురాలైన అందాలకుప్ప. నానాటికి హీనమైపోయిన తన ఐశ్వర్యస్థితిని గ్రహించక అరవింద తండ్రి చంద్రాపతి చిన్నతనంలో కవి, గాయకాది విద్వన్మణులకు ఆశ్రయమిచ్చిన ఉదార హృదయుడు. ఆయన హృదయం నొవ్వకుండ అతనికి తెలిసి తెలియకుండేటట్లుగా ఆబాల్యమిత్రుడైన పృథుకల్పాచార్యుడు తన ఇంటికడనే ఆమెకు సాహిత్యాదికళలు నేర్పుతూ, తనకభిమానవిద్యయైన నృత్యంలో ఆమెను ఉత్కృష్ట కళామూర్తిగా ఒనరించినాడు. చంద్రాపతికి కూతురు వివాహచింత హృదయకంటకమైనది. పదునెనిమిదేండ్ల ఎలప్రాయపు జవ్వని. అందాల నేరి తెచ్చుకొని తనలో హత్తుకొన్న దివ్యబాల. బీదవారికిత్తుమన్న మనసొప్పదు. సంపన్నులకు అర్చింప ధైర్యము జాలదు. ఇతరుల సహాయము అపేక్షించుట అనభిజాతుల వని. ఆపేక్షించకుండా మనుగడ మృగ్యము. అప్పులకై ఆస్తి హారతి కర్పూరములా హరించిపోయింది. తిండికోసము భార్యనగలు నాణ్యరూపాలగుచున్నవి. కుమారవీరుడు తగిన అల్లుడని ఆశ. అడిగి కాదనిపించుకోవడం విషము చేతులారా త్రాగినట్లే.
తల్లిదండ్రుల హృదయం గుర్తింపలేని అమాయక శిశువు అరవిందాదేవి. తనచుట్టూ ఆవరించివున్న బీదతనం చీకట్లను పారకించింది. వెలిగే కన్నులు, కొంచెం మలుపు తిరిగిన చిన్నని అర్ధగరుడు నాసిక, వట్రువలు తిరిగిన పెదవులు కొంచెం నిడుపై పైకి ప్రసరించి ఆమెను ఎప్పుడున్నూ హసన్ముఖిగా చేస్తున్నవి. ఒత్తయి కిందికి వాలిపోతూ ఉన్నది ఆమెవేణీ భరం. పొంకాలు అలంకరించుకొని, మృదులత్వ మూర్తియై సౌందర్యరేఖా సమన్వితయైన అరవింద నాట్యప్రోక్తియైన ఉషాకన్యయే.
4
యవ్వనమూర్తి... మధురా సుందరేశ సదృశ సౌందర్యరాశి... కుమారుడు అరవిందను, ఆనాడు మెరుపుకాలం మాత్రం చూచిన మరుక్షణాన్నుంచీ నిద్రపోడు - ఉప్పెనలా వచ్చి ముంచివేసింది ప్రణయ పయోరాశి.
ఆనాటినుంచీ రాత్రింబవళ్ళు నృత్యమే. “కోమలకరణాంగ నిక్షేపమై కైశికీవృత్తి ప్రధాన”మైన లాస్యంలో ఆ బాలికను అలంకరిస్తాడు. “వృత్తి రహితమైన వివిధ కరణాంగ విక్షేప” మైన వృత్తంలో ఆమె హృదయానికి దూరాననుండి, పాదసమీపాననుండి పూజ ఆ సాయంకాలము జత ఆకులతో మిసమిసలాడు వెదురు దివ్వెలా, శ్వేత పన్నగిలా ఆ దివ్యకన్య నృత్యం చేస్తూ ఉండగా చూచినప్పటినుంచీ తన నర్తనశాల మాట పూర్తిగా మరిచిపోయి అభినయాదుల అభ్యాసానికి పృథుకల్పాచార్యులవారికై తాను నగరంలో నిర్మించిన నృత్యశాలకే వచ్చుట కారంభించాడు.
ఆ బాల మరల తనకు ప్రత్యక్షం కాలేదు. గురువుగారిని అడగ మనస్సు ఒప్పదు. అడగకుండుటకు హృదయం ఒప్పదు. ఆ కళ్ళల్లో కాంతులు ఎక్కువవుతూ ఉన్నవి. శరీరం కృశిస్తున్నది. ఏదో మరచిపోయినవానిలా సంచరిస్తాడు. అస్తమానం తియ్యని లోగొంతుకతో పాటలు పాడుకుంటూ ఉంటాడు. విధి సంఘట్టనా కాండ పటంమాటున వున్న ఆ బాలికామూర్తిని ఉద్వేష్టితవ్యావృత్తి పరివృత్త సంకేతాది హస్త ప్రాణాలతో అరమోడ్పు కన్నులతో ధ్యానిస్తూ -
“ఓ చెలీ నీ వెవరు?
ఓ చెలీ నీ వెవరు?
కలలోని బాలవా
ప్రకృతి వలపుల పాపవా?
వారాసి కెరటాల రేఖవా?
శాంతసంథ్యాసమయ క్షణమవా?
అరుణాంశు చుంబితోత్ఫుల్ల సరసిజూత
హృదయనర్తిత పరీమళవా?”
అని అభినయించాడు.
“మేఘాల తళుకాడుచపలవా?
చుక్కల్లొ మినుకాడు కాంతివా?
తాండవేశ్వరపాద తరుణాంగుళీతాళ
గతిలయల మొలకెత్తు దళమవా?
ఓ చెలీ నీ వెవరు?
ఓ చెలీ నీ వెవరు?
కలలోని భాలవా?
ప్రకృతి వలపుల పాపవా?”
అతి తియ్యని గంభీరకంఠంతో పాడుకుంటూ తాండవము సలిపినాడు.
ప్రఫుల్ల రేఖలతో, పరిస్ఫుట పూర్ణానయన గాంభీర్యంతో వివిధ భంగిమాయుతాంగికాభినయ సుందర శరీరముతో అతడు నృత్యం సలిపే సమయాన అప్పుడే అక్కడకు వచ్చిన అరవింద కుమారవీరుని సందర్శించడం సంభవించినది. అతని కలలోని బాల నవ్వుచూపుల ప్రసరిస్తూ మనోనయనాన ప్రత్యక్షమై ఉండుటచేత, ఆమెనిజస్వరూపముతో సాక్షాత్కరించినా గమనించక, కుమారవీరుడు, చేతులుచాచి సాత్వికాభినయరూప ప్రణయ విరవానన్దము దృశ్యింపజేస్తూ నృత్యము మాత్రము సలుపుతున్నాడు. ఈ బాలుడెవడు? ఎంత మనోహరమూర్తి! ఏమి దివ్యత్వము! నృత్య శాస్త్ర పారంగతుడైన కుమారస్వామిలా వెలుగుతున్నాడు. కొత్త దేశాలనుంచి వచ్చినాడా గురువుగారి దగ్గర నృత్యశాస్త్రము పూర్తిచేసుకోతలచి - ఎన్నాళ్లుగా వున్నాడో? ఇదివరకెప్పుడు చూడలేదే - అని అనుకుంటూ అరవింద అట్లే నిలిచిపోయినది. ఆచార్యులు "తల్లీ! కూచో అమ్మా” అన్నాడు.
5
పృథుకల్పుడు - కుమారవీరునికీ అరవిందకూ సందర్శనము సమకూర్చిన మహానటునికి తన మనస్సులో వివిధ విధాల జోహారు లొనరించాడు.
ఆయన మనస్సులో అరవింద చరిత్ర అంతా జ్ఞప్తికి వచ్చింది. అరవిందాదేవి ఉదయగిరి ప్రభువైన చంద్రారెడ్డి మహారాజు కూతురు. ఆ ప్రభువులు కుమారవీరుని తండ్రిని సకలమండలేశ్వరుని, సార్వభౌముని, రెడ్డికుల దుగ్ధాంబోధి చంద్రుని, అయిన వేమారెడ్డిని ఓడించి స్వతంత్రుడు కా సంకల్పించి ఉన్నాడని దుర్మార్గులు కొందరు చక్రవర్తితో చెప్పడంచేత చక్రవర్తి సైన్యాలు కూర్చుకొని వచ్చి చంద్రాపతిని ఓడించి రాజ్యాన్నుంచి తరిమివేశాడు.
ఆ చంద్రాపతి సభలో మహా పండితుడు, తేజశ్శాలి పృథుకల్పుడు సాహిత్య సంగీత నాట్యాచార్యుడుగా ఉండెను.
తానూ తన మహారాజుతో వారణాశి మొదలైన పుణ్యక్షేత్ర యాత్ర లొనరించాడు.
కుమార వీరుడు తండ్రి మరణానంతరం రాజ్యానికి రాగానే అతడు నాట్య విద్యకు పరమ పూజ లర్పిస్తున్నాడని విన్నాడు పృథుకల్పాచార్యులు.
వెంటనే చంద్రాపతిరెడ్డిని రహస్యంగా కొండవీటికి తీసుకొనివచ్చి, సమయం చిక్కినప్పుడు మహారాజుకు నిజము నివేదింప సంకల్పించినాడు.
పృథుకల్పుడు కుమారవీర మహారాజు ఎదుట తన విద్యచూపినప్పుడు మహారాజాతని పాండిత్యానికి ఉప్పొంగి ఆయనను తన గురువుగా స్వీకరించాడు. ఇది జరిగి ఒక సంవత్సరమైనది.
మహారాజు అరవిందా దేవిని చూచి పార్వతిని చూచిన శివునిలా, లక్ష్మిని చూచిన విష్ణునిలా గాఢ ప్రణయాన మునిగిపోయాడు.
అరవింద మనస్సు అతనిపై లగ్నమైనట్లే సంభాషణ వ్యక్తం చేస్తున్నదని పృథుకల్పుడు ఆనందాన మునిగిపోయాడు.
పరస్పరం తీసిపోవని అందము, ఒకళ్ళొకళ్ళకు తగ్గిపోవని విద్యాజ్ఞానము ఒకండొకళ్ళకు నేర్పదగిన నాట్యకళాదీక్ష.
అరవింద మొదట సిగ్గుపడినా తాను నాట్యం చేస్తూ ఉన్నప్పుడు కుమారుడు ప్రేక్షకుడయి ఉండుటకు పోనుపోను ఒప్పుకున్నది.
ఆమె చూస్తూ ఉన్నదని కుమారుడు తన విద్య అంతా అత్యంత ప్రజ్ఞతో, ఆనందమయ హృదయంతో, అద్భుత శారీరపూరితగాంధర్వంతో, నాట్య నృత్య వృత్తాదులు సల్పుతూ ఉండేవాడు. మొదటి రోజుల్లో అతను చూస్తూ ఉన్నప్పుడు ఆమె సంపూర్ణమైన నృత్య నిపుణత్వాలు చూపించలేకపోయేది. గొంతుక వ్రీడా భారంచే గళాంతరాలనే దాచుకొనేది.
దినాలు, మాసాలు పరువులెత్తాయి. యువతీ యువకులగు ఆ ఇర్వురకూ స్నేహము పూర్ణమై ఒకరొకరి లోపాలు సవరించుకొంటూ ఒకరి నొకరు వుద్బోధించుకుంటూ నృత్యకళానందమయులైపోయినారు.
అరవిందకు కుమారు డెవ్వడో తెలియదు. పృథుకల్పాచార్యులవారిని తానెవ్వరో చెప్పవలదని కుమారుడు వేడుకొన్నాడు.
కుమారుడు లేని ఒక సాయంత్రము అరవింద గురువుగారి పాదసమీపాన్న అధివసించింది.
"స్వామీ! ప్రతిభామూర్తి, ఈయన ఎవ్వరో? విదేశ వాసి, నాట్య కుమార, అభిముఖ్యుడని సెలవిచ్చారు. సంపూర్ణంగా ఆయన వుదంతం చెప్పరూ?”
"అమ్మాయీ! అంతకన్న నీ కెందుకమ్మా? ప్రతి క్రొత్తవారిని గురించీ మనకెందుకు? నాట్యం నేర్చుకోవడానికి వచ్చాడు; నాట్యం నేర్చుకొని తనదారిని తాను చక్కాపోతాడు.”
"అవునండీ ఇంత శేముషి సంపన్నుడు తమకు శిష్యుడు కావడం చాలా ఆనందముగా ఉన్నది. అందుకని ఎవరా అన్న ప్రశ్న ఉదయించింది.”
“నిజమే! ఈ చిత్రసంఘటన నాకున్నూ ఆశ్చర్యాన్ని ఉద్భవింపజేస్తూ ఉంటుంది.”
“ఏ విచిత్ర సంఘటన?”
“ఇద్దరు అపురూపమూర్తులు, విద్యావినయసంపన్నులు ఒకే గురువు వద్ద శుశ్రూష చేస్తూ వుండడం.”
“అందులో ఏమి విచిత్రం ఉంది? ఉత్కృష్ట విద్యాసాగరులయిన తమ దగ్గిర ఎన్ని దేశాల నుండి ఎన్నిరకాలవారు ఎంతమంది రారు? ఇద్దరూ అంటే ఏ ఇద్దరూ ?”
“అనేక 'ఇద్దర్లు' ఉండరు తల్లీ!”
- * * * *
“కుమారసంభవ యక్షగానం నేర్పుతామన్నారు?”
“ఇరువురూ ఒకే యక్షగానంలో అభినయిస్తూ ఉంటే?”
- * * * *
“నాయనగారు తమరిని ఒకసారి వచ్చి కలుసుకోమన్నారు.”
“నీ వివాహ విషయం కాదుగదా?”
“ఏమండీ స్వామీ! నాల్గయిదురోజుల్నుంచి నన్ను ఒకటే వేళాకోళం చేస్తున్నారు, నామీద దయ తప్పిందా?”
ఆమె కన్నుల నీరుతిరిగి తలవంచుకుంది.
“ఆఁ! ఆఁ, అదేమిటమ్మా అరవిందా! ప్రాణసమానమైన నా బిడ్డతో ఇంచుక హాస్యమాడి కాస్త నవ్వుకోకూడదా!” అంతట ఆమె మంచుబడ్డ పూర్ణచంద్రునిలా వికసించిన మోముతో, నవ్వుతూ గురువుగారి పాదాలకు నమస్కరించింది.
పృథుకల్పాచార్యు లా బాలను అవ్యక్తస్వనముతో “దీర్ఘాయుష్మతీభవ, దీర్ఘసుమంగళీభవ, సత్వర వివాహ ప్రాప్తిరస్తు!" అని చేయి తలపై ఉంచి ఆశీర్వదించి పంపాడు.
ఆ రాత్రంతా అరవిందకు నిద్రపట్టదు. గురువుగారి ఆశీర్వచన వాక్యాలు గానంలా, ఉరుములులా ఆమె హృదయంలో ప్రతిధ్వనిస్తున్నవి.
6
కుమారునికి నానాటికి ప్రేమ ఆవేశరూపమైంది. అరవిందను తలవని, అరవిందాదేవిని పూజింపని నిమేషమైనాలేదు. మహాలక్ష్మి భావాత్మకంగా అరవిందాంకితమైన దరువులు, పదాలు ఎన్నేని రచించుకుంటున్నాడు. అభినయించుకుంటున్నాడు.
నాట్యకళాభిమానంతో కుమారవీర మహారాజు తన నగరంలో ప్రతి ఏడూ సంక్రాంతి పండుగలకు నృత్యవిద్యా ప్రదర్శనం ఏర్పాటుచేసి బహుమతు లిస్తున్నాడు.
నర్తకీ నర్తకులనేకులు దేశదేశాలనుండి యాత్రలు సాగించి ప్రకృతి దేవీ సువర్ణోత్సవానికి విజయంచేసి, తమ విద్యానైపుణ్యం ప్రదర్శించి, బహుమతులంది, విందులారగించి, ఉత్సవంలో మైమరచి, తాండవించి వెళ్ళుతూ ఉంటారు.
ఆ సంవత్సరం పండుగలకు కుమారుని నగరానికి - ప్రసిద్ధినంది, కీర్తికాములయిన నటీనటకులు విడివిడిగా, జట్టు జట్టులుగా విజయం చేసినారు. నగరమంతా అలంకరించినారు. ప్రభుసేవకులు అప్రమత్తతతో అందరికీ విడుదులు చూపినారు, బహూకరించినారు.
విద్యాదక్షులైన పండితులు పరీక్షకవర్గంగా నియమింపబడ్డారు. సభ రసజ్ఞులతో, పండితులతో, వీరులతో, విద్యావంతులతో, ప్రభువులతో, సంపన్నులతో, ఉద్యోగులతో నిండి ఉన్నది. వనితాలోకం వివిధాలంకార భూషితమై భూమిమీద కవతరించిన ఇంద్రచాపంలా వెలుగుతున్నది.
తమ ప్రభువగు శ్రీశ్రీ కుమార వీరవర్మ కూడా నాట్యకళా వైదుష్య ప్రకటన చేయగలడన్న వార్త ఎవ్వరికీ తెలియదు. ప్రభువు తన పీఠం మీద లేడు.
నాట్యకళలో ఆంధ్రుల ప్రజ్ఞ అప్రతిమానం. బ్రాహ్మణ కుటుంబాల వారీ దివ్యకళను అవలంబించి భారతీయలోకాన్ని మెప్పించి మహారాజుల సన్మానాన్ని పొందుతూ, చక్రవర్తుల ఆదరణలు సముపార్జిస్తూ, లోక విఖ్యాతిని అందుకుంటూ, అగ్రహారాలు అనేకం గణించుకున్నారు. ప్రభువులున్నూ ఈ పవిత్ర కళయందు తమకున్న అభిమానంచేత నర్తకులై దివ్యానందం పొందుతూ ఊగిపొయ్యేవారు. ఆ ఉత్సవంలో సభ కిటకిటలాడి పోయింది.
వేణులు, వీణలు, మృదంగాలు ప్రతి వాయిద్యాలు ఒక్కసారిగా మోగినవి. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ కళానైపుణ్యం లాస్యములో, నృత్తములో, తాండవంలో, నాట్యంలో అభినయ పూరితంగా భరత విద్యలో ప్రదర్శిస్తున్నారు. దేశ్యాలయిన సాంప్రదాయాలు, వివిధకాల సాంప్రదాయాలు ప్రకాశిస్తున్నవి.
కిరీటాంగద కేయూరకంకణకంఠహార శృంఖలాలతో కళ లుట్టిపడువేషాలు, మంజీరకింకిణీరవాలు తాళగతులవుతున్నవి.
రంగు రంగుల దుకూలాంతరీయాలు - అంచులతో మెరుముల్లా లలితములవుతున్నవి. ఒక్కొక్కరి నాట్యాలే పూర్తియైన తర్వాత ఒక బాల నటుడు రంగస్థలంలోనికి అవతరించాడు. అతని తేజస్సు రంగస్థలమున్ను మహాసభయున్ను నిండిపోయింది. అతనిమూర్తి అనంత సౌందర్య యుతము, అతని రేఖావిలాసాలు సుధాకరకిరణ ప్రసారాలు.
"చిది చిద్విలాసుడా ఆ - ఆ - రాఘవుడు ఊ - ఊ - సీతామనోహరుడు - ఊ - ఊ - వెడలెను -”
అని ఎత్తుకున్నాడు.
“తకిటికాతోం, ధిం ధిమికిట తోం తోం" మృదంగం పలికింది.
ఒక గంతున రంగమధ్యస్థలానికి తేలి
"వెడలెనూ విశ్వామిత్రుని
యాగరక్షణకు వెడలెనూ
శ్రీరా - ఆ-ఆ మూడూ వెడలెనూ అడవులకూ”
అప్పుడాతడు శ్రీరామచంద్రుడే. దివ్య వినీలకాంతులు చంచలిత హాసాంచల సాత్వికాలలో, పరిప్లావితభ్రూయుగ్మ వ్యంజనాలలో భమితహస్త విన్యాసాలలో భంగరచితాంగ విక్షేపాలలో కలిసి, వెలుగునీడలై మహాశ్రుతులయినవి.
సర్వలక్షణలక్షితు డా బాలనటుడు రంగస్థలంలోకి రావడంతోనే అందరి హృదయాలూ చూరగొన్నాడు. అందరు అతనియెడ వినమ్రులైనారు. అతని ఆట పూర్తియైనది. సభ్యుల హర్షధ్వనులు గోపురాల ప్రతి ధ్వనించాయి. అతడు మహావీరుడు.
తన మిత్రుని భరత కళాప్రజ్ఞ తనకు పులకరాలు ఉద్భవింపచేస్తూ వుండగా అరవింద కరిగే కన్నులతో అతన్ని తనివోవ పారకించింది, అతడు అమిత హర్షాశ్రులతో అరవిందవైపు చూడ్కులు ప్రసరించి చిరునవ్వులు వెదజల్లాడు
7
ఆ వెంటనే ఇంకో యువకుడు రంగస్థలంలో ప్రత్యక్షం అయ్యాడు.
అతని శరీరకాంతి తప్తకాంచనము, అతని భూయుగ్మం మధ్య చంద్రుని కాంతులు వెలుగుచున్నది.
అతని చతుర్విధాభినయాలు పరిష్కృత సాంప్రదాయీతీతమైన ఒక వినూతన నృత్యవిధానజనితాలు.
వృత్తిరహితమయిన్నీ, సర్వవృత్తిగర్భితమైన నృత్తం సలుపుతున్నాడు. అతనికంఠ మెట్టిదో, రసవిషగంధక సంకీర్ణమైన ఏ ఔషధసేవ చేసినదో! మధురాతి మధురమై, ద్వాదశార్కానుభూతమైన వేదపనసను ధ్వనింపచేసే స్వరకల్పనలో సమస్త జగత్తూ నిండినట్లయినది.
సభ నిశ్శబ్దము. సభాహృదయాలు, ఆత్మలు పూవులై కర్పూరాలై ఒక్క పరమ నివేదనై పోయినవి.
ఆ కొత్త యువకుడు విజయుడు కాక ఎట్లు? జయధ్వానాలు గంభీర కల్లోలదృశంగా విరుచుకొనిపడినవి.
- * * *
"ఎవరో హో యీ మహాప్రజ్ఞి!"
“ఎవరో ఈ పరమాద్భుత నటకుడు."
అని సభా హృదయాలు ప్రశ్నలు చేసుకొంటున్నవి.
- * * *
అరవిందకు తా నేమవుతున్నదీ తెలియదు. మహా మనోహర సుగంధ ఝరీ వేగాన కాలునిలువక కొట్టుకుపోతున్నట్లు కలగాని కల.
అప్రయత్నంగా లేచి రంగస్థలం వెనకవున్న నేపథ్యశాలలోకి చొచ్చుకుపోయింది.
“ఏమా? ఈ విపరీత” మనుకుంటూ చంద్రాపతి ఆమె వెనుకనే వెళ్ళినాడు. నటకులు, సభ్యులు తండతండాలుగా ఆ నూత్ననటుణ్ణి చూడడానికి నేపథ్యశాలను చుట్టివేస్తున్నారు.
ఇందరు చూస్తున్నారని గుర్తులేదు. ఎవరు ఏమనుకొందురో అన్న భీతిలేదు. సహజ మాధుర్యగుణమైన సిబ్బితి వదిలి గంభీరమూర్తి, వెడద ఉరుమువాడు, దీర్ఘబాహువులవాడైన ఆ విలాస నటునియొక్క సౌందర్య రేఖాకారాలైన పాదాలకడ మోకరిల్లి మూర్ఛపోయింది.
ఒక్కుమ్మడిగా పృథుకల్పాచార్యులవారు, కుమారవీరుడు, చంద్రాపతి ప్రభువు, ఆ క్రొత్త నటకుడు అందరు అరవిందాదేవిని లేవనెత్తుటకు ఆమెదగ్గరకు వ్రాలారు. కుమారవీరు లా బాలను ముందుగా విష్ణువు భూమి నెత్తినట్టు ఎత్తి ఆ సమ్మర్ధంలోంచి తీసుకొనిపోయి ప్రాసాదాంతఃపురములో దాసిజనాలచే పరిచర్య చేయిస్తున్నాడు. సభలోనున్న ప్రభువైద్యుడు, ఆజ్ఞ రా లోనికి విచ్చేసినాడు.
అరవిందకు తెలివి వచ్చినది.
తెలివి వచ్చేటప్పుడు "ప్రభూ" అని వైద్యుడు తనస్నేహితుడైన నాట్యకుమారుణ్ణి పలకరించడం విన్నది. ఒక దాసీని రహస్యంగా అడగగా 'వారుకుమారవీర మహారాజుగా”రని ఆమె జవాబు చెప్పింది.
అరవిందకు త్రపయు, పౌరుషము, పట్టరాని కోపమూ వచ్చినది. 'ఇన్నాళ్ళు ఈ మాయావి మారుపేరుతో తన ప్రాభవం దాచుకొని నా చనువు నాసించినాడుగా! గురుదేవులైనా నా కీ రహస్య మించుకంతయినా సూచింపరయిరిగా! ప్రభు గౌరవం వారిని చెప్పనిచ్చినదికాదు కాబోలు. నా పేదతనం కదా ఈతనికి నన్నింత చులకనచేసింది. చంద్రాపతి కూతురు కపటానునయాలతో సమీపించదగ్గదా? గురువుగారు నాకీ రహస్యం దాచిపెట్టడం చూడగా ఇది వీరందరు కలిసి చేసిన కుట్ర కాదుగదా. ఇంకో సంపన్నుల యాడుబిడ్డ నీతడిట్లు అనుసరింపగలడా? అంటూ ఒక్కుమ్మడి భావపథాన విద్యుద్వేగంతో యెన్నియో తలపోతలు పాటుపోటులు కాగా ముద్దరాలయిన అరవింద, తన అభిజాత్యం, అభిమానం రక్షించుకోడాని కది తరుణం అని యెంచి, తన మనస్సే తానెరుగలేని ఆవేగంతో కంపించి పోయింది.
ఏమది? మహారాజు ప్రచ్ఛన్నుడై మాయతో తన చనువు ఆశించినాడా? ఆయన ఉద్దేశమేమి? హృదయస్సంక్షోభంతో నిదానమైన ఆలోచనలేని అరవిందాదేవికి ప్రభు వేదో దురుద్దేశంతో తన స్నేహం చేశాడన్న కోపం పొంగి పొర్లిపోయింది. తన పేదతనంకాదా ఇంత చులకనచేసింది. తనతండ్రి మాత్రం మహారాజు కాడా? విధివశాన రాజ్యం కోలుపోయినంత మాత్రాన తాను హీనురాలయిందా? ఏదో కుట్ర, ఏదో మాయ తనచుట్టూ మహారాజల్లినాడు.
నాట్యవిద్య మహా నటేశ్వరుని పూజ అనే ఆమె భావం. అందుకు తనజీవితం ఎందుకు నివేదన చేయకూడదు? ఈ మహారాజుల్ని, ఈ హీన సంసారాన్ని నమ్ముకోవడంకన్నా ఆ మహానటు డెవడో అతనికి తన బ్రతుకు అప్పగించడం ఉత్తమం అని భావించుకొన్నది. ఒక్కుమ్మడి భావపధాన విద్యుద్వేగంతో యెన్నో తలపోతలురాగా, లలితాంగి అరవింద తన అభిజాత్యం అభిమానం రక్షించుకొనడానికి అది తరుణం అనిపించి, తనమనస్సే తా నెరుగలేని ఆవేశంతో కంపించిపోయింది.
మనస్సులో ఉన్న కుమారవీరునిబింబం వికృతమైంది. ఆ అపరిచిత నటశేఖరుని దివ్యరూపం హృదయాంతరాలలో స్ఫుటకాంతిపూరితమై ప్రత్యక్షమయింది. ఆ అలౌకిక నృత్యకౌశల్యం దివ్యునకుకాక ఎవరికి ఉంటుంది? ఆమె హృదయం రక్తిమాతిరక్తిమమై మెరుపుతీగలా చంచలించింది.
తన సర్వస్వం ఆ నూతననటుని పాదాంబుజాల కేల సమర్పించుకోకూడదు? పూజచేస్తూ శిష్యురాలై అతన్ని అనుసరించడం మహాభాగ్యం.
జేవురించిన తన ముఖరక్తిమా మాధుర్యాన్ని, తన చూపులలోని ఏవో చలితాగ్నిశిఖలను చూస్తూ మ్రాన్పడి నిలచిన కుమారవీర మహారాజునకు ఒక వీక్షణమైనా ప్రసాదింపక చివుక్కున లేచింది. అరవింద విసవిస నడచి పోతున్నది.
చంద్రాపతి రెడ్డిప్రభువు "అమ్మాయీ! ఎక్కడికమ్మా" అంటూ వెంటనంటి పోతున్నాడు; ఆమె తన తండ్రిగారి ఆవేదనా పూరితమైన కేక వినిపించుకోక నడచిపోతున్నది.
అప్పటికప్పుడే రాత్రి మూడుయామాలు గడచిపోయినాయి. సేవకులు అరవిందాదేవికి దారి చూపడానికి వెండి కాగడాలతో, కూడా పరువెత్తుచున్నారు. వెన్నంటివచ్చే తండ్రివంక, కుమారునివంక తిరిగి చూడక వినవిన నడచి పృథుకల్పాచార్యుని గృహం ప్రవేశించింది.
గురువుసరస కూర్చున్న నాట్యమూర్తిని దూరాన్నుంచే చూచింది. ఆమె ముగ్ధహృదయం దడదడ కొట్టుకున్నది. ఇంతలో ఆ అపరిచిత సుందర దివ్యమూర్తి తన్ను గాంచి, చిరునవ్వు చంద్రికలు వెదజల్లుచు దగ్గరకు రమ్మని తల ఊపాడు.
ఆమె సర్వాంగాలు చిరుచెమ్మటలతో ప్రాతస్తుషార్ద్రా పుల్లకుసుమాలై పోయినవి. పారవశ్యాన అడుగులు తడబడ ఆ నటకుని సమీపించి సాగిలపడ్డది.
"ప్రభూ! అవిదితానురాగమైన నా హృదయమూ, నా జన్మా ఈ క్షణం వరకూ మీ కొరకే మీదుకట్టబడి ఉందేమో! ఈ అజ్ఞాత బాలికకు నీ పాదదాస్య మనుగ్రహింపవా?” అని బాష్పరుద్ధకంఠియై పలికింది.
ఇంతలో అచ్చటికి ఆమె ననుసరించివస్తున్న కుమారవీర చంద్రాపతులు లోనికి రావడం ఆ నూత్ననటుడు చూచి, తనచేరువ సాగిలపడి ఉన్న అరవింద నుద్దేశించి “అమ్మాయీ నీ వీ కుమారవీరుని ప్రేమించుట లేదా?” అని ప్రశ్నించాడు.
అరవింద మాటాడలేదు.
“ఏమమ్మా పలుకవు” అని అతడు హెచ్చరించాడు.
అరవింద “ప్రభూ! ఈ అభాగిని రాజప్రసాద మహితైశ్వర్యాన్ని కన్నెత్తి చూడజాలదని కుమారవీర మహారాజులుంగారు ఎరుగుదురు. కలలోనైనా నాకటువంటి లోభం పొడమకుండా వారు తమ అభినయం వల్ల ధ్వనియుక్తమైన కట్టుదిట్టాలు చేశారు. నిన్నుకదా నేను శరణుచొచ్చాను. వారిమాటెందుకు స్వామీ?” అని కంటనీరు జలజలరాల పలికినది.
అసూయావిషాదాలు హృదయాన్ని ఆవరించి కుమారవీరుని మోము జేవురించింది. ఎంత శిల్పి అయినా, ఎంత మృదు హృదయుడైనా ప్రాణాధికయైన తన ప్రేయసి తన కళ్ళయెదుట ఎవరో ఊరుపేరులేని ఒకనికి అట్లు తన్నర్పించుకొంటూ ఉంటే సహింపగలడా?
ఈ బాలిక తన్ను ప్రేమించింది అని పరవశత్వం పొందాడు. ఆమె ఎవరైనా తన మహారాణిగా చేయాలని సంకల్పించాడు. వారిద్దరూ నాట్యంలో సతీపరమేశ్వరులులా, రాధికాకృష్ణులులా వారు ఒకరికోసం ఒకరు, తమకోసం తామిద్దరూ నాట్యాలతో మహితానుభూతితో ఆనందపరమావధిలో లయమై పోవాలనుకున్నాడు ఆ యువప్రభువు.
ఈ బాలిక తన్ను ప్రేమించనేలేదా? ఇన్నాళ్ళు తాను రిత్తకోరికలతో దివాస్వప్నాలు కంటున్నాడా? ఆ సుకుమార హృదయము అంటే తనకున్న ఆ మహాపవిత్రభావం వల్ల తన నిజస్థితిని గోపనం చేయటం ఎంత తెలివి తక్కువపని. ఓహో! ఈ దివ్య సుందరాంగి తానెవరో తెలిసికొని, తన నిజ స్థితి తెలిసే వేరుగా తలచి ఎంత కించపడిందో?
ఇన్నాళ్ళ తమ సాహచర్యం, తమ సహాధ్యాయత్వ మాధుర్యం ఎంతలో కరిగిపోయింది? గాఢమైన స్త్రీ హృదయం ఎవరు తెలిసికోగలరు?
కళాపూజ్యోన్మాదంచేత ఈ నవీనాగతుణ్ని పూజలు చేసినాడు తాను. ఈ తన పవిత్రభాగధేయమని ఎంచుకున్న అరవిందాదేవి రాజ్యం పోయిన చంద్రాపతి ప్రభువు తనయ అని తనకు తెలిసింది. అరవింద తన హృదయాన్ని పూలమాలతో అలంకరించే ముహూర్తంలో చంద్రాపతి మహారాజుకు ఉదయగిరి రాజ్యం తొల్లింటి సర్వస్వాతంత్ర్య దేశంగా అర్పించాలని తాను గురువుగారితో కుట్రచేయడము దోషమా? ప్రభూ! అనంత తాండ వనర్తిత సుందరపాదా! ఏది తనకు దారి! ఈ కొత్త నటుని వలచి అరవింద తనకు కానిదై పోవునా ప్రభూ!
కుమారవీరు డిట్లు తలపోతలకు జిక్కి ఇతికర్తవ్యతా మూఢుడై నిలుచున్నాడు.
ఆ నూత్ననటమూర్తి: ఓ వెఱ్ఱితల్లీ! నీలేత హృదయానికి అనంత గంభీర ప్రేమయొక్క లోతులు ఏమి తెలుస్తాయి? నన్ను ప్రేమించడం దుష్కరం. దేశదేశాల్లో ఎడారుల్లో తిరిగినచోట తిరక్కుండా తిరుగుతుంటాను.
అర: సమస్తమూ వదలి మీతో ఎక్కడికైనా సరే మీ నీడను అనుగమిస్తా ప్రభూ! నన్ను పరిగ్రహించు! ఇతరం నాకేమీ వద్దు.
కుమా: స్వామీ! నువ్వెవ్వరివో నాకు తెలియదు. నేను ఈ దేశ ప్రజలకు రాజును.
నూత్న: అవునయ్యా! అవును. నీకు భరతవిద్య అంటే పరమ ప్రీతి! నువ్వు ఈ మహారాజ్యం అంతా వదలి నాతోరా. నీ ఊహకు, నీ జ్ఞానానికి, నీ శక్తికి అతీతమైన మహోత్తమ దివ్యనాట్యవిధానాల నిన్ను అత్యంతోతృష్ట విద్యావంతుణ్ణిగా జేస్తాను.
కుమా: స్వామీ! ఏమిటి తమ ఆదేశం?
పృథు: స్వామీ! నేను సమస్తమూ తెలిసినవాడనని గర్వపడినాను. ఈ భువనంలో నాతోటి సమానప్రజ్ఞాయుత కళాస్రష్ట లేడని విర్రవీగాను. నీ నాట్యముచూచి మహాక్రోధవంతుడనయ్యాను. అనేక దోషాలున్న కుపండితుడు వనుకొన్నాను. నేను నా అజ్ఞానానికి తలవంచుకుంటున్నాను. నన్ను నీతో తీసుకొనిపో. నీకు శిష్యాతిశిష్యుణ్ణయి ఏకదళంమాత్రం నేర్చిన నాట్య విద్య నీవద్ద పూర్తిచేసుకుంటాను.
నూత్న: మంచిదయ్యా, పృథుకల్పాచార్యా! నీకు నా నమస్కారాలు, నువ్వు నాకు తగినవాడవయ్యా! లే! ఈ యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించిన్నీ తమ ప్రేమ తాము గుర్తింపలేని యౌవనమదాయత్తులు. వీళ్ళకు కళ యేమిటి? కళారాధన ఏమిటి?
అరవింద: ప్రభూ! ప్రభూ!
కుమా: స్వామి! నేను దిగ్భ్రమలోపడ్డాను. ఏదో నిస్సహాయత, ఏదో పరవశత్వము నన్ను ముంచివేస్తోంది. ఈ అరవిందాదేవి నీకు పాదాక్రాంత అయింది.
నూత్ననటుడు: ఓయి వెఱ్ఱివాడా! అరవిందకు నువ్వోయి సూర్యుడవు. ప్రేమకూ కళకూ అనంత రహస్య సంబంధముంది! పృథుకల్పాచార్యా! మృదంగం ధరించు. అరవిందా! వీణ తాల్చు. కుమారా! వేణు.
ధిం ధిమికిటతోం! తోం తోం!
అతని నవ్వులు సంపూర్ణజ్యోత్స్నాసహస్రాల గర్భీకరించుకొన్న వెలుగు లయినవి.
అతని కాళ్ళను బంగారుమువ్వలు 'కింకిణకిణాంకిణాం' అని ధ్వనించినవి. ఆయన ఒక అద్భుత భంగిమ తాల్చినాడు.
పృథుకల్పుని మృదంగం, అరవింద వీణ, కుమారుని వేణువు, ఆ గతికి సమన్వయ లయరూపం తాల్చింది. కేదారగౌళరాగిణి ఆవిర్భవించింది. ఉదయాద్రిపై అప్పుడే అరుణాలవుతున్న ఉషఃకన్య చేలాంచలాలు గాలిలో దిక్కులలో ప్రసరించినవి.
కోష్ఠాలలో గోమాతలుచేపుబరువున అంబా అని వత్సముల పిలుస్తున్నవి. దేవాలయ ఘంటానాదము లాప్రత్యూష వాయువులతో కలిసి వీతెంచుతూ ఉన్నవి.
మందిరగవాక్షాలలో తోటయున్నూ, తోటవెనుక తోటకు యెరుపు రంగు అద్దుతూ ఉన్న ఉదయ సంధ్యారుణ కాంతులున్నూ విప్పారిన నేత్రాల నిండుతున్నవి. పక్షులు సా, రీ, గా, మా, పా, పా, మా, పా, సా అని పాడుతున్నవి.
ఆ నటుని నాట్యమునందు కరణాలు మూడయినవి.
ఆ మందిరాన కుడ్యాలు, స్థంభాలు, తోరణాలు మాయమైపోయినవి. హిమవన్నగ శిఖరాలు దవుదవ్వుల తోచినవి. శీతలవాయువులు ప్రసరించినవి. పవిత్ర పారిజాత పరీమళాలు కలయంపులై వారలైనవి.
అప్రయత్నంగా అరవిందా కుమార పృథుకల్పులు తమతమ వాద్యాలు మ్రోయింప మానినారు. చంద్రాపతి ఒక దివ్యనాట్యసృష్టి చూస్తూ మ్రాన్పడి నిలుచున్నాడు.
ఆ దివ్యనాదాలు కిన్నరీస్వనాలు, మహతీ వీణానాదాలు.
ప్రవాళరజోమిశ్రితసముద్రకల్లోల శిఖరనర్తితఫేన సదృశ్యాలై ఆ నటుని పాదాలు ఆడిపోతున్నవి. ఆకాశసంచారంచేత విహంగవశ సంచాలన సుందరాలై భౌమ్యచారపల్లవ సుఖగాలై లోకాల నాడిస్తున్న వా పాదాలు.
సితకుముదవల్లులై గజశుండాదండాలై అతని హస్తాలు ప్రచలనవేగ విధూతాలౌతున్నవి. పల్లికతావై అతని దృష్టులు భూమ్యాకాశాలు ఏక వీక్షణంలో లోగొంటున్నవి. అతని రేచిత భూవిలాసాలు పృథగ్భావావిష్కరణాలవుతున్నవి.
ఆ వికసించునది జగత్కల్యాణ పద్మరాగ్యోజ్వల కాంతి.
ఆ నృత్యం ఉదయ సంధ్యా నృత్యము.
“అంగికం భువనం యస్య
వాచికం సర్వవాఙ్మయమ్
ఆహార్యం చన్ద్రతారాది
తన్నమ స్సాత్వికం శివమ్”
అంటూ వృద్ధులయిన పృథుకల్ప చంద్రాపతులునూ కళావేశులైన అరవిందా కుమారవీరులున్నూ భక్తితో ప్రణమిల్లినారు.
కరిగిపోతూ ఉన్న ఉదయారుణ రక్తిమలో మహానటుడు లీనమై పోయినాడు.
“అరవిందా కుమారులారా! రాగరంజితమైన మీ అలౌకిక దాంపత్య వసంతము భరత సంప్రదాయవల్లికి క్రొంజివుళ్ళు వెట్టుగాక” అన్న ఒక దివ్యస్వరం వారికి వినిపించింది.
సూర్యుని రథం మహావేగంతో కాశ్మీరజారాగాలు వెదజల్లుతూ యువయుగ్మదివ్యాను రాగంలా ఉదయించింది.
నాట్యశాలాంతరాన ఎట్టయెదుటనున్న నటేశ్వర పీఠానికి అరవిందా కుమారులు నిమీలితనయనాలతో ప్రణమిల్లారు.
అప్పుడు పృథుకల్పాచార్యులు
“లోకానాహూయ సర్వాన్ డమరుక నినదైః
ఘోరసంసారమగ్నాన్
దత్వాభీతిం దయాళుః ప్రణత భయహరం
కుంచితం పాదపద్మం
ఉద్ధృత్యేదం విముక్తే రయన మితి కరా
దర్శయన్ ప్రత్యయార్థం
బిభ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం
యస్సబోయాన్నటేశః”
అని విముక్త గంభీర మధుర కంఠంతో కీర్తిస్తూ సాష్టాంగ పడినాడు.
ఒక్క ముహూర్తం నిశ్శబ్దాన తేలిపోయింది.
అవ్యక్తానేక భావశలభమైన నెమ్మోముతో నిలిచి ఉన్న అరవింద యెదుట కుమారుడు మోకరిల్లి,
"దేవీ! నా అపరాధ సహస్రం విస్మరించి నన్ను ఏలుకోవా?” అన్నాడు.
అరవింద తప్రాపతియై మాటాడలేక తలవంచి నిలుచున్నది.
కుమారు: దేవీ! నీవు ఒల్లని ఈ మహారాజ్యం నాకు పరిత్యక్తము.
చంద్రా: మహాప్రభూ! నా దురదృష్టబలం వల్ల నాపై విరోధులు సలిపిన కుట్రవల్ల తమ జనకుల అనుమానానికి గురై రాజ్యం కోలుపోయి ప్రచ్ఛన్నవేషంతో ఇక్కడ వుంటిని.
కుమా: మహారాజా! తమ చరిత్ర అంతా మా అమాత్యుడు నాకు తెలియజెప్పినాడు.
తమ రాజ్యం అంతా ఎప్పటియట్లు తమ ఛత్రచ్ఛాయల నిండించండి. ఈ కుమారుడు తమకు అన్ని విధాల బాసటే.
పృథు: మహాప్రభూ! రాజ్యం తిరిగి సంపాయించడంకన్న శ్రీ చంద్రాపతి మహారాజులుంగారు తమ్ము జామాతగా కోరిన సముద్రుడు తపస్సు చేసినట్లు కోటేశ్వరుని ప్రార్థిస్తూ ఉండేవారు ప్రభూ!
అర: ప్రభూ! ఈ మందభాగ్య మిమ్ము తనకు తెలియని ఆవేశంలో....
కుమా: దేవీ, నీవు ఒల్లని ఈ మహారాజ్యం నాకు మాత్రం భారం కాదా? పరమ నటేశ్వరాజ్ఞ పాలించడానికి నా దేశమే మనకు ప్రతిబంధకమైతే నేను అది అంతా త్యజించి కేవలం నన్నే అర్పించుకొంటాను. అనుగ్రహించవా?
"ప్రభూ! మీ దివ్య ప్రేమవాహినిలో నాకు నిలకడ చిక్కడంలేదు” అని అంటూ అరవిందాదేవి ముత్యాలకన్నీరు ఆనందకాంతిలో మిలమిలలాడమోకరిల్లి ఉన్న తన హృదయాధినాధుణ్ని కోమలహస్తద్వయ పల్లవాలతో స్పృశించి లేవనెత్తినది. కుమారుడులేచి సర్వమూ మరచి తనజన్మ సహస్రాపుణ్యాల నృత్య తపస్సు పుంజీభవించిన అరవిందను తన వెడద రొమ్మున బిగికౌగిటహత్తుకొన్నాడు. త్రపానమ్రమైన ముద్దుమోమును అరవింద ఆ విశాలవక్షాన దాచుకొన్నది.
వారిరువురు చంద్రాపతి పృథుకల్పులకు ప్రణమిల్లినారు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse