అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/వీణ
వీణ
ఆనందమూర్తి గళము అన్ని రాగాల ఆనందానికి నిలయం. 'ఏమి పాట పాడతాడండి!' 'అది సరస్వతీ కంఠము గదాండీ!' 'కాకలీ మృదులం - అహో!' అని సంగీత ప్రియులు తన్మయులై పోతూవుంటారు. ఇంతవరకు ఏ గురువువద్దా శుశ్రూష చేయలేదు. తండ్రిగారి సంగీతం వినిన్నీ, గానసభలలో జనించిన మహాప్రవాహాలలో లయమైపోయిన్నీ నేర్చుకున్న పాటే యింత పులకరింపులైతే, ఏ సర్వేశ్వరుల పాదతీరాన్నో ఆనందమూర్తి పూజలు సలిపినట్లయితే అఖిలభారతదేశానికి నాయకమణియై పోవలసిందేగదా! - అని విద్వాంసుడు భరతశాస్త్రి సంతోష బాష్పాలను ఎడమ బొటన వ్రేలితో తుడుచుకొన్నాడు.
శుభ ముహూర్తం చూచి ఆనందమూర్తివైన నిన్ను శ్రీ సర్వేశ్వరుల మ్రోల మీ తండ్రి శిష్యునిగా అప్పగించి వచ్చినాడు. నీవు పదహారు సంవత్సరాల బాలకుడవు. సరస్వతి అవతరించిన శ్రీ సర్వేశ్వరుల పీఠము మ్రోల దేహానికి పులకలు, మనస్సుకు మఱపు, ఆత్మకు పరమానందము వరములిచ్చే ఉతృష్టకళ గాన విద్యను అభ్యసించే దీక్షపూనినావు.
ప్రౌఢ రాగాలు. ప్రవహించే పరమ సౌందర్య ప్రదేశాలలో తాండవించినావు. దివ్యగాయకుల కృతి గంభీరతలలో తేలినావు. గానకళాసూత్రం, శృతి రహస్యం, గురువులవారు ఆనందమూర్తికి ఉపదేశించే జ్ఞానముద్రను ధరించినారు.
2
స్వరూపపతి వీణా నిర్మాత. తరతరాలనుంచి అతని కుటుంబమువారు వీణలు రూపొందిస్తూనే ఉన్నారు. స్వరూపపతి తండ్రి అకళంకపతి సర్వేశ్వరుల వీణ నిర్మించినాడు.
గాయకుడు దినదినము సంగీతలోలుడై వుండాలెనంట, అతని కంఠగత స్వనప్రవాహ శ్రుతులతో మేళవించే ధ్వని రాశి, మధురమూర్తిని ఆ వీణాకారులు నిర్మించేవారంట, మానవాతీతమయిన ఒక శక్తి ఆ వీణాజనకుని చేతిలో ప్రవహించునంట. సంగీతము మూర్తీభవించిన వీణా స్వరూపము ఆ మహాకల్పనలో నుంచి ప్రత్యక్షమవునంట.
ఆనందమూర్తి స్వరూపవతి గ్రామానికి విచ్చేసినాడు. ఓ ఆనందమూర్తీ! నీ సంగీతమును స్వరూపపతి నిమీలితదృష్టి తన్మయతలో విన్నాడు. ఆ సాయంకాలపు అరుణకాంతులలోని పాట తీవలై అలముకుపోయినది. రాగాలాపనరక్తిమ, రాగస్థాయి విహంగపథము, నీ దివ్యగాంధర్వాన ఓలలాడి, 'జన్మాన్ని అలుముకుపోయిన పాపలతలు తెంపబడ్డాయి; నేను ముక్తుణ్ణి' అనుకున్నాడు స్వరూపపతి, ప్రాణమే రాగ ప్రవాహరేఖలో లీనమయిందట, ఉత్కృష్ట నాద స్వరూపము, మహోత్తమమైనట్టి వీణామతల్లిని నిర్మించి తన జన్మ పావనం చేసుకుందామని స్వరూపపతి ఉవ్విళ్ళూరి పోయినాడు. ఆ దినాన్నుంచి వీణాకారునికి వైణికునికి నాదబిందు కళా పూజయే, ఆనంద విహారమే. కలశము కలలూరినది. దండము రూపించినది. తుంభీఫలము మీటలు ప్రత్యక్షమయినాయి. సింహకరాళ శిరము రేఖలు తిరిగినది. పండు పనసల పరువాలు. దంత ధావళ్యకాంతులు, బంగారుసుడులు, లతాపుష్ప విన్యాస చతురమయిన శిల్ప సౌందర్యము; సూక్ష్మ, స్థూల, వివిధ విచిత్ర తంత్రీ వైదగ్ధ్యము తళుక్కుమనే అద్భుత వల్లకీ బాల దివ్య ముహూర్తంలో సాక్షాత్కరించింది.
తీగలు సారించి, మీటలు బిగించి, గుళ్లు సవరించి, ఒయారంగా పల్లకిని వలెవాటువేసి భారతీదేవిని ఆత్మ సారూప్యం చేసుకుని, ఆనందమూర్తీ! నీవు శ్రుతులు చూచుకొన్నావు. కంఠగీతీ పరిమళంలో దివ్యనాదాన్ని లయింపజేశావు. స్వరూపపతి ఆనందపరవశుడై మూర్ఛపోయినాడు. అతడు వీణలో కలిసిపోయినాడు.
3
ఆనందమూర్తీ! నీ యశము దేశదేశాల వెలిగిపోయినది. మహారాజులు నిన్ను రప్పించుకున్నారు. కళాదృష్టలు నీపాటలో త్రీసరేణువులై పోయినారు.
ఆనాటి సభ, మహాపండితుల సభ. వాండ్లను మెప్పించుట కళాబ్రాహ్మలకును వెఱపు కలుగజేస్తున్నది. నీవు ఉప్పొంగిపోయినావు. ఈ నాటికినీ జన్మ సఫలమయినదో లేదో నీకు వ్యక్తమైపోవుననుకున్నావు. వీణామతల్లిని హృదయమార పూజించినావు. మహాసభకు నమస్కరించినావు. విద్యుల్లతికలగు నీవేళ్ళు వీణ తీగలపై ప్రసరించినవి.
ఆనాటి శృతి ఓంకారము. మొదట కళాచమత్కృతులు చూపించినావు. కళారసజ్ఞత అల్పమై కళాజ్ఞానరూపమయిన గానవిద్వత్త పండితులంతా హర్షించేటట్లు విజృంభింప చేసినావు. స్వరకల్పన, తాళగతి విచిత్రత, కష్టతమమైన వానిని సునాయాసముగా వెదజల్లినావు.
ఇంతలో ఆనందమూర్తీ, నీవు మైమరచి ఆనందలహరీ వేగమవై విజృంభించినావు.
అది మధురాతి మధురమగు రాగవికాసము. అది లయామృతవాహిని. నాలుగు తీగలూ శృతిగళములోని కాకలీ ప్రేంఖిత స్వనవల్లత.
ఎన్ని కాలములు పైకి వుబికినావో, శృతాశృతములైన కాలాలనెన్నింటి సూక్ష్మమైపోయినావొ!
ఆ సభ పూర్తి అయినది. ఆనందరక్తిమల విరిసియున్నటువంటి మోముతో ఆనందమూర్తి కన్నులనీళ్ళను తుడిచేవారిని, కళ్ళుమూసి ఊగిపోతూ వున్నవారిని, చైతన్యం తప్పి ఏ అదృశ్యలోకాలకో ప్రవహించిపోయిన ప్రాణరహిత దేహులను పరికించినాడు.
వాళ్ళమధ్య అందాలప్రోవై, బంగారుతీగయై, చెమరించు అమృతాధరోష్ఠయై, గీతావిష్టయైన త్రిభంగాక్రతియై గాన లయాకృతార్ధనిమీలితయై, నేపాలదేశ శ్వేతతారాదేవీ విగ్రహయై పదహారేళ్ళ బాలిక తెల్లని కేతకీపన్నగిలా కనబడినది. ఆ అమ్మాయివైపే విస్తుపోతూ చూస్తూ ఆనందమూర్తి సర్వమూ మఱచిపోయినాడు. అతని హృదయం తాళగతులు తప్పినది. అతని కోర్కెలు రాగ మిశ్రమాలయినవి. అతని బ్రతుకు శృతికోసమై వెర్రిదానిలా తీగలు, గుళ్ళు, మీటలు సవరిస్తూనే ఉన్నది.
4
ఆలోచనలతో నిండి, ఆలోచనలులేని కలలతో, ఆనందమూర్తి, విడిదివరకూ ఏలాగో నడిచినావు. దిండ్లు పరచిన కృష్ణాజినముపై చదికిలంబడి నిట్టూర్పు పుచ్చినావు. సేవకుడు వల్లకినిదాల్చిన పేటిక తీసుకొనివచ్చుట యెరుగవు. దీపాల వెలుగులు తెల్లని గోడలపై నీ నీడను ఆడింపజేసినవి దృష్టిలేని చూపులతో చూచితివి. అంతా నిశ్శబ్దము. గృహ యజమాని స్నానానికి లెమ్మని ప్రార్థించుట యెరుగవు. ఆ బాలికే ఎక్కడేని ప్రత్యక్షమవుతున్నది! నీవు ప్రేమతపస్వివి అయితివా?
ఏ మహారాగము సృష్టించుకొంటున్నావో అని గృహ యజమాని చప్పుడులేని పదాలతో వెనుకకు వెళ్ళిపోయినాడు.
ఆనందమూర్తి కడకు ఒక ముదుసలి ఆ బాలికను తీసుకొని వచ్చినట్లయినది. ఆనందమూర్తీ! కంపించిపోయినావు. బాలిక అర్పించు నమస్కారమును అందుకొనవు. ఋషివంటి ఆ వృద్ధునకు నమస్కారమిడవు. నీవు నిలుచుండినావు. మీరు మువ్వురును అట్లనే నిలుచుండిపోయినారు. ఆ బాలిక మోము వివర్ణమగుచున్నది. సిగ్గుచే రక్తిమము తాల్చుచున్నది. గృహ యజమాని వచ్చి, "స్వామీ! ఈలాగు వచ్చినారు? తమ కుమార్తెతో యీ వూరు యెప్పుడు వచ్చినారు?" అని ప్రశ్నిస్తే, ఓ ఆనందమూర్తీ! అది కల కాదనుకున్నావు. ఆ బాలిక నీవైపు చూస్తూనూ ఉన్నది. అవ్యక్తమధురమగు హాస్యంతో కన్నులు నేలవైపు వాలుస్తూనూ వున్నది.
గృహ యజమాని మిమ్మల్నందరినీ ఆసనాలపై అధివసింపచేసినాడు.
ఆ వృద్ధుడు నీ మొగమై, “బాబూ! ఇది నా మనుమరాలు! మా కుటుంబము సంగీత కుటుంబము, యీ బాలికకు గాన విద్య పూర్తిగా నేర్పినాము. ఆమె సర్వకాలమూ స్వయంకృషి చేస్తూనే ఉంటుంది. ఈ బాలికకు తగిన వరుడు నేటివరకున్నూ మాకు గోచరింపలేదు. నాయనా, నీవు దివ్య పురుషునిలా ప్రత్యక్షమయినావు. నీ కీర్తిలో జోగి నీకీ బాలికను సమర్పించి ధన్యుణ్ణవుదామని నా గ్రామాన్నుండి ఈనాటి సభకు వచ్చినాను. ఈ బాలిక ఫిడేలు వాద్యమునందు రాలుకరిగించు విమల గాంధర్వం వినిపించగల కళామూర్తి సుమా!" అని మనవి చేసికొన్నాడు.
ఆనందమూర్తీ, నీ మోము ప్రఫుల్లమైపోయింది. విద్యుల్లతలు నిన్నలమినట్లయింది. ఈ విచిత్రము నమ్మవచ్చునా! యిది ఐంద్రజాలికమా?
5
ఆ దంపతుల జీవితం మహానదిలోని పడవలా తేలిపోతూ ఉన్నది.
ఆనందమూర్తి వీణ, ప్రేమబాల 'వాయులీన' (పిడేలు) రెండు జంత్రాల సంగమములో అంతర్వాహినియై వారిరువురి ప్రేమయున్నూ చేరిపోయింది. ఒకళ్ళను మించిన అందం ఒకళ్ళది. ఒకళ్ళ ప్రేమను మించిన ప్రేమ ఒకళ్ళది. వారి బ్రతుకు వేయితావుల పూలతోట అయింది. వారందులోని కోయిలలు.
6
నాటికి నాటికి ప్రేమబాలకు భర్తపై అనురాగం ఎక్కువైపోయింది. 'అతని స్వరూపం ఏ దివ్యమూర్తి కున్నది! ఒక్కనిమేషమైనా నాధుణ్ని చూడలేక మనలేదు. ఎన్ని ముహూర్తములైనా అతనిమోము తిలకిస్తూ ఆనందామృతములో పొక్కిపోతూ వుండేది. ఏదేని వంకతో అతనిని స్పృశించేది. అతని ముంగురులు దిద్ది పరవశ అయిపోవునది. అతనిని చిరుగాలివలె చుట్టివేయునది. అతని వెడదఉరాన్ని తన మోమును దాచుకొని వణికిపోవునది.
నానాటికి ఆనందమూర్తీ! నీ పత్ని గళనర్తితమగు మధుర గాంధర్వమే నిన్ను మూల మంట కదల్చివేయునది. నీ వీణలోని మహాస్వర ప్రసారము నిన్ను యోగముద్రలో నిల్పివేయునది. నీ పత్ని నీ పాటలోని యొక శ్రుతియైనది.
ప్రేమబాలకు కాంతునిపై ప్రేమ విజృంభించినది. గాన కళాభిరుచి సన్నగిల్లినది. ఆనందమూర్తికి ప్రణయినీ విలాసము చిఱునవ్వు మాత్రము తెచ్చునది. ఆనందమూర్తి ఆనాటి ప్రేమావిష్ణుడు కాడు.
7
అతని పాటకు అతని తపస్సుకు ఆమె ప్రేమావేశము చిన్న అపశ్రుతి అయింది. ఆమె ప్రణయరాగాలాపనంలో నాధుని గానయోగం దోషస్వరమైంది.
ఆనందమూర్తీ! వీణామతల్లికి నమస్కారంచేసి ఆమెను ధరించి నాదప్రవాహం కల్పించుకొని విచిత్రాలైన కృతులు తానం పోకడలు, లయ విజ్ఞానం స్వనింపజేస్తూ మైమరచిపోతూ వుంటే, దివ్యసుందరగాత్ర అయిన నీ ప్రేమబాల హృదయం కంటకవృక్షాన్ని కొట్టుకున్నట్లయ్యేది.
ఆ దినాల్లో నీ చూపులకు ప్రేమబాల అదృశ్య! ఆమె ప్రేమ పూజ నీకు వేడిగాల్పు! ఆమె కౌగిలింతలు ఇనుపసంకెళ్ళు! పరీమళచుంబనము నాభీ పుష్పమధురము.
“ప్రేమబాలను అనిమేషుడవై చూస్తూ ప్రవహించిపోయిన మధురాతి మధురములగు సంధ్యలు, చంద్రికాయామినులు, నక్షత్ర ప్రకాశాలు, సౌరభదినాలు మాయమైపోయాయే! ఆనాటి ఆనందమూర్తివేనా? నాథా! నాలో ఏమిలోపం వచ్చింది? నా దివ్యసౌందర్యము కలమాత్రమై ఆరతి కర్పూరంలా హరించిపోయిందా? నీదృఢపరిష్వంగ డోలికల్లో దెసలంటానే ప్రభూ!” 8
ఆనందమూర్తీ! నీ హృదయావేదన విచిత్రమైంది. బాలికల గానకళాభ్యాసం భర్తలకొరకా? నీ జీవితానికి అణువు అణువునా గాంధర్వం నిలుపుతా ననుకొన్నావు. గానమూర్తితో కలిసిపోయి ఐక్యమైపోతుంది నీ బ్రతుకు, త్రివేణిసంగములా, అనుకున్నావు. ప్రేమబాల మూడో ప్రవాహం. తన గాన తపస్సులో సంపూర్ణయోగం లేదా? గానం యొక్క వేరు స్వరూపం అనుకున్న ప్రియకాంత, అత్తరువు రాచిన బంగారు కమలం మాత్రమేనా? లేక ఆమెను తన సంగీతములో లయింప చేసుకునేశక్తి తనకు నశించి పోయిందా?
ఆమె అందమును చూచి నువ్వు లజ్జిస్తున్నావేం? ఆమె పన్నీరు పోసిన వేడినీటిలో సువాసన ద్రవ్యాలపిండి నలుగుపెట్టుకొని, తళుక్కుమనే నగలు, పూవులు చీర ధరించి చిత్రకారునికీ కవికీ భావానికందని ఆందంతో వస్తే, నువ్వలా పెడమొగం పెడతావేం? శుకుడవా? ఋష్యశృంగుడవా? రసంలేని విద్వత్తవా?
వివాహమై రెండు సంవత్సరాలు కాలేదు. ప్రేమరసవాహినిలో ఆ దంపతులు ఇంకా సంపూర్ణ స్నాతులు కాలేదు. ఇంతలో ప్రణయభంగము శూర్పణఖలా వచ్చిపడింది.
ప్రేయసిని తీసుకువెళ్ళకుండానే ఆనందుడు సభలకు వెళ్ళుతున్నాడు. సభలో జరిగిన విచిత్రాలు ఆమెకు చెప్పడు. కొత్త రాగాలూ, పాటలూ వినిపింపడు. అసలు నెలకు రెండురోజులన్నా ఇంటిదగ్గర వుండడు.
ప్రేమబాల విషాదబాల అయిపోయింది. ఆమె హృదయంలో అపశృతినాదాలు - వకదానివకటి తరుముకు వస్తూ ఉన్నవి. దొడ్డిలో గోపాలకుని కృష్ణమ్మపదం, బంగారు పిచికల కలకలస్వరము, వీధిలో ముష్టివాండ్ర తందానపాట, భర్తగారి ఉత్కృష్టమయిన వీణాగానం అన్నీ ఆమె జీవితానికి పెళపెళార్భాటాలయి, వురుముల ధ్వనులయి కంపించివేసేవి. అందాల ప్రోవయిన ఆ ప్రేమబాల ఈనాడు వడిలి, కమలిపోయిన పువ్వులా అయిపోయింది. వంటలక్క పచన రహస్యాలల్లో ప్రత్యక్షంచేసే రుచులు ప్రేమబాల నోటికి విషాదలయిపోయినవి.
9
ఓ ఆనందమూర్తీ! నువ్వా వెన్నెలలో వీణను ధరించి ఆ వసంత కాల వనసౌభాగ్యాన్ని స్వరాలల్లోకి మార్చావు. వెన్నెలే రాగమయింది. ఆకుల కలకలలు లయలయ్యాయి. అత్యద్భుతమైనటువంటిన్నీ, పరీమళ పూరితమయినటువంటిన్నీ ఒక కొత్తరాగమును ఆరోజున సృజించావు. రాగాలాపన ప్రవహింపచేశావు. హృదయకంఠశిరః ప్రదేశ జనితాలయిన మూడు స్థాయిలూ "స్వతోరంజయతి శ్రోత్రం స్వరమిత్యభిధీయతే” అన్నట్లు రస స్వరూపాలయిన 'స్వరాలనన్నీ నిలుపుకున్నావు. ఆ రాగము మహాఋషి వెంకటమఖి రచించి డెబ్బది రెండు మేళాల్లో శుద్ధ దైవతాన్ని ఆధారం చేసుకున్న ఎనిమిదవ స్థానంలోనిది అయివున్నది. ఆ రాగం గ్రహ, అంశ, మంద్ర, తార, వ్యాస, అపన్యాస, సన్యాస, విన్యాస, బహుత్వ, అల్పత్వములనే పది లక్షణాలను కలిగివుంది. ఆ రాగం పూర్వమేళంలోని ఇందుచక్రం లోనిది. ఆ రాగం దేశీయ, ఔత్తరాహ, సాంప్రదాయాల కలయిక లోనిది.
ఆ రాగాలాపన ప్రథమాన్ని ఆక్షిప్తికమైంది. ఆనందమూర్తీ, రాగ వర్ధని చేసినావు. ఆరోహణమై, అవరోహణమై తానంలోకి దిగినావు. వేయిచంద్రు లొక్కసారి పుష్పాలల్లే నిలిచినట్లయింది. పల్లవి ప్రారంభించి కీర్తనలోనికి విజృంభించినావు. ఆ రాగము 'వసంత చంద్రిక' అనిపేరు పెట్టుకున్నావు. ఆహా! ఆ గానము పరమ మాయా సౌందర్య పూరితం అయిపోయింది.
ఉదయాన్నే ప్రాణప్రియుడు తన్ను పలుకరించిన పలుకులో, హాస్యరసపూరితమయిన నర్మభాషణలో వేయి అర్థాలు గ్రహించుకుని ప్రేమబాల ఉలిక్కిపడినది. ఆమెను మధురతరంగాలు ముంచివేసినవి. ఆమె హృదయములో వెన్నెలలు పిండి ఆరబోసినవి. ఆసాయంత్రం పన్నీట జలకమాడింది. కలలూరు చీనాంబరము ధరించినది. ఒకటి రెండు ముద్దుగులుకు నగలతో గంభీరంగా అలంకరించుకున్నది. మల్లెపూలు జడవేస్తున్నది. నెత్తిపై కనకాంబరాలు జరీ సూత్రంతో కట్టి అర్ధచంద్రిక అలంకరించుకున్నది. ఆ రాత్రి దీపాల వెలుగుల్లో ఆమె దివ్యసౌందర్యరాసి, ప్రేమ తేజస్విని.
తోటలోకి కిటికీలు తెరచి వున్న వాళ్ళ శయన మందిరాన్ని శ్రీ శుకులవారి హృదయం కూడా కరిగించివేసేటట్లు ప్రేమబాల అలంకరించింది.
కిటికీలోంచి వెన్నెట్లో సన్నజాజి, గులాబి, మల్లెతీగె, సంపెంగపొదల మధ్యనవున్న శిలావేదిక పైన కృష్ణాజినంపరచుకొని తన్మయుడయి వీణ పాడుకుంటూ వున్న భర్తను చూచింది. నెమ్మదిగా దొడ్డి గుమ్మంమెట్లు దిగి, నాధుడున్న శిలా వేదిక దగ్గరకు పోయి, ప్రేమబాల భర్త ప్రక్కనే కూర్చున్నది.
10
ఆ పవిత్ర నిశాఘటికల్లో ఆ వీణ దివ్యస్వరాలు విరజల్లి వేసింది. ఆనందమూర్తీ, ప్రేమబాల కూడా అట్టి మహాఅద్భుతమయిన బాణి గంభీరత, మాధుర్యాతిమాధుర్యము ఎన్నడూ చూరగొని యుండలేదు. నిమేషాలు గడియ లయ్యాయి, ఒక్క యామమయింది తుంబుర, నారద, శారదా దేవుల వీణలను అపశ్రుతి భూయిష్టాలని అనిపించేటట్టు విజృంభించి పోతూంది.
ఇంతలో ఆ వీణ ప్రేమబాలకు ఒక యక్షిణీలా తోచింది. ప్రేమబాలను హేళన చేస్తూ ఆ విచిత్ర గానంలో విజృంభించిపోతూ ఉన్నట్లయినది. భర్త యీ లోకములో లేడు. ఏ గాంధర్వ లోకంలోనో! "ప్రేమకన్న ఉత్కృష్టమైన గాంధర్వము వేయిరెట్లు ఎక్కువ; ఓసి వెర్రిబాలికా, ఇక్కడి నుంచి శీఘ్రంగా నీ పడకంటింటిలోకి పో!" యీ గానకళా పుంజము నా పతిసుమా! నువ్వు నారాజుకూ నాకు అడ్డంవచ్చేటట్టు చేశావు. కాని నేను నీ ఆటలు సాగనివ్వలేదు. నీ ఫిడేలు పాట మంత్రంచేసి, నా యీ నాధుణ్ణి దూరము చేస్తారని అనుకున్నావా?” అని ఆ వీణ ఆ మంత్ర గానంలోనే పలికినట్లయింది. ప్రేమబాలకు చెమటలు పట్టినవి. ఆమె గజగజ వణికిపోయింది. ఎలా లేచి నడిచివెళ్ళిందో! శయన గృహందాకానైనా వెళ్ళలేదు. "ప్రభూ యింతేనా” అంటూ కనకాంబరం మొక్కలవద్ద గభాలున పడి మూర్ఛపోయింది.
ఆనందమూర్తీ! నీ గాన తపస్సు పూర్తి అయినది. ఆ ఆనందము యొక్క పులకలు నీ మనస్సులో చిరుకెరటాలుకాగా నువ్వు గంధర్వ యువరాజులా లేచినావు. నీ హృదయం ఆ యీనాటి నూత్న రాగము, కృతి, తాళము పాడుకుంటూ వుండగా, ఆ ధ్యానములో ఎలా చేరావో నీ పడక గదికి. దారిలో పడిఉన్న ప్రేమబాల నీకు కనపడలేదు. పర్యంకముపై పత్ని లేదన్న భావమే నీకు కలుగలేదు. ఘోర బ్రహ్మచారిలా, సరసమెరుగని పరమ మూర్ఖునిలా, ప్రణయంలో పులకరించిపోని బాలకునిలా శయన గృహం అందం కనిపెట్టక, అగరుధూపాల ఆనందించిపోక, శయనమందిరం నింపివేసిన వివిధ పుష్ప పరిమళాలల్లో ఓలలాడిపోక, శిల్ప హృదయ అయిన నీ భార్య అలంకరించిన శయనమందిరం యొక్కా తల్పం యొక్క సౌందర్య విన్యాసాలల్లో తోగిపోక, లంబభుజుడులా మంచంమీద పడుకుని నిద్ర పోయినావు. సంగీతము జీవితాన్ని కర్కశం చేస్తుందా?
ఇంతలో ప్రేమబాలపై ఒక చిరువెన్నెల చెలికత్తెలా వ్రాలి, శీతలోపచారాలు చేసి ఆమెను మృదుహస్తాలతో స్పృశిస్తూ మూర్ఛలో నుంచి లేపింది. ప్రేమ బాలకు లోకమంతా ఇంకాచీకటిగానే వుంది. కళ్ళు నులుముకుంటూ ఏల అక్కడ పడివున్నదో, శయన మందిరంలో ఎందుకులేదో? ఆమెకు అర్థము కాకుండానే తూలుతూ పడక గదిలోకి వెళ్ళింది. ఆ దీపాల వెలుతురులో భర్త గుర్రుపెట్టి నిదురపోవడం వినీ, చూచీ గబుక్కున సంపూర్ణ జ్ఞానంకలుగగా తెల్లపోయి చూచింది. భర్త ఎప్పుడూ గుఱ్ఱుపెట్టలేదు. ఆమెకు అప్పుడు భర్తయొక్క హృదయం ప్రేమరహితమయిన మరుభూమిలా తోచింది.
దివ్యాంగన అనుకున్న వల్లకీబాల తనకీ, నాథునికీ తెగతెంపులు కలుగజేయడానికి జన్మించిన రాక్షసి అని తానెప్పుడూ అనుకోలేదే! నాధుని చేరవచ్చి రెండేండ్లుకాలేదు, ప్రణయస్వరూపమైన వీణామతల్లి పరమశత్రు వయిందా? ఓ వీణాదేవి! నీకేమి అపకారం చేసిందమ్మా? తన పతిని నిన్ను ప్రేమించవద్దన్నదా? నీ స్నేహంలో తన్మయుణ్ణి కావద్దన్నదా? కళాస్రష్టల్లేరా? వారు తమ హృదయాల్లో నివసిస్తూ ఉన్న ప్రాణకాంతల్ని మరచారా? నీకు దయలేదు. నీ హృదయం వట్టిగాలి. నీ బ్రతుకుకర్రమొద్దు. నువ్వు తననాథుణ్ణి లోహపాశాలు వేసి బంధించావు. నీవు మామూలు వీణవు కావు! నువ్వు రాక్షసివి! పెనుభూతంలా కుటుంబములో ఆవిర్భవించావు. ఈ రోజుతో నీ జీవితం సమాప్తి!!
11
ప్రేమబాల మహోగ్రబాల అయింది. ఆమె కన్నులు విస్ఫులింగాలు రాల్చినవి. ఆమె కాత్యాయని, మహాకాళి మూర్తి! భయంకర చండీమాత. రెండు అంగలలో సంగీత మందిరాన్ని చేరుకుంది. పూజాపీఠంమీద వల్లకీ పేటిక తెరిచింది. ఆ వీణను మోటుగా యీవలకు లాగింది. ఆ వీణాబాల గజగజలాడిపోయింది. ప్రేమబాల తీగలన్నీ ముక్కలు ముక్కలుగా తెంపి వేసింది. మీటలు వూడబెరికింది. గుళ్ళూ, తంత్రీపీఠము దూరముగా విసిరివేసింది. తుంభీఫలము లాగివేసింది. సింహముఖము చితకగొట్టడానికి సిద్ధపడుతూ వుండగా వక్కపరుగున ఆనందమూర్తి “ఆ! ఆ!” అనుకుంటూ వచ్చిపడ్డాడు.
మైమరచి నిద్రపోతూవున్న ఆనందమూర్తికి చటుక్కున ఓ కల వచ్చింది. ఒక మహాశక్తి భయంకరముగా తన్ను తరుముకువస్తూ, "ఓయీ! నీవు నా మీద భక్తి మానేశావు. ఇందుకు అంతా నీ వీణే కారణం!" అని అంటూ తన వీణను అతని చేతుల్లోంచి లాగి ముక్కలు చేయడానికి ప్రారంభించిందట! ఆనందమూర్తికి గుండె దడదడమంటూ చెమటలు పడుతూ వుండగా తటాలున మెలకువ వచ్చింది. “అమ్మయ్యో” అంటూ సంగీత మందిరం చేరుకున్నాడు.
ఓ ఆనందమూర్తీ మహోగ్రమూర్తి అయిన భార్యనుచూచి వణికిపోయావు. ఆమె చేతుల్లో రూపం మారిపోతూ ఉన్న నీ అనుంగువల్లకిని చూచి కెవ్వున అర్చి ఆ వీణమీద మూర్చపోయావు.
ప్రేమబాలకు స్మృతి తెలిసింది. తాను చేసిన పని చూచుకుంది. మూర్ఛలో మునిగివున్న భర్తను చూసింది. భర్త అల్లా పడివున్నాడేమి? అయ్యో, వారికి ఆపత్తు కలుగలేదు కదా? పరమశివా, ఏమిటీ ఘోరం, ఆ వీణను తానే పాడుచేసింది? నిజమా? నిజమా? భర్తను తన ఒళ్ళోకి చేర్చుకుంది. అతని తలనుతన హృదయాని కద్దుకుంది. ఆయన మోమును పెదవులతో స్పృశించింది. ఆమె లోచనాంచలాల్లోంచి జలజల బిందుప్రవాహము వెచ్చగా నాధుని తలపై, మోముపైపడి, తడిపివేస్తూ ఆనందమూర్తికి మెలకువ తెప్పించినది.
12
ఆనందమూర్తి కళ్ళు తెరవగా ప్రేమపూరితమై ప్రేమచే విషాదమేఘావృతమై కోలయై, లలితరేఖా పూర్ణమై, బంగారు వెన్నలా స్విన్నమై, వివర్ణమై, ముంగురులు ఆవరించినదియై, విషాదంలో కూడా వింత సౌందర్యయుతమైన ప్రేమబాల తన ప్రేయసియొక్క మోము ప్రత్యక్షమైంది. అతని గుండె పరమ కరుణచే దడదడలాడినది. ప్రేమబాల ఏనాడు తనకూ తన ప్రజ్ఞకూ అడ్డం వచ్చింది? ఏనాడు తన విద్యను ప్రోత్సాహింపలేదు! ఆమె తన జీవిత ప్రవాహంలో వేరొక శైవాలినీ బాలలా సంగమించే నప్పటినుంచి, తన కళాచాతుర్యం వేయిరెట్లు వృద్దికాలేదా? ఎందుకూ తనకూ తనప్రేమ మూర్తికీ ఈలాంటి హృదయ భేదము వచ్చింది? స్వరూపపతీ, నువ్వు నిర్మించిన వీణ పరమసాధ్వీమతల్లి దివ్యాంగన. ఆమెకు హృదయంలో ప్రేమ తప్ప ఇంకేమీ వుంటుంది? ఈ విషాద నాటకం అంతా తమ మనస్సుల్లో జన్మించిందేనా?
అతని హృదయంలో ప్రేమ మహా ప్రవాహం, వుప్పెనలా వచ్చి పడింది. చటుక్కున ఆనందమూర్తీ, ప్రేమబాల ఒళ్లోంచి నువ్వు లేచినావు. ఆమెను నిండుతమిమై హృదయాని కదుముకొన్నావు. అశృపూరిత నయనాల్ని, చెదిరిన ముంగురులతో నిండిపోయిన మోమును, కలిగి పోయిన పువ్వులతో గజిబిజి అయిన పొంకమైన శిరాన్ని చుంబించినావు. ఆమె సుళ్ళు తిరుగు చెక్కిళ్ళు, చిరుగడ్డము, తేనెలూరు పెదవులు ముద్దుగొన్నావు.
ప్రేమబాల ఆశ్చర్య చకిత, ఆనందమయి అయిపోయింది. ఆమె కన్నుల్లో, ఫాలంలో కేశసౌభాగ్యంలో, చెక్కిళ్ళల్లో, గడ్డంలో పెదవుల్లో, విచిత్రకాంతులు అలిమినవి.
ఇరువురూ వల్లకీబాలను నూత్న తంత్రులతో అలంకరించినారు, అన్నీ సవరించినారు. యథాప్రకారం వీణామతల్లి పరమగాంధర్వ మూర్తియై పోయింది.
నాధునికడ నేర్చుకున్న ఆనాటి విద్వత్తతో ప్రేమబాల వీణను మీటింది. ఆ వీణ.
“చైతన్యం సర్వభూతానాం వివృతిం జగదాత్మనాం
నాద బ్రహ్మ తదానందం అద్వితీయం" అయింది.
ఆ మువ్వురూ ఒకళ్ళల్లో ఒకళ్ళయినారు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse