అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/వసుబాలుడు
వసుబాలుడు
వసుబాలరెడ్డి పరువుకల కమ్మవారి బిడ్డడు. గజపతుల రాజ్యమైన కొండపల్లి మండలం గుడివాడసీమలో “కురుమద్దాలి” అను పల్లెటూరు నుంచి శ్రీ రాయరాయ నరసింహ దేవరయ్యవార్లంగారు చక్రవర్తయి కొలువుచేయగా శివబాలరెడ్డి తన రెండెడ్ల బండిపై గూడుకట్టుకొని కతిపయ ప్రయాణాలుచేస్తూ విజయనగరం ప్రవేశించాడు. అప్పట్నుంచి కత్తి నడుముకుకట్టి, డాలు భుజాన వేసుకొని రాయలదండులో కాల్బలంలో జేరాడు. దళవాయి అవడం, చమూపతి అవడం, చివరకు శ్రీమూరు రాయరగండ, శ్రీకృష్ణదేవరాయలవార్లంగారి సేనాధిపతుల్లో ముఖ్యుడవడం శివబాలరెడ్డి అదృష్టమో! పతివ్రతా శిరోమణి అయిన అతని భార్య అదృష్టమో!
విజయనగరంలో జన్మించాడు మన వసుబాలుడు. కాని పుట్టినప్పట్నుంచి వసుబాలుడు కవిత్వం ప్రారంభించాడు. “అమ్మ” “అక్క" అనే మాటలు రాకముందే “తములై యెవ్వలు మకతికలను తయులై” అని పద్యాలు ఎవరికీ అర్థం కాకుండా గళ గ్రాహంగా చదివేయటం ప్రారంభించాడు. శివబాలు డతన్ని చూచి ఒక్కనిట్టూర్పు వదిలేస్తుండేవాడు. పెద్దనామాత్యుల శిష్యుడయ్యాడు. కవి స్వరూపం దాల్చాడు. వసుబాలరెడ్డి! తండ్రిగారి మోస్తరుగా కత్తికటారులు తిప్పడంలో చాకచక్యం ఎక్కడా కనబడలేదు అతని దగ్గర.
శివబాలరెడ్డి తీరని విచారానికి ఎప్పుడూ ఉపశమన వాక్యాలు చెప్పేది వృద్ధులైన తమ్మన్న నాయకుడు. సేనానాయకులలో చాలా పేరు పొందాడు. ఆయనతో తన విచారమంతా వెళ్ళబోసుకున్నాడు శివబాలరెడ్డి నాయకుడు.
తమ్మన్న: అబ్బాయికి యుద్ధం అంటే ఏమీ యిష్టం లేదా?
శివ: సుతరామూ! ఈ రహస్యం తమతోతప్ప ఎవరితోనూ చెప్పలేదు. మావాడు - నాకు చెప్పడం సిగ్గుగా ఉంది - మావాడు పిరికివాడు కూడానండి!
తమ్మన్న: ఆ! మరి మీరు! ఎలా తెలిసింది మీకు? మీ ఉద్దేశం ఏమిటి?
శివ: (ఒక్క దీర్ఘవిశ్వాసం విడుస్తూ) చిన్నతనాన్నుండీ నేను చూస్తూనే ఉన్నానండి. చప్పుడు అవుతే ఉలిక్కిపడి కెవ్వున కేకవేస్తాడు! పిల్లినిచూస్తే భయపడేవాడు చిన్నతనంలో, చీకట్లో ఒక్కడూ ఉండలేక పోయేవాడు. ఒక్కడూ పడుకోలేకపోయేవాడు -
తమ్మన్న: అదేమిటండీ అంతమాత్రం వల్ల -
శివ: కత్తిపట్టలేడు. గుఱ్ఱంస్వారి చేస్తూ ఉంటే కొత్త పెళ్ళి కూతురు నడకలా ఉంటుంది. రక్తం కళ్ళజూస్తే మూర్ఛపోతాడు. నా కుటుంబంలో ఇంత దురదృష్టం ఇదివరకెప్పుడూ లేదండి! మా అత్తవారి వైపునా ఈ పిరికితనం లేదండి. ఎక్కడనుంచి దాపురించిందో ఈదురదృష్టపు పిరికిదేవత.
తమ్మన్న: కవిత్వం సగం పిరికిమందు పోస్తుంది! మీవాడు మంచి కవిగా?
శివ: కవిత్వం వల్ల యీ పిరికితనం రాదనుకుంటాను, తిక్కన్న మహాకవి, మహామంత్రి, మహాదండ నాయకుడు. పెద్దనామాత్యులు చిన్నప్పట్నుంచీ మావాణ్ని బుజ్జగిస్తూ చేరతీశాడు. ఇప్పట్నుంచి కవిత్వం, గంటం, పత్రం. రాత్రిళ్ళు నిద్రపోడు, ఆపిచ్చివస్తే ఊ కూనిరాగాలు తీస్తూరాస్తూనే ఉంటాడు.
తమ్మన్న: దీనికిఉపాయం నేను ఆలోచించి తమకు మనవి చేస్తా.
శివ: ఈ రహస్యము అతి గోప్యముగా ఉంచి నా కుటుంబమునకు తాము ఉపకారం చేస్తే మిమ్మెప్పుడూ తలపోస్తూనే ఉంటాము.
తమ్మన్న: నేనేమి చేసేది, కొన్నాళ్ళుపోయిన వెనుక చెప్తాను లెండి.
పెద్దనామాత్యుని భవనముననే సదా వసుబాలుడు మకాం. ఇంటికి కూడా రావటం మానివేశాడు. ఆంధ్రభాషలో “విద్యాధర్మ చరిత్ర” అను నరవాహనదత్త విజయమును అసాధారణ కవిత్వం ధారాళంగా ప్రవహిస్తూ ఉన్న గ్రంథం రచించడమే కాక, కర్ణాటక భాషలో పదునెనిమిదేండ్ల బాలుడయిన వసుబాలుడు ఒక వ్యాకరణము, రామచరిత్ర అను కృతిని రచియించి రాయలకు అంకితం చేశాడు. సంస్కృతంలో నిధే అన్నారు. వసుబాలుణ్ణి కావ్య వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలన్నీ భాష్యాలతో పెద్దనామాత్యులు తన ప్రియశిష్యుడికి నూరిపోశాడని విజయనగర పండితబృందం అనుకుంటే శివబాలరెడ్డి సేనానాయకులు విని, తన భార్యతో 'అబ్బాయి కత్తి ఎలా ఉంటుందో తలచుకొని మూర్ఛబొయ్యే రోజులు వచ్చాయి' అని అన్నాడు.
వసుబాలుడికి పారశీకం, అరబ్బీ, మహారాష్ట్ర భాషలు నేర్చుకుందామని తోచింది. అదే వెర్రిపట్టింది, తండ్రిని, గురువును వేపుకుతింటే సరే అని ఒప్పుకున్నారు. బీజపురం వెళ్ళడం మహోత్తమం అన్నారు. నవాబు గారికి స్నేహితుడుగా వెళ్ళడం మరీ ఉత్తమంగా! తండ్రిగారి దగ్గర నుంచి కొండపల్లి మండలాధిపతికి ఉత్తరం తీసుకొని వెళ్ళాడు. వారి సభలో నాలుగురోజులు గౌరవాలు పొందాడు. పండితులతో వాదించాడు: 'సింహం' పిల్లరా, సింహం అయితే ఎల్లాఉంటుందో' అని ఆస్థానకవులు డిల్లపోయేటట్లుగా ప్రతాపం చూపించాడు. శ్రీ మహారాజు మెచ్చుకొని, అతని ఉద్దేశం గ్రహించి బీజపురం నవాబ్ బహదూరు వారికి స్నేహపు ముద్రిక ప్రసాదించగా, అత డది తీసుకొని వెళ్ళాడు. ఒక ఏడాది నిరాటంకంగా బీజపురం నవాబు మన్ననకు పాత్రుడవుతూ, పండితులచే గౌరవం పొందుతూ, రాజబంధువుల స్నేహం సంపాదించుకుంటూ, ఆ భాషలు మూడున్నూ నేర్చుకున్నాడు. పండితుణ్ణి అయ్యానని తల ఊపుకున్నాడు కూడాను.
2
రాజవంశీకుడు మహమ్మదు ఇబిన్ బ్రహనల్లా ఉస్మాన్ అమీర్ జంగ్ నిజాముల్ ముల్కు అనే బాలుడూ, వసుబాలుడూ ఒక రోజున హుక్కా పీలుస్తూ కూర్చున్నారు. ఆ మహమ్మదీయ బాలకుని యింట్లో. అమీర్‌జంగ్: భాయ్, నీకు చదువు పూర్తి అయిందే, యింటికిపోరాదూ.
వసు: ఎందుకు?
అమీర్‌జంగ్: మా సుల్తాన్ బహదూర్‌వారికిన్నీ విజయనగరం కిష్టరాయలకి యుద్ధం ప్రారంభమయింది. నీగతిఎట్లా అవుతుందో, ఆలస్యం ఎందుకూ?
వసు: రాయలకి నవాబ్ బహదూర్ వారికిన్నీ యుద్ధంలేదుగా. సంధి రాయబారాలే జరుగుతూఉండేవిగా!
అమీర్: వెర్రివాడా! మా సైన్యం సర్వంసిద్ధం. ఒక చిటికెలో బెల్గాం దగ్గరనుంచి ఉస్మాన్‌పూర్ దాకాసైన్యం బారులు తీరుస్తుంది. ఒక్క రాత్రిలో కృష్ణ దాటుతుంది. రెండవ రోజుకు ఆ విజయనగరం వాళ్లు నిద్రకళ్లు నలుపుకుంటూ ఉండగానే ఆ ఊరుమీదబడి నాశనం చేయడం.
వసు: అబ్బా! విజయనగరం చాలా అందమైన పట్నం అంటారు. అది నిష్కారణంగా పాడుచెయ్యడమే?
“అవసరం అయితే అంతే. ఇప్పుడు ముఖ్యావసరం కాబట్టి మగపురుగన్నవాడు కత్తిపట్టాలని సుల్తాన్ బహదూర్ వారి ఆజ్ఞ. సెలవు తీసుకుంటా. కటకపురినుంచి మహారాజావారి బేగిరావులతో నీ ఉత్తరాలు నాకు పంపుతూ ఉంటావుకదూ! నీ పెళ్ళి అయినప్పుడు నేను వివాహానికి హాజరు.”
అని ఆ బాలుడు వసుబాలునికి సలాంపెట్టి చేయి ముద్దు పెట్టుకొని వీడుకోలిచ్చాడు.
వసుబాలుడి గుండెల్లో రాయిపడింది. ఈపాడు యుద్ధాలేమిటి? ఒకళ్ళని ఒకళ్ళు లక్షలకొలది చంపుకోవడమే! అనుకున్నాడు. అతనిచెవులు హోరుమన్నాయి. కళ్లు తిరిగిపోయాయి. రక్తమేఘాలు దశ దిశలు కమ్మినట్టే కనిపించాయి. యుద్ధం మొదలు పెట్టేలోపుగా, తాను నెమ్మదిగా గజపతుల రాజ్యంజేరి, అక్కడనుంచి విజయనగరం చేరాలి. ఎంత విద్వచ్చిరోమణి అయితేనేం: కళాహృదయం కలవాడయితేనేం; సరశృంగారరస వీచికా సల్లాప సంతోషజీవి అయితేనేం! శ్రీశ్రీ రాయలవారు ఈ యుద్ధాల విషయంలో కటికవారే!' అనుకున్నాడు వసుబాలరెడ్డి, ఉన్నరాజ్యం చాలదా? అబ్బా!
రెండుగుర్రాల రథంమీద నవాబుకోటలో మైకమే దివానీమహల్ నుంచి తనవిడిది మంజిల్‌కు వస్తూవుంటే లోకం అంతా ఫిరంగులు మోగిపోతున్నట్లే అయింది. కత్తులు శాపిళ్లు, కఠార్లు పొడిపిళ్ళు, శూలాల మెరుముళ్లు, సున్నీలపరుపుల్లు మహావేగంతో ఎదుట ప్రత్యక్షమయ్యాయి. అతడు వణికిపోయాడు.
జేవురించిన భీభత్సరూపాలతో భయంకర కరాళాలతో పిశాచాలు ఒకటినొకటి పీక్కుతింటూ వికారతాండవం చేస్తూ అనంతంగా కోటాను కోట్లు కనబడ్డాయి.
ఉలిక్కిపడి బండివాడితో మాట్లాడితే ధైర్యం అనుకొని "ఏమయ్యా బగ్గీవాలా! పాదుషావారికి ఎన్ని అరబ్బీ గుర్రాలున్నాయి?" అని ప్రశ్నవేశాడు.
బగ్గీవాలా: లక్షల్ - సఫేద్ ఘోడా - హౌరీ అందం, వేగం విష్వాసం - లడాయిమే బయం గియంనై - ఆఖరి ప్రాణం పోవాలా- రౌతు కాపాడవాల - మహారాజ్!
వసు: యుద్ధానికేమిగాని బగ్గీ: ఖుదావంద్, యుద్ధం అంటారే, నేన్కు యెళ్ళి యీయాళ రేపు యిరోదుల్కు ఎంతామంద్కి సంపియేస్తాన్ -
వసు: సరే, సరేలే!
ఆలోచనతో ఇంటికి వచ్చినాడు వసుబాలుడు! బసలో తన దేవిడీ అంతా కంగారుగా ఉంది - తురక సర్దారులు కొందరువచ్చి వారి సామానంతా వెదుకుతూ ఉన్నారు. రెడ్డి దడదడమనే గుండెతో లోపలికివెళ్ళి, “ఏమిటీ దౌర్జన్యం” అన్నాడు. నలుగురు సిపాయిలు, దళవాయి రెడ్డిగారిపెట్టెలు బేడలు అన్నీ కలగాపులగంచేసి, మంచిమంచి జరీకండువాలు, ధోవతులు అన్నీ చిందరవందరగా పారేసి ఏమిటో వెదుకుతూ ఉన్నారు. రెడ్డిగారు లోపలికి రాగానే ఆ దళవాయి పందిరి మంచంమీద కూర్చున్నవాడు లేచి సలాముచేసి, “జనాబ్ మీరు పరాయిదేశం వాళ్ళు. మీ దగ్గర ఏమైనా రాజద్రోహకరమైన గ్రంథం ఉందేమోనని వెదుకుతున్నాము. ఏమీ కనబడలేదు' అన్నాడు.
వసుబాలునకు ఏమన్నా ధైర్యమనేది వుంటే మటుమాయమైపోయింది. 'నువ్వెవరవు! నాసంగతి తెలుసునా! ఇదిగో శ్రీసుల్తాన్‌సాహెబ్ బహదూర్ వారి ఫర్మానా!' అని దళవాయి చేతికిచ్చాడు వసుబాలుడు. సిపాయి లందరూ మోకరించారు. దళవాయి వంగి సలాముచేసి ఆ ఆజ్ఞాపత్రం నెత్తిమీద పెట్టుకుని కన్నులనద్దుకొని ముద్దుపెట్టుకొని “శ్రీసుల్తాన్ శ్రీ కటకపురనివాస రాజాధిరాజ అనంతనాధ సర్వశత్రువిచారణ శ్రీ గజపతి రాజ బహదూర్ స్నేహితుల రాజ సభికుడైన వసుబాలరెడ్డిగారు మా రాజ్యము విడిచి క్షేమంగా వారిరాజ్యం చేరుకోడానికి చేసే ప్రయాణంలో ప్రజలు, సేవకులు, సేనాధికారులు, తాబేదార్లు యావన్మందిన్నీ సర్వగౌరవాలతో వారికి నౌఖరీ చేయవలసింది. ఇది పాదుషా ఆజ్ఞ” అని చదివాడు. అందు చివర నవాబ్ ముద్ర ఉన్నది.
ఈ ఆజ్ఞాపత్రం చూచేటప్పటికి ఆ దళవాయి కొంచెమెచ్చుతచ్చుగా వణికాడు - అస్తమానం సలాములే - “అన్నీ సర్దండి” అని పారశీకంలో సిపాయీలకు ఆజ్ఞయిచ్చాడు. అది చూచి పౌరుషంతో వసుబాలవర్యుడు పక్కున నవ్వాడు.
అంతా నిమిషంలో సర్దారు. దళవాయిసలాముచేసి, “జనాబ్ ఖుదా వంద్ - మీరు త్వరగా మీదేశం పొండి - తాళికోట మీదుగా, అక్కడ మా సైన్యాలు వుండయి. ప్రజలు మిమ్మల్ని చాల గౌరవం చేస్తారు. నేను తాళికోట తహసీల్ తాలుక్దారులకు అంచె పంపుతుండా. తమరు ఆరుబగ్గీలు, నాలుగు ఒంటెలు, ఒక ఏనుగు, ఇరవై లష్కర్ హకుం.”
వసు: తాళికోటలో శుభ్రమైన బస ఉందయ్యా”
"జీహాఁ, పాండేకరు పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు, చాలా మంచిది.”
వసు: సరే, యిక నువ్వు పోయి నా వెంటవచ్చే దళం పంపించు; జల్దీ!
ఈ లోపుగా అన్నీ సర్దివెయ్యడం అయ్యింది. ఆ దళవాయి, సైనికులు వెళ్ళిపోయారు.
వసుబాలుని గుండె నిమ్మళించింది. ఏమో! తాను రాయల మనిషి అని గ్రహించి, ఇన్నాళ్ళనుంచీ వాళ్ళను చేసిన మోసం ఊహించి కొరత వేయిస్తే! చాలా గొప్పగండం తప్పింది. ఇక్కణ్నుంచి త్వరగా ప్రయాణాలు సాగించి వెడలిపోతే కొంత ప్రాణం కుదుటపడుతుంది. 3
తాళికోటలో పాండేకరు గృహంలో మకాంజేశాడు. వసుబాలరెడ్డి స్నానం భోజనం పూర్తిజేసుకొని ఊరుచూడ్డానికి బయలుదేరారు. అక్కడ కొన్ని గొప్ప దేవాలయాలున్నాయి. మంచి మసీదుంది.
శిల్పచాతుర్యము, భవననిర్మాణ కుశలత చూచి చాలా మెచ్చుకుంటూ బజారులో చిత్రమైన వస్తువులు కొన్ని కొనుక్కుంటూ, వసుబాలరెడ్డి కూలివాని నెత్తిమీద సరుకులతో యింటికి వచ్చినాడు. ఈ తెచ్చిన సామాను తన గుండ్రని తోలు పెట్టెలలో, కొంత కావడి పెట్టెలలోను సర్దుకుంటున్నాడు. అప్పుడు తన బట్టలమధ్య దివ్యమైన రవిక ఓటి కనబడ్డది. ఆ రవిక పొంకం చూసేటప్పటికి వసుబాలుని హృదయం హాయిమనే రాగాలు పాడింది. ఘుమఘుమ పరిమళించింది. ఆ రవిక, జరీపువ్వులు ఆణిముత్యాల అంచులుకుట్టిన ఆ మేలిపట్టు ఊదా రవిక ముట్టకోవడంతోనే వసుబాలుడి ఒళ్లు జల్లుమంది. ఒక దివ్యసుందర విగ్రహయైన బాలామణి రవిక విప్పి, మడత పెట్టి తన పెట్టెలో పెట్టినట్లేవుంది.
ఆ ఆనందంలో ఈ రవిక తన పెట్టెలోకి ఎల్లా వచ్చినది అని ఆలోచన కలిగింది. విద్యానగరం బయలుదేరినప్పటినుండి వుందా? తన పెట్టె లక్షసారులు సర్దుకున్నాడే! వుంటే కనబడదూ? పైగా తన ఇంటిలో ఇల్లాంటి రవిక తొడుక్కునే బాలికలు ఎవరున్నారు?
రవిక చేత్తో పట్టుకునే వున్నాడు. ఇంకా గుడ్డలు తీస్తూవుంటే మనోహరమైనచీర కనుపించింది. మాయా? కలా? పరవశం చేసేటంత అందంగా వుంది ఆ చీర. ఉదయారుణ కాంతిలా మృదువుగా వుంది. వెన్నెలలా లాలిత్యం తాల్చింది. చుక్కల మినుకులా లేనే లేదన్నట్లుగా అతిసన్నదనం. వేయి పూవులతావులు ప్రాణాలు కలిగించే మడతలు అక్కడక్కడ!
ఈ యింద్రజాలం అర్థంకాలేదు. ఆలోచనలేని ఆనంద తన్మయత్వములో ఒక నిమేషం మునిగిపోయి వసుబాలుడు ఇంక “అనగా అనగా ఒక రాజకుమార్తె రావాలీ - ”
అంటూ ఉండగా గభాలున తలుపు తోసుకొని మేఘంలో మెరుపులా ఒక వ్యక్తి సుగంధంతో నిండిపోయిన సుడిగాలిలా వచ్చి వసుబాలుణ్ణి కౌగిలించుకొని “నాధా, ఎన్నాళ్ళకు కలుసుకున్నాము!” అన్నది.
క్వచిదుష్టాంగాలు అతని దేహాన్ని చుట్టివెయ్యడంతోనే అతనికి కెరటాల్లాంటి పులకరాళ్ళు పుట్టినవి. కవుగిలించిన ఆ వ్యక్తి అంతతో పోనిచ్చినదా? కళ్ళు నిమీలితాలు చేసి, వసుబాలుడి తలవంచి అతనిపెదవులమీద ఊపిరాడకుండా ముద్దుల వర్షం కురిపించింది. వసుబాలుడు తన్మయుడై అప్రయత్నంగా అద్భుతంగా ఆనందతమంగా వచ్చిన ఆ సుధాప్రవాహంలో ప్రాణాల్ని ఎక్కడికో పోనిచ్చి ఏమీ తెలియకుండానే ఆ వ్యక్తిని తన వక్షానికి గట్టిగా అదిమివేసుకున్నాడు. ఎదురు ముద్దులు బదులిచ్చాడు!
ఇంతలో ఆ నూతన వ్యక్తి కౌగిలివదలించుకుంది. వెనుకకుపోయి అచ్చట ఉండే ఒక పీఠంపై చదికిలబడి “ఇప్పటికి నాప్రాణం మరల వచ్చింది” అని మెల్లగా అనుకున్నది.
ఆమె పదహారేళ్ళ బాలప్రాయాన వెలిగిపోయే బాలిక. చాలా అందముగా ఉంది. మోము మూటగట్టిన ముద్దులే. మంచి వెడల్పయిన కళ్ళు. ముక్కు సమంగా సన్నంగా రాగంలోని "సంగతి" లా ఉంది. ముద్దకరనిరం మొగ్గలే పెదవులు. చిన్ననోరు! దివ్యవిలాసమూర్తి. గాలిచేత చెదరిన నీలి మబ్బులా ఆమె జుట్టుముంగురులు చెదరిపోయి వున్నాయి. కళ్ళలో నీరు తిరుగుతున్నది. కాంతులు రెండు ఆ కళ్ళలోనే వెనక వెనక కనబడినై. పెదవుల చివర సంతోషాన్ని విషాదాన్ని సమైక్యంచేసిన సుడిగుండాలు అతి చిన్నవి తిరుగుతున్నవి.
'మీరు పంపిన బేగిరావులేఖ అందగానే ఆలస్యం లేకుండా అందలం మీద వచ్చాను.'
వసుబాలరెడ్డికి పిచ్చిఅన్నా ఎత్తివుండాలి. లేక చైతన్యం అన్నా తప్పి వుండాలి. తెల్లబోయి అలాగే చూస్తూ వున్నాడు. మాటలేదు.
ఆ అమ్మాయితో వచ్చిన దాసీలున్నూ ఆ యింట్లోనే ఉన్న పనికత్తెలున్నూ వెళ్ళిపోయారు.
ఆ బాలిక లేచి ఆ గదితలుపు మూసుకున్నది. అప్పుడామె కళ్ళు లేడికళ్ళలా బెదురుతున్నవి. రెండు చేతులతోనూ కళ్లు మూసుకొని వెక్కివెక్కి ఏడవటం మొదలు పెట్టింది.
ఇదంతా తన చరిత్ర కనుక్కోటానికి నవాబు పన్నిన తంత్రం కాదుగదా అనుకున్నాడు వసుబాలుడు. అతనికి చెమట పట్టింది.
అయితే ఈ అమ్మాయి తప్పకుండా పక్కాబోగంది. ఎంత పన్నాగం పన్నింది. తనగుట్టు తెలియడానికి! ఏమన్నా పొరపాటుపని చేయలేదు గదా తాను! అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాయల కవిత్వాలు వింటూ సమస్త భోగాలు అనుభవిస్తూ ఉండక యీ యుద్ధాలు ఎందుకయ్యా! తనకి ప్రాణ భయం లేదుగదా? అతని ఆలోచన లేడిపరుగులా పరుగెత్తుతోంది.
“వసుబాల రెడ్డివర్యా!”
ఉలిక్కిపడి తలయెత్తిచూశాడు వసుబాలుడు. ఆ బాలిక తనవైపు దీనత్వం వెదజల్లే అపాంగవీక్షణాలు పంపిస్తూ ఉంది.
“మహావీరుడగు శివబాలరెడ్డి సేనానాయకుణ్ణి స్మరించుకోండి.”
ఏమిటది? ఎవరీబాలిక? తన గుట్టు అంతా తెలిసింది. నవాబు పన్నిన పన్నాగం ఇది! సాయంత్రంలోపుగా తల యెగిరిపోతుంది. పారశీకభాష నేర్చుకోవటానికి ఎందుకు బీజపురం వచ్చాడో!
4
వసు: నువ్వు ఎవరవు?
బాలిక: మాది రాయచూరు కాపురము.
వసు: అయితే?
బాలిక: నేను ఈ దేశంలోంచి పారిపోవాలి.
వసు: ఏమిటీ?
బాలిక: బీజపురం నవాబుకు శ్రీ మూరురాయరగండ శ్రీకృష్ణరాయ సార్వభౌములవారికి యుద్ధం వచ్చింది. వసు: ఎందుకు?
బాలిక: శ్రీకృష్ణ రాయలయ్య వార్లంగారు రాయచూరు ముట్టడించారు.
వసు: ముట్టడిస్తే?
బాలిక: రాయచూరు నవాబుది. అందుకని యుద్ధం.
వసు: నాకీ గొడవ అంతా ఎందుకు?
బాలిక: మీచేతిలో నాప్రాణం వున్నది.
వసు: నీది రాయచూరు కాపురం అయితే యీయుద్ధం అంటే నీకు భయం ఎందుకు?
బాలిక: రాయచూరు పూర్వకాలం నుంచి విజయ నగరం వారిది.
వసు: అది నువ్వు పారిపోవటానికి కారణమెట్లా?
బాలిక: రాయచూరులో వుండే ప్రజలంతా విజయనగర పక్షపాతులు. నేనున్నూ విజయనగర పక్షపాతిని. అందుచేత విజయనగర రాజ్యంలోకి పోవాలి.
వసు: నువ్వు ఇక్కడ వుంటే ఏమి భయం? నువ్వు యిక్కడ వుండడం ఎలా తటస్థించింది?
బాలిక: నేను ఈ చుట్టుపక్కల మా చుట్టాల యిళ్ళల్లో ఉండటం తటస్థించింది. రాయచూరు సంగతులన్నీ గ్రహించాను. నేను శ్రీ రాయలవారి వేగులవారిలో ఒక రైతు అంతఃపుర నారీమణులతో మెలగుతూ అనేక వేషభాషలతో సంచరిస్తూ రహస్యములు ఎన్నో గ్రహించాను. అవన్నీ ఎల్లుండి ఉదయంలోగా అప్పాజీవారికి అందాలి. అట్లా అందాలంటే తమరొక్కరే ఆధారం.
వసు: మా ప్రభువుకున్నూ మీ రాయలవారికిన్నీ మనస్పర్ధలు చాలా వున్నాయి. మాది కటకపురం. నేను నవాబుగారికి స్నేహితుణ్ణి. నేను నీకు ఎట్లా సహాయంచేస్తాను? నా దగ్గిర మా ప్రభువు గజపతి మహారాజుల వారి ఆజ్ఞాపత్రము శ్రీ నవాబుగారి ఫర్మానాయున్నూ ఉన్నవి.
బాలిక: మీరన్నది కొంతనిజమే కాని, మీ చరిత్ర నాకు పూర్తిగా తెలుసును. శ్రీ శివబాల రెడ్డివర్యులను అందుకోసమే జ్ఞాపకం తెచ్చుకోమన్నా. నేను నవాబు తరఫు మనిషిని అని మీరేమిన్ని భయపడవద్దు. మీరీ వూరు సంవత్సరం క్రితం వచ్చి పారశీకం నేర్చుకున్నారు. మీ గ్రంథాలన్నీ చదివాను.
ఆ ఆఖరు ముక్కకు వసుబాలుడి హృదయం హాయిమంది.
"నేనున్నూ, మా తండ్రి ప్రతాపరాయలవారున్నూ రాయచూరులో రాయలవారి వేగు సైన్యంలో పనిచేసేవారం. అంతఃపురాల్లోని రహస్యాలు గ్రహించడంలో అతి చమత్కారంగా పనిచేస్తానని మా నాయనగారంటారు. ఆయన గ్రహించిన రహస్యాలు, నేను గ్రహించిన రహస్యాలు నా దగ్గిర వున్నై. ఆయన దారిగా ఆయన. నాదారిగా నేను పారిపోదామని అనుకుంటూ వుండగా, ఆయన పట్టుపడ్డారు. మా యిద్దరికి తప్ప యింక ఎవ్వరికీ యీ రహస్యాలు తెలియవు. మీ చరిత్ర మొదటినుంచీ నాకు తెలుసు. మాతండ్రిగారు పట్టుబడిన తర్వాత నేను మా చుట్టాల యిళ్ళలో మాయమయ్యాను. నా సంగతి నవాబు వేగు సైన్యాధిపతికి, అతని తాబేదార్లకు చాలామట్టుకు తెలియవచ్చింది. పూర్తిగా తెలియదు. చిన్నతనాన్నుంచి మగబిడ్డలు లేని మా తండ్రి నాకీ వేగువిద్య చాలా బాగా నేర్పారు.”
వసు: అయితే నేను నీకు ఎట్లా సహాయం చేయగలను?
బాలిక: మీ దగ్గిర నవాబు ఫర్మానా వుంది. అందులో వసుబాల రెడ్డిగారు అన్నది పంక్తిచివర ఉన్నది. అక్కడ భార్యతో అని చేరిస్తే సరిపోతుంది.
ఆమె ముఖం సిగ్గుతో కెంపువారింది.
వసు: నువ్వు అవివాహితవా?
ఆ బాలిక ఔనని తలవంచుకొనే తలూపి, కన్నులెత్తి అతనిమోము ఒకసారి చూచి మళ్ళీ కనురెప్ప వాల్చింది.
వసుబాలునికి ఏలనో ఆనందం వరదలుకట్టి సెలఏరులా పరవళ్ళెత్తింది.
వసు: నువ్వుచెప్పే సంగతులు యదార్థములన్న గుర్తేది?
బాలిక తలెత్తిచూచి, మరలవాల్చి చిరునవ్వులు పెదవుల చివర సుడులు తిరుగుతూ ఉండగా వెనుకకు తిరిగి ఏదో వస్తువుతీసి అతనివైపు తిరిగి అరచేతిలో ఉంచుకొని అతనివైపు చేయి చాచింది.
అది శ్రీకృష్ణరాయ సార్వభౌముని ముద్రిక. విద్యానగర ప్రజలలో చాలా కొద్ది మందికే తెలుసును. వసుబాలుడు ఆశ్చర్యం పొంది, గడగడ వణికి, ఆ ముద్రిక ఆమె హస్తంలోంచి తీసి కన్నులు కద్దుకొని, శిరస్సుపై ఉంచుకొన్నాడు. అతనికి ఆ బాలిక అంటే భయమూ, భక్తీ, గౌరవమూ కలిగాయి.
“సరే, సరే, అట్లాగే నీ ఇష్టంవచ్చినట్లే చేయి; కాని నేను మాత్రం ఆ ఫర్మానామాత్రం దిద్దలేను.”
“ఆపని నాదండి. ఆ ఫర్మానా నాచేతి కివ్వండి.”
“కాని నా ఫర్మానాలో ఉన్న సంగతులన్నీ నీ కెట్లా తెలిసినవి?”
“అయ్యా బీజపురంలో మిమ్మల్ని తనిఖీ చేయడానికి వచ్చిన ముస్లిం దళవాయి, సైనికులు శ్రీచక్రవర్తి వేగుసైన్యంలో ఉన్నవారే!”
వసుబాలుడు అత్యంత ఆశ్చర్యంలో మునిగిపోయాడు.
“అయితే నా పెట్టెలో వున్న రవికా, చీరా నీవా? అవి బీజపురంలోనే ఆ దళవాయి నా పెట్టెలో సర్దిఉన్నాడు కాబోలు!”
“అవి నావే! ఆ దళవాయే మీ పెట్టెలో పెట్టాడు. ఆయనే మీ కీయబడిన ఫర్మానా చూచాడు. మీమీదే మావేగు ఆధారపడిఉన్నదని మా నాయకులు నిశ్చయంచేసి మిమ్మల్ని సహాయం కోరుతున్నారు” అని అంటూ ఆమె ఫర్మానా తీసుకొని, తన కాటుకభరిణ తీసింది. ఆ భరిణెలో రెండు రహస్యమైనమీటలు నొక్కగానే ఒక చిన్న అర తెరుచుకుంది. ఆ అరలో సిరా ఉన్నది. ఆ సిరాతో అతని పేరుతో పక్కనే 'ఆమె భార్యతో' అని నాలుగు రేఖలతో పారశీకంలో రచించింది. 5
వసుబాలుడి కవిహృదయం యావత్తూ ఆ బాలికలో లయమై గంగా యమునా సంగమమైంది. ఆమె కౌగిలింతవల్ల స్మృతి వచ్చినప్పుడల్లా ఒళ్ళు ఝల్లుమంటూనే ఉంది. ఈ పదహారేళ్ళ బాలిక ఎన్నికష్టాలకైనా ఓర్చి స్వామికార్యం విజయంతో నిర్వహిస్తున్నది. ఈ బాలిక తన విషయంలో జరిపిన తంతు ఇతరులకంటే కూడా జరపలేదుకదా? అనిఅనుకున్నాడు. అప్పుడా బాల తానెక్కిన జోడుగుర్రాల బండిలోనుండి అతన్ని వాలుచూపులతోనే గమనిస్తూ, “వసుబాలరెడ్డిగారూ! నా విషయంలో కొన్ని అపోహలు మీకు రావచ్చును. నేను నా రహస్య చారిణీ చరిత్రలో మా తండ్రి గారిని దక్క ఇంకొక పురుషుని తాకలేదు. మీ విషయంలో “నువ్వు ఈలా ఈలా చేయి!" అని మా తండ్రిగారు ఆజ్ఞ యిచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం.”
“అబ్బేబే!” అని వసుబాలుడు ఆమెకు అడ్డము వచ్చినాడు. అతనికి చిరుచెమటలు పట్టినవి. ఈ బాలిక తన హృదయంలోని ఆలోచన యెట్లా గ్రహించగలిగింది! అంతటి దివ్య సౌందర్యాంగి, ఉత్తమ చరిత్ర యెప్పుడూ హీనత్వంలో పడిపోయి ఉండదు! అయితే తనయెడ అట్లా సంచరించవలసిందని ఈ బాలికతండ్రి ఎట్లా ఆనతియ్యగలిగినారు? కాని తన విషయంలో ఈ రీతిగా విచిత్రంగా సంచరించమని ఎందుకు చెప్పి ఉంటారు? ఇందులో ఏదో పరమార్థం ఉందని అతడనుకొన్నాడు.
ప్రేమాలోచనలు! మళ్ళీ అయ్యో అన్న భయం! ఏమిటి ఆమె తన్నలా ముద్దుపెట్టుకోడానికి కారణం? భార్యగా నటించడం అంత ఎక్కువగా!
వారు ప్రయాణంచేస్తూ ఉన్నారు. అతను గుఱ్ఱంమీద అధివసించి ప్రయాణం సాగిస్తున్నాడు.
అతని ఆలోచనలు గ్రహించినట్లా బాలిక "రెడ్డి ప్రభూ! నాతో వచ్చిన దాసీలు, మీ ఇంట్లో ఉన్న దాసదాసీలు నవాబు వేగులోవారు. అందుకని నేను అలా నటించవలసి వచ్చింది. అప్పటికిగాని వారి అనుమానం పోలేదు."
ఆ మాటలు అతని హృదయాన్ని క్రుంగచేశాయి. అంతేనా. నటనా? లేకపోతే తనకూ ఆమెకు సంబంధం ఏమిటి? మహారాజ కార్యానికి తన శీలం కూడా శంకించడానికి వీలయిన నటన చేస్తే తాను పశువై ఆమెకు యెదురు ముద్దులు - గట్టిగా - గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఓహో! ఆ క్షణం ఆద్యంత రహితత్వమొందింది. ఆమె పెదవులంత మధురముగా ఉన్నవేమి? ప్రియురాలి పెదవు లంత మధురముగా ఉండునేమి? అబ్బా! ఈ ఆలోచన లేమిటి తనకు! ఈ బాలిక ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్తుంది. ఈ అమ్మాయి దగ్గిర ఎవ్వరు రహస్యం దాచుకోగలరు?
వసుబాలు డెక్కినగుఱ్ఱం ఆమె బండి వెనక్కు పోనిస్తాడు. ఆమెను ఎన్నోవిధాల వర్ణించుకుంటాడు.ఇది ప్రేమా? అనుకుంటాడు. ఈమె తండ్రి ఎవరు? ఈలా ఈమెను ఒంటరిగా విడిచి పారిపోయాడు కదా! ఎలాగో విధివశాత్తు తానక్కడ ఉండడం సంభవించింది. లేకపోతే ఆమె బ్రతుకేమి గావలె? ఎల్లాగ తాను ఈ నవాబు సైన్యాలు దాటడం? ఏలాగు ఈ బాలికను తాను సురక్షితంగా శ్రీనవాబు సైన్యాల పాలపడకుండా కాపాడుట?
ఈ బాలిక ఎంత తెలివైనది! ఎంత చక్కగా మాట్లాడింది. తాను ఎంత నేర్పుగా వ్యాపారం సర్దుకువచ్చిందీ! ఎలాటి క్లిష్టమైన స్థితికి వచ్చినా ఆ బాలికే అన్నీ సర్దుకుపోగలదు!
అదృష్టవశాత్తు అతని ప్రయాణం కూడా రాయచూరు ప్రక్కనుంచే వెళ్ళవలసి ఉన్నది. అక్కడనుంచి ఉళింది, అక్కడనుంచి పానగల్లు, అక్కడ నుండి దేవరకొండ, పిల్లలమర్రి, అటునుండి విజయవాడ అలా బీజపూరు నవాబు ఉద్యోగులు అతని ప్రయాణం ఏర్పాటుచేశారు.
దారిపొడుగునా, బీజపుర సైన్యాలే ఎదురుపడుతున్నవి. వారు మన ప్రయాణీకుల్ని ఆపుచేయడం, మన యాత్రికులు సుల్తాన్‌గారి ఫర్మానా చూపిస్తుండడం, సైనికులు ఆ ఫర్మానాకు సలాములు చేయడం పోనివ్వడం నాలుగైదుసారులు జరిగింది. ఎప్పటికప్పుడు వసుబాలుడి ప్రాణాలు అయిదున్నూ అతని అరచేతిలోకి చేరేవి.
రెండురోజులైన వెనక వసుబాలుడు, ఆ బాలికయు తమ అనుచరులతో ఉళింది చేరుకొన్నారు. దారిపొడుగునా ఆ బాలవసుబాలునికి వంటచేయించడం, వడ్డింపించి, తానాతని వెండి కంచంలో అతను భోజనం చేసినవెనుక భోజనం చేయడం మొదలైన పనులు చేసేది. అతనికి తాంబూల మందిచ్చేది; వారితో కూడా వచ్చే చిన్నలష్కరులో, అమ్మాయి దాసీలలో పిల్లిచూపులుగల వేగులున్నారని ఆమె అతనితో రాత్రిళ్ళు వాళ్ళిద్దరు ఒంటిగా ఉన్నప్పు డొకనా డామె యాతనితో చెప్పింది.
ప్రయాణపు పట్టి మంచములు వారి సామానులో ఉన్నవి.
వారు తమ గదిలో చేరిన కొంతసేపటివరకు ఆమె వీణ వాయించేది. అతని పాదాల నొత్తునది. ఆ వెనుక ఆమె తలుపు గడియ వేయునది.
గడియవేసి, తలుపుకు తెరకప్పి తన మంచము దూరముగా లాక్కొని, ఆమె నిర్భయముగా నిద్రపోవునది. అతడు నిద్రలో ఉన్న ఆ బాలిక అందాలు గమనిస్తూ, ఆమెను గూర్చి ఒక బాలికోపాఖ్యానము రచించసాగాడు. అతని ఆలోచనలకు మేరలేదు. తన గురువు రచించిన మను చరిత్రలో ప్రవరాఖ్యునిలా తాను అసిధారావ్రతమాచరించాలా? ఏమిటీ విపరీత దాంపత్యము? తమ ఈనాటి చరిత్ర సుఖాంతమైనచో, ఆ బాలిక మరల తనకు కనపడునా?
ఎవరి బాలిక ఈమె! ఈమె తండ్రి బీజపూరు సైనికుల బారినుండి తప్పించుకొని పారిపోయినట్లు దారిలో ఒక రెడ్డి వేషమున ఒక చారుడు యాదాలాపమున వీరికి తారసిల్లినట్లు వచ్చి ఏదో వారిసంజ్ఞల ప్రకారము ఆ బాలికకు తెల్పి తనదారిన తాను పోయినాడు.
ఉళింది సాయంకాలానికి చేరుకొని దేవాలయ సత్రంలో బసచేశారు. ఊరంతా బీజపూరు సైన్యాలు నిండివున్నాయి. సత్రంలో దిగగానే ఒక సర్దారు కొంతమంది ఫౌజుతో వచ్చి వసుబాలుణ్ణి నవాబుగారి ఫర్మానా చూపించమని కోరాడు. వసుబాలుడు లోపల వణికాడు. కొంచెం కోపము వచ్చింది. మాట్లాడకుండా మొఖం చిట్లించుకుంటూ ఫర్మానాను తీసి చేతికిచ్చాడు.
ఆ సరదారు దీక్షతో ఫర్మానాను ఎగాదిగా చూశాడు. కాగడాలు తెమ్మని ఆ వెల్తురులో పరీక్షించాడు.
సర: మీ భార్య పేరు?
అమ్మయ్యో. ఇదేమి ప్రశ్న? వసుబాలుని గుండె గుభిల్లుమన్నది. అయినా ఆమె పాఠాలు కొన్ని చెప్పిఉన్నది. “సిరియాలదేవి” అని అతడు ప్రతివచనమిచ్చాడు.
సర: మీకెప్పుడు వివాహం అయింది.
వసు: ఎడన్నర్ధం.
సర: మొదట వచ్చేటప్పుడు భార్యతో వచ్చారా?
వసు: లేదు. కాని మా అత్తవారూరికి బేగిరావుటపా పంపాను. ఆవిడ వచ్చింది.
సర: ఏ వూరినుంచి?
వసు: మధిర దగ్గర మడవకొండ.
సర: అవును, మీరు కొండపల్లి జాగిరునుంచి వచ్చి ఉంటార్. మాకు అర్థం అయింది. మాకు మీ సంగతి ఇది వర్కు తెల్సును. అయితే మీరు మా బీజాపూరునుండి యెల్లేయాల. మీబీబీని రప్పించారు. ఆ అత్తవార్కీ ఇంట్కీ ఎల్లలేకపోయార్ మీరు ఒక్కరే?
వసు: ఖమ్మం మెట్టులో మా భార్యగారి మేనమామగారు ఉన్నారు. వార్నిచూచి అక్కడ నెలరోజులు మకాం సేద్దాము అనిన్నీ, కలిసిప్రయాణం చేయడం పడుచువాళ్ళకు సరదా కాబట్టిన్నీ - ...
సర: సరేనయ్యా, పయానంలో ఔరత్ ఉంటే దొంగలిబయం ఎక్వాకాదు అండీ?
వసు: మీ రాజ్యంలోను గోలకొండ రాజ్యంలోనూ మేము దొంగలికి భయపడం.
ఆ ముక్క వసుబాలుడనగానే, సరదారుకు ఆనందం కలిగింది. అతడు మళ్ళీ మాట్లాడకుండా వసుబాలుణ్ణి ఒక గదిలోకి తీసుకొనిపోయి, అన్ని దుస్తులు విప్పించి శల్యపరీక్షచేశాడు.
“సరే, మీరుపొండి!” అని ఆ సరదారు అన్నాడు.
"మీకి భార్యకి తనిఖీ చెయ్యాలి మాలో ఆడవేగువాళ్ళు వున్నారు అండీ. వార్కి తనిఖీ చేస్తారు. సిత్తం” అని ముగించాడు.
వసు: ఏమయ్యా శ్రీగజపతి మహారాజువారికి ముఖ్య సభ్యుల్లో ఒకణ్ణి. వారి శ్రీముఖం ఉన్నది. వారికి ప్రాణస్నేహితులైన శ్రీశ్రీ సుల్తాన్ బహదూర్ వారి ఫర్మానా ఉన్నది. అప్పటికీ నువ్వు అగౌరవం చేస్తున్నావు. ఇది మా ప్రభువుకు విన్నవించుకోవాలి. అటుపైన ఏమిజరిగేదీ నువ్వే ఆలోచించుకో.
సుబే: సలామ్! మీరు చెప్పింది నిజం. అయితే నేన్ బీజపూర్ వేయి సైన్యం సరదార్. మా రాయసూర్కా రహస్యాలన్ని ఒకటి అడ్గి మీకీ ఔరత్ అంతా తీస్కుపోయింది. ఆమె మాయామంత్రంలా మాయం అయిపోయింది అండీ! అందుకు మేము ఈలాంటి కట్టదిట్టాల్కు చేషాం; అందుకు మాకీ క్షమించాల. ఇంతలో ఆ బాలిక పరీక్ష అయింది. ఒక స్త్రీ మేలి ముసుకు వేసుకువచ్చి ఒక కాగజ్‌ముక్క ఆ సరదారుకు ఇచ్చింది. అది వసుబాలుడు తన మామగారికి భార్యను పంపమని రాసిన ఉత్తరం - భార్యను త్వరగా పంపించమని. మడవకొండ మామగారి నివాసగ్రామం. తాను కొంతకాలం బీజపూరులో భార్యతో ఉండాలని ఉన్నదనీ, తమ పారశీభాష నేర్చుకోడం పూర్తికాగానే, తానూ తనభార్య బయలుదేరి ఖమ్మం మెట్టుపోయి అక్కడ నెలరోజులు ఉంటామనీ ఆ తర్వాత మడవకొండ వస్తామనీ వసుబాలుడు మామగారికి రాసిన ఉత్తరం.
సుబే: అయ్యా నేను సెప్పిన లడ్కీకి యెరిగిన ఔరతులు కొంత మందిక్కి ఉన్నారు. వారు రాయచూరు వాళ్ళు. వాళ్ళకి మా కబురు యెల్లింది. రేపట్కి వస్తార్? అందాకా మీరు ఈ షత్రంలో ఉండవాలా ఉంది.
6
వసుబాలుడి హృదయంలో రాయిపడింది. అతడు సరే, అని అతి ధైర్యంగా పలికి, లోనికిపోయాడు. గదిలో బాలిక సేవకులు పరచిన తివాసీ పైనకూర్చుని ఉంది.
“ఇది అంతా ఎట్లా -” అని వసుబాలుడు ప్రారంభించబోయాడు.
“ష్” అని ఆ బాలిక సైగచేసింది. తన దగ్గిరగా కూర్చుండమని ఆమె వసుబాలునికి సైగచేసింది.
వసుబాలుడు ఒళ్ళు ఝల్లుమంటుండగా ఆ బాలిక దగ్గరకుపోయి కూర్చున్నాడు.
ప్రతిదళమువారు జరుపుతున్న ఆ నాటకము వసుబాలుణ్ణి ఏ దివ్య లోకానికో తీసుకొని పోతున్నది. ఆమె బంగారుచాయలో స్వర్ణనదీ ప్రవాహరేఖలు పోల్చుకొన్నాడు. ఆమె దేహసౌభాగ్యంలో దేవ పారిజాత పుష్పాల మాలిక చూచినాడు. ఆమె సన్నని నడుంలో ఆధ్యాత్మిక రహస్యం పోల్చుకొన్నాడు. పయ్యద అలంకరించిన ఆ బాలిక వక్రం పాల్కడలిలో అమృత కలశాలుగా ఊహించుకున్నాడు. ఆమె చేతులు రామయామాత్య గీతాలట. ఆమె కన్నులు, ఆ కన్నులలోని చూపులు రాగతాళాల మేలిమి కలయికట, కోల గాక గుండ్రము గాక పరమ శిల్ప స్వప్నమైన ఆ బాలిక మోము శారద వీణాజనిత దేవగాంధారరాగమట. ఆమె పెదవులలో లక్ష్మీ హస్తాంచిత లీలా కమలమాధుర్యాలు రూపుపొందాయట.
ఈ బాలిక తన జీవితంలో ఈలా ప్రవేశించడం పాల సముద్రంలో పవళించిన రంగనాథుని యెదుట లక్ష్మీబాల ఉదయించడం వంటిదేనట!
“వసుబాలరెడ్డిగారూ!”
వసుబాలుడు ఉలిక్కిపడి ఆ చీకటిలో ఆమెవైపుకు మోము తిప్పినాడు. సువాసన పూరితాలై ఆమె విశ్వాసాలు చల్లగా అతనిమోము తాకినవి.
ఆ మోమంతా సమీపంగా దర్శనముకాగా వసుబాలుడామె హృదయానికి గాఢంగా అదుముకొని, తన వేయిజన్మాలు, తన కోటికవిత్వాలు సార్థకం చేసే తమిపూరిత చుంబనాన్ని పొందుదామన్న కాంక్షను అక్కడక్కడే ఆపుకొన్నాడు.
ఆ బాలిక రహస్యంగా అతని చెవిలో “బంగారుకాటిక భరణిచూసి మీట సంగతి తెలియక నాకు తిరిగి ఇచ్చివేసింది. రేపు నన్ను గుర్తించగల ఆడవేగువాళ్ళు వస్తారు. నన్ను అనవాలు పడతారు. నేను మిమ్మల్ని వృథాగా ప్రాణాపాయస్థితికి తీసుకురావాలి. నేను పారిపోతాను. మిమ్మల్ని ఏమీ చేయరు. కైదుమాత్రం వేస్తారు" అని తెలిపింది.
ఈ బాలిక తన్ను వదలి పారిపోవడమే! అని వసుబాలుడనుకున్నాడు. తన్ను రక్షించడానికా ఈమె ఈ మార్గం తెలుపుతున్నది.
“నువ్వు పారిపోతే వాళ్ళకు పట్టుబడకుండా వెళ్ళగలవా?”
"ఏమో! నాకు శక్తి ఉన్నంతవరకూ ప్రయత్నం చేస్తాను. నా ప్రభువుకోసం నా ప్రాణం పోతే ఏమి?”
“ఓహో! నువ్వు ఒక్క దానవే పారిపోగలవా? ఒక మనిషివస్తే పరుగెత్తగలవా? నీకు సహాయం చేసేవాళ్లు ఎవరు దొరుకుతారు?”
“మా నాయనగారు 'వేగువారు పరుల సహాయం కోరరు; ఎవరికివారే సహాయం- ప్రాణంకు వెరవవద్దు, అని చెప్పేవారు.”
వసుబాలుడు గజగజ వణికాడు. అతనికి ఏమీ పాలుపోలేదు. ఈ బాలికతో వెడితే, తానూ ఆమెకూడా పట్టుబడతారు. తప్పదు. అప్పుడు ఇద్దరికీ మృత్యువే. మృత్యు వెంత భయంకరమైంది? ఎన్నెన్ని భాషలు నేర్చుకొని -
ఈ ఆలోచన కడ్డమువచ్చి, ఆ బాలిక "వసుబాల ప్రభూ! మీరు సకల భాషాకోవిదులు, మహాకవులు. మీరు పట్టుబడితే వారు కోపంతో మీకేదైనా శిక్ష విధిస్తే మీరు భరించలేరు. నేను వేరు. స్త్రీని. ఈ వృత్తి నేర్చుకోవడమే ప్రాణం ఒడ్డడం. మీరూ మీవ్రాసిన గ్రంథాలు మీ గురువుగారైన పెద్దనామాత్యులవారికి వినిపించాలి. శ్రీ రాయలువారికి అంకితం ఇవ్వాలి. తోటి సహాధ్యాయుల మెప్పుపొందాలి. కాబట్టి నేనిక్కడ ఉంటాను. మీరు వెళ్ళిపొండి. నన్ను పరీక్షచేసి నాచేత నిజం చెప్పించడం మొదలగు పనులలో కొంతకాలం వ్యవధివస్తుంది. మీరీలోపుగా చాలా దూరం వెళ్ళి మాయమై పోవచ్చును” అని అన్నది.
వసుబాలుడు ఉలిక్కిపడ్డాడు. ఆ బాలికమాట ఒక్కనిమేషం మరచిపోయాడు. భయంతో ఆమె దగ్గిరనుంచి కొంచెం దూరం జరిగాడు. శ్రీ రాయల సభావైభవం, ఆనందంతో కూడుకొని ఉన్న తనదైనందిన జీవితం, తన ఉత్తమ కావ్యరచనా అన్నీ జరుగుతుంటాయే!
కాని, ఈ బాలికను ఎలా వదిలిఉండటం? ఎంత సుందరాంగి! ఎంతటి వీరహృదయ! మహారాజనినా, తండ్రి అన్నా ఎంత అచంచలభక్తి! ప్రాణాలకైన వెరవనిధీర! అయినా స్త్రీలకు రాజసేవ అవసరమేమిటి? సరస్వతీసేవా, పతిసేవా చేస్తూ కూర్చుండకూడదా?
ఓహో! ఈ బాలిక కష్టాలకు ఆదిదేవతలయినా, తన ప్రభుసేవకై నిర్భయంగా రాజసేవ దివ్యపథాన సంచరించే అమృత హంసిలా ఉంది.
ఇంతలో అస్పష్టంగా అతని చెవులకి వెక్కి వెక్కి ఏడుపు వినవచ్చింది. వసుబాలుడు ఉలిక్కిపడి హృదయం గతులు తప్పి ఆ అమ్మాయి వైపు తిరిగి ఆమె చేయిపట్టుకొని ఆ బాలికను తన హృదయాని కదుముకొన్నాడు. అతని వక్షంపై వెచ్చని కన్నీటి చుక్కలు జలజల రాలాయి.
“ఓ బాలికా! నీ పేరు సిరియాలదేవి కావచ్చును, కాకపోవచ్చును. నాకు మాత్రం సిరియాలదేవివే. ఆనాడు నా బ్రతుకులోని నువ్వు ఒక ఇంద్రజాలంలా, అమృతవర్షపాతంలా, వేగంగా అవిచ్ఛన్నంగా వచ్చిన ముహూర్తాన నేను దివ్యభూములకు తేలిపోయాను. నేను వట్టి పిరికివాడిని, నిన్ను రక్షించుకొనుటకే భయపడే హీనుణ్ణి! నిన్ను వదలి నన్ను రక్షించుకొందామనుకొన్న నికృష్టజీవిని. నువ్వు వీరకర్మవ్రతవు. ఉత్తమ చరిత్రవు. అపర రుద్రమవు. నువ్వు సత్యభామవు; నీజీవితము పవిత్రజాహ్నవీ ప్రవాహమే. నన్ను క్షమించు! సిరియాలదేవీ! నన్ను క్షమించు. నన్ను నీసేవకుణ్ని చేసుకో. నువ్వు ఒక్కదానవే వెళ్ళలేవు. నువ్వు నవాబు సైనికుల చేతుల్లో పడిపోతావు. నువ్వు వేగంగా పరుగిడలేవు. అవసరమైతే యు....ద్ధం యుద్ధం....చేయ... లేవు. కాబట్టి మనం ఇద్దరంకలిసి ఉండవలసినదే.”
“మీరు కవులు! మీరు ప్రజల హృదయం ఆనంద తాండవ గతులకు ఉమ్మలం చేయగలరు. మీకు తుచ్ఛ యుద్ధాలు వద్దు. ఈ హింసా వద్దు, నాకు కళ్ళనీళ్ళు రావడానికి కారణం భయంకాదు, ఆడదాన్ని.... చేతగానిదాన్ని. ఇదివరకు ఏ పరపురుషునీ ముట్టనైనా ముట్టలేనిదాన్ని! అలాంటి అబలను బాలికను. నేను నా ప్రభువునకు సేవచేయలేను. నాకు మా నాయనగారు అప్పగించిన ఈ పరమోత్తమ ముఖ్యాతిముఖ్య కార్యము నేను చేయలేనేమో అని ఆలోచన గలిగి, కంట నీళ్లు వచ్చినవి. కంట నీరు పెట్టడం మా ఆడవాళ్ళ స్వభావమే కదా” అంది.
వసుబాలుడు ఆమె మాటలకు పరవశత్వం పొందినాడు. ఆమె జీవితమే కవిత్వమా అని అనుకున్నాడు. తన ప్రభువు కృష్ణరాయలు మహాకవి, ఉత్తమ విద్వాంసుడు, ఉత్కృష్ట హృదయుడు, అసమాన వీరుడు, అకుంఠిత భక్తుడు, అతడు లోకకల్యాణం కోసం తన ప్రాణానికి వెరవడు! ఇక తానో! ఏమి కవి, ఏమి వీరుడు? ఎలాంటి పుత్రుడు తాను మహా సేనానాయక శివబాలరెడ్డి ప్రభువుకు? అలాంటి తానీ బాలిక నీడనైన చరించడానికి తగునా? ఓహో! ఈమె తోటలోని మంచిగంధపు తరువు, వెన్నెల, పారిజాతకుసుమము, అమృతము, భగవద్గీతా మాధుర్యం!
వసుబాలుని ఒడలంతా విద్యుత్ ప్రవాహాలు ప్రసరించాయి. ఉత్సాహం తేజస్సూ అతనికి రెక్కలై మొలిచాయి. ఆమెను మరీ దగ్గరగా అదుముకొన్నాడు. ఆమె చెంపలు తన హస్తతలాలతో అదిమి ఆమె మోమెత్తి ఆమె కన్నులా చీకటిలో పారకించినాడు. ఒడలు తెలియక పెదవులు చుంబించినాడు.
వెంటనే అతడు ఎంత తప్పు చేసినాను. అని కుంగిపోయినాడు. ఆమెను తన కౌగిట్లోనుండి వదలి "క్షమించు దేవీ! నేను పిశాచినైనాను!" అన్నాడు.
ఆమె వసుబాలుని మెడచుట్టూ చేతులుచుట్టి "ప్రభూ! ఇదివరకే నాకు ప్రభువులు మీరు. అవసరముకొలది ముద్దు పెట్టుకొనుట నాకు ప్రభువు కాబోవువానినిదక్క నే నెల్లా అలా చేయగలుగుదాన ననుకొన్నారు. ఆ రహస్యం శ్రీ శ్రీకృష్ణరాయ ప్రభుస్కంధావారం చేరిన తర్వాత మనవి చేస్తాను" అని అంటూ మరల ఆమె అతని పెదవులు గాఢంగా చుంబించి, ఆయన కౌగిలి వదలి వంగి, ఆయన పాదాలు తన కన్నుల కద్దుకుని “మహాకవీ! ఇక మీరు మహావీరులుకండి" అన్నది.
అతని చెవిలో ఆమె గవాక్షపు కఱ్ఱఊచలు లాగివేయమని కోరింది. అత డట్లు చేయగానే ఇద్దరు చప్పుడు కాకుండా ఆ చీకటి గదిలోంచి సత్రం వెనకవున్న సందులోపడి ఊరి బయట పొలాల్లోని చీకట్లలో మాయమయ్యారు.
సత్రంలో నీళ్ళగది కెదరుగుండా పహరాజవాను ఏ ఏమరపాటూ లేకుండా పారా ఇస్తూనే ఉన్నాడు.
ఆ రాత్రల్లాభయంతో ఒణికిపోతూ అలసటపడి ఒదిగిపోతూ కాళ్ళనొప్పులతో కణతలబరువుతో యిరవై అయిదుమైళ్ళు నడిచారా కాందిశీకులు! డొంకలు, గుట్టలు, కత్తుల్లాంటి రాళ్లు, పెద్ద బండరాళ్లు దారి పొడుగునా, అపశృతులూ ఎదురుపడుతున్నాయి. అపశృతులలోని అపస్వరాలులా కీచురాయిలు. అడవిమృగాల ధ్వనులు గుండెల కలతపెడుతున్నాయి. ఈ అపశృతి స్వరాలమధ్య తప్పించుకొని ప్రసరించే కృష్ణాకల్యాణి రాగిణిలా వారిరువురూ, ఒకరి కొకరు ఆసరాగా ఆకాశాన చుక్కలే వీణ మెట్టులుగా ఆనవాళ్ళు సరిచూచుకుంటూ దక్షిణంగా పోయారు.
చల్లనిగాలి వీచింది. అస్పష్ట మధురగీతము వినబడింది. కొంత అరణ్యము దాటగానే, ఎట్టయెదుట కృష్ణానది.
దారిలో నవాబు సైన్యాల శిబిరాలు కనబడ్డాయి. డేరాలు ఆ చీకట్లో తెల్లని గోడలులా ఉన్నవి. భయపడుతూ చుట్టు దార్లు చుట్టి - నడుస్తూ కృష్ణ ఒడ్డుకు వారిద్దరూ చేరారు.
నీరసము కమ్ముకుంటున్న కొలది, ఆయాస మెక్కువైన కొలది వసుబాలుడికి ధైర్యము, ఆనందము ఇనుమడిస్తున్నాయి.
ఇక కృష్ణ ఎల్లాగు దాటడం? అక్కడ కృష్ణ ఒడ్డు రాళ్ళతో కత్తిరిగట్టు మళుపుతిరిగి ఉన్నది. అవతల అస్పష్టంగా ఇసక ఒడ్డూ, గుట్టలూ కనపడుతూన్నవి. నెమ్మదిగా ఆ ఒడ్డునుండి నీటిమట్టానికి దిగడానికి వారిద్దరు ప్రయత్నం చేసే సమయంలో ఆ చీకట్లోనుండి ఒక పిశాచి ధ్వని, “ఎవరు మీరు? అక్కడే కదలకుండా ఆగండి" అని వినవచ్చింది. ఇద్దరూ నిశ్చేష్టులై అలాగే నిలుచుండిపోయారు. ఇంతలో ఎవరో చెకుముకి వెలిగించి కాగడా ముట్టించారు. నవాబు సైనికులు వీళ్ళదగ్గిరకువచ్చి వీరిరువురనూ ఎగాదిగాచూచి వారిలో వారేదో సైగచేసుకున్నారు.
ఒకడు: ఎవరు మీరు?
వసు: మేము దారి తప్పిపోయిన బాటసారులము.
రెండ: ఇక్కడ ఎక్కడ దారితప్పిపోయారు?
బాలిక: మువ్వమట్టి గ్రామంనుంచి గద్వాల పోతూ ఉంటిమి. ఇక్కడికి నాలుగు మైళ్ళలో దొంగలు కొట్టిదోచినారు. మేము ఎవరికివారము చెదరి పారిపోయాము. మా యిద్దరం ఇలా పారిపోయి వచ్చాము. ఒకడు: అల్లా మిమ్మల్ని చూస్తే మాకీ సాలా అనుమానంగా వుంది. ఇంకా కొలదిదూరంలో మా సైన్యం మకాం చేసింది. అక్కడికి మీరిద్దరూ రావాలి.
వసుబాలుడు తన సిరియాలదేవికేసి పారచూశాడు. ఆ అమ్మాయి అతనివైపు తీక్షణమైన వీక్షణం పంపించింది. అతని ఒళ్ళు పొంగి పోయింది.
పారా అతడు వాళ్ళీద్దరివైపు ఆ కాగడా వెలుతురులో పార చూచాడు. తుండులులా ఉన్నారు. కత్తులతో నల్గురూ! ఈలాంటి రాక్షసులతో తాను యుద్ధం చేయగలడా?
ఇంతలో అందులో ఒకడు సిరియాలదేవి చేయిపట్టుకొని తనవైపు లాక్కున్నాడు. అమ్మాయి ‘ఓయి!' అని అరచింది.
ఆ మరుసటి క్షణంలో ఒక్క సింహపుగాండ్రు పెట్టి ఒక్కగంతులో వసుబాలుడు వానిమీద కురికి ఆ చేయిపట్టుకున్న సైనికుని పొట్టమీద తన్ని వానిచేతిలోని కత్తిలాక్కున్నాడు. వాడు వెనక్కుపడి ఒక రాయితగిలి, చైతన్యరహితుడయ్యాడు. ఈ సంఘటన ఒక మెరుపులా జరిగింది.
రెండవవాడు కాగడా అవతలపారేసి కత్తిదూసి వసుబాలుడిమీదకు ఉరికాడు.
తరాలనుంచీ వసుబాలుడు కుటుంబంలో ఉన్న క్షాత్రం రాళ్ళు పెకలించుకొని వచ్చేనదిలా చిమ్ముకుంటూ వచ్చింది. తండ్రి మహావీరుడు. శివబాలరెడ్డి ఖడ్గయుద్ధ ప్రావీణ్యము రాయలదేశంలో ప్రతివారిచేత పొగడ్త పొందింది. ఆ ప్రావీణ్యము వసుబాలుని ఆత్మలోఉంది. దేహంలో సమైక్యమై దాగి ఉంది. నాలుగైదు పొడుపులు, అడ్డుకోతలు, ఏటులు, మెలికలూ తళతళలాడినవి. ఆ సిపాయి తన డొక్కలోంచి చిమ్మేరక్తం చేత్తో ఆపుచేసుకుంటూ పడిపోయాడు.
ఆ బాలిక ఇదంతా చూస్తూనే ఉంది. వసుబాలుడి సాహసం చూచి ఆశ్చర్యపడ్డది. ఆమెకు అపరిమిత సంతోషం కలిగింది. ఆమె కన్నులు నక్షత్రాలులా మిలమిలలాడినవి. పడివున్న సిపాయి లేవకుండా ఆమె అతని పీకపైన కాలువైచి త్రొక్కి ఉంచి, అతని నడుమున ధట్టీవేలాడు కైజారుతీసి, కదిలితే పొడిచివేయవలెనని ఉన్నది.
అతనికి స్పృహ వచ్చి కదిలినాడు. బాలిక వెనక్కు తప్పుకొన్నది. వసుబాలుని మహోగ్రమూర్తినీ స్నేహితుని అవస్థాచూచి అతడు వసుబాలుడికి మోకరించాడు. వసుబాలుడు పారిపొమ్మని అతనికి సైగజేశాడు. ఆ భటుడు ఒక్క చిటికలో ఆ డొంకల్లో మాయమైపోయాడు.
వసుబాలుడికి ఉత్సాహం సడలింది. భయము కలిగి గజగజలాడిపోయినాడు. తానెలా చంపగలిగా డొకమనుష్యుణ్ణి - మాంస భోజనాదికాలు మానివేసినా తాను?
అతడు కూలబడి వణుకుతూ అప్పుడే ఎరుపులలము ఆ అస్పష్టసంధ్యలో లీనమైపోయే ముఖం రెండు చేతులా మూసుకున్నాడు.
ఆ బాలిక గబుక్కున బాకుపారవేసి వసుబాలుడి దగ్గరకు గంతువేసి అతన్ని కౌగలించుకొని "మీరు చూపిన ధైర్యం, వీరత్వము, ఆయుధ కుశలత అపరిమితమైన ఆనందాన్ని కలిగించినవి. మీకేమిభయం? మీరు శివబాలరెడ్డి కుమాళ్ళుగదా! ఒక్క మనుష్యుణ్ణి - విరోధిని- మన ప్రాణాల్ని నిశ్చింతగా నల్లిని చంపివేసినట్లు తీసివేయ దలుచుకున్నవాడిని చంపుట ఏమి దోషము?” అని ఆనందాశ్రునయనాలతో అతని ముఖం చూసింది. వసుబాలుడికి జీవితం ధన్యమనిపించింది. ఆ వెలుగు చీకట్లో చెదరి పోయిన ముంగురులతో కాంతులను వెదజల్లే మోముతో సౌందర్య నిధులైన కన్నులతో తన్ను కౌగలించుకున్న బాలికనుచూచి వసుబాలుని పిరికితనం తెల్లవారుముందులా పటాపంచలైంది. అతడామెను ఒడిలోనికి తీసుకొని మూర్ధ మాఘ్రాణించి, “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని చిన్న ప్రశ్న వేశాడు.
“నాకు మొదట ఇష్టంలేదు; కాని మిమ్మల్ని చూచినకొద్దీ నా హృదయం సంపూర్ణంగా మీపాలయింది. అప్పటితో నా ఆత్మ నా సర్వస్వము తమలో లీనమైపోయింది.”
వసుబాలుడి హృదయం రాగాలు పాడింది.
“అయితే పరపురుషుణ్ణి అనైనా ఎంచక నన్ను తాళికోటలో...”
“మా నాయకుడు కొద్ది వారాలక్రిందట మానాయనగారికి రహస్యమైన అంచె పంపించాడు. అదిచూచి ఆయన గడియలకొద్ది అదే ఆలోచించుకున్నారు. ఒకరోజున ఆయన నన్ను మారువేషం వేసుకోమన్నారు; ఆయనా వేసుకున్నారు. ఇద్దరం బయలుదేరాము. బీజపురంలో నవాబుగారి మోహన్ ఖానాలో మీదగ్గరకు వచ్చాం. ఒక బుధవారం ఒక ముసలి తురక నవాబు ఆయన కుమారుడూ రాలేదూ?”
“ఆ యిద్దరు మీరా! నిజంగా!" ఆ బాలికను తన హృదయానికి ఇంకా అదుముకున్నాడు.
“మేము బయటికి వెళ్ళిపోయిన తరువాత మా నాయనగారు నన్ను చూసి “అమ్మాయీ అరవిందా, ఆ అబ్బాయియే నీ భర్త, అది శ్రీశ్రీ మన చక్రవర్తి ఆజ్ఞ సుమా!” అన్నారు.
వసుబాలుడు ఆశ్చర్యంచేత అనిమిషుడయ్యాడు. “ఏమిటి! నీ పేరు అరవిందా! ఎంత మనోహరనామం. అరవింద! అరవింద! ఈ నామమే నా బ్రతుకు పరమావధిని నాకు ప్రత్యక్షం జేయగలదా?” అని అతడు పులకరించిపోయినాడు. అతనికి వేయిఏనుగుల బలం వచ్చింది.
తెల్లవారిపోతున్నది. మంచు విడిపోయింది. ప్రకృతి అంతా తూర్పారావములు పాడింది.
వసుబాలుడు అరవిందాదేవి చేయిపట్టుకొని నెమ్మదిగా కృష్ణ దాటించడం ప్రారంభించాడు.కొంతదూరం పోయేటప్పటికి లోతు అయింది. వసుబాలుడికి ఈతరాదు. మళ్ళీ వెనక్కు వచ్చారు. ఒడ్డునున్న పడిపోయిన రెండు చెట్లను కష్టపడి కృష్ణలోనికి తోశారు. ఇద్దరూ పట్టుకొని నెమ్మదిగా కాళ్ళు కొట్టుకుంటూ నదిలోనికి లోతుల్లోకి తేలిపోయారు.
ఆ ప్రవాహానికి చాలా దిగువను గట్టుఎక్కారు. ఎండ వచ్చింది. దంత ధావనాదులు చేసుకుని రాయచూరు ఎటువుందో అని కృష్ణానదీతీరం వెంటబడే నడక సాగించారు. వసులుడు తలకు చుట్టుకున్న పైకండువా తడువలేదు. కాబట్టి అది చీర విడుచుకొని కట్టుకోమని అరవిందాదేవికి ఇచ్చాడు. ఆమె పునహా పట్టుచీరె పాముకుబుసంలాంటిది. ఆ ఎండలో ఒక అరగంటకి ఆరిపోయింది. ఆరిపోయిన బట్టలు కట్టుకొని ఇద్దరూ దారిసాగించారు. ఆకలి! ప్రొద్దెక్కినకొద్దీ ఆకలి ఎక్కువ అయింది.
అలాగే వెడుతూ ఉండగా నెమ్మది నెమ్మదిగా ఫిరంగుల చప్పుడు వినవచ్చింది. పెద్దకల్లోలము, హోరు. వీళ్ళు నెమ్మదిగా ఒక గుట్ట ఎక్కారు. ఎదుటనుండు సైన్యాలు హోరాహోరీ పోరుతున్నారు. రెండు క్రోసులు వ్యాపించి వున్నవి ఆ సైన్యాలు. బందూకులు తోపుఖానాలు చెవులపుటాలను బద్దలుకొడుతున్నవి. అతి పారవశ్యంగా కించిత్తు భయంతో చూస్తూ నిలుచుండిపోయాడు వసుబాలుడు. అరవింద ఆకలి, బడలిక, ఆయాసంవల్ల ఒడలిపోయిన పువ్వులా నేల వాలిపోయింది. వసుబాలుడు చూచి, 'అమ్మయ్యో' అని ఆ బాలికను ఎత్తుకొని నెమ్మదిగా ఆ గుట్ట దిగాడు. “అవతల సైన్యం రాయల సైన్యం అయివుంటుంది. అక్కడకు ఎలాగైనా జేరుకుంటిమా మా ప్రాణాలు మావి" అని అనుకుంటూ వసుబాలుడు ఆవైపు ఆచెట్ల చాటు నుండి వెళుతూ ఉన్నాడు.
అతని హృదయానికి పసిపాపలా హత్తుకుపోయిన ఆ బాలిక అతని మొగంచూచి “ఈ సమయంలో నేను బ్రతుకుతానని తోచదు. నన్ను వదలి మీరు వెళ్ళిపొండి" అన్నది.
వసుబాలుడు భయపడి కోపంతో “నేనా నిన్ను వదలడం? పెన్నిధి దొరికిన పేదలా వున్నాను. పాలసముద్రంలో లక్ష్మి విష్ణువుకు దొరికినట్లు నాకు దొరికినావు. నా ప్రాణం అంతా నీలోనే ఉంది. నువ్వులేని ఉత్తర క్షణంలో శివబాలరెడ్డి పుత్రుడులేని తండ్రి!”
ఆ బాలిక నవ్వుతో అతని నోరు మూసివేసింది.
“అవతలిది శ్రీ చక్రవర్తి సైన్యం. మనం ఎల్లాగో అక్కడికి పోవాలే. నాకు ఏమీ ఓపికలేదు. కాబట్టి మీరు నన్ను దింపండి. కొంతదూరం నడవగలను. అలా నడవలేనప్పుడు మీరు నన్ను... ముఖ్యంగా ఈ రెండు వస్తువులు మీదగ్గర ఉంచండి. ఇది శ్రీచక్రవర్తి రహస్య ముద్రిక. ఇది మీరు మాకు అమరాబాదు పంపిన బేగిరావు ఉత్తరం” అని నవ్వుతూ యిచ్చింది. “ఎందుకూ ఈ ఉత్తరం” అని చిరునవ్వుతో వసుబాలుడు ఆ ఉత్తరం చూసుకున్నాడు. అచ్చంగా తనవ్రాతే!
"ఈ ఉత్తరం ఎందుకు దాచుకోటం ?...”
“ఆ ఉత్తరమే అతి ముఖ్యమైంది. ఒకవేళ మీరు వొఖ్ఖరే మాట్లాడే స్థితిలో వుంటే అప్పాజీవారికి ఈఉత్తరం యివ్వండి!”
"ఈ ఉత్తరం ఈ ముద్రిక ఎలా దాచావు దేవీ! ఆ సరదారు ఒక స్త్రీ చేత పరీక్ష చేయించాడుకదా!”
"వేగులవారిలో శ్రీ చక్రవర్తి వేగులవారికి సరిపోయినవాళ్ళు భారత ఖండంలో లేరు! ఈ రెండున్నూ నాతలముడిలో దాచుకున్నా. దేహమంతా వెదకిన మనిషి తలకట్టు వెతకలేదు సుమండీ!”
వసుబాలుడు ఈ నాలుగు దినాల్నుంచి కవులు కూడా ఎరగని కొత్త సంగతులు నేర్చుకోడమనే ఆశ్చర్యంలో పడి వున్నాడు. ఆ రెండువస్తువులున్నూ వసుబాలుడు నడుముకు కట్టుకట్టుకుని బట్టలు సర్దుకున్నాడో లేదో విరిగిపడ్డ ఒక కొండ ప్రవాహంలా గుఱ్ఱపు సైన్యం పారిపోతూ ఆ దారిని వచ్చింది. అనేకమంది గాయాలు తగిలి వగరుస్తూ ఉన్నారు. వారి గుఱ్ఱాలు రక్తాలు కారుస్తున్నవి. వారికవచాలు ముక్కలైపోయి ఉన్నవి. విరిగినకత్తులు, ముక్కలైన కాళ్ళతో ప్రాణాల కోసం పరుగెత్తుకు పోయి వచ్చారు. వాళ్ళు మనవారిని చూచారు. కొందరు రైతులు ఓపిక లేకపోయినా గుర్రాలను వీళ్ళమీదికి తిప్పారు. వసుబాలుడు అరవిందాదేవిని వెనక్కుతోసి, కత్తిలాగి ఝళిపించి, జేవురించిన మొగంతో హృదయంలో ఏమూలలోనూ లేని భయంతో నిలుచున్నాడు. గుఱ్ఱాలు సకిలిస్తుండగా నలుగురు రౌతులు నాలుగువైపులా వచ్చారు. అరవింద కూర్చున్నది. ఆ దినాన వసుబాలుడు దెబ్బ తగిలిన సింహములా పోరాడాడు. దెబ్బలు తిన్నాడు; రక్తధారాలు ఎరుపుతో ఉదయభానుబింబం అయ్యాడు. కొనఊపిరి వున్నంతసేపు ఏటుఏటుకు తప్పుకోడం; పొడపుపొడపుకు వంగడం అలా యుద్ధంచేసి వేటకుక్కల ముందర కొమ్ముల జింకలా, పెద్దపులుల మధ్య వృషభరాజులా, తమ దగ్గిరకు వాళ్ళని రానీయకుండా యుద్ధం చేశాడు.
చేతిలోకత్తి యెగిరిపోయింది; నెత్తిమీద బలమైన గాయం తగిలింది. కళ్ళలో మెరుపులు కమ్మి గిఱ్ఱున తిరిగిపోయి గబుక్కున చైతన్యంవదలి పడిపోయాడు.
అరవింద ఛంగున ముందుకు ఉరికింది! దాచివుంచుకున్న బాకుతీసింది. నాలుగుదెబ్బలు తిన్నది. ఒకడి గుఱ్ఱాన్ని పొడిచివేసింది; మహాశక్తి అయిపోయింది అరవిందాదేవి. నాలుగు క్షణాలు జరిగినవి.
ఇంతలో డెక్కలచప్పుడు, సింహనాదాలు వినబడ్డవి. రాయలు గుఱ్ఱపు దళం కాబోలు. విల్లునుంచివచ్చే బాణంలా వచ్చింది. దానితో చెల్లాచెదరై పారిపోయారు ఆ బీజపూరు రౌతులు. అందులో ఒకడు కసిగొని, గుఱ్ఱంమీద నుంచే వంగి, తూలిపడిపోతూ వున్న అరవిందాదేవిని ఒక్క అదటున మీదికి లాక్కొని పారిపోయాడు.
ఆ వచ్చిన రౌతులది చూశారు. వాళ్ళవెనక అమితవేగంగా వచ్చిన సైన్యం యావత్తూ ఉడాయించారు. కాని నాయకుడి పక్కనున్న రౌతుకి “ఇప్పుడు జరిగిన ఆ అధర్మయుద్ధములో ఒక వ్యక్తిపడిపోయి వున్నట్టు వున్నాడు; చచ్చినాడో బ్రతికివున్నాడో చూచిరా - కొనూపిరి వుంటే నెమ్మదిగా నీ దగ్గిర మందులు ఇచ్చి మన శిబిరానికి తీసుకుపో” అని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు వెనుతిరిగి మన వసుబాలుడు పడివున్న స్థలానికి వచ్చాడు. నాడి చూశాడు. 'ఊ' అని తల ఊపుకున్నాడు. మందులు సంచిలో ఉన్న ఒక చిన్నమాత్ర తీసి పళ్ళు బిగిసిపోయివున్న వసుబాలుడి నోరు బలంతో విడదీసి ఆ మాత్రవేశాడు. దానితో వసుబాలుడు ఒక్క నిమేషంలో మూలగడం ప్రారంభించాడు.
9
వసుబాలుడికి మెలకువ వచ్చేటప్పటికి ఒక గుడారంలో వున్నాడు. మంచిపరుపులు, దిండ్లు నులకమంచం మీద పరిచివుండగా, అందుమీద పడుకొని వున్నాడు. గబుక్కున లేవబోగా అక్కడే వున్న ఒకాయన వద్దని వెనక్కు పడుకో పెట్టాడు. వసు: నేనెక్కడున్నాను?
అతడు: శ్రీవిద్యానగరాధీశ శ్రీ మూరురాయరగండ కృష్ణరాయ సార్వభౌముని శిబిరంలో ఉన్నావు.
వసుబాలుడు ఆశ్చర్యంతో మళ్ళీ లేవబోయాడు. నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతూ ఆ వ్యక్తి వసుబాలుణ్ణి వెనక్కు పడుకోబెట్టాడు.
వసు: ఒక బాలిక వుండాలి.
'ఆమె క్షేమంగా ఉన్నది లెండి”
వసుబాలుడికి అమ్మయ్యా అనిపించింది.
అత: ఈ దినానికి నువ్వు కదలకూడదు. గాయాలు చాలా తగిలాయి. అందుకని నా ప్రార్ధన.
వసు: అదంతా నాకు తెలియదండీ! నేను ఇప్పుడు తత్క్షణం అప్పాజీవారి దగ్గరకు పోవాలి. నేను వారికి అతి ముఖ్యమైనటువంటి వేగు యివ్వాలి.
అత: రేపు ఇవ్వకూడదూ?
వసు: ఇప్పుడు జరిగే యుద్ధం ప్రాముఖ్యం మీకు తెలుసునా?
అత: నేను వైద్యుణ్ణయ్యా!
వసు: వైద్యులకి కూడా ఎందుకు యుద్ధం చేత కాకూడదు? కవులు అందరూ ఆ యుద్ధం చేయవలసిందే కదా?
అతడు: నిజం..నేను నరసింహదేవరాయ సార్వభౌముల దగ్గర సేనానాయకత్వం చేశాను.
వసు: అమ్మయ్యా! అట్లయితే సరే, మీకు నమస్కారము! నాకు ఇప్పుడు బలంవచ్చే మందు యివ్వండి; నేను అప్పాజీవారి శిబిరానికి పోతాను.
ఫిరంగులమోత వినబడుతూనే ఉంది. ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా తనమందుల పెట్టెలోంచి ఒక బుడ్డి తీశాడు.
“ఇందులో ఒక మందువుంది. ఒక చుక్క అమృతంతో రెండు గడియలదాకా మనిషి యుద్ధం చేయగలడు. ఏనుగును ఎత్తగలడు.”
వసుబాలుడు సరే అన్నాడు, ఆ చుక్క త్రాగినాడు. అతని దేహంలో ఒక శక్తి ప్రవాహం అతి వేగంతో ప్రవేశించి కొండను పిండికొట్టగలనన్న బలం వచ్చినట్లయింది. లేచాడు. ఆ వైద్యుడు పైనవున్న సేవకునికి ఆజ్ఞ యివ్వగానే అతడు గుఱ్ఱం ఒకటి తీసుకువచ్చి నిల్చున్నాడు. వసుబాలుడు ఆ గుఱ్ఱం ఎక్కాడు. ఇంకో రౌతు సిద్ధంగా ఉన్నాడు. అతడు ముందూ, వసుబాలుడు వెనకగా మహాపట్నంలా ఉన్న శిబిరంలో ఆ గుడారాల వీధుల్లోంచి వెళ్ళి వెళ్ళి అనేకమంది రౌతులు బలమైన పదాతులు కావలికాస్తూ పట్టుజల్తారు ముత్యాలతో అలంకరింపబడి కుబేరమందిరంలా ఉన్న గుడారం దగ్గరకు వెళ్ళినారు. ఆ పక్కనే ఆడంబరరహితంగా సౌభాగ్యము చూపిస్తూ ఉన్న గూడారం గుమ్మందగ్గర ఆగినాడు.
దారిలో వసుబాలుణ్ణి అనేకమంది రౌతులు ఆపినారు. కాని ముందు పోయే అశ్వికుడు ఏదో జవాబుగా చెప్పగా పోనిస్తూ ఉండేవారు. పై గుడారం దగ్గరకు వెళ్ళి గుర్రాలు దిగారు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు లోపలికి పోయేందుకు గురుతు యివ్వమన్నాడు. వసుబాలుడు 'ఒక ముఖ్యకార్యంమీద శ్రీ సార్వభౌముని సేవకుడు వచ్చా'డని చెప్పమన్నాడు. ద్వారపాలకుడు పనికిరాదన్నాడు. వసుబాలుడికికోపం వచ్చింది. చాలా ముఖ్య విషయం, అందుమీద అంతా ఆధారపడి ఉందయ్యా!" అన్నాడు. ద్వారపాలకుడు లాభంలేదని తలూపినాడు.
వసుబాలుడు గుఱ్ఱంయెక్కి బయలుదేరినప్పటినుంచి తాను మహమ్మదీయులతో పోరినవిధం, తనకుస్పృహ తప్పిన విషయం అంతా జ్ఞాపకం వచ్చింది. తనకు శ్రీదేవి అరవిందాదేవి ఏమయిపోయింది? సురక్షితంగా ఉందంటే? ఎక్కడ ఉన్నది? ఆ వైద్యుణ్ణి ఇంకా తప్సీళ్లు అడగవలసిందే కాని ఆ దేవి ఆజ్ఞ శిరసావహించేగా, తాను ఈవేగు శ్రీ అప్పాజీవారికి తెలియజేయడానికి వచ్చింది. అది జ్ఞాపకం వచ్చింది. ఆ బేగిరావు ఉత్తరంతోపాటు ఆమె శ్రీ సార్వభౌముని రహస్య ముద్రిక యిచ్చింది; అది పనికిరాదా?
"ఓ ద్వారపాలకుడా? ఈ గుర్తుచూసి నీ యిష్టము వచ్చినట్లు చెయ్యి” అని వసుబాలుడు తన దేహాన భద్రపరచుకొన్న ఆ ముద్రిక చూపించాడు. ఆ ద్వారపాలకుడు ఒంగి నమస్కారముచేసి, తక్షణమే లోపలికిపోయి వచ్చి, "శ్రీ అప్పాజీ ప్రభువు మీ రాకకోసం చూస్తున్నారు” అని అన్నాడు.
వసుబాలుడు లోనికిపోయాడు. విజయనగర సామ్రాజ్యం దేదీప్యమానంగా మిట్టమధ్యాహ్న సూర్యుడులా వెలిగేటట్టు చేసిన శ్రీ సాళువ తిమ్మరుసు మహామంత్రులవారు పరుపులపై అధివసించి ఏదో పత్రాలు తిరగవేస్తున్నారు.
వసుబాలుడు ఆ వృద్ధునకు వీర నమస్కారంచేసి నుంచున్నాడు. తిమ్మరుసు తలయెత్తకుండా “ఏ వేగువాడవయ్యా? నీ ముఖం మాకు పరిచయ స్మృతి తెస్తున్నదే?” అని ప్రశ్నించారు.
"ప్రభూ, నేను వేగు సైన్యంలో లేను. ఈ ఉత్తరం తమకు అందజేయవలసిందిగా ఒక బాలిక - అరవిందాదేవి - ప్రతాపనాయనింగారి కుమార్తె ఇచ్చింది" అని వసుబాలుడా ఉత్తరం పట్టుకొన్నాడు.
అప్పాజీ వెంటనే తలయెత్తి, అతి ఆనందంతో "ఎవడురా అక్కడ?" అని కేకవేయగానే ద్వారపాలకుడు పరువిడి వచ్చాడు. లేచి వసుబాలుడి దగ్గిరనుండి ఆవుత్తరం అందిపుచ్చుకొని “శ్రీతమ్మననాయనింవారిని, శ్రీ వేగేశిన అనంత మల్లవర మహారాజులను సార్వభౌముని గుడారానికి రావలసిందిగా చెప్పు" అని ఆజ్ఞ ఇచ్చి, వాడుపోగానే వసుబాలుణ్ణి చూచి, “అబ్బాయీ! ఈ విషయం అంతా గమనిస్తే నువ్వు ఎన్నో కష్టాలకు ఓర్చి, ఈ ప్రాణప్రదమైన లేఖ పట్టుకువచ్చినట్లు కనబడుతోంది. నువ్వు ఎవరివో నాకు స్పష్టమౌతున్నది. శ్రీ చక్రవర్తికడ నీ చరిత్ర చెప్పుకుందువుగాని రా!” అని అనునయిస్తూ చిరునవ్వు నవ్వుకుంటూ వసుబాలుని మోము పరిశీలిస్తూ రెండుసార్లు అటు నిటు తిరిగి, గుడారం దాటి సార్వభౌముని శిబిరంవైపుకు నడుస్తున్నాడు. దారిలో సైనికులు, దళవాయిలు, చమూపతులు అంతా వీర నమస్కారాలు చేస్తున్నారు. అవి అందుకుంటూ చిరునవ్వు నవ్వుతూ ఆశీర్వదిస్తూ సార్వభౌముని బంగారపు సరిగపనిచేసిన పట్టు శిబిరాలను సమీపించారు. అప్పాజీగారిని చూడగానే, సార్వభౌముని అంగరక్షకులు ఎదురై “మహాప్రభువులు సభాశిబిరంలో వేంచేసి ఉన్నారు” అని మనవి చేశారు. అప్పాజీవారు సభామందిరానకు వసుబాలుని తీసుకుపోయారు. సార్వభౌముని చక్రరక్షకులు, ద్వారపాలకులు, చారులు అందరు వంగి అప్పాజీకి నమస్కారాలు చేశారు.
అప్పాజీవారు రావడం చూడగానే వారి పార్శ్వకు డొకడు తలవాల్చి సభామందిర శిబిరంలోకిపోయి “జయ జయ జయ!!! మహారాజాధిరాజా!" అని గుమ్మం దగ్గిర మోకరించి, "శ్రీ అప్పాజీవారు వస్తున్నారు" అని మనవి చేసుకొన్నాడు. సార్వభౌములు వెంటనే పీఠంనుండి దిగి, గుమ్మం దగ్గిరకు ఎదురువచ్చి, అప్పాజీవారికి నమస్కరించి, వారిచ్చిన ఆశీర్వచనాలందుకొని, అప్పాజీవారి చేయి పట్టుకొని వారిని మంత్ర్యాసనం అధివసింప జేసి తాను వెళ్ళి తను సింహాసనం అధివసించారు.
ఇంతలో వసుబాలుడు లోనికిరాగా అప్పాజీ కోరిక తెలియజేశారు. వసుబాలుడు లోనికి ప్రవేశించి వెంటనే సార్వభౌముల యెదుట మోకరించాడు.
సార్వభౌములు అప్పాజీవంక చూచి "నాయనగారూ! ఎవరీబాలుడు?” అని ప్రశ్నించారు.
"మహాప్రభూ! అతి ముఖ్యమైన వేగు కొనివచ్చాడు. తమ్మన్న నాయకులవారూ అనంతమల్లవర ప్రభువులూ వస్తున్నారు,”
అప్పాజీ వసుబాలుణ్ణి ఒక ఆసనం అధివసింప తల పంకించి సంజ్ఞ చేసినారు.
ఇంతలో తమ్మన్న నాయకులూ అనంతవరమల్ల ప్రభువులు వచ్చి ప్రభువుకు వీరనమస్కారాలు చేసి అనుమతి సంజ్ఞవలన ఆసనాలు అధివసించారు.
అప్పాజీ అరవింద ఉత్తరం తమ్మన్న నాయకులకు ద్వారపాలకునిచే అందించినారు.
తమ్మన్న: ఈ ఉత్తరం ఏమిటి మహామంత్రీ?
అప్పాజీ: అరవింద ఉత్తరం.
తమ్మన్న: వచ్చిందీ! వచ్చిందా! అమ్మయ్యా! ఇంక రాదని నిస్పృహ చేసుకున్నాము మా వేగు వారందరమూ. ఇంక రాయచూరు రెండు నిముషాలలో! ఏదీ! ఎవరక్కడ నీళ్ళతో బిందె - చిన్నది” అని అంటూ లేచి “మహాప్రభూ! ప్రతాప నాయకులవారి అమ్మాయి అరవింద రాయచూరు రహస్యాలు పంపిందని విన్నవించుకుంటున్నాను” సంతోషంతో మనవి చేశారు.
ఇంతలో నీళ్ళబిందె వచ్చింది. వెంటనే తమ్మన్న నాయకులు ఒక బరిణె తన సంచి కట్టులోనుండి తీసి అందులోనుండి పొడుమును కొంత ఆ బిందెలో వేసినారు. దౌవారికుడు ఆ నీళ్ళు కలపగానే ఆ ఉత్తరం అందులో వేసినాడు. “సిరియాలదేవిని పంపండి" అని వసుబాలుడు రాసినట్లున్న ఉత్తరపు అక్షరాలన్నీ మాయమైపోయినవి.
వెంటనే తమ్మన్న నాయకు లాఉత్తరం నీళ్ళలోనుంచి తీసి ఇంకొక బరిణెలో ఉన్న హారతి కర్పూరముతీసి, చెకుముకి వెలిగించి, మందు దూది మండించి, ఆ మంటలో కర్పూరము వెలిగించి, ఆ కాగితాన్ని ఆ పొగలో ఉంచినారు. మంత్రంలా ఆ పొగలో ఆ పెద్దపత్రంమీద గీతలు అక్షరాలు చీమల బారులు లాంటివి కొత్తవి వచ్చి ప్రత్యక్షమైనవి.
ఆ ఉత్తరం మెత్తటి బట్టతో అద్ది, తమ్మన్న నాయకులు సవినయంగా సార్వభౌముల కడకు కొనిపోయి, సింహాసనం దగ్గర పీఠంపై ఉంచినారు.
అప్పాజీ, అనంతమల్లవర ప్రభువులు, తమ్మన్న నాయకులు, సార్వభౌములు ఆ పత్రం చూస్తున్నారు. “ఇదిగో ఇక్కడ అగడ్త లోతు తక్కువ. ఇక్కడ గోడ అవుడు. ఇక్కడ రక్షక సైన్యం ఎక్కువ ఉంది. ఇక్కడ ఫిరంగులు బలమైనవి. ఇక్కడ ఫిరంగులు పాతవి. ఈ వైపున మనవారు సిద్ధంగా ఉన్నారు” అని తమ్మన్న నాయకులు మనవి చేస్తుంటే, తక్కినవారు వింటూంటే, సార్వభౌములు దీక్షగా గమనిస్తున్నారు.
సార్వభౌముడు చిరునవ్వు నవ్వుతూ వసుబాలుణ్ణి దగ్గరకు రమ్మన్నారు. వసుబాలుడు దగ్గిరకువెళ్ళి ఆసనం సమీపాన నిలబడ్డాడు.
“నీ చరిత్ర చెప్పు.”
వసుబాలుడు చక్రవర్తి ఆజ్ఞ కాగానే ఆ జలతారుగుడారం, ఆ మణిదీపంబుడ్ల మిరుమిట్లు, పట్టుపరుపులు, కాశీరత్న కంబళ్లు, పట్టుకలంకారీ తెరలు, మత్యాలజాలర్లు - అన్నీ మరిచిపోయాడు. కవీ, భావోన్మాదీ, ప్రేమ పూర్ణయికజీవీ, ఆనందాత్ముడూ అయిపోయి మొదటినుంచి చరిత్ర పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టినాడు.
అతని కథతో అందరూ తన్మయత్వం పొందినారు. సార్వభౌముని ముదము, అప్పాజీగారి సంతోషముకన్న తమ్మన్ననాయకులు పొందిన ఆనందము అపరిమితము. ఒకపారి పార్శ్వకుని చెవిలో రహస్యం చెప్పి పంపించాడు.
“ఏమిటీ, నువ్వు శివబాలరెడ్డి నాయకుల కుమారుడవా!” అని సార్వభౌములు ఆశ్చర్యం వెలిబుచ్చినారు.
“పెద్దన్నగారి శిష్యుడవా!” అని తిమ్మరుసు తల పంకించాడు.
“పారశీకం నేర్చుకునేందుకు, బీజపురం వెళ్ళావా?" అని మల్లవర ప్రభువు చిత్రం అయిపోయాడు.
తమ్మన్న నాయకులు మాట్లాడనేలేదు. వసుబాలుని కథ పూర్తి అయింది. అతడు చక్రవర్తి యెదుట మోకరించి, “మహా రాజాధిరాజా! నేను ఆ బాలికను... ఆమె యిప్పుడు ఎక్కడ నున్నది? ఆమెకు ఆపద లేదుగదా! ఆమె చరిత్ర ఏమిటి? నాకు తెలియజేయ ప్రార్థించుచున్నాను” అన్నాడు.
సార్వభౌముడు చిరునవ్వుతో వసుబాలుణ్ణి దగ్గిరకు రమ్మని తన మెళ్లో ఉన్న దివ్యమణిహారము ఒకటితీసి అతని మెళ్లో వేసి, తల నిమిరి - "కవివిన్నీ వీరుడవున్నూ అయి నీ చక్రవర్తికి సహాయం చేసుకో!” అని “పెద్దనామాత్యులకు కబురు పంపవలసింది” అన్నారు.
ఒక ద్వారపాలకుడు వేగంగా పోయినాడు. వసుబాలుడు భూలోకంలో లేడు; ఇదివరకు చక్రవర్తిని దూరంగా చూడడమే! ఆయనతో మాట్లాడలేదు. ఆయన తల నిమిరినప్పుడు శ్రీ ఆదివిష్ణువు ఆశీర్వదించినట్లయింది. జన్మసాఫల్యం అయింది అనుకున్నాడు వసుబాలుడు.
ఇంతలో ఒక పక్క నుంచి పెద్దనామాత్యులు, ఒక పక్క నుండి శివబాలరెడ్డి నాయకులు చక్కావచ్చి సార్వభౌమునికి నమస్కారములుచేసి ఆసనాలు అధివసించారు.
వసుబాలుడు సంభ్రమంగా లేచి గురువుగారికి మోకరించి నమస్కరించాడు. ఆయన లేవదీసి, “ఏమి చిక్కావు, గట్టితనం దాల్చావు. ఈ గాయాలు, కట్లు ఏమిటి?” అని అన్నాడు.
వసుబాలుడు తండ్రికి మోకరించినాడు. అతడు కుమారుని యెత్తి మూర్ధ మాఘ్రాణించాడు. కళ్ళ నీళ్ళు తిరుగుతూ ఉండగా, గొంతులో డగ్గుత్తికపడుతూ ఉండగా కుమారుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగినవి.
అప్పాజీ: శివబాలరెడ్డి వర్యా! నీ కుమారుడు తన సార్వభౌమునికి, విజయనగరం సామ్రాజ్యానికి తీరరాని ఉపకారం జేసినాడు. శ్రీ సార్వభౌములు అతనికి నూకపాలెం జాగీరు దయచేయుచున్నారు” అని అప్పుడే చక్రవర్తి స్వహస్తనామాంకితమైన ముద్ర వేయగానే ఆ పత్రము పుచ్చుకొని వసుబాలుడికి యిచ్చినారు.
ఇంతలో ప్రతాపనాయకులు ఒక బాలికను మేలిముసుగులో కొనివచ్చినారు. అందరూ ప్రతాపనాయకుణ్ణి బహూకరించారు. వసుబాలుడి గుండెలు కొట్టుకున్నవి. అతనికి దివ్యగీతానాదములు వినిపించినవి. వేయారు అపరిమిత సుగంధములు వీచినట్లయినది.
అప్పాజీ: ప్రతాపనాయకా! నువ్వు నీ సార్వభౌములకు చేసే సేవ అపరిమితము, నీ కుమార్తె ఎవరికిన్నీ సాధ్యముగాని రహస్య భేదనాలు నీ సహాయంతో చేసి అత్యుత్కృష్టమైన సేవజేసింది. ఆమెకు శ్రీసార్వభౌములు సూరదాపాలెం జాగీరు పక్కవున్న వీరసపాలెంజాగీరు దయచేస్తూ ఉన్నారు. ఆ రెండు జాగీర్లు కృష్ణా తుంగభద్రల్లా ఉండుగాక!
సార్వభౌములు, మల్లవరప్రభువులు తమ్మన్న నాయకులు “తథాస్తు” అన్నారు.
ఆప్పాజీ సార్వభౌముని వంక చూచి అన్నాడు “దేవా! ఈ తమ్మన్న నాయకులే ఈ నాటకానికి సూత్రధారులు. ఈలా వస్తుందని అనుకోలేదు. ఈ అమ్మాయి అందం లోక ప్రసిద్ధం. అమ్మాయిని వసుబాలుడికి యివ్వడానికి తన కుడిచెయ్యి అయిన ప్రతాపనాయని కోర్కెతో ఆ బాలను ఏదో కష్టంలో దొంగలుకొట్తున్నట్లుగా ఏర్పాటుచేసి అతడు ఆమెను రక్షించేటట్లు చేయాలిసిందిగా ఆజ్ఞ పంపించారు. శివబాలుని కుమారునకు ప్రతాపుని కుమార్తెను యిచ్చునట్లు శ్రీ దేవర ఆజ్ఞ ఇదివరకె పుచ్చుకున్నానుకదా! అని నేను పంపినాను. కాని ఇంతకూ జరిగిన కథ వేరు. విరూపాక్షుడే వసుబాలుడి కథ నడిపాడు.” 10
రెండు రోజులైన వెనుక వసుబాలుడు ప్రతాపనాయనింవారి శిబిరానికి పోయినాడు. అవరోధజనశిబిరాలు ప్రతి నాయకుని శిబిరానికి వెనకగా ఉంటాయి. అంతఃపుర స్త్రీలు కనబడరు.
వసుబాలుడు ప్రతాపనాయనింవారి శిబిరానికి వెళ్ళగానే ద్వారపాలకులాతనికి నమస్కరించి, ఒక డేరాలోనికి తీసికొని వెళ్ళి అచ్చట అతనిని అధివసింపచేసినారు.
వసుబాలుడు అచ్చట ఉచితాసనంపై కూర్చుండి హృదయం మారుమ్రోగుతుండగా ఒంటరిగా అన్నీచూస్తూ ఉన్నాడు. ఆ డేరాలో అలంకారాలు, ఉన్న వస్తువులు ఒక బాలిక అలంకరించుకొనే మందిరంలో ఉన్న వానిలా ఉన్నాయి.
వివిధ సుగంధాలా డేరాలో ప్రసరిస్తున్నాయి. ఒకచోట కొన్ని పట్టుచీరలున్నాయి. ఒకచోట జరీబుటావు పనిచేసిన పట్టురవిక లారవేయబడి ఉన్నాయి. చందుగా పెట్టెలు, గుండ్రని తోలుపెట్టెలు, నగల పెట్టెలు ఉన్నవి. ఒకచోట సాలపత్ర గ్రంథపీఠిక లున్నాయి.
ఇంతలో ఒక ద్వారానికి ఉన్నతెర ఒత్తిగించబడి, ఒక బాలిక లోనికి వచ్చి, కలకలలాడుతూ ఉదయ ప్రాంగణారుణ ప్రత్యక్షమూర్తి ఉషాదేవిలా దివ్య కాసారమధ్య వికసిత సహస్రదళ కమలపద్మినీ దేవిలా చిరునవ్వుతో పోతపోసిన సౌందర్యరాశిలా అరవిందబాల నిలుచుంది.
ఒకే ఒక్కక్షణికమట్లా బాలిక నిలుచుండి “మీరేనా ప్రభూ!” అంటూ మెరుములా, సుగంధకల్లోలంలా, వేయి ఆనందాల సుడిగుండంలా వచ్చి వసుబాలుని ఒళ్ళో వాలింది. వసుబాలుడు మైమరచాడు.
మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడూ యిలాగే వచ్చింది. ఇంతలో ఆమె అతని తలవంచి గాఢంగా అతని పెదవులు ముద్దుకొన్నది.
ఒకరిగాయాలు ఒకరికి చూపించుకుంటూ, ఒకే, అశ్లేషంలో విడిపోక ఒకరై, వారు మాటలులేక అలా ఉండిపోయారు.
“అమ్మగారు మిమ్ము నా మందిరపుడేరాలో చూడవచ్చునన్నారు. మీకు వార్త పంపాను సుమండీ. ఇక మీరు నన్ను కొన్నాళ్ళవరకూ చూడలేరులెండి. ఆ దినాలు ఎల్లా గడుపుకుంటారో ఓ తాయిలంగారు! నేను మాత్రం ఒక నిముషము ఒక కల్పంగా -"
“అట్టే దినాలు అక్కర్లేదులెండి ఓ చారిణీ దేవిగారూ! అప్పాజీవారు పెట్టించిన ముహూర్తం వారం రోజులలో, ఇక్కడే లెండి ఒక మహా ఉత్సవమని ప్రతాపరాయనింవారు వార్త పంపారు - ఎల్లుండి ప్రధానానికి వస్తున్నామని - ఇక - ఓ తాయిలంగారూ, ఏమంటారు?"
“ఏమంటారా?” అంటూ గబుక్కున లేచి ఆమె గుమ్మం దగ్గరకు పరువిడింది. వసుబాలుడూ ఉరికి, ఆమెను గట్టిగా హృదయానికి అదుముకున్నాడు.
వారిద్దరూ ఆ తన్మయత్వంలో ఒకరిమోము నొకరు చూస్తూ, తమ తరువాయి కథారహస్యం చెప్పుకుంటూ ఉండిపోయారు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse