అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/లచ్చిమి
'లచ్చిమి'
పచ్చలయ్య ముదుసలి రైతు. అతనికున్నదే రెండెకరాల మాగాణి. ఆ మాగాణి అతనికి మాలచ్చిమి. ఆ రెండెకరాలభూమి ఒక వ్యక్తి అయింది. ఆ చిన్నారి పొలానికి “లచ్చిమి” అని పేరు పెట్టుకొన్నాడు. ఆ పొలం కూడా చాలా అందంగా ఉంటుంది. పంట కాల్వఒడ్డునే ఉంది. ఆ పొలం నవ్వనికాలం లేదు.
“లచ్చిమి” చుట్టు వెడల్పాటిగట్టు వేసినాడు, ఆ గట్టుపైన అంటు మామిడిచెట్లు నాల్గు, ఒక పాతమామిడిచెట్టు ఉన్నవి. పది అరటి బోదెలున్నాయి. కాల్వవైపుగట్టు కూరగాయలు పెంచేందుకు! ఆగట్టంతా ఏవో పాదులెప్పుడూ పెరుగుతూ ఉంటాయి. వంగచెట్లు, తోటకూర, గోంగూర, కొత్తిమీరమళ్ళు ఘుమఘుమలాడుతూ, వేసవికాలంలో కూడా పచ్చగా మిలమిల లాడుతుంటాయి. పాదులలో విడవకుండా దొండ ఎప్పుడూ కాస్తూనే వుంటుంది. తూర్పు గట్టుమీద నాల్గు సపోటాచెట్లు, పది తేనెబొప్పాయిచెట్లు, మల్లె, జాజి, గులాబి అంట్లూ ఉన్నాయి. పడమటిగట్టుమీద పొడుగునా కొబ్బరిచెట్లు గంభీరంగా ఆకాశంలోకి తలలాడిస్తూ ఉంటాయి.
తన కన్న కూతురే లచ్చిమి.
2
అతనికి పెళ్ళిలేదు. చిన్నతనంలో రంగం పారిపోయాడు. కొండంత బరువులెత్తి శేషుడై డబ్బు మూట గట్టాడు. నాలుగు వేదాలూ ఒకేపాఠమై భూమి రథాన్ని లాగినట్టు పచ్చలయ్య రిక్షాల్ని లాగి డబ్బు సంపాదించాడు.
మధుపానం కోసం మానినీమణులు కోసం పోగుచేసుకొనే చిల్లర మూటల్లోంచి డబ్బు ఖర్చు అయినా అసలే జాగ్రత్త మనిషి అవడం చేత పచ్చలయ్యకి యాభయ్యోయేడు వచ్చేటప్పటికి రెండువేల అయిదువందల యాభైమూడు రూపాయలు పోగయ్యాయి. కన్నతల్లి అయిన తెలుగుదేశం పిలుపు వినబడింది.
రంగంపట్నవాసపు ఛండాలపుకంపులు అప్పటి కతనికి ఏవగింపు పుట్టించాయి. ఆంధ్రదేశంలో గోదావరి డెల్టాలో తన గ్రామం జ్ఞాపకం వచ్చింది. చిన్నతనంలో తన తండ్రి భూములు కవుళ్ళకు తీసుకుని వ్యవసాయం చేసిన రోజులు, తాను దూడల్ని కాసిన రోజులు, మక్తాధాన్యం ఇవ్వలేక తండ్రిపడిన అగచాట్లు, భూమి యజమాని తండ్రిని పెట్టిన కష్టాలు, తండ్రి బాకీదారుడై బాకీదారుల జయిలుకి వెళ్ళడం, తన అక్క పెళ్ళికి తండ్రి పడిన ఇబ్బందులు, వానకాలపు మబ్బై కంటికి మంటికి ఏకధారై తల్లి కుళ్ళి పోయిన విషయం, తనకున్న ఆస్తిపాస్తి తాకట్టు పెట్టి తండ్రి డబ్బు తెచ్చిన సంగతీ, తాను రంగానికి పారిపోవడం, తల్లిదండ్రులకు తాను వ్రాయించిన యుత్తరాలు, అప్పుడప్పుడు పంపించిన పదీ పాతికి, తండ్రికి అప్పిచ్చిన తణఖాదారుడు వ్యాజ్యమేసి వేలంలో ఇల్లూ దొడ్డీ తనే పాడుకోవడం, ఒకరి తరువాత ఒకరు తల్లీ తండ్రీ చనిపోవడం, ఇవన్నీ ఒక్కసారిగా తెరమీద బొమ్మల్లా అతని మనోనేత్రాల ఎదుట ఆడిపోయాయి.
తాను పోగుచేసుకున్న డబ్బు సంగ్రహించుకొని పచ్చలయ్య స్వగ్రామమైన ఉండీ అగ్రహారం చేరుకున్నాడు.
తొలకరి వానలు కురిసి, బీటలుకట్టి యెండిఉన్న పొలాలు తడిసి, ఆ పొలాల్లోంచి వస్తూన్న సువాసన పచ్చలయ్యకి హాయి సమకూర్చింది. పొలాలన్నీ ప్రాణాలున్న వ్యక్తులై పచ్చలయ్యకు ప్రత్యక్షమయ్యాయి. అతని అదృష్టం కొలది స్వగ్రామంలో కాలవగట్టున రెండెకరాలపొలం అమ్మకానికి వచ్చింది. వెనక్కూ ముందుకూ సాగించి క్రిందామీదాపడి, పచ్చలయ్య ఆ భూమిని రెండువేల రెండువందలకుస్వాధీనం చేసుకున్నాడు. ఉండీ సబురిజిస్ట్రారు ఆఫీసులో పత్రం రిజిష్టరు చేయించి మహాపట్టణమైన రంగాన్ని పరిపాలించిన పచ్చలయ్య నూరురూపాయల కొక ఎద్దులజత, ఇరవై రూపాయలకొక నాగలి కొని వ్యవసాయం ప్రారంభించాడు. వ్యవసాయం అతనికి ఆనంద పూర్ణమైన తపస్సు అయినది. పొలం మరమ్మతు చేయించినాడు. పాటిమన్ను తోలించాడు. ఆ పొలం బాలికను తానుకన్న కూతుర్ని చేసుకున్నాడు. ఆమెను అలంకరించాడు. ఆటలు నేర్పాడు. పాటలు నేర్పాడు, చుట్టూ పెద్ద గట్టువేయించి తోట తయారుచేశాడు. తూర్పు గట్టుమీద తాను పాక వేసుకుని పొలంలోనే మకాంపెట్టాడు.
3
పచ్చలయ్య అనవసరంగా ఎవ్వరితోనూ మాటలాడే వాడుకాడు. తన రెండెకరాలు వ్యవసాయమూ లేనప్పుడు తన పొలంగట్లమీద కలకలలాడుతూ అవతరించిన తోటకి సేవచేయడం, కష్టాల్లో ఉన్న బీదరైతులకు కానో కాసో రహస్యంగా సాయంచేయడం ఇదే అతని జీవితమార్గం.
పచ్చగాఉన్న పచ్చలయ్యమాట అందరికీ పథ్యంకాసాగింది. రెండెకరాలకు నలభైబస్తాలు పండుతాయి. అమ్మితే కరువురోజులలో కూడా అతనికి రెండువందలు వస్తాయి. ఎద్దుల మేతకు, తన భోజనానికి సంవత్సరానికి రెండువందల నలభై ఖర్చు అవుతున్నది.
పళ్ళకూ, కూరగాయలకు, కొబ్బరికాయలకు, గట్టుల మోసే మినుములకూ కందులకూ సాలుకు రెండువందలు వస్తున్నవి. ఆకుమళ్ళకు నూరురూపాయ లాదాయం వస్తుంది. ఖర్చులు వ్యవసాయానికంతకూ యాభై అవుతుంది. లెక్కలన్నీ చూసుకుంటే పన్నులు, మామూళ్ళు, మళ్ళీ తిరిగిరాని చేబదుళ్ళూ, వారికీ వీరికి సహాయాలూ అన్నీ పోతే అతనికి సాలుకు నూరు, నూటయాభై రూపాయలు మిగుల్తున్నాయి. ఈ పదేళ్ళలో తన పొలంలో రూపాయి కాసులుగా మార్చుకొని, ఎక్కడ దాస్తాడో పచ్చలయ్యకు పన్నెండువందల రూపాయలు పోగయ్యాయి.
అడివి బాపిరాజు రచనలు 4
పచ్చలయ్యకు అరవైఏడో ఈడు వచ్చింది. అతనిది విజయనగరం పక్కగ్రామం. ఆరోగ్యం ఎప్పుడూ చెదరదు. కాని పచ్చలయ్యకి ఆవేదన ఎక్కువైంది. తన కూతురు “పొలం లచ్చిమి” పెద్దదయింది. ఈడు వచ్చింది. ఈ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్ళిచేసేది. మంచి సంపాదన పరురాలు. ఇవాళ కాకపోతే తన తదనంతరమన్నా అమ్మాయిని ఎవరో పెళ్ళి చేసుకోవలసినవారే!
తానూ పెద్దవాడవుతున్నాడు. విశాఖపట్నం సీమవాడు అతని తాత. అతనిచుట్టాలు ఉండీ గ్రామంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తన అక్క అప్పలమ్మ, తన మేనల్లుడు సోమన్న ఉన్నారు. తన అక్క మొగుడు పోయిన వెనక కరణంగారి ఇంట్లో పనిచేసుకుంటోంది. మేనల్లుడు పెద్దకాపు సుబ్బన్న నాయుడుగారికి పాలేరు. కాని ఆ కుఱ్ఱకుంక ఇరవై అయిదేళ్ళొచ్చి పెళ్ళాన్నొదిలేసి, ఉండికాల్వ వంతెన పక్క కొత్తగా పెట్టిన హోటలులో ఓ అమ్మాయిని మరిగాడు.
అలాంటి ఎదవకు తన కన్న తల్లిని తన బంగారు బొమ్మను “లచ్చిమిని” ఇస్తే దాన్ని గంగలో కలిపేస్తాడుకదా, అనుకున్నాడు.
ఆ వేసవిరాత్రి బీరపాదులు పెట్టిన తన పొలంలోకి వెళ్ళి ఓ గట్టుమీద కూర్చున్నాడు.
"ఓలమ్మీ లచ్చిమీ! ఏటంతవు? నిన్నింతదాన్ని చేసి పెంచుకొన్నా, నీకు పెళ్ళి సేయకపోతే ఏటనుకుంటుంది నోకం?”
ఇంట్లో ఆ పొలంకన్నె పధ్నాలుగేండ్ల బాలికలా వచ్చినట్లయింది అతనికి. ఆ అమ్మాయివచ్చి అతనిపక్క కూచుంది.
లచ్చిమి: ఓరయ్య, నేనేటనేది. నాకిప్పుడేటి పెళ్ళి! యారన్నా నవ్విపోతరు. అందులో ఓయిబాబు! ఏ పందిగాడన్నా నా మొగుడైతే నా తిప్పలా సింహాదిరప్పన్న కూడ సయించలేనంత అయిపోతది బాబూ!
పచ్చ: నాకన్నతల్లివి గావంటో?
లచ్చి: అయ్యా! మంచి మొగుణ్ణి నానే యేరుకుంతాను గాదేంటి?
పచ్చ: ఎప్పుడేరుకుంతవులమ్మీ!
లచ్చి: బాబూ! నీ కెందు కంతగొడవ. నానే సెపుతాను గాదంట్రా!
పచ్చ: నా నెల్లి తొంగుంటాలమ్మీ.
లచ్చి: బాబూ, నువ్వు తొంగో, నేను సూత్తా ఉంటానులే.
ఈ సంభాషణ అతనికి ఏమాత్రమూ అనుమానం లేని నిజం. పచ్చలయ్య సంతోషంవచ్చి నిద్రపోయాడు.
లచ్చిమి ఆ వెన్నెట్లో అలా పవ్వళించి కన్ను మూసింది. 5
ఆ మర్నాడు పచ్చలయ్య మేనల్లుడు సోమన్న భార్య పైడమ్మ పచ్చలయ్య దగ్గరకు వచ్చింది.
పైడమ్మ: బాబూ, నీ అల్లుడి యిసయం అంతకన్న ఎక్కువౌతోంది బాబూ! నిన్న రేతిరి తాగి ఇంటికాడ కొచ్చినాడు. ఇంటికాడ మా అత్తతో దెబ్బనాట వేసుకున్నాడు. ఆపళంగా కోపంతో వచ్చి, నన్ను సావగొట్టితూలి పడిపోయి, ఈత దుమ్మునాగు గుఱ్ఱెట్టి నిదరోయాడు బాబూ, నువ్వు తప్ప ఆడిని మంచిదారిలోకి ఇంకేరు పెడతారు చెప్పూ!
పచ్చ: పైడమ్మా! నీవన్నదంతా సత్తెమే! నాను మాత్రమేటి చేసేది తల్లీ! భగవంతుడు రచ్చించాల. నువెళ్ళి ఏ అమ్మవారికో దణ్ణాలెట్టుకుంటూ ఉండంతె!
పైడమ్మ: బాబూ, నన్ను సంపెత్తడు నీ అల్లుడు. నాకు బయమేత్తదయ్యా! నిన్నరేతిరి పెద్ద కత్తుచ్చుకొని, 'నంజా పతివోడి పక్కలోకి యెడతావున్నావా. నిన్ను సంపేసి నాను సంపేస్కుంతను' అని ఆ కమ్మకత్తి నాక్కొని నాకాడి కొచ్చాడు. యేటి సేయమంతవు పచ్చలాయి బాబూ?
పైడమ్మ కళ్ళ మహానదులు ప్రవహిస్తుండగా కుళ్ళిపోయింది. పచ్చలయ్యకు చటుక్కున తనలచ్చిమిని సలహా అడిగితే, ఆమె సరియైన మార్గం చెప్పాలి. తన కా ఆలోచన తట్టింది. తిన్నగా పొలంలోకి ఒక్కడూ పోయాడు. ఆ పచ్చని పొలం “ఏటిబాబూ, ఆడికి నానే బుద్ధి. సెపుతాగాదా!” అని జవాబిచ్చినట్లయింది. తిన్నగా తన పాకలోకొచ్చి “పైడీ! యెల్లి మా అక్కను నాను రమ్మంతున్నానని తీసుకురాయే! మా అక్క, నువ్వూ ఇక్కడే నాలుగురోజులపాటు వుందురుగాని” అని ఆమెను పంపించినాడు.
పైడమ్మ వెళ్ళి ఒక గంటలో, తన అత్త అప్పమ్మని తీసుకుచక్కా వచ్చింది.
6
ఇంటికొచ్చేటప్పటికి పైడమ్మా కనబళ్ళేదు, తల్లి అప్పలమ్మా కనబళ్ళేదు సోమన్నకు! తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రచేసుకొని పక్క దాంట్లో ముసలిదా న్నడిగాడు.
"ఆళ్ళు నీ మామింటికి పొలం పోయారు సోమన్నా” అన్న దా ముసలిది.
“ఏటీ! ఎళ్ళారు, ఆ ముసలెదవదగ్గరికి? ఆణ్ణి సంపేసి, నాను సంపేస్కుంతా” అంటూ దుడ్డుకర్ర పుచ్చుకొని మేనమామ పొలానికి తన పేట నుంచీ ఎల్లాతూలుతూ, కేకవేసుకొంటూ ఉండీ నుంచి ఉండీ అగ్రహార పొలిమేరకు కాలవగట్టుననే నడుస్తూ వచ్చాడు. రెండు మూడు సారులు పడ్డాడు లేచాడు. మళ్ళీ సాగించాడు.
ఉండీ తూరుపుకాపుల గూడెంలో సోమన్న మామని చంపేస్తాడేమో నని అల్లరి బయలుదేరి పెద్దలూ పిన్నలూ కర్రలు పుచ్చుకొని పచ్చలయ్య పొలానికి నడక సాగించారు. గజం చుట్టలు వెలిగించారు. కుర్రవాళ్ళు బీడీలు వెలిగించారు. జట్కాతోలే రామన్న సిగరెట్టు వెలిగించాడు. వాళ్ళంతా పచ్చలయ్య పొలం దగ్గరకు వచ్చి కాల్వలో దిగి దాటి అవతలగట్టునే ఉన్న పచ్చలయ్య పొలం గట్టుమీదకు వెళ్ళి "పచ్చలయ్యా" అని పిలిచారు. అదివరకే వాళ్ళందరూ వచ్చే ఈవతలిగట్టు నుంచే "పచ్చలయ్యా" అని వాళ్ళు కేకవేశారు.
వాళ్ళందరూ తన పాకున్న పొలం గట్టుమీదకు రాగానే పచ్చలయ్య నిద్రలేచి "ఏటిరా అది! అల్లాగా కేకలెడుతున్నా”రని అంటూ పైకివచ్చాడు. పైడమ్మ, అప్పలమ్మ పైకివచ్చారు.
ఒకడు: సోములు ఇక్కడకు రాలేదురా మావా?
పచ్చ: రాలేదురా! ఆ డేమయ్యాడేంటి?
ఇంకొకడు: ఏమో నిన్ను సంపేత్తనని ఇక్కడకు బయలుదేరి నాడంట.
పచ్చ: ఏమై ఉంటాడు. మీకు దారిలో కాపడలేదంట్రా?
మొదటివాడు: అబ్బే!
ఇంతట్లో పైడమ్మ హర్రికేన్ దీపము వెలిగించి తీసుకొనివచ్చింది. అందరూ సోమన్నను వెదకటానికి బయలుదేరి ఒకవేళ వంతెన దగ్గర ఆవలి ఒడ్డుకు దాటివస్తూ, తాగి ఉన్నాడు గనుక దారిలో పడిపోయి ఉండవచ్చునేమో యని ఆలోచించారు. దీపం పట్టుకొని ఒకడు ముందు నడిచాడు. తర్వాత అందరూ బయలుదేరారు.
నాలుగు అడుగులు వేయగానే, వెనక వచ్చే ఒక పడుచువానికి పచ్చలయ్య పొలంలో ఏదో తెల్లగా పడిఉన్నట్టు కనబడింది. “అదేదో సూసొత్తాను” అని లాంతరు పుచ్చుకొని పొలంలోకి దిగి, ఆ వస్తువు దగ్గరకు వెళ్ళి చూసీ చూడటంతోనే “ఓరి రండల్లో. ఇక్కడ పడున్నాడు సోమన్నగాడో" అని కేకేశాడు. అందరూ పొలంలోకి పరుగెత్తారు.
ఆ పొలంలో ఒళ్ళు తెలియకుండా సోమన్న పడివున్నాడు.
పచ్చలయ్య వంగి సోమన్న గుండెలో చేయిపెట్టిచూచాడు. గుండె దడ దడ కొట్టుకుంటోంది.
“ఈడికీ మత్తుతప్ప మరేం జబ్బు లేదర్రా” అన్నాడు. ఇద్దరు సోమన్నను పైకెత్తి పొలంలోంచి పచ్చలయ్య పూరింటి దగ్గిరకు తీసుకుని వచ్చారు.
పచ్చ: ఆణ్ణి అల్లా తొంగోబెట్టి మీ రెల్లండర్రా మీకు నా దండాలు.
మొదటి: ఈ కుంకన్నగాడికీ మెలకువవత్తే, అల్లరిచేత్తాడేమో పచ్చలాయి!
పచ్చ: మెలకువ తెల్లారిందనకా వస్తుందా? వచ్చినా ఈణ్ణాంటి పదిమందిని మడతలేసి సితకమొడిసెయ్యగల్ను.
రెండవ: ఓరి యెంకటసామి, పచ్చలయ్య మొన్నకాలవలో మెరకట్టిన పన్నెండు టన్నుల నావను తలకాడెత్తి, ఎనక్కునెట్టిన సంగతి యెరగవేంట్రా?
వారందరు కొంచెంసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు సెప్పుకొని, పచ్చలయ్యా అప్పలమ్మలదగ్గిర సెలవు పుచ్చుకొని తమ పేటకు వెళ్ళిపోయినారు. 7
తెల్లారిన రెండుగంటలకు సోమన్న లేచినాడు. తానెక్కడవున్నదీ సోమన్నకు తెలియలేదు. చేతులతో తలపట్టుకొని “నా ఎదవమతి! ఎక్కడున్నానేంటి!” అనుకున్నాడు. అతనికళ్ళు తిరిగి మూతలుపడిపోనాయి కాని ఒక్కసారిగా అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది.
తాగివున్న అంతమత్తులోనూ, రాత్రి జరిగిన ఒక సంఘటన గుండెను గుద్ది చెప్పినట్లుగా జ్ఞాపకం వచ్చింది. తాను తనమామ పొలందగ్గరకు వచ్చాడు. గట్టు తప్పి పొలంలోకి వెళ్ళాడు. అప్పుడెల్లా వచ్చిందో నీళ్ళల్లో పడినట్లే మెలకువ వచ్చింది. ఈ పొలం రాత్రి ఎంత అందంగా కనబడింది. "ఆ కాఫీహోటలుపిల్ల దొంగనానంజ నా నెల్లేసరికి, ఆడెవడిపక్కనో తొంగొనుంది. ఓలబ్బో మాచెడ్డ కోపమొచ్చేసి ఆళ్ళిద్దరినీ సంపేసేద్దామని మీదపడేటప్పటికి ఆ కొత్తోడు, నెగిసి సావకొట్టి, యిడిసిపెట్టాడు. ఈడి పొగరు ఇల్లాఉందిరా అని, నానెళ్ళి సారాయి దుకాణం కాడ రెండు బుడ్లు లోనేసి, కత్తికోసం ఇంటికెళ్ళాను. ఆ తరువాత నాకేం తెలుసు. మామ పొలంలో ఉన్నాను గందా ఆపైన నాకు చటుక్కున తెలివొచ్చి సూత్తే మామపొలం. అది పొలమేటి, అది బంగారుపిల్ల కాదంట్రా! ఆ సీకటంతా ఎన్నెలే అయిపోయింది. ఆ పొలం సూత్తే మామెంత దేముడంటివాడో గాపకం వచ్చి, మా దుక్కమేసి పొలంలో పడిపోయి యేడిసినాగందా ఆ తర్వాత నాకు నిదరే పట్టేసింది" అని తనచుట్టూ చేరిన పచ్చలయ్యతో, పైడమ్మతో అప్పలమ్మతో సోమన్న సిగ్గుపడుతూ చెప్పాడు.
సోమన్న: మావాఁ! ఏటి సేయమంతవు, రాత్రి నీపొలంలో కాలెట్టానా. అంత దుక్క మొచ్చిందేమిటి?
అప్ప: ఓరి కుంకన్నా, మామపొలంలో కడుగెట్టడానికి నీకేమి అక్కుందిరా?
పచ్చ: నీ కిట్టమొత్తే నా పొలం గట్టుమీద నీ బారియతో నుండు. యేరే సిన్నిల్లేసుకుందాం. నానూ, మా అక్కా మా ఇంటిలో ఉంటాం.
అప్ప: రోజూ తాగొచ్చి, పుత్తెగట్టిన పుత్తడి బొమ్మంటి పిల్లదాన్ని కొట్టే చచ్చుకుంకకి ఇక్కడ కాపురమేటిరా తమ్ముడూ.
పచ్చ: నా లచ్చిమి ఈడు తాగొత్తే ఇక్కడకురానిత్తందనే నీ ఉద్దేశం?
పైడ: బాబూ, నీకింత సాకిరిచేసుకుంటూ పడుంటాను, ఆడు నన్ను చంపేత్తాడని భయంకాదు. ఆ తాగొచ్చినప్పుడే డనేటి మాటలు రామసెంద్రా! పాపం వొరుసం కురుత్తాదికందా!
8
సోమన్న సిగ్గుపడి లేచి ఆ పొలం మాలక్ష్మిలోనికి నడిచిపోయాడు. అక్కడ ఒక మడిగట్టుమీద కూర్చుండి, ఏదో ఆలోచనలోపడినాడు. తన మామ ఈ పొలానికి లచ్చిమి అని పేరెట్టుకున్నాడు. ఎంత సక్కని, ఎంత సక్కని పొలం! తనమామ పచ్చలయ్య దేముడంటివాడు. ఎన్నిసార్లు తనకూ తన కుటుంబానికి సాయం రాలేదు. అంత ముసలోడు ఆ పనేంటి ఆ సగితేంటి?
లచ్చిమీదేవే ఈ పొలం. తాను ఈ లచ్చిమీదేవి దగ్గిర నుంచోడానికైనా తగడుకందా! ఈ పొలం లచ్చిమిని కావులించుకోవాలి. తన మావ తన కూతురంటా డీ పొలాన్ని, తన పైడి నిజంగా పైడిబొమ్మే! ఎన్నిమార్లు తాను దాన్ని ఏడిపించలేదు. ఉలక్కుండా మలక్కుండా ఎంత బగితితో తనకూ, తనమ్మకు శాకిరిసేత్తుందికాదు. ఆ దిగదుడిచిన ఓటలు సరుకు తన పైడికి మైలుదూరంలో నుంచోడానికి వొల్లా? ఆ సచ్చు సరుకులు ఈ పొలం లచ్చిమికి రావడానికి వొల్లా!
ఏటి తనకీ పోగాలం. ఎదవ తాగుడు. మా అయ్య ఎప్పుడైనా తాగినాడా. సంపాయించినా ఎకరాపొలం నేను ముణసబుగారి కమ్మేసినానుగందా! తల్లీ, పొలం మాలచ్చిమీ అంటే నన్ను రచ్చిత్తాది. లేకుంటే నాకూ దానికి ఏమి సమ్మందం.
"పెళ్ళాం మెళ్ళో గుల్లలు తాగురమ్మగోరి వొళ్లో ఏసేసినాను.
"పొలం లచ్చిమీ! కుక్కబతుకు బతికినాను. నన్ను రచ్చించాలి.”
ఆ పొలం బాలిక నవ్వినట్లయింది సోమన్నకు. ఆ పొలంలో సాగిలపడ్డాడు సోమన్న. అతని కళ్ళవెంట ఉండి కాల్వలునూరు ప్రవహించాయి. పొలంలచ్చిమి చిరునవ్వు నవ్వి 'లే సోమన్నా! నన్నూ పైడమ్మను ఆపేచ్చతో సూత్తానని మాటియ్యి. మాట తప్పావా! నువ్వు నాశనమైపోతవు. నా శకితి అలాటిది. మామమాట తప్పక బుద్ధితో మసలు, నేనూ పైడమ్మా నీకిద్దరం పెళ్ళాలము' అని పలికినట్లు అతని హృదయానకు తట్టింది.
9
చిరునవ్వు నవ్వుకుంటూ, కళ్ళనీరు కారుస్తూ సోమన్న మేనమామ కాళ్ళమీద పడ్డాడు. “మామా! మా బాబు పేరు హచ్చి. నువ్వు సెప్పింది ఇనుకుంటా! ఈ పొలం పొలిమీరదాటి వెళ్ళితే నన్ను బలెయ్యి!" అన్నాడు.
అతని మాటలలో సత్యవాక్కు వారి హృదయాలలో మారు మ్రోగినది.
అప్పలమ్మ 'సింహాదిరప్పన్నా, నీ దయ' అంది. పచ్చలయ్య 'నా లచ్చిమి, నువ్వు బర్తనేరుకున్నావా తల్లీ' అనుకున్నాడు. పైడమ్మ ముసిముసి నవ్వును నవ్వుకొని పైటసర్దుకొంది. పొలం కన్నె లచ్చిమి సిగ్గుతో తనపైట తాను సర్దుకొంది.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse