Jump to content

అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/తూలికా నృత్యం

​

తూలికా నృత్యం

ఆ బాలిక రంగులు కలుపుకుంటూ ఉన్నది. తాను ఎదురుగుండా పెట్టుకున్న వాట్‌మన్స్ డ్రాయింగు పేపరు నున్నటి చిత్రలేఖన ఫలకానికి సూదులతో నొక్కిపెట్టి ఉంచినది. ఆ కాగితంపై పెన్సిల్‌తో రేఖాచిత్రం ఒకటి గీసి ఉన్నది. అనేక చిత్తుడ్రాయింగు కాగితాలపై తన మనసులోని భావాలకు మూర్తికట్టించే రూపం కోసం ప్రయత్నాలన్నీ చేసింది.

అవి ఎంతో కంగాళీగా వచ్చినవి. మనస్సు తృప్తి కలుగలేదు. బొమ్మని, రబ్బరు ముక్కతో చెరిపి, మళ్ళీ వేసి, మళ్ళీ చెరిపి, అలా వేస్తూ చెరుపుతూ ఈ వారంరోజులనుండీ ఆమెతన భావానికి మూర్తి సమకూర్చ ప్రయత్నించింది.

చిత్తు డ్రాయింగు కాగితా లెన్ని పాడుచేసిందో!

చివరకు ఆ విన్యాసాలన్నిటిలోనుండి ఏదో ఒకరకంగా తృప్తి ఇచ్చిన రూపం వచ్చింది ఆ రూపాన్ని దిద్ది, తీర్చింది.

ఆ బొమ్మను పల్చని కాగితంపైన ప్రతి తీసి. కాగితం వెనకవైపు నల్లటి డ్రాయింగు బొగ్గుపొడుం రుద్ది, నాలుగు “హెచ్” మార్కు వీనస్ పెన్సిలు సన్నంగా చెక్కి, ఇసుక కాగితంపై అరగదీసి, మొనతీర్చి, “వాట్‌మన్" కంపెనీవారి “ఇంపీరియల్' చేతి తయారు కాగితం ఇరవై అంగుళాలు పొడుగూ, పన్నెండు అంగుళాలు వెడల్పూ కొలతలను కత్తిరించి, మొదట చిత్రలేఖన ఫలకంపై ఆ వాట్‌మన్ కాగితమూ, దానిపైన ఆ పల్చని కాగితమూ ఉంచి డ్రాయింగు సూదులు నాలుగు మొనలపైనా గట్టిగా గుచ్చింది. ఆ పల్చని కాగితంపై ఉన్న రేఖాచిత్రంపై ఈ నాలుగు “హెచ్” వీనసు పెన్సిలుతో రేఖలను గీసింది.

ఆ వెంటనే చిత్తురేఖాచిత్రం ఉన్న పల్చని కాగితం తీసివేసి, మంచి కాగితంపై దిగిన బొమ్మను చూసుకొని సరిదిద్దుకొంది. ఆ వెనుక ఆ పెన్సిలు రేఖలపై తాను ఈయదలచుకొన్న రంగుల ననుసరించి తూలికతో రంగురేఖలు దిద్దింది.

వేయదలచుకొన్న చిత్రం "రైతూ - రైతు కూలీ!” ఆ బొమ్మ వేయడమా, వద్దా అని మొదట కొన్ని రోజులు ఆలోచించింది. ఆ విషయంలో ఆ బాలికకు, ఆ బాలికకు చిత్రలేఖన విద్య నేర్పే “పద్మప్రియ” దేవికీ ఒక ఉదయమంతా వాదన జరిగింది.

“ఒక భావం నీకు సన్నిహితమై ఆనందం కలగాలి! అప్పుడే ఆ ఆనందంలో నుంచి చిత్రకారునికి రసస్వరూపమైన రూపం ప్రత్యక్షమౌతుంది. అంతేకాని మనస్సులో ​రాజకీయమైన కోర్కెలూ, కాంక్షలూ, పట్టుదలలూ ఉండి, ఆ భావాలు రసస్వరూపమై ప్రత్యక్షం కాకుండా చిత్రం వేయడానికి సంకల్పం చేసుకుంటే రసాభాసం ఉద్భవిస్తుంది కాని, రసభావ స్వరూపం ఉద్భవించదు వాణీ!"

వాణీసుందరి అని ఆ బాలిక పేరు. వాణి తన దేశికురాలివైపు తీక్షణంగా చూచి, “పిన్నీ, మీరు చెప్పే ముక్కలు నాకేమీ అర్థంకావు, రసభావం ఏమిటి, రసాభాస భావం ఏమిటి? నాకు విడమరచి చెప్పండి!”

“రసానందం అంటే కళానందం అని మన గురువుగారు బ్రహ్మమూర్తిగారు చెప్పారుకదా!”

"అవునూ! ఆహార, నిద్రా, భయాదులైన మానవ భౌతిక వాంఛలను మించిన ఒక మహోత్తమ వాంఛ ఉన్నదనీ, అది సౌందర్య వాంఛ అనీ, జగత్తులో ఆ సౌందర్యం చూచి ఆనందం పడడం మానవుని మనస్సునకు ఉత్తమస్థితి అనీ ఆ శక్తివల్ల మనుష్యుడు సర్వకాల సౌందర్యాన్వేషి అవుతాడనీ, ప్రకృతిలో, మనుష్యసంఘ చరిత్రలో ఆ సౌందర్యం కొన్నికొన్ని దోషాలు కలిగి ఉంటే వానిని మనుష్యుడు తనమనస్సులో దిద్దుకొని, లేనివి కలుపుకొని ఆనందిస్తాడనీ, అలాంటి మనుష్యునకు సృజనశక్తిఉంటే, అతడు కావ్య రూపంగానో, ఇతర సాహిత్య రూపాలుగానో, చిత్రలేఖన శిల్ప రూపాలుగానో, సంగీత నాట్య రూపాలుగానో వ్యక్తం చేసి ఆనందిస్తాడనీ, అవి లలిత కళారూపాలనీ, ఆ కళలు భావకులైన సహృదయులకు ఆనందం కలుగజేస్తాయనీ గురువుగారు బోధించారు. అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ ఆనందం రసానందం అన్నారు. నిజమే అయితే ఏమి? ఆ భావాలన్నీ నాకు పూర్తిగా అర్థంకాలేదు పిన్నీ!”

“చిన్న ఉపన్యాసం ఇచ్చావు తల్లీ! ఆ భావాలు పోను పోను నీకు పూర్తిగా అర్థం అవుతాయి.”

“సరేలెండి, పిన్నీ! అయితే ఇంతకూ ఈ చిత్రంలో ఉండే దోషమేమిటంటారు?”

ఆ బాలికవేసే చిత్రం పద్మప్రియ పరిశీలించసాగింది. రైతు, రైతు వెనక అతడు వేసుకొన్న పాశ్చాత్యఛత్రం ఉంది. రైతుకూలీ బొమ్మకు కుడివైపున మధ్యగా ఉన్నాడు. రైతు బొమ్మకు ఎడంవైపున మధ్యగా ఉన్నాడు. ఒకరికొకరు ఎదురై ఉన్నారు. రైతు కోపంగా ఉన్నాడు. రైతు కూలీ శాంతంగా ఉన్నాడు. రైతుకూలీ వెనక నీలాకాశం ఉంది. వీరిరువురకుమధ్య దూరంగా వరికుప్పఉంది. రైతుకు ఎడంప్రక్క చిత్రానికి వెనక భాగాన దూరంగా రోడ్డుమీద, అతను పొలాలకు ఎక్కివచ్చిన గుఱ్ఱపు బగ్గీ బండి ఉంది. దానికి వెనుకగా ఇంకా దూరంగా గ్రామమూ, చెట్లూ, ఆ చెట్లల్లోంచి రైతుమేడ కనబడుతూ ఉంటాయి. రైతుమోము మూడు వంతులు తిరిగి ఉంది. రైతుకూలీ మోము రైతువైపుకు పూర్తిగా తిరిగి ఉంది. దేహం మూడువంతులు ప్రేక్షకులవైపు తిరిగి ఉంది. రైతు దేహం రైతుకూలీ వేపుకు పూర్తిగా తిరిగి ఉంది. రైతుకూలీ ప్రక్కనే నాగలి, ఎడ్లూ ఉన్నాయి. కొంచెం దూరంగా అతని భార్య పచ్చగడ్డికోస్తూ రైతూ, రైతుకూలీల సంభాషణ వింటున్నది. ఆ ప్రక్కనే రైతుకూలీ కొడుకు గట్లు తవ్వుతూ, బాగుచేస్తున్నాడు. ఇంకా కొంచెం దూరంగా ​మాలపల్లి గుడిసెలూ, కుక్కలూ కోళ్ళూ, పశువులూ, మరికొంత దూరంలో చచ్చిన జంతువూ, దాన్ని తింటూ రాబందులూ, కాకులు ఉన్నవి.

ఈ చిత్రం వలదనిన్నీ ఈ చిత్రభావానికి స్థాయీస్థితి రాదనిన్నీ పద్మప్రియాదేవి శిష్యురాలికి మొదటనే నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. కాని "స్థాయీస్థితి అంటే ఏమిటి? అదిరావడం అంటే ఏమిటి? అది రాకపోవడము అంటే యేమిటి?" అని తీవ్రంగా ఆమెను వాణీసుందరి అడిగింది.

తమ గురువు బ్రహ్మమూర్తి ఈలాంటి విషయాలు పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వాదిస్తాడు. తనకు తన గురువు బోధించినవి అర్థం అయ్యాయి. అవన్నీ తన జీవితంలో హత్తించుకొని. తాను రచించే చిత్రాలన్నిటిలో భారతీయ కళాసత్యం సర్వతోముఖంగా వికసింప చేయకలిగింది పద్మప్రియ. ఎటువచ్చినా తాను ఆరభటీ వృత్తిపూర్ణమైన చిత్రాలు విన్యాసం చేయలేకపోలేదు. కైశికీ వృత్తిజనిత శృంగార, భక్తి, శాంతి, కరుణ, శోకరసాలను సిద్ధహస్తంతో నిష్పన్నం చేయకలిగేది. ఇంక ఈ బాలకు బోధించి వాణీసుందరికి సరియైన దారిచూపించడం ఏలాగు అని ఆనాడు పద్మప్రియ దీర్ఘనిశ్వాసం విడిచింది.

ఈ దినాన వాణీసుందరి ఆ బొమ్మను రంగుల రేకలు దిద్దుతూ ఉండగా పద్మప్రియ అచ్చటికి వచ్చి ఆ బాలిక చిత్రాన్ని గమనించి చూచి వెళ్ళిపోయింది.

2

పద్మప్రియాదేవికి ఇప్పుడు ఈ 1949, డిశంబరులో ఇరువది ఎనిమిదేండ్లు. ఆమెకు బంగారు ఛాయ ఒళ్ళు. కోలనైనమోము. సోగకళ్ళు. ఒత్తయిన జుట్టు, ఆ సోగకళ్ళు అర్ధనిమీలితాలు. చిన్ననినోరు. ఎఱ్ఱనై సన్నవైన పెదవులు. సమంగా నిడువు కలిగినమెడ. సొట్టకలిగి ముద్దులు గులికే గడ్డము. ఆ దివ్య సౌందర్యం కలిగిన వదనం చూసిన పురుషుడు పదే పదే ఆ మోముచూచి తనివినందుడు. ఆమె కళ్ళల్లో ఏవో లోతులు కలిగిన అమాయకపు చూపులు. ఎత్తయిన వక్షోజాలపై, పూర్వకాలపు విధానంగా రైకా, ఆపై అందంగా మడతలు తీర్చిన పయ్యెద ఎప్పుడూ చెక్కుచెదరువు. సన్నని నడుము, శిల్పులు ఆనంద తన్మయులయ్యే విగ్రహము. వికసించిన కటి, తీర్చిన పాదాలు, పొడుగు చేతులు, చిన్న హస్తాలు, తీగలవంటి వేళ్ళు, ఆమె పెదవులు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాయి.

పెళ్ళి అయి, కార్యంకాకుండా నెలరోజులలో ఆమె భర్తకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఎన్నో ఉపవ్యాధులు ఆ జ్వరంలో విజృంభించి అతడు ఇరవైయో లంకనం రోజున దేహం వీడినాడు.

పద్మప్రియకు పదునారవ ఏటనే పెళ్ళయినది. అంతవరకూ సరియైన సంబంధాలు దొరకలేదు. దొరికిన సంబంధాలు ఆమెకు నచ్చలేదు. ఏం.ఎ.లో కృతార్థుడై ఒక కాలేజీలో ఆచార్య పదవిలో ఉన్న ఇరవై నాలుగేళ్ళ యువకుడు, స్వకులం వాడు, మంచి వరుడు దొరికాడు.

ఒక్కతే కూతురు; సోదరులులేరు పద్మప్రియకు. కాబట్టి మంచి కట్నం ఇచ్చాడు. కట్నం ఇవ్వకూడదన్న పెద్దమనిషే. అయితే ఏమి? ఇప్పటి సంఘంలో ఉన్న ఈ మహా దురాచార వ్యాధికి అతడూ లోనుగాక తప్పిందికాదు. ​చిన్నతనంలోనే విధవ అయిన పద్మప్రియను చూచి, బంధువులంతా దుఃఖించారు. తల్లిదండ్రుల దుఃఖం ఏడు సముద్రాలే అయింది. ఆమె అందం చూచి, ఆమె స్థితి తలచుకొని ఆమె తండ్రిగారి స్నేహితులందరూ మళ్ళీ వివాహం చేయమని పట్టుగా సలహా యిచ్చారు. “ఆమెకు విద్య చెప్పిస్తాను. ఆ తర్వాత ఆమె ఇష్టం!” అని తండ్రి కోదండరామయ్యగారన్నారు.

ఆమె చదువులో చేరింది; స్కూలు ఫైనలు నెగ్గింది. కాలేజీ చదువు పూర్తిచేసి బి.యే. పట్టం పొందింది. ఆ బాలికకు చిన్నతనాన్నుంచీ చిత్రకళ అంటే మహాఇష్టం. ఎప్పుడూ ఏవో బొమ్మలు, పత్రులు వ్రాస్తూనే ఉండేది. రంగుల పెట్టే, కుంచెలూ కొనుక్కుంది. ఇరవై అయిదో ఏట బి.యే. నెగ్గింది. పద్మప్రియ. ఆమె కప్పుడు వివాహం చేద్దామని తండ్రి ప్రయత్నించారు.

“నాన్నా! నాకు వివాహంమీద ఇచ్చలేదు. నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం. శాంతినికేతనానికి పోయి నందలాలుగారి పాదాలకడ చిత్రలేఖనం నేర్చుకుంటాను” అని ఆ బాల పట్టుపట్టింది. తండ్రి ఆమెను శాంతినికేతనానికి పంపించాడు. అక్కడ ఆమెకు ఆంధ్రుడైన బ్రహ్మమూర్తితో పరిచయం కలిగింది.

బ్రహ్మమూర్తి వివాహం చేసుకోనని నిశ్చయం చేసికొని జీవితం సాగిస్తున్న బ్రహ్మచారి. అతనికి చిన్నతనాన్నుంచి శిల్పము, చిత్రలేఖనము, కవిత్వము, సంగీతము, నాట్యము అంటే వర్ణింపరాని ప్రేమ. అతనికి ఉగ్గుపాలరోజులలోనే ఈ విద్యలన్నీ అలవడినాయి. కాని, తల్లితండ్రులు ఈ విద్యలవల్ల లాభం లేదురా బాగా చదువుకొని, పరీక్షలునెగ్గి ఉద్యోగం చేయరా అని పోరుపెట్టారు. అతడు చదువు సాగించాడు. కళాహృదయం ఉత్కృష్టంగా వికసించాలంటే సర్వప్రపంచ జ్ఞానం అవసరమనీ, అందుకై చదువులు ముఖ్యమనీ అతడు సమాధానం పెట్టుకున్నాడు. చదువుకుంటూ లలితకళాభ్యాసం చేసుకుంటూ ఇరవైరెండో ఏట బి.ఎస్‌సి . ఆనర్సు పూర్తి చేశాడు. ఆనర్సు చదువుతూ ఉండగానే అతని తల్లితండ్రులు పరమపదంచేరినారు మూడు నెలలు ఎచ్చుతగ్గులుగా!

తనకు సరియైన భార్య దొరకడం అసంభవమని అతనివాదన. అతడంత అందమైన వాడూ కాదు; అంత కురూపీకాడు. కొంచెంపసిమిలో చేరే చామనచాయ. మధ్యరకం ఎత్తు. బలవంతమూకాని, బలహీనముకాని దేహ సౌష్టవం. కోలమోము చిన్న కళ్ళు, సమనాసిక, విశాలమైన నుదురు, సాధారణమైన నోరు. కాని అతని చూపులలో సర్వ విశ్వ సౌందర్యాలూ అన్వేషించే శక్తి ఉంది. అతనికంఠం చాలా తీయని మందర పంచమ మధ్యస్థాయి కలది. చురుకైన బుద్ధి. ఎప్పటికీ శక్తివీడని నవనవోన్మేషమైన కళాసృష్టి.

అతని పాటలు అతనిని ఆంధ్రదేశంలో పదిమంది పెద్దకవులలో ఒకణ్ని చేశాయి. అతని నాట్య ప్రదర్శన అతనికి భారతదేశం అంతా నిండే కీర్తిని సమర్పించింది. అతని సంగీతం మనోహరం. అలాంటి ఆ యువకుడు ఆనర్సు పూర్తిచేసి కలకత్తాపోయి, అవనీంద్ర ఋషి పాదాలకడ చిత్రలేఖనం నేర్చుకున్నాడు. దేశం అంతా తిరిగి సర్వకళాక్షేత్రాలలో మూల్య శిల్పాలనూ, చిత్రాలనూ సమర్పించిన అజ్ఞాత కళావేత్తల ఆత్మ పాదాలకడ అతడు ​భారతీయ సంప్రదాయ మహోత్తమశక్తి అలవరచుకొన్నాడు. శివుని కడ పాశుపతం సముపార్జించిన అర్జునునివలె!

చిన్నతనాన్నుండీ అతనికి ఒక ఆశయ సౌందర్యరాశి అయిన బాలికా మూర్తి స్వప్న సుందరిగా సాక్షాత్కరించి ఉండేది. ఆ బాలిక తనకు ఈ జన్మలోగాని, మరి ఏ జన్మలోగాని ప్రత్యక్షం కాదనే అతని నమ్మకం. అతడు కళాతపస్వి అయిన మరుక్షణం నుండీ ఆమె సర్వకాలమూ అతనికి వ్యక్తావ్యక్త మూర్తిగా ప్రత్యక్షం అయియుండేది.

అతడు చిత్రలేఖనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. అనేక ఉత్తమ మంత్ర ధ్యానమూర్తులను, అనేక విచిత్ర పురాణేతిహాస కావ్యాంతర సంఘటనలను చిత్రించేవాడు; అనేక భాష చిత్రాలను రచించాడు; మహాభావపూరితమైన ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు.

చిత్రాలు ఉత్తమమైనవి. వర్ణ విన్యాసము మహోత్తమము, రేఖా శక్తి అత్యుత్తమము, భావము పరమోత్తమము అయినా ఈ కాలానికీ ఈ చిత్రాలన్నీ ఎవరికికావాలి? ఆ భావాలు ఎవరికో కొద్దిమందికి తక్క సాధారణ ప్రజాకోటికి సన్నిహితంకావు. ఈనాడవి పూలతోటలంటివి. తిండిలేక మలమల మాడిపోయేవారికీ ఈలాంటి చిత్రాలెవరికి కావాలి?” అని కొందరు విమర్శకు లాతన్ని గురించి పత్రికలలో వ్రాసినారు.

“సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యల విషయంలో ప్రజలకు ఉద్రేకం కలుగజేసే చిత్రాలు ఉత్తమ తరగతికి రాలేవు. అవి విన్యసించేందుకు సాధారణ చిత్రకారులు చాలు. బ్రహ్మమూర్తిగారి వంటి మహోత్తమ చిత్రకారులు భారతీయ దివ్యసంస్కృతిని పునరుద్ధరించేందుకు ఉద్భవించారు. ఈనాడు భరతమాతకు సంపూర్ణ విముక్తి వచ్చింది, లోకానికి సరియైన మార్గం భారత జాతీయతే చూపించవలసి ఉన్నది. అటు కోటీశ్వర ప్రజాస్వామికము పనికిరాదు; ఇటు ప్రజా నియంతృత్వమూ పనికిరాదు. ప్రపంచానికి కావలసినది సంపూర్ణ ప్రజాస్వామికత్వము. దానికి మార్గం అహింస. భారతీయ సంస్కృతిలో నుండి ఉద్భవించిన లలిత కళా విధానం ఆ ఉత్తమ ప్రజారాజ్యస్థితికి దారిచూపిస్తుంది” అని ఇంకో తెగ విమర్శకులు బ్రహ్మమూర్తిని సమర్థించారు.

ఆ విమర్శనవల్ల బ్రహ్మమూర్తి హృదయం కుదురు చెదిరిపోయింది. అతడు తన గురువైన అవనీంద్రునికడకు సందేహ నివృత్తికోసం శాంతి నికేతనం చేరినాడు. దివ్యకవి శ్రీ రవీంద్రుడు అస్తమించినప్పటి నుండీ అవనీంద్రుడే శాంతినికేతనానికి కులపతి అయినాడు.

బ్రహ్మమూర్తికి ఏది నిజమైన దారి అన్న అనుమానం పిశాచమై ఆవహించింది. దేశాలు తిరిగినా, శిల్ప క్షేత్రాలు సేవించినా, హిమాలయ దివ్యసౌందర్య ప్రదేశాలు యాత్రలు సేవించినా, అతనికి అనుమానము పోలేదు; శాంతి కుదరలేదు. చివరకాతడు 1947, ఏప్రిల్నెల 1వ తారీఖున తన గురుపాదాలకడ చేరుకున్నాడు. ​

3

శాంతి నికేతనానికి వచ్చిన మర్నాడు బ్రహ్మమూర్తి అవనీంద్ర పర్ణశాలకుపోయి తన గురువునకు పాదాభివందనమాచరించి, శ్రీనందలాల్‌ని దర్శిద్దామని వెడుతున్నాడు. నందలాల్ పర్ణశాలా ముఖద్వారములో అతడు అడిగినాడు, అప్పుడే అతని కళ్ళకు ఒక దివ్యసుందరమూర్తి ప్రత్యక్షమైంది. ఇన్నాళ్ళవరకు ఏ స్వప్నసుందరి అతని ఆశా దేవీమూర్తియై అతనిచేత పాటలు పాడించిందో, ఆ దేవీయే ఇప్పుడు అతని ఎదుట మానినీమూర్తియై ప్రత్యక్షమైంది.

అతని హృదయ స్పందనం ఆగిపోయింది; అతడు ఆగిపోయి అనిమిషుడై ఆ మూర్తిని ప్రగాఢ భక్తిపూరిత నయనాలతో అవలోకిస్తున్నాడు.

ఆ బాలికా మూర్తి ఈతన్ని చూసి ఆగిపోయింది. అతని వెనకాల ఉన్న కాంతి అతనిలోనుండే ఉద్భవిస్తున్నట్లామెకు తోచినది. ఎవరో ఒక దేవుడు స్వర్గము విడిచి ఇక్కడకు వచ్చినాడని ఆమె అనుకొన్నది. అనుకొని ఏదో ఒక వ్యవస్థాభి సంఘాతయై ఆమె తలవాల్చుకొని రెండుచేతులు అంజలి ఘటించి అతనికి నమస్కరించింది. అతడు తిరిగి నమస్కరిస్తూ.

"దేవీ! భారతీయ సంప్రదాయమా ఈనాడు భరతదేశమునకు కావలసినది? లేదా అతి నవీన పాశ్చాత్య సంప్రదాయాది అభిముఖత్వమా?” అని ప్రశ్నించాడు.

అతని ప్రశ్నకు ఆమె ఏమి ఆశ్చర్యపడకుండానే, తాను తెలుగుబాలిక నని అతనికి ఎలా తెలిసిందని ఆలోచించకుండానే, ఆమె "ప్రపంచానికే సరియైన దారి భారతీయ సంప్రదాయమండీ” అన్నది.

తరువాత వారిద్దరు ఆ ప్రశ్నకూ ఆ సమాధానమునకూ ఆశ్చర్యమును పొందినారు.

బ్రహ్మమూర్తికి ఇప్పుడు ముప్పదిరెండు ఏండ్లు. అతడు ఇన్నేళ్ళూ వివాహము చేసికోలేదు.

వివాహము చేసికొనమని వత్తిడిచేసే తల్లిదండ్రులే నాకవాసులై పోయినారు. అన్నగార్లిద్దరు గుడిగుడి గుంచం గుండా రాగం వాళ్లు. ఒక అక్కగారు, ఇద్దరూ చెల్లెళ్ళు. “పెళ్ళిచేసికో తమ్ముడూ”, “పెళ్ళిచేసుకో అన్నయ్యా" అని వత్తిడి చేసిన మాట నిజమే. కాని "నాకు భార్యాబిడ్డలు చిత్రలేఖనమే” అని అతడు జవాబిచ్చేవాడు. కాని అతని హృదయంలో అతని భార్య అతని ఆశయదేవి. అతని హృదయ పూజాపీఠంమీద ఆమె నిత్యావివశిత. ఆమెయే అతనికి దేవి.

ఈనాడు ఎదుట అజంతా కుడ్యవిలసిత సుందరివలె లతాంగి, పూబోడి మంజుల తారల్యకాంతిశరీరం తన ఆశాదేవి తన ఎదుట సాక్షాత్కరించింది. ఇంతలో అతనికి చైతన్యం వచ్చినది. ఆమె తెలుగు బాలిక అని ఎట్లా గ్రహించాడో అతనికే ఆశ్చర్యం వేసింది. ఆ ఆశ్చర్యముతోనే అతను ఆమెను “మీరు తెలుగువారా అండి?” అని ప్రశ్నించాడు.

“అవునండి!” ​“మీరు నందలాల్ గారి వద్ద చిత్రలేఖనం నేర్చుకుంటున్నారా?”

"అవునండి. ఏడాది ఆరు నెలల వెనక నేను శాంతినికేతనానికి వచ్చాను. చిత్రలేఖనం నేర్చుకుంటున్నాను.”

అతనికి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు.

“మీరు బ్రహ్మమూర్తిగారు కాదండీ? అనేక పత్రికలలో మీ ఫోటోలు గుర్తించాను; మీ వ్యాసాలు చదివాను; మీ బొమ్మలు చూశాను.”

“మీ ఊరండి? మీ పేరు? మీ... మీ... నాన్నగారిపేరు?”

“నా పేరు పద్మప్రియండి. మాది గుంటూరు జిల్లా అమరావతీ గ్రామం. మానాన్నగారి పేరు కోదండరామయ్యగారు.”

అతడు ఆ హాలులో ఉన్న చిత్రాసనము వైపు ప్రవేశిస్తూ “దయ చేయండి పద్మప్రియగారూ” అన్నాడు.

ఆమె దూరంలో ఉన్న ఇంకో చిత్రాసనముపై కూర్చున్నది.

అతడు తలవంచుకొని "పద్మప్రియగారూ, మీరు లేపాక్షి చూశారా?" అని ప్రశ్నించాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ “నేను మా అమరావతి దగ్గర ఉండే శిల్ప శిధిలాలూ, నాగార్జున కొండా, కలకత్తా మ్యూజియంలో శిల్పాలు, ఇచ్చటి శిల్ప చిత్రలేఖనాలు మాత్రం చూచానండి. ఇంక ఏ శిల్ప క్షేత్రములు చూడలేదు.”

“మిమ్మల్ని ఎన్నాళ్ళకు చూశాను!”

“అంటే?”

"ఏమీలేదు. తరవాత మనవి చేసుకుంటాను.”

ఇంతట్లో శ్రీనందలాల్ బోసు ఆ హాలులోకి వచ్చాడు. ఇద్దరూ లేచి ఆయనకు నమస్కరించారు. నందలాలు చిరునవ్వు నవ్వుతూ "ఎప్పుడు వచ్చావు బ్రహ్మమూర్తీ ? లేపాక్షిలో శిల్పవిద్యాలయం నెలకొల్పుతా నన్నావు?”

“చిత్తం, నందలాల్‌జీ, ఈ ఏడే అక్కడ విద్యాలయం ప్రారంభించాను. ఆ క్షేత్రమే ఒక శిల్పవిద్యాలయం. నా ఆస్తి అంతా అమ్మి అక్కడ కొందరు పెద్దమనుష్యులు దానమిచ్చిన పది ఎకరాల భూమిలో పని ప్రారంభించాను. మూడు మంచి పర్ణశాలలుకట్టినాను. ఇప్పుడు పన్నెండుగురు బాలురూ, నలుగురు బాలికలు విద్య నేర్చుకుంటున్నారు. ఈ వేసవి కాలంలో ఏమీ తోచక మన సంప్రదాయమా, పాశ్చాత్య సంప్రదాయమా అని విద్యాలయానికి సెలవిచ్చి ఈ నెలరోజులు పిచ్చిఎత్తినట్లు తిరుగుతున్నాను. ఆ ప్రశ్నయే అనాలోచితంగా మీ ఇంట్లో కనపడ్డ ఈ అమ్మాయిని అడిగాను. నేను ప్రశ్నవేసినట్లుగానే భారతీయ సంప్రదాయమే ప్రపంచానికి దేశికత్వము వహిస్తుందని జవాబు చెప్పింది. ఈమె నోటితో శ్రీ కళాదేవే ప్రత్యుత్తర మిచ్చి నట్లనిపించింది. నా సంశయం కూడా తీరిపోయిందండి” అని బ్రహ్మమూర్తి నందలాల్‌తో మనవి చేసుకొన్నాడు.

నందలాల్ బోసు చిరునవ్వు నవ్వుకొన్నాడు. "బ్రహ్మమూర్తి, ఈమెను నీ ఆశ్రమానికి తీసుకు వెళ్ళవయ్యా” అన్నాడు. ​

4

ఆనాటినుండీ పద్మప్రియ బ్రహ్మమూర్తికి శిష్యురాలయినది. పది రోజులైన వెనుక వారిరువురూ శాంతినికేతనమునుండి బయలుదేరారు. కోదండరామయ్యగారు కొమరిత లేపాక్షి వెళ్ళి చిత్రలేఖనము నేర్చుకొన సంకల్పించినందుకు ఆయనకు ఇష్టమేనని ఉత్తరం వ్రాసినారు.

వారిరువురూ అజంతా వెళ్ళినారు. ఎల్లోరా వెళ్ళినారు. ఒక్కొక్క క్షేత్రంలో పదీ, పదకొండురోజులు మకాం చేసేవారు. అతడు శిల్ప విద్యా రహస్యాలెన్నో ఆమెకు బోధించినాడు. ఆమెచే ఎప్పుడూ బొమ్మలు వేయిస్తూనే ఉన్నాడు.

క్షణక్షణమూ అతడన్న భక్తి ఆమెకు ఎక్కువై పోతున్నది. ఆమెను చూచిన ప్రథమ క్షణంలోనే అతనికి ప్రేమ ఉదయించింది.

వారు చెన్ననగరం నుంచి మహాబలేశ్వరము వచ్చినారు. మహాబలేశ్వరంలో ఇద్దరూ శిల్పాలను చూచి స్కెచ్చిలు వేసుకుంటున్నారు. ఆ సమయంలో బ్రహ్మమూర్తి పద్మప్రియను చూచి"పద్మప్రియా, నీవు ఎవరినైనా పురుషునిగా ప్రేమించావా?” అని ప్రశ్నించాడు.

“లేదండి!”

"నేను నా ఆశయ దేవతకై యుగాలనుండి వెదుకుతున్నాను. ఆమెను నీలో చూచాను! నువ్వే నా ఆశయమూర్తివి. నీ కోసం వేచి వేచి ఇంతవరకూ వివాహం చేసుకోలేదు. దివ్యశిల్పక్షేత్రమైన శాంతినికేతనంలో నాకు దర్శనమిచ్చావు.”

ఆమె సిగ్గుతో తలవంచుకుంది.

“నీకు ఆశయ పురుషుడు?”

“నా కెవరూలేరు!”

ఆమె జవాబులాతనికి ఆశ్చర్యం కలుగజేశాయి. అతడు మరల ఆమెతో ఏ ప్రస్తావనా తీసుకురాలేదు. అతని హృదయం గతులు తప్పిపోయింది.

శాంతినికేతనం నుండి బయలుదేరిన రెండు నెలలకు వారిరువురూ లేపాక్షి చేరుకున్నారు. ఆమె అతనికి దీక్షాపూర్ణ అయిన శిష్యురాలయింది. అలా వారిరువురి స్నేహము నానాటికి వృద్ధి అయింది.

1948లో బ్రహ్మమూర్తి లేపాక్షి కళా విద్యాలయంలో బాలికా శాఖ నేర్పరచి, ఆ శాఖకు పద్మప్రియాదేవిని దేశికురాలిగా నియమించినాడు.

ఆమె అతనికి చేసే పరిచర్య వర్ణనాతీతము. వారిరువురి స్నేహమూ అనన్యము. అయినా వారిరువురూ ఈ రెండేళ్ళపైన ఎప్పుడూ కళా విషయాలు తక్క, రాజకీయాలు, సాంఘిక విషయాలు తక్క ప్రేమవిషయాలు మాట్లాడుకోలేదు.

పద్మప్రియ లోలోన కుళ్ళిపోయేది. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించింది. కాని ఆమెకు ప్రేమ విషయాలు మాట్లాడడం సిగ్గు. యెన్నిసార్లో ఆమె అతని పాదాలపై వాలి “నువ్వు నా అత్మేశ్వరుడవు, నాకు దేవుడవు. నా ప్రభువువు! నా ఆత్మ. నా శక్తి, నా ​దేహము నీకు బానిసలు, నన్ను ఏలుకో! నన్ను గాఢంగా కౌగలించుకో!" అని తన రహస్యం అతనికి విన్నవించాలనుకుంది.

ఆమె తన్ను ప్రేమించడం లేదనిన్నీ, ఆమె ఈలా దూరంగా తనకు ఆశయ దేవియై ఉండిన చాలనిన్నీ, ఈ జన్మకు ఇంతే ప్రాప్తమనిన్నీ అతడు నిశ్చయం చేసుకున్నాడు.

ఆమెతో అప్పుడప్పుడు తన ఆశయాలు, తాను సృష్టించదలచుకొన్న మహోత్తమ చిత్రలేఖనాలు, ఉత్తమ కావ్యాలు, ఆ కావ్యాలకు తానే అద్భుతమైన చిత్రాలు వేయదలచుకొన్నది. అతడామెకు తన హృదయమంతా తన కళలలో ప్రతిఫలిస్తుండగా చెప్పుకునేవాడు. తన ఆశయ దేవికి ఉషాదేవి అని పేరుట. ఆమె నిత్యోదయ స్వరూపిని అట. ఆమె నిత్యారుణ దివ్య సౌందర్య రూపిణియట. ఆమె నిత్య కౌశికీనృత్య పరవశ అట. ఆమెను అజంతాలో అలంకారోన్ముఖియైన రాజకుమారీ రూపంలో దర్శించాడట. ఆమెను అమరావతీ శిల్పంలో లీలా త్రిభంగీమూర్తియై హాస నృత్యాంచితాంచలాధరోష్టియైన యక్షిణీ రూపంలో అవిర్భావంగా చేసుకున్నాడట. ఆమెను ఎల్లోరాలో ముప్ఫై నాల్గవ గుహలో శచీదేవీ విలాసిత లోలా దివ్యసుందరమూర్తిలో సన్నిహితం చేసుకున్నాడట. పాలంపేట మందిరస్తంభ శిఖరాంచిత నృత్యబాలికా మూర్తిలో ప్రసన్నను చేసుకున్నాడట. కాని జీవితంలో ఆమె తనకింకనూ అవినతను కాంతయట.

అవ్యక్తకాకలీ గంభీర కంఠంతో అత డీభావాలన్నీ ఉత్కంఠతో ఆమెకు చెపుతూ ఉంటే ఆమెకు ఆ మాటలు తన్నుద్దేశించినవే అని తెలుసు. ఆమె అతని పవిత్ర హృదయం అలా దర్శిస్తూ. లోలోన ఉప్పొంగిపోయేది. ఆ మాటలన్నీ వింటూ తన హృదయంలోని గాఢ ప్రణయావేశాన్ని తెరమరుగునే దాచి మోమున చూపుల్లో మాటలు వినే స్నేహితురాలి సానుభూతి మాత్రమే కనబరుస్తూ ఉండేది.

ఇద్దరూ లోలోన పరితావేదనలకు లోనయ్యేవారు. వారి ఆవేదనలన్నీ వారిచిత్రాలలో ప్రత్యక్షమయ్యేవి. సర్వసంగ పరిత్యాగియై, మహాభి నిష్కరుణుడై పోవు సిద్ధార్థ బోధిసత్వుని చిత్రం నలుబది దినాలు సర్వాహార వర్జితుడై మహాతపస్సు సల్పి, కామదేవుని మాయకులోబడని బుద్ధిస్థితోన్ముఖుడై అశ్వద్ధ ఛాయాధివసితనిష్ఠుడైన బోధిసత్వుని చిత్రమును. దివ్యభిక్షకుడై గడపకడా గడపకడా భిక్షమడుగు మహాశ్రమణక బుద్ధదేవుని చిత్రమును అతడు లిఖించినాడు. శ్రీకృష్ణుడే అతడు యోగేశ్వరేశ్వరునిగా ప్రత్యక్షము చేసినాడు. కపాలపాత్రా లంకరుడై సర్వవిశ్వాన్నీ భిక్షమడిగే పరమశివున్నాతడు చిత్రించినాడు. తపస్సు చేసే ధృవుడు. మహావేదాంతియై నడచిపోయే బాలుడైన శ్రీశకుడు అతని తూలికా వైరాగ్య నృత్యంలో నుంచి ఉద్భవించారు. సణ్వాప్రణయ భిక్షాటన మూర్తినిగా సూర్యుణ్ణి చిత్రించారు.

దినదినము రాత్రికాలాలయందు తన విద్యార్థినీ, విద్యార్ధి బృందానికి ప్రపంచ లలితకళా చరిత్ర ఉపన్యసించేవాడు. లలితకళలెందుకు అన్న ప్రశ్నకు ప్రత్యుత్తరముగా మూడుగంట లుపన్యసించినాడు. కళాశయములేమిటి అన్న ప్రశ్నకు సమాధానముగా వారము రోజులు పరమ పవిత్ర గంభీరస్వరముతో సూక్తములు ప్రవచించినాడు. ​అతడు పద్మప్రియను ప్రేమిస్తున్నట్లు విద్యార్థి లోకమంతయు గ్రహించినది. ఆమె హృదయము వాణీసుందరి అను బాలికకు తక్క ఇంకెవ్వరికీ అర్థముకాలేదు.

5

వాణీసుందరి పద్మప్రియకు వలెనే బి.ఏ. పూర్తిచేసి చిత్రలేఖన, నాట్య సంగీతకళలు అభ్యసించేందుకు లేపాక్షి కళాశ్రమంలో 1948లో చేరిన యువతి, ఆమె రాయలసీమ అనంతపుర పట్నవాసిని. ఆమె వచ్చిన మరుక్షణమునుండి పద్మప్రియాదేవి యంటే ఎంతో గాఢమైన భక్తి కుదిరినది. మేలిమి బంగరు రంగు, తీర్చిదిద్దిన కనుముక్కు తీరు, స్పష్టరేఖా విలసిత సుందరాంగ ప్రఫుల్లమైనరూపము. ఆ బాలిక పద్మప్రియకు అడుగులకు మడుగులొత్తేది. ఆ బాలిక ప్రేమించిన సహాధ్యాయుడైన యువకుడు దుర్మార్గగుణ పూరితుడు, మాయాజీవి అని తెలిసి హృదయము విచ్ఛిన్నము కాగా లలితకళాభ్యసన యోగంలో తన గాఢ దుఃఖము మరిచిపోయేందుకు లేపాక్షి కళాశ్రమమునకు వచ్చిచేరింది.

లేపాక్షి కళాశ్రమము ఈనాడెంతో వృద్ధి పొందింది. ముప్పది ఇద్దరు విద్యార్థినులు, అరువది తొమ్మండుగురు విద్యార్థులు అక్కడ లలితకళలను అభ్యసిస్తున్నారు. బ్రహ్మమూర్తి ఆశ్రమాన్ని రెండు భాగాలుగా విభజించినాడు. ఒక భాగం బాలికాశాఖ, ఒక భాగం బాలశాఖ. దైనందిన విద్యాభ్యాసంలో ఈ శాఖకు, ఆ శాఖకు ఏవిధమైన సంబంధములేదు. కులపతి బ్రహ్మమూర్తి ఏదైనా ఉత్తమ చిత్రలేఖనము ప్రారంభించినప్పుడు విద్యార్థీ విద్యార్థినీ లోకము, ఆచార్య ఆచార్యిణీలోకము వచ్చి అతని తూలికానృత్య గతులు దర్శిస్తూ ఉండేవారు. బ్రహ్మమూర్తి ఉపన్యాసాలు సాధారణంగా రాత్రిళ్ళు ఇచ్చేవాడు. ఆ పాఠములు వినడానికి ఆశ్రమవాసులందరూ హాజరయ్యేవారు.

పద్మప్రియాదేవి తన జీవిత సర్వస్వముతో బ్రహ్మమూర్తిని ప్రేమిస్తున్నదని వాణీసుందరి వచ్చిన నెలరోజుల్లోనే గ్రహించకల్గింది. ధైర్యము లేక రసాభాస స్వరూపమైన మూర్ఖపుసిగ్గుతో తన ఆత్మప్రణయ నిక్షేపాన్ని పద్మప్రియాదేవి తానే కూలదోసుకుంటున్నదని వాణీసుందరి గ్రహించింది. ఆమెకు జరిగిన ప్రేమ పరాభవం, ఆమె జీవితాన్ని దగ్ధము చేసిన ప్రణయ దావానలం, ఆమెను మహాసూక్ష్మగ్రహణ శక్తియుతగా ఒనర్చాయి. ఆమెకు ఒక విధంగా ఉత్తమమైన ఉడుకుమోతుతనము పద్మప్రియ అంటే కలిగింది. సంపూర్ణ కళావతారమూర్తి ఒక మహాపురుషుడు తన ప్రేమ సర్వస్వము ఆమెకు నివేదిస్తున్నాడన్న భావము ఆమెకు ఆ ఉడుకుబోతుతనానికి కారణమైంది. మహాభక్తితో ప్రణయభిక్షను అంజలి పట్టిన తనకు ప్రేమ విషము లభించింది.

వాణీసుందరికి పద్మప్రియాదేవి అంటే ప్రేమతో ఎంత భక్తి. అనురాగం కలిగిందో అంత క్రోధము ఆవహించినది. ఆ క్రోధముతో తన దేశికురాలైన పద్మప్రియాదేవిని అనేక రీతులుగా బాధలు పెట్టడానికి సంకల్పించుకొన్నది.

వాణీసుందరికి భారతీయ సంప్రదాయ మహోత్తమ స్థితి తెలుసును. ఆ సంప్రదాయమంటే భక్తీ కలిగింది. నమ్మకమూ కుదిరింది. అయినా కావాలని నవీన పాశ్చాత్య సంప్రదాయాలను అనుకరిస్తూ చిత్రాలు లిఖించేది. అతి వాస్తవికత, అతి ​వ్యంగిణిరూపిత, అతి ప్రాథమికత వాదాల సంప్రదాయంగా ఆమె బొమ్మలు సృష్టిస్తూ ఉండేది. రాజకీయంగా పనికిరాని చిత్రాలు పనికిరావనేది. గాఢ బాధాపూరిత బీదస్థితిలో మగ్గిపోయే కోటికోటి జనాలకు ఉత్తమస్థితిని కొనివచ్చే మార్గాలను నిర్మించడానికి నాయకులకు దారిచూపే చిత్రాలను చిత్రించని కళ శుష్కకళ అని వాదించేది.

వాణీసుందరిని పద్మప్రియ అమితంగా ప్రేమించింది. అందుకని వాణీసుందరి మూర్ఖత్వానికి ఆమె ఎంతో బాధపడేది. వాణీసుందరితో పద్మప్రియ ఎంతో శాంతంగా వాదించేది. మేలుకుని నిద్ర నటించే వారిని ఎవ్వరూ లేపలేరు. తెలిసివుండి మూర్ఖవాదన వాదించేవారిని యెవ్వరు ఒప్పించలేరు.

6

బ్రహ్మమూర్తికి ప్రథమ శిష్యుడున్నూ చిన్నతనాన్నుంచి అలంకార శాస్త్రము, వ్యాకరణము పండితుల కడ చదువుకొన్నవాడును, స్కూలు ఫైనలు పరీక్ష ప్యాసయి సాహిత్యరత్న పరీక్షలో విజయమొందినవాడును, అన్ని కళలలోను తన గురువుకు వెనువెంట నున్నవాడని అనిపించుకున్న వాడును అయిన అహోబల నరశింహారావు బ్రహ్మమూర్తికి గాఢ స్నేహితుడు, శిష్యుడు, బ్రహ్మమూర్తి పాదాలు కడిగి నెత్తిని చల్లుకునే భక్తి అతనిది.

అహోబల నరశింహారావు గురువుగారితోపాటు వివాహం చేసుకోనని పట్టుదల పట్టినాడు. గురువుగారి హృదయం అతనికి పూర్తిగా అవగాహన అయింది. కాబట్టే బ్రహ్మమూర్తి తన ఆవేదనలని అతనితో చెప్పి దుఃఖించేవాడు. బ్రహ్మమూర్తిని అతడు నాన్నగారూ అని పిలిచేవాడు. అతడు చామనచాయ మనిషి. చాలా బలంగా ఉంటాడు.

బ్రహ్మమూర్తి శిష్యులందరికి అపరిమితానందము, భక్తి, అందరినీ మించినవాడు అహోబల నరశింహారావు. వారందరికీ పద్మప్రియాదేవి యన్న విపరీతమైన భక్తి.

ప్రథమంలో ప్రతి శిష్యుడూ ఉషాదేవి చిత్రం లిఖించాలి. కొందరామె నృత్యం చేస్తున్నట్లు, కొందరామె పద్మాసనస్థయై ప్రత్యక్షమైనట్లు మరికొందరామె చతుర్థానురాశ్వములు పూనించిన దివ్యకమల చక్రాలు కలిగిన రథముపై అధివసించి నిరాలంబ మార్గాన్ని ప్రయాణిస్తున్నట్లు ఈలా వివిధ రూపాలతో ఆ దేవిని చిత్రించేవారు.

1949, నవంబరు నెల 5వ తారీఖున బ్రహ్మమూర్తి పద్మప్రియాదేవిని కలుసుకొన్నప్పుడు “మీకు ఆశయ పురుషు డెవ్వరూలేడా” యని ప్రశ్నించాడు.

“మీరు నాకు ఆశయ స్త్రీ పురుషత్వాలంటే ఏమిటో చాలా చెప్పారు కాని, ఆ భావం నాకేమీ అర్థం కావటంలేదండీ.”

"అయితే నేను నీ కెవ్వరను?”

"మీరు నాకు ఆశయ గురువులు!"

“నువ్వు నాకు అనేక రకాలుగా చాకిరీ చేస్తావు. నాకు జ్వరము వచ్చినప్పుడు వచ్చి పాదసంవాహనము కూడా చేస్తావు. నేను నిన్ను దగ్గరగా తీసుకుంటే నా పక్క వదిగిపోతావు. నేను నీ కనులు స్పృశించాను. నీ పెదవులు నా హస్తాంగుళీయాంచనాలతో చుంబించినాను. నా పెదవులతో నీ ఫాలము, నీ మూర్ధ్వము ఎన్నిసార్లో పుణికినాను. నీ ​ఒడిలో నా తల వుంచి ఎన్నిసార్లో బాధతో రోదించినాను. ఆ సమయాల నా తలపైన నీ చేతులు అనురాగంతో వాలిపోయినవి. నువ్వు ఈ విధంగా పురుషుడనైన నన్ను ఏలా స్పృశించకలిగావు? దేవీ! నీ హృదయంలో దయలేదా?”

“మీరు నాకు గురువుగారు కనుక మీకు సేవ చేసినాను. ఆ సేవలో స్పృశించాను.”

“అంతేనా?”

“ఏమో నాకు తెలియదు గురువుగారూ.”

పట్టలేక ఇన్ని సంవత్సరాలు వూరుకొని ఈనాడు ఈ విధంగా కర్కశంగా ప్రత్యుత్తరాలిచ్చిన తన ఆశయమూర్తి మాటల కాతని హృదయము వజ్రాఘాత పర్వతంలా కూలిపోయింది. అతడు విసవిస ఆమె యింటిలోనుండి పైకిపోయి, నడచి నడచి ఆశ్రమంలో పురుష భాగంలో ఉన్న తనయింటిలోనికి వెళ్ళి, తూలి క్రిందపడిపోయినాడు. ఈ విషయం వాణీసుందరి, నరసింహారావు గ్రహించి పరువు పరువున గురువుగారికడ చేరుకున్నారు. అది ఆనాటిరాత్రి. రాత్రి ఎనిమిదైన వెనుక స్త్రీ భాగంలోంచి పురుషుడు కాని, పురుష భాగంలోనికి స్త్రీ గాని వచ్చుటకు వీలులేదు. ఈ రెండింటికి పెద్ద గోడ అడ్డం. మూడు గుమ్మాలు ఉన్నాయి. రెండు ఎప్పుడూ తాళంవేసి ఉంటాయి. మధ్య గుమ్మంలో రాత్రి ఎనిమిదైన వెనుక తాళం వేస్తారు. ఆనాడు తాళం వేయడానికి వాణీసుందరి ఆశ్రమ కులపతి వెళ్ళినాడుకదా అని వచ్చినది.

ఆ ద్వారానికి దగ్గిరగా ఉన్న కులపతి, పర్ణశాలవైపు నరసింహారావు పరుగెత్తుకొని వెళ్ళడం చూసి, తానూ తాళం వేయుట మాని కులపతి ఇంటికి తొందరగా వెళ్ళింది. అచ్చట కులపతి హాలులో తివాసీపై కూలబడి ఉండటమూ, నరసింహారావు గురువుగారితో ఏవేవో మాటలు చెప్పుతూ నుదురునకు చన్నీళ్ళు కొడుతూ ఉండటమూ చూసింది.

వాణీసుందరి వెంటనే “నరసింహారావుగారూ, మీరు వెళ్ళి వెంటనే డాక్టరుగారిని తీసుకురండి. నేను గురువుగారి దగ్గిర ఉంటాను" అని అంటూ లోనికి వచ్చింది. నరసింహారావు “సరే”నని ఆశ్రమ వైద్యుని పిలచుకొని రావడానికి పరుగిడిపోయినాడు.

వాణీ గురువుగారు మూలుగుతూ ఉండటము చూచి "నాన్నగారూ! ఎలా ఉందండి?” అని ప్రశ్నించింది, వాణి మాటలు వినగానే కులపతి బ్రహ్మమూర్తి లేచి కూర్చున్నాడు. “నాకు ఏదో తలతిరిగినది తల్లీ! ఇప్పుడు బాగానే ఉందిలే! నువ్వెప్పుడు వచ్చావు. నరసింహం నిన్ను పిలిచినాడా?” అని అంటూ ఆమె భుజంపై చేయివేసి, నెమ్మదిగా లేచి అక్కడే ఉన్న ఆసనంపై చతికిలబడినాడు. వాణీసుందరి తన గురువు తల తన హృదయానికి ఆన్చుకొని ఆయన మోమూ, భుజములూ హస్తతలంతో నిమురుతూ, “నాన్నగారూ! మీరు అవతారమూర్తులు. మీరు మా పిన్నిగారిని ఇంత ప్రేమిస్తున్నారు. అంతా నేను గ్రహించాను. ఆమె హృదయం నవనీతం. శ్రీకృష్ణుని రాధ ప్రేమించినట్లు, రామచంద్రుని సీతమ్మ ప్రేమించినట్లు ఆమె మిమ్ము ప్రేమిస్తున్నది. కాని ఏకారణం చేతనో తాను ప్రేమ విషయంలో ఇంత మూకత్వం దాల్చినది" అని అవ్యక్త ధ్వనులతో ఆ బాలిక బ్రహ్మమూర్తి చెవిలో చెప్పింది. ​ఇంతలో ఆశ్రమ డాక్టరుగారూ, నరసింహారావు అచ్చటికి చక్కా వచ్చినారు. డాక్టరుగారు కులపతి హస్తనాడి, హృదయము పరిశీలించి ఏమీ జబ్బులేదనీ, ఎలాగో నరాలు ఒక నిమేషంపాటు తారుమారై తల తిరిగి ఉండవచ్చుననీ తెలిపి, కొంచెం బ్రొమెయిడ్ ఇస్తానని వెళ్ళిపోయినారు. ఆయనతో నరసింహారావు వెళ్ళినాడు.

“మందు వస్తుంది. నువ్వు వెళ్ళు తల్లీ!" అని వాణితో బ్రహ్మమూర్తి అన్నాడు.

“కాదు గురువుగారూ! ఈరాత్రి నేను ఇక్కడే మకాం!”

“ఆశ్రమ విధులు ఒప్పుకోవు తల్లీ!"

“ఎవరికైనా జబ్బుచేస్తే పరిచర్య చేయడానికి బాలికలు రావచ్చునన్న ధర్మంకూడా ఉందిగా!"

"అలా వైద్యాలయంలో మాత్రమే! పైగా నాకేమీ జబ్బులేదు. నా ఆరోగ్యం ఇంతవరకూ చెడలేదు. ఇక ముందూ చెడదు. మన కళా సంప్రదాయం మృత్యుంజయ స్వరూపం. భక్తితో మన సంప్రదాయం అనుసరించే వ్యక్తి మృత్యుంజయుడే!”

“అయితే మన సంప్రదాయం మతధర్మం కూడానా?”

“అవును తల్లీ! మతం అంటే బొట్టూ, కట్టూ, ఆచారాలూ అనుకున్నావా? ఆత్మా, పరమాత్మా దివ్యజ్ఞాన స్వరూపమైనదే మతం. కులాలు మతం కావు.”

“మానవుని సంపూర్ణజీవితం మతభాగమే అనిలేదు. మీరొక్క ఉపన్యాసంలో ఉపదేశించారు కాదా నాన్నగారూ?”

“అవును. దివ్యధర్మాలకు శృతిగా మానవుని నిత్యజీవితం నడవాలి, అని నా ఉద్దేశంకదా, అదేగా నేను విపులంచేసి చెప్పాను.”

“అవునండి!”

నరసింహారావు మందుపట్టుకు వచ్చినాడు.

ఆ మందు ఆ అలమారులో ఉంచమని చెప్పి బ్రహ్మమూర్తి వాణీసుందరిని వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చి “నరసింహా! అమ్మాయిని ద్వారంవరకూ దిగవిడిచి రా!" అని నరసింహారావును ఆదేశించారు.

నరసింహారావు ప్రఫుల్లమైనమోముతో ఆ బాలికను అనుసరించాడు.

7

నరసింహారావు వాణీసుందరిని గాఢంగా ప్రేమించాడు. వాణి అతన్ని ప్రేమించింది. ఆశ్రమంవారు బెంగుళూరులో, అనంతపురంలో, బళ్ళారిలో, మదరాసులో ధనసేకరణ నిమిత్తం సలిపిన నాట్య, నాటక ప్రదర్శనాలలో ఇద్దరూ కలిసి నాయికా నాయకుల వేషాలు వేసేవారు.

అతడు కృష్ణుడు, ఆమె రాధ. అతడు శివుడు, ఆమె పార్వతి. అతడు వేటకాడు, ఆమె వేటకత్తె, బుద్ధనాటకంలో మాత్రం వాణి యశోధర వేషం వేసేది. బుద్ధుడు కులపతి బ్రహ్మమూర్తి. ​నాట్య కార్యక్రమంలో బ్రహ్మమూర్తి ఆనందతాండవ స్వరూపియైన శివునిగా అవతరించి అద్భుతముగా నాట్యము చేసేవాడు. ఆ నాట్య కార్యక్రమంలో మాత్రం పద్మప్రియ పార్వతి వేషం వేసేది. ఊర్వశీగాథ నాటకంలోను పద్మప్రియాదేవి ఊర్వశి వేషంవేసేది. అప్పుడామె ప్రదర్శించే నాట్యం అనన్యమని లోకమంతా ప్రశంసించేది. తక్కిన నాట్య కార్యక్రమంలో ఆమె పాలుపుచ్చుకోకుండా వీణ వాయించేది.

ఈ ప్రదర్శనాలవల్ల ఏడాదికి అన్నివిధాలైన ఖర్చులుపోను ఐదారువేల రూపాయల రాబడి వచ్చేది. ఏకమొత్తంగా వచ్చిన చందాల డబ్బు ఇరవై ఐదువేల రూపాయలు బ్రహ్మమూర్తి మూలధనంగా ఉంచి ప్రభుత్వపు ఋణపత్రాలు కొన్నాడు. కొందరు పెద్దలు తమ పేరను, తమకు నచ్చిన ఇతరుల పేరను భవనాలు అవి కట్టించి ఇచ్చేవారు.

వాణీసుందరి, నరసింహారావు నెమ్మదిగా నడిచి వెడుతూ ఆశ్రమపు రెండు భాగాలను కలిపే ఆ ద్వారం దగ్గిర ఆగినారు.

"వాణీ! ఇప్పటికైనా పురుషులంటే కోపం నీకు పోలేదా!” అని నరసింహారావు వాణీసుందరిని ప్రశ్నించాడు.

“లేదండీ అహోబలంగారూ, పురుషులంటే నాకే మాత్రం నమ్మకం లేదు. ఎవరో గాంధీజీవంటి, బ్రహ్మమూర్తిగారివంటి వారు తక్క పురుషులలో మంచివారెవరున్నారండీ?”

“నేను బ్రహ్మమూర్తిగారి శిష్యుణ్ణి కాదా?”

“ఇప్పుడనేకమంది కాంగ్రెసువాదులు గాంధీగారి శిష్యులు కాదూ? ఆ శిష్యులుచేసే దురన్యాయాలు, అక్రమాలు లోకమంతా వాసనెత్తి పోవటం లేదూ?”

“అలాంటి వాళ్ళలోనే నన్ను జమచేర్చావు. నీపాదాలుకడ వాలి నా గురువుకు, నా గురువుగారి ఆశయదేవి పద్మప్రియాదేవిగారికి తక్క ఇంకెవ్వరికి నమస్కరించనన్న గర్వంకల నేను నిన్ను పూజిస్తున్నాను. నువ్వు నా ఆశయ దేవతవు. నీవు నా జ్యోత్స్నవు. నేను జ్యోత్స్నా పతిని. ఏనాటికైనా నీవు నేను, నేను నీవు. అలా దంపతులం కానినాడు కాని, నీవు ఇతరులని ప్రేమించిననాడు కాని, వివాహము చేసుకొన్నాడు కాని, నేను సన్యాసమన్నా పుచ్చుకుంటాను, లేక ప్రాణమైనా విశ్వాసానికి సమర్పిస్తాను.”

“అయితే ఇప్పుడే సన్యాసం పుచ్చుకోండి.”

“అంటే నీవు నన్ను ప్రేమించటం లేదన్నమాట.”

"అలాగే అనుకోండి.”

నరసింహారావు మ్రాన్పడిపోయినాడు. ఆగ్రుడ్డి వెన్నెల్లో అతని కన్నులనీరు గిర్రున తిరగడం ఆమె పరికించింది. అతడు తన గుండెను గట్టిగా నొక్కుకుంటూ తలవంచుకొని ఆ అర్ధచంద్రుని వెన్నెల్లో తూలి పోయే నడకతో వెనక్కు నడిచిపోసాగినాడు.

వాణి చిరునవ్వుతో అతడు పదిగజాలు దూరం వెళ్ళేవరకూ అతన్ని పరికిస్తూ నించుంది.

అతడలా తూలిపోతూ నడచిపోతూనే ఉన్నాడు.

అప్పుడామె కళకళ నవ్వుతూ నరసింహారావు కడకు పరుగెత్తుకొని పోయి అతన్ని వెనుకనుంచి తన రెండు చేతులా చుట్టివేసి, గట్టిగా హృదయానికి హత్తుకొన్నది. ​“మీరు నా ప్రభువులు, మిమ్మల్ని చూచిన మొదటి క్షణంనుంచీ నా సర్వస్వమూ మీ పాదాలకడ అర్పించాను. అయినా దెబ్బతిని ఉన్న దానను. మనుష్యులంటేనే అసహ్యం వేసింది. పురుషుల మాటటుంచండి. నా హృదయాన్నే నిరసించాను. అది నీరసమని నన్ను నేను తిట్టుకొన్నాను. ఆడది ఒట్టి జావకడి అని నన్నే నేను ద్వేషించుకొన్నాను. కాని, రానురాను కాలం జరిగి పోనుపోను, ఇది నిజమైన ప్రేమ, ఆనాటిది ఒట్టి ఉళక్కి అని తెలుసుకొన్నాను. మీరు నన్ను చూసిన మొదటి క్షణం నుంచి నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు. అయినా మీరు మాత్రం ఎలాంటివారో నాకెలా తెలుస్తుంది? ఇన్ని నెలలు మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాను. మీరు నా పరీక్షలన్నిటిలోను విజయం పొందారు. ఈ రోజు ఆఖరి పరీక్ష!"

అతడు నెమ్మదిగా ఆమెవైపు తిరిగినాడు. అతని మోము అమరమందాకినీ నదిలోని దివ్య సువర్ణ పద్మంలా వికసించి పోయింది. మాటలు రాని పరమోద్రేకంతో అతడామెను గాఢంగా కౌగలించుకొన్నాడు.

ఆమె కడ మోకరించినాడు; మోకరించి వంగి ఆమెపాదాలు దీర్ఘముగా చుంబించినాడు. ఆమె అతనిపై వ్రాలి రెండుచేతులూ పట్టి పైకి లేవనెత్తింది. ఇరువురూ ఆ వెన్నెల్లో నిల్చున్నారు.

“ఈ క్షణమే పోయి గురువుగారికి ఈ పవిత్ర విషయం నివేదిద్దాం. ప్రాణేశ్వరీ?” అన్నాడతడు.

ఇరువురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కులపతి పర్ణశాల వైపు నడిచినారు.

“ప్రాణేశ్వరీ, యుగాలనుండి నీ కొరకై ఎదురు చూచాను. ఈ నాటికి నీకు కరుణ కలిగింది. నీ వల్లే నేను పెద్ద చదువులు చదువలేదు. నన్ను నీవెలా ప్రేమించ కలిగావో అర్థం కావటంలేదు. నా ఈ పవిత్రమైన అదృష్టాన్ని నమ్మలేకుండా ఉన్నాను.”

'ఓ వెర్రి ఓబలయ్యగారూ! మీరు గడుసువారనుకున్నాను. ఇంత అమాయకులని నేను గ్రహించలేదు. మీ విద్యముందు, మీ ప్రతిభముందు నా చదువేపాటిది? సంధ్యేపాటిది! మీ శక్తిలో శతాంశము నా దగ్గర ఉంటే నేను జగద్విఖ్యాతిగడించి ఉందును ఇది నా అదృష్టం. మిమ్మల్ని మీరు తక్కువ పర్చుకోవడం మానేయండి. ఇక్కడనుంచి మీ యింటికీ, మీకూ నేను అధికారిని. నా ఆజ్ఞ పరిపాలించకపోతే మీకు విధించబడే శిక్షలు మీరు ఊహించుకోనైనా లేరు. జాగ్రత్త. ఇద్దరూ కలకల నవ్వుకున్నారు.

వారిరువురూ కలసి పర్ణశాలలోనికి భయపడుతూ వెళ్ళినారు. కులపతి బ్రహ్మమూర్తి తాను విన్యసించిన గౌరీతాండవ మూర్తికడ పద్మాసనాసీనుడై ప్రార్థన చేసికొంటున్నాడు. నెమ్మదిగా ఆ మందిరం గుమ్మం దగ్గిరే వారిరువురూ నిలబడినారు.

వీరిరువురూ వచ్చినదీ, వచ్చిన విషయము బ్రహ్మమూర్తి గ్రహించినట్లు “ఇద్దరూ వచ్చి నా చెరో ప్రక్కనా కూర్చోండి, కుడిప్రక్కన నా కోడలు, ఎడమ ప్రక్క నా కుమారుడు' అన్నాడు ఆయన. వారు ముగ్గురూ కలిసి సృష్టిస్వరూపమూర్తి అభయ ముద్రాధరుడు, వరద ముద్రాంచిత వామహస్తుడు. అష్టభుజుడు, ఆకాశ చారయుక్త దక్షిణపాదుడూ, ​భౌమ్యచారయుక్త వామపాదుడు, పరశు, డమరుక అగ్నిధరుడు, వ్యోమజఠాఝూటి సర్వకాలంకృతుడు. వ్యాఘ్రాజినధారి, ఆ శంకర తాండవమూర్తిని ప్రార్థించినారు.

8

వారం రోజుల్లో బ్రహ్మమూర్తి హిమాలయాలకు వెళ్ళిపోయినాడు. నరసింహారావు వాణీసుందరి నిజం దాచకుండా తమ ఉద్దేశ్యము బ్రహ్మమూర్తికి నివేదించుకున్నారు. తమ దేశికుడు పద్మప్రియాదేవిని ప్రేమిస్తున్నట్లు తమకు తెలుసునట. ఆమె అంత పవిత్రంగాను అతనిని ప్రేమిస్తున్నట్లును తెలుసునట. వారిరువురి పవిత్ర కళ్యాణ మహోత్సవం అయ్యే వరకు తాము వివాహం చేసుకోరట.

బ్రహ్మమూర్తి ఏం చేయకలడు? వారిద్దరికి తన ఆశీర్వచనము మాత్రము అనుగ్రహించినాడు. తాను తన కర్తవ్యాన్ని, తన భవిష్యత్తును తెలుసుకొనడానికి హిమాలయములకు వెడుతానన్నాడు. ఆ చలికాలంలో తానెంతవరకు హిమాలయక్షేత్రం దర్శించకలడో అంతవరకు వెళ్ళివస్తానని వారిరువురుతో అతడు తన రహస్యము స్పష్టముగా చెప్పినాడు. తక్కిన ఆశ్రమవాసులందరితో జాగ్రత్తగా ఉండమని తాను కొద్దివారాలలో తిరిగివస్తానని కళావిషయమైన ఒక సత్యం అన్వేషించడానికి తాను హిమాలయములకు వెడలుచున్నాడని చెప్పి అతను ప్రయాణమైనాడు.

అతడు ఇందుపురం వచ్చి రైలు ఎక్కబోయేముందు పద్మప్రియను ఒంటిగా పర్ణశాలలో కలుసుకున్నాడు.

"పద్మప్రియా! నేను హిమాలయాలకు వెడుతున్నాను. నాపై నీకు ప్రేమలేదని నిర్ధారణచేసి చెప్పినావు. నీ పైన నా ప్రేమ నా సర్వస్వము, నా శక్తి, నా రక్తి, నా ముక్తి, అదే నాకళ. నీవు ఎదురీయని ఈ ప్రేమను జయించి మహాయోగినై తిరిగివస్తాను, ఓడిపోతానా తిరిగిరాను. నువ్వు నా బిడ్డలు, నరసింహం, వాణీ సుందరి ఈ ఆశ్రమం నిర్వహించండి. ప్రథమ శిష్యురాలైన నీకు ఇదే నా తుది ఆదేశము” అస్పష్ట వాక్యాలతో మనవి చేసినాడు. ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగినవి. గజగజ వణికిపోయింది.

గద్గదస్వరంతో వినీవినబడనట్లు “మీరు నన్ను ప్రేమించటానికి నా అభ్యంతరం లేదు. ఈలాగే ఈ మన పవిత్ర స్నేహంలో ఈ ఆశ్రమం మన యిద్దరం ఎందుకు నడపకూడదు?” అని ఆమె తలవాల్చుకొని కన్నులనీరు జలజల రాలిపోతూండగా పలికినది.

“అది అసంభవము పద్మా! ఉత్తమ సంగీతము త్రిస్థాయీ మూర్తిత్వము. ఉత్తమ ప్రేమ త్రిగుణాత్మకము. భౌతిక మానసిక ఆత్మీకరము. నేను ఈ త్రివిధంగా నిన్ను ప్రేమిస్తూ, వాంఛిస్తూ నీవు ఏవిధంగానూ ఆ మూడు స్థాయిలకు శ్రుతి కలపకుండా వట్టి స్నేహంగా ఉంటూ ఉంటే నా కళాపూజ నిర్వహించలేను. కాబట్టి మనం విడిపోవడమే ఉత్తమం.”

“అయితే నన్ను వెళ్ళిపొమ్మంటారా? ఈ ఆశ్రమం మీ బిడ్డ. నేను మీ ఎదుట లేకపోతే ఈ ఆశ్రమం నిర్వహించటానికి అభ్యంతరం లేదు. మీ బిడ్డనుంచి మిమ్ము ఎలా వేరుచేయగలను? నేను వెళ్ళిపోతాను ఉండండి.” ​ఆమె రోదిస్తూ కూలబడిపోయింది.

“ఓసి వెర్రిపద్మా! నువ్వాశ్రమంలో ఉండడం నా పూజకు ప్రధానం కాదు. నువ్వు నాలో లయమై పోవడమే నా పూజ దివ్యరసానంద స్వరూప మౌతుంది. అయినా నీ సలహా గమనిస్తాను. ఏమైనా నేను తిరిగివస్తాను. నువ్వు ఆశ్రమం వదిలి వెళ్ళిపోకు. అలా నీవు వెళ్ళిపోతే నా ప్రాణం నన్ను వీడిపోవడం నిశ్చయం.”

“మీరు వెళ్ళకండి. మీ కోసం నేను ఏమిచేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

“అది పనికిరాదు పద్మా! నా అవస్థకు నీవు నన్ను కరుణించి ఆత్మ బలిదానం చేయడం నాకిష్టంలేదు. నేను తప్పక తిరిగి వస్తాను. మన జీవితం ఇలాగే గడుపుదాం.”

ఆ సాయంకాలం అతడు ప్రయాణమై వెళ్ళిపోయినాడు.

ఇప్పుడు డిశంబరు నెల జరుగుతున్నది. వాణి రైతుకూలీ చిత్రం ప్రారంభించింది. ఆచిత్రం స్థాయీ భావం పొందలేదని పద్మప్రియ వాదన. వాణికి పద్మప్రియ అంటే చాలా కోపంగా ఉన్నది. తన చిత్రం ఉత్తమ కళారూపం కాదని ఆమెకు తెలుసు. అయినా కావాలని ఆ విషయమే చిత్రించ సాగింది. ఆమె ఉద్దేశ్యము నరసింహారావు గ్రహించాడు.

“వాణీ! నువ్వు చేసేపని చాలా తప్పు సుమా, వేళాకోళానికైనా స్థాయీ రహిత చిత్రాలను చిత్రకారుడు విన్యసించకూడదు. నీవు రచించేది వట్టి ప్రచార చిత్రం. ప్రచార చిత్రాలయందు నమ్మకమున్నవాళ్ళు అలాటి చిత్రాలనే రచించుకోవచ్చు. మన సంప్రదాయం అదికాదుగా? అలాంటప్పుడు దేశికురాలిపై కోపంతో ఈ చిత్రం రచించటం అన్యాయం సుమా.”

“ఏమండోయ్ ఓబలయ్యగారూ! నా ఆజ్ఞలను పరిపాలిస్తామన్నారు, మరచిపోకండి.”

“వివాహ మహోత్సవం కాకుండానే అధికారం చెలాయిస్తావేమిటి!”

“ఇదివరకే మనస్సులు, ఆత్మలు కలిశాయి. ఇంక దేహాలు మాత్రం కలియాలి. అంచేత నాకు సగం అధికారం వచ్చింది. సగం తలుపు తెరవడం సగం తలుపు మూయడం.”

అతడు నవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు.

పద్మప్రియకి తన గురువు వెళ్ళిననుండి పడేబాధ వర్ణనాతీతం. ఆమె అతనిని సంపూర్ణంగా ప్రేమిస్తున్నదని ఆమెకు మొదటినుంచి తెలుసు. శాంతినికేతనంలో నందలాల్‌గారి ఎదుట అతడు దివ్యమూర్తియై ప్రత్యక్షమైనప్పుడు అతడే తన ప్రాణప్రియుడు; అతడే తన భగవంతుడు అని ఆమె గ్రహించింది. కాని ఆ భావంనుంచి ఆమె భయపడి పారిపోయింది. అందుకు కారణం ఆమెకు తీరనిసిగ్గు.

కాని సిగ్గుచేత తన గురువుగారితో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. అది తన కర్మము.ఎంతో మహాప్రయత్నం చేసింది. వ్యంగ్యంగానన్నా ఆవిషయం అతనికి మనవి చేద్దామన్నా కాని లాభం లేకపోయింది. ఆయనంత శక్తివంతుడే తన హృదయం ఎందుకు గ్రహించలేక పోతున్నాడు. అలా గ్రహించి ధైర్యం చేసి తన్ను గాఢంగా ఆయన ​హృదయానికి అదుముకొని, తన్ను కనికరించివేసి తనను సర్వార్పణ చేయమన్నాచేసేదే. ఈ పెనుభూతమైన సిగ్గు తన్నిలా ఆవహించిందే. ఈ రాక్షసినుండి విముక్తే దొరకదా? తన జన్మా, తన దేశికుని జన్మా ఈలా బాధాపూరితమై పరీమళ రహితమై కృశించి కూలిపోవలసినదేనా?

9

వాణీసుందరి తన రైతుకూలీ చిత్రానికి వర్ణలేఖలు విన్యసించడం ముగించింది. అప్పుడా చిత్రాన్ని తీసి నీళ్ళలో పూర్తిగా తడిపి నానవేసి ఆ కాగితం కొలతకు సరిపోయే దళసరి అద్దం తడిపి ఆ చిత్రాన్ని నీళ్ళతో అంటించింది. కాగితానికి అద్దానికి మధ్య గాలిబుడగలు లేకుండా చూసుకొంది. పై భాగం ఆరిపోగానే తాననుకొన్న రంగులు పూయడం ప్రారంభించింది. అలాగువేస్తే రంగులు ఎంతో బాగా వస్తాయి.

ఆమె ఆ చిత్రం రచించే చిత్రశాల కళాశ్రమ బాలికా భాగంలో బాలికలు చిత్రవిద్య నేర్చుకొనే మందిరం. ఆ మందిరమున్నది పొడుగాటి డాబామేడ. మందిరానికి రెండువైపులా వరండాలు ఉన్నవి. ఆ శాలలో ఒక్కొక్క బాలిక ఒక్కొక్క విశాలమైన కిటికీ కడ ఎడమవైపు నుండి వెల్తురు వచ్చేటట్లు కూచుంటుంది. కూచునేందుకు చిత్రాసనాలు, ఆసనాలకి ముందువాలివున్న చిత్రలేఖనపు బల్లలున్నవి. ఆ శాలలో అలాంటి బల్లలు ఇరవై నాల్గుఉన్నై. ఎడమవైపు పన్నెండు, కుడివైపు పన్నెండు. ప్రతిబల్లకు కుడివైపున నీళ్ళతో పెద్ద గిన్నెలుంటై. ఆ గిన్నెకు ప్రక్కన రంగుల పెట్టెలు, కుంచెలు, రబ్బరుముక్కలు, పెన్సల్స్ ఉంచుకొనే చిన్నబల్లలూ ఉన్నై. ఆ మందిరానికి ఈవల ఆవల ఒక అరడగుఎత్తు బల్లలున్నవి. ఆ వేదికపైన చిత్రలేఖనపు బల్లలు, చిత్రాసనాలు అమరించబడి ఉంటై. ఇరువురు చిత్రకళోపాధ్యాయినులు ఆ వేదికలపై కూర్చుండి వారిచిత్రములు వేసుకుందురు. పద్మప్రియ ప్రథమ చిత్రకళోపాధ్యాయిని; రెండవ ఆమె వాణీసుందరి.

తలుపులు రెండూ మందిరానికి ఈవల ఆవల ఉన్నై. ఒకటి బైటకు పోయే దారి. రెండవది ఈవలావలయున్న కటకటాల గుండా చిన్న వరండా గుండా చిత్ర ప్రదర్శనశాలకు పోయేదారి. చిత్రశాలలోను, చిత్ర ప్రదర్శనశాలలోను అనేక ఉత్తమ చిత్రాలు ప్రదర్శింపబడి ఉన్నవి. ప్రదర్శనశాల వంటి కళాగ్రంథాలయమున్నది. ప్రదర్శనశాల, కళాగ్రంథాలయము ఆశ్రమం రెండు భాగాలకు మధ్యగా ఉన్నాయి. ఇటు స్త్రీల చిత్రశాఖ స్త్రీల భాగంలోను, పురుషుల చిత్రశాఖ పురుషుల భాగంలోను ఉన్నాయి. గ్రంథాలయాన్నంటి అటూ ఇటూ ఒకటి బాలికలు, రెండవది బాలురు పుస్తకాలు చదువుకొనే పఠనశాల లున్నవి.

వాణీసుందరి చిత్రానికి రంగులువేస్తూ ఉండగా పద్మప్రియ అచ్చటకు వచ్చింది. అచ్చటచ్చట కొందరు బాలికలు చిత్రాలు లిఖించుకొంటున్నారు. ఆరోజు క్రిస్‌మస్ పండుగ. పండుగ దినం కాబట్టి అందరు బాలికలు రాలేదు.

సాధారణంగా బాలికలు బొమ్మలు వేసేటప్పుడు విద్యలో ముందుకు వచ్చిన వారి బొమ్మలు పద్మప్రియ దిద్దుతూ ఉంటుంది. విధానాలు బోధిస్తూ ఉంటుంది.

అలాగే ప్రాథమికులకు వాణీసుందరి శిక్షణ గరుపుతూ ఉంటుంది. ​వాణీసుందరి చిత్రం చూస్తూ ఉన్న పద్మప్రియకు ఆవేదన ఎక్కువై పోయింది.

“వాణీ, ఒక్కసారి నీగదికిరా. నీతో కొన్ని ముఖ్యవిషయాలు చెప్పుకోవాలి” అని పద్మప్రియ చెవిలో రహస్యంగా చెప్పింది. వాణి తన దేశికురాలివైపు తిరిగి ఆమె మొగము పరికించింది. పద్మప్రియ మోము బాధతో వైవర్ణమైయుంది. వాణి లేచి పద్మప్రియ చేయిపట్టుకొని లేవదీసి “రండి పిన్నీ, మీ పర్ణశాలకు వెళ్ళే మాట్లాడుకొందాము” అని ఆమెను తీసుకొనిపోయింది. పద్మప్రియాదేవి పర్ణశాలలో ఆమె పడక గదిలో ఆమె మంచం పైన ఇద్దరూ కూర్చున్నారు. పద్మప్రియ వాణి ఒడిలో వాలిపోయింది.

“వాణీ! నేను ఒట్టి తుచ్ఛురాలను సుమా. నా గురువుగారిని నేనెంత బాధపెడుతున్నానో నీవు గ్రహించనే గ్రహించావు. నేను... వారిని సంపూర్ణంగా... నా సర్వస్వంతో నా.. నా... నా సర్వ... సర్వస్వముతో ప్రేమ... ప్రే... ప్రేమిస్తున్నాను. అది... అది... వారిని దర్శించిన మొదటి క్షణము నుండీ, నన్ను కుంగదీసే సిగ్గే వారికి వర్ణింపరాని బాధ కలిగిస్తున్నది. నివ్వే నన్ను రక్షించాలి. అంత భారం నీమీదే వేశాను. గురువుగారు “కూలూ”లో రూరిక్‌గారి ఆశ్రమంలో ఉన్నారు. వారు ఏమి బాధలు పడుతున్నారో.”

వాణి పరమానంద భరితురాలైంది. తన దేశికురాలిని గట్టిగా కౌగలించుకున్నది.

10

బ్రహ్మమూర్తి ఆ చలికాలంలో “కులూ” లోయలో రూరిక్కుగారి ఆశ్రమంలో మకాంచేశాడు.

ఆ చలికాలంలో మంచుతో నిండిన కొండలను తనివితీర కళ్ళతో ఆస్వాదిస్తూ ఆ లోయ అంతా తిరిగేవాడు. కాలం ప్రవహించిన కొద్దీ అతని కేదో శాంతి సమకూరింది. హిమాలయ శిఖరనివాసియై, నిత్య యోగీశ్వరేశ్వరుడై అతనికి పరమశివుడు ప్రత్యక్షమైనట్లయినది. అప్పుడాతనికి ప్రకృతి దేవి దివ్యవిలాసము సంపూర్ణ భావయుక్తంగా వ్యక్తమైనది.

ఉదకమండలం, కొడైకెనాలు, తిరుపతి, పాపికొండలు, వింధ్యాద్రి, శ్రీశైలాది పర్వతాలు; నర్మదా, గోదావరి, కృష్ణా, కావేరి, గంగాది నదులు, వాని నదీ కంఠాలు అతనికి దివ్యక్షేత్రాలై మనోనేత్రానికి ప్రత్యక్షమయ్యాయి.

నదులు ఉదయించే పవిత్ర ప్రదేశాలు, సూర్యకాంతి అయినా చొరరాని కీకారణ్యాలు, ఆకాశంలోకి చొచ్చుకుపోయే పర్వత శిఖరోత్తుంగాలు ప్రకృతీదేవి ఆనందతాండవ కరణాలని అతడు గ్రహించాడు.

పిల్లతెమ్మెరలు, నదీ ప్రవాహాలు, వసంతుని ప్రణయ సూక్తులు, మందరస్వరాల ఎడతెగని బోధతో యుగాల రహస్యాలు బోధించే సముద్రుని కెరటాల నడకలు, చేరరాని అతి శాంత ప్రదేశాల హిమాచలేశ్వరుని రాజసభ ప్రకృతీదేవి కైశికీ వృత్తిపూరిత భక్తి నాట్యాంగహారాలు అతడు తెలిసికొన్నాడు.

అతనికి పరమశాంతి కలిగింది. ​ఇంతలో “మీరు వెంటనే రండి!" అని పద్మప్రియ ఇచ్చిన తంతి అతనికి అందింది. అతడు రెక్కలు కట్టుకుని లేపాక్షి వచ్చిచేరినాడు.

ఆ దినం 1950, జనవరి ఒకటవ తారీకు.

అతనికి హిందుపురం రైలుస్టేషను దగ్గరనే నరసింహారావు, వాణీసుందరీ, విద్యార్థి విద్యార్థినీ లోకమూ స్వాగతం ఇచ్చారు.

పద్మప్రియ లేదు. ఆమె కేమి జబ్బుచేయలేదుకదా అని అతడు భయపడి వణికిపోయినాడు.

“గురువుగారు! మీరు మొదటి తరగతి విశ్రాంతి మందిరంలోకి వెళ్ళండి" అని నరసింహం మనవి చేసినాడు.

బ్రహ్మమూర్తి ఏమిటా అని ఆశ్చర్యపడుతూ ఆ గదిలోకి పోయినాడు.

అచ్చట దివ్యాలంకృతయై, పరమ సంతోష పూర్ణ సౌందర్యవతియై పద్మప్రియ వెండి కలశంతో నిలిచిఉంది. ఆ కలశంతో అతని పాదాలు కడిగి తన శిరస్సు పై చల్లుకుంది. పూలతో అతని పాదాలు పూజించింది. వెండి పళ్ళెరాన కర్పూరము వెలిగించి హారతి ఇస్తూ తలవంచుకొని చిరునవ్వుతో ఆబాలిక :

“నా ప్రాణేశ్వరునకు దివ్యమంగళం" అని అంటూ, చిరునవ్వున దూరంగా పోయి నిలుచుంది.

"ఏమిటి! నిజమా! నాదేవి! మళ్ళీ అను!" అని అతడామెను చేరినాడు.

“నిజం! నా సిగ్గు... నాకింత... చేటు తెచ్చింది గురువు గారూ! శాంతినికేతన ప్రథమ క్షణంలోనే నేను నా మనస్సులో మీకర్పించుకొన్నాను” అని ఆమె ధైర్యంతో చెప్పివేసింది.

అతడామె చేతులో ఉన్న పళ్లెం తీసి అక్కడ బల్లపై ఉంచి, ఆమెను గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఆమె మోము ముద్దుకై తనవైపు తిప్పుకొనగా ఆమెయే అతని మెడచుట్టూ చేతులువేసి, అతని పెదవులపై గాఢంపు ముద్దుల వరమిచ్చింది.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse