అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/గోదావరి సుడులు
గోదావరి సుడులు
వరదలు కట్టి ప్రవహిస్తున్న గోదావరిలో సుడిగుండాలు తిరుగుతూన్నట్లు రామమూర్తి హృదయంలోనూ ఆవేదనలు సుడులు చుట్టుతున్నాయి. 15 ఆగష్టు, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశపు అవతార పురుషుడు, తేజస్వరూపుడు, ప్రేమమూర్తి విశ్వంలో లీనమైపోయినాడు. 15 ఆగష్టు, 1948లో స్వతంత్రోత్సవం కూడా జరిగిపోయింది. కాని ఈ దుర్భరావేదన మాత్రం తప్పటంలేదు, తాను రాజమహేంద్రవరం నుంచి అయిదేండ్లు క్రిందట హైదరాబాదు రాష్ట్రంపోయి నిజాం ప్రభుత్వం వారి పబ్లిక్ వర్చు శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం ఖాయమైంది. ప్రభుత్వంవారు జీతం కూడా హెచ్చించారు. తాను శక్తి వంచన లేకుండా ప్రభుత్వానికీ, ప్రజలకు సేవచేస్తున్నాడు.
ఆ జిల్లాలల్లో తిరిగేటప్పుడు రామమూర్తి ఆనందం వర్ణింప అలవి కాకుండా ఉండేది. ఇంకా మొగలుకాలంనాటి ఆచారాలే సంస్థానంలో ఉండడం చేత అతడు ఉన్న ప్రదేశంలో అతడే మహారాజులాగుండేవాడు. తనకు గవర్నరంత హోదా, ప్రజల (బ్రతుకు, పంటల బ్రతుకు తనచేతిలో ఉండెను దేశముఖులు, వతందార్లు, మక్తాదార్లు, కౌలుదార్లు, పెద్ద రైతులు. షావుకార్లు, పఠేలు - పట్వారీలు, పోలీసు ముంతజింలు - అందరూ తనకు 'అదాబర్జ్' చేస్తూ, తన్ను గౌరవిస్తూ అందలం ఎక్కించేవారు. పుష్కలంగా సఫ్లయిలు, జేబులనిండా బహుమతులు. తన జీవితం హాయిగా జరిగిపోయింది.
రామమూర్తి ఓవర్శీర్ పరీక్ష ప్యాసయినా కొంచెం రసజ్ఞుడు. హైదరాబాదు సంస్థానంలోని కొండలు, నదులు, సెలయేర్లు, చెరువులు అతని కెంతో ఆనందం కలుగజేసేవి; జీవితాలు ప్రవహించిపోవడం నదుల నడకలలో, జీవిత సత్యస్థిరత్వం కొండలస్థాణుత్వంలో, బ్రతుకులోని ఆనంద నృత్యం సెలయేటి జలజలలో, మనుష్యుడు కల్పించుకున్న సౌఖ్యాలు తెలంగాణపు చెరువులలో అతనికి గోచరించేవి.
సాధారణ ప్రజలు గర్భదారిద్ర్యంలో ఉండి దేశముఖులకు బానిసలులా మెలుగుతూ ఉన్నా - వా రా కష్టాలలో నుండి జీవితం శుచిగా ఉంచుకుంటూ బురదనుండి పైకిప్రసరించి వికసించే నీలి కలువపూవును చేసికుంటూ, పాటలు పాడుకుంటూ, తమకు తెలియని ఏదో ఒక స్వర్ణయుగం కోసం ఎదురుచూస్తూ ఉదయాస్తమానాలు ఒక దివ్యరాగంతో కలుపుకుంటూపోతున్నారు. ఆ తెలంగాణ, మరాఠ్వాడా, కర్టాటక ప్రజలు స్వాతంత్ర్యం అంటే ఎరుగరు. “దొరా! నీపాదాలకి మొక్కుతా” అంటారు. అన్నా ఆ మాటల వెనక తాము ఆహుతిచ్చే ఆత్మార్పణ అతనికి దృశ్యమయ్యేది. అతడు నిట్టూర్పు విడుస్తోనే గుఱ్ఱంస్వారీ చేసుకుంటూ అవతలి మకాంకు వెళ్ళిపోయేవాడు.
ఈ ఆలోచనలు రాజమహేంద్రవరపు గోదావరి గట్టుమీద కూర్చున్న రామమూర్తి హృదయంలో నుంచి ప్రవహించి గోదావరి వరదల సుడులలో లీనమై పోతున్నవి.
2
రామమూర్తి ప్రభుత్వోద్యోగి అని తెలిసి ఉండి కూడా రాక్షసుల లాంటి రజాకార్లు అతని ఇంటిమీదపడి దోచుకున్నారు. అందాల ప్రోగైన అతని భార్యను వాళ్ళు పట్టుకోబోయే సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో ఒక కమ్యూనిస్టుల గుంపు ఆ రజాకార్ల పై విరుచుకుపడింది. రజాకార్లు రామమూర్తి ఇల్లు దోచడం మాని కమ్యూనిస్టులను ఎదుర్కోడానికి పరిగెత్తారు. వృశ్చిక రోముడుకూ - సర్వరోముడుకూ యుద్ధం జరిగినట్లు జరిగింది. రామమూర్తి ఆ గడబిడ సమయంలో, కొందరి గ్రామ ప్రజల సహాయంతో, ఊరుదాటి అడవి రుప్పలంబట పడి గ్రామాల అంచలు దాటుకుంటూ, గోదావరి యొడ్డుకు వచ్చి ఓ కోయ జట్టు సహాయంతో భద్రాచలం చేరుకున్నాడు.
దారిలో అతడూ అతని భార్యా పడిన పాట్లు రామాయణంలోని అరణ్యకాండ అంత గాథ అయింది. ఎలాగో నానాకడగండ్లుపడి రాజమండ్రి చేరుకున్నారు. ఇంటిదగ్గర పెద్ద సంసారం. తాను హైదరాబాదులో ఓవర్సీరై బాగా సంపాదిస్తూ ఇంటిదగ్గర తమ్ముళ్ళ చదువు చెప్పిస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, తన అక్క చెల్లెండ్రను పురుడూ - పుణ్యాలకూ ఆదరిస్తూ డబ్బు పంపించేవాడు. ఇంతటితో ఆటవిడుపు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాదుకు స్వాతంత్ర్యం లేదు; తనకు దిక్కులేదు. తాను తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి వీలులేదు. తనకు స్వతంత్ర భారతంలో ఉద్యోగంలేదు. తాను ఓవర్సీర్ ఉద్యోగం చేస్తూ సంపాదించిన పెళ్ళాం మెళ్ళో నగలూ, వెండి సామానూ ఖర్చయిపోయింది. భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు; మద్రాసు ప్రభుత్వానికి గూడ దరఖాస్తు పెట్టుకున్నాడు. తన దరఖాస్తులు శుష్కలంగా తిరిగి వచ్చాయి. గోదావరి సుళ్ళు చుట్టుకుంటూ ప్రవహించిపోతోంది.
3
గోదావరి చల్లని తల్లి. తాను చిన్నతనంలో, రాజమహేంద్రవరంలో చదువుకొనే రోజుల్లో వేసం కాలపు గోదావరిని ఆవలికి ఈవలికీ ఈదుతూ దాటేవాడు. కరుణామయి అయిన ఆమె హృదయం పైన తేలిపోయేవాడు. ఆమె నీలనీరగంభీరాలలో మునిగితేలుతూ ఉండేవాడు.ఈ గోదావరితల్లి నీటిని ఉపయోగించుకునేందుకు తనకు భూమన్నా లేదు. తాను పరీక్షప్యాసయిన కొత్తదినాలల్లో మదరాసు రాష్ట్రంలో ఉద్యోగమే దొరక్కపోయింది. తాను బ్రాహ్మణుడనై పుట్టడం దౌర్భాగ్యమైంది. తెలంగాణలో కులం తేడాలు లేవు. గోదావరి తల్లికి కులం తేడాలు లేవు. హీనుడైన మనుష్యునికే కులం తేడాలూ: మతం తేడాలూను. అవమానదగ్ధులైన వారిని, అహంకారులను ఆనందమయులను, విచార మేఘావృత జీవులను, కోటీశ్వరులను, నిరుపేదలను, భూఖామందులను, నిరుపేద పొలం కూలీని సరిసమాన ప్రేమతో ఈ కన్నతల్లి తన గర్భాన దాచుకొని ఊరడించగలదు.
అతడు ఎత్తయిన ఆ గట్టుపైన నిలబడి నెమ్మదిగా నీటి దగ్గరకు పోయాడు. చొక్కా, కండువా తీసి పైనబెట్టాడు. వరదకు కొట్టుకువచ్చే పుల్లలను పోగుజేసుకొనే ముసలమ్మనూ, పిల్లలను వత్తిగించుకుంటూ నీటిలో దిగాడు. మహాత్ముని తలచుకుంటూ ఒక్క ఉరుకు ఉరికాడు. ఆ వేగంతో చాలాదూరం నీళ్ళల్లోకి పోయిన అతని మూర్తిని గోదావరి తల్లి తన చేతులతో కప్పింది. కాని ఈత ఎరిగిన యువకుడవడంచేత ఆమెకూడా తనలో లీనం చేసుకోలేకపోయింది. ఆ ముసుగులో గర్భవతియైన అతని భార్యా ముదుసలులైన తల్లిదండ్రులూ అతని హృదంతరాలు ప్రత్యక్షమయినారు, బాపూజీ! క్షమించమంటూ ఈదుకుంటూ వడ్డుకువచ్చి, మెట్లెక్కి తన కండువా తీసికొని తల తుడుచుకుంటున్నాడు. ఇంతల్లో గబగబా పరుగెత్తుకుంటూ తన తమ్ముడక్కడకు వచ్చాడు. “నీవు గోదావరి గట్టున ఉంటావని వదిన చెప్పడం వల్ల నీవు సాధారణంగా కూర్చుంటావని ఇక్కడకు వచ్చాను. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. నిన్ను రామపాదసాగరం ప్రాజెక్టులో ఓవర్సీరుగా చేయించగలిగేనని శొంఠి రామమూర్తిగారు నీకు టెలిగ్రాం యిచ్చారు. నీకు రేపో, ఎల్లుండో ఆర్డర్లు వస్తాయట. ఇదిగో టెలిగ్రాం.”
రామమూర్తికి కళ్ళనీళ్ళు తిరిగాయి. గోదావరి వరద ప్రవాహాలు సుడిగుండాలు తిరుగుతూ వెళ్ళిపోతున్నవి.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse