Jump to content

అడివి బాపిరాజు రచనలు–8/అంజలి/అసురకన్య

​

అసుర కన్య

మొదటిభాగం

కక్షీవంత మహాఋషి కుమారుడు సుధన్వుడు సూర్యాశ్వంలా బలిష్ఠుడు, ఇంద్రునివలె ఆజానుబాహుడు.

అతని నవ్వులు ఆశ్వనీ నక్షత్రంలో చేరిన రాకాచంద్రుని కిరణాలు. అతని కోపము ఆరుద్రాయుక్తాదిత్య మాసమేఘపర్తిత శంపాలతవలె జాజ్వల్యమానమైంది. సుధన్వుని సౌహార్దము కమలదళశీతలము.

అతని ధనర్విముక్త శరీరము ఇంద్రవజ్రసమము. అతని యుద్ధ నాయకత్వము వృత్రాసురుని ఎదుర్కొనే ఇంద్రవిజయత్వం వంటిది.

పవిత్ర మంత్రద్రష్ట కక్షీవంతుడు తన కుమారుని దస్యమారు డితడే అని ఆశీర్వదించాడు.

తల్లిదండ్రులకు మ్రొక్కి అనుమతి పొంది ఆర్యసైన్యాలను నడుపుకొంటూ సింధూనదితరంగాలను నావలలో దాటాడు సుధన్వుడు. పర్వతాలు దాటి, అసురదేశంలో విడిదిచేసి అసుర రాజును యుద్ధానికి పిలిచాడు.

అసురులు ఉత్తమనాగరికులు. మిత్రావరుణాది దేవతాభక్తులైన ఆర్యులకు విరోధులు. ఆర్యరాజైన సుధన్వుడు ఉత్తమవీరు లధివసించి ఉన్న రథాలతో, గాలిలో ఎగిరే ఉత్తరీయాంచలాలు కలిగిన ఆశ్వికులతో తమ రాజ్యంలోనికి చొచ్చి వచ్చాడని తెలియగానే అసురులు అఖండ క్రోధంచేత మండిపోయారు. వారికళ్ళళ్ళో విస్ఫులింగాలు రాలాయి.

ఉషాబాల దరస్మిత కాంతులు ప్రసరించిన మంచుశిఖరాల బోలిన సత్వులైన అసురులు అశ్వాలను రథాలకు పూన్చి ఉత్తమజానేయాల అధివసించి ఆర్యుల నాశనం చేయడానికి సైన్యాల ఆయత్తం చేసుకొని వచ్చారు.

2

అసురరాజ కుమార్తె పాంచర నవ యౌవనవతి. పద్దెన్మిది వర్షాల పారిజాత పుష్పంలాంటి ఎరుపు తెలుపుల అందాల బొమ్మ. పుత్రులు లేని అసురరాజు పుత్రికను వీరునిలా పెంచాడు.

ఆమె కవచం ధరించి, మూడుధనువుల బల్లెము ముష్టిని పట్టింది. తండ్రికి చక్రరక్షకురాలై ఒక ఉన్నతాశ్వాన్ని అధివసించి యుద్ధానికి బయలుదేరింది. ​మేరుపర్వత సానువుల మిలమిలలాడే లేత దేవదారు సౌష్ఠవంతో వెన్నెలలో సాయంకాలపు ఉషఃకాంతులు రంగరించిన శరీరకాంతిలో వెలిగే తన బాలికను చూచి అసురరాజు గర్వంతో రథంమీద నిలిచినాడు.

ఆమె అధివసించిన ధవళాశ్వం తన్ను స్వారీచేసే సుందర మూర్తిని ఎరిగివున్నదా అన్నట్లు గర్వంతో, వేగంతో, అసురరథాశ్వాలను పందేనికి ఆహ్వానిస్తున్నది.

బంగారు శిరస్త్రాణం క్రింద నర్తించే ముంగురులు ఆమె దివ్య సుందర వదనాన్ని ఇంకా మనోహరంగా పనిచేస్తూండగా, ఆమె చిరునవ్వులను దిరిశనపూవులులా విరజిల్లుతూ స్వారిచేస్తున్నది.

తమస్సులను పోగొట్టు సౌందర్య స్వరూపురాలైన పాంచర వేగముగా గుఱ్ఱాన్ని తోలుతూ తండ్రిని అనుసరిస్తున్నది.

తెలుపు ఎరుపుల కాంతితో ఉషోదేవిలా ఆ పాంచర సూర్యునివంటి తండ్రి రథానికి ముందు వస్తున్నది.

ఇంతలో రెండు సైన్యాలు తలపడినవి. అసురులు, మహావీరులు, దృఢకాయులు. ఆర్యులు మగటిమిగల బంటులు. అసురార్యులు ఒకే రూపురేఖా విలాసాలు కలవారు. ఆ సంకుల సమరంలో కవచాదులలో మాత్రం భేదాలున్న ఆ రెండు సైన్యాల వీరులు పాలసముద్రంలో సుడిగుండములోని కెరటాలవలె పోరుసల్పినారు.

పోరు ఘోరమైంది. శరశూలభల్ల ఖడ్గకాంతులు, ముసలముద్గర పరశుగదాద్యాయుధ తాడన నినాదాలు, ఇంద్రుడు మేఘాలతో ఆకాశాన అవతరించినట్లే అయింది.

పాంచర తండ్రి ప్రక్కనే ఉండి తండ్రినీ తన్నూ కాపాడుకొంటూ భయంకర యుద్ధం చేస్తూ ఉన్నది.

అంతలో అసురార్య యుద్ధనాయకులిర్వురూ ద్వంద్వయుద్దాన ఒకరి నొకరు మార్కొన్నారు.

3

యుద్ధారంభం నుండి సుధన్వుడు మేఘాలను దూరివచ్చే వజ్రపాతంలా పొగమంచును చీల్చివచ్చే సూర్యకిరణంలా, అసురసైన్యాలను చొచ్చి, శంఖం పూరిస్తూ తన సైన్యాలను చేయివిసిరి, విజృంభింపచేస్తూ, అసురనాయకుల్ని బాణాలతో, వివిధాయుధ ప్రయోగాలతో నిర్జిస్తూ పూలతో నిండిన మోదుగచెట్టులా రక్తసిక్తాంగుడై, ఏమీ చలింపకుండా వేగంతో యుద్ధవిక్రాంతుడైనాడు.

అతడు మహావేగంతో అసురరాజును ఎప్పుడు కదిపినాడో, ఆ తక్షణమే చక్రరక్షకురాలై ఆర్యసైన్యం చెండాడే ఉషోదేవిలా ఉన్న పాంచర ముందుకు వచ్చి సుధన్వుని తలపడింది.

ఆర్యరా జా బాలకునివలె నున్న పాంచరను చూచినాడు. బాలుడే అనుకున్నాడు. సుధన్వునకు పాంచర పదునాలుగేండ్ల బాలికవలెనే తోచింది. ​సుధన్వుడు: ఓయి బాలకా, నువ్వు చిన్నవాడవు, నీ తండ్రి పెద్దవాడు. మీ కేతనము మాకు లొంగినట్లు ఒకసారి దింపండి, మీరూ మేమూ సమాధానం కుదుర్చుకొని ఎవరిదారిని వాళ్ళు పోదాంగాక!

పాంచర: ఓయి ఆర్యవీరుడా! యుద్ధంచేసి అలసి వున్నావు. నీ కవచంలోంచి రక్తం సూర్యరథానికి ముందు ప్రవహించే ఎఱ్ఱని కాంతిధారల్లా ప్రవహిస్తూ ఉంది. నువ్వే నీ పతాకాన్ని దింపినట్లయితే, నువ్వు నీ దేహం బాగుపడేవరకూ మా కోటలో అతిథిగా ఉండవచ్చును. మీ సైన్యాలు మా రాజ్యానికి అతిథులు.

సుధ: ఓ పుణ్యమూర్తీ! నీ మాటలు మధురాలు కురిసే కలకంఠి కంఠ స్రవితగాన స్వనాలులా వినబడుతున్నాయి. ఇంత చిన్నతనంలో నీకు యుద్ధమేమిటయ్యా?

పాంచర: ఓయి యుద్ధమే జీవితం చేసుకొన్న కర్కశుడా! నీకు బాలుడెవరో, బాలిక ఎవరో తెలియదా? ఇవిగో నా బాణాలు రుచిచూడు. ఇవి వాలుచూపులుకావు. ప్రాణాలు హరించే తూపులుసుమా!

4

సుధన్వుడు బాల సౌందర్యానికి ఆనందించి ఉప్పొంగిపోయాడు. ఈ బాలవీరుడు బాలికా? ఓహో, ఏమా బాలిక సౌందర్యము! భూమి దున్నిన వెనక విత్తులుజల్లగా ఇంద్రదేవుడు తన మేఘాలతో చల్లని వృష్టి కురిపించినప్పుడు బయలుదేరిన పచ్చని మొక్కలతో నిండి ఉన్న పొలంలా ఉన్నది!

ఆ బాలిక అందము, వెన్నెల ప్రసరిస్తుండగా, ఆ వెలుగులోని అమృతం ఆస్వాదిస్తూ తీవలు సారించిన, దేవతలకు అతిప్రియమైన సోమలతలా ఉన్నది.

ఆ బాలిక మనోజ్ఞత్వము హిమాలయశిఖరాల పుట్టి గీతాలాలపిస్తూ లోయలలో ప్రవహించే వితస్తానది ప్రవహింపులా ఉన్నది. సుధన్వుడు ఈ ఆలోచనలు తన హృదయాన్ని వెన్నెల నింపగా తన రథం మీదనుంచి డిగ్గనురికాడు. అత డా రథముమీదే పగ్గాలు విడిచినాడు. అతడు ఆ రథం మీదనుంచి యజ్ఞభాగం భోగించడానికి ఆకాశంనుంచి దిగివచ్చే మరుత్తునిలా ఉన్నాడు.

అతడు తన మీదపడే అసురుల బాణాలు లెక్కచేయలేదు. అత డాయుధాలన్నీ రథంమీదనే ఉంచివేశాడు. అతని చిరునవ్వు మోము, అతని వెలిగిపోయే ఫాలం, అతని విశాలమైన కన్నులు, అతని సమున్నత మూర్తిత్వము, అతని విక్రమము, అతని అశ్వినీదేవ సౌందర్యము, అసురవీరుల్ని సమ్మోహపరచింది. అసురవీరులందరు యుద్ధము మాని, అతనివైపే చూస్తూ ఉండిరి. ఆర్యనాయకులూ యుద్ధం మానివేశారు.

పాంచరవైపు చూస్తూ “ఓ దివ్యసౌందర్యగాత్రీ, ఓ ఇంద్రాణి వంటి పరాక్రమం కలదానా, నిన్ను వాయుదేవుడు మేఘాలను కొనిపోయినట్లుగా మా సప్తసింధు దేశానికి కొనిపోగలను. ఓ అనన్యదివ్యమనోహరరూపంకల అమరకన్యా, ఓ బాడలివంటి తేజస్సు కలదానా, నిన్ను ఆదిత్యుడు బాడలియైన సంజ్ఞాదేవిని సముద్రంలోనుండి కొనిపోయినట్లు కొనిపోగలను" అని ఉచ్ఛైస్వనాన్ని కేకవేసి సముద్రకెరటంలా కదిలాడు. సింహంలా ముందుకు సాగాడు. ​"ఓ ఆర్యశూరుడా! రావయ్యా నా దగ్గరకు; నేనే నిన్ను జయించి నిన్ను నేను ప్రియుణ్ణి చేసుకొని, తన హృదయంలో యామినీ చంద్రుణ్ణి దాచుకొన్నట్టు నిన్ను దాచుకొంటాను. ఓ మిత్రునివంటి పరాక్రమం కలవాడా, ఓ అగ్నివంటి తేజస్సు కలవాడా, మంచి గంధం తరువు అగ్నిని దాచుకొన్నట్టు నిన్ను నా హృదయంలో దాచుకోగలను” అని కేకలేస్తూ గుఱ్ఱంపై రక్తసిక్తాంగియై పూవులు పూచిన ఫలాశవృక్షంలా అధివసించి ఉన్నది.

తమ రాజకుమార్తెకు అడ్డం వచ్చిన అసురవీరుల్ని సుధన్వుడు లెక్కచేయక ముళ్ళడొంకలను విదల్చుకొనుచు తన ప్రియురాలైన ధేనువును కలిసికొనబోయే అడవి వృషభంలా, ఆవలి ఒడ్డున ఉన్న తన రాణిని చేర మహాప్రవాహం వడికి ఎదురీదిపోయే ఐరావతంలా, అతడు అసుర సైన్యాలను ఈవలావలకు నెట్టివేస్తూ పాంచర దగ్గిరకు చేరినాడు.

పాంచర మహాసంతోషాన నవ్వుతూ, తన నిశితఖడ్గాన్ని మెరుము వైపు తిప్పి సుధన్వుడు నిరాయుధుడై ఉండడంచేత, మెరుము వేగంగా అతన్ని ప్రహరించడం ప్రారంభించింది.

సుధన్వుడు తన తలమీద 'శిరస్త్రాణం పెరికి, ఎడమ ముష్టితో మహా వేగంతో పరపే ఆమె ఖడ్గప్రహారాలను ఆ శిరస్త్రాణంపై పడేటట్లు ఆమెను సమీపించి, కుడిచేత్తో ఆమె కుడిచేయిపట్టుకొని ఖడ్గంలాగి ఆవలకు విసరివైచాడు!

ఇంద్రునివలె బలం గలవాడున్ను, అశ్వినీ కుమారులవలె అందగాడునూ, సవితృనివలె కాంతివంతుడును అగు సుధన్వుడు ఆమె నడుము చుట్టూ చేతులువేసి అశ్వాన్నుండి ఎత్తితీసి, ఆమెను గాఢంగా తన హృదయానికి అదుముకొన్నాడు.

ఆమె సంతోషాన ముసిముసినవ్వులు నవ్వుతూ ఆ దృఢ పరిష్వంగనంలో ఇరికిపోయి, అసురవీరుల చూచి ఆశ్చర్యం పొందుతూ ఉండగా, తండ్రి అయిన అసురరాజు నివ్వెరగంది చూస్తూ ఉండగా, రెండు చేతులా అతని చంపలు చుట్టి అతని కళ్ళల్లోకి తేరి పారచూచింది.

ఆమె చూపులు వెన్నెల కిరణాలు మానస సరోవరం లోతులలోనికి ప్రసరించి నట్లయింది. ఆమె చూపులు కల్పవృక్షంపైన అమృత వర్షం కురిసినట్లయినది.

అత డామెను చూచి “ఓ హృదయేశ్వరీ! ఓ అసుర మహారాజ బాలికా, హిమాలయపర్వతాగ్రాలు మేఘాలను ధరించినట్లుగా నిన్ను నా హృదయంలో ధరిస్తూన్నాను. నీ నాప్రణయమంత్రము, కచుడు శుక్రునికడ గ్రహించిన మృత సంజీవినిలా మనఉభయసేనలకు అమృతత్వం ప్రసాదించుగాక!” అని అంటూ ఆమెను పెదువులపై ముద్దిడుకొన్నాడు.

పాంచర గాయత్రీమంత్రం లాంటి పవిత్ర స్వరయుక్తంగా నవ్వింది. ఆమె సుధన్వుని హృదయంలో తన మోము దాచుకుంది.

ఇంతలో సాయంకాలము ఆదిత్యుడూ, అతని వెలుగూ సముద్రంలో కుంకిపోయిన రీతిగా, దివ్యపరీమళావృతమైన పూవు చెట్టునుండి రాలిపోయిన రీతిగా, పాంచర కౌగిలిలో సుధన్వుడు ఆ యుద్ధభూమిలో కూలిపోయినాడు. ​సుధన్వుని ప్రాణాలు పాంచర ప్రాణాలు ఆ అమృత మృతిలో లీనమైపోయినవి. అసురసైన్యాలలో, ఆర్యసైన్యాలలో హాహాకారాలు మిన్ను ముట్టినాయి.

రెండవ భాగము

అహమ్మదాబాదు కాంగ్రెసు కాంధ్రదేశాన్నుండి ప్రతినిధులుగా వెళ్ళినవారిలో డాక్టరు వైకుంఠరావు ఎం.బి. అండ్ సి.యం. ఒకడు. వైకుంఠరావు మాంచి ఒడ్డూపొడుగూ ఉన్న మనిషి, ఆటలన్నిటిలో అందెవేసిన చెయ్యి. మద్రాసు వైద్యకళాశాల ఆట జట్టులన్నిటికీ నాయకుడు. విద్యార్థులలో మేటి అయిన టెన్నిస్ ఆటకాడు. న్యాయకళాశాల, పచ్చియప్ప కళాశాల, క్రిస్టియన్ కళాశాల, ప్రభుత్వ కళాశాలలు జట్టులలో ఒకటిన్నీ అతడు కాలేజీ విద్యార్థిగా ఉన్నంతకాలం కాలిబంతి, హాకీబంతి టెన్నిస్ ఆటలలో వైద్యకళాశాలతో పోటీచేసి మొదటిరంగమైనా దాటలేక పోయాయి.

ఎన్నివేల సంవత్సరాలనుండో భారతదేశంలో విజృంభించిన ఆర్య వీరుల వీర్యమూ పరాక్రమమూ అతనిలో మూర్తీభవించాయిరా! అనేవారతని స్నేహితులు.

నలుగురు స్నేహితులతోటి ప్రతినిధులుగా స్వగ్రామమైన గుడివాడ నుండి బయలుదేరి బెజవాడ, సికిందరాబాదు, ఎల్లోరా, అజంతా, జాల్ గాన్, బార్డోలీలమీదుగా అహమ్మదాబాదు చేరుకున్నాడు.

అహమ్మదాబాద్ కాంగ్రెస్‌లో కుర్చీలూ బల్లలూ లేవు. అందరూ ఆ మహాశిబిరంలో క్రింద కూర్చోవలసిందే! ఒక ప్రక్క ఖిలాఫత్ మహాసభ, ఒక ప్రక్క స్వదేశీవస్తు, ఖాదీ ప్రదర్శనము. దేశ దేశాలనుండి వచ్చిన లక్షలకొలది జనం. అక్కడే సబర్మతీ నదీతీరాన్ని మహాత్ముని ఆశ్రమం. అహమ్మదాబాదు ఏనాటి భారతీయ మహోత్కృష్ట గాథలనో స్మరింపచేస్తున్నది.

భారతదేశం తనకు త్వరలో విముక్తి వస్తున్నదని, పవిత్ర ప్రపంచ ప్రఖ్యాత అపర అహింసావతారమైన మహాత్ముని చూస్తూ మురిసి పోతున్నది.

ఆ వైభవం స్నేహితులతో చూస్తూ భరతదేశంలో జరగబోయే అఖండ సత్యాగ్రహ యుద్ధానికి మహాత్మునికే నాయకత్వమిచ్చి శ్రీశ్రీ హకీం అజ్మాల్‌ఖానుగారి యాజమాన్యాన కాంగ్రెసు తీర్మానం చేసింది.

వైద్య కళాశాలలో వైకుంఠరావు ఆఖరు సంవత్సరం చదువుతూ ఉండగా మహాత్ముని దివ్యవాక్యాలు భారతదేశం అంతా మారుమ్రోగాయి. వైకుంఠరావు ఆ తక్షణమే కళాశాల వెడలి పైకి వచ్చేద్దామనుకున్నాడు. కాని ఇంక మూడునెలలు ఓపికపట్టి ప్రభుత్వోద్యోగం కోసం తాను నిశ్చయించుకొన్న కార్యక్రమం మానివేసి విడిగా వైద్యవృత్తి చేసుకుంటూ కాంగ్రెసు కార్యక్రమంలో పాలుగొంటూ ఉండాలని వైకుంఠుడు నిశ్చయం చేసుకున్నాడు.

నాగపూరు కాంగ్రెసుకు వెళ్ళాడు. అప్పటికి అతడు హౌసుసర్జను పనిలో ఉన్నాడు. ప్రసూతి వైద్యము, కళ్ళవైద్యం పూర్తిచేసి గుడివాడలో వైద్యవృత్తి ప్రారంభించాడు. ప్రారంభించిన మూడునెలలలో వైకుంఠునికి నెలకు అయిదారువందలు దొరుకుతున్నాయి. ​ఈ కారణాలన్నిటిచేత ఇదివరదాకా పెళ్ళిమాట తలపెట్టక, ఇప్పుడెందుకు సంగతి, తర్వాత చూచుకొనవచ్చునులే అని ఊరుకున్నాడు.

2

అహమ్మదాబాదు కాంగ్రెసు అద్భుతంగా జరిగింది. అక్కడనుండి స్నేహితులను 'ఆబూ పోయి దిలావరా గుడులను చూచి వద్దాం రండర్రా' అని ప్రోత్సహించాడు వైకుంఠరావు.

ఢిల్లీ మేలెక్కి, ఆబూరోడ్డు స్టేషనులో దిగారు మన వాళ్ళందరూ. ఆ బండిలోనే ఆ సమయంలోనే తహిమీనా బాట్లివాలాకన్యయు, ఆమె తండ్రి బాట్లివాలాగారు కూడా మెయిలులో ఒక మొదటి తరగతి పెట్టిలోంచి దిగారు.

తహిమీనా కన్య పార్శీ బాలికలలో దేవకన్యలాంటిది. గులోబకావళి కన్యకు అందాలు నేర్పే మనోహరాంగి.

తహిమీనా ఇంగ్లండులో చదువుకుంది. ఆంగ్ల బాలలను వారి చదువులోనే వారిని తోసిరాజు చేసింది. ఆమె ఎం.ఏ., పిహెచ్.డి. పరీక్షలలో మొదటగా జయమంది ఇంటికి వచ్చింది.

ఆమె ఇంగ్లండులో చదువుకొనే రోజులలో ఆటలలో మొదట - నాట్యంలో మొదట. భారతీయ బాలిక అయినా ఆమె అనేక ఆంగ్ల ఉన్నత కుటుంబాలవారి ఇళ్ళల్లో వారి కుటుంబాలలోని బాలికలాగే తిరిగేది. ఆమె అంటే అంత స్నేహం ఆ బ్రిటిషు బాలలకు.

తహిమీనాను చూచిన వాళ్ళందరూ కొంచెం వేడి దేశంలో వున్న ఇంగ్లీషు బాలికే అనుకునేవారు.

టెన్నిస్, పరుగు, ఈత పందేలలో మొదటగా వచ్చేది. తహిమీనాను ఒకరిద్దరు పెద్ద కుటుంబాల ఆంగ్ల బాలురు పెళ్ళి చేసుకుందామని చూశారుకూడా.

ఎందుకనో తహిమీనాకు పెళ్ళి అంటే ఎప్పుడూ ఇష్టంలేదు. అనేక పార్శీ పెద్దలు ఆ బాలికకు చాలా మంచి సంబంధాలు తెచ్చారు.

ఆ బాలిక స్త్రీగా ఎంత అందగత్తో, మగవీరుడులా అంత అల్లరి పిల్ల. ఎప్పుడూ మగవానిలా వేషం వేసుకుని గుర్రం స్వారి చేసేది. కారు నడిపేది. ప్రయాణంలో ఎప్పుడూ మగ వేషంలోనే ఉండేది.

3

బాట్లివాలాగారు కోటీశ్వరులు. ఆయన ఎన్నో కంపెనీలు పెట్టించి వాటిని అత్యంత లాభం కొనివచ్చే సంస్థల చేశాడు. ఎన్నో పరిశ్రమ సంస్థలకు ఆయన ముఖ్యాధ్యక్షుడు.

ఆయన మొదటి నుంచి గాంధీమహాత్ముని శిష్యులలో ఒకడయ్యాడు. అందుచేతనే ఈ సంవత్సరానికి ముందు సంవత్సరంలో ఆయనకు ప్రభుత్వం పెద్ద బిరుదం ఇద్దామనుకున్నారు. కాని బాట్లివాలాగారు ఖండితంగా తన కక్కరలేదని కబురుచేశారు.

తండ్రిగారూ కుమార్తెయూ అహమ్మదాబాదు కాంగ్రెసుకు బొంబాయి నుంచి ప్రతినిధులుగా వచ్చారు. ​వారూ కాంగ్రెసు అయిపోగానే ఓరోజు ఆబూ చూచి మళ్ళీ వద్దామని బయలుదేరి వెళ్ళారు.

ఆబూరోడ్డు స్టేషనులో ఒక మంచికారు వచ్చిఉంది. స్టేషన్‌లో దాదాభాయి మెనక్జీ తన చుట్టమైన బాట్లివాలా కుటుంబానికి కారు వేసుకొని వచ్చాడు ఆతిథ్యం ఇద్దామని.

స్టేషన్‌లో బాట్లివాలా తండ్రి కుమార్తె లిద్దరకూ స్వాగతమిచ్చి ఆబూపట్నం తీసుకుపోయాడు దాదాభాయి.

ఆ మెయిలుబండిలోంచి దిగి వైకుంఠరావు అతని స్నేహితులూ ఉదయము అక్కడ ఇన్ని పూరీలు తిని, పాలు తాగి బస్సుమీద ఆబూ చేరారు.

ఆబూనగరం ఆరావళీ పర్వతాలలో దత్తాత్రేయ శిఖరానికి అయిదు వందల అడుగుల దిగువను ఉన్నది. ఆబూ ఎత్తు ఆరువేల అడుగులకు తక్కువగా ఉంటుంది. ఆబూ నగరానికి రోడ్డు వంకరటింకరగా పైకి ఎక్కుతుంది.

బస్సు వెళ్ళుతూంటే రోడ్డుమీద ఒక పెద్దపులి పడుకుని ఉంది. బస్సు ఆపి విద్యుచ్ఛక్తి కొమ్ము, మామూలు బూరా అల్లరి హంగామాచేస్తే ఒక్క గంతువేసి దిగువ లోయలోకి పులి మాయమైంది. అందరి ప్రయాణికుల ప్రాణాలు లేచిపోయాయన్నమాటే.

వైకుంఠ: ఒరే విశ్వం! ఇప్పటికి చూశానురా బరిమీద పెద్ద పులిని.

విశ్వం: నేనూ పెద్దపులులను సర్కసులలోనూ, జంతు ప్రదర్శనశాలలోనేగా చూసిందీ.

రామం: ఓహో ఏమి గొప్పగా ఉందిరా! ఏమి దర్జారా, మనకేసి నవ్వుతూ చూసినట్లుగా అయిందిరా.

వైకుంఠ: దిగి వెళ్ళి దాన్ని తట్టి దాంతో ఆడుకుందామనిపించింది.

కృష్ణమూర్తి: నువ్వు దుష్యంతుడు కొడుకువా? లేక కాశీ మజిలీ కథలోని సింహదమనుడ ననుకున్నావా?

ఆబులో ఒక సత్రంలో మకాంపెట్టి మన స్నేహితులు దిలావరా గుళ్ళు చూశారు. అచలేశ్వర దేవాలయం చూశారు. దత్తాత్రేయ శిఖరం ఎక్కారు.

మూడురోజులైన తర్వాత ఆబూనగరానికి రెండుమైళ్ళ దూరంలో ఒక లోయలో వశిష్ఠాశ్రమం చూడడానికి వెళ్ళారు.

4

వశిష్ఠాశ్రమం ఎంతో అందంగా ఉంది. ఎన్నో ఫలవృక్షాలున్నాయి. ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంది.

ఆ ప్రకృతి దృశ్యము, అలాంటి ప్రదేశాలలో ఋషులు ఆశ్రమాలు ఏర్పాటుచేసుకున్న భావమూ సమన్వయం చేసుకుంటూ వైకుంఠరావు స్నేహితులూ తిరిగి అబూనగరం వస్తూ ఉన్నారు.

చలి హిమాలయాలలోని చలిలా గజగజ వణికిస్తూ ఉంది.

అయిదుగురు స్నేహితులూ మాట్లాడుకుంటూ వస్తూన్నారు. స్నేహితుల జట్టుకు ముందుగా, ఒక వృద్ధుడు ఒక బాలుడు ఆంగ్ల దుస్తులు ధరించి నడుస్తున్నారు. వృద్ధుని తలపై పార్శీటోపీ ఉంది. ఆ బాలుడు హేటు ధరించి ఉన్నాడు. ​ఇంతలో వెనకవచ్చే వైకుంఠరావు జట్టుకు “ఓహోహో” అన ఒక కేక వినబడింది. ఆ కేకలో ఏదో వర్ణింపలేని భయం గర్భీకృతమై తోచి, మన వాళ్ళందరు ముందరకు పరుగెత్తారు. ఆ ఇద్దరూ ఉన్న స్థలం దగ్గిరకు వెళ్ళగానే మనవాళ్ళ ప్రాణాలు నిలువునా తేలిపోయాయి. ఎదురు గుండా పడుకుని వీరి అందరివైపు ఒక మహావేదాంతిలా చూస్తోంది. ఒక పెద్దపులి.

మనవాళ్ళందరూ బిఱ్ర బిగుసుకుపోయారు! ఆ కొత్త పురుషులూ బిర్రబిగుసుకు ఉన్నారు.

ఇంతట్లో ఉరుములా ఒక పెద్ద బొబ్బపెట్టి తన చేతిలో విలాసంగా తిప్పుకుంటూ ఉన్న ఒక అడవి దుడ్డుకఱ్రను పైకెత్తి వీళ్ళందరికీ ముందుకు ఉరికాడు వైకుంఠరావు!

ఆ కేకతో పెద్దపులికి ఏమి కంగారు పుట్టిందో ఓ చెంగున గంతువేసి ఆదారిపక్క దుబ్బుల్లోకి ఉరికి నిముషంలో మాయమయింది.

పెద్దకేకలు వేసుకుంటూ ప్రాణాలు బిగపట్టుకుని వారందరూ ఆబూ నగరం చేరారు.

బాట్లివాలాగారు వారందరికీ ముఖ్యంగా వైకుంఠరావుకీ కృతజ్ఞత తెల్పి తమ బస చేరుకున్నారు.

5

ఆబూ నగరం చుట్టుపక్కలు అంతా చూచి సామానును ఒక స్నేహితుణ్ణి బస్‌మీద పంపి, మిగతా నలుగురూ నడుస్తూ పాటలు పాడుకుంటూ, అయిదవ రోజు సాయంకాలం వైకుంఠరావు, స్నేహితులు ఆబూస్టేషనుకు పోతున్నారు.

కొండదిగి కొంతదూరం పోయేటప్పటికి, ఆ రోడ్డుమీద ఒక కారు చుట్టూ ఒక భిల్లు జట్టు కనబడింది. వీళ్ళు నలుగురూ దగ్గరకు వెళ్ళేసరికి కొంతమంది బిల్లులు వచ్చి వీళ్ళని చుట్టుముట్టారు. వైకుంఠరావు నల్గురైదుగురు భిల్లులును బంతుల్లా పట్టి అవతలకు గిరవాటువేశాడు.

'ఒరే, వీళ్ళు గాంధిదేముడు జట్టువాళ్లురా' అని కేకలుపెట్టి కనుమూసి కనుతెరచేటంతలో మాయమైపోయారు బిల్లులు.

అప్పుడా కారులోంచి దిగింది బాట్లివాలాగారు. ఏమిటి విచిత్ర సంధానాలు అని వారూ అనుకున్నారు. వీరూ అనుకున్నారు.

తహిమీనా పార్శీబాలిక. ఆ బాలిక హృదయంలో వైకుంఠరావు - పెద్దపులిని అల్లరి పెట్టినప్పటినుంచి, ఏమి చిత్రమో - మకాం పెట్టి కూచున్నాడు. పార్శీ బాలికలు పార్శేతరులతో సాధారణ స్నేహం కన్న ఎక్కువ దూరం పోరాదు! అయినా ఆ కొత్త బాలకుడు చీకటిలో కూడా గంభీర వ్యక్తిత్వంతో అస్పష్టమూర్తిత్వంలో పెద్దపులిని తరిమివేస్తూ ఎన్నిసార్లో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు.

బాట్లివాలా మన స్నేహితులకు వందనాలర్పిస్తూ నవ్వుతూ "మీకూ మాకూ ఈ చిత్రసంబంధం ఏమిటి!" అన్నాడు. ​"నేనూ అదే అనుకుంటున్నానండీ" అని వైకుంఠరావు సమాధాన మిచ్చాడు. అందరూ కలిసి భిల్లులు రోడ్డుకడ్డంగా వేసిన రాళ్ళూ రప్పలూ ఎత్తిపారవేసి మోటారు కారు సరిగా పోవడానికి దారిచేశారు. కారు వెళ్ళిపోయింది. స్నేహితులు స్టేషనుకుపోయి అహమ్మదాబాదుకు రెండవ తరగతి టిక్కెట్లు కొన్నారో లేదో మెయిలు చక్కా వచ్చింది.

6

వెంటనే మన స్నేహితులైదుగురూ ఇటు తిరిగారు అటు తిరిగారు: ఏ సెకండు క్లాసులోనూ కాళీలేదు.

వైకుంఠరావుకు కోపం వచ్చింది. రైలును కదలమని చెప్పినట్లుగా ఈలవేసేగార్డును పట్టుకొని గబుక్కున వెనక్కు తిప్పి "గార్డుజీ నమస్కారం క్షమించండి! రెండవ తరగతిలో స్థలం అణుమాత్రంలేదు. అహమ్మదాబాదు ప్రయాణం. మొదటి తరగతిలో ఎక్కుతాం. తరువాత స్టేషనులో ఛార్జీ ఇస్తాం; సెలవు" అని పరుగెత్తి ఒక మొదటి తరగతి పెట్టెలో - ఇద్దరే ఉన్న ఆరుసీట్ల దానిలో ఎక్కబోయారు.

పెట్టె గుమ్మంలో తహిమీనా బాట్లివాలా పురుష వేషంలో నుంచొని ఉంది.

వైకుంఠరావు, అతని స్నేహితులు గబ గబ ఎక్కబోయారు. తహిమీనా “ఎక్కడానికి వీలులేదు” అన్నది. “ఓయి కుఱ్ఱాడా, రైలు కదులుతున్నది; వాదించడానికి వ్యవధిలేదు” అని ఆ బాలుణ్ణి నెమ్మదిగా నెట్టుకు పోయి స్నేహితులకు దారిచేసినాడు.

బాట్లివాలాగారు అతికోపంతో లేచి "పశువా!" అని కేకవేశాడు.

వైకుంఠరావు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. ఇంతట్లో తహిమీనా తన తండ్రి చేతికఱ్ఱ తీసుకొని వైకుంఠరావు నెత్తిమీద దబదబ బాదటం ప్రారంభించింది. మరుసటి క్షణంలో ఆ కఱ్ఱ ఆమె చేతులోంచి ఊడదీసి కఱ్ఱ రెండుముక్కలుచేసి మూల పడవేశాడు.

ఒకదెబ్బ అతని నుదురుపై తగిలి చర్మంకొంచెం పగిలి రక్తం బొటబొట కారింది.

“అదేమిటి అమ్మాయీ” అని పార్శీభాషలో బాట్లివాలా అన్నాడు.

వైకుంఠుని తహిమీనా తాడన మారంభించగానే ఆమె తలపై ధరించిన ఇంగ్లీషుటోపీ ఊడిపడిపోయింది. ఆమె జుట్టు ముడివీడి సూటువేసిన ఆ బాలిక వీపుపై పడి ప్రసరించింది. ఆ బాలిక సిగ్గుపడుతూ నిలుచుంది. వైకుంఠరావు ఆమె నింతవరకు బాలుడే ననుకొన్నాడు.

అందమైన బాలుడు అత్యంత సుందరియైనబాలిక అయింది.

ఆమెను తేరిపార చూచినాడు. ఆమె అతన్ని తేరిపార చూచింది.

“నీవా!” అని అన్నాడతను. “నీవా!” అని ఆమె అన్నది.

7

దాదాభాయి బాట్లివాలాగా రప్పుడు వైకుంఠుడు పెద్దపులి బారినుండి, భిల్లులబారినుండీ తమ్ము తప్పించిన ప్రాణదాత ఇతడే అని పోల్చుకున్నాడు.

దాదా: అయ్యా క్షమించండి. ఆ సీటుపైన కూర్చోండి. మా అమ్మాయి చాలా తొందరపడింది అన్నాడు. స్నేహితుడొకడు గాయానికి కట్టుకట్టాడు. ​వైకుంఠుడు నవ్వుతూ “ఫరవాలేదండి. తొందరలో ఈలాంటి సంఘటనలు వస్తూ ఉంటాయి.”

అతనిపై ప్రసరించిన అందాల చూపులు తహిమీనా మరల్చలేదు. వైకుంఠుడు తన చూపులు ఆమె నుంచి మరల్చలేకపోయాడు.

అహమ్మదాబాదు చేరేసరికి వారూ వీరూ స్నేహితులయ్యారు. ఇరవై ఏళ్ళ బాలిక తహిమీనా వైకుంఠుని అహమ్మదాబాదులో తమ మకాం కడ ఒంటరిగా కలుసుకొంది.

తహి: నిన్ను ఎన్నివేల సంవత్సరాల క్రిందటనో కలుసుకున్నట్లుంది. ఇదివరకు మనం ఎక్కడ కలిసికొని ఉంటాము?

వైకుం: కాంగ్రెసులోనేమో!

తహి: కాదు. ఇదివరకే నీతో నేను యుద్ధం చేసినట్లు నువ్వు నన్నూ ఓడించి -

వైకుం: ఓడించి నిన్ను మా దేశానికి ఎత్తుకొనిపోయి వివాహమాడినట్టు కలగానికల?

తహి: నాకు అంతే!

వారట్లు గంటలు మాట్లాడుకొన్నారు. ఆమె నిర్భయంగా నిస్సందేహమయిన మాటలతో వైకుంఠుని తాను ప్రేమిస్తున్నానని చెప్పింది. వైకుంఠుడు "తహిమీనా! నీ పేరు ఎంత చక్కగా ఉంది. నిన్ను యుగాలక్రితం పోగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ కలిశానా నీతో అన్న భావం నన్ను వీడదు. నువ్వే సర్వకాలం నా చూపులలో, నా హృదయంలో. నా సర్వస్వంలో! ఎల్లాగ నిన్ను వదలి ఉండటం?” అన్నాడు.

“ఓయి వెఱ్ఱివాడా! నేనూ నిన్ను వదలి ఉండగలనా? ఏమో నేను అసురబాలికనై, నువ్వు ఆర్య బాలకుడవేమో! గులోబకావళీకన్య కథ వినలేదా”

ఒక్క నిముషం వారొకరు నొకరి విడిచి ఉండలేకపోయారు.

దాదాభాయిగారికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. పార్శీ కన్యక పార్శేతరుణ్ణి ఎలా వివాహం చేసుకోకలదు?

తహిమీనా ప్రేమ మతాలు దాటింది. దేశాలు దాటింది. దేహబలం జ్ఞానబలం కుటుంబ, దేశ, ప్రపంచసేవ చేయడానికి ఎంత ముఖ్యమో ప్రేమ బలం అంతే ముఖ్యం అని ఆమె అనుకుంది. ఒకజాతిని చెక్కు చెదరకుండా కాపాడుకోవడం పురాతన వస్తు సంరక్షణభావం కావచ్చును. ఆ మ్యూజియం భావం అన్ని విషయాలలోనూ వర్తించదు. శ్రీ జిన్నాగారి వివాహం జాతిని మించి నడిచింది, అని ఆమె దృఢనిశ్చయానికి వచ్చింది.

ప్రేమ ఒకటే సర్వమతాలను, సర్వదేశాలను మించిపైకి ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం కొండలను గోదావరి కోసినట్లు ప్రవహిస్తుంది. ఒక నీగ్రో పురుషుణ్ణి తెల్లజాతి స్త్రీ ప్రేమించి నడిస్తే అమెరికా తత్వం అడ్డం వస్తుందా?

ఏ యుగాలనాటిదో ఈ ప్రేమ! ఈ దివ్య సమాగమము యమునా గంగా సంగమమే అవుతుంది.

ఎందరు పార్శీలు ముస్లింమతంలో కలువలేదు. ఎందరు అసురకన్యలు ఆర్యవీరుల్ని ఉద్వాహం కాలేదు?

ఇలా తండ్రితో గంభీరంగా వాదించింది తహిమీనా. ​

8

వైకుంఠరావుకు అనుమానమేలేదు. పార్శీ పత్రికలలో అల్లరి అతడు గమనింపలేదు. కొన్ని బెదరింపు ఉత్తరాలను అతడు లెక్కచేయలేదు.

అతడు మహాత్మునికి రాసి అనుమతి తెప్పించుకున్నాడు.

పార్శీ సంఘమువారు పనికిరాదన్నారు. అనేక విధాల దాదాభాయి బాట్లివాలాగారిని ఒత్తిడిచేశారు.

వేదాలలో, జెండ్ అవెష్టాలో గాథలుగా, ఋక్కులుగా పాడబడిన పాంచరసుధన్వా ప్రేమకధన మహాబలం ఎవ్వరాపగలరు?

తహిమీనా తండ్రి ఇంటికడనుండి వచ్చి సబర్మతి వెళ్ళిపోయింది. వైకుంఠరావు సబర్మతి చేరినాడు.

సబర్మతి ఆశ్రమంలో తహిమీనా, వైకుంఠుల వివాహం అతి వైభవంగా జరిగింది.

9

ఆ దంపతుల ప్రేమ పవిత్ర సత్యాగ్రహ విజయం.

"ఓ దేవీ! తహిమీనా! ఏనాటిది మన యీ ప్రేమ?”

"ఆర్యవీరుడవు పంతం నెగ్గించుకున్నావు!”

"నీవు ఆర్యబాలికవుకావా? ఆర్యత్వం మహాత్ముని ధర్మం అర్ధం చేసుకోవడంలో ఉందికదూ! నువ్వు ధర్మం కోసం మహోత్తమ సత్యాగ్రహం చేశావు ప్రాణప్రియా!”

తహిమీనా వైకుంఠకుని హృదయం మీదవాలి, అతని తలవంచి మధురపరీమళంగా అతని పెదవులు తనివి తీర ముద్దిడుకుంది. వైకుంఠుడు సర్వవిశ్వానికి మొక్కుకొన్నాడు. ఈ దివ్యభామినిని తనకు ప్రత్యక్షం చేసినందుకు.

వారిద్దరూ దేశసేవా మహాయుద్ధంలో ఒకరికొకరు దగ్గరగా, ఒకరి నడుం చుట్టూ ఒకరుగా భారతదేశంలోనికి అడుగిడుతూ నడుస్తున్నారు.



This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse