అడివి బాపిరాజు రచనలు–8/అంజలి
అంజలి
అంకితం
నవ్య సాహిత్యాచార్యుడు
మా అన్న
రాయప్రోలు సుబ్బారావు గారికి
భక్తితో....
సంధ్యా నృత్యము
సూర్యుడు మనోవేగంతో పశ్చిమానికి దిగిపోతున్నాడు. ఆ నీలాకాశంలో నానావర్ణాలు సమ్మిళితం అవుతూ ఉన్నవి. ధూమ్రాలు, నీలలోహితాలు, కుసుంబారుణాలు, శబలాలు అయిన మేఘాలు మీగడతరకల్లా, క్షణక్షణం రంగు మారుతూ, ఆకాశాన తేలిపోతూ, సముద్రతరంగాలలో, నదుల్లో, చెరువుల్లో నీడలారుతున్నవి. తరుపర్ణాలు, పర్వత శిఖరాలు బంగారుపూతతో మిలమిలలాడుతున్నవి.
ఆకాశాన వంగపండుచాయ సూర్యుడస్తంగతుడైనాడు. ఉషాబాల నల్లని చీర యంచులు దెసలు ఆవరిస్తుండగా ఉదయించింది.
యోగనిద్రలాంటి చీకటి ఆవరిస్తున్నది. ఆ చీకటిలో వెలుగు చెట్టాపట్టాలు పడుతూంది. సంధ్యానాదములు, సర్వ కుసుమ పరిమళాల వియత్పథానికి నివేదన లవుతున్నవి.
ఓం, ననతోం, ధిమికిటతోం, ధింధిమికిటనాం కిణికిణీం.
అవి హిమధవళపాదాలు, అరుణ కమలదళాంతరతలాలు. తారకా కాంతులపైన అనంతపథాంచలాలమీద అంటీ అంటనట్లు నాట్యం చేస్తున్నవి. ఆ అంగుళులు సౌందర్య బాలికా ఫుల్లనయిన సౌభాగ్యాలు. పాదరేఖలు మహాత్ముల భావ ప్రవాహర్తాలు. ఆ వేగం తేజోరూపులైన సిద్ధుల సంకల్పం. ఆ తాండవం లయతాండవం.
2
పృథుకల్పాచార్యులు నాట్యమూర్తి. పెదవి కదల్పకే ఎంతటి సూక్ష్మ భావమునైన అభినయింపగలడు. తాండవంలో ఆవేశమూర్తి, నృత్తంలో లయబ్రహ్మ, లాస్యాన గాలికికదిలే కసటు చిగురాకు జొంపము కదలిక, దశావతారాలు, నాగనృత్యం, రాధికా హృదయం, సత్యభామా సంవాదము, వ్రజకన్యాప్రణయము, పార్వతీదేవి తపస్సు, పాలసముద్ర మథనము, జగన్మోహినీఘట్టం, శంపాలతా వేగంతో దేహభంగిమలు, కరప్రసారాలు, హస్తముద్రలు దృష్టి లౌల్యాలు, భావవ్యంజనాలు - పరీమళాలు వెదజల్ల ఆనంద మయుడై, తన్మయుడై కరిగిపోతాడు. వృద్ధుడైనా ఆతని నాట్య శక్తి ఆవంతయు తగ్గిపోలేదు, పృథుకల్పుడు కుమారవీరునకు నాట్యశాస్త్రమంతా నేర్పుతూ ఉన్నాడు. కుమారుడు ఆ దేశానికి ప్రభువు. ఏ పూర్వకర్మ సముపార్జితమైనదో అతనికి చిన్ననాటినుండి నృత్యకళాభిమానము! తడబడే అడుగులు నెలలనాటి ముద్దులతో తల్లి ఒడిలో నృత్యం జేసినాడట! నృత్యమూర్తులగు విగ్రహాలను చూచి మైమరచిపోయేవాడు. నర్తకీ నర్తకులు మహారాజైన తననాయనగారి యెదుట నృత్యకళాశేముషీ వైభవము వెదజల్లేటప్పుడు బాలకుడైన కుమారవీరుడు తనివోని గాఢదీక్షతో పారకిస్తూ ఉండేవాడు. తానే యజమానుడైన వత్సరాలలో వివిధ దేశాల నృత్యపిధారాల పారకించి విమర్శించి పూజ్యభావాన పులకరాలు పొందేవాడు. కళయందుండే వెర్రి మమతా కళాప్రేక్షకుడు కావడంతో వదలక, కళాపీఠ పాద సన్నిధిని కళార్థిగా అతనిని సాష్టాంగపడజేసినది.
ఉన్నత వంశంవారు నృత్యకళాకోవిదులగుట మరచిపోయి ఎన్నో శకాలు గడిచినవి. తోటివారి పెదవుల దాగిలి మూతలాడే అపహాస్యపు చీకట్లకు భయపడిన్నీ, సిగ్గుచెందిన్నీ కుమారుడు రహస్యంగా పృథుకల్పునికడ హస్తాభినయం, నేత్ర, గ్రీవ, స్కంధాభినయాలు నేర్చుకున్నాడు. పదగతులు నేర్చుకొన్నాడు. అంగవిక్షేపాలు, హస్త విన్యాసాలు, రస ప్రదర్శన కౌశల్యము - నృత్యవిద్య యావత్తు దీక్షతో నేర్చుకొంటున్నాడు.
పృథుకల్పుడు ఆ మహాపురాన గణికలకు, ఉత్తమవంశ బాలికలకు కూడా గురువై నృత్యభిక్ష సంకల్పించాడు. అరనింద వారిలోకల్లా ప్రజ్ఞాశాలిని యగునర్తకి, ఉత్తమకుల సంజాత, బీదకుటుంబంలో వికసించిన పన్నీటి పువ్వు. యౌవనం బిగువులు తిరిగి మృదువైన ఆమె బాలికాత్వమునాట్యవిద్యలో జవజవను పుణికి పుచ్చుకొన్నది. పృథుకల్పుని నాట్యమందిరానికి కొన్ని సందేహాలు తీర్చుకోదలచి వెళ్ళిన కుమారుడు, ఆ రోజు అరవింద లాస్యమూర్తి అయిన సమయాన ఆవిర్భవించినాడు. కైశికీవృత్తి మూర్తి అరవింద సిగ్గుతో యవనికాంతరాన మాయమైంది. అప్పుడామె అర్ధవస్త్రపాటలవర్ణస్నిగ్ధమగు వక్షః కాంతిని మరుగుపరచలేని దుకూల లాలిత్యము కుమారుని కంటిపాపలో ప్రతిఫలించింది. ఏడాది ఈడుగల ఏకశాఖామాత్ర కరవీరవృక్షంలా కదిలిపోతున్న ఆమె యౌవనం పరమ మంత్రంలా అతని హృదయానికి అద్దుకొన్నది. కనుమెరగిన మనోహర మేఖలా కాంతుల్ని స్మరిస్తూ, స్తబ్ధుడైన కుమారుడు గురువుగారికి ప్రణమిల్ల మరచిపోయినాడు. పృథుకల్పుని కన్నులు నవ్వుకొన్నవి. కాని ఆయన తన అధరోష్టాంచలాల బిగించుకొని "తెలియపరచని మీ రాక మర్యాద దూరముకాదా” అని కుమారుని హెచ్చరించినాడు.
“నమస్కరిస్తున్నాను; అందుకొని క్షమించండి. ఆ తెరల్లో మూల్య రహితమైన నిధి గుప్తమైనది. ఏ లోకాలనుండి ఇక్కడకు అవతరించిందో?”
"కుమారా! గోప్య ప్రకాశనము శాస్త్ర సమ్మతము కాదు. ఆ ప్రస్తావన అప్రస్తుతమని మనవి.”
"ఈ శిష్యునికడ ప్రచ్ఛన్నము కావలసిన నిగూఢ రహస్యాలు ఉన్నవా? అని ఈ వినయి గురువులను ప్రశ్నిస్తున్నాడు.”
"ప్రభూ! క్షమించు. హాస్యంలోనూ అనృతం ఆడలేను. నిజంగా అది నిగూఢ
విషయమే.” 3
అరవింద త్రపామూర్తిద్లై తెరలోనికి పరుగెత్తిన మరుక్షణాన విసవిన సత్యభామావేషాన్ని విసర్జించి రైకతొడిగి చీర ధరించి ఉన్న కొలది మాత్రపు నగలు అలంకరించుకొని, తోటమార్జాన దొడ్డితోవచేరి తనకై ఎదురు చూస్తున్న బండినెక్కి పాడైపోతూ ఉన్న తన భవనాన్ని చేరుకొన్నది.
మహోన్నతిని అనుభవించి చితికిపోయిన ఆ సంసారంలో తండ్రి విచారగ్రస్తుడు. తల్లి భూదేవత. తాను ఏకపుత్రిక. బీదతనంలో గారామున పెరిగిన దురదృష్టవంతురాలైన అందాలకుప్ప. నానాటికి హీనమైపోయిన తన ఐశ్వర్యస్థితిని గ్రహించక అరవింద తండ్రి చంద్రాపతి చిన్నతనంలో కవి, గాయకాది విద్వన్మణులకు ఆశ్రయమిచ్చిన ఉదార హృదయుడు. ఆయన హృదయం నొవ్వకుండ అతనికి తెలిసి తెలియకుండేటట్లుగా ఆబాల్యమిత్రుడైన పృథుకల్పాచార్యుడు తన ఇంటికడనే ఆమెకు సాహిత్యాదికళలు నేర్పుతూ, తనకభిమానవిద్యయైన నృత్యంలో ఆమెను ఉత్కృష్ట కళామూర్తిగా ఒనరించినాడు. చంద్రాపతికి కూతురు వివాహచింత హృదయకంటకమైనది. పదునెనిమిదేండ్ల ఎలప్రాయపు జవ్వని. అందాల నేరి తెచ్చుకొని తనలో హత్తుకొన్న దివ్యబాల. బీదవారికిత్తుమన్న మనసొప్పదు. సంపన్నులకు అర్చింప ధైర్యము జాలదు. ఇతరుల సహాయము అపేక్షించుట అనభిజాతుల వని. ఆపేక్షించకుండా మనుగడ మృగ్యము. అప్పులకై ఆస్తి హారతి కర్పూరములా హరించిపోయింది. తిండికోసము భార్యనగలు నాణ్యరూపాలగుచున్నవి. కుమారవీరుడు తగిన అల్లుడని ఆశ. అడిగి కాదనిపించుకోవడం విషము చేతులారా త్రాగినట్లే.
తల్లిదండ్రుల హృదయం గుర్తింపలేని అమాయక శిశువు అరవిందాదేవి. తనచుట్టూ ఆవరించివున్న బీదతనం చీకట్లను పారకించింది. వెలిగే కన్నులు, కొంచెం మలుపు తిరిగిన చిన్నని అర్ధగరుడు నాసిక, వట్రువలు తిరిగిన పెదవులు కొంచెం నిడుపై పైకి ప్రసరించి ఆమెను ఎప్పుడున్నూ హసన్ముఖిగా చేస్తున్నవి. ఒత్తయి కిందికి వాలిపోతూ ఉన్నది ఆమెవేణీ భరం. పొంకాలు అలంకరించుకొని, మృదులత్వ మూర్తియై సౌందర్యరేఖా సమన్వితయైన అరవింద నాట్య్రోక్తియైన ఉషాకన్యయే.
4
యవ్వనమూర్తి... మధురా సుందరేశ సదృశ సౌందర్యరాశి... కుమారుడు అరవిందను, ఆనాడు మెరుపుకాలం మాత్రం చూచిన మరుక్షణాన్నుంచీ నిద్రపోడు - ఉప్పెనలా వచ్చి ముంచివేసింది ప్రణయ పయోరాళశి.
ఆనాటినుంచీ రాత్రింబవళ్ళు నృత్యమే. “కోమలకరణాంగ నిక్షేపమై కైశికీవృత్తి ప్రధాన”మైన లాస్యంలో ఆ బాలికను అలంకరిస్తాడు. “వృత్తి రహితమైన వివిధ కరణాంగ విక్షేప” మైన వృత్తంలో ఆమె హృదయానికి దూరాననుండి, పాదసమీపాననుండి పూజ ఆ సాయంకాలము జత ఆకులతో మిసమిసలాడు వెదురు దివ్వెలా, శ్వేత పన్నగిలా ఆ దివ్యకన్య నృత్యం చేస్తూ ఉండగా చూచినప్పటినుంచీ తన నర్తనశాల మాట పూర్తిగా మరిచిపోయి అభినయాదుల అభ్యాసానికి పృథుకల్పాచార్యులవారికై తాను నగరంలో నిర్మించిన నృత్యశాలకే వచ్చుట కారంభించాడు.
ఆ బాల మరల తనకు ప్రత్యక్షం కాలేదు. గురువుగారిని అడగ మనస్సు ఒప్పదు. అడగకుండుటకు హృదయం ఒప్పదు. ఆ కళ్ళల్లో కాంతులు ఎక్కువవుతూ ఉన్నవి. శరీరం కృశిస్తున్నది. ఏదో మరచిపోయినవానిలా సంచరిస్తాడు. అస్తమానం తియ్యని లోగొంతుకతో పాటలు పాడుకుంటూ ఉంటాడు. విధి సంఘట్టనా కాండ పటంమాటున వున్న ఆ బాలికామూర్తిని ఉద్వేష్టితవ్యావృత్తి పరివృత్త సంకేతాది హస్త ప్రాణాలతో అరమోడ్పు కన్నులతో ధ్యానిస్తూ -
“ఓ బెల్ నీ వెవడు? 4 చెలీ నీ వెవరు? కలలో?ి భాలవా టళ్టుతి వలవుల వొవవా? వారానీ కెరటాల రేఖవా? జాంతనండ్వానమయ క్షణమవా? అరుణాంచు చుంభితోత్భుల్ల నరసిజూత వ్రదయన్నర్దిత వరీమళవా?””
అని అభినయించాడు.
“కుతూల తణకాదుచబవలవా? భుక్టుల్లా మనుకాడు కాంతివా? తాందవేళ్సరపొద తరుణాంగుకీతాళ గతిలయల మొలకొత్తు దళమవా? 4 చెలీ నీ వవడు? 4 చెల్ నీ వెవరు? కలలోని భాలనా? థటళ్టుతి వలవుల వావవా””
అతి తియ్యని గంభీరకంఠంతో పాడుకుంటూ తాండవము సలిపినాడు.
ప్రఫుల్ల రేఖలతో, పరిస్స్ఫుట పూర్ణానయన గాంభీర్యంతో వివిధ భంగిమాయు తాంగికాఖినయ సుందర శరీరముతో అతడు నృత్యం సలిపే సమయాన అప్పుడే అక్కడకు వచ్చిన అరవింద కుమారవీరుని సందర్శించడం సంభవించినది. అతని కలలోని బాల నవ్వుచూపుల ప్రసరిస్తూ మనోనయనాన ప్రత్యక్షమై ఉండుటచేత, ఆమెనిజస్వరూపముతో సాక్షాత్మరించినా గమనించక, కుమారవీరుడు, చేతులుచాచి సాత్వికాఖినయరూప ప్రణయ విరవానన్షము దృశ్యింపజేస్తూ నృత్యము మాత్రము సలుపుతున్నాడు. ఈ బాలుడెవడు? ఎంత మనోహరమూర్తి! ఏమి దివ్యత్వము! నృత్య శాస్త్ర పారంగతుడైన కుమారస్వామిలా వెలుగుతున్నాడు. కొత్త దేశాలనుంచి వచ్చినాడా గురువుగారి దగ్గర నృత్యశాస్త్రము పూర్తిచేసుకోతలచి - ఎన్నాళ్లుగా వున్నాడో? ఇదివరకెప్పుడు చూడలేదే - అని అనుకుంటూ అరవింద అట్లే నిలిచిపోయినది. ఆచార్యులు "తల్లీ! కూచో అమ్మా” అన్నాడు.
5
పృథుకల్పుడు - కుమారవీరునికీ అరవిందకూ సందర్శనము సమకూర్చిన మహానటునికి తన మనస్సులో వివిధ విధాల జోహారు లొనరించాడు.
ఆయన మనస్సులో అరవింద చరిత్ర అంతా జ్ఞప్తికి వచ్చింది. అరవిందాదేవి ఉదయగిరి ప్రభువైన చంద్రారెడ్డి మహారాజు కూతురు. ఆ ప్రభువులు కుమారవీరుని తండ్రిని సకలమండలేశ్వరుని, సార్వభౌముని, రెడ్డికుల దుగ్గాంబోధి చంద్రుని, అయిన వేమారెడ్డిని ఓడించి స్వతంత్రుడు కా సంకల్పించి ఉన్నాడని దుర్మార్గులు కొందరు చక్రవర్తితో చెప్పడంచేత చక్రవర్తి సైన్యాలు కూర్చుకొని వచ్చి చంద్రాపతిని ఓడించి రాజ్యాన్నుంచి తరిమివేశాడు.
ఆ చంద్రాపతి సభలో మహా పండితుడు, తేజశ్శాలి పృథుకల్పుడు సాహిత్య సంగీత నాట్యాచార్యుడుగా ఉండెను.
తానూ తన మహారాజుతో వారణాశి మొదలైన పుణ్యక్షేత్ర యాత్ర లొనరించాడు.
కుమార వీరుడు తండ్రి మరణానంతరం రాజ్యానికి రాగానే అతడు నాట్య విద్యకు పరమ పూజ లర్పిస్తున్నాడని విన్నాడు పృథుకల్పాచార్యులు.
వెంటనే చంద్రాపతిరెడ్డిని రహస్యంగా కొండవీటికి తీసుకొనివచ్చి, సమయం చిక్కినప్పుడు మహారాజుకు నిజము నివేదింప సంకల్పించినాడు.
పృథుకల్పుడు కుమారవీర మహారాజు ఎదుట తన విద్యచూపినప్పుడు మహారాజాతని పాండిత్యానికి ఉప్పొంగి ఆయనను తన గురువుగా స్వీకరించాడు. ఇది జరిగి ఒక సంవత్సరమైనది.
మహారాజు అరవిందా దేవిని చూచి పార్వతిని చూచిన శివునిలా, లక్ష్మిని చూచిన విష్ణునిలా గాఢ ప్రణయాన మునిగిపోయాడు.
అరవింద మనస్సు అతనిపై లగ్నమైనట్లే సంభాషణ వ్యక్తం చేస్తున్నదని పృథుకల్పుడు ఆనందాన మునిగిపోయాడు.
పరస్పరం తీసిపోవని అందము, ఒకళ్ళోకళ్ళకు తగ్గిపోవని విద్యాజ్ఞానము ఒకండొకళ్ళకు నేర్పదగిన నాట్యకళాదీక్ష.
అరవింద మొదట సిగ్గుపడినా తాను నాట్యం చేస్తూ ఉన్నప్పుడు కుమారుడు ప్రేక్షకుడయి ఉండుటకు పోనుపోను ఒప్పుకున్నది.
ఆమె చూస్తూ ఉన్నదని కుమారుడు తన విద్య అంతా అత్యంత ప్రజ్ఞతో, ఆనందమయ హృదయంతో, అద్భుత శారీరపూరితగాంధర్వంతో, నాట్య నృత్య వృత్తాదులు సల్పుతూ ఉండేవాడు. మొదటి రోజుల్లో అతను చూస్తూ ఉన్నప్పుడు ఆమె సంపూర్ణమైన నృత్య నిపుణత్వాలు చూపించలేకపోయేది. గొంతుక వ్రీడా భారంచే గళాంతరాలనే దాచుకొనేది.
దినాలు, మాసాలు పరువులెత్తాయి. యువతీ యువకులగు ఆ ఇర్వురకూ స్నేహము పూర్ణమై ఒకరొకరి లోపాలు సవరించుకొంటూ ఒకరి నొకరు వుద్బోధించుకుంటూ నృత్యకళానందమయులైపోయినారు.
అరవిందకు కుమారు డెవ్వడో తెలియదు. పృథుకల్పాచార్యులవారిని తానెవ్వరో చెప్పవలదని కుమారుడు వేడుకొన్నాడు.
కుమారుడు లేని ఒక సాయంత్రము అరవింద గురువుగారి పాదసమీపాన్న అధివసించింది.
"స్వామీ! ప్రతిభామూర్తి, ఈయన ఎవ్వరో? విదేశ వాసి, నాట్య కుమార, అభిముఖ్యుడని సెలవిచ్చారు. సంపూర్ణంగా ఆయన వుదంతం చెప్పరూ?”
"అమ్మాయీ! అంతకన్న నీ కెందుకమ్మా? ప్రతి క్రొత్తవారిని గురించీ నీ మనకెందుకు? నాట్యం నేర్చుకోవడానికి వచ్చాడు; నాట్యం నేర్చుకొని తనదారిని తాను చక్కాపోతాడు.”
"అవునండీ ఇంత శేముషి సంపన్నుడు తమకు శిష్యుడు కావడం చాలా ఆనందముగా ఉన్నది. అందుకని ఎవరా అన్న ప్రశ్న ఉదయించింది.”
“నిజమే! ఈ చిత్రసంఘటన నాకున్నూ ఆశ్చర్యాన్ని ఉద్భవింపజేస్తూ ఉంటుంది.”
“ఏ విచిత్ర సంఘటన?”
“ఇద్దరు అపురూపమూర్తులు, విద్యావినయసంపన్నులు ఒకే గురువు వద్ద శుశ్రూష చేస్తూ వుండడం.”
“అందులో ఏమి విచిత్రం ఉంది? ఉత్కృష్ట విద్యాసాగరులయిన తమ దగ్గిర ఎన్ని దేశాల నుండి ఎన్నిరకాలవారు ఎంతమంది రారు? ఇద్దరూ అంటే ఏ ఇద్దరూ ?”
“అనేక 'ఇద్దర్లు' ఉండరు తల్లీ!”
- * * *
“కుమారసంభవ యక్షగానం నేర్పుతామన్నారు?” “ఇరువురూ ఒకే యక్షగానంలో అభినయిస్తూ ఉంటే?”
- * * *
“నాయనగారు తమరిని ఒకసారి వచ్చి కలుసుకోమన్నారు.”
“నీ వివాహ విషయం కాదుగదా?”
“ఏమండీ స్వామీ! నాల్గయిదురోజుల్నుంచి నన్ను ఒకటే వేళాకోళం చేస్తున్నారు, నామీద దయ తప్పిందా?”
ఆమె కన్నుల నీరుతిరిగి తలవంచుకుంది.
“ఆఁ! ఆఁ, అదేమిటమ్మా అరవిందా! ప్రాణసమానమైన నా బిడ్డతో ఇంచుక హాస్యమాడి కాస్త నవ్వుకోకూడదా!” అంతట ఆమె మంచుబడ్డ పూర్ణచంద్రునిలా వికసించిన మోముతో, నవ్వుతూ గురువుగారి పాదాలకు నమస్కరించింది.
పృథుకల్పాచార్యు లా బాలను అవ్యక్తస్వనముతో “దీర్ఘాయుష్మతీభవ, దీర్ఘసుమంగళీభవ, సత్వర వివాహ ప్రాప్తిరస్తు!" అని చేయి తలపై ఉంచి ఆశీర్వదించి పంపాడు.
ఆ రాత్రంతా అరవిందకు నిద్రపట్టదు. గురువుగారి ఆశీర్వచన వాక్యాలు గానంలా, ఉరుములులా ఆమె హృదయంలో ప్రతిధ్వనిస్తున్నవి.
6
కుమారునికి నానాటికి ప్రేమ ఆవేశరూపమైంది. అరవిందను తలవని, అరవిందాదేవిని పూజింపని నిమేషమైనాలేదు. మహాలక్ష్మి భావాత్మకంగా అరవిందాంకితమైన దరువులు, పదాలు ఎన్నేని రచించుకుంటున్నాడు. అభినయించుకుంటున్నాడు.
నాట్యకళాభిమానంతో కుమారవీర మహారాజు తన నగరంలో ప్రతి ఏడూ సంక్రాంతి పండుగలకు నృత్యవిద్యా ప్రదర్శనం ఏర్పాటుచేసి బహుమతు లిస్తున్నాడు.
నర్తకీ నర్తకులనేకులు దేశదేశాలనుండి యాత్రలు సాగించి ప్రకృతి దేవీ సువర్ణోత్సవానికి విజయంచేసి, తమ విద్యానైపుణ్యం ప్రదర్శించి, బహుమతులంది, విందులారగించి, ఉత్సవంలో మైమరచి, తాండవించి వెళ్ళుతూ ఉంటారు.
ఆ సంవత్సరం పండుగలకు కుమారుని నగరానికి ప్రసిద్ధినంది, కీర్తికాములయిన నటీనటకులు విడివిడిగా, జట్టు జట్టులుగా విజయం చేసినారు. నగరమంతా అలంకరించినారు. ప్రభుసేవకులు అప్రమత్తతతో అందరికీ విడుదులు చూపినారు, బహూకరించినారు.
విద్యాదక్షులైన పండితులు పరీక్షకవర్గంగా నియమింపబడ్డారు. సభ రసజ్ఞులతో, పండితులతో, వీరులతో, విద్యావంతులతో, ప్రభువులతో, సంపన్నులతో, ఉద్యోగులతో నిండి ఉన్నది. వనితాలోకం వివిధాలంకార భూషితమై భూమిమీద కవతరించిన ఇంద్రచాపంలా వెలుగుతున్నది.
తమ ప్రభువగు శ్రీశ్రీ కుమార వీరవర్మ కూడా నాట్యకళా వైదుష్య ప్రకటన చేయగలడన్న వార్త ఎవ్వరికీ తెలియదు. ప్రభువు తన పీఠం మీద లేడు.
నాట్యకళలో ఆంధ్రుల ప్రజ్ఞ అప్రతిమానం. బ్రాహ్మణ కుటుంబాల వారీ దివ్యకళను అవలంబించి భారతీయలోకాన్ని మెప్పించి మహారాజుల సన్మానాన్ని పొందుతూ, చక్రవర్తుల ఆదరణలు సముపార్జిస్తూ, లోక విఖ్యాతిని అందుకుంటూ, అగ్రహారాలు అనేకం గణించుకున్నారు. ప్రభువులున్నూ ఈ పవిత్ర కళయందు తమకున్న అభిమానంచేత నర్తకులై దివ్యానందం పొందుతూ ఊగిపొయ్యేవారు. ఆ ఉత్సవంలో సభ కిటకిటలాడి పోయింది.
వేణులు, వీణలు, మృదంగాలు ప్రతి వాయిద్యాలు ఒక్కసారిగా మోగినవి. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ కళానైపుణ్యం లాస్యములో, నృత్తములో, తాండవంలో, నాట్యంలో అభినయ పూరితంగా భరత విద్యలో ప్రదర్శిస్తున్నారు. దేశ్యాలయిన సాంప్రదాయాలు, వివిధకాల సాంప్రదాయాలు ప్రకాశిస్తున్నవి.
కిరీటాంగద కేయూరకంకణకంఠహార శృంఖలాలతో కళ లుట్టిపడువేషాలు, మంజీరకింకిణీరవాలు తాళగతులవుతున్నవి.
రంగు రంగుల దుకూలాంతరీయాలు - అంచులతో మెరుముల్లా లలిత ములవుతున్నవి. ఒక్కొక్కరి నాట్యాలే పూర్తియైన తర్వాత ఒక బాల నటుడు రంగస్థలంలోనికి అవతరించాడు. అతని తేజస్సు రంగస్థలమున్ను మహాసభయున్ను నిండిపోయింది. అతనిమూర్తి అనంత సౌందర్య యుతము, అతని రేఖావిలాసాలు సుధాకరకిరణ ప్రసారాలు. ఊ - ఊ -
"చిది చిద్విలాసుడా ఆ - ఆ - రాఘవుడు ఊ - ఊ - సీతామనోహరుడు - - వెడలెను -” అని ఎత్తుకున్నాడు. “తకిటికాతోం, ధిం ధిమికిట తోం తోం" మృదంగం పలికింది. ఒక గంతున రంగమధ్యస్థలానికి తేలి "వెడలెనూ విశ్వామిత్రుని యాగరక్షణకు వెడలెనూ శ్రీరా - ఆ-ఆ మూడూ వెడలెనూ అడవులకూ” అప్పుడతడు శ్రీరామచంద్రుడే. దివ్య వినీలకాంతులు చంచలిత హాసాంచల సాత్వికాలలో, పరిప్లావితభ్రూయుగ్మ వ్యంజనాలలో భమితహస్త విన్యాసాలలో భంగ రచితాంగ విక్షేపాలలో కలిసి, వెలుగునీడలై మహాశ్రుతులయినవి. సర్వలక్షణలక్షితు డా బాలనటుడు రంగస్థలంలోకి రావడంతోనే అందరి హృదయాలూ చూరగొన్నాడు. అందరు అతనియెడ వినమ్రులైనారు. అతని ఆట పూర్తియైనది. సభ్యుల హర్షధ్వనులు గోపురాల ప్రతి ధ్వనించాయి. అతడు మహావీరుడు. తన మిత్రుని భరత కళాప్రజ్ఞ తనకు పులకరాలు ఉద్భవింపచేస్తూ వుండగా అరవింద కరిగే కన్నులతో అతన్ని తనివోవ పారకించింది, అతడు అమిత హర్షాశ్రులతో అరవిందవైపు చూడ్కులు ప్రసరించి చిరునవ్వులు వెదజల్లాడు
7
ఆ వెంటనే ఇంకో యువకుడు రంగస్థలంలో ప్రత్యక్షం అయ్యాడు. అతని శరీరకాంతి తప్తకాంచనము, అతని భూయుగ్మం మధ్య చంద్రుని కాంతులు వెలుగుచున్నది. అతని చతుర్విధాభినయాలు పరిష్కృత సాంప్రదాయీతీతమైన ఒక వినూతన నృత్యవిధానజనితాలు. వృత్తిరహితమయిన్నీ, సర్వవృత్తిగర్భితమైన నృత్తం సలుపుతున్నాడు. అతనికంఠ మెట్టిదో, రసవిషగంధక సంకీర్ణమైన ఏ ఔషధసేవ చేసినదో! మధురాతి మధురమై, అడివి బాపిరాజు రచనలు - 8 - 10 -> కథలు ద్వాదశారానుభూతమైన వేదపనసను ధ్వనింపచేసే స్వరకల్పనలో సమస్త జగత్తూ నిండినట్లయినది. సభ నిశ్శబ్దము. సభాహృదయాలు, ఆత్మలు పూవులై కర్పూరాలై ఒక్క పరమ నివేదనై పోయినవి. ఆ కొత్త యువకుడు విజయుడు కాక ఎట్లు? జయధ్వానాలు గంభీర కల్లోలదృశంగా విరుచుకొనిపడినవి.
"ఎవరో హో యీ మహాప్రజ్ఞి!" “ఎవరో ఈ పరమాద్భుత నటకుడు. "
అని సభా హృదయాలు ప్రశ్నలు చేసుకొంటున్నవి. అరవిందకు తా నేమవుతున్నదీ తెలియదు. మహా మనోహర సుగంధ ఝరీ వేగాన కాలునిలువక కొట్టుకుపోతున్నట్లు కలగాని కల. అప్రయత్నంగా లేచి రంగస్థలం వెనకవున్న నేపథ్యశాలలోకి చొచ్చుకుపోయింది. “ఏమా? ఈ విపరీత” మనుకుంటూ చంద్రాపతి ఆమె వెనుకనే వెళ్ళినాడు. నటకులు, సభ్యులు తండతండాలుగా ఆ నూత్ననటుణ్ణి చూడడానికి నేపథ్యశాలను చుట్టివేస్తున్నారు. ఇందరు చూస్తున్నారని గుర్తులేదు. ఎవరు ఏమనుకొందురో అన్న భీతిలేదు. సహజ మాధుర్యగుణమైన సిబ్బితి వదిలి గంభీరమూర్తి, వెడద ఉరుమువాడు, దీర్ఘబాహువులవాడైన ఆ విలాస నటునియొక్క సౌందర్య రేఖాకారాలైన పాదాలకడ మోకరిల్లి మూర్ఛపోయింది. ఒక్కుమ్మడిగా పృథుకల్పాచార్యులవారు, కుమారవీరుడు, చంద్రాపతి ప్రభువు, ఆ క్రొత్త నటకుడు అందరు అరవిందాదేవిని లేవనెత్తుటకు ఆమెదగ్గరకు వ్రాలారు. కుమారవీరు లా బాలను ముందుగా విష్ణువు భూమి నెత్తినట్టు ఎత్తి ఆ సమ్మర్ధంలోంచి తీసుకొనిపోయి ప్రాసాదాంతఃపురములో దాసిజనాలచే పరిచర్య చేయిస్తున్నాడు. సభలోనున్న ప్రభువైద్యుడు, ఆజ్ఞ రా లోనికి విచ్చేసినాడు. అరవిందకు తెలివి వచ్చినది. తెలివి వచ్చేటప్పుడు "ప్రభూ" అని వైద్యుడు తన స్నేహితుడైన నాట్యకుమారుణ్ణి పలకరించడం విన్నది. ఒక దాసీని రహస్యంగా అడగగా 'వారుకుమారవీర మహారాజుగా” రని ఆమె జవాబు చెప్పింది. అరవిందకు త్రపయు, పౌరుషము, పట్టరాని కోపమూ వచ్చినది. 'ఇన్నాళ్ళు ఈ మాయావి మారుపేరుతో తన ప్రాభవం దాచుకొని నా చనువు నాసించినాడుగా! గురుదేవులైనా నా కీ రహస్య మించుకంతయినా సూచింపరయిరిగా! ప్రభు గౌరవం వారిని చెప్పనిచ్చినదికాదు కాబోలు. నా పేదతనం కదా ఈతనికి నన్నింత చులకనచేసింది. చంద్రాపతి కూతురు కపటానునయాలతో సమీపించదగ్గదా? గురువుగారు నాకీ రహస్యం అడివి బాపిరాజు రచనలు - 8 • 11 • కథలు దాచిపెట్టడం చూడగా ఇది వీరందరు కలిసి చేసిన కుట్ర కాదుగదా. ఇంకో సంపన్నుల యాడుబిడ్డ నీతడిట్లు అనుసరింపగలడా? అంటూ ఒక్కుమ్మడి భావపథాన విద్యుద్వేగంతో యెన్నియో తలపోతలు పాటుపోటులు కాగా ముద్దరాలయిన అరవింద, తన అభిజాత్యం, అభిమానం రక్షించుకోడాని కది తరుణం అని యెంచి, తన మనస్సే తానెరుగలేని ఆవేగంతో కంపించి పోయింది. ఏమది? మహారాజు ప్రచ్ఛన్నుడై మాయతో తన చనువు ఆశించినాడా? ఆయన ఉద్దేశమేమి? హృదయస్సంక్షోభంతో నిదానమైన ఆలోచనలేని అరవిందాదేవికి ప్రభు వేదో దురుద్దేశంతో తన స్నేహం చేశాడన్న కోపం పొంగి పొర్లిపోయింది. తన పేదతనంకాదా ఇంత చులకనచేసింది. తనతండ్రి మాత్రం మహారాజు కాడా? విధివశాన రాజ్యం కోలుపోయినంత మాత్రాన తాను హీనురాలయిందా? ఏదో కుట్ర, ఏదో మాయ తనచుట్టూ మహారాజల్లినాడు. ఆ నాట్యవిద్య మహా నటేశ్వరుని పూజ అనే ఆమె భావం. అందుకు తనజీవితం ఎందుకు నివేదన చేయకూడదు? ఈ మహారాజుల్ని, ఈ హీన సంసారాన్ని నమ్ముకోవడంకన్నా ఆ మహానటు డెవడో అతనికి తన బ్రతుకు అప్పగించడం ఉత్తమం అని భావించుకొన్నది. ఒక్కుమ్మడి భావపధాన విద్యుద్వేగంతో యెన్నో తలపోతలురాగా, లలితాంగి అరవింద తన అభిజాత్యం అభిమానం రక్షించుకొనడానికి అది తరుణం అనిపించి, తనమనస్సే తా నెరుగలేని ఆవేశంతో కంపించిపోయింది. మనస్సులో ఉన్న కుమారవీరునిబింబం వికృతమైంది. ఆ అపరిచిత నటశేఖరుని దివ్యరూపం హృదయాంతరాలలో స్ఫుటకాంతిపూరితమై ప్రత్యక్షమయింది. ఆ అలౌకిక నృత్యకౌశల్యం దివ్యునకుకాక ఎవరికి ఉంటుంది? ఆమె హృదయం రక్తిమాతిరక్తిమమై మెరుపుతీగలా చంచలించింది. తన సర్వస్వం ఆ నూతననటుని పాదాంబుజాల కేల సమర్పించుకోకూడదు? పూజచేస్తూ శిష్యురాలై అతన్ని అనుసరించడం మహాభాగ్యం. జేవురించిన తన ముఖరక్తిమా మాధుర్యాన్ని, తన చూపులలోని ఏవో చలితాగ్నిశిఖలను చూస్తూ మ్రాన్పడి నిలచిన కుమారవీర మహారాజునకు ఒక వీక్షణమైనా ప్రసాదింపక చివుక్కున లేచింది. అరవింద విసవిస నడచి పోతున్నది. చంద్రాపతి రెడ్డిప్రభువు "అమ్మాయీ! ఎక్కడికమ్మా" అంటూ వెంటనంటి పోతున్నాడు; ఆమె తన తండ్రిగారి ఆవేదనా పూరితమైన కేక వినిపించుకోక నడచిపోతున్నది. అప్పటికప్పుడే రాత్రి మూడుయామాలు గడచిపోయినాయి. సేవకులు అరవిందాదేవికి దారి చూపడానికి వెండి కాగడాలతో, కూడా పరువెత్తుచున్నారు. వెన్నంటి వచ్చే తండ్రివంక, కుమారునివంక తిరిగి చూడక వినవిన నడచి పృథుకల్పాచార్యుని గృహం ప్రవేశించింది. గురువుసరన కూర్చున్న నాట్యమూర్తిని దూరాన్నుంచే చూచింది. ఆమె అడివి బాపిరాజు రచనలు - 8 • 12 • కథలు ముగ్ధహృదయం దడదడ కొట్టుకున్నది. ఇంతలో ఆ అపరిచిత సుందర దివ్యమూర్తి తన్ను గాంచి, చిరునవ్వు చంద్రికలు వెదజల్లుచు దగ్గరకు రమ్మని తల ఊపాడు. ఆమె సర్వాంగాలు చిరుచెమ్మటలతో ప్రాతస్తుషార్ధా పుల్లకుసుమాలై పోయినవి. పారవశ్యాన అడుగులు తడబడ ఆ నటకుని సమీపించి సాగిలపడ్డది. "ప్రభూ! అవిదితానురాగమైన నా హృదయమూ, నా జన్మా ఈ క్షణం వరకూ మీ కొరకే మీదుకట్టబడి ఉందేమో! ఈ అజ్ఞాత బాలికకు నీ పాదదాస్య మనుగ్రహింపవా?” అని బాష్పరుద్ధకంఠియై పలికింది. ఇంతలో అచ్చటికి ఆమె ననుసరించివస్తున్న కుమారవీర చంద్రాపతులు లోనికి రావడం ఆ నూత్ననటుడు చూచి, తనచేరువ సాగిలపడి ఉన్న అరవింద నుద్దేశించి “అమ్మాయీ నీ వీ కుమారవీరుని ప్రేమించుట లేదా?” అని ప్రశ్నించాడు. అరవింద మాటాడలేదు. “ఏమమ్మా పలుకవు” అని అతడు హెచ్చరించాడు. అరవింద “ప్రభూ! ఈ అభాగిని రాజప్రసాద మహితైశ్వర్యాన్ని కన్నెత్తి చూడజాలదని కుమారవీర మహారాజులుంగారు ఎరుగుదురు. కలలోనైనా నాకటువంటి లోభం పొడమకుండా వారు తమ అభినయం వల్ల ధ్వనియుక్తమైన కట్టుదిట్టాలు చేశారు. నిన్నుకదా నేను శరణుచొచ్చాను. వారిమాటెందుకు స్వామీ?” అని కంటనీరు జలజలరాల పలికినది. అసూయావిషాదాలు హృదయాన్ని ఆవరించి కుమారవీరుని మోము జేవురించింది. ఎంత శిల్పి అయినా, ఎంత మృదు హృదయుడైనా ప్రాణాధికయైన తన ప్రేయసి తన కళ్ళయెదుట ఎవరో ఊరుపేరులేని ఒకనికి అట్లు తన్నర్పించుకొంటూ ఉంటే సహింపగలడా? ఈ బాలిక తన్ను ప్రేమించింది అని పరవశత్వం పొందాడు. ఆమె ఎవరైనా తన మహారాణిగా చేయాలని సంకల్పించాడు. వారిద్దరూ నాట్యంలో సతీపరమేశ్వరులులా, రాధికాకృష్ణులులా వారు ఒకరికోసం ఒకరు, తమకోసం తామిద్దరూ నాట్యాలతో మహితానుభూతితో ఆనందపరమావధిలో లయమై పోవాలనుకున్నాడు ఆ యువప్రభువు. ఈ బాలిక తన్ను ప్రేమించనేలేదా? ఇన్నాళ్ళు తాను రిత్తకోరికలతో దివాస్వప్నాలు కంటున్నాడా? ఆ సుకుమార హృదయము అంటే తనకున్న ఆ మహాపవిత్రభావం వల్ల తన నిజస్థితిని గోపనం చేయటం ఎంత తెలివి తక్కువపని. ఓహో! ఈ దివ్య సుందరాంగి తానెవరో తెలిసికొని, తన నిజ స్థితి తెలిసే వేరుగా తలచి ఎంత కించపడిందో? ఇన్నాళ్ళ తమ సాహచర్యం, తమ సహాధ్యాయత్వ మాధుర్యం ఎంతలో కరిగిపోయింది? గాఢమైన స్త్రీ హృదయం ఎవరు తెలిసికోగలరు? కళాపూజ్యోన్మాదంచేత ఈ నవీనాగతుణ్ని పూజలు చేసినాడు తాను. ఈ తన పవిత్రభాగధేయమని ఎంచుకున్న అరవిందాదేవి రాజ్యం పోయిన చంద్రాపతి ప్రభువు తనయ అని తనకు తెలిసింది. అరవింద తన హృదయాన్ని పూలమాలతో అలంకరించే ముహూర్తంలో చంద్రాపతి మహారాజుకు ఉదయగిరి రాజ్యం తొల్లింటి సర్వస్వాతంత్ర్య అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 13 ♦ కథలు . దేశంగా అర్పించాలని తాను గురువుగారితో కుట్రచేయడము దోషమా? ప్రభూ! అనంత తాండ వనర్తిత సుందరపాదా! ఏది తనకు దారి! ఈ కొత్త నటుని వలచి అరవింద తనకు కానిదై పోవునా ప్రభూ! కుమారవీరు డిట్లు తలపోతలకు జిక్కి ఇతికర్తవ్యతా మూఢుడై నిలుచున్నాడు. ఆ నూత్ననటమూర్తి: ఓ వెట్టితల్లీ! నీలేత హృదయానికి అనంత గంభీర ప్రేమయొక్క లోతులు ఏమి తెలుస్తాయి? నన్ను ప్రేమించడం దుష్కరం. దేశదేశాల్లో ఎడారుల్లో తిరిగినచోట తిరక్కుండా తిరుగుతుంటాను. అర: సమస్తమూ వదలి మీతో ఎక్కడికైనా సరే మీ నీడను అనుగమిస్తా ప్రభూ! నన్ను పరిగ్రహించు! ఇతరం నాకేమీ వద్దు. కుమా: స్వామీ! నువ్వెవ్వరివో నాకు తెలియదు. నేను ఈ దేశ ప్రజలకు రాజును. నూత్న: అవునయ్యా! అవును. నీకు భరతవిద్య అంటే పరమ ప్రీతి! నువ్వు ఈ మహారాజ్యం అంతా వదలి నాతోరా. నీ ఊహకు, నీ జ్ఞానానికి, నీ శక్తికి అతీతమైన మహోత్తమ దివ్యనాట్యవిధానాల నిన్ను అత్యంతో తృష్ట విద్యావంతుణ్ణిగా జేస్తాను. కుమా: స్వామీ! ఏమిటి తమ ఆదేశం? పృథు: స్వామీ! నేను సమస్తమూ తెలిసినవాడనని గర్వపడినాను. ఈ భువనంలో నాతోటి సమానప్రజ్ఞాయుత కళాస్రష్ట లేడని విర్రవీగాను. నీ నాట్యముచూచి మహాక్రోధ వంతుడనయ్యాను. అనేక దోషాలున్న కుపండితుడు వనుకొన్నాను. నేను నా అజ్ఞానానికి తలవంచుకుంటున్నాను. నన్ను నీతో తీసుకొనిపో. నీకు శిష్యాతిశిష్యుణ్ణయి ఏకదళంమాత్రం నేర్చిన నాట్య విద్య నీవద్ద పూర్తిచేసుకుంటాను. నూత్న: మంచిదయ్యా, పృథుకల్పాచార్యా! నీకు నా నమస్కారాలు, నువ్వు నాకు తగినవాడవయ్యా! లే! ఈ యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించిన్నీ తమ ప్రేమ తాము గుర్తింపలేని యౌవనమదాయత్తులు. వీళ్ళకు కళ యేమిటి? కళారాధన ఏమిటి? అరవింద: ప్రభూ! ప్రభూ! కుమా: స్వామి! నేను దిగ్భ్రామలోపడ్డాను. ఏదో నిస్సహాయత, ఏదో పరవశత్వము నన్ను ముంచివేస్తోంది. ఈ అరవిందాదేవి నీకు పాదాక్రాంత అయింది. నూత్ననటుడు: ఓయి వెట్టివాడా! అరవిందకు నువ్వోయి సూర్యుడవు. ప్రేమకూ కళకూ అనంత రహస్య సంబంధముంది! పృథుకల్పాచార్యా! మృదంగం ధరించు. అరవిందా! వీణ తాల్చు. కుమారా! వేణు. ధిం ధిమికిటతోం! తోం తోం! అతని నవ్వులు సంపూర్ణజ్యోత్స్నాసహస్రాల గర్భీకరించుకొన్న వెలుగు లయినవి. అతని కాళ్ళను బంగారుమువ్వలు 'కింకిణకిణాంకిణాం' అని ధ్వనించినవి. ఆయన ఒక అద్భుత భంగిమ తాల్చినాడు. పృథుకల్పుని మృదంగం, అరవింద వీణ, కుమారుని వేణువు, ఆ గతికి సమన్వయ లయరూపం తాల్చింది. కేదారగౌళరాగిణి ఆవిర్భవించింది. అడివి బాపిరాజు రచనలు - 8 • 14 • కథలు ఉదయాద్రిపై అప్పుడే అరుణాలవుతున్న ఉషఃకన్య చేలాంచలాలు గాలిలో దిక్కులలో ప్రసరించినవి. కోష్టాలలో గోమాతలుచేపుబరువున అంబా అని వత్సముల పిలుస్తున్నవి. దేవాలయ ఘంటానాదము లాప్రత్యూష వాయువులతో కలిసి వీతెంచుతూ ఉన్నవి. మందిరగవాక్షాలలో తోటయున్నూ, తోటవెనుక తోటకు యెరుపు రంగు అద్దుతూ ఉన్న ఉదయ సంధ్యారుణ కాంతులున్నూ విప్పారిన నేత్రాల నిండుతున్నవి. పక్షులు సా, రీ, గా, మా, పా, పా, మా, పా, సా అని పాడుతున్నవి. ఆ నటుని నాట్యమునందు కరణాలు మూడయినవి. ఆ మందిరాన కుడ్యాలు, స్థంభాలు, తోరణాలు మాయమైపోయినవి. హిమవన్నగ శిఖరాలు దవుదవ్వుల తోచినవి. శీతల వాయువులు ప్రసరించినవి. పవిత్ర పారిజాత పరీమళాలు కలయంపులై వారలైనవి. అప్రయత్నంగా అరవిందా కుమార పృథుకల్పులు తమతమ వాద్యాలు మ్రోయింప మానినారు. చంద్రాపతి ఒక దివ్యనాట్యసృష్టి చూస్తూ మ్రాన్పడి నిలుచున్నాడు. ఆ దివ్యనాదాలు కిన్నరీస్వనాలు, మహతీ వీణానాదాలు. ప్రవాళరజోమిశ్రితసముద్రకల్లోల శిఖరనర్తితఫేన సదృశ్యాలై ఆ నటుని పాదాలు ఆడిపోతున్నవి. ఆకాశసంచారంచేత విహంగవశ సంచాలన సుందరాలై భౌమ్యచారపల్లవ సుఖగాలై లోకాల నాడిస్తున్న వా పాదాలు. నితకుముదవల్లులై గజశుండాదండాలై అతని హస్తాలు ప్రచలనవేగ విధూతాలౌతున్నవి. పల్లికతావై అతని దృష్టులు భూమ్యాకాశాలు ఏక వీక్షణంలో లోగొంటున్నవి. అతని రేచిత భూవిలాసాలు పృథగ్భావావిష్కరణాలవుతున్నవి. ఆ వికసించునది జగత్కల్యాణ పద్మరాగ్యోజ్వల కాంతి. ఆ నృత్యం ఉదయ సంధ్యా నృత్యము. “అంగికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చన్ద్రతారాది తన్నమ సాత్వికం శివమ్” అంటూ వృద్ధులయిన పృథుకల్ప చంద్రాపతులునూ కళావేశులైన అరవిందా కుమారవీరులున్నూ భక్తితో ప్రణమిల్లినారు. కరిగిపోతూ ఉన్న ఉదయారుణ రక్తిమలో మహానటుడు లీనమై పోయినాడు. “అరవిందా కుమారులారా! రాగరంజితమైన మీ అలౌకిక దాంపత్య వసంతము భరత సంప్రదాయవల్లికి క్రొంజివుళ్ళు వెట్టుగాక” అన్న ఒక దివ్యస్వరం వారికి వినిపించింది. సూర్యుని రథం మహావేగంతో కాశ్మీరరాగాలు వెదజల్లుతూ యువయుగ్మ దివ్యాను రాగంలా ఉదయించింది. నాట్యశాలాంతరాన ఎట్టయెదుటనున్న నటేశ్వర పీఠానికి అరవిందా కుమారులు నిమీలితనయనాలతో ప్రణమిల్లారు. అప్పుడు పృథుకల్పాచార్యులు అడివి బాపిరాజు రచనలు - 8 • 15 •> కథలు “లోకానాహూయ సర్వాన్ డమరుక నినదైః ఘోరసంసారమగ్నాన్ దత్వాభీతిం దయాళుః ప్రణత భయహరం కుంచితం పాదపద్మం ఉదృత్యేదం విముక్తే రయన మితి కరా దర్శయన్ ప్రత్యయార్థం బిభ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం యస్సబోయాన్నటేశః” అని విముక్త గంభీర మధుర కంఠంతో కీర్తిస్తూ సాష్టాంగ పడినాడు. ఒక్క ముహూర్తం నిశ్శబ్దాన తేలిపోయింది. అవ్యక్తానేక భావశలభమైన నెమ్మోముతో నిలిచి ఉన్న అరవింద యెదుట కుమారుడు మోకరిల్లి, "దేవీ! నా అపరాధ సహస్రం విస్మరించి నన్ను ఏలుకోవా?” అన్నాడు. అరవింద తప్రాపతియై మాటాడలేక తలవంచి నిలుచున్నది. కుమారు: దేవీ! నీవు ఒల్లని ఈ మహారాజ్యం నాకు పరిత్యక్తము. చంద్రా: మహాప్రభూ! నా దురదృష్టబలం వల్ల నాపై విరోధులు సలిపిన కుట్రవల్ల తమ జనకుల అనుమానానికి గురై రాజ్యం కోలుపోయి ప్రచ్ఛన్నవేషంతో ఇక్కడ వుంటిని. కుమా: మహారాజా! తమ చరిత్ర అంతా మా అమాత్యుడు నాకు తెలియజెప్పినాడు. తమ రాజ్యం అంతా ఎప్పటియట్లు తమ ఛత్రచ్ఛాయల నిండించండి. ఈ కుమారుడు తమకు అన్ని విధాల బాసటే. పృధు: మహాప్రభూ! రాజ్యం తిరిగి సంపాయించడంకన్న శ్రీ చంద్రాపతి మహారాజులుంగారు. తమ్ము జామాతగా కోరిన సముద్రుడు తపస్సు చేసినట్లు కోటేశ్వరుని ప్రార్థిస్తూ ఉండేవారు ప్రభూ! అర: ప్రభూ! ఈ మందభాగ్య మిమ్ము తనకు తెలియని ఆవేశంలో.... కుమా: దేవీ, నీవు ఒల్లని ఈ మహారాజ్యం నాకు మాత్రం భారం కాదా? పరమ నటేశ్వరాజ్ఞ పాలించడానికి నా దేశమే మనకు ప్రతిబంధకమైతే నేను అది అంతా త్యజించి కేవలం నన్నే అర్పించుకొంటాను. అనుగ్రహించవా? "ప్రభూ! మీ దివ్య ప్రేమవాహినిలో నాకు నిలకడ చిక్కడంలేదు” అని అంటూ అరవిందాదేవి ముత్యాలకన్నీరు ఆనందకాంతిలో మిలమిలలాడమోకరిల్లి ఉన్న తన హృదయాధినాధుణ్ని కోమలహస్తద్వయ పల్లవాలతో స్పృశించి లేవనెత్తినది. కుమారుడులేచి సర్వమూ మరచి తనజన్మ సహస్రాపుణ్యాల నృత్య తపస్సు పుంజీభవించిన అరవిందను తన వెడద రొమ్మున బిగికౌగిటహత్తుకొన్నాడు. త్రపానమ్రమైన ముద్దుమోమును అరవింద ఆ విశాలవక్షాన దాచుకొన్నది. వారిరువురు చంద్రాపతి పృథుకల్పులకు ప్రణమిల్లినారు. అడివి బాపిరాజు రచనలు - 8 • 16 • కథలు “లచ్చిమి”
పచ్చలయ్య ముదుసలి రైతు. అతనికున్నదే రెండెకరాల మాగాణి. ఆ మాగాణి అతనికి మాలచ్చిమి. ఆ రెండెకరాలభూమి ఒక వ్యక్తి అయింది. ఆ చిన్నారి పొలానికి “లచ్చిమి” అని పేరు పెట్టుకొన్నాడు. ఆ పొలం కూడా చాలా అందంగా ఉంటుంది. పంట కాల్వజఒద్దునే ఉంది. ఆ పొలం నవ్వనికాలం లేదు.
“లచ్చిమి” చుట్టు వెడల్పాటిగట్టు వేసినాడు, ఆ గట్టుపైన అంటు మామిడిచెట్లు నాల్గు, ఒక పాతమామిడిచెట్టు ఉన్నవి. పది అరటి బోదెలున్నాయి. కాల్వవైపుగట్టు కూరగాయలు పెంచేందుకు! ఆగట్టంతా ఏవో పాదులెప్పుడూ పెరుగుతూ ఉంటాయి. వంగచెట్టు, తోటకూర, గోంగూర, కొత్తిమీరమళ్ళు ఘుమఘుమలాడుతూ, వేసవికాలంలో కూడా పచ్చగా మిలమిల లాడుతుంటాయి. పాదులలో విడవకుండా దొండ ఎప్పుడూ కాస్తూనే వుంటుంది. తూర్పు గట్టుమీద నాల్గు సపోటాచెట్లు, పది తేనెబొప్పాయిచెట్సు, మల్లె, జాజి, గులాబి అంట్లూ ఉన్నాయి. పడమటిగట్టుమీద పొడుగునా కొబ్బరిచెట్లు. గంభీరంగా ఆకాశంలోకి తలలాడిస్తూ ఉంటాయి.
తన కన్న కూతురే లచ్చిమి.
2
అతనికి పెళ్ళిలేదు. చిన్నతనంలో రంగం పారిపోయాడు. కొండంత బరువులెత్తి శేషుడై డబ్బు మూట గట్టాడు. నాలుగు వేదాలూ ఒకేపాఠమై భూమి రథాన్ని లాగినట్టు పచ్చలయ్య రిక్షాల్ని లాగి డబ్బు సంపాదించాడు.
మధుపానం కోసం మానినీమణులు కోసం పోగుచేసుకొనే చిల్లర మూటల్లోంచి డబ్బు ఖర్చు అయినా అసలే జాగ్రత్త మనిషి అవడం చేత పచ్చలయ్యకి యాభయ్యోయేడు వచ్చేటప్పటికి రెండువేల అయిదువందల యాభైమూడు రూపాయలు పోగయ్యాయి. కన్నతల్లి అయిన తెలుగుదేశం పిలుపు వినబడింది.
రంగంపట్నవాసపు ఛండాలపుకంపులు అప్పటి కతనికి ఏవగింపు పుట్టించాయి. ఆంధ్రదేశంలో గోదావరి డెల్దాలో తన గ్రామం జ్ఞాపకం వచ్చింది. చిన్నతనంలో తన తండ్రి భూములు కవుళ్ళకు తీసుకుని వ్యవసాయం చేసిన రోజులు, తాను దూడల్ని కాసిన రోజులు, మక్తాధాన్యం ఇవ్వలేక తండ్రిపడిన అగచాట్లు, భూమి యజమాని' . తండ్రిని పెట్టిన కష్టాలు, తండ్రి బాకీదారుదై బాకీదారుల జయిలుకి వెళ్ళడం, తన అక్క పెళ్ళికి తండ్రి పడిన ఇబ్బందులు, వానకాలపు మబ్బై కంటికి మంటికి ఏకధారై తల్లి
అడివి బాపిరాజు రచనలు - 8 + 174 కథలు కుళ్ళి పోయిన విషయం, తనకున్న ఆస్తిపాస్తి తాకట్టు పెట్టి తండ్రి డబ్బు తెచ్చిన సంగతీ, తాను రంగానికి పారిపోవడం, తల్లిదండ్రులకు తాను వ్రాయించిన యుత్తరాలు, అప్పుడప్పుడు పంపించిన పదీ పాతికి, తండ్రికి అప్పిచ్చిన తణఖాదారుడు వ్యాజ్యమేసి వేలంలో ఇల్లూ దొడ్డీ తనే పాడుకోవడం, ఒకరి తరువాత ఒకరు తల్లీ తండ్రీ చనిపోవడం, ఇవన్నీ ఒక్కసారిగా తెరమీద బొమ్మల్లా అతని మనోనేత్రాల ఎదుట ఆడిపోయాయి. తాను పోగుచేసుకున్న డబ్బు సంగ్రహించుకొని పచ్చలయ్య స్వగ్రామమైన ఉండీ అగ్రహారం చేరుకున్నాడు. తొలకరి వానలు కురిసి, బీటలుకట్టి యెండిఉన్న పొలాలు తడిసి, ఆ పొలాల్లోంచి వస్తూన్న సువాసన పచ్చలయ్యకి హాయి సమకూర్చింది. పొలాలన్నీ ప్రాణాలున్న వ్యక్తులై పచ్చలయ్యకు ప్రత్యక్షమయ్యాయి. అతని అదృష్టం కొలది స్వగ్రామంలో కాలవగట్టున రెండెకరాలపొలం అమ్మకానికి వచ్చింది. వెనక్కూ ముందుకూ సాగించి క్రిందామీదాపడి, పచ్చలయ్య ఆ భూమిని రెండువేల రెండువందలకుస్వాధీనం చేసుకున్నాడు. ఉండీ సబురిజిస్ట్రారు ఆఫీసులో పత్రం రిజిష్టరు చేయించి మహాపట్టణమైన రంగాన్ని పరిపాలించిన పచ్చలయ్య నూరురూపాయల కొక ఎద్దుల జత, ఇరవై రూపాయలకొక నాగలి కొని వ్యవసాయం ప్రారంభించాడు. వ్యవసాయం అతనికి ఆనంద పూర్ణమైన తపస్సు అయినది. పొలం మరమ్మతు చేయించినాడు. పాటిమన్ను తోలించాడు. ఆ పొలం బాలికను తానుకన్న కూతుర్ని చేసుకున్నాడు. ఆమెను అలంకరించాడు. ఆటలు నేర్పాడు. పాటలు నేర్పాడు, చుట్టూ పెద్ద గట్టువేయించి తోట తయారుచేశాడు. తూర్పు గట్టుమీద తాను పాక వేసుకుని పొలంలోనే మకాంపెట్టాడు.
3
పచ్చలయ్య అనవసరంగా ఎవ్వరితోనూ మాటలాడే వాడుకాడు. తన రెండెకరాలు వ్యవసాయమూ లేనప్పుడు తన పొలంగట్లమీద కలకలలాడుతూ అవతరించిన తోటకి సేవచేయడం, కష్టాల్లో ఉన్న బీదరైతులకు కానో కాసో రహస్యంగా సాయంచేయడం ఇదే అతని జీవితమార్గం. పచ్చగాఉన్న పచ్చలయ్యమాట అందరికీ పథ్యంకాసాగింది. రెండెకరాలకు నలభైబస్తాలు పండుతాయి. అమ్మితే కరువురోజులలో కూడా అతనికి రెండువందలు వస్తాయి. ఎద్దుల మేతకు, తన భోజనానికి సంవత్సరానికి రెండువందల నలభై ఖర్చు అవుతున్నది. పళ్ళకూ, కూరగాయలకు, కొబ్బరికాయలకు, గట్టుల మోసే మినుములకూ కందులకూ సాలుకు రెండువందలు వస్తున్నవి. ఆకుమళ్ళకు నూరురూపాయ లాదాయం వస్తుంది. ఖర్చులు వ్యవసాయానికంతకూ యాభై అవుతుంది. లెక్కలన్నీ చూసుకుంటే పన్నులు, మామూళ్ళు, మళ్ళీ తిరిగిరాని చేబదుళ్ళూ, వారికీ వీరికి సహాయాలూ అన్నీ పోతే అతనికి సాలుకు నూరు, నూటయాభై రూపాయలు మిగుల్తున్నాయి. ఈ పదేళ్ళలో తన పొలంలో రూపాయి కాసులుగా మార్చుకొని, ఎక్కడ దాస్తాడో పచ్చలయ్యకు పన్నెండు వందల రూపాయలు పోగయ్యాయి. అడివి బాపిరాజు రచనలు - 8 • 18 • కథలు 4
పచ్చలయ్యకు అరవైఏడో ఈడు వచ్చింది. అతనిది విజయనగరం పక్కగ్రామం. ఆరోగ్యం ఎప్పుడూ చెదరదు. కాని పచ్చలయ్యకి ఆవేదన ఎక్కువైంది. తన కూతురు “పొలం లచ్చిమి” పెద్దదయింది. ఈడు వచ్చింది. ఈ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్ళిచేసేది. మంచి సంపాదన పరురాలు. ఇవాళ కాకపోతే తన తదనంతరమన్నా అమ్మాయిని ఎవరో పెళ్ళి చేసుకోవలసినవారే! తానూ పెద్దవాడవుతున్నాడు. విశాఖపట్నం సీమవాడు అతని తాత. అతనిచుట్టాలు ఉండీ గ్రామంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తన అక్క అప్పలమ్మ, తన మేనల్లుడు సోమన్న ఉన్నారు. తన అక్క మొగుడు పోయిన వెనక కరణంగారి ఇంట్లో పనిచేసుకుంటోంది. మేనల్లుడు పెద్దకాపు సుబ్బన్న నాయుడుగారికి పాలేరు. కాని ఆ కుఱ్ఱకుంక ఇరవై అయిదేళ్ళొచ్చి పెళ్ళాన్నొదిలేసి, ఉండికాల్వ వంతెన పక్క కొత్తగా పెట్టిన హోటలులో ఓ అమ్మాయిని మరిగాడు. అలాంటి ఎదవకు తన కన్న తల్లిని తన బంగారు బొమ్మను “లచ్చిమిని” ఇస్తే దాన్ని గంగలో కలిపేస్తాడుకదా, అనుకున్నాడు. ఆ వేసవిరాత్రి బీరపాదులు పెట్టిన తన పొలంలోకి వెళ్ళి ఓ గట్టుమీద కూర్చున్నాడు. "ఓలమ్మీ లచ్చిమీ! ఏటంతవు? నిన్నింతదాన్ని చేసి పెంచుకొన్నా, నీకు పెళ్ళి సేయకపోతే ఏటనుకుంటుంది నోకం?” ఇంట్లో ఆ పొలంకన్నె పధ్నాలుగేండ్ల బాలికలా వచ్చినట్లయింది అతనికి. ఆ అమ్మాయివచ్చి అతనిపక్క కూచుంది. లచ్చిమి: ఓరయ్య, నేనేటనేది. నాకిప్పుడేటి పెళ్ళి! యారన్నా నవ్విపోతరు. అందులో ఓయిబాబు! ఏ పందిగాడన్నా నా మొగుడైతే నా తిప్పలా సింహాదిరప్పన్న కూడ సయించలేనంత అయిపోతది బాబూ! పచ్చ: నాకన్నతల్లివి గావంటో? లచ్చి: అయ్యా! మంచి మొగుణ్ణి నానే యేరుకుంతాను గాదేంటి? పచ్చ: ఎప్పుడేరుకుంతవులమ్మీ! లచ్చి: బాబూ! నీ కెందు కంతగొడవ. నానే సెపుతాను గాదంట్రా! పచ్చ: నా నెల్లి తొంగుంటాలమ్మీ. లచ్చి: బాబూ, నువ్వు తొంగో, నేను సూత్తా ఉంటానులే. ఈ సంభాషణ అతనికి ఏమాత్రమూ అనుమానం లేని నిజం. పచ్చలయ్య సంతోషంవచ్చి నిద్రపోయాడు. లచ్చిమి ఆ వెన్నెట్లో అలా పవ్వళించి కన్ను మూసింది. అడివి బాపిరాజు రచనలు - 8 - 19 -> కథలు 5
ఆ మర్నాడు పచ్చలయ్య మేనల్లుడు సోమన్న భార్య పైడమ్మ పచ్చలయ్య దగ్గరకు వచ్చింది. పైడమ్మ: బాబూ, నీ అల్లుడి యిసయం అంతకన్న ఎక్కువౌతోంది బాబూ! నిన్న రేతిరి తాగి ఇంటికాడ కొచ్చినాడు. ఇంటికాడ మా అత్తతో దెబ్బనాట వేసుకున్నాడు. ఆపళంగా కోపంతో వచ్చి, నన్ను సావగొట్టితూలి పడిపోయి, ఈత దుమ్మునాగు గుట్టెట్టి నిదరోయాడు బాబూ, నువ్వు తప్ప ఆడిని మంచిదారిలోకి ఇంకేరు పెడతారు చెప్పూ! పచ్చ: పైడమ్మా! నీవన్నదంతా సత్తెమే! నాను మాత్రమేటి చేసేది తల్లీ! భగవంతుడు రచ్చించాల. నువెళ్ళి ఏ అమ్మవారికో దణ్ణాలెట్టుకుంటూ ఉండంతె! పైడమ్మ: బాబూ, నన్ను సంపెత్తడు నీ అల్లుడు. నాకు బయమేత్తదయ్యా! నిన్నరేతిరి పెద్ద కత్తుచ్చుకొని, 'నంజా పతివోడి పక్కలోకి యెడతావున్నావా. నిన్ను సంపేసి నాను సంపేస్కుంతను' అని ఆ కమ్మకత్తి నాక్కొని నాకాడి కొచ్చాడు. యేటి సేయమంతవు పచ్చలాయి బాబూ? పైడమ్మ కళ్ళ మహానదులు ప్రవహిస్తుండగా కుళ్ళిపోయింది. పచ్చలయ్యకు చటుక్కున తనలచ్చిమిని సలహా అడిగితే, ఆమె సరియైన మార్గం చెప్పాలి. తన కా ఆలోచన తట్టింది. తిన్నగా పొలంలోకి ఒక్కడూ పోయాడు. ఆ పచ్చని పొలం “ఏటిబాబూ, ఆడికి నానే బుద్ధి. సెపుతాగాదా!” అని జవాబిచ్చినట్లయింది. తిన్నగా తన పాకలోకొచ్చి “పైడీ! యెల్లి మా అక్కను నాను రమ్మంతున్నానని తీసుకురాయే! మా అక్క, నువ్వూ ఇక్కడే నాలుగురోజులపాటు వుందురుగాని” అని ఆమెను పంపించినాడు. పైడమ్మ వెళ్ళి ఒక గంటలో, తన అత్త అప్పమ్మని తీసుకుచక్కా వచ్చింది.
6
ఇంటికొచ్చేటప్పటికి పైడమ్మా కనబళ్ళేదు, తల్లి అప్పలమ్మా కనబళ్ళేదు సోమన్నకు! తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రచేసుకొని పక్క దాంట్లో ముసలిదా న్నడిగాడు. "ఆళ్ళు నీ మామింటికి పొలం పోయారు సోమన్నా” అన్న దా ముసలిది. “ఏటీ! ఎళ్ళారు, ఆ ముసలెదవదగ్గరికి? ఆణ్ణి సంపేసి, నాను సంపేస్కుంతా” అంటూ దుడ్డుకర్ర పుచ్చుకొని మేనమామ పొలానికి తన పేట నుంచీ ఎల్లాతూలుతూ, కేకవేసుకొంటూ ఉండీ నుంచి ఉండీ అగ్రహార పొలిమేరకు కాలవగట్టుననే నడుస్తూ వచ్చాడు. రెండు మూడు సారులు పడ్డాడు లేచాడు. మళ్ళీ సాగించాడు. ఉండీ తూరుపుకాపుల గూడెంలో సోమన్న మామని చంపేస్తాడేమో నని అల్లరి బయలుదేరి పెద్దలూ పిన్నలూ కర్రలు పుచ్చుకొని పచ్చలయ్య పొలానికి నడక సాగించారు. గజం చుట్టలు వెలిగించారు. కుర్రవాళ్ళు బీడీలు వెలిగించారు. జట్కాతోలే రామన్న సిగరెట్టు వెలిగించాడు. అడివి బాపిరాజు రచనలు 8 ♦ 20 కథలు వాళ్ళంతా పచ్చలయ్య పొలం దగ్గరకు వచ్చి కాల్వలో దిగి దాటి అవతలగట్టునే ఉన్న పచ్చలయ్య పొలం గట్టుమీదకు వెళ్ళి "పచ్చలయ్యా" అని పిలిచారు. అదివరకే వాళ్ళందరూ వచ్చే ఈవతలిగట్టు నుంచే "పచ్చలయ్యా" అని వాళ్ళు కేకవేశారు. వాళ్ళందరూ తన పాకున్న పొలం గట్టుమీదకు రాగానే పచ్చలయ్య నిద్రలేచి "ఏటిరా అది! అల్లాగా కేకలెడుతున్నా”రని అంటూ పైకివచ్చాడు. పైడమ్మ, అప్పలమ్మ పైకివచ్చారు. ఒకడు: సోములు ఇక్కడకు రాలేదురా మావా? పచ్చ: రాలేదురా! ఆ డేమయ్యాడేంటి? ఇంకొకడు: ఏమో నిన్ను సంపేత్తనని ఇక్కడకు బయలుదేరి నాడంట. పచ్చ: ఏమై ఉంటాడు. మీకు దారిలో కాపడలేదంట్రా? మొదటివాడు: అబ్బే! ఇంతట్లో పైడమ్మ హర్రికేన్ దీపము వెలిగించి తీసుకొనివచ్చింది. అందరూ సోమన్నను వెదకటానికి బయలుదేరి ఒకవేళ వంతెన దగ్గర ఆవలి ఒడ్డుకు దాటివస్తూ, తాగి ఉన్నాడు గనుక దారిలో పడిపోయి ఉండవచ్చునేమో యని ఆలోచించారు. దీపం పట్టుకొని ఒకడు ముందు నడిచాడు. తర్వాత అందరూ బయలుదేరారు. నాలుగు అడుగులు వేయగానే, వెనక వచ్చే ఒక పడుచువానికి పచ్చలయ్య పొలంలో ఏదో తెల్లగా పడిఉన్నట్టు కనబడింది. “అదేదో సూసొత్తాను” అని లాంతరు పుచ్చుకొని పొలంలోకి దిగి, ఆ వస్తువు దగ్గరకు వెళ్ళి చూసీ చూడటంతోనే “ఓరి రండల్లో. ఇక్కడ పడున్నాడు సోమన్నగాడో" అని కేకేశాడు. అందరూ పొలంలోకి పరుగెత్తారు. ఆ పొలంలో ఒళ్ళు తెలియకుండా సోమన్న పడివున్నాడు. పచ్చలయ్య వంగి సోమన్న గుండెలో చేయిపెట్టిచూచాడు. గుండె దడ దడ కొట్టుకుంటోంది. “ఈడికీ మత్తుతప్ప మరేం జబ్బు లేదర్రా” అన్నాడు. ఇద్దరు సోమన్నను పైకెత్తి పొలంలోంచి పచ్చలయ్య పూరింటి దగ్గిరకు తీసుకుని వచ్చారు. పచ్చ: ఆణ్ణి అల్లా తొంగోబెట్టి మీ రెల్లండర్రా మీకు నా దండాలు. మొదటి: ఈ కుంకన్నగాడికీ మెలకువవత్తే, అల్లరిచేత్తాడేమో పచ్చలాయి! పచ్చ: మెలకువ తెల్లారిందనకా వస్తుందా? వచ్చినా ఈణ్ణాంటి పదిమందిని మడతలేసి సితకమొడి సెయ్యగల్ను. రెండవ: ఓరి యెంకటసామి, పచ్చలయ్య మొన్నకాలవలో మెరకట్టిన పన్నెండు టన్నుల నావను తలకాడెత్తి, ఎనక్కునెట్టిన సంగతి యెరగవేంట్రా? వారందరు కొంచెంసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు సెప్పుకొని, పచ్చలయ్యా అప్పలమ్మలదగ్గిర సెలవు పుచ్చుకొని తమ పేటకు వెళ్ళిపోయినారు. అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 21 కథలు 7
తెల్లారిన రెండుగంటలకు సోమన్న లేచినాడు. తానెక్కడవున్నదీ సోమన్నకు తెలియలేదు. చేతులతో తలపట్టుకొని “నా ఎదవమతి! ఎక్కడున్నానేంటి!” అనుకున్నాడు. అతనికళ్ళు తిరిగి మూతలుపడిపోనాయి కాని ఒక్కసారిగా అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. తాగివున్న అంతమత్తులోనూ, రాత్రి జరిగిన ఒక సంఘటన గుండెను గుద్ది చెప్పినట్లుగా జ్ఞాపకం వచ్చింది. తాను తనమామ పొలందగ్గరకు వచ్చాడు. గట్టు తప్పి పొలంలోకి వెళ్ళాడు. అప్పుడెల్లా వచ్చిందో నీళ్ళల్లో పడినట్లే మెలకువ వచ్చింది. ఈ పొలం రాత్రి ఎంత అందంగా కనబడింది. "ఆ కాఫీ హోటలుపిల్ల దొంగనానంజ నా నెల్లేసరికి, ఆడెవడిపక్కనో తొంగొనుంది. ఓలబ్బో మాచెడ్డ కోపమొచ్చేసి ఆళ్ళిద్దరినీ సంపేసేద్దామని మీదపడేటప్పటికి ఆ కొత్తోడు, నెగిసి సావకొట్టి, యిడిసిపెట్టాడు. ఈడి పొగరు ఇల్లాఉందిరా అని, నానెళ్ళి సారాయి దుకాణం కాడ రెండు బుడ్లు లోనేసి, కత్తికోసం ఇంటికెళ్ళాను. ఆ తరువాత నాకేం తెలుసు. మామ పొలంలో ఉన్నాను గందా ఆపైన నాకు చటుక్కున తెలివొచ్చి సూత్తే మామపొలం. అది పొలమేటి, అది బంగారుపిల్ల కాదంట్రా! ఆ సీకటంతా ఎన్నెలే అయిపోయింది. ఆ పొలం సూత్తే మామెంత దేముడంటివాడో గాపకం వచ్చి, మా దుక్కమేసి పొలంలో పడిపోయి యేడిసినాగందా ఆ తర్వాత నాకు నిదరే పట్టేసింది" అని తనచుట్టూ చేరిన పచ్చలయ్యతో, పైడమ్మతో అప్పలమ్మతో సోమన్న సిగ్గుపడుతూ చెప్పాడు. సోమన్న: మావాఁ! ఏటి సేయమంతవు, రాత్రి నీపొలంలో కాలెట్టానా. అంత దుక్క మొచ్చిందేమిటి? అప్ప: ఓరి కుంకన్నా, మామపొలంలో కడుగెట్టడానికి నీకేమి అక్కుందిరా? పచ్చ: నీ కిట్టమొత్తే నా పొలం గట్టుమీద నీ బారియతో నుండు. యేరే సిన్నిల్లేసుకుందాం. నానూ, మా అక్కా మా ఇంటిలో ఉంటాం. అప్ప: రోజూ తాగొచ్చి, పుత్తెగట్టిన పుత్తడి బొమ్మంటి పిల్లదాన్ని కొట్టే చచ్చుకుంకకి ఇక్కడ కాపురమేటిరా తమ్ముడూ. పచ్చ: నా లచ్చిమి ఈడు తాగొత్తే ఇక్కడకురానిత్తందనే నీ ఉద్దేశం? పైడ: బాబూ, నీకింత సాకిరిచేసుకుంటూ పడుంటాను, ఆడు నన్ను చంపేత్తాడని భయంకాదు. ఆ తాగొచ్చినప్పుడే డనేటి మాటలు రామసెంద్రా! పాపం వొరుసం కురుత్తాదికందా!
8
సోమన్న సిగ్గుపడి లేచి ఆ పొలం మాలక్ష్మిలోనికి నడిచిపోయాడు. అక్కడ ఒక మడిగట్టుమీద కూర్చుండి, ఏదో ఆలోచనలోపడినాడు. అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 22. కథలు తన మామ ఈ పొలానికి లచ్చిమి అని పేరెట్టుకున్నాడు. ఎంత సక్కని, ఎంత సక్కని పొలం! తనమామ పచ్చలయ్య దేముడంటివాడు. ఎన్నిసార్లు తనకూ తన కుటుంబానికి సాయం రాలేదు. అంత ముసలోడు ఆ పనేంటి ఆ సగితేంటి? లచ్చిమీదేవే ఈ పొలం. తాను ఈ లచ్చిమీదేవి దగ్గిర నుంచోడానికైనా తగడుకందా! ఈ పొలం లచ్చిమిని కావులించుకోవాలి. తన మావ తన కూతురంటా డీ పొలాన్ని, తన పైడి నిజంగా పైడిబొమ్మే! ఎన్నిమార్లు తాను దాన్ని ఏడిపించలేదు. ఉలక్కుండా మలక్కుండా ఎంత బగితితో తనకూ, తనమ్మకు శాకిరిసేత్తుందికాదు. ఆ దిగదుడిచిన ఓటలు సరుకు తన పైడికి మైలుదూరంలో నుంచోడానికి వొల్లా? ఆ సచ్చు సరుకులు ఈ పొలం లచ్చిమికి రావడానికి వొల్లా! ఏటి తనకీ పోగాలం. ఎదవ తాగుడు. మా అయ్య ఎప్పుడైనా తాగినాడా. సంపాయించినా ఎకరాపొలం నేను ముణసబుగారి కమ్మేసినానుగందా! తల్లీ, పొలం మాలచ్చిమీ అంటే నన్ను రచ్చిత్తాది. లేకుంటే నాకూ దానికి ఏమి సమ్మందం. "పెళ్ళాం మెళ్ళో గుల్లలు తాగురమ్మగోరి వొళ్లో ఏసేసినాను. "పొలం లచ్చిమీ! కుక్కబతుకు బతికినాను. నన్ను రచ్చించాలి.” ఆ పొలం బాలిక నవ్వినట్లయింది సోమన్నకు. ఆ పొలంలో సాగిలపడ్డాడు సోమన్న. అతని కళ్ళవెంట ఉండి కాల్వలునూరు ప్రవహించాయి. పొలంలచ్చిమి చిరునవ్వు నవ్వి లే సోమన్నా! నన్నూ పైడమ్మను ఆపేచ్చతో సూత్తానని మాటియ్యి. మాట తప్పావా! నువ్వు నాశనమైపోతవు. నా శకితి అలాటిది. మామమాట తప్పక బుద్ధితో మసలు, నేనూ పైడమ్మా నీకిద్దరం పెళ్ళాలము' అని పలికినట్లు అతని హృదయానకు తట్టింది.
9
చిరునవ్వు నవ్వుకుంటూ, కళ్ళనీరు కారుస్తూ సోమన్న మేనమామ కాళ్ళమీద పడ్డాడు. “మామా! మా బాబు పేరు హచ్చి. నువ్వు సెప్పింది ఇనుకుంటా! ఈ పొలం పొలిమీరదాటి వెళ్ళితే నన్ను బలెయ్యి!" అన్నాడు. అతని మాటలలో సత్యవాక్కు వారి హృదయాలలో మారు మ్రోగినది. అప్పలమ్మ 'సింహాదిరప్పన్నా, నీ దయ' అంది. పచ్చలయ్య 'నా లచ్చిమి, నువ్వు బర్తనేరుకున్నావా తల్లీ' అనుకున్నాడు. పైడమ్మ ముసిముసి నవ్వును నవ్వుకొని పైటసర్దుకొంది. పొలం కన్నె లచ్చిమి సిగ్గుతో తనపైట తాను సర్దుకొంది. అడివి బాపిరాజు రచనలు 8 ◆ 23 కథలు అసుర కన్య
మొదటిభాగం
కక్షీవంత మహాఋషి కుమారుడు సుధన్వుడు సూర్యాశ్వంలా బలిష్ఠుడు, ఇంద్రునివలె ఆజానుబాహుడు. అతని నవ్వులు ఆశ్వనీ నక్షత్రంలో చేరిన రాకాచంద్రుని కిరణాలు. అతని కోపము ఆరుద్రాయుక్తాదిత్య మాసమేఘపర్తిత శంపాలతవలె జాజ్వల్యమానమైంది. సుధన్వుని సౌహార్దము కమలదళశీతలము. అతని ధనర్విముక్త శరీరము ఇంద్రవజ్రసమము. అతని యుద్ధ నాయకత్వము వృత్రాసురుని ఎదుర్కొనే ఇంద్రవిజయత్వం వంటిది. పవిత్ర మంత్రద్రష్ట కక్షివంతుడు తన కుమారుని దస్యమారు డితడే అని ఆశీర్వదించాడు. తల్లిదండ్రులకు మ్రొక్కి అనుమతి పొంది ఆర్యసైన్యాలను నడుపుకొంటూ సింధూనదితరంగాలను నావలలో దాటాడు సుధన్వుడు. పర్వతాలు దాటి, అసురదేశంలో విడిదిచేసి అసుర రాజును యుద్ధానికి పిలిచాడు. అసురులు ఉత్తమనాగరికులు. మిత్రావరుణాది దేవతాభక్తులైన ఆర్యులకు విరోధులు. ఆర్యరాజైన సుధన్వుడు ఉత్తమవీరు లధివసించి ఉన్న రథాలతో, గాలిలో ఎగిరే ఉత్తరీయాంచలాలు కలిగిన ఆశ్వికులతో తమ రాజ్యంలోనికి చొచ్చి వచ్చాడని తెలియగానే అసురులు అఖండ క్రోధంచేత మండిపోయారు. వారికళ్ళళ్ళో విస్ఫులింగాలు రాలాయి. ఉషాబాల దరస్మిత కాంతులు ప్రసరించిన మంచుశిఖరాల బోలిన సత్వులైన అసురులు అశ్వాలను రథాలకు పూన్చి ఉత్తమజానేయాల అధివసించి ఆర్యుల నాశనం చేయడానికి సైన్యాల ఆయత్తం చేసుకొని వచ్చారు.
2
అసురరాజ కుమార్తె పంచర నవ యౌవనవతి. పద్దెన్మిది వర్షాల పారిజాత పుష్పంలాంటి ఎరుపు తెలుపుల అందాల బొమ్మ. పుత్రులు లేని అసురరాజు పుత్రికను వీరునిలా పెంచాడు. ఆమె కవచం ధరించి, మూడుధనువుల బల్లెము ముష్టిని పట్టింది. తండ్రికి చక్రరక్షకురాలై ఒక ఉన్నతాశ్వాన్ని అధివసించి యుద్ధానికి బయలుదేరింది.
అడివి బాపిరాజు రచనలు - 8 • 24 • కథలు మేరుపర్వత సానువుల మిలమిలలాడే లేత దేవదారు సౌష్ఠవంతో వెన్నెలలో సాయంకాలపు ఉషఃకాంతులు రంగరించిన శరీరకాంతిలో వెలిగే తన బాలికను చూచి అసురరాజు గర్వంతో రథంమీద నిలిచినాడు. ఆమె అధివసించిన ధవళాశ్వం తన్ను స్వారీచేసే సుందర మూర్తిని ఎరిగివున్నదా అన్నట్లు గర్వంతో, వేగంతో, అసురరథాశ్వాలను పందేనికి ఆహ్వానిస్తున్నది. బంగారు శిరస్త్రాణం క్రింద నర్తించే ముంగురులు ఆమె దివ్య సుందర వదనాన్ని ఇంకా మనోహరంగా పనిచేస్తూండగా, ఆమె చిరునవ్వులను దిరిశనపూవులులా విరజిల్లుతూ స్వారిచేస్తున్నది. తమస్సులను పోగొట్టు సౌందర్య స్వరూపురాలైన పాంచర వేగముగా గుఱ్ఱాన్ని తోలుతూ తండ్రిని అనుసరిస్తున్నది. తెలుపు ఎరుపుల కాంతితో ఉషోదేవిలా ఆ పాంచర సూర్యునివంటి తండ్రి రథానికి ముందు వస్తున్నది. ఇంతలో రెండు సైన్యాలు తలపడినవి. అసురులు, మహావీరులు, దృఢకాయులు. ఆర్యులు మగటిమిగల బంటులు. అసురార్యులు ఒకే రూపురేఖా విలాసాలు కలవారు. ఆ సంకుల సమరంలో కవచాదులలో మాత్రం భేదాలున్న ఆ రెండు సైన్యాల వీరులు పాల సముద్రంలో సుడిగుండములోని కెరటాలవలె పోరుసల్పినారు. పోరు ఘోరమైంది. శరశూలభల్ల ఖడ్గకాంతులు, ముసలముద్గర పరశుగదాద్యాయుధ తాడన నినాదాలు, ఇంద్రుడు మేఘాలతో ఆకాశాన అవతరించినట్లే అయింది. పాంచర తండ్రి ప్రక్కనే ఉండి తండ్రినీ తన్నూ కాపాడుకొంటూ భయంకర యుద్ధం చేస్తూ ఉన్నది. అంతలో అసురార్య యుద్ధనాయకులిర్వురూ ద్వంద్వయుద్దాన ఒకరి నొకరు మార్కొన్నారు.
3
యుద్ధారంభం నుండి సుధన్వుడు మేఘాలను దూరివచ్చే వజ్రపాతంలా పొగమంచును చీల్చివచ్చే సూర్యకిరణంలా, అసురసైన్యాలను చొచ్చి, శంఖం పూరిస్తూ తన సైన్యాలను చేయివిసిరి, విజృంభింపచేస్తూ, అసురనాయకుల్ని బాణాలతో, వివిధాయుధ ప్రయోగాలతో నిర్జిస్తూ పూలతో నిండిన మోదుగచెట్టులా రక్తసిక్తాంగుడై, ఏమీ చలింపకుండా వేగంతో యుద్ధవిక్రాంతుడైనాడు. అతడు మహావేగంతో అసురరాజును ఎప్పుడు కదిపినాడో, ఆ తక్షణమే చక్రరక్షకురాలై ఆర్యసైన్యం చెండాడే ఉషోదేవిలా ఉన్న పాంచర ముందుకు వచ్చి సుధన్వుని తలపడింది. ఆర్యరా జా బాలకునివలె నున్న పాంచరను చూచినాడు. బాలుడే అనుకున్నాడు. సుధన్వునకు పాంచర పదునాలుగేండ్ల బాలికవలెనే తోచింది.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 25 + కథలు సుధన్వుడు: ఓయి బాలకా, నువ్వు చిన్నవాడవు, నీ తండ్రి పెద్దవాడు. మీ కేతనము మాకు లొంగినట్లు ఒకసారి దింపండి, మీరూ మేమూ సమాధానం కుదుర్చుకొని ఎవరిదారిని వాళ్ళు పోదాంగాక! పాంచర: ఓయి ఆర్యవీరుడా! యుద్ధంచేసి అలసి వున్నావు. నీ కవచంలోంచి రక్తం సూర్యరథానికి ముందు ప్రవహించే ఎఱ్ఱని కాంతిధారల్లా ప్రవహిస్తూ ఉంది. నువ్వే నీ పతాకాన్ని దింపినట్లయితే, నువ్వు నీ దేహం బాగుపడేవరకూ మా కోటలో అతిథిగా ఉండవచ్చును. మీ సైన్యాలు మా రాజ్యానికి అతిథులు. సుధ: ఓ పుణ్యమూర్తీ! నీ మాటలు మధురాలు కురిసే కలకంఠి కంఠ స్రవితగాన స్వనాలులా వినబడుతున్నాయి. ఇంత చిన్నతనంలో నీకు యుద్ధమేమిటయ్యా? పాంచర: ఓయి యుద్ధమే జీవితం చేసుకొన్న కర్కశుడా! నీకు బాలుడెవరో, బాలిక ఎవరో తెలియదా? ఇవిగో నా బాణాలు రుచిచూడు. ఇవి వాలుచూపులుకావు. ప్రాణాలు హరించే తూపులుసుమా!
4
సుధన్వుడు బాల సౌందర్యానికి ఆనందించి ఉప్పొంగిపోయాడు. ఈ బాలవీరుడు బాలికా? ఓహో, ఏమా బాలిక సౌందర్యము! భూమి దున్నిన వెనక విత్తులుజల్లగా ఇంద్రదేవుడు తన మేఘాలతో చల్లని వృష్టి కురిపించినప్పుడు బయలుదేరిన పచ్చని మొక్కలతో నిండి ఉన్న పొలంలా ఉన్నది! ఆ బాలిక అందము, వెన్నెల ప్రసరిస్తుండగా, ఆ వెలుగులోని అమృతం ఆస్వాదిస్తూ తీవలు సారించిన, దేవతలకు అతిప్రియమైన సోమలతలా ఉన్నది. ఆ బాలిక మనోజ్ఞత్వము హిమాలయశిఖరాల పుట్టి గీతాలాలపిస్తూ లోయలలో ప్రవహించే వితస్తానది ప్రవహింపులా ఉన్నది. సుధన్వుడు ఈ ఆలోచనలు తన హృదయాన్ని వెన్నెల నింపగా తన రథం మీదనుంచి డిగ్గనురికాడు. అత డా రథముమీదే పగ్గాలు విడిచినాడు. అతడు ఆ రథం మీదనుంచి యజ్ఞభాగం భోగించడానికి ఆకాశంనుంచి దిగివచ్చే మరుత్తునిలా ఉన్నాడు. అతడు తన మీదపడే అసురుల బాణాలు లెక్కచేయలేదు. అత డాయుధాలన్నీ రథంమీదనే ఉంచివేశాడు. అతని చిరునవ్వు మోము, అతని వెలిగిపోయే ఫాలం, అతని విశాలమైన కన్నులు, అతని సమున్నత మూర్తిత్వము, అతని విక్రమము, అతని అశ్వినీదేవ సౌందర్యము, అసురవీరుల్ని సమ్మోహపరచింది. అసురవీరులందరు యుద్ధము మాని, అతనివైపే చూస్తూ ఉండిరి. ఆర్యనాయకులూ యుద్ధం మానివేశారు. పాంచరవైపు చూస్తూ “ఓ దివ్యసౌందర్యగాత్రీ, ఓ ఇంద్రాణి వంటి పరాక్రమం కలదానా, నిన్ను వాయుదేవుడు మేఘాలను కొనిపోయినట్లుగా మా సప్తసింధు దేశానికి కొనిపోగలను. ఓ అనన్యదివ్యమనోహరరూపంకల అమరకన్యా, ఓ బాడలివంటి తేజస్సు కలదానా, నిన్ను ఆదిత్యుడు బాడలియైన సంజ్ఞాదేవిని సముద్రంలోనుండి కొనిపోయినట్లు కొనిపోగలను" అని ఉచ్ఛైస్వనాన్ని కేకవేసి సముద్రకెరటంలా కదిలాడు. సింహంలా ముందుకు సాగాడు.
అడివి బాపిరాజు రచనలు 8 ◆ ♦ 26- కథలు "ఓ ఆర్యశూరుడా! రావయ్యా నా దగ్గరకు; నేనే నిన్ను జయించి నిన్ను నేను ప్రియుణ్ణి చేసుకొని, తన హృదయంలో యామినీ చంద్రుణ్ణి దాచుకొన్నట్టు నిన్ను దాచుకొంటాను. ఓ మిత్రునివంటి పరాక్రమం కలవాడా, ఓ అగ్నివంటి తేజస్సు కలవాడా, మంచి గంధం తరువు అగ్నిని దాచుకొన్నట్టు నిన్ను నా హృదయంలో దాచుకోగలను” అని కేకలేస్తూ గుఱ్ఱంపై రక్తసిక్తాంగియై పూవులు పూచిన ఫలాశవృక్షంలా అధివసించి ఉన్నది. తమ రాజకుమార్తెకు అడ్డం వచ్చిన అసురవీరుల్ని సుధన్వుడు లెక్కచేయక ముళ్ళడొంకలను విదల్చుకొనుచు తన ప్రియురాలైన ధేనువును కలిసికొనబోయే అడవి వృషభంలా, ఆవలి ఒడ్డున ఉన్న తన రాణిని చేర మహాప్రవాహం వడికి ఎదురీదిపోయే ఐరావతంలా, అతడు అసుర సైన్యాలను ఈవలావలకు నెట్టివేస్తూ పాంచర దగ్గిరకు చేరినాడు. పాంచర మహాసంతోషాన నవ్వుతూ, తన నిశితఖడ్గాన్ని మెరుము వైపు తిప్పి సుధన్వుడు నిరాయుధుడై ఉండడంచేత, మెరుము వేగంగా అతన్ని ప్రహరించడం ప్రారంభించింది. సుధన్వుడు తన తలమీద 'శిరస్త్రాణం పెరికి, ఎడమ ముష్టితో మహా వేగంతో పరపే ఆమె ఖడ్గప్రహారాలను ఆ శిరస్త్రాణంపై పడేటట్లు ఆమెను సమీపించి, కుడిచేత్తో ఆమె కుడిచేయిపట్టుకొని ఖడ్గంలాగి ఆవలకు విసరివైచాడు! ఇంద్రునివలె బలం గలవాడున్ను, అశ్వినీ కుమారులవలె అందగాడునూ, సవితృనివలె కాంతివంతుడును అగు సుధన్వుడు ఆమె నడుము చుట్టూ చేతులువేసి అశ్వాన్నుండి ఎత్తితీసి, ఆమెను గాఢంగా తన హృదయానికి అదుముకొన్నాడు. ఆమె సంతోషాన ముసిముసినవ్వులు నవ్వుతూ ఆ దృఢ పరిష్వంగనంలో ఇరికిపోయి, అసురవీరులు చూచి ఆశ్చర్యం పొందుతూ ఉండగా, తండ్రి అయిన అసురరాజు నివ్వెరగంది చూస్తూ ఉండగా, రెండు చేతులా అతని చంపలు చుట్టి అతని కళ్ళల్లోకి తేరి పారచూచింది. ఆమె చూపులు వెన్నెల కిరణాలు మానస సరోవరం లోతులలోనికి ప్రసరించి నట్లయింది. ఆమె చూపులు కల్పవృక్షంపైన అమృత వర్షం కురిసినట్లయినది. అత డామెను చూచి “ఓ హృదయేశ్వరీ! ఓ అసుర మహారాజ బాలికా, హిమాలయ పర్వతాగ్రాలు మేఘాలను ధరించినట్లుగా నిన్ను నా హృదయంలో ధరిస్తూన్నాను. నీ ప్రణయమంత్రము, కచుడు శుక్రునికడ గ్రహించిన మృత సంజీవినిలా మనఉభయసేనలకు అమృతత్వం ప్రసాదించుగాక!” అని అంటూ ఆమెను పెదువులపై ముద్దిడుకొన్నాడు. పాంచర గాయత్రీమంత్రం లాంటి పవిత్ర స్వరయుక్తంగా నవ్వింది. ఆమె సుధన్వుని హృదయంలో తన మోము దాచుకుంది. ఇంతలో సాయంకాలము ఆదిత్యుడూ, అతని వెలుగూ సముద్రంలో కుంకిపోయిన రీతిగా, దివ్యపరీమళావృతమైన పూవు చెట్టునుండి రాలిపోయిన రీతిగా, పాంచర కౌగిలిలో సుధన్వుడు ఆ యుద్ధభూమిలో కూలిపోయినాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 27 - కథలు సుధన్వుని ప్రాణాలు పాంచర ప్రాణాలు ఆ అమృత మృతిలో లీనమైపోయినవి. అసురసైన్యాలలో, ఆర్యసైన్యాలలో హాహాకారాలు మిన్ను ముట్టినాయి.
రెండవ భాగము
అహమ్మదాబాదు కాంగ్రెసు కాంధ్రదేశాన్నుండి ప్రతినిధులుగా వెళ్ళినవారిలో డాక్టరు వైకుంఠరావు ఎం.బి. అండ్ సి.యం. ఒకడు. వైకుంఠరావు మాంచి ఒడ్డూపొడుగూ ఉన్న మనిషి, ఆటలన్నిటిలో అందెవేసిన చెయ్యి. మద్రాసు వైద్యకళాశాల ఆట జట్టులన్నిటికీ నాయకుడు. విద్యార్థులలో మేటి అయిన టెన్నిస్ ఆటకాడు. న్యాయకళాశాల, పచ్చియప్ప కళాశాల, క్రిస్టియన్ కళాశాల, ప్రభుత్వ కళాశాలలు జట్టులలో ఒకటిన్నీ అతడు కాలేజీ విద్యార్థిగా ఉన్నంతకాలం కాలిబంతి, హాకీబంతి టెన్నిస్ ఆటలలో వైద్యకళాశాలతో పోటీచేసి మొదటిరంగమైనా దాటలేక పోయాయి. ఎన్నివేల సంవత్సరాలనుండో భారతదేశంలో విజృంభించిన ఆర్య వీరుల వీర్యమూ పరాక్రమమూ అతనిలో మూర్తీభవించాయిరా! అనేవారతని స్నేహితులు. నలుగురు స్నేహితులతోటి ప్రతినిధులుగా స్వగ్రామమైన గుడివాడ నుండి బయలుదేరి బెజవాడ, సికిందరాబాదు, ఎల్లోరా, అజంతా, జాల్ గాన్, బార్డోలీలమీదుగా అహమ్మదాబాదు చేరుకున్నాడు. అహమ్మదాబాద్ కాంగ్రెస్లో కుర్చీలూ బల్లలూ లేవు. అందరూ ఆ మహాశిబిరంలో క్రింద కూర్చోవలసిందే! ఒక ప్రక్క ఖిలాఫత్ మహాసభ, ఒక ప్రక్క స్వదేశీవస్తు, ఖాదీ ప్రదర్శనము. దేశ దేశాలనుండి వచ్చిన లక్షలకొలది జనం. అక్కడే సబర్మతీ నదీతీరాన్ని మహాత్ముని ఆశ్రమం. అహమ్మదాబాదు ఏనాటి భారతీయ మహోత్కృష్ట గాథలనో స్మరింపచేస్తున్నది. భారతదేశం తనకు త్వరలో విముక్తి వస్తున్నదని, పవిత్ర ప్రపంచ ప్రఖ్యాత అపర అహింసావతారమైన మహాత్ముని చూస్తూ మురిసి పోతున్నది. ఆ వైభవం స్నేహితులతో చూస్తూ భరతదేశంలో జరగబోయే అఖండ సత్యాగ్రహ యుద్ధానికి మహాత్మునికే నాయకత్వమిచ్చి శ్రీశ్రీ హకీం అజ్మాలానుగారి యాజమాన్యాన కాంగ్రెసు తీర్మానం చేసింది. వైద్య కళాశాలలో వైకుంఠరావు ఆఖరు సంవత్సరం చదువుతూ ఉండగా మహాత్ముని దివ్యవాక్యాలు భారతదేశం అంతా మారుమ్రోగాయి. వైకుంఠరావు ఆ తక్షణమే కళాశాల వెడలి పైకి వచ్చేద్దామనుకున్నాడు. కాని ఇంక మూడునెలలు ఓపికపట్టి ప్రభుత్వోద్యోగం కోసం తాను నిశ్చయించుకొన్న కార్యక్రమం మానివేసి విడిగా వైద్యవృత్తి చేసుకుంటూ కాంగ్రెసు కార్యక్రమంలో పాలుగొంటూ ఉండాలని వైకుంఠుడు నిశ్చయం చేసుకున్నాడు. నాగపూరు కాంగ్రెసుకు వెళ్ళాడు. అప్పటికి అతడు హౌసుసర్జను పనిలో ఉన్నాడు. ప్రసూతి వైద్యము, కళ్ళవైద్యం పూర్తిచేసి గుడివాడలో వైద్యవృత్తి ప్రారంభించాడు. ప్రారంభించిన మూడునెలలలో వైకుంఠునికి నెలకు అయిదారువందలు దొరుకుతున్నాయి.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 28 -> కథలు ఈ కారణాలన్నిటిచేత ఇదివరదాకా పెళ్ళిమాట తలపెట్టక, ఇప్పుడెందుకు సంగతి, తర్వాత చూచుకొనవచ్చునులే అని ఊరుకున్నాడు.
2
అహమ్మదాబాదు కాంగ్రెసు అద్భుతంగా జరిగింది. అక్కడనుండి స్నేహితులను 'ఆబూ పోయి దిలావరా గుడులను చూచి వద్దాం రండర్రా” అని ప్రోత్సహించాడు వైకుంఠరావు. ఢిల్లీ మేలెక్కి, ఆబూరోడ్డు స్టేషనులో దిగారు మన వాళ్ళందరూ. ఆ బండిలోనే ఆ సమయంలోనే తహిమీనా బాట్లివాలాకన్యయు, ఆమె తండ్రి బాట్లివాలాగారు కూడా మెయిలులో ఒక మొదటి తరగతి పెట్టిలోంచి దిగారు. తహిమీనా కన్య పార్శీ బాలికలలో దేవకన్యలాంటిది. గులోబకావళి కన్యకు అందాలు నేర్పే మనోహరాంగి. తహిమీనా ఇంగ్లండులో చదువుకుంది. ఆంగ్ల బాలలను వారి చదువులోనే వారిని తోసిరాజు చేసింది. ఆమె ఎం.ఏ., పిహెచ్.డి. పరీక్షలలో మొదటగా జయమంది ఇంటికి వచ్చింది. ఆమె ఇంగ్లండులో చదువుకొనే రోజులలో ఆటలలో మొదట - నాట్యంలో మొదట. భారతీయ బాలిక అయినా ఆమె అనేక ఆంగ్ల ఉన్నత కుటుంబాలవారి ఇళ్ళల్లో వారి కుటుంబాలలోని బాలికలాగే తిరిగేది. ఆమె అంటే అంత స్నేహం ఆ బ్రిటిషు బాలలకు. తహిమీనాను చూచిన వాళ్ళందరూ కొంచెం వేడి దేశంలో వున్న ఇంగ్లీషు బాలికే అనుకునేవారు. టెన్నిస్, పరుగు, ఈత పందేలలో మొదటగా వచ్చేది. తహిమీనాను ఒకరిద్దరు పెద్ద కుటుంబాల ఆంగ్ల బాలురు పెళ్ళి చేసుకుందామని చూశారుకూడా. ఎందుకనో తహిమీనాకు పెళ్ళి అంటే ఎప్పుడూ ఇష్టంలేదు. అనేక పార్శీ పెద్దలు ఆ బాలికకు చాలా మంచి సంబంధాలు తెచ్చారు. ఆ బాలిక స్త్రీగా ఎంత అందగత్తో, మగవీరుడులా అంత అల్లరి పిల్ల. ఎప్పుడూ మగవానిలా వేషం వేసుకుని గుర్రం స్వారి చేసేది. కారు నడిపేది. ప్రయాణంలో ఎప్పుడూ మగ వేషంలోనే ఉండేది.
3
బాట్లివాలాగారు కోటీశ్వరులు. ఆయన ఎన్నో కంపెనీలు పెట్టించి వాటిని అత్యంత లాభం కొనివచ్చే సంస్థల చేశాడు. ఎన్నో పరిశ్రమ సంస్థలకు ఆయన ముఖ్యాధ్యక్షుడు. ఆయన మొదటి నుంచి గాంధీమహాత్ముని శిష్యులలో ఒకడయ్యాడు. అందుచేతనే ఈ సంవత్సరానికి ముందు సంవత్సరంలో ఆయనకు ప్రభుత్వం పెద్ద బిరుదం ఇద్దామనుకున్నారు. కాని బాట్లివాలాగారు ఖండితంగా తన కక్కరలేదని కబురుచేశారు. తండ్రిగారూ కుమార్తెయూ అహమ్మదాబాదు కాంగ్రెసుకు బొంబాయి నుంచి ప్రతినిధులుగా వచ్చారు.
అడివి బాపిరాజు రచనలు. 8 1 • 29 • కథలు వారూ కాంగ్రెసు అయిపోగానే ఓరోజు ఆబూ చూచి మళ్ళీ వద్దామని బయలుదేరి వెళ్ళారు. ఆబూరోడ్డు స్టేషనులో ఒక మంచికారు వచ్చిఉంది. స్టేషన్లో దాదాభాయి మెనర్జీ తన చుట్టమైన బాట్లివాలా కుటుంబానికి కారు వేసుకొని వచ్చాడు ఆతిథ్యం ఇద్దామని. స్టేషన్లో బాట్లివాలా తండ్రి కుమార్తె లిద్దరకూ స్వాగతమిచ్చి ఆబూపట్నం తీసుకుపోయాడు దాదాభాయి. ఆ మెయిలుబండిలోంచి దిగి వైకుంఠరావు అతని స్నేహితులూ ఉదయము అక్కడ ఇన్ని పూరీలు తిని, పాలు తాగి బస్సుమీద ఆబూ చేరారు. ఆబూనగరం ఆరావళీ పర్వతాలలో దత్తాత్రేయ శిఖరానికి అయిదు వందల అడుగుల దిగువను ఉన్నది. ఆబూ ఎత్తు ఆరువేల అడుగులకు తక్కువగా ఉంటుంది. ఆబూ నగరానికి రోడ్డు వంకరటింకరగా పైకి ఎక్కుతుంది. బస్సు వెళ్ళుతూంటే రోడ్డుమీద ఒక పెద్దపులి పడుకుని ఉంది. బస్సు ఆపి విద్యుచ్ఛక్తి కొమ్ము, మామూలు బూరా అల్లరి హంగామాచేస్తే ఒక్క గంతువేసి దిగువ లోయలోకి పులి మాయమైంది. అందరి ప్రయాణికుల ప్రాణాలు లేచిపోయాయన్నమాటే. వైకుంఠ: ఒరే విశ్వం! ఇప్పటికి చూశానురా బరిమీద పెద్ద పులిని. విశ్వం: నేనూ పెద్దపులులను సర్కసులలోనూ, జంతు ప్రదర్శనశాలలోనేగా చూసిందీ. రామం: ఓహో ఏమి గొప్పగా ఉందిరా! ఏమి దర్జారా, మనకేసి నవ్వుతూ చూసినట్లుగా అయిందిరా. వైకుంఠ: దిగి వెళ్ళి దాన్ని తట్టి దాంతో ఆడుకుందామనిపించింది. కృష్ణమూర్తి: నువ్వు దుష్యంతుడు కొడుకువా? లేక కాశీ మజిలీ కథలోని సింహదమనుడ ననుకున్నావా? ఆబులో ఒక సత్రంలో మకాంపెట్టి మన స్నేహితులు దిలావరా గుళ్ళు చూశారు. అచలేశ్వర దేవాలయం చూశారు. దత్తాత్రేయ శిఖరం ఎక్కారు. మూడురోజులైన తర్వాత ఆబూనగరానికి రెండుమైళ్ళ దూరంలో ఒక లోయలో వశిష్టాశ్రమం చూడడానికి వెళ్ళారు.
4
వశిష్టాశ్రమం ఎంతో అందంగా ఉంది. ఎన్నో ఫలవృక్షాలున్నాయి. ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రకృతి దృశ్యము, అలాంటి ప్రదేశాలలో ఋషులు ఆశ్రమాలు ఏర్పాటుచేసుకున్న భావమూ సమన్వయం చేసుకుంటూ వైకుంఠరావు స్నేహితులూ తిరిగి అబూనగరం వస్తూ ఉన్నారు. చలి హిమాలయాలలోని చలిలా గజగజ వణికిస్తూ ఉంది. అయిదుగురు స్నేహితులూ మాట్లాడుకుంటూ వస్తూన్నారు. స్నేహితుల జట్టుకు ముందుగా, ఒక వృద్ధుడు ఒక బాలుడు ఆంగ్ల దుస్తులు ధరించి నడుస్తున్నారు. వృద్ధుని తలపై పార్శీటోపీ ఉంది. ఆ బాలుడు హేటు ధరించి ఉన్నాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 30 → కథలు ఇంతలో వెనకవచ్చే వైకుంఠరావు జట్టుకు “ఓహోహో” అన ఒక కేక వినబడింది. ఆ కేకలో ఏదో వర్ణింపలేని భయం గర్భీకృతమై తోచి, మన వాళ్ళందరు ముందరకు పరుగెత్తారు. ఆ ఇద్దరూ ఉన్న స్థలం దగ్గిరకు వెళ్ళగానే మనవాళ్ళ ప్రాణాలు నిలువునా తేలిపోయాయి. ఎదురు గుండా పడుకుని వీరి అందరివైపు ఒక మహావేదాంతిలా చూస్తోంది. ఒక పెద్దపులి. ఉన్నారు. మనవాళ్ళందరూ బిఱ్ర బిగుసుకుపోయారు! ఆ కొత్త పురుషులూ బిర్రబిగుసుకు ఇంతట్లో ఉరుములా ఒక పెద్ద బొబ్బపెట్టి తన చేతిలో విలాసంగా తిప్పుకుంటూ ఉన్న ఒక అడవి దుడ్డుకఱ్రను పైకెత్తి వీళ్ళందరికీ ముందుకు ఉరికాడు వైకుంఠరావు! ఆ కేకతో పెద్దపులికి ఏమి కంగారు పుట్టిందో ఓ చెంగున గంతువేసి ఆదారిపక్క దుబ్బుల్లోకి ఉరికి నిముషంలో మాయమయింది. చేరారు. ఆ పెద్దకేకలు వేసుకుంటూ ప్రాణాలు బిగపట్టుకుని వారందరూ ఆబూ నగరం బాట్లివాలాగారు వారందరికీ ముఖ్యంగా వైకుంఠరావుకీ కృతజ్ఞత తెల్పి తమ బస చేరుకున్నారు.
5
ఆబూ నగరం చుట్టుపక్కలు అంతా చూచి సామానును ఒక స్నేహితుణ్ణి బస్మీద పంపి, మిగతా నలుగురూ నడుస్తూ పాటలు పాడుకుంటూ, అయిదవ రోజు సాయంకాలం వైకుంఠరావు, స్నేహితులు ఆబూస్టేషనుకు పోతున్నారు. కొండదిగి కొంతదూరం పోయేటప్పటికి, ఆ రోడ్డుమీద ఒక కారు చుట్టూ ఒక భిల్లు జట్టు కనబడింది. వీళ్ళు నలుగురూ దగ్గరకు వెళ్ళేసరికి కొంతమంది బిల్లులు వచ్చి వీళ్ళని చుట్టుముట్టారు. వైకుంఠరావు నల్గురైదుగురు భిల్లులును బంతుల్లా పట్టి అవతలకు గిరవాటువేశాడు. 'ఒరే, వీళ్ళు గాంధిదేముడు జట్టువాళ్లురా” అని కేకలుపెట్టి కనుమూసి కనుతెరచేటంతలో మాయమైపోయారు బిల్లులు. అప్పుడా కారులోంచి దిగింది బాట్లివాలాగారు. ఏమిటి విచిత్ర సంధానాలు అని వారూ అనుకున్నారు. వీరూ అనుకున్నారు. తహిమీనా పార్శీబాలిక. ఆ బాలిక హృదయంలో వైకుంఠరావు - పెద్దపులిని అల్లరి పెట్టినప్పటినుంచి, ఏమి చిత్రమో - మకాం పెట్టి కూచున్నాడు. పార్శీ బాలికలు పార్శేతరులతో సాధారణ స్నేహం కన్న ఎక్కువ దూరం పోరాదు! అయినా ఆ కొత్త బాలకుడు చీకటిలో కూడా గంభీర వ్యక్తిత్వంతో అస్పష్టమూర్తిత్వంలో పెద్దపులిని తరిమివేస్తూ ఎన్నిసార్లో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. బాట్లివాలా మన స్నేహితులకు వందనాలర్పిస్తూ నవ్వుతూ "మీకూ మాకూ ఈ చిత్రసంబంధం ఏమిటి!" అన్నాడు.
అడివి బాపిరాజు రచనలు 8 • 31 • కథలు "నేనూ అదే అనుకుంటున్నానండీ" అని వైకుంఠరావు సమాధాన మిచ్చాడు. అందరూ కలిసి భిల్లులు రోడ్డుకడ్డంగా వేసిన రాళ్ళూ రప్పలూ ఎత్తిపారవేసి మోటారు కారు సరిగా పోవడానికి దారిచేశారు. కారు వెళ్ళిపోయింది. స్నేహితులు స్టేషనుకుపోయి అహమ్మదాబాదుకు రెండవ తరగతి టిక్కెట్లు కొన్నారో లేదో మెయిలు చక్కా వచ్చింది.
6
వెంటనే మన స్నేహితులైదుగురూ ఇటు తిరిగారు అటు తిరిగారు: ఏ సెకండు క్లాసులోనూ కాళీ లేదు. వైకుంఠరావుకు కోపం వచ్చింది. రైలును కదలమని చెప్పినట్లుగా ఈలవేసేగార్డును పట్టుకొని గబుక్కున వెనక్కు తిప్పి "గార్డుజీ నమస్కారం క్షమించండి! రెండవ తరగతిలో స్థలం అణుమాత్రంలేదు. అహమ్మదాబాదు ప్రయాణం. మొదటి తరగతిలో ఎక్కుతాం. తరువాత స్టేషనులో ఛార్జీ ఇస్తాం; సెలవు" అని పరుగెత్తి ఒక మొదటి తరగతి పెట్టెలో - ఇద్దరే ఉన్న ఆరుసీట్ల దానిలో ఎక్కబోయారు. పెట్టె గుమ్మంలో తహిమీనా బాట్లివాలా పురుష వేషంలో నుంచొని ఉంది. వైకుంఠరావు, అతని స్నేహితులు గబ గబ ఎక్కబోయారు. తహిమీనా “ఎక్కడానికి వీలులేదు” అన్నది. “ఓయి కుఱ్ఱాడా, రైలు కదులుతున్నది; వాదించడానికి వ్యవధిలేదు” అని ఆ బాలుణ్ణి నెమ్మదిగా నెట్టుకు పోయి స్నేహితులకు దారిచేసినాడు. బాట్లివాలాగారు అతికోపంతో లేచి "పశువా!" అని కేకవేశాడు. వైకుంఠరావు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. ఇంతట్లో తహిమీనా తన తండ్రి చేతికఱ్ఱ తీసుకొని వైకుంఠరావు నెత్తిమీద దబదబ బాదటం ప్రారంభించింది. మరుసటి క్షణంలో ఆ కఱ్ఱ ఆమె చేతులోంచి ఊడదీసి కఱ్ఱ రెండుముక్కలుచేసి మూల పడవేశాడు. ఒకదెబ్బ అతని నుదురుపై తగిలి చర్మంకొంచెం పగిలి రక్తం బొటబొట కారింది. “అదేమిటి అమ్మాయీ” అని పార్శీభాషలో బాట్లివాలా అన్నాడు. వైకుంఠుని తహిమీనా తాడన మారంభించగానే ఆమె తలపై ధరించిన ఇంగ్లీషుటోపీ ఊడిపడిపోయింది. ఆమె జుట్టు ముడివీడి సూటువేసిన ఆ బాలిక వీపుపై పడి ప్రసరించింది. ఆ బాలిక సిగ్గుపడుతూ నిలుచుంది. వైకుంఠరావు ఆమె నింతవరకు బాలుడే ననుకొన్నాడు. అందమైన బాలుడు అత్యంత సుందరియైనబాలిక అయింది. ఆమెను తేరిపార చూచినాడు. ఆమె అతన్ని తేరిపార చూచింది. “నీవా!” అని అన్నాడతను. “నీవా!” అని ఆమె అన్నది.
7
దాదాభాయి బాట్లివాలాగా రప్పుడు వైకుంఠుడు పెద్దపులి బారినుండి, భిల్లులబారినుండీ తమ్ము తప్పించిన ప్రాణదాత ఇతడే అని పోల్చుకున్నాడు. దాదా: అయ్యా క్షమించండి. ఆ సీటుపైన కూర్చోండి. మా అమ్మాయి చాలా తొందరపడింది అన్నాడు. స్నేహితుడొకడు గాయానికి కట్టుకట్టాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 32 కథలు వైకుంఠుడు నవ్వుతూ “ఫరవాలేదండి. తొందరలో ఈలాంటి సంఘటనలు వస్తూ ఉంటాయి.” అతనిపై ప్రసరించిన అందాల చూపులు తహిమీనా మరల్చలేదు. వైకుంఠుడు తన చూపులు ఆమె నుంచి మరల్చలేకపోయాడు. అహమ్మదాబాదు చేరేసరికి వారూ వీరూ స్నేహితులయ్యారు. ఇరవై ఏళ్ళ బాలిక తహిమీనా వైకుంఠుని అహమ్మదాబాదులో తమ మకాం కడ ఒంటరిగా కలుసుకొంది. తహి: నిన్ను ఎన్నివేల సంవత్సరాల క్రిందటనో కలుసుకున్నట్లుంది. ఇదివరకు మనం ఎక్కడ కలిసికొని ఉంటాము? వైకుం: కాంగ్రెసులోనేమో! తహి: కాదు. ఇదివరకే నీతో నేను యుద్ధం చేసినట్లు నువ్వు నన్నూ ఓడించి - వైకుం: ఓడించి నిన్ను మా దేశానికి ఎత్తుకొనిపోయి వివాహమాడినట్టు కలగానికల? తహి: నాకు అంతే! వారట్లు గంటలు మాట్లాడుకొన్నారు. ఆమె నిర్భయంగా నిస్సందేహమయిన మాటలతో వైకుంఠుని తాను ప్రేమిస్తున్నానని చెప్పింది. వైకుంఠుడు "తహిమీనా! నీ పేరు ఎంత చక్కగా ఉంది. నిన్ను యుగాలక్రితం పోగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ కలిశానా నీతో అన్న భావం నన్ను వీడదు. నువ్వే సర్వకాలం నా చూపులలో, నా హృదయంలో. నా సర్వస్వంలో! ఎల్లాగ నిన్ను వదలి ఉండటం?” అన్నాడు. “ఓయి వెట్రివాడా! నేనూ నిన్ను వదలి ఉండగలనా? ఏమో నేను అసురబాలికనై, నువ్వు ఆర్య బాలకుడవేమో! గులో బకావళీకన్య కథ వినలేదా” ఒక్క నిముషం వారొకరు నొకరి విడిచి ఉండలేకపోయారు. దాదాభాయిగారికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. పార్శీ కన్యక పార్శేతరుణ్ణి ఎలా వివాహం చేసుకోకలదు? తహిమీనా ప్రేమ మతాలు దాటింది. దేశాలు దాటింది. దేహబలం జ్ఞానబలం కుటుంబ, దేశ, ప్రపంచసేవ చేయడానికి ఎంత ముఖ్యమో ప్రేమ బలం అంతే ముఖ్యం అని ఆమె అనుకుంది. ఒకజాతిని చెక్కు చెదరకుండా కాపాడుకోవడం పురాతన వస్తు సంరక్షణభావం కావచ్చును. ఆ మ్యూజియం భావం అన్ని విషయాలలోనూ వర్తించదు. శ్రీ జిన్నాగారి వివాహం జాతిని మించి నడిచింది, అని ఆమె దృఢనిశ్చయానికి వచ్చింది. ప్రేమ ఒకటే సర్వమతాలను, సర్వదేశాలను మించిపైకి ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం కొండలను గోదావరి కోసినట్లు ప్రవహిస్తుంది. ఒక నీగ్రో పురుషుణ్ణి తెల్లజాతి స్త్రీ ప్రేమించి నడిస్తే అమెరికా తత్వం అడ్డం వస్తుందా? ఏ యుగాలనాటిదో ఈ ప్రేమ! ఈ దివ్య సమాగమము యమునా గంగా సంగమమే అవుతుంది. ఎందరు పార్శీలు ముస్లింమతంలో కలువలేదు. ఎందరు అసురకన్యలు ఆర్యవీరుల్ని ఉద్వాహం కాలేదు? ఇలా తండ్రితో గంభీరంగా వాదించింది తహిమీనా.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 33 కథలు 8
వైకుంఠరావుకు అనుమానమేలేదు. పార్శీ పత్రికలలో అల్లరి అతడు గమనింపలేదు. కొన్ని బెదరింపు ఉత్తరాలను అతడు లెక్కచేయలేదు. అతడు మహాత్మునికి రాసి అనుమతి తెప్పించుకున్నాడు. పార్శీ సంఘమువారు పనికిరాదన్నారు. అనేక విధాల దాదాభాయి బాట్లివాలాగారిని ఒత్తిడిచేశారు. వేదాలలో, జెండ్ అవెష్టాలో గాథలుగా, ఋక్కులుగా పాడబడిన పాంచరసుధన్వా ప్రేమకధన మహాబలం ఎవ్వరాపగలరు? తహిమీనా తండ్రి ఇంటికడనుండి వచ్చి సబర్మతి వెళ్ళిపోయింది. వైకుంఠరావు సబర్మతి చేరినాడు. సబర్మతి ఆశ్రమంలో తహిమీనా, వైకుంఠుల వివాహం అతి వైభవంగా జరిగింది.
9
ఆ దంపతుల ప్రేమ పవిత్ర సత్యాగ్రహ విజయం. "ఓ దేవీ! తహిమీనా! ఏనాటిది మన యీ ప్రేమ?” "ఆర్యవీరుడవు పంతం నెగ్గించుకున్నావు!” "నీవు ఆర్యబాలికవుకావా? ఆర్యత్వం మహాత్ముని ధర్మం అర్ధం చేసుకోవడంలో ఉందికదూ! నువ్వు ధర్మం కోసం మహోత్తమ సత్యాగ్రహం చేశావు ప్రాణప్రియా!” తహిమీనా వైకుంఠకుని హృదయం మీదవాలి, అతని తలవంచి మధురపరీమళంగా అతని పెదవులు తనివి తీర ముద్దిడుకుంది. వైకుంఠుడు సర్వవిశ్వానికి మొక్కుకొన్నాడు. ఈ దివ్యభామినిని తనకు ప్రత్యక్షం చేసినందుకు. వారిద్దరూ దేశసేవా మహాయుద్ధంలో ఒకరికొకరు దగ్గరగా, ఒకరి నడుం చుట్టూ ఒకరుగా భారతదేశంలోనికి అడుగిడుతూ నడుస్తున్నారు.
అడివి బాపిరాజు రచనలు - 80 34 కథలు తిరుపతి కొండ మెట్టు
శ్రీ తిరుమల మహా పుణ్యక్షేత్రంలో గాలి గోపురానికి పోయే మొదటి మెట్లవరుసలో సగం దాటినపైన, ఏకాకి కుంటి బిచ్చగాడు పున్నెడు నివాసం. ఏ బిచ్చగాళ్ళ ఋషికులానికీ చెందకుండా పున్నెడు ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. రెండు కాళ్ళూ మొండే! కాని వాడికున్న బలం విపరీతం. వాడుచేసే దొమ్మరవిద్యల సాహసం నైపుణ్యం ఏ “ఇసాకో గ్రాండు రషియను సర్కసు" జట్టులోఉండే పరమ సాహసికిన్నీ లేదు. చేతులతో మెట్లెక్కుతాడు. కోతిలా కొమ్మనుంచి కొమ్మకు ఎగిరి ఛంగున పోతాడు. వ్రేలాడుతూ చక్రంలా గిరగిర తిరుగుతాడు. దేహమంతా వాఅఖ్యిమనిలా పైకెత్తి వేళ్ళమీద తలక్రిందులా నిలబడి నడుస్తాడు. మెట్టు మీద నిలుస్తూ, చేతుల్లోంచి దూరుస్తాడు. అతని విచిత్రపు ఆసనాలూ మొగ్గలూ ముందు హఠయోగి విరూపాక్షనందుడుగాని, జపాను సర్కసు వీరుడు మసుకాకోగాని విన్యాసంచేసే ఆసనాలూ మొగ్గలూ వేయి కొవ్వువత్తుల విద్యుత్ దీపంముందు ఆముదం దీపంలా తెలతెలపోవలసిందే. యాత్రికుల తండాలు మేఘాలులా పున్నెడు ముందరచేరి, అతని అద్భుతమైన మొగ్గలు, పనులు చూసి ఆశ్చర్యంతో దమ్మిడీలు, కాసులు, అణాలు వర్షం కురిపిస్తే రాత్రి తొమ్మిది అయ్యేసరికి అయిదూ, ఆరు రూపాయల చిల్లర చెరువులు కట్టవలసినదే. ఏ బ్రహ్మోత్సవమో అయితే పది, పదిహేను రూపాయల వరదలు కట్టాయి. తిరుపతి కొండల ఎక్కుడు దిగుడుల ఏడు మైళ్ళలో ఉన్న నాల్గు వందల ఏబదియారు బిచ్చగాళ్ళలో, పున్నెడుకు వచ్చే రాబడి ఇంక ఎవరికీ లేదు. వికలాంగులు ఉన్నారు. ముక్కు నోరు అంతా ఏకరంధ్రమైన వారున్నారు. కుష్టురోగులు, మాంత్రికులు, సన్యాసులు, ముళ్ళమీద హంసతూలికా తల్పం మీదలా పండుకొనే యోగీశ్వరులు, గుడ్డివారు, కోకిల కంఠముతో పాడే గాయకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, బిడ్డలు, భయం గలుగజేసేవి, వట్టి మొద్దుని కళాసౌందర్యం వెల్లివిరిసేవి విగ్రహాలను ముందుంచుకొని పూజారి పనిచేసే భక్తులు ఎన్ని రకాలున్నారో తిరుమలేశ్వరుని కొలువుచేసే అయ్యంగార్లు, అయ్యరులు, అయ్యలు, రెడ్లు, మొదలియార్లు, సెట్లు, పిళ్ళలతోపాటు, కోతులతోపాటు ఈ బిచ్చకుల బృందాలు!
అడివి బాపిరాజు రచనలు - 8 35 ♦ కథలు 2
ఆ విచిత్ర ప్రపంచంలో ఉన్న బిచ్చగాళ్ళంతా పున్నెణ్ణి చూసి అసహ్యించుకునేవారు. పున్నెడు ముష్టివాళ్ళందరికి విరోధి అయిపోయినాడు. అతడి సంపాదన వాళ్ళ కడుపుల్లో, మంటలు చెలరేగజేసింది. వారికి ఉడుకు బోతుతనం కాశ్మీర దేశాన్ని సహారా ఎడారి చేయగల శక్తితో విజృంభించింది. వితరణ ప్రవాహాలు పున్నెడు దగ్గిర ఆనకట్ట కట్టబడి అక్కడ మహా సరస్పై, తక్కిన ఏడుకొండలూ నిర్జలవాహినులుగా ప్రవహిస్తున్నవి. పున్నెణ్ని త్వరగా కొండమీదనుంచి జపానువారు మంచూరియా ఆక్రమించుకొని చీనా రాజ్యాన్ని తరిమినట్లు నెట్టి వేయాలని బిచ్చగాళ్ళ సంఘంలో ఉద్యమం బయలుదేరింది. బిచ్చగాళ్ళలో ఏ కబురైనా తీగెలేని వార్తయి శేషాచలం అంతా నిమేషంలో ప్రసరిస్తుంది. మోకాళ్ళ పర్వతం, చుక్కల పర్వతం, సన్నిధి పర్వతం అన్నీ ఆ వార్త ఆక్రమిస్తుంది. పున్నెణీ శ్రీ వెంకటేశ్వర సర్వహిత భక్త బృందంలోంచి రెండువేల మైళ్ళన్నా విసిరి వేసేందుకు ఒక మాఘశుద్ధ ఏకాదశినాడు బిచ్చకులు ఆశ్రమాలన్నీ తీర్మానించుకున్నాయి. దీనికికారణం ఏమిటంటే ఆ ఏకాదశి ఉదయం నుంచి పున్నెడికి మధ్యాహ్నానికి ఇరవై అయిదు రూపాయలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. సాయంకాలానికి ఈ తీర్మానం! ఈ తీర్మానము ప్రకారం బిచ్చగాళ్ళకు అన్నము సాంబారు అమ్మేవాళ్ళు పున్నెడికి అమ్మడం మానివేశారు సరుకులు. ఏడుమైళ్ళదారి పొడుగునా విక్రయించేవాళ్ళు విక్రయించడం మానివేశారు.
3
పున్నెడు మొదట వేళాకోళ మనుకున్నాడు. క్రింద ఆశ్రమంలో ఉన్న దిగుడు బావిలో నుంచి పై ఆశ్రమాలవాళ్ళకీ విడి బిచ్చగాళ్ళకి అమ్మేమనిషి అలివేలు పున్నెణ్ణి వెక్కిరించి “నీళ్లు, నీళ్లు" అని పున్నెడు గోల పెడుతున్నా! నడుమూ కటిగౌరం ఆడించుకుంటూ వెళ్ళిపోయింది. పున్నెడికి కళ్లు పచ్చబడ్డాయి. ఆ స్థలం వదిలి క్రిందికిపోయి నీళ్లు త్రాగి రావచ్చును. కాని పున్నె డున్న అత్యంత లాభదాయకమైన స్థలం యాత్రికులు విశ్రాంతికి ఆగేస్థలం. మెట్లెక్కి వస్తూంటేనే పున్నెడు కనబడతాడు. ఆ స్థలం వదిలితే పున్నెడికి రెండునూర్లురూపాయలిస్తామన్నారు కొందరు బిచ్చగాళ్లు; పున్నెడు ఆస్థలానికి నెలకు పదిచొప్పున అద్ది, పదిచొప్పున అమ్మకానికి ఇచ్చి పన్నెండు నెలలకు వెంకటేశ పెరుమాళ్ళ పున్నెమా అని సంపాదించాడు. చెట్టునీడనే కూలబడి తల ఛాతీమీద వాలిపోగా పున్నెడు తన జీవితం అంతా తలబోసుకున్నాడు.
4
పున్నెడు అనంతపురం జిల్లాలో ఒకగ్రామంలో నివసించే అభిమానవంతుడూ ఆస్థిపరుడూ అయిన రెడ్డి భూస్వామి. ఈ రెడ్డికుటుంబానికి పక్క ఊరులో పెద్ద
అడివి బాపిరాజు రచనలు 1 8 ♦ 36 కథలు భూస్వాములైన ఇంకో రెడ్డికుటుంబానికి సరిహద్దు తగాదా వచ్చి కురుపాండవ యుద్ధమైపోయింది. అప్పుడు పున్నెడి పేరు పుణ్యంరెడ్డి. తండ్రిన్నీ ముగ్గురు అన్న దమ్ములూ వీరస్వర్గం పొందారు. వారితోపాటు అవతల కక్షవారూ చాలా మంది రంభకోసం పెనుగులాడడానికి స్వర్గానికి గూడా ఈ తగాదా తీసుకువెళ్ళారు. అవతల కుటుంబంలో ఇద్దరూ, ఇటు పుణ్యంరెడ్డీ మిగిలారు. పుణ్యం రెడ్డి రెండుకాళ్లూ ఆ యుద్ధంలో విరిగిపోయినాయి. జిల్లా వైద్యాలయంలో రెండు కాళ్ళూ ఛేదించి మొండిలగ్గణ్ణి జేశారు. కుటుంబం యావత్తూ నశించింది. వ్యాజ్యాలలో ఆస్థి ఇదివరకే పోయింది. ఉన్న నాల్గయిదువందలు పట్టుకొని కతిపయ ప్రయాణాలుచేసి రెండేళ్ళకు వేంకటాచలం సోపానపంక్తిలో రెండవశేషాచలపతిలా అవతరించాడు. పుణ్యం రెడ్డి, ఇంక రెండేళ్ళలో పున్నెడయ్యాడు రెడ్డి. అవతల రెడ్డి కుటుంబం ఏమవుతుందో! అన్న శిక్ష! భగవంతుడు లేడా అన్న వేదాంతం, బ్రతుకుమీద ఆశతో అతను తిరుపతి కొండ మెట్లల్లో అవతరించాడు.
5
పూర్వ చరిత్రలన్నీ మాయమై పున్నెడికి కళ్ళ రెండు చుక్కలు రాలినవి. అతని గొంతుక ఎండింది. ఆకలి కొండచిలువలా చుట్టుకుపోయింది. ఎముకలు పిప్పిచేస్తున్నాయి. కొండమీద దుకాణాలకు సరుకు అందుబాటుచేసే వర్తకులు వచ్చినప్పుడు పున్నెడు కొంతడబ్బు వారికి యిచ్చి సాయంకాలానికి వంట సామగ్రి తెప్పించుకొనుటకు ప్రయత్నించి డోలీలవాళ్ళకు రెండణాలు చేతులో వేసి కుండెడు నీళ్ళు తెప్పించుకున్నాడు! ఆ సరుకుతో, ఆ నీటితో మూడు రోజులు గడిపాడు పున్నెడు. నాలుగురోజులు తెల్లవారగట్ల మూడింటికి లేచి ముష్టికి తయారైనాడు. తెల్లవారే వరకు ఒకరూపాయన్నర మూడు దమ్మిడీలు ప్రోగయినాయి. ఇంతలో మామూలుగా కొండమీద దుకాణాలకు సరఫరాదారుడు కందసామి వంటసామాగ్రి తెచ్చి ఇచ్చే సమయమైందని కొండపైకి దిగువకూ చూసి ఆ పక్కనే నాలుగుబారల దూరంలో తాను నిద్రపోయే పొదకడకు పోయి, ఒకపెద్ద రాయితీసి చూసినాడు. అతని కళ్ళు తిరిగి “అమ్మయ్యో అని వెనక్కు వాలిపోయినాడు. ఆ రాతిక్రింద పున్నెడు దాచుకున్న అయిదు వందల డెబ్బది అయిదురూపాయల మూట మాయమైపోయింది. పున్నెడు ప్రాణం నిలువునా కూలబడిపోయింది. రాతిపక్కనే పున్నెడు కూలబడిపోయాడు. కొంతసేపటికి అతని మొగం జేవురించింది. తనకు వస్తువులిచ్చే కుప్పుస్వామిగాడే అని అతడనుమానం పడ్డాడు. కుప్పుస్వామి వాళ్ళజట్టులో వాడు కాడు గనుక తనకు సరుకులిచ్చాడు. ఈ కుప్పుస్వామి రాక్షసుడు. వెంకటేశ్వరుడి ఆస్తే దొంగతనం చేయగల పిశాచి! వట్రువలు తిరిగి కండలుకట్టి హనుమంతుని హస్తాలవంటి బలమైన అతనిచేతులు భయంకరంగా వంకరలు తిరిగినవి. ఆ సమయంలో అతనిచేతుల కందిన ప్రాణి, కబంధుని వాతబడినట్లే.
అడివి బాపిరాజు రచనలు 8 • 37 + కథలు 6
ఆ రోజు దొరికిన డబ్బునిచ్చి వంటసామాగ్రి కొనుక్కున్నాడు పున్నెడు. ధనంతోపాటు అతని ఉత్సాహమూ శక్తీ పోవడానికి కారణం అలివేలు చర్యే! అలివేలు ఈ రోజూ అంతనిర్దయగానే నడిచిపోయింది. అలివేలు శేషాచలపతి కొండకూ, తనకూ ప్రియమైనది. ఆమె నవ్వు తనకోసం, ఆమె వయ్యారం తనకోసం. ఆమె తన చింపిరి జుట్టును దువ్వుకొందంటే తనకోసం! ఆ ఆలివేలుకూడా తనమీద కక్షవహించింది. ఆమె తనవైపు చూడలేదు. తలవంచుకు వెళ్ళిపోయింది. తనకు నీరీయలేదు. వెక్కిరించి వెళ్ళిపోయింది. తాను భోజనం చేస్తుంటే అది కబుర్లు చెప్పడానికి రాలేదు. అతనికి జీవితేచ్ఛ పోయింది. కసికొద్దీ అవతలి రెడ్డికుటుంబం నాశనం కోరుతూ జీవించి ఉన్న పున్నెంరెడ్డి, పున్నెడుగా సంపూర్ణంగా మారి వెనకటి జీవితం మరచి జీవిత యుద్ధంలో ఈ విచిత్ర భిక్షకునిగా నడిపిస్తున్నాడు. అతనిలోని భిక్షకత్వ భావమూ పోయింది. అతడు జీవిత యోధుడు : బ్రతుకొక మహాయుద్ధం, అందులో రోజురోజూ విజయమే! ఆ విజయానికి ప్రేమ, సేవ, కసి, భయం, ఆశ, జీవితావలంబనాలవుతాయి. ఆ ప్రేమ నిధానం పున్నెడికి అలివేలు, అలివేలు పెడమోము పెట్టింది. మూలమూలల దాగివున్న పున్నెడు ప్రేమ ఈనాడు అతివ్యక్తమైంది. ప్రపంచంలో యుద్ధంక్రమంగా ఒంటిగా సంసార యాత్రచేసే ఆశ అడుగంటింది. తన విద్యలు చూపించి ముష్టిఎత్తడం మానివేశాడు పున్నెడు. ఆ డబ్బు మాయమైంది. రోజూ వచ్చే డబ్బులేదు. యాత్రికులు పలకరించినా పున్నెడు మాట్లాడలేదు. ఏదైనా జబ్బు అంటే పున్నెడు మాట్లాడకుండా పండుకొంటాడు.
7
అయిదురోజు లయ్యేసరికి పున్నెడు అస్థిపంజరమైపోయాడు. పున్నెడు దురదృష్టము వెంకటాచలాన్ని రాళ్ళలా ఆశ్రయించివున్న వర్తకులు మొదలైన యావన్మందికీ తెలిసిపోయింది. శేషాచల బిచ్చకులలోకం అంతా పున్నెడు స్థితికి పండుగ చేసుకుంది. వదులుతాడురా పిశాచి అనుకున్నదా లోకం! అందరికి ఇక కొంచెమో గొప్పో దొరుకుతుంది. ఇంతవరకు పున్నెణ్ణి అదృష్టదేవత ఆవహించింది. ఇంతటినుంచి కొండమెట్లదారి ఏడుమైళ్ళా క్రిందకి పైకీ ఆమె తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎన్నాళ్ళకో మంచి దినాలు వచ్చాయిరా అనుకున్నారు. నీరసించిపోయిన పున్నెడికి ఆరవదినం రాత్రి స్పృహవచ్చింది. కొండమీదనుంచి ప్రక్కనున్న లోయలోనికి ఉరికి వెంకటేశ పాదసన్నిధి చేరుదామనుకున్నాడు. చేతులతో పాకి నూరడుగుల దూరంలో ఉన్న ఎత్తు బండలమీదికి పోయినాడు. గోవిందా!
అడివి బాపిరాజు రచనలు 8 - ♦ 38 ♦ కథలు వెంకటరమణా! ఏడుకొండలవాడా! అని ఉరకబోయినాడు. ఇంతలో చల్లని చేతులు అతని నడుంబట్టి వెనక్కు లాగివేసినాయి!
8
కళ్ళు మూసుకున్న పున్నెడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైనాడనుకొన్నాడు, అతని దేహం పులకరించింది. చల్లని గాలులు ప్రసరించినట్లయింది. వెన్నెలలు పిండి ఆరగా కాచినట్లయింది. అతను కళ్ళు తెరిచేసరికి ఎట్టఎదుట చుట్టుపక్కల బిచ్చగాళ్ళ ఆశ్రమాలకు నీళ్ళు పోసే పిల్ల అలివేలు కనబడింది. ఆమె తీరైన మోమంతా ఆ వెన్నెల్లో ప్రవాహాలై ప్రవహించే కంటినీరు మెరుస్తూ కనిపించింది. ఆమె వెక్కివెక్కి ఏడుస్తూ, "పున్నెడు! నాను బహుపాపిని. నిండా ద్రోగం చేసిన ఆరుమాసాల క్రితం రోగం వచ్చి దుడ్డులేక సబ్బరపడి నప్పుడు నాకు పత్తురూపాయలంపిన నీ సల్లని గుండెకు నాను ద్రోగం సేశినా! సుక్కల పర్వతం ముసలిదానికి నువ్వు చేసిన సాకిరి దేముడే సేయగల్గు! నీ బతుకునిండా దేముడే వున్నాడు. వీళ్ళు పిశాసులు. నాను రక్కసి. వాళ్ళ మాటలకు లోబడి, ఈలా పాపి అయిపోతినిదా! ఓయ్! ఓయ్ నాకు నరకందా రాసినాడే!" అని పొంకమయిన తన వక్షోజాలు ఉబికిపోగా అతి దీనంగా పొర్లి పొర్లి వచ్చే ఏడుపును ఆపకుండా ఏడ్చింది.
9
పున్నెడు నిర్ఘాంతపోయినాడు. అలివేలును నీరసంలో కూడా బలం తగ్గని చేతులతో దగ్గిరకు లాక్కున్నాడు. “పిల్లా, నాకు కలిగిన ఈ సెబ్బరకు నేను దుఃఖం పొందనేలేదు. ఇంతకుమించి కష్టాలు తీరినవి ఈ ప్రాణికి! కాని అతి మెత్తని నీమనస్సుకు ఎంత బాయితనం వచ్చిందని విచారం పొందినాను. ఎప్పుడూ ఎన్నెల్లుకురిసే నీ చూపుల్లో కారుమబ్బులు కనబడినాయి కదా! ఇక ప్రపంచకంలో మంచి పున్నెం లేదనే తోచినదే! ఏల ఈ ప్రాణి బ్రతికేది?” “సామీ! చెమించు, నాను శాకినిదా! నీసొమ్ము ఏడ నీవు దాచేది నాకుదా తెలుసునే. అది కుప్పుసామికిదా నాను సెప్పితేనే. అది వాడుదా తీసుండు!" పున్నెడు పక్కున నవ్వాడు. అతని హృదయంలోనూ వెన్నెల కాసింది. "పోయెలే! ఈ ప్రాణికి చేతులిచ్చిన యెంకన్న పున్నెమా! పది అయిదు నూర్లు సంపాదించినా? నువ్వు నా దగ్గిరే ఉండు! అంతే, నా సంసారం నువ్వు!” పున్నెడు ఆమెను తనచేతుల్లోకి తీసుకొని తలా, కళ్ళూ, ముక్కు చెవులూ, పెదవులూ ముద్దుపెట్టుకొన్నాడు. అలివేలు తానుతెచ్చిన మంచినీళ్ళూ కూడూ పున్నెడికి నెమ్మదిగా తినిపించింది. చుక్కలు నవ్వినవి! వెన్నెలలపతి మరీ చల్లని గాఢమయిన అడవి పూవుల పరీమళాలైనకాంతులు వాళ్ళపై అక్షతలుగా చల్లాడు. శ్రీ వెంకటేశపతి తన ఎదుట జరిగిన వివాహాలకన్న తానే స్వయంగా జరిపిన యీ పెళ్ళి ఉత్తమమైనదనుకున్నాడా!
అడివి బాపిరాజు రచనలు 1 8 ♦ 39 కథలు టాంకుదళము
భారతీయ సైన్యాలకు ముందుగానే వెళ్లుతున్నాయి వారిపొట్టి టాంకు దళాలు. ఈ టాంకులను మరుగుజ్జు టాంకులు అంటారు కూడాను. ఆ టాంకుల గర్భంలో నిండిఉన్నవారూ భారతీయ వీరులే. ఆ ఇసుక మహాసముద్రంలో ఇసుక గుంటలు, ఇసుక కెరటాలు, వేడి వేడి గాలిదుమారాలు, ఎండమావులూ తప్ప ఏ అందమూ ముందు టాంకును నడుపుకుపోతున్న రావుకు కనబడుటలేదు. టాంకు కన్నులలోంచే అతడూ చూస్తూ, టాంకును నడుపుకుపోయే యంత్రాలను సవరిస్తూ, చుక్కాని చక్రాన్ని తిప్పుకుంటూ ముందుకు తీక్షణంగా సాగిపోతున్నాడు. గంటన్నర కిందట చిన్నచిన్న సంఘర్షణలో అతని రక్తము కెరటాల్లా పొంగిపోయింది. మహా క్రోధపూరిత మాగధ మహిషాన్ని నడిపే యముడులా తన టాంకును ఈ కందకంలోకి ఆ అడ్డతీగెల కట్టపైకి దుమికించాడు, ఎగిరించాడు, పరుగెత్తించాడు. అతని కన్నులకప్పిన ఎర్రతెరలు అతని మెదడునిండిన జ్వాలాస్ఫులింగాలు టాంకు నరనరాలికి కమ్ముకుపోయి ఆ టాంకే ప్రాణపూరిత భయంకర పిశాచ మయింది. టాంకులో ఉన్న తనతోటి భారత వీరులు క్షణక్షణమారణాగ్ని ప్రయోగశతాఘ్నికాల నుండి జర్మనులను చెండాడి వేటాడుతున్నారు. ఆ టాంకుపై టాంకు విధ్వంసకాగ్ని గోళనిపాతము ఇంతైనా తగలదు. తగిలితే దూసుకుపోతుంది. ఛేదిస్తే చప్పబడి మూల ఒదిగి కూర్చుంటుంది.
2
రావు యుద్ధంలో టాంకు నాయకుడుగా జేరకముందు సహజ శాంతశీలుడు, మితభాషి, త్రపాశీలి. యుద్ధం అంటే చాలాభయపడ్డాడు. ప్రాణాలకే వెరిచాడు. రహస్యంగా స్నేహితులను యుద్ధంలో చేరవద్దని ప్రబోధించాడు. ఇంతలో ఒకనాటి "ఇండియన్ ఎక్స్ప్రెస్” పత్రికలో జర్మనులు ఒక రష్యను గ్రామంలో ఉన్న యావన్మంది స్త్రీ పురుషులను నాశనం చేశారు అని చదివాడు. అతనికనులు మూతలుపడి, హృదయం వివశత్వం పొంది అతని మెదడురక్తం నిండింది.
అడివి బాపిరాజు రచనలు - 8 + 40 - కథలు స్టాలిన్ 'మీ యిళ్ళకూ, మీ బిడ్డలకూ, మీ భార్యలకు జరిగే విపత్తు ఆలోచించుకోండి. మీ దేశం మీది కాకపోతుందన్న భవిష్యత్తు ఆలోచించండి” అని రష్యన్ల ప్రబోధించడం చదివాడు. ఏమిపుట్టిందో తల్లికి చెప్పకుండా - సైన్యాధికారోద్యోగానికి దరఖాస్తు పెట్టినాడు. రాజముద్రాంకితోద్యోగము కొన్ని మాసాలలో వచ్చింది. మహా యుద్ధానికి శిక్షణ ఇచ్చినవారిలో ముందువాడయ్యాడు. టాంకు నడుపుట, టాంకుయుద్ధము చేయుట, శతఘ్నుల నవలీలగా పేల్చుటలో అద్వితీయుడయ్యాడు. ధీర లలితుడు, ధీరోధాత్తు డయ్యాడు.
3
లిబియా ఎడారిలో భారతీయ సైన్యాలు అవిరళ పురోగమన వేగవంతాలై బ్రిటీషు సైన్యాలతోపాటు చొచ్చుకుపోతున్నవి. రోమెలు సేనాని జర్మను దళాలను అనేక వ్యూహాలతో అనేక బంధాలతో రక్షించుకొంటూ నిలువనీడలేక వెనక్కు పరుగెత్తుకుని, పోతూ పోతూ ఏల్ అఘెలియా ప్రదేశంలో మోహరించాడు. మూడురోజు లక్కడ ప్రచండ యుద్ధం జరిగింది. శతఘ్నులపొగలు, ఇసుక పొగలు దిఙ్మండలం అంతా కప్పాయి. ఎక్కడ చూచినా కుప్పలుగా ఇనుపముళ్ళతీగలు అడ్డాలు, టాంకు విధ్వంసక గర్తరాలు. అడ్డాల కత్తెర బంధాలు. రావు టాంకు ఎట్లు దాటిందో ఇవన్నీ, జర్మను వ్యూహా మధ్యానానికి వెళ్ళేటప్పటికి ఒక్క జర్మనులేడు. జర్మనులు ఇంకా తిరోగమన ప్రదర్శనము నాటక మాడినారు.
4
ఏల్ అఘెలీ విజయయాత్ర సాగుతోనే రావు టాంకులో చక్రం మీదకు వాలిపోయాడు. ఇన్నాళ్ళనుంచీ చెక్కు చెదరని అతనిప్రేమ నిధానమైన చిట్టి టాంకు దెబ్బతిన్నది. దూరాన్నుంచి ఒక జర్మను గుండు వచ్చి పేలి, రావు టాంకుకు పార్శ్వంలో తాకి, చొచ్చి రావుకు కంఠం క్రిందతగిలి అతణ్ణి మూర్ఛగతుణ్ణి చేసింది. ప్రక్కనున్న సహాయ చోదకుడు రావును నెమ్మదిగా తప్పించి తానా చక్రాన్ని ధరించాడు. దెబ్బతిన్న రావుచేతులు ఆ మైమరుపులో ఏదో తిప్పుతూనే ఉన్నాయి. తన టాంకునకు రావు “మహిషమర్ధని” అని పేరు పెట్టుకొన్నాడు. మహిషమర్ధని ఆగింది. రావును తాత్కాలిక వైద్య శిబిరానికి తీసుకు వెడుతుంటే ఆమె కన్నుల నీరు వచ్చినట్లు ఆమె గర్భంనుంచి వచ్చిన ఇతర భారతీయ యోధులకు కనిపించింది. వైద్యనాయకుడు పరీక్షచేశాడు. కంఠంలోనుంచి వెళ్ళిన అక్షాగ్ని మయశకలము శుభ్రంగా ఆవలికి పోయింది. ఒకటి రెండు చిన్న రక్తనాళాలు తెగినవి. రావు వారం రోజులలో మళ్ళీ యుద్ధానికి సిద్ధం అని అన్నాడు.
అడివి బాపిరాజు రచనలు 77 8 +41 + కథలు 5
రావుకు ఆపరేషన్ జరిగిన వెనుక స్వప్నలోకంలో విహరించే మత్తు తనంలో, వైద్యోపచారికైన ఒక ఫ్రెంచి బాలిక అతడు ప్రేమతో “మహిషమర్ధనీ” అని పిలుచుట విన్నది. ఆమె ఆశ్చర్యమందింది. ఎవరాబాలిక అని ఆమె ప్రశ్నించుకొన్నది. రావుకు మెలకువ వచ్చింది. “నీనా” అన్న ఆ బాలిక రావుని మహిషమర్ధని పేరు తలపుకు తెస్తూ హాస్యం చేసింది. “ఎవరయ్యా ఆ బాలిక?నీ ప్రియురాలా!” “అవును. ఆమె కులాసాగా ఉన్నదో, లేదో నా మిత్రు లొకరూ చెప్పేరు కారు!” "ఏమీ ఉత్తరాలు రాలేదయ్యా?" “ఉత్తరా లక్కరలేదు. మా స్నేహితులకు తెలుస్తుంది. నువ్వు ఆలోచిస్తావేమి?” "ఏమీలేదులే. నీ పేరు ఇంగ్లండుకు పొగడుతూ పంపారటలే!” “అయితే నీ అందమైన ముఖంలో చిన్న అలలులాంటి ఆ ముడుతలు ఎందుకు?” “మహిషమర్ధని అంటే అర్థం ఏమిటి?” “మహిషమర్ధని అంటే, దున్నపోతుల చంపే తల్లి అని” “నీ ప్రియురాలికి అంత భయంకరం పేరు ఎందుకూ?” “అంత గొడవ ఎందుకులే, మీ ఊరు ఏది?” “టునీషియా” “నీ పేరు?” “నీనా” “ఎంత అందంగా ఉంది నీ పేరు కూడా!” “నీ ప్రియురాలికన్నా ఎక్కువ అందంగా ఉన్నానా?” “నా ప్రియురాలు ఎవరని నీ ఉద్దేశం? అది నా టాంకు.” "టాంకు!” “అవును.” ఆ బాలిక పకపక నవ్వింది. ఆమె వదనము ఆనందకాంతితో ప్రఫుల్లమైంది. “నేను నిజంగా భయపడ్డాను రావ్" అని ఆమె అన్నది. అతనికంతా అవగతమైంది. అతడు నవ్వుకొన్నాడు! ఆ శిబిర మంచముమీద పడుకొనియే ఆమె రెండుచేతులూ పట్టుకొని తన హృదయానికదుముకొనినాడు! బయట వైద్యము చేయబడుతున్న మహిషమర్ధని నిశ్శబ్ద గర్జనచేసి, సంతోషముతో నవ్వుకొన్నది.
అడివి బాపిరాజు రచనలు - 8 + 42 + కథలు వసుబాలుడు
వసుబాలరెడ్డి పరువుకల కమ్మవారి బిడ్డడు. గజపతుల రాజ్యమైన కొండపల్లి మండలం గుడివాడసీమలో “కురుమద్దాలి” అను పల్లెటూరు నుంచి శ్రీ రాయరాయ నరసింహ దేవరయ్యవార్లంగారు చక్రవర్తయి కొలువుచేయగా శివబాలరెడ్డి తన రెండెడ్ల బండిపై గూడుకట్టుకొని కతిపయ ప్రయాణాలు చేస్తూ విజయనగరం ప్రవేశించాడు. అప్పట్నుంచి కత్తి నడుముకుకట్టి, డాలు భుజాన వేసుకొని రాయలదండులో కాల్బలంలో జేరాడు. దళవాయి అవడం, చమూపతి అవడం, చివరకు శ్రీమూరు రాయరగండ, శ్రీకృష్ణదేవరాయలవార్లంగారి సేనాధిపతుల్లో ముఖ్యుడవడం శివబాలరెడ్డి అదృష్టమో! పతివ్రతా శిరోమణి అయిన అతని భార్య అదృష్టమో! విజయనగరంలో జన్మించాడు మన వసుబాలుడు. కాని పుట్టినప్పట్నుంచి వసుబాలుడు కవిత్వం ప్రారంభించాడు. “అమ్మ” “అక్క అనే మాటలు రాకముందే “తములై యెవ్వలు మకతికలను తయులై” అని పద్యాలు ఎవరికీ అర్థం కాకుండా గళ గ్రాహంగా చదివేయటం ప్రారంభించాడు. శివబాలు డతన్ని చూచి ఒక్కనిట్టూర్పు వదిలేస్తుండేవాడు. పెద్దనామాత్యుల శిష్యుడయ్యాడు. కవి స్వరూపం దాల్చాడు. వసుబాలరెడ్డి! తండ్రిగారి మోస్తరుగా కత్తికటారులు తిప్పడంలో చాకచక్యం ఎక్కడా కనబడలేదు అతని దగ్గర. శివబాలరెడ్డి తీరని విచారానికి ఎప్పుడూ ఉపశమన వాక్యాలు చెప్పేది వృద్ధులైన తమ్మన్న నాయకుడు. సేనానాయకులలో చాలా పేరు పొందాడు. ఆయనతో తన విచారమంతా వెళ్ళబోసుకున్నాడు శివబాలరెడ్డి నాయకుడు. తమ్మన్న: అబ్బాయికి యుద్ధం అంటే ఏమీ యిష్టం లేదా? శివ: సుతరామూ! ఈ రహస్యం తమతోతప్ప ఎవరితోనూ చెప్పలేదు. మావాడు - నాకు చెప్పడం సిగ్గుగా ఉంది - మావాడు పిరికివాడు కూడానండి! తమ్మన్న: ఆ! మరి మీరు! ఎలా తెలిసింది మీకు? మీ ఉద్దేశం ఏమిటి? శివ: (ఒక్క దీర్ఘవిశ్వాసం విడుస్తూ) చిన్నతనాన్నుండీ నేను చూస్తూనే ఉన్నానండి. చప్పుడు అవుతే ఉలిక్కిపడి కెవ్వున కేకవేస్తాడు! పిల్లినిచూస్తే భయపడేవాడు చిన్నతనంలో, చీకట్లో ఒక్కడూ ఉండలేక పోయేవాడు. ఒక్కడూ పడుకోలేకపోయేవాడు - తమ్మన్న: అదేమిటండీ అంతమాత్రం వల్ల - - - శివ: కత్తిపట్టలేడు. గుఱ్ఱంస్వారి చేస్తూ ఉంటే కొత్త పెళ్ళి కూతురు నడకలా ఉంటుంది. రక్తం కళ్ళజూస్తే మూర్ఛపోతాడు. నా కుటుంబంలో ఇంత దురదృష్టం ఇదివరకెప్పుడూ
అడివి బాపిరాజు రచనలు - 8 • 43 - కథలు లేదండి! మా అత్తవారి వైపునా ఈ పిరికితనం లేదండి. ఎక్కడనుంచి దాపురించిందో ఈదురదృష్టపు పిరికిదేవత. తమ్మన్న: కవిత్వం సగం పిరికిమందు పోస్తుంది! మీవాడు మంచి కవిగా? శివ: కవిత్వం వల్ల యీ పిరికితనం రాదనుకుంటాను, తిక్కన్న మహాకవి, మహామంత్రి, మహాదండ నాయకుడు. పెద్దనామాత్యులు చిన్నప్పట్నుంచీ మావాణ్ని బుజ్జగిస్తూ చేరతీశాడు. ఇప్పట్నుంచి కవిత్వం, గంటం, పత్రం. రాత్రిళ్ళు నిద్రపోడు, ఆపిచ్చివస్తే ఊ కూనిరాగాలు తీస్తూరాస్తూనే ఉంటాడు. తమ్మన్న: దీనికిఉపాయం నేను ఆలోచించి తమకు మనవి చేస్తా. శివ: ఈ రహస్యము అతి గోప్యముగా ఉంచి నా కుటుంబమునకు తాము ఉపకారం చేస్తే మిమ్మెప్పుడూ తలపోస్తూనే ఉంటాము. తమ్మన్న: నేనేమి చేసేది, కొన్నాళ్ళుపోయిన వెనుక చెప్తాను లెండి. పెద్దనామాత్యుని భవనముననే సదా వసుబాలుడు మకాం. ఇంటికి కూడా రావటం మానివేశాడు. ఆంధ్రభాషలో “విద్యాధర్మ చరిత్ర” అను నరవాహనదత్త విజయమును అసాధారణ కవిత్వం ధారాళంగా ప్రవహిస్తూ ఉన్న గ్రంథం రచించడమే కాక, కర్ణాటక భాషలో పదునెనిమిదేండ్ల బాలుడయిన వసుబాలుడు ఒక వ్యాకరణము, రామచరిత్ర అను కృతిని రచియించి రాయలకు అంకితం చేశాడు. సంస్కృతంలో నిధే అన్నారు. వసుబాలుణ్ణి కావ్య వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలన్నీ భాష్యాలతో పెద్దనామాత్యులు తన ప్రియశిష్యుడికి నూరిపోశాడని విజయనగర పండితబృందం అనుకుంటే శివబాలరెడ్డి సేనానాయకులు విని, తన భార్యతో 'అబ్బాయి కత్తి ఎలా ఉంటుందో తలచుకొని మూర్ఛబొయ్యే రోజులు వచ్చాయి' అని అన్నాడు. వసుబాలుడికి పారశీకం, అరబ్బీ, మహారాష్ట్ర భాషలు నేర్చుకుందామని తోచింది. అదే వెర్రిపట్టింది, తండ్రిని, గురువును వేపుకుతింటే సరే అని ఒప్పుకున్నారు. బీజపురం వెళ్ళడం మహోత్తమం అన్నారు. నవాబు గారికి స్నేహితుడుగా వెళ్ళడం మరీ ఉత్తమంగా! తండ్రిగారి దగ్గర నుంచి కొండపల్లి మండలాధిపతికి ఉత్తరం తీసుకొని వెళ్ళాడు. వారి సభలో నాలుగురోజులు గౌరవాలు పొందాడు. పండితులతో వాదించాడు: 'సింహం' పిల్లరా, సింహం అయితే ఎల్లాఉంటుందో' అని ఆస్థానకవులు డిల్లపోయేటట్లుగా ప్రతాపం చూపించాడు. శ్రీ మహారాజు మెచ్చుకొని, అతని ఉద్దేశం గ్రహించి బీజపురం నవాబ్ బహదూరు వారికి స్నేహపు ముద్రిక ప్రసాదించగా, అత డది తీసుకొని వెళ్ళాడు. ఒక ఏడాది నిరాటంకంగా బీజపురం నవాబు మన్ననకు పాత్రుడవుతూ, పండితులచే గౌరవం పొందుతూ, రాజబంధువుల స్నేహం సంపాదించుకుంటూ, ఆ భాషలు మూడున్నూ నేర్చుకున్నాడు. పండితుణ్ణి అయ్యానని తల ఊపుకున్నాడు కూడాను.
2
రాజవంశీకుడు మహమ్మదు ఇబిన్ బ్రహనల్లా ఉస్మాన్ అమీర్ జంగ్ నిజాముల్ ముల్కు అనే బాలుడూ, వసుబాలుడూ ఒక రోజున హుక్కా పీలుస్తూ కూర్చున్నారు. ఆ మహమ్మదీయ బాలకుని యింట్లో.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 44 ♦ కథలు అమీర్ఆంగ్: భాయ్, నీకు చదువు పూర్తి అయిందే, యింటికిపోరాదూ. వసు: ఎందుకు? అమీర్ఆంగ్: మా సుల్తాన్ బహదూర్ వారికిన్నీ విజయనగరం కిష్టరాయలకి యుద్ధం ప్రారంభమయింది. నీగతిఎట్లా అవుతుందో, ఆలస్యం ఎందుకూ? వసు: రాయలకి నవాబ్ బహదూర్ వారికిన్నీ యుద్ధంలేదుగా. సంధి రాయబారాలే జరుగుతూఉండేవిగా! అమీర్: వెర్రివాడా! మా సైన్యం సర్వంసిద్ధం. ఒక చిటికెలో బెల్గాం దగ్గరనుంచి ఉస్మాన్పూర్ దాకాసైన్యం బారులు తీరుస్తుంది. ఒక్క రాత్రిలో కృష్ణ దాటుతుంది. రెండవ రోజుకు ఆ విజయనగరం వాళ్లు నిద్రకళ్లు నలుపుకుంటూ ఉండగానే ఆ ఊరుమీదబడి నాశనం చేయడం. వసు: అబ్బా! విజయనగరం చాలా అందమైన పట్నం అంటారు. అది నిష్కారణంగా పాడుచెయ్యడమే? “అవసరం అయితే అంతే. ఇప్పుడు ముఖ్యావసరం కాబట్టి మగపురుగన్నవాడు కత్తిపట్టాలని సుల్తాన్ బహదూర్ వారి ఆజ్ఞ. సెలవు తీసుకుంటా. కటకపురినుంచి మహారాజావారి బేగిరావులతో నీ ఉత్తరాలు నాకు పంపుతూ ఉంటావుకదూ! నీ పెళ్ళి అయినప్పుడు నేను వివాహానికి హాజరు.” అని ఆ బాలుడు వసుబాలునికి సలాంపెట్టి చేయి ముద్దు పెట్టుకొని వీడుకోలిచ్చాడు. వసుబాలుడి గుండెల్లో రాయిపడింది. ఈపాడు యుద్ధాలేమిటి? ఒకళ్ళని ఒకళ్ళు లక్షలకొలది చంపుకోవడమే! అనుకున్నాడు. అతని చెవులు హోరుమన్నాయి. కళ్లు తిరిగిపోయాయి. రక్తమేఘాలు దశ దిశలు కమ్మినట్టే కనిపించాయి. యుద్ధం మొదలు పెట్టేలోపుగా, తాను నెమ్మదిగా గజపతుల రాజ్యంజేరి, అక్కడనుంచి విజయనగరం చేరాలి. ఎంత విద్వచ్చిరోమణి అయితేనేం: కళాహృదయం కలవాడయితేనేం; సరశృంగారరస వీచికా సల్లాప సంతోషజీవి అయితేనేం! శ్రీశ్రీ రాయలవారు ఈ యుద్ధాల విషయంలో కటికవారే!' అనుకున్నాడు వసుబాలరెడ్డి, ఉన్నరాజ్యం చాలదా? అబ్బా! రెండుగుర్రాల రథంమీద నవాబుకోటలో మైకమే దివానీమహల్ నుంచి తనవిడిది మంజిలు వస్తూవుంటే లోకం అంతా ఫిరంగులు మోగిపోతున్నట్లే అయింది. కత్తులు శాపిళ్లు, కఠార్లు పొడిపిళ్ళు, శూలాల మెరుముళ్లు, సున్నీలపరుపుల్లు మహావేగంతో ఎదుట ప్రత్యక్షమయ్యాయి. అతడు వణికిపోయాడు. జేవురించిన భీభత్సరూపాలతో భయంకర కరాళాలతో పిశాచాలు ఒకటినొకటి పీక్కుతింటూ వికారతాండవం చేస్తూ అనంతంగా కోటాను కోట్లు కనబడ్డాయి. ఉలిక్కిపడి బండివాడితో మాట్లాడితే ధైర్యం అనుకొని "ఏమయ్యా బగ్గీవాలా! పాదుషావారికి ఎన్ని అరబ్బీ గుర్రాలున్నాయి?" అని ప్రశ్నవేశాడు. బగ్గీవాలా: లక్షల్ - సఫేద్ ఘోడా - హౌరీ అందం, వేగం విష్వాసం - లడాయిమే బయం గియంనై - ఆఖరి ప్రాణం పోవాలా- రౌతు కాపాడవాల - మహారాజ్! వసు: యుద్ధానికేమిగాని
- అడివి బాపిరాజు రచనలు - 8 + 45 + కథలు బగ్గీ: ఖుదావంద్, యుద్ధం అంటారే, నేన్కు వెళ్ళి యీయాళ. రేపు యిరోదుల్కు ఎంతామంద్కి సంపియేస్తాన్ - వసు: సరే, సరేలే! ఆలోచనతో ఇంటికి వచ్చినాడు వసుబాలుడు! బసలో తన దేవిడీ అంతా కంగారుగా ఉంది. తురక సర్దారులు కొందరువచ్చి వారి సామానంతా వెదుకుతూ ఉన్నారు. రెడ్డి దడదడమనే గుండెతో లోపలికివెళ్ళి, “ఏమిటీ దౌర్జన్యం” అన్నాడు. నలుగురు సిపాయిలు, దళవాయి రెడ్డిగారి పెట్టెలు బేడలు అన్నీ కలగాపులగంచేసి, మంచిమంచి జరీకండువాలు, ధోవతులు అన్నీ చిందరవందరగా పారేసి ఏమిటో వెదుకుతూ ఉన్నారు. రెడ్డిగారు లోపలికి రాగానే ఆ దళవాయి పందిరి మంచంమీద కూర్చున్నవాడు లేచి సలాముచేసి, “జనాబ్ మీరు పరాయిదేశం వాళ్ళు. మీ దగ్గర ఏమైనా రాజద్రోహకరమైన గ్రంథం ఉందేమోనని వెదుకుతున్నాము. ఏమీ కనబడలేదు' అన్నాడు. వసుబాలునకు ఏమన్నా ధైర్యమనేది వుంటే మటుమాయమైపోయింది. 'నువ్వెవరవు! నాసంగతి తెలుసునా! ఇదిగో శ్రీసుల్తానాసాహెబ్ బహదూర్ వారి ఫర్మానా!' అని దళవాయి చేతికిచ్చాడు వసుబాలుడు. సిపాయి లందరూ మోకరించారు. దళవాయి వంగి సలాముచేసి ఆ ఆజ్ఞాపత్రం నెత్తిమీద పెట్టుకుని కన్నులనద్దుకొని ముద్దుపెట్టుకొని “శ్రీసుల్తాన్ శ్రీ కటకపురనివాస రాజాధిరాజ అనంతనాధ సర్వశత్రువిచారణ శ్రీ గజపతి రాజ బహదూర్ స్నేహితుల రాజ సభికుడైన వసుబాలరెడ్డిగారు మా రాజ్యము విడిచి క్షేమంగా వారిరాజ్యం చేరుకోడానికి చేసే ప్రయాణంలో ప్రజలు, సేవకులు, సేనాధికారులు, తాబేదార్లు యావన్మందిన్నీ సర్వగౌరవాలతో వారికి నౌఖరీ చేయవలసింది. ఇది పాదుషా ఆజ్ఞ” అని చదివాడు. అందు చివర నవాబ్ ముద్ర ఉన్నది. ఈ ఆజ్ఞాపత్రం చూచేటప్పటికి ఆ దళవాయి కొంచెమెచ్చుతచ్చుగా వణికాడు అస్తమానం సలాములే - “అన్నీ సర్దండి” అని పారశీకంలో సిపాయీలకు ఆజ్ఞయిచ్చాడు. అది చూచి పౌరుషంతో వసుబాలవర్యుడు పక్కున నవ్వాడు. ― 1 - అంతా నిమిషంలో సర్దారు. దళవాయిసలాముచేసి, “జనాబ్ ఖుదా వంద్ మీరు త్వరగా మీదేశం పొండి తాళికోట మీదుగా, అక్కడ మా సైన్యాలు వుండయి. ప్రజలు మిమ్మల్ని చాల గౌరవం చేస్తారు. నేను తాళికోట తహసీల్ తాలుక్టారులకు అంచె పంపుతుండా. తమరు ఆరుబగ్గీలు, నాలుగు ఒంటెలు, ఒక ఏనుగు, ఇరవై లష్కర్ హకుం.” వసు: తాళికోటలో శుభ్రమైన బస ఉందయ్యా” "జీహాఁ, పాండేకరు పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు, చాలా మంచిది.” వసు: సరే, యిక నువ్వు పోయి నా వెంటవచ్చే దళం పంపించు; జల్దీ! ఈ లోపుగా అన్నీ సర్దివెయ్యడం అయ్యింది. ఆ దళవాయి, సైనికులు వెళ్ళిపోయారు. వసుబాలుని గుండె నిమ్మళించింది. ఏమో! తాను రాయల మనిషి అని గ్రహించి, ఇన్నాళ్ళనుంచీ వాళ్ళను చేసిన మోసం ఊహించి కొరత వేయిస్తే! చాలా గొప్పగండం తప్పింది. ఇక్కణ్నుంచి త్వరగా ప్రయాణాలు సాగించి వెడలిపోతే కొంత ప్రాణం కుదుటపడుతుంది.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 46 ♦ కథలు 3
తాళికోటలో పాండేకరు గృహంలో మకాంజేశాడు. వసుబాలరెడ్డి స్నానం భోజనం పూర్తిజేసుకొని ఊరుచూడ్డానికి బయలుదేరారు. అక్కడ కొన్ని గొప్ప దేవాలయాలున్నాయి. మంచి మసీదుంది. శిల్పచాతుర్యము, భవననిర్మాణ కుశలత చూచి చాలా మెచ్చుకుంటూ బజారులో చిత్రమైన వస్తువులు కొన్ని కొనుక్కుంటూ, వసుబాలరెడ్డి కూలివాని నెత్తిమీద సరుకులతో యింటికి వచ్చినాడు. ఈ తెచ్చిన సామాను తన గుండ్రని తోలు పెట్టెలలో, కొంత కావడి పెట్టెలలోను సర్దుకుంటున్నాడు. అప్పుడు తన బట్టలమధ్య దివ్యమైన రవిక ఓటి కనబడ్డది. ఆ రవిక పొంకం చూసేటప్పటికి వసుబాలుని హృదయం హాయిమనే రాగాలు పాడింది. ఘుమఘుమ పరిమళించింది. ఆ రవిక, జరీపువ్వులు ఆణిముత్యాల అంచులుకుట్టిన ఆ మేలిపట్టు ఊదా రవిక ముట్టకోవడంతోనే వసుబాలుడి ఒళ్లు జల్లుమంది. ఒక దివ్యసుందర విగ్రహయైన బాలామణి రవిక విప్పి, మడత పెట్టి తన పెట్టెలో పెట్టినట్లేవుంది. ఆ ఆనందంలో ఈ రవిక తన పెట్టెలోకి ఎల్లా వచ్చినది అని ఆలోచన కలిగింది. విద్యానగరం బయలుదేరినప్పటినుండి వుందా? తన పెట్టె లక్షసారులు సర్దుకున్నాడే! వుంటే కనబడదూ? పైగా తన ఇంటిలో ఇల్లాంటి రవిక తొడుక్కునే బాలికలు ఎవరున్నారు? రవిక చేత్తో పట్టుకునే వున్నాడు. ఇంకా గుడ్డలు తీస్తూవుంటే మనోహరమైనచీర కనుపించింది. మాయా? కలా? పరవశం చేసేటంత అందంగా వుంది ఆ చీర. ఉదయారుణ కాంతిలా మృదువుగా వుంది. వెన్నెలలా లాలిత్యం తాల్చింది. చుక్కల మినుకులా లేనే లేదన్నట్లుగా అతిసన్నదనం. వేయి పూవులతావులు ప్రాణాలు కలిగించే మడతలు అక్కడక్కడ! ఈ యింద్రజాలం అర్థంకాలేదు. ఆలోచనలేని ఆనంద తన్మయత్వములో ఒక నిమేషం మునిగిపోయి వసుబాలుడు ఇంక “అనగా అనగా ఒక రాజకుమార్తె రావాలి ” " అంటూ ఉండగా గభాలున తలుపు తోసుకొని మేఘంలో మెరుపులా ఒక వ్యక్తి సుగంధంతో నిండిపోయిన సుడిగాలిలా వచ్చి వసుబాలుణ్ణి కౌగిలించుకొని “నాధా, ఎన్నాళ్ళకు కలుసుకున్నాము!” అన్నది. క్వచిదుష్టాంగాలు అతని దేహాన్ని చుట్టివెయ్యడంతోనే అతనికి కెరటాల్లాంటి పులకరాళ్ళు పుట్టినవి. కవుగిలించిన ఆ వ్యక్తి అంతతో పోనిచ్చినదా? కళ్ళు నిమీలితాలు చేసి, వసుబాలుడి తలవంచి అతని పెదవులమీద ఊపిరాడకుండా ముద్దుల వర్షం కురిపించింది. వసుబాలుడు తన్మయుడై అప్రయత్నంగా అద్భుతంగా ఆనందతమంగా వచ్చిన ఆ సుధాప్రవాహంలో ప్రాణాల్ని ఎక్కడికో పోనిచ్చి ఏమీ తెలియకుండానే ఆ వ్యక్తిని తన వక్షానికి గట్టిగా అదిమివేసుకున్నాడు. ఎదురు ముద్దులు బదులిచ్చాడు! ఇంతలో ఆ నూతన వ్యక్తి కౌగిలివదలించుకుంది. వెనుకకుపోయి అచ్చట ఉండే ఒక పీఠంపై చదికిలబడి “ఇప్పటికి నాప్రాణం మరల వచ్చింది” అని మెల్లగా అనుకున్నది. ఆమె పదహారేళ్ళ బాలప్రాయాన వెలిగిపోయే బాలిక. చాలా అందముగా ఉంది. మోము మూటగట్టిన ముద్దులే. మంచి వెడల్పయిన కళ్ళు. ముక్కు సమంగా సన్నంగా
అడివి బాపిరాజు రచనలు - 8 +47 + కథలు రాగంలోని "సంగతి" లా ఉంది. ముద్దకరనిరం మొగ్గలే పెదవులు. చిన్ననోరు! దివ్యవిలాసమూర్తి. గాలిచేత చెదరిన నీలి మబ్బులా ఆమె జుట్టుముంగురులు చెదరిపోయి వున్నాయి. కళ్ళలో నీరు తిరుగుతున్నది. కాంతులు రెండు ఆ కళ్ళలోనే వెనక వెనక కనబడినై. పెదవుల చివర సంతోషాన్ని విషాదాన్ని సమైక్యంచేసిన సుడిగుండాలు అతి చిన్నవి తిరుగుతున్నవి. వచ్చాను.' 'మీరు పంపిన బేగిరావులేఖ అందగానే ఆలస్యం లేకుండా అందలం మీద వసుబాలరెడ్డికి పిచ్చిఅన్నా ఎత్తివుండాలి. లేక చైతన్యం అన్నా తప్పి వుండాలి. తెల్లబోయి అలాగే చూస్తూ వున్నాడు. మాటలేదు. ఆ అమ్మాయితో వచ్చిన దాసీలున్నూ ఆ యింట్లోనే ఉన్న పనికత్తెలున్నూ వెళ్ళిపోయారు. ఆ బాలిక లేచి ఆ గదితలుపు మూసుకున్నది. అప్పుడామె కళ్ళు లేడికళ్ళలా బెదురుతున్నవి. రెండు చేతులతోనూ కళ్లు మూసుకొని వెక్కివెక్కి ఏడవటం మొదలు పెట్టింది. ఇదంతా తన చరిత్ర కనుక్కోటానికి నవాబు పన్నిన తంత్రం కాదుగదా అనుకున్నాడు వసుబాలుడు. అతనికి చెమట పట్టింది. అయితే ఈ అమ్మాయి తప్పకుండా పక్కాబోగంది. ఎంత పన్నాగం పన్నింది. తనగుట్టు తెలియడానికి! ఏమన్నా పొరపాటుపని చేయలేదు గదా తాను! అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాయల కవిత్వాలు వింటూ సమస్త భోగాలు అనుభవిస్తూ ఉండక యీ యుద్ధాలు ఎందుకయ్యా! తనకి ప్రాణ భయం లేదుగదా? అతని ఆలోచన లేడిపరుగులా పరుగెత్తుతోంది. “వసుబాల రెడ్డివర్యా!” ఉలిక్కిపడి తలయెత్తిచూశాడు వసుబాలుడు. ఆ బాలిక తనవైపు దీనత్వం వెదజల్లే అపాంగవీక్షణాలు పంపిస్తూ ఉంది. “మహావీరుడగు శివబాలరెడ్డి సేనానాయకుణ్ణి స్మరించుకోండి.” ఏమిటది? ఎవరీబాలిక? తన గుట్టు అంతా తెలిసింది. నవాబు పన్నిన పన్నాగం ఇది! సాయంత్రంలోపుగా తల యెగిరిపోతుంది. పారశీకభాష నేర్చుకోవటానికి ఎందుకు బీజపురం వచ్చాడో! వసు: నువ్వు ఎవరవు? బాలిక: మాది రాయచూరు కాపురము. వసు: అయితే? బాలిక: నేను ఈ దేశంలోంచి పారిపోవాలి. వసు: ఏమిటీ?
4
బాలిక: బీజపురం నవాబుకు శ్రీ మూరురాయరగండ శ్రీకృష్ణరాయ సార్వభౌములవారికి యుద్ధం వచ్చింది.
అడివి బాపిరాజు రచనలు 1 8 ♦ 48 కథలు వసు: ఎందుకు? బాలిక: శ్రీకృష్ణ రాయలయ్య వార్లంగారు రాయచూరు ముట్టడించారు. వసు: ముట్టడిస్తే? బాలిక: రాయచూరు నవాబుది. అందుకని యుద్ధం. వసు: నాకీ గొడవ అంతా ఎందుకు? బాలిక: మీచేతిలో నాప్రాణం వున్నది. వసు: నీది రాయచూరు కాపురం అయితే యీయుద్ధం అంటే నీకు భయం ఎందుకు? బాలిక: రాయచూరు పూర్వకాలం నుంచి విజయ నగరం వారిది. వసు: అది నువ్వు పారిపోవటానికి కారణమెట్లా? బాలిక: రాయచూరులో వుండే ప్రజలంతా విజయనగర పక్షపాతులు. నేనున్నూ విజయనగర పక్షపాతిని. అందుచేత విజయనగర రాజ్యంలోకి పోవాలి. వసు: నువ్వు ఇక్కడ వుంటే ఏమి భయం? నువ్వు యిక్కడ వుండడం ఎలా తటస్థించింది? బాలిక: నేను ఈ చుట్టుపక్కల మా చుట్టాల యిళ్ళల్లో ఉండటం తటస్థించింది. రాయచూరు సంగతులన్నీ గ్రహించాను. నేను శ్రీ రాయలవారి వేగులవారిలో ఒక రైతు అంతః పుర నారీమణులతో మెలగుతూ అనేక వేషభాషలతో సంచరిస్తూ రహస్యములు ఎన్నో గ్రహించాను. అవన్నీ ఎల్లుండి ఉదయంలోగా అప్పాజీవారికి అందాలి. అట్లా అందాలంటే తమరొక్కరే ఆధారం. వసు: మా ప్రభువుకున్నూ మీ రాయలవారికిన్నీ మనస్పర్ధలు చాలా వున్నాయి. మాది కటకపురం. నేను నవాబుగారికి స్నేహితుణ్ణి. నేను నీకు ఎట్లా సహాయంచేస్తాను? నా దగ్గిర మా ప్రభువు గజపతి మహారాజుల వారి ఆజ్ఞాపత్రము శ్రీ నవాబుగారి ఫర్మానాయున్నూ ఉన్నవి. బాలిక: మీరన్నది కొంతనిజమే కాని, మీ చరిత్ర నాకు పూర్తిగా తెలుసును. శ్రీ శివబాల రెడ్డివర్యులను అందుకోసమే జ్ఞాపకం తెచ్చుకోమన్నా. నేను నవాబు తరఫు మనిషిని అని మీరేమిన్ని భయపడవద్దు. మీరీ వూరు సంవత్సరం క్రితం వచ్చి పారశీకం నేర్చుకున్నారు. మీ గ్రంథాలన్నీ చదివాను. ఆ ఆఖరు ముక్కకు వసుబాలుడి హృదయం హాయిమంది. "నేనున్నూ, మా తండ్రి ప్రతాపరాయలవారున్నూ రాయచూరులో రాయలవారి వేగు సైన్యంలో పనిచేసేవారం. అంతఃపురాల్లోని రహస్యాలు గ్రహించడంలో అతి చమత్కారంగా పనిచేస్తానని మా నాయనగారంటారు. ఆయన గ్రహించిన రహస్యాలు, నేను గ్రహించిన రహస్యాలు నా దగ్గిర వున్నై. ఆయన దారిగా ఆయన. నాదారిగా నేను పారిపోదామని అనుకుంటూ వుండగా, ఆయన పట్టుపడ్డారు. మా యిద్దరికి తప్ప యింక ఎవ్వరికీ యీ రహస్యాలు తెలియవు. మీ చరిత్ర మొదటినుంచీ నాకు తెలుసు. మాతండ్రిగారు పట్టుబడిన తర్వాత నేను మా చుట్టాల యిళ్ళలో మాయమయ్యాను. నా సంగతి నవాబు వేగు సైన్యాధిపతికి, అతని తాబేదార్లకు చాలామట్టుకు తెలియవచ్చింది.
అడివి బాపిరాజు రచనలు - 8 49 కథలు పూర్తిగా తెలియదు. చిన్నతనాన్నుంచి మగబిడ్డలు లేని మా తండ్రి నాకీ వేగువిద్య చాలా బాగా నేర్పారు.” వసు: అయితే నేను నీకు ఎట్లా సహాయం చేయగలను? బాలిక: మీ దగ్గిర నవాబు ఫర్మానా వుంది. అందులో వసుబాల రెడ్డిగారు అన్నది పంక్తిచివర ఉన్నది. అక్కడ భార్యతో అని చేరిస్తే సరిపోతుంది. ఆమె ముఖం సిగ్గుతో కెంపువారింది. వసు: నువ్వు అవివాహితవా? ఆ బాలిక ఔనని తలవంచుకొనే తలూపి, కన్నులెత్తి అతనిమోము ఒకసారి చూచి మళ్ళీ కనురెప్ప వాల్చింది. వసుబాలునికి ఏలనో ఆనందం వరదలుకట్టి సెలఏరులా పరవళ్ళెత్తింది. వసు: నువ్వుచెప్పే సంగతులు యదార్థములన్న గుర్తేది? బాలిక తలెత్తిచూచి, మరలవాల్చి చిరునవ్వులు పెదవుల చివర సుడులు తిరుగుతూ ఉండగా వెనుకకు తిరిగి ఏదో వస్తువుతీసి అతనివైపు తిరిగి అరచేతిలో ఉంచుకొని అతనివైపు చేయి చాచింది. అది శ్రీకృష్ణరాయ సార్వభౌముని ముద్రిక. విద్యానగర ప్రజలలో చాలా కొద్ది మందికే తెలుసును. వసుబాలుడు ఆశ్చర్యం పొంది, గడగడ వణికి, ఆ ముద్రిక ఆమె హస్తంలోంచి తీసి కన్నులు కద్దుకొని, శిరస్సుపై ఉంచుకొన్నాడు. అతనికి ఆ బాలిక అంటే భయమూ, భక్తీ, గౌరవమూ కలిగాయి. “సరే, సరే, అట్లాగే నీ ఇష్టంవచ్చినట్లే చేయి; కాని నేను మాత్రం ఆ ఫర్మానామాత్రం దిద్దలేను.” “ఆపని నాదండి. ఆ ఫర్మానా నాచేతి కివ్వండి.” “కాని నా ఫర్మానాలో ఉన్న సంగతులన్నీ నీ కెట్లా తెలిసినవి?” “అయ్యా బీజపురంలో మిమ్మల్ని తనిఖీ చేయడానికి వచ్చిన ముస్లిం దళవాయి, సైనికులు శ్రీచక్రవర్తి వేగు సైన్యంలో ఉన్నవారే!” వసుబాలుడు అత్యంత ఆశ్చర్యంలో మునిగిపోయాడు. “అయితే నా పెట్టెలో వున్న రవికా, చీరా నీవా? అవి బీజపురంలోనే ఆ దళవాయి నా పెట్టెలో సర్దిఉన్నాడు కాబోలు!” “అవి నావే! ఆ దళవాయే మీ పెట్టెలో పెట్టాడు. ఆయనే మీ కీయబడిన ఫర్మానా చూచాడు. మీమీదే మావేగు ఆధారపడిఉన్నదని మా నాయకులు నిశ్చయంచేసి మిమ్మల్ని సహాయం కోరుతున్నారు” అని అంటూ ఆమె ఫర్మానా తీసుకొని, తన కాటుకభరిణ తీసింది. ఆ భరిణెలో రెండు రహస్యమైనమీటలు నొక్కగానే ఒక చిన్న అర తెరుచుకుంది. ఆ అరలో సిరా ఉన్నది. ఆ సిరాతో అతని పేరుతో పక్కనే 'ఆమె భార్యతో' అని నాలుగు రేఖలతో పారశీకంలో రచించింది.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 50 - కథలు 5
వసుబాలుడి కవిహృదయం యావత్తూ ఆ బాలికలో లయమై గంగా యమునా సంగమమైంది. ఆమె కౌగిలింతవల్ల స్మృతి వచ్చినప్పుడల్లా ఒళ్ళు ఝల్లుమంటూనే ఉంది. ఈ పదహారేళ్ళ బాలిక ఎన్నికష్టాలకైనా ఓర్చి స్వామికార్యం విజయంతో నిర్వహిస్తున్నది. ఈ బాలిక తన విషయంలో జరిపిన తంతు ఇతరులకంటే కూడా జరపలేదుకదా? అనిఅనుకున్నాడు. అప్పుడా బాల తానెక్కిన జోడుగుర్రాల బండిలోనుండి అతన్ని వాలుచూపులతోనే గమనిస్తూ, “వసుబాలరెడ్డిగారూ! నా విషయంలో కొన్ని అపోహలు మీకు రావచ్చును. నేను నా రహస్య చారిణీ చరిత్రలో మా తండ్రి గారిని దక్క ఇంకొక పురుషుని తాకలేదు. మీ విషయంలో “నువ్వు ఈలా ఈలా చేయి!" అని మా తండ్రిగారు ఆజ్ఞ యిచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం.” “అబ్బేబే!” అని వసుబాలుడు ఆమెకు అడ్డము వచ్చినాడు. అతనికి చిరుచెమటలు పట్టినవి. ఈ బాలిక తన హృదయంలోని ఆలోచన యెట్లా గ్రహించగలిగింది! అంతటి దివ్య సౌందర్యాంగి, ఉత్తమ చరిత్ర యెప్పుడూ హీనత్వంలో పడిపోయి ఉండదు! అయితే తనయెడ అట్లా సంచరించవలసిందని ఈ బాలికతండ్రి ఎట్లా ఆనతియ్యగలిగినారు? కాని తన విషయంలో ఈ రీతిగా విచిత్రంగా సంచరించమని ఎందుకు చెప్పి ఉంటారు? ఇందులో ఏదో పరమార్థం ఉందని అతడనుకొన్నాడు. ప్రేమాలోచనలు! మళ్ళీ అయ్యో అన్న భయం! ఏమిటి ఆమె తన్నలా ముద్దుపెట్టుకోడానికి కారణం? భార్యగా నటించడం అంత ఎక్కువగా! వారు ప్రయాణంచేస్తూ ఉన్నారు. అతను గుఱ్ఱంమీద అధివసించి ప్రయాణం సాగిస్తున్నాడు. అతని ఆలోచనలు గ్రహించినట్లా బాలిక "రెడ్డి ప్రభూ! నాతో వచ్చిన దాసీలు, మీ ఇంట్లో ఉన్న దాసదాసీలు నవాబు వేగులోవారు. అందుకని నేను అలా నటించవలసి వచ్చింది. అప్పటికిగాని వారి అనుమానం పోలేదు. ' " ఆ మాటలు అతని హృదయాన్ని క్రుంగచేశాయి. అంతేనా. నటనా? లేకపోతే తనకూ ఆమెకు సంబంధం ఏమిటి? మహారాజ కార్యానికి తన శీలం కూడా శంకించడానికి వీలయిన నటన చేస్తే తాను పశువై ఆమెకు యెదురు ముద్దులు - గట్టిగా - గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఓహో! ఆ క్షణం ఆద్యంత రహితత్వమొందింది. ఆమె పెదవులంత మధురముగా ఉన్నవేమి? ప్రియురాలి పెదవు లంత మధురముగా ఉండునేమి? అబ్బా! ఈ ఆలోచన లేమిటి తనకు! ఈ బాలిక ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్తుంది. ఈ అమ్మాయి దగ్గిర ఎవ్వరు రహస్యం దాచుకోగలరు? వసుబాలు డెక్కినగుఱ్ఱం ఆమె బండి వెనక్కు పోనిస్తాడు. ఆమెను ఎన్నోవిధాల వర్ణించుకుంటాడు.ఇది ప్రేమా? అనుకుంటాడు. ఈమె తండ్రి ఎవరు? ఈలా ఈమెను ఒంటరిగా విడిచి పారిపోయాడు కదా! ఎలాగో విధివశాత్తు తానక్కడ ఉండడం సంభవించింది. లేకపోతే ఆమె బ్రతుకేమి గావలె?
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 51 ♦ కథలు ఎల్లాగ తాను ఈ నవాబు సైన్యాలు దాటడం? ఏలాగు ఈ బాలికను తాను సురక్షితంగా శ్రీనవాబు సైన్యాల పాలపడకుండా కాపాడుట? ఈ బాలిక ఎంత తెలివైనది! ఎంత చక్కగా మాట్లాడింది. తాను ఎంత నేర్పుగా వ్యాపారం సర్దుకువచ్చిందీ! ఎలాటి క్లిష్టమైన స్థితికి వచ్చినా ఆ బాలికే అన్నీ సర్దుకుపోగలదు! అదృష్టవశాత్తు అతని ప్రయాణం కూడా రాయచూరు ప్రక్కనుంచే వెళ్ళవలసి ఉన్నది. అక్కడనుంచి ఉళింది, అక్కడనుంచి పానగల్లు, అక్కడ నుండి దేవరకొండ, పిల్లలమర్రి, అటునుండి విజయవాడ అలా బీజపూరు నవాబు ఉద్యోగులు అతని ప్రయాణం ఏర్పాటుచేశారు. దారిపొడుగునా, బీజపుర సైన్యాలే ఎదురుపడుతున్నవి. వారు మన ప్రయాణీకుల్ని ఆపుచేయడం, మన యాత్రికులు సుల్తాన్ గారి ఫర్మానా చూపిస్తుండడం, సైనికులు ఆ ఫర్మానాకు సలాములు చేయడం పోనివ్వడం నాలుగైదుసారులు జరిగింది. ఎప్పటికప్పుడు వసుబాలుడి ప్రాణాలు అయిదున్నూ అతని అరచేతిలోకి చేరేవి. రెండురోజులైన వెనక వసుబాలుడు, ఆ బాలికయు తమ అనుచరులతో ఉళింది చేరుకొన్నారు. దారిపొడుగునా ఆ బాలవసుబాలునికి వంటచేయించడం, వడ్డింపించి, తానాతని వెండి కంచంలో అతను భోజనం చేసినవెనుక భోజనం చేయడం మొదలైన పనులు చేసేది. అతనికి తాంబూల మందిచ్చేది; వారితో కూడా వచ్చే చిన్నలష్కరులో, అమ్మాయి దాసీలలో పిల్లిచూపులుగల వేగులున్నారని ఆమె అతనితో రాత్రిళ్ళు వాళ్ళిద్దరు ఒంటిగా ఉన్నప్పు డొకనా డామె యాతనితో చెప్పింది. ప్రయాణపు పట్టి మంచములు వారి సామానులో ఉన్నవి. వారు తమ గదిలో చేరిన కొంతసేపటివరకు ఆమె వీణ వాయించేది. అతని పాదాల నొత్తునది. ఆ వెనుక ఆమె తలుపు గడియ వేయునది. గడియవేసి, తలుపుకు తెరకప్పి తన మంచము దూరముగా లాక్కొని, ఆమె నిర్భయముగా నిద్రపోవునది. అతడు నిద్రలో ఉన్న ఆ బాలిక అందాలు గమనిస్తూ, ఆమెను గూర్చి ఒక బాలికోపాఖ్యానము రచించసాగాడు. అతని ఆలోచనలకు మేరలేదు. తన గురువు రచించిన మను చరిత్రలో ప్రవరాఖ్యునిలా తాను అసిధారావ్రతమాచరించాలా? ఏమిటీ విపరీత దాంపత్యము? తమ ఈనాటి చరిత్ర సుఖాంతమైనచో, ఆ బాలిక మరల తనకు కనపడునా? ఎవరి బాలిక ఈమె! ఈమె తండ్రి బీజపూరు సైనికుల బారినుండి తప్పించుకొని పారిపోయినట్లు దారిలో ఒక రెడ్డి వేషమున ఒక చారుడు యాదాలాపమున వీరికి తారసిల్లినట్లు వచ్చి ఏదో వారిసంజ్ఞల ప్రకారము ఆ బాలికకు తెల్పి తనదారిన తాను పోయినాడు. ఉళింది సాయంకాలానికి చేరుకొని దేవాలయ సత్రంలో బసచేశారు. ఊరంతా బీజపూరు సైన్యాలు నిండివున్నాయి. సత్రంలో దిగగానే ఒక సర్దారు కొంతమంది ఫౌజుతో వచ్చి వసుబాలుణ్ణి నవాబుగారి ఫర్మానా చూపించమని కోరాడు.
అడివి బాపిరాజు రచనలు 1 8 ♦ 52 కథలు వసుబాలుడు లోపల వణికాడు. కొంచెం కోపము వచ్చింది. మాట్లాడకుండా మొఖం చిట్లించుకుంటూ ఫర్మానాను తీసి చేతికిచ్చాడు. ఆ సరదారు దీక్షతో ఫర్మానాను ఎగాదిగా చూశాడు. కాగడాలు తెమ్మని ఆ వెల్తురులో పరీక్షించాడు. సర: మీ భార్య పేరు? అమ్మయ్యో. ఇదేమి ప్రశ్న? వసుబాలుని గుండె గుభిల్లుమన్నది. అయినా ఆమె పాఠాలు కొన్ని చెప్పిఉన్నది. “సిరియాలదేవి” అని అతడు ప్రతివచనమిచ్చాడు. సర: మీకెప్పుడు వివాహం అయింది. వసు: ఎడన్నర్ధం. సర: మొదట వచ్చేటప్పుడు భార్యతో వచ్చారా? వసు: లేదు. కాని మా అత్తవారూరికి బేగిరావుటపా పంపాను. ఆవిడ వచ్చింది. సర: ఏ వూరినుంచి? వసు: మధిర దగ్గర మడవకొండ. సర: అవును, మీరు కొండపల్లి జాగిరునుంచి వచ్చి ఉంటార్. మాకు అర్థం అయింది. మాకు మీ సంగతి ఇది వర్కు తెల్సును. అయితే మీరు మా బీజాపూరునుండి యెల్లేయాల. మీబీబీని రప్పించారు. ఆ అత్తవార్కీ ఇంట్కీ ఎల్లలేకపోయార్ మీరు ఒక్కరే? వసు: ఖమ్మం మెట్టులో మా భార్యగారి మేనమామగారు ఉన్నారు. వార్నిచూచి అక్కడ నెలరోజులు మకాం సేద్దాము అనిన్నీ, కలిసిప్రయాణం చేయడం పడుచువాళ్ళకు సరదా కాబట్టిన్నీ - ... సర: సరేనయ్యా, పయానంలో ఔరత్ ఉంటే దొంగలిబయం ఎక్వాకాదు అండీ? వసు: మీ రాజ్యంలోను గోలకొండ రాజ్యంలోనూ మేము దొంగలికి భయపడం. ఆ ముక్క వసుబాలుడనగానే, సరదారుకు ఆనందం కలిగింది. అతడు మళ్ళీ మాట్లాడకుండా వసుబాలుణ్ణి ఒక గదిలోకి తీసుకొనిపోయి, అన్ని దుస్తులు విప్పించి శల్యపరీక్షచేశాడు. “సరే, మీరుపొండి!” అని ఆ సరదారు అన్నాడు. "మీకి భార్యకి తనిఖీ చెయ్యాలి మాలో ఆడవేగువాళ్ళు వున్నారు అండీ. వార్కి తనిఖీ చేస్తారు. సిత్తం” అని ముగించాడు. వసు: ఏమయ్యా శ్రీగజపతి మహారాజువారికి ముఖ్య సభ్యుల్లో ఒకణ్ణి. వారి శ్రీముఖం ఉన్నది. వారికి ప్రాణస్నేహితులైన శ్రీశ్రీ సుల్తాన్ బహదూర్ వారి ఫర్మానా ఉన్నది. అప్పటికీ నువ్వు అగౌరవం చేస్తున్నావు. ఇది మా ప్రభువుకు విన్నవించుకోవాలి. అటుపైన ఏమిజరిగేదీ నువ్వే ఆలోచించుకో. సుబే: సలామ్! మీరు చెప్పింది నిజం. అయితే నేన్ బీజపూర్ వేయి సైన్యం సరదార్. మా రాయసూర్కా రహస్యాలన్ని ఒకటి అడ్డి మీకీ ఔరత్ అంతా తీస్కుపోయింది. ఆమె మాయామంత్రంలా మాయం అయిపోయింది అండీ! అందుకు మేము ఈలాంటి కట్టదిట్టాల్కు చేషాం; అందుకు మాకీ క్షమించాల.
అడివి బాపిరాజు రచనలు 1 8 ♦ 53 కథలు ఇంతలో ఆ బాలిక పరీక్ష అయింది. ఒక స్త్రీ మేలి ముసుకు వేసుకువచ్చి ఒక కాగజుక్క ఆ సరదారుకు ఇచ్చింది. అది వసుబాలుడు తన మామగారికి భార్యను పంపమని రాసిన ఉత్తరం - భార్యను త్వరగా పంపించమని. మడవకొండ మామగారి నివాసగ్రామం. తాను కొంతకాలం బీజపూరులో భార్యతో ఉండాలని ఉన్నదనీ, తమ పారశీభాష నేర్చుకోడం పూర్తికాగానే, తానూ తనభార్య బయలుదేరి ఖమ్మం మెట్టుపోయి అక్కడ నెలరోజులు ఉంటామనీ ఆ తర్వాత మడవకొండ వస్తామనీ వసుబాలుడు మామగారికి రాసిన ఉత్తరం. సుబే: అయ్యా నేను సెప్పిన లడ్కీకి యెరిగిన ఔరతులు కొంత మందిక్కి ఉన్నారు. వారు రాయచూరు వాళ్ళు. వాళ్ళకి మా కబురు యెల్లింది. రేపట్కి వస్తార్? అందాకా మీరు ఈ పత్రంలో ఉండవాలా ఉంది.
6
వసుబాలుడి హృదయంలో రాయిపడింది. అతడు సరే, అని అతి ధైర్యంగా పలికి, లోనికిపోయాడు. గదిలో బాలిక సేవకులు పరచిన తివాసీ పైనకూర్చుని ఉంది. “ఇది అంతా ఎట్లా -” అని వసుబాలుడు ప్రారంభించబోయాడు. “ష్” అని ఆ బాలిక సైగచేసింది. తన దగ్గిరగా కూర్చుండమని ఆమె వసుబాలునికి సైగచేసింది. వసుబాలుడు ఒళ్ళు ఝల్లుమంటుండగా ఆ బాలిక దగ్గరకుపోయి కూర్చున్నాడు. ప్రతిదళమువారు జరుపుతున్న ఆ నాటకము వసుబాలుణ్ణి ఏ దివ్య లోకానికో తీసుకొని పోతున్నది. ఆమె బంగారుచాయలో స్వర్ణనదీ ప్రవాహరేఖలు పోల్చుకొన్నాడు. ఆమె దేహసౌభాగ్యంలో దేవ పారిజాత పుష్పాల మాలిక చూచినాడు. ఆమె సన్నని నడుంలో ఆధ్యాత్మిక రహస్యం పోల్చుకొన్నాడు. పయ్యద అలంకరించిన ఆ బాలిక వక్రం పాల్కడలిలో అమృత కలశాలుగా ఊహించుకున్నాడు. ఆమె చేతులు రామయామాత్య గీతాలట, ఆమె కన్నులు, ఆ కన్నులలోని చూపులు రాగతాళాల మేలిమి కలయికట, కోల గాక గుండ్రము గాక పరమ శిల్ప స్వప్నమైన ఆ బాలిక మోము శారద వీణాజనిత దేవగాంధారరాగమట. ఆమె పెదవులలో లక్ష్మీ హస్తాంచిత లీలా కమలమాధుర్యాలు రూపుపొందాయట. ఈ బాలిక తన జీవితంలో ఈలా ప్రవేశించడం పాల సముద్రంలో పవళించిన రంగనాథుని యెదుట లక్ష్మీబాల ఉదయించడం వంటిదేనట! “వసుబాలరెడ్డిగారూ!” వసుబాలుడు ఉలిక్కిపడి ఆ చీకటిలో ఆమెవైపుకు మోము తిప్పినాడు. సువాసన పూరితాలై ఆమె విశ్వాసాలు చల్లగా అతనిమోము తాకినవి. ఆ మోమంతా సమీపంగా దర్శనముకాగా వసుబాలుడామె హృదయానికి గాఢంగా అదుముకొని, తన వేయిజన్మాలు, తన కోటికవిత్వాలు సార్థకం చేసే తమిపూరిత చుంబనాన్ని పొందుదామన్న కాంక్షను అక్కడక్కడే ఆపుకొన్నాడు. ఆ బాలిక రహస్యంగా అతని చెవిలో “బంగారుకాటిక భరణిచూసి మీట సంగతి తెలియక నాకు తిరిగి ఇచ్చివేసింది. రేపు నన్ను గుర్తించగల ఆడవేగువాళ్ళు వస్తారు.
అడివి బాపిరాజు రచనలు 8 54 -> కథలు నన్ను అనవాలు పడతారు. నేను మిమ్మల్ని వృథాగా ప్రాణాపాయస్థితికి తీసుకురావాలి. నేను పారిపోతాను. మిమ్మల్ని ఏమీ చేయరు. కైదుమాత్రం వేస్తారు" అని తెలిపింది. ఈ బాలిక తన్ను వదలి పారిపోవడమే! అని వసుబాలుడనుకున్నాడు. తన్ను రక్షించడానికా ఈమె ఈ మార్గం తెలుపుతున్నది. “నువ్వు పారిపోతే వాళ్ళకు పట్టుబడకుండా వెళ్ళగలవా?” "ఏమో! నాకు శక్తి ఉన్నంతవరకూ ప్రయత్నం చేస్తాను. నా ప్రభువుకోసం నా ప్రాణం పోతే ఏమి?” “ఓహో! నువ్వు ఒక్క దానవే పారిపోగలవా? ఒక మనిషివస్తే పరుగెత్తగలవా? నీకు సహాయం చేసేవాళ్లు ఎవరు దొరుకుతారు?” “మా నాయనగారు 'వేగువారు పరుల సహాయం కోరరు; ఎవరికివారే సహాయం- ప్రాణంకు వెరవవద్దు, అని చెప్పేవారు.” వసుబాలుడు గజగజ వణికాడు. అతనికి ఏమీ పాలుపోలేదు. ఈ బాలికతో వెడితే, తానూ ఆమెకూడా పట్టుబడతారు. తప్పదు. అప్పుడు ఇద్దరికీ మృత్యువే. మృత్యు వెంత భయంకరమైంది? ఎన్నెన్ని భాషలు నేర్చుకొని - ఈ ఆలోచన కడ్డమువచ్చి, ఆ బాలిక "వసుబాల ప్రభూ! మీరు సకల భాషాకోవిదులు, మహాకవులు. మీరు పట్టుబడితే వారు కోపంతో మీకేదైనా శిక్ష విధిస్తే మీరు భరించలేరు. నేను వేరు. స్త్రీని. ఈ వృత్తి నేర్చుకోవడమే ప్రాణం ఒడ్డడం. మీరూ మీ వ్రాసిన గ్రంథాలు మీ గురువుగారైన పెద్దనామాత్యులవారికి వినిపించాలి. శ్రీ రాయలువారికి అంకితం ఇవ్వాలి. తోటి సహాధ్యాయుల మెప్పుపొందాలి. కాబట్టి నేనిక్కడ ఉంటాను. మీరు వెళ్ళిపొండి. నన్ను పరీక్షచేసి నాచేత నిజం చెప్పించడం మొదలగు పనులలో కొంతకాలం వ్యవధివస్తుంది. మీరీలోపుగా చాలా దూరం వెళ్ళి మాయమై పోవచ్చును” అని అన్నది. వసుబాలుడు ఉలిక్కిపడ్డాడు. ఆ బాలికమాట ఒక్కనిమేషం మరచిపోయాడు. భయంతో ఆమె దగ్గిరనుంచి కొంచెం దూరం జరిగాడు. శ్రీ రాయల సభావైభవం, ఆనందంతో కూడుకొని ఉన్న తనదైనందిన జీవితం, తన ఉత్తమ కావ్యరచనా అన్నీ జరుగుతుంటాయే! కాని, ఈ బాలికను ఎలా వదిలిఉండటం? ఎంత సుందరాంగి! ఎంతటి వీరహృదయ! మహారాజనినా, తండ్రి అన్నా ఎంత అచంచలభక్తి! ప్రాణాలకైన వెరవనిధీర! స్త్రీలకు రాజసేవ అవసరమేమిటి? సరస్వతీసేవా, పతిసేవా చేస్తూ కూర్చుండకూడదా? అయినా ఓహో! ఈ బాలిక కష్టాలకు ఆదిదేవతలయినా, తన ప్రభుసేవకై నిర్భయంగా రాజసేవ దివ్యపథాన సంచరించే అమృత హంసిలా ఉంది. ఇంతలో అస్పష్టంగా అతని చెవులకి వెక్కి వెక్కి ఏడుపు వినవచ్చింది. వసుబాలుడు ఉలిక్కిపడి హృదయం గతులు తప్పి ఆ అమ్మాయి వైపు తిరిగి ఆమె చేయిపట్టుకొని
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 55 + ఆ కథలు బాలికను తన హృదయాని కదుముకొన్నాడు. అతని వక్షంపై వెచ్చని కన్నీటి చుక్కలు జలజల రాలాయి. “ఓ బాలికా! నీ పేరు సిరియాలదేవి కావచ్చును, కాకపోవచ్చును. నాకు మాత్రం సిరియాలదేవివే. ఆనాడు నా బ్రతుకులోని నువ్వు ఒక ఇంద్రజాలంలా, అమృత వర్షపాతంలా, వేగంగా అవిచ్ఛన్నంగా వచ్చిన ముహూర్తాన నేను దివ్యభూములకు తేలిపోయాను. నేను వట్టి పిరికివాడిని, నిన్ను రక్షించుకొనుటకే భయపడే హీనుణ్ణి! నిన్ను వదలి నన్ను రక్షించుకొందామనుకొన్న నికృష్టజీవిని. నువ్వు వీరకర్మవ్రతవు. ఉత్తమ చరిత్రవు. అపర రుద్రమవు. నువ్వు సత్యభామవు; నీజీవితము పవిత్రజాహ్నవీ ప్రవాహమే. నన్ను క్షమించు! సిరియాలదేవీ! నన్ను క్షమించు. నన్ను నీసేవకుణ్ని చేసుకో. నువ్వు ఒక్కదానవే వెళ్ళలేవు. నువ్వు నవాబు సైనికుల చేతుల్లో పడిపోతావు. నువ్వు వేగంగా పరుగిడలేవు. అవసరమైతే యుద్ధం యుద్ధం.... చేయ... లేవు. కాబట్టి మనం ఇద్దరంకలిసి ఉండవలసినదే.” “మీరు కవులు! మీరు ప్రజల హృదయం ఆనంద తాండవ గతులకు ఉమ్మలు చేయగలరు. మీకు తుచ్ఛ యుద్ధాలు వద్దు. ఈ హింసా వద్దు, నాకు కళ్ళనీళ్ళు రావడానికి కారణం భయంకాదు, ఆడదాన్ని.... చేతగానిదాన్ని. ఇదివరకు ఏ పరపురుషునీ ముట్టనైనా ముట్టలేనిదాన్ని! అలాంటి అబలను బాలికను. నేను నా ప్రభువునకు సేవచేయలేను. నాకు మా నాయనగారు అప్పగించిన ఈ పరమోత్తమ ముఖ్యాతిముఖ్య కార్యము నేను చేయలేనేమో అని ఆలోచన గలిగి, కంట నీళ్లు వచ్చినవి. కంట నీరు పెట్టడం మా ఆడవాళ్ళ స్వభావమే కదా” అంది. వసుబాలుడు ఆమె మాటలకు పరవశత్వం పొందినాడు. ఆమె జీవితమే కవిత్వమా అని అనుకున్నాడు. తన ప్రభువు కృష్ణరాయలు మహాకవి, ఉత్తమ విద్వాంసుడు, ఉత్కృష్ట హృదయుడు, అసమాన వీరుడు, అకుంఠిత భక్తుడు, అతడు లోకకల్యాణం కోసం తన ప్రాణానికి వెరవడు! ఇక తానో! ఏమి కవి, ఏమి వీరుడు? ఎలాంటి పుత్రుడు తాను మహా సేనానాయక శివబాలరెడ్డి ప్రభువుకు? అలాంటి తానీ బాలిక నీడనైన చరించడానికి తగునా? ఓహో! ఈమె తోటలోని మంచిగంధపు తరువు, వెన్నెల, పారిజాతకుసుమము, అమృతము, భగవద్గీతా మాధుర్యం! వసుబాలుని ఒడలంతా విద్యుత్ ప్రవాహాలు ప్రసరించాయి. ఉత్సాహం తేజస్సూ అతనికి రెక్కలై మొలిచాయి. ఆమెను మరీ దగ్గరగా అదుముకొన్నాడు. ఆమె చెంపలు తన హస్తతలాలతో అదిమి ఆమె మోమెత్తి ఆమె కన్నులా చీకటిలో పారకించినాడు. ఒడలు తెలియక పెదవులు చుంబించినాడు. -వెంటనే అతడు ఎంత తప్పు చేసినాను. అని కుంగిపోయినాడు. ఆమెను తన కౌగిట్లోనుండి వదలి "క్షమించు దేవీ! నేను పిశాచినైనాను!" అన్నాడు. ఆమె వసుబాలుని మెడచుట్టూ చేతులుచుట్టి "ప్రభూ! ఇదివరకే నాకు ప్రభువులు మీరు. అవసరముకొలది ముద్దు పెట్టుకొనుట నాకు ప్రభువు కాబోవువానినిదక్క నే నెల్లా అలా చేయగలుగుదాన ననుకొన్నారు. ఆ రహస్యం శ్రీ శ్రీకృష్ణరాయ ప్రభుస్కంధావారం
అడివి బాపిరాజు రచనలు 8 - ♦ 56 - కథలు చేరిన తర్వాత మనవి చేస్తాను" అని అంటూ మరల ఆమె అతని పెదవులు గాఢంగా చుంబించి, ఆయన కౌగిలి వదలి వంగి, ఆయన పాదాలు తన కన్నుల కద్దుకుని “మహాకవీ! ఇక మీరు మహావీరులుకండి" అన్నది. అతని చెవిలో ఆమె గవాక్షపు కఱ్ఱఊచలు లాగివేయమని కోరింది. అత డట్లు చేయగానే ఇద్దరు చప్పుడు కాకుండా ఆ చీకటి గదిలోంచి సత్రం వెనకవున్న సందులోపడి ఊరి బయట పొలాల్లోని చీకట్లలో మాయమయ్యారు. సత్రంలో నీళ్ళగది కెదరుగుండా పహరాజవాను ఏ ఏమరపాటూ లేకుండా పారా ఇస్తూనే ఉన్నాడు. ఆ రాత్రల్లాభయంతో ఒణికిపోతూ అలసటపడి ఒదిగిపోతూ కాళ్ళనొప్పులతో కణతలబరువుతో యిరవై అయిదుమైళ్ళు నడిచారా కాందిశీకులు! డొంకలు, గుట్టలు, కత్తుల్లాంటి రాళ్లు, పెద్ద బండరాళ్లు దారి పొడుగునా, అపశృతులూ ఎదురుపడుతున్నాయి. అపశృతులలోని అపస్వరాలులా కీచురాయిలు. అడవిమృగాల ధ్వనులు గుండెల కలతపెడుతున్నాయి. ఈ అపశృతి స్వరాలమధ్య తప్పించుకొని ప్రసరించే కృష్ణాకల్యాణి రాగిణిలా వారిరువురూ, ఒకరి కొకరు ఆసరాగా ఆకాశాన చుక్కలే వీణ మెట్టులుగా ఆనవాళ్ళు సరిచూచుకుంటూ దక్షిణంగా పోయారు. చల్లనిగాలి వీచింది. అస్పష్ట మధురగీతము వినబడింది. కొంత అరణ్యము దాటగానే, ఎట్టయెదుట కృష్ణానది. దారిలో నవాబు సైన్యాల శిబిరాలు కనబడ్డాయి. డేరాలు ఆ చీకట్లో తెల్లని గోడలులా ఉన్నవి. భయపడుతూ చుట్టు దార్లు చుట్టి - నడుస్తూ కృష్ణ ఒడ్డుకు వారిద్దరూ చేరారు. నీరసము కమ్ముకుంటున్న కొలది, ఆయాస మెక్కువైన కొలది వసుబాలుడికి ధైర్యము, ఆనందము ఇనుమడిస్తున్నాయి. ఇక కృష్ణ ఎల్లాగు దాటడం? అక్కడ కృష్ణ ఒడ్డు రాళ్ళతో కత్తిరిగట్టు మళుపుతిరిగి ఉన్నది. అవతల అస్పష్టంగా ఇసక ఒడ్డూ, గుట్టలూ కనపడుతూన్నవి. నెమ్మదిగా ఒడ్డునుండి నీటిమట్టానికి దిగడానికి వారిద్దరు ప్రయత్నం చేసే సమయంలో ఆ చీకట్లోనుండి ఒక పిశాచి ధ్వని, “ఎవరు మీరు? అక్కడే కదలకుండా ఆగండి" అని వినవచ్చింది. ఇద్దరూ నిశ్చేష్టులై అలాగే నిలుచుండిపోయారు. ఇంతలో ఎవరో చెకుముకి వెలిగించి కాగడా ముట్టించారు. నవాబు సైనికులు వీళ్ళదగ్గిరకువచ్చి వీరిరువురనూ ఎగాదిగాచూచి వారిలో వారేదో సైగచేసుకున్నారు. ఒకడు: ఎవరు మీరు? వసు: మేము దారి తప్పిపోయిన బాటసారులము. రెండ: ఇక్కడ ఎక్కడ దారితప్పిపోయారు? బాలిక: మువ్వమట్టి గ్రామంనుంచి గద్వాల పోతూ ఉంటిమి. ఇక్కడికి నాలుగు మైళ్ళలో దొంగలు కొట్టిదోచినారు. మేము ఎవరికివారము చెదరి పారిపోయాము. మా యిద్దరం ఇలా పారిపోయి వచ్చాము.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 57 ♦ కథలు ఒకడు: అల్లా మిమ్మల్ని చూస్తే మాకీ సాలా అనుమానంగా వుంది. ఇంకా కొలదిదూరంలో మా సైన్యం మకాం చేసింది. అక్కడికి మీరిద్దరూ రావాలి. వసుబాలుడు తన సిరియాలదేవికేసి పారచూశాడు. ఆ అమ్మాయి అతనివైపు తీక్షణమైన వీక్షణం పంపించింది. అతని ఒళ్ళు పొంగి పోయింది. ఆ పారా అతడు వాళ్ళీద్దరివైపు ఆ కాగడా వెలుతురులో పార చూచాడు. తుండులులా ఉన్నారు. కత్తులతో నల్గురూ! ఈలాంటి రాక్షసులతో తాను యుద్ధం చేయగలడా? ఇంతలో అందులో ఒకడు సిరియాలదేవి చేయిపట్టుకొని తనవైపు లాక్కున్నాడు. అమ్మాయి ‘ఓయి!' అని అరచింది. ఆ మరుసటి క్షణంలో ఒక్క సింహపుగాండ్రు పెట్టి ఒక్కగంతులో వసుబాలుడు వానిమీద కురికి ఆ చేయిపట్టుకున్న సైనికుని పొట్టమీద తన్ని వానిచేతిలోని కత్తిలాక్కున్నాడు. వాడు వెనక్కుపడి ఒక రాయితగిలి, చైతన్యరహితుడయ్యాడు. ఈ సంఘటన ఒక మెరుపులా జరిగింది. రెండవవాడు కాగడా అవతలపారేసి కత్తిదూసి వసుబాలుడిమీదకు ఉరికాడు. తరాలనుంచీ వసుబాలుడు కుటుంబంలో ఉన్న క్షాత్రం రాళ్ళు పెకలించుకొని వచ్చేనదిలా చిమ్ముకుంటూ వచ్చింది. తండ్రి మహావీరుడు. శివబాలరెడ్డి ఖడ్గయుద్ధ ప్రావీణ్యము రాయలదేశంలో ప్రతివారిచేత పొగడ్త పొందింది. ఆ ప్రావీణ్యము వసుబాలుని ఆత్మలో ఉంది. దేహంలో సమైక్యమై దాగి ఉంది. నాలుగైదు పొడుపులు, అడ్డుకోతలు, ఏటులు, మెలికలూ తళతళలాడినవి. ఆ సిపాయి తన డొక్కలోంచి చిమ్మేరక్తం చేత్తో ఆపుచేసుకుంటూ పడిపోయాడు. ఆ బాలిక ఇదంతా చూస్తూనే ఉంది. వసుబాలుడి సాహసం చూచి ఆశ్చర్యపడ్డది. ఆమెకు అపరిమిత సంతోషం కలిగింది. ఆమె కన్నులు నక్షత్రాలులా మిలమిలలాడినవి. పడివున్న సిపాయి లేవకుండా ఆమె అతని పీకపైన కాలువైచి త్రొక్కి ఉంచి, అతని నడుమున ధట్టీవేలాడు కైజారుతీసి, కదిలితే పొడిచివేయవలెనని ఉన్నది. అతనికి స్పృహ వచ్చి కదిలినాడు. బాలిక వెనక్కు తప్పుకొన్నది. వసుబాలుని మహోగ్రమూర్తినీ స్నేహితుని అవస్థాచూచి అతడు వసుబాలుడికి మోకరించాడు. వసుబాలుడు పారిపొమ్మని అతనికి సైగజేశాడు. ఆ భటుడు ఒక్క చిటికలో ఆ డొంకల్లో మాయమైపోయాడు. వసుబాలుడికి ఉత్సాహం సడలింది. భయము కలిగి గజగజలాడిపోయినాడు. తానెలా చంపగలిగా డొకమనుష్యుణ్ణి - మాంస భోజనాదికాలు మానివేసినా తాను? అతడు కూలబడి వణుకుతూ అప్పుడే ఎరుపులలము ఆ అస్పష్టసంధ్యలో లీనమైపోయే ముఖం రెండు చేతులా మూసుకున్నాడు. ఆ బాలిక గబుక్కున బాకుపారవేసి వసుబాలుడి దగ్గరకు గంతువేసి అతన్ని కౌగలించుకొని "మీరు చూపిన ధైర్యం, వీరత్వము, ఆయుధ కుశలత అపరిమితమైన ఆనందాన్ని కలిగించినవి. మీకేమిభయం? మీరు శివబాలరెడ్డి కుమాళ్ళుగదా! ఒక్క మనుష్యుణ్ణి - విరోధిని- మన ప్రాణాల్ని నిశ్చింతగా నల్లిని చంపివేసినట్లు తీసివేయ
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 58 - కథలు దలుచుకున్నవాడిని చంపుట ఏమి దోషము?” అని ఆనందాశ్రునయనాలతో అతని ముఖం చూసింది. వసుబాలుడికి జీవితం ధన్యమనిపించింది. ఆ వెలుగు చీకట్లో చెదరి పోయిన ముంగురులతో కాంతులను వెదజల్లే మోముతో సౌందర్య నిధులైన కన్నులతో తన్ను కౌగలించుకున్న బాలికనుచూచి వసుబాలుని పిరికితనం తెల్లవారుముందులా పటాపంచలైంది. అతడామెను ఒడిలోనికి తీసుకొని మూర్ధ మాఘ్రాణించి, “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని చిన్న ప్రశ్న వేశాడు. “నాకు మొదట ఇష్టంలేదు; కాని మిమ్మల్ని చూచినకొద్దీ నా హృదయం సంపూర్ణంగా మీపాలయింది. అప్పటితో నా ఆత్మ నా సర్వస్వము తమలో లీనమైపోయింది.” వసుబాలుడి హృదయం రాగాలు పాడింది. “అయితే పరపురుషుణ్ణి అనైనా ఎంచక నన్ను తాళికోటలో...” “మా నాయకుడు కొద్ది వారాలక్రిందట మానాయనగారికి రహస్యమైన అంచె పంపించాడు. అదిచూచి ఆయన గడియలకొద్ది అదే ఆలోచించుకున్నారు. ఒకరోజున ఆయన నన్ను మారువేషం వేసుకోమన్నారు; ఆయనా వేసుకున్నారు. ఇద్దరం బయలుదేరాము. బీజపురంలో నవాబుగారి మోహన్ ఖానాలో మీదగ్గరకు వచ్చాం. ఒక బుధవారం ఒక ముసలి తురక నవాబు ఆయన కుమారుడూ రాలేదూ?” “ఆ యిద్దరు మీరా! నిజంగా!" ఆ బాలికను తన హృదయానికి ఇంకా అదుముకున్నాడు. “మేము బయటికి వెళ్ళిపోయిన తరువాత మా నాయనగారు నన్ను చూసి “అమ్మాయీ అరవిందా, ఆ అబ్బాయియే నీ భర్త, అది శ్రీశ్రీ మన చక్రవర్తి ఆజ్ఞ సుమా!” అన్నారు. వసుబాలుడు ఆశ్చర్యంచేత అనిమిషుడయ్యాడు. “ఏమిటి! నీ పేరు అరవిందా! ఎంత మనోహరనామం. అరవింద! అరవింద! ఈ నామమే నా బ్రతుకు పరమావధిని నాకు ప్రత్యక్షం జేయగలదా?” అని అతడు పులకరించిపోయినాడు. అతనికి వేయిఏనుగుల బలం వచ్చింది. పాడింది. తెల్లవారిపోతున్నది. మంచు విడిపోయింది. ప్రకృతి అంతా తూర్పారావములు వసుబాలుడు అరవిందాదేవి చేయిపట్టుకొని నెమ్మదిగా కృష్ణ దాటించడం ప్రారంభించాడు.కొంతదూరం పోయేటప్పటికి లోతు అయింది. వసుబాలుడికి ఈతరాదు. మళ్ళీ వెనక్కు వచ్చారు. ఒడ్డునున్న పడిపోయిన రెండు చెట్లను కష్టపడి కృష్ణలోనికి తోశారు. ఇద్దరూ పట్టుకొని నెమ్మదిగా కాళ్ళు కొట్టుకుంటూ నదిలోనికి లోతుల్లోకి తేలిపోయారు. ఆ ప్రవాహానికి చాలా దిగువను గట్టుఎక్కారు. ఎండ వచ్చింది. దంత ధావనాదులు చేసుకుని రాయచూరు ఎటువుందో అని కృష్ణానదీతీరం వెంటబడే నడక సాగించారు. వసులుడు తలకు చుట్టుకున్న పైకండువా తడువలేదు. కాబట్టి అది చీర విడుచుకొని కట్టుకోమని అరవిందాదేవికి ఇచ్చాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 59 కథలు ఆమె పునహా పట్టుచీరె పాముకుబుసంలాంటిది. ఆ ఎండలో ఒక అరగంటకి ఆరిపోయింది. ఆరిపోయిన బట్టలు కట్టుకొని ఇద్దరూ దారిసాగించారు. ఆకలి! ప్రొద్దెక్కినకొద్దీ ఆకలి ఎక్కువ అయింది. అలాగే వెడుతూ ఉండగా నెమ్మది నెమ్మదిగా ఫిరంగుల చప్పుడు వినవచ్చింది. పెద్దకల్లోలము, హోరు. వీళ్ళు నెమ్మదిగా ఒక గుట్ట ఎక్కారు. ఎదుటనుండు సైన్యాలు హోరాహోరీ పోరుతున్నారు. రెండు క్రోసులు వ్యాపించి వున్నవి ఆ సైన్యాలు. బందూకులు తోపుఖానాలు చెవులపుటాలను బద్దలుకొడుతున్నవి. అతి పారవశ్యంగా కించిత్తు భయంతో చూస్తూ నిలుచుండిపోయాడు వసుబాలుడు. అరవింద ఆకలి, బడలిక, ఆయాసంవల్ల ఒడలిపోయిన పువ్వులా నేల వాలిపోయింది. వసుబాలుడు చూచి, 'అమ్మయ్యో' అని ఆ బాలికను ఎత్తుకొని నెమ్మదిగా ఆ గుట్ట దిగాడు. “అవతల సైన్యం రాయల సైన్యం అయివుంటుంది. అక్కడకు ఎలాగైనా జేరుకుంటిమా మా ప్రాణాలు మావి" అని అనుకుంటూ వసుబాలుడు ఆవైపు ఆచెట్ల చాటు నుండి వెళుతూ ఉన్నాడు. అతని హృదయానికి పసిపాపలా హత్తుకుపోయిన ఆ బాలిక అతని మొగంచూచి “ఈ సమయంలో నేను బ్రతుకుతానని తోచదు. నన్ను వదలి మీరు వెళ్ళిపొండి" అన్నది. వసుబాలుడు భయపడి కోపంతో “నేనా నిన్ను వదలడం? పెన్నిధి దొరికిన పేదలా వున్నాను. పాలసముద్రంలో లక్ష్మి విష్ణువుకు దొరికినట్లు నాకు దొరికినావు. నా ప్రాణం అంతా నీలోనే ఉంది. నువ్వులేని ఉత్తర క్షణంలో శివబాలరెడ్డి పుత్రుడులేని తండ్రి!” ఆ బాలిక నవ్వుతో అతని నోరు మూసివేసింది. “అవతలిది శ్రీ చక్రవర్తి సైన్యం. మనం ఎల్లాగో అక్కడికి పోవాలే. నాకు ఏమీ ఓపికలేదు. కాబట్టి మీరు నన్ను దింపండి. కొంతదూరం నడవగలను. అలా నడవలేనప్పుడు మీరు నన్ను... ముఖ్యంగా ఈ రెండు వస్తువులు మీదగ్గర ఉంచండి. ఇది శ్రీచక్రవర్తి రహస్య ముద్రిక. ఇది మీరు మాకు అమరాబాదు పంపిన బేగిరావు ఉత్తరం” అని నవ్వుతూ యిచ్చింది. “ఎందుకూ ఈ ఉత్తరం” అని చిరునవ్వుతో వసుబాలుడు ఆ ఉత్తరం చూసుకున్నాడు. అచ్చంగా తనవ్రాతే! "ఈ ఉత్తరం ఎందుకు దాచుకోటం ?...” “ఆ ఉత్తరమే అతి ముఖ్యమైంది. ఒకవేళ మీరు వొబరే మాట్లాడే స్థితిలో వుంటే అప్పాజీవారికి ఈఉత్తరం యివ్వండి!” "ఈ ఉత్తరం ఈ ముద్రిక ఎలా దాచావు దేవీ! ఆ సరదారు ఒక స్త్రీ చేత పరీక్ష చేయించాడుకదా!” "వేగులవారిలో శ్రీ చక్రవర్తి వేగులవారికి సరిపోయినవాళ్ళు భారత ఖండంలో లేరు! ఈ రెండున్నూ నాతలముడిలో దాచుకున్నా. దేహమంతా వెదకిన మనిషి తలకట్టు వెతకలేదు సుమండీ!” వసుబాలుడు ఈ నాలుగు దినాల్నుంచి కవులు కూడా ఎరగని కొత్త సంగతులు నేర్చుకోడమనే ఆశ్చర్యంలో పడి వున్నాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 60 కథలు ఆ రెండువస్తువులున్నూ వసుబాలుడు నడుముకు కట్టుకట్టుకుని బట్టలు సర్దుకున్నాడో లేదో విరిగిపడ్డ ఒక కొండ ప్రవాహంలా గుఱ్ఱపు సైన్యం పారిపోతూ ఆ దారిని వచ్చింది. అనేకమంది గాయాలు తగిలి వగరుస్తూ ఉన్నారు. వారి గుఱ్ఱాలు రక్తాలు కారుస్తున్నవి. వారికవచాలు ముక్కలైపోయి ఉన్నవి. విరిగినకత్తులు, ముక్కలైన కాళ్ళతో ప్రాణాల కోసం పరుగెత్తుకు పోయి వచ్చారు. వాళ్ళు మనవారిని చూచారు. కొందరు రైతులు ఓపిక లేకపోయినా గుర్రాలను వీళ్ళమీదికి తిప్పారు. వసుబాలుడు అరవిందాదేవిని వెనక్కుతోసి, కత్తిలాగి ఝళిపించి, జేవురించిన మొగంతో హృదయంలో ఏమూలలోనూ లేని భయంతో నిలుచున్నాడు. గుఱ్ఱాలు సకిలిస్తుండగా నలుగురు రౌతులు నాలుగువైపులా వచ్చారు. అరవింద కూర్చున్నది. ఆ దినాన వసుబాలుడు దెబ్బ తగిలిన సింహములా పోరాడాడు. దెబ్బలు తిన్నాడు; రక్తధారాలు ఎరుపుతో ఉదయభానుబింబం అయ్యాడు. కొనఊపిరి వున్నంతసేపు ఏటుఏటుకు తప్పుకోడం; పొడపుపొడపుకు వంగడం అలా యుద్ధంచేసి వేటకుక్కల ముందర కొమ్ముల జింకలా, పెద్దపులుల మధ్య వృషభరాజులా, తమ దగ్గిరకు వాళ్ళని రానీయకుండా యుద్ధం చేశాడు. చేతిలోకత్తి యెగిరిపోయింది; నెత్తిమీద బలమైన గాయం తగిలింది. కళ్ళలో మెరుపులు కమ్మి గిఱ్ఱున తిరిగిపోయి గబుక్కున చైతన్యంవదలి పడిపోయాడు. అరవింద ఛంగున ముందుకు ఉరికింది! దాచివుంచుకున్న బాకుతీసింది. నాలుగుదెబ్బలు తిన్నది. ఒకడి గుఱ్ఱాన్ని పొడిచివేసింది; మహాశక్తి అయిపోయింది అరవిందాదేవి. నాలుగు క్షణాలు జరిగినవి. ఇంతలో డెక్కలచప్పుడు, సింహనాదాలు వినబడ్డవి. రాయలు గుఱ్ఱపు దళం కాబోలు. విల్లునుంచివచ్చే బాణంలా వచ్చింది. దానితో చెల్లాచెదరై పారిపోయారు ఆ బీజపూరు రౌతులు. అందులో ఒకడు కసిగొని, గుఱ్ఱంమీద నుంచే వంగి, తూలిపడిపోతూ వున్న అరవిందాదేవిని ఒక్క అదటున మీదికి లాక్కొని పారిపోయాడు. చూచిరా - ఆ వచ్చిన రౌతులది చూశారు. వాళ్ళవెనక అమితవేగంగా వచ్చిన సైన్యం యావత్తూ ఉడాయించారు. కాని నాయకుడి పక్కనున్న రౌతుకి “ఇప్పుడు జరిగిన ఆ అధర్మయుద్ధములో ఒక వ్యక్తిపడిపోయి వున్నట్టు వున్నాడు; చచ్చినాడో బ్రతికివున్నాడో కొనూపిరి వుంటే నెమ్మదిగా నీ దగ్గిర మందులు ఇచ్చి మన శిబిరానికి తీసుకుపో” అని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు వెనుతిరిగి మన వసుబాలుడు పడివున్న స్థలానికి వచ్చాడు. నాడి చూశాడు. 'ఊ' అని తల ఊపుకున్నాడు. మందులు సంచిలో ఉన్న ఒక చిన్నమాత్ర తీసి పళ్ళు బిగిసిపోయివున్న వసుబాలుడి నోరు బలంతో విడదీసి ఆ మాత్రవేశాడు. దానితో వసుబాలుడు ఒక్క నిమేషంలో మూలగడం ప్రారంభించాడు.
9
వసుబాలుడికి మెలకువ వచ్చేటప్పటికి ఒక గుడారంలో వున్నాడు. మంచిపరుపులు, దిండ్లు నులకమంచం మీద పరిచివుండగా, అందుమీద పడుకొని వున్నాడు. గబుక్కున లేవబోగా అక్కడే వున్న ఒకాయన వద్దని వెనక్కు పడుకో పెట్టాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 61 -> కథలు వసు: నేనెక్కడున్నాను? అతడు: శ్రీవిద్యానగరాధీశ శ్రీ మూరురాయరగండ కృష్ణరాయ సార్వభౌముని శిబిరంలో ఉన్నావు. వసుబాలుడు ఆశ్చర్యంతో మళ్ళీ లేవబోయాడు. నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతూ ఆ వ్యక్తి వసుబాలుణ్ణి వెనక్కు పడుకోబెట్టాడు. వసు: ఒక బాలిక వుండాలి. 'ఆమె క్షేమంగా ఉన్నది లెండి” వసుబాలుడికి అమ్మయ్యా అనిపించింది. అత: ఈ దినానికి నువ్వు కదలకూడదు. గాయాలు చాలా తగిలాయి. అందుకని నా ప్రార్ధన. వసు: అదంతా నాకు తెలియదండీ! నేను ఇప్పుడు తత్క్షణం అప్పాజీవారి దగ్గరకు పోవాలి. నేను వారికి అతి ముఖ్యమైనటువంటి వేగు యివ్వాలి. అత: రేపు ఇవ్వకూడదూ? వసు: ఇప్పుడు జరిగే యుద్ధం ప్రాముఖ్యం మీకు తెలుసునా? అత: నేను వైద్యుణ్ణయ్యా! వసు: వైద్యులకి కూడా ఎందుకు యుద్ధం చేత కాకూడదు? కవులు అందరూ ఆ యుద్ధం చేయవలసిందే కదా? అతడు: నిజం..నేను నరసింహదేవరాయ సార్వభౌముల దగ్గర సేనానాయకత్వం చేశాను. వసు: అమ్మయ్యా! అట్లయితే సరే, మీకు నమస్కారము! నాకు ఇప్పుడు బలంవచ్చే మందు యివ్వండి; నేను అప్పాజీవారి శిబిరానికి పోతాను. ఫిరంగులమోత వినబడుతూనే ఉంది. ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా తనమందుల పెట్టెలోంచి ఒక బుడ్డి తీశాడు. “ఇందులో ఒక మందువుంది. ఒక చుక్క అమృతంతో రెండు గడియలదాకా మనిషి యుద్ధం చేయగలడు. ఏనుగును ఎత్తగలడు.” వసుబాలుడు సరే అన్నాడు, ఆ చుక్క త్రాగినాడు. అతని దేహంలో ఒక శక్తి ప్రవాహం అతి వేగంతో ప్రవేశించి కొండను పిండికొట్టగలనన్న బలం వచ్చినట్లయింది. లేచాడు. ఆ వైద్యుడు పైనవున్న సేవకునికి ఆజ్ఞ యివ్వగానే అతడు గుఱ్ఱం ఒకటి తీసుకువచ్చి నిల్చున్నాడు. వసుబాలుడు ఆ గుఱ్ఱం ఎక్కాడు. ఇంకో రౌతు సిద్ధంగా ఉన్నాడు. అతడు ముందూ, వసుబాలుడు వెనకగా మహాపట్నంలా ఉన్న శిబిరంలో ఆ గుడారాల వీధుల్లోంచి వెళ్ళి వెళ్ళి అనేకమంది రౌతులు బలమైన పదాతులు కావలికాస్తూ పట్టుజల్తారు ముత్యాలతో అలంకరింపబడి కుబేరమందిరంలా ఉన్న గుడారం దగ్గరకు వెళ్ళినారు. పక్కనే ఆడంబరరహితంగా సౌభాగ్యము చూపిస్తూ ఉన్న గూడారం గుమ్మందగ్గర ఆగినాడు. దారిలో వసుబాలుణ్ణి అనేకమంది రౌతులు ఆపినారు. కాని ముందు పోయే అశ్వికుడు ఏదో జవాబుగా చెప్పగా పోనిస్తూ ఉండేవారు.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 62 - కథలు పై గుడారం దగ్గరకు వెళ్ళి గుర్రాలు దిగారు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు లోపలికి పోయేందుకు గురుతు యివ్వమన్నాడు. వసుబాలుడు 'ఒక ముఖ్యకార్యంమీద శ్రీ సార్వభౌముని సేవకుడు వచ్చా'డని చెప్పమన్నాడు. ద్వారపాలకుడు పనికిరాదన్నాడు. వసుబాలుడికికోపం వచ్చింది. చాలా ముఖ్య విషయం, అందుమీద అంతా ఆధారపడి ఉందయ్యా!" అన్నాడు. ద్వారపాలకుడు లాభంలేదని తలూపినాడు. వసుబాలుడు గుఱ్ఱంయొక్కి బయలుదేరినప్పటినుంచి తాను మహమ్మదీయులతో పోరినవిధం, తనకుస్పృహ తప్పిన విషయం అంతా జ్ఞాపకం వచ్చింది. తనకు శ్రీదేవి అరవిందాదేవి ఏమయిపోయింది? సురక్షితంగా ఉందంటే? ఎక్కడ ఉన్నది? ఆ వైద్యుణ్ణి ఇంకా తప్సీళ్లు అడగవలసిందే కాని ఆ దేవి ఆజ్ఞ శిరసావహించేగా, తాను ఈవేగు శ్రీ అప్పాజీవారికి తెలియజేయడానికి వచ్చింది. అది జ్ఞాపకం వచ్చింది. ఆ బేగిరావు ఉత్తరంతోపాటు ఆమె శ్రీ సార్వభౌముని రహస్య ముద్రిక యిచ్చింది; అది పనికిరాదా? "ఓ ద్వారపాలకుడా? ఈ గుర్తుచూసి నీ యిష్టము వచ్చినట్లు చెయ్యి” అని వసుబాలుడు తన దేహాన భద్రపరచుకొన్న ఆ ముద్రిక చూపించాడు. ఆ ద్వారపాలకుడు ఒంగి నమస్కారముచేసి, తక్షణమే లోపలికిపోయి వచ్చి, "శ్రీ అప్పాజీ ప్రభువు మీ రాకకోసం చూస్తున్నారు” అని అన్నాడు. వసుబాలుడు లోనికిపోయాడు. విజయనగర సామ్రాజ్యం దేదీప్యమానంగా మిట్టమధ్యాహ్న సూర్యుడులా వెలిగేటట్టు చేసిన శ్రీ సాళువ తిమ్మరుసు మహామంత్రులవారు పరుపులపై అధివసించి ఏదో పత్రాలు తిరగవేస్తున్నారు. వసుబాలుడు ఆ వృద్ధునకు వీర నమస్కారంచేసి నుంచున్నాడు. తిమ్మరుసు తలయెత్తకుండా “ఏ వేగువాడవయ్యా? నీ ముఖం మాకు పరిచయ స్మృతి తెస్తున్నదే?” అని ప్రశ్నించారు. - "ప్రభూ, నేను వేగు సైన్యంలో లేను. ఈ ఉత్తరం తమకు అందజేయవలసిందిగా ఒక బాలిక - అరవిందాదేవి - ప్రతాపనాయనింగారి కుమార్తె ఇచ్చింది" అని వసుబాలుడా ఉత్తరం పట్టుకొన్నాడు. అప్పాజీ వెంటనే తలయెత్తి, అతి ఆనందంతో "ఎవడురా అక్కడ?" అని కేకవేయగానే ద్వారపాలకుడు పరువిడి వచ్చాడు. లేచి వసుబాలుడి దగ్గిరనుండి ఆవుత్తరం అందిపుచ్చుకొని “శ్రీతమ్మననాయనింవారిని, శ్రీ వేగేశిన అనంత మల్లవర మహారాజులను సార్వభౌముని గుడారానికి రావలసిందిగా చెప్పు" అని ఆజ్ఞ ఇచ్చి, వాడుపోగానే వసుబాలుణ్ణి చూచి, “అబ్బాయీ! ఈ విషయం అంతా గమనిస్తే నువ్వు ఎన్నో కష్టాలకు ఓర్చి, ఈ ప్రాణప్రదమైన లేఖ పట్టుకువచ్చినట్లు కనబడుతోంది. నువ్వు ఎవరివో నాకు స్పష్టమౌతున్నది. శ్రీ చక్రవర్తికడ నీ చరిత్ర చెప్పుకుందువుగాని రా!” అని అనునయిస్తూ చిరునవ్వు నవ్వుకుంటూ వసుబాలుని మోము పరిశీలిస్తూ రెండుసార్లు అటు నిటు తిరిగి, గుడారం దాటి సార్వభౌముని శిబిరంవైపుకు నడుస్తున్నాడు. దారిలో సైనికులు, దళవాయిలు, చమూపతులు అంతా వీర నమస్కారాలు చేస్తున్నారు. అవి అందుకుంటూ చిరునవ్వు నవ్వుతూ ఆశీర్వదిస్తూ సార్వభౌముని బంగారపు సరిగపనిచేసిన పట్టు శిబిరాలను సమీపించారు.
అడివి బాపిరాజు రచనలు 8. - ♦ 63 కథలు అప్పాజీగారిని చూడగానే, సార్వభౌముని అంగరక్షకులు ఎదురై “మహాప్రభువులు సభాశిబిరంలో వేంచేసి ఉన్నారు” అని మనవి చేశారు. అప్పాజీవారు సభామందిరానకు వసుబాలుని తీసుకుపోయారు. సార్వభౌముని చక్రరక్షకులు, ద్వారపాలకులు, చారులు అందరు వంగి అప్పాజీకి నమస్కారాలు చేశారు. అప్పాజీవారు రావడం చూడగానే వారి పార్శ్వకు డొకడు తలవాల్చి సభామందిర శిబిరంలోకిపోయి “జయ జయ జయ!!! మహారాజాధిరాజా!" అని గుమ్మం దగ్గిర మోకరించి, "శ్రీ అప్పాజీవారు వస్తున్నారు" అని మనవి చేసుకొన్నాడు. సార్వభౌములు వెంటనే పీఠంనుండి దిగి, గుమ్మం దగ్గిరకు ఎదురువచ్చి, అప్పాజీవారికి నమస్కరించి, వారిచ్చిన ఆశీర్వచనాలందుకొని, అప్పాజీవారి చేయి పట్టుకొని వారిని మంత్రాసనం అధివసింప జేసి తాను వెళ్ళి తను సింహాసనం అధివసించారు. ఇంతలో వసుబాలుడు లోనికిరాగా అప్పాజీ కోరిక తెలియజేశారు. వసుబాలుడు లోనికి ప్రవేశించి వెంటనే సార్వభౌముల యెదుట మోకరించాడు. సార్వభౌములు అప్పాజీవంక చూచి "నాయనగారూ! ఎవరీబాలుడు?” అని ప్రశ్నించారు. "మహాప్రభూ! అతి ముఖ్యమైన వేగు కొనివచ్చాడు. తమ్మన్న నాయకులవారూ అనంతమల్లవర ప్రభువులూ వస్తున్నారు,” అప్పాజీ వసుబాలుణ్ణి ఒక ఆసనం అధివసింప తల పంకించి సంజ్ఞ చేసినారు. ఇంతలో తమ్మన్న నాయకులూ అనంతవరమల్ల ప్రభువులు వచ్చి ప్రభువుకు వీరనమస్కారాలు చేసి అనుమతి సంజ్ఞవలన ఆసనాలు అధివసించారు. అప్పాజీ అరవింద ఉత్తరం తమ్మన్న నాయకులకు ద్వారపాలకునిచే అందించినారు. తమ్మన్న: ఈ ఉత్తరం ఏమిటి మహామంత్రీ? అప్పాజీ: అరవింద ఉత్తరం. తమ్మన్న: వచ్చిందీ! వచ్చిందా! అమ్మయ్యా! ఇంక రాదని నిస్పృహ చేసుకున్నాము మా వేగు వారందరమూ. ఇంక రాయచూరు రెండు నిముషాలలో! ఏదీ! ఎవరక్కడ నీళ్ళతో బిందె - చిన్నది” అని అంటూ లేచి “మహాప్రభూ! ప్రతాప నాయకులవారి అమ్మాయి అరవింద రాయచూరు రహస్యాలు పంపిందని విన్నవించుకుంటున్నాను” సంతోషంతో మనవి చేశారు. ఇంతలో నీళ్ళబిందె వచ్చింది. వెంటనే తమ్మన్న నాయకులు ఒక బరిణె తన సంచి కట్టులోనుండి తీసి అందులోనుండి పొడుమును కొంత ఆ బిందెలో వేసినారు. దౌవారికుడు ఆ నీళ్ళు కలపగానే ఆ ఉత్తరం అందులో వేసినాడు. “సిరియాలదేవిని పంపండి" అని వసుబాలుడు రాసినట్లున్న ఉత్తరపు అక్షరాలన్నీ మాయమైపోయినవి. వెంటనే తమ్మన్న నాయకు లాఉత్తరం నీళ్ళలోనుంచి తీసి ఇంకొక బరిణెలో ఉన్న హారతి కర్పూరముతీసి, చెకుముకి వెలిగించి, మందు దూది మండించి, ఆ మంటలో కర్పూరము వెలిగించి, ఆ కాగితాన్ని ఆ పొగలో ఉంచినారు.
అడివి బాపిరాజు రచనలు - 8 64 -> కథలు మంత్రంలా ఆ పొగలో ఆ పెద్దపత్రంమీద గీతలు అక్షరాలు చీమల బారులు లాంటివి కొత్తవి వచ్చి ప్రత్యక్షమైనవి. ఆ ఉత్తరం మెత్తటి బట్టతో అద్ది, తమ్మన్న నాయకులు సవినయంగా సార్వభౌముల కడకు కొనిపోయి, సింహాసనం దగ్గర పీఠంపై ఉంచినారు. అప్పాజీ, అనంతమల్లవర ప్రభువులు, తమ్మన్న నాయకులు, సార్వభౌములు ఆ పత్రం చూస్తున్నారు. “ఇదిగో ఇక్కడ అగడ్త లోతు తక్కువ. ఇక్కడ గోడ అవుడు. ఇక్కడ రక్షక సైన్యం ఎక్కువ ఉంది. ఇక్కడ ఫిరంగులు బలమైనవి. ఇక్కడ ఫిరంగులు పాతవి. ఈ వైపున మనవారు సిద్ధంగా ఉన్నారు” అని తమ్మన్న నాయకులు మనవి చేస్తుంటే, తక్కినవారు వింటూంటే, సార్వభౌములు దీక్షగా గమనిస్తున్నారు. సార్వభౌముడు చిరునవ్వు నవ్వుతూ వసుబాలుణ్ణి దగ్గరకు రమ్మన్నారు. వసుబాలుడు దగ్గిరకువెళ్ళి ఆసనం సమీపాన నిలబడ్డాడు. “నీ చరిత్ర చెప్పు.” వసుబాలుడు చక్రవర్తి ఆజ్ఞ కాగానే ఆ జలతారుగుడారం, ఆ మణిదీపంబుడ్ల మిరుమిట్లు, పట్టుపరుపులు, కాశీరత్న కంబళ్లు, పట్టుకలంకారీ తెరలు, మత్యాలజాలర్లు - అన్నీ మరిచిపోయాడు. కవీ, భావోన్మాదీ, ప్రేమ పూర్ణయికజీవీ, ఆనందాత్ముడూ అయిపోయి మొదటినుంచి చరిత్ర పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టినాడు. అతని కథతో అందరూ తన్మయత్వం పొందినారు. సార్వభౌముని ముదము, అప్పాజీగారి సంతోషముకన్న తమ్మన్ననాయకులు పొందిన ఆనందము అపరిమితము. ఒకపారి పార్శ్వకుని చెవిలో రహస్యం చెప్పి పంపించాడు. “ఏమిటీ, నువ్వు శివబాలరెడ్డి నాయకుల కుమారుడవా!” అని సార్వభౌములు ఆశ్చర్యం వెలిబుచ్చినారు. “పెద్దన్నగారి శిష్యుడవా!” అని తిమ్మరుసు తల పంకించాడు. “పారశీకం నేర్చుకునేందుకు, బీజపురం వెళ్ళావా?" అని మల్లవర ప్రభువు చిత్రం అయిపోయాడు. తమ్మన్న నాయకులు మాట్లాడనేలేదు. వసుబాలుని కథ పూర్తి అయింది. అతడు చక్రవర్తి యెదుట మోకరించి, “మహా రాజాధిరాజా! నేను ఆ బాలికను... ఆమె యిప్పుడు ఎక్కడ నున్నది? ఆమెకు ఆపద లేదుగదా! ఆమె చరిత్ర ఏమిటి? నాకు తెలియజేయ ప్రార్థించుచున్నాను” అన్నాడు. సార్వభౌముడు చిరునవ్వుతో వసుబాలుణ్ణి దగ్గిరకు రమ్మని తన మెళ్లో ఉన్న దివ్యమణిహారము ఒకటితీసి అతని మెళ్లో వేసి, తల నిమిరి - "కవివిన్నీ వీరుడవున్నూ అయి నీ చక్రవర్తికి సహాయం చేసుకో!” అని “పెద్దనామాత్యులకు కబురు పంపవలసింది” అన్నారు. ఒక ద్వారపాలకుడు వేగంగా పోయినాడు. వసుబాలుడు భూలోకంలో లేడు; ఇదివరకు చక్రవర్తిని దూరంగా చూడడమే! ఆయనతో మాట్లాడలేదు. ఆయన తల
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 65- కథలు నిమిరినప్పుడు శ్రీ ఆదివిష్ణువు ఆశీర్వదించినట్లయింది. జన్మసాఫల్యం అయింది అనుకున్నాడు వసుబాలుడు. ఇంతలో ఒక పక్క నుంచి పెద్దనామాత్యులు, ఒక పక్క నుండి శివబాలరెడ్డి నాయకులు చక్కావచ్చి సార్వభౌమునికి నమస్కారములుచేసి ఆసనాలు అధివసించారు. వసుబాలుడు సంభ్రమంగా లేచి గురువుగారికి మోకరించి నమస్కరించాడు. ఆయన లేవదీసి, “ఏమి చిక్కావు, గట్టితనం దాల్చావు. ఈ గాయాలు, కట్లు ఏమిటి?” అని అన్నాడు. వసుబాలుడు తండ్రికి మోకరించినాడు. అతడు కుమారుని యెత్తి మూర్ధ మాఘ్రాణించాడు. కళ్ళ నీళ్ళు తిరుగుతూ ఉండగా, గొంతులో డగ్గుత్తికపడుతూ ఉండగా కుమారుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగినవి. అప్పాజీ: శివబాలరెడ్డి వర్యా! నీ కుమారుడు తన సార్వభౌమునికి, విజయనగరం సామ్రాజ్యానికి తీరరాని ఉపకారం జేసినాడు. శ్రీ సార్వభౌములు అతనికి నూకపాలెం జాగీరు దయచేయుచున్నారు” అని అప్పుడే చక్రవర్తి స్వహస్తనామాంకితమైన ముద్ర వేయగానే ఆ పత్రము పుచ్చుకొని వసుబాలుడికి యిచ్చినారు. ఇంతలో ప్రతాపనాయకులు ఒక బాలికను మేలిముసుగులో కొనివచ్చినారు. అందరూ ప్రతాపనాయకుణ్ణి బహూకరించారు. వసుబాలుడి గుండెలు కొట్టుకున్నవి. అతనికి దివ్యగీతానాదములు వినిపించినవి. వేయారు అపరిమిత సుగంధములు వీచినట్లయినది. అప్పాజీ: ప్రతాపనాయకా! నువ్వు నీ సార్వభౌములకు చేసే సేవ అపరిమితము, నీ కుమార్తె ఎవరికిన్నీ సాధ్యముగాని రహస్య భేదనాలు నీ సహాయంతో చేసి అత్యుత్కృష్టమైన సేవజేసింది. ఆమెకు శ్రీసార్వభౌములు సూరదాపాలెం జాగీరు పక్కవున్న వీరసపాలెంజాగీరు దయచేస్తూ ఉన్నారు. ఆ రెండు జాగీర్లు కృష్ణా తుంగభద్రల్లా ఉండుగాక! సార్వభౌములు, మల్లవరప్రభువులు తమ్మన్న నాయకులు “తథాస్తు” అన్నారు. - ఆప్పాజీ సార్వభౌముని వంక చూచి అన్నాడు “దేవా! ఈ తమ్మన్న నాయకులే ఈ నాటకానికి సూత్రధారులు. ఈలా వస్తుందని అనుకోలేదు. ఈ అమ్మాయి అందం లోక ప్రసిద్ధం. అమ్మాయిని వసుబాలుడికి యివ్వడానికి తన కుడిచెయ్యి అయిన ప్రతాపనాయని కోర్కెతో ఆ బాలను ఏదో కష్టంలో దొంగలుకొట్తున్నట్లుగా ఏర్పాటుచేసి అతడు ఆమెను రక్షించేటట్లు చేయాలిసిందిగా ఆజ్ఞ పంపించారు. శివబాలుని కుమారునకు ప్రతాపుని కుమార్తెను యిచ్చునట్లు శ్రీ దేవర ఆజ్ఞ ఇదివరకె పుచ్చుకున్నానుకదా! అని నేను పంపినాను. కాని ఇంతకూ జరిగిన కథ వేరు. విరూపాక్షుడే వసుబాలుడి కథ నడిపాడు.”
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 66 ♦ కథలు 10
రెండు రోజులైన వెనుక వసుబాలుడు ప్రతాపనాయనింవారి శిబిరానికి పోయినాడు. అవరోధజనశిబిరాలు ప్రతి నాయకుని శిబిరానికి వెనకగా ఉంటాయి. అంతఃపుర స్త్రీలు కనబడరు. వసుబాలుడు ప్రతాపనాయనింవారి శిబిరానికి వెళ్ళగానే ద్వారపాలకులాతనికి నమస్కరించి, ఒక డేరాలోనికి తీసికొని వెళ్ళి అచ్చట అతనిని అధివసింపచేసినారు. వసుబాలుడు అచ్చట ఉచితాసనంపై కూర్చుండి హృదయం మారు మ్రోగుతుండగా ఒంటరిగా అన్నీచూస్తూ ఉన్నాడు. ఆ డేరాలో అలంకారాలు, ఉన్న వస్తువులు ఒక బాలిక అలంకరించుకొనే మందిరంలో ఉన్న వానిలా ఉన్నాయి. వివిధ సుగంధాలా డేరాలో ప్రసరిస్తున్నాయి. ఒకచోట కొన్ని పట్టుచీరలున్నాయి. ఒకచోట జరీబుటావు పనిచేసిన పట్టురవిక లారవేయబడి ఉన్నాయి. చందుగా పెట్టెలు, గుండ్రని తోలుపెట్టెలు, నగల పెట్టెలు ఉన్నవి. ఒకచోట సాలపత్ర గ్రంథపీఠిక లున్నాయి. ఇంతలో ఒక ద్వారానికి ఉన్నతెర ఒత్తిగించబడి, ఒక బాలిక లోనికి వచ్చి, కలకలలాడుతూ ఉదయ ప్రాంగణారుణ ప్రత్యక్షమూర్తి ఉషాదేవిలా దివ్య కాసారమధ్య వికసిత సహస్రదళ కమలపద్మినీ దేవిలా చిరునవ్వుతో పోతపోసిన సౌందర్యరాశిలా అరవిందబాల నిలుచుంది. ఒకే ఒక్క క్షణికమట్లా బాలిక నిలుచుండి “మీరేనా ప్రభూ!” అంటూ మెరుములా, సుగంధకల్లోలంలా, వేయి ఆనందాల సుడిగుండంలా వచ్చి వసుబాలుని ఒళ్ళో వాలింది. వసుబాలుడు మైమరచాడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడూ యిలాగే వచ్చింది. ఇంతలో ఆమె అతని తలవంచి గాఢంగా అతని పెదవులు ముద్దుకొన్నది. ఒకరిగాయాలు ఒకరికి చూపించుకుంటూ, ఒకే, అశ్లేషంలో విడిపోక ఒకరై, వారు మాటలులేక అలా ఉండిపోయారు. “అమ్మగారు మిమ్ము నా మందిరపుడేరాలో చూడవచ్చునన్నారు. మీకు వార్త పంపాను సుమండీ. ఇక మీరు నన్ను కొన్నాళ్ళవరకూ చూడలేరులెండి. ఆ దినాలు ఎల్లా గడుపుకుంటారో ఓ తాయిలంగారు! నేను మాత్రం ఒక నిముషము ఒక కల్పంగా “అట్టే దినాలు అక్కర్లేదులెండి ఓ చారిణీ దేవిగారూ! అప్పాజీవారు పెట్టించిన ముహూర్తం వారం రోజులలో, ఇక్కడే లెండి ఒక మహా ఉత్సవమని ప్రతాపరాయనించారు వార్త పంపారు ఇక ఎల్లుండి ప్రధానానికి వస్తున్నామని ఓ తాయిలంగారూ, ఏమంటారు?" - - - “ఏమంటారా?” అంటూ గబుక్కున లేచి ఆమె గుమ్మం దగ్గరకు పరువిడింది. వసుబాలుడూ ఉరికి, ఆమెను గట్టిగా హృదయానికి అదుముకున్నాడు. వారిద్దరూ ఆ తన్మయత్వంలో ఒకరిమోము నొకరు చూస్తూ, తమ తరువాయి కథారహస్యం చెప్పుకుంటూ ఉండిపోయారు.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 67 ♦ కథలు తూలికా నృత్యం
ఆ బాలిక రంగులు కలుపుకుంటూ ఉన్నది. తాను ఎదురుగుండా పెట్టుకున్న వాట్మన్స్ డ్రాయింగు పేపరు నున్నటి చిత్రలేఖన ఫలకానికి సూదులతో నొక్కిపెట్టి ఉంచినది. ఆ కాగితంపై పెన్సిల్తో రేఖాచిత్రం ఒకటి గీసి ఉన్నది. అనేక చిత్తుడ్రాయింగు కాగితాలపై తన మనసులోని భావాలకు మూర్తికట్టించే రూపం కోసం ప్రయత్నాలన్నీ చేసింది. అవి ఎంతో కంగాళీగా వచ్చినవి. మనస్సు తృప్తి కలుగలేదు. బొమ్మని, రబ్బరు ముక్కతో చెరిపి, మళ్ళీ వేసి, మళ్ళీ చెరిపి, అలా వేస్తూ చెరుపుతూ ఈ వారంరోజులనుండీ ఆమెతన భావానికి మూర్తి సమకూర్చ ప్రయత్నించింది. చిత్తు డ్రాయింగు కాగితా లెన్ని పాడుచేసిందో! చివరకు ఆ విన్యాసాలన్నిటిలోనుండి ఏదో ఒకరకంగా తృప్తి ఇచ్చిన రూపం వచ్చింది ఆ రూపాన్ని దిద్ది, తీర్చింది. ఆ బొమ్మను పల్చని కాగితంపైన ప్రతి తీసి. కాగితం వెనకవైపు నల్లటి డ్రాయింగు బొగ్గుపొడుం రుద్ది, నాలుగు “హెచ్” మార్కు వీనస్ పెన్సిలు సన్నంగా చెక్కి, ఇసుక కాగితంపై అరగదీసి, మొనతీర్చి, “వాట్మన్ కంపెనీవారి “ఇంపీరియల్' చేతి తయారు కాగితం ఇరవై అంగుళాలు పొడుగూ, పన్నెండు అంగుళాలు వెడల్పూ కొలతలను కత్తిరించి, మొదట చిత్రలేఖన ఫలకంపై ఆ వాట్మన్ కాగితమూ, దానిపైన ఆ పల్చని కాగితమూ ఉంచి డ్రాయింగు సూదులు నాలుగు మొనలపైనా గట్టిగా గుచ్చింది. ఆ పల్చని కాగితంపై ఉన్న రేఖాచిత్రంపై ఈ నాలుగు “హెచ్” వీనసు పెన్సిలుతో రేఖలను గీసింది. ఆ వెంటనే చిత్తురేఖాచిత్రం ఉన్న పల్చని కాగితం తీసివేసి, మంచి కాగితంపై దిగిన బొమ్మను చూసుకొని సరిదిద్దుకొంది. ఆ వెనుక ఆ పెన్సిలు రేఖలపై తాను ఈయదలచుకొన్న రంగుల ననుసరించి తూలికతో రంగురేఖలు దిద్దింది. వేయదలచుకొన్న చిత్రం "రైతూ - రైతు కూలీ!” ఆ బొమ్మ వేయడమా, వద్దా అని మొదట కొన్ని రోజులు ఆలోచించింది. ఆ విషయంలో ఆ బాలికకు, ఆ బాలికకు చిత్రలేఖన విద్య నేర్పే “పద్మప్రియ” దేవికీ ఒక ఉదయమంతా వాదన జరిగింది. “ఒక భావం నీకు సన్నిహితమై ఆనందం కలగాలి! అప్పుడే ఆ ఆనందంలో నుంచి చిత్రకారునికి రసస్వరూపమైన రూపం ప్రత్యక్షమౌతుంది. అంతేకాని మనస్సులో
అడివి బాపిరాజు రచనలు 8 9U9 ♦ 68 + కథలు రాజకీయమైన కోర్కెలూ, కాంక్షలూ, పట్టుదలలూ ఉండి, ఆ భావాలు రసస్వరూపమై ప్రత్యక్షం కాకుండా చిత్రం వేయడానికి సంకల్పం చేసుకుంటే రసాభాసం ఉద్భవిస్తుంది కాని, రసభావ స్వరూపం ఉద్భవించదు వాణీ!" వాణీసుందరి అని ఆ బాలిక పేరు. వాణి తన దేశికురాలివైపు తీక్షణంగా చూచి, “పిన్నీ, మీరు చెప్పే ముక్కలు నాకేమీ అర్థంకావు, రసభావం ఏమిటి, రసాభాస భావం ఏమిటి? నాకు విడమరచి చెప్పండి!” “రసానందం అంటే కళానందం అని మన గురువుగారు బ్రహ్మమూర్తిగారు చెప్పారుకదా!” "అవునూ! ఆహార, నిద్రా, భయాదులైన మానవ భౌతిక వాంఛలను మించిన ఒక మహోత్తమ వాంఛ ఉన్నదనీ, అది సౌందర్య వాంఛ అనీ, జగత్తులో ఆ సౌందర్యం చూచి ఆనందం పడడం మానవుని మనస్సునకు ఉత్తమస్థితి అనీ ఆ శక్తివల్ల మనుష్యుడు సర్వకాల సౌందర్యాన్వేషి అవుతాడనీ, ప్రకృతిలో, మనుష్యసంఘ చరిత్రలో ఆ సౌందర్యం కొన్నికొన్ని దోషాలు కలిగి ఉంటే వానిని మనుష్యుడు తనమనస్సులో దిద్దుకొని, లేనివి కలుపుకొని ఆనందిస్తాడనీ, అలాంటి మనుష్యునకు సృజనశక్తిఉంటే, అతడు కావ్య రూపంగానో, ఇతర సాహిత్య రూపాలుగానో, చిత్రలేఖన శిల్ప రూపాలుగానో, సంగీత నాట్య రూపాలుగానో వ్యక్తం చేసి ఆనందిస్తాడనీ, అవి లలిత కళారూపాలనీ, ఆ కళలు భావకులైన సహృదయులకు ఆనందం కలుగజేస్తాయనీ గురువుగారు బోధించారు. అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ ఆనందం రసానందం అన్నారు. నిజమే అయితే ఏమి? ఆ భావాలన్నీ నాకు పూర్తిగా అర్థంకాలేదు పిన్నీ!” “చిన్న ఉపన్యాసం ఇచ్చావు తల్లీ! ఆ భావాలు పోను పోను నీకు పూర్తిగా అర్థం అవుతాయి.” “సరేలెండి, పిన్నీ! అయితే ఇంతకూ ఈ చిత్రంలో ఉండే దోషమేమిటంటారు?” ఆ బాలికవేసే చిత్రం పద్మప్రియ పరిశీలించసాగింది. రైతు, రైతు వెనక అతడు వేసుకొన్న పాశ్చాత్యఛత్రం ఉంది. రైతుకూలీ బొమ్మకు కుడివైపున మధ్యగా ఉన్నాడు. రైతు బొమ్మకు ఎడంవైపున మధ్యగా ఉన్నాడు. ఒకరికొకరు ఎదురై ఉన్నారు. రైతు కోపంగా ఉన్నాడు. రైతు కూలీ శాంతంగా ఉన్నాడు. రైతుకూలీ వెనక నీలాకాశం ఉంది. వీరిరువురకుమధ్య దూరంగా వరికుప్పఉంది. రైతుకు ఎడంప్రక్క చిత్రానికి వెనక భాగాన దూరంగా రోడ్డుమీద, అతను పొలాలకు ఎక్కివచ్చిన గుఱ్ఱపు బగ్గీ బండి ఉంది. దానికి వెనుకగా ఇంకా దూరంగా గ్రామమూ, చెట్లూ, ఆ చెట్లల్లోంచి రైతుమేడ కనబడుతూ ఉంటాయి. రైతుమోము మూడు వంతులు తిరిగి ఉంది. రైతుకూలీ మోము రైతువైపుకు పూర్తిగా తిరిగి ఉంది. దేహం మూడువంతులు ప్రేక్షకులవైపు తిరిగి ఉంది. రైతు దేహం రైతుకూలీ వేపుకు పూర్తిగా తిరిగి ఉంది. రైతుకూలీ ప్రక్కనే నాగలి, ఎడ్లూ ఉన్నాయి. కొంచెం దూరంగా అతని భార్య పచ్చగడ్డికోస్తూ రైతూ, రైతుకూలీల సంభాషణ వింటున్నది. ఆ ప్రక్కనే రైతుకూలీ కొడుకు గట్లు తవ్వుతూ, బాగుచేస్తున్నాడు. ఇంకా కొంచెం దూరంగా
అడివి బాపిరాజు రచనలు - 8 69 కథలు మాలపల్లి గుడిసెలూ, కుక్కలూ కోళ్ళూ, పశువులూ, మరికొంత దూరంలో చచ్చిన జంతువూ, దాన్ని తింటూ రాబందులూ, కాకులు ఉన్నవి. ఈ చిత్రం వలదనిన్నీ ఈ చిత్రభావానికి స్థాయీస్థితి రాదనిన్నీ పద్మప్రియాదేవి శిష్యురాలికి మొదటనే నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. కాని "స్థాయీస్థితి అంటే ఏమిటి? అదిరావడం అంటే ఏమిటి? అది రాకపోవడము అంటే యేమిటి?" అని తీవ్రంగా ఆమెను వాణీసుందరి అడిగింది. తమ గురువు బ్రహ్మమూర్తి ఈలాంటి విషయాలు పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వాదిస్తాడు. తనకు తన గురువు బోధించినవి అర్థం అయ్యాయి. అవన్నీ తన జీవితంలో హత్తించుకొని. తాను రచించే చిత్రాలన్నిటిలో భారతీయ కళాసత్యం సర్వతోముఖంగా వికసింప చేయకలిగింది పద్మప్రియ. ఎటువచ్చినా తాను ఆరభటీ వృత్తిపూర్ణమైన చిత్రాలు విన్యాసం చేయలేకపోలేదు. కైశికీ వృత్తిజనిత శృంగార, భక్తి, శాంతి, కరుణ, శోకరసాలను సిద్ధహస్తంతో నిష్పన్నం చేయకలిగేది. ఇంక ఈ బాలకు బోధించి వాణీసుందరికి సరియైన దారిచూపించడం ఏలాగు అని ఆనాడు పద్మప్రియ దీర్ఘనిశ్వాసం విడిచింది. ఈ దినాన వాణీసుందరి ఆ బొమ్మను రంగుల రేకలు దిద్దుతూ ఉండగా పద్మప్రియ అచ్చటికి వచ్చి ఆ బాలిక చిత్రాన్ని గమనించి చూచి వెళ్ళిపోయింది.
2
పద్మప్రియాదేవికి ఇప్పుడు ఈ 1949, డిశంబరులో ఇరువది ఎనిమిదేండ్లు. ఆమెకు బంగారు ఛాయ ఒళ్ళు. కోలనైనమోము. సోగకళ్ళు. ఒత్తయిన జుట్టు, ఆ సోగకళ్ళు అర్ధనిమీలితాలు. చిన్ననినోరు. ఎఱ్ఱనై సన్నవైన పెదవులు. సమంగా నిడువు కలిగినమెడ. సొట్టకలిగి ముద్దులు గులికే గడ్డము. ఆ దివ్య సౌందర్యం కలిగిన వదనం చూసిన పురుషుడు పదే పదే ఆ మోముచూచి తనివినందుడు. ఆమె కళ్ళల్లో ఏవో లోతులు కలిగిన అమాయకపు చూపులు. ఎత్తయిన వక్షోజాలపై, పూర్వకాలపు విధానంగా రైకా, ఆపై అందంగా మడతలు తీర్చిన పయ్యెద ఎప్పుడూ చెక్కుచెదరువు. సన్నని నడుము, శిల్పులు ఆనంద తన్మయులయ్యే విగ్రహము. వికసించిన కటి, తీర్చిన పాదాలు, పొడుగు చేతులు, చిన్న హస్తాలు, తీగలవంటి వేళ్ళు, ఆమె పెదవులు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాయి. పెళ్ళి అయి, కార్యంకాకుండా నెలరోజులలో ఆమె భర్తకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఎన్నో ఉపవ్యాధులు ఆ జ్వరంలో విజృంభించి అతడు ఇరవైయో లంకనం రోజున దేహం వీడినాడు. పద్మప్రియకు పదునారవ ఏటనే పెళ్ళయినది. అంతవరకూ సరియైన సంబంధాలు దొరకలేదు. దొరికిన సంబంధాలు ఆమెకు నచ్చలేదు. ఏం.ఎ.లో కృతార్థుడై ఒక కాలేజీలో ఆచార్య పదవిలో ఉన్న ఇరవై నాలుగేళ్ళ యువకుడు, స్వకులం వాడు, మంచి వరుడు దొరికాడు. ఒక్కతే కూతురు; సోదరులులేరు పద్మప్రియకు. కాబట్టి మంచి కట్నం ఇచ్చాడు. కట్నం ఇవ్వకూడదన్న పెద్దమనిషే. అయితే ఏమి? ఇప్పటి సంఘంలో ఉన్న ఈ మహా దురాచార వ్యాధికి అతడూ లోనుగాక తప్పిందికాదు.
అడివి బాపిరాజు రచనలు - 8 + 70 -> కథలు చిన్నతనంలోనే విధవ అయిన పద్మప్రియను చూచి, బంధువులంతా దుఃఖించారు. తల్లిదండ్రుల దుఃఖం ఏడు సముద్రాలే అయింది. ఆమె అందం చూచి, ఆమె స్థితి తలచుకొని ఆమె తండ్రిగారి స్నేహితులందరూ మళ్ళీ వివాహం చేయమని పట్టుగా సలహా యిచ్చారు. “ఆమెకు విద్య చెప్పిస్తాను. ఆ తర్వాత ఆమె ఇష్టం!” అని తండ్రి కోదండరామయ్య గారన్నారు. ఆమె చదువులో చేరింది; స్కూలు ఫైనలు నెగ్గింది. కాలేజీ చదువు పూర్తిచేసి బి.యే. పట్టం పొందింది. ఆ బాలికకు చిన్నతనాన్నుంచీ చిత్రకళ అంటే మహాఇష్టం. ఎప్పుడూ ఏవో బొమ్మలు, పత్రులు వ్రాస్తూనే ఉండేది. రంగుల పెట్టే, కుంచెలూ కొనుక్కుంది. ఇరవై అయిదో ఏట బి.యే. నెగ్గింది. పద్మప్రియ. ఆమె కప్పుడు వివాహం చేద్దామని తండ్రి ప్రయత్నించారు. “నాన్నా! నాకు వివాహంమీద ఇచ్చలేదు. నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం. శాంతినికేతనానికి పోయి నందలాలుగారి పాదాలకడ చిత్రలేఖనం నేర్చుకుంటాను” అని ఆ బాల పట్టుపట్టింది. తండ్రి ఆమెను శాంతినికేతనానికి పంపించాడు. అక్కడ ఆమెకు ఆంధ్రుడైన బ్రహ్మమూర్తితో పరిచయం కలిగింది. బ్రహ్మమూర్తి వివాహం చేసుకోనని నిశ్చయం చేసికొని జీవితం సాగిస్తున్న బ్రహ్మచారి. అతనికి చిన్నతనాన్నుంచి శిల్పము, చిత్రలేఖనము, కవిత్వము, సంగీతము, నాట్యము అంటే వర్ణింపరాని ప్రేమ. అతనికి ఉగ్గుపాలరోజులలోనే ఈ విద్యలన్నీ అలవడినాయి. కాని, తల్లితండ్రులు ఈ విద్యలవల్ల లాభం లేదురా బాగా చదువుకొని, పరీక్షలునెగ్గి ఉద్యోగం చేయరా అని పోరుపెట్టారు. అతడు చదువు సాగించాడు. కళాహృదయం ఉత్కృష్టంగా వికసించాలంటే సర్వప్రపంచ జ్ఞానం అవసరమనీ, అందుకై చదువులు ముఖ్యమనీ అతడు సమాధానం పెట్టుకున్నాడు. చదువుకుంటూ లలితకళాభ్యాసం చేసుకుంటూ ఇరవైరెండో ఏట బి.ఎస్సి. ఆనర్సు పూర్తి చేశాడు. ఆనర్సు చదువుతూ ఉండగానే అతని తల్లితండ్రులు పరమపదంచేరినారు మూడు నెలలు ఎచ్చుతగ్గులుగా! తనకు సరియైన భార్య దొరకడం అసంభవమని అతనివాదన. అతడంత అందమైన వాడూ కాదు; అంత కురూపీకాడు. కొంచెంపసిమిలో చేరే చామనచాయ. మధ్యరకం ఎత్తు. బలవంతమూకాని, బలహీనముకాని దేహ సౌష్టవం. కోలమోము చిన్న కళ్ళు, సమనాసిక, విశాలమైన నుదురు, సాధారణమైన నోరు. కాని అతని చూపులలో సర్వ విశ్వ సౌందర్యాలూ అన్వేషించే శక్తి ఉంది. అతనికంఠం చాలా తీయని మందర పంచమ మధ్యస్థాయి కలది. చురుకైన బుద్ధి. ఎప్పటికీ శక్తివీడని నవనవోన్మేషమైన కళాసృష్టి. అతని పాటలు అతనిని ఆంధ్రదేశంలో పదిమంది పెద్దకవులలో ఒకణ్ని చేశాయి. అతని నాట్య ప్రదర్శన అతనికి భారతదేశం అంతా నిండే కీర్తిని సమర్పించింది. అతని సంగీతం మనోహరం. అలాంటి ఆ యువకుడు ఆనర్సు పూర్తిచేసి కలకత్తాపోయి, అవనీంద్ర ఋషి పాదాలకడ చిత్రలేఖనం నేర్చుకున్నాడు. దేశం అంతా తిరిగి సర్వకళాక్షేత్రాలలో మూల్య శిల్పాలనూ, చిత్రాలనూ సమర్పించిన అజ్ఞాత కళావేత్తల ఆత్మ పాదాలకడ అతడు
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 71 - కథలుy భారతీయ సంప్రదాయ మహోత్తమశక్తి అలవరచుకొన్నాడు. శివుని కడ పాశుపతం సముపార్జించిన అర్జునునివలె! చిన్నతనాన్నుండీ అతనికి ఒక ఆశయ సౌందర్యరాశి అయిన బాలికా మూర్తి స్వప్న సుందరిగా సాళాత్కరించి ఉండేది. ఆ బాలిక తనకు ఈ జన్మలోగాని, మరి ఏ జన్మలోగాని ప్రత్యక్షం కాదనే అతని నమ్మకం. అతడు కళాతపస్వి అయిన మరుక్షణం నుండీ ఆమె సర్వకాలమూ అతనికి వ్యక్తావ్యక్త మూర్తిగా ప్రత్యక్షం అయియుండేది. అతడు చిత్రలేఖనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. అనేక ఉత్తమ మంత్ర ధ్యానమూర్తులను, అనేక విచిత్ర పురాణేతిహాస కావ్యాంతర సంఘటనలను చిత్రించేవాడు; అనేక భాష చిత్రాలను రచించాడు; మహాభావపూరితమైన ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు. చిత్రాలు ఉత్తమమైనవి. వర్ణ విన్యాసము మహోత్తమము, రేఖా శక్తి అత్యుత్తమము, భావము పరమోత్తమము అయినా ఈ కాలానికీ ఈ చిత్రాలన్నీ ఎవరికికావాలి? ఆ భావాలు ఎవరికో కొద్దిమందికి తక్క సాధారణ ప్రజాకోటికి సన్నిహితంకావు. ఈనాడవి పూలతోటలంటివి. తిండిలేక మలమల మాడిపోయేవారికీ ఈలాంటి చిత్రాలెవరికి కావాలి?” అని కొందరు విమర్శకు లాతన్ని గురించి పత్రికలలో వ్రాసినారు. “సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యల విషయంలో ప్రజలకు ఉద్రేకం కలుగజేసే చిత్రాలు ఉత్తమ తరగతికి రాలేవు. అవి విన్యసించేందుకు సాధారణ చిత్రకారులు చాలు. బ్రహ్మమూర్తిగారి వంటి మహోత్తమ చిత్రకారులు భారతీయ దివ్యసంస్కృతిని పునరుద్ధరించేందుకు ఉద్భవించారు. ఈనాడు భరతమాతకు సంపూర్ణ విముక్తి వచ్చింది, లోకానికి సరియైన మార్గం భారత జాతీయతే చూపించవలసి ఉన్నది. అటు కోటీశ్వర ప్రజాస్వామికము పనికిరాదు; ఇటు ప్రజా నియంతృత్వమూ పనికిరాదు. ప్రపంచానికి కావలసినది సంపూర్ణ ప్రజాస్వామికత్వము. దానికి మార్గం అహింస. భారతీయ సంస్కృతిలో నుండి ఉద్భవించిన లలిత కళా విధానం ఆ ఉత్తమ ప్రజారాజ్యస్థితికి దారిచూపిస్తుంది” అని ఇంకో తెగ విమర్శకులు బ్రహ్మమూర్తిని సమర్థించారు. ఆ విమర్శనవల్ల బ్రహ్మమూర్తి హృదయం కుదురు చెదిరిపోయింది. అతడు తన గురువైన అవనీంద్రునికడకు సందేహ నివృత్తికోసం శాంతి నికేతనం చేరినాడు. దివ్యకవి శ్రీ రవీంద్రుడు అస్తమించినప్పటి నుండీ అవనీంద్రుడే శాంతినికేతనానికి కులపతి అయినాడు. బ్రహ్మమూర్తికి ఏది నిజమైన దారి అన్న అనుమానం పిశాచమై ఆవహించింది. దేశాలు తిరిగినా, శిల్ప క్షేత్రాలు సేవించినా, హిమాలయ దివ్యసౌందర్య ప్రదేశాలు యాత్రలు సేవించినా, అతనికి అనుమానము పోలేదు; శాంతి కుదరలేదు. చివరకాతడు 1947, ఏప్రిల్నెల 1వ తారీఖున తన గురుపాదాలకడ చేరుకున్నాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 • 72 + కథలు 3
శాంతి నికేతనానికి వచ్చిన మర్నాడు బ్రహ్మమూర్తి అవనీంద్ర పర్ణశాలకుపోయి. తన గురువునకు పాదాభివందనమాచరించి, శ్రీనందలాల్ని దర్శిద్దామని వెడుతున్నాడు. నందలాల్ పర్ణశాలా ముఖద్వారములో అతడు అడిగినాడు, అప్పుడే అతని కళ్ళకు ఒక దివ్యసుందరమూర్తి ప్రత్యక్షమైంది. ఇన్నాళ్ళ వరకు ఏ స్వప్నసుందరి అతని ఆశా దేవీమూర్తియై అతనిచేత పాటలు పాడించిందో, ఆ దేవీయే ఇప్పుడు అతని ఎదుట మానినీమూర్తియై ప్రత్యక్షమైంది. అతని హృదయ స్పందనం ఆగిపోయింది; అతడు ఆగిపోయి అనిమిషుడై ఆ మూర్తిని ప్రగాఢ భక్తిపూరిత నయనాలతో అవలోకిస్తున్నాడు. ఆ బాలికా మూర్తి ఈతన్ని చూసి ఆగిపోయింది. అతని వెనకాల ఉన్న కాంతి అతనిలోనుండే ఉద్భవిస్తున్నట్లామెకు తోచినది. ఎవరో ఒక దేవుడు స్వర్గము విడిచి ఇక్కడకు వచ్చినాడని ఆమె అనుకొన్నది. అనుకొని ఏదో ఒక వ్యవస్థాభి సంఘాతయై ఆమె తలవాల్చుకొని రెండుచేతులు అంజలి ఘటించి అతనికి నమస్కరించింది. అతడు తిరిగి నమస్కరిస్తూ. "దేవీ! భారతీయ సంప్రదాయమా ఈనాడు భరతదేశమునకు కావలసినది? లేదా అతి నవీన పాశ్చాత్య సంప్రదాయాది అభిముఖత్వమా?” అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఆమె ఏమి ఆశ్చర్యపడకుండానే, తాను తెలుగుబాలిక నని అతనికి ఎలా తెలిసిందని ఆలోచించకుండానే, ఆమె "ప్రపంచానికే సరియైన దారి భారతీయ సంప్రదాయమండీ” అన్నది. తరువాత వారిద్దరు ఆ ప్రశ్నకూ ఆ సమాధానమునకూ ఆశ్చర్యమును పొందినారు. బ్రహ్మమూర్తికి ఇప్పుడు ముప్పదిరెండు ఏండ్లు. అతడు ఇన్నేళ్ళూ వివాహము చేసికోలేదు. వివాహము చేసికొనమని వత్తిడిచేసే తల్లిదండ్రులే నాకవాసులై పోయినారు. అన్నగార్లిద్దరు గుడిగుడి గుండం గుండా రాగం వాళ్లు. ఒక అక్కగారు, ఇద్దరూ చెల్లెళ్ళు. “పెళ్ళిచేసికో తమ్ముడూ”, “పెళ్ళిచేసుకో అన్నయ్యా" అని వత్తిడి చేసిన మాట నిజమే. కాని "నాకు భార్యాబిడ్డలు చిత్రలేఖనమే” అని అతడు జవాబిచ్చేవాడు. కాని అతని హృదయంలో అతని భార్య అతని ఆశయదేవి. అతని హృదయ పూజాపీఠంమీద ఆమె నిత్యావివశిత. ఆమెయే అతనికి దేవి. ఈనాడు ఎదుట అజంతా కుడ్యవిలసిత సుందరివలె లతాంగి, పూబోడి మంజుల తారల్యకాంతిశరీరం తన ఆశాదేవి తన ఎదుట సాక్షాత్కరించింది. ఇంతలో అతనికి చైతన్యం వచ్చినది. ఆమె తెలుగు బాలిక అని ఎట్లా గ్రహించాడో అతనికే ఆశ్చర్యం వేసింది. ఆ ఆశ్చర్యముతోనే అతను ఆమెను “మీరు తెలుగువారా అండి?” అని ప్రశ్నించాడు. “అవునండి!”
అడివి బాపిరాజు రచనలు 8 ◆ 73 - కథలు “మీరు నందలాల్ గారి వద్ద చిత్రలేఖనం నేర్చుకుంటున్నారా?” "అవునండి. ఏడాది ఆరు నెలల వెనక నేను శాంతినికేతనానికి వచ్చాను. చిత్రలేఖనం నేర్చుకుంటున్నాను.” అతనికి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. “మీరు బ్రహ్మమూర్తిగారు కాదండీ? అనేక పత్రికలలో మీ ఫోటోలు గుర్తించాను; మీ వ్యాసాలు చదివాను; మీ బొమ్మలు చూశాను.” “మీ ఊరండి? మీ పేరు? మీ... మీ... నాన్నగారిపేరు?” “నా పేరు పద్మప్రియండి. మాది గుంటూరు జిల్లా అమరావతీ గ్రామం. మానాన్నగారి పేరు కోదండరామయ్యగారు.” అతడు ఆ హాలులో ఉన్న చిత్రాసనము వైపు ప్రవేశిస్తూ “దయ చేయండి పద్మప్రియగారూ” అన్నాడు. ఆమె దూరంలో ఉన్న ఇంకో చిత్రాసనముపై కూర్చున్నది. అతడు తలవంచుకొని "పద్మప్రియగారూ, మీరు లేపాక్షి చూశారా?" అని ప్రశ్నించాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ “నేను మా అమరావతి దగ్గర ఉండే శిల్ప శిధిలాలూ, నాగార్జున కొండా, కలకత్తా మ్యూజియంలో శిల్పాలు, ఇచ్చటి శిల్ప చిత్రలేఖనాలు మాత్రం చూచానండి. ఇంక ఏ శిల్ప క్షేత్రములు చూడలేదు.” “మిమ్మల్ని ఎన్నాళ్ళకు చూశాను!” “అంటే?” "ఏమీలేదు. తరవాత మనవి చేసుకుంటాను.” ".. ఇంతట్లో శ్రీనందలాల్ బోసు ఆ హాలులోకి వచ్చాడు. ఇద్దరూ లేచి ఆయనకు నమస్కరించారు. నందలాలు చిరునవ్వు నవ్వుతూ "ఎప్పుడు వచ్చావు బ్రహ్మమూర్తీ లేపాక్షిలో శిల్పవిద్యాలయం నెలకొల్పుతా నన్నావు?” “చిత్తం, నందలాలీ, ఈ ఏడే అక్కడ విద్యాలయం ప్రారంభించాను. ఆ క్షేత్రమే ఒక శిల్పవిద్యాలయం. నా ఆస్తి అంతా అమ్మి అక్కడ కొందరు పెద్దమనుష్యులు దాన మిచ్చిన పది ఎకరాల భూమిలో పని ప్రారంభించాను. మూడు మంచి పర్ణశాలలుకట్టినాను. ఇప్పుడు పన్నెండుగురు బాలురూ, నలుగురు బాలికలు విద్య నేర్చుకుంటున్నారు. ఈ వేసవి కాలంలో ఏమీ తోచక మన సంప్రదాయమా, పాశ్చాత్య సంప్రదాయమా అని విద్యాలయానికి సెలవిచ్చి ఈ నెలరోజులు పిచ్చిఎత్తినట్లు తిరుగుతున్నాను. ఆ ప్రశ్నయే అనాలోచితంగా మీ ఇంట్లో కనపడ్డ ఈ అమ్మాయిని అడిగాను. నేను ప్రశ్నవేసినట్లుగానే భారతీయ సంప్రదాయమే ప్రపంచానికి దేశికత్వము వహిస్తుందని జవాబు చెప్పింది. ఈమె నోటితో శ్రీ కళాదేవే ప్రత్యుత్తర మిచ్చి నట్లనిపించింది. నా సంశయం కూడా తీరిపోయిందండి” అని బ్రహ్మమూర్తి నందలాల్తో మనవి చేసుకొన్నాడు. నందలాల్ బోసు చిరునవ్వు నవ్వుకొన్నాడు. "బ్రహ్మమూర్తి, ఈమెను నీ ఆశ్రమానికి తీసుకు వెళ్ళవయ్యా” అన్నాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 74 + కథలు 4
ఆనాటినుండీ పద్మప్రియ బ్రహ్మమూర్తికి శిష్యురాలయినది. పది రోజులైన వెనుక వారిరువురూ శాంతినికేతనమునుండి బయలుదేరారు. కోదండరామయ్యగారు కొమరిత లేపాక్షి వెళ్ళి చిత్రలేఖనము నేర్చుకొన సంకల్పించినందుకు ఆయనకు ఇష్టమేనని ఉత్తరం వ్రాసినారు. వారిరువురూ అజంతా వెళ్ళినారు. ఎల్లోరా వెళ్ళినారు. ఒక్కొక్క క్షేత్రంలో పదీ, పదకొండురోజులు మకాం చేసేవారు. అతడు శిల్ప విద్యా రహస్యాలెన్నో ఆమెకు బోధించినాడు. ఆమెచే ఎప్పుడూ బొమ్మలు వేయిస్తూనే ఉన్నాడు. క్షణక్షణమూ అతడన్న భక్తి ఆమెకు ఎక్కువై పోతున్నది. ఆమెను చూచిన ప్రథమ క్షణంలోనే అతనికి ప్రేమ ఉదయించింది. వారు చెన్ననగరం నుంచి మహాబలేశ్వరము వచ్చినారు. మహాబలేశ్వరంలో ఇద్దరూ శిల్పాలను చూచి స్కెచ్చిలు వేసుకుంటున్నారు. ఆ సమయంలో బ్రహ్మమూర్తి పద్మప్రియను చూచి"పద్మప్రియా, నీవు ఎవరినైనా పురుషునిగా ప్రేమించావా?” అని ప్రశ్నించాడు. “లేదండి!” "నేను నా ఆశయ దేవతకై యుగాలనుండి వెదుకుతున్నాను. ఆమెను నీలో చూచాను! నువ్వే నా ఆశయమూర్తివి. నీ కోసం వేచి వేచి ఇంతవరకూ వివాహం చేసుకోలేదు. దివ్యశిల్పక్షేత్రమైన శాంతినికేతనంలో నాకు దర్శనమిచ్చావు.” ఆమె సిగ్గుతో తలవంచుకుంది. “నీకు ఆశయ పురుషుడు?” “నా కెవరూలేరు!” ఆమె జవాబులాతనికి ఆశ్చర్యం కలుగజేశాయి. అతడు మరల ఆమెతో ఏ ప్రస్తావనా తీసుకురాలేదు. అతని హృదయం గతులు తప్పిపోయింది. శాంతినికేతనం నుండి బయలుదేరిన రెండు నెలలకు వారిరువురూ లేపాక్షి చేరుకున్నారు. ఆమె అతనికి దీక్షాపూర్ణ అయిన శిష్యురాలయింది. అలా వారిరువురి స్నేహము నానాటికి వృద్ధి అయింది. 1948లో బ్రహ్మమూర్తి లేపాక్షి కళా విద్యాలయంలో బాలికా శాఖ నేర్పరచి, ఆ శాఖకు పద్మప్రియాదేవిని దేశికురాలిగా నియమించినాడు. ఆమె అతనికి చేసే పరిచర్య వర్ణనాతీతము. వారిరువురి స్నేహమూ అనన్యము. అయినా వారిరువురూ ఈ రెండేళ్ళపైన ఎప్పుడూ కళా విషయాలు తక్క, రాజకీయాలు, సాంఘిక విషయాలు తక్క ప్రేమవిషయాలు మాట్లాడుకోలేదు. పద్మప్రియ లోలోన కుళ్ళిపోయేది. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించింది. కాని ఆమెకు ప్రేమ విషయాలు మాట్లాడడం సిగ్గు. యెన్నిసార్లో ఆమె అతని పాదాలపై వాలి “నువ్వు నా అత్మేశ్వరుడవు, నాకు దేవుడవు. నా ప్రభువువు! నా ఆత్మ. నా శక్తి, నా
అడివి బాపిరాజు రచనలు - 8 75 -> కథలు దేహము నీకు బానిసలు, నన్ను ఏలుకో! నన్ను గాఢంగా కౌగలించుకో!" అని తన రహస్యం అతనికి విన్నవించాలనుకుంది. ఆమె తన్ను ప్రేమించడం లేదనిన్నీ, ఆమె ఈలా దూరంగా తనకు ఆశయ దేవియై ఉండిన చాలనిన్నీ, ఈ జన్మకు ఇంతే ప్రాప్తమనిన్నీ అతడు నిశ్చయం చేసుకున్నాడు. ఈ ఆమెతో అప్పుడప్పుడు తన ఆశయాలు, తాను సృష్టించదలచుకొన్న మహోత్తమ చిత్రలేఖనాలు, ఉత్తమ కావ్యాలు, ఆ కావ్యాలకు తానే అద్భుతమైన చిత్రాలు వేయదలచుకొన్నది. అతడామెకు తన హృదయమంతా తన కళలలో ప్రతిఫలిస్తుండగా చెప్పుకునేవాడు. తన ఆశయ దేవికి ఉషాదేవి అని పేరుట. ఆమె నిత్యోదయ స్వరూపిని అట. ఆమె నిత్యారుణ దివ్య సౌందర్య రూపిణియట. ఆమె నిత్య కౌశికీనృత్య పరవశ అట. ఆమెను అజంతాలో అలంకారోన్ముఖియైన రాజకుమారీ రూపంలో దర్శించాడట. ఆమెను అమరావతీ శిల్పంలో లీలా త్రిభంగీమూర్తియై హాస నృత్యాంచితాంచలాధరోష్టియైన యక్షిణీ రూపంలో అవిర్భావంగా చేసుకున్నాడట. ఆమెను ఎల్లోరాలో ముప్ఫై నాల్గవ గుహలో శచీదేవీ విలాసిత లోలా దివ్యసుందరమూర్తిలో సన్నిహితం చేసుకున్నాడట. పాలంపేట మందిరస్తంభ శిఖరాంచిత నృత్యబాలికా మూర్తిలో ప్రసన్నను చేసుకున్నాడట. కాని జీవితంలో ఆమె తనకింకనూ అవినతను కాంతయట. అవ్యక్తకాకలీ గంభీర కంఠంతో అత డీభావాలన్నీ ఉత్కంఠతో ఆమెకు చెపుతూ ఉంటే ఆమెకు ఆ మాటలు తన్నుద్దేశించినవే అని తెలుసు. ఆమె అతని పవిత్ర హృదయం అలా దర్శిస్తూ. లోలోన ఉప్పొంగిపోయేది. ఆ మాటలన్నీ వింటూ తన హృదయంలోని గాఢ ప్రణయావేశాన్ని తెరమరుగునే దాచి మోమున చూపుల్లో మాటలు వినే స్నేహితురాలి సానుభూతి మాత్రమే కనబరుస్తూ ఉండేది. ఇద్దరూ లోలోన పరితావేదనలకు లోనయ్యేవారు. వారి ఆవేదనలన్నీ వారిచిత్రాలలో ప్రత్యక్షమయ్యేవి. సర్వసంగ పరిత్యాగియై, మహాభి నిష్కరుణుడై పోవు సిద్ధార్థ బోధిసత్వుని చిత్రం నలుబది దినాలు సర్వాహార వర్జితుడై మహాతపస్సు సల్పి, కామదేవుని మాయకులోబడని బుద్ధిస్థితోన్ముఖుడై అశ్వద్ధ ఛాయాధివసితనిష్ఠుడైన బోధిసత్వుని చిత్రమును. దివ్యభిక్షకుడై గడపకడా గడపకడా భిక్షమడుగు మహాశ్రమణక బుద్ధదేవుని చిత్రమును అతడు లిఖించినాడు. శ్రీకృష్ణుడే అతడు యోగేశ్వరేశ్వరునిగా ప్రత్యక్షము చేసినాడు. కపాలపాత్రా లంకరుడై సర్వవిశ్వాన్నీ భిక్షమడిగే పరమశివున్నాతడు చిత్రించినాడు. తపస్సు చేసే ధృవుడు. మహావేదాంతియై నడచిపోయే బాలుడైన శ్రీశకుడు అతని తూలికా వైరాగ్య నృత్యంలో నుంచి ఉద్భవించారు. సణ్వాప్రణయ భిక్షాటన మూర్తినిగా సూర్యుణ్ణి చిత్రించారు. దినదినము రాత్రికాలాలయందు తన విద్యార్థినీ, విద్యార్ధి బృందానికి ప్రపంచ లలితకళా చరిత్ర ఉపన్యసించేవాడు. లలితకళలెందుకు అన్న ప్రశ్నకు ప్రత్యుత్తరముగా మూడుగంట లుపన్యసించినాడు. కళాశయములేమిటి అన్న ప్రశ్నకు సమాధానముగా వారము రోజులు పరమ పవిత్ర గంభీరస్వరముతో సూక్తములు ప్రవచించినాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 76 -> కథలు అతడు పద్మప్రియను ప్రేమిస్తున్నట్లు విద్యార్థి లోకమంతయు గ్రహించినది. ఆమె హృదయము వాణీసుందరి అను బాలికకు తక్క ఇంకెవ్వరికీ అర్థముకాలేదు.
5
వాణీసుందరి పద్మప్రియకు వలెనే బి.ఏ. పూర్తిచేసి చిత్రలేఖన, నాట్య సంగీత కళలు అభ్యసించేందుకు లేపాక్షి కళాశ్రమంలో 1948లో చేరిన యువతి, ఆమె రాయలసీమ అనంతపుర పట్నవాసిని. ఆమె వచ్చిన మరుక్షణమునుండి పద్మప్రియాదేవి యంటే ఎంతో గాఢమైన భక్తి కుదిరినది. మేలిమి బంగరు రంగు, తీర్చిదిద్దిన కనుముక్కు తీరు, స్పష్టరేఖా విలసిత సుందరాంగ ప్రఫుల్లమైనరూపము. ఆ బాలిక పద్మప్రియకు అడుగులకు మడుగులొత్తేది. ఆ బాలిక ప్రేమించిన సహాధ్యాయుడైన యువకుడు దుర్మార్గగుణ పూరితుడు, మాయాజీవి అని తెలిసి హృదయము విచ్ఛిన్నము కాగా లలితకళాభ్యసన యోగంలో తన గాఢ దుఃఖము మరిచిపోయేందుకు లేపాక్షి కళాశ్రమమునకు వచ్చిచేరింది. లేపాక్షి కళాశ్రమము ఈనాడెంతో వృద్ధి పొందింది. ముప్పది ఇద్దరు విద్యార్థినులు, అరువది తొమ్మండుగురు విద్యార్థులు అక్కడ లలితకళలను అభ్యసిస్తున్నారు. బ్రహ్మమూర్తి ఆశ్రమాన్ని రెండు భాగాలుగా విభజించినాడు. ఒక భాగం బాలికాశాఖ, ఒక భాగం బాలశాఖ. దైనందిన విద్యాభ్యాసంలో ఈ శాఖకు, ఆ శాఖకు ఏవిధమైన సంబంధములేదు. కులపతి బ్రహ్మమూర్తి ఏదైనా ఉత్తమ చిత్రలేఖనము ప్రారంభించినప్పుడు విద్యార్థి విద్యార్థినీ లోకము, ఆచార్య ఆచార్యిణీలోకము వచ్చి అతని తూలికానృత్య గతులు దర్శిస్తూ ఉండేవారు. బ్రహ్మమూర్తి ఉపన్యాసాలు సాధారణంగా రాత్రిళ్ళు ఇచ్చేవాడు. ఆ పాఠములు వినడానికి ఆశ్రమవాసులందరూ హాజరయ్యేవారు. పద్మప్రియాదేవి తన జీవిత సర్వస్వముతో బ్రహ్మమూర్తిని ప్రేమిస్తున్నదని వాణీసుందరి వచ్చిన నెలరోజుల్లోనే గ్రహించకల్గింది. ధైర్యము లేక రసాభాస స్వరూపమైన మూర్ఖపుసిగ్గుతో తన ఆత్మప్రణయ నిక్షేపాన్ని పద్మప్రియాదేవి తానే కూలదోసు కుంటున్నదని వాణీసుందరి గ్రహించింది. ఆమెకు జరిగిన ప్రేమ పరాభవం, ఆమె జీవితాన్ని దగ్ధము చేసిన ప్రణయ దావానలం, ఆమెను మహాసూక్ష్మగ్రహణ శక్తియుతగా ఒనర్చాయి. ఆమెకు ఒక విధంగా ఉత్తమమైన ఉడుకుమోతుతనము పద్మప్రియ అంటే కలిగింది. సంపూర్ణ కళావతారమూర్తి ఒక మహాపురుషుడు తన ప్రేమ సర్వస్వము ఆమెకు నివేదిస్తున్నాడన్న భావము ఆమెకు ఆ ఉడుకుబోతుతనానికి కారణమైంది. మహాభక్తితో ప్రణయభిక్షను అంజలి పట్టిన తనకు ప్రేమ విషము లభించింది. వాణీసుందరికి పద్మప్రియాదేవి అంటే ప్రేమతో ఎంత భక్తి. అనురాగం కలిగిందో అంత క్రోధము ఆవహించినది. ఆ క్రోధముతో తన దేశికురాలైన పద్మప్రియాదేవిని అనేక రీతులుగా బాధలు పెట్టడానికి సంకల్పించుకొన్నది. వాణీసుందరికి భారతీయ సంప్రదాయ మహోత్తమ స్థితి తెలుసును. ఆ సంప్రదాయమంటే భక్తీ కలిగింది. నమ్మకమూ కుదిరింది. అయినా కావాలని నవీన పాశ్చాత్య సంప్రదాయాలను అనుకరిస్తూ చిత్రాలు లిఖించేది. అతి వాస్తవికత, అతి
అడివి బాపిరాజు రచనలు 1 8 + 77+> కథలు వ్యంగిణిరూపిత, అతి ప్రాథమికత వాదాల సంప్రదాయంగా ఆమె బొమ్మలు సృష్టిస్తూ ఉండేది. రాజకీయంగా పనికిరాని చిత్రాలు పనికిరావనేది. గాఢ బాధాపూరిత బీదస్థితిలో మగ్గిపోయే కోటికోటి జనాలకు ఉత్తమస్థితిని కొనివచ్చే మార్గాలను నిర్మించడానికి నాయకులకు దారిచూపే చిత్రాలను చిత్రించని కళ శుష్కకళ అని వాదించేది. వాణీసుందరిని పద్మప్రియ అమితంగా ప్రేమించింది. అందుకని వాణీసుందరి మూర్ఖత్వానికి ఆమె ఎంతో బాధపడేది. వాణీ సుందరితో పద్మప్రియ ఎంతో శాంతంగా వాదించేది. మేలుకుని నిద్ర నటించే వారిని ఎవ్వరూ లేపలేరు. తెలిసివుండి మూర్ఖవాదన వాదించేవారిని యెవ్వరు ఒప్పించలేరు.
6
బ్రహ్మమూర్తికి ప్రథమ శిష్యుడున్నూ చిన్నతనాన్నుంచి అలంకార శాస్త్రము, వ్యాకరణము పండితుల కడ చదువుకొన్నవాడును, స్కూలు ఫైనలు పరీక్ష ప్యాసయి సాహిత్యరత్న పరీక్షలో విజయమొందినవాడును, అన్ని కళలలోను తన గురువుకు వెనువెంట నున్నవాడని అనిపించుకున్న వాడును అయిన అహోబల నరశింహారావు బ్రహ్మమూర్తికి గాఢ స్నేహితుడు, శిష్యుడు, బ్రహ్మమూర్తి పాదాలు కడిగి నెత్తిని చల్లుకునే భక్తి అతనిది. అహోబల నరశింహారావు గురువుగారితోపాటు వివాహం చేసుకోనని పట్టుదల పట్టినాడు. గురువుగారి హృదయం అతనికి పూర్తిగా అవగాహన అయింది. కాబట్టే బ్రహ్మమూర్తి తన ఆవేదనలని అతనితో చెప్పి దుఃఖించేవాడు. బ్రహ్మమూర్తిని అతడు నాన్నగారూ అని పిలిచేవాడు. అతడు చామనచాయ మనిషి. చాలా బలంగా ఉంటాడు. బ్రహ్మమూర్తి శిష్యులందరికి అపరిమితానందము, భక్తి, అందరినీ మించినవాడు అహోబల నరశింహారావు. వారందరికీ పద్మప్రియాదేవి యన్న విపరీతమైన భక్తి. ప్రథమంలో ప్రతి శిష్యుడూ ఉషాదేవి చిత్రం లిఖించాలి. కొందరామె నృత్యం చేస్తున్నట్లు, కొందరామె పద్మాసనస్థయై ప్రత్యక్షమైనట్లు మరికొందరామె చతుర్థానురాశ్వములు పూనించిన దివ్యకమల చక్రాలు కలిగిన రథముపై అధివసించి నిరాలంబ మార్గాన్ని ప్రయాణిస్తున్నట్లు ఈలా వివిధ రూపాలతో ఆ దేవిని చిత్రించేవారు. 1949, నవంబరు నెల 5వ తారీఖున బ్రహ్మమూర్తి పద్మప్రియాదేవిని కలుసుకొన్నప్పుడు “మీకు ఆశయ పురుషు డెవ్వరూలేడా” యని ప్రశ్నించాడు. “మీరు నాకు ఆశయ స్త్రీ పురుషత్వాలంటే ఏమిటో చాలా చెప్పారు కాని, ఆ భావం నాకేమీ అర్థం కావటంలేదండీ.” "అయితే నేను నీ కెవ్వరను?” "మీరు నాకు ఆశయ గురువులు!" “నువ్వు నాకు అనేక రకాలుగా చాకిరీ చేస్తావు. నాకు జ్వరము వచ్చినప్పుడు వచ్చి పాదసంవాహనము కూడా చేస్తావు. నేను నిన్ను దగ్గరగా తీసుకుంటే నా పక్క వదిగిపోతావు. నేను నీ కనులు స్పృశించాను. నీ పెదవులు నా హస్తాంగుళీయాంచనాలతో చుంబించినాను. నా పెదవులతో నీ ఫాలము, నీ మూర్ధ్వము ఎన్నిసార్లో పుణికినాను. నీ
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 78 -> కథలు ఒడిలో నా తల వుంచి ఎన్నిసార్లో బాధతో రోదించినాను. ఆ సమయాల నా తలపైన నీ చేతులు అనురాగంతో వాలిపోయినవి. నువ్వు ఈ విధంగా పురుషుడనైన నన్ను ఏలా స్పృశించకలిగావు? దేవీ! నీ హృదయంలో దయలేదా?” “మీరు నాకు గురువుగారు కనుక మీకు సేవ చేసినాను. ఆ సేవలో స్పృశించాను.” “అంతేనా?” “ఏమో నాకు తెలియదు గురువుగారూ.” పట్టలేక ఇన్ని సంవత్సరాలు వూరుకొని ఈనాడు ఈ విధంగా కర్కశంగా ప్రత్యుత్తరాలిచ్చిన తన ఆశయమూర్తి మాటల కాతని హృదయము వజ్రాఘాత పర్వతంలా కూలిపోయింది. అతడు విసవిస ఆమె యింటిలోనుండి పైకిపోయి, నడచి నడచి ఆశ్రమంలో పురుష భాగంలో ఉన్న తనయింటిలోనికి వెళ్ళి, తూలి క్రిందపడిపోయినాడు. ఈ విషయం వాణీసుందరి, నరసింహారావు గ్రహించి పరువు పరువున గురువుగారికడ చేరుకున్నారు. అది ఆనాటిరాత్రి. రాత్రి ఎనిమిదైన వెనుక స్త్రీ భాగంలోంచి పురుషుడు కాని, పురుష భాగంలోనికి స్త్రీ గాని వచ్చుటకు వీలులేదు. ఈ రెండింటికి పెద్ద గోడ అడ్డం. మూడు గుమ్మాలు ఉన్నాయి. రెండు ఎప్పుడూ తాళంవేసి ఉంటాయి. మధ్య గుమ్మంలో రాత్రి ఎనిమిదైన వెనుక తాళం వేస్తారు. ఆనాడు తాళం వేయడానికి వాణీసుందరి ఆశ్రమ కులపతి వెళ్ళినాడుకదా అని వచ్చినది. ఆ ద్వారానికి దగ్గిరగా ఉన్న కులపతి, పర్ణశాలవైపు నరసింహారావు పరుగెత్తుకొని వెళ్ళడం చూసి, తానూ తాళం వేయుట మాని కులపతి ఇంటికి తొందరగా వెళ్ళింది. అచ్చట కులపతి హాలులో తివాసీపై కూలబడి ఉండటమూ, నరసింహారావు గురువుగారితో ఏవేవో మాటలు చెప్పుతూ నుదురునకు చన్నీళ్ళు కొడుతూ ఉండటమూ చూసింది. వాణీసుందరి వెంటనే “నరసింహారావుగారూ, మీరు వెళ్ళి వెంటనే డాక్టరుగారిని తీసుకురండి. నేను గురువుగారి దగ్గిర ఉంటాను" అని అంటూ లోనికి వచ్చింది. నరసింహారావు “సరే”నని ఆశ్రమ వైద్యుని పిలచుకొని రావడానికి పరుగిడిపోయినాడు. వాణీ గురువుగారు మూలుగుతూ ఉండటము చూచి "నాన్నగారూ! ఎలా ఉందండి?” అని ప్రశ్నించింది, వాణి మాటలు వినగానే కులపతి బ్రహ్మమూర్తి లేచి కూర్చున్నాడు. “నాకు ఏదో తలతిరిగినది తల్లీ! ఇప్పుడు బాగానే ఉందిలే! నువ్వెప్పుడు వచ్చావు. నరసింహం నిన్ను పిలిచినాడా?” అని అంటూ ఆమె భుజంపై చేయివేసి, నెమ్మదిగా లేచి అక్కడే ఉన్న ఆసనంపై చతికిలబడినాడు. వాణీసుందరి తన గురువు తల తన హృదయానికి ఆన్చుకొని ఆయన మోమూ, భుజములూ హస్తతలంతో నిమురుతూ, “నాన్నగారూ! మీరు అవతారమూర్తులు. మీరు మా పిన్నిగారిని ఇంత ప్రేమిస్తున్నారు. అంతా నేను గ్రహించాను. ఆమె హృదయం నవనీతం. శ్రీకృష్ణుని రాధ ప్రేమించినట్లు, రామచంద్రుని సీతమ్మ ప్రేమించినట్లు ఆమె మిమ్ము ప్రేమిస్తున్నది. కాని ఏకారణం చేతనో తాను ప్రేమ విషయంలో ఇంత మూకత్వం దాల్చినది" అని అవ్యక్త ధ్వనులతో ఆ బాలిక బ్రహ్మమూర్తి చెవిలో చెప్పింది.
అడివి బాపిరాజు రచనలు - 8 + 79 - కథలు ఇంతలో ఆశ్రమ డాక్టరుగారూ, నరసింహారావు అచ్చటికి చక్కా వచ్చినారు. డాక్టరుగారు కులపతి హస్తనాడి, హృదయము పరిశీలించి ఏమీ జబ్బులేదనీ, ఎలాగో నరాలు ఒక నిమేషంపాటు తారుమారై తల తిరిగి ఉండవచ్చుననీ తెలిపి, కొంచెం బ్రొమెయిడ్ ఇస్తానని వెళ్ళిపోయినారు. ఆయనతో నరసింహారావు వెళ్ళినాడు. ఉందిగా!" “మందు వస్తుంది. నువ్వు వెళ్ళు తల్లీ!" అని వాణితో బ్రహ్మమూర్తి అన్నాడు. “కాదు గురువుగారూ! ఈరాత్రి నేను ఇక్కడే మకాం!” “ఆశ్రమ విధులు ఒప్పుకోవు తల్లీ!" “ఎవరికైనా జబ్బుచేస్తే పరిచర్య చేయడానికి బాలికలు రావచ్చునన్న ధర్మంకూడా "అలా వైద్యాలయంలో మాత్రమే! పైగా నాకేమీ జబ్బులేదు. నా ఆరోగ్యం ఇంతవరకూ చెడలేదు. ఇక ముందూ చెడదు. మన కళా సంప్రదాయం మృత్యుంజయ స్వరూపం. భక్తితో మన సంప్రదాయం అనుసరించే వ్యక్తి మృత్యుంజయుడే!” “అయితే మన సంప్రదాయం మతధర్మం కూడానా?” “అవును తల్లీ! మతం అంటే బొట్టూ, కట్టూ, ఆచారాలూ అనుకున్నావా? ఆత్మా, పరమాత్మా దివ్యజ్ఞాన స్వరూపమైనదే మతం. కులాలు మతం కావు.” “మానవుని సంపూర్ణజీవితం మతభాగమే అనిలేదు. మీరొక్క ఉపన్యాసంలో ఉపదేశించారు కాదా నాన్నగారూ?” “అవును. దివ్యధర్మాలకు శృతిగా మానవుని నిత్యజీవితం నడవాలి, అని నా ఉద్దేశంకదా, అదేగా నేను విపులంచేసి చెప్పాను.” “అవునండి!” నరసింహారావు మందుపట్టుకు వచ్చినాడు. ఆ మందు ఆ అలమారులో ఉంచమని చెప్పి బ్రహ్మమూర్తి వాణీసుందరిని వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చి “నరసింహా! అమ్మాయిని ద్వారంవరకూ దిగవిడిచి రా!" అని నరసింహారావును ఆదేశించారు. నరసింహారావు ప్రఫుల్లమైనమోముతో ఆ బాలికను అనుసరించాడు.
7
నరసింహారావు వాణీసుందరిని గాఢంగా ప్రేమించాడు. వాణి అతన్ని ప్రేమించింది. ఆశ్రమంవారు బెంగుళూరులో, అనంతపురంలో, బళ్ళారిలో, మదరాసులో ధనసేకరణ నిమిత్తం సలిపిన నాట్య, నాటక ప్రదర్శనాలలో ఇద్దరూ కలిసి నాయికా నాయకుల వేషాలు వేసేవారు. అతడు కృష్ణుడు, ఆమె రాధ. అతడు శివుడు, ఆమె పార్వతి. అతడు వేటకాడు, ఆమె వేటకత్తె, బుద్ధనాటకంలో మాత్రం వాణి యశోధర వేషం వేసేది. బుద్ధుడు కులపతి బ్రహ్మమూర్తి.
అడివి బాపిరాజు రచనలు 8 - 80 - కథలు నాట్య కార్యక్రమంలో బ్రహ్మమూర్తి ఆనందతాండవ స్వరూపియైన శివునిగా అవతరించి అద్భుతముగా నాట్యము చేసేవాడు. ఆ నాట్య కార్యక్రమంలో మాత్రం పద్మప్రియ పార్వతి వేషం వేసేది. ఊర్వశీగాథ నాటకంలోను పద్మప్రియాదేవి ఊర్వశి వేషంవేసేది. అప్పుడామె ప్రదర్శించే నాట్యం అనన్యమని లోకమంతా ప్రశంసించేది. తక్కిన నాట్య కార్యక్రమంలో ఆమె పాలుపుచ్చుకోకుండా వీణ వాయించేది. ఈ ప్రదర్శనాలవల్ల ఏడాదికి అన్నివిధాలైన ఖర్చులుపోను ఐదారువేల రూపాయల రాబడి వచ్చేది. ఏకమొత్తంగా వచ్చిన చందాల డబ్బు ఇరవై ఐదువేల రూపాయలు బ్రహ్మమూర్తి మూలధనంగా ఉంచి ప్రభుత్వపు ఋణపత్రాలు కొన్నాడు. కొందరు పెద్దలు తమ పేరను, తమకు నచ్చిన ఇతరుల పేరను భవనాలు అవి కట్టించి ఇచ్చేవారు. వాణీసుందరి, నరసింహారావు నెమ్మదిగా నడిచి వెడుతూ ఆశ్రమపు రెండు భాగాలను కలిపే ఆ ద్వారం దగ్గిర ఆగినారు. "వాణీ! ఇప్పటికైనా పురుషులంటే కోపం నీకు పోలేదా!” అని నరసింహారావు వాణీసుందరిని ప్రశ్నించాడు. “లేదండీ అహోబలంగారూ, పురుషులంటే నాకే మాత్రం నమ్మకం లేదు. ఎవరో గాంధీజీవంటి, బ్రహ్మమూర్తిగారివంటి వారు తక్క పురుషులలో మంచివారెవరున్నారండీ?” “నేను బ్రహ్మమూర్తిగారి శిష్యుణ్ణి కాదా?” “ఇప్పుడనేకమంది కాంగ్రెసువాదులు గాంధీగారి శిష్యులు కాదూ? ఆ శిష్యులుచేసే దురన్యాయాలు, అక్రమాలు లోకమంతా వాసనెత్తి పోవటం లేదూ?” “అలాంటి వాళ్ళలోనే నన్ను జమచేర్చావు. నీపాదాలుకడ వాలి నా గురువుకు, నా గురువుగారి ఆశయదేవి పద్మప్రియాదేవిగారికి తక్క ఇంకెవ్వరికి నమస్కరించనన్న గర్వంకల నేను నిన్ను పూజిస్తున్నాను. నువ్వు నా ఆశయ దేవతవు. నీవు నా జ్యోత్స్నవు. నేను జ్యోత్స్నా పతిని. ఏనాటికైనా నీవు నేను, నేను నీవు. అలా దంపతులం కానినాడు కాని, నీవు ఇతరులని ప్రేమించిననాడు కాని, వివాహము చేసుకొన్నాడు కాని, నేను సన్యాసమన్నా పుచ్చుకుంటాను, లేక ప్రాణమైనా విశ్వాసానికి సమర్పిస్తాను.” “అయితే ఇప్పుడే సన్యాసం పుచ్చుకోండి.” “అంటే నీవు నన్ను ప్రేమించటం లేదన్నమాట.” "అలాగే అనుకోండి.” నరసింహారావు మ్రాన్పడిపోయినాడు. ఆగ్రుడ్డి వెన్నెల్లో అతని కన్నులనీరు గిర్రున తిరగడం ఆమె పరికించింది. అతడు తన గుండెను గట్టిగా నొక్కుకుంటూ తలవంచుకొని ఆ అర్ధచంద్రుని వెన్నెల్లో తూలి పోయే నడకతో వెనక్కు నడిచిపోసాగినాడు. వాణి చిరునవ్వుతో అతడు పదిగజాలు దూరం వెళ్ళేవరకూ అతన్ని పరికిస్తూ నించుంది. అతడలా తూలిపోతూ నడచిపోతూనే ఉన్నాడు. అప్పుడామె కళకళ నవ్వుతూ నరసింహారావు కడకు పరుగెత్తుకొని పోయి అతన్ని వెనుకనుంచి తన రెండు చేతులా చుట్టివేసి, గట్టిగా హృదయానికి హత్తుకొన్నది.
అడివి బాపిరాజు రచనలు 8 1 81 కథలు “మీరు నా ప్రభువులు, మిమ్మల్ని చూచిన మొదటి క్షణంనుంచీ నా సర్వస్వమూ మీ పాదాలకడ అర్పించాను. అయినా దెబ్బతిని ఉన్న దానను. మనుష్యులంటేనే అసహ్యం వేసింది. పురుషుల మాటటుంచండి. నా హృదయాన్నే నిరసించాను. అది నీరసమని నన్ను నేను తిట్టుకొన్నాను. ఆడది ఒట్టి జావకడి అని నన్నే నేను ద్వేషించుకొన్నాను. కాని, రానురాను కాలం జరిగి పోనుపోను, ఇది నిజమైన ప్రేమ, ఆనాటిది ఒట్టి ఉళక్కి అని తెలుసుకొన్నాను. మీరు నన్ను చూసిన మొదటి క్షణం నుంచి నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు. అయినా మీరు మాత్రం ఎలాంటివారో నాకెలా తెలుస్తుంది? ఇన్ని నెలలు మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాను. మీరు నా పరీక్షలన్నిటిలోను విజయం పొందారు. ఈ రోజు ఆఖరి పరీక్ష!" అతడు నెమ్మదిగా ఆమెవైపు తిరిగినాడు. అతని మోము అమరమందాకినీ నదిలోని దివ్య సువర్ణ పద్మంలా వికసించి పోయింది. మాటలు రాని పరమోద్రేకంతో అతడామెను గాఢంగా కౌగలించుకొన్నాడు. ఆమె కడ మోకరించినాడు; మోకరించి వంగి ఆమెపాదాలు దీర్ఘముగా చుంబించినాడు. ఆమె అతనిపై వ్రాలి రెండుచేతులూ పట్టి పైకి లేవనెత్తింది. ఇరువురూ వెన్నెల్లో నిల్చున్నారు. “ఈ క్షణమే పోయి గురువుగారికి ఈ పవిత్ర విషయం నివేదిద్దాం. ప్రాణేశ్వరీ?” అన్నాడతడు. ఇరువురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కులపతి పర్ణశాల వైపు నడిచినారు. “ప్రాణేశ్వరీ, యుగాలనుండి నీ కొరకై ఎదురు చూచాను. ఈ నాటికి నీకు కరుణ కలిగింది. నీ వల్లే నేను పెద్ద చదువులు చదువలేదు. నన్ను నీవెలా ప్రేమించ కలిగావో అర్థం కావటంలేదు. నా ఈ పవిత్రమైన ఆదృష్టాన్ని నమ్మలేకుండా ఉన్నాను.” 'ఓ వెర్రి ఓబలయ్యగారూ! మీరు గడుసువారనుకున్నాను. ఇంత అమాయకులని నేను గ్రహించలేదు. మీ విద్యముందు, మీ ప్రతిభముందు నా చదువేపాటిది? సంధ్యేపాటిది! మీ శక్తిలో శతాంశము నా దగ్గర ఉంటే నేను జగద్విఖ్యాతిగడించి ఉందును ఇది నా అదృష్టం. మిమ్మల్ని మీరు తక్కువ పర్చుకోవడం మానేయండి. ఇక్కడనుంచి మీ యింటికీ, మీకూ నేను అధికారిని. నా ఆజ్ఞ పరిపాలించకపోతే మీకు విధించబడే శిక్షలు మీరు ఊహించుకోనైనా లేరు. జాగ్రత్త. ఇద్దరూ కలకల నవ్వుకున్నారు. వారిరువురూ కలసి పర్ణశాలలోనికి భయపడుతూ వెళ్ళినారు. కులపతి బ్రహ్మమూర్తి తాను విన్యసించిన గౌరీతాండవ మూర్తికడ పద్మాసనాసీనుడై ప్రార్థన చేసికొంటున్నాడు. నెమ్మదిగా ఆ మందిరం గుమ్మం దగ్గిరే వారిరువురూ నిలబడినారు. వీరిరువురూ వచ్చినదీ, వచ్చిన విషయము బ్రహ్మమూర్తి గ్రహించినట్లు “ఇద్దరూ వచ్చి నా చెరో ప్రక్కనా కూర్చోండి, కుడిప్రక్కన నా కోడలు, ఎడమ ప్రక్క నా కుమారుడు' అన్నాడు ఆయన. వారు ముగ్గురూ కలిసి సృష్టిస్వరూపమూర్తి అభయ ముద్రాధరుడు, వరద ముద్రాంచిత వామహస్తుడు. అష్టభుజుడు, ఆకాశ చారయుక్త దక్షిణపాదుడూ,
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 82 కథలు భౌమ్యచారయుక్త వామపాదుడు, పరశు, డమరుక అగ్నిధరుడు, వ్యోమజఠాఝూటి సర్వకాలంకృతుడు. వ్యాఘ్రాజినధారి, ఆ శంకర తాండవమూర్తిని ప్రార్థించినారు.
8
వారం రోజుల్లో బ్రహ్మమూర్తి హిమాలయాలకు వెళ్ళిపోయినాడు. నరసింహారావు. వాణీసుందరి నిజం దాచకుండా తమ ఉద్దేశ్యము బ్రహ్మమూర్తికి నివేదించుకున్నారు. తమ దేశికుడు పద్మప్రియాదేవిని ప్రేమిస్తున్నట్లు తమకు తెలుసునట. ఆమె అంత పవిత్రంగాను అతనిని ప్రేమిస్తున్నట్లును తెలుసునట. వారిరువురి పవిత్ర కళ్యాణ మహోత్సవం అయ్యే వరకు తాము వివాహం చేసుకోరట. బ్రహ్మమూర్తి ఏం చేయకలడు? వారిద్దరికి తన ఆశీర్వచనము మాత్రము అనుగ్రహించినాడు. తాను తన కర్తవ్యాన్ని, తన భవిష్యత్తును తెలుసుకొనడానికి హిమాలయములకు వెడుతానన్నాడు. ఆ చలికాలంలో తానెంతవరకు హిమాలయక్షేత్రం దర్శించకలడో అంతవరకు వెళ్ళివస్తానని వారిరువురుతో అతడు తన రహస్యము స్పష్టముగా చెప్పినాడు. తక్కిన ఆశ్రమవాసులందరితో జాగ్రత్తగా ఉండమని తాను కొద్దివారాలలో తిరిగివస్తానని కళావిషయమైన ఒక సత్యం అన్వేషించడానికి తాను హిమాలయములకు వెడలుచున్నాడని చెప్పి అతను ప్రయాణమైనాడు. అతడు ఇందుపురం వచ్చి రైలు ఎక్కబోయేముందు పద్మప్రియను ఒంటిగా పర్ణశాలలో కలుసుకున్నాడు. "పద్మప్రియా! నేను హిమాలయాలకు వెడుతున్నాను. నాపై నీకు ప్రేమలేదని నిర్ధారణచేసి చెప్పినావు. నీ పైన నా ప్రేమ నా సర్వస్వము, నా శక్తి, నా రక్తి, నా ముక్తి, అదే నాకళ. నీవు ఎదురీయని ఈ ప్రేమను జయించి మహాయోగినై తిరిగివస్తాను, ఓడిపోతానా తిరిగిరాను. నువ్వు నా బిడ్డలు, నరసింహం, వాణీ సుందరి ఈ ఆశ్రమం నిర్వహించండి. ప్రథమ శిష్యురాలైన నీకు ఇదే నా తుది ఆదేశము” అస్పష్ట వాక్యాలతో మనవి చేసినాడు. ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగినవి. గజగజ వణికిపోయింది. గద్గదస్వరంతో వినీవినబడనట్లు “మీరు నన్ను ప్రేమించటానికి నా అభ్యంతరం లేదు. ఈలాగే ఈ మన పవిత్ర స్నేహంలో ఈ ఆశ్రమం మన యిద్దరం ఎందుకు నడపకూడదు?” అని ఆమె తలవాల్చుకొని కన్నులనీరు జలజల రాలిపోతూండగా పలికినది. “అది అసంభవము పద్మా! ఉత్తమ సంగీతము త్రిస్థాయీ మూర్తిత్వము. ఉత్తమ ప్రేమ త్రిగుణాత్మకము. భౌతిక మానసిక ఆత్మీకరము. నేను ఈ త్రివిధంగా నిన్ను ప్రేమిస్తూ, వాంఛిస్తూ నీవు ఏవిధంగానూ ఆ మూడు స్థాయిలకు శ్రుతి కలపకుండా వట్టి స్నేహంగా ఉంటూ ఉంటే నా కళాపూజ నిర్వహించలేను. కాబట్టి మనం విడిపోవడమే ఉత్తమం.” “అయితే నన్ను వెళ్ళిపొమ్మంటారా? ఈ ఆశ్రమం మీ బిడ్డ. నేను మీ ఎదుట లేకపోతే ఈ ఆశ్రమం నిర్వహించటానికి అభ్యంతరం లేదు. మీ బిడ్డనుంచి మిమ్ము ఎలా వేరుచేయగలను? నేను వెళ్ళిపోతాను ఉండండి.”
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 83 ♦ కథలు ఆమె రోదిస్తూ కూలబడిపోయింది. “ఓసి వెర్రిపద్మా! నువ్వాశ్రమంలో ఉండడం నా పూజకు ప్రధానం కాదు. నువ్వు నాలో లయమై పోవడమే నా పూజ దివ్యరసానంద స్వరూప మౌతుంది. అయినా నీ సలహా గమనిస్తాను. ఏమైనా నేను తిరిగివస్తాను. నువ్వు ఆశ్రమం వదిలి వెళ్ళిపోకు. అలా నీవు వెళ్ళిపోతే నా ప్రాణం నన్ను వీడిపోవడం నిశ్చయం.” “మీరు వెళ్ళకండి. మీ కోసం నేను ఏమిచేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. “అది పనికిరాదు పద్మా! నా అవస్థకు నీవు నన్ను కరుణించి ఆత్మ బలిదానం చేయడం నాకిష్టంలేదు. నేను తప్పక తిరిగి వస్తాను. మన జీవితం ఇలాగే గడుపుదాం.” ఆ సాయంకాలం అతడు ప్రయాణమై వెళ్ళిపోయినాడు. ఇప్పుడు డిశంబరు నెల జరుగుతున్నది. వాణి రైతుకూలీ చిత్రం ప్రారంభించింది. ఆచిత్రం స్థాయీ భావం పొందలేదని పద్మప్రియ వాదన. వాణికి పద్మప్రియ అంటే చాలా కోపంగా ఉన్నది. తన చిత్రం ఉత్తమ కళారూపం కాదని ఆమెకు తెలుసు. అయినా కావాలని ఆ విషయమే చిత్రించ సాగింది. ఆమె ఉద్దేశ్యము నరసింహారావు గ్రహించాడు. “వాణీ! నువ్వు చేసేపని చాలా తప్పు సుమా, వేళాకోళానికైనా స్థాయీ రహిత చిత్రాలను చిత్రకారుడు విన్యసించకూడదు. నీవు రచించేది వట్టి ప్రచార చిత్రం. ప్రచార చిత్రాలయందు నమ్మకమున్నవాళ్ళు అలాటి చిత్రాలనే రచించుకోవచ్చు. మన సంప్రదాయం అదికాదుగా? అలాంటప్పుడు దేశికురాలిపై కోపంతో ఈ చిత్రం రచించటం అన్యాయం సుమా.” “ఏమండోయ్ ఓబలయ్యగారూ! నా ఆజ్ఞలను పరిపాలిస్తామన్నారు, మరచిపోకండి.” “వివాహ మహోత్సవం కాకుండానే అధికారం చెలాయిస్తావేమిటి!” “ఇదివరకే మనస్సులు, ఆత్మలు కలిశాయి. ఇంక దేహాలు మాత్రం కలియాలి. అంచేత నాకు సగం అధికారం వచ్చింది. సగం తలుపు తెరవడం సగం తలుపు మూయడం.” ” అతడు నవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు. పద్మప్రియకి తన గురువు వెళ్ళిన నుండి పడేబాధ వర్ణనాతీతం. ఆమె అతనిని సంపూర్ణంగా ప్రేమిస్తున్నదని ఆమెకు మొదటినుంచి తెలుసు. శాంతినికేతనంలో నందలాల్గారి ఎదుట అతడు దివ్యమూర్తియై ప్రత్యక్షమైనప్పుడు అతడే తన ప్రాణప్రియుడు; అతడే తన భగవంతుడు అని ఆమె గ్రహించింది. కాని ఆ భావంనుంచి ఆమె భయపడి పారిపోయింది. అందుకు కారణం ఆమెకు తీరనిసిగ్గు. కాని సిగ్గుచేత తన గురువుగారితో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. అది తన కర్మము.ఎంతో మహాప్రయత్నం చేసింది. వ్యంగ్యంగానన్నా ఆవిషయం అతనికి మనవి చేద్దామన్నా కాని లాభం లేకపోయింది. ఆయనంత శక్తివంతుడే తన హృదయం ఎందుకు గ్రహించలేక పోతున్నాడు. అలా గ్రహించి ధైర్యం చేసి తన్ను గాఢంగా ఆయన
అడివి బాపిరాజు రచనలు 8 • 84 + కథలు హృదయానికి అదుముకొని, తన్ను కనికరించివేసి తనను సర్వార్పణ చేయమన్నాచేసేదే. ఈ పెనుభూతమైన సిగ్గు తన్నిలా ఆవహించిందే. ఈ రాక్షసినుండి విముక్తే దొరకదా? తన జన్మా, తన దేశికుని జన్మా ఈలా బాధాపూరితమై పరీమళ రహితమై కృశించి కూలిపోవలసినదేనా?
9
వాణీసుందరి తన రైతుకూలీ చిత్రానికి వర్ణలేఖలు విన్యసించడం ముగించింది. అప్పుడా చిత్రాన్ని తీసి నీళ్ళలో పూర్తిగా తడిపి నానవేసి ఆ కాగితం కొలతకు సరిపోయే దళసరి అద్దం తడిపి ఆ చిత్రాన్ని నీళ్ళతో అంటించింది. కాగితానికి అద్దానికి మధ్య గాలిబుడగలు లేకుండా చూసుకొంది. పై భాగం ఆరిపోగానే తాననుకొన్న రంగులు పూయడం ప్రారంభించింది. అలాగువేస్తే రంగులు ఎంతో బాగా వస్తాయి. ఆమె ఆ చిత్రం రచించే చిత్రశాల కళాశ్రమ బాలికా భాగంలో బాలికలు చిత్రవిద్య నేర్చుకొనే మందిరం. ఆ మందిరమున్నది పొడుగాటి డాబామేడ. మందిరానికి రెండువైపులా వరండాలు ఉన్నవి. ఆ శాలలో ఒక్కొక్క బాలిక ఒక్కొక్క విశాలమైన కిటికీ కడ ఎడమవైపు నుండి వెల్తురు వచ్చేటట్లు కూచుంటుంది. కూచునేందుకు చిత్రాసనాలు, ఆసనాలకి ముందువాలివున్న చిత్రలేఖనపు బల్లలున్నవి. ఆ శాలలో అలాంటి బల్లలు ఇరవై నాల్గుఉన్నై. ఎడమవైపు పన్నెండు, కుడివైపు పన్నెండు. ప్రతిబల్లకు కుడివైపున నీళ్ళతో పెద్ద గిన్నెలుంటై. ఆ గిన్నెకు ప్రక్కన రంగుల పెట్టెలు, కుంచెలు, రబ్బరుముక్కలు, పెన్సల్స్ ఉంచుకొనే చిన్నబల్లలూ ఉన్నై. ఆ మందిరానికి ఈవల ఆవల ఒక అరడగుఎత్తు బల్లలున్నవి. ఆ వేదిక పైన చిత్రలేఖనపు బల్లలు, చిత్రాసనాలు అమరించబడి ఉంటై. ఇరువురు చిత్రకళోపాధ్యాయినులు ఆ వేదికలపై కూర్చుండి వారిచిత్రములు వేసుకుందురు. పద్మప్రియ ప్రథమ చిత్రకళోపాధ్యాయిని; రెండవ ఆమె వాణీ సుందరి. తలుపులు రెండూ మందిరానికి ఈవల ఆవల ఉన్నై. ఒకటి బైటకు పోయే దారి. రెండవది ఈవలావలయున్న కటకటాల గుండా చిన్న వరండా గుండా చిత్ర ప్రదర్శనశాలకు పోయేదారి. చిత్రశాలలోను, చిత్ర ప్రదర్శనశాలలోను అనేక ఉత్తమ చిత్రాలు ప్రదర్శింపబడి ఉన్నవి. ప్రదర్శనశాల వంటి కళాగ్రంథాలయమున్నది. ప్రదర్శనశాల, కళాగ్రంథాలయము ఆశ్రమం రెండు భాగాలకు మధ్యగా ఉన్నాయి. ఇటు స్త్రీల చిత్రశాఖ స్త్రీల భాగంలోను, పురుషుల చిత్రశాఖ పురుషుల భాగంలోను ఉన్నాయి. గ్రంథాలయాన్నంటి అటూ ఇటూ ఒకటి బాలికలు, రెండవది బాలురు పుస్తకాలు చదువుకొనే పఠనశాల లున్నవి. వాణీసుందరి చిత్రానికి రంగులువేస్తూ ఉండగా పద్మప్రియ అచ్చటకు వచ్చింది. అచ్చటచ్చట కొందరు బాలికలు చిత్రాలు లిఖించుకొంటున్నారు. ఆరోజు క్రిస్మస్ పండుగ. పండుగ దినం కాబట్టి అందరు బాలికలు రాలేదు. సాధారణంగా బాలికలు బొమ్మలు వేసేటప్పుడు విద్యలో ముందుకు వచ్చిన వారి బొమ్మలు పద్మప్రియ దిద్దుతూ ఉంటుంది. విధానాలు బోధిస్తూ ఉంటుంది. అలాగే ప్రాథమికులకు వాణీసుందరి శిక్షణ గరుపుతూ ఉంటుంది.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 85 -> కథలు వాణీసుందరి చిత్రం చూస్తూ ఉన్న పద్మప్రియకు ఆవేదన ఎక్కువై పోయింది. “వాణీ, ఒక్కసారి నీగదికిరా. నీతో కొన్ని ముఖ్యవిషయాలు చెప్పుకోవాలి” అని పద్మప్రియ చెవిలో రహస్యంగా చెప్పింది. వాణి తన దేశికురాలివైపు తిరిగి ఆమె మొగము పరికించింది. పద్మప్రియ మోము బాధతో వైవర్ణమైయుంది. వాణి లేచి పద్మప్రియ చేయిపట్టుకొని లేవదీసి “రండి పిన్నీ, మీ పర్ణశాలకు వెళ్ళే మాట్లాడుకొందాము” అని ఆమెను తీసుకొనిపోయింది. పద్మప్రియాదేవి పర్ణశాలలో ఆమె పడక గదిలో ఆమె మంచం పైన ఇద్దరూ కూర్చున్నారు. పద్మప్రియ వాణి ఒడిలో వాలిపోయింది. “వాణీ! నేను ఒట్టి తుచ్ఛురాలను సుమా. నా గురువుగారిని నేనెంత బాధపెడుతున్నానో నీవు గ్రహించనే గ్రహించావు. నేను... వారిని సంపూర్ణంగా... నా సర్వస్వంతో నా.. నా... నా సర్వ... సర్వస్వముతో ప్రేమ... ప్రే... ప్రేమిస్తున్నాను. అది... అది... వారిని దర్శించిన మొదటి క్షణము నుండీ, నన్ను కుంగదీసే సిగ్గే వారికి వర్ణింపరాని బాధ కలిగిస్తున్నది. నివ్వే నన్ను రక్షించాలి. అంత భారం నీమీదే వేశాను. గురువుగారు “కూలూ”లో రూరిక్ గారి ఆశ్రమంలో ఉన్నారు. వారు ఏమి బాధలు పడుతున్నారో.” వాణి పరమానంద భరితురాలైంది. తన దేశికురాలిని గట్టిగా కౌగలించుకున్నది.
10
బ్రహ్మమూర్తి ఆ చలికాలంలో “కులూ” లోయలో రూరిక్కుగారి ఆశ్రమంలో మకాంచేశాడు. ఆ చలికాలంలో మంచుతో నిండిన కొండలను తనివితీర కళ్ళతో ఆస్వాదిస్తూ ఆ లోయ అంతా తిరిగేవాడు. కాలం ప్రవహించిన కొద్దీ అతని కేదో శాంతి సమకూరింది. హిమాలయ శిఖరనివాసియై, నిత్య యోగీశ్వరేశ్వరుడై అతనికి పరమశివుడు ప్రత్యక్షమైనట్లయినది. అప్పుడాతనికి ప్రకృతి దేవి దివ్యవిలాసము సంపూర్ణ భావయుక్తంగా వ్యక్తమైనది. ఉదకమండలం, కొడైకెనాలు, తిరుపతి, పాపికొండలు, వింధ్యాద్రి, శ్రీశైలాది పర్వతాలు; నర్మదా, గోదావరి, కృష్ణా, కావేరి, గంగాది నదులు, వాని నదీ కంఠాలు అతనికి దివ్యక్షేత్రాలై మనోనేత్రానికి ప్రత్యక్షమయ్యాయి. నదులు ఉదయించే పవిత్ర ప్రదేశాలు, సూర్యకాంతి అయినా చొరరాని కీకారణ్యాలు, ఆకాశంలోకి చొచ్చుకుపోయే పర్వత శిఖరోత్తుంగాలు ప్రకృతీదేవి ఆనందతాండవ కరణాలని అతడు గ్రహించాడు. పిల్లతెమ్మెరలు, నదీ ప్రవాహాలు, వసంతుని ప్రణయ సూక్తులు, మందరస్వరాల ఎడతెగని బోధతో యుగాల రహస్యాలు బోధించే సముద్రుని కెరటాల నడకలు, చేరరాని అతి శాంత ప్రదేశాల హిమాచలేశ్వరుని రాజసభ ప్రకృతీదేవి కైశికీ వృత్తిపూరిత భక్తి నాట్యాంగహారాలు అతడు తెలిసికొన్నాడు. అతనికి పరమశాంతి కలిగింది.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 86 - కథలు ఇంతలో “మీరు వెంటనే రండి!" అని పద్మప్రియ ఇచ్చిన తంతి అతనికి అందింది. అతడు రెక్కలు కట్టుకుని లేపాక్షి వచ్చిచేరినాడు. ఆ దినం 1950, జనవరి ఒకటవ తారీకు. అతనికి హిందుపురం రైలుస్టేషను దగ్గరనే నరసింహారావు, వాణీసుందరీ, విద్యార్థి విద్యార్థినీ లోకమూ స్వాగతం ఇచ్చారు. పద్మప్రియ లేదు. ఆమె కేమి జబ్బుచేయలేదుకదా అని అతడు భయపడి వణికిపోయినాడు. “గురువుగారు! మీరు మొదటి తరగతి విశ్రాంతి మందిరంలోకి వెళ్ళండి" అని నరసింహం మనవి చేసినాడు. బ్రహ్మమూర్తి ఏమిటా అని ఆశ్చర్యపడుతూ ఆ గదిలోకి పోయినాడు. అచ్చట దివ్యాలంకృతయై, పరమ సంతోష పూర్ణ సౌందర్యవతియై పద్మప్రియ వెండి కలశంతో నిలిచిఉంది. ఆ కలశంతో అతని పాదాలు కడిగి తన శిరస్సు పై చల్లుకుంది. పూలతో అతని పాదాలు పూజించింది. వెండి పళ్ళెరాన కర్పూరము వెలిగించి హారతి ఇస్తూ తలవంచుకొని చిరునవ్వుతో ఆబాలిక : “నా ప్రాణేశ్వరునకు దివ్యమంగళం" అని అంటూ, చిరునవ్వున దూరంగా పోయి నిలుచుంది. "ఏమిటి! నిజమా! నాదేవి! మళ్ళీ అను!" అని అతడామెను చేరినాడు. “నిజం! నా సిగ్గు... నాకింత... చేటు తెచ్చింది గురువు గారూ! శాంతినికేతన ప్రథమ క్షణంలోనే నేను నా మనస్సులో మీకర్పించుకొన్నాను” అని ఆమె ధైర్యంతో చెప్పివేసింది. అతడామె చేతులో ఉన్న పళ్లెం తీసి అక్కడ బల్లపై ఉంచి, ఆమెను గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఆమె మోము ముద్దుకై తనవైపు తిప్పుకొనగా ఆమెయే అతని మెడచుట్టూ చేతులువేసి, అతని పెదవులపై గాఢంపు ముద్దుల వరమిచ్చింది.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 87 ♦ కథలు వీణ
ఆనందమూర్తి గళము అన్ని రాగాలు ఆనందానికి నిలయం. 'ఏమి పాట పాడతాడండి!' 'అది సరస్వతీ కంఠము గదాండీ!' 'కాకలీ మృదులం - అహో!' అని సంగీత ప్రియులు తన్మయులై పోతూవుంటారు. ఇంతవరకు ఏ గురువువద్దా శుశ్రూష చేయలేదు. తండ్రిగారి సంగీతం వినిన్నీ, గానసభలలో జనించిన మహాప్రవాహాలలో లయమైపోయిన్నీ నేర్చుకున్న పాటే యింత పులకరింపులైతే, ఏ సర్వేశ్వరుల పాదతీరాన్నో ఆనందమూర్తి పూజలు సలిపినట్లయితే అఖిలభారతదేశానికి నాయకమణియై పోవలసిందేగదా! - అని విద్వాంసుడు భరతశాస్త్రి సంతోష బాష్పాలను ఎడమ బొటన వ్రేలితో తుడుచుకొన్నాడు. శుభ ముహూర్తం చూచి ఆనందమూర్తివైన నిన్ను శ్రీ సర్వేశ్వరుల మ్రోల మీ తండ్రి శిష్యునిగా అప్పగించి వచ్చినాడు. నీవు పదహారు సంవత్సరాల బాలకుడవు. సరస్వతి అవతరించిన శ్రీ సర్వేశ్వరుల పీఠము మ్రోల దేహానికి పులకలు, మనస్సుకు మఱపు, ఆత్మకు పరమానందము వరములిచ్చే ఉతృష్టకళ గాన విద్యను అభ్యసించే దీక్షపూనినావు. ప్రౌఢ రాగాలు. ప్రవహించే పరమ సౌందర్య ప్రదేశాలలో తాండవించినావు. దివ్యగాయకుల కృతి గంభీరతలలో తేలినావు. గానకళాసూత్రం, శృతి రహస్యం, గురువులవారు ఆనందమూర్తికి ఉపదేశించే జ్ఞానముద్రను ధరించినారు.
2
స్వరూపపతి వీణా నిర్మాత. తరతరాలనుంచి అతని కుటుంబమువారు వీణలు రూపొందిస్తూనే ఉన్నారు. స్వరూపపతి తండ్రి అకళంకపతి సర్వేశ్వరుల వీణ నిర్మించినాడు. గాయకుడు దినదినము సంగీతలోలుడై వుండాలెనంట, అతని కంఠగత స్వనప్రవాహ శ్రుతులతో మేళవించే ధ్వని రాశి, మధురమూర్తిని ఆ వీణాకారులు నిర్మించేవారంట, మానవాతీతమయిన ఒక శక్తి ఆ వీణాజనకుని చేతిలో ప్రవహించునంట. సంగీతము మూర్తీభవించిన వీణా స్వరూపము ఆ మహాకల్పనలో నుంచి ప్రత్యక్షమవునంట. ఆనందమూర్తి స్వరూపవతి గ్రామానికి విచ్చేసినాడు. ఓ ఆనందమూర్తీ! నీ సంగీతమును స్వరూపపతి నిమీలితదృష్టి తన్మయతలో విన్నాడు. ఆ సాయంకాలపు అరుణకాంతులలోని పాట తీవలై అలముకుపోయినది. రాగాలాపనరక్తిమ, రాగస్థాయి విహంగపథము, నీ దివ్యగాంధర్వాన ఓలలాడి, 'జన్మాన్ని అలుముకుపోయిన పాపలతలు తెంపబడ్డాయి; నేను ముక్తుణ్ణి' అనుకున్నాడు స్వరూపపతి, ప్రాణమే రాగ ప్రవాహరేఖలో
అడివి బాపిరాజు రచనలు 8 88 కథలు లీనమయిందట, ఉత్కృష్ట నాద స్వరూపము, మహోత్తమమైనట్టి వీణామతల్లిని నిర్మించి తన జన్మ పావనం చేసుకుందామని స్వరూపపతి ఉవ్విళ్ళూరి పోయినాడు. ఆ దినాన్నుంచి వీణాకారునికి వైణికునికి నాదబిందు కళా పూజయే, ఆనంద విహారమే. కలశము కలలూరినది. దండము రూపించినది. తుంభీఫలము మీటలు ప్రత్యక్షమయినాయి. సింహకరాళ శిరము రేఖలు తిరిగినది. పండు పనసల పరువాలు. దంత ధావళ్యకాంతులు, బంగారుసుడులు, లతాపుష్ప విన్యాస చతురమయిన శిల్ప సౌందర్యము; సూక్ష్మ, స్థూల, వివిధ విచిత్ర తంత్రీ వైదగ్ధ్యము తళుక్కుమనే అద్భుత వల్లకీ బాల దివ్య ముహూర్తంలో సాక్షాత్కరించింది. తీగలు సారించి, మీటలు బిగించి, గుళ్లు సవరించి, ఒయారంగా పల్లకిని వలెవాటువేసి భారతీదేవిని ఆత్మ సారూప్యం చేసుకుని, ఆనందమూర్తీ! నీవు శ్రుతులు చూచుకొన్నావు. కంఠగీతీ పరిమళంలో దివ్యనాదాన్ని లయింపజేశావు. స్వరూపపతి ఆనందపరవశుడై మూర్ఛపోయినాడు. అతడు వీణలో కలిసిపోయినాడు.
3
ఆనందమూర్తీ! నీ యశము దేశదేశాల వెలిగిపోయినది. మహారాజులు నిన్ను రప్పించుకున్నారు. కళాదృష్టలు నీపాటలో త్రీసరేణువులై పోయినారు. ఆనాటి సభ, మహాపండితుల సభ. వాండ్లను మెప్పించుట కళాబ్రాహ్మలకును వెఱపు కలుగజేస్తున్నది. నీవు ఉప్పొంగిపోయినావు. ఈ నాటికినీ జన్మ సఫలమయినదో లేదో నీకు వ్యక్తమైపోవుననుకున్నావు. వీణామతల్లిని హృదయమార పూజించినావు. మహాసభకు నమస్కరించినావు. విద్యుల్లతికలగు నీవేళ్ళు వీణ తీగలపై ప్రసరించినవి. ఆనాటి శృతి ఓంకారము. మొదట కళాచమత్కృతులు చూపించినావు. కళారసజ్ఞత అల్పమై కళాజ్ఞానరూపమయిన గానవిద్వత్త పండితులంతా హర్షించేటట్లు విజృంభింప చేసినావు. స్వరకల్పన, తాళగతి విచిత్రత, కష్టతమమైన వానిని సునాయాసముగా వెదజల్లినావు. ఇంతలో ఆనందమూర్తీ, నీవు మైమరచి ఆనందలహరీ వేగమవై విజృంభించినావు. అది మధురాతి మధురమగు రాగవికాసము. అది లయామృతవాహిని. నాలుగు తీగలూ శృతిగళములోని కాకలీ ప్రేంఖిత స్వనవల్లత. ఎన్ని కాలములు పైకి వుబికినావో, శృతాశృతములైన కాలాలనెన్నింటి సూక్ష్మమైపోయినావొ! ఆ సభ పూర్తి అయినది. ఆనందరక్తిమలు విరిసియున్నటువంటి మోముతో ఆనందమూర్తి కన్నులనీళ్ళను తుడిచేవారిని, కళ్ళుమూసి ఊగిపోతూ వున్నవారిని, చైతన్యం తప్పి ఏ అదృశ్యలోకాలకో ప్రవహించిపోయిన ప్రాణరహిత దేహులను పరికించినాడు. వాళ్ళమధ్య అందాలప్రోవై, బంగారుతీగయై, చెమరించు అమృతాధరోష్ఠయై, గీతావిష్టయైన త్రిభంగాక్రతియై గాన లయాకృతార్ధనిమీలితయై, నేపాలదేశ శ్వేతతారాదేవీ విగ్రహయై పదహారేళ్ళ బాలిక తెల్లని కేతకీపన్నగిలా కనబడినది. ఆ అమ్మాయివైపే
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 89 - కథలు విస్తుపోతూ చూస్తూ ఆనందమూర్తి సర్వమూ మఱచిపోయినాడు. అతని హృదయం తాళగతులు తప్పినది. అతని కోర్కెలు రాగ మిశ్రమాలయినవి. అతని బ్రతుకు శృతికోసమై వెర్రిదానిలా తీగలు, గుళ్ళు, మీటలు సవరిస్తూనే ఉన్నది.
4
ఆలోచనలతో నిండి, ఆలోచనలులేని కలలతో, ఆనందమూర్తి, విడిదివరకూ ఏలాగో నడిచినావు. దిండ్లు పరచిన కృష్ణాజినముపై చదికిలంబడి నిట్టూర్పు పుచ్చినావు. సేవకుడు వల్లకినిదాల్చిన పేటిక తీసుకొనివచ్చుట యెరుగవు. దీపాల వెలుగులు తెల్లని గోడలపై నీ నీడను ఆడింపజేసినవి దృష్టిలేని చూపులతో చూచితివి. అంతా నిశ్శబ్దము. గృహ యజమాని స్నానానికి లెమ్మని ప్రార్థించుట యెరుగవు. ఆ బాలికే ఎక్కడేని ప్రత్యక్ష మవుతున్నది! నీవు ప్రేమతపస్వివి అయితివా? ఏ మహారాగము సృష్టించుకొంటున్నావో అని గృహ యజమాని చప్పుడులేని పదాలతో వెనుకకు వెళ్ళిపోయినాడు. ఆనందమూర్తి కడకు ఒక ముదుసలి ఆ బాలికను తీసుకొని వచ్చినట్లయినది. ఆనందమూర్తీ! కంపించిపోయినావు. బాలిక అర్పించు నమస్కారమును అందుకొనవు. ఋషివంటి ఆ వృద్ధునకు నమస్కారమిడవు. నీవు నిలుచుండినావు. మీరు మువ్వురును అట్లనే నిలుచుండిపోయినారు. ఆ బాలిక మోము వివర్ణమగుచున్నది. సిగ్గుచే రక్తిమము తాల్చుచున్నది. గృహ యజమాని వచ్చి, "స్వామీ! ఈలాగు వచ్చినారు? తమ కుమార్తెతో యీ వూరు యెప్పుడు వచ్చినారు?" అని ప్రశ్నిస్తే, ఓ ఆనందమూర్తీ! అది కల కాదనుకున్నావు. ఆ బాలిక నీవైపు చూస్తూనూ ఉన్నది. అవ్యక్తమధురమగు హాస్యంతో కన్నులు నేలవైపు వాలుస్తూనూ వున్నది. గృహ యజమాని మిమ్మల్నందరినీ ఆసనాలపై అధివసింపచేసినాడు. నీ ఆ వృద్ధుడు నీ మొగమై, “బాబూ! ఇది నా మనుమరాలు! మా కుటుంబము సంగీత కుటుంబము, యీ బాలికకు గాన విద్య పూర్తిగా నేర్పినాము. ఆమె సర్వకాలమూ స్వయంకృషి చేస్తూనే ఉంటుంది. ఈ బాలికకు తగిన వరుడు నేటివరకున్నూ మాకు గోచరింపలేదు. నాయనా, నీవు దివ్య పురుషునిలా ప్రత్యక్షమయినావు. నీ కీర్తిలో జోగి నీకీ బాలికను సమర్పించి ధన్యుణ్ణవుదామని నా గ్రామాన్నుండి ఈనాటి సభకు వచ్చినాను. ఈ బాలిక ఫిడేలు వాద్యమునందు రాలు కరిగించు విమల గాంధర్వం వినిపించగల కళామూర్తి సుమా!" అని మనవి చేసికొన్నాడు. ఆనందమూర్తీ, నీ మోము ప్రఫుల్లమైపోయింది. విద్యుల్లతలు నిన్నలమినట్లయింది. ఈ విచిత్రము నమ్మవచ్చునా! యిది ఐంద్రజాలికమా?
5
ఆ దంపతులు జీవితం మహానదిలోని పడవలా తేలిపోతూ ఉన్నది. ఆనందమూర్తి వీణ, ప్రేమబాల 'వాయులీన' (పిడేలు) రెండు జంత్రాల సంగమములో అంతర్వాహినియై వారిరువురి ప్రేమయున్నూ చేరిపోయింది.
అడివి బాపిరాజు రచనలు - 8 90 కథలు ఒకళ్ళను మించిన అందం ఒకళ్ళది. ఒకళ్ళ ప్రేమను మించిన ప్రేమ ఒకళ్ళది. వారి బ్రతుకు వేయితావుల పూలతోట అయింది. వారందులోని కోయిలలు.
6
నాటికి నాటికి ప్రేమబాలకు భర్తపై అనురాగం ఎక్కువైపోయింది. 'అతని స్వరూపం ఏ దివ్యమూర్తి కున్నది! ఒక్కనిమేషమైనా నాధుణ్ని చూడలేక మనలేదు. ఎన్ని ముహూర్తములైనా అతనిమోము తిలకిస్తూ ఆనందామృతములో పొక్కిపోతూ వుండేది. ఏదేని వంకతో అతనిని స్పృశించేది. అతని ముంగురులు దిద్ది పరవశ అయిపోవునది. అతనిని చిరుగాలివలె చుట్టివేయునది. అతని వెడదఉరాన్ని తన మోమును దాచుకొని వణికిపోవునది. నానాటికి ఆనందమూర్తీ! నీ పత్ని గళనర్తితమగు మధుర గాంధర్వమే నిన్ను మూల మంట కదల్చివేయునది. నీ వీణలోని మహాస్వర ప్రసారము నిన్ను యోగముద్రలో నిల్పివేయునది. నీ పత్ని నీ పాటలోని యొక శ్రుతియైనది. ప్రేమబాలకు కాంతునిపై ప్రేమ విజృంభించినది. గాన కళాభిరుచి సన్నగిల్లినది. ఆనందమూర్తికి ప్రణయినీ విలాసము చిఱునవ్వు మాత్రము తెచ్చునది. ఆనందమూర్తి ఆనాటి ప్రేమావిష్ణుడు కాడు.
7
అతని పాటకు అతని తపస్సుకు ఆమె ప్రేమావేశము చిన్న అపశ్రుతి అయింది. ఆమె ప్రణయరాగాలాపనంలో నాధుని గానయోగం దోషస్వరమైంది. ఆనందమూర్తీ! వీణామతల్లికి నమస్కారంచేసి ఆమెను ధరించి నాదప్రవాహం కల్పించుకొని విచిత్రాలైన కృతులు తానం పోకడలు, లయ విజ్ఞానం స్వనింపజేస్తూ మైమరచిపోతూ వుంటే, దివ్యసుందరగాత్ర అయిన నీ ప్రేమబాల హృదయం కంటకవృక్షాన్ని కొట్టుకున్నట్లయ్యేది. ఆ దినాల్లో నీ చూపులకు ప్రేమబాల అదృశ్య! ఆమె ప్రేమ పూజ నీకు వేడిగాల్పు! ఆమె కౌగిలింతలు ఇనుపసంకెళ్ళు! పరీమళచుంబనము నాభీ పుష్పమధురము. “ప్రేమబాలను అనిమేషుడవై చూస్తూ ప్రవహించిపోయిన మధురాతి మధురములగు సంధ్యలు, చంద్రికాయామినులు, నక్షత్ర ప్రకాశాలు, సౌరభదినాలు మాయమైపోయాయే! ఆనాటి ఆనందమూర్తివేనా? నాథా! నాలో ఏమిలోపం వచ్చింది? నా దివ్యసౌందర్యము కలమాత్రమై ఆరతి కర్పూరంలా హరించిపోయిందా? నీదృఢపరిష్వంగ డోలికల్లో దెసలంటానే ప్రభూ!”
అడివి బాపిరాజు రచనలు 8 + 91 -> కథలు 8
ఆనందమూర్తీ! నీ హృదయావేదన విచిత్రమైంది. బాలికల గానకళాభ్యాసం భర్తలకొరకా? నీ జీవితానికి అణువు అణువునా గాంధర్వం నిలుపుతా ననుకొన్నావు. గానమూర్తితో కలిసిపోయి ఐక్యమైపోతుంది నీ బ్రతుకు, త్రివేణిసంగములా, అనుకున్నావు. ప్రేమబాల మూడో ప్రవాహం. తన గాన తపస్సులో సంపూర్ణయోగం లేదా? గానం యొక్క వేరు స్వరూపం అనుకున్న ప్రియకాంత, అత్తరువు రాచిన బంగారు కమలం మాత్రమేనా? లేక ఆమెను తన సంగీతములో లయింప చేసుకునేశక్తి తనకు నశించి పోయిందా? ఆమె అందమును చూచి నువ్వు లజ్జిస్తున్నావేం? ఆమె పన్నీరు పోసిన వేడినీటిలో సువాసన ద్రవ్యాలపిండి నలుగుపెట్టుకొని, తళుక్కుమనే నగలు, పూవులు చీర ధరించి చిత్రకారునికీ కవికీ భావానికందని ఆందంతో వస్తే, నువ్వలా పెడమొగం పెడతావేం? శుకుడవా? ఋష్యశృంగుడవా? రసంలేని విద్వత్తవా? వివాహమై రెండు సంవత్సరాలు కాలేదు. ప్రేమరసవాహినిలో ఆ దంపతులు ఇంకా సంపూర్ణ స్నాతులు కాలేదు. ఇంతలో ప్రణయభంగము శూర్పణఖలా వచ్చిపడింది. ప్రేయసిని తీసుకువెళ్ళకుండానే ఆనందుడు సభలకు వెళ్ళుతున్నాడు. సభలో జరిగిన విచిత్రాలు ఆమెకు చెప్పడు. కొత్త రాగాలూ, పాటలూ వినిపింపడు. అసలు నెలకు రెండురోజులన్నా ఇంటిదగ్గర వుండడు. - ప్రేమబాల విషాదబాల అయిపోయింది. ఆమె హృదయంలో అపశృతినాదాలు - వకదానివకటి తరుముకు వస్తూ ఉన్నవి. దొడ్డిలో గోపాలకుని కృష్ణమ్మపదం, బంగారు పిచికల కలకలస్వరము, వీధిలో ముష్టివాండ్ర తందానపాట, భర్తగారి ఉత్కృష్టమయిన వీణాగానం అన్నీ ఆమె జీవితానికి పెళపెళార్భాటాలయి, వురుముల ధ్వనులయి కంపించివేసేవి. అందాల ప్రోవయిన ఆ ప్రేమబాల ఈనాడు వడిలి, కమలిపోయిన పువ్వులా అయిపోయింది. వంటలక్క పచన రహస్యాలల్లో ప్రత్యక్షంచేసే రుచులు ప్రేమబాల నోటికి విషాదలయిపోయినవి.
9
ఓ ఆనందమూర్తీ! నువ్వా వెన్నెలలో వీణను ధరించి ఆ వసంత కాల వనసౌభాగ్యాన్ని స్వరాలల్లోకి మార్చావు. వెన్నెలే రాగమయింది. ఆకుల కలకలలు లయలయ్యాయి. అత్యద్భుతమైనటువంటిన్నీ, పరిమళ పూరితమయినటువంటిన్నీ ఒక కొత్తరాగమును ఆరోజున సృజించావు. రాగాలాపన ప్రవహింపచేశావు. హృదయకంఠశిరః ప్రదేశ జనితాలయిన మూడు స్థాయిలూ "స్వతోరంజయతి శ్రోత్రం స్వరమిత్యభిధీయతే” అన్నట్లు రస స్వరూపాలయిన 'స్వరాలనన్నీ నిలుపుకున్నావు. ఆ రాగము మహాఋషి వెంకటమఖి రచించి డెబ్బది రెండు మేళాల్లో శుద్ధ దైవతాన్ని ఆధారం చేసుకున్న ఎనిమిదవ స్థానంలోనిది అయివున్నది. ఆ రాగం గ్రహ, అంశ, మంద్ర, తార, వ్యాస, అపన్యాస, సన్యాస, విన్యాస, బహుత్వ, అల్పత్వములనే పది లక్షణాలను కలిగివుంది. ఆ రాగం
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 92 -> కథలు పూర్వమేళంలోని ఇందుచక్రం లోనిది. ఆ రాగం దేశీయ, ఔత్తరాహ, సాంప్రదాయాల కలయిక లోనిది. ఆ రాగాలాపన ప్రథమాన్ని ఆక్షిప్తికమైంది. ఆనందమూర్తీ, రాగ వర్ధని చేసినావు. ఆరోహణమై, అవరోహణమై తానంలోకి దిగినావు. వేయిచంద్రు లొక్కసారి పుష్పాలల్లే నిలిచినట్లయింది. పల్లవి ప్రారంభించి కీర్తనలోనికి విజృంభించినావు. ఆ రాగము 'వసంత చంద్రిక' అనిపేరు పెట్టుకున్నావు. ఆహా! ఆ గానము పరమ మాయా సౌందర్య పూరితం అయిపోయింది. ఉదయాన్నే ప్రాణప్రియుడు తన్ను పలుకరించిన పలుకులో, హాస్య రసపూరితమయిన నర్మభాషణలో వేయి అర్థాలు గ్రహించుకుని ప్రేమబాల ఉలిక్కిపడినది. ఆమెను మధురతరంగాలు ముంచివేసినవి. ఆమె హృదయములో వెన్నెలలు పిండి ఆరబోసినవి. ఆసాయంత్రం పన్నీట జలకమాడింది. కలలూరు చీనాంబరము ధరించినది. ఒకటి రెండు ముద్దుగులుకు నగలతో గంభీరంగా అలంకరించుకున్నది. మల్లెపూలు జడవేస్తున్నది. నెత్తిపై కనకాంబరాలు జరీ సూత్రంతో కట్టి అర్ధచంద్రిక అలంకరించు కున్నది. ఆ రాత్రి దీపాల వెలుగుల్లో ఆమె దివ్యసౌందర్యరాసి, ప్రేమ తేజస్విని. తోటలోకి కిటికీలు తెరచి వున్న వాళ్ళ శయన మందిరాన్ని శ్రీ శుకులవారి హృదయం కూడా కరిగించివేసేటట్లు ప్రేమబాల అలంకరించింది. కిటికీలోంచి వెన్నెట్లో సన్నజాజి, గులాబి, మల్లెతీగె, సంపెంగపొదల మధ్యనవున్న శిలావేదిక పైన కృష్ణాజినంపరచుకొని తన్మయుడయి వీణ పాడుకుంటూ వున్న భర్తను చూచింది. నెమ్మదిగా దొడ్డి గుమ్మంమెట్లు దిగి, నాధుడున్న శిలా వేదిక దగ్గరకు పోయి, ప్రేమబాల భర్త ప్రక్కనే కూర్చున్నది.
10
ఆ పవిత్ర నిశాఘటికల్లో ఆ వీణ దివ్యస్వరాలు విరజల్లి వేసింది. ఆనందమూర్తీ, ప్రేమబాల కూడా అట్టి మహా అద్భుతమయిన బాణి గంభీరత, మాధుర్యాతిమాధుర్యము ఎన్నడూ చూరగొని యుండలేదు. నిమేషాలు గడియ లయ్యాయి, ఒక్క యామమయింది తుంబుర, నారద, శారదా దేవుల వీణలను అపశ్రుతి భూయిష్టాలని అనిపించేటట్టు విజృంభించి పోతూంది. ఇంతలో ఆ వీణ ప్రేమబాలకు ఒక యక్షిణీలా తోచింది. ప్రేమబాలను హేళన చేస్తూ ఆ విచిత్ర గానంలో విజృంభించిపోతూ ఉన్నట్లయినది. భర్త యీ లోకములో లేడు. ఏ గాంధర్వ లోకంలోనో! "ప్రేమకన్న ఉత్కృష్టమైన గాంధర్వము వేయిరెట్లు ఎక్కువ; ఓసి వెర్రిబాలికా, ఇక్కడి నుంచి శీఘ్రంగా నీ పడకంటింటిలోకి పో!" యీ గానకళా పుంజము నా పతిసుమా! నువ్వు నారాజుకూ నాకు అడ్డంవచ్చేటట్టు చేశావు. కాని నేను నీ ఆటలు సాగనివ్వలేదు. నీ ఫిడేలు పాట మంత్రంచేసి, నా యీ నాధుణ్ణి దూరము చేస్తారని అనుకున్నావా?” అని ఆ వీణ ఆ మంత్ర గానంలోనే పలికినట్లయింది.
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 93 ♦ కథలు ప్రేమబాలకు చెమటలు పట్టినవి. ఆమె గజగజ వణికిపోయింది. ఎలా లేచి నడిచివెళ్ళిందో! శయన గృహందాకానైనా వెళ్ళలేదు. "ప్రభూ యింతేనా” అంటూ కనకాంబరం మొక్కలవద్ద గభాలున పడి మూర్ఛపోయింది. ఆనందమూర్తీ! నీ గాన తపస్సు పూర్తి అయినది. ఆ ఆనందము యొక్క పులకలు నీ మనస్సులో చిరుకెరటాలుకాగా నువ్వు గంధర్వ యువరాజులా లేచినావు. నీ హృదయం ఆ యీనాటి నూత్న రాగము, కృతి, తాళము పాడుకుంటూ వుండగా, ఆ ధ్యానములో ఎలా చేరావో నీ పడక గదికి. దారిలో పడిఉన్న ప్రేమబాల నీకు కనపడలేదు. పర్యంకముపై పత్ని లేదన్న భావమే నీకు కలుగలేదు. ఘోర బ్రహ్మచారిలా, సరసమెరుగని పరమ మూర్ఖునిలా, ప్రణయంలో పులకరించిపోని బాలకునిలా శయన గృహం అందం కనిపెట్టక, అగరుధూపాల ఆనందించిపోక, శయనమందిరం నింపివేసిన వివిధ పుష్ప పరిమళాలల్లో ఓలలాడిపోక, శిల్ప హృదయ అయిన నీ భార్య అలంకరించిన శయనమందిరం యొక్కా తల్పం యొక్క సౌందర్య విన్యాసాలల్లో తోగిపోక, లంబభుజుడులా మంచంమీద పడుకుని నిద్ర పోయినావు. సంగీతము జీవితాన్ని కర్కశం చేస్తుందా? ఇంతలో ప్రేమబాలపై ఒక చిరువెన్నెల చెలికత్తెలా వ్రాలి, శీతలోపచారాలు చేసి ఆమెను మృదుహస్తాలతో స్పృశిస్తూ మూర్ఛలో నుంచి లేపింది. ప్రేమ బాలకు లోకమంతా ఇంకాచీకటిగానే వుంది. కళ్ళు నులుముకుంటూ ఏల అక్కడ పడివున్నదో, శయన మందిరంలో ఎందుకులేదో? ఆమెకు అర్థము కాకుండానే తూలుతూ పడక గదిలోకి వెళ్ళింది. ఆ దీపాల వెలుతురులో భర్త గుర్రుపెట్టి నిదురపోవడం వినీ, చూచీ గబుక్కున సంపూర్ణ జ్ఞానంకలుగగా తెల్లపోయి చూచింది. భర్త ఎప్పుడూ గుఱ్ఱుపెట్టలేదు. ఆమెకు అప్పుడు భర్తయొక్క హృదయం ప్రేమరహితమయిన మరుభూమిలా తోచింది. దివ్యాంగన అనుకున్న వల్లకీబాల తనకీ, నాథునికీ తెగతెంపులు కలుగజేయడానికి జన్మించిన రాక్షసి అని తానెప్పుడూ అనుకోలేదే! నాధుని చేరవచ్చి రెండేండ్లుకాలేదు, ప్రణయస్వరూపమైన వీణామతల్లి పరమశత్రు వయిందా? ఓ వీణాదేవి! నీకేమి అపకారం చేసిందమ్మా? తన పతిని నిన్ను ప్రేమించవద్దన్నదా? నీ స్నేహంలో తన్మయుణ్ణి కావద్దన్నదా? కళాస్రష్టల్లేరా? వారు తమ హృదయాల్లో నివసిస్తూ ఉన్న ప్రాణకాంతల్ని మరచారా? నీకు దయలేదు. నీ హృదయం వట్టిగాలి. నీ బ్రతుకుకర్రమొద్దు. నువ్వు తననాథుణ్ణి లోహపాశాలు వేసి బంధించావు. నీవు మామూలు వీణవు కావు! నువ్వు రాక్షసివి! పెనుభూతంలా కుటుంబములో ఆవిర్భవించావు. ఈ రోజుతో నీ జీవితం సమాప్తి!!
11
ప్రేమబాల మహోగ్రబాల అయింది. ఆమె కన్నులు విస్ఫులింగాలు రాల్చినవి. ఆమె కాత్యాయని, మహాకాళి మూర్తి! భయంకర చండీమాత. రెండు అంగలలో సంగీత మందిరాన్ని చేరుకుంది. పూజాపీఠంమీద వల్లకీ పేటిక తెరిచింది. ఆ వీణను మోటుగా యీవలకు లాగింది. ఆ వీణాబాల గజగజలాడిపోయింది. ప్రేమబాల తీగలన్నీ ముక్కలు
అడివి బాపిరాజు రచనలు - 8 +94 + కథలు ముక్కలుగా తెంపి వేసింది. మీటలు వూడబెరికింది. గుళ్ళూ, తంత్రీపీఠము దూరముగా విసిరివేసింది. తుంభీఫలము లాగివేసింది. సింహముఖము చితకగొట్టడానికి సిద్ధపడుతూ వుండగా వక్కపరుగున ఆనందమూర్తి “ఆ! ఆ!” అనుకుంటూ వచ్చిపడ్డాడు. మైమరచి నిద్రపోతూవున్న ఆనందమూర్తికి చటుక్కున ఓ కల వచ్చింది. ఒక మహాశక్తి భయంకరముగా తన్ను తరుముకువస్తూ, "ఓయీ! నీవు నా మీద భక్తి మానేశావు. ఇందుకు అంతా నీ వీణే కారణం!" అని అంటూ తన వీణను అతని చేతుల్లోంచి లాగి ముక్కలు చేయడానికి ప్రారంభించిందట! ఆనందమూర్తికి గుండె దడదడమంటూ చెమటలు పడుతూ వుండగా తటాలున మెలకువ వచ్చింది. “అమ్మయ్యో” అంటూ సంగీత మందిరం చేరుకున్నాడు. ఓ ఆనందమూర్తీ మహోగ్రమూర్తి అయిన భార్యనుచూచి వణికిపోయావు. ఆమె చేతుల్లో రూపం మారిపోతూ ఉన్న నీ అనుంగువల్లకిని చూచి కెవ్వున అర్చి ఆ వీణమీద మూర్చపోయావు. ప్రేమబాలకు స్మృతి తెలిసింది. తాను చేసిన పని చూచుకుంది. మూర్ఛలో మునిగివున్న భర్తను చూసింది. భర్త అల్లా పడివున్నాడేమి? అయ్యో, వారికి ఆపత్తు కలుగలేదు కదా? పరమశివా, ఏమిటీ ఘోరం, ఆ వీణను తానే పాడుచేసింది? నిజమా? నిజమా? భర్తను తన ఒళ్ళోకి చేర్చుకుంది. అతని తలనుతన హృదయాని కద్దుకుంది. ఆయన మోమును పెదవులతో స్పృశించింది. ఆమె లోచనాంచలాల్లోంచి జలజల బిందుప్రవాహము వెచ్చగా నాధుని తలపై, మోముపైపడి, తడిపివేస్తూ ఆనందమూర్తికి మెలకువ తెప్పించినది.
12
ఆనందమూర్తి కళ్ళు తెరవగా ప్రేమపూరితమై ప్రేమచే విషాదమేఘావృతమై కోలయై, లలితరేఖా పూర్ణమై, బంగారు వెన్నలా స్విన్నమై, వివర్ణమై, ముంగురులు ఆవరించినదియై, విషాదంలో కూడా వింత సౌందర్యయుతమైన ప్రేమబాల తన ప్రేయసియొక్క మోము ప్రత్యక్షమైంది. అతని గుండె పరమ కరుణచే దడదడలాడినది. ప్రేమబాల ఏనాడు తనకూ తన ప్రజ్ఞకూ అడ్డం వచ్చింది? ఏనాడు తన విద్యను ప్రోత్సాహింపలేదు! ఆమె తన జీవిత ప్రవాహంలో వేరొక శైవాలినీ బాలలా సంగమించే నప్పటినుంచి, తన కళాచాతుర్యం వేయిరెట్లు వృద్దికాలేదా? ఎందుకూ తనకూ తనప్రేమ మూర్తికీ ఈలాంటి హృదయ భేదము వచ్చింది? స్వరూపపతీ, నువ్వు నిర్మించిన వీణ పరమసాధ్వీమతల్లి దివ్యాంగన. ఆమెకు హృదయంలో ప్రేమ తప్ప ఇంకేమీ వుంటుంది? ఈ విషాద నాటకం అంతా తమ మనస్సుల్లో జన్మించిందేనా? అతని హృదయంలో ప్రేమ మహా ప్రవాహం, వుప్పెనలా వచ్చి పడింది. చటుక్కున ఆనందమూర్తీ, ప్రేమబాల ఒళ్లోంచి నువ్వు లేచినావు. ఆమెను నిండుతమిమై హృదయాని కదుముకొన్నావు. అశృపూరిత నయనాల్ని, చెదిరిన ముంగురులతో నిండిపోయిన
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 95 -> కథలు మోమును, కలిగి పోయిన పువ్వులతో గజిబిజి అయిన పొంకమైన శిరాన్ని చుంబించినావు. ఆమె సుళ్ళు తిరుగు చెక్కిళ్ళు, చిరుగడ్డము, తేనెలూరు పెదవులు ముద్దుగొన్నావు. ప్రేమబాల ఆశ్చర్య చకిత, ఆనందమయి అయిపోయింది. ఆమె కన్నుల్లో, ఫాలంలో కేశసౌభాగ్యంలో, చెక్కిళ్ళల్లో, గడ్డంలో పెదవుల్లో, విచిత్రకాంతులు అలిమినవి. ఇరువురూ వల్లకీబాలను నూత్న తంత్రులతో అలంకరించినారు, అన్నీ సవరించినారు. యథాప్రకారం వీణామతల్లి పరమగాంధర్వ మూర్తియై పోయింది. నాధునికడ నేర్చుకున్న ఆనాటి విద్వత్తతో ప్రేమబాల వీణను మీటింది. ఆ వీణ. “చైతన్యం సర్వభూతానాం వివృతిం జగదాత్మనాం నాద బ్రహ్మ తదానందం అద్వితీయం" అయింది. ఆ మువ్వురూ ఒకళ్ళల్లో ఒకళ్ళయినారు.
అడివి బాపిరాజు రచనలు 1 8 96 -> కథలు హిమాలయ రశ్మి
మొదటి భాగం
ఒకరోజు ఉదయాన్నే ఆనందస్వామీజీ హరిద్వారం స్నానఘట్టం దగ్గిర ఆ బాలికను చూశాడు. చూపుతోనే అతని హృదయంలో భయంకరమైన వేదనాజ్వాల ఆవిర్భవించింది. అతని ఒళ్లు కంపమెత్తింది; మొగం జేవురించింది. అతని తపస్సు అంతర్ధానమైపోయింది. స్వామి చూపులు ఆయన ఆజ్ఞల్లోంచి తప్పుకొని, స్నానంచేస్తూ అందాలముద్ద అయిన బాలికపైనే పదే పదే ప్రసరిస్తూ ఉన్నవి. ఆమె లాగు, చొక్కా, పై ఉత్తరీయం తడిసిపోయి ఆమె బంగారు పరువాలు ఫలించే దేహసౌష్ఠవం ప్రచురించినవి. ఆయన చూపులు శిశుత్వ, ముగ్ధత్వాలతో వియ్యాలందే ఒక విచారం, ఒక వినోదంలో వెలిగే ఆమె మొగంపైన వాలినవి; ఆమె కంఠం, బాహుమూలాలు, వక్షోజాలు, నడుము, నీళ్ళలో దాగుడు మూతలాడు కటివిలాసం పైనా ప్రాకులాడినవి. సహజంగా ప్రశాంతం అయి, దివ్యతేజస్సుతో వెలుగు ఆ బాలయోగి మోము వివర్ణమైపోయింది. ఇంతలో బాలశంకరునిలా మూర్తీభవించి స్నానంచేస్తూ ఉన్న ఆనందస్వామిని కనుగొన్నదా కాశ్మీర సుందరి.
2
ఆ బాలిక? శ్రీనగరంలో ఉన్న ఒక కాశ్మీర బ్రాహ్మణ బాలిక. హరిద్వారంలో తలవెండ్రుకలు తీయించి వేద్దామని ఆ అమ్మాయి తండ్రి కుమార్తెను తీసుకు చక్కావచ్చాడు. ఆరేళ్ళ పసికూనై ఉన్నప్పుడే అష్టదరిద్రుడికి బలిదారపోస్తే, ఎవరి అదృష్టమో ఎవరి దురదృష్టమో పెళ్ళయిన మూడోమాసానికే రాయంటి పెళ్ళికొడుకు తుపాకి మందు పేలితే బ్రద్దలైనట్లు ఆ అమ్మాయిని ఒంటిదాన్ని చేసి, అధోగతిలో పడేసి, అట్టే పొయ్యాడు. ఆ చిన్నదానికి ఏమీ తెలియదు. తాను విగత భర్తృకనన్న విచారమూలేదు. “అయ్యో అమ్మా! నీ ఖర్మం ఎంతకాలిందే నా తల్లీ? నీ బ్రతుకు ఇంత చిన్నతనంలోనే బుగ్గి అయిందే” అని తల్లీ వాళ్ళూ కౌగలించుకొని అప్పుడప్పుడు ఏడుస్తే ఆమెకు అర్థముకాలేదు; మొగుడు లేకపోయినాడన్న బెంగా కలుగలేదు.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 97 కథలు పదహారేళ్ళు నిండి ఈడువచ్చింది; జీలం నదిలోని పద్మంలా మెరిసిపోతోంది. ఆమె మొగాన్ని వైధవ్యకళేలేదు. సౌభాగ్యదేవతా విగ్రహంలా ఉంది. శిల్ప కళాశాస్త్రానికి ఉదాహరణంగా సృష్టించారా అన్నట్లు అపరిమిత సుందరాంగియై ఆ కాశ్మీర బ్రాహ్మణుని ఇల్లు వెలిగిస్తూ పద్దెనిమిదేళ్ళు నిండేటప్పటికి చూస్తే దృష్టి తగిలేటట్లు ముద్దులొలికి పోయింది. 'మా కళ్ళు పాపిష్టివి' అని భూమిమీద తల బద్దలుకొట్టుకొన్నాడు తండ్రి బ్రాహ్మణుడు. మేనత్త వితంతువు “అబ్బే, ఈ అందం మన యింటిలో వుంటే, అష్టపాపాలకి ఆసరువైపోతుంది. తలవెండ్రుకలు తీయించెయ్” అన్నది. తల్లి కుళ్ళిపోయింది
3
ఆనందస్వామిజీ? రాజమండ్రిలో బియ్యేలో నెగ్గి, కృష్ణా జిల్లా 'కలెక్టరేటు'లో యిరవైయైదు రూపాయలు జీతానికి కుదిరి, యిరవైయైదేళ్లు వచ్చేసరికి రివిన్యూ యిన స్పెక్టరీ చేస్తూ భీమవరంలో కాపురం వున్నాడు రామచంద్రరావు. పరువుకన్న వెలనాటి కుటుంబంలో ఉద్భవించి, పరువుకన్న సంప్రదాయ సంబంధం చేసికొని, యిద్దరు బిడ్డల తండ్రయి, ఏమీ కష్టనిష్టూరాలు లేక, అందరికీ తల్లో నాలికలా మెలుగుతూ, సంసారంలో ఏమీ లోటులేకుండా కాపురం చేస్తున్నాడు. బంగారంలాంటి భార్య, పనసతొనల బొజ్జబాబులు ఇద్దరు బిడ్డలూ. ఓ రాత్రి ఏ మాయ బుద్ధిపుట్టిందో, రెండో కంటివాళ్ళకు తెలియకుండా కటికి అమావాస్య చీకట్లో మాయమైపోయాడు. తెల్లవారే లేచి భార్య అతడు వ్రాసిన ఉత్తరం చూసి “అమ్మో” యని గోలపెట్టి కాలవవతల శ్రీరాంపురంలో కాపురం ఉండటంచేత దగ్గిరగా ఉన్న యనమదుఱ్ఱు పెద్ద మురుగుకాల్వలో గుభాలున పడింది పిల్లల మాటైనా తలపెట్టకుండా. అప్పుడే బల్లకట్టుపైన ఊళ్ళోకి దాటుతూవున్న ఆసామీ ఒకడు గభిల్లున ఉరికి, ఈది గుటకలు వేస్తూ ఉన్న ఆమెను ఒడ్డుకు లాగేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళంతా మూగి అడ్డంపడి పట్టుకొని ఇంటికి లాక్కువచ్చినారు. ఆమె తండ్రికి అమలాపురం తంతి ఇచ్చారు. ఆయన వచ్చి తీసుకుపోయాడు కూతుర్ని, మనుమల్ని, వారం అయింది, నెల అయింది, సంవత్సరాలు అయినవి. ఎక్కడా రామచంద్రుని జాడే లేదు. కాలువలో పడ్డాడేమో అన్నారు. కాని ఉత్తరంలో ధ్వని అది కాదే! అతనికి భార్య అంటే ఇష్టం. ఇద్దరు పిల్లలూ అంటే ప్రాణం. ఎవళ్ళతో తగాదాలు లేవు. అధికార్లంటే ప్రాపకం. ఏవిధమైన కష్టాలులేవు. “కొందరు పిరికిపందలు శుంఠకార్యాలు చేస్తారు నిష్కారణంగా” అని రామచంద్రరావుని అతని స్నేహితులు తిట్టుకున్నారు.
4
ఈ సంగతంతా తెలిసిన ఒక పెద్దమనిషి కుటుంబంతో కాశీయాత్రకు వెళ్ళినప్పుడు "రామచంద్రరావు ఇక్కడ వున్నాడు. సన్యాసం పుచ్చుకొన్నాడేమో! భార్యను తీసుకుని మీరూ, అతనివాళ్ళూ కుటుంబాలతో రండి” అని రామచంద్రరావు మామగారికి టెలిగ్రాం ఇచ్చాడు. అంతా తండాలా ప్రయాణమై కాశీ చేరారు.
అడివి బాపిరాజు రచనలు 1 8 ◆ 98 కథలు అక్కడ రామచంద్రరావు సన్యాసుల్లో కలిసిపోయి వేదాంతం నేర్చుకుంటూ, యోగాలు అభ్యసిస్తూ ఉన్నాడు. అది చూసి అతని భార్య కెవ్వున అర్చి మూర్ఛపోయింది. అతని ముద్దుబిడ్డలు ఇద్దరూ గవ్వల్లా కళ్ళుచేసుకుని విస్తుపోతూ తండ్రిని చూశారు. ఎన్నివిధాలు ఎంతమంది ప్రయత్నించినా కాషాయాంబరాలు ధరించిన ఈ క్రొత్త సన్యాసి హృదయం కరగలేదు. "దివ్యాదేశం వచ్చింది. కారణం ఏమిటి? కారణం వుండదు. తరించడానికి వైరాగ్యం ముఖ్యసాధనం!" అంటూ శంకరభాష్యం ఏకరువు పెట్టాడు. రాతితో వండారు అతని హృదయాన్ని. ఆయన గురువు శతవృద్ధు యతీశ్వరానందజీ రామచంద్రుని భార్యకు హృదయోపశమనం చేశారు. వారందరు తిరిగి ఇంటికి చేరారు. హిమాలయాలు పిలిస్తే ఎవరాగ్గలరు? ఆ రామచంద్రరావు నేటి ఆశ్రమంలో ఆనందస్వామిజీ!
రెండవ భాగము
ఆ బాలికను చూసినకొద్దీ ఆనందజీ దేహం నరం నరం వశం తప్పిపోయినవి. అతని గుండె రైలుమరలా మ్రోగుతోంది. అతని మనస్సు చెప్పుచేతల్లోంచి పూర్తిగా తప్పిపోయింది. ఎప్పుడూ అట్టి విపరీతం జరగలేదు. భయపడుతూ స్నానం పూర్తికానిచ్చి హరిద్వారం సమీపంలో వున్న ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు ఆనందజీ. ఏమిటిది? ఎక్కడి ఘోరపాపం! ప్రపంచం అధోలోకంలోనికి క్రుంగిపోతున్నదా? హిమాలయాలు విరుచుకు పడుతున్నవా? తల భూమి పైకొట్టుకున్నాడు. ఇన్నాళ్ళ తపస్సు భగ్నమైపోయింది. మంట కలిసింది. మూడేళ్ళు గంగోత్రిదగ్గిర తపస్సు చేశాడు తాను. చవి ఉన్నదన్న 'ప్రకృతి సత్యము' మిథ్య అని అనుకోలేదా తాను. తన మనస్సు ఆ రోజుల్లో విశ్వమంతా తిరిగేది. 'శివోహం' అనే ధ్యానంమీద మహాయోగం వల్ల దీక్షతో చివరకు నిలిచింది. కుండలిని లేపింది. షట్చక్రాలు దాటి విజృంభించి పైకి ఉబికింది. సహస్రారందాట ప్రయత్నం. ప్రాణశక్తి. వికల్ప సమాధి. అంతా ఏక తపస్సు, అంతంలేని చీకటి. శబ్దంలేని కటిక నలుపు. ఏమీలేని ఘోరజీమూతం. దేహం కొయ్యబారింది. ఆకలి దహించింది. హృదయం పేరుకుపోయి గడ్డకట్టింది. కొన్ని వారాలు అలాగే చైతన్య రహితమై పడిఉన్నాడు. బాహ్యజ్ఞానమేలేదు. ఏమి జరిగినదో? అంతర్ధానమూ నశించిపోయింది. చటుక్కున ఒక్కనాడు మెలకువ వచ్చింది తనకు. గురుభాయీలు “శివోహం” “శివోహం” జపిస్తూ ఉన్నారని తెలిసింది గంగోత్రికడ గుహల్లో. నెమ్మదిగా నెమ్మదిగా పండ్లు తిన్నాడు; పాలు చప్పరించినాడు; రొట్టె నమిలినాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 99 కథలు గురుస్వామి యతీశ్వరానందజీ "మొదటిగడ్డు దాటింది. రెండవదానికి సిద్ధం అవు" అన్నాడు. అతని ఆత్మ మహాశాంతంలో దిగిపోయింది. ఒక విధమైన తేజస్సు అతన్ని ఫాలాన్ని వెలిగిస్తూ ఉన్నది. గురుస్వామికడ అనేక గ్రంథాలు చదివాడు. వేదాంత మహాభావాలు అవగతం చేసుకొన్నాడు. అవి అన్నీ తనకు ఇదివరకే తెలిసిఉన్నట్లు గోచరించాయి.
2
కైలాసగిరికడ ఒక గుహలో రెండవసారి తపస్సుకు పద్మాసనం వేసి కొన్నాడు. ఇప్పుడు అతిత్వరలో వికల్ప సమాధిలోనికి పోయాడు. దేహం అంతా వేయి విద్యుల్లతలు పాకినట్లయింది. “శివోహం’ ‘శివోహం!' 'శివోహం!' అంతా వెలుగే. 'తత్త్వం సర్వం'! 'తత్త్వమసి'!! 'అహం బ్రహ్మాస్మి'!!! 'సర్వంసత్'! 'సర్వంచిత్'! 'సర్వం ఆనందం'! ఆరునెల్లు ఒకే యోగం, ఒకే సమాధి! ఒకే ఆనందం! ఓం, ఓం, ఓం!!! ఆనందజీ కళ్ళు తెరిచినాడు. సంపూర్ణ చంద్రమండలమే ఆయన మోము. ఆయన దేహాన్నుంచి వెలుగులు చిమ్ముతున్నవి. ఆయన పెదవుల చివురుల సంతతానందహాసము, ఆయన కనుల్లో జ్ఞాన జ్యోతిర్లతలు. “హరిద్వారంవద్ద ఆశ్రమం ఏర్పరచుకో, రోజూ స్వామి దేవాలయం ఎదుట స్నానాల రేవులో స్నానంచేసి, స్వామిదర్శనంచేసి ఆశ్రమంలోకిపోయి తపస్సు చేసుకో!” అని గురుస్వామి ఆజ్ఞ. అలాంటి తనకు ఈ అవస్థ ఏమిటి?
3
ఆ బాలిక మోము కలకలలాడుతూ ఎదురుగా కనబడుతోంది. తల తిప్పివేసి పద్మాసనం వేసికొని ధ్యానంలో కూర్చున్నాడు. ఆ కాశ్మీరబాల ఎదుటకు వచ్చింది. పూలు ఫలాలు పళ్ళేన పట్టుకొనివచ్చి ఎదుట నిల్చొని నమస్కరించి తన సెజ్జనే కూర్చున్నది. ఆమె ఉష్ణాంగములు తన దేహాన్ని తాకినవి. ఆమె హృదయాలయాలు తన దేహాన్ని అదిమినవి. ఆమె తన ఫాలము ముద్దుకొన్నది : ‘అయ్యో!' అని ఆనందజీ చివాలున లేచినాడు. అక్కడ ఎవ్వరూ లేరు. పళ్ళెమూలేదు బాలికాలేదు. తానొక్కడే. చుట్టూ శూన్య కుటీరము. తపస్సు భగ్నమైపోయింది. జీవితం ప్రక్కలై పోయింది. మళ్ళీ తాను ఎన్ని జన్మలు వెనక్కుపోవాలో! సత్ పదార్థముతో ఐక్యం అయిపోయినవాళ్ళు మళ్ళీ వెనక్కు వెళ్ళడం ఉన్నదా? పరమశివా! తాను తన గురుస్వామి మోము ఏలాగు చూడగలడు? తాను తనకే రోతయిపోయినాడే. "దేవా, ఏమిగతి? గురూ, నన్ను రక్షించు” తలక్రిందవేసి బద్దలు కొట్టుకున్నాడు; ఏడ్చినాడు; దండం పుచ్చుకొని దేహాన్ని బాదుకొన్నాడు కంగి, వాచి, కాయలుకట్టి ఎంతో బాధ పెట్టింది. ఆ బాలిక తనవైపు చేతులుచాచి అతిప్రేమతో చేరవస్తున్నది.
అడివి బాపిరాజు రచనలు 1 8 - 100 - కథలు “శ్రీహరీ!” అంటూ, ఉన్నతుడై ఆనంద గంగ ఒడ్డునే పరుగెత్తినాడు. “శ్రీహరీ!” అని గంగాప్రవాహం ప్రతిధ్వనించింది.
4
"అయ్యో తల్లీ! నీకర్మం కాలిపోయిందే, ఏమిచేస్తాం. ఎన్ని చుక్కలు తలవెంట్రుకల నుంచి రాలుతూ ఉంటాయో అన్ని జన్మాలు వైధవ్యం అనుభవించవలసి వస్తుందమ్మా. నేను తీయించుకోలేదూ. ఉన్నా ఎవరు ఆ తుమ్మెద రెక్కలు చూసి సంతోషించడం” అని నిరుపమాదేవి మేనత్త యామెను బలవంతాన లాగుతూ ఉన్నది. తల్లి మేలిముసుగు పూర్తిగా మోముమీదికి లాక్కొని వెక్కి వెక్కి వాపోవుతూ ఉన్నది. తండ్రి పండిత రామానంద్ కుమార్తె చేయిపట్టుకుని మంగలివైపు లాగుతూ ఉన్నాడు. మంగలివాడు ఒంటి చిరునవ్వు నవ్వుతూ కత్తినూరుకుంటూ “ఎన్ని రకాల అందాలజుట్లు యీకత్తి మింగి ఈ గంగకు అర్పించిందో” అని అస్పష్టంగా అంటున్నాడు. నిరుపమాదేవి "అబ్బా, నేను చేయించుకోలేనర్రా” అంటూ పులి దగ్గరకు తోసే లేడిలా వెనక్కుపోతూ ఎంత బలవంతాన లాగినా ముందుకు రాదు. భర్త పోయినాడన్న దుఃఖమేమీ ఎరుగదు. తన్నందరు హీనంగా ఎందుకు చూసేవాళ్ళో ఆ బాలికకేమి తెలుసు? ఎప్పుడు వాళ్ళింటిలో శ్రీనగరంలో ఆడుకుంటూ ఉండేది. తండ్రి భాగ్యవంతుడు. ఆ బాలిక తప్ప పిల్లలెవ్వరూ లేరు. కాని తానొక గొప్ప సనాతన వాదినని అతని అభిప్రాయం. వచ్చే కళ్ళనీళ్ళు వెనక్కు తరుముతూ లేని కోపంతో జేవురిస్తూ కుమార్తె రెండు బుజాలూ నొక్కిపెట్టి బలవంతాన మంగలి దగ్గిర కూచోపెట్టాలని తోస్తూ ఉండగా “స్వామీ, రక్షించు” అని ఆ బాలిక కింద పడింది. గంగ ఒడ్డునే విసవిసా పిచ్చవానివలె వస్తూ ఉన్న ఆనందస్వామిజీ అక్కడకే ఆ సమయంలో వచ్చాడు. “ఎవరువారు?” మంగలి: ప్రభూ! బాలవితంతువు శిరోజములు గంగాదేవి కర్పించపోతూ ఉన్నారు. ఆ కాశ్మీర బాలికే చైతన్యం తప్పి కిందపడి ఉన్నట్లు చూశాడు. చివ్వునపోయి ఆమెనుపట్టి లేవనెత్తి ఆమె శిరస్సు తన ఒళ్లో పెట్టి కొని “శివోహం, శివోహం” అన్నాడు. ఆమె కళ్ళు విప్పింది. సిగ్గున ఆ బాలిక స్వామీజీ ఒళ్ళోనుంచి లేచి, జరిగి కూచుని మేలి ముసుగు సవరించుకున్నది. పండిత రామానంద్ స్తబ్ధుడై విస్తుపోతూ చూస్తూ నుంచున్నాడు. స్వామిజీ ప్రళయకాలరుద్రునిలా గర్జిస్తూలేచి, “ఈ కసుగాయపాపను విరూపను చెయ్యడానికి నువ్వెలా ఒప్పుకున్నావయ్యా?" నీకు మోక్షం వస్తుంది అని అనుకున్నావా? ధర్మశాస్త్రాలు వప్పుకుంటాయనా నీ అభిప్రాయం! ఏ వ్యక్తికైనా బలవంతంగా వైరాగ్యం ఇవ్వవచ్చునా?
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 101 కథలు మనస్సులో లేని వైరాగ్యం జట్టులో వస్తుందా?" అంటూ శాస్త్రంలో కబుర్లు, శాస్త్రాతీతమైన యుక్తులూ ఏకరువు పెట్టేశాడు. హృదయాంతరాంతరాళాల్లో ఇష్టంలేక లోకానికి వెరచిజుట్టు తీయించతలచుకొన్న పండిత రామానందుడు "స్వామిజీ, క్షమించండి. నాకుమార్తె తనంతటతాను యోగినీవేషం పూన్తానన్నదాకా వేణీభరం తీయించను. కాని తమ బోంట్లు ఈలాంటి బాలికలకు సంసారమందు రోత, వేదాంత విచారం మొదలయినవి బోధిస్తూ ఉంటే మా సంసారాలు తరిస్తాయి స్వామీజీ!" అన్నాడు.
మూడవ భాగము
ఆనందజీ హృదయం తుఫానునాటి మహాసముద్రమైంది. విశ్వామిత్రునకు తపోభంగం జరగలేదా? అది తాత్కాలికం అయినదే. కాని వారి తపోభంగం యొక్క అంతం, ఆ సుందర కాంతాపరిష్వంగంతోగాని కాలేదు. అది మహాపాపంకాదా? తనకేది కర్తవ్యం? ఒక్కనిమేషమేని ఆ బాలిక సుందర వదనం హృదయంలోంచి మాయంకాదే? ఆ దివ్యసుందరగాత్ర తన్ను ముట్టుకున్నప్పుడు తన దేహం పొందిన పులకరాలు, హాయి, ఆనందం, తాను సమాధిలో పొందిన ఆనందంకన్న ఉత్కృష్టమైందో సమమైందో? తనపాపానికి నివృత్తి ఉన్నదా? తన యీ అధఃపతనానికి చెలియలికట్ట ఎక్కడ? దేహం తెలియకుండా ఎన్ని దేశాలు తిరిగాడో! గొప్ప స్వామి వచ్చాడని చాలామంది గృహస్థులు ఆతిథ్యం ఇస్తే వంకర నవ్వునవ్వుకుంటూ "మీ అమ్మాయిల్ని జాగ్రత్తచేసికోండో!” అని మనస్సులో చాటించుకున్నాడు. కసితో, వాళ్ళతో చార్వాకసిద్ధాంతం పూర్వపక్షంచేస్తే, అంతా అంతరార్థమే అని సంతోషించారు మానవులు. అతని మొహంలోని కెరటాలు కొడుతూఉన్న మోహజలధి "పార లౌకిక కాంతినిధి” అని అనుకున్నారు విధవ స్త్రీలు. ఎక్కడెక్కడో తిరిగాడు, ఏమేమో ఉపన్యాసాలు ఇచ్చాడు. మాట్లాడేదంతా మాయ సంసారపు విముక్తి ఉపన్యాసం. మనస్సు నిండినదంతా మాయామోహపు తీపివెట్రి. తీర్థాలు, పుణ్యస్థలాలు, వర్తకపు పట్టణాలు, వ్యవసాయపు కేంద్ర స్థానాలు, రాజధానులు ఆరునెలలు తిరిగి తిరిగీ ఎక్కడ తిరిగాడో, ఎలా తిరిగాడో, పరివ్రాజకత్వమో భామరూపం నిండిన పరవశత్వమో, తిరిగి తిరిగి కళ్ళు తెరిచి చూసేటప్పటికి కాశ్మీర దేశం, శ్రీనగరం వీధిలో ఒక మేడముందు. “స్వామీ! నమస్తే!” అని కాశ్మీర బ్రాహ్మణుడు నడుముకు తలపాగ చుట్టుకుని జోళ్ళు విప్పి సాష్టాంగపడ్డ దృశ్యం. పదిమందీ జేరడం, లోనికి తీసుకువెళ్ళడం, గౌరవం చేయడం నిముషములో జరిగిపోయింది. ఆ బాలిక తండ్రి ఇల్లు, ఆ పండితుడు, ఆ దివ్య మంగళ విగ్రహం ఎదుట సర్వాంగాలింగితభూతల అయి ఉన్నది.
అడివి బాపిరాజు రచనలు - 8 ◆ 102 కథలు 2
ఇంటి గురువు అయ్యాడు. తన్ని మూలమంటా కదిల్చివేసే ఆబాలిక తనకు పరిచర్యచేస్తూ ఉన్నది. ఏరోజు తన్ను రక్షించాడా బాల సన్యాసి అనిచూసిందో ఆనాటి నుంచి అతడామె జీవితానికి ఈశ్వరుడయ్యాడు. హిమాలయ ధవళశృంగాలల్లో ఎర్రని పాదాంగుళులను మోపుతూ నృత్యంచేసే నటేశ్వరుడే ఆ బాల సన్యాసి ఆ బాలికకు, అతని వెడద ఫాలం హిమాలయ సానువైంది. తీక్షణమై లోతై నల్లనై చిన్ననైన అతని కళ్ళు తన మోక్షమార్గం చూపించే నక్షత్రాలయ్యాయి. సన్నని పొడుగాటి చామన చాయగల ఆ బాల సన్యాసి తన్ను తరింపచేయడానికి అవతరించిన కేదారేశ్వరుడు. అమరనాధుడు. అతని ఫాలంలో చంద్రవంక చూసుకుంది. అతని బోడితలలో జటాజూటాలు నర్తించినవి. అనుక్షణం ఆ బాలసన్యాసి వరద హస్తంతో ఎదుట తోస్తూనే ఉన్నాడు. రాత్రిళ్ళు చీకట్లలో హరిద్వారంనుంచి వచ్చినప్పటించీ ఆస్వామిజీ దగ్గిర నిలుచుండి తనవైపు అభయముద్ర చాచినట్లే కనిపిస్తూ ఉన్నది. ఆస్వామిజీ తలచుట్టూ కాంతిపుంజము ప్రసరించిందంట. ఆయన్నే తేజస్సు అలుముకు పోయింది. సర్వకాలమూ ఆయనకు సేవచేస్తే తనజన్మ పవిత్రం అయిపోతుంది. ఆ అవతారమూర్తి మళ్ళీ కనబడతాడా? ఎప్పుడూ కళ్ళకు కనబడుతూనే ఉంటాడు. దేహంతో ప్రత్యక్షం కాకపోయినా పరవాలేదు. ఆయన ఎప్పుడూ హరిద్వారం దగ్గిరేనా బస? ఎంత సుందరమూర్తి! ఆయన ఒళ్ళో తాను పడివున్నప్పుడు, అంత ఒళ్ళు ఆనందంతో కరిగి పోయిందేమిటి? ఆయన మొహంలో మందహాసాలు మంచు శిఖరంమీద వెన్నెలపడినట్లు వెలిగినవేమిటి? ఆయన మనుష్యరూపం పొందిన భగవంతుడు కాడా మరి! ఆయన్ని నిత్యమూ కొలుస్తూ ఉన్నా, తనకు తృప్తి ఉంటుందా? ఆయన పాదాలు తాను పట్టాలి. ఆయన తనకుముక్తినిచ్చే మార్గము బోధిస్తూ, నెత్తిమీద చేయివేసి ఆశీర్వదిస్తాడా? దినదినమూ ఈలాంటి ఆలోచనలతో నిండివున్న ఆ కాశ్మీరబాలికకు "స్వామిజీ వచ్చాడు” అన్న తండ్రికేక వినబడింది. గజగజ వణికి పోయింది. కన్నుల నీరు తిరిగినవి. ఆనందం ఒళ్ళంతా అలుముకుపోయింది. తనకోర్కె విన్నా డాస్వామి. తన తపస్సు ఫలించిందా? తన గురువు తన్ను వెదుక్కుంటూ వచ్చినాడా? ఆ స్వామి ఇంట్లోకి వచ్చాడు. కాళ్ళపై పడింది. ఆ కాళ్ళక్రింద మన్ను తనతలపై వేసికొన్నది.
అడివి బాపిరాజు రచనలు 8 103 కథలు 3
ఆ నగరంలో ఆబాలగోపాలం స్వామిజీకి పరిచర్య చేస్తున్నారు. ఫలాలు పట్టుకువచ్చేవాళ్ళు, పాలు పట్టుకువచ్చేవాళ్ళు, భిక్షలకు పిలిచేవాళ్లు, మిఠాయి వంటలు వండించేవాళ్ళు, ఒక్క నిముషం స్వామిజీకి తీరుబడి లేకుండా జనం ఎప్పుడూ ఆయన చుట్టూ మూగి ఉండేవాళ్ళు. సంసారంలో దౌర్బల్యం బోధించాడు. కర్మ అనేది ఏమిటి? జ్ఞాన మార్గం యొక్క ఉతృష్టత. మానవుడు మనస్సు. మనువు మనస్సు. జీవితం మనస్సు. మనస్సు యొక్క వికల్పాలే ప్రపంచ సృష్టి, ఆనందం ఏమిటి? సత్ పదార్థం ఏమిటి? ఈశ్వరుడు పరాప్రకృతి. సాక్షీభూతమగు పురుషుడు, సృష్టిభూతమగు పురుషుడు, సమస్త పురుష స్వరూపుడగు పురుషోత్తముడు. భగవద్గీత పరమ వాక్కు, త్రిభాష్యాలకు ఉండు పరమసంయోగం, సమీకరణం ఎక్కడ? సాంఖ్యము, ఉపనిషత్తులు, బ్రహ్మగీత అన్నీ ఒకటే చెప్పుతాయి. హఠయోగం దేహనిర్మలతకోసం. మంత్రబలిమి. పరా, పశ్యంతీ, మధ్యమా వైఖరీ వాక్కులు, సృష్టిశక్తి, శక్తికి మహోత్కృష్ట స్వరూపమైన పరమ సూక్ష్మమగు ధ్వని. ఆ ధ్వని అక్షర సముదాయమైంది. కాబట్టి బీజాక్షరాలు. ఇంకా, ఇంకా ఈలాగే జ్ఞానముద్ర ధరించి తీపి వాక్కులతో వందలకొలది భక్తులకు బోధిస్తూనే ఉన్నాడు. ఒకనాడు ఒక శిష్యుడు “స్వామీ, సంసారంలో ఉండి త్యజించే మార్గం చెప్పండి” అని పృచ్ఛచేసినాడు చేతులు జోడించి. స్వామి అన్నాడు. “ఒక నావ బయలుదేరింది. తెరచాపలెత్తారు. గాలి జోరుగా వీస్తూంది. తెడ్లువేశారు. గడలు మోపారు పడవ నడవదు. తర్జన భర్జన చేశారు. చివరకు అంతా కనిపెట్టింది ఏమిటి? లంగరే ఎత్తలేదట. ప్రపంచంలో ఉండి ఆ పాపాలన్నీ చేస్తూ మోక్షం ఎల్లా సంపాదించడం. బజారులో కూరగాయ వస్తువా మోక్షం?" రాత్రిళ్ళు స్వామిజీకి పరిచర్య నిరుపమాదేవే. పరుపుపై ఔభ్రాదుప్పట్లు, ఔభ్రాశాలువలు, ఆయన జపానికి కృష్ణాజినం వగైరాలు. బట్టలు ఉతికి ఆరవేయుట పళ్ళు ఒలిచి సిద్ధం చేయుట. పాలుకాచుటా, కాళ్ళు పట్టేది. దేహము పట్టేది. ఇద్దరూ ఆనందం పొందేవాళ్ళు. ఎప్పుడు పరిచర్య వస్తుందా అని ఇద్దరూ ఎదురు చూసేవాళ్ళు. మహాభక్తితో పరిచర్యజేస్తూ ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులకు పరమ సంతోషం అయ్యేది. వైరాగ్యమార్గంలోపడి సమస్త దుఃఖమూ మరచిపోతుంది కాదా మరి.
4
ఇన్ని సంవత్సరాలూ చేసిన తపస్సు బలిమి ఇంకా ఉందేమో? ఆ బాలిక తన దగ్గిర కూర్చుండి పరిచర్య చేస్తూవుంటే తమిపట్టలేకపోయినాడు. ఆమెతో కామ సంబంధమగు సహచర్యం ఊహించు కొనటానికే స్వామిజీ భయపడినాడు. అయినా అతని మనస్సు, ఆధీనంతప్పి చుక్కాని తెంపుకొని భయంకరమైన సముద్రాల్లోకి దుమికి పోవడానికి సిద్ధపడివున్న నావలా ఉంది.
అడివి బాపిరాజు రచనలు - 8 - 104 - కథలు ఏదోవంకతో ఆమెను స్పృశించేవాడు. ఆమె కురులు దువ్వేవాడు. ఆమెకు ఆధ్యాత్మికమైన రహస్యాలు నేర్పుతూ దగ్గిరకు లాక్కొని పక్కను జేర్చుకునేవాడు. ఆమెకు స్వామిజీయన్న మోహముకాదు. స్వామిజీయే తనకు దైవము, సర్వస్వము, స్వామిజీ తనకు దేహమర్పించమన్న అతి ఆనందపూర్ణమున్ను అతి అమాయికమున్ను అయిన హృదయంతో అర్పించగలదు. స్వామిజీ జీలంనదికి ప్రాణం సమర్పించమన్న అంతే. నవ్వుతో వెళ్ళిచేయగలదు. “నీ తండ్రిని ఈకత్తిపుచ్చుకొని చంపివేయి” అని స్వామిజీ అంటే అలాగే చేయడానికి ఆమె ఏమాత్రం సందేహించదు; ఆ బాలిక సమస్తము విడిచేస్తుందిగాని స్వామిజీని ఆమె నిమేషమైనా విడిచి ఉండలేదు. “అమ్మాయీ! ఇల్లా ఎందుకు నాకు పరిచర్య చేస్తున్నావు?” “నా దైవానికి పరిచర్య చేయడం నాకు అబ్బరమా?” “ఎవరిమట్టుకు వాళ్ళే దైవము. నా ఎక్కువ ఏముందమ్మా?” “అది తెలుసుకున్న తర్వాత కదా. అందాకా గురువే పరమ దైవం.” “సర్వ విధాల ఉత్కృష్టత పొందిన మానవుడే గురువుగా తగి ఉంటాడుకాని నాబోటివాడు- “పాపం! పాపం! అల్లా అనకండి, మీరు భగవంతుని అవతారమే!”
నాలుగో భాగము
ఆనందజీ తపస్సంతా భగ్నమైపోయింది. ఒక విచిత్ర ముహూర్తాన్ని ఆనందజీ తమి ఆపుకోలేక పోయనాడు. నిరుపమాదేవి అతని కౌగిలింతలో కరిగిపోయింది. ఆ సంధాన ముహూర్తం పవిత్రమైనదో. పాపభూయిష్టమైనదో ఆ రాత్రియే ఆనందజీ తలవాల్చుకొని సిగ్గుచే, భయంచే వణికిపోతూ హృదయంలో పశ్చాత్తాపం దావానలం అయి జ్వాలలు ఎగుస్తూ ఉండగా దేహం కుమిలి బొగ్గు అవుతూ ఉండగా ఇల్లు విడిచి నడుస్తూ నడుస్తూ అదే వెళ్ళిపోయినాడు.
2
నిరూపమాదేవి తనజన్మం పవిత్రం అయిందని ఉప్పొంగిపోయింది. భగవంతుడు ప్రత్యక్షమైన భక్తురాలులా తేజస్విని అయింది. ఆమెను ఎవ్వరూ తేరిపార జూడ్డానికి వీలులేనట్లు మిరుమిట్లు కొలుపుతూ ఉంది. తండ్రి: అమ్మా స్వామిజీ ఎక్కడ? నిరు: తపస్సుకు వెళ్ళారు నాన్నా! తల్లి: ఎప్పుడు వెళ్లారు? నిరు: తెల్లవారుగట్ల.
అడివి బాపిరాజు రచనలు - 8 - 105-> కథలు తండ్రి: అమ్మా నీ మొగము అల్లా ప్రజ్వరిల్లుతోంది. నీకన్నులు వెలిగిపోతున్నవి. స్వామి నీకు ఏమన్నా ఉపదేశం చేశారా ఏమిటి? నిరు: (చిరునవ్వుతో ఊరకుండును.) తల్లి: అమ్మా నువ్వు పరమేశ్వరుణ్ణి చేరే ఉమాదేవిలా ఉన్నావు. స్వామివారు నిన్ను కటాక్షించారా ఏమిటి? నిరు: (ఇంకా చిరునవ్వునవ్వుతుండును.) తండ్రి: ఎంత అదృష్టవంతురాలవమ్మా. పెద్ద పెద్ద వాళ్ళు తల్లక్రిందులా తపస్సు చేసినా దొరకని మహాభాగ్యం నీ పూర్వపుణ్యంవల్ల సమకూరింది. తల్లి: నా తల్లి పరమపూజ్యురాలు.
3
వేగంతో తరుముకువస్తూ ఉన్న భయంకరమైన సింహం బారినుండి తప్పించుకు పారిపోతూ ఉన్న లేడిలా ఆనందజీ హిమాలయ పర్వతాల్లోకి పారిపోయాడు. అతనికి ప్రపంచమంతా నల్లపడిపోయింది. పర్వత శిఖరం విరిగి అతనిమీద పడినట్లయింది. స్వచ్ఛమైన హిమాలయ ఖండాన్నిచూచి నల్లపడికుళ్ళి ఉన్న తన జీవితాన్ని చూసుకున్నాడు!! ఎందుకు తాను సన్యాసం పుచ్చుకున్నాడు? బంగారం లాంటి భార్యను విడిచిపెట్టాడు. ఊర్ధ్వరేతస్కుడని తన్ననుట మహా సత్యమన్న తపస్సు చేశాడు. ఆలోచించుకొని ఏడ్వడానికిన్నీ మించిపోయిందే యీ దుఃఖం. అసాధారణవేగంతో కొట్టుకునే ఈ హృదయం ముక్కలై పోరాదూ? జై! ఆనందజీ పాపానికి జై! తిరిగాడు. ఒక్క ఉరుకు ఉరికాడు. ఎంత దూరం ఆ పర్వతా ఘాతంలో పడ్డాడో! గిరగిర జయ్యిమని క్రింద దూరంగా ప్రవహిస్తూ పతనాల జలజల ధ్వనిస్తూ ఉన్న నది. దేవదారు చెట్లు, కొండరాళ్ళు, అన్నీ తన్ను చేరడానికి మహా వేగంతో వస్తున్నవి. ఇంక ఒక్క నిమేషంలో పదోవంతు కాలంలో తల బద్ధలు, దేహం పిండి, మళ్ళీ తనస్వరూపం ఎక్కడా కనబడదు. శివోహం! శివోహం! ఆనందజీకి ఆ పతనంలోనే ఒళ్ళు మైకం కప్పి స్మృతి తప్పిపోయినది.
4
నిరుపమాదేవి నానాటికి మహాతేజస్విని అయినది. ఆమెను తేరిచూడ్డానికి ఎవరికిన్నీ చాలకున్నది. ఆమె మోము ప్రఫుల్లమైంది. కళ్ళలో లోతులు కాంతులు సుళ్లుతిరిగి పోతూ ఉన్నవి. అరమూతలైన నయనాలల్లో ఎంత దివ్యప్రేమ ప్రవహిస్తూ ఉన్నదో?
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 106 -> కథలు పాటలవర్ణ వర్ఛస్విని అయిన ఆ దివ్య సౌందర్యబాల శలాకలా ఉండేది. నేడామె సంపూర్ణ చంద్రునిలా అయ్యింది. కుమార స్వామిని సర్వ విశ్వానికి అర్చించపోతూ వున్న దేవి, తధాగతుణ్ణి నెలలు నిండుగా గర్భమందు దాచుకున్న మాయాదేవి, ఆమెదేవకి, కౌసల్య. ఇంట్లో అందరికి గప్పున వెల్లడి అయింది. గొల్లుమన్నారు. తల్లి నోరు మూసుకుంది, కూతురు మీద పడిఏడ్చింది. "నా తల్లీ, కొంపలు ముంచావే! తరతరాలకి మన కుటుంబాల్లో ముక్తి అనేది లేకుండా చేశావే! అమ్మయ్యో! ఆ సన్యాసి ముండాకొడుకేనా! చిరునవ్వు నవ్వుతావు. అయ్యో! అయ్యో!!" తల్లి విచారం, ఏడ్పు, కంగారు నిరుపమాదేవికి అర్థము కాలేదు. పవిత్రమైన తన్ను చూసి ఎందుకు ఇంత దుఃఖం. తానేమి తప్పు చేసినది? స్వామి తనకుపదేశించిన మంత్రము పఠించు కొన్నది. ఆ వేళ కుమార్తెను తల్లి తేరిచూడజాల లేకపోయినది.
5
ఇంకొక వారం రోజులకు తండ్రికి తెలిసినది. ఆయన కోపము దక్షునికి రాలేదు; వీరభద్రునికి రాలేదు. ఎంతటి దుర్మార్గుడు. పాపి! సన్యాసా వాడు? ఛండాలాతి ఛండాలుడు. క్రూరుడు. వాడితల వేయి ముక్కలు చేసి వాడిని మహామాయ వండి భోజనంచేయాలిగాక! రామారామా! కంట నీరుపెట్టుకుని హోరుమని ఏడ్చినాడు. రామారామా! ఎంతటి ఆపత్తు తెచ్చి పెట్టినా వోయి? పవిత్రమయిన తనకుటుంబానికి వంశానికి, ఇట్టి కళంకమే? గొరిగించ కోపముతో మళ్ళీ మండిపోయాడు. పాడుముండ. ఆ వెధవవాడివల్లో పడింది. ఆడదానికి బుద్ధిఉంటే మగవాడు ఏమి చేస్తాడు. దీనికి ఆ రోజునే వలసిందిరా దైవమా! ఆ రాక్షసి వెధవ దానిమీద కన్నువేసి వెధవ వేదాంతాలు చెప్పి అడ్డుపడ్డాడు. ఈ ప్రపంచంలో ఎంత పాపం ఉంది? ఎల్లాగ తన బ్రతుకు? ఏమిటి కర్తవ్యం! ఈ పాడుపాపిని జీలంలో పడమంటే విషమిస్తే?....? లేకలేక ఒక బిడ్డ!!! చేతులార ఎట్లాగురా? దైవమా? కుమార్తె దగ్గిరకుపోయినాడు. ఆనందమై ప్రఫుల్లమైన ఆమె మోము చూసేటప్పటికి అతడు గజగజ వణికినాడు. కాశీలో అన్నపూర్ణను చూసినట్లయింది. కొల్హాపురం దివ్యమూర్తి గజలక్ష్మి ప్రత్యక్షమైనట్లయింది. కాశీ ఘట్టపు మహాకాళి. తల్లీ నీవా ఈ పాపంచేసింది. ఇదంతా అబద్ధమేమో? తన భార్య తప్పు అభిప్రాయం పడిందేమో? “అమ్మా ఏమిటి చేస్తున్నావు?” "ఏమీలేదు నాన్నగారూ! స్వామి ప్రసాదించిన మంత్రము పునశ్చరణ చేసుకుంటున్నానండీ!” “వాడి మొగం మండ, వాడిచ్చేదేమిటే మంత్రం వాడితల!” స్వామి భగవంతుని అవతారం!"
అడివి బాపిరాజు రచనలు - 8 ♦ 107 - కథలు “వాడి అవతారం కూల! నా కొంపమాపేడే! బాబూ!" "స్వామి పవిత్రమైన మహాఋషి!” “అయ్యో నా తల్లీ! నిన్నూ నన్నూ రౌరవాది నరక కూపంలో దింపేడే! బాబూ! రామా!! దీనికి అర్థంకాదురా?” “మీరు చెప్పిన వెనక కథల్లో వ్యాసుడు, ధృతరాష్ట్రుణ్ణి పాండురాజును ఎల్లా ప్రసాదించాడు నాన్నగారూ?” “మ!.. మ!.. ప!....ప!....” "జన్మం మనస్సు నాన్నా! ఆత్మ! పరమ తేజం అంతా నిండి ఉంటుంది! పాపంపుణ్యం! మనస్సే ఆరోపించుకుంటుంది! నిజం గోచరించుకుంటే! మనస్సు వికల్పం లేకుండా పవిత్ర భావంతో ఉన్నప్పుడు పాపందేనికి నాన్నగారూ!” “.....” తలవంచుకొని నిలుచున్నాడు తండ్రి. "స్వామి నాకు భగవంతుడు, సమస్తమూ ఆయన ప్రసాదము. నా గర్భం. వెలుగుతో నిండిఉన్నట్టు నాకు ప్రత్యక్షంగా ఈ కళ్ళకి కనుపిస్తో ఉంటుంది నాన్నగారూ!” " “నాకు వచ్చేకలలు పవిత్రమై ఉంటున్నాయి! పవిత్రమైనది పాపం పాపం ఎట్లా? నిప్పుకు అంటున్నదా?
6
మరునాడు కాశీప్రయాణం, కాశ్మీర బ్రాహ్మణ కుటుంబం యావత్తూ. అక్కణ్ణుంచి రామేశ్వరం వెళ్ళుతూ మధుర, చిదంబరం, శ్రీరంగం, కన్యాకుమారి, అనంతశయనం, కంచి, ఉడిపి, తిరుపతి, తిరువన్నామలై, కాళహస్తి, పక్షితీర్థము, తంజావూరు, కుంభకోణం, రాణ్మహేంద్రపురం, జగన్నాధం, దర్భశయనం అన్నీ తిరిగి, అమ్మాయి పురిటికి కాళీఘట్టం చేరుకున్నారు. ఒక పవిత్రమైన దినంలో, దివ్య ముహూర్తంలో, నిరుపమాదేవికి వెలిగిపోతూ ఉన్న పుత్రుడు జన్మించాడు. పేరు ప్రతిష్ఠా పాడుజేయడానికి పుట్టిన మలినం, మహాపాపానికి చిహ్నంగా పుట్టినముద్ద, ఆ శిశివును హుగ్లీ నదిలో పారవేద్దామని కాశ్మీర పండిజ్జి సంకల్పించాడు. పురుడు వచ్చిన మరునాడు ఎవళ్ళూ లేకుండా పురిటిగదిలోకి వెళ్ళాడు. కుమార్తె బాలకుణ్ణి పక్కను బెట్టుకొని యశోదలా నిద్రపోతూఉన్నది. ఆ బాలకుడు తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. “ఓయి వెళ్లి బ్రాహ్మణుడా, నీకు పిల్లలులేరు. భగవంతుడు ఈ బాలకుణ్ణి నీకు ప్రసాదించాడోయి” అని ఎవరో గంభీరస్వరములు తనచెవిలో పలికినారు. ఆయన ఉలిక్కిపడ్డాడు. ఎంతమంది ఎన్ని మాటలంటారో, ఎన్ని రకాలు సృష్టిస్తారో, ఎల్లాగు ఈ పసిపాపణ్ని తన ఊరు తీసుకుపోవడం. ఎంత అపఖ్యాతి? ఎల్లాగు? తలయెత్తి తిరగడం? “దైవమా ఏదయ్యా మా దిక్కు? పరువుగా బ్రతికిన మా కుటుంబం గంగలో కలియడమే?”
అడివి బాపిరాజు రచనలు 1 8 ◆ 108 కథలు అయితే పండులాంటి ఈచిన్న పాపను చేతులారా ప్రాణం తీయడమే! అమ్మయ్యో అది మాత్రం తాను చేయలేడు. తన హృదయం కర్కోటకం కాదు! తాను కటికి వాడున్నూ కాడే! భగవంతుడా దారేది? తెన్నేది? ఎవరికైనా పెంపకం ఇస్తే!! ఎవరు తీసుకుంటారు?! తానే పెంచుకొనాలా??? ఎల్లాగు???? ఎవరి పిల్లాణ్ణి పెంచుకునేందుకు తీసుకువచ్చానంటే ఎవరేమంటారు! దిక్కులేని పాపడు దొరికాడనచ్చుగా!!!!
7
స్వామికి చటుక్కున మెలకువ వచ్చేటప్పటికి ఆ హిమాలయపర్వతం లోతులోయలో ఆఖాతంలో గోడలాంటి ఆకొండచరియలో ఉన్న ఒక చెట్లగుంపులో వ్రేలాడుతూ ఉన్నాడు. గుబురుగా ఉన్న ఆచెట్లు, ఒత్తయి ఉన్న ఆ కొమ్మలు ఆనందజీని రక్షించాయి. ఒళ్ళంతా నొప్పులు, తల బద్దలైపోతూ ఉంది. కదలలేకుండా ఉన్నాడు. తల్లిలా ఆ చెట్లకొమ్మలు అతన్ని ఉయ్యాల లూపినవి. క్రింద లోతుగా ప్రవహిస్తూ ఉన్న నది సంగీతం పాడుతూ అతనికి ఉపశమనం చేసింది. “శివోహం! శివోహం!” అన్నట్లుగా ఉన్నది. నెమ్మదిగా మహా ప్రయత్నంతో కొమ్మల్లోంచి ఆ చరియ తలానికి దిగాడు. ఒళ్ళు దులుపుకున్నాడు. తనతోపాటు పడిన మంచుగడ్డలు కరిగి ఒళ్ళు చల్లగా జిమ్మమని తడిసి ప్రాణంలేచి వచ్చునట్లు చేసినవి. ఆకులు, చిరురెమ్మలు దులుపుకున్నాడు. పైకి ఎక్కడానికి వీలులేదు. క్రింద దిగడానికి వీలులేదు. భగవంతుడు తన్నిక్కడ ఖైదువేశాడా? ఏది ఎట్లయితే తనకు భయమేమిటి? అంతంవస్తే అంతకన్న మంచిదే. శివోహం! శివోహం! శివ! శివ! శివ! హరిః ఓం! ఓం! ఓం!! పద్మాసనం వేసుకున్నాడు. తపస్సు లోకి దిగాడు. రెండునెల్లు మహాతపస్సు, రాతిలోరాయి. వాయువులో వాయువు. మంచులో మంచు. మహాతేజస్సు క్రింద ప్రవహించే నది గడ్డకట్టుకు పోయింది. ఆ శీతాకాలంలో అతను వడకలేదు. సర్వసృష్టి స్తంభించిపోయింది. మహాప్రశాంతం చిదానందం. అంగుటిలోని రంధ్రం పూడిపోయినది. అంతర్ముఖాన కుండలినీ శృతి! గురుపాదుకలు దివ్యకాంతులతో వెలిగిపోతున్నవి. షట్చక్రాలు దాటి బ్రహ్మరంధ్రం సమీపాన్ని, సహస్రార కమలనాళతీరాన్ని అతని ఆత్మ పరాశక్తిస్థాన ప్రస్థానమైంది.
అడివి బాపిరాజు రచనలు 8 - ◆ 109 → కథలు అయిదవ భాగము
శ్రీనగరంలో కాశ్మీరపండితుడు రామానందలాల్జీ పెంచుకుని తీసుకుని వచ్చిన కుఱ్ఱవాడు పండితుని మేడంతా వెలిగిస్తూ బాలకృష్ణునిలా పెరుగుతూ ఉన్నాడు. నిరుపమాదేవి విగతకేశ యోగినీ రూపందాల్చి పరమ పవిత్రయగు భాగీరధివలె ప్రవహిస్తూ ఉన్నది. చుట్టాలు పక్కాలు చట్టుపక్కలవారు రామానందలాల్జీకి కలకత్తాలో ఒకబీద కాశ్మీర బ్రాహ్మణ కుటుంబం వారు ఇచ్చిన ఆ బంగారు బాలకుణ్ణి చూచి విస్తుపోయారు. ఏవో అనుమానాలు పడ్డారుగాని, దివ్యతేజ స్వరూపంతో తపస్వినిలా ఉన్న నిరుపమాదేవిని తేరిచూడ వాళ్ళకు భయము వేసి పోయింది. రామానందలాల్జీ చెప్పిన చరిత్ర ఒక్కరున్నూ అనుమాన పడలేక పోయినారు.
2
నిరుపమాదేవి అంతకన్న తపస్సులో మునిగిపోయింది. శ్రీ స్వామిజీ ఉపదేశించిన ఆమంత్రమే పరమమార్గము, స్వామిజీ గురువు, పునశ్చరణయే యోగము. తపస్సులో మైమరచిపోయేది, పరవశమై కన్నులు అంతర్దృష్టిచే అర్ధనిమీలితాలూగా, ఆ పూజా గృహంలో అమ్మవారి పీఠం యెదుట కాంచన గంగా శిఖరమువలె యోగముద్రలో ఉండేది. ఆ సమయంలో ఆమెలోంచి ఒక కాంతి బయలుదేరి ఆగది, ఆగది దాటి చావిళ్ళు ఇతర గదులు అంతా ఆక్రమించినట్లు ఉండేది. ఆమె అందం మరీ ఉత్కృష్టమైపోయింది. ఆమె మాట మరీ తీపి పడిపోయింది. నిరుపమాదేవి తనగురువగు ఆనందజీ చెప్పిన వేదాంతపు కబుర్లన్నిటికి నిజమైన అర్థం గ్రహించింది. ఆయన ఆదేశానుసారం భగవద్గీత ఎప్పుడూ పారాయణంచేస్తూ, ఆ పరమ పవిత్ర వాక్కులకు నిజార్థం గోచరింప చేసుకునేది. ఆ సుశీలకు కుమారుడన్న గురుప్రసాదమనే భక్తేగాని, కుమారుడన్న మమతయే లేదు. పాలివ్వదు. ఇతర పరిచర్య చేయదు. రామానందజీకి ఇష్టంలేదు. భయం కూడాను. పెంపుడుతల్లి అయిన అమ్మమ్మయే అమ్మ. ఊళ్ళో ఉన్న అమ్మలక్కలంతా మధ్యాహ్నం రామానందజీ ఇంటికి పల్లకీల మీద, పడవలమీద, నడకలమీద మేలిముసుగులతో వచ్చి నిరుపమాదేవి తన నిర్మలమాధుర్య గళంతో పాడి అర్థము చెబుతూఉన్న భగవద్గీతా రహస్యాలు విని ఉప్పొంగిపోయేవారు. సంస్కృత ఆధ్యాత్మ రామాయణం పరవశయై పాడుతూ ఉంటే వాళ్ళ మనస్సులు ఊగిపోయేవి.
3
రెండేళ్ళకు ఆనందస్వామిజీ మహాతపస్సంపన్నుడై చంద్రశేఖరునిలా హిమాలయ పర్వతం ఎత్తులున్న బండిదిగి వచ్చాడు కాశీపట్టణానికి. తలంతా జుట్టు జడలుకట్టి ఉంది. గడ్డము మీసము పెరిగి ఉంగరాలు చుట్టుకొనిపోయి ఉన్నది. ఆయన ఫాలం దివ్యదీప్తులతో
అడివి బాపిరాజు రచనలు - 8 - 110 - కథలు కిరణాలు వెదజల్లుతూంది. ఆయన జాభ్రాగుడ్డలు చిరిగిపోయి ఉన్నవి. ఆయన ఎముకల పోగు. తిన్నగావెళ్ళి గురుస్వామి యతీశ్వరానందజీ కాళ్ళమీదపడ్డాడు. ఆ మహానుభావుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆశీర్వదించి “వత్సా, నీకు జరిగిన అనుభవం పరాశక్తి చిద్విలాసం సుమా! పడిలేచావు. పాపలోకం కళ్ళార పారకించావు. ప్రారబ్ధం విచ్ఛిన్నమైంది. హిమాలయ గౌరీశంకరశృంగం నీకు పూజాపీఠం అవుతుంది సుమా” అని సెలవిచ్చినాడు.
4
ఇంక రెండునెల్లకు ఒక ఉదయాన్న రామానందలాల్జీ జపం చేసుకుంటూండే వేళ ఎదుట ఆనందస్వామిజీ నిలుచున్నాడు. పండిజ్జి కళ్ళు తెరచేటప్పటికి ప్రత్యక్షమై ఉన్న స్వామిజీని చూసి స్వామిజీని ఆనవాలు పట్టలేక కైలాసగిరి మీద సంచరించే దేవతల్లో ఎవరైనానేమోనని గజగజవణికి పోయాడు. ఆ విగ్రహం అల్లా దివ్యమైన చిరునవ్వు వేయి వాసనలులా ప్రవహింపచేస్తూ నిలుచునే ఉన్నది. పండిజ్జి కళ్ళునులుముకొన్నాడు. శివప్రార్థనా సూక్తాలను వణికే కంఠంతో పఠించుకోడం ప్రారంభించాడు. ఆనం: పండిజ్జి క్షేమమా మీకు? రామానందలాల్జీ ఆ గొంతుక ఒక క్షణంలో ఆనవాలు కట్టాడు. “స్వా.... స్వా... మిజీ!" “అవును! హిమాలయ పర్వతాలల్లోంచి బయలుదేరి కాశీలో గురుదర్శనం చేసికొని మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళే ముందు మీ దర్శనం చేసుకొందామని ఇల్లా వచ్చాను.” “ఒక ఉదయాన్ని... ఆనందస్వామిజీ నిలుచున్నాడు” మొదట జనించిన ఆశ్చర్యభావం మాయంకాగా మిగిలిన మహాకోపంతో పండిజ్జి “నా కూతురుకోసం కాదుకదా!” “పండిజ్జి! భగవంతుడు నన్ను మీమ్ములనందరినిన్నీ రక్షించాలి మహాపాపంచేశాను; అనుభవించాను. “మహాపాపం చేశావు! అనుభవించావు! ఏమి అనుభవించావు? నువ్వు సన్యాసివా, సన్యాసివా? నీబోటివాళ్ళవల్ల మతానికి అపఖ్యాతా?ఛీ, రాక్షసికొడకా, నువ్వు మనుష్యుడవా? నా ఎదుటనుంచి లేచిపో, నీ చితికేయగలను.” స్వామిజీ చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. "పండిజ్జి, నేను మీ విషయంలో సలిపిన ఘోరదోషం. ఎట్టి శిక్షకైనా నన్ను పాత్రుణ్ణి చేసింది. మీ ఇష్టం వచ్చినట్లు నన్ను శిక్షించి నన్ను పాపం నుంచి విముక్తుంచేస్తే నేను తమకు సర్వకాలం కృతజ్ఞుణ్ణి.” "ఛీ ఛండాలుడా! నువ్వు నా ఇంట్లోంచిపో! నీ బుఱ్ఱ వేయిముక్కల కింద కొట్టేస్తా”నని మహారౌద్ర స్వరూపంతో ప్రక్కనున్న కర్రపుచ్చుకొని లేచి స్వామిజీవైపుకు దుమికాడు. స్వామిజీ తలవంచినాడు. రామానందలాల్జీ కాళ్ళు ఎవరో పట్టుకొని లాగినట్లయింది. రామానందలాల్జీ తలవంచి చూచునప్పటికి అతని ప్రియ దౌహిత్రుడు, పెంపుడు కుమారుడు పాకుతూవచ్చి “దాదా?” అని ముద్దుమాటలతో చేతులు చాచినాడు.
అడివి బాపిరాజు రచనలు - 8 + 111. కథలు రామానందలాల్జీ భార్య భర్తగారికోపం మాటలు విని ఏమిటా అని వంటింటిలోంచి పరుగునవచ్చింది. నిరుపమాదేవి తపస్సు చాలించుకొని తండ్రి మాటలు విని అచ్చటకు వచ్చింది. స్వామిజీ కనులుమూసుకొని తలవంచి అట్లనే నిలుచుండిపోయినాడు, అట్లనే సమాధిలో తన్మయుడై పోయినాడు. అతని ముఖాన్నుంచి వేయి వెలుగులు ప్రసరించినవి. అక్కడ నిలుచున్న వారందరికీ దివ్యసంగీత శ్రుతి వినవచ్చింది. తన గురువు, తన భగవంతుడు స్వామిజీని చూచి నిరుపమాదేవి పులకరించి మైమరచి, ఆయన పాదాలకడ సాష్టాంగపడింది. పెట్టింది. నిరుపమాదేవి తల్లి మేలిముసుగు సవరించుకొని తలవంచి స్వామిజీకి నమస్కారం స్వామిజీ దేహాన్నుంచి ఉద్యత్ చంద్రకోటి ప్రభాకాంతమైన వెలుగు ఆవిర్భవించి ఆ మందిరాన్ని నిండి, గోడలలోంచి ప్రసరించి, విశ్వమంతా వెలిగించింది. రామానందుని చేతులోంచి కఱ్ఱ కిందపడి పోయింది. అతని మోకాళ్లు పట్టువీడి పోయినవి. భూమిమీద కూలబడి "ప్రభూ, క్షమించు" అంటూ స్వామిజీ పాదాలకడ మూర్ఛపోయినాడు. స్వామిజీ ఆ మహదానంద సమాధిలో నిలుచునే ఉండిపోయినాడు. “శివోహం! శివోహం!" హిమపూరిత శృంగాలు, ఎత్తయిన పర్వత సానువులు, నందనవనంతో తులతూగే లోయలు, సువాసనలు వెదజల్లే విచిత్ర పుష్పలతలు, వివిధ శాద్వలజాతులు, వృక్షాలు, దేవదారువులు, నిర్మల నీలాకాశం హిమపాతాలు రంగురంగుల కలయికలు తెలుపు, నీలం. ఆ దేవ పర్వతంలోనికి చొచ్చుకు పోతున్నాడు ఆనందస్వామిజీ. ఆ హేమంత పవిత్ర దినము పరమ నిర్మలమై, నిశ్చలయై వెలిగిపోతున్నది. “పరమేశ్వర స్వరూపమైన ఈ మహాపర్వత పంక్తి లోకానికి తపోభూమి, అన్ని మతాలవారు ఇక్కడ ముముక్షువులు కావలసిందే. ఓహో పర్వతేశ్వరా, నీరశ్మి లోకహృదయాన్ని కాంతితో నింపి పులకరింపిస్తున్నది. శివోహం, శివోహం" అనుకుంటూ ఆనందస్వామిజీ అగమ్యమైన ఆ పర్వత భూమిలోకి చొచ్చుకుపోతున్నాడు. “శివోహం! శివోహం!! శివోహం!!!" “కదా ద్వైతం ప్రశ్యన్నఖిలమసి సత్యం శివమయం మహావాక్యార్ధాన మవగతిసమాఖ్యానవశతః; గతద్వైతాభావ శ్శివశివశివే"త్యేవ విలపన్ మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమా.
అడివి బాపిరాజు రచనలు - 00 8 112. కథలు గోదావరి సుడులు
వరదలు కట్టి ప్రవహిస్తున్న గోదావరిలో సుడిగుండాలు తిరుగుతూన్నట్లు రామమూర్తి హృదయంలోనూ ఆవేదనలు సుడులు చుట్టుతున్నాయి. 15 ఆగష్టు, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశపు అవతార పురుషుడు, తేజస్వరూపుడు, ప్రేమమూర్తి విశ్వంలో లీనమైపోయినాడు. 15 ఆగష్టు, 1948లో స్వతంత్రోత్సవం కూడా జరిగిపోయింది. కాని ఈ దుర్భరావేదన మాత్రం తప్పటంలేదు, తాను రాజమహేంద్రవరం నుంచి అయిదేంద్లు క్రిందట హైదరాబాదు రాష్ట్రంపోయి నిజాం ప్రభుత్వం వారి పబ్లిక్ వర్చు శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం ఖాయమైంది. ప్రభుత్వంవారు జీతం కూడా హెచ్చించారు. తాను శక్తి వంచన లేకుండా ప్రభుత్వానికీ, ప్రజలకు సేవచేస్తున్నాడు.
ఆ జిల్లాలల్లో తిరిగేటప్పుడు రామమూర్తి ఆనందం వర్ణింప అలవి కాకుండా ఉండేది. ఇంకా మొగలుకాలంనాటి ఆచారాలే సంస్థానంలో ఉండడం చేత అతడు ఉన్న ప్రదేశంలో అతడే మహారాజులాగుందేవాడు. తనకు గవర్నరంత హోదా, ప్రజల (బ్రతుకు, పంటల బ్రతుకు తనచేతిలో ఉండెను దేశముఖులు, వతందార్లు, మక్తాదార్లు, కౌలుదార్హు, పెద్ద రైతులు. షావుకార్లు, పఠేలు - పట్వారీలు, పోలీసు ముంతజింలు - అందరూ తనకు 'అదాబర్జొ చేస్తూ, తన్ను గౌరవిస్తూ అందలం ఎక్కించేవారు. పుష్కలంగా సఫ్లయిలు, జేబులనిండా బహుమతులు. తన జీవితం వోయిగా జరిగిపోయింది.
రామమూర్తి ఓవర్శీర్ పరీక్ష ప్యాసయినా కొంచెం రసజ్ఞుడు. హైదరాబాదు సంస్థానం లోని కొండలు, నదులు, సెలయేర్లు, చెరువులు అతని కెంతో ఆనందం కలుగజేసేవి; జీవితాలు ప్రవహించిపోవడం నదుల నడకలలో, జీవిత సత్యస్థిరత్వం కొండలస్థాణుత్వంలో, బ్రతుకులోని ఆనంద నృత్యం సెలయేటి జలజలలో, మనుష్యుడు కల్పించుకున్న సౌఖ్యాలు తెలంగాణపు చెరువులలో అతనికి గోచరించేవి.
సాధారణ ప్రజలు గర్భదారిద్ర్యంలో ఉండి దేశముఖులకు బానిసలులా మెలుగుతూ ఉన్నా -.వారా కష్టాలలో నుండి జీవితం శుచిగా ఉంచుకుంటూ బురదనుండి పైకిప్రసరించి వికసించే నీలి కలువపూవును చేసికుంటూ, పాటలు పాడుకుంటూ, తమకు తెలియని ఏదో ఒక స్వర్ణయుగం కోసం ఎదురుచూస్తూ ఉదయాస్తమానాలు ఒక దివ్యరాగంతో కలుపుకుంటూపోతున్నారు. ఆ తెలంగాణ, మరాఠ్వాదా, కర్టాటక ప్రజలు స్వాతంత్ర్యం అంటే ఎరుగరు. “దొరా! నీపాదాలకి మొక్కుతా” అంటారు. అన్నా ఆ మాటల వెనక తాము ఆహుతిచ్చే ఆత్మార్పణ అతనికి దృశ్యమయ్యేది. అతడు నిట్టూర్పు విడుస్తోనే గుఱ్ఱంస్వారీ చేసుకుంటూ అవతలి మకాంకు వెళ్ళిపోయేవాడు. ఈ ఆలోచనలు రాజమహేంద్రవరపు గోదావరి గట్టుమీద కూర్చున్న రామమూర్తి హృదయంలో నుంచి ప్రవహించి గోదావరి వరదల సుడులలో లీనమై పోతున్నవి.
2
రామమూర్తి ప్రభుత్వోద్యోగి అని తెలిసి ఉండి కూడా రాక్షసుల లాంటి రజాకార్లు అతని ఇంటిమీదపడి దోచుకున్నారు. అందాల ప్రోగైన అతని భార్యను వాళ్ళు పట్టుకోబోయే సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో ఒక కమ్యూనిస్టుల గుంపు ఆ రజాకార్ల పై విరుచుకుపడింది. రజాకార్లు రామమూర్తి ఇల్లు దోచడం మాని కమ్యూనిస్టులను ఎదుర్కోడానికి పరిగెత్తారు. వృశ్చిక రోముడుకూ - సర్వరోముడుకూ యుద్ధం జరిగినట్లు జరిగింది. రామమూర్తి ఆ గడబిడ సమయంలో, కొందరి గ్రామ ప్రజల సహాయంతో, ఊరుదాటి అడవి రుప్పలంబట పడి గ్రామాల అంచలు దాటుకుంటూ, గోదావరి యొడ్డుకు వచ్చి ఓ కోయ జట్టు సహాయంతో భద్రాచలం చేరుకున్నాడు. - దారిలో అతడూ అతని భార్యా పడిన పాట్లు రామాయణంలోని అరణ్యకాండ అంత గాథ అయింది. ఎలాగో నానాకడగండ్లుపడి రాజమండ్రి చేరుకున్నారు. ఇంటిదగ్గర పెద్ద సంసారం. తాను హైదరాబాదులో ఓవర్సీరై బాగా సంపాదిస్తూ ఇంటిదగ్గర తమ్ముళ్ళ చదువు చెప్పిస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, తన అక్క చెల్లెండ్రను పురుడూ - పుణ్యాలకూ ఆదరిస్తూ డబ్బు పంపించేవాడు. ఇంతటితో ఆటవిడుపు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాదుకు స్వాతంత్ర్యం లేదు; తనకు దిక్కులేదు. తాను తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి వీలులేదు. తనకు స్వతంత్ర భారతంలో ఉద్యోగంలేదు. తాను ఓవర్సీర్ ఉద్యోగం చేస్తూ సంపాదించిన పెళ్ళాం మెళ్ళో నగలూ, వెండి సామానూ ఖర్చయిపోయింది. భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు; మద్రాసు ప్రభుత్వానికి గూడ దరఖాస్తు పెట్టుకున్నాడు. తన దరఖాస్తులు శుష్కలంగా తిరిగి వచ్చాయి. గోదావరి సుళ్ళు చుట్టుకుంటూ ప్రవహించిపోతోంది.
3
గోదావరి చల్లని తల్లి. తాను చిన్నతనంలో, రాజమహేంద్రవరంలో చదువుకొనే రోజుల్లో వేసం కాలపు గోదావరిని ఆవలికి ఈవలికీ ఈదుతూ దాటేవాడు. కరుణామయి అయిన ఆమె హృదయం పైన తేలిపోయేవాడు. ఆమె నీలనీరగంభీరాలలో మునిగితేలుతూ ఉండేవాడు.ఈ గోదావరితల్లి నీటిని ఉపయోగించుకునేందుకు తనకు భూమన్నా లేదు. తాను పరీక్షప్యాసయిన కొత్తదినాలల్లో మదరాసు రాష్ట్రంలో ఉద్యోగమే దొరక్కపోయింది. తాను బ్రాహ్మణుడనై పుట్టడం దౌర్భాగ్యమైంది. తెలంగాణలో కులం తేడాలు లేవు. గోదావరి తల్లికి కులం తేడాలు లేవు. హీనుడైన మనుష్యునికే కులం తేడాలూ: మతం తేడాలూను.
అడివి బాపిరాజు రచనలు - 8 +114 + కథలు అవమానదగ్ధులైన వారిని, అహంకారులను ఆనందమయులను, విచార మేఘావృత జీవులను, కోటీశ్వరులను, నిరుపేదలను, భూకామందులను, నిరుపేద పొలం కూలీని సరిసమాన ప్రేమతో ఈ కన్నతల్లి తన గర్భాన దాచుకొని ఊరడించగలదు. అతడు ఎత్తయిన ఆ గట్టుపైన నిలబడి నెమ్మదిగా నీటి దగ్గరకు పోయాడు. చొక్కా, కండువా తీసి పైనబెట్టాడు. వరదకు కొట్టుకువచ్చే పుల్లలను పోగుజేసుకొనే ముసలమ్మనూ, పిల్లలను వత్తిగించుకుంటూ నీటిలో దిగాడు. మహాత్ముని తలచుకుంటూ ఒక్క ఉరుకు ఉరికాడు. ఆ వేగంతో చాలాదూరం నీళ్ళల్లోకి పోయిన అతని మూర్తిని గోదావరి తల్లి తన చేతులతో కప్పింది. కాని ఈత ఎరిగిన యువకుడవడంచేత ఆమెకూడా తనలో లీనం చేసుకోలేకపోయింది. ఆ ముసుగులో గర్భవతియైన అతని భార్యా ముదుసలులైన తల్లిదండ్రులూ అతని హృదంతరాలు ప్రత్యక్షమయినారు, బాపూజీ! క్షమించమంటూ ఈదుకుంటూ వడ్డుకువచ్చి, మెట్లెక్కి తన కండువా తీసికొని తల తుడుచుకుంటున్నాడు. ఇంతల్లో గబగబా పరుగెత్తుకుంటూ తన తమ్ముడక్కడకు వచ్చాడు. “నీవు గోదావరి గట్టున ఉంటావని వదిన చెప్పడం వల్ల నీవు సాధారణంగా కూర్చుంటావని ఇక్కడకు వచ్చాను. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. నిన్ను రామపాదసాగరం ప్రాజెక్టులో ఓవర్సీరుగా చేయించగలిగేనని శొంఠి రామమూర్తిగారు నీకు టెలిగ్రాం యిచ్చారు. నీకు రేపో, ఎల్లుండో ఆర్డర్లు వస్తాయట. ఇదిగో టెలిగ్రాం.” రామమూర్తికి కళ్ళనీళ్ళు తిరిగాయి. గోదావరి వరద ప్రవాహాలు సుడిగుండాలు తిరుగుతూ వెళ్ళిపోతున్నవి. అడివి బాపిరాజు రచనలు 8 ◆ 115 - కథలు
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2025, prior to January 1, 1965). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse