అడవి శాంతిశ్రీ/సప్తమ భాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సప్తమ భాగం

భయంకరమూర్తి

ఆమె దేశికుడు యుద్ధమనివార్యమని శాంతిశ్రీని ఒప్పింపజూచినా ఆమె హృదయమో, బుద్ధియో ఏదో ఆ వాదనలకు లోబడలేదు. ఆమెలో హృదయముందని ఆమెకు తెలియదు. ఇతరులకునూ ఆ హృదయము వ్యక్తము కాలేదు. ఆమెకు స్వప్నాలు లేదు. పులకరింతలులేవు. తన్మయత్వము లేదు. ఒళ్ళు ఝల్లుమనే ఆనందంలేదు. ఆమె సౌందర్యం అరవిచ్చిన పారిజాతసుమము. ఆ సుమములో పరీమళములు మాత్రం విరియలేదు. ఇప్పుడా బాలిక గురువు మాటలను తలపోస్తూ ఉంది. ఆ రాత్రి నిద్రపట్టలేదు. తన మెత్తని పల్యంకముపై మేను చేర్చిన మరుని మేషముంలో గాఢనిద్రచే మైమరచే ఆ బాలిక పక్కపై ఇటూ అటూ దొర్లసాగింది.

ఆ తరువాత కన్నులు పూర్తిగా తెరచి ఆలోచనలు లేని ఆలోచన పథంలో విహరింపసాగింది. ఆమె ఏకసంతగ్రాహి. అలవోకగా విన్న పాటలు, గాథలు గూడా ఆమె మరచిపోదు. ఈనాడు ఆ పాటలు ప్రతి మలుపులో ఆమెకు ప్రత్యక్షం కాసాగినవి. ఒకనాడు ప్రతీహారిణి ఒకర్తు తాను ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా తన్ను గమనింపక ఒక పొదరింటి నీడలో కూర్చుండి పాట పాడుకొంటూ ఉంది. పొద ఈవల పక్క నుండి ఆ పాట తాను విన్నది.

“నారాజు పెదవులెంతో రంగుకలవీ
                   నా పెదవి
 గారాల ముద్దులా కరిగించ గలవీ!”

ఒకరి పెదవులతో ఇంకోరి దేహం స్పృశించడం ముద్దు అని వాత్స్యాయన సూత్రాలలో ఉన్నది. తన్ను చిన్నతనంలో తల్లిదండ్రులు బుగ్గపై, నుదురుపై, తలపై ముద్దులు పెట్టుకునేవారు. అవి వాత్సల్యాత్మక చుంబనాలట! కాని స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు గాఢానురాగం కలవారయినప్పుడు ఒకరిపెదవులు ఒకరు చుంబింప వాంఛింతురట. స్త్రీ పురుషులలో కాక గాఢానురాగ ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? తనకు ఆనాటి తల్లిదండ్రుల ముద్దులు ఏమీ ప్రయోజనం లేనివిగా కనిపించాయి.

ఎందుకా ముద్దులు? ఏమిటా ముద్దులు?
    ఇప్పుడు తనకీ అలోచనలేమిటి?
“నారాజు తనెదకు నను చేర్చి అదిమికొనె
నా ఒడలు పులకించి నన్ను సిగ్గులుముంచె"

సిగ్గు అంటే తనకు అర్థంకాలేదు. లజ్జావతి, త్రపాపూర్ణ అని బాలికలను సంబోధిస్తారు. అది భయమా? సంకోచమా?

“నారాజు స్తనవల్కలము పాయగాజేసి
 హారాలు చిక్కుపడెనని వాని సరిచేసే"

సరిచేయడంలో ఏముంది? పాటలో రచింపవలసిన వైచిత్య మేమి కలదు?

“నా ఒళ్ళు ఝల్లుమనే నాకళ్లు అల్లుకొనె
 నా ఎడద ఫెళ్ళుమనె నా కోర్కెలుల్లసిలె"

ఏమిది ఈ అల్లరి, ఈ ఝల్లుమనడము? ఈ ఆలోచన రాగానే ఆమెకు ఏదో వివశత్వము కలిగింది. కణతలు వేడి ఎక్కినవి. ఎప్పుడూ ఆకాశాభిముఖియై గుండెపైని చేయినిడి నిదురపోయే ఆ బాలిక భయంతో ఒక్కసారి బోర్లగిలపడి హంసతూలికలుగల వెన్నమెత్తని పరుపునకు గాఢంగా హత్తుకొన్నది. మనస్సులో తళుకు, ఒళ్ళు ఝల్లుఝల్లుమని జలదరించింది. ఏదో మత్తు ఆవహించింది. హృదయంలో ఏదో బాధ. ఆ బాధ తీర్చడానికై తన చిన్నారి బంగారు వక్షోజాలను ఉపధానానికి ఒత్తుకున్నది. ఆమె కన్నుల నీరు తిరిగింది. ఆమె చటుక్కున లేచి త్వరితముగ వాతాయన మార్గముకడకు పోయి మత్తుగా వీచు వసంత మందమలయానిలాలను గుప్పున పీల్చుకొన్నది. ఆమెలో ఆవేదన ఎక్కువయినది. శరీరాంగములు పొంగిపోతున్నవి. కఠినమయిన వాతాయనశిల్ప ఫలకాలను తన హృదయమునకు హత్తుకున్నది, ఇంకను చెంపలు వేడి ఎక్కుతున్నవి. ఒడలు జల దరిస్తున్నది. రోమాంచిము శరీరమంతా విద్యుల్లతవలె ప్రాకిపోతున్నది.

ఆమె మందిరములో నిలువలేకపోయింది. పరుగు పరుగున మందిరాలు దాటి తన ఉద్యానవనంలోనికి పారిపోయి చంద్రశిలా నిర్మిత మయిన కేళాకూళికడ మెత్తని పచ్చికపై వాలిపోయింది. ఏమిది? తనకు దయ్యము పట్టినదా? ఆమె ఆ చల్లని పచ్చికపై దొర్లినది. లేచి ఇన్ని తెల్లనిపూలు మల్లెపొదలనుండి పుణికినది. అవి కన్నుల కద్దుకొన్నది. ఆమెకు ఆవేదన మరీ అధికమయినది. “అబ్బా ఏమిటీ బాధ భగవాన్ పరమశ్రమణకా!” అని అవ్యక్తంగా ఎలుగెత్తి అరచినది. ఎట్టఎదుట బ్రహ్మదత్తుడు తోచినాడు, అతడా? “గురూ! గురుదేవా!” అని ఆమె చుటుక్కున లేచి నిలుచున్నది ఆమెకు ఏదో శాంతి ఆవహించింది. “మీకొరకే ఎదురు చూస్తున్నాను ప్రభూ!” అని ఆమె తలవాల్చింది. ఏదో నిశ్శబ్దము, ఏమిటా నిశ్శబ్దమని ఆమె తలఎత్తినది. అక్కడ బ్రహ్మదత్తుడు లేడు.

(2)

ఎప్పుడు శాంతిశ్రీకి బ్రహ్మదత్తచ్ఛాయ గోచరించిందో ఆ బాలిక కేదో అద్భుతమైన పరమశాంతము సన్నిహితమైంది. ఆమె మోము ఆరుణార్ద్రా రాగపూర్ణమైనది. కాకలీకంఠంతో ఆ బాలిక జ్ఞప్తికి వచ్చిన పాట పాడుకుంటూ భవనంలోనికి నడచివచ్చింది.

“ఇది ఎంతచిత్రమే
 మదవతి పవిత్రమే
 నా హృదయ రమణుడే
 రచింయించే ఈ ప్రతిమ

        ఆ మూర్తి పోలికలు
        ఏమానినిలో తోచు
        ననుచూచి నవ్వెదవు
        నాతీ నేనేమంటి?
ఆ చిత్రమూర్తిలో
తోచు నా బింబమని
ఏల ఊహింతువే
మేల మెందుకె నాతో
        నాదు ప్రతిబింబాన
        నన్నుమించెను సొగసు
        సుంతైన నేగాను
        సుందరమె ఆ మూర్తి !"

ఏమిటీ ఈ పాటకర్థం? నేను నా గురుపు హృదయంలో చిత్రింప బడలేదు గదా? ఇదేమి పిచ్చిభావము? హృదయంలో చిత్రమేమిటి? ప్రణయవశులగు యువతీ యువకుల హృదయాలలో పరస్పరమూర్తులు చిత్రితమవుతాయట. ఆ చిత్రాలు ఉత్ప్రేక్షలట. ప్రకృతిలోని వంకరలు చిత్ర కారుడు దిద్ది శ్రుతి చేస్తాడట. స్వరశ్రుతిసమ్మేళనం చేసి సంగీతతపస్వినీ తపస్వులు ప్రకృతి ధ్వనులలో నుండి గాంధర్వం ఉద్భవింపచేసారట. సంగీతమేమిటి? చిత్రలేఖనమేమిటి? కవిత్వమేమిటి? అవి కాముని చేతి ఆయుధాలు. వీనివల్ల జగజ్జీవి వంచితుడౌతాడేగాని, అవి ఉత్తమ నిర్వాణ సాధనా లెట్లా అవుతాయి?

కాని ఒక్కసారిగా ఈ దినమున అవి తనకు ఎదో ఆనందం కలుగ జేస్తున్నాయి. ఆనందం అంటే పులుపు అంటే తీపి అంటే అనుభవించినవారే తెలుసుకుంటారు. ఈ దినాన పాటకై తన హృదయం? పొద్దుపొడుపు పూవులా తిరిగిందే. ఆ నిండుజవ్వనికి ఏమీ అర్ధం అవటంలేదు. ఆమె తన భవనంలోకి వెళ్ళడం మానివేసింది. భయపడిన హరిణిలా అంతా కలియచూచింది. ఈ పది నిమేషములలో మబ్బుకప్పిన చంద్రుని వెన్నెలలా ఆమె శాంతి మాయమయింది. ఆ బాలికాహరిణము ఇటూ అటూ చూసింది. కళ్ళు చెదిరినాయి. అపరిచితమయిన ఒక నూత్న స్పందనము దిశలనుండి తుంపరలు కురుస్తున్నది. ఆ అనుభూతి సుఖమా, దుఃఖమా? ఆమె తన్ను తాను మనోదర్పణంలో చిన్నబిడ్డలా చూచుకొన్నది.

లోకంలో ఆనందం వెన్నెలలా ప్రతివస్తువునూ స్పృశిస్తుంది అన్న సత్యం ఆమెకు గోచరించింది. వెన్నెల స్పృశించిన వస్తువు వేరు, వెన్నెలలో ఉన్న వస్తువు ప్రక్కల, అడుగున చీకటి ఉండుగాక. ఆ చీకటికి నీడ అని వేరే అర్థం వస్తుంది. ఆ వెన్నెలకున్న వ్యక్తిత్వంవలెనే నీడకూ వ్యక్తిత్వం వస్తుంది. బ్రహ్మదత్తప్రభువు తనకు చంద్రుడా? అది ఏమి వెఱ్ఱి ఆలోచన అని ఆమె అనుకుంది. ఇలా ఆమె మనస్సులో అనుకోవడం ఎవరూ వినలేదు కదా? ఆమె నలుదిక్కులు పరికించింది. ఇదీ అర్థంలేని ఆలోచనే. ఈ ఆలోచన ఎందుకు కలగాలి? అంతఃకరణ ప్రవృత్తులే లేని ఆ బాలిక జీవిత ప్రదేశానికి చిత్తవికార మహానది పొంగి వరదలు పొర్లి వచ్చినట్లు, విరుచుకు పడినట్టు, నెమ్మదిగా ప్రవహించినట్టు వస్తున్నది. ఉన్నట్టుండి ఒక దినం తన తండ్రి మహాసభలో పాడిన ఒక మహాకవి పద్యము ఆమె ఎదుట తోచినది.

“ప్రేమ అన్నది ఒకదివ్య ధామమగును
 ప్రేమికు లనిమిషులు వారి వీక్షణములె
 తపము, చుంబనములె అమృతము, బళిర
 అద్భుతాలింగనమె వారి యజ్ఞఫలము"

ఈ పద్యము చదువుకొని ఆమె తెల్లబోయింది. తెరవెనక నర్తకిలా భావము వ్యక్తావ్యక్తమై ఆమెకు తోచినది. ఆమె “బ్రహ్మదత్తప్రభూ! ఈ ఆవేదనాపూర్ణాలయిన సంశయాలను మీరే పరిష్కరించాలి” అనుకొన్నది వెంటనే ఆమె హృదయము అతివేగంగా స్వనించినది. ఆమె కేదియో ధైర్యము కలిగింది. ఆమె తన భవనంచేరి అంతఃపుర రక్షకురాలిని పిలిచింది.

“నువ్వు మన అంగరక్షకదళములు రెంటిలో ఒకటి సిద్ధం చేయించు. భవన రక్షకదళాలు మూడింటిలో రెండు సిద్ధంచేయించు. రథాలు, ఏనుగులు మహారాజుగారిని నే నర్జించినట్లు వారికి ఇదిగో నా చిటికెనవేలి ఉంగరము ముద్రవేసిన అభ్యర్ధనము కొనిపో! రేపు ఉదయం మన చిన్నసైన్యం ప్రయాణానికి అనుమతికోరు. పులమావితో యుద్ధానికిపోయిన మనసైన్యాలను, ముఖ్యంగా మా గురువుగారిని, కలుసుకోడానికి వెడుతున్నానని వారికి మనవిచేయి” అని ఆ బాలిక మహాసామ్రాజ్ఞిలా ఆనతి ఇచ్చింది. చిన్నతనాననుండీ ఆ బాలికను తల్లిలా పెంచిన ఆ అంతఃపుర పాలకురాలు తెల్లబోయి “చిత్త” మని మాత్రమనగలిగినది. శాంతిశ్రీ తన విద్యామందిరము లోనికిపోయి చిరునవ్వు నవ్వుకొంటూ అప్పుడప్పుడు ఆశువుగా,

“యుద్ధమేమిటి వ్యూహమేమిటి?
 యుద్ధమున మారణము లెందుకు?
 శత్రువేమిటి మిత్రుడేమిటి
                     జీవజాలములో?
“విజయ మెందుకు ఓట మెందుకు?
 విజయ మొందగ సైన్యమెందుకు?
 సైన్య ముఖమున రథములెందుకు
                     అశస్త్రాలున్?
“చంపువా డెవ్వండు? వానికి
 చంపబడు నావీరవరునకు
 చావునకునూ బ్రతుకునకునూ
                   భేద మేముందో?
“గురువొక్క డే తీర్చగల డీ
 బరువెక్కిన హృదయ వేదన,
 నరునిపొదివిన కష్టజాలము
                   కర్దమేముందో?”

3

యుద్ధం ముగియ సమయం సూర్యాస్తమయం. యుద్ధం ఆపే విరామ కాహళాలు మ్రోగినవి. ఇక్ష్వాకులు వ్యూహరచన నిపుణతవల్లా, యుద్ధాన వారు చూపిన నేర్పువల్లా పులమావి సైన్యంలో పదివేలమంది సైనికులు, రెండువేలమంది అశ్వికులు నశించారు. ముప్పదిఅయిదు కథాలు నుసి నుసి అయిపోయాయి. పదిహేను ఏనుగులు పర్వతాలు కూలిపోయినట్లు కూలిపోయాయి. ఘోరాపజయం అయినట్టు సిగ్గుపడి పులమావి సైన్యాలను వెనుకకు నడిపించుకుపోయాడు. శిబిరాలను చేరి పులమావి తన ముఖ్య సైన్యాధిపతిని పిలిపించి ఆలోచన ప్రారంభించాడు.

“మనం ఈ దినాన ఓడినట్టేకదా?” పులమావి హేళనగానూ కోపం గానూ ప్రశ్నించాడు తన సేనాధిపతిని.

“మహాప్రభూ! జయాపజయాలు ఒకదినం యుద్ధాన్ని పురస్కరించుకొని చెప్పలేము కదా ?”

“వేదాంతమా మీరు మాట్లాడేది?”

“మహాప్రభువులు వేళాకోళం చేస్తున్నారు. అన్నదాతలకు నామనవి ఇది-మన సైన్యాలకు సంఖ్యాధికం ఉన్నది. మన సైన్యాలలో మగటిమి గల వీరు లనేకులున్నారు. మొదటిదినం కొంచెం మనకు నష్టము ఎక్కువ అయిన మాట నిజం. దినదినమూ మనకు కలిగిన నష్టాలచే సగంసేన నష్టమయినా ఒక వారం దినాలలో ఇక్ష్వాకు సైన్యాలు నాశనం కావా ప్రభూ!” |

“ఎంత చక్కగా ఉన్నది మీవాదం మహాసేనాపతీ!” అని పులమావి వెటకారంగా నవ్వినాడు.

మహాసేనాపతి తెల్లబోయి “నా ఉద్దేశం తమకు మనవిచేసి ఉన్నాను. తమ ఆజ్ఞకు ఎదురుచూస్తున్నాను.”

“పులమావి ఇంక ఆ ధోరణి రాకూడదని అనుకున్నాడు. ” ఇదివరకు యుద్ధాలలో ఆరితేరిన ప్రజ్ఞాశాలి. యజ్ఞశ్రీ శాతకర్ణికడ శిక్షణపొందిన సేనాపతి. తాను బంగారంతో ముంచెత్తి ఈతణ్ణి మహాసేనాపతిగా ఉండడానికి ఒప్పించాడు. ఈతని లోటులేదు.

“మహాసేనాపతీ! మనం ముందుకర్తవ్యం ఆలోచించుకోవద్దా?” పులమావి చిరునవ్వు నవ్వినాడు.

“ముందు ఈ దినంవలె మనంవెళ్ళి ఇక్ష్వాకులను తాకక, వారిపై విరుచుకు పడినట్టు ముందుకుపోయి రెండునూర్ల ధనస్సుల దూరంలో సైన్యాలను ఆపు చేయించాలి. వింటి అమ్ములవారిని ముందుకుంచాలి. సైన్యాలను మూడుభాగాలుచేసి గరుడవ్యూహం పన్నాలి.”

“సేనాపతీ! రేపటి దినం మీరే సంపూర్ణనాయకత్వం వహించి సేనలు నడపండి. మేము మా యుద్ధగజంపై అధివసించి సేనామధ్యస్థులమై యుద్ధ విధానం పరిశీలిస్తూ ఉంటాము” అని పులమావి నవ్వుతూ మహాసేనాపతిని వీడ్కొలిపినాడు.

★ ★ ★

శాంతిశ్రీ మహారాజుకుమారి తన అంగరక్షకులకు తారానికను నాయకురాలి నొనర్చినది. అమెను తన కుడిదిక్కున, యశోదనాగనిక ఎడమదెసను నిలిపినది. ఇరువురు కత్తిసాములో, సాముగరిడీలో, మల్ల ముష్టియుద్దాలలో, ధనుర్యుద్ధంలో అందెవేసిన సుందరీమణులు. ఏ మగవాడైనా వాళ్ళిద్దరితో కత్తియుద్దానికి తలపడడు. వారిరువురకూ భయంలేదు. వారు ప్రాణానికి వెరవరు. రాకుమార్తెను కంటిరెప్పలులా కాపాడుతూ ఉంటారు. కోపం వస్తే ఆడపులులే, ఆనందంగా ఉంటే అందాల అల్లరి పిల్లలు.

తారానిక యశోదనాగనిక గ్రామం వెళ్ళి వచ్చినప్పటినుంచీ నాగదత్త వీరుని తలంపని నిమిషంలేదు. ఆమె కళ్ళలో కాంతి హెచ్చింది. ఆమె వక్షము మరీ ఉప్పొంగి పోతున్నది. ఆమె మూర్తి మరీ అందం తాల్చింది. ఇవన్నీ అంగరక్షకీ నాయిక పరిశీలించి ఈమెకు ప్రేమదయ్యము ఆవేశించింది అని నిశ్చయానికి వచ్చింది. ఈ వీరసుందరి హృదయం చూరగొన సమర్థు డెవ్వడు తల్లీ! అని ఆమె ప్రశ్నించుకొంది. తారానికా, యశోదనాగనికా చాలా స్నేహంగా ఉంటూ ఒక్కనిమేషమైనా ఒకరిని ఒకరు వదల లేకుండ ఉండిరి. పైగా ఈ మార్పంతా యశోదనాగనిక ఊరు వెళ్ళి వచ్చినప్పటినుండీ వచ్చింది. అదీగాక పని విడుపు వచ్చినా యశోద అంతఃపురం వదలి వెళ్ళేదికాదు. ఇప్పుడు తారానిక ఇంటికి పోతున్నది.

యశోదకు అన్నగారొకరున్నారు. అందాలవాడు. మిసిమి వయసువాడు. వీరుడు. బ్రహ్మదత్తప్రభువు అంగరక్షకబలంలో చిన్ననాయకులలో ఒకడు. యశోద ఊరు తారానిక వెళ్ళినప్పుడు నాగదత్తుడు, ఆమె కలుసుకుని ఉంటారు. ఆ విషయం ఎప్పుడు ఊహించుకొందో వెంటనే అంతఃపురాధి కారిణి తారానికను రప్పించింది.

“తారానికా భర్తృదారిక యుద్ధరంగాభిముఖియై వెళుతూ ఉంది. ఆమె చూట్టూ ఉండే ఎనమండుగురు అంగరక్షకురాండ్రలో నిన్ను ముఖ్యనుచేయుమని నాకాజ్ఞ ఇచ్చింది. నీ ఉద్దేశం?”

“అంత అదృష్టానికి నేను తగుదునా? నా ప్రాణాలు పోవాలి. దేవిగారి వంటిమీద ఈగ వాలడానికి!”

“నీ ప్రాణాలు పోయిన వెనుక నువ్వేమి చేయగలవు?”

“నా ప్రాణాలు పోగొట్టుకోను, అమ్మగారిమీద ఈగనూ వాలనివ్వను.”

“అలా ఉండాలిదీక్ష! ప్రణయవిలాసినులు మాత్రం అంగరక్షకురాండ్రుగా ఉండకూడదు. ప్రతిఅంగరక్షకురాలిని నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. ప్రతి బాలికా నిజం చెప్పాలి.”

“చిత్తం.”

“నువ్వు ఎవరినై నా ప్రేమిస్తున్నావా?”

"......................................"

“మాట్లాడవేం?”

“చిత్తం! ప్రేమిస్తున్నానమ్మా!” ఆమె మోము వైవర్ణ్య మొందింది.

“ఎవరిని?"

4

నేను ప్రేమిస్తున్నాను అని తారానిక అనగానే, అంతఃపుర రక్షకురాలు పకపక నవ్వుతూ, “ఎవరిని?” అని ప్రశ్నించింది. తారానిక తలవాల్చుకొని “నాగదత్తుని” అని అస్పష్టంగా పలికింది. “ఎవరా నాగదత్తుడు?” పరిపాలకురాలు బుద్ధశ్రీ మాటలు కొంచెం కటువుగా ఉన్నట్లున్నాయి. “యశోదనాగనిక అన్నగారు. ” తారానిక తలఎత్తి సరే ఏమవుతుందో చూద్దాము అన్నట్లుగా మాట్లాడింది. “అదే నేనూ అనుకున్నాను. సరే నువ్వువెళ్లు. ఏ విషయమూ తర్వాత మాట్లాడుతాను” అన్నది ఆ అంతఃపురపాలకురాలు బుద్ధశ్రీ. తారనిక ఆలోచనా హృదయంతో వెళ్ళిపోయింది. నాగదత్తుని ప్రేమ అంతా ఆమెకు జ్ఞాపకం వచ్చింది. సాల గ్రామంలో జరిగిన వసంతోత్సవపు వేడుకలన్నీ ఆమెకు స్ఫురణకు వచ్చాయి. శైవాలినీప్రాంత విలాసక్రీడ అంతా జ్ఞాపకం వచ్చింది తారానికకు. ఆమె ఒళ్ళు ఝల్లుమన్నది.

నాగదత్తుని ప్రేమ తన్ను సుడిగుండంలా ముంచెత్తింది. నాగదత్తుడు తారానికకు తెలియకుండా తన మేనమామను విజయపురం తారానిక తండ్రి కడకు పెళ్ళిరాయబారం పంపించినాడు. ఆమె తండ్రి గౌతమస్వామి చాలా సంతోషకరమైనదనిన్నీ త్వరలో శుభముహూర్తాన ప్రధానం చేసుకోవలసి ఉంటుందనీ చెప్పినాడు. మేనమామ పూర్ణనాగుడు సంతోషంతో తిరిగి వచ్చి మేనల్లునికీ, బావగారికీ, తన అక్కగారికీ రాయబార ఫలితం వర్ణించాడు. నాగదత్తుని సంతోషానికి మేరలేదు. తల్లీ కొడుకూ, చెల్లెలూ తారానికకు సంతోషం కలిగించే ఒక విచిత్రవ్యూహం పన్నినారు.

తారానిక ఉదయస్నానం నిర్వర్తించి బొట్టుపెట్టుకొంటున్నది. చెంపలకు పుప్పొడి ఆద్దుకొంటున్నది. ఆ సమయంలో నగలమంజూష ఒకటి పట్టుకొనివచ్చి “కాబోయే తన కోడలుకు అత్తగారు ఈ భూషణమందసము బహుమానమట. రేపటినుంచి వసంతోత్సవాలు వస్తున్నాయి. ఆ ఉత్సవాలకు తారానికి వనదేవికావాలి” అంటూ “నీకిమ్మన్నది” అని యశోద గబ గబ వెడలిపోయినది. ఇంతలో నాగదత్తుని అన్నగారి కొమరిత వచ్చి, “పిన్నీ! ఈ చీరెలూ పల్లెలూ మా తాతయ్య తనకు కాబోయే కోడలికని ఇవ్వమన్నారు. ఇవి తీసికో తారపిన్నీ” అని చెప్పి అక్కడ ఆచీనాంబరాలమూట రత్నకంబళి పై ఉంచి పారిపోయింది. కొంతసేపటికి నాగదత్తుని ఆన్న కొమరుడు వచ్చి “పిన్నమ్మా! మరే మా నాన్న ఈ బంగారుకంకణాలు మా మరదలుకు బహుమతి అని నీకిమ్మన్నారు” అని అవి ఆమె ఒళ్ళో ఉంచి తుఱ్ఱుమన్నాడు.

అతడు వెళ్ళడమేమిటి వాని చిన్నతమ్ముడు వెంటనే అక్కడకు వచ్చి “ఇదిగో, తూలు, పిన్నాయీ! మలే మలే! మా బాబాయి ఈ ముత్తాల హాలం తన బారియకు బగుమతిత. నీకేఁబాబాయేఁ ఇమ్మన్నాలు.” తారానికి మెళ్ళో హారంవేసి, “నేను వెల్లుతున్నాను, నన్ను ఒక్కసారి పెత్తుకోవూ! అది మా బాబాయికి ఇవ్వాలిత” అన్నాడు. తారానిక ఆ బాలుని గబుక్కున ఎత్తుకుని హృదయానికి గాఢంగా అదుముకుని ముద్దులతో ముంచెత్తింది. “నన్ను పిన్నాయి పెత్తుకుందోయి” అంటూ పారిపోయాడు. తారానికి ఏమిటో ఆలోచిస్తూ కూచున్నది ఇంతలో వసంతోత్సవపు విందుకు రమ్మదంటూ యశోద వచ్చింది.

“ఇందతా ఏమిటీ యశోదా?” అని తీవ్రంగా అడిగినట్లు అడిగింది.

“ఏమో నాకేమి తెలుసును?”

“తెలియకుండా నువ్వు ఆ నగపెట్టె ఏలాపట్టుకు వచ్చావు?”

“మా అమ్మ చెప్పినట్లు అదిచేశాను.”

“అంతేగాని నీకేమీ తెలియదు?”

“మా మేనమామ విజయపురం నుంచి వచ్చాట్ట!”

“వచ్చి?"

“వచ్చినవార్త విన్పించాట్ట.”

“ఏ వార్త ?”

“వివాహం వార్త!

“ఏ వివాహం ?”

“మా అన్నయ్య వివాహం!”

“ఎప్పుడుట?” గబుక్కున ఆమె గుండెలల్లో రాయిపడింది. మళ్ళీ ఇదంతా తన్ను మాయచేసేడే అని అర్థం అయి పకపక నవ్వు వచ్చింది.

“ప్రధానం త్వరలో అవుతుందట!”

“ఎవరి ప్రధానం!”

“నీ ప్రధానం!”

“నా ప్రధానమేమిటి!”

“నీ ప్రధానమేనట. మీ నాయనగారు మా మాయయ్యచేత శుభవర్తమానం పంపించారు.”

“ఎప్పుడూ?”

“నిన్న సాయంకాలం మా మామయ్య విజయపురం నుంచి రాలేదు మరీ?”

“మా నాన్నగారిని ఎందుకు కలిశారు? ఏలా కలిశారు?”

“మా అన్నయ్య, మా నాన్నగారు ఆలోచించి మా మామయ్యను నీ పెళ్ళి విషయం కనుక్కోడానికి పంపారు!” యశోద పక పక నవ్వింది.

“నా పెళ్ళి విషయం మీకందరికీ అవసరం ఎందుకూ?” తార దొంగకోపం అభినయించింది.

“మా అన్నయ్యకు కాబోయే పెళ్ళానివిగనుక!”

“ఎవరన్నారూ ఆ ముక్కంట?”

“నువ్వు!”

“నేనా?”

“నేనూ!”

“నువ్వా?” “నువ్వూ, నేనూ!”

“ఇదేమిటి?”

“మా వదినకు ఒక ముద్దు” అని తారానికను యశోదనాగనిక గాఢంగా కౌగిలించుకుంది. తారానిక యశోదను కౌగిలించుకొంది.

5

ఆనాటి విషయాలన్నీ తారానికకు జ్ఞాపకం వచ్చినవి. ఆమె మోము ఆనందంతో అరుణరాగ సుందరమై వెలిగినది. ఇంతలో యశోదనాగనిక పరుగున అక్కడకు వచ్చి.

“చిన్న వదినా!
 చిన్నారి వదినా!
 కన్న వదినా!
 కమ్మని వదినా!
 ఏమిటే నువు కలలు కంటావూ
                   వదినా!
 మిలమిలలాడేవూ?"

అని పాడి, ఆడుతూ వచ్చి తారానికకడ వాలింది.

“ప్రియుడు దొరకని బాలికటా,
 బాలిక అందంకూర్చిన విధిటా
                   అటు ఇటు ఆడీ
                   అల్ల రిచేసి,
                   ప్రియుడు ఎక్కడని
               వెదుకుతున్నదటా!"

అని పాడుతూ తారానిక లేచి నాట్యంచేయ సాగింది

యశోద : ఎవరు విన్నా నవ్వి పోదురూ!
         ఎవరు కన్నా తెల్లపోదురూ
         ప్రణయ తాపమున బాదావతీయై
         బాలిక ఒక్కతె నాట్యమాడితే
         ఎవ్వరూ వినినా,
         ఎవ్వరు కనినా

తారానిక : ప్రేమ సంగతీ తెలియని బాలిక
          ప్రేమామృతమును క్రోలని ముగుదా
          ప్రణయవిషయములు మాటలాడితే
          ప్రజలు చూచితె ముక్కునవ్రేలుగ
          ఫక్కున నవ్వుతు పగలబడుదురూ
                       ఎవ్వరూ వినినా,
                       ఎవ్వరు కనినా?

యశోద: బాలిక అవడం ప్రణయం కొరకే
        ప్రణయం తెలియని బాలిక ఉంటే
                 వీరురాలు గంభీరురాలు! అల
                 మారునైనా తూల్చును వాల్చును
                                ఎవ్వరు వినినా,
                                ఎవ్వరు కనినా?

ఇద్దరూ విరగబడి నవ్వుకొన్నారు మంచంమీద దొర్లుతూ ఒకరితో నొకరు మల్లయుద్ధం చెరపుతున్నట్లు, నటించారు. ఆ వెనుక ఇద్దరు లేచి చీరెలు సవరించుకొని, వల్లెవస్త్రములు వయారించుకొని సడలిన స్తనదుకూలాలు బిగించుకొని, రత్నకంబళులపై కూరుచుండి తలకట్లు దువ్వుకుంటూ మాటలాడుకొన ప్రారంభించారు.

“చిట్టివదినా! బోధిశ్రీదేవి, 'యశోదా! నిన్ను తమకు అంగ రక్షకురాలిగా వియోగించుమని భర్తర్తృదారిక ఆజ్ఞ ఇచ్చినారు. అలా ఏర్పాటు చేయకముందు కొన్ని సంశయాలు బాపుకోవాలి. నువ్వు ఏ బాలకునైనా ప్రేమిస్తున్నావా?' అని ప్రశ్నించింది. నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. నిన్నూ ఆ ప్రశ్న అడిగిందా?” అని యశోద తారానిక వంక చూస్తూ అన్నది.

“ఆ, అడిగింది. వదినా! అడిగితే అవునని నిజం చెప్పేసి ఊరు కొన్నను.” తారానిక ఇటూ అటూ పరికించి మరీ చెప్పింది.

“మా అన్నయ్యను ప్రేమిస్తున్నాననే చెప్పితివా ?”

“ఆ!”

“అప్పుడేమంది బోధిశ్రీదేవి?”

“ఏమంటుంది? ఆలోచించి చెబుతానంది.”

“ఎప్పుడూ?”

“ఎప్పుడా? ఆ తర్వాతనట! నువ్వు ఆమె ప్రశ్నకు ఏమి ప్రత్యుత్తరమిచ్చావు?”

“నేను ఎవ్వరినీ ప్రేమించటంలేదని, నీవూ మా అన్నయ్య ప్రేమించుకోవడం తెలుసుకుని, అడిగిందేమో ఈ ప్రశ్న!”

“అయితే కావచ్చును. ఈమె మనిద్దరినే అడిగిందా? అందరినీ ఈ ప్రశ్న లడిగిందంటావా?” అని తారానిక ఆలోచనాధీనయై ప్రశ్నవేసింది.

“ప్రేమిస్తే అంగరక్షకత్వానికి అడ్డంవస్తుందని కాబోలు!"

ఇద్దరు బాలికలూ ఏదో ఆలోచనలో మునిగినారు. ఒక విఘటిక గడచినవెనుక యశోదనాగనికను చూచి తారానిక “వదినా! నేను పోయి రాజకుమారి దర్శనం చేసుకుంటాను. ఆమెతోనే మాట్లాడుకుంటాను” అన్నది. యశోదనాగనిక “సరే వెళ్ళిరా! నేను నాగదిలో కూర్చుని ఉంటాను. మన వంతు తరువాతకదా వచ్చేది” అంటూ తన గదిలోనికి వెళ్ళిపోయింది.

తారానిక వెళ్ళి రాజకుమారి దర్శనం అర్థించింది. రాజకుమారి రావచ్చుననీ అనుమతి ఇచ్చింది. తారానిక వెంటనే లోనికిపోయి రాజకుమారి పాదాలకు నమస్కరించి నిలుచున్నది. “భర్తృదారికా! నేను తారానికను తమ అంగరక్షకురాలిని!”

“అవును నిన్ను ఎరుగుదును, నువ్వు బ్రహ్మదత్తప్రభువు అంగరక్షకులలో ఒకరైన నాగదత్తుడు అనే యువకుణ్ణి ప్రేమిస్తున్నావని, మీ వివాహం వైశాఖమాసంలో కావచ్చునని విన్నాము, నిజమేనా?” అని శాంతవదనంతో ఏ భావాలు వ్యక్తంగాని చూపులతో రాజకుమారి శాంతిశ్రీ ప్రశ్నించింది.

“చిత్తం !”

“సరే నీవు రావచ్చును.... వెళ్ళు - పాలకురాలికి ఆజ్ఞ ఇత్తును.”

తారానికి సంతోషంతో వంగి రాజకుమారి పాదాలంటి వెడలిపోయింది. ఆమె ఉప్పొంగిపోయింది. ఎంతవిచిత్రము.... పురుషుని పేరయినా తలవని ఈ బాలిక, నిర్వికారవర్తనఅయిని ఈ దేవి తనకు అనుమతి ఏలా ఇచ్చినది? నిరుడు వసంతోత్సవాలలో బ్రహ్మదత్తప్రభువు ఈ బాలికను రతీదేవిగా ఎన్నుకుంటే విచారంతో కుంగిపోయింది. అదివరకు విచారమూ ఎరుగదు, కోపమూ ఎరుగదు, దయా ఎరుగదు. అంతఃకరణ ప్రపత్తులే లేవన్నారు. అలాంటిది ఈ ఏడు వసంతకాలంలో ఈ రాజకుమారి కలకలలాడుతూ దివ్యపథాలనుండి దిగివచ్చిన త్రిజగన్మోహినిలా వసంతోత్సవంలో విలసిల్లిపోయినదట. ఓహో! ఏమీ రాకుమారి సౌందర్యం!తామెవ్వరూ ఆ బాలికను తేరిపార చూడలేరు. ఆమెకు తన వసంతోత్సవం కళ్ళకుకట్టినది. తన ప్రియుడు నాగదత్తుడు వసంతదేవుడైనాడు. ఆ మనోహరుని విశాలఫాలం, గరుడనాసిక, కండలుకట్టిన విశాలవక్షము, ఆ గోమూర్ధకటి, ఉన్నతమూర్తి, తుమ్మెదరెక్కల మీసాలతో పుష్పాలంకృతుడై వెలిగి పోయినాడు.

6

సాలగ్రామ వసంతోత్సవం అతివిచిత్రంగా ఏర్పాటు చేశాడు నాగదత్తుడు. రాత్రులు కాగడాల వెలుతురున చంద్రోత్సవం జరిగింది. మధు మాసదేవుని అలంకార విధానం మార్చినాడు. వనదేవిగా తారానికను ఎన్నుకొనడమే ఒక అద్భుతకల్పన. ఒక మోడుచెట్టును ఉత్సవంచేసే స్థలంమధ్య పాతినారు. అక్కడక్కడ వట్టిగంపలు నిలువెత్తున మ్రోడుగా ఉన్నవి. మధ్యను ఒకధాన్యపు పురి ఏమీ అలంకరణ లేకుండా ఉంది. ప్రజలందరూ ఈ ఉత్సవం చూడడానికి వీలుగా ఎత్తయిన మంచెలు చూట్టూ కట్టించినాడు. శుభముహూర్తం రాగానే మూడేళ్ళనుండి అయిదేళ్ళవరకూ ఈడుగల ఇరు వదిమంది బాలికలు ఆకులతో, లతలతో అలంకృతులైనవారు పాడుకుంటూ వచ్చారు.

“చలిచేత వణికామె
    మలిసంజ పోయినదె
            తొలిప్రొద్దు ఉదయింప
                   తూరుపున ఎరుపెక్కె
                          ఏడె మా మధురాజు
                                  ఏడమ్మ తెలుపరే!"

అని అందరూ పాడినారు.
         “అమ్మా కప్పవే
              అదరిపాటే నాకు
                       ఏదో భయమౌతాది
                                ఎటుపోవనే నేను!"

అని ఒక మూడేళ్ళబాలిక పాడింది.

“భయ మెందుకమ్మా?
            బాలలార మనకూ భ
 యమెందుకమ్మా ?
            జయ మొందు శుభ
 శకునమాయె అదుగొ
            మగువలార మధు
            మాసరాజు లేడ!
            భయమెందుకమ్మా?
 దూరమందు ఏదో
 తొగరురంగు తోచే
      చిట్టిపాప బోసి
      చిన్నారి పెదవిపై
          భయమెందుకమ్మా?"

ఆ ముగ్గురు బాలలు నాట్యం పూర్తిచేయగానే, ఎఱ్ఱనిమొగ్గలుగల లతలు అలంకరించి బంగారురంగు వస్త్రాలు ధరించిన పన్నెండు సంవత్సరాల బాలికలు ఎనమండుగురు నలువైపులనుంచీ నాట్యమాడుతూ ప్రవేశించారు. వారి వెనుక బాలురు పది పన్నెండు సంవత్సరాలవారు ఎనమండు గురు తెల్లని మొగ్గలతో లతలతో అలంకరించినవారు ఎనమండుగురు నీల వస్త్ర శోభితులు వచ్చిన్నారు. ప్రతివానిచేతిలో ఒక బొమ్మనాగలి ఉంది. ప్రతి బాలిక చేతిలో రంగులతో అలంకరించిన మృత్తికాకలశ మొకటి ఉన్నది.

బాలికలు : దిశలమమ్మా మేము
          దెసల బాలికలం
బాలురు: దెసలకై ఎదురేగు
         పసుల కాపులమూ
                   మేము
         మిసిమి భూమినిదున్న
                 మేటి హాలికులం!
                           మేము
                           హాలికులం

బాలికలు: కలిమిచ్చు భూమాత
                   కన్నతల్లీ మాకు

అనుచు బాలికలు, బాలకులు కలిసి నృత్యవిన్యాసాలు నెరపదొడగిరి.

7

వసంతుడు; భూతమ్మువలె తమము భూమియంతా నిండె
           భూతజాలమ్ము నిశ్చేతనములై పండె
           తొలకరించే సృష్టి వెలుగు వెల్లువలలో
           మొలకచీకట్లేల అలముకొనెనో?

మన్మధుడు; జగతికి శుభమూ ప్రేమయితే
           భుగ భుగ పొంగుతు ద్వేషమ్మూ
           కాలకూటమై వ్యాపిస్తె
           మూలమూలలకు మండిస్తే
           బూడిదకాదా
           మోడై పొదా విశ్వమ్మూ లోకమ్ము.

వసంతుడు; సత్యరూపమౌ ప్రేమశక్తిని
           నిత్యమే నే చేసివేతును
           సృష్టిధర్మము నాదుజన్మా
           అష్టదిక్పాలకులె సాక్షులు.

మలయమారుతుడు ; నీవులేకే నేనులేను
                   నిన్ను పొదివి నేనువత్తును
                   అందుకే నన్ గంధవహుడని
                   అందరును ప్రేమింతురయ్యా!

మన్మథుడు : ప్రేమబలమును నీచులెరుగరు
            ప్రేమబలమె అహింసరూపము
            ప్రేమశక్తే దైవశక్తీ
            ప్రేమనిత్య వసంతమూ.

వసంతుడు చీకట్లను పారదోలుతాడు.... కాపు బాలురు అచ్చటచ్చట ఉన్న లతలను పూవులను ధరించుకొంటారు.

బాలురు : వసంతదేవా వచ్చేవా?
          వసుధకు ప్రాణములిచ్చేవా?
మలయ : ఉత్సాహంలో ఉప్పొంగండీ
          ఉర్వినినిండే నవయౌవనులూ

            ప్రేమించేటి ముహూర్తమొచ్చే
            ప్రేమవాహినుల తేలండీ!

మన్మథుడు : పూలశరాలూ విసిరివేసెదా
            తూలిపోకుడీ నవయౌవనులూ
                      ఏదోబాధా తీయని గాధా
                      వేదనముంచే అన్వేషణలూ

బాలురు : వసంతదేవా రావయ్యా!
           వసుధకు ప్రాణములీవయ్యా!

వసంతుడు ఆనందనృత్యంచేసి బాలుర కడకువచ్చి వారిపై ఆశీర్వాద హస్తముంచి.

          “భయమేలనయ్య
           బాలకులు మీకూ
                    దయకలిగె వరమిత్తు
                    తలలెత్తి తెల్పుడీ!

బాలురు : మాకేమి కావాలొ
         మనసులకు తట్టదే
               హృదయాలు ఉప్పొంగు
         కదిలేను కాంక్షా

మన్మథుడు : తెలుసునయ్య
            తెలుసునయ్య
            తేటతెల్లమై
                  పాటుపోటులై

            యువతినికోరే యువకులురండీ
            రండమ్మా బాలికలూ
            దండలనే వేయండీ
                తలపులతో పొంగండీ
                వలపులతో కరగండీ.

గలగల నాట్యమాడుతూ బాలికలు వత్తురు. బాలురు. బాలికలూ కలిసి ప్రణయ నృత్యం సలుపుతారు. బాలికల జట్టునాయిక రతీదేవి. ఆమె ప్రక్క గంధవతీ. రతీ మన్మథుని కడకూ, గంధవతి మలయమారుత కుమారుని కడకూ నాట్యాన వచ్చి వారితో కలిసి నృత్యం సలుపుతారు.

రతి : నాథ, మన్మథా
      నర్మ మథురమూర్తి
      ఎన్నాళ్ళకో నిన్ను
      కన్నార కాంచితిని!

మన్మథుడు : ప్రణయినీ నాతనువు
            భగ్గుమని మండగా
                   రూపరహితుడనై
                   రోదించిపోయాను
            ఇంతలో నాశక్తి
            ఇలనిండె దెసనిండె
                  విశ్వమంతా నిండి
                  శాశ్వతమ్మయి నిలిచె!

రతి : నాథ మిముగానకే
      భాధపడి కూలితిని
            రోదించి రోదించి
            రుద్రునే తిట్టితిని
            దేవతలు విచ్చేసి
            దీనులై నిలిచారు
            “తల్లీ! నీ నాథుండు
            ఎల్లఎడ నిండాడు
            తిరిగి వచ్చేనమ్మ
            తిరిగి వచ్చేను
            ప్రతియేడు మధుమాస
            ప్రారంభమందు
            ఈ రహస్యము నెరిగి
            ఓ రతీ నీవు
       ఆమనితో వేచి అరయు" మన్నారు!

మన్మథుడు : అడుగొ దేవీ వసంత దేవుడు
            అచ్చట దీనత కూర్చున్నాడు
                    చేష్టలు దక్కీ
                    చిన్న తనముతో
            అతడే చిహ్నము నిత్యసృష్టికీ
            అతడే కలిపెను మనలనిద్దరా
                    కనుగొందామె కాంతా రావె
                    కలకలనవ్వుల తేలించెదమే!

రతి, మన్మథులు : ఏమోయి ఆమనీ
                 ఈ రీతి నున్నావు

                 ఆనందనృత్యాల
                 అఖిల లోకమ్మలరు

గంధవతి, మలయమారుతుడు : మధుమూర్తి ఈ రీతి
                            మనసు కలతైతే
                                   మా ఒడలు వేడెక్కి
                                   మరిగిపోయేము!

బాలికలు, బాలురు : ఆమనికి శోకమూ
                   ఆశ్చర్యమయ్యే
                   ఆమనికి దుఃఖమే
                   అంత్య కాలమ మాకు.

(8)

వసంతుడు ఆ త్రిభంగాకృతి పీఠముపై అధివసించి ఆవేదన అభినయిస్తు ఉండును. రతీ మన్మథులు, గంధవతీ మలయమారుతులు, బాల బాలికలు వసంతుని అనునయించే నాట్యం చేస్తూ, పాటపాడగానే ఆ దివ్యమూర్తి,

“వికల మొందె హృదయమయ్య
 శకలమయ్యె ఆనందం
        తెలియరాని భావమొకటి
        నిలువెల్లా కూల్చేనో!"

అని పాడుతూ తలవంచాడు.

రతి : ఈ రీతినే నా దుఃఖం
      ఏడుజగాలను నిండీ
            మండించెను గరళమ్మయి
            మసిచేసెను మాంగల్యము

మన్మధుడు : ఓయి వసంతా ఉపశమించుమా
            నాయికలేనీ నాయకుడీవే!
                   దేవీ సహితుడు దేవుడె పూర్ణుడు
                   దీనుడు ఒంటిగ ఉంటే అమరుడు
            లక్ష్మి హృదయమునలేని విష్ణువు
            లలితార్థాంగుడుకాని శివుండు
                   తలపులకయినా అందని భావము
                   తపసులనయినా చేరని మోక్షము

రతి : గంధములు లేనట్టి పూవులు
      కాంతిరహితుడు సూర్యబింబము
      ప్రాణసతి లేనట్టి వ్యక్తే

మలయమారుతుడు : నాకు జన్మేలా
                   నాదుప్రేయసి నన్ను చేరని నాదుజన్మ్యేలా?

గంధవతి : ప్రియుని కౌగిలివీడి బ్రతుకే లా నాతికి
          ప్రేమ ఈయని వరములుండేలా ?

బాలురు : వలపుచేడియ కౌగిలే
         బ్రతుకుమార్గపు వెన్నలా
               ప్రణయనీమృదులా ధరమ్మే
               ప్రాణమిచ్చే అమృతమే

బాలికలు : నాథుని హృదయము జీవాధారము
          నాధునిప్రేమే ఆత్మాధారము

వసంతుడు : మీమీ మాటల
            మించెను దుఃఖము

అందరు : దుఃఖమేలా ఆమనీ
          దోయిలింపుము భూమినీ!

వసంతదేవుడు సమభంగాకృతియై, పద్మాసనాసీనుడై చిమ్మద్రాంకిత హస్తుడై కన్నులరమూతలుగా తపస్సు అభినయిస్తాడు.

ఆకాశవాణి : నీ తపసు ఫలియించెనోయీ ఆమనీ
           చేతనుడవై నిలువుమోయీ

అందరు : ఏదోవెలుగూ ఏదో సౌరభ
          మేదోదర్శన మదె వచ్చెన్!

రంగస్థలానికి మధ్యగా ఉన్న ఒకపెద్దగంపతేలి మాయమయిపోతుంది. ఆ స్థలంలో తారానిక వనదేవి వేషాన సహస్రదళ పద్మం మధ్య కూర్చుండి ప్రత్యక్షమౌతుంది. వసంతుడు కన్నులు నెమ్మదిగా తెరుస్తూ పులకరం అభినయిస్తాడు. ఎదురుగా వనదేవిని చూస్తాడు.

“ఓహో! ఏదో ఆనందం
 ఆహా! అలమెను నన్నూ
       ఎవరో ఈ దివ్యదర్శనము
       ఎవరో ఈ పరమ దర్శనము
 సౌందర్యాలూ మూర్తించినవీ
 సర్వమునన్నిటు ముంచెత్తినదీ
       ఆపలేను నా చివరవాంఛితమును
       ఓపలేను ఈ విరహవేదనను

వనదేవి కన్నులు తెరుస్తూ : ఎక్కడనుండీ ఇక్కడతేలితి
                        ఏమయ్యెను నా ప్రాణేశుండూ

ఆమె అంతటా కలియ చూచి, వసంతదేవుని కనుగొనును.

మన్మథుడు : వేశాను వేశాను పూలబాణాలూ

రతి : వలపుబందాలతో కట్టివేశాను.

గంధవతి : కమ్రకాంక్షల వీరి కలయనింపాను.

మలయ : కాంక్షలో నునుమొగ్గ విరియ జేశాను.

వనదేవి ఆసనంనుండి దిగి తూలుతూ నాట్యమాడుతూ ముందుకు వస్తుంది. ఆమె చుట్టూ గంభీర శృంగార తాండవం చేస్తాడు వసంతుడు. ఆమె వారిస్తూ, నీవెవరవంటుంది. అభినయంలో వసంతుడు దివ్యప్రణయ విలాసతాండవోద్వేగాన దృతగతితో ఆమెను సమీపిస్తాడు.

వసంతుడు : నినువిడిచి మనజాల
            కనుతెరచి చూడవే!

వనదేవి : వ్రీడావతిని నేను
         చూడవో ఆమనీ

వసంతుడు : నీ హృదయమున నన్ను
            దాచుకొంటాను.

ఇరువురు అద్భుత నాట్యమొనర్చి ఒకరి కౌగిలిలో ఒకరు కరిగి పోతారు. తక్కిన వారంతా అనుగుణంగా నాట్యం చేస్తారు.

ఈ పవిత్ర సంఘటన తారానికకు జ్ఞప్తికిరాగా, నవ్వుకొంటూ శాంతిశ్రీ మహా రాజకుమారి రథం ప్రక్కనే అశ్వారూఢురాలయి వస్తూ ఉన్నది.

9

రెండురాత్రిళ్ళు పగళ్ళూ ప్రయాణంచేసి శాంతిశ్రీకుమారి సైన్యమూ ఆ వెనుక వీరపురుషత్తుని సైన్యమూ బ్రహ్మదత్తప్రభువు సైన్యమును చేరారు. బ్రహ్మదత్తుని సైన్యాన్ని చేరేసరికి తూర్పున ఉషాబాల కెంపుచీర ధరించి తాండవిస్తున్నది. ఆమెకు వెనుకనే దిశాబాలికలు అరుణవస్త్రాలతో హంగు చేస్తున్నారు.

శాంతిశ్రీ వచ్చేసరికి ఆమె సైన్యాలకై విడిదులు ఏర్పాటై శిబిరము నిర్మాణమై ఉన్నది. చక్రవర్తి ఆశ్వికవార్తాహరులను ఇదివరకే పంపి ఉన్నారు. శాంతిశ్రీకుమారి తన శిబిరంలో ప్రవేశించి స్నానాదికాలు నిర్వర్తించి, ఎఱ్ఱచీర ధరించి స్తనదుకూలము అలంకరించి, శిరస్త్రాణతనుత్రాణములు ధరించి, గుఱ్ఱమెక్కి అంగరక్షక బాలికలు వెంటరా, కొందరు సేనాపతులు దారిచూప బ్రహ్మదత్తుని శిబిరానకుపోగానే అంతకుముందే బ్రహ్మదత్త ప్రభువు రాయబారానికై ఒక్కడే పులమావి స్కంధావారానికి వెళ్ళినారని అక్కడి దళపతులు ఆమెకు మనవిచేసినారు. వెంటనే రాకుమారి తిరిగి తన శిబిరానికి వెళ్ళిపోయింది. ఆమెకు ఎందుకో నిరాశా విసుగు కలిగినవి. ఎన్నడూ ఆమె విసుగుచెంది యెఱుగదు. ఆశలే లేని ఆ రాకుమారికి నిరాశపొంద కారణమేమి ఉండగలదు? ఆమె కవచం విప్పి తన యోగాసనాన కూరుచుండి మనస్సును ఏకముఖం చేయాలని ప్రయత్నించింది. ఆలోచనలు ఒకదానివెంట ఒకటి తరుముకు వచ్చాయి. ఆమె ఎన్ని ఘటికలు అలా నిశ్చలత్వానికై ఎదురు చూస్తూ కూరుచుందో! సేనా నాయిక శిబిరమూహూర్త ఘంటికలు మ్రోగుతున్నాయి.

బ్రహ్మదత్తుడు పాఠాలు చెబుతూ కనబడతాడు. ఒక వసంతోత్సవంలో తానే ఏదో భయపడి పారిపోతున్నట్లు కనబడుతుంది. సముద్రం కల్లోలావృతమై ప్రత్యక్షమాతుంది. అందులో ఒక చిన్న ఓడ మునిగి పోయేటంత స్థితిలో దూరంగా తోస్తుంది. బ్రహ్మదత్తుడు నవ్వుతూ దర్శనం ఇస్తాడు. ఏదో మాట్లాడ బోతాడు. బ్రహ్మదత్తుడు యుద్ధానికి వెడుతూ మూర్తించాడు. ఆ దృశ్యం మాయమైపోతుంది. యుద్ధంలో రక్తసిక్తాంగుడై పడిపోయి ఉంటాడు.

“ఓ” అంటూ శాంతిశ్రీ లేచింది. ఒక అంగరక్షకురాలు పరుగెత్తు కొనివచ్చి “రాజకుమారీ! ధనకమహారాజలవారిని బంధించినామని పులమావి వద్ద నుంచి వార్త వచ్చింది” అని రోజుతూ చెప్పింది.

“ఏమిటీ? ధనక ప్రభువును బంధించడమే?” ఆమెకు ఏమీ అర్థం కాదు. మేము వివర్ణమైనది.

ఇంతలో వీరపురుషదత్త యువరాజు వేగంగా చెల్లెలి శిబిరంలోనికి వచ్చి “చెల్లీ! బ్రహ్మదత్తప్రభువు రాయబారానికై వెళ్ళితే పులమావి వారిని పట్టుకొని బంధించాడట. ఆ విషయం కమ్మఁవాసి స్వహస్తాంకితమైన ముద్ర పంపించినాడు” అనుచు ససంభ్రమంగా మాట్లాడినాడు. పదిలిప్తలు జరిగినవి. శాంతిశ్రీ తిరిగి గంభీరత తాల్చింది.

“అన్నయ్యగారూ! రాయబారిని ఎట్లా పట్టుకోగలరు?"

“రాయబారి వస్తున్నాడని వార్త పంపి మరీవెళ్ళినాడట బ్రహ్మదత్త ప్రభువు!”

“రాయబారిని ఎల్లా పట్టుకొన్నారు అన్నయ్యగారూ?” శాంతిశ్రీ ఏదో ఆశ్చర్యమూ, ఏమీ అర్థంకాని వైకల్యమూ మోమును ఆవరిస్తూ ఉండగా అడిగింది.

“రాయబారిని ఏ రాజూ రాజనీతి ప్రకారము బంధింపకూడదు. అలా బంధించినవాడు రాజుకాడు. వాడు నీతి బాహ్యుడు” అని వీరపురుషదత్తుడు తన గుప్పిలి ముడిచి పులమావి శిబిరంపై ఆడిస్తూ అన్నాడు.

శాంతిశ్రీ చటుక్కునలేచింది. ఆమె అన్నగారికి నమస్కరించింది. ఆమె మోమున చూడనలవికాని భయంకరరేఖలు తోచినవి. ఆమె అచ్చట ఉన్న ఖడ్గపు వరలోనుండి ఖడ్గము తీసినది. కవచము ధరించలేదు. శిబిర ద్వారము కడకుపోయి “గుఱ్ఱము” అని కేక వేసింది. అచ్చట కావలికాయు రక్షకదళ బాలికలలో ఒకరై పరుగునపోయి సూతుని శాంతిశ్రీ ఎక్కే అత్యుత్తమాజానేయాన్ని కొనివచ్చేటట్టు చేసింది. ఆమె గుఱ్ఱంమీదకు ఉరికింది. “శాంతీ! ఇదేమిటమ్మా ! ఎక్కడికీప్రయాణం” అని కేకలు వేస్తూ వీరపురుషదత్తుడు బయటకు పరుగిడి వచ్చినాడు. శాంతిశ్రీ అన్నగారి మాటలు వినిపించుకొనలేదు. తన రక్షకభటురాండ్రుకు యువతీదళాలు ఒక నిమేషంలో సిద్ధం కావాలని ఆజ్ఞ ఇచ్చింది. యువతీ సైన్యాధికారిణియైన ప్రౌఢయోర్తు అచ్చటికి అచ్చటికి అశ్వారూఢయై వచ్చింది. శాంతిశ్రీ ఆజ్ఞ వినగానే ఆమె వీపున వ్రేలాడు శంఖం ఎడమచేత ధరించి “భోం భోం, భోంభో” ఊదింది. ఊదిన మరుసటిక్షణంలో వేయిమంది యువతులు అశ్వాలు అధిరోహించి సాయుధులై విచ్చేసిరి. శాంతిశ్రీ అన్నగారి వంక చూడలేదు. ఆమె ఆ సమయంలో దుర్నిరీక్ష ప్రతాపమూర్తియై విరాజిల్లినది. వీరపురుషదత్తుడే ఆమెను తేరిపార చూడలేకపోయినాడు. శాంతిశ్రీ తన సైన్యానికి ముందుకు సాగండి అన్నట్లుగా చేయి ఊపి, వేగంతో సాగిపోయింది. ఆమె వెనుకనే సాగిపోతోంది ఆమె సైన్యం.

వీరపురుషదత్తుడు ఏమీ అర్థము కాక తానూ తన సైన్యాలను సిద్ధము చేసి రెండుఘటికలు జరిగిపోయేసరికి సైన్యాన్ని కూర్చుకొని ముందుకురికినాడు. అతని సైన్యం ముందుకు సాగగానే సేనాధిపతి కొంపలు మునిగి పోవునను భయంతో తన యావత్తు సైన్యాన్ని సిద్ధంకండని ఆజ్ఞ ఇచ్చెను. శాంతిశ్రీ భయంకరమూర్తియై సింహవాహన అయిన ఆదిశక్తివలె ముందుకు మహావేగంతో పురోగమనంచేస్తూ హిమాలయపర్వతంనుంచి విరుచుకుపడిన గంగానదిలా విజృంభించింది. ఆమెను ఎవ్వరూ తేరిపార చూడలేరు. పులమావి ఆయుధోపేతలైన స్త్రీలు తమ మీదకు వస్తూ ఉండడం చూచి ఆశ్చర్యము చెందెను. ఆ వనితా సైన్యానికి శిరస్పై వస్తున్న బాలికను చూచినాడు. విస్తుపోయి నిలిచినాడు.

(10)

శాంతిశ్రీ పులమావిని గాంచి చిరునవ్వు నవ్వుకుంది. “ఓహో! మీరా నూత్నచక్రవర్తులు, రాయబారులను బందీచేసే ధర్మమూర్తులు!” అని నవ్వింది శాంతిశ్రీ. పులమావి కళ్ళు కోపంతో ఎఱ్ఱబారాయి. “ఎవరురా అక్కడ? ఈ తుచ్చురాలిని బందీచేసి మా దాసీజనంలో చేర్చు. ఈ పిచ్చి దానితో వచ్చిన ఈ దండును బంధించి సేనాపతులు పంచుకోవలసిందని మా ఆజ్ఞలందించు” అని దండతాడితభుజంగంలా రోజినాడు. “ప్రచండికా! ఈ దుడుకు మనుష్యుని బంధించు!” అని ఆమె ఆజ్ఞ ఇచ్చింది. ప్రచండిక ముందుకుపోయి, పులమావిని చేయిపట్టుకుని బరబర శాంతిశ్రీ రాకుమారికడకు లాగికొనివచ్చి ఒక్కవిదిలింపున క్రిందకు పడద్రోచినది. అక్కడఉన్న సేనాపతులు 'ఆఁ ఆఁ!' అంటూ తమ ప్రభువును రక్షించడానికి ముందుకురికారు. శాంతిశ్రీ చుట్టుఉన్న నాగనికా తారానికాది అంగరక్షక బాలలు కత్తులుతీసి మహావేగంతో సేనాపతులను తలపడినారు.

ఒక్కసారిగా శాంతిశ్రీ యువతీసైనికులు పులమావి శిబిరాలను చుట్టు ముట్టినారు. పది నిమేషాలలో పులమావి అతని అంగరక్షకులు సేనాపతులు పరివారజనము ఆ వీరాంగనులకు పట్టుబడిపోయినారు. శాంతిశ్రీ బంధితులను అంగరక్షక బాలలకు అప్పగించి తాను పులమావి సభాశిబిరంలో ప్రవేశించి అక్కడ 'సింహాసనము పై అధివసించింది. పులమావివైపూ సేనాపతుల వైపు తీక్ష్ణంగా చూస్తూ “మాలో ఏఒక్కరికి గాయమైనా పులమావితల ఎగిరిపోతుంది. మాగురువు శ్రీశ్రీ బ్రహ్మదత్తప్రభువును మాకు అప్పగించండి. ఆ వెనుక నువ్వు శ్రీశాతవాహనచక్రవర్తికి నీయావత్తు ధనమూ అర్పించాలి. ప్రయాణానికి తగిన ధనంమాత్రం మేము ఇస్తాము. నీ సైన్యంతో వెంటనే బయలుదేరి నీదేశం పో!” అని సూర్యమండల మధ్యస్థ కాంతి పుంజమువలె ప్రకాశించి పోయినది.

అప్పుడా పరమాద్భుత దివ్యసుందరిని చూచి “ఈ బాలిక నాశించికాదా తానీ జైత్రయాత్ర ప్రారంభించింది” అని అనుకున్నాడు పులమావి. ఆతనికి భయమునకు బదులు నవ్వు వచ్చినది. ఈ బాల ఏమిచేయగలదు? తానీ బాలికను ముసికనగరానికి కొనిపోయి ప్రియురాలిని చేసుకొన్ననాడు తన జన్మ ధన్యమగునని పులమావి ఉప్పొంగినాడు. ఈమెకు కోపం వెన్నెలకు తావి అబ్బినట్లు విలసిల్లుతున్నది అని కన్నులరమూతలు వేసుకొన్నాడు.

ఇంతలో స్కంధావారమంతా ఒక్కసారి హోరుమని అలజడి బయలుదేరింది. అప్పుడు శాంతిశ్రీకుమారి అంగరక్షకురాలయిన తారానిక లోనికివచ్చి,

“జయము! జయము! భర్తృదారికా. యువరాజు వీరపురుషదత్తుల వారు లేళ్ళగుంపులో ప్రవేశించి సింహంలా సైన్యంతో ఈ పులమావి స్కంధావారంపైకి ఉరికినారు. స్కంధావారం అంతా చెల్లాచెదరై పోతున్నది. వేరొక దెసనుండి బ్రహ్మదత్తప్రభువు సైన్యాలు తలపడినవి. ఏమి ఆజ్ఞ?”

“ఆజ్ఞ ఏమి ఉన్నది? మన సైన్యాలను వెంటనే మనరథాలను యుద్ధ సన్నద్ధంచేసి, శంఖాలు ఊది, కేకలువేసి 'పులమావి బందీ అయ్యాడు. మీరు యుద్ధం ఆపండి. లేకపోతే పులమావి మృత్యువు తథ్యము' అని చాటించు!” అని శాంతిశ్రీ కత్తి తళతళవలె మాట్లాడింది.

11

ఒక అరఘడియలో యుద్ధం ముగిసిపోయింది. బ్రహ్మదత్తుని పట్టినానని గర్వపడిన పులమావి తానే పట్టుబడిపోయినాడు. ఏ భటుడూ యుద్ధం చేయడానికి సాహసించలేదు. ఏ సేనాపతీ యుద్ధం సాగించండి అని ఆజ్ఞ ఇవ్వడానికి సాహసించలేదు. పులమావి సేనలో. అంతపెద్ద ఎత్తూ ఇంత సులభంగా ఈడ్చుకుపోయింది! ఏది ఎట్లా అయిందో ఎవరికీ స్పష్టంకాలేదు. ఒక్కబిందువైనా రక్తం ఎందుకు ప్రవహించలేదో ఎవరికీ అర్థం కాలేదు.

ఈ మాయంతా రాజకుమారి శాంతిశ్రీదన్నారు. శాంతిశ్రీ ప్రళయ యుద్ధం చేసిందన్నారు. యువరాజు వీరపురషదత్త ప్రభువుని యుద్ధచమత్కృతిలోని మహత్తిది అని అనేకులు నొక్కి చెప్పినారు. కొందరు అన్నా చెల్లెలూ ఈ విచిత్రవిధానము అల్లినారని అనుకొన్నారు. మరికొందరు బ్రహ్మదత్తప్రభువే ఈ ఎత్తంతా ఊహించింది. తన ఎత్తు ప్రకారం తాను ముందు పట్టుబడి తర్వాత ఈ విధమైన నాటకం అంతా ఆడించాడని ఆనందంతో నవ్వుకొన్నారు.

పులమావి ధనం అంతా పట్టుబడింది. సైనికుల ఆయుధాలన్నీ సంగ్రహించినాడు వీరపురుషదత్తుడు. పులమావి పొడిగుడ్లుపడి వంచినతల ఎత్తకుండా తన్నుబంధించిన శిబిరం వదిలి రావటం లేదు. ఇంత దురదృష్ట సన్నివేశం ఏలా జరిగింది? ఏలా వచ్చింది తనకీ ప్రమత్తత? స్త్రీ అని ఆ బాలికను లోనికి రానివ్వలేదు; ఆమె తన శిబిరంలో బయలుదేరినప్పటినుంచీ పులమావికి గూఢచారులు ఎప్పటి వార్త అప్పటికే తెస్తూ ఉండిరి. ఆ బాలిక శాంతిశ్రీ! శాంతిశ్రీ జగదేకసుందరి, త్రిభువలనైకమోహిని, ఆ దివ్యసుందరమూర్తి శాంతమూర్తి. ఆమెకు లోకజ్ఞానంలేదు. ఆమె తనంతట తాను కోరి తన స్కంధావారానికి వస్తూఉంటే వంట యింటి కుందేలవుతున్నదని మురిసిపోయినాడు. ఆమె ఇష్టపడినా పడకపోయినా వివాహం జరగవలసిందే! ఇంతట్లో శాంతిశ్రీయే వచ్చివాలింది. ఆమెనూ ఆమె వెంటవచ్చే స్త్రీ పరిచారికామండలినీ స్కంధావార గోపురంలో నుండి రానియ్యవలసిందని స్కంధావారమహాపాలకునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ కారణంచేత శాంతిశ్రీ నిరభ్యంతరంగా లోనికి రాగలిగింది. -

వీరపురుషదత్తుడు తన చెల్లెలిదళాలకు గోరుతదూరం వెనుకగా ఉన్నాడు. ఎప్పుడు తన చెల్లెలు లోనికి పోగలిగిందో, ఇందులో ఏదో అనుమానించవలసిన విషయం ఉందనుకొన్నాడు. వెంటనే తన సైన్యాన్ని రెండు పాయలుచేసి స్కంధావారం చుట్టుముట్టాలనీ, ఘనరూపమయిన దళాలుగా ఒక ఘటిలో స్కంధావారాన్ని తాకవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు. కొందరు చారులకు ఇక్ష్వాకు సైన్యాలను మహావేగంతోవచ్చి స్కంధావార గోపుర ద్వారానికి ఇరువైపులా తాకి తనవెనుక బలంచేయవలసిందని వార్త పంపినాడు.

శాంతిశ్రీ రాజకుమారి పులమావిని బంధించిందని విన్ననూ పులమావి సేనాపతులు నమ్మలేదు. కాని వీరపురుషదత్తుని సైన్యాలు మహావేగంతో తమ స్కంధావారం లోనికి చొచ్చుకు వచ్చినాయని తెలియగానే కింకర్తవ్యతామూఢులై పదిక్షణికాలు సందేహించారు. ఇంతలో వేగులు ఇక్ష్వాకులసైన్యం వచ్చి తమ స్కంధావారం చీల్చి లోనప్రవేశించిందని తెలుపగానే యుద్ధం విష్ఫలమనీ వృధా సైనికనష్టం లెక్కకు మించిపోతుందనీ నిశ్చయానికివచ్చి యుద్ధం చేయవద్దు అని తమసైన్యాలకు ఆజ్ఞలు వేగంగా పంపించినారు.

బ్రహ్మదత్తప్రభువును ఒక ఆభీరసేనాపతి దర్శించి, “ప్రభూ! మీరిక మా బందీకారు. రాయబారిగా వచ్చిన వారిని బంధించకూడదని మేమెంత మనవి చేసినా సార్వభౌముడు....”

“సార్వభౌములా!” అని బ్రహ్మదత్తప్రభువు ఆశ్చర్యంతో ప్రశ్నించినాడు.

“శ్రీ పులమావి సార్వభౌములు ప్రభూ !” అని సేనాపతి బ్రహ్మదత్తునికి నమస్కరిస్తూ మనవి చేసినాడు.

“ఓహో! అవును ఏమి జరిగినదిప్పుడు?” అని బ్రహ్మదత్తుడు చిరునవ్వుతో ప్రశ్నించినాడు.

“ఏమి ఉన్నది మహారాజా! ఇక్షాకు శాంతిశ్రీ రాకుమారి తన స్త్రీ సైన్యంతో వచ్చి చక్రవర్తి శిబిరం ముట్టడించింది. ఇంతలో వీరపురుషదత్త యువరాజుగారూ, తక్కినయావత్తు ఇక్ష్వాకు సైన్యమూ వచ్చి మమ్ము కత్తి ఎత్తకుండా చేసినారు.”

“అలాగా!”

“చిత్తం.” “సరే మనం వెళ్ళి శాంతిశ్రీ రాకుమారినీ, వీరపురుషదత్త ప్రభువునూ దర్శించగలంలెండి” అని చిరునవ్వుతో ప్రభువు లేచినాడు. మౌనమూర్తియై రెప్పవాల్పక శాంతిశ్రీ రాకుమారి పులమావివైపు తీక్షంగాచూస్తూ సింహాసనం అధివసించి ఉన్నది. పులమావి ఆమెవైపు రెప్పఎత్తి చూడలేక పోయినాడు. అతనికిలోన నిర్వచింపరాని భయం ఆవేశించింది. ఏమిటీ బాలిక? ఆమె పిచ్చిదా? పిచ్చివారు ఏమి చేసినా చేస్తారు అనుకున్నాడు పులమావి.

ఆమె దివ్యసౌందర్యం ఆ భయంకరమూర్తిమత్వంవల్ల ప్రళయతాండవోద్యోగియగు రుద్రుని తాళగతిలా ఉన్నది. ఎవ్వరినోటను మాటలేదు. అక్కడ ఉన్న రక్షకయువతులు మ్రాన్పడి నిలిచి ఉన్నారు. అందరికీ ఏదో భయం ఆవహించింది. తొందరగా ఇంతలో వీరపురుషదత్త ప్రభువులోన ప్రవేశించి “చెల్లీ !” అని పిలచి అర్థాంతంలో ఆగిపోయినాడు. ఆ యువకునకు ఒక్కసారి మంచుగడ్డలమధ్య పడినట్లు హృదయము జిమ్ముమన్నది. అతడు తెల్లబోయి అల్లానే నిలుచుండిపోయినాడు. మరుసటి నిమేషంలో బ్రహ్మదత్త ప్రభువు నెమ్మదిగా ఆ గుడారములోనికి ప్రవేశించి చిత్రించిన మహాచిత్రంలా ఉన్న ఆ దృశ్యము చూచినాడు. ఆయనకు ఒక నిమేషంలో ఏదో ఒక పరమాద్భుతము ప్రత్యక్షమైనట్లు తోచింది. చిరునవ్వు నవ్వుతూ ఆ ప్రభువు,

“వీరపురుషదత్త మహారాజా ! ఏమిటా అత్యంతాశ్చర్యకరమైన విషయం ? శిష్యురాలా! రాజకుమారీ! ఏమిటి అలా క్రోధఘూర్ణిత అపరాజితాదేవిలా పీఠము అధివసించి ఉన్నావు?” అని ప్రశ్నించినాడు. బ్రహదత్తుని మాటలు చెవిసోకగానే శాంతిశ్రీ నిద్రలేచిన బాలికవలె దీర్ఘమైన నిట్టూర్పు పుచ్చి కన్నులు మూసికొన్నది. “శాంతిశ్రీ! శాంతిదేవీ!” అనే బ్రహ్మదత్తుని పలుకులు సామగానంలా ఉన్నాయి శాంతిశ్రీ కన్నులు అరమూతలుగా తెరిచి "గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః” అంటూ పూర్ణవిస్ఫారితనేత్రాల ఆమె ఇటునటు చూచింది. “తారానికా! ఇదంతా ఏమిటే? ఎక్కడ ఉన్నామే?” అని అడుగుతూ ఇటునటు చూచి, కనుగొని, “గురుదేవా! మీరెక్కడనుండి వచ్చినారు?” అంటూ పీఠం మీదనుంచి లేచి వచ్చి గురుదేవుని పాదాలపై వాలిందా బాలిక.


★ ★ ★