Jump to content

అడవి శాంతిశ్రీ/ప్రథమ భాగం

వికీసోర్స్ నుండి

ప్రథమ భాగం

విజయపురం

అడవి బ్రహ్మదత్తప్రభువు ఉత్తమ కవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతి విశారదుడు. అతనికి కవిత్వావేశం కలిగితే ఆంధ్రప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాథలు, కావ్యాలు సృష్టిస్తాడు. అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతిని సేనాపతిత్వాన్ని మరచిపోతాడు.

అడవి బ్రహ్మదత్తప్రభువు ఆపస్తంబ సూత్రుడు, కృష్ణయజుర్వేద శాఖాధ్యాయి, విశ్వామిత్ర అఘమర్షణ దేవరాతత్రయార్షేయ సాంఖ్యాయనస గోత్రజుడు. బ్రహ్మదత్తుని తండ్రి ధనకమహారాజ అడవి ప్రియబల మహా సేనాపతి, దేవదత్తాభిధానుడు. బ్రహ్మదత్తప్రభువు తల్లి భరద్వాజ గోత్రోద్భవ, పల్లవబుద్ధీ చంద్రప్రభువు తనయ సాంఖ్యాయనస గోత్రము కౌశిక గోత్రోద్భవము.

ఆంధ్ర శాతవాహనులు కౌశిక గోత్రోద్భవులు. విశ్వామిత్ర సంతతి వారు. కాబట్టే వారు తమతో సంబంధాలు చేయుటకని భరద్వాజులను వాసిష్టులను కాశ్యపులను మాద్గల్యులను హరితసులను కుటుంబాలుగా కృష్ణా గోదావరీ తీరాలకు తీసుకొని వచ్చినారు. వారందరు మహాంధ్రులైనారు.

కౌశికులలో రానురాను రెండు వంశాలు ఎక్కువ ప్రాముఖ్యము సముపార్జించు కొన్నవి. ఒక వంశము ఆ కాలంలోనే కృష్ణవేణ్ణకు ఎగువ అడవులు నిండి ఉన్న శ్రీపర్వత ప్రాంతాల ఆశ్రమాలు ఏర్పరచి, ఆటవిక ప్రభువుల లోబరచుకొని, ఆర్యనాగరికత వారి కలవరచి, క్షత్రియత్వమిచ్చినారు. కొందరికి శూద్రత్వ మిచ్చినారు. ఆటవికులలో మంత్ర వేత్తలకు వైశ్యత్వ మిచ్చినారు. వారి దేశము ధనకదేశము, వారు ధనకులై నారు. వారు చక్రవర్తులగు శాతవాహనులతో విడపడ్డవారు అన్న గుర్తుగా సాంఖ్యాయనగోత్రం తీసుకొన్నారు.

ఈ కౌశిక గోత్రికులు విశ్వామిత్ర వంశంనుండి సూటిగా వచ్చినవారు. తమ వంశఋషి దర్శించిన గాయత్రి మంత్రమునకున్న సాంఖ్యాయనస గోత్రమును వారు గ్రహించిరి. అడవిని సస్యశ్యామలంగా, బహుజనాకీర్ణంగా చేసినారు. గనుక ఈ సాంఖ్యాయనులకు అడవివారు అను బిరుదనామం వచ్చింది. ఆ అడవి ఫలభూమి అవడంవల్లను అక్కడ అనేక బంగారుగనులు రత్నాలగనులు ఉండడంవల్లను, అది ధనకదేశం అయింది. వీరే కృష్ణాతీరంలో ధనకటక నగరం నిర్మించారు.

శ్రీపర్వతము వీరి పర్వతము. కృష్ణవేణ్ణ ప్రవహించే ఆ లోయ అడవి వారిది. వారు ఆ సీమకంతకు ఋషులు, ప్రభువులు. ఈ అడవి సాంఖ్యాయనులే విజయపురము నిర్మించారు. వీరే శ్రీశైలమునందు మల్లికార్జునదేవుని ప్రతిష్ఠించినారు. శాతవాహన సామ్రాజ్యము స్థాపించిన ప్రథమార్య ఋషి కౌశిక గోత్రోద్భవుడైన దీపకర్ణి కుమారుడు శాతవాహనుడు. ఆ శాతవాహనులు విజృంభించి తమ ప్రథమాంధ్ర ముఖ్యపట్టణమైన శ్రీకాకుళము వదలి సాంఖ్యాయనులు శుభప్రదము కావించిన శ్రీపర్వతానికి దిగువ వారు నిర్మించిన ధాన్యకటక మహానగరమును, ధనకులకోరికమీద ముఖ్యనగరం చేసుకొన్నారు. ఆ భూమి బంగారు పంటలు పండేది. కాబట్టి ఆ నగరం ధాన్యకటక నగరం అన్న పేరు పొందింది.

శాతవాహన సామ్రాజ్యము విజృంభించిన కొలది అడవి సాంఖ్యాయనుల ప్రాబల్యము తగ్గి, శాతవాహనులకు వారు సామంతులై ధనకటకాన్ని శాతవాహనుల కర్పించినారు.

శాతవాహనులలో శ్రీముఖుడు పాటలీపుత్రపురం రాజధానిగా మగధ రాజ్యమూ, సకల భూమండలము సార్వభౌముడై ఏలిన సుశర్మ కాణ్వాయన చక్రవర్తిని ఓడించి, తాను ఆంధ్రదేశానికే కాకుండా సర్వభూమండలానికి చక్రవర్తి అయి మగధ సింహాసనం ఎక్కినాడు.

సూర్యచంద్రుల సంతతివారై కృతయుగ కాలంనుంచి మనుష్యానంద రూపులైన చక్రవర్తులు సకలభూమండలం ఏలుతూ ఉండేవారు. ప్రథమంలో ఇక్ష్వాకు వంశస్థులు అయోధ్యలో చక్రవర్తి సింహాసనం స్థాపించారు. అలా కృత త్రేతాయుగాలు గడిచి పోయినాయి. ఆ వెనుక కురువంశరాజు హస్తినాపురంలో ద్వాపర యుగంలో చక్రవర్తి సింహాసనల నెలకొల్పినారు. అభిమన్యు సుతుడు పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు మొదలయిన చక్రవర్తులకు బిమ్మట చక్రవర్తిత్వం శిశునాగవంశజులయిన మహా పద్మనందులకు సంక్రమించినది. వారు పాటలీపుత్రంలో చక్రవర్తి సింహాసనం స్థాపించారు. నందుల నాశనంచేసి మౌర్యులూ, వారిని నాశనం చేసి శృంగులూ వారిని నాశనంచేసి కాణ్వాయనులూ వరుసగా చక్రవర్తు లయ్యారు.

ఈ మధ్య రెండు పర్యాయాలు కౌశాంబిలో ఉదయనుని కాలంలో చక్రవర్తిత్వం ఉదయనుడు, ఆయన కుమారుడు నరవాహన దత్తుడు అనుభవించారు. కాని సింహాసనం పాటలీపుత్రంలోనే ఉండిపోయినది.

కాణ్వాయనుల నుక్కడగించి శ్రీముఖశాతవాహనుడు జంబూద్వీప చక్రవర్తి అయిన వెనుక, ఆంధ్రక్షత్రియులలో గుప్తవంశంవారు శాతవాహనులకు రాజప్రతినిధులుగా ఉండి శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నం కాగానే స్వాతంత్య్రం వహించి ఉత్తర భారతీయ చక్రవర్తు లయ్యారు.

ఇప్పుడు శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీశాతకర్ణి రాజ్యం చేస్తూ ఉన్నారు. అడవిస్కంధ విశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు తండ్రి ప్రియబల దేవదత్తుడు తపస్సు చేసుకొనుటకు శ్రీ శైలక్షేత్రాటవులకు వెడలిపోయినాడు. తల్లి భారద్వాజనియైన నాగసిరిదేవి కుమారునకు వివాహము కాగానే తానూ భర్తగారి యాశ్రమమునకు తాపసిగా పోవ సంకల్పించుకొని విజయపురమునందే ఆగిపోయినది. “నాయనా! మీ తండ్రిగారు కోరికోరి విసుగెత్తిపోయి, చివరికి వారి కోరిక నెరవేర కుండగనే, తపస్సుకు వెళ్ళిపోయినారు. ఎక్కడ ఉన్నదయ్యా మా కోడలు?”

“మీ కోడలా అమ్మా నాకేమి తెలియును? నేను గాథలు పాడుతూ కలలుకంటాను, యుద్ధంచేస్తూ కలలు కంటాను, రాజసభలో కూర్చుని కలలు కంటాను. కలలు కనేవానికి పెళ్ళి ఎందుకు?”

“కలలుకనడం అందరికీ సామాన్యమే. అందరూ పెళ్ళిళ్ళు చేసికొనడం మానివేశారా?”

“అందరూ కలలు కంటారు. అయితే నన్ను తారసిల్లే స్వప్నాలు అవేవో చిత్రంగా ఉంటాయి.”

“చిత్రంగా కలలుకాంచేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా?”

“అదికాదమ్మా! కలలకు పెళ్ళికి సంబంధం ఉందనికాదు, నా విషయంలో కొన్ని చిత్ర విచిత్ర భావాలు నన్ను పొదివికొని ఉన్నాయి. వానికీ నాపెళ్ళికీ సంబంధం ఉంది.”

“ఇదేమి చిత్రమైనవాడమ్మా! ఎక్కడి మనుష్యుడివి నాయనా!” అడవి బ్రహ్మదత్త ప్రభువునకు ఇరువది ఒకటవ సంవత్సరము వచ్చింది. “గృహస్థువైగాని ధనకసింహాసనం ఎక్కకు నాయనా!” అని తండ్రి ఆదేశించడంవల్ల బ్రహ్మదత్తునికి ఇంకా రాజ్యాభిషేకం జరుగలేదు. ధనకరాజ్యానికి ముఖ్యనగరం గురుదత్తపురం.

స్కంధవిశాఖాయనక బ్రహ్మదత్తుడు ఏదో ఆవేదన పడుతున్నట్లు మహాసామంతులు చూసినారు. ఆతని తండ్రి మహారాజు శాంతిమూలునికి మహామంత్రి, మహాసేనాపతి, మహాదండనాయకుడు. ఆ ప్రియబల దేవదత్త ప్రభువు శ్రీశైలం వెళ్ళిపోగానే తానే ఇక్ష్వాకు మహారాజునకు మహామంత్రి, మహాసేనాపతీ, మహాతలవరి, మహాదండనాయకుడు కావలసి వచ్చింది.

శాతవాహనులకు మహాతలవరియై, మహాదండ నాయకుడై, తాతగారు ధనక విజయశ్రీ ప్రభువు తన చిన్నతనంలో తనకు విద్యగరపుతూ “నాయనా! మా తాతగారినుండి విన్న శాతవాహన గాథలు జగదద్భుతములు. శాతవాహన సామ్రాజ్యము తూర్పు తీరంనుండి, పడమటి తీరానికి వ్యాపించి ఉండేది” అన్నారు.

“ఆ స్థితిని దాయాదులమూ, సామంతులమూ అయిన మనం సర్వదా కాపాడాలి” అన్నారు.

నాగర్జునదేవుడు విజయపురంలో నూటపది సంవత్సరాలు ఏమీ ఆరోగ్యం చెడకుండా, కృష్ణవేణ్ణకు ప్రక్కనున్న శ్రీపర్వతాశ్రమంలో ఉన్నారు. చిన్న తనంనుంచీ దేశాలు తిరిగి ఇక్కడే తపస్సుచేసి ఇక్కడే మహాసంఘారామం స్థాపించి పార్వతీయ సంప్రదాయం నెలకొల్పినారు. ఆ సంఘారామ పర్వతం ప్రక్కనే విజయపురం వెలిసింది. ఆ బోధిసత్వుని పేరనే ఆ పర్వతాలకు నాగార్జున పర్వతాలు అని పేరు వచ్చింది.

తన తాతగారు శ్రీ నాగార్జునదేవుడు శివుని అవతారమని బోధించినారు, మల్లికార్జునుడే నాగార్జునుడని వారు చెప్పుచుండేవారు. బౌద్ధులు వారిని బుద్ధావతార మంటారు. ఆ పరమ మహర్షి తనకు గురువులైనారు. ఎందుకు తనకీ ఆవేదన? తాను ధనకరాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడిచేటట్లు చూస్తున్నాడు. ఇక్ష్వాకురాజ్యంలో బందిపోటులు లేవు. పంటలు పండుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలా నడుస్తున్నది. తక్కిన సామంత దేశాలు సుభిక్షంగానే ఉన్నాయి. అయినా దేశంలో ఏదో అశాంతి, ఏదో ఆవేదన నిండిపోయింది. వేడిగాలులతో నిండి ఊపిరాడని వేసవికాలంలా ఉన్నది.

బ్రహ్మదత్తుడు ఉదయం లేస్తాడు. స్నానాదికాలు నిర్వహించి, సంధ్యావందనం అర్పించి, అగ్నిహోత్రార్చన నెరవేర్చి, స్కందజపమాచరించి, రాజ భవనంలోనికి వచ్చి ఒక ముహూర్తకాలం రాచకార్యాలు నిర్వహించుకొని సభనుండి లేస్తాడు. వెంటనే ఉత్తమాజానేయ మధివసించి అనుచరుల గూడి నగరసంచారం చేసి రెండుయామాలు పూర్తి కాకమునుపే కోటలోనికి వేంచేస్తాడు. మరల స్నానాదికాలు నిర్వహించి మధ్యాహ్నిక సంధ్యావందనం చేసి మహాఋషులు, పండితులు, చుట్టాలు, భిక్కులు తన పంక్తిని భుజింపగా భోజనం నిర్వహించి అందరి సెలవు అందుకొని, తాను రెండు విఘడియలు విశ్రమిస్తాడు. ఆ రెండు విఘడియలు భగవంతుని ధ్యానము చేస్తూ ఉంటాడు.

అక్కడనుండి ఆ ప్రభువు పండితులతో, ఋషులతో, భిక్కులతో విద్యావ్యాసంగము చేస్తారు. కవులు తమ రచనలను వినిపిస్తారు. ఈ పండిత గోష్టి అర్థయామము జరుగుతుంది. బ్రహ్మదత్త ప్రభువు తనకు తోచిన పారితోషికాలు పండితులు మొదలయిన వారి కర్పించి సభ చాలిస్తాడు.

అచటనుండి మరల రాజసభ జరుగుతుంది. తన కడకు వచ్చిన అన్ని నేర నివారణలు ఆయన పండితుల సహాయంతో సలిపి, తీర్పులు చెప్పి అక్కడ నుండి అనేక రాజవ్యవహారాలు సమాలోచిస్తాడు. లేకపోతే మహారాజు శాంతమూలుని కోటకు వెడతాడు. మహారాజు అపుడు మంత్రి దండనాయకులతో కలసి మంత్రాలోచన సభ జరుపుతాడు.

ఎక్కడెక్కడ పంటలు పండలేదో, ఎక్కడెక్కడ ప్రజలకు సహాయము కావలసి యున్నదో చర్చించి, ఈ విధముగా చేయవలెనని నిర్ణయించి, తాను లోనికి వెళ్ళిపోతాడు. బ్రహ్మదత్తప్రభువు మరల సంధ్యావందనము చేయును. జపతపాలు అయిన వెనుక ప్రభువు నూత్న విషయాలు శాస్త్రాలు చదువుకుంటాడు. భోజనాలవుతాయి. కొంతకాలానికి ప్రభువు తన శయన మందిరానికి వెళ్ళిపోవును.

దేశం అంతా సుభిక్షమే ఉన్నప్పుడు, దేశంలో ధర్మం ఆనంద నాట్యం చేస్తున్నప్పుడు, రాజులు నూతనాలయాలు, చైత్యాలు, గుహలు, నూత్న రాజపథాలు, సత్రములు, వైద్యశాలలు నిర్మిస్తారు. ఇప్పుడు ఆంధ్ర మహాసామ్రాజ్యములో యజ్ఞశ్రీ తన పూర్వీకులనాటి ధర్మం నిర్వహిస్తున్నాడు.

ఆడవిబ్రహ్మదత్తప్రభువునకు నిద్రపట్టదు. ఆయన ఆలోచిస్తూ తన శయన మందిర ప్రాంగణానకు వచ్చి, అచ్చటనుండి మెట్లమీదుగా పూలతోటలోనికి దిగి, ఆ తోటలో ఇటునటు నడయాడుతూ, గాథలు పాడుకుంటూ, రామాయణాది మహాకావ్యాలనుండి శ్లోకాలు చదువుకుంటూ ఏదియో ఆలోచిస్తూ చివరకు రెండుయామాలయిన వెనుక భగవంతుని ప్రార్థించి శయన తల్పం చేరుతాడు.

2

విజయపురం ఒక మహానగరం. ఈ నగరం చుట్టూ ఎత్తయిన కొండలున్నాయి. కొండల పైకి ఒక్కటేదారి ఉంది. ఈ మహానగరానికి తూర్పుగా ఉన్న కొండలలో ఒకచోట కొంత ఎత్తు తక్కువ ప్రదేశం ఉంది. అక్కడికి ఒక రాజపథం నిర్మించారు. అక్కడే ఒక పెద్దకోట గోడ, నాలుగు పెద్ద బురుజులు ఉన్నాయి. తక్కిన కొండల పైన అక్కడక్కడ బురుజులు మాత్రం ఉన్నాయి. ఈ మహానగరానికి కృష్ణవైపున రెండు లోయలున్నాయి. నగరంలో నూరు మహాకూపాలున్నవి. అమృతంవంటి నీటితో నిండి ఉంటాయి ఆ నూతులు.

కృష్ణ ఒడ్డువరకు రెండు లోయలలోను నగరం ఉన్నది. నగరం మధ్యనుంచి రెండు పెద్దరాజవీధులు కృష్ణ ఒడ్డునకు వెడతాయి. నగరం చుట్టి ఉన్న ఉత్తుంగగిరులపైన పడిన వాన నగరం మధ్యకు ప్రవహించి, రెండు వాగులై వస్తుంది. రెండు వాగులు రెండు లోయలగుండా పోయి కృష్ణలో కలుస్తాయి. వాన వచ్చినప్పుడు తప్ప ఈ వాగులలో నీరుండదు. ఈ రెండు వాగులకు నగరానికి దక్షిణంగా ఒక పెద్ద చెరువు నిర్మించారు నగర ప్రభువులు. ఆ చెరువునుండి అనేకమైన కాలువలు భూమిలో నిర్మించినారు. నగరమంతట ఉన్న తోటలకు, కేళాకూళులకు, క్రీడావనాలకు, సంఘారామాలకు ఆ కాలువలగుండా నీరు వస్తుంది. ఈ కాలువల నిర్మాణం వాస్తు శాస్త్రజ్ఞులు అద్భుతంగా నిర్వహించారు. భూమిలో లోతుగా కాల్వలు త్రవ్వినారు. ఆ కాలువలలో గట్టిరాళ్ళు దిమిస చేసిరి. ఆ రాళ్ళపైన చిన్నకాలువగా గాంధారించిన గట్టిరాళ్ళను వరుసగా పేర్చిరి. ఆ రాళ్ళపైన గాంధారించిన రాళ్ళను బోర్లింపగా, వాని మధ్య నలుపలకల గొట్టము ఏర్పడినది. ఆ పైన రాళ్ళతో నింపి కాలువ పూడ్చి సాధారణ భూమిని చేతురు.

విజయపుర మనగా ఆరామనగరమని ఆ కాలంలో పేరు మ్రోగిపోయింది. ఆ మహానగరంలో ఫలవృక్షముల తోటలు, తోటల మధ్య భవనములు ఉన్నవి. రాజవీధుల కీవలావల మనుష్యపథములు, వానికి పక్కగా ఫలపుష్ప వృక్షములున్నవి. నీలవర్ణములైన పర్వతాలపైనుండి క్రిందికి చూచినచో నగరమంతయు దివ్యవనవాటికవలే దర్శనమిచ్చును. దేవతలుకూడ ఆకాశ సంచారముమాని ఈ దివ్యనగరము చూడవత్తురట.

విజయపుర మహాచైత్యం జగత్ర్పసిద్ధము. కాబట్టే దేశదేశాల నుండి బౌద్ధభిక్షువులు విజయపురమునకు వచ్చి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ధాన్యకటక మహాచైత్యంలోవలె విజయపురమహాచైత్యంలోనూ తధాగతుని దివ్యధాతువు నిక్షిప్త మైనదట. విజయపురంలో ఎన్ని సంప్రదాయాలవారో సంఘారామాల నిర్మించుకొని ఉన్నారు. కాబట్టే జంబూద్వీపం అన్ని మూలలనుండి బౌద్ధభిక్షువులు ధాన్యకటకంతోపాటు విజయపురం కూడా దర్శించిపోతూ ఉంటారు. సింహళ భిక్షువులు నగరానికి వాయవ్యాన ఉన్న శ్రీపర్వతంమీద సంఘారామాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. ఆ పర్వతంమీద ఇంకో చిన్న నగరం వెలిసింది. (ఈ దినాలలో శ్రీపర్వతానికి నల్లరాళ్ళబోడు అని పేరు.)

అడవిప్రియ బలదేవదత్త ప్రభువు ఇక్ష్వాకులకు దండనాయకుడు, మహాతలవరి. విజయపుర పరిపాలకుడు ఇక్ష్వాకు మహాప్రభువు పల్లవ భోగానికి, నాగమహావిషయమునకు మహారాజై శాతవాహనులకు మహాసామంతుడుగా పేరు పొందినాడు. దేవదత్తుని అనంతరమందు అడవి ధనకవంశజుడు స్కంధవిశాఖాయనక బ్రహ్మదత్తప్రభువు విజయపుర నగరపాలనాధికారం వహించగానే శ్రీశ్రీ శాంతిమూల మహారాజు బ్రహ్మదత్తునికి వీరఖడ్గము ప్రసాదించినారు.

బ్రహ్మదత్తప్రభు వాఖడ్గము ధరించి తన ఉత్తమాజానేయ, మధివసించి ఆ ఫాల్గుణ శుద్ధ విదియ ఉదయాన రెండవముహూర్త ప్రారంభంలో మహారాజు కోటగోపురం కడకు సపరివారుడై వెళ్ళినాడు. బ్రహ్మదత్తుని చూడగానే గోపుర ద్వారపాలకులు దళపతులు వీర నమస్కారాలిడినారు. బ్రహ్మదత్తుడు తిన్నగా కక్ష్యాంతరాలు దాటుచు మహాసభా భవనం ఎదుట గోపురంకడ తనవారువం దిగి లోనికి పాదచారియై వెళ్ళినాడు. అక్కడ దళపతులు, రక్షకులు బ్రహ్మదత్తునికి వంగి నమస్కారాలుచేసి సగౌరవంగా లోనికి “ఇటు ఇటు దేవా!” అని దారి చూపినారు.

బ్రహ్మదత్త ప్రభువు మహాసభామందిరం ప్రవేశించినాడు. సభలోని వారందరు లేచి ప్రభువునకు నమస్కారా లర్పించారు. బ్రహదత్తుడు ప్రతి నమస్కారాలిస్తూ సింహాసన వితర్దికకు కుడివైపున చిన్న పాలరాతి వితర్దికపై అధివసించినాడు. సభ్యులందరు ఆసీనులైరి. ఇంతలో తొమ్మిది శంఖాలు, మూడు కాహళాలు, మూడు విజయభేరులు వైతాళికుల జయజయధ్వానాలు వినవచ్చినవి. విప్రాశీర్వాదాలు, బౌద్ధభిక్షుకాశీర్వాదాలు వినబడుతూన్నవి. బ్రహ్మదత్తుడు, తక్కిన సభ్యులు ఒక్కుమ్మడి నిలబడినారు. సభాభవనానికి మహారాజు ప్రవేశించే సింహద్వారంలోంచి పండిత భిక్షుకాది పరివేష్ఠితుడై, వైతాళికులు బిరుదాలుపాడ మహారాజు విజయం చేసిరి.

“జయ జయ జయ శ్రీ ఇక్ష్వాకువంశ చూడమణీ! జయ జయ మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక! జయ జయ ఆంధ్రశాతవాహన సార్వభౌమ ప్రసాదాత్త సింహాసన! జయ జయ! విరోధి మత్తగంకుంభ విదారణ పంచాననా! జయ జయ! వాసిష్టీపుత్ర శ్రీ శాంతిమూల మహారాజా! జయ జయ జయ!” అని విజయధ్వానాలు మిన్ను ముట్టినాయి. ఇక్ష్వాకు శాంతి మూల మహారాజు సింహాసనం అధివసించారు.

శాంతిమూల మహారాజుది బొద్దయిన విగ్రహం. తప్తకాంచన వర్ణుడు. మహా వీరుడు. ధనువుపై గుప్పెడు పొడవుండును. వెడద వక్షము. కోలమోము. గుప్పెడు మీసాలతో గంభీరమైన వదనము, విశాలఫాలము గల శుద్ధసత్వుడా మహారాజు.

3

శాంతిమూల మహారాజు సింహాసనం అధిష్టించగా సభ్యులంతా కూర్చున్నారు. మహారాజు: బ్రహ్మదత్తప్రభూ! చక్రవర్తి ధాన్యకటకానికి ససైన్యంగా రమ్మని, శాత్రవులు శాతవాహనులపై దండెత్తుతున్నారని వేరు వచ్చిందికదా! మీరు సన్నాహంలో ఉన్నారు కదా?

బ్రహ్మ: చిత్తం మహాప్రభూ! పూంగి రాష్ట్ర ప్రభువులనూ వేంగి వారిని ససైన్యంగా వచ్చి కలుసుకోమని వార్త పంపించగలవాడను. ఈలోగా మన సైన్యం అంతా సిద్ధం చేయగలను.

మహారాజు: బ్రహ్మదత్తప్రభూ! మీకు బ్రహ్మదత్త బిరుదము, తమ తండ్రిగారికి దేవదత్త బిరుదము ఊరికే రాలేదు. మీ ఆలోచన మాకు అవశ్యం ఆచరణీయము. శ్రీయజ్ఞశ్రీ చక్రవర్తి వృద్ధులైనారు. సామ్రాజ్యంలో ఎక్కడి ప్రభువులక్కడ స్వాతంత్ర్యం వహించాలని కాబోలు మహారాజ బిరుదాలు వహిస్తున్నారు. ఈనాడు ఈ హీనమతులవల్ల మన భారం అధికమవుతున్నది.

బ్రహ్మ: మహాప్రభూ! తాము నాయందున్న ప్రేమచే అలా సెలవిస్తున్నారు. నేను తమకు ఆలోచన చెప్పగలవాణ్ణికాను. ఈనాడు తాము కదా శాతవాహన సామ్రాజ్యం నిలబెట్టుతున్నది! ఒకనాడు ఇక్ష్వాకు వంశం సకలజగత్తును ఏలింది. హిమాచలంనుంచి గౌతమి వరకూ కోసలదేశం రెక్కలు చాచి ఉండేది. మహాప్రభూ! మొదటినుండీ తమ వంశీయులు ధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నారు.

మహారాజు: ప్రభూ! ఆ ఇక్ష్వాకుల ప్రతిష్ట ఇప్పుడు మాకు ఆవేదన కారణమయింది.

బ్రహ్మదత్తు: మహాప్రభూ! ఇప్పుడు సర్వదేశాలలోని పరిస్థితి ఆవేదన కారణమవుతున్నది. ధర్మరక్షణకొరకు యుద్దాలు తప్పవు. బుద్ధదేవుడు లోకంలో యుద్ధాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కాని మానవ ప్రకృతిని ఎవరు మారుస్తారు? మానవుడు కూడా ఒక్కొక్కప్పుడు ద్విపాద పశువు అయిపోతాడు.

సభ పూర్తి అయ్యేవరకూ మహారాజు శాంతమూలుడూ, దండనాయకుడూ, సేనాపతీ అయిన బ్రహ్మదత్తుడూ ఏవేవో మాట్లాడుతునే ఉన్నారు. సభలోని వారు కదలరాదు. మాట్లాడరాదు. అయితే ఎందుకు మహాప్రభువు ఒడ్లోలగమున్నారో తెలియలేదు. సభ్యులందరు మహారాజు ఆజ్ఞలకు, ఆలోచనకు ఎదురు చూస్తూ ఉండిరి.

మహారాజు కొన్ని విఘడియలు బ్రహ్మదత్తులతో మాట్లాడుచుండిరి. ఆ వెనుక బ్రహ్మదత్తప్రభువు సభ్యుల కనుగొని “మహారాజులవారు ససైన్యంగా ధాన్యకటకపురం వెడుతున్నారు. శ్రీ సార్వభౌములు యజ్ఞశ్రీ మహారాజు కోరడంచే అలా వెళ్ళవలసి వచ్చింది. మహారాజులవారితో నేను సేనాపతిగా వెడుతున్నాను. ఈలోగా రాజప్రతినిధిగా యువరాజులవారుంటారు. వూంగీయ రాష్ట్రపతి స్కంధప్రభువు యువరాజులవారికి బాసటగా విజయపురంలో రాజ్యం చూస్తూ ఉంటారు” అని తెలిపినాడు.

యువరాజులైన శ్రీ వీరపురుషదత్తప్రభువు ఆనందార్హతుల ఆశ్రమంలో ధర్మగిరి విహారంలోనే చదువుకొంటున్నారు. ఆ ప్రభువున్ను ధర్మగిరి దిగి మహాసభకు వేంచేసినారు. వారికి పదునెనిమిది సంవత్సరాలు. వారు శ్రీ శాంతిమూల మహారాజు సింహాసనమునకు ఎడమచేతివైపున యువరాజు సింహాసనం అధివసించి ఉన్నారు. బ్రహ్మదత్తప్రభువు మహారాజు భావాలు తెలియజేయగానే యువరాజు వీరపురుషదత్తప్రభువు లేచి తండ్రిగారి పాదాల వ్రాలి “మహాప్రభూ! నాకున్నూ తమ సేనతో రావడానికి అనుజ్ఞ ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” అని కోరినారు. మహారాజు చిరునవ్వుతో కుమారుని లేవనెత్తి అర్ధసింహాసనాన కూర్చుండబెట్టుకొన్నారు.

మహారాజు కుమారుణ్ణి చూచి "ప్రభూ! మీరు తప్పక రావలసిందే కాని, మీరు ముఖ్యంగా ఉజ్జయిని వెళ్ళవలసి ఉన్నది. ఇక్కడ వసంతోత్సవాలు అయినగాని మేము కదలము. రుద్రసేన మహారాజు మిమ్ము చూడాలనీ, మిమ్ము తమ హృదయానికి అదుముకోవాలనీ రాయబారము పంపినారు. మీరు మా ప్రతినిధులుగా పదివేల సైన్యం తీసుకొని ఉజ్జయిని వెళ్ళాలి” అని చిరునవ్వు మోమును వెలిగింప పలికినారు. వసంతోత్సవాలు ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పూర్ణిమ వరకు జరుగుతవి. ఇంక రెండు దినాలే ఉన్నది.

శాంతిమూల మహారాజు మాటలు ఎప్పుడూ గంభీరంగా ఉంటాయి. యుద్ధంలో ఎంత శుద్ధసత్వంతో విజృంభిస్తారో తదితర సమయాలలో అంత శాంతమూర్తిగా ప్రత్యక్షమౌతారు. దేవదత్తబిరుదాంకితుడూ, ఉత్తమ బ్రాహ్మణుడూ, సాంఖ్యాయనస గోత్రీకుడూ, ధాన్యకటకానికి తూర్పున ఉన్న ధనక రాష్ట్రాధిపుడు, ధనకవంశజుడు అయిన అడవిప్రియబల దేవదత్తప్రభువూ, శాంతి మూలమహారాజు సహాధ్యాయులు. శాంతిమూల మహారాజునకు నలుబది అయిదు సంవత్సరాలున్నవి. ఆయన విశాలఫాలంలో ప్రజాప్రియత్వం అమృత శాంతిమయమై ప్రజ్వలిస్తూ ఉంటుంది.

తండ్రి మాటలు యువరాజశ్రీ వీరపురుషదత్త ప్రభువునకు అర్థం కాలేదు. ఎందుకు తాను ఉజ్జయిని పోవాలి? రుద్రసేన మహారాజు తన్ను చూడాలని కోరడంలో ఉద్దేశం ఏమిటి? వీరపురుషదత్త ప్రభువు అంత కన్న ఆలోచింప దలచుకొనలేదు. మాఠరిగోత్రజ అయిన మహారాణి తన తల్లి సారసికాదేవితో తానీ విషయం మాట్లాడి, తన గురువు ఆచార్య ఆనందులవారి సెలవుపొంది, ససైన్యంగా ఉజ్జయిని వెళ్ళవలసి ఉంది. ఈ ఆలోచనలతో తన ప్రాణ స్నేహితుడైన బ్రహ్మదత్త ప్రభు వైపు చూచినాడు యువరాజు. ఆ సేనాపతి చిరునవ్వుతో “ప్రభూ! నేను ముహూర్తం పెట్టి సేవను సిద్ధంచేసి, సేనాపతిని నియమించి తమకు వార్త పంపుతాను” అని పలికినాడు.

సభ్యులెవ్వరికీ మాళవమహారాజు శ్రీ వీరపురుషదత్త ప్రభువును తమ కడకు రాయబారిగా ఎందుకు పంపుమని కోరినారో అర్థంకాలేదు. మహారాజు సాభిప్రాయంగా బ్రహ్మదత్త ప్రభువువైపు చూడగానే అచ్చట అధివసించియున్న పండితులు లేచి శ్రీశాంతమూల మహారాజును, వీరపురుషదత్త ప్రభువును, ధర్మప్రభువైన సేనాపతి స్కంధ విశాఖాయనక ప్రభువును, ఇక్ష్వాకులను, రాజకుటుంబాలను, సర్వలోకాన్ని ఆశీర్వదించారు.

అందరు లేచి తథాస్తనిరి. మహారాజు సింహాసనంనుండి లేచి యువకుడైన స్కందవిశాఖ ప్రభువు భుజంపై కుడిచేయిమోపి, యువరాజు వీరపురుషదత్తుని మహారాజ ప్రాసాదానికి రమ్మనికోరి వారిరువురితో వెడలిపోయినారు.

బ్రహ్మదత్తప్రభువుది సుందరమైన విగ్రహం. ఆ ప్రభువు ధనుః ప్రమాణము (ఈనాడు ఆరడుగులు) కంటే ఒక అంగుష్టము ఎక్కువ పొడుగువాడు. పెద్దతల, విశాలస్కంధము. ఏనుగుల మూర్ధాలవంటి భుజాలు, కొండచరియవంటి వక్షం, మధ్యమమైన కోలమోమూ, గోమూర్ధకటీ, తీర్చిన కనుబొమలు, ఎత్తైన నాసికామూలం, గరుడచంపక నాసికల సంశ్లేషమైన ముక్కు సమానమయిన ఉత్తరాధరోష్ఠాలు, కమలకల్ముల చిబుకమూ, అంబకర్ణాలు, పోతపోసిన కంచుకంఠము, సమమైన చెంపలు, స్నిగ్ధఫాలం వీనితో వెలిగిపోతూ ఉండే ఆతడు వేద వేదాంగ పారంగతుడు, బ్రహ్మజుడు. కనుకనే ఆ ప్రభువును బ్రహ్మదత్తుడనే వారు.

విశాఖాయనక ప్రభువు నడక సింహపు నడక. మాట గంభీరము. పైశాచీ ప్రాకృతపాలీ సమ్మిశ్రితమైన ఆంధ్రభాషలో అనర్గళధారగా కావ్యసృష్టి చేస్తాడు. ఆ కావ్యాలు వీణపై అతడు పాడుతూంటే రాళ్ళు కరిగిపోతాయని ప్రజలు చెప్పుకుంటారు. విశాఖాయనకప్రభువు శాంతిమూల మహారాజుతో కలిసి కక్ష్యంతరాలు దాటి, మహారాజ ప్రాసాదాంతర్గతి సభామందిరం చేరాడు. మహారాజు విశాఖాయనక ప్రభువును అచట నిలిపి, దౌవారికులు దారి చూపుతూ ఉండగా పరిచారకులు కొలుస్తూ ఉండగా యువరాజుతో కలిసి లోనికి వెళ్ళిపోయినారు.

మహారాజు వెళ్ళిపోగానే బ్రహ్మదత్తప్రభువు మందిరం మధ్యనున్న సింహాసనానికి కొంచెం దూరంగా ఉత్తర కుడ్యం ప్రక్కనున్న ఆసనంపై అధివసించినాడు. ఆ మందిరము సంపూర్ణాలంకారయుతమై కుబేరభవనాన్ని మించి ఉంది. గోడలన్నీ చిత్రాలతో నిండి ఉన్నాయి. అయినా ఆ భవనంలో అతిత్వమేమీలేదు. మహారాజు బ్రాహ్మణ భక్తి కలవాడు. అగ్నిష్టోమ మాచరించిన క్రతుకర్త, ఉత్తమ బ్రాహ్మణ క్షత్రియుడు. బ్రహ్మదత్తుడు ఆ మందిరంలో ఒంటిగా కూర్చుండి, ఏవేవో ఆలోచించుకొంటూ ఉన్నాడు. ప్రజలు భగవత్స్వరూపులు, రాజులు ధర్మస్వరూపులు, ఋషులు పుణ్యస్వరూపులు. ఇంక బౌద్ధభిక్షువులు కర్మానుష్టాన స్వరూపులా!

ఇంతలో కొందరు చెలులు కూడ రా ఒక సఖియ భుజంపై చేయి వేచి, పదియారేళ్ళ జవ్వని ఒకర్తు ఆ సభామందిరంలోనికి గంభీరంగా నడుస్తూ వచ్చినది. ఆ యువతి మందిరంలోని రాగానే బ్రహ్మదత్తుడు లేచి నిలబడినాడు. ఆమె బ్రహ్మదత్త ప్రభువును చూచింది. ఆమెను బ్రహ్మదత్తుడు చూచి తల వాల్చుకొన్నాడు. ఆయమ సౌందర్యము అనన్యము. అతని సౌందర్యము అద్భుతము. ఆమె తెల్లబోయి ఆగిపోయినది. వెంటవచ్చే సఖివైపు ఎవరు వీరు అన్నట్లుగా చూచింది. ఆమె ఆ మందిరంలోనే ఉండవలసినదని మహారాజు ఆజ్ఞ.

4

వరు ఈ బాలిక? ఇంత దివ్యసౌందర్య సమన్విత, ఎవరు ఈ బాలిక! ఇంత వర్ణనాతీత ఎవరు? అని అడవి బ్రహ్మదత్త ప్రభువు అనుకున్నాడు..

ఎవరు ఈయన? అని ఆ బాలిక అనుకొన్నది. అక్కడ ఉండుటా, వెళ్ళిపోవుటా? మహారాజు నన్నిచట ఉండుమనిరికదా? ఈ ప్రదేశం స్త్రీ జన సంచార యోగ్యమని మహారాజు ఎరుగరా?

ఇంతలో ప్రతీహారి వచ్చి, నిలువబడి ఉన్న స్కంధవిశాఖాయనక ప్రభువు వారివైపు వంగి చేతులు జోడించి, “ప్రభూ!” మహారాజకుమారి! మహారాజుల వారు వేంచేస్తున్నారు” అని మనవి చేసుకున్నాడు.

“ప్రభూ!” అని హృదయంలో ప్రశ్నించుకొన్నదా బాలిక. “మహారాజకుమారి! ఏమి శాంతిశ్రీ రాజకుమారియా” అనుకొన్నాడు బ్రహ్మదత్తుడు. ఈమె సౌందర్యము దేశాలలో రాష్ట్రాలలో కథలుగా చెప్పుకుంటారు. ఈమెను తనకీయవలసిందని ముసిక నగరప్రభువు పులమావి రాయబారము పంపినాడు.

ఇంతలో మహారాజు లోనికి వచ్చినారు. "అదేమి, నిలుచునే ఉన్నారు బ్రహ్మదత్తప్రభూ! తల్లీ! నిలుచునే ఉంటివేమమ్మా!” అని మహారాజు చిరునవ్వుతో ఇరువురినీ పలుకరించి, ఆసనంపై అధివసించి, ఎడం ప్రక్క ఆసనం పై బ్రహ్మదత్త ప్రభువునీ కుడిప్రక్క ఆసనంపై ఆ బాలికనూ కూర్చుండ నియమించారు.

వారిరువురు ఉపవిష్టులైన పిమ్మట మహారాజు; బహ్మదత్తప్రభూ! మా అమ్మాయి యీ బాలిక. శాంతిశ్రీకుమారి. చిన్నతనాన్నుంచీ బద్దదేవునిపై మహాభక్తి. ఆచార్య ఆనందదేవుల శిష్యురాలు. ఈమెకు ఆర్షధర్మ పరిచయం లేదు. సంగీతాది విద్యలూ రావు. తాము ఈ బిడ్డకు గురువులు కావాలని కోరడానికే మాతో కూడా తీసుకొని వచ్చినాము.

బ్రహ్మదత్తుడు ఆశ్చర్యమంది తానీ బాలికకు గురుత్వం చేయుటా! అని అక్కజం పడినాడు. మహారాజు: తల్లీ! ఈ ప్రభువు ధనకవంశశుక్తముక్తాఫలము. మహాపండితులు.

శాంతిశ్రీ : మహాప్రభూ! నేను అన్నీ విన్నాను.

సిగ్గు ఏమీ ఎరుగని శిశువువలె ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆమె కంఠము అమృతపూర్ణ మనుకొన్నాడు బ్రహ్మదత్తుడు.

మహారాజు :అవును తల్లీ! బ్రాహ్మదత్త ప్రభువునుగూర్చి వినవి వారెవ్వరు!

బ్రహ్మ : భర్తృదారిక విద్య విషయం....

మహారాజు : బ్రహ్మదత్తప్రభూ! మేము బాగా ఆలోచించాము. భర్తృదారిక చదువునుగూర్చి మహారాణుల కోరికపైనే తమ్ము మేము కోరుట.

బ్రహ్మదత్తుడు : మహాప్రసాదము. బ్రహ్మదత్తుడు శాంతిమూల మహారాజు సెలవంది తన కోటకు వెడలి పోయినాడు.

“ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజ్యం చేస్తున్నారు. వారు ధాన్యకటకం రాజధానిగా, కురవ, చోళవాడి, హిరణ్యరాష్ట్రం, కర్ణరాష్ట్ర, ముండరాష్ట్ర, వేంగిరాష్ట్ర పూంగీరాష్ట్ర కర్మరాష్ట్ర, ధనకరాష్ట్ర, దక్షిణకళింగాది ఆంధ్ర రాష్ట్రాలనూ, కుంతల, ఆశ్మక, ములక, అపరాంతక, మాళవ, మధ్యకళింగాది ఇతర చేశాలను పాలిస్తు ఉండిరి. మగధ చక్రవర్తి సింహాసనం ఎక్కిరి. నేపాలం జయించిరి. యువ, సువర్ణ, క్రౌంచ, ప్లక్షాది ద్వీపాలలో శాతవాహన వంశంవారు రాజ్యాలు స్థాపించారు. అలాంటిది నేడు, శాతవాహన సామ్రాజ్యము ముక్కలైపోతుంది అని భయంగా ఉంది. యజ్ఞశ్రీ శాతవాహన చక్రవర్తి దేశదేశాల సైన్యాలను ఆహ్వానించిరి. కప్పాలు అందుకొని వాజిపేయం చేసిన చక్రవర్తి నేడు వృద్ధులయ్యారు. వారికి ఇక్ష్వాకు ప్రభువులంటే ఉన్న నమ్మకం ఎవరిమీదా లేదు. అందుకని మహారాజును ససైన్యంగా రావలసిందని ఆహ్వానం పంపినారు. కుసుమలతాదేవి చక్రవర్తి కొమరిత అయినందున మహారాజుల వారిని త్వరలో ధాన్యకటకం వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. ఇదీ రహస్యం” అని బ్రహ్మదత్త ప్రభువు భోజన సమయంలో తన తల్లికి నివేదించారు.

“అవును తండ్రీ! అయితే చక్రవర్తి మహారాజులవారిని ఏమి కోరుతారు? రాజ్యం రక్షించవలసిందనీ, తమ కొమారులు యువరాజులవారైన శ్రీ విజయ శాతవాహన ప్రభువును తమ తదనంతరం సింహాసనం ఎక్కించి సహాయం చెయ్యవలసిందనీ కోరతారు. అంతేనా?”

“నిజం అమ్మగారూ”

“విజయశ్రీ ప్రభువు విషయంలో భయపడడానికి కారణం?”

“ఆ ప్రభువు చక్రవర్తివలె బుద్ధిబలం కలవారు కారు. అమిత స్త్రీ లోలుపులు.”

“కావచ్చు. అంతమాత్రాన భయమెందుకు?”

“విజయశ్రీ ప్రభువుకు ఏబది ఏళ్ళు పైన ఉన్నాయి. వారి పెద్దకుమారుడు చంద్రశ్రీ ప్రభువుకు ముగ్గురు భార్యలు, నలుబది మంది....”

“ఇంతకూ ”

“ఇంతకూ వీరి దాయది పులమావి ప్రభువు నక్కజిత్తులవాడు. చంద్రశ్రీకి కొమరులు పుట్టరని పులమావి ప్రభువుకు తెలుసును అమ్మగారూ!”

అడవిస్కంద విశాఖాయనక ప్రభువు తల్లిగారితో ఇష్టాగోష్టి మాట్లాడి ఆలోచనా మందిరానికి వెళ్ళినారు.

ఆ మధుమాసంలో ఆ రాత్రి మూడంతస్తుల మేడ పైన ఉప్పరిగమీద చల్లగాలి వీస్తున్నది. ఆ గాలిలో ఏవో మధురమనోహర మత్తతలు రంగరింపై ఉన్నాయి. తాను ఆ బాలికకు చదువు చెప్పాలని ఆ గాలులన్నవి. తన క్రీడావనంలో మల్లిక, మాలతి. మాధవి విరిసి మలయపవనాలకు మరీ మత్తతలు చేకూర్చినాయి.

తన రాష్ట్రము మళ్ళీ ఇంకొకసారి చూస్తాడు ప్రభువు. ధనక వంశ్యులు మొదటినుండి శాతవాహనులకు నమ్మకమైన సామంతులు. వారు గురుదత్తపురం (నేటి గురజాల) రాజధానిగా ధనకరాష్ట్రం రాజ్యంచేస్తూ ఉండిరి. ఇక్ష్వాకులు తమతోపాటు ఒకనాడు

ప్రతీపాలపురంలో సామంతులు. ముండకాది, పార్వతీయుల టక్కు అణగించి తమ రాజ్యమును స్థిరం చేయుడని అవతారపురుషుడైన శ్రీముఖ శాతవాహన మహారాజు కోరడం చేత ఇక్ష్వాకు మహారాజు విజయపురం నిర్మించి ఈ పార్వతీయరాజ్యం ఏర్పరచారు. ధనక కుటుంబంలోని తమ పూర్వీకులందరినీ చక్రవర్తి అటవీరాష్ట్రమైన కురవ దేశాన్ని ఓడించి రాజ్యం సుస్థిరం చేయవలసిందన్నారు. అందుకనే తన వంశంవారికి అటవిధనక ప్రభువు అని పేరు వచ్చింది. తనకు ఈ పురాతన చరిత్రాలోచన లెందుకు? మహారాజు తన బిడ్డకు నన్ను చదువు చెప్పమన్న మాత్రాన ఈ ఆలోచనలు కలగడం ఏమిటి? చదువు చెప్పడానికి కుటుంబ చరిత్రలకూ సంబంధం ఏమిటి? బ్రహ్మదత్తుడు అధివలసించి యున్న మంచము పైనుండి లేచెను.

ఆ బాలిక సౌందర్యము మానవాతీతం. ఆమె భౌద్దధర్మాభిరత. ఆమె వదనమునందు శాంతతేజస్సు వికసించి ఉన్నది. ఆ మోము శారదపూర్ణిమనాడు ఆకాశంలా ఉన్నది. అంత అందము మనుష్యులలో ఉండుట విచిత్రమే. ఆ బాలిక వికసించి లోకాన్ని దివ్యసురభిళాలతో నింపడం అద్భుత సంఘటనే! మహారాణి పారసికాదేవి సౌందర్యం నిరుపమానం. మహారాజూ అందకాడే. కాని ఈ అతిలోక సౌందర్యం ఎక్కడనుండి వచ్చింది రాజకుమారికి?

బ్రహ్మదత్త ప్రభువు ఉప్పరిగనుండి తన తోటలోనికి దిగినాడు. తోటలో ఏమో పరిశీలించు వానివలె ప్రతి పూలవృక్షమును ఆయన చూస్తూన్నాడు. ఎందుకీ మల్లియలు, చంపకాలు? ఎందుకీ పూలు? ఇవి చక్కని పండునైనా ఈయలేవు. మామిడిపూవు సువాసన గలది. నీటిచుక్క కన్న చిన్నపూవు. అయినా చంద్రబింబమంతటి పండును కూడా మనుష్యునికి అర్పిస్తుంది. తామరపూవు చంద్రబింబమంత ఉండి కూడా ఫలాన్ని ఇవ్వలేదే! ఎందుకీ పుష్పాలు? జంబుపుష్పము చిన్నది. అయినా దాని నల్లని ఫలం మధురమైంది.

5

శాంతిశ్రీ రాజకుమారి లోకైకసుందరి. ఆమె అద్భుత సౌందర్యము దక్షిణాపథ మందేకాక ఉత్తరాపథమందును ప్రసిద్ధి పొందినది. ఆ బాలికను వైజయంతీ మహారాజు కొమరుడు యువరాజు చూటకులచంద్రుడు విష్ణుస్కంద శాతకర్ణి ప్రభువు వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరిపోతున్నాడు. యజ్ఞశ్రీ శాతవాహన సార్వభౌముని తమ్ముని మనుమడైన పులమావి ప్రభువు శాంతిశ్రీ అందము విని ఆమెకోసం మరులుకొని విరహతాపం పడుతున్నాడు. మగధలో ఉన్న గుప్తమహారాజులు కూడా ఈ బాలికను వాంఛించారు. అపరాంతకపతి అభ్రకులార్ణవ చంద్రుడున్ను, పిష్టపుర ప్రభుపు కౌశికీపుత్ర ఈశ్వర సేన మహారాజు శాంతిశ్రీ అందము విని ఆబాలిక తనకు మహారాణి కావాలని వాంఛిస్తున్నాడు.

ఆ బాలికకు తాను జగదద్భుత సుందరినని మాత్రం తెలియదు. ఆమెకు తన అందాన్ని గూర్చి విచారణ చేసుకొనేబుద్దే కలుగలేదు. చెలికత్తెలు చెప్పుతూ ఉంటారు మహారాజు బాలికకు. స్త్రీలకూ, పురుషులకూ ఒక విషయం వినగానే అది చెప్పడం వారి ప్రకృతి. అది మార్పులతో విన్పించడం వికృతియైన ప్రకృతి. ఆ విషయాన్ని కవిత్వంలా చెప్పడం అద్భుత ప్రకృతి.

మహారాణుల శుద్ధాంతాలిలో అనేకం వినబడుతాయి. ద్వారపాలికలు, పారిపార్శ్వకలు, దాసీలు మహారాజు హర్మ్యంలో అనేకం వింటారు. అక్కడ ఉండే కంచుకులు, ద్వారపాలకులు, చారులు ఏవో చెప్పుకుంటారు. ఇవన్నీ రాజకుమారికలకు, రాణులకు తెలుస్తాయి. అలాగే శాంతిశ్రీ రాజ కుమారికకు ఎందరో యువరాజులు, మహారాజులు పరోక్షంగా తన్ను భార్యగా వాంఛించి రాయబారాలు పంపున్నారని తెలిసింది.

రాజకుమారిక అందంవంటి అందం ఒక్కొక్కశకానికి ఒకసారి రెండుసార్లుమాత్రం ప్రత్యక్షమౌతుంది.

రాజకుమారుడు వీరపురుషదత్తుడు చాల అందమైనవాడు. అతడు శాంతిశ్రీ అన్న. వీరిరువురు కవలలులా ఉంటారు. శాంతిశ్రీ అందానికి ఒక వీసపాలులో వీసపాలు తక్కువ రాజకుమార వీరపురుషదత్తుని అందము.

వీరిరువురి తల్లి మాఠరిగోత్రజ అయిన సారసికాదేవి. శ్రీ మాఠరి సారసికాదేవి, శాంతిశ్రీ అడ్డాల శిశువుగా ఉన్నప్పటినుంచీ దృష్టికొడుతుందనే భయంచేత ఇతరుల కంటబడనిచ్చేదికాదు. తాను తేరిపార చూచుటకే భయపడేది.

సారసికాదేవి బౌద్ధధర్మ పరాయణులైన కళింగాంధ్ర ప్రభువుల ఆడుబడుచు. పిష్ఠపురం రాజధానిగా ఈ మాఠరీగోత్రజులైన మహారాజులు శాతవాహనులకు ముఖ్యసామంతులై రాజ్యం చేస్తూ ఉండిరి. వారి ఆడబడుచు సారసికాదేవి. బుద్ధదేవుని యందు పరమభక్తితో మాఠర గోత్రజుడు శుభశ్రీ మహారాజు నూరేండ్ల క్రిందట బుద్ధగయనుండి ఒక బోధివృక్షశాఖ ఉత్సవాలలో పవిత్ర స్వర్ణపాత్రలో సప్తమృత్తికలు కలిపి ఫల్గుణినదీ జలాభిషేకం చేస్తూ కొనివచ్చి పిష్ఠపురంలో మహాసంఘారామం ప్రక్కను మహాచైత్యానికి తూర్పుగా పవిత్ర వితర్ధిక మధ్యను పాదుకొల్పినాడు.

ఈలాంటి శాఖే పూజ్య శ్రీ సంఘమిత్ర భిత్కుని శ్రీ మహేంద్ర భిక్కులు తామ్రపర్ణి ద్వీపంలో నెలకొల్పినారు. ఆనాటినుండి పిష్ఠపురానికి పాద బౌద్దమనీ, పాదగయ అనీ పేరు వచ్చింది.

మాఠరీ ప్రజలకు శాతవాహనులంటే అమితభక్తి. తరువాత శాతవాహనులు బౌద్ధధర్మము పరిత్యజించినా మాఠరీ ప్రభువులు మాత్రం ఆ ధర్మము పరిత్యజించలేదు. వారు ధాన్యకటక మహాచైత్యము, కంటకశైల మహా చైత్యము, ప్రతిపాలపుర చైత్యము సిద్ధనాగార్జున ప్రతిష్ఠాపిత మహాచైత్యము దర్శిస్తూ ఉండిరి. వారికీ, శాతవాహనులకూ, ఇక్ష్వాకులకూ ఎన్నేని సంబంధాలు ఉండేవి.

సారసికాదేవి బుద్ధధర్మపరాయణ. శాంతిమూల మహారాజు పట్టమహిషి. ఆమె బుద్ధభక్తి విషయంలో మహారాజు ఏ విధమైన అభ్యంతరమూ పెట్టలేదు. ఆమె బౌద్దధర్మాభిరతియై కొమరుని, కొమరితను తన గురువైన ఆనందార్హతుల పాదాలకడ చదువుకై అప్పగించింది. మహారాజు శాంతిమూల మహాప్రభువు ఆర్షధర్మ పరాయణుడు. గౌతమపుత్ర శ్రీశాతకర్ణి చక్రవర్తి కాలంనుంచీ ఇక్ష్వాకులు ఆర్షధర్మాభిరతు లయ్యారు. శాంతమూలుడు ఉత్తమ బ్రాహ్మణుడై అగ్నిష్టోమంకూడా చేశాడు. అయినా కరుణాత్మకుడైన ఆ మహాప్రభువు సర్వధర్మరతులను సమాన ప్రేమతో చూసేవాడు.

ఆనందార్హతులు నాగార్జున బోధిసత్వుల శిష్యులు. ఆర్యసంఘ సంప్రదాయ, దిఘ, మజ్జిమ నికాయ పారంగతుడు, పంచమాతులుక మహానుష్ఠానపరుడు, యోగీంద్రుడు.

శాంతిశ్రీకి చిన్నతనాన్నుంచీ అహింస, అష్టమార్గములు అంటే నమ్మకం. అవి ఆచరిస్తేనేగాని మనుష్యునకు గతిలేదని ఆమె చిన్ని హృదయానికి నమ్మకం. మాటలు వచ్చినప్పటినుంచి ఆ బాలిక ఒక్క పరుష వాక్యం అయినా పలికి ఎరుగదు. “వెఱ్ఱిబాగుల తల్లి!” అని మహారాజులున్నూ, మహారాణియు అనుకునేవారు బుద్ధపూజలు, చైత్య నిర్మాణాలు ఆటలలో, నందసుందరీ గాథలు మహాభిష్క్రమణ గాథలు వింటూ ఉండేది.

తండ్రి ఆర్షసంప్రదాయంగా జపతపాలు, గార్హస్థ్యాగ్న్యర్చననిత్యమూ జరుపుతూ ఉండేవారు. తమ పూర్వీకుడు అవతారమూర్తి అయిన రామచంద్రుని సర్వదా పూజించేవారు. పూర్వఇక్ష్వాకుల మహోత్తమ స్థితి, వారి తపస్సు వారి శక్తి, వారి దిగ్విజయ ప్రతిభ శాంతిమూలునికి పులకలు కలిగించేవి.

కొమరిత శాంతిశ్రీ ఎవ్వరితో వాదించేదికాదు. మేనత్తలు ఇద్దరూ ఇక్ష్వాకుల ఆడబడుచులు అయినందుకు అన్నగారి రామభక్తి వారికీ అబ్బింది. అయినా వారికిగాని, శాంతిమూల మహారాజుకుగాని, బౌద్ధధర్మమన్న అయిష్ట మేమీ లేదు. ఆనందులవారు ఆరు సంవత్సరాల క్రిందటనే పమ్నగ్రామం నుంచి పవిత్రప్రదేశమైన నాగార్జున దేవపవిత్రమైన విజయపురం విచ్చేసినారు.

శాంతిశ్రీకి బౌద్ధ ధర్మాభిరతులైన పిష్టపురాధీశులు మేనమామలు. మాఠరి యైన తల్లి పోలిక తెచ్చుకున్నది. తండ్రి తన్ను ఆ దండనాయకుడైన, స్కంద విశాఖాయనక ప్రభువుచెంత భగవద్గీత, రామాయణము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు చదువుకొమ్మని నంతనే ఆమె ఆశ్చర్యమందినది. తనకును, ఆ ఆర్షధర్మ గ్రంథాలకు సంబంధమేమి? తనకు గురువు కాబోవు ఆ మహాపురుషుడు అంత యువకుడే! వారు తనకు గురువు లగుట ఏమి? తండ్రిగారి ఉద్దేశమేమి?

బ్రహ్మజ్ఞాన సంపన్నులు, ఉత్తమ బ్రాహ్మణులు, సాంఖ్యాయనస గోత్రజులయిన ప్రియబలదేవదత్త ప్రభువు ఖ్యాతి ఆమె విన్నది. బౌద్ధభిక్షాచార్యులకు, దేవదత్తప్రభువులకు జరిగిన వాదోపవాదాలు, అందులో దేవదత్తుడు వాదమునందు అప్రతిమానుడై ఆచార్యుల నందరిని ఓడించిన సంగతి తన గురువులు ఆనందులవారు తన కుపదేశించారు. దేవదత్తప్రభువు తనయులు బ్రహ్మదత్త ప్రభువులు. పండితలోకము ఆయనకు బ్రహ్మదత్త బిరుదం ఇచ్చెనట. తండ్రితో సమమైన విద్యావంతులు. తండ్రికన్న మించిన జ్ఞానమూ ఉపజ్ఞా కలవారు. యుద్ధంలో తన తండ్రికి కుడిచేయి. బ్రహ్మదత్త ప్రభువు నెదిరించగల మేటి ఈ జంబూద్వీపంలోనే లేరు అంటారు. ఎంత శాంత తేజస్సు! అంత చిన్నవారయ్యు ఆ ప్రభువు విద్యలో అంత వృద్ధులట. ఆ ప్రభువును తనకు గురువుగా చేయుటలో జనకుల ఉద్దేశమేమి? శాంతిశ్రీ తన మందిరంలో ఆలోచించుకొనుచు కూర్చున్నది. ఆమె మేనత్త వూంగీయ మహారాణి కొమరిత శాంతశ్రీ కుమారి స్నేహితురాలిని చూడటానికి వచ్చింది.

“ఏమమ్మా శాంతిశ్రీ వదినా! ఏమిటి ఆలోచిస్తున్నావు.”

“ఏమీ ఆలోచనలేదు, మహారాజు నాకో నూతన గురువును ఏర్పాటు చేశారు.”

“వాసవదత్తకు ఉదయనుని ఏర్పాటు చేసినారా?” వూంగీయ శాంతశ్రీ చిరునవ్వు నవ్వింది.

“అంటే నీ భావం?” ఆమె చిన్న బిడ్డలా ఆ ప్రశ్న వేసింది.

“ఏముంది భావం? ఏదో బృహత్కథ జ్ఞాపకం వచ్చింది.”

“నేను ఆర్షధర్మం అభ్యసించలేదని మహారాజు....”

“అవును, వాసవదత్తా అంతే వదినా. ఆమెకు వీణపాట అంటే వల్లమాలిన ఇష్టం. మాళవంలో ఉన్న గురువులంతా నేర్పారట. కాని ఇంకా నేర్చుకోవలసిన సంగీత మహావిద్య చాలా ఉందట. అది నేర్చడానికి ఉదయన మహారాజు ఒక్కడేనట సకల ధరాతలంలోనూ ఉన్నది. అందుకని మాయా హస్తివ్యాజాన ఉదయనుని చండమహాకాళుడు అనే చండసేన మహారాజు బంధించి ఉజ్జయినికి కొనివచ్చి కొమరితకు గురువును చేసినాడు.

“నేను బృహత్కథ ఎరుగను శాంతా! మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారా?”

“బహ్మదత్త ప్రభువులు నీకు గురువులు కాబోతున్నారనీ మా అమ్మ గారే చెప్పినారు.”

“నువ్వు వచ్చి ఒకపక్షం దినాలయినది కాదూ, ఇక్కడకు ఇంత వరకు రాలేదేమి?”

“మామయ్యగారిని చూచాము, అత్తయ్యగార్లను చూచినాము. నువ్వు అక్కడ లేకపోయావు. అలా మూడు పర్యాయాలయినది.”

“నేను ఈమధ్య ఆనందార్హతులకడకు పాఠానికి వెళ్ళుతూ ఉంటిని.”

“అవును. ఈ మధ్య బావగారు మా పట్టణం వచ్చారు కాదూ?”

“యువరాజుగారి విషయం నాకంత తెలియదు.”

“యువరాజు మహాదండనాయక, మహాప్రభువులు. ఆయన విషయమే నీకు తెలియదూ! మీ అన్నగారి విషయమే నీకు తెలియదంటావు వదినా!”

ఇంతలో హమ్మశ్రీదేవి పెద్దకొమరిత బాపిశ్రీరాకుమారి అచటికి వచ్చెను. హమ్మశ్రీ శాంతమూల మహారాజు రెండవ చెల్లెలు. పల్లవరాజు కోడలు.

6

బాపిశ్రీ మేనమామ కొమరితను చూచి, “వదినా! నీకు బ్రహ్మదత్త ప్రభువు చదువు చెపుతారటగా?” అని ప్రశ్నించింది.

శాంతిశ్రీ: మీ నగరులోనూ తెలిసిందీ ఈ వార్త, బాపిత్రీకుమారీ!

బాపిశ్రీ కోపం అభినయించి “మేమిద్దరమూ నిన్ను వదినా అని పిలుస్తాము. నువ్వు మమ్మల్ని పేరులుపెట్టి పిలుస్తావు! నీకు ఆపేక్షలే లేవుసుమా” అన్నది. ఇక్ష్మాకు శాంతిశ్రీ తెల్లబోయింది.

అప్పుడు పూంగీయశాంతశ్రీ “అమ్మగారి శుద్దాంతంలో తెలిసింది. బాపిశ్రీకి తెలియదా? పిన్నిగారు హమ్మశ్రీకి తెలియదా?” బాపిశ్రీ: వదినా! మీ విజయపురం వసంతోత్సవానికి నే వస్తే

పూంగీయశాంతశ్రీ: మీ అన్నయ్యగారు ఉజ్జయినికి వెళ్ళుతున్నారటగా? వారు లేని వసంతపంచమి శిశిరపంచమే అవుతుందని భయంగా ఉంది వదినా?

బాపిశ్రీ: మూగదేవుడులా బదులు చెప్పవు. నీకు హృదయము ఏమి అర్థము అవుతుందీ?

శాంతిశ్రీ: చెల్లీ మామయ్యగారు గురువును ఏర్పాటు చేశారు, వదిన ఇక మనతో మాట్లాడదులే!

బాపిశ్రీ: అదికాదే అక్కా! గురువు దగ్గర అంచక్కగా చమత్కారాలూ అవి నేర్చుకొని ఇక మనలను మాటాడనే మాటాడ నివ్వదు.

పూంగీయశాంతశ్రీ: అవునవును. చదువుల సరస్వతై పోతుంది కాబోలు.

బాపిశ్రీ: అప్పుడు రతీదేవికే పాఠాలు నేర్పుతుందేమో?

ఇక్ష్వాకుశాంతిశ్రీ: ఏమో మీ మాటలు నాకు తెలియవుగాని నిజం చెబుతాను వినండి. నాకు ఆనందులవారి దగ్గర చదువుతప్ప ఇంకో చదువు అక్కరలేదు. అయినా మహారాజు ఆజ్ఞ పరిపాలింపక తప్పదు.

బాపిశ్రీ పూంగీయశాంతశ్రీ లిద్దరు శాంతిశ్రీ మాటలకు తెల్లబోయి నారు. వరి వారి తల్లుల అంతఃపురాలలో వినవచ్చిన విషయం ఒకరీతిగా, ఇప్పుడు శాంతిశ్రీ అనే విషయం వేరుగా ఉంది అనుకున్నారు. శాంతిశ్రీ వేళాకోళా లెరుగదు. ఎంత వేళాకోళం చేసినా, ఆ హాస్యాన్ని నిజము క్రింద భావించుకొంటుంది.

శాంతిశ్రీకి సంగీతం నేర్చుకొనుట తప్పుగా తోచినది. ఆవిద్య ఏనాడూ నేర్చుకోవాలని కోరలేదు. పాటలంటే విసుగువచ్చేది. కవిత్వమంటే ఆమెకు తలనొప్పి, కాని బోధిసత్వుని పరమపవిత్ర జాతక గాథలు ఎంతో ఆపేక్షగా చదువుకొంటుంది. సంగీతమూ, శిల్పమూ, చిత్రమూ బుద్ధదేవుని అర్చించడానికే అయితే సరేనట. అట్లు ఉపచరించని సంగీతము, నాట్యము బుద్ధధర్మాధిరతులకు పనికిరావట. అయినా శాంతిశ్రీ మహారాజకుమారి కంఠంలో అమృతాలు వాకలు కట్టుతవి. ఆమె మాటలే మధురము. ఆమె ఏదో రాగధోరణిగా వినయాది త్రిపీఠకాలు, ధర్మసూత్రాలు చదువుతూ ఉంటే వినేవారు “ఇంతకన్న దివ్యగాంధర్వం ఏమి కావాలి?' అని తన్మయులై పోదురు.

వాసిష్టీపుత్రిక శ్రీపూంగిరాణి శాంతశ్రీదేవికీ, ఆమె చెల్లెలు హమ్మశ్రీదేవికీ భౌద్ధధర్మం అంటే వెఱ్ఱి ఆపేక్ష లేదు గానీ బుద్దదేవునియందు భక్తి మాత్రం ఎక్కువే. వాసిష్టీ పుత్రిక శాంతశ్రీదేవి కొమరిత శాంతశ్రీ రాజకుమారికిన్నీ హమ్మశ్రీదేవి కొమరితలు బాపిశ్రీ షష్టిశ్రీ రాకొమరితలకున్నూ ఏదేవునియందు అంత భక్తిలేదు. శాంతశ్రీ బాపిశ్రీలు ఎలజవ్వనులు; షష్ఠిశ్రీ ఇంకా జవ్వనంలో అడుగుపెట్టుచున్నది.

అల్లరిపిల్ల శాంతశ్రీ రాకుమారి మహారాజకుమారిని చూచి, “వదినా ఒక్కపాట పాడవమ్మా” అన్నది. మహారాజపుత్రి శాంతిశ్రీని రెప్పవాల్చకుండా అయిదు నిమేషాలు చూచి నిట్టూర్చి, రెప్పలు వాల్చి, “వదినా! నాకు సంగీతమంటే ఇష్టంలేదు. మీరు భరత సూత్రాలు కూడా నేర్చుకున్నారు. మీరు ఆ విద్యలవే సభారం జనం చేయగలరు. నాకా గొడవలేదు. సంగీతం మారుని ఆయుధాలలో ఒకటి” అన్నది అస్పష్ట వాక్కులతో. శాంతశ్రీ బాపిశ్రీలు చిరునవ్వులు నవ్వినారు.

బాపిశ్రీ: వదినా నీకు సంగీతం ఇష్టంలేదంటే నేను నమ్మను. అయినా ఇష్టంలేదని అన్నావు గనుక అడుగుతాను, సంగీతానికి ఏమి దోషం వచ్చిందీ?

శాంతిశ్రీ: దోషం లేకపోలేదు. ఆ దోషం మనం చేసే భోజనంలో, ధరించే వస్త్రాలలో, అలంకరించుకొనే భూషణాదులలో, ఉపయోగించే సుగంధవస్తువులలో, నాసంచేసే ఈ మహాద్భుత అంతఃపురాలలో, జీవించే జీవితంలోనూ అంతటా ఉన్నది.

బాపిశ్రీ: బాగుంది వదినా, స్త్రీ పురుషులందరూ సన్యాసం పుచ్చుకోవాలంటావు నువ్వు.

శాంతిశ్రీ: పుచ్చుకుంటేనేకాని నిర్వాణం లేదుకదా?

శాంతశ్రీ: ఇంక సృష్టి ఎట్లాగు?

శాంతిశ్రీ: సృష్టి అంతా నిర్వాణానికి పోవలసిందే కదా! ఇవాళ కాకుంటే ఏనాటికైనా అది తప్పనిదే.

బాపిశ్రీ: భోజనం?

శాంతిశ్రీ: నిర్వాణ పథం కనుక్కునే వరకూ దేహపోషణ చెయ్యాలి. తర్వాత భోజనం ఎందుకు?

శాంతశ్రీ: వర్ధమాన జినమతం బోధిస్తున్నావా వదినా? నిరాహార దీక్షాప్రతుడై ప్రాణం | బలి ఇచ్చిన వానికి సద్గతి లభించి తీరుతుందంటారు జనులు.

శాంతిశ్రీ: నా మాటలకు అదికాదు అర్థం.

బాపిశ్రీ: కాకపోవచ్చును. కాని తాత్పర్యం ఒకటే కదా? శరీర ధారణం ఎలాంటిదో సర్వవిద్యలూ అలాంటివి కావా? ధాన్యకటక శిల్పం మాట ఏమంటావు?

శాంతిశ్రీ: విద్యలు తథాగతుని అర్చించడానికే అయితే తప్పు లేదంటినిగా.

బాపిశ్రీ: సంగీతంతో ఎందుకు అర్చించకూడదు?

శాంతిశ్రీ: సంగీతం మనం స్వీయానందానికే పాడుకొంటున్నాము. హృదయానందం ప్రాపంచికం. అష్టమార్గాలకు ప్రాపంచికానందం వ్యతిరేకం కాదా?

బాపిశ్రీ: చూచినావా అక్కా వదిన మాటలు?

శాంతశ్రీ: వదిన భిక్కుణి అవుతుందని విన్నాము కాదటే, అది నిజం అని ఇప్పుడు తేలిపోయింది.

7

మువ్వురు రాజకుమారికలు మాట్లాడుచుండగనే ఒక పరిచారిక అక్కడకు వచ్చి “జయము జయము రాజకుమారికలకు! పూజ్యశ్రీ రాజ వసిష్ఠులవారు మహారాజకుమారి నూతన విద్యారంభం, మాఘశుద్ధ పంచమినాడు వసంతోత్సవ ప్రారంభంలో ఉదయం ఘటికా తొమ్మిది విఘడియలకు మేషలగ్న పుష్కర కాలంలో అని సెలవిచ్చినారట. మహారాణి శ్రీశ్రీ సారసికాదేవి మహారాజకుమారికి నివేదింప నాకు ఆజ్ఞ ఇచ్చినారు” అని విన్నవించినది. మహారాజకుమారి శాంతిశ్రీ తల ఊపినది. “జయము జయము, రాజ కుమారికలకు! నాకు అనుజ్ఞ దయచేయించండి' అనినంత శాంతిశ్రీ తల ఊపినది. ఆ చారిణి వెళ్ళిపోయినది.

బాపిశ్రీ: మామయ్యగారు వెంటనే ముహూర్తము పెట్టించినారే!

శాంతశ్రీ: నీకు ఈ ముహూర్త బలమువల్ల చదువు బాగా సాగుతుంది వదినా!

శాంతిశ్రీ: సాగినా, సాగకున్నా నాకు ఒకటే శాంతశ్రీ!

బాపిశ్రీ: మా వదిన ద్వంద్వాతీతురాలు. కనుకనే చుట్టాలను బొడ్డు కోసినట్లు పేరుపెట్టి పిలుస్తుందేకాని వరుసలు పెట్ట పిలువదు.

శాంతశ్రీ: వదినను హాస్యం చేయకు చెల్లీ!

బాపిశ్రీ: అయితే వదినకు చదువు సాగదని నీకు అనుమానం ఎందుకు అక్కా?

శాంతిశ్రీ: మా నాయనగారు వచ్చారని తెలుసా నీకు, చెల్లీ!

బాపిశ్రీ: తెలుసును. మామయ్యగారు తమ సైన్యాలన్నీ చేకూర్చు కుని ధాన్యకటకం రావలసిందని ధాన్యకటకంనుంచి చక్రవర్తి ఆజ్ఞ!

శాంతశ్రీ: మామయ్యగారి సైన్యాన్ని నడిపే సేనాపతి ఎవరు?

బాపిశ్రీ: సేనాపతి బ్రహ్మదత్త ప్రభువులేకదా అక్కా!

శాంతశ్రీ: వారే! వదినకు నూతన విద్యాగురువులు వారేకదా? అందుకనే వదినను నీ చదువు ఎల్లాసాగుతుంది అని అడిగాను.

బాపిశ్రీ: వదినా! మామయ్యగారు వసంతోత్సవాలైన వెనుక వెడతారు కదా, ఎప్పుడు తిరిగివస్తారు?

శాంతిశ్రీ: యుద్దయాత్రకు వెళ్ళినవారు ఎన్నాళ్ళకు వస్తారో ఎలా తెలుస్తుంది?

అక్కడికి ఒక దౌవారిక వచ్చి, “మహారాజకుమారీ, మహారాజ కుమారులు తమ్ము చూడడానికి వచ్చినారు. లోనికిరా అనుజ్ఞ కోరినారు” అని విన్నవించింది. శాంతశ్రీ, బాపిశ్రీలవైపు వారి అభిప్రాయార్ధము శాంతిశ్రీ చూచినది. వారి మొగాలు జేవురించినవి.

శాంతశ్రీ : బావగారు వస్తే భయమేమిటి?

బాపిశ్రీ: నాకు కొంచెం సిగ్గు అక్కా!

శాంతిశ్రీ : నీకు సిగ్గు ఎందుకు బాపిశ్రీకుమారీ?

శాంతశ్రీ: బాగా అన్నావు వదినా! బావగారిని ప్రవేశపెట్టుమను.

శాంతిశ్రీ: రాజకుమారులు రావచ్చునని విన్నవించు.

శాంతిశ్రీ: ఆమాటలు అనుచు శాంతిశ్రీ లేచి ఆ మందిరము గుమ్మము కడకు వెళ్ళినది. బాపిశ్రీ లేచి వీరందరూ అధివసించిన పీఠముల తావు వదలి ఆ మందిర వాతాయనాలకడ ఉన్న భూర్జర తాళపత్ర లిఖితగ్రంథ మంజూషల కడకు పోయి, ఒక్కొక్కగ్రంథము పరిశీలించుచున్నది.

వాసిష్టి శాంతశ్రీ కొమరిత హారీతి శాంతశ్రీ చిరునవ్వు నవ్వుకొనుచు బావగారిరాకకు ఎదురుచూచుచున్నది. మహారాజకుమారి మాఠరి శాంతిశ్రీ గుమ్మముదాటి తన విద్యామందిరాన్ని అందిఉన్న సభాగృహంలోనికిపోయి, అది దాటి, ఆవలనున్న మందిర యానశాలకు పోయినది. అప్పటికి అప్పుడే యువమహారాజు మాఠరీపుత్ర వీరపురుషదత్త ప్రభువు నూరు మన్మథుల అందముతో నడిచి వస్తున్నాడు. అన్నగారు దగ్గరకు రాగానే శాంతిశ్రీ వారి పాదాలకు వంగి నమస్కరించింది. చెల్లెలిని భుజములు పట్టి వీరపురుష దత్తుడు లేవదీసి “చెల్లీ, నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉండి వచ్చాను” అన్నాడు. “శాంతశ్రీకుమారీ బాపిశ్రీకుమారీ నా చదువుల గదిలో ఉన్నారు” అని ఆమె అన్నతో ననెను. “మరీమంచిది. పదచెల్లీ!” అని రాజకుమారుడు ప్రత్యుత్తర మిచ్చినాడు.

అన్నయు చెల్లెలును లోనికి విచ్చేసినారు. పూంగీయ రాజకుమారి శాంతశ్రీయు, బాపిశ్రీ రాకుమారియు చిరునవ్వులతో సిగ్గు గదురు నెమ్మోములతో నిలుచుండి బావగారికి నమస్కారాలు చేసినారు. వారిని చూచి వీరపురుషదత్తుడు ప్రతినమస్కారాలిడి “మా మరదళ్ళు మేనమామ కొమారితతో ఏకాంత మున్నట్లున్నారు” అని సంతోషాన వికసించిన మోముతో పలికినాడు. శాంతశ్రీ బాపిశ్రీలు మాటలాడకుండ నిలుచుండిరి. శాంతిశ్రీ నవ్వుచు “వదినలు కూర్చోండి! నిలుచున్నారేమి, బావగారు కొత్తవారు కదా?” అనెను.

ఇక్ష్వాకువంశపు ఆడబిడ్డలు, ఇక్ష్వాకు రాజకుమారులు అందాలకు జంబూ ద్వీపం అంతట ప్రసిద్ధి పొందిరి. వీరపురుషదత్తుని అందము జగత్ప్రసిద్దము. ఆయనను ఆపరమన్మథుడని కవులు వర్ణింతురు. అతని మేనత్తలిరువురువారి యవ్వనంలో వేవురు రాజకుమారుల హృదయాలలో ప్రణయాలు ఉద్దీపింపజేసిరి. వారి కొమరితలకూ ఆ అందాలు అబ్బినవి. ఆనలువురదిదేవతలను కురూపులనుగా చేయజాలిన అందము. బాపిశ్రీ మోమించుకగుండ్రము, శాంతశ్రీ మోమించుకకోల. బాపిశ్రీ నుదురు అర్ధచంద్రము. శాంతశ్రీ నుదురు విశాల విశాలము. బాపిశ్రీ కనుబొమలు రెండు ఎక్కుబెట్టిన ధనస్సుకు పూర్వఉత్తరార్ధ దండభాగముల వంటివి, శాంతశ్రీ కనుబొమలు ఆకాశపు వంపుల వంటివి. బాపిశ్రీ నాసిక తిలపుష్పము, శాంతశ్రీ నాసిక శుకనాసిక. బాపిశ్రీ పెదవులు చిన్నవి, పక్వబింబాలు. శాంతశ్రీ పెదవులు మధ్యమాలు. కాశ్మీరకుసుమ రాసులు. బాపిశ్రీ, శాంతశ్రీలు కవలలవలె ఉంటారు. తీర్చిన రేఖలతో పోత పోసిన బంగారు విగ్రహాలు వారివి.

వీరపురుషదత్తుని ఈ బాలికలిద్దరు ప్రేమించుచుండిరి. వీరిరువురను ఆ యువరాజు ప్రేమిస్తున్నాడు. ప్రజాపతులు దక్షిణనాయకులు. పరమేశ్వరీ పరమేశ్వరు అర్థనారీశ్వరులు. ఇక్ష్వాకు శ్రీశాంతమూల మహారాజు గూడ దక్షిణ నాయకుడే. బ్రహ్మదత్తు డేకనాయకుడు. వీరపురుషదత్తుడు సౌందర్యజిత లోలుడు. వీరవిక్రమ విహారంలోను స్కందదేవ సమానుడు. అతని హృదయాన శాంతశ్రీ బాపిశ్రీలు ఇరువురు సమాన స్థానాలు ఆక్రమించినారు.

ఇక్ష్వాకు శాంతిశ్రీ అన్నగారికి శాంతశ్రీని బాపిశ్రీని వేలుపెట్టి చూపించింది. “ఈ ఇద్దరు మహారాజకుమారుని హృదయం దొంగిలించారు. మీ ఇద్దరూ ఒక్కరే ఇద్దరయ్యారా, ఇద్దరూ ఒకటయ్యారా!” అని చిరునవ్వు నవ్వింది.

“వదినా! ఈ అల్లరి ఎక్కడ నేర్చావు? మరి నేనేమి ఎరగనంటావు. నువ్వు ప్రతిజ్జాయౌగంధరాయణం చదవడం మరిచిపోకు. నీ గురువుగారినే చెప్పమను.” వీరపురుష: శాంతా! చిన్ననాటినుండి నువ్వు అల్లరిపిల్ల ! బాపిశ్రీ గడుసరిది. నాతో పందేలువేసి నిరుడు వసంతోత్సవాలలో నువ్వు ఓడిపోయావుగాని ఈఏడు బాపిశ్రీ వీణపాటలో నన్ను ఓడిస్తుంది.

శాంతిశ్రీ “ఈ ఇరువురితో పందెంవేసి మీరెప్పుడు జయించలేరు” అన్నది అన్నతో. వీరపురుష ఓటమి నిశ్చయం కనుకనే వసంతోత్సవాల అనంతరం నేను ఉజ్జయిని వెళుతున్నాను.

వసంతోత్సవాల అనంతరము తమ వసంతుడు ఉండడు కాబోలునని శాంతశ్రీ బాపిశ్రీల హృదయాలలో పిడుగులు పడినవి. బాపిశ్రీ వదనము వాడిపోయింది. ఆమె కన్నుల అశ్రువులు తిరిగినవి. శాంతశ్రీ తనలో ఒక్కసారిగా భయంకర తృణావర్తము ఉద్భవించి హృదయమును మనస్సును మెదడును దూదిపింజలు చేసి ఎగురవేసినా, మోమునందు గంభీరత వీడకుండా “చెల్లీ! అలా కంటనీరు పెట్టుకొంటావేమిటి? యువరాజులవారికి రాజకీయ వ్యవహారాలకంటే మనతో ఆటలు ప్రియమటే! చిన్ననాటి నుండీ మనతో ఊసుపోక బాల్యక్రీడలు ఆడినారేకాని యువరాజులవారి కిపుడు మనం కావలెనటే వెఱ్ఱిదానా! వారిని నువ్వు నేను ఆపగలమా?” అన్నది. ఆమె మాటలలో హృదయము కృంగిపోవుట ప్రత్యక్షమయినది.

శాంతిశ్రీ బాపిశ్రీలమధ్య అరమరలు లేవు. ఇరువురు గాఢంగా యువమహారాజ వీరపురుషదత్తప్రభువును ప్రేమిస్తున్నట్లు ఇరువురు నెరుగుదురు. ఒకరి రహస్య మొకరికి దెలిసినదేయనికూడ వారెరుగుదురు. ఇరువురకు ఓర్వలేనితనంలేదు. అతన్ని ప్రేమించడంలో తామిరువురూ ఒకే ఆత్మలోని రెండు ఛాయలనుకున్నారు. శాంతశ్రీ పూంగీప్రోలు మహాపట్టణంలో ఉన్నా బాపిశ్రీని తలవని నిమిషం ఉండదు. బాపిశ్రీ విజయపురంలో ఉంటూ శాంతశ్రీని తలవని నిమేషం ఉండదు. ఇరువురూ యువ రాజును తలపోయని క్షణమంటు ఉండదు. ఆ యిరువురకు వీరపురుషదత్తుడు కుమారస్వామీ, బోధిసత్వుడూ! అతని దివ్యసౌందర్యం వారికి పూర్ణ చంద్రికా ప్రకాశం. అతని మహాశౌర్యం అఖండ సూర్యతేజస్సు. వారిరువురు వీలయినప్పుడు కలుసుకుంటారు. ఇరువురూ తమ జీవిత మధ్యస్థుడైన యువరాజును గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆ బాలికలు చిన్ననాటి నుండి విజయపుర వసంతోత్సవాలలో యువరాజునే వసంతునిచేసి తాము పుష్పమహారాణులై అతనితో ఆనంద పరవశులై ఆటలాడు కొనేవారు. ఇంతవరకు ఒక సంవత్సరమైనా తప్పిపోక ఈ మువ్వురు వసంతోత్సవానికి అవసంత కుసుమాలై ఆడుకొంటున్నారు. నేడు ఆ వసంతోత్సవము మళ్ళీ అరుదెంచినది. తమ వసంతుడు తమ మన్మథుడు తమ భగవానుడు మళ్ళీ వసంతుడు కావాలి, తాము వనదేవీ, వాసంత కావాలి. మహారాజ పుత్రితో శాంతశ్రీ “వదినా, మేమిరువురమూ, సెలవు పుచ్చుకొంటాము” అన్నది వినీ వినరాని నిట్టూర్పుతో.

శాంతిశ్రీ: అప్పుడే వెడతారా వదినలిద్దరూ? ఎల్లుండి ప్రారంభించబోయే వసంతోత్సవాలకు వాసిష్టిభట్టిదేవి రాకుమారి కళింగమునుండి దాసదాసీజన పరివృతయై మహా వైభవంగా వస్తుందని వారికి అంతకుముందే తెలిసినది. వాసిష్ణులకు ఇక్ష్వాకులైన హారీతసులకు ఎన్నితరాలనుండో సంబంధాలు ఉన్నవి. అదివరకే అంతిపురాలలో చాలా కాలంనుండి వాసిష్టి భట్టిదేవిరాకుమారుని వీరపురుషదత్తుని కల్పింప సంకల్పించిఉన్నారు. శాంతి మూలుని కోర్కెఅది. యువరాజు ఉజ్జయిని వెళ్ళుచున్నాడు అంటే క్షాత్రప రాజకుమారిని చూచుటకే అని ఆ రాజకుమారికల కిరువురకు తోచినది. ఈ ఆలోచనలతో వారిరువురూ క్రుంగిపోయినారు.

బాపిశ్రీని, శాంతశ్రీని వీరపురుషదత్తుడు తేరిపారచూచాడు. ఆ బాలిక లిరువురూ, వెన్నెలా వెలుగూ, పుష్పమూ సుగంధమూ, గీతమూ రాగమూలా మూర్తించి ప్రకాశించినారు. సాధుహృదయ అందాలబాల బాపిశ్రీ వేడిగాడ్పు తగిలిన కలువపూవువలె వడిలిపోయింది, సూర్యకాంతి తగిలిన వజ్రమువలె శాంతశ్రీ మండిపోయినది.

చెల్లెలు ప్రక్కనున్నదని మరిచిపోయి, వానలు కురిసినప్పుడు ఉప్పొంగే నదిలా యువరాజు లేచినాడు. బాపిశ్రీ కడకుపోయి ఆ బాలికను తన కుడిచేతితో ప్రక్కకు లాగికొని బిగియార వామహస్తాన చుట్టివేసినాడు. శాంతశ్రీ కడకుపోయి పొంకాలు తిరిగిన దక్షిణ బాహువుచే ఆమెను చుట్టి ఇద్దరిని ఒక్కసారిగా తన హృదయాన కదుముకొన్నాడు.

“శాంతా! బాపిశ్రీనికా! నేను మహారాజుల ఆజ్ఞచొప్పున ఉజ్జయిని వెళ్ళవలసి వచ్చింది. వెంటనే తిరిగివస్తాను. ఒక్కటే నామాట నమ్మండి. మీ ఇద్దరికీ నా హృదయం మన బాల్యంనుంచీ అర్పించుకొన్నాను. రాజ్యావసరాల కొలది ఇతర రాకొమరికలు నా జీవితంలో ప్రవేశింతురుగాక; వారిపట్ల ధర్మం నిర్వహిస్తాను అంతే!” అని రాకొమరుడు వారి మూర్ధములను ఇటు అటు తిరిగి చుంబించినాడు.

శాంతశ్రీ ఆశ్చర్యం పొందింది. బాపీశ్రీ ఆనందంతో ఉప్పొంగిపోయి త్రవతియై తలవాల్చింది. వారిరువురు నెమ్మదిగా యువరాజు కౌగిలిలోనుండి ఈవలకు వచ్చినారు. మహారాజకుమారికి అన్నగారిమాటలు, మూర్దాఘ్రాణాలు మొదలే అర్థము కానివి. శాంతిశ్రీయు, బాపిశ్రీయు బావగారికి నమస్కరించి, శాంతిశ్రీని కౌగిలించుకొని, వారిరువురి అనుమతి నడిగి వెళ్ళిపోయినారు. వారిని ఆ మందిర కవాటంవరకు యువరాజు, ఆయన చెల్లెలు సాగనంపి వచ్చారు.

“చెల్లీ! నువ్వా ఆసనం అలంకరించు. శ్రీ నాయనగారి తల్లి పుట్టిన రాజ్యం ఎరుగుదువుగా, మధ్యకళింగం? దేవరాష్ట్రాధిపతులు వాసిష్టులు మనతాతగారి అత్తవారు. మన మేనమామలు మాఠరులకు, ఆ వాసిషులకు ఎన్నాళ్ళనుంచో సంబంధ బంధవ్యాలున్నాయి. ఆ వాసిష్టులు మధ్యకళింగానికీ, మాఠరులు దక్షిణకళింగానికీ మహారాజులు. చక్రవర్తికి మనతోపాటు మహాసామంతులు. కానీ నాయనగారిది దూరదృష్టి చక్రవర్తి అవసాన దశలో ఉన్నారు. చక్రవర్తి కొమరుడు, మనుమడు ఇద్దరూ ప్రజ్ఞారహితులు. వారు సింహాసనం ఎక్కినా నామకఃమాత్రమే! మహాసామ్రాజ్యము ఎవరు కాపాడేది? ఆ మహాభారము భరించవలసినది మన ఇక్ష్వాకు వంశమే!

“అందుకే రాజ్యబలంకోసం అనేక రాజకుటుంబాలతో వియ్యాలంద బోతున్నారు నాయనగారు. పిష్టపురంనుంచి మాఠరులూ, దేవపురంనుంచి వాసిష్టులూ మనకు బలం చేకూరుస్తారు. వారు తమబాలిక భట్టిదేవిని నాకు ఉద్వాహం చేయాలని సంకల్పించి రాయబారం పంపించారు. నా హృదయం శాంతశ్రీ, బాపిశ్రీలకు దత్తమైనది. నువ్వుతప్ప నాకు ఆలోచన చెప్పేవారులేరు. ధనకప్రభువు ఆలోచనపైననే, మహారాజు నాకడకు పూంగీయప్రభువును రాయబారము పంపించారు. ఆ మామయ్యగారు, తమ కొమరిత విషయం ఎరిగి ఉండి కూడా అత్తయ్యగారి సంప్రదింపుతోనే నాదగ్గిరకు వచ్చారుట!” అని చెల్లెలి వేపు యువరాజు దీనంగా చూచాడు.

“వాసిష్టీ రాజకుమారిని మీరు వివాహం చేసుకోవాలని రాజధర్మం విధిస్తున్నది.”

“ఉజ్జయినీవారు మన సహాయం అర్థిస్తున్నారు. వారి సామంతులు వాకాటులూ, నలులూ తిరుగుబాటు చేస్తున్నారు. మృగ రాజుబలం తగ్గగానే చిన్న చిన్న జంతువులన్నీ తలలెత్తుతాయి. చక్రవర్తి దిగ్విజయంచేసి పది సంవత్సరాలయింది. దేశంలో ప్రతి మహాసామంతుడు చక్రవర్తి కావలెననే! అందులో చక్రవర్తి దాయాది పులమావిప్రభువు ప్రతి చిన్న సామంతునితోను కుట్ర చేస్తున్నాడు. అందుకే మాళవమహారాజు మన సహాయం అర్ధించి ఉండవచ్చు.”

“అన్నయ్యగారూ! మీరు చెప్పింది నిజం.”

శాంతిశ్రీ సర్వశాస్త్రాలూ చదువుకొన్నదానివలె ఇరువైపుల హెచ్చు తగ్గులు సరిచూచి చెప్పినట్లు తీరుపు చెప్పినది.

8

వీరపురుషదత్త యువరాజు ఆశ్చర్యమున చెల్లెలివంక చూచినాడు.

వీర: మనకు క్షాత్రవులు చుట్టాలు. వెనక శ్రీ పులమావి చక్రవర్తి క్షాత్రప రాకుమారిని ఉద్వాహమైనాడు. క్షాత్రపరుద్రసేన మహారాజుకు శ్రీరుద్ర దేవభట్టారకకుమారి అను సౌందర్యనిధియైన పదునారేండ్ల బాలిక ఉన్నది.

“అన్నగారూ! ఈ రాచకార్యాలకు, పెళ్ళిమనువులకు ముడిపెట్టడం నావల్ల నేమవుతుంది? నేనేమి ఆలోచన చెప్పగలను? మీరు ఆనందార్హతాచార్యులతో ఆలోచించండి.”

“ఇంతకు నేను ఉజ్జయిని వెళ్ళడం?

“వసంతోత్సవము వెళ్ళగానే మీరు వెళ్ళుతున్నారు కాదా?”

“అది రాజాజ్ఞ!”

“అలాగే వెళ్ళిరండి. ఇంక ఒకవిషయం; నాకు ఆనందార్హత గురుదేవుల శుశ్రూషమానడం ఇష్టంలేదు.”

“నిన్నెవరు మానుమన్నారు తల్లీ?”

“మహారాజులు, శ్రీబ్రహ్మదత్త ప్రభువుకడ ఆర్షధర్మాలు, దర్శనాలు నేర్చుకో వలసిందని ఆజ్ఞ ఇచ్చారు.

“స్కందవిశాఖాయనక ప్రభువు ఇంకా యువకులు. ఆయన చెంత శుశ్రూష ఉచితమా అని సందేహిస్తున్నాను. ఆయన జగద్విఖ్యాత పండితులనేది నిజమే కాని నాకేమో మనస్కరించడంలేదు. అయినా కారణంలేకుండా మహారాజు ఇలాంటి ఏర్పాటు చేస్తారా?” “చదువు ప్రారంభానికి శుభముహూర్తం కూడా నిశ్చయించారు!”

“నీకు యిష్టంలేదా?”

“లేదు.”

“ఎందువల్ల? ఇందులో భయపడవలసిందేముంది?”

“భయం కాదండీ, ఇంత బుద్దధర్మమూ చదివి, మళ్ళీ ఆర్షధర్మమా?”

“తల్లీ! ఎంత వెఱ్ఱిదానవు. నాయనగారు శ్రీరామచంద్రుని భక్తులు. దేవతల ప్రీతికోసం క్రతువులొనర్చి సర్వప్రజాసౌభాగ్యంకోసం కర్మయోగం సలిపే రాజర్షులు. వారి కొమరితకు ఆర్షధర్మం విజాతీయం కాదుకదా?”

“వినండి.”

“అవధారు!”

“ఏదో దిగులుగా ఉన్నది నాకు.”

“ఒక్కవిషయం చెప్పుతున్నాను విను శాంతీ! మనుష్యులందరూ సర్వధర్మాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నంత మాత్రాన మనకు ప్రీతిపాత్రమగు ధర్మము మనలో నీరసించిపోయే టట్లయితే, ఆ ధర్మము ఉన్నాఒక్కటే, లేకపోయినా ఒకటే! ఏ ధర్మమూ నిత్యముకాదు. లోకంలో అనేక ధర్మాలు యుగయుగానికీ శకశకానికి మారుతూ ఉంటాయి. బౌద్ధధర్మమే ఎన్ని రూపాలు తాల్చలేదు తల్లీ! ఈ ధర్మాలలో బలముకలవి కొన్ని తరాల వరకు ఉంటాయి. కొన్ని వెంటనే నశించిపోతాయి. ఆర్షధర్మం అంటే భయమా అని నేను ప్రశ్న అందుకనే వేసినాను. ధనక ప్రభువును గురువుగా ఒప్పుకో చెల్లీ!” యువరాజు చెల్లెలు నమస్కరింప ఆశీర్వదించి, ఆమెను దరికి చేర్చుకుని తలపై చేయివైచి కురులు సవరించి, “ఆర్షధర్మాలు నేర్చుకోనని పట్టుబట్టకు తల్లీ!” అని వెడలిపోయినాడు.

ఆ జగదద్భుతసుందరి స్నానమాడి శుభ్రవస్త్రాలు ధరించి కచ భాగ్యము తలపై పరిష్కారిణులు ముడిగా రచింప బుద్దపూజా గృహానికి పూజకై పోయినది.

మగవారు మరచిపోయినా స్త్రీ లోకం ధర్మాన్ని మరవలేదు. ఆంధ్ర మహాదేశంలో బౌద్ధధర్మం కొంచెం తగ్గిపోయి, మరల ఆర్షధర్మం నూతన రూపంలో మొలకెత్తినది. అయినా ఆంధ్ర వనితామణులు బుద్దారాధన కొనసాగిస్తూ, సంఘారామాలకూ, స్తూపాలకూ విరివిగా దానధర్మాలు చేస్తున్నారు. శిధిలములయ్యే చైత్యాలను బాగు చేయిస్తూనూ ఉన్నారు.

పురుషులలో బౌద్దభక్తి పూర్తిగా నాశనము కాకున్నను శాతవాహను నాటి అఖండభక్తి తగ్గిపోయింది. వారూ బౌద్దారాధనలు చేస్తూ దానధర్మాలు చేస్తూనే ఉన్నారు. తమ స్త్రీలు భక్తితో చేసే ఆరాధనలకు, దానధర్మాలకూ ఆనందిస్తూ ఉన్నారు.

మాఠరి సారసికాదేవి శాంతహృదయ, పరమబౌద్ద భక్తురాలు. అయినా భర్తసలుపు అగ్నిసోమక్రతువున ఆమెయే సోమిదమ్మ అయినది. శాంతిమూల మహారాజు చెల్లెండ్రు, శాంతిశ్రీ హమ్మశ్రీలు వదినగారి యందు భక్తికలవారు. తమ చిన్నతనంనుండి బౌద్దధర్మాభిరతలై ఉన్నా బౌద్దధర్మ బోధనలను అంతగా చవిచూచి ఎరుగరు. సారసికాదేవి సకల విద్యాపారంగతురాలు. బౌద్ధధర్మ నిష్ణాత కాబట్టి మరదండ్రకు బౌద్ద నికాయాలూ, పీఠకాలూ, అభిధర్మసూత్రములు తెలియజెప్పేది. వాసిష్టీ పుత్రికలు శాంతిశ్రీ, హమ్మశ్రీ లిద్దరు బుద్దారాధన చేసిరి. మాఠరీ పుత్రి శాంతిశ్రీ ఆరాధన సామాన్యమయినది కాదు. అటు తల్లీ, మేనత్తలూ గురుత్వం చేసినదలా ఉండగా ఆ బాలికకు ఆనందార్హతలు ముఖ్య గురువులై బౌద్ధధర్మ సర్వస్వం కరతలామలకం చేసిరి. అట్టి శాంతిశ్రీకి ఈ బ్రహ్మదత్తప్రభువు గురువగుట యెట్లు? ఆయన ఎంత పండితుడైనా, సద్గుణ సంపన్నుడైనా నిమతాభిమాని కదా. బుద్ధదేవా, అహింసా పరమావతారా నువ్వు తప్పింపలేవా, నాకీక్రూరవిధి సంఘటన!” అని ఆమె పూజా గృహంలో మహాశ్రమణక విగ్రహం ముందు సమాలింగిత భూతల అయింది.

9

హారాజు ఆజ్ఞ అనుల్లంఘనీయము. రాజకీయాలలో పాల్గొంటూ, రాజ్యాలు పాలిస్తూ పవిత్ర బ్రాహ్మణవంశాలు నీచగతి పొందాయి. ఒక్కసారి శతవృద్దుడైన అవతారమూర్తి నాగార్జునదేవుని కలుసుకొని, ఆ మహాత్ముని ఆజ్ఞను గ్రహించడం ఉత్తమమని విశాఖాయనక ప్రభువు రథారూఢుడై శ్రీ పర్వత పాదానికపోయి, కొండ గుహలలోనుంచి కొండచరియపైకి, కొండ చరియపై నుండి శైలగర్భానికి తొలిచియున్న మెట్లనెక్కుచు శిల్పాలు చిత్రలేఖనాలు గమనింపకుండా, ఆ ధనకప్రభువు శైలశిఖర సమతలంపైన మహోత్కృష్ట ప్రజ్ఞతో ఆంధ్రబ్రాహ్మణ శిల్పవంశంవారు రచించిన మహా సంఘారామ విహార భవనాలకు పోయినాడు. ఆ భవనాల క్రిందిభాగము శైలశిఖరభాగమే, పై అంతస్థును మాత్రం సమతలంపైన పెద్దయిటుకలతో నిర్మించారు. ఈలాంటి అంతస్థులు నాలుగున్నాయి.

నాలుగవ అంతస్తులో కొండ లోయలన్నీ పరకించి చూడడానికి అనువుగా ఒక విహారమందిరం, ఆ మందిరానికి నాలుగువైపులా ద్వారా లున్నాయి. ఒకవైపు విజయపురి రాచనగళ్ళూ, కోటా కనిపిస్తవి. వేరొకవైపు కృష్ణానదీ, ఇంకో వైపు నగరము, నాలుగో వైపు కృష్ణానదిన్నీ, ఆ విహార మందిరంలో మొగలి ఆకు చాపలు నేలెపై మంచాలపై, పరచిఉన్నవి. ఆ చాపలన్నీ నూలువస్త్రాలకన్న మెత్తవై, కంబళులకన్న దళసరై ఉన్నాయి. ఆ మందిరంలో ఒక బంగారు బుద్దవిగ్రహం తూర్పువైపుగా ఉంది. పడమటి గోడచెంత ఎఱ్ఱగంధపు చెక్క మంచముపై పరచిన తూలికామృదుల కృష్ణమృగాజినముపై నొక శతవృద్దు కూర్చుండి ఉన్నాడు. ఆయనకు నూట పదిహేను సంవత్సరాలున్నవి. ఆ దివ్యపురుషుని దేహము ఈ షణ్మాత్రము వదలినట్లు లేదు. ఇంక ఆ విహారమందిరంలో ఏ వస్తువులు లేవు. శ్రీ నాగార్జునదేవుడు ఆరడుగుల పొడవువాడు. దక్షిణకోసలస్థమైన ఆంధ్రబ్రాహ్మణ వంశంలో ఉద్భవించిన అవతారమూర్తి నాగార్జునదేవుడు. ఆయన బోధిసత్వుడని ప్రజల విశ్వాసము.

సర్వవిద్యాపారంగతుడు. అవధిలేని జ్ఞానం రూపొందినమూర్తి. సకల జంబూద్వీపము, త్రివిష్టప చీనాదేశాలు, యవసువర్ణప్లక్ష్మ శాకశాల్మవి కుశక్రౌంచ పుష్కరాది సప్తద్వీపములు తిరిగి వచ్చినాడని ప్రతీతి. ఆర్జానార్ష ధర్మములు బుద్దధర్మమూ అత డవగాహించెను. బుద్ధదేవునితో పాటు నాగార్జునదేవుని భక్తిమై ఎల్లరు స్మరించేవారు. ఆయన జుట్టు పూర్తిగా నెరిసిపోయింది. దేహాన అనవసరమైన కండలేమీలేవు. చర్మపు కాంతి తగ్గిపోక దివ్యమై మెరుస్తున్నది. ఆయన మోమున దరహాస కాంతులు అతిలోక తేజస్సుల లీనమై సర్వ విశ్వాసాలను అమృతపు గలయంపి చల్లుతున్నవి. ఆయన రూపమే దివ్యమందాకిని.

నాగార్జునదేవుడు కోసలరాష్ట్ర బ్రాహ్మణుడై, మహావిద్వాంసుడని ఎనిమిదేండ్ల వటువుగానే పేరుపొందడంచేత, ఆంధ్రశాతవాహన చక్రవర్తి ఆ బాలకుని మంజుశ్రీ దేవుడని యెంచి పూజించెనట, ఆ మహాభాగుడు సర్వ విద్యాక్షేత్రములు సేవించి తిరిగి ఆంధ్రదేశానికివచ్చి ధాన్యకటక మహా సంఘారామంలో తాను రచించిన మాధ్యమికవాద సూత్రాలను శిష్యులకు నేర్పజొచ్చినాడు. ఆ మహాభాగుడు వాదనిష్టురుడు.

ఆశ్రమ నియమాలు ఉల్లంఘించిన పదివేవురు భిక్షులను వైశాలి నగర మహా సంఘసభ వెడలగొట్టినది. వారిలో ఆరువేలమంది ధాన్యకటక సంఘారామ, ప్రతీపాలపుర, కంటకశిలా సంఘారామాది వివిధ సంఘారామాలకు చెందిన భిక్షులు. వీరే మహా సాంఘికులని పేరుపెట్టుకొన్నారు. వీరికి వ్యతిరేకము మహాస్థ విహారవాదము. ఆంధ్ర మహాసాంఘికులను అంధక సాంఘికులని భారతీయ బౌద్ధ సంఘాలు పిలిచేవి. నిరీశ్వర వాదమైన భౌద్దము నానాటికి శుష్కమై సాధారణ ప్రజలకు రుచించడంలేదు. ప్రజాసామాన్యమునకు తర్కముతో బనిలేదు. వారిభక్తికి ఆధారము లేకపోయినది. కావుననే వారు బుద్దధాతువులు నిక్షిప్తమైన చైత్యాలను, బుద్ధదేవ చిహ్నాలయిన పాద, బోధివృక్ష, ధర్మచక్ర, పూర్ణకలశ చైత్యములను పూజించి, చివరకు బుద్దునే దేవుడన్నారు.

అది అదనుగాగొని ఆర్షధర్మవాదులు, బౌద్దమతాన్ని ఖండించి, మరల ఆర్షధర్మము పునరుద్దరింప సాగినారు. ఈ రెంటినీ సమన్వయించు వాదము మాధ్యమికము. దీనినే మహాయాన మంటారు. ఈ పూర్ణ పురుషుడైన నాగార్జున దేవుడు బౌద్దధర్మాని అశోకుని తర్వాత రెండోసారి పునరుద్దరించినాడు. ఈయన జంబూద్వీపం అంతా తిరిగి ధర్మ దిగ్విజయముచేసి, మళ్ళీ ధాన్యకటక పురిలో తన ఆశ్రమానికి చేరుకొనేసరికి, వాసిష్టీపుత్ర పులమావి చక్రవర్తి సర్వ దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపతిగా ఏలుచుండెను. అప్పటికి నాగార్జునునకు నలుబది సంవత్సరాలు.

వాసిష్టీపుత్ర పులమావి అటు ఆర్షధర్మ మవలంబించి అశ్వమేధాది క్రతువులు చేస్తూఉండెను. ఆయన తనతండ్రి గౌతమీపుత్ర శాతకర్ణి వలన అమిత గౌరవం పొందిన ఆచార్య నాగార్జున పరమార్హతులను పూజించెను. సర్వ ధర్మాలు ఆయాచార్యదేవునిడు నేర్చుకొన్నాడు. నీతివిశేషాలను గూడ నాగార్జున దేవునివలన గ్రహిస్తూ ఉండెను. సర్వదక్షిణాపథంలో ఉన్న వందల కొలది మహాసంఘారామాలకు ఆచార్యదేవుడు ముఖ్యాచార్యుడయినాడు.

కొంతకాలనికి ఆ మహాతపస్వి అటవీ ప్రదేశానికి సమీపంగా తనకొక గ్రామాశ్రమం నిర్మింపుమని చక్రవర్తిని కోరినాడు. ఆ వాసిష్టీ పుత్రుడు అటవీ రాజ్యమైన కొరవి రాష్ట్రానికి చోరరాష్ట్రానికి ధనకరాష్ట్రానికి పల్లవ భోగానికి మహాసామంతులయిన ఇక్ష్వాకు ప్రభువులు నిర్మించిన విజయపురికడ శ్రీపర్వత శిఖరంపై నాగార్జునదేవునికొక పవిత్రాశ్రమం నిర్మించెను.

10

విజయపురి నాగార్జునాచార్యుల కాలంలోనే పెద్దనగరమైనది. ఎటు చూచినా రెండు గోరుతాలుంటుం దానగరం. కృష్ణానదీతీరాన యోజనదూరం వ్యాపించినది. ఈ మహాపట్టణానికి ఉపగ్రామాలు ఇరువది ముప్పది ఉన్నాయి. ఈ మహానగరానికి ధనకుల శేఖరుడైన బ్రహ్మదత్తుడే పాలకుడు. ఈ విశాఖాయనకులలో ఒక కుటుంబంవారు ఇప్పటికి రెండు మూడు వందల సంవత్సరాలనుంచి వేంగీరాష్ట్రానికి మహాసామంతులు, మహాతలవరులు, మహాసేనాపతులుగా ఉన్నారు. బ్రహ్మదత్తుని తాతతండ్రులు, ఇక్ష్వాకు శాంతి మూలమహారాజున్నూ మహాచార్యబోధిసత్వ నాగార్జునదేవుని శిష్యులు.

నాగార్జునదేవుని మిత్రుడైన వాసిష్టీపుత్ర పులమావి చక్రవర్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అఖండ సామ్రాజ్యము పాలించి దివంగతులయ్యారు. వారి మామగారు ఉజ్జయిని మహాక్షాత్రపుడు అల్లుని లోకువ చేసి ఆంధ్ర సామ్రాజ్యంనుంచి విడిపోయి, అల్లునితోడనే యుద్దం సాగించాడు. అప్పుడు నాగార్జునదేవుడు ఇరువాగులవారికి సంధిచేసి, మామగారిచే అల్లుని చక్రవర్తిత్వం ఒప్పించారు.

వాసిష్టీపుత్ర పులమావిపుత్రులు భారద్వాజీపుత్ర శివశ్రీ ఛత్రపాణి నాగార్జునదేవుని ప్రియశిష్యుడై, తండ్రి నిర్యాణానంతరం చక్రవర్తి సింహాసనం అధిష్టించి పదమూడు సంవత్సరాలు రాజ్యంచేసి పుత్రుడైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణిని నాగార్జునదేవునికి అప్ప చెప్పి, భగవంతునిలో లీనమైపోయినాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి సార్వభౌమ సింహాసనాసీనుడైనాడు. ఛత్రపాణి చక్రవర్తి మహాభక్తుడై రాజ్యపాలనంలో ఎక్కువ శ్రద్ధవహించక మేనమామలయిన క్షాత్రపులు స్వాతంత్ర్యం పొందినా, చూటు శాతకర్ణులు, మహాభోజ కాదంబులు, మహారథులు, అభీరులు, స్వాతంత్ర్యం పొందినా ఊరుకొనెను. ఉత్తరాంధ్రనాగులు, వాకాటులు, మాఠరులు, వాసిష్టులుగూడ స్వాతంత్ర్యం పొందినారు. ఇటు వేంగీపుర సాలంకాయనులు, గూడూరుపుర బృహత్పాలాయనులు, ఇంద్రకీల విష్ణుకుండినులు, ధనదుపుర ధనకులు, పూంగీప్రోలుపుర గౌతములు మాత్రం విజయపుర ఇక్ష్వాకులతోపాటు మహాసామంతులయి రాజ్యం రక్షిస్తూ ఉండిరి.

యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తి సింహాసనం ఎక్కగానే ఇక్ష్వాకు శాంతమూలుడు సర్వసేనాపతిగా, దేవదత్తుడు సేనాపతిగా సాలంకాయనాది సామంతులు కొలువ అఖండసైన్యం చేకూర్చుకొని, ఒక్కసారి దిగ్విజయానికి బయలుదేరినంత స్వాతంత్ర్యం పొందిన రాజ్యాలన్నీ దాసోహమని కప్పం గట్టినవి. ఆ దిగ్విజయం పూర్తికాగానే ధాన్యకటకం తిరిగివచ్చి, యజ్ఞశ్రీ అశ్వమేధం, వాజపేయం చేసినారు. నేడు యజ్ఞశ్రీ వృద్దుడైపోయినాడు. ఇంక దక్షిణా పథం అంతా ముక్కలు కావలసిందేనా అని అనుకుంటూ బ్రహ్మదత్తప్రభువు ఆ మహాచైత్య మందిరంలో దిగువ అంతస్తులందు భిక్షులకడకు వచ్చినాడు.

ఆ భిక్షులందరూ బ్రహ్మదత్తునిపై నాగార్జునదేవునికి ఉన్న ప్రేమ ఎరుంగుదురు. బ్రహ్మదత్తుడు, ఆనందార్హతులు, శాంతమూలుడు, చక్రవర్తి యజ్ఞశ్రీ మాత్రమే నియమిత దినాలలో, నియమితకాలాల ఆ బోధిసత్వుని దర్శింపవచ్చు. బ్రహ్మదత్తుడు భిక్షులకు నమస్కరించినాడు. అప్పుడొక వృద్ద శ్రమణకుడు బ్రహ్మదత్తుని స్నానగృహానికి కొనిపోయినాడు. బ్రహ్మదత్తుడు ఆ స్నాన గృహ కుడ్యమందున్న గోముఖాన వినిర్గమించే ప్రసవణం క్రింద స్నానంచేసి ఆ శ్రమణకు డందిచ్చు చీనాంబరాలను ధరించినాడు.

అప్పుడు అర్హతులొకరు వచ్చి మాటలాడక స్కందవిశాఖాయన ప్రభువును చివర అంతస్తులోనికి తీసుకొనిపోయినాడు. అడవి స్కంద విశాఖాయనక ప్రభువు నాగార్జునాచార్యుని ఎదుట సాష్టాంగము పడినాడు.

“నాయనా, దగ్గరకు వచ్చి కూర్చో” అని అతి మధురములై, దివ్యామృతధారలైన మాటలు స్పష్టముగా వినంబడినవి. బ్రహ్మదత్తప్రభువు ఆనంద వికసితమైన మోముతో లేచి, నాగార్జునదేవునికడకు వచ్చి వారి మంచముదాపున క్రింద మొగలియాకు చాపపై కూర్చుండినాడు. నాగార్జున దేవుని వదనాన మందహాసము సంపూర్ణ జ్యోత్స్నలు విరియుచున్నది.

“ధనకప్రభూ! మీ నాయనగారు శ్రీశైలారణ్యాశ్రమంలో క్షేమంగా ఉన్నారా?” నాగార్జునదేవుడు మాట్లాడునప్పుడు పెదవులు కదలినట్లు కానరావు.

“క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నవి భగవాన్!”

“కాలం మనలోనే ఉంది. దానినుంచి మనం ఎంతదూరం పరుగెత్తగలం?”

“చిత్తము.”

“మూడుగా కనుపిస్తూ ఏకమైనకాలం అనంతమై, మనుష్యుని అణువణువూ పొదువుకొని ఉంటుంది.”

“చిత్తం భగవాన్!”

‘శాతవాహన యుగం అస్తమిస్తున్నది. దేశంలో ధర్మనాశనం కలుగుతుంది అనుకుంటున్నావు.”

“చిత్తం భగవాన్."

“ఆనాటి ఇక్ష్వాకు వంశంలోనిదే ఈ విజయపురి శాఖ.”

“చిత్తం.”

“నాయనా, ఇక్ష్వాకులమీదే ఈ మహాదేశ రక్షణభారం పడుతుంది. ఆ ఇక్ష్వాకుల భారం నీపైన ఎక్కువ మొగ్గుతుంది. ధర్మనిర్వహణానికి దారిచూపే వెలుగు మనలోనే ఉంది.”

“భగవాన్! నేను కృతార్థుణ్ణి.

“నాయనా! నువ్వు ధాన్యకటకంనుండి రాగానే, ఇక్కడికి ఒక్కసారి రా.”

ఆనందంతో, అనిర్వచనీయ మహాభక్తితో బ్రహ్మదత్తుడు భగవాన్ నాగార్జునదేవునకు సమాలింగితభూతభూతలుడై నమస్కరించి, నెమ్మదిగా నడిచి వెడలి పోయినాడు. నాగార్జునదేవుని చిరునవ్వులు విశ్వమున ప్రసరించినట్లయి పోయినవి. ఆశీర్వచన సమ్మిశ్రితమగు చూపులు బ్రహ్మదత్తుని గుమ్మము వరకు సాగనంపినవి. బ్రహ్మదత్తప్రభువు కొరకు బహిర్మందిరంలో ఎనలేని ఓర్పుతో కనిపెట్టుకొని యున్నాడు ఆ వృద్దశ్రమణకుడు. బ్రహ్మదత్తుడు ఆశ్రమణకుని వెంటనే బయలుదేరి అంతస్తులు దిగి, అక్కడ ఉన్న భిక్షులకందరకు నమస్కరించి వారి సెలవుపొంది వెడలి పోయినాడు. త్రికాలజ్ఞులైన మహనీయుల దర్శనమే సర్వసంశయాలకు నివారకమనుకొన్నాడు బ్రహ్మదత్తుడు. మహాత్ములు బోధింపనవసరములేదు. శుద్దసాత్త్వికులను సకలమార్గములూ మూలకారణానికే కొంపోవును.

ప్రపంచంలోని అపశ్రుతులు మానవహృదయాన్ని సంశయానిలం చేస్తవి. స్థిరమైన పట్టు దొరకదు. సంతతమైన ఈ జగత్పరిణామం అతిచిత్రమైనది. కనుకనే ఇది మాయగా గోచరిస్తుంది. ఉపనిషద్విచారణ మార్గాన్ని బౌద్దవిచారణ పరిపూర్తి చేసిందనుకుంటే, బౌద్ధధర్మకూడా హీనమైపోవడమేమిటి! ఎన్నో చిన్న చిన్న సిద్దాంతాలు ఈ ధర్మ సమన్వయానికే భగవాన్ నాగార్జునదేవులు అవతరించారు. శ్రీకృష్ణపరమాత్మే బుద్ధదేవుడు, ఆయనే నాగార్జునదేవుడు అనుకుంటూ బ్రహ్మదత్తుడు కొండ దిగి, రథమెక్కి కృష్ణాతీరానికి వెళ్ళి, ఓడలరేవు చేరినాడు.

శాంతిమూల మహారాజు కృష్ణానది పడవల రేవును చలవ నాపరాళ్ళ వితర్దికగా నిర్మాణ మొనర్పజేసెను. ఆ వసంత కాలంలోకూడా విజయపురి చెంత కృష్ణలో వేలకొలది ఓడలు, నావలు, పడవలు, తరణులు అన్నీ కునికిపాటుపాడే వృద్దులవలె, ఆ నదీ తరంగాలలో ఊగిసలాడుతున్నవి. బ్రహ్మదత్తుడు రేవు దగ్గరకు పోయేసరికి ఒక ఓడలోనుంచి సరుకు దిగుతోంది.

11

బ్రహ్మదత్తుడు రథము దిగి రేవులోని ఓడల పరిశీలింప వెడలినాడు. ఈ ఓడలు సాగరికములుకావు. నదులలో ప్రయాణంచేసే తరణులు. ఇవి సముద్రంవరకు ప్రయాణం చేస్తాయి. కొలందియలు అన్న ఓడలు నదుల ముఖద్వారంలోనూ లోతు నదులలోనూ సముద్రతీరం వెంబడినీ ప్రయాణం చేస్తాయి. నదిలో మాత్రమే యానం చేసేని నావలు. సముద్రంలో మాత్రం యానంచేసే ఓడలనే సాగరికములనీ, నౌకలనీ పిలిచేవారు. కృష్ణాముఖ ద్వారము ఎంత పెద్ద ఓడలలో నుంచి సరుకులన్నీ తాము ఎగుమతి చేసుకొని, ఈ ఓడలు నదీతీర పట్టణాలలో దిగుమతి చేయవలసిన సరకులను దిగుమతి చేస్తూ ప్రయాణం సాగిస్తాయి. శ్రీపార్వతీయాంధ్ర ప్రదేశంవరకూ కృష్ణలో ఒక్కనడివేసవి కాలంలో తప్ప తక్కినకాలాల్లో ఈ పెద్ద ఓడలు ప్రయాణం చేస్తూనే ఉంటాయి.

బ్రహ్మదత్తప్రభువు దిగుమతి అయ్యే మిరియాలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క ముత్యాలు, లక్క కెంపులు, చీనాపట్టు, బంగారము పరీక్షించెను. శ్రీకాకుళంలోనే వర్తకులు సుంకాలు చెల్లించి సరకులు ఓడలో ఎక్కించుకొన్నారు. సుంకాలు పుచ్చుకొన్నట్లు శాతవాహన ముద్రికలు ఓడ నాయకునికడ ఉన్నాయి. ఏ ఏ వస్తువునకు ఎంత సుంకమిచ్చిరో ఆ వివరాలను సముద్రవర్తకాధికారి రాగి రేకుమీద చెక్కించి ఆ ఓడ నాయకునికి ఇచ్చినాడు. వానినెల్ల ఆ ప్రభువు పరీక్షించినాడు. విజయపురంనుంచి వజ్రాలు, బియ్యము మొదలగు ధాన్యాలు, నూలు, కంబళ్ళు, ఉన్నివస్త్రాలు, పొత్తుబట్టలు, బంగారు వెండినగలు, కత్తులు, ఫలకములు, వర్ణములు, నువ్వులు మొదలగు నూనెవస్తువులు, పూగీఫలాలు, సంగీతవాద్య విశేషాలు, దూది, గాజులు, దంతపుశిల్పాలు, చింతపండు, ఉప్పు, సారాయములు సరుకు లెగుమతి అవుతవి.

ఆంధ్రదేశ వణిక్కులు, ఆంధ్రశిల్ప బ్రాహ్మణులు జగత్ర్పసిద్ధి నొందినారు. ఆంధ్ర నేతపని లోకపూజ్యము. అన్ని కుటుంబాలవారు వడికేవారు. సర్వసాధారణంగా ఆంధ్రులు వడకిన నూలు సాలిపురుగు దారాలకన్న సన్నంగా ఉక్కు తీగలకన్న బలంగా ఉండేది. కొన్ని మడతలుపెట్టి కట్టుకొన్నా ఒళ్ళు కనబడేది ఆంధ్ర స్త్రీలు వడికిన వలువలలో. అలాంటి నూలును నేయడంలో, ఆ నూలుకు రంగులద్ది చిత్రవర్ణ వస్త్రాలు నేయడంలో ప్రపంచంలో ఆంధ్రతంతుకారకుల మించిన వారింకొకరు లేనేలేరు. తెల్లని వస్త్రములు చేసిన వెనుక వర్ణకారకులు రంగులు అత్యంత మనోహరంగా అద్ది పూవులు లతలు మొదలయిన అలంకార శిల్పాలుగా సిద్ధం చేసేవారు. వస్త్రాలు లాతి విలాతులవారు ఎగనెత్తుకుపోయేవారు ఈ గొఱ్ఱెలను పెంచి ఉన్ని తీసి, ఆ ఉన్నిని ఓషధీరసంతో కడిగి శుభ్రంచేసి చిత్రవిచిత్రంగా కంబళ్లు, రత్నకంబళ్ళు, శాలువలు మొదలయినవి అల్లేవారు. ఆంధ్రభూమిలో, రజితమును నూలుపై పోతపోసిన దారము రజని అని పారశీకులు సిద్ధంచేసేవారు దానిని సరజ లేక సరిగ అనే వారు ఆంధ్రులు. ఆ సరిగ వస్త్రాలలో అంచులు పువ్వులు లతాదికాలూ నేసేవారు. ధాన్యకటకము, విజయపురి మొదలయిన మహాపురాలలో ఈ వస్త్రశిల్పం విరివిగా చిరకాలమునుండి జరుగుతున్నది. బ్రహ్మదత్తునికి ఆంధ్రశిల్పులన్నా, ఆంధ్రవస్త్రకారులన్నా అపరిమితాదరం. రోమక, యవన, నీలాది ద్వీపాలలో భారతీయ వస్త్రాలకు, శిల్పపుపనికి ఉన్న గౌరవము విన్నప్పుడు బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయేవాడు.

ఓడలు అనంతమైన సముద్రంలో నిర్భయంగా తేలిపోతున్నాయి. వరుణ దేవునికి కోపం రాకుండా ఉంటే ప్రయాణంలో ఓడలకేమీ ముప్పం లేదు. గాలివేగము వానికి తోడవుతుంది. ఓడలకు మహాసముద్ర మధ్యమందుండే ప్రవాహ భేదాలు సహాయమవుతాయి. లేదా, తెడ్లు వేసుకొని, ఆంధ్ర నౌకలు ప్రయాణం చేస్తాయి. ఓడలు నడపటంలో ఆంధ్ర నావికులు పేరుపొందినారు. నాలుగువందల గోరుతాల సముద్రతీరం పొడవునా వరుణదేవుడు ఆంధ్ర నావికులను వాత్సల్యంతో చూస్తాడు. అహో! వీరుకదా వరుణదేవుళ్ళు అని బ్రహ్మదత్తుడు అనుకున్నాడు.

తెరచాపలన్నీ ఎత్తి, సముద్రాన్నే ఆకాశంచేసి, ఓడ రాజహంస అయి తేలిపోతూ ఉంటుంది. నావికులు పాటపాడుతూ ఉంటారు. లోపల యాత్రికులు ఉంటారు. యవద్వీప భాషలో నావికా నాయకుణ్ణి “సరాంగు” అంటారట. ఆ నాయకుడే ఓడకు కళ్ళు. మెదడూను. వారి పాట ఎంతో మధురంగా ఉంటుంది. భూమి మనుష్యుల తల్లి. సముద్రుడు నావికుల తండ్రి, వారికి తల్లి ఆకాశం, నక్షత్రాలు సహోదరీమణులు. సూర్య దేవుడు సోదరుడూ, గురువూ. చంద్రుడు ప్రియురాలు. ఓడ రెక్కలు చాచి ఎగిరిపోతోంటే బ్రహ్మదత్తుడు చిన్నతనంలో తాను తామ్రలిప్తినుండి తామ్రపర్ణి వరకు ప్రయాణం చేసిన విషయం జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మొదటి దినాలలో భయంవేసింది. భోజనాదికాలు ఓడమీదనే. ఎక్కడా భూమి కనబడలేదు. ఆ సముద్రమధ్యంలో నావికులు తమ దారి తెలుసుకోవడం అత్యద్భుతమైన విషయం వారు నక్షత్రాలు చూచేవారు రాత్రులు. సూర్యుణ్ణి చూచేవారు పగలు. మేఘాలు ఆకాశం నిండిపోతే గాలివెళ్లే తీరు మొదటినుంచి గమనిస్తూ ఓడ నడుపుతుంటారు.

12

బ్రహ్మదత్తుప్రభువు నదీతీరంనుండి రథముపై రాచనగళ్ళవైపు వెళ్ళినాడు. ఆ మరునాడే తాను మహారాజకుమారికకు విద్య ప్రారంభింపవలసిన శుభముహూర్తము. నగరమున అన్ని వీధులు రథపథములు కావు. కాబట్టి పెద్దవీధుల వెంటనే రాచనగళ్లున్న కోట ప్రక్కనుండి మరల కృష్ణ ఒడ్డుకు వచ్చి, రెండు గోరుతముల దూరముపోయి, తన పండ్లతోటను చేరినాడు. అచ్చటి వనాలలో సమస్త ఫలజాతులు పండుతవి. మామిళ్ళు విరివిగా పిందెలతో నిండి ఉన్నవి. పనసపిందెలు దిగుతున్నవి. అరటిచెట్లకు మనిషి ఎత్తుగెలలు వ్రేలాడుతున్నవి. అవి ఎప్పుడూ గెలలు వేస్తూనేఉంటాయి. నిమ్మలు పూలతో పిందెలతో నిండి ఉన్నవి. పెద్ద నేరేడులు పూతతో పిందెలతో నిండి ఉన్నవి. ద్రాక్షపళ్ళు పిందెలతో నిండి ఉన్నాయి. పూగీ వృక్షాలు గెలలు దిగుతున్నవి. శీతాఫలములు కాపు కాస్తున్నవి. నదీతీరం పొడుగునా పెద్దదోసపాదులు పందెళ్ళపై పాకుతున్నవి. నాగ రంగములు బంగారు ఎరుపు పళ్ళతో నిండి ఉన్నవి. నారికేళాలు ఆకాశం అంటుతూ జటలు దెసలక్రమ్మాగా నాట్యంచేసే శైవులులా ఉన్నవి.

బ్రహ్మదత్తుడు తిన్నగా తోటలోనికిపోయి భవనం ముందు రథము దిగినాడు. బ్రహ్మదత్తప్రభువు వస్తూ ఉండగానే తోటమాలీలు నమస్కారాలు చేస్తూ ఉండిరి. ఆ ప్రభువు రథము దిగగానే సూతుడు రథము తోలుకొని పోయినాడు. కృష్ణకు, నూరు వివర్తనములున్న ఆ తోటకు ఒక నగపంక్తి అడ్డమున్నది. ఒక్క దిక్కుననే తోటలోనుండి కృష్ణవరకూ లోయదారి. ఆ లోయనడుమ సంతతము ప్రవహించే చిన్న సెలఏరు ఉంది. ఆ నూరు నివర్తనముల తోటలోను ఎన్నో కూపాలూ, ఒక క్రీడాసరస్సూ, ఒక నడబావి. సరస్సుచుట్టూ సమస్త పుష్పజాతుల వృక్షాలున్నాయి. బ్రహ్మదత్త ప్రభువు ఆ సరస్సు ప్రక్కనే ఉన్న తిన్నెపై కూర్చుండినాడు. సూర్యుడు అప్పుడే ఆకాశం మధ్యకు వస్తున్నాడు. భోజనం వేళ అయినా, ఆయన కాగొడవే తట్టలేదు.

చక్రవర్తి మహావృద్దు. అవసాన దినాలు; కుమారుడు వీరసుడు. ఇక్ష్వాకు మహారాజే దేశాలలో ధర్మం నడుపగల మేటి వీరుడు. ఆయన చక్రవర్తి అల్లుడు. పులమావి కుట్రలు చేస్తున్నాడు. ఆయనకు అభీరులూ, క్షాత్రవులూ సహాయం చేస్తామంటున్నారు. పులమానికి శ్రీశాంతిశ్రీ మహారాజకుమారికను వివాహం చేసుకుందామని ఉన్నది. శాంతిశ్రీ కుమారి త్రిజగన్మోహిని. బాలలకు అంత అందము ఉండడంవల్ల ఒక్కొక్కప్పుడు రాజకీయాలలో కష్టములు సంభవిస్తాయి. ఆ బాలకు తాను చదువు చెప్పాలట. రేపే ఆ శుభముహూర్తము. ఆ బాల భిక్కుని కావాలని సంకల్పము పూనినదంటారు. ఆమె హృదయంలో కామగంధము లేదట. తల్లిదండ్రులన్నా ప్రేమలేదట. వారియెడ గౌరవంతో సంచరిస్తుందట. ఆమె హృదయం శుద్దశూన్యం, తెల్లటి రాయి అంటారు. కాని ఆమె స్వభావము సాత్వికమట. రాతి హృదయానికి సాత్విక గుణమెలా అలవడుతుంది? శుద్ధసత్వంకూడా తమస్సులా కనిపిస్తుంది. అంతే. ఓహో ఏమి అందం! అలౌకికమా సౌందర్యం. ఆ పరమసుందరికి తాను యువకుడు, అవివాహితుడు ఎలా చదువు చెప్పడం?

ఆ సమయంలో తోటమాలి పరుగునవచ్చి, బ్రహ్మదత్తప్రభువు కడ మోకరించి, “ప్రభూ, శ్రీ మహారాజులవారి కడనుండి కంచుకి వచ్చి తమ దర్శనము అపేక్షిస్తున్నారు” అని మనవి చేసుకొన్నాడు.

“అలాగా! వెంటనే ప్రవేశ పెట్టు.”

కంచుకివచ్చి బ్రహ్మదత్తునికి నమస్కరించి, “ప్రభూ! మహారాజుల వారికి ధాన్యకటకంనుండి గజవార్త వచ్చింది, తమ్ము వెంటనే ఆలోచనా మందిరానికి రమ్మన్నారు. అక్కడనే పూంగీయ స్కందశ్రీమహాప్రభువూ ఉన్నారు. శ్రీమహారాజకుమారులవారూ అచ్చటనే ఉన్నారు” అని మనవి చేసినాడు.

“సరే నేనూ వస్తున్నాను” అని బ్రహ్మదత్తప్రభువు లేచి తన వీపున వ్రేలాడు శంఖంతీసి “భోం, భోం” అని ఊదినాడు. ఆ వెంటనే రథాన్ని తోలుకొని సూతు డక్కడకు వచ్చినాడు. బ్రహ్మదత్తప్రభువు రథారోహణం చేయగానే ఆ రెండు గుఱ్ఱాలూ వాయువేగంతో విజయపురంవైపు సాగినాయి. కన్నుమూసి తెరిచేలోపల రాచకోట వచ్చినది. కోటగోపుర ద్వారం దాటి, రథం రాజభవనం సమీపించి, ఆగిపోయినది. వెంటనే బ్రహ్మదత్తుడు రథావతరణంచేసి మృగరాజువలె లోనికి నడిచిపోయినాడు. మహాకంచుకి ఉత్తమాజానేయ మధివసించి రథము వెంటనే వచ్చి, బ్రహ్మదత్త ప్రభువు రథావతరణ చేయకమునుపే గుఱ్ఱం దిగి, అచ్చట ఉన్న సారధికి కళైమందిచ్చినాడు. వారిరువురు సమాలోచన మందిరానికి వెళ్ళిపోయినారు. బ్రహ్మదత్తుడు మహారాజునకు స్కందశ్రీ ప్రభువునకు నమస్కరించినాడు. మహారాజ కుమారుడు వీరపురుషదత్త ప్రభువు లేచి బ్రహ్మదత్తునకు నమస్కరించినాడు. బ్రహ్మదత్త ప్రభువు మహారాజకుమారుడూ ఆసనాలధివసించినారు.

మహారాజు: బ్రహ్మదత్త ప్రభూ! పులమావి ప్రభువు తాను ముసిక నగర రాజప్రతినిధి అయినా ధాన్యకటకంలోనే ఉంటున్నాడుకదా! ఈ మధ్య ఆతని కుట్రలెక్కువ కాగా, సార్వభౌములు పులమావిప్రభువును ధాన్యకటకం వదలిపోవద్దని ఆజ్ఞ ఇచ్చినారు. ఆలాంటి సమయంలో నిన్న రాత్రి అతడు ముసికనగరం ప్రయాణమై పోయినాడట.

బ్రహ్మదత్తు: ఈ వార్త పంపించింది ఎవరు మహాప్రభూ?

స్కందశ్రీ: మహామంత్రి శివశ్రీ పంపించినారు.

బ్రహ్మ: మహాప్రభూ! పులమావిని ముసిక నగరమే వెళ్ళనీయండి. ధాన్యకటకంలో ఉండి కుట్రలు చేయడంకన్న మనకు దూరంగా ఉండడము ఉత్తమం కాదా?

వీరపురుష: బ్రహ్మదత్తప్రభూ! ముసికలో ఉంటే పులమావికి ఇతరులతో కలవడం సులభం కాదా? బ్రహ్మ: సులభమే. కానివ్వండి. చక్రవర్తి వారసుడైన ఒక రాజకుమారుని మనం ధర్మపరంగా ఏమిచేయగలం? అతడు మంచివాడైతే పూజార్హుడే! కాక రాజద్రోహం సలుపడానికి కుట్రలుచేస్తే భయంకర ధర్మగ్లాని అవుతుంది. ఆతడు శిక్షార్హుడు.

వీరపురుష: తమ ఆలోచన బాగున్నది.

బ్రహ్మ: ఈ విషయం చక్రవర్తికి తెలియునా?

స్కందశ్రీ: చక్రవర్తి చాలా జబ్బుగా ఉన్నారు. అందుచే తెలియనీయలేదట.

బ్రహ్మ: చిత్తం నేను వెంటనే మన అపసర్పులలో దిట్టలను ముసిక నగరం పంపి పులిమావి శాతవాహన ప్రభువు అక్కడ ఏమిచేస్తున్నదీ తెలిసికొంటాను.

మహారాజు: ధనక ప్రభు! మీరు వెంటనే మన సైన్యాలను ఆయత్తం చేయించి ఉంచండి. ఏ సమయానికి మనం యుద్ధాభిముఖులం కావలసివస్తుందో?

మహారాజు లేవగానే, మంత్రులు, సామంతులు, మహారాజకుమారులు లేచినారు.

13

విష్ణునాధుని, సరస్వతిని, స్కందుని, బుద్ధదేవుని, విష్ణుని, శివుని పూజించి బ్రహ్మదత్తప్రభువు శాంతిశ్రీ రాజకుమారికి చదువు ప్రారంభించారు. ఆమె కీచదువుపై, ఈ గురువుపై భక్తిలేదు. తల్లిదండ్రుల ఆజ్ఞలను ఉల్లంఘించ కూడదన్న నియమమే ఆమె నీ చదువుకు ఒప్పింపచేసింది. మహారాజ కుమారికి చదువు చెప్పేటప్పుడు ఆమె చెలులు ముగ్గురు దగ్గరనే ఉన్నారు.

స్కందవిశాఖాయనక ప్రభువు ఆరంభమందే ఆత్మ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు.

“స్వామీ! ఆత్మ అంటే ఉపనిషన్మత ప్రకారం సత్ పదార్ధము. తక్కినవన్నీ ఆ పదార్థానికి అభాసలు.”

“బౌద్దధర్మ ప్రకారం ఆత్మ ఉన్నదా?”

“బౌద్దంలో ఆత్మ సత్యము కాదు.”

“బౌద్ధధర్మంలో సత్ పదార్థమేది?”

“బౌధంలో రెండు సంప్రదాయాలున్నాయి. హీనయానమునందు పురుష వ్యక్తిని తెలియజేసేది ఆత్మ. దీనిని మహాస్థ విరవాదమంటారు. వ్యక్తులు తమ నిర్మాణం తాము చూచుకోవాలి. ఈవాదంలో మహాసాంఘికులు మానవ సంఘానికంతకూ విముక్తి తీసుకురావాలంటారు. ఈ సాంఘిక వాదంలో ముక్తి సత్యం, బుద్దుడు శాశ్వతుడు.”

“ప్రథమావాదంలో బుద్ధు డెట్టివాడు?”

“ఆ వాదంలో సంయుకీ సంబుద్దుడు అలౌకిక పురుషుడుమాత్రం.”

“మహా సాంఘికవాదంలో రెండు శాశ్వాతపదార్థములు ఉన్నట్లు తేలుతోంది కదా. రెండు శాత్వతములు విశ్వంలో ఏలా ఇముడుతాయి?”

“ఆ రెండూ ఒక సత్తునే చెప్పుతవి.”

“సత్ భావన ఏలాంటిది?” “బుద్దుడే పరమసత్యం.”

“మహాయానంలో బౌద్ద త్రిరత్నాలకు ప్రాముఖ్యం ఉన్నది. ధర్మ, బుద్ధ, సంఘాలు మూడు త్రిరత్నాలు.”

“అవును.”

“అందులో ధర్మము సత్ అనిన్నీ, అదే ప్రజ్ఞ అనిన్నీ, ఆ ప్రజ్ఞను సంపాదించుకొనే ఉపాయమే బుద్దుడనీ చెప్పుతారు. ధర్మం శాశ్వతమంటే ధర్మాచరణం చేసే పురుషుడూ శాశ్వతుడు కావాలికదా! పురషుడు దేహం వీడితే ధర్మమేమయింది? ధర్మంచేత వాడేమయినాడు?”

“ధర్మం ఎప్పుడూ ఉంటుంది.”

“అధర్మమో?”

“అశాశ్వతము.”

“అహింసాది ధర్మాలు సాపేక్షములు కదా, సాపేక్షవలన గుణమత్త ఏర్పడుతుంది కదా, ధర్మానికి?”

“ధర్మం గుణయుక్తమే.”

“గుణములు శాశ్వతమా?”

“సద్గుణములు శాశ్వతములు.”

“ఆ సత్ గుణములు అశాశ్వతములని ఏర్పడుతుంది. వెలుగు శాశ్వతమై, చీకటి అశాశ్వతమెలా అవుతుంది? చీకటి అనేది వెలుగు యొక్క అభావమే కదా? ఈ ద్వంద్వాలలో ఒకటి శాశ్వతమై రెండోది అశాశ్వతమెలా అవుతుంది?”

ఈ విధంగా బ్రహ్మదత్తుడు చదువు ప్రారంభించాడు. శాంతిశ్రీ నిశ్చలతతో తొణకని నిర్మలతతో ప్రత్యుత్తరాలు ఇస్తున్నది. బ్రహ్మదత్తుని అఖండ శేముషి శాంతిశ్రీకి పూర్తిగా తెలియును. అయినా ఆమె ఇసుమంత కూడా చకితహృదయ కాలేదు. చెక్కిన విగ్రహంలా ఆమె శిష్యపీఠంపై గురువున కెదురుగా అధివసించి ఉంది.

శిష్యులు ప్రశ్నించటం ఆచార్యులు ఉపదేశించడం సాధారణ విధానం. కాని ఈ విచిత్రమైన విద్యాభ్యాసంలో గురువే పృచ్ఛచేయడం శిష్యురాలు ప్రత్యుత్తరాలు ఇవ్వడం జరిగింది. ప్రథమదినం పూజలైన తర్వాత రెండు ఘటికలు మాత్రమే బ్రహ్మదత్త ప్రభువు శాంతిశ్రీతో చర్చించినాడు.

“రాజకుమారీ! నేను సెలవు తీసుకుంటాను.”

"చిత్తం, స్కందవిశాఖాయనక ప్రభూ!”

అంతే. ఆ వెనుక బ్రహ్మదత్తుడు వెడలిపోయినాడు. బ్రహ్మదత్త ప్రభువు నగరి వెనుక ఉపవనం ఉంది. ఆ తోటమధ్య శిల్పసౌందర్య విలసితమైన బ్రహ్మ విద్యాశ్రమం ఉంది. దేశదేశాలనుండి ఈ బ్రాహ్మణ క్షత్రియుని పాదాలకడ ఆర్షవిద్యలు నేర్చుకొనడానికి పండితులూ, విద్యాప్రియులూ, కళావేత్తలూ వస్తూ ఉంటారు. ఈ విద్యాశ్రమానికి బ్రహ్మదత్త ప్రభువు కులపతి. వీరు కాక వివిధ విద్యాసాగరులైన మహాపండితు లనేకులు విద్యా గురువులుగా ఆ ఆశ్రమంలో ఉన్నారు. కాని ఇంతవరకు బ్రహ్మదత్తుడు ఒక్క బాలికకైనా చదువు చెప్పలేదు. బాలికకు చదువు చెప్పటానికి ఆ యువక ప్రభువు కొంచెం సిగ్గుపడ్డాడు. అందులో మహారాజకుమారిక! తాను వృద్దుడైతే భయములేకపోవును. యువకుడు, బ్రహ్మచారి, ఆవల పెళ్ళి కాని బాలిక! మహారాజు ఈ విచిత్రస్థితి ఎందుకు కొనివచ్చినారు? ఆ బాలిక తెలివయినదీ, ప్రజ్ఞావంతురాలు అవును. కానీ ఎంతసేపూ ధర్మము, భిక్షుకత్వము, అష్టమార్గాలు అంటూ కూర్చుంటుందనీ విన్నాడు. తాను మధ్య మధ్య ఇంచుక పరిహాసముగా మాటలాడినా ఆమె ఈషణ్మాత్రం స్పందించ లేదు. నవ్వలేదు. ఆమె మోము వెన్నెలలో కైలాస పర్వత శిఖరంలా ఉన్నది. ఆ మోమున కదలిక లేదు. అది స్థాణుత్వమేనా అని ప్రశ్నించుకొన్నాడు బ్రహ్మదత్త ప్రభువు.

14

చదువు హాస్యభాజనమనిగాని, అర్థము లేనిదనిగాని శాంతిశ్రీ రాకుమారి నిరసించలేదు. ఆ చదువు తనకు పనికిరాదనిగాని ధర్మబోధకమనిగాని ఆ బాలిక క్రోధపూరిత కాలేదు. ఆమె చిన్ననాటినుండి కోపతాపములు ఎరుగదు. ఇంత శిశువై ఉన్న కాలంనుంచి ఆమెకు కోరికలు లేవు, ప్రేమ లేదు. ఆమెకు ఆనందం లేదు, విచారం లేదు. ఆమె అడ్డాలనాటినుండి నవ్వి ఎరుగదు. ఆనందముచేగాని విచారంవల్లగాని కంటిచుక్కలు ఆమె రాల్చ లేదు. ఆమె ఎప్పుడు మంకుపట్టు ఎరుగదు, సులభంగా లొంగిపోనూలేదు.

పొత్తిళ్ళనాడే ఆమె అందం మంత్రసానులకు తెలిసింది. వాళ్ళు పూట పూటకూ దృష్టి తీసేవారు. ఆ తెల్లటి వళ్ళు ఉష్ణజల స్నానం చేయించినప్పుడు ఎఱ్ఱకమలంలా కందిపోయేది. పనసతొనల బంగారంలో తురిమిన నక్షత్ర కాంతి రంగరించిన శిశువై పెరుగుతూ ప్రపంచాన్ని శూన్యవిలోకనాల చూచే ఆ బాలికను కనుగొని, ఆకలి యైనప్పుడు మాత్రం ఏడిచే ఆ బిడ్డను అవలోకించి కౌగిలించుకొన్నా స్పందింపక మోమున ఏమాత్రమూ మార్పురాని ఆకొమరితను పారకించి, ముద్దులకు మోముముడిచి విసుగు చూపించి, పలకరిస్తే ఇంచుకయినా ప్రత్యుత్తరమీయని ఆ విసుగును పరిశీలించి మహారాజూ, మహారాణీ ఇద్దరూ వెర్రిబాలిక ఏమో అని పైకిపొంగని బెంగపెట్టుకొన్నారు.

మహారాజు ఎన్ని విచిత్రాలైన ఆటవస్తువులు ఇచ్చినా ఆ బాలికలో ఏమీ మార్పు వచ్చేదికాదు. కిలకిల నవ్వేదికాదు. చప్పట్లుకొడుతూ కోడుతూ గంతులువేసేది కాదు. “నాయనగారు నాకివి ఇచ్చారు” అని తల్లితో చెప్పేది కాదు. బొమ్మలను “పాపాయి!' అని ఎత్తుకొనేదికాదు. ఆ పాపాయికి నీళ్ళు పోసేదికాదు. దంతపుబొమ్మ రథాలు నడిపింపలేదు. లాక్షావర్ణ విచిత్రలతా విన్యాససుందరమైన ఆటపడవల తన బొమ్మ కాలువలలో ఆమె ప్రయాణింప చేయలేదు. తోటి బాలికలు మేనత్తల కొమరితలు శాంతశ్రీ బాపిశ్రీలతో ఆ బాలికకు నేస్తమూలేదు. కయ్యమూ లేదు. చీనాంబరాలుకట్టి ముద్దులు గులిగే నగలు తల్లి ధరింపజేసినా శాంతిశ్రీలో ఏమీ సమ్మోదములేదు. ఆమెకు నగలు ధరించాలని ఇచ్చలేదు. సాధారణపు నగలు, సాధారణ వస్త్రాలు ధరించి ఉండేది. ఆమెను మహారాజు కొమారికగా అలంకరిస్తే అవసరమున్నంతవరకే అవి ఉంచి తర్వాత తీసివేసేది. వైద్యులు ఆమెకు వెర్రికాదన్నారు. అయిదవ సంవత్సరమున చదువు ప్రారంభించి నప్పటినుండీ ఆమె గురువులు ఆమె విపరీత మేధకు, ఆమె గ్రహణశక్తికీ ఆశ్చర్యపూరితు లయ్యారు. ఆమె విద్యాగురువుల ద్వారాలన్నీ దాటి సర్వ విద్యాపరిపూర్ణియై, ఆర్యశ్రీ ఆనందార్హతులకడ శిష్యురాలయినది. భౌద్ధధర్మ శిక్షితురాలై నప్పటినుంచి ఆమెకు చైతన్యము వచ్చినది. ఆమె చిరునవ్వులు మోమున తొంగిచూడ నారంభించినవి. ఆమె సుకుమారమైన హాస్యముకూడా చేయడం సాగించినది. ఆమెకు కాశ్మీరకుసుమవర్ణ వస్త్రాలంటే ఇష్టమయినవి. మిరియములు, జీలకఱ్ఱ, నల్లజీల కఱ్ఱ, అల్లము, శొంఠి, శర్కర, గుడములేని ఆహారము లామెకు ఇష్టమైనవి.

నానాటికి ఆమె సౌందర్యము విజృంభించి, ఆమె యవ్వనము పొడసూపి, ఆమె పెదవుల అమృతాలు చెమరించి, ఆమె వక్షావలి కుచము లుప్పొంగి, ఆమెకటి విస్తరింప మొదలుపెట్టి, ఆమె పిరుదులు ఘనత వహింప నారంభించి ఆమెలో ఏవియో మసృణకాంతులు ప్రసరింప నారంభించినవి. ఆ దినాలలో అట్లు విజృంభించు ఆ సౌందర్య విషయమే ఆమెకు తెలియదు. వైరాగ్యమననేమో తెలియదామెకు. భిక్కుని అగుట మంచిదనే బౌద్ధధర్మం ఆమెకు తెలియును. భిక్కునికావడం ఎందుకో ఆమెకు తెలియదు. విజ్ఞాన విషయంగా వైరాగ్యాన్నిగూర్చి ఆమె చర్చింపగలదు, కాని వైరాగ్య మహాభావం ఆమెకు ప్రత్యక్షము కాలేదు. తనది వైరాగ్య జీవితమే అని ఆమెకు తెలియదు. చిన్నతనంనుంచీ విచిత్రమైన ఈ వైరాగ్య జీవితం తనకెందుకు అలవడిందో ఆమె యెరుగదు. అనేక వసంతోత్సవాలు వెళ్ళిపోయినాయి. మధుమాస పరిమళించే ఆమె ఒక్కక్షణమైనా పులకిత కాలేదు. ఆమెకీనాడు బ్రహ్మదత్త ప్రభువు చదువు ప్రారంభించినారని పెద్ద ఆశ్చర్యమూ కలుగలేదు. విసుగు చెందనూ లేదు. ఆ చదువుకు పూర్వం ఎంత నిశ్చలమై ఉన్నదో ఆ పిమ్మటను అంతే నిశ్చలత.

ఆమె నెమ్మదిగాలేచి లోనికి వెళ్ళిపోయింది. తన పూజాగృహంలో బుద్ధదేవుని ఎదుట పద్మాసనాసీనయై ఆర్య ఘోషుని బుద్దచరిత్రనుండి అనేక ఘట్టాలు పఠించింది. కాని ఆమెకు భక్తితన్మయత కలుగలేదు.

చదవడం మానివేసింది. మనను నిశ్చలతనందింది. శూన్య మనస్సుతో అలా కూర్చుండిపోయింది. ఆమె మందిరంలో ఉన్న బుద్దవిగ్రహములు అలాగే ఉన్నాయి. దీపాలు చిరుగాలులకు ఇటూఅటూ కదులుతున్నాయి. చిత్రాలేమీ లేని ఆ గోడపైన వెలుగునీడల ఛాయలుమాత్రం ఆడుతున్నాయి. కదలికలేని క్షణాలుమాత్రం కదలి పోతున్నాయి. ఆ బాలికా సౌందర్యకాంతిలోని ప్రతితేజఃకణమూ ప్రతిక్షణంతోను వియ్యమంది, అనంత సృష్టిసౌందర్య లేశాతిలేశంలోనూ ప్రత్యేక విలీనత నందింది. ఆ విచిత్రత ఆ బాలికకేమి తెలియును! ఆమె అలా నిశ్చలతలోనే స్థాణువై కూర్చున్నది.

15

ఇక్ష్వాకుశాంతిమూల మహారాజు అంతులేని ఆలోచనలతో తన ఆనంద గృహాన ఒక బంగారు మజ్చిపీఠముపై త్రిభంగాకృతిని కూరుచుండెను. వెలుపలి మందిరంలో నలుగురు విలాసినులు సంగీతకళాకోవిదలు కాకలీస్వనాలగాన మొనర్చుచుండిరి. ఒకతె వీణ, ఒకతే ముఖవీణ, ఒకతె మృదంగము ధరించి వ్యాదము సలుపుచు బృందగానంలో గొంతులు కలుపుచుండిరి.

"ఆరామ తరులతలు
        ఆలకించిన స్వరము
శ్రీరామ పదము లిడు
        చిరుసవ్వడుల గీతి”

ఆ పాట తన ఆలోచనలను పొదివికొనగా మహారాజు అనంతమైన ఆ భావాలలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రభువునకు తన చక్రవర్తి అవసాన స్థితి అనేక రూపాలలో దర్శనమవుతున్నది. అంతటి శాతవాహన సామ్రాజ్యమూ నేడు ఈలా అయిపోయిందేమి? యజ్ఞశ్రీ సార్వభౌముల విజయపరంపరలకు తన బాహుబలమే ముఖ్యసాధనమైనది. ఆనాడు తాను యువకుడు. అయినా వ్యక్తిగత పరాక్రమంలో ఏమి, వ్యూహరచన విధానంలో ఏమి అతిరథ శ్రేష్ఠుడనిపించుకొని ఆంధ్రరాజ్య శ్రతువుల కుక్కలువలె పరిగెత్తించలేదా?

యజ్ఞశ్రీ సార్వభౌముని కొమరిత కుసుమలతాదేవి సుందరీమణి తన్ను వలచివచ్చి స్వయంవరంలో కంఠాన పూలదండ వేచినది. శాతవాహనవంశము నిస్తేజమైపోతే ఎవరు ఈ సర్వదక్షిణాపథమందు ధర్మము అవిచ్ఛన్నంగా నడపగలిగిన మేటి? శాంతిమూల మహారాజు నిట్టూర్పు విడిచినాడు. తరతరాలనుండి ఇక్ష్వాకులు శాతవాహనులకు కుడిచేయివంటి వారు. ఈ రెండు వంశాలకు గాఢమైన బంధుత్వాలూ కలిసినవి. తన పూర్వులు అయోధ్య నేలినారు. తనది రఘుమహారాజు వంశం. ఆ బాలల గాంధర్వంలో ఏవో స్వరమధురాలు ప్రవహించాయి.

“దండకాటవి మధ్య
        గండశిలకే తెలుసు
దివ్యపదముల స్పర్శ
       త్రిదశు లెరిగిన స్పర్శ!”

చక్రవర్తి అంతనీరసుడై పోయినాడేమి? ఆయన సంరక్షణభారం పూర్తిగా తనమీదే పడుతుంది. ఈలోగా తన బావమరిది దాయాది సామంతుల నందరిని కూర్చు కుంటున్నాడు. రాజ్యము ధర్మంగా నడవాలి. ప్రజలు భగవంతుని అవతారము. ప్రజల సంరక్షణ పరమధర్మముగా ఎంచని రాజు లెందుకు? సామ్రాట్టు లెందుకు? ప్రతి మనుష్యుని హృదయంలో అధర్మం ఏమూలనో దాక్కుని ఉంటుంది. మనుష్యుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, రాక్షసిలా విరుచుకుపడుతుంది. రామరాజ్యంలో ధర్మపాలనవల్లనే జగత్ర్పసిద్ధి పొందింది.

“రామచంద్రుని వెంట
        రమణి సీతాదేవి
సీతమ్మ నవ్వులో
       చేరె కాంతులు కోటి. ”

సీతమ్మ ఇక్ష్వాకుల కోడలై ఉభయకులములను పవిత్రం చేసింది. తన బాలిక శాంతిశ్రీకి ఈ స్థాణుత్వ మెక్కడనుండి వచ్చింది? మహారాజు పక్క నున్న జేగంటపై నెమ్మదిగా స్పృశించారు. వెంటనే ఇద్దరు అంతఃపుర రక్షక స్త్రీలు అక్కడికి గాలులవలె తేలుతూ వచ్చారు. “మేము రాజకుమారి క్షేమం విచారించుటకు వస్తున్నా” మన్నారు మహారాజు.

ఆ రక్షక స్త్రీలు వెంటచే మాయమయ్యారు. మహారాజు ఆ మజ్చపీఠము నుండిలేచి, ఆలోచనతోనే నడుస్తూ తమ నగళ్ళుదాటి రాజకుమారి శాంతిశ్రీ నగరికి పోయినారు. ఆమె నగరిలోకి మహారాజు వచ్చి పూజా గృహం ప్రక్కగృహంలో కూర్చుండి ఉన్న శాంతిశ్రీని తారసిల్లారు. తండ్రిగారు వస్తున్నారని పరిచారికలు వార్త తీసుకునిరాగానే శాంతిశ్రీ ఆనందమూ పొందలేదు, ఆశ్చర్యమూ పొందలేదు. ఆమె లేచి తండ్రిగారి పాదాలకు నమస్కరించింది. మహారాజు కొమరిత నాశీర్వదించి పీఠం పై అధివసించెను.

16

హారాజు రాజకుమారికవైపు తేరపార చూచి “తల్లీ, చదువు బాగుగ ప్రారంభమైనదా?” అని ప్రశ్నించినారు.

“మహాప్రభూ! చదువు ప్రారంభమైనది.”

“ప్రస్తుతము మీ గురువుగారేమి చెబుతున్నారు?”

“ఏవిషయమూ ప్రారంభించలేదు. ధర్మాలనుగూర్చి ఏవో ప్రశ్నలు వేసినారు వానికి నేను ప్రత్యుత్తరా లిచ్చినాను.”

“మంచిది తల్లీ! చదువు అలాగే ప్రారంభించు. విజ్ఞానవంతులు శిష్యులై నప్పుడు గురువులు ఎక్కడో ప్రారంభిస్తారు.”

“కావచ్చును మహాప్రభూ!”

“తల్లీ! నీకు సంగీతమంటే ఎంతో అభిరుచికదా, ఆ ఉత్తమవిద్య ఎందుకు వృద్దిచేసుకోవు?”

“నాకు సంగీతమంటే ఎందుకో ఇష్టంలేదు.”

“శిల్పం ?”

“శిల్పం తథాగతుని సేవచెయ్యడానికి పనికివస్తుంది. అయినా ఆ విద్యపై మనస్సు పోలేదు.”

“బ్రహ్మదత్త ప్రభువు గొప్ప చిత్రకారులుకూడా తల్లీ! వారి దగ్గర చిత్ర లేఖనం నేర్పుకోవచ్చునుకదా. వారి సంగీత విద్యాశేమషీసంపన్నత సకల జంబూద్వీపంలోనూ కీర్తిని కన్నది. దేవభాషలో, ప్రాకృతాలలో, మన ఆంధ్ర ప్రాకృతంలో ఆ ప్రభువు మహాకవి.”

“నాయనగారూ! నాకు ఏ విద్యమీదా కోర్కె కలగడంలేదు.”

“రాజకుమారీక లందరు నేర్చుకోవలసిన విద్యలుకదా ఇవి?”

“కావచ్చును మహాప్రభూ! నా మనను వానిపై ప్రసరించదు.”

మహారాజు నిట్టూర్పు విడిచి లేచినాడు. మర్యాద ననుసరించి, ఆ బాలిక తండ్రివెంట తనమందిర కవాటంవరకూ సాగనంపి వెనుకకు వచ్చింది. ఆమె కంఠము మధురమైంది. ఆమెకు నేర్పకుండానే సంగీతం అలవడింది. ఆమె భూర్జపత్రాలపై వ్రాసిన ధర్మసూత్రలు ముత్యాలకోవలే. మషీపాత్రలో కుంచెముంచి, ఆమె మహావేగంతో అందాలు కరిగించి పోతపోసిన వ్రాత వ్రాస్తుంది. ఆమె బొమ్మలు వేస్తుంది కాని ఆ రచన భక్తివల్ల చేసేదికాదు. అయిన ఆ బొమ్మలు అందం ఒలుకుతూ ఉంటవి. వానిలో పరిణతి లేకపోయినా మంచి ప్రజ్ఞ కనిపిస్తుంది.

ఈ ఆలోచనతో మహారాజు తన నగరు చేరెను. శాంతిశ్రీ హృదయంలో పరివర్తన ఎప్పటికైనా కలగదా? ఆమెలో ప్రేమ ఉద్భవింపదా? ఆమెకు కోపము తాపము ఆవేశము పుల్కరింపు ఒకనాటికైనా తలచూపవా? తన ఈ అందాలబిడ్డ, ఈ జగదద్భుతసుందరి, చిత్రించిన పారిజాత కుసుమమయి పోవలసిందేనా? ధర్మదత్త ప్రభువు తాను ఈ బాలిక విషయమై ప్రశ్న అడిగినప్పుడు “ప్రభూ! ఈ బాలికలోని మహోత్తమ మానవత్వము భూమి లోతుగా రాళ్ళకింద పరవళ్ళెత్తి ప్రవహించే పాతాళగంగలా ఉన్నది. ఒకనాడు ఆ రాళ్ళను బద్దలుకొట్టి పాతాళగంగను భాగీరధి చేయగలిగిన మహాపురుషు డెవ్వడో ఆమె జీవితంలో తారసిల్లుతాడు. అప్పుడే ఈమె సంపూర్ణ స్త్రీ అవుతుం” దని వాక్రుచ్చినాడు.

విజ్ఞానంలో, ప్రతిభలో, మహాపురుషత్వంలో, అతిరథ శూరత్వంలో బ్రహ్మదత్త ప్రభువు మేరుశిఖరంవంటివాడు. వీరిరువురిని ఒకరికోస మొకరిని బ్రహ్మ సృష్టించినాడు. తాను వారిద్దరిని విద్యవ్యాజా సంధానించినాడు. ఆ పైన భగవదిచ్ఛ.

తండ్రి వెళ్ళినప్పటినుండి శాంతిశ్రీ మహారాజు ఎందుకు వచ్చినారు అనుకొన్నది. ఆమె చెలికత్తె ఒకర్తవచ్చి “మహారాజకుమరీ, మిమ్ము శాంతశ్రీ ఆహ్వానించింది. వేళ అవుతున్నది. కోటభేరీ అప్పుడే మూడవ యామపు మ్రోత వ్రాయించినది” అని మనవి చేసినది.

17

విజయపురిలో వసంతతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆనాడు సకల భారతవర్షమూ నవ్యజీవనంతో కలకలలాడి పోతుంది. కామదేవుడు దివ్యతపోజనిత నేత్రాగ్నితో మసి అయిపోతాడు. ఆ దినాన ప్రజలు కామ దహనోత్సవంచేసి, విషణ్ణ వదనాలతో ఘడియలు గడుపుతారు. ఆ మరునాడు మనుష్యుని నిత్యయౌవనశక్తి నూత్న జీవన మార్గాన్ని అన్వేషించ కోరుతుంది. ఆ కాంక్షకు సిద్ది రతీదేవి. సిద్ది కార్యదీక్షను వాంఛిస్తుంది. కార్యదీక్ష కామదేవుడు, మనుష్యుని నిత్యత్వానికై కాముడు తిరిగి ఉద్భవించాలి. నూత్నచైతన్యం కటికచీకటిలో కాంతికణంలా ఉద్భవిస్తుంది. ఎండిపోయిన చెట్టు కోరికలనే కెంజిగుళ్లు ధరిస్తుంది. ఎక్కడో అస్పష్టంగా “కో” యని వినబడుతుంది. కామ జననం అయింది. పసంతకాలం ప్రారంభించింది. చిగురులు పెరుగుతున్నాయి. ఫెళ్లున తోటలు అడవులు, చెట్లు, పొదలు జేగురుపసిమి రంగులతో విరిసిపోయినాయి. దిరిసెనలు, తంగేడులు, మోదుగలు కోర్కెచివుళ్ళు తొడగకుండానే పూలమొగ్గలతో నిండిపోయాయి. యువతీ యువకులు తమలో ఉదయిస్తున్న ప్రేమరాగానికి చిహ్నంగా వసంతకాలం అంతా పాటలతో, ఆటలతో, నాట్యాలతో ఉప్పొంగిపోతారు.

“కరడు కట్టిన నీరు కరగి ప్రవహించింది.
 కొత్త ఉప్పొంగుతో కొత్త కెరటాలతో”

వారు ధరించిన వస్త్రాలు కళాస్వరూపాలు. వారి అలంకారాలు సౌందర్య స్వప్నాలు. వారేరసాధిదేవతలు. యువరాజు వీరపురుషదత్తుడు వసంతమూర్తి అయినాడు. పూంగీయ శాంతశ్రీయు, బాపిశ్రీయు వనదేవతా, కుసుమదేవత అయినారు. నగరంలోని, దేశంలోని యువతీ యువకులు మహోద్యానవనంలోనే చేరి అచ్చటనే వివిధ మందిరాలలో నివసిస్తారు. పగలూ రాత్రీ ఆటలపరవళ్ళలో ప్రవహించిపోతారు.

ఒకదినం వసంతవరణోత్సవము. ఆ దినం కొన్ని నూరుల నివర్త నాల వైశాల్యమున ఆ తోటంతా దేశంలోని వీరులు, చదువుకొన్నవారు, అందమైనవారు, సర్వకళా కుశలులు అయిన బ్రహ్మచారులు కూడిపోయినారు. వారిలోనుండి మరల ఉదయించిన కామదేవుని, అతని అనుగు చెలికాడు వసంతుని ఎన్నుకోవాలి. వీరిద్దరిలో మొదటి ఎన్నిక వసంతదేవునిదే. ఈ ఏడు వసంతుడు ఉత్తమ గాంధర్వనిధి అయ్యుండాలన్నారు. ఆ నిర్ణయానికి ఒక పండితుడు, ఒక యువకుడు, ఒక యువతి పరీక్షకులు. శాంతిమూల మహారాజు ముగ్గురు పరీక్షకులను నియమించారు. పరీక్షలు నాలుగుదినాలు జరిగినవి. ఎందరో యువకులా పరీక్షకు నిలిచిరి. సంగీత ప్రదర్శనం కాగానే పరీక్షకులు ఆలోచించుకొని శ్రీశ్రీ వీరపురుషదత్తప్రభువు ఉత్తమ గాయకుడని నిర్ణయించారు. యువరాజు వీరపురుషదత్తుడు రావణహస్తము మ్రోయిస్తూ, గాత్రంతో గంభీరముగా పాటలు పాడినాడు.

     “పూలకై భృంగమే పుట్టేనో
      పూలె భృంగానికై పుట్టేనో
      వనములే ఎరుగున్,
భూమిచీల్చుకు మొక్కవచ్చును
మొక్కపూయును మంజులతలన్
     పూలఎదలో మధురగంధము
     భూమిలోనే గంధముండేనా?”

యువరాజు మోమున చంద్రిక లలముకొన్నవి. ఆ యువక ప్రభువు దేహమంతా ఏదో ఒక ఆనందముతో పుష్పపూర్ణ వృక్షములా అయినది. ఆ ప్రభువు కంఠంలో తేనెలు నిండినవి. లోయలో సెలయేరు నిండిపోయి ప్రవహించినట్లా మహారాజకుమారుని గొంతుకలో విమలగాంధర్వము పొంగిపోయింది. వసంతరాగ మాలాపించి ఆ సుందరమూర్తి తన కంఠాన్ని పూవుపూవుకూ పోయే భృంగమూర్తిని చేసినాడు. ఆకాశాన సంతోషంతో తిరిగే పతంగ మూర్తిని చేసినాడు. అగాథశూన్యంలో పయనించే నక్షత్రాన్ని చేసినాడు. విపుల వక్షుడు, ప్రస్పుట రేఖా సమన్విత దృఢంగ సుభగుడైన ఆ ప్రభువు మనోహర వదనము పారిజాత కుసుమంలా కలకలలాడిపోయినది. రావణహస్త విపంచిపై ప్రసరించే వ్రేళ్ళు నీళ్ళలో ఈదులాడే మీనాలులా ఉన్నవి. వ్రేళ్ళ కదలికలో సంగీత ముద్భవిస్తున్నదో, సంగీత మహా ప్రవాహంలో అవి కదులుతున్నవో? ఆ ప్రభువు కంఠము హృషీ కేశంలోని గంగాప్రవాహంలా గంభీరం.

      “నిత్యమృత్యువు జగము ప్రాణులు
       నిత్యజీవము జగము ప్రాణులు
       మృత్యువున జీవమ్ము నిత్యము
       అమృతత్వ మనంత విశ్వపు
       నిత్య లీలయట!”

(18)

వసంతుడై శ్రీ వీరపురుషదత్తకుమారప్రభువు వనదేవతను వరించాలి. అతనిని వసంత దేవునిగా బాలికలందరూ అలంకరించారు. పూవుల కంఠమాలలు, పూవుల దండకడియాలు, కంకణాలు, పూవుల మొలనూలు, పూవుల మంజీరాలు, చిత్రచిత్ర రూపాలుగా రచించి, యువరాజును పూవుల ఆసనంపై అధివసింప జేసినారు. అతని చూట్టూ ఆ బాలికలు నాట్యంచేస్తూ కళ లుట్టిపడ రచించిన పూలకిరీట ముంచినారు.

       “జయ జయ జయ జయవసంత
          జయ మధుదేవా
          జయ వసంత
          జయ నవజీవిత రథసారధి
                  రావోయీ స్వప్న మూర్తి
                  రావోయీ కామమూర్తి.
          విరియబోవు హృదయకుసుమ
          దళములలో గంధమూర్తి
                  రావోయీ!
                  రావోయీ!
          జయ జయ జయ జయవసంత
          జయ మధుదేవా!
          లోకంలో శ్రుతి ఉందో
          రాకాసగు శ్రుతిభంగమొ
                  ఓ మధుమాసాధిప
                  మా మనసులు వికల మొందె
                  జయ జయ జయ జయవసంత
                  జయ మధుదేవా!
          గజ గజ వణకించు నెలలు
          గడచినవయ్యా నేటికి

        జరఠత్వము సమసిపోయె
        విరియబూచె నవకాంక్షలు
        జయ జయ జయ జయవసంత
        జయ మధుదేవా!
చిగిరించెను మ్రోడుమ్రోక
రగిలించెను కోర్కె రేక
        నీ కొరకే ఎదురు చూచు
        మా కన్నులు కాంతినిండె
        జయ జయ జయ జయవసంత
        జయ మధుదేవా!”

ఆ బాలలు సుగంధజలముల వసంతునకు అభిషేకము చేసినారు. లక్షలకొలది. మల్లెలు, మొల్లలు, మాలతులచే వీరపురషప్రభుని పూజించినారు. వసంతదేవాభిషేక మహోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. వసంత దేవుడంత చెలికత్తెలు కూడరా బయలుదేరి ఉద్యానవనం అంతా నాట్యాన పరిభ్రమించడం ప్రారంభించాడు.

ఆంధ్రసామ్రాజ్య మహాసామంతుల తనయలు, మహాతలవరుల తనయలు, మహాదండనాయకుల తనయలు, అనేకు లీయేటి వసంతోత్సములకు విజయపురికి వేంచేసినారు. శ్రీ వీరపురుషదత్తప్రభువు తనకు అనుగు చెలికాడైన విదూషకునితో, తానే ఎన్నుకొన్న మలయపవనదేవునితో, భృంగదేవునితో సరససల్లా పాలాడుతూ ఆవేదనపడుతూ వనరమకై వెదుకుతున్నాడు.

శాంతిమూల మహారాజు మేనమామలు ఉత్తరకళింగాధిపతులైన వాసిష్టులు యశోవర్మ మహారాజు, ఆ మేనమామ కొమరుడు దుర్జయవర్మ, దుర్జయ వర్మకొమరిత భట్టిదేవి.

విజయపురిలో జరిగే ఈ వసంత మహోత్సవాలకు దుర్జయవర్మ మహారాజు కొమరితతో, తన మహారాణితో సపరివారుడై విచ్చేసినాడు. ఈ ఉత్సవంలో భట్టిదేవి తన చెలికత్తెలతో వచ్చి పాల్గొంటున్నది. భట్టి అందాల బాల. ఆమె మోము గుండ్రనై పద్మాకారంగా ఉంటుంది. ఆమె విశాలనయన, సంతత హాస ప్రపుల్ల వదన. గడుసరి కాదు. అమాయిక, భట్టిదేవి అందము కామధేనువు అందము. ఆమె ఆనాడు వీరపురుషదత్త ప్రభువును వసంత దేవునిగా అలంకరించిన బాలికలలో ఒకరిత.

ఆమె తక్కిన బాలలతోపాటు తన్ను అలంకరిస్తున్నప్పుడే వీరపురుషదత్తప్రభువు ఎవరా ఈ బాలికయని ఆశ్చర్యం నిండిన ప్రశ్న వేసుకొన్నాడు. భట్టిదేవి మోమున పూంగీయ శాంతశ్రీ మోమునవెలిగే విద్యాకాంతులు లేవు కాని, పూర్ణశ్రీ కాంతులు, గంధపు తరువును చందన పరిమళ మలమిపోయినట్లే అలమిపోయి ఉన్నవి. ఆ బాలిక ప్రతి అవయవమూ యౌవనరాగాన్ని సౌందర్యశ్రుతిలో పాడే విపంచికాతంత్రి అయినది. ఆ బాలిక ఎదుట నిలుచుండిపోయినాడు యువరాజు. యువరాజు వెంట వచ్చే నంది యువరాజు నుద్దేశించి “జయము జయము మహాప్రభూ! ఈ దివ్యసౌందర్యగాత్ర అయిన రాజకుమారి ఉత్తరకళింగ మహారాజులైన దుర్జయవర్మ మహాప్రభువుల తనయ వాసిష్టీగోత్రజ భట్టిదేవి” అని మనవి చేసెను.

వెంటనే తన తండ్రి శాంతిమూల మహారాజు వాక్యాలుగా బ్రహ్మదత్త ప్రభువు తనతో చెప్పిన మాటలు రాజకుమారునకు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చిరునవ్వుతో “రాజకుమారీ! మాకు వనలక్ష్మిగా అవతరించావు" అని పలికినాడు. రాజకొమరిత చెలి ఒకర్తు నవ్వుతూ చేతులుమోడ్చి “మహారాజ కుమారా! మీరు మా భర్తృదారికను వనరమగా ఎన్నుకొని రసజ్ఞ శేఖరత్వం ప్రకటించారు. రాకుమారి తమచే బహుకృత అయింది” అని విన్నవించుకొన్నది. ఈ సంఘటన గమనిస్తున్న పూంగీయ రాకుమారి శాంతశ్రీకి పట్టరాని కోపమువచ్చి విసవిస నడిచి రథమెక్కి తనచెలులు కొలిచిరా భవనానికి వెళ్ళిపోయింది.

19

హారాజకుమారి భట్టిదేవిని వనలక్ష్మిగా ఎన్నుకోగానే ఆ మహోద్యానవనములో వివిధ ప్రాంతాలలో ఉన్న వందలకొలది బాలికలు ఆమె చుట్టూ మూగినారు. పాటలు పాడుతూ నాట్యమాడినారు. పూలతో లతలతో అలంకరించినారు. బాలకులందరూ వసంతుని పొదివికొని నాట్యమాడుతూ, పాటలు పాడుతూ తీసుకొని వచ్చి వనమధ్యాన లతలతో పూలతో మనోహరంగా అలంకరించిన పూలవేదికపై అధివసింపచేశారు. ఇంతలో బాలికలందరూ పాటలు పాడుతూ, నాట్యమాడుతూ వనదేవిని తీసికొని వచ్చి వసంతుని ఎడమ పక్క ఉన్న కుసుమాసనంపై అధివసింప చేసిరి. యువతీ యువకులందరూ కలిసి కుసుమభృంగ నాట్యం కావించారు. నాట్యం పూర్తికాగానే బాలికలందరూ మన్మధుని ఎన్నుకోవాలి.

ఈ నాట్యాలు, ఈ ఆనందం గమనిస్తూ చిరునవ్వు నవ్వుకుంటూ కొంచెం దూరంగా బ్రహ్మదత్తప్రభువు నిలిచి ఉన్నాడు. అతని బాపిశ్రీ రాకుమారి గమనించింది. ఆమె కేమి బుద్ది పుట్టిందో ఆ ప్రభువు వంక తీక్షణవీక్షణాలు పరపింది. అతని సమున్నత రూపమూ, దృఢాంగ బలము, అఖండ జ్ఞానవికాంతివిలసిత సుందరవదనమూ చూచింది. ఇన్ని దినాలనుండి ఆ ప్రభువు ఈ వేడుకలలో పాల్గొనుటలేదు. ఈ ప్రభువు వట్టి విరాగి. జీవితం ప్రక్కనుంచి తప్పుకొని పోవాలని చూచే యువకుడు. ఈయన తనకు అన్న అయితే ఎంత బాగుండును అని బాపిశ్రీ అనుకున్నది. బాపిశ్రీ తన మేనమామ శాంతిమూలమహారాజును భగవంతునిగా పూజిస్తుంది. ఆయన హృదయము పూగీయ శాంతశ్రీతోపాటు ఈ బాలికయు అర్ధముచేసుకొన్నది. తమ వదిన శాంతిశ్రీ ఏ యోగినీ లోకం నుంచో దారి తప్పి వచ్చింది. ఆ అందాలరాణిని ధనక ప్రభువైన స్కంద విశాఖాయనక బ్రహ్మదత్తునికీయ మహారాజు సంకల్పించి ఉన్నాడని బాపిశ్రీ శాంతశ్రీలు గ్రహించారు. ఇట్లు యోగివంటి ఈ ప్రభువు అటు యోగినివంటి తమవదిన అనుకొన్నది బాపిశ్రీ. తన పెత్తల్లి కొమరిత పూంగీయరాకుమారి శాంతశ్రీ ఎందుకు కోపంవచ్చి వెళ్ళిపోయిందో తనకు అప్పుడే అర్థమైంది. తామిద్దరూ యువరాజును సమంగా ప్రేమించారు. తమనిద్దరినీ యువరాజు సమంగా ప్రేమిస్తున్నాడు. అలాంటిది వనదేవతగా అక్క శాంతశ్రీని ఎన్నుకోకుండా వాసిష్టి భట్టిదేవిని బావగారు ఎన్నుకోడం అక్కగారికి కోప కారణమైనది. అక్కకు కోపం వచ్చినట్లు తనకు కోపం రావలసిందే. కాని సౌందర్యంలో అక్క శాంతశ్రీతో ఎవరు దీటుకో గలరు! తన్ను యువరాజు కమల పుష్పముగా మాత్రము ఎన్నుకుంటారని ఆమె అనుకున్నది.

ఈ ఆలోచనలతోనే బాపిశ్రీ బ్రహదత్త ప్రభువునుచూచి, ఈ ప్రభువును కామదేవునిగా ఎన్నుకుంటే, ఈయనే అక్కకూ, తన బావగారికీ సామరస్యం కుదర్చగలరు అని ఆలోచించుకున్నది. ఆ భావము ఒక బాలిక చెవులో వేసింది. అది అలా అలా పాకిపోయింది బాలిక లందరిలో.

        “మధుమాసదేవునకు మదనదేవుడు హితుడూ
        మదనదేవుందేడి మదవతులు వేదకరే!”

అని పాడుతూ బాలికలు బ్రహ్మదత్తప్రభువును చుట్టుముట్టినారు.

      “ఇడుగిడుగొ చెలియరో ఇక్కడే వెలిసాడె
       పడుచువారల దాడిసలుప నున్నాడే!

బ్రహ్మదత్తుడు తెల్ల పోయినాడు.

     “రావోయి మన్మథా
      రావోయి శుకరథా!
      నీవె సృష్టికి మూల మీవె జీవాత్ముడవు
              రావోయి మన్మథా
              రావోయి శుకరథా!
      కామేశ్వరుడ వీవె
      కావేశ్వరుడ వీవె
      ఈవె యవ్వన జీవితేశ్వరుడవు కావే
              రావోయి మన్మథా
              రావోయి శుకరథా!”

పాటలు పాడుతూ మహావేగాన నృత్యమొనరించినారు. బాలురు, బాలికలు, వృద్దులు వసంతుని ఎన్నిక సమయంలోవలె అత్యంత సంతోషము వెల్లడించారు. బ్రహ్మదత్త ప్రభువు మాట్లాడుటకు వీలే లేకపోయింది. ఆయనను కొనిపోయి వసంతదేవుని పూలవేదిక ప్రక్కనున్న వేదికపైన పూలసింహాసనంపై అధివసింపచేశారు. యువతీ యువకులు ఆయనకు పూలకిరీటం పెట్టినారు. ఇక్షు కోదండమూ, పూవుల బాణాలతో అలంకరించారు.

     “వెదకరే మన రతీదేవిని
      వెదకరే శృంగారాదేవిని
      ఆనంద పులకితదూ!”

అని పాడినా రా బాలలు. బ్రహ్మదత్తునకు చటుక్కున ఒక దృఢనిశ్చయం కలిగింది. ఆ ప్రభువు ఆ బాలికల నందరిని కలియచూచినాడు. చిరునవ్వు నవ్వుకొన్నాడు. మహారాజు కొమరిత శాంతిశ్రీ తండ్రిగారి శిబిరములకడ వెలసిన తన శిబిరములనుండి పైకిరాదు. ఆమె యువతీ యువకులు పాల్గొను ఆ ఉత్సవాలు చూచి అసహ్యించుకొన్నది.

ఇంతకు పూర్వము సంవత్సరాలలో యవ్వనవతి అయినను ఆ రాజకుమారి వసంతోత్సవములలో పాల్గొనేదికాదు. ఈ సంవత్సరోత్సవము దక్షిణాపథాన కంతకూ శిరోమణిగా మహారాజు సంకల్పించినారు. దేశ దేశాల రాజకుమారులూ, రాకుమారికలూ ఆహూతులై విజయపురికి వచ్చినారు. కాబట్టి మహారాజు కొమరిత మర్యాదకై వసంతోత్సవానికై రాక తప్పిందికాదు.

బ్రహ్మదత్తుని బాలలందరు మన్మథునిగా ఎన్నుకొన్న సమయంలో శాంతిశ్రీ రాజకుమారి తన శిబిరానికి దాపున ఉన్న ఒక నికుంజపు నీడలో ప్రతిమాకారయై కూరుచుండి ఉన్నది. ఇంతలో యువతీయువకులు పాటలు పాడుతూ పూవులు జల్లుతూ కొలిచిరా ధనకస్కంద విశాఖాయనక బ్రహ్మదత్తుడు అచ్చటకు వచ్చి ఆ బాలికను సమీపించి ఆమె మెడలో దండవైచెను.

20

బ్రహ్మదత్తప్రభువు మాఠరీపుత్రి శాంతిశ్రీ మెడలో దండ వేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. మహారాజు కొమరిత విరాగిని వంటిది. ఏ ఉత్సవాలలో పాల్గొనని బాలికను బ్రహ్మదత్తుడు రతిగా వరిస్తాడని ఎవ్వరనుకుంటారు?

పుష్పదామము మెళ్ళోబడగానే ఆ బాలిక చటుక్కున కళ్ళు తెరచింది. ఆ కళ్ళు విశాలములు పరమ మనోహరములు. ఆ కళ్ళ పక్ష్మములు దీర్ఘ వినీలములు. ఆ కళ్ళలోని కాంతి మధురార్ధ్ర శాంతియుతము. ఆ కాంతిని చూచి యౌవన పులకితులైన యా మదవతులు వెరగుపడి, పాటలు మాని, నాట్యము మాని నిలుచుండిపోయిరి. యువకులు సిగ్గుపడి, భయపడి, వెనుకంజ వేసినారు. కాని బ్రహ్మదత్తప్రభువు మాత్రం చిరునవ్వు నవ్వుతూ.

"శాంతిశ్రీదేవీ! మిమ్ము రతీదేవిగా ఆహ్వానిస్తున్నాను” అని చేతులు సగం చాపి ఆహ్వానించినాడు. శాంతిశ్రీ నిద్రమేల్కొన్న బాలికవలె ఏమియు అర్థముకాక అటుయిటు చూచి, మళ్ళీ బ్రహ్మదత్తునివంక చూస్తూ కళ్లు చిట్లుంచుకొన్నది. ఆమె తెల్లని దుకూలాలు ధరించి ఉన్నది. కొలది భూషణాలు మాత్రమే ఆమె అలంకరించుకొని ఉన్నది. ఆమె మన్మథుడు పాలనేత్రాగ్నిచే భస్మమైన వెనుక యోగినీవేషము తాల్చిన రతీదేవివలెనే ఉన్నది. ఆమె అనుపమ సౌందర్యము శాంతతేజః ప్రవాహమై ఆ వనమంతా పరవళ్లెత్తినది.

"రాకుమారీ! నన్నీ యువతీయువకులు మన్మథునిగా ఎన్నుకొన్నారు. నేను మిమ్ము రతీదేవిగా ఎన్నుకొన్నాను. వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనవలసిందని నేనూ ఈ యువతీ యువకులం ప్రార్థిస్తున్నాము.”

“ఏ ఉత్సవము?” ఆమె మాటలు తెల్లబోయిన చిన్నబిడ్డ మాటల్లా ఉన్నాయి.

“ఇది వసంతోత్సము.”

“అవును.” “మీరు రతీదేవి.”

“నేను రతీదేవినా!”ఆమె మోము వైవర్ణ్యమొందినది. ఇటు నటు చూచింది. “నేనా రతీదేవిని? బుద్దుని ఓడించి నాశనం చేయడానికి ప్రయత్నించిన మారరాక్షసుని భార్య రతీదేవినా నేను!” ఆమె దీనవదనము చుట్టూ ఉన్న బాలబాలికల హృదయాలను క్రుంగ చేసింది.

బ్రహ్మదత్తుడు మహోత్తమ ప్రేమ స్పందించు మాటలతో “భర్తృ దారికా! నువ్వు మారభావాన్నీ, మన్మథభావాన్నీ విపరీతంగా అర్థం చేసుకొంటున్నావు” అన్నాడు.

“నాకు ఆ రెండు భావాలకూ భేదము కనబడదు ప్రభూ!”

“మారభావము దురాశ అతికాంక్ష, అతిప్రాపంచిక వాసనను తెలియజేస్తుంది. మన్మథభావం నిత్యసృష్టీ, యౌవనమూ, ఆనందమూ.”

“నిత్యసృష్టి మాత్రం దురాశకాదా?”

“ఆధ్యాత్మిక దృష్టినే కావచ్చును. ప్రపంచంలో ఉన్న శుద్దోదనునకూ, మాయాదేవికీ సిద్దార్ధబోధిసత్వుడుద్బవించి జగత్తును తరింపచేసే మార్గ ముపదేశించాడు. మన్మథభావం లేకపోతే అది ఎట్లా సాధ్యం?”

“ఆ మన్మథభావం పూర్తిగా పోవాలనికదా సమంతభద్రుని ఉపదేశం.”

“అవునుకాని ఆ పరమశ్రమణకుడు గృహస్థులు కూడా బౌద్దదీక్ష పుచ్చుకోవచ్చునని అనుమతించిన కారణం ఆలోచించుకొన్నావా రాకుమారీ.”

ఈ సంభాషణ అంతా ఆశ్చర్యపడుతూ ఆ యువతీ యువకులంతా వింటున్నారు. ఉత్సవస్థలంలో యువతీయువకులూ, వసంతుడూ, వనలక్ష్మి రతీ మన్మథులకోసం ఎదురు చూస్తున్నారు. ఆలశ్యం అయిందేమో అని వసంతుడైన వీరపురుషత్తుడు భట్టిదేవి చేయిపట్టుకొని లేచాడు. వసంత వేదికనుండి దిగి, యువతీ యువకులు కొలిచిరా వనరమా వసంతు లిరువురు రతీమన్మథులున్న స్థలానికి వచ్చారు.

    "ఏదమ్మ జగదేక సుందరాకార రతి?
     ఏదమ్మ ప్రణయయోగాసనావిర్చూత?
            ఏది మాదేవి రతి?
            ఏదమ్మ ఏది?”

అని బాలికలు పాడినారు. వీరపురుషదత్తుడు, బ్రహ్మదత్తప్రభువు తన చెల్లెలిని రతిగా ఎన్నుకొన్న పరమార్దము వెంటనే గ్రహించాడు. మహారాజు కొమరి తమ మహారాజు ఆజ్ఞలేక రతిగా ఎన్నుకొనడానికి ధైర్యమెవ్వరికి ఉంటుంది, బ్రహ్మాదత్తునకు తప్పితే? యువకుడై, బ్రహ్మచారియైన బ్రహ్మదత్త ప్రభువును చెల్లికి గురువుగా నియమించడంలోని అర్థం వీరపురుషదత్తుడప్పుడే గ్రహించాడు.

వసంతుడు: మీనకేతనదేవా! రతీదేవి రావడానికి ఆలస్యం చేయడం కారణం?

మన్మథుడు: వసంతదేవా! అతనుడై మన్మథుడు మళ్ళీ తనువు తాల్చి వచ్చినాడని రతీదేవి గ్రహించలేకుండా ఉన్నది. వనరమ: చెల్లీ, రతీదేవి! నీవింకా యోగినీ హృదయంతో ఈలా తపస్సు చేసుకోవడం మంచిదికాదు. మన్మథదేవులే స్వయంగా వచ్చి నిన్ను అర్థిస్తున్నారు.

బాలికలు: అవునుదేవీ, శుభముహూర్తం దాటి పోతున్నది.

బాలురు: వసంతకాలం నిత్యమైనా క్షణికం. మాకింతలో కౌమారదశ వస్తుందన్న భయం ఆవరిస్తున్నది.

శాంతిశ్రీ రాకుమారి వెలవెలబోయే చూపులతో వీరందరినీ కలియ జూచింది.

21

శాంతిశ్రీ మోము చూస్తూ బ్రహ్మదత్తుడు క్రుంగిపోయాడు. ఈ బాలికను తాను ప్రేమించినాడు. ఈ బాలికే తన ఆత్మేశ్వరి! ఈ ప్రణయరహిత హృదయ, ఈ జన్మయోగిని, తన ప్రేమ నిధానము. ఇంత లోకోత్తర సౌందర్యవతి అయిన ఈమె జీవితంలో ప్రేమరసార్ధత లేనేలేదే! తేనెలేని పుష్పమా ఈమె! ఈమెకు భగవద్భావంకూడా లేదా! ఇది ఈమెలో దోషమా లేక అవస్థా దోషమా? తాను ఈ బాలికను రతీదేవిగా ఎన్నుకొని ధర్మద్రోహము చేసినాడా? ధర్మజ్ఞుడయ్యూ తాను ఈ విషయంలో ఇంత ధర్మగ్లాని ఒనర్చినాడేమి? వైరాగ్యాభిరతమగు తన హృదయంలో స్త్రీ కాంక్ష అంతరాంతరాలలో అణిగి ఉన్నదా? స్త్రీ పురుష సంయోగము దుష్టమని పరిత్యజించ దగినదా? బ్రహ్మదత్తుని ఆలోచనా నిమగ్నత గమనించిన ఆ యువతీ యువకులు చుటుక్కున నిశ్శబ్దత వహించారు.

శాంతిశ్రీ రాకుమారి బ్రహ్మదత్తుని గమనించింది. బ్రహ్మదత్తుని మోము నిశ్చలత వహించింది. అతని మోము శీతకాలాన హిమాలయ శిఖర రూపం తాల్చింది. అతని మోము సంపూర్ణామవాస్య రాత్రి నిశ్చిలాకాశంలోని గంభీరత వహించింది.

“శాంతిశ్రీ రాకుమారీ! నన్ను క్షమించు. నీ దివ్య సౌందర్యానికి నేను ముగ్ధుడనయి నిన్ను రతీదేవిగా ఎన్నుకొన్నాను. ఆకాశాన్ని ఆడుకొనేందుకు కావాలని పోరుపెట్టిన బాలకుణ్ణి నేను.”

"ఆర్యా! నేనే క్షంత్రవ్యురాలిని. మీ యందు దోషమేముందీ? మిమ్మీ యువతీ యువకులు మన్మథునిగా ఎన్నుకొన్నారు. నన్ను మీరు ఎన్నుకొన్నారు.”

ఆమె మాటలలో, ఆశ్చర్యముగాని, కోపముగాని, దయగాని, ఆనందముగాని, హాస్యముగాని, విచారముగాని ఏమీలేదు. ఆమె మాటలు ఆకాశవాణి మాటలులా ఉన్నాయి.

“రాజకుమారీ! ఇందులో నీదోషమూ లేదు. నాదోషమూ లేదు. వీరందరి దోషమూలేదు. విధిదీ, కాలముదీ దోషం. సెలవు.” బ్రహ్మదత్తుడు తలవంచుకొని విసవిస నడిచి తన రథము కడకుబోయి తానే తన గుఱ్ఱములు రథానికిపూన్చి విజయపురంవైపు వెళ్ళిపోయాడు.

అతడు వెళ్లిపోవడం చూస్తున్న శాంతిశ్రీ ఏమీ ఆశ్చర్యం పొందలేదు. ఈ యువకుడు అలా వెళ్లి పోయినాడేమిటి? ఆమె శాస్త్రప్రకారం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులంటే ఏమిటో తెలుసుకొన్నది. కాని వాని అనుభవం ఆ బాలకేమి తెలుసు? కొలదిగా విసుగు రావడం. ఎక్కడో మనసు లోతులలో కొంచెం కృతజ్ఞత. ఆ లోతులకు ఇంకా దిగువను అదొకరకపు సంతోషం కలగడం. ఇవి అప్పుడప్పుడు ఆమె జీవితంలో సంభవించిన ఘట్టాలు. నేడు బ్రహ్మదత్తప్రభువు విచార వదనంతో వెళ్ళిపోవడం చూచి ఆమెకు ఆశ్చర్యం కలిగిందేమో ఆమె మనస్సు లోతుల్లో అదిమాత్రం ఆమెకు తెలియదు.

ఈ నాటకమంతా శాంతిమూల మహారాజు తన శిబిరంలోనుండి గమనించాడు. తన కొమరిత మోముపై ఆశ్చర్యరేఖలైనా తోచకపోవడం చూచి, శాంతమూలుని మోము మేఘాలు కమ్ముకొన్న కొండచరియై పోయింది. ఎలాగు తానీ బాలికలో చైతన్యం కలిగించడం? ఆమెకు ప్రేమ ఉద్బవింపనే ఉద్బవింపదా? ఆమె యోగినియై దేశాల సంచరిస్తుందా? వివాహం చేసుకోదా? మహారాజువదనం విచారంతో ముడుచుకొని పోయిన పుష్పంలా అయింది.

ఆర్యధర్మంలో స్త్రీకి సన్యాసం విధించి ఉండలేదు. పురుషుడైనా బ్రహ్మచర్య, గృహస్తాశ్రమాలు నిర్వహిస్తేగాని వానప్రస్థ, సన్యాసాశ్రమాలు ఆశ్రయించకూడదు. స్త్రీకి వైధవ్యంలోనూ, వృద్ధాప్యంలోనూ మాత్రమే.

తనకు ఒక్కరితే ఈ కొమరిత. ఈ బాలికకు బౌద్ధధర్మమే ఈ అకాల వైరాగ్యం కల్పించిందా? తల్లి బౌద్ద ధర్మాభిరత అవడంవల్ల పుట్టుక తోడనే ఈ జడభావం అబ్బిందా లేక తన బాలిక వట్టివెఱ్ఱిబాగులదా?

వెఱ్ఱిదే అయితే అంత జ్ఞానసముపార్జనా ప్రతిభేల్లా వచ్చింది! ఏలాంటి గహన విషయమైన నిమేషంలో అర్థం చేసుకోగలదే!” ఈమె జీవితాన్ని, భవిష్యత్తునుగూర్చిన సందేహాలు ఎప్పుడూ మహారాజును భాధిస్తునే వచ్చాయి.

వీరపురుషదత్తుడూ, బట్టిదేవీ ఈ సంఘటన చూచి ఎంతో నిరుత్సాహ పడిపోయారు. యువరాజు వీరపురుషదత్తుడు వీరుడు. అతి ప్రణయు విలాస పూరితుడూ, ధర్మహృదయుడూ, తన సేవకై నియమింపబడిన సౌందర్యవతులగు బాలల నాతడు కన్నెత్తి చూడడు. ఇరువది సంవత్సరాల ఈడువాడు. అయినా మహారాజు కొమరునకు వివాహం మాట తలపెట్టలేదు.

ఆ దినాలలాంటివి శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ అవసానదశలో ఉన్నాడు. అఖండ శాతవాహన సామ్రాజ్యం విచ్చిన్నమైపోతున్నది. శాతవాహన యువరాజు నీరసుడని మహాసామంతులందరికీ తెలుసును. ఆ సామంతులందరు స్వతంత్రరాజ్యాలు స్థాపించి శాతవాహన ఛత్రచ్చాయలనుండి తొలగిపోవాలని సంకల్పించుకున్నారని శాంతి మూలునకు వేగులు వస్తున్నాయి.

దేశంలో ధర్మం నిలబెట్టిన శాతవాహనుల చల్లని సామ్రాజ్యం నశించ నున్నదని శాంతమూలుడు నిలువునా కలగిపోయినాడు. తాను శాతవాహనులకు అల్లుడును అయి ఉండడంవల్ల ఆ సామ్రాజ్యం నిలబెట్టవలసిన బాధ్యత తన మీదనే సంపూర్ణంగా ఉంది. అందుకై ఇతర మహాసామంతుల బాంధవ్యం ఎంతో ముఖ్యం. బాంధవ్యంవల్లనే పులమావి క్షాత్రపుల నెదిరి నిలువగలుగుతున్నాడు. తాను అలాంటి బాంధవ్యం కోసమే ఇంతమంది దేవేరులను చేసుకొన్నాడు. తన కొమరుడూ అలాగే దక్షిణనాయకుడు కావలసి ఉన్నది.