అడవి శాంతిశ్రీ/ఏకాదశ భాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(ఏకాదశభాగం)

నాగార్జునపర్వతం

శాంతిమూల చక్రవర్తి

ఇక్ష్వాకు శాంతమూలుడు ధాన్యకటకంలో ఆలోచనాపరుడై యుండగా నాగార్జునదేవుని కడనుండి “కుమారా! నీవే చక్రవర్తిని కావాలి. నేను స్వయంగా మిమ్ము పట్టాభిషిక్తులచేసి సిద్ధలోకానికి వెళ్ళిపోతున్నాను.

“బుద్ధం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
                  - నాగార్జున"

అని కదంబపత్ర విరచితమైన శ్రీముఖం వచ్చింది. వెంటనే శాంతిమూలుని మోము విప్పారినది. సర్వసైన్యాలకు తాను అధ్యక్షుడయి మాహావేగంతో ప్రతిష్ఠానం బయలుదేరినాడు. చవుకరాయనిక ప్రభువును, బృహత్పాలాయనప్రభును ముసికనగరంపైకి పంపినాడు. సాలంకాయనప్రభువును మాళవం పంపినాడు. అతివేగంతో ప్రతిష్ఠానం వచ్చి చెల్లెలి స్త్రీ సైన్యాలను వెంటబెట్టుకొని పూంగీయప్రభువును ప్రతిష్ఠానంలోఉంచి , నాసిక చేరుకునే సరికి పులమావి అంతకుముందే ప్రాణం వదిలినాడని తెలిసినది.

పులమావికి మహావైభవంగా భవంగా అంత్యక్రియలు జరిపి, నిండుసభలో పులమావి చక్రవర్తిగా నిర్యాణమందినాడని ప్రకటించినాడు. పులమావి రాణిని సంరక్షింపుమని చెల్లెలికి అప్పగించినాడు. నాసికనుండి కొమరితను చెల్లెలిని వీరాంగనాసైన్యాన్ని తిరిగి విజయపురం పంపినాడు. అక్కడ నుండి సర్వసైన్యాలతో కూడుకొని భరుకచ్ఛమూల మాళవ, మగథ, విదేహ, కోసల, వంగ, కళింగ విజయ యాత్ర సలిపి విజయపురం చేరెను.

ఒక శుభముహూర్తాన శ్రీనాగార్జునదేవుల పాదసమీపాన సర్వశుద్ధుల నంది శాంతమూలుడు ఆ దివ్యమూర్తికి సాష్టాంగపడినాడు.

శుద్ధసత్వమూర్తియై ఆ పరమఅర్హతుడు చిరునవ్వుతో "నాయనా! నాతల్లి ఆంద్రి. నేను విశ్వామిత్ర గోత్రుడను. సర్వవేదాలను మూర్తించు కొన్న గాయత్రిని కనుగొన్న వంశం మాది. ఏనాడు ఏ సాంప్రదాయం చెడిపోయినా ఆ సంప్రదాయానికి నూత్నజీవం పోసేందుకు ఉద్భవించిన వంశంమాది. సర్వశాస్త్రసమన్వయం, సర్వధర్మ సమన్వయం, సర్వసంప్రదాయ సమన్వయం లోకానికి అవసరమయిన దిప్పుడు. అర్షధర్మం సమన్వయించినాను. భౌతిక సత్యం ఆధ్యాత్మికసత్యంలోనిదే అని రసవాదంవల్ల నిరూపించినాను. కుమారా! నీ వంశము చాలాకాలం ఆంధ్రదేశాన్ని ఏలబోదు. కాని లోకోద్ధరణ చేయడంలో తనపాత్ర తాను నిర్వహించి సర్వాంధ్రంలో కలిసి పోతుంది. మీ వంశీకుడే ఒక మహాపురుషుడు కాకతీ భక్తుడు ముందు ఉద్భవించి సామ్రాజ్యం స్థాపిస్తాడు. నేను కొద్దిదినాలలో నీకు పట్టాభిషేకం చేసి హిమాలయాభిముఖుడనయి వెళ్ళిపోతాను. బుద్ధంశరణం గచ్ఛామి"అని తెలిపినాడు.

నాగార్జునదేవుడే ఒక దివ్వమూర్తంముంచి తాను అపర శైలాశ్రమమునుంచి దిగివచ్చి, సర్వరాజన్య సర్వ అర్హతాచార్య సర్వమహాపండిత ఋషి, కాపాలిక మహాప్రజా సమక్షంలో శాంతిమూలుని సర్వభూమండలానికి సార్వభౌమునిగా అభిషేకం చేసినాడు. కుసుమలతా సారసికాదేవులు ఇద్దరూ చెరి ఒక వైపున మహారాణులయి అధివసించినారు.

పాండ్యులు, చోళులు, కేరళులు, నాగులు, ఆభీరులు, మాళవులు, కోసలులు, వైదేహులు, వాసిష్ఠులు, మాఠరులు, చాళుక్యలు, సాలంకాయనులు, బృహత్పాలాయనులు, గాంగులు, మాగధులు, నేపాళులు మొదలగు మహారాజులు, రాజప్రతినిధులూ సార్వభౌమ పట్టాభిషేకానికి వేంచేసినారు.

ఉత్సవాలు దివ్యంగా జరిగినాయి. శాంతమూలుడు సార్వభౌముడు కాగానే వీరపురుషదత్త మహాప్రభువును బాసటగా ఇచ్చి అశ్వమును వదిలినాడు. ఆ అశ్వమును ఎవ్వరును పట్టుటకు సాహసించలేదు. వీరపురుషదత్తుడు లక్ష్మణునివలె, అర్జునునివలె సర్వదేశాలు దిగ్విజయంచేసి అశ్వాన్ని నడిపించుకొని వచ్చినాడు. వీరపురుసదత్త పార్థునకు బ్రహ్మదత్త కృష్ణుడు సారథి యాయెను.

వీరపురుషదత్తునకు బ్రహ్మదత్త దనకప్రభువు, భగవద్గీతయు, బ్రహ్మసూత్రాలు పాఠముచెప్పి వ్యాఖ్యానించినాడు. వీరపురుషదత్తుడు విజయపుర అశ్వముతో చేరగానే బ్రహ్మదత్తుని పాదాలకెరిగి “ప్రభూ! నేను తరించాను నాజన్మ పావనమయినది. కాని తన వ్యాఖ్యానంతో అద్వయమయిన సత్యం నాకు గోచరించింది. బౌద్ధగురువులయిన అర్హతాచార్యుల బోధకిప్పుడు సమసన్వయం కుదురుతున్నది” అని మనవి చేసికొన్నాడు. బ్రహ్మదత్తుని గీతావ్యాఖ్యానం బ్రహ్మదత్త భాష్యమని లోకంలో ప్రసిద్ధి వడసినది.

(2)

అనేక అగ్నిష్టోమాది క్రతువులొనరించిన శాంతమూలుడు వాజపేయమూ, అశ్వమేధ క్రతువుల నొనర్చినాడు. బ్రాహ్మణులకు అనేకాగ్రహరాలు, మహాదానాలూ, హిరణ్యకోటులు, గోసహస్రాలు, హయసహస్రాలు అర్పించినాడు. ఈ క్రతువులు కాగానే అర్షసంప్రదాయంగా సర్వభూచక్రానికి శాంతమూలుని చక్రవర్తిగా అభిషేకించినారు. బ్రహ్మదత్తప్రభువు తండ్రి, విజ్ఞానశ్రీ దేవదత్త మహర్షి వసిష్ఠులై అశ్వమేధ వాజపేయాదులు జరిపించి శాంతమూలుని చక్రవర్తిగా అభిషేకించినారు.

మహారాజు యువరాజుగా, విజయపుర మహారాజుగా వీరపురుషదత్తుని అభిషేకం చేసేముందు వాసిష్ఠీ భట్టిదేవి నిచ్చి విజయపురంలో ఆఖండ వైభవంగా వివాహం చేసినారు. వారిరువురకూ యౌవరాజ్య పట్టాభిషేకం జరిగింది. మహోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మదత్తుడు ఆ ఉత్సవాలలో సంపూర్ణంగా నిమగ్నుడై ఉన్నాడు. ఆ ఉత్సవాలలో ఒకనాడు సాయంకాలం తారానిక రథమెక్కి బ్రహ్మదత్తప్రభువు మహాభవనానికి వచ్చి ప్రభువు దర్శనం కోరింది. ఆ ధనకప్రభవు అప్పుడే స్నానంచేసి వచ్చి తన విద్యామందిరంలో పీఠం అధివసించి యుండెను. తారానిక వచ్చి సాష్టాంగపడి “మహాప్రభూ! తాము వెంటనే అంతఃపురానికి రావలసిందని మహారాజకుమారి నన్ను పంపింది” అని మనవి చేసినది.

“ఎప్పుడు?”

“వెంటనే ప్రభు!”

“నేను జపం చేసుకోవలసి ఉంది.”

“మా భర్తృదారిక ఇలా అన్నారండి. 'మా దేశికులు జపానికి పోయే వేళ అయినా వారిని వెంటనే కొనిరా' అని”

“సరే వస్తాను. నీవు పో!”

తారానికి వెళ్ళిపోయింది. బ్రహ్మదత్తుడు 'ఏమి పుట్టి మునిగినదో” అని సందేహించుచు తల్లికి నమస్కరించి ఆశీర్వాదమంది ఆమె మోమున వెలిగిన చిరునవ్వున కర్ధమేమా అని ఆలోచిస్తూ రథమెక్కినాడు.

(3)

ధనకప్రభువు మహావేగంతో మహారాజకుమారి భవనానికి వెడలినాడు. ఆ రథంవెంట తారానిక రథం ఉన్నది. రెండు రథాలూ లోనిప్రాంగణాలకు వెళ్ళిపోయినవి. మహాభవనము ఎదుట ఆగినవి. స్కందవిశాఖప్రభవు నెమ్మదిగి తారినిక దారి చూపగా లోనికి వెడలినాడు. సభాభవనాలు దాటి విద్యా మందిరంలోనికి ఆ మహాసామంతుని కొనిపోయినది. లోన నిశ్చలంగా శాంతిశ్రీ నిలిచి ఉన్నది. ఆమె ఎదుట బ్రహ్మదత్తప్రభువు చిత్రము లిఖించిన ఫలకము కుడ్యమును అలంకరించి ఉన్నది.

బ్రహ్మదత్తుడు రాగానే శాంతిశ్రీ పరుగున వచ్చి ఆ ప్రభునిపాదాల వాలినది. ఆ ప్రభువు చిరునవ్వుతో “మహారాజకుమారీ! నీకు సర్వవిద్యలూ కరతలామలకములగుగాక” యని ఆశీర్వదించెను. తారానిక వచ్చి రాజకుమారిని లేవనెత్తి “మహారాజా! తాము సింహాసనముపై అధివసించండి. మాభర్తృదారిక ఈ ఆసనం అధివసిస్తారు” అని పలికినది. బ్రహ్మదత్తుడు ఒక ఆసనం అధివసించినాడు. రాజకుమారై ఇంకో ఆసనం అధివసించింది.

“రాజకుమారీ! ఎందుకు నన్ను రప్పించింది?”

రాజకుమారి మౌనం వహించింది.

“నీ హృదయంలో ఉన్నది దేశికులకడ చెప్పవచ్చుకాదా?”

రాకుమారి నేలచూస్తూ నిలబడింది.

“ప్రభూ! నేను భిక్షురాలినికా మీ అనుమతి నీయ ప్రార్థిస్తున్నాను.”

"భిక్షుకురాలా?”

అవునని రాకుమారి తలవంచే ఊపినది.

“తప్పక కావచ్చును. కాని....” “ఆజ్ఞ ఇవ్వవచ్చునుగాదా?”

“ఇవ్వవచ్చును, సమయము వచ్చినప్పుడు,

ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు?”

“మీ తండ్రిగారు దగ్గిర ఉండగా గురువులు ఈయకూడదు. పెళ్ళి అయిన స్త్రీకి అనుమతి ఈయవలసింది భర్త. విధవ అయితే కుమారుడు. ఎవరూ లేకపోతే గురువు. పెళ్ళికాని బాలికలకు తండ్రి. తండ్రి తరువాత తల్లి. వీరుకాక ఇంకొకరు కన్యకు అనుమతి ఈయకూడదు.”

శాంతిశ్రీ మౌనం వహించింది. ఆమె దేశికులు సన్యాసానికి ఆజ్ఞ ఇస్తారు అనుకొన్నది. కాని ధర్మశాస్త్రప్రకారం అలా దేశికులు పనికిరాదని అంటారని ఆమె ఏ మాత్రమూ అనుకోలేదు. ఆ రాజపుత్రి ఇంచుక తడవు నిర్వికారమై నిలిచినది. పొడముచున్న కన్నీటిని రెప్పలతో అప్పళించినది. వెనుదిరిగి ఏగబోయి ఆగినది. ముందునకూగి వెనుకడుగు వై చినది. తటాలున బ్రహ్మదత్తుని పాదాలవాలి “మీరు నాకు దేశికులుకాదు, భగవంతులు. నేను నాకు తెలియక మిమ్ము ప్రేమించాను. శూన్యమయిన ఏదోలోకంలో చైతన్యంకాని చైతన్యంలో తిరుగుచుంటిని. చదివిన విద్య ఒక విధంగా అగ్రాహ్యమై ఉండేది. ఇంతలో మీరు నాకు దేశికులయినప్పటినుండీ ఏదో నాలో నూతనచైతన్యం అంకురించి, క్రమంగా నా జీవితం అంతా నిండి పోయింది. ప్రభూ! తాము నన్ను వనదేవతగా ఎన్నుకొంటిరి. ఎన్ను కొన్నందుకు ప్రథమంలో విపరీతానందం, వెంటనే తీరని వ్యధ అరంభించినవి అంతకుమున్ను అట్టి అనుభవాలు ఎరుగను. ఈ బాధలూ, ఈ సంతోషాలూ ఏమిటని ఆశ్చర్యపొందినాను. చికాకుపడినాను, ఏడ్చినాను, గంతులు వేసినాను మీరు కనబడక మనలేకపోతిని. మీరు నన్ను ప్రేమిస్తున్నారేమో అని ఆనందమందాను, బాధపడినాను. ప్రేమించుటలేదని నిశ్చయించి దుఃఖించినాను. మీరు సముద్రంలో మునిగిపోయినారన్న వార్తనా జన్మను మూలవంతటా కదిలించివేసింది. ఒకనాడు నేను జైనులవలె నా దేహం నాశనం చేసుకుందామనిపించినది.

“ఇంతలో మీరు తిరిగివచ్చినారని తెలిసి నాలో ఉద్భవించిన ఆనందము వర్ణనాతీతము. ప్రభూ! మీరు బందీ అయినారని విని క్రుంగి పోయాను. ఇంతలో నన్ను మించిన కోపం ఆవహించి పులనూవిని నాశనం చేయ సమకట్టినాను.

“దివ్యమూర్తీ! నేను మిమ్ము సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీ పరిచర్యకుగాని ఈ బ్రతుకు ఇసుమంతయినా అవసరంలేదు. మీరు వేదాంతము నాకు బోధించినారు. లోకమంతా పరిత్యజించి సన్యాసులయి వెడలిపోతారని భయమావహించి మీకన్న ముందుగానే దీక్ష పుచ్చుకోవాలని నిశ్చయించాను. ప్రభూ! ఈ నా ప్రేమ అవధిరహితం. సర్వదివ్యభావాలనూ అధిగమించి పోయినది. సర్వధర్మాలను దాటిపోయింది. మీరు నన్ను భార్యగానన్నా స్వీకరించండి. లేదా నాకు భిక్షుణి ధర్మదీక్షకు అనుమతి నివ్వండి. ఇదంతా నాయనగారికి మనవి చేసి వారి అనుమతిమీద మీకు నివేదించాను” అని మాటలంతకన్న అంతకన్న అస్పష్టమైపోగా మనవి చేసి కనులనీరు దొరలిపోగా, ఆ ధనకప్రభువు పాదాల వాలిపోయినది. ధనకప్రభువు ఆశ్చర్యమందినాడు. ఆనందముచే అతని మోము ఉదయారుణకాంతి రంజిత హిమాచలశృంగంలా వెలిగిపోయినది. ఆతడును ఆమె కడ మోకరిల్లి “దేవీ! నేను నిన్నింత చిన్ననాటినుండి ప్రేమించినాను. చిరుబాలికవైన దినాలలో నిన్ను ఏకాంతాన పూజించుకొంటిని. నీవు నా హృదయస్థదేవీమూర్తివి.

“నీవు ఈ లోకంతోపాటుకాక శాపవశంచే నరజన్మ తాల్చిన దేవతవలె నుంటివి. నీ కరగ్రహణము చేయలేని, నీ సాన్నిధ్యం పొందలేని నేను భక్తుడుగా జీవితం గడుపు దామనుకొన్నాను. దేవీ! ఇంతలో నీకు గురువైనాను. నేను నా సర్వస్వముతో ప్రేమిస్తూ- నీ సాన్నిధ్యవరానికే పరమేశ్వరునికి హృదయంలో సకమాలింగిత భూతలుణ్ణి అవుతూ - ఆ మహదానందంతో నీకు పాఠాలు చెప్పినాను.

“దేవీ! నీవు నన్ను ప్రేమిస్తున్నావన్న నిశ్చయమూ కలిగింది. లేదేమోనన్న భయమూ కలిగేది. నా జీవితేశ్వరివి... నా ఆరాధ్యదేవతవు! నాకు ఈ దినం అతి పవిత్రం!”

(4)

శాంతిశ్రీ కన్నుల నీరు తిరిగిపోయినది, ఆమె ఆనందంతో ఉప్పొంగినది. కన్నులనీటిలో తళతళ మందహాస కాంతులు ప్రసరించినవి. ఇరువురును ఒకరి కన్నుల నొకరుచూస్తూ, ఒకరిచేతులు నొకరు పట్టుకొనిలేచినారు. “ప్రభూ!” అని శాంతిశ్రీ “దేవీ!” అని బ్రహ్మదత్తుడు! ఆ పైన వారికి మాటలు లేవు. అయస్కాంతాకర్షణచేవలే ఒకరికొకరు దగ్గరకు మరియు దగ్గరకు వచ్చినారు. మరునిమేషాన శాంతిశ్రీ బ్రహ్మదత్తుని కౌగిలింతలో గాఢంగ ఇమిడిపోయింది. ఆ పరమసుందరి అతని పెదవులకు పరిమళామృత పూర్ణధరోష్ఠము అందిచ్చినది. అతడు సర్వసృష్టిని మరచి ఆ పెదవి నాఘ్రాణించాడు. ఆ బాలికను సువ్వున ఎత్తుకొనిపోయి, బ్రహ్మదత్తుడు అక్కడనే ఉన్న ఒకపీఠం అధివసించి ఆమెను ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆమె చిబుకము, కపోలాలు, ఫాలము స్పృశించినాడు.

“ఇంతటి ప్రేమ నీలో దాచుకొని, రత్నగర్భలా ఏమీ తెలియని దానిలా ఉంటివేమి దేవీ!”

“మీరు మాత్రం గాఢప్రణయమూర్తులై ఉండిన్నీ, అమృతాన్ని తనలో దాచుకొన్న సముద్రంలా ఎంత గంభీరంగా ఉన్నారు, ప్రభూ!”

“శిష్యురాలు గురువునకు మాటకు మాట ప్రతిచెప్పవచ్చునా?”

“చెప్పకపోతే చదువు చదువనేరనిదాన నవుతానుకదా?”

వారు తమ కౌగిలి విడిపోయి ఒకరిచేయి ఒకరు అందిపుచ్చుకొని తిన్నగా నడిచి మందిరాలు దాటి చక్రవర్తి హార్మ్యాలలోనికి దారిపట్టినారు. దారి పొడుగునా దాసదాసీజనము, కంచుకులు, ద్వారపాలకులు అందరూ ఆనందమయులై నడిచిపోయే యువతీయువకుల్ని చూచి, వంగి నమస్కరిస్తూ ఆనందాశ్చర్యాలక లోనవుతూ “అమ్మయ్యా! ఎంతటి ఆనందం కనుల బడింది!” అని ఒకరి కొకరు సైగలు చేసుకుంటున్నారు.

ఈ యువద్వయం అలా తిన్నగా చక్రవర్తి మందిరాని కరిగిరి. వారిని గాంచి ద్వారపాలకుడు లోనికరిగి, సాష్టాంగముగా నమస్కరించి, లేచి చేతులు కట్టుకోని “మహాప్రభూ! బ్రహ్మదత్తప్రభువు, భర్తృదారికా చేయి చేయి పట్టుకొని మహాప్రభువుల దర్శనార్థము వస్తున్నారు” అని మనవి చేసినాడు.

శాంతమూలుని హృదయం ఒక్కలిప్త గతితప్పింది. చెంత గ్రంథ పఠనం చేస్తున్న పండితుని “ఉండండి స్వామీ” అని నిలిపి, పీఠంనుండి లేచినాడు. ఆయన మోమంతా ఆనందంతో వెలిగిపోగా గంభీరంగా నడుస్తూ ఆ మందిర కవాటం దగ్గరకు వచ్చేసరికి అప్పుడే బ్రహ్మదత్తుడూ శాంతిశ్రీయున్నూ వచ్చినారు.

చక్రవర్తి ఎదురుపడగనే వార్కొక్షణికం చకితులై “జయము జయము మహాప్రభువులకు” అని మోకరిల్లినారు. “దీర్ఘాయుష్మాన్‌భవ! సత్వర వివాహప్రాప్తిరస్తు బహుసంతాన ప్రాప్తిరస్తు!” అని చక్రవర్తి ఆశీర్వదించినారు. ఆ వెంటనే వారిరువురను లేవదీసి చెరియొక ప్రక్క అక్కునచేర్చి, “శాంతీ! ఈనాటికి నాకు నువ్వు ఆనందం సమకూర్చినావు తల్లీ!” అన్నారు. బ్రహ్మదత్తప్రభు! ఈ నాతల్లిని, నీ బ్రహ్మవిద్యలా కాపాడుకో నాయనా!” అని చక్రవర్తి కొమరిత చేయిని బ్రహ్మదత్తుని చేతిలో పెట్టినారు.

ఆ సాంఖ్యాయనస గోత్రజుడు, భరద్వాజుడు ధనకప్రభువు హారీత గోత్రజ మాఠరీపుత్ర శాంతిశ్రీకుమారి చేయి పట్టుకొని పట్టమహిషి అంతఃపురంలోనికి పోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వీరపురుషదత్తుడు పూంగీయ శాంతిశ్రీయు అచ్చటికి చేయిచేయి పట్టుకుని వచ్చినారు. చక్రవర్తి ఆశ్చర్యంతో లోనికిపోయేవారు పోక అట్లే నిలిచిపోయినారు. ధనక ప్రభువు, శాంతిశ్రీయు నిలిచిపోయినారు. వారిరువురూ చక్రవర్తి పాదాలకడ మోకరించినారు. పూంగీయ శాంతశ్రీ “మామయ్యగారూ! మీరు మా వివాహం జరుప నా చిన్నతంలోనే మాట ఇచ్చారు. బావగారికి పట్టమహిషి వచ్చింది. ఇంక మా వివాహానికి అభ్యంతర మేమిటి? నేను బావగారిని విడచియుండలేను అని తలవంచుకొని నిర్భయంగా చెప్పినది. “సౌభాగ్యవతివై వర్థిల్లు తల్లీ! ఈ శాంతికికూడా వివాహం నిశ్చయమైంది. మీరూ మహారాణుల ఆశీర్వాదం పొందండి” అని చెప్పి ఆనందంతో వారి తలలపై చేయినిడి, మోకరించిన ఆ యువతీ యువకులను పైకి లేవదీసినారు.

(5)

నాగార్జునదేవుడు శాంతిమూల సార్వభౌమునికి పట్టాభిషేకం చేసి మరల కొండమీద తన ఆశ్రమానికి వెళ్ళిపోయినారు.

ఆ మహర్షి శాంతిమూలునికీ బ్రహ్మదత్తునికీ ఇక్ష్వాకు రాజకుమారి శాంతిశ్రీకీ, మహాసామంతులకు, సేనాపతులకు, అర్హతులకు, ఆచార్యులకు, దేవదత్తాది ఋషులకూ నూరుమందికి తన యాశ్రమమునకు రావలసిందని ఆహ్వానము లంపెను.

నాగార్జున దేవుడుంచిన ముహూర్తమునకు ఆహ్వానితులందరు కొండ ఎక్కి స్నానాదికాలు చేసి భిక్కులందిచ్చిన శుభ్రవస్త్రాలు ధరించి మహర్షి మందిరంలోనికి పోయి సాష్టాంగ నమస్కృతు లాచరించి, వారి అనుజ్ఞను ఉచితాసనాలపై అధివసించినారు.

“మీకందరికీ నా ఆశీర్వాదాలు. నేను ఈ దేహం చాలిస్తున్నాను. శాంతిమూల చక్రవర్తీ! నేను భూలోకంలో చేయవలసివచ్చిన కార్యాలన్నీ చేశాను. ఇంక సిద్దలోకం వెళ్ళవలసిన శుభమూహూర్తం వచ్చింది. ఈ ఆశ్రమాదులు చైత్యాలు అభివృద్ధిపొంది మళ్ళీ దేశంలో బౌద్ధ సంప్రదాయం విజృంభిస్తుంది. పిమ్మట నెమ్మది నెమ్మదిగా ఆర్షధర్మంలో కలిసి దానికి నూతన జీవంపోస్తుంది. శాంతిమూల ప్రభూ! నీ కొమరితను నేను పెట్టిన ముహూర్తాన అడవి స్కంద విశాఖాయన బ్రహ్మదత్త ధనకప్రభువునకు ఇచ్చి వివాహం చేయండి. ఈ బాలిక బౌద్ధధర్మానికి చేసేసేవ శాశ్వతమౌతుంది. దేవదత్త మహార్షీ! నీ కొమరుని భాష్యగ్రంథాలు లోకానికి ఆర్షధర్మాన్ని తెలియజెప్పే వెలుగులవుతవి. నాకు మీరందరు ఇక అనుజ్ఞ ఇప్పించండి. త్రిరత్నములు మిమ్ము కాపాడుగాక” అంటూ దివ్వగంభీర స్వరాలతో పలికినారు.

అనేకులకు కన్నులనీరు తిరిగినది. అందరు మహర్షికి తుదిమారు మ్రొక్కి సంభ్రమాశ్చర్యములతో ఆ మందిరం వీడి వచ్చినారు.

ఇదివరకే భిక్షులు, అర్హతులు, ఆచార్యులు ఆ దేవునికడ ఆశీర్వాదాలు పొందినారు. భిక్షుకులు నిర్వికారభావంతో ఆ మందిరానికి కవాటాలు బిగించినారు. మందిరం చుట్టూ ధూపములు వెలిగించినారు. వేయి ఆవునేతి దీపాలు వెలిగిపోతున్నవి.

“ఓం మణి పద్మిహం. బుద్ధం శరణం గచ్ఛామి
 సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి

అని భిక్షులు కోటితుమ్మెదల ఝూంకారముతో పాడజొచ్చిరి. కొంతసేపటికి తలుపులు తెరచినారు. ఆ మందిరంలో ఏదో పరమశాంతి పాల సముద్రం వలె ప్రవహించి ఉన్నది. ఒక పరమపవిత్ర కాంతిన్ని నాగార్జునదేవుని పీఠముమీద వెలుగుతున్నది. నాగార్జునదేవులు లేరు. లోనికి వచ్చిన శాంతిమూల చక్రవర్తి మొదలగువారికి భక్తిభావము ముసురుకు వచ్చింది. వారందరా పీఠానికి సాష్టాంగమై నాగార్జునావతారాన్ని హృదయంలో కొలిచినారు.

మూడు దినాలకు నాగార్జునదేవుడు బుద్ధగయలో ప్రత్యక్షమై బౌద్ద దేవాలయంలో మూడు దినాలున్నారన్నారు. ఆ వెనుక మూడుదినాలకు ఆ భగవంతుడు మృగవనంలో, ఆ వెనుక వేణువనంలో, ఆ వెనుక లుంబినీ వనంలో ప్రత్యక్షమై మూడేసి దినాలున్నారట. నాగార్జునదేవుడు పెట్టిన శుభముహూర్తంలో ఇక్ష్వాకు శాంతిశ్రీ రాజకుమారికకు ధనకస్కంద విశాఖా యనక ప్రభువునకూ వివాహం అయినది. ఆ సాయంకాలమే పూంగీయ యనక ప్రభువునకూ వివాహం అయినది. ఆ సాయంకాలమే పూంగీయ శాంతశ్రీ రాకుమారికీ మాఠరీపుత్ర వీరపురుషదత్త యువమహారాజుకూ వివాహమైనది. ఇక్ష్వాకు శాంతిశ్రీ “అడవి శాంతిశ్రీ' అని బిరుదము వహించింది. స్కందవిశాఖ శాంతిశ్రీ దంపతులు ఇరువురు మహాతలవరులు, మహాదండనాయకులు మహాసేనాధికారులు, మహాసామంతులయ్యారు. యువరాజుకు పూంగీయ శాంతిశ్రీ రెండవ యువరాణి అయినది.

తాను చక్రవర్తికాగానే ఇక్ష్వాకు శాంతమూల మహారాజు చూటశాత కర్ణులను, ముసికదేశ శాతవాహనులను ప్రతిష్ఠానపతులను పూర్తిగా లోబరచుకొనినాడు. మహారాజ్యమంతా రాష్ట్రములూ ఆహారములుగా విభజంపబడినది. ఆహారపతులను అమాత్యపతులనేవారు. మహాతారకుడు చక్రవర్తి కడనుండే ముఖ్యోద్యోగి. మహామాత్యుని తరువాతివాడు. అతని వెనుక మహాఅధ్యక్షుడు, మతధర్మాధికారులు, ఆ వెనుక భాండాగారికుడు చక్రవర్తి సర్వసంపదలు చూచేవాడు. హిరణ్యకుడు ధనకోశాధిపతి, బుద్ధభిక్షుక చైత్యవిహార సంఘాధిపతి, మహామంత్రులు, నిబందకారుడు శాసనాలు, భూమి అమ్మకాలు, వర్తకంలో వస్తువుల అమ్మకాలు మొదలయినవి చూచేవాడు. చక్రవర్తి ఆజ్ఞలను ప్రతీహారులు కొనిపోయి ఆయా అధిపతులకు అందిస్తూ ఉండేవారు.

రాజ్యంలో బ్రాహ్మణులు, క్షత్రియబ్రాహ్మణులు అను కులాల వారుండేవారు. రాజ్యాలు పాలించే బ్రాహ్మణులు క్షత్రియ బ్రాహ్మణులు. వారికింకా బ్రాహ్మణత్వం పోలేదు. అలా బ్రాహ్మణత్వం పోగొట్టుకున్న వారు పూర్తిగా క్షత్రియులై పోయేవారు. వీరు, హాలికులని, మూర్ఖకులని, గోపాలురని మూడు కులాలుగా ఉండేవారు. కుమ్మరులు, చాకళ్ళు మొదలయినరు శూద్రులు.

శాంతిమూల చక్రవర్తి పరిపాలన ప్రారంభించడమేమి సర్వదక్షిణాపథ మందూ నిమ్మకు నీరుపోసినట్లు అద్భుతమైన శాంతి అవతరించింది. సర్వధర్మాల వారూ అడ్డంకులులేక ఆనందంతో నిజధర్మమందు మెలగేవారు. శాంతిమూల చక్రవర్తిని ధాన్యకటకంలో సింహాసనం అధివసింపవలసిందని మహాసామంతులందరూ కోరినా శాంతమూలుడు పనికిరాదన్నాడు.

“శాతవాహన వంశం పాలించిన పవిత్రదేశం మనకు దివ్యక్షేత్రం."

“నేనూ నా పుత్రులు వారి సంతానమూ ఎప్పటికీ ఆంధ్రభృత్యులం.

ఇక్కడనుండే సర్వదక్షిణాపథాన్ని పరిపాలింతుముగాక” అని నిండుసభలో సెలవిచ్చినాడు. బ్రహ్మదత్తప్రభువును మహాసేనాపతి మహామాత్య సింహాసనంపై చక్రవర్తి అభిషేకించినారు. పూంగీయ శాంతశ్రీ వివాహం కాగానే శ్రీ వీరపురుషదత్త యువ మహారాజునకు ఇరువురు దేవులతో ప్రతిష్ఠాన నగరంలో యువరాజ పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అవుతూనే వీర పురుషదత్తుడు తన సామంతులతో ఉజ్జయిని వెళ్ళి రుద్రసేనక్షాత్రప రుద్రసింహ మహారాజు కొమరిత రుద్రభట్టారికను వివాహము చేసుకొన్నాడు. ఆ ఉత్సవం పరమాద్భుతంగా జరిగింది.

(6)

అడవి శాంతిశ్రీ బ్రహ్మదత్తుడు పాలీ గ్రంథము చదువుకొను విద్యామందిరానికి తొందరగా వెళ్ళినది. తనదేవేరి మంజీరనిక్వణశ్రుతి చెవుల సోకగానే ధనకప్రభువు పుస్తకము కన్నుల కద్దుకొని పేటికాంతమందుంచి లేచి నిలుచుండి గుమ్మమువంక చిరునవ్వుతో ఎదురు చూస్తున్నాడు. ఇంతలో శాంతిశ్రీదేవి గుమ్మం దగ్గర ప్రత్యక్షమయినది.

“ప్రభూ! ఎప్పుడూ చదువే?”

“నువ్వు నా జీవితంలోకి వచ్చి నా చదువు అంతా ఆపివేశావు దేవీ!” ఆమె కోపం నటించే అతని చెంతజేరి నల్లత్రాచువంటి వేణీబంధము కేలబూని గిరగిర త్రిప్పుతూ జంకించినది.

“శాంతీ! నువ్వు నా యెదుట ఉన్నా, లేకున్నా హృదయానికి శాంతి లేదు.”

“బాధలన్నీ మీరొక్కరే కాబోలు పడేది?”

“రా, ఇలా వచ్చి నా అంకమందు” అక్కర ఉన్నవారు తామే....”

“అలాగా” అంటూనే రెండంగలలో బ్రహ్మదత్తుడు సువ్వున వచ్చి శాంతిశ్రీని ఎత్తుకొని ఆమె మోము మూర్కొనుచు తీసుకొనిపోయి పీఠంపై కూర్చుండి ఆమెను ఒడిలో ఇమిడించుకొన్నాడు.

“ఇంతటి సౌందర్యం అంతా నువ్వే ప్రోగుచేసుకొంటే లోకంలో స్త్రీలంతా బెంగపెట్టుకోరూ?”

“మీ సౌందర్యంముందు నేను....”

“వింధ్యపర్వతంముందు హిమాలయం అనికాదూ?”

“మాటలు నేర్చిన మగవాళ్ళతో ఎవరు ప్రత్యుత్తరాలు ఇవ్వగలరూ?”

“మాటలు నేర్వని బాలికకు ప్రత్యుత్తరం ఇవ్వడం ఓడిపోవడమే!”

“పోనీలెండి. నేను కళ్ళుమూసుకుంటాను, నాకు ఎంతోకోపం వస్తోంది!”

“ఇదేమిటి లోకం అంతా చీకటైపోయింది. నా హృదయం ముడుచుకు పోయింది.”

“మీరు మరీని!”

“ప్రాణేశ్వరీ! నువ్వు నాకు మరీ మరీ!”

“నాకు ఈ అడవి ఇంటి పేరు ఎంతో గంభీరమై, ఆనందపూర్ణమై ఉన్నదండీ!”

“అడవి ఇంటి పేరు విని మాచెల్లెళ్ళు నవ్వలేదూ?”

“నవ్వలేదుగాని, నవ్వు ఆపుకొని పైకి తేలనీయక మా వదిన శాంతశ్రీ ఏమన్నదో ఎరుగుదురా?”

“చెప్పు ఆత్మేశ్వరీ!”

“కొంచెం వంగండీ. చెవిలో చెప్పుతాను.”

“ఇక్కడ ఎవరున్నారు, రహస్యం వినడానికి?”

“మీ పెదవులు వింటాయి. అవి నాకు ఊపిరాడనీయవు”

“ఇందులో నీ అభ్యంతర మేమిటి? పెదవులకు పెదవులకు చుట్టరికం.

నా కన్నులు నీ అందాన్ని జుఱ్ఱుకొంటవి. నా ముక్కు నీ దివ్యసౌరభాన్ని త్రాగుతుంది. నా చేతులు నీ దేహాన్ని వదలవు. నా హృదయం నీ హదృయాన్ని వదలదు. నా ఆత్మ నిన్ను పూజిస్తుంది.”

“ఇంక నాకు మిగిలింది ఏమిటి?”

“ఆసి దొంగ” అని ఆమెను బిగియార కౌగిలించుకొన్నాడు.


★ ★ ★