అక్కన్న మాదన్నల చరిత్ర/అవతారిక

వికీసోర్స్ నుండి

అవతారిక

ఈ యాంధ్రమంత్రులంగూర్చి ఎవరును విపులముగా వ్రాయలేదు. అందులకై ప్రారంభింపఁగా నాకు వీరిచరిత్ర ఒక యాకరమున దొరకలేదు. సర్కారు పండితుఁడు రచించిన యౌరంగజేబు చరిత్రమున అచ్చటచ్చట కొంతగలదు. అతఁడు సయితము ప్రాచీన దాక్షిణాత్యచరిత్రకారుల గ్రంథములను పరిశీలించినట్లు లేదు. ఈభావమునే వెల్లడించుచు, తానాషా, అక్కన్న మాదన్నలలో ఎట్టిదోషమును లేదనియు ఔరంగజేబు సామ్రాజ్యకాంక్షచే వారిపై అసత్యము నారోపించెననియు ప్రొఫెసర్ అబ్దుల్‌మజీద్‌సిద్దికిగారు ఒక వ్యాసమును ఆంగ్లమున రచించియున్నారు. [హైదరాబాద్ ఎకాడెమీ జర్నల్] భారతేతిహాస పరిశోధకమండలి, పూనా, వారు ప్రకటించిన ‘గోల్కొండ్యాచీ కుతుబ్‌శాహీ’ గ్రంథమున, మెకంజీదొర వారి స్థానికచరిత్రలనుండి కొంతయు, ‘హదికత్-ఉల్-అలామ్’ అనుగ్రంథమునుండి కొన్ని ప్రకరణములును కలవు. మదరాసు విశ్వవిద్యాలయ సంస్కృతాచార్యులు శ్రీ డాక్టరు రాఘవౝ గారు, డాక్టరు సి. కున్‌హౝరాజాగారికి మిత్రులు సమర్పించిన సంపుటములో తానాషా గురువు బడే అక్బర్ షా శృంగారమంజరినిగుఱించి యొకవ్యాసము వ్రాయుచు తానాషానుగుఱించి వ్రాసియున్నారు. ఇటీవల శృంగారమంజరినే ప్రకటించినారు.

డచ్చిరచయిత హవార్టు వీరింగూర్చి వ్రాసియున్నాఁడు. వీరు మొదట 1666 లో సయ్యద్ ముస్తఫా (తర్వాతి మీర్

అక్కన్న పంతులు గారు

 
జుమ్లా) అనువానికడ గుమాస్తాలుగా 10 గిల్డర్సు జీతమున ప్రవేశించిరి. వీరిలో మాదన్న ఉపాయశాలి, అక్కన్న కొంతతొందర పడువాఁడు. వీరివలననే మీర్‌జుమ్లా గోలకొండను వదలెను. తర్వాత మాదన్న ‘సూర్యప్రకాశరావు’ బిరుదముతో సర్వాధికారమును వహించియుండగా సుల్తాను అంతటిని ఆతనిపై

మాదన్న పంతులు గారు

 

వదలి తానుమాత్రము 75000 డాలరులు గ్రహించి ఆనందించుచుండెనఁట. మాదన్న పర్షియను హిందూస్థానీలలో పండితుడట. ఆతని బంగారుపల్లకీ పోవుచుండఁగా వీథులలో నెల్లవారును లేచి నిలిచి గౌరవించుచుండిరఁట. డచ్చివారిని చాలమర్యాదగా మాదన్న చూచి హవార్టుకు దర్శనము సైత మొసంగెనఁట.

మంత్రుల దుర్మరణము

ఇట్లు ఎంతేనియు సామగ్రికలదు. చర్చించి వ్రాయుటకు చాలకాలము పట్టును గాన ప్రస్తుతము దొరకిన విషయములనే సామాన్య పాఠకలోకముకొఱకు నవలవలె ఈ వచనగ్రంథమును 1949 లో రచించితిని. ఇందు కొంత సంగ్రహించితిని.

15 - 5 - 1962. వేదము వేంకటరాయశాస్త్రి.