Jump to content

అంటువ్యాధులు/అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అయిదవ ప్రకరణము

అంతర్గతకాలము

పైనిచెప్పబడిన వివిధజాతుల సూక్ష్మజీవులు మనశరీరములో ప్రవేశించినవెంటనే వ్యాధి బయలుపడదని యిదివరలో సూచించియున్నాము. మనశరీరములో ప్రవేశించిన సూక్ష్మ జీవుల సంఖ్యమొదట మిక్కిలి తక్కువగనుండి అవి గంట గంటకు మనశరీరములో పెరిగి వందలువందలుగ పిల్లలనుపెట్టి తుదకు కొన్నిదినములలోనే లక్షలకొలది, కోట్లకొలది యగును. మనశరీరములో సూక్ష్మజీవులు ప్రవేశించినది మొదలు అంటువ్యాధియొక్క మొదటి చిహ్నము అగు జ్వరము, తల నొప్పి మొదలగునవి యెవ్వియైనను కనబడువరకు పట్టుకాలమునకు అంతర్గతకాలము (Incubation period) అని పేరు. దీనినే కొందరు ఉద్భూతకాలమనుచున్నారు. ఈ యంతర్గత కాలము కొన్నివ్యాధులలో మిక్కిలి తక్కువగ నుండును. మఱికొన్ని వ్యాధులలో పది లేక పదునైదు దినములుపట్టును. ఇది ఆ యాజాతి సూక్ష్మజీవులు పెరుగు పద్ధతినిబట్టియు, రోగి యొక్కబలాబలముబట్టియు, మారుచుండును. అంతర్గతకాలములో రోగికి ఫలాని వ్యాధిసోకినదని యెంతమాత్రము తెలియదని చెప్పపచ్చును. ఒక్కొక్కవ్యాధియొక్క అంతర్గతకాలము తెలిసికొనుటలో అనేక సందిగ్ధాంశములు గలవు.

౧. ఏ దినమున సూక్ష్మజీవులు శరీరములో ప్రవేశించినవో చెప్పుట కన్నిసమయములందును వీలుండదు. ఒకానొక ప్పుడు రోగియుండు స్థలమునకు చుట్టుప్రక్కల నెక్కడను ఆ వ్యాధి సోకినవారలు మనకు తెలియకపోవచ్చును. మిక్కిలి ముమ్మరముగ వ్యాధి వ్యాపించియున్న ప్రదేశములలో నే చోట నుండి రోగి తనవ్యాధిని అంటించుకొనెనో మనకు తెలియకపోవుటచేత రోగముసోకిన కాలము సరిగా మనము నిర్ణయింప లేక పోవచ్చు.

౨. రోగి, తనబట్టలమీదగాని, శరీరముమీదగాని, వ్యాధిని గలిగించు సూక్ష్మజీవులను మోసికొనిపోవుచున్నను, కొన్నిదినములైన తరువాతగాని అవి తమవాహకుని సోకక పోవచ్చును. అందుచే అంతర్గతకాలము హెచ్చుగనున్నట్లు మనకు లెక్కకువచ్చును.

3. క్షయ, కుష్ఠరోగము మొదలగు కొన్ని వ్యాధులు కొద్దికొద్దిగా శరీరము నంటినను అవి రోగికి తెలియకుండ చిరకాలమువరకు శరీరములో దాగియుండవచ్చును.

౪. ఇద్దరు ముగ్గురు రోగులు ఒకయింటిలో నొకవ్యాధి యొక్క వివిధావస్థలలో నున్నప్పుడు వారిలో నొకరినుండి యితరులకు వ్యాధి సోకినయెడల ఎవరినుండి క్రొత్తవారికి వ్యాధి సోకినదో తెలియక పోవుటచేత క్రొత్తరోగియొక్క అంతర్గతకాలము కనుగొనుట కష్టము.

౫. ఇది గాక, అంతర్గతకాలము రోగియొక్క శరీరబలమును బట్టియు, రోగి శరీరములో ప్రవేశించిన సూక్ష్మజీవుల బలమును బట్టియు, సంఖ్యనుబట్టియు, మారుచుండునని చెప్పి యుంటిమి. సూక్ష్మ జీవులు మిక్కిలి తక్కువగ ప్రవేశించిన యెడల వ్యాధి పెంపు తక్కువగనుండును. అప్పుడు అంతర్గత కాలము ఎక్కువ కావచ్చును. ఒక్కొకప్పుడు రోగిబలమయిన వాడైనయెడల వ్యాధి బయటపడక పోవచ్చును. సూక్ష్మ జీవులమోతాదు హెచ్చినకొలదిని రోగి బలహీనుడైనకొలదిని రోగము మిక్కిలి తీవ్రముగను, శీఘ్రముగను పరిణమింప వచ్చును. అప్పుడు అంతర్గతకాలము తగ్గిపోవును. సూక్ష్మ జీవులు కొంతవరకు శరీరములోనున్నను, వ్యాధి పైకి తెలియక పోవచ్చు ననుటకొక నిదర్శనము చెప్పెదము. రమారమి లక్ష నెత్తురు కణములకొక్క చలిజ్వరపు పురుగుచొప్పున మన శరీరములోనున్నప్పుడే జ్వరముపైకి కనబడును. కాని లక్ష కొక్కటికంటె చలిజ్వరపు పురుగులు తక్కువగ నున్నయెడల జ్వరము బయటకురాదు. సాధారణముగా మన దేశమున వ్యాపించియుండు అంటువ్యాధులయొక్క అంతర్గత కాలమును, వ్యాధియొక్క సూచనలుకొన్ని బయట పడిన తరువాత నది ఫలానా వ్యాధియని నిశ్చయముగ తెలిసికొనుట కెన్నటికి సాధ్యమగునో ఆదినముయొక్క సంఖ్యయు, వ్యాధియొక్క ప్రారంభించు దినసంఖ్యయు వ్యాధి పీడితుడగు రోగితో నెన్ని దినములవర కితరులు సంపర్కముకలిగి యుండకూడదో ఆ దినముల సంఖ్యయు, వ్యాధి కుదిరిన పిమ్మట రోగిని స్వేచ్ఛగ నితరులతో నెప్పుడు కలిసి మెలసి తిరుగనియ్య వచ్చునో ఆ దినములసంఖ్యయు తెలియజేయుపట్టీ నొక దాని నీ క్రింద జేర్చి యున్నాము.

వ్యాధి పేరు అంతర్గత కాలము వ్యాధి నిర్ధారణయగు దినము వ్యాధి దిగుటకు ప్రారంభించు దినము రోగిని బహిష్కరింపవలసిన దినముల సంఖ్య రోగిని స్వీకరించుటకు తగిన నిదర్శనములు
1 2 3 4 5 6
1 మశూచికము (Small Pox) లేక పెద్దమ్మవారు 10 మొదలు 15 రోజులు జ్వరము వచ్చిన తరువాత మూడవరోజున పొక్కు ప్రారంభించును 9 లేక 10-వ రోజున పొక్కు లన్నియు ఊడి పోవువరకు అనగా 2 మొదలు 4 వారములు పొక్కు లన్నియు మాడి పోయినతరువాత ఒక వారము
2 ఆటలమ్మ లేక పైరమ్మవారు (Chicken Pox) 10 మొదలు 12 రోజులు జ్వరము వచ్చిన మొదటి రోజుననే పొక్కు ఏర్పడును 4 లేక 5-వ రోజున 1 లేక2 వారములు పొక్కు లన్నియు మాడి పోయినతరువాత ఒక వారము
3 పొంగు లేక తట్టమ్మవారు (Measles) 10 మొదలు 12 రోజులు జలుబు చేసినది మొదలు నాల్గవ రోజు 7-వ దినము సాధారణము గా 2 వారములు శరీరము నుండి పొప్పర ఊడిపోయి దగ్గు పోవలెను
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
4 సన్నిపాత జ్వరము (Typhoid) 7 మొదలు 21 రోజువరకు సగటున పదునాల్గు దినములు 8 మొదలు 13 దినములు 17 మొదలు 22 వరకు జ్వరము విడిచిన తరువాత 42 దినములవరకు ఏవిధమయిన వ్యాధియు లేకుండుట
5 డింగి జ్వరము లేక మడకలమ్మ (Dengue fever) 2 మొదలు 6 రోజులు 1, 4 దినములు 3 లేక 4 దినములు 10 లేక 14 దినములు ఆరోగ్యముగా నుండవలెను
6 గవదలు లేక పుట్టలమ్మ (Mumps) 10 మొదలు 25 రోజులవరకు 2 లేక 3 దినములు 7, 10 దినములు 4 వారములు వాపు అంతయు పోయిన తరువాత వారము దినములు
7 కోరింత దగ్గు లేక కక్కువాయి దగ్గు (Whooping Cough) 7 మొదలు 14 రోజులు ఒకానొకప్పుడు కోరింతదగ్గు నిశ్చయముగా తెలియుటకు 3 వారములు పట్టును 21 దినము మొదలు 42 దినములు వ్యాధి ప్రారంభమయినది మొదలు 6 వారములు దగ్గు పూర్తిగా పోవలెను.
పైన చెప్పినవిగాక మరికొన్ని అంటువ్యాధుల యొక్క అంతర్గతకాలమును రోగిని బహిష్కరింపవలసిన దినముల సంఖ్యను నీ క్రింద వ్రాసియున్నాము.
వ్యాధి పేరు అంతర్గతకాలము రోగిని బహిష్కరింపవలసిన కాలము
1 కలరా 1 మొదలు 4 దినములు లోపల పది దినముల వరకు
2 చలిజ్వరము 1 లేక 2 వారములు. అంతకు పైన కూడ నుండవచ్చును జ్వరము బొత్తిగ రాకుండు వరకు
3 సెగ (Gonorrhoea) 2 లేక 3 రోజులు చీము తగ్గిన తరువాత 6 వారములు.
4 ఇన్‌ఫ్లూయెన్‌జా (Influenza) 1 లేక 3 రోజులు 14 దినముల వరకు.
5 ప్లేగు 1 మొదలు 7 రోజులు 21 దినముల వరకు.
6 కల్లవాపు (Glanders) 3 మొదలు 18 రోజుల వరకు పశువ్యాధి. 14 దినముల వరకు
7 దొమ్మ (Anthrax) 2 మొదలు 3 రోజులు పశువ్యాధి. డిటో.
8 సర్పి లేక దద్దుర (Erysipelas) 1 మొదలు 2 రోజులు 7 దినముల వరకు
9 ధనుర్వాయువు (Tetanus) 2 దినములు మొదలు 24 దినముల లోపల ... ...
10 సూతిక జ్వరము (Peurperal fever) 1 మొదలు 5 రోజులు ... ...
11 కొరుకు (Syphilis) 40 రోజులు అంతకన్న ఎక్కువ రెండు సంవత్సరములు
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
12 కుక్క కాటు బహుశ కొన్ని వారములు లేక నెలలు. వ్యాధి కుదురువరకు
13 క్షయ నిశ్చయముగా తెలియదు వ్యాధి కుదురువరకు లేక యావజ్జీవము.
14 కఫ జ్వరము (Pneumonia) డిటో కఫము వచ్చుచున్నంత కాలము.
15 సంధియెత్తి మెడ నడుము కొయ్యబారిపోవు ఒక విధమైన జ్వరము (Cerebro-spinal fever) 7 మొదలు 14 దినములు.
16 తామర (Ring-worm) 8 దినముల లోపల. పూర్తిగ పోయిన తరువాత 28 దినముల వరకు.
17 గజ్జి (Itch) 8 దినములు 6 వారములు
18 తిమ్మిరివాయువు (సంజు-Beri-beri) నాలుగు వారములు
19 డిప్తిరియా (Diphtheria) గొంతుకలో పుండుపుట్టి చంపువ్యాధి 1 మొదలు 4 దినములు వ్యాధి కుదిరిన తరువాత 3 వారములు.
20 బూదకాలు (Elephantiasis) నిశ్చయముగా తెలియదు. యావజ్జీవము జ్వరము వచ్చు దినములు.

పై పట్టీలయందలి గజ్జిని బూదకాలును వ్యాపింపజేయు పురుగులు సూక్ష్మజీవులు కావు. పరాన్నభుక్కులు (Parasites) అను మరియొక తెగలోనివి. 22, 23, 24-వ పటములను జూడుము.