సుమతీ శతకము

Wikisource నుండి

సుమతీ శతకము
బద్దెన


[మార్చు] 001

శ్రీ రాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ


భావం: మంచి బుధ్ధిగలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను ఔరా అనునట్లుగా నోటినుండి నీళ్ళూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును భోధించు నీతులను చెప్పెదన్.

[మార్చు] 002

అక్కరకు రాని చుట్టము,

మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా

నెక్కిన బారని గుర్రము

గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ


భావం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును.

[మార్చు] 003

అడిగిన జీతంబియ్యని

మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ


భావం: అడిగినప్పుడు జీతము ఈయని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, నాగలికి వేగముగా పోగల యెద్దులను కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది.

[మార్చు] 004

అడియాస కొలువు గొలువకు,

గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌

విడువక కూరిమి సేయకు,

మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ


భావం: వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము.

[మార్చు] 005

అధరము గదలియు, గదలక

మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ

అధికార రోగ పూరిత

బధిరాంధక శవము జూడ బాపము సుమతీ


భావం: పెదవి కదలీకదలకుండ తీయనైన మాటలు మాని, మాటలాడనను నియమము పూని, అధికార వ్యాధిచేనిండిన చెవిటి గ్రుడ్డి పీనుగును చూచుట పాపము.

[మార్చు] 006

అప్పు కొని చేయు విభవము,

ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్‌,

దప్పరయని నృపు రాజ్యము

దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ


భావం: ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచు భార్య, తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును.

[మార్చు] 007

అప్పిచ్చువాడు, వైద్యుడు

నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌

జొప్పడిన యూర నుండుము

చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ


భావం: ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండా ప్రవహించు నదియును, బ్రాహ్మణుడుగల గ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు నివసింపకుము.

[మార్చు] 008

అల్లుని మంచితనంబు,

గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్‌,

బొల్లున దంచిన బియ్యము,

దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ


భావం: అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదానియందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులును లోకములో నుండవు.

[మార్చు] 009

ఆకొన్న కూడె యమృతము,

తాకొంచక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్‌,

సోకోర్చువాడె మనుజుడు,

తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ


భావం: లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా నిచ్చువాడే దాత. ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశ శ్రేష్టుడు.

[మార్చు] 010

ఆకలి యుడుగని కడుపును,

వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్‌,

బ్రాకొన్న నూతి యుదకము,

మేకల పాడియును రోత మేదిని సుమతీ


భావం: భూమియందు ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారమును విడువని బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్ళును, మేకల పాడియు రోత పుట్టించును.

[మార్చు] 011

ఇచ్చునదే విద్య, రణమున

జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌

మెచ్చునదే నేర్చు, వదుకు

వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ


భావం: భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని.

[మార్చు] 012

ఇమ్ముగ జదువని నోరును,

నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌,

దమ్ముల బిలువని నోరును

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ


భావం: ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువని నోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా.

[మార్చు] 013

ఉడుముండదె నూరేండ్లును,

బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌,

మడువున గొక్కెర యుండదె,

కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ


భావం: ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి. వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితో కూడినది కావలెను.

[మార్చు] 014

ఉత్తమగుణములు నీచున

కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా

నెత్తిచ్చి కరగి పోసిన

నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ?


భావం: బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.


[మార్చు] 015

ఉదకము ద్రావెడు హయమును,

మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌,

మొదవు కడ నున్న వృషభము,

జదువని యానీచు గడకు జనకుర సుమతీ


భావం: నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును, విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము.


[మార్చు] 016

ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ వివరింపంగా;

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ


భావం: మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు.

[మార్చు] 017

ఉపమింప మొదలు తియ్యన

కపటం బెడనెడను జెఱకు కై వడినే పో

నెపములు వెదకును గడపట

గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ


భావం: చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్నను చివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా.


[మార్చు] 018

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌

నొప్పించక, తా నొవ్వక,

తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ


భావం: ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు.

[మార్చు] 019

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్‌

సర్పంబు పడగ నీడను

గప్ప వసించిన విధంబు గదరా సుమతీ


భావం: నల్లత్రాచుయొక్క పడగనీడను వసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములను వెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.


[మార్చు] 020

ఎప్పుడు సంపద కలిగిన

నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌

తెప్పలుగ జెఱువు నిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ


భావం: చెరువునిండా నీరుచేరగనే వేలకొలది కప్పలందులోనికి ఏ విధముగా చేరుకొనునో, సంపద కలిగిన బంధువులెక్కువగా జేరుకొందురు.

[మార్చు] 021

ఏఱకుమీ కసుగాయలు,

దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,

పాఱకుమీ రణమందున,

మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ


భావం: ఈ భూమి పైన పచ్చికాయలు ఏరి తినకుము, చుట్టములను ధూషింపకుము, యుధ్ధమునుండి వెనుదిరిగి పారిపోకుము, పెద్దల మాటను జవదాటకుము తప్పు సుమా.


[మార్చు] 022

ఒక యూరికి నొక కరణము,

నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్‌,

గకవికలు గాక యుండునె

సకలంబును గొట్టువడక సహజము సుమతీ


భావం: ఒక గ్రామమునకు ఒక లేఖరి, ఒక ధర్మాధికారి యుండవలెను. అట్లు కాక పైన చెప్పబడినవారు పెక్కుమందియైనచో అనేకమైన గంధరగోళములు పుట్టి సమస్తమును చెడిపోవుట సహజము.

[మార్చు] 023

ఒరు నాత్మ దలచు సతి విడు,

మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ,

వెఱ పెఱుగని భటునేలకు,

తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ


[మార్చు] 024

ఒల్లని సతి నొల్లని పతి,

నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే

గొల్లండు, కాక ధరలో

గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ


భావం: తన్ను ప్రేమించని భార్యను, యజమానుని, స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరింపనివాడే వెర్రిగొల్లవాడు. కాని జాతిచేత గొల్లవాదైనంత మాత్రమున గుణములయందు వెర్రి గొల్లవాడు కాదు.


[మార్చు] 025

ఓడల బండ్లును వచ్చును,

ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్‌,

ఓడలు బండ్లును వలనే

వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ


భావం: నావలమీద బండ్లును, బండ్లమీద నావలును వచ్చునట్లుగనే భాగ్యవంతులకు దారిద్ర్యము, దరిద్రులకు భాగ్యమును పర్యాయముగా కలుగుచుండును.


[మార్చు] 026

కడు బలవంతుడైనను

బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్‌

దడవుండ నిచ్చెనేనియు

బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ


భావం: ఎంత సమర్ధత కలవాడైనను యవ్వనమందున్న భార్యను చిరకాలము పుట్టినయింట నుండనిచ్చినచో తానే స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.


[మార్చు] 027

కనకపు సింహాసనమున

శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ


భావం: కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో, ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవము చేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు.


[మార్చు] 028

కప్పకు నొరగాలైనను,

సర్పమునకు రోగమైన, సతి తులువైనన్‌,

ముప్పున దరిద్రుడైనను,

తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ


భావం: కప్పకు కాలు విఱిగినను, పాముకు రోగము కలిగినను, భార్య దుష్టురాలైనను, ముసలితనములో దారిద్ర్యము సంభవించినను, ఎక్కువ దుఖప్రదమగును తప్పదు.


[మార్చు] 029

కమలములు నీట బాసిన

కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌

తమ తమ నెలవులు దప్పిన

తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ


భావం: కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ నివాసములను విడిచి పెట్టినచో తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు.


[మార్చు] 030

కరణము గరణము నమ్మిన

మరణాంతక మౌను గాని మనలేడు సుమీ;

కరణము దన సరి కరణము

మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ


భావం: ఒక లేఖకుడు మఱియొక లేఖకుని నమ్మిన మరణముతో సమానమైన ఆపదను చెందును కావున లేఖకుడైనవాడు తనతో సమానుడైన మఱియొక లేఖరిని విశ్వసింపక తన గుట్టు ఈయక జీవింపవలయును.


[మార్చు] 031

కరణముల ననుసరింపక

విరసంబున దిన్న తిండి వికటించు జుమీ

యిరుసున కందెన బెట్టక

పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ


భావం: బండి యిరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండియైనను త్వరితంగా పరుగెత్తదు. అదే విధముగా లేఖకుడు చెప్పినట్లు విని అతని వెంబడింపక విరోధముతో మెలగినవారు సుఖముగా మన జాలరు.

[మార్చు] 032

కరణము సాదైయున్నను,

గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్‌,

ధర దేలు మీటకున్నను,

గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ


భావం: భూమియందు కరణము నెమ్మదివాడైనను, ఏనుగు మదము పోయినదైననూ, త్రాచు కఱవకున్నను, తేలు కుట్టకున్నను ఆశ్చర్యముతో మిక్కిలి తేలికగా చూతురు.


[మార్చు] 033

కసుగాయ గఱచి చూచిన

మసలక పస యొగరు రాక మధురంబగునా;

పస గలుగు యువతులుండగ

పసి బాలల బొందువాడు పశువుర సుమతీ


భావం: పక్వమునకు వచ్చిన పండ్లను వదలి పచ్చికాయలను కొఱికిన తీయదనము లేక ఒగరుగా దోచును. ఆ విధముగనే చాతుర్యము గల పడుచులుండంగా పసిపాపలను కూడెడువానికి సుఖము శూన్యము అట్టివాడు నిజముగా పశువే.

[మార్చు] 034

కవి కాని వాని వ్రాతయు,

నవరస భావములు లేని నాతుల వలపున్‌,

దవిలి చను పంది నేయని

వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ


భావం: కవికానట్టివాడు వ్రాసిన రచనయును, తొమ్మిది రసముల యొక్క స్థితులు తెలియని స్త్రీలయొక్క ప్రేమయును, ముందు పోయెడి పందిని వెంబడించి కొట్టలేనివాని యొక్క ఆయుధవిద్యయందలి నేర్పరితనము వ్యర్ధము.


[మార్చు] 035

కాదు సుమీ దుస్సంగతి,

పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్‌,

వాదు సుమీ యప్పిచ్చుట,

లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ


భావం: చెడ్డవారితోడ స్నేహము మంచిదికాదు. కీర్తి వచ్చిన పిదప నశించదు. అప్పొసంగుట తగవులకు మూలము. స్త్రీలకడ ప్రేమ శూన్యము.


[మార్చు] 036

కాముకుడు దనిసి విడిచిన

కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్‌

బ్రేమమున జెఱకు పిప్పికి

చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ


భావం: ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడచిన కాంతను మఱియొక జాఱుడు అనుభవింపగోరుట చెఱకునందలి రసమును సంపూర్ణముగా తీసివేసిన తరువాత ఆ పిప్పికై చీమలు ముసుకొన్నట్లుండును.


[మార్చు] 037

కారణము లేని నగవును,

బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో

బూరణము లేని బూరెయు,

వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ


భావం: కారణములేని నవ్వును, పేరణము(రవిక) లేని స్త్రీయును, పూరణములేని బూరెయును, వీరణములేని పెండ్లియును వ్యర్ధములు.


[మార్చు] 038

కులకాంత తోడ నెప్పుడు

గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,

కలకంఠి కంట కన్నీ

రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ


భావం: భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు.


[మార్చు] 039

కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోచు చుండు నిక్కము సుమతీ


భావం: పరస్పరము స్నేహమున్న రోజులలో నేరములెప్పుడును కనుపించబోవు. ఆ స్నేహము చెడగానే అన్నియును తప్పులుగా కనపడుచుండును. ఇది నిజము.


[మార్చు] 040

కొంచెపు నరు సంగతిచే

నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌

గించిత్తు నల్లి కుట్టిన

మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ


భావం: చిన్న నల్లి కుట్టిన ఆ నల్లి యున్న మంచమును ఎండలో వేయుట కర్రతో కొట్టుట, మరుగునీళ్ళు పోయుట మొదలగు ఆపదలు కలుగును. ఆ విచముగనే అల్పుడైనవానితోడి స్నేహము ఎట్టివారికైనను ఆపదను తెచ్చిపెట్టును.


[మార్చు] 041

కొక్కోకమెల్ల జదివిన,

చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్‌,

మిక్కిలి రొక్కము లియ్యక,

చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ


భావం: వెలయాలు పుష్కలముగా ధనమీయకున్న ఎంతగా రతిశాస్త్రమును చదివినవాడైనను, అందగాడైనను, గొప్ప రాజశ్రేష్టుడైనను, ప్రేమించి దగ్గరకు చేరదు.


[మార్చు] 042

కొఱ గాని కొడుకు బుట్టిన

కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్‌

చెఱకు తుద వెన్ను బుట్టిన

జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ


భావం: చెఱకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెఱకునందలి తీయదనము నంతయు నేవిధముగ పాడుచేయునో ఆ విధముగనే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకుపయోగకారి కాకపోవుట యటుండగా తండ్రి మంచిగుణమును కూడా పాడుచేయును.


[మార్చు] 043

కోమలి విశ్వాసంబును,

బాములతో జెలిమి, యన్య భామల వలపున్‌,

వేముల తియ్యదనంబును,

భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ


భావం: స్త్రీలయందు విశ్వాసమును, పాములయందు స్నేహమును, పరస్త్రీలయందు ప్రేమయును, వేపచెట్లయందు తీయదనమును, రాజులయందు విశ్వాసము వట్టి అసత్యములు.


[మార్చు] 044

గడన గల మగని జూచిన

నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;

గడ నుడుగు మగని జూచిన

నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ


భావం: స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు.

[మార్చు] 045

చింతింపకు కడచిన పని,

కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,

నంతఃపుర కాంతలతో

మంతనముల మాను మిదియె మతముర సుమతీ


భావం: జరిగిపోయిన దానిని గురించి ఆలోచించుటయు, స్త్రీలు తన్ను ప్రేమింతురని విశ్వసించుటయును, రాణీవాసపు స్త్రీలతో రహస్యములను విడిచిపెట్టుము. ఇదియే అనుసరించవలసిన మంచితనము.


[మార్చు] 046

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైనయట్లు పామరుడు దగన్‌

హేమంబు గూడ బెట్టిన

భూమీశుల పాల జేరు భువిలో సుమతీ


భావం: చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును.


[మార్చు] 047

చుట్టములు గాని వారలు

చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్‌

నెట్టుకొని యాశ్రయింతురు

గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ

[మార్చు] 048

చేతులకు దొడవు దానము,

భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,

నీతియె తొడవెవ్వారికి,

నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ


భావం: చేతులకు దానమును, పాలకులకు అసత్యమును పలుకకుండుటయును, అందరికినీ న్యాయమును, స్త్రీకి అభిమానమును అలంకారములు.

[మార్చు] 049

తడ వోర్వక, యొడ లోర్వక,

కడు వేగం బడిచి పడిన గార్యం బగునే;

తడ వోర్చిన, నొడ లోర్చిన,

జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ


భావం: ఆలస్యమునకు, శరీర శ్రమకును సహింపక తొందరపడిన నేకార్యమును కానేరదు. ఆలస్యమునకును శరీర శ్రమకును ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యమంతయు నెఱవేరుచుండును.


[మార్చు] 050

తన కోపమె తన శత్రువు,

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము,

తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ


భావం: తన కోపమే తనను శత్రువులువలె బాధించును. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.

సుమతీ శతకము
తెలియదు



శతకములు ఫైలు:Satakamu.png
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | శతకము
పేజీ లింకులు