వికీపీడియా స్వయంశిక్షణ

వికీసోర్స్ నుండి

Center

ఏ గ్రహం పైనైతే ప్రతి మనిషికీ మానవ విజ్ఞాన సర్వస్వం పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందో అటువంటి ప్రపంచాన్ని ఊహించండి. -- జిమ్మీ వేల్స్


వికీపీడియా కు స్వాగతం

వికీపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద విజ్ఞాన సర్వస్వం. ప్రపంచం మొత్తం మీద దాదాపు లక్ష మంది ద్వారా ఈ విజ్ఞాన సర్వస్వం తయారుచేయటం, నిర్వహించటం జరుగుతుంది. ప్రతి నెలా వికీపీడియాను 45 కోట్ల మంది కొత్తగా సందర్శిస్తున్నారు. 280 పైగా భాషలలో 2.3 కోట్ల వ్యాసాలతో వికీపీడియా అలరారుతున్నది. దీనిని ఉచితంగా వాడుకోవచ్చు, స్వేచ్ఛగా మార్చవచ్చు. దీనికి వాణిజ్య ప్రకటనల బెడద లేదు.(ఆగష్టు 2012 వివరాలతో)

వికిపీడియా స్వయంశిక్షణ చదవటం ద్వారా మీరు:

  • వికీపీడియా పనిచేయు విధానాన్ని తెలుసుకుంటారు
  • వికీపీడియాలో మీ ఖాతాను తెరవగలుగుతారు
  • వికిపీడియా ఇంటర్ఫేస్ ను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు
  • వికీపీడియాకు ఎన్ని విధాలుగా తోడ్పడవచ్చో తెలుసుకుంటారు
  • "నా చర్చా" పేజీ ద్వారా ఇతర వాడుకర్లతో సంభాషించగలుగుతారు
  • వికీపీడియాలో ఒక వ్యాసం పరిణామ క్రమాన్ని తెలుసుకోగలుగుతారు
  • నాణ్యమయిన వ్యాసం గుణవిశేషాలను గుర్తించగలుగుతారు
  • ఒక కొత్త వ్యాసాన్ని రాయగలుగుతారు.

"నమస్కారం నా పేరు అనుపమ! నేను ఎప్పుడైనా ఒక విషయాన్ని వివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే వికీపీడియాను వాడతాను. కానీ చాలా రోజులుగా నేననుకుంటున్నదేంటంటే - ఈ వ్యాసాలన్ని ఎవరు రాస్తారు? ఎందుకని ఈ వ్యాసాలు తరచూ మార్పిడి చెందుతుంటాయి? వికిపీడియాను ఎవ్వరైనా సవరించవచ్చని నేను చదివాను. నేనూ అలా సవరించవచ్చా? అది ఎలా?"

వికీపీడియా ఎలా పని చేస్తుంది?

వికీపీడియాలో వున్న ప్రతి విషయం ప్రపంచ వ్యాప్తంగా వున్న మీలాంటి వారు వ్రాస్తున్నదే. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఇలాంటి వికీపీడియన్లు విషయాలను, వ్యాసాలను, బొమ్మలు మొదలగు విజ్ఞాన విషయాలను చేర్చక పోతే ఈ వికీపీడియా అంతర్జాలంలో ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన భాండాగారంగా అవిర్భవించేది కాదు. వికీపీడియాలో రోజుకు 9700 వ్యాసాలతో నెలకు సుమారు 1 కోటి 20 లక్షల మార్పులతో ముందుకు పోతున్నది. (ఆగస్టు 2012 నాటి గణాంకాల ఆధారంగా)

ఎందరో ఉత్సాహ వంతులైన వికీపీడియన్లు ప్రపంచ వ్యాప్తంగా తమ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న వికీపీడియన్లు స్వచ్ఛందంగా చేస్తున్న కృషిఫలితంగానే విషయాలు మెరుగులు దిద్దుకుంటూ అభివృద్ధి చెందుచున్నాయి. వికీపీడియాలో ఏ విషయాన్నైనా చదువుకొనుటకు, దిగుమతి చేసుకొని వాడుకొనుటకు, దానిని మార్చి వాడుకొనుటకు అవకాశమున్నది. వికీపీడియాలో విషయాన్ని చాలా రకాలుగా ఇతరులతో పంచుకోవచ్చు.

కాని...... ఎవరు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎవరి ఆధీనంలో ఇది పని చేస్తున్నది? వికీపీడియా ప్రధాన సంపాదకుడెవరు?
వికీపీడియన్లు సరికొత్త వ్యాసాలను సృష్ఠించడం, ఉన్న వ్యాసాలను సరిదిద్దడం చేస్తూనే ఉంటారు. సదా దిద్దుబాట్లు జరిగే వికీపీడియా వ్యాసాలను పూర్తిగా సమీక్షించడం, నాణ్యతా నిర్ణయం చేయడం సాధ్యం కానిపని. వికీపీడియా అనే బృహత్తర విజ్ఞానభండాగారంలో భద్రపరిచే వ్యాసాలను ప్రపంచం నలుమూలలలో వున్న వికీపీడియన్లు వ్రాస్తుంటారు. వికీపీడియాలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు ఇది వినోదాన్ని, విజ్ఞానాన్ని కానుకగా అందించే అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు. సామాజిక దృష్టిలో ఒక లక్ష్యం కొరకు పనిచేయడం వింత అయినప్పటికీ క్రియాశీలక వికీపీడియన్లు తమకు తెలిసిన పరిమిత విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి సంతోషిస్తున్నారు.
ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కరికీ సహాయ పడడమనే విషయం ఎంతో సంతృప్తినిస్తుంది. కాని ఈ విషయమై మరి కొన్ని వివరాలు చెప్పండి? ఎలా ప్రారంభించాలి?

ప్రయత్నించండి!

ఎవరు వికీపీడియాలో గల వ్యాసాలను సవరించగలరు? సరియైన జవాబు ఎంచుకోండి.

□ అనుభవమున్న సంపాదకులు మాత్రమే
□ వికీపీడియా ప్రధాన సంపాదకుడు
□ అంతర్జాల సంపర్కమున్న ఎవరైనా

ఈ ప్రశ్నకు మరియు ఇతర ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకం చివరి పేజీలో కనబడతాయి.

వికీపీడియాలో ఖాతా తెరుచుట

వికీపీడియాలో ఏదైనా వ్రాయడానికి మొదటగా చేయ వలసిన మంచి పని వాడుకరి ఖాతా తెరుచుకోవటం. ఖాతా తెరచినవారు వికీపీడియాలో క్రొత్త వ్యాసాలు వ్రాయవచ్చు. బొమ్మలను ఎక్కించవచ్చు, వ్యాసాలకు కొత్త పేర్లను సూచించవచ్చు. అంతేగాక, వారి వీక్షణా జాబితాలోకెళ్ళి తాము ఇదివరకు వ్రాసిన వ్యాసాలలో జరుగుతున్న సవరణలు చూడవచ్చు. ఒక వ్యాసాన్ని మీ వీక్షణ జాబితాలో వుంచాలనుకుంటే పైన ఆదేశాలవరస లో కనబడే నక్షత్రం గుర్తుపై నొక్కాలి.

ముఖ్యమైన విషయమేమంటే మీరు చేసిన మార్పులు, చేర్పులు మీఖాతా(పేరు)తో నమోదు అయి వుంటాయి. వికీపీడియాలో మీకొక గుర్తింపు వుంటుంది. దీనివల మీలాంటి ఇతర వికీపీడియన్లతో సత్సంబందాలు కలిగి వుండవచ్చు. వికీపీడియాకు అలవాటు పడిన తర్వాత ఇతర వికీపీడియన్ల తో చర్చలు జరపవచ్చు వారి సందేహాలను నివృత్తి చేయవచ్చు.

వికీపీడియాలో ఖాతా నమోదు చేసుకోకుండా కూడా మార్పులు చేర్పులు చేయవచ్చు. కాని ఆ మార్పులు చేర్పులు మీ పేరున కాకుండా అంతర్జాల .ఐ.పి. చిరునామ మీద చేరతాయి. అటువంటి మార్పులు నిబంధనలకు విరుద్దంగా వుంటే తొలగించే అవకాశముంటుంది; ఉదాహరణకు: ఒక పాఠశాల విద్యార్ఢి తన పాఠశాల గురించి వ్యతిరేకత కలిగివుండి చెడుగా వ్రాసినది పాఠశాల గౌరవానికి భంగకరంగా వుంటే వాటిని తొలిగిస్తారు.


ప్రయత్నించండి.

  1. వికీపీడియాలో వాడుకరి ఖాతా సృష్టించండి.
  2. మీ వీక్షణా జాబితా లో మీకిష్టమైన వికీపీడియా వ్యాసాన్ని చేర్చుకొనుటకు ఆ వ్యాస పుటలో పైన కుడివైపున వున్న నక్షత్ర గుర్తుపై నొక్కాలి. ఆ వ్యాసాలలో మార్పులను వీక్షణ జాబితా నొక్కి గమనించండి.


వికీపీడియాలో అకౌంటు సృష్టించటం సులభం. మీరు దానికొరకు వ్యక్తిగత సమాచారము ఇవ్వవలసిన అవసరంలేదు.

  1. వికీపీడియా పుట పైన కుడివైపు వున్న అకౌంటు పై నొక్కండి.
  2. మీ వాడుకరి పేరు టైపు చేయండి
  3. సంకేతపదం (పాస్ వర్డ్) టైపు చేయండి
  4. ఖాతా సృష్టించు పై నొక్కండి
చాలా త్వరగా అయిపోయింది. నాకు ఇప్పడు ఖాతావుంది కాబట్టి, నేను నాణ్యమైన వ్యాసాలు సృష్టించడానికి తోడ్పడవచ్చు.

వికీపీడియా వాడుకరి అంతర్వర్తి

ఈ వ్యాసము ఎవరు వ్రాశారు? చాల బాగున్నది. వ్యాసాలను ఇంత బాగుగ నేను వ్రాయలేనేమో?


వికీపీడియా మొదటి పుట.

చర్చ: అను గడి పుట పైభాగాన వుంటుండి. వికీపీడియాలో వ్రాయు అన్ని విషయాల గురించి ఇతర వాడుకరులతో ఈ చర్చ పుటలో చర్చించుకోవచ్చు. పరస్పర సందేహాలను తొలగించుకోవచ్చు.

సహాయం: పుట పైభాగాన వున్న ఈ గడి పై నొక్కితే వికీపీడియాలో మార్పులు చేర్పులు ఎలా చేస్తారో ఆ విధానము ఎలా పని చేస్తుందో సులభంగా అర్థం అవుతుంది.

ఇటీవలి మార్పులు: దీనిపై నొక్కితే కాల క్రమంలో క్రొత్తగా చేరిన మార్పులు చేర్పులు ప్రత్యక్షమౌతాయి.

భాషలు: వికీపీడియా ప్రస్తుతం 280 భాషలలో వున్నది.

వికీపీడియా మొదటి పేజి

"ఖాతా తెరువు:" పుట పైభాగాన వున్నది. దీని సహాయంతో వికీపీడియాలో అన్ని సౌలభ్యాలు అందుబాటులోకి తెచ్చుకోవడమేకాకుండా మీ ఆన్లైన్ పరిచయపత్రం కూడా రూపొందించుకోవచ్చు.

చరిత్ర: ఇది గతంలో చేసిన మార్పులు చేర్పులు మొదలగు వాటి వివరాలు చూపిస్తుంది.

వెతుకు: మీకు కావలసిన వ్యాసం పేరును "వెతుకు" పెట్టెలో సరిగా వ్రాసి దానిని నొక్కినచో ఆ వ్యాసం ఇదివరకే వున్న యడల ఆ వ్యాసం వున్న పుట తెరుచుకుంటుంది. అలా ఆ వ్యాసం లోనికి వెళ్ళవచ్చు.

ప్రయత్నించండి
  1. చరిత్రను చూడండి దీనిపై నొక్కితే ఎవరెవరు ఎప్పుడు ఏ సమయాన, ఏ తారీఖున, ఆ వ్వాసంలో ఏ భాగము మార్పులు, చేర్పులు చేశారో, చూడొచ్చు. అంతే కాక గతంలో పోల్చితే మార్పు ఎలా వుండేదో వారి పేరున కూడ చూడవచ్చు. ఒక మార్పును ఎందుకు చేసామో వివరించడం వలన ఇతరులు మార్పులు ఎలా చేయాలో సులభంగా అర్ధం చేసుకోగలరు.
  2. అనుపమ స్నేహితుడు రాజు కొత్తగా చేరి వికీపీడియాలో వ్రాయడం ప్రారంబించాడు. ఈ విషయంలో అతనికి వికీపీడియా నియమ నిబంధనల గురించి, దీనికి సంబంధించిన విషయాల గురించి సాధారణ సలహాలు, సహాయము కావలసి వున్నది. అవి ఎక్కడ లభించ గలవు?

సరియైన సమాధానం ఎంపిక చేయండి.

□ ఇటీవలి మార్పులు
□ సహాయం
□ వెతుకు

నేను వికీపీడియాకు ఎలా సహాయపడగలను?

వికీపీడియాలో చేయడానికి మీకు ఎన్నో పనులున్నాయి. వ్యాసాలు వ్రాయడము అన్నది వాటిలో ఒకటి. వికీపీడియాలో చేయవలసి పనులు కొన్ని ఇక్కడ వివరించ బడ్డాయి.

నిర్వహణ

నిర్వహణ బాధ్యతలో భాగంపంచుకొనేవారు పక్షపాతంతో కూడిన సవరణలను చక్కదిద్దుతారు. ఇతర వికీపీడియన్లు వ్యక్తిగత లక్ష్యంతో చేసే మార్పులు, చేర్పులు ఒక కంట కనిపెడుతూ వారు వ్రాసే విషయమేదైనా అది, రాజకీయమా, వేదాంత విషయమా ఏదైనా సంబంధిత మార్పులలో విషయంలోని ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తుంటారు.

వికీ గనోమ్

చిన్న చిన్న అక్షర దోషాలను సరిచేస్తూ, సందేశాల ద్వారా అయా రచయితలకు సలహాలను చర్చ పుటలో వ్రాస్తు వుంటారు.

కాపీ ఎడిటర్

వ్యాసంలో భాషా దోషాలను సరిచేస్తారు.

మధ్యవర్తి

వివాదాస్పద విషయాలపై చర్చలను అదుపుదప్పకుండా చేయుటద్వారా వివాదాలను పరిష్కరించుటకు సహాయపడతారు. సంపాదకుల ప్రవర్తన పై సూచనలిస్తుంటారు.

చిత్రకర్త

బొమ్మలు, ఫోటోలు , పటములు మొదలగు దృశ్య సంబంధమైన వాటిని సంబంధిత వ్వాసాలలో చేరుస్తుంటారు.

రూపశిల్పి

వ్యాసాలను చదవడానికి సులభతరం చేయటానికి వికీ కోడులు వాడి వికీకీరణ చేస్తారు.

రచయిత

ఒక వ్యాసానికి సంబంధించిన విషయాలను సంబంధిత గ్రంధాలనుండి, వార్తా పత్రికలు వంటి ఇతర నమ్మకమైన మూలాలనుండి సేకరించి వ్యాసంలో చేరుస్తుంటాడు. దీనితో పాటు రచయిత కొత్త వ్యాసాలను ప్రారంభిస్తారు .

పాకిస్తాన్ నగరమైన లాహోర్ గురించి చారిత్రాత్మక సత్యాన్ని సవరించాను. మీరు వూహించగలరా? నేను భద్రపరచిన వెంటనే నా మార్పులు కనబడ్డాయి. ఎంత అద్భుతం!

వాడుకరి, వాడుకరి చర్చా పుటలు

ప్రతిరోజు వికీపీడియాలో కొన్ని వందల మార్పులు, చేర్పులు చేస్తుంటారు. వాటిలో కొందరు వ్రాసిన విషయంలోని నిజా నిజాలను సరి చూచుకొనే అవకాశముండదు. అందుచేత కొంత మంది వికీపీడియన్లు ఇంచు మించు అన్ని మార్పులను,చేర్పులను సంప్రదింపులు పేజీ ద్వారా నియంత్రిస్తుంటారు. (ఇది పుటకు ఎడమ వైపునున్న మార్జిన్ లో వున్నది) ఈ పుటలో అయా భాషల వికీపీడియాలో వున్న మార్పులు, చేర్పులకు సంబంధించిన అన్ని అంశాలు వున్నాయి. కొందరు వికీపీడియన్లు మార్పులు చేర్పులు చేస్తూ ఒక మంచి విషయాన్ని అది నిజమైనా దానికి సరియైన ఆధారాలు చూపనందున తొలగించవచ్చు. ఇటువంటి ఇబ్బందులను తొలగించాలంటే వ్రాసిన విషయానికి సరైన అధారాలను చూపడము అతి ముఖ్యమని గ్రహించాలి. అటు వంటి విషయాలను ఆయా వాడుకరుల పుటలలో వ్రాసుకోవచ్చు. మీఇష్టాఇష్టాలకు సంబంధించిన వివరాలు అక్కడ వ్రాసుకోవడము అతి ముఖ్యమని గ్రహించాలి. ప్రతి వికీపీడియన్ కు ఒక వాడుకరి పుట, మరియు ఒక వాడుకరి చర్చా పుట వున్నది. ఈ రెండు పుటలకు లంకె వేయడానికి మానిటర్ పై భాగాన కనబడతాయి. వాడుకరి పుట లోనికెళ్ళడానికి ఆయా వాడుకరి పేరుపైన నొక్కితే అతని వాడుకరి పుట తెరుచుకుంటుంది. సవరించు అను దానిమీద నొక్కి ఆ పుటలో వ్రాయాలనుకున్నది అక్కడ వ్రాయవచ్చు. వ్రాసిన తర్వాత భద్రపరుచు అను దానిమీద నొక్కితే అప్పటి వరకు వ్రాసినది భద్రమౌతుంది. భద్రపరుచు అను గడి మార్పుల పెట్టె క్రింద భాగాన వుంటుంది.

ఏమైంది. నేను చేసిన వ్యాస మార్పు కనబడలేదు. దానిని ఎవరైనా తొలగించారా? ఎందుకు తొలిగిస్తారు?

ప్రయత్నించు

అనుపమ ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అనేక ఫోటోలను తీసింది. ఆమె ఫోటోలను వికీపీడియాలో పెట్టాలనుకున్నది. ఈ విషయంలో ఆమె ఏ వికీపీడియా బాధ్యతను నిర్వహిస్తున్నది?

□ చిత్రకర్త
□ రచయిత
□ మధ్యవర్తి
□ రూపశిల్పి

మీ వాడుకరి పేజీలో మీగురించిన వివరాలు, మీకు తెలిసిన, మీకు ఆసక్తి కలిగిన వ్యాసాలపేర్లు. మీరు ఏదైనా సంస్థకి చెందితే ఆ వివరాలు, మీకు వైరుధ్యాసక్తులు (Conflict of Interest) వుంటే ఆ వివరాలు తెలియపరచడానికి సరియైన చోటు ఇదే. ఉదాహరణగా మీరు పనిచేస్తున్న సంస్థకు సంబంధిత వ్యాసంలో మీరు దిద్దుబాటు చేస్తున్న సమయలో తటస్థంగా ఉండడం శ్రమతో కూడుకున్న విషయమే అయినప్పటికీ మీ సంస్థ గురించి విషయ పరిజ్ఞానం మీకు అధికంగా ఉంటుంది కనుక మీ సంస్థ గురించిన పరపూర్ణ సమాచారం సంబంధిత వ్యాసంలో మీరు చేర్చవచ్చు. అలాగే మీ సంస్థ సంబంధిత వ్యాసంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా లేక అందించిన సమాచారం పాతబడినా వాటిని సవరించడానికి అవసరమైన సూచనలను చర్చాపేజీలో వ్రాయవచ్చు లేకుంటే వారిని మీ పేజీని సందర్శించేలా చేయవచ్చు. వ్యాసరచయిత మీరందించిన వనరులను ఉపయోగించి వికీపీడియాలో ఉన్న వ్యాసాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది.

ఇతర సభ్యులు మీకు సందేశాలు పంపడానికి, సూచనలు అందించడానికి ఇతర సంప్రదింపులు జరపడానికి మీరు ప్రతిస్పందన తెలపడానికి సరైన చోటు వాడుకరి చర్చ పేజి. సభ్యులలో అనేకమంది కొత్తగా వికీపీడియాలో ప్రవేశించిన సభ్యులకు వారి చర్చాపేజీలలో స్వాగతసందేశం పంపుతుంటారు. ఇతర సభ్యులు కూడా మీరు కోరకుండానే, దిద్దుబాట్లు చేయడానికి మీకు అవసరమైన సమాచారం మీ చర్చాపేజీలో వ్రాస్తూ మీతో సంప్రదింపులు జరుపుతుంటారు.

ప్రతిఒక్క వ్యాసానికి ఒక చర్చా పేజి ఉంటుంది. వ్యాసాల చర్చా పేజిలో సభ్యులు వ్యాససంబంధిత విషయాలను చర్చించడానికి వివాదాలను పరిష్కరించడానికి, వ్యాస నాణ్యతను మెరుగుపరచడానికి ఈ పేజీ ఎంతగానో సహకరిస్తుంది. మీ దిద్దుబాట్లు చూసి ఆశ్చర్యపడిన సభ్యులు దానిని గురించిన వివరణ తెలుసుకోవడానికి కూడా ఈ పేజీ సహకరిస్తుంది. అలాగే ఇతర సభ్యుల నుండి వ్యాస సంబంధిత సహాయం కోరడానికి కూడా వ్యాసాల చర్చాపేజీలు సరైన వేదిక అనుకోవచ్చు.

ప్రయత్నించండి!

మీ వాడుకరి పేరు పై నొక్కండి ఆ తరువాత పేజీలో మార్పులు చేయుటకు సవరించు నొక్కండి. సవరించు ఉపకరణ పట్టీలో వున్న వివిధ ఐచ్ఛికాలను పరిశీలించండి.... (బొద్దు), (వాలు), మరియు (లంకె).

రూపాన్ని దిద్దే ఉపకరణాలు చూడుటకు ఉన్నత నొక్కండి.

వికీ కోడుల త్వరిత సూచీ ఈ పుస్తకం చివరి భాగంలో వుంది.

ఓ, ఎవరో నా చర్చాపేజీలో వ్యాఖ్య చేర్చారు. ఈ సందేశం, నేను మూలాలు పేర్కొనలేదుకాబట్టి నా సవరణలు రద్దు చేయబడినవని తెలుపుతున్నది. దీనికి ఆధారం ప్రభుత్వ జాలస్థలి లో పేర్కొన్నారు కాబట్టి, నేను మరల సవరించుతాను. ఈ సారి నేను ఈ మూలాన్ని వ్యాసంలో సవరణ ప్రక్కన చేరుస్తాను. అప్పడు అది అడుగున వున్న మూలాల విభాగంలో కనబడుతుంది. అలా చేస్తే సరిపోతుంది.

ఒక వ్యాసం జీవిత కథ

వికీపీడియాలో చాలా సమగ్రమైన ప్రామాణికత కలిగిన వ్వాసాలుండాలి. ఆ వ్యాసాలు ఒక్కసారిగా అలా పుట్టుకొచ్చాయని ఎవరూ ఊహించరు. ప్రతి వ్యాసము చిన్నదిగా ప్రారంభమై అనేకమంది చేత దిద్దుబాట్లకు గురై, అందరి విస్తృత సహకారముతో ఈ క్రింద ఇవ్వబడిన తరహాలో అభివృద్ధి చెందుతుంది.


  • విశేష వ్యాసంగా గుర్తింపు పొందిన అనేక వ్యాసాలు మొదటగా వ్యాసానికి సంబందించిన విషయమై క్లుప్తమైన వివరణ (సంగ్రహం), ఆ వ్యాసం ఎందుకంత ప్రముఖమైనదో తెలియజేసే వివరంతో(ప్రథమాలు...", "అతి పెద్దదైన...", "...కు రాజధాని" లాంటివి), ప్రాముఖ్యతను నిర్థారించుకోవడానికి వికీపీడియా వెలుపల ఇతర ప్రముఖ సంస్థల ముద్రణలు లేక జాలస్థలాలను పేర్కొనటంతో ప్రారంభమవుతుంది. అటువంటి వ్యాసాన్ని 'మొలక' అని అంటారు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా పాఠకులలో అదంత ప్రాముఖ్యత కలిగినది కాదు అనే భావమేర్పడి ఆ వ్యాసం తొలిగించే అవకాశమున్నది.
  • ఇతర సభ్యులు పాఠ్యము, బొమ్మలు చేర్చుతుంటే, ఈ వ్యాసం విషయం సంగ్రహ స్థాయినుండి వివిధ ధృక్పథాలను అనగా చారిత్రక (ఉదాహరణకు "1923 లో కొత్త కారణాలు...") లేక ప్రపంచ (ఉదాహరణకు "యూరప్ లో దీనిని అనుకొన్న విధము") దృక్పథాలను చేరిస్తే వివరమైన వ్యాసంగా రూపొందుతుంది. ఎక్కువగా పనిచేసే సభ్యులు దీనిని వికీపీడియా సహసభ్యుల సమీక్ష విధానానికి ప్రతిపాదించవచ్చు. ఈ పద్ధతిలో చాలా మంది సభ్యులు నాణ్యతను జాగ్రత్తగా సమీక్షించుతారు. ఈ పద్ధతి చాలాపనిజరిగిన వ్యాసాలకు అమలుచేస్తారు. ఈ సమీక్షపద్ధతిలో వ్యాఖ్యలకు, ప్రశ్నలకు, సలహాలకు తగినవిధంగా సమాధానమివ్వాలి. అలా వ్యాసాన్ని అభివృద్ధిచేయటానికి ప్రణాళికను చర్చాపేజీలో చేరుస్తారు.
  • చివరిగా, బాగావ్రాయబడినదనీ, మూలాధారలతో వ్యాసం సమగ్రంగా ఉన్నదని ఇక విషయ నిపుణులు మాత్రమే ఇక దీనిని మెరుగుచేయగలరనే స్థాయికి వ్యాసం చేరుతుంది. వీటిని మంచి వ్యాసాలుగా పరిగణిస్తారు. కొద్ది వ్యాసాలు సముదాయం దృష్టిలో ఉన్నతమైన నాణ్యతగా భావించబడతాయి. అటువంటి వ్యాసాలలో విశేష వ్యాసాలుగా పరిగణించి వికీపీడియా ప్రధాన పుటలో ప్రదర్శించుతారు. ఆ స్థాయి వ్యాసాలు తయారవడము చాల శ్రమ, సమయంతో కూడుకున్న పని. ఈ పనిలో సహకరించడం చాలా తృప్తినివ్వటమే కాక సమదాయంలో గౌరవం పెరుగుతుంది. మిగతా వ్యాసాలతో బాటు ఈ వ్యాసాలుకూడ నిత్యము సవరింపునకు గురౌతుంటాయి.

లక్షల పాఠకులు చదివే జాలస్థలిలో మొదటి పేజీలో ప్రదర్శించటానికి వ్యాసం వ్రాయడంలో నేను కృషిచేయాలని కలగంటున్నాను.

ప్రయత్నించండి!

వికీపీడియాసహసభ్యుల సమీక్ష విధానం అంటే ఏమిటి ? సమాధానం ఎంచుకోండి

□ వికీపీడియా సభ్యులబృందం వ్యాసనాణ్యత నిర్ణయించుట
□ నిపుణుల బృందం వ్యాసనాణ్యత నిర్ణయించుట.
□ వికీపీడీయా సంస్థ వ్యాసనాణ్యత నిర్ణయించుట.

నాణ్యమైన వ్యాసానికి కావలసినవి ఏవి?

చక్కగా నిర్వచించబడిన వ్యాస నిర్మాణవిధానాలను అనుసరిస్తూ, క్రియాశీలక సభ్యులతో విజ్ఞాన సర్వస్వపరమైన విషయాలతో తీర్చిదిద్దబడే వ్యాసమే నాణ్యత కలిగిన వ్యాసం.

నిర్మాణం: వ్యాస నిర్మాణం, స్పష్టమైన నాణ్యమైన వ్యాసాన్ని తయారుచెయ్యడానికి,. పాఠకులు తమకు కావలసిన వివరాలు చక్కగా తెలుసుకోవడానికి, సభ్యులు వ్యాసాన్నివివిధ దృక్కోణాలలో తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది. నిర్మాణం గురించి తెలుసుకోవడానికి వికీపీడియాలో చక్కగా రూపుదిద్దుకున్న వ్యాసాలను పరిశీలించడం ఒక మార్గం. విశేషవ్యాసాలను అన్నింటిని మొదటి పేజీలోని వివరాల అధారంగా చేరుకోవచ్చు. ఈ వారం వ్యాసం జాబితా అనే లింకును నొక్కి ప్రత్యేకవ్యాసాల జాబితా ఉన్న పేజీకి చేరుకోండి. స్క్రోల్ బారును కిందకు లాగుతూ మిమ్మల్ని ఆకర్షించిన వ్యాసాన్ని ఎన్నుకోండి.

నాణ్యత గల వ్యాసాల నిర్మాణం ఈ క్రిందివిధంగావుంటుంది.

ప్రారంభ భాగం: వ్యాసంలోనిప్రధానమైన అంశాలను క్లుప్తీకరించబడిన భాగం. దీనికి శీర్షిక వుండదు.

తరువాతి భాగాలు: శీర్షికలు ఉపశీర్షికలతో వివరాలుంటాయి. ఉదాహరణగా ఒకప్రదేశాన్ని గురించిన వ్యాసంలో చరిత్ర, భౌగోళిక వర్ణన, వాతావరణం, ఆర్థికం, పాలనావ్యవస్థ, గణాంకాలు, సంస్కృతి అనే శీర్షికలు ఉపశీర్షికలతో ఉండడం గమనించవచ్చు.

అనుబంధాలు, పాదసూచికలు: అదనంగా వెలుపలి లింకులు, ఇవికూడా చూడండి, మూలాలు వంటి శీర్షికలతో వ్యాసానికి సంబంధించిన వికీపీడియాకు వెలుపలి అంతర్జాల పేజీల లింకులు, వ్యాసానికి సంబంధం ఉన్న వికీపీడియాలోని ఇతర వ్యాసాలు, వ్యాసరచనకు ఆధారంగా ఉన్న వెబ్‌పేజీల లింకులు, వర్గాలు వ్యాసానికి సంబంధించిన ఇతరవ్యాసాల మూసలు మొదలైనవి ఉండడం గమనించండి.

ప్రయత్నించండి.

1 వ్యాసంలోని మధ్యభాగాలలో శీర్షికలు లేవు. సరియైన సమాధానం ఎంచుకోండి

□ సరి
□ తప్పు

2 నాణ్యమైన వికీపీడీయా వ్యాసంలో ఉండవలసినవి విషయాలు ఏమిటి? క్రింది వాటిలో సరిపోయినవన్నీ ఎంచుకోండి

□ పరిశీలించతగిన అధారాలు.
□ తటస్థ దృక్పథం
□ ఎలా- ఏమిటి- ఎందుకు అన్న సూచనలు.
□ సంగ్రహం, వివరాలతో కూడిన భాగం, మూలాలు

విషయాలు: పలు వికీపీడియన్లు వ్యాసనాణ్యత నిర్ణయించడానికి విషయాలు అతిముఖ్యమైనవి అనుకుంటారు. స్థిరమైన విశ్వసనీయమైన నాణ్యతనిర్ణయం కొరకు వికీమీడియా సముదాయం నాలుగు మార్గదర్శకాలను నిర్ణయించారు.
  • మూలాలను అందించడం: వివరాలను పరిశీలించడానికి అవసరమైన మూలాలను అందించేలా సభ్యులను ప్రోత్సహించడం. ప్రతి వాస్తవాన్ని విశ్వసనీయమైన మూలాలతో పరిశీలించడం.
  • తటస్థ దృక్కోణం: వ్యాసాలు పూర్తిగా నిష్పక్షపాత దృష్టి, గడిచినకాలంలో ముద్రితమైన ముఖ్యమైన అభిప్రాయాలను ప్రదర్శించాలి.
  • ప్రచారదృష్టి రహితం : ప్రకటనా పద్ధతులు, ఎలా అనే సూచనలు, పరిచయపత్రాలు, విక్రయజాబితాల వంటివి వికీపీడియా వ్యాసాలలో చేర్చకూడదు.
  • స్వంత పరిశోధన నిషేధం: ఒక విషయం గురించి మీ స్వంత పరిశోధన, ఆలోచనలను, (వికీపీడియా వీటిని స్వంత పరిశోధనగా భావిస్తుంది) మీ వ్యక్తిగత అభిప్రాయాలను చేర్చటం సమంజసం కాదు.

సముదాయం: - వికీపీడియా సభ్యులందరూ ఉచిత లైసెన్స్‌తో తమ వ్యాసాలను ఇతర దిద్దుబాట్లను వికీపీడియాలో చేర్చుతుంటారు. ఏ వ్యాసం ఏ సభ్యునకు స్వంతం కాదు. వ్యాసాలన్నీ పలు సభ్యులతో దిద్దబడుతుంటాయి. మరోమాట చెప్పాలంటే నిర్ణయం తీసుకునే విధానంలో ప్రతి వికీపీడియన్ భాగస్వామ్యం వహిస్తారు. వ్యాసం చర్చాపేజీ, వ్యాస విషయాల నిర్మాణం చర్చించడానికి సరైన ప్రదేశం. ఒక్కోసారి వ్యాసం సర్వామోదం పొందడానికి కష్టతరమైనపుడు వికీపీడియా:వివాద పరిష్కారం పేజీ చూడండి. వికీపీడియాలో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న సభ్యులు, రచయితల అనుభవం వివాదాలు పరిష్కరించడానికి ప్రధాన వనరుగా భావించవచ్చు.

వికీపీడియాలో ఇందుకు సంబంధించిన వ్యాసం కనబడలేదు. ఎవరైనా ఇటువంటి వ్యాసరచనకు ప్రయత్నిస్తారేమో ఎదురుచూడాలా?

కొత్తవ్యాసం సృష్టించడం

తెలుగు వికీపీడియాలో వ్యాసాలు లేని అనేక విషయాలు ఉన్నాయి. ఒక వ్యాసం వికీపీడియాలో లేదని మీరు భావించితే, ఆ విషయానికి సంబంధం గలిగిన వ్యాసాల కొరకు శోధించండి. ఉదాహరణగా విషయసంబంధిత పేరులో స్వల్పమార్పులతో శోధించండి. అలాగే విషయానికి దగ్గర సంబంధం ఉన్న ఇతర వ్యాసాలు ఉన్నాయేమో శోధించండి. ఉదాహరణకు ఒక ద్వీపం అది చెందిన దేశం వ్యాసంలో పేర్కొనబడి ఉండవచ్చు. ఒకవేళ ఆ విషయం వికీపీడియాలో ఇంకా వ్రాయబడకుంటే గ్యారేజీ బ్యాండ్ లేక అంతగా పేరులేని వ్యక్తి బ్లాగు లాంటి అప్రధానమైనవంటివి కావచ్చు. మీరు ఆ విషయం తప్పక వికీపీడియాలో వుండాలని అనుకుంటే మీరే ఆ వ్యాసం సృష్టించవచ్చు.

వ్యాసం శీర్షిక తో శోధించండి. వికీపీడియాలో వ్యాసం లేకుంటే మీరు ఆ పేరును ఎర్ర హైపర్ లింకులో చూస్తారు. కొత్తవ్యాసం ఆరంభించడానికి ఆ హైపర్ లింకుని నొక్కండి. మీరిక ఈ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు.

మీ కొత్తవ్యాసం ఒక మంచి వ్యాసం కావాలంటే ఈ మూడింటిపై శ్రద్దపెట్టండి:

  1. వ్యాసం సంగ్రహరూపం
  2. విషయం ప్రాధాన్యం తెలిపే కారణాలు
  3. విషయానికి సంబంధించి నమ్మదగిన మూలాలు

నా తొట్ట తొలి వికీపీడియా వ్యాసం ఇప్పుడు అంతర్జాలంలో కనబడుతున్నది. సముదాయం దీనిని ఎలా విస్తరిస్తుందో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది.

ఎప్పుడైతే మీరు వ్యాసాన్ని వ్రాయాలని అనుకున్నారో మీరు పనిచేయడానికి మీకు ఒక చోటు కావాలి. మీరు మీ స్వంత పనిప్రదేశం కొరకు "ఇసుక పెట్టె" ను సృష్టించుకోండి. అక్కడ మీ వ్యాసం మూడు ప్రధానాంశాలతో పూర్తి అయ్యేవరకు మీరు దిద్దుబాట్లు చేయవచ్చు.

మీ ఇసుక పెట్టెను ఉపయోగించాలంటే మీ వాడుకరి పేజీని సవరించి [[/నా ఇసుక పెట్టె]] అని చేర్చి భద్రపరచండి.

అప్పుడు కనబడే ఎర్రలింకు పై నొక్కి మీవ్యాసం చిత్తుప్రతిని తయారుచేసుకోవచ్చు. మీ దిద్దుబాటు పూర్తికాగానే దానిని భద్రపరచడం మరిచిపోవద్దు. మీరు వ్యాసం సిద్ధం చేసుకున్న తరువాత మీ వ్యాసం పట్ల ఆసక్తి కలిగిన ఇతర సభ్యులను గుర్తించండి. సభ్యులను గుర్తించడానికి సంబంధించిన వ్యాసాల చరిత్రను పరిశీలించడం ఒక మార్గం. ఆ సభ్యుల చర్చాపేజిలో మీ వ్యాసాన్ని పరిశీలించమని అభ్యర్ధనా సందేశం ఇవ్వండి. మీ వ్యాసం సిద్ధం కాగానే విజ్ఞానసర్వస్వంలోకి తరలించడానికి వెతుకుపెట్టె ఎడమపక్కన వున్న మెనూ బొత్తాము నొక్కి తరలించు ఎంపికచేయండి. అప్పుడు కనబడే పెట్టెలో వ్యాస పేరుబరిని (మొదటి) గా ఎంపికచేసుకొని పేరులో మీ ఇసుకపెట్టె పేరుబదులుగా కేవలం వ్యాసం పేరుమాత్రమే వుండేటట్లు చూసుకొని తరలించండి. కింద పెట్టెలో తరలించడానికి తగిన కారణం వివరించండి.


ఇప్పుడు మీరు మీ వ్యాసాన్ని సృష్టించడం పూర్తయ్యింది, కాని ఇంతటితో ఆగకండి. మీరు దీనిని ఎక్కడైతే ప్రస్తావించబడిందో అక్కడనుండి లింకు ఇవ్వండి.

ప్రయత్నించండి

మీ కొత్త వ్యాసంలో చేర్చవలసిన మూడు ప్రధానాంశాలు ఏమిటి? సరైన సమాధానం ఎంచుకోండి.

□ సంగ్రహం, గుర్తింపు ప్రాధాన్యత వివరం, మూలం.
□ సంగ్రహం, ఒక చిత్రం, ఇంకొక వ్యాసానికి హైపర్ లింకు.
□ పేరు, గుర్తింపు ప్రాధాన్యత వివరం, మూలం.

ఒక వికీపీడియన్

వచ్చే నెలలో నా మొరాకో పర్యటనకు ముందు నేను వికీపీడియాలో ఓ పుస్తకాన్ని సృష్టించండి ఆదేశాన్ని ఉపయోగించుకుంటాను. నేను నా వ్యక్తిగత పర్యాటక మార్గదర్శక సహాయకారిని తయారుచేసుకోవడానికి అవసరమైన వ్యాసాలను సేకరిస్తాను. నేను ముందు ఊహించినదానికంటే చాలా సౌలభ్యాలు వికీపీడియాలో ఉన్నాయి.

ఇప్పుడు మీరు ’వికీపీడియా స్వయం శిక్షణ’ చదివారు కాబట్టి, మీకు తెలిసినవి:

  • వికీపీడియా పనితీరు అర్ధం చేసుకోవటం
  • వికీపీడియా వాడుకరి ఖాతాను సృష్టించుట.
  • వికీపీడియా అంతరవర్తి(interface) అర్ధం చేసుకోవటం
  • వికీపీడియాలో వివిధ రకాలుగా మీరు చేయగల కృషి
  • ఇతర సభ్యులతో చర్చా పేజీల ద్వారా సంభాషించుట
  • వికీపీడియాలో వ్యాస పరిణామ క్రమం అర్ధంచేసుకొనుట
  • వికీపీడియాలో నాణ్యమైన వ్యాస లక్షణాలు వివరించుట
  • వికీపీడియాలో కొత్త వ్యాసం తయారు చేయుట

బాగుంది, కాలం నిజంగా పరిగెడుతుంది! నేను ఇప్పుడే నా పేజీ పై నున్న నా మార్పులు నొక్కితే అప్పుడే 100 పైగా దిద్దుబాట్లు చేసినట్లు గ్రహించాను. ఇతర వికీపీడియన్లతో జరిపిన సంప్రదింపులు, నాణ్యమైన వ్యాసాలు వ్రాయగలగడం, నాకు తెలిసిన విషయాలను ఉచితంగా అందరికీ అందించగలగడం నన్ను ఆనందపరిచాయి.


వికీమీడియా బుక్ షెల్ఫ్ ప్రణాళిక ద్వారా "వికీపీడియా స్వయంశిక్షణ" మీకు అందించబడుతుంది. దీని ఎలెక్ట్రానిక్ నకలును దిగుమతి చేసుకోవాలంటే సందర్శించండి: [1]

ఇక్కడ మీకు దీనిని అనువదించడం, అర్ధం చేసుకోవడం అలాగే పుస్తక వనరులను తిరిగి ఉపయోగించడం వంటి వివరాలు లభిస్తాయి.

ప్రయత్నించండి! సరైన సమాధానాలు.

వికీపీడియా ఎలా పని చేస్తుంది ?

ఎవరు వికీపీడియాలో గల వ్యాసాలను సవరించగలరు?

☑ అంతర్జాల సంపర్కమున్న ఎవరైనా


వికీపీడియా వాడుకరి అంతర్వర్తి

అనుపమ స్నేహితుడు రాజు వికీపీడియాలో వ్రాయడం ఇటీవలే ప్రారంభించాడు. అతనికి వికీపీడియా నియమ నిబంధనల గురించి, సంబంధించిన విధానాలు, మార్గదర్శకాల గురించి సముదాయ ప్రమాణాలు, సాధారణ సహాయము కావలసి వున్నది. అవి ఎక్కడ లభించగలవు?

☑ సహాయం


నేనే విధంగా కృషి చేయగలను

అనుపమ తను వెళ్లినపర్యాటక ప్రదేశపు ఫోటోలు తీయటం ఇష్టం. ఈ విషయంలో ఆమె ఏ వికీపీడియా భాద్యతను నిర్వహిస్తున్నది?

☑ చిత్రకర్త


వ్యాస జీవిత కథ

వికీపీడియా సహవికీపీడియన్ల సమీక్షలో ఏమి వుంటుంది.

☑ వ్యాస నాణ్యతను వికీపీడియన్లు సమీక్ష చేయటం


నాణ్యమైన వ్యాసానికి కావలసినవి

1. వ్యాసం ప్రవేశిక తర్వాత భాగాలకు శీర్షికలు లేవు.

☑ తప్పు

2. నాణ్యమైన వికీపీడీయా వ్యాసంలో ఉండవలసినవి విషయాలు ఏమిటి?

☑ పరిశీలించతగిన అధారాలు.
☑ తటస్థ దృక్పథం
☑ సంగ్రహం,వివరాలతో కూడిన భాగం, మూలం


కొత్త వ్యాసం సృష్టించుట

మీ కొత్త వ్యాసంలో చేర్చవలసిన మూడు ప్రధానాంశాలు ఏమిటి?

☑ సంగ్రహం, గుర్తింపు ప్రాధాన్యత వివరం, మూలం.

వికీపీడియాను ప్రతిరోజు వాడే లక్షలమందిలో మీరు ఒకరా?

ప్రతిరోజు, ప్రపంచంలోని అన్ని చోట్లనుండి ప్రజలు పాఠశాల ప్రాజెక్టులకు, వ్యాపార ప్రణాళికలకు, వ్యక్తిగత పరిశోధనకు, ప్రణాళికల తయారీకి, ప్రయాణాలకు వికీపీడియాను వాడతారు. కొత్త ఆలోచనల ప్రేరేపణకు, ఊహల మేధోమధనానికి వాడతారు. దూరపు భూభాగాలను, పురాతనసంస్కృతిని, కళలను, పౌర నాయకులను, ఇటీవలి ఘటనల గురించి తెలుసుకొనడానికి వాడుతారు.

ఎవరైనా తరువాతి మెట్టుకి వెళ్లి మానవ జ్ఞానాన్ని పోగుచేయటం, పంచుకోవాలనుకుంటే వికీపీడియా స్వయంశిక్షణ అనే ఈ చిన్నపుస్తకము ఉపయోగపడుతుంది.

అనుపమ తను వికీపీడియాలో ఏ విధంగా మొదటి దిద్దుబాట్లు చేస్తున్నదో గమనించండి. ఆలా మీరు, ముఖ్యమైన ఊహలు, మార్గదర్శకాలు, సమాచారము, ఉపకరణాలు గురించి తెలుసుకొని వికీపీడియాలో కృషి చేయగలుగుతారు.

మరింత సమాచారానికై బుక్ షెల్ఫ్ జాల స్థలం: http://bookshelf.wikimedia.org

వికీమీడియా భారతదేశం చాప్టర్ ( నమోదు చేయబడిన పేరు వికీమీడియా చాప్టర్) ఒక లాభాపేక్ష లేని సంస్థ. సంఘాల నమోదు కార్యాలయం, బెంగుళూరు పట్టణ జిల్లా వద్ద 3 జనవరి 2011 రిజిస్టర్ చెయ్యబడింది. భారతీయులకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం, అటువంటి సాధనాలకు తోడ్పాడటానికి ప్రజల నైపుణ్యాలను మెరుగు పరచేలా చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఇది వికీపీడియా, ఇతర ప్రాజెక్టులు నడిపే వికీమీడియా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తునంది. వికీమీడియా చాప్టర్ కు వికీపీడియా మరియు ఇతర ప్రాజెక్టులలో చేర్చే విషయాలపై ఏ విధమైన నియంత్రణ లేదు. అలాగే ఈ ప్రాజెక్టులు నడిచే సర్వర్లపై నేరు ఆధిపత్యం లేదు.

వికీమీడియా ఫౌండేషన్
149 న్యూ మోంట్గోమరీ స్ట్రీట్, థర్డ్ ఫ్లోర్
శాన్ ఫ్రాన్సిస్కో, సిఎ 94105, యుఎస్ఎ.
వికీమీడియా ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది వికీపీడియా, ఇతర ఉచిత విషయాలుగల వెబ్సైట్లను నడుపుతుంది.


వేరేగా పేర్కొనకబోతే అన్ని బొమ్మలు వికీమీడియాకామన్స్ నుండి సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) లేక ఇతర సార్వజనీయమైన లైసెన్సులతో విడుదల చేయబడినవి. పాఠ్యము క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్ ఎలైక్ లైసెన్స్ v.3.0 లేక దాని తరువాత రూపం(Creative Commons Attribution-ShareAlike License v.3.0) (http://en.wikipedia.org/wiki/Wikipedia:CC-BY-SA) ద్వారా విడుదల చెయ్యబడింది. వికీమీడియా ఫౌండేషన్, ఇలాంటి ఇతర సంస్థల వ్యాపార చిహ్నాలు, గుర్తులు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు లోబడవు. వికీమీడియా ఫౌండేషన్, వికీపీడియా, కామన్స్, మీడియావికీ, విక్షనరీ, వికీబుక్స్, వికీసోర్స్, వికీన్యూస్, వికీఖోట్, వికీవర్శిటీ, వికీస్పిసీస్, మెటా వికీలు నమోదుచేయబడిన లేక నమోదు చేయబడుతున్న వ్యాపార చిహ్నలు.
మరింత సమాచారానికి, మా వ్యాపార చిహ్నాల విధానం (http://wikimediafoundation.org/wiki/Trademark_Policy) చూడండి: ఇతర ప్రశ్నలకు, లైసెన్స్ షరతులకు లేక వ్యాపార చిహ్నాల విధానానికి వికీమీడియా ఫౌండేషన్ న్యాయశాఖకు ఈమెయిల్ (legal@wikimedia.org ) చేయండి. వికీమీడియా భారతదేశం గురించి మరియు ఈ తెలుగు పుస్తకం గురించి సూచనలు చేయదలిస్తే వికీమీడియా భారతదేశానికి ఈ మెయిల్ (chapter@wikimedia.in) చేయండి.

ఇవీ చూడండి[మార్చు]

This work is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 Unported license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.