కురాన్ భావామృతం/అల్-మాయిదా

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ


5. మాయిదా (వడ్డించిన విస్తరి)
(అవతరణ: మదీనా; సూక్తులు: 120)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
విశ్వాసులారా! నియమ నిబంధనలను పూర్తిగా పాటించండి. ఇకముందు మీకు తెలియజేయబోయేవి తప్ప పశువుల్ని పోలిన చతుష్పాదాలన్నీ మీ కోసం (ఆహారంగా) ధర్మసమ్మతం చేయబడ్డాయి. అయితే (హజ్‌దీక్ష)లో ఉన్నప్పుడు మాత్రం వేటాడటాన్ని ధర్మసమ్మతం చేసుకోకండి. దేవుడు తాను తలచుకున్న ఆదేశం జారీచేస్తాడు. (1)
విశ్వాసులారా! దేవునికి సంబంధించిన (ధర్మ) చిహ్నాలను అగౌరపరచకండి. నిషిద్ధ మాసాల్లో ఏ మాసాన్ని ధర్మసమ్మతం చేసుకోకండి. బలిపశువుల్ని కొట్టకండి. దేవునికి అర్పించడానికి మొక్కుబడి సూచనగా మెడలలో పట్టెడలు కట్టిన పశువుల్ని కూడా బాధించకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహం, ప్రసన్నతలను పొందే ఉద్దేశ్యంతో ప్రతిష్ఠాలయానికి (కాబాగృహానికి) పోయేవారి జోలికి కూడా పోకండి. ఇహ్రాం (దీక్ష) ముగిసిన తరువాత మీరు నిరభ్యంతరంగా (పశుపక్షాదులను) వేటాడవచ్చు.
జాగ్రత్త! కొందరు మిమ్మల్ని ప్రతిష్ఠాలయానికి పోకుండా నిరోధించారన్న ఆగ్రహంతో మితిమీరి వారిపై దౌర్జన్యం చేయకూడదు సుమా! సత్కార్యాల్లో, దైవభక్తికి సంబం ధించిన పనుల్లో పరస్పరం సహకరించుకోండి. అంతేగాని, పాపకార్యాల్లో, హింసాదౌర్జ న్యాల్లో మాత్రం ఎవరితోనూ సహకరించకూడదు. దేవునికి భయపడండి. ఆయన (నేరస్థుల్ని) చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి. (2)
తమంతట తాము చచ్చిన పశుపక్షులు, రక్తం, పందిమాంసం, దైవేతరుల పేరుతో కోయబడిన పశుపక్షులు, ఊపిరాడక లేదా దెబ్బతిని లేదా ఎత్తు ప్రదేశం నుండి పడి చచ్చిన జంతువులు మీకు నిషేధించబడ్డాయి. సజీవంగా ఉండగానే మీరు దేవుని పేరుతో కోసినవి తప్ప కుమ్మడం వల్ల, క్రూరమృగం దాడితో మృతిచెందిన పశువులు కూడా నిషేధించబడ్డాయి. ఇంకా విగ్రహాల ముందు (ఇతర దైవేతర చిహ్నాల ముందు) బలివ్వబడిన పశువులు కూడా నిషేధించబడ్డాయి. పాచికల ద్వారా జాతకం తెలుసు కునే పద్ధతి కూడా నిషేధించబడింది. ఇవన్నీ పాపకార్యాలు. (వీటిని మానేయండి.)
సత్యతిరస్కారులు మీ ధర్మం గురించి ఇప్పుడు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కనుక మీరు వారికి ఏమాత్రం భయపడకండి. నాకే భయపడండి. నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను. (కనుక ఇకనుంచి ఈ నిషేధితాల జోలికి పోకండి.) అయితే తీవ్రమైన ఆకలితో ఉండి మరోదారి లేనప్పుడు, వీటిలో దేన్నయినా పాపం చేసే ఉద్దేశ్యం లేకుండా కొద్దిగా తింటే పరవాలేదు. దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు. (3)
ప్రజలు తమకు ఏఏ వస్తువులు ధర్మసమ్మతం చేయబడ్డాయని అడుగుతున్నారు. వారికి చెప్పు, మీ కోసం పరిశుద్ధ వస్తువులన్నీ ధర్మసమ్మతం చేయబడ్డాయి. దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానంతో మీరు శిక్షణ ఇచ్చిన వేటజంతువులు మీ కోసం పట్టిచ్చే జీవాలను కూడా మీరు తినవచ్చు. అయితే వేట కోసం వేటజంతువుల్ని వదిలేటప్పుడు దేవుని పేరు స్మరించి వదలిపెట్టండి. దేవునికి ఎల్లప్పుడూ భయపడుతూ ఉండండి. దేవుడు త్వరలోనే (కర్మలను గురించి) విచారణ జరుపుతాడు. (4)
ఈరోజు మీకు పరిశుద్ధ వస్తువులన్నీ ధర్మసమ్మతం చేయబడ్డాయి. గ్రంథప్రజల ఆహారం మీకు, మీ ఆహారం గ్రంథప్రజలకు ధర్మసమ్మతం చేయబడింది. శీలవతులైన ముస్లిం స్త్రీలు, గ్రంథప్రజలకు చెందిన శీలవతులు కూడా (వివాహానికి) మీకు ధర్మ సమ్మతం చేయబడ్డారు. కాకపోతే వారికి చెల్లించవలసిన మహర్‌సొమ్ము చెల్లించి, వారిని వివాహబంధంలో సురక్షితంగా ఉంచాలి. అంతేగాని, వారితో విచ్చలవిడిగా కామక్రీడలకు పాల్పడటంగాని, దొంగచాటుగా అక్రమసంబంధాలు పెట్టుకోవడంగాని చేయకూడదు. సత్యాన్ని విశ్వసించడానికి నిరాకరిస్తే మనిషి తన జీవితంలో సాధించినదంతా వ్యర్థమవు తుంది. చివరికి అతను పరలోకంలో ఘోరంగా నష్టపోతాడు. (5)
విశ్వాసులారా! ప్రార్థన చేయడానికి సిద్ధమైనప్పుడు ముందుగా మీరు ముఖాన్ని, మోచేతులదాకా చేతుల్ని కడుక్కోండి; తలను తడిచేత్తో స్పర్శించండి; కాళ్ళు చీలమండల దాకా కడుక్కోండి. (వీర్యస్ఖలనం వల్ల) అశుద్ధావస్థ ఏర్పడితే శుభ్రంగా తలంటు స్నానం చేయండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులయితే, లేదా ప్రయాణావస్థలో ఉంటే, లేదా మలమూత్ర విసర్జన చేస్తే, లేదా స్త్రీని కలుసుకుంటే- అప్పుడు నీళ్ళు దొరకని పక్షంలో పరిశుభ్రమైన మట్టి ఉపయోగించండి. అంటే మట్టిపై చేతులు తట్టి వాటితో ముఖం, చేతులు రుద్దుకోండి. దేవుడు మీ జీవితాన్ని దుర్భరం చేయగోరడం లేదు. మీరు కృతజ్ఞులై ఉండేందుకు ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచి, మీకు తన అనుగ్రహాలను పూర్తిగా ప్రసాదించదలిచాడు. (6)
దేవుడు మీకు చేసిన మేలు గుర్తుంచుకోండి. ఆయన మీచేత చేయించిన వాగ్దానం, ప్రమాణాలు కూడా మరచిపోకండి. అంటే ‘మేము విన్నాం, విధేయులయ్యాం’ అని మీరు మాటిచ్చారు. దాన్ని నిలబెట్టుకోండి. దేవునికి భయపడుతూ మసలుకోండి. మీ అంతరంగాల్లో దాగివుండే రహస్యాలు సైతం ఆయనకు తెలుసు. (7)
విశ్వాసులారా! దేవుని కోసం నీతి నిజాయితీలకు కట్టుబడిఉంటూ, న్యాయమైన సాక్ష్యం ఇవ్వండి. ఇతరులపట్ల విరోధం ఉన్నాసరే మీరు న్యాయానికి తిలోదకాలు ఇవ్వ కూడదు. ఎల్లప్పుడూ న్యాయంగానే వ్యవహరించాలి. దైవభీతిపరాయణత అంటే అదే. ప్రతి విషయంలోనూ దేవుని పట్ల భయభక్తులతో మసలుకోవాలి. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి, వారి పొరపాట్లు మన్నించబడతా యని, వారికి గొప్పప్రతిఫలం లభిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవిశ్వాసు లయి దేవుని సూక్తులు తిరస్కరించేవారు మాత్రం నరకానికి పోతారు. (8-10)
విశ్వాసులారా! (ఇటీవల) దేవుడు మీకు చేసిన మేలును ఓసారి జ్ఞాపకం చేసు కోండి. అప్పుడు ఒక వర్గం మీపై దౌర్జన్యం చేయడానికి నిశ్చయించుకుంది. కాని దేవుడు వారి చేతుల్ని మీపైకి లేవకుండా నిరోధించాడు. కనుక దేవునికి భయపడుతూ మసలు కోండి. (ఆయన్నే నమ్ముకోండి.) విశ్వాసులు దేవుడినే నమ్ముకోవాలి. (11)
దేవుడు ఇస్రాయీల్‌సంతతి చేత ప్రమాణం చేయించాడు. వారిలో (ఉన్న పన్నెండు తెగలకు) మేము పన్నెండుమంది నాయకుల్ని నియమించాము. తర్వాత దేవుడిలా అన్నాడు: “నేను మీకు తోడుగా ఉంటాను. అయితే మీరు నమాజ్‌ చేస్తుండాలి. జకాత్‌ చెల్లించాలి. నేను పంపే ప్రవక్తలను విశ్వసించి వారికి సహకరించాలి. దేవునికి శ్రేష్ఠమైన రుణం ఇవ్వాలి. ఇలా నడచుకుంటే నేను మీలో ఉన్న చెడుల్ని తొలగించి మిమ్మల్ని సెలయేరులు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాను. అయితే ఆ తర్వాత మీలో ఎవరైనా అవిశ్వాసవైఖరి అవలంబిస్తే మాత్రం అతను సన్మార్గం తప్పినట్లే.” (12)
అసలు వారు తమ ప్రమాణం ఉల్లంఘించిన కారణంగానే మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసిరివేసి, వారి హృదయాలను కఠినం చేశాము. చివరికి వారిప్పుడు దైవవాక్కుల్ని తారుమారు చేసే స్థితికి దిగిజారిపోయారు. తమకు బోధించిన ఉపదేశాల్లో అత్యధిక భాగం విస్మరించారు. వారు పాల్పడుతున్న మోసాల్లో ఏదో ఒకటి ఈనాడు కూడా నీ దృష్టికి వస్తూనేఉంది. వారిలో బహుకొద్ది మంది మాత్రమే ఈ బలహీనతకు దూరంగా ఉన్నారు. కనుక వారిని క్షమించు. వారి చేష్టలను గురించి అంతగా పట్టించుకోకు. దేవుడు సహృదయులనే ప్రేమిస్తాడు. (13)
అలాగే “మేము సహాయకులం” అన్నవారి చేత కూడా మేము ప్రమాణం చేయించాము. వారు కూడా మేము బోధించిన ఉపదేశాల్లో అత్యధిక భాగం విస్మ రించారు. చివరికి మేము వారి మధ్య ప్రళయం దాకా శత్రుభావం ఉండేలా వారి హృద యాలలో పరస్పరం విద్వేషబీజాలు నాటాము. వారు ఇహలోకంలో ఏం చేస్తుండేవారో దేవుడు ఒకరోజు తప్పకుండా వారి దృష్టికి తీసుకువస్తాడు. (14)
గ్రంథప్రజలారా! మా ప్రవక్త మీ దగ్గరకు వచ్చాడు. మీరు దైవగ్రంథంలో (లేకుండా) దాచిన అనేక విషయాలు అతను మీముందు వెల్లడిస్తున్నాడు. కొన్ని విషయాల్ని గురించి మిమ్మల్ని ఉపేక్షిస్తున్నాడు కూడా. దేవుని వైపు నుండి మీ దగ్గరకు (అజ్ఞానాంధకారం దూరంచేసే) జ్యోతి వచ్చింది. (సన్మార్గం చూపే) దేదీప్యమానమైన దివ్యగ్రంథం కూడా వచ్చింది. దీనిద్వారా దేవుడు తన ప్రసన్నతాభాగ్యం కోరుకునేవారికి ముక్తిమార్గం చూపుతాడు. అదీగాక ఆయన తన అనుగ్రహంతో వారిని కారుచీకట్ల నుండి కాంతి వైపు తీసుకువెళ్తాడు; (అపమార్గం నుండి తీసి) రుజుమార్గంలో నడిపిస్తాడు. (15-16)
మర్యం కుమారుడు మసీహ్‌యే దేవుడు అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసులై పోయారు. ముహమ్మద్‌ (సల్లం)! “దేవుడు గనక మర్యం కుమారుడు మసీహ్‌ని, అతని తల్లిని, భూలోకంలో ఉన్న వారందర్నీ చంపదలచుకుంటే ఆయన నిర్ణయాన్ని అడ్టుకోగల ధైర్యం ఎవరికయినా ఉందా?” అని అడుగు. భూమ్యాకాశాలకు, భూమిపై ఉన్నవాటికి, ఆకాశంలో ఉన్నవాటికి దేవుడే యజమాని. ఆయన తాను కోరినదాన్ని సృష్టిస్తాడు. ఆయన ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వ శక్తిమంతుడు. (17)
యూదులు, క్రైస్తవులు తాము దేవుని బిడ్డలమని, ఆయనకు ప్రియమైన వారమని అంటారు. “మరి ఆయన మీరు చేసే పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు?” అని వారిని అడుగు. నిజానికి మీరు కూడా దేవుడు సృష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే. దేవుడు తానుతలచిన విధంగా కొందరిని క్షమిస్తాడు; మరికొందరిని శిక్షిస్తాడు. భూమ్యాకాశాలు, వాటికి సంబంధించిన సమస్తం దేవునివే. చివరికి అందరూ (ఓరోజు) ఆయన సన్నిధికే మరలి పోవలసి ఉంది. (18)
గ్రంథప్రజలారా! దైవప్రవక్తల ఆగమనం ఆగిపోయి ఓ సుదీర్ఘకాలం గడచి పోయింది. అలాంటి పరిస్థితిలో మాఈ ప్రవక్త ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నిజధర్మం గురించిన విషయాలు మీకు బోధిస్తున్నాడు. ఇక మీరు శుభవార్త అందజేసే, హెచ్చరించే ప్రవక్త ఎవరూ రాలేదే అని సాకులు చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. శుభవార్త నందజేసే, హెచ్చరించేవాడు వచ్చేశాడు. (మా బాధ్యత తీరిపోయింది.) దేవుడు ప్రతి విషయంపై అధికారంగల అసాధారణ శక్తిసంపన్నుడు. (19)
మూసా (అ) తన జాతిప్రజలకు చేసిన హితబోధ గుర్తుకుతెచ్చుకో. అతను వారితో ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! మీకు దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన మీలో ఒక ప్రవక్తను ప్రభవింపజేసి, మిమ్మల్ని రాజ్యాధినేతలుగా చేశాడు. ఆయన మీకు ప్రపంచంలో ఏజాతికీ ప్రసాదించనిదయ్యెత్తాన్ని (వైభవోన్నతుల్ని) ప్రసాదించాడు. కనుక సోదరులారా! దేవుడు మీకు రాసిపెట్టిన ఈ పవిత్రభూభాగం (పాలస్తీనా)లో ప్రవే శించండి. వెనక్కి మరలకండి. అలాచేస్తే మీరు ఘోరంగా నష్టపోతారు.” (20-21)
దానికి వారిలా సమాధానమిచ్చారు: “మూసా! అక్కడ భయంకరమైన మనుషు లున్నారు. వారా ప్రాంతం నుండి వెళ్ళిపోనంత వరకూ మేమక్కడికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళం. వారక్కడ్నుంచి వెళ్ళిపోతే మేము పోవడానికి సిద్ధమే.” (22)
అలా భయపడిన వారిలోనే దైవానుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులున్నారు. వారు కల్పించుకొని “ఆ భయంకరుల్ని ఎదుర్కోవడానికి మీరు ప్రధానద్వారం గుండా ప్రవేశిం చండి. మీరు లోపలికి ప్రవేశిస్తేచాలు, విజయం మిమ్మల్ని వరించినట్లే. మీరు విశ్వాసులే అయితే దేవునిపై భారంవేసి ముందుకు సాగండి”అని అన్నారు. (23)
కాని వారు (దానికి అంగీకరించకుండా) “మూసా! వారక్కడ ఉన్నంతవరకు మేము ఎన్నటికీ వెళ్ళం. కావాలంటే నీవు, నీప్రభువు ఇద్దరూ వెళ్ళి (వారితో) తలపడండి. మేము మాత్రం ఇక్కడే ఉండిపోతాం” అన్నారు (తలబిరుసుతో). (24)
అప్పుడు మూసా (అలై) దేవుడ్ని ప్రార్థిస్తూ “ప్రభూ! నా చేతిలో ఏమీ లేదు. నాపై, నా సోదరునిపై మాత్రమే నాకు అధికారం ఉంది. అందువల్ల దేవా! మమ్మల్నిద్దరినీ ఈ దుర్మార్గుల నుండి వేరుచెయ్యి” అని అన్నాడు. (25)
దానికి దేవుడు “సరే, వారికీ దేశాన్ని నలభై యేండ్లపాటు నిషేధించాను. ఇక వారు ప్రపంచంలో ఏఒక్కచోటా నిలువనీడ దొరక్క కాళ్ళుకొట్టుకుంటూ తిరుగుతారు. ఈ దుర్మార్గుల దుస్థితి పట్ల నీవు విచారపడకు” అని చెప్పాడు. (26)
ముహమ్మద్‌! వీరికి కాస్త ఆదం కొడుకులిద్దరి గాధ విన్పించు. వారిద్దరు (ఒక పశువుని) బలిచ్చారు. వారిలో ఒకని బలి మాత్రమే స్వీకరించబడింది. రెండోవాని బలి స్వీకరించబడలేదు. దాంతో అతను (చిర్రెత్తిపోయి) “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు.
దానికి రెండోవాడు ఇలా అన్నాడు: “దేవుడు భయభక్తులు కలవారి మొక్కుబడినే స్వీకరిస్తాడు. నీవు నన్ను చంపడానికి చెయ్యెత్తితే నేను మాత్రం నిన్ను చంపడానికి చెయ్యెత్తను. నేను సర్వలోక ప్రభువయిన దేవునికి భయపడుతున్నాను. నా పాపం, నీ పాపం అంతా నువ్వే మూటకట్టుకొని నరకంలోకి పోయిపడు. అదే దుర్మార్గులకు తగిన ప్రతిఫలం. నేను కోరేది కూడా అదే.” (27-29)
చివరికి అతని (దుష్ట) మనస్సు అతని సోదరుడ్ని వధించడానికి ప్రేరేపించింది. అతను తన సోదరుడ్ని హతమార్చివేశాడు. ఈ విధంగా అతను నష్టపోయినవారిలో చేరిపోయాడు. ఆతర్వాత దేవుడు ఓ కాకిని పంపాడు. ఆ కాకి అతనికి అతని సోదరుడి శవాన్ని ఎలా పూడ్చిపెట్టాలో చూపడానికి నేలను త్రవ్వడం ప్రారంభించింది. అది చూసి అతను “అయ్యయ్యో! నా సోదరుడి శవాన్ని ఎలా పూడ్చిపెట్టాలో తెలియలేదే! నాకు ఆ కాకికున్నంత జ్ఞానం కూడా లేకపోయిందే!!” అని బాధపడ్డాడు. ఆ తరువాత అతను తాను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. (30-31)
ఈ (హత్య) కారణంగానే మేము ఇస్రాయీల్‌ సంతతివారికి ఇలా ఒక ఉత్తర్వు జారీచేశాం:“ఎవరైనా ప్రతీకార హత్య(శిక్ష)గా లేక ధరణిపై కల్లోలం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషినైనా చంపితే అతను యావత్తు మానవాళిని చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళిని కాపాడినట్లే.” (ఈ ఆజ్ఞ జారీ చేసినప్పటికీ వారి పరిస్థితి మారలేదు) మా ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరు అనేకమంది వారి దగ్గరకు స్పష్టమైన హితోక్తులు తీసుకొచ్చారు. అయినా వారిలో ఇప్పటికీ అత్యధికమంది ప్రపంచంలో హద్దుమీరి ప్రవర్తించేవారే ఉన్నారు. (32)
దేవునికి ఆయనప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడేవారికి, ధరణిలో కలహాలు రేకెత్తిస్తూ తిరిగేవారికి శిక్షగా వారిని హతమార్చాలి; లేదా ఉరికంబం ఎక్కించాలి; లేదా ఒక చేయి, దానికి అభిముఖంగా వున్న ఒక కాలు నరికివేయాలి; లేదా దేశబహిష్కరణ చేయాలి. ఇవి ఇహలోకంలో వారికి లభించే అవమానం, అప్రతిష్ఠలు. పరలోకంలో ఇంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది. అయితే మీ స్వాధీనంలోకి రాకముందే వారు తాము చేసిన నిర్వాకానికి పశ్చాత్తాపంచెంది తమ నడవడికను సరిదిద్దుకుంటే (ఇక వారి జోలికి పోకూడదు.) దేవుడు క్షమించేవాడని, కరుణించేవాడని తెలుసుకోండి. (33-34)
విశ్వాసులారా! దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సాన్నిధ్యం పొందే మార్గం అన్వేషించండి. ఆయన మార్గంలో (సత్యవ్యతిరేక శక్తులతో) నిరంతరం పోరాడుతూ ఉండండి, మీ జీవితం సార్థకమవుతుంది. (35)
సత్యాన్ని తిరస్కరించినవారు తమ దగ్గర భూమండలమంత సిరిసంపదలుండి, ఇంకా అంతకు రెట్టింపు సంపదలు ఉండి, ప్రళయదినం శిక్ష నుండి తప్పించుకోవడానికి దాన్నంతా పాపపరిహారంగా ఇచ్చివేయ దలచుకున్నా సరే, దాన్ని స్వీకరించడం జరగదు. వారికి వ్యధాభరితమయిన శిక్ష పడితీరుతుంది. వారు నరకాగ్ని నుండి బయటపడాలని ఎంత గింజుకున్నా దాన్నుండి బయటపడలేరు. వారా నరక యాతలోనే మగ్గుతూ శాశ్వతంగా పడి వుండవలసి ఉంటుంది. (36-37)
స్త్రీ అయినా, పురుషుడైనా దొంగతనం చేస్తే ఇద్దరికీ చెయ్యి నరికివేయండి. ఇది వారు సంపాదించుకున్న దానికి ప్రతిఫలం. దేవుని తరఫున కనువిప్పు కలిగించే శిక్ష. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఎంతో వివేకవంతుడు. అయితే తప్పు చేసిన తర్వాతయినా పశ్చాత్తాపం చెంది తమ నడవడిక సరిదిద్దుకుంటే, దేవుడు గొప్ప క్షమాశీలి, అపార కృపాశీలుడని తెలుసుకోండి. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి దేవుడే అధిపతి అని మీకు తెలియదా? ఆయన తాను తలచిన విధంగా కొందరిని శిక్షిస్తాడు, కొందరిని క్షమిస్తాడు. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (38-40)
ప్రవక్తా! సత్యతిరస్కారంలో కొట్టుకుపోయేవారిని గురించి నీవు చింతించకు. వారు పైకి తాము విశ్వసించామని చెప్పుకుంటారు. కాని వారి హృదయాల్లో విశ్వాసం నాటుకో లేదు. అలాంటివారు కొందరు యూదుల్లో కూడా ఉన్నారు. వారు అసత్య విషయాలంటే చెవి కోసుకుంటారు. నీదగ్గరకు ఎప్పుడూ రానివారిని పెడత్రోవ పట్టించే ఉద్దేశ్యంతో వారు దొంగచాటుగా నీ మాటలు వింటారు. దైవగ్రంథంలో విషయాలు సందర్భాను సారం ఉన్నప్పటికీ వారు వాటి అసలు అర్థాన్ని మార్చివేస్తారు.
వారు (అమాయక) జనంతో “ఈవిధమైన ఆజ్ఞ ఇస్తే అంగీకరించండి, లేకపోతే అంగీకరించకండి” అంటారు. ఒక వ్యక్తిని దేవుడే పరీక్షకు గురిచేసి దారి తప్పించదలచు కుంటే, ఇక అతడ్ని దేవుని పట్టు నుండి తప్పించడానికి నీవు ఏం చేసినా ప్రయోజనం లేదు. దేవుడు వారి హృదయాల్ని పరిశుద్ధం చేయదలచుకో లేదు. వారికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో ఘోర యాతనలు తప్పవు. (41)
వీరసలు అసత్య విషయాలు వినడానికి చెవి కోసుకుంటారు. అక్రమార్జన కోసం వెంపర్లాడుతారు. కనుక వీరు నీదగ్గరికి వస్తే వారి వ్యవహారాన్ని నీకు ఇష్టమైతే పరిష్క రించు లేదా తిరస్కరించు. ఆ మేరకు నీకు అధికారం ఇవ్వబడుతోంది. వ్యతిరేకిస్తే వారు నీకేమాత్రం నష్టం కలిగించలేరు. ఒకవేళ పరిష్కరించదలచుకుంటే న్యాయంగా, నిష్పక్ష పాతంగా పరిష్కరించు. దేవుడు న్యాయంగా వ్వవహరించేవారినే ప్రేమిస్తాడు. (42)
అయినా వారు నిన్ను న్యాయనిర్ణేతగా ఎలా చేసుకుంటారు? వారి దగ్గర తౌరాత్‌ గ్రంథం ఉందికదా! అందులో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. వాటికి విముఖులై నీ దగ్గరకు రావలసిన పనేమిటీ? అసలు వారిలో (సత్యం పట్ల) విశ్వాసమే లేదు. (43)
మేము కాంతి, సన్మార్గం గల తౌరాత్‌ అవతరింపజేశాము. దేవునికి విధేయులైన ప్రవక్తలందరూ దాని ప్రకారమే యూదుల వ్యవహారాలు పరిష్కరిస్తుండేవారు. అలాగే ధర్మవేత్తలు, ధర్మశాస్త్రనిపుణులు కూడా. వారికే గ్రంథపరిరక్షణ బాధ్యత ఇవ్వబడింది. దానికి వారే సాక్షులుగా ఉన్నారు. కనుక మీరు ప్రజలకు భయపడకండి. నాకే భయ పడండి. నా సూక్తుల్ని స్వల్పమూల్యానికి అమ్ముకోవడం మానేయండి. వినండి, దేవుడు నిర్దేశించిన చట్టం ప్రకారం పరిష్కారం చేయనివారే సత్యతిరస్కారులు. (44)
తౌరాత్‌లో మేము యూదులకు ఈ ఉత్తర్వు జారీచేశాము: “ప్రాణానికి బదులు ప్రాణం, కంటికి బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను, అలాగే సమస్తగాయాలకు బదులు అలాంటిగాయాలే. అయితే ఎవరైనా ప్రతీకారం చేయకుండా క్షమిస్తే, అది అతని పాపాలకు పరిహారమవుతుంది.” వినండి, దేవుడు నిర్దేశించిన చట్టంప్రకారం పరిష్కారం చేయనివారే దుర్మార్గులు. (45)
ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యం కుమారుడు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం నుండీ వున్న తౌరాత్‌ను ధృవీకరించేవాడు. అతనికి మేము కాంతి, సన్మార్గం గల ఇన్జీల్‌ని ప్రసాదించాం. అది కూడా గతంలో వచ్చిన తౌరాత్‌ను ధృవీకరి స్తుంది. అది దైవభీతిపరుల పాలిట వెలుగుబాట, హితోపదేశం. ఇన్జీల్‌ప్రజలు అందులో దేవుడు నిర్దేశించిన చట్టం ప్రకారమే పరిష్కరించుకోవాలని మేము ఆదేశించాం. కనుక దేవుడు నిర్దేశించిన చట్టం ప్రకారం పరిష్కారం చేయనివారే దుర్జనులు. (46-47)
చివరికి మేము సత్యపూరితమైన ఈ గ్రంథం నీపై అవతరింపజేశాం. ఇది ఇంతకు పూర్వం వచ్చిన దివ్యగ్రంథాలను ధృవీకరిస్తోంది. వాటన్నిటి సారాంశం కలిగి ఉంది. కనుక నీవు దేవుడు నిర్దేశించిన చట్టం ప్రకారమే ప్రజల వ్యవహారాలు పరిష్కరించు. నీ దగ్గరకు వచ్చిన సత్యాన్ని వదిలేసి వారి మనోకాంక్షలను అనుసరించకు.
మేము మీలో ప్రతి సముదాయానికి ఓ ప్రత్యేక ధర్మశాస్త్రాన్ని, ఓ ప్రత్యేక ఆచరణ విధానాన్ని నిర్ణయించాం. దేవుడు తలచుకుంటే మిమ్మల్నందర్నీ ఒకే సముదాయంగా కూడా చేయగలడు. కాని ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి విభిన్న సముదాయాలుగా చేశాడు. కనుక మీరు సత్కార్యాల్లో ఒకర్నొకరు మించిపోవడానికి ప్రయత్నించండి. చివరికి మీరంతా దేవుని సన్నిధికే చేరుకోవలసి ఉంది. తర్వాత మీరు ఏ విషయాల్లో పరస్పరం విభేదించుకున్నారో వాటి వాస్తవికతను ఆయన మీకు తెలియజేస్తాడు. (48)
కనుక ప్రవక్తా! నీవు దేవుడు నిర్దేశించిన చట్టంప్రకారమే వారి వ్యవహారాలు పరిష్క రించు. వారి మనోకాంక్షల్ని అనుసరించకు. జాగ్రత్త! దేవుడు నీపై అవతరింపజేసిన సంవిధానం నుండి తప్పించడానికి వారు నిన్ను రకరకాలుగా ప్రలోభ పెట్టవచ్చు. వారి కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారు గనక విముఖులైతే, ఒక విషయం తెలుసుకో, వారు చేసిన కొన్ని ఘోరపాపాలకు దేవుడు వారిపై ఆపద పడవేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. వారిలో చాలామంది దుర్జనులే ఉన్నారు. వీరు (దైవచట్టం కాదని) మూఢకాలంనాటి అనాగరిక పద్ధతులు కోరుతున్నారా? దేవుడ్ని విశ్వసించినవారి దృష్టిలో దేవుని చట్టం తప్ప మరెవరి చట్టం శ్రేష్ఠమైనదవుతుంది? (49-50)
విశ్వాసులారా! యూదుల్ని, క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోకండి. వారు పరస్ప రం స్నేహితులు. మీలో ఎవరైనా వారితో స్నేహంచేస్తే అతను కూడా వారిలో ఒకడిగా లెక్కించబడతాడు. హద్దుమీరిన దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (51)
హృదయాల్లో (కాపట్య) రోగం ఉన్నవారు పరుగుపరుగున వెళ్ళి వారితో కలసి పోవడం నీవు చూస్తూనే ఉన్నావు. వారంటారు: “ఖర్మకాలి మనమేదైనా ఆపదలో చిక్కుకో బోవడం లేదుకదా!” అని. దేవుడు మీకు త్వరలోనే విజయభాగ్యం ప్రసాదించవచ్చు; లేదా తన దగ్గర్నుంచి ఏదైనా ఆజ్ఞనయినా (అవతరింపజేయవచ్చు). అప్పుడు వీరు తమ మనసుల్లో దాచిన విషయం పట్ల పశ్చాత్తాపపడతారు. విశ్వాసులు (వారి నిజస్వరూపం చూసి ఆశ్చర్యపోతూ) “దేవునిపేర పెద్దపెద్ద ప్రమాణాలు చేసి ‘మేము మీతోనే ఉన్నాం’ అని ఎంతో నమ్మకంగా చెప్పినవారు వీరేనా?” అని అంటారు. ఇలా కపటవిశ్వాసుల కర్మలన్నీ కాలిపోయి చివరికి వారు ఉత్త చేతులతో మిగిలిపోతారు. (52-53)
విశ్వాసులారా! మీలో ఎవరైనా తామిప్పుడు అనుసరిస్తున్న ధర్మం నుండి వెనక్కి మరలితే (మరలిపోనివ్వండి), దేవుడు (అంతకంటే మంచివాళ్ళు) చాలామందిని పుట్టిస్తాడు. వారు దేవుడ్ని ఎంతగానో ప్రేమిస్తారు. దేవుడు కూడా వారిని ప్రేమిస్తాడు. అదీగాక వారు తోటివిశ్వాసుల విషయంలో మృదువుగా, అవిశ్వాసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. దైవమార్గంలో నిరంతరం పోరాటం జరుపుతారు. నిందించే వారి నిందలకు ఏమాత్రం బెదిరిపోరు. ఇది దేవుని అనుగ్రహం, తాను కోరినవారికి అను గ్రహిస్తాడు. ఆయన విశాలహృదయుడు, సర్వజ్ఞాన సంపన్నుడు. (54)
మీకు మిత్రులంటూ ఎవరైనా ఉంటే వారు దేవుడు, దైవప్రవక్త, ఆ తరువాత నమాజ్‌ నెలగొల్పే, జకాత్‌ చెల్లించే, దేవుని ముందు మోకరిల్లే విశ్వాసులు మాత్రమే. దేవుడ్ని, ఆయన ప్రవక్తను, విశ్వాసుల్ని మిత్రులుగా చేసుకునేవారు దేవుని పక్షానికే విజయం వరిస్తుంద’ని తెలుసుకోవాలి. (55-56)
విశ్వాసులారా! మీకు పూర్వం దివ్యగ్రంథాలు ప్రసాదించబడిన వారిలో మీ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నవారిని, ఇతర అవిశ్వాసుల్ని మీరు స్నేహితులుగా చేసుకో కండి. మీరు నిజంగా విశ్వసించిన వారయితే దేవునికి భయపడి, ఆయన ఆజ్ఞల్ని పాటించండి. మీరు నమాజు కోసం (అజాన్‌) పిలుపు నిస్తే వారు దాన్ని వెక్కిరింపులతో హేళన చేస్తారు. దానికి కారణం వారికి ఇంగిత జ్ఞానం లేకపోవడమే. (57-58)
వారిని అడుగు: “గ్రంథప్రజలారా! మేము (సర్వలోక ప్రభువయిన) దేవుడ్ని, మా ముందిప్పుడు అవతరించినదాన్ని (అంటే ఖుర్‌ఆన్‌ని), మాకు పూర్వం అవతరించిన వాటిని విశ్వసించామనేకదా మీరు మామీద మండిపడుతున్నారు? (మరి మీ సంగతే మిటి?) మీలో ఉన్నది చాలామంది దుర్జనులే కదా?” (59)
ఈసంగతి కూడా అడుగు: “దేవుని దగ్గర అంతకంటే కూడా అధముల్ని, అత్యంత దారుణఫలితం పొందేవారిని మీకు చూపనా? వారే దైవశాపగ్రస్తులు. దైవాగ్రహం వారిపై విరుచుకుపడింది. వారిలో అనేకమంది కోతులుగా, పందులుగా మార్చబడ్డారు. షైతాన్‌ కు బానిసలయి (వాడి చేతిలో కీలుబొమ్మలుగా మారి)నవారు అంతకంటే నీచంగా దిగ జారిపోయారు. వారు సన్మార్గానికి బహుదూరంగా పోయి తచ్చాడుతున్నారు.” (60)
వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు, తాము విశ్వసించామని అంటారు. కాని వారు తమ అంతరంగాల్లో అవిశ్వాసం నింపుకువచ్చారు. అవిశ్వాసాన్నే తిరిగి తీసుకొనివెళ్తారు. వారు ఎంతో రహస్యంగా ఉంచామనుకున్న విషయాలు కూడా దేవునికి తెలుసు. (61)
నీవు చూస్తూనేవున్నావు, వారిలో చాలామంది పాపకార్యాలు, హింసాదౌర్జాన్యాలు, అన్యాయం, అక్రమాలు చేయడానికే అనుక్షణం పరుగులు పెడతారు. అక్రమ సంపాద నతో కడుపు నింపుకుంటారు. వీరు ఎంతటి ఘోరమైన వికృతచేష్టలకు పాల్పడుతు న్నారు! వారి పండితులు, ధర్మవేత్తలు వారిని పాపకార్యాల నుండి, అక్రమ సంపాదనల నుండి ఎందుకు వారించరు? వీరు చేస్తున్నది కూడా చాలా చెడ్డపనే. (62-63)
యూదులు “దేవుని చేతులు కట్టివేయబడ్డాయి”అంటారు. వారి చేతులే కట్టివేయ బడ్డాయి. ఇలాంటి కారుకూతల వల్లే వారిపై (దైవ)శాపం విరుచుకుపడింది. దేవుని చేతులు నిక్షేపంగా తెరిచే ఉన్నాయి. ఆయన తాను తలచినవారికి తలచుకున్నంత అనుగ్రహిస్తాడు. నీ ప్రభువు నుండి నీపై అవతరించిన ఈ వాణి వారిలో చాలామంది ప్రజల అవిశ్వాసం, తలబిరుసుతనాలు మరింత ముదిరిపోవడానికే కారణభూతమైంది. అంచేతనే మేము ప్రళయందాకా ఉండేలా వారి మధ్య విరోధం, విద్వేషాలు నాటాము. వారు (ప్రపంచంలో) యుద్ధజ్వాలలు రగిల్చినప్పుడల్లా దేవుడు వాటిని చల్లార్చవలసి వస్తున్నది. వారు ఎల్లప్పుడూ ధరణిపై ఏదోఒక ఉపద్రవం సృష్టించడానికే ప్రయత్ని స్తుంటారు. దేవుడు ఇలాంటి కలహకారుల్ని ఎన్నటికీ ప్రేమించడు. (64)
గ్రంథప్రజలు (దుశ్చర్యలకు పోకుండా) సత్యాన్ని విశ్వసించి, భయభక్తుల వైఖరి అవలంబిస్తే మేము వారి పాపాలు క్షమించి, వారిని సుఖసంతోషాలతో కూడిన స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాం కదా! వారు తౌరాత్‌ని, ఇన్జీల్‌ని, వారివద్దకు వారిప్రభువు నుండి వచ్చిన ఇతర గ్రంథాలను పాటించివుంటే ఎంత బాగుండేది!! అలా చేసివుంటే వారికోసం ఆహారం పైనుండి వర్షించివుండేది, క్రిందినుండీ ఉప్పొంగివుండేది. వారిలో కొందరు సజ్జనులు లేకపోలేదు. కాని వారిలో అత్యధికమంది దుర్జనులే ఉన్నారు. (65-66)
ప్రవక్తా! ఏమైనప్పటికీ నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలు వారికి అంద జేస్తూవుండు. నీవలా చేయకపోతే దౌత్యబాధ్యతను నెరవేర్చని వాడవవుతావు. (ఈ పనిలో నీవు ఎలాంటి భయాందోళనలకు గురికానవసరం లేదు.) దేవుడే నిన్ను ప్రజల కీడు నుండి కాపాడుతాడు. దేవుడు అవిశ్వాసులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (67)
వారికిలా చెప్పు: “గ్రంథప్రజలారా! తౌరాత్‌ని, ఇన్జీల్‌ని, మీ ప్రభువు నుండి మీ దగ్గరకు అవతరించిన ఇతర గ్రంథాలను అనుసరించనంతవరకూ మీరు ఏవిధంగానూ సన్మార్గంలో ఉన్నట్లు పరిగణించబడరు.” నీ ప్రభువు నుండి నీపై అవతరించిన ఈ వాణి వారిలో చాలామంది అవిశ్వాసం, తలబిరుసుతనాలు మరింత ముదిరిపోవడానికే కారణమయింది. కనుక నీవు అవిశ్వాసుల వైఖరి పట్ల విచారపడకు. (68)
ముస్లింలైనా, యూదులైనా, క్రైస్తవులైనా, నక్షత్రారాధకులైనా, మరెవరైనా సరే దేవుడ్ని, అంతిమదినాన్ని విశ్వసించి తదనుగుణంగా సత్కార్యాలు చేస్తుంటే, అలాంటి వారికి ప్రళయదినాన) ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. (69)
మేము ఇస్రాయీల్‌ సంతతివారి చేత ప్రమాణం చేయించాము. వారి దగ్గరకు ప్రవక్తలను కూడా పంపాము. అయితే వారి దగ్గరకు ప్రవక్తలు వారికి నచ్చని విషయాలు తెచ్చినప్పుడు వారు కొందరు ప్రవక్తల్ని తిరస్కరించేవారు, మరికొందరు ప్రవక్తల్ని హత మార్చేవారు. వారు (తాము ఏం చేసినా) ఎలాంటి ఆపదలు వచ్చిపడవని భావించారు. అందుకే వారు అంధులు, బధిరులు అయిపోయారు. తర్వాత దేవుడు వారిని క్షమిం చాడు. కాని వారిలో చాలామంది ఇంకా పెట్రేగిపోయి మరింత అంధులు, బధిరులయి పోయారు. దేవుడు వారి చర్యల్ని ఓకంట గమనిస్తూనే ఉన్నాడు. (70-71)
‘మర్యం కుమారుడు మసీహ్‌ దేవుడే’ అంటున్నవారు నిస్సందేహంగా అవిశ్వాసులై పోయారు. మసీహ్‌(తనను దేవుడని చెప్పుకోలేదు.) ఇలా బోధిస్తుండేవాడు: “ఇస్రాయీల్‌ సంతతి ప్రజలారా! దేవుడ్ని మాత్రమే ఆరాధించండి. ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. దేవునికి సాటి కల్పించేవారికి దేవుడు స్వర్గప్రవేశం నిషేధించాడు. వారి నివాసం నరకమవుతుంది. అలాంటి దుర్మార్గులకు ఎవరూ సహాయం చేయలేరు.” (72)
‘దేవుడు ముగ్గురిలో ఒకడు’ అని పలికినవారు కూడా నిస్సందేహంగా సత్యతిరస్కా రులుగానే పరిగణించబడతారు. వాస్తవానికి దేవుడు ఒక్కడే. ఆయన తప్ప మరేదేవుడూ లేడు. వారు ఇలాంటి మాటలు మానుకోకపోతే వారిలో (ఇలా) సత్యాన్ని తిరస్కరించిన వారికి అతి బాధాకరమైన శిక్ష పడుతుంది. మరి ఇప్పటికైనా వారు పశ్చాత్తాపంతో దేవుడ్ని క్షమాపణ కోరుకుంటారా? దేవుడు ఎంతోక్షమాశీలి, అమిత కరుణామయుడు. (73-74)
మర్యం కుమారుడు మసీహ్‌ (ఏసు) దైవప్రవక్త తప్ప మరేమీ కాదు. అతనికి పూర్వం కూడా అనేకమంది దైవప్రవక్తలు వచ్చిపోయారు. అతని తల్లి సౌశీల్యమూర్తి అయిన స్త్రీ. వారిద్దరూ (అందరిలాగే) అన్నం తినే మనుషులే. చూడు, మేము వారి ముందు మా సూక్తుల్ని ఎలా విడమరచి తెలుపుతున్నామో. అయినా వారు (ముఖం చాటేసి) ఎలా వెనక్కి మరలిపోతున్నారో చూడు! (75)
వారిని అడుగు: “మీరు దేవుడ్ని వదలి ఎలాంటి లాభనష్టాలు కలిగించలేని వాటిని ఎందుకు ఆరాధిస్తున్నారు? నిజానికి అందరి మొరల్ని ఆలకించేవాడు, అన్ని విషయాలు ఎరిగినవాడు దేవుడు మాత్రమే.” (76)
చెప్పు: “గ్రంథప్రజలారా! మీరు మీధర్మంలో సత్యానికి వ్యతిరేకంగా హద్దుమీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్వయంగా మార్గభ్రష్టులయి, ఇతరుల్ని కూడా అనేక మందిని మార్గభ్రష్టులుగా చేసినవారి అడుగుజాడల్లో నడవకండి. వారు రుజుమార్గం నుండి పూర్తిగా తప్పిపోయారు.”
ఇస్రాయీల్‌ సంతతిలో సత్యాన్ని తిరస్కరించినవారు దావూద్‌ నోట, మర్యం కుమారుడు ఈసా నోట శపించబడ్డారు. దానిక్కారణం వారు అవిధేయులయి హద్దుమీరి ప్రవర్తించడమే. అదీగాక వారు ఒకర్నొకరు చెడుల నుండి వారించుకునేవారు కాదు. నిస్సందేహంగా వారు చాలా చెడ్డపని చేశారు. (77-79)
ఈనాడు కూడా అలాంటివారు నీకు చాలామంది కనిపిస్తారు. వారు (విశ్వాసుల కంటే) అవిశ్వాసులతోనే ఎక్కువ స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు ముందుగా పంపుకున్నది చాలా చెడ్డ విషయం (అంటే దుష్కర్మలు). వారిపై దైవాగ్రహం విరుచుకు పడింది. వారిక శాశ్వతంగా (నరక) యాతనల్లో చిక్కుకొని ఉంటారు. (80)
వారు గనక దేవుడ్ని, దైవప్రవక్తను, వారి దగ్గరకు పంపబడిన గ్రంథాన్ని విశ్వసించి వుంటే వారు అవిశ్వాసుల్ని స్నేహితులుగా చేసుకునేవారు కాదు. కాని వారిలో చాలా మంది దుర్జనులే ఉన్నారు. విశ్వాసుల పట్ల అందరికన్నా ఎక్కువ శత్రువైఖరి అవలం బించేవారు యూదులు, బహుదైవారాధకులే. అది నీకూ తెలుసు. స్నేహసంబంధాల విషయంలో “మేము నసారా(సహాయకులం)” అన్నవారు విశ్వాసులకు చాలా దగ్గరగా ఉన్నారని కూడ నీకు తెలుసు. దానిక్కారణం వారిలో భక్తిపరులైన పండితులు, వైరాగ్యు లైన సాధువులు కూడా ఉన్నారు. వారిలో ఏమాత్రం అహంకారం లేదు. (81-82)
వారు దైవప్రవక్తపై అవతరించిన (ఈ)వాణి విన్నప్పుడు దాని సత్యతను గుర్తించ డంవల్ల వారి కళ్లు అశ్రుపూరితాలవుతాయి. వారు అప్రయత్నంగా “ప్రభూ! మేము విశ్వ సించాము. మాపేరు సాక్షుల జాబితాలో వ్రాయి” అనంటారు. వారింకా ఇలా అంటారు: “అసలు మేము దేవుడ్ని ఎందుకు విశ్వసించము? మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో పరిగణిస్తాడని మేము ఆశిస్తున్నాము. అలాంటప్పుడు మా దగ్గరకు వచ్చిన సత్యాన్ని మేము ఎందుకు విశ్వసించము? (తప్పకుండా విశ్వసిస్తాము.)” (83-84)
ఈ పలుకుల కారణంగానే దేవుడు వారికి సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలు ప్రసాదిస్తాడు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచారసంపన్నులకు మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తాము. ఇక అవిశ్వాస వైఖరి అవలంబించి మా సూక్తుల్ని నిరాకరించే వారు నరకాగ్నికి సమిధలయి పోతారు. (85-86)
విశ్వాసులారా! దేవుడు మీకోసం ధర్మసమ్మతం చేసినవాటిని నిషేధించుకోకండి. హద్దుమీరి వ్యహరించకండి. హద్దుమీరేవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. దేవుడు మీకు ధర్మసమ్మతం చేసిచ్చిన పరిశుద్ధ వస్తువులు నిస్సంకోచంగా తినండి, త్రాగండి. దాంతోపాటు మీరు విశ్వసిస్తున్న దేవునిపట్ల భయభక్తులు కలిగివుండండి. (87-88)
మీరు చేసే అర్థం పర్థంలేని ఉత్తుత్తి ప్రమాణాలను గురించి దేవుడు మిమ్మల్ని పట్టుకోడు. బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాల విషయంలో మాత్రం ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. (అలా బుద్ధిపూర్వకంగా ఏదైనా తప్పుడు ప్రమాణం చేసివుంటే) దానికి నిష్కృతి- మీరు మీ భార్యాపిల్లలకు పెట్టేటటువంటి సగటురకం భోజనం పది మంది పేదలకు పెట్టాలి, లేదా బట్టలివ్వాలి, లేదా ఒక బానిసకు స్వేచ్ఛ కలిగించాలి. ఇవేవీ లేనివారు మూర్రోజులు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణంచేసి భంగపరిస్తే దానికిదే నిష్కృతి. అంచేత మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు దేవుని పట్ల కృతజ్ఞులై ఉండేందుకు ఈవిధంగా ఆయన తన సూక్తులు మీకు విడమరచి బోధిస్తున్నాడు. (89)
విశ్వాసులారా! మద్యం, జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు. వాటికి దూరంగా ఉండండి, మీ జీవితం సార్థక మవుతుంది. మద్యం, జూదాల ద్వారా షైతాన్‌ మీమధ్య విరోధం, విద్వేషబీజాలు నాటి మిమ్మల్ని దైవధ్యానం, ప్రార్థనల నుండి నిరోధించగోరుతున్నాడు. కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి. దైవాజ్ఞలను, ఆయన ప్రవక్త హితవుల్ని పాటించండి. వాటిని పాటించకుండా ముఖం తిప్పుకుంటే మాత్రం (మీకే నష్టం), ఆదేశాన్ని యధాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. (90-92)
విశ్వసించి సదాచారవైఖరి అవలంబించినవారు గతంలో ఏదైనా తినివుంటే (అంటే పాపకార్యానికి పాల్పడివుంటే) దాన్ని గురించి వారిని నిలదీయడం జరగదు. అయితే ఇకముందు వారు నిషిద్ధ విషయాల జోలికి పోకుండా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మంచిపనులు చేస్తుండాలి. ఏ విషయాల నుండి వారిస్తే ఆ విషయాలకు దూరంగా ఉండాలి. దైవాజ్ఞల పరిధిలో ఉన్నవాటినే పాటిస్తుండాలి. దైవభీతి కలిగి సద్వ ర్తునులై మసలుకోవాలి. దేవుడు (ఇలాంటి) సద్వర్తునులనే ప్రేమిస్తాడు. (93)
విశ్వాసులారా! మీరు చేతులతో, ఈటెలతో చేసే వేట ద్వారా దేవుడు మిమ్మల్ని కఠిన పరీక్షకు గురిచేయనున్నాడు. మీలో ఎవరు దేవుడ్ని ప్రత్యక్షంగా చూడకుండానే ఆయనకు భయపడతారో చూసేందుకు ఈవిధంగా ఆయన మీకు పరీక్ష పెడుతున్నాడు. (కనుక హజ్‌దీక్షలో ఉండి వేటాడటం నిషిద్ధం అని గుర్తుంచుకోండి.) ఈహెచ్చరిక విన్న తర్వాత కూడా హద్దుమీరితే అలాంటివారికి బాధాకరమైన యాతన తప్పదు. (94)
విశ్వాసులారా! మీరు హజ్‌దీక్షలో ఉన్నప్పుడు వేటాడకండి. ఒకవేళ ఎవరైనా కావాలని ఇలా చేస్తే అతను తాను వేటాడిన జంతువుకు సమానమైన మరో జంతువును సమర్పించి మొక్కుబడి చెల్లించవలసి ఉంటుంది. దీన్ని గురించి మీలో ఇద్దరు నిజాయితీపరులు నిర్ణయం తీసుకోవాలి. తరువాత ఈ (బలిపశువు) కానుకను కాబా గృహానికి చేర్చాలి. అలాంటి మొక్కుబడి చెల్లించే స్తోమత లేనివారు తమ పాపానికి నిష్కృతిగా కొందరు పేదలకు అన్నదానం చేయాలి. లేదా దానికి సమానమయిన ఉపవాసాలు పాటించాలి. ఈవిధంగా వారు తాము చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. గతంలో చేసినదాన్ని దేవుడు క్షమిస్తాడు. అయితే మళ్ళీ అలాంటి పనికి పాల్పడితే మాత్రం దేవుడు దానికి ప్రతీకారం చేస్తాడని తెలుసుకోండి. దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగల సమర్థుడు కూడా. (95)
దేవుడు మీకు సముద్ర జీవాలను వేటాడటాన్ని, వాటిని తినడాన్ని ధర్మసమ్మతం చేశాడు. దానివల్ల మీకూ, తోటి ప్రయాణీకులకూ ప్రయోజనం ఉంది. అయితే మీరు దీక్షలో ఉన్నంతవరకు నేలపై వేటాడకూడదు. దేవునికి భయపడండి. ఆయన మిమ్మ ల్నందరినీ (తీర్పుదినాన) సమీకరించి తనముందు సమావేశపరచుకుంటాడు. దేవుడు కాబా ప్రతిష్ఠాలయాన్ని మానవుల కోసం శాంతిభద్రతల నిలయంగా చేశాడు. పవిత్ర మాసాలను, బలిపశువుల్ని, వాటిమెడ పట్టడాలను కూడా (ఈ లక్ష్యానికి దోహదపడేవిగా చేశాడు). దేవుడు భూమ్యాకాశాల్లోని సమస్తం ఎరిగినవాడని, ఏవస్తువూ ఆయన జ్ఞాన పరిధికి అతీతంగాలేదని మీరు తెలుసుకోవడానికే ఇలా చేశాడు. (96-97)
గుర్తుంచుకోండి, దేవుడు శిక్షించదలచుకుంటే అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. అయితే దాంతోపాటు ఆయన గొప్ప క్షమాశీలి, అపార దయామయుడు కూడా. (మా) సందేశాన్ని (మీకు) అందజేయడమే దైవప్రవక్తపై ఉన్న బాధ్యత. ఆ తర్వాత మీ అంతర్‌ బాహ్యాల స్థితిగతులను గమనించే దేవుడున్నాడు. (98-99)
ప్రవక్తా! చెప్పు: “అత్యధిక సంఖ్యలో ఉండే అపరిశుద్ధవస్తువులు మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకున్నా (అవి అపరిశుద్ధవస్తువులేగాని పరిశుద్ధవస్తువులు కాజాలవు) పరిశుద్ధం, అపరిశుద్ధం ఎన్నటికీ ఒకటి కాజాలవు. కనుక బుద్ధిమంతులారా! (ప్రతి వ్యవహారం లోనూ) దేవునికి భయపడుతూ మసలుకోండి, మీ జీవితం సార్థకమవుతుంది.” (100)
విశ్వాసులారా! మీ ముందు వెల్లడిచేస్తే మీకు బాధ కలిగేటటువంటి విషయాలను గురించి (ప్రవక్తను) అడగకండి. కావాలంటే ఖుర్‌ఆన్‌ సూక్తులు అవతరించే సందర్భం లో అడగండి, వాటిని గురించి మీకు విడమరచి చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మీవల్ల జరిగినవాటి విషయంలో దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. ఆయన గొప్ప క్షమాశీలి, జాలి కలవాడు. మీకు పూర్వం కూడా కొందరు ఇలాంటి (పనికిమాలిన) ప్రశ్నలే అడిగి అవిశ్వాసులయి పోయారు. (101-102)
దేవుడు బహీరా, సాయిబా, వసీలా, హామ్‌ (పశువు)లను నియమించ లేదు. కాని ఈ తిరస్కారులు దేవునిపై అపనింద మోపుతున్నారు. వారిలో చాలామంది బుద్ధిహీనులే ఉన్నారు. దేవుడు అవతరింపజేసిన దానివైపు, దైవప్రవక్త వైపు రండని చెబితే, “మా తాతముత్తాతల నుండి వస్తున్న ఆచారాలే మాకు చాలు” అంటారు వారు. మరి వీరి తాతముత్తాతలు ఏమీ ఎరగకపోయినా, వారికి సన్మార్గం ఏమిటో తెలియకపోయినా వీరు తమ తాతముత్తాతలనే గుడ్డిగా అనుసరిస్తారా? (103-104)
విశ్వాసులారా! మీరు మీగురించి ఆలోచించండి. మీరు గనక సన్మార్గంలో ఉంటే ఇతరుల మార్గభ్రష్టత వల్ల మీకెలాంటి నష్టం జరగదు. మీరంతా చివరికి దేవుని దగ్గరికే పోవలసి ఉంది. అప్పుడు ఆయన (ఇహలోక జీవితంలో) మీరు ఏమేమి చేస్తుండేవారో మీకు తెలియజేస్తాడు. (105)
విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు అతను వీలునామా రాయదలిస్తే, అందుకు మీలో నిజాయితీపరులైన ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండాలి. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అక్కడ మరణ సమయం ఆసన్నమైతే ముస్లిమేతరుల నుండయినా సరే ఇద్దర్ని సాక్షులుగా పెట్టుకోండి.
ఒకవేళ వారి నిజాయితీ పట్ల మీకేదైనా అనుమానంవస్తే, ప్రార్థన తర్వాత వారిద్దరి చేత (మసీదులో) ప్రమాణం చేయించాలి. వారు దేవుని మీద ప్రమాణం చేస్తూ ఇలా పలకాలి: “మేము ఎలాంటి స్వార్థప్రయోజనాల కోసం ఈ సాక్ష్యాన్ని వాడుకోము, మా బంధువులైనా సరే (మేము పక్షపాతం చూపము). దేవుని కోసం చెప్పే సాక్ష్యాన్ని మేము ఎన్నటికీ దాచము. అలా చేస్తే మేము పాపాత్ములలో చేరిపోతాము.” (106)
అయితే అలా ప్రమాణం చేసి కూడా వారు అన్యాయం, పక్షపాతాలకు పాల్పడితే వారి స్థానంలో వారికంటే కొంచెం యోగ్యులైన మరో ఇద్దరు సాక్షులుగా ముందుకు రావాలి. ఈ సాక్షులు అన్యాయానికి గురైనవారయి ఉండాలి. మృతునికి సన్నిహితులై కూడా ఉండాలి. వారు (మసీదులో నిలబడి) దేవుని మీద ప్రమాణం చేసి “వారి సాక్ష్యం కంటే మా సాక్ష్యం నిజమయినది; మేము మా సాక్ష్యంలో ఎలాంటి హద్దు మీరలేదు. అలా చేస్తే మేము దుర్మార్గులలో చేరినవారమవుతాము” అని పలకాలి. (107)
ఇలాంటి పద్ధతి వల్ల ప్రజలు సరైన సాక్ష్యమిస్తారని ఆశ ఉంటుంది. లేదా వారు తాము ప్రమాణం చేసిన తరువాత రెండో వర్గం చేసే ప్రమాణం తమకు వ్యతిరేకంగా ఉంటుందేమోనని భావించయినా భయపడతారు. దేవునికి భయపడండి. వినండి, నీతిలేని వారికి దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (108)
దేవుడు ప్రవక్తలందర్నీ సమావేశపరచే (ప్రళయ)దినం గురించి ఆలోచించు. అప్పుడు దేవుడు “(ప్రజలు) మీకు ఏం సమాధానమిచ్చారు?” అని అడుగుతాడు. దానికి వారు “ మాకేమీ తెలియదు. అగోచర విషయాలన్నీ మీకే తెలుసు” అంటారు. (109)
అప్పుడు దేవుడు ఈసా (అలైహి)ను ఇలా అడుగుతాడు: “మర్యం కుమారుడవైన ఈసా! నేను నీకు, నీ తల్లికి చేసిన మేళ్ళను గుర్తుకు తెచ్చుకో. నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు కూడా ప్రజలతో మాట్లాడేవాడివి; పెద్దవాడైన తర్వాత కూడా. నేను నీకు గ్రంథం, వివేకం ప్రసాదించాను. తౌరాత్‌, ఇన్జీల్‌ బోధనలు కూడా అందజేశాను. నా ఆజ్ఞతో నీవు మట్టితో పక్షి బొమ్మలు చేసి అందులో గాలి ఊదినప్పుడు అవి నాఆజ్ఞతో (నిజమైన) పక్షులుగా తయారయ్యేవి. నీవు పుట్టు గుడ్డిని, కుష్టురోగిని నా అనుజ్ఞతోనే బాగుచేసేవాడివి. మృతులను కూడా నాఆజ్ఞతోనే బ్రతికించేవాడివి. నీవు (ఇలాంటి) స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీల్‌సంతతి దగ్గరికి పోయినప్పుడు వారిలోని సత్యతిరస్కారులు “ఇదంతా మంత్రజాలం తప్ప మరేమీ కాద”ని నిరాకరిస్తే, నేనే నిన్ను వారి బారినుండి కాపాడాను. నన్ను, నా ప్రవక్తను విశ్వసించండని నేను హవారీలను సూచించిన మీదటే వారు ‘మేము విశ్వసించాం. విధేయులైపోయాము. దీనికి నీవే సాక్షి’ అని పలికారు.” (110-111)
ఆ తర్వాత జరిగిన మరో సంఘటన- హవారీలు ఓసారి తమ ప్రవక్తతో “మర్యం కుమారుడవైన ఈసా! మాముందు నీప్రభువు ఆకాశం నుండి వడ్డించిన విస్తరి నొకదాన్ని దించగలడా?” అనడిగారు. దానికి ఈసా (అలైహి) “మీరు విశ్వసించినవారైతే దేవునికి భయపడండి” అన్నాడు. “మేము విస్తరిలోనివి తిని అవి మా హృదయాలకు తృప్తి కల్గిం చాలని మాత్రమే మేము కోరుతున్నాము. ఈవిధంగా నీవు చెప్పినదంతా యదార్థమని తెలుసుకొని అందుకు సాక్షులుగా ఉంటాము” అన్నారు మళ్ళీ వారు. (112-113)
అప్పుడు మర్యం కుమారుడు ఈసా ఇలా ప్రార్థించాడు: “దేవా! మా ప్రభువా!! మా ముందు వడ్డించిన విస్తరి ఒకదాన్ని ఆకాశం నుండి దించు. ఇది మాకూ, మా పూర్వీకులకూ, రాబోయేతరాలకూ పండుగరోజవుతుంది. నీతరఫున ఒక నిదర్శనంగా ఉంటుంది. మాకు ఆహారం ప్రసాదించు. నీవే అందరికన్నా మంచి అన్నదాతవు.” (114)
దానికి దేవుడు ఇలా అన్నాడు: “సరే, నేను దాన్ని మీ ముందు దించుతాను. అయితే ఆ తర్వాత మీలో ఎవడైనా అవిశ్వాసవైఖరి అవలంబిస్తే మాత్రం నేనతనికి ప్రపంచంలో ఎవరికీ విధించనటువంటి ఘోరమైన శిక్ష విధిస్తాను.” (115)
ఆ తర్వాత దేవుడు (ప్రళయదినాన) ఈసాను నిలబెట్టి “మర్యం కుమారుడవైన ఈసా! నన్ను కాదని నిన్ను, నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకొని ఆరాధించాలని నీవు ప్రజలకు బోధించావా?” అని అడుగుతాడు. దానికి ఈసా ఇలా చెబుతాడు: “మీరు ఎంతో పవిత్రులు, పరిశుద్ధులు. నాకు అధికారంలేని విషయం గురించి నేనెలా అనగలను? నేనలాంటి మాటేదయినా అని ఉంటే అది తప్పకుండా మీ దృష్టికి వచ్చేది. నా అంతరంగంలో ఏముందో మీకు బాగా తెలుసు. కాని మీ అంతరంగంలో ఏముందో నాకేమాత్రం తెలియదు. మీరు సమస్త అగోచర విషయాలు ఎరిగినవారు.” (116)
“మీరు ఆదేశించిన విషయాలే నేను వారికి బోధించాను. నా ప్రభువు, మీ ప్రభువు కూడా అయిన దేవుడ్ని మాత్రమే ఆరాధించండని నేను వారికి చెప్పాను. వారి మధ్య జీవించి ఉన్నంతవరకే నేను వారిని కనిపెట్టుకొని ఉన్నాను. మీరు నన్ను పైకెత్తుకున్న తరువాత వారిని మీరే కనిపెట్టుకొని ఉన్నారు. మీరు అందర్నీ, అన్ని విషయాల్ని (అన్ని వేళలా) కనిపెడ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వారిని శిక్షిస్తే వారు మీ దాసులే. ఒకవేళ క్షమిస్తే మీరు ఎంతో శక్తిమంతులు, మహా వివేకవంతులు.” (117-118)
అది విని దేవుడు ఇలా అన్నాడు: “సత్యవ్రతులకు వారి సత్యసంధత ప్రయోజనం చేకూర్చే రోజు వస్తుంది. అలాంటివారికి (ఆరోజు) సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలు లభిస్తాయి. అక్కడ వారు కలకాలం (సుఖంగా) ఉంటారు. దేవుడు వారి పట్ల ప్రసన్నుడవుతాడు, వారు దేవుని పట్ల సంతోషిస్తారు. ఇదే ఘనవిజయం.” (119)
భూమ్యాకాశాలలో, వాటి మధ్య, సర్వత్రా దేవుని రాజ్యమే సాగుతోంది. ఆయన సమస్త విషయాలపై అధికారంగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (120)