భాస్కర శతకము

వికీసోర్స్ నుండి

BHASKARA SATAKAM

With Full Annotations.

Venkata Ram & Co.,

Publishers & Book-sellers,

Head Office: ELLORE.

RAMA PRESS, POWERPER, ELLORE.

MAY 1928

ఇతర మూల ప్రతులు[మార్చు]

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.


1[మార్చు]

శ్రీగల భాగ్యశాలి గడు

జేరగవత్తురు తారుదారె దూ

రాగమన ప్రయాసమున

కాదటనోర్చియునైన నిల్వ ను

ద్యోగముచేసి రత్ననిల

యుండనికాదె సమస్తవాహినుల్

సాగరు జేరుటెల్ల ముని

సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!


తా. ఎక్కడెక్కడ బుట్టిన నదులును రత్నాకరుడను నాశతో సముద్రుని చేరువిధముగా నెన్నియిక్కట్టులకైన నోర్చి ప్రజలు దమంతట దామె ప్రియముం జూపుచు ధనికుని యింటికేతెంచుచుందురు.

2[మార్చు]

ఉ. అంగన నమ్మరాదు

తనయంకెకురాని మహాబలాఢ్యువే

భంగుల మాయలొడ్డి చెఱు

పం దలపెట్టు వివేకియైన సా

రంగధరుం బదంబులు క

రంబులు గోయగ జేసె దొల్లి

చిత్రాంగి యనేకముల్ నుడువ

రాని కుయుక్తులు పన్ని భాస్కరా!


తా. జ్ఞానవంతుడయిన సారంగధరుని మీద చిత్రాంగి చెడు కార్యము కల్పించి యాతని కరచరణములు తెగనరికించిన విధముగా, స్త్రీలు తమకు వశముగాని బల్లిదునిగూడ ననేకములగు మాయలు కల్పించి ప్రాణములు దీయనెంతురు గావున స్త్రీలను నమ్మరాదు.

3[మార్చు]

ఉ. అక్కఱవాటువచ్చు సమ

యంబున జుట్టములొక్క రొక్కరి

న్మక్కువ నుద్ధరించుటలు

మైత్రికి జూడగ యుక్తమే సుమీ

యొక్కట నీటిలో మెరక

నోడలబండ్లును బండ్లనోడలున్

దక్కక వచ్చుచుండుటని

దానముగా దెతలంప భాస్కరా!


తా. ఒకానొక సమయంబున నీటిలో బడవలపై బండ్లును మెరక స్థలములందు బండ్లపై నావలును వచ్చుచుండుట తార్కాణము. అటులే ప్రపంచమున జుట్టములు పనిబడ్డయపు డొకరినొకరు కాపాడుకొందురు.

4[మార్చు]

చ. అడిగినయట్టి యాచకుల

యాశలెఱుంగక లోభవర్తియై

కడిపిన ధర్మదేవత యొ

కానొక యప్పుడు నీదు వాని

కయ్యెడలనదెట్లు, పాలుతమ

కిచ్చునె యెచ్చటనైనలే

గలన్, గుడువగనీనిచో గెరలి

గోవులు తన్నునుగాక భాస్కరా!


తా. అధికాశచే మనుష్యులు దూడలకు లేకుండ గోవుల పాలన్నియు దామే బితుకుకొనవలెనని యెంచిన నావులట్టివారికి పాలీయవు. అట్లుగాక మనుజుడు మితిమీరిన యాశగలవాడై తన్ను గోరినవారికేమి నీయకుండ దరిమినచో నట్టిలోభికి గూడ ధర్మదేవత యొసంగకుండును.

5[మార్చు]

చ. అతిగుణ హీనలోభికి

బదార్థముగలిగిన లేక యుండినన్

మితముగగాని కల్మిగల

మీదటనైన భుజింపడింపుగా

సతమని నమ్ముదేహమును

సంపద నేఱులు నిండి పాఱినన్

గతుకగజూచుగుక్క తన

కట్టడమీఱకయెందు భాస్కరా!


తా. నదులు పరిపూర్ణజలముతో నిండియున్నను, ఉదకము తక్కువ యైయున్నను, కుక్క తన స్వభావమును వదలక నాలుకతో గతుకును త్రాగనేరదు. ఆ విధముగా లోభి తనకెంత భాగ్య మున్నను లేక యున్నను దగినంతే భుజించునుగాని సంపద కలిగియున్నను చక్కగా బుజింప నేరడు.

6[మార్చు]

చ. అదను తలంచికూర్చి ప్రయ

నాదర మొక్కవిభుండు కోరినన్

గదిసి పదార్థ మిత్తురట

కానక వేగమె కొట్టితెండనన్

మొదటికి మోసమౌ బొదుగు

మూలముగోసిన బాలుగల్గునే

పిదికినగాక భూమిబశు

బృందము నెవ్వరికైన భాస్కరా!


తా. గోవులను మనుజుడు నెమ్మదిగా జేతులతో బితికిన పాలు వచ్చునుగాని, ఆ పొదుగును గత్తితో గోసిన పాలుండవు సరికదా ఆవులే నశించును. ఆ విధముగా రాజయినవాడు తన రాజ్యములోని ప్రజలను మంచిగా నడిగిన గప్పములు చెల్లింతురుగాని, బలాత్కరించిన ధనమియ్యక పోవుటయే గాక దేశము విడిచి పారిపోవుదురు.

7[మార్చు]

చ. అనఘునికైన జేకుఱు నన

ర్హుని గూడి చరించునంతలో

మన మెరియంగ నప్పుడవమానము

కీడు ధరిత్రియందునే,

యనువుననైన దప్పవు య

థార్థము; తానది యెట్టు

లన్నచో, నినుమును గూర్చి యగ్ని నల

యింపదె సమ్మెట పెట్టు భాస్కరా!


తా. ఇనుముతోగూడ నగ్నికి సమ్మెటపెట్టు తప్పనట్లు చెడ్డవాని సావాసము చేసిన మంచివానికి అగౌరవమును, చెడుగును గలుగుచుండును, ఎట్లయినను తప్పిపోవు.

8[మార్చు]

చ. అలఘుగుణ ప్రసిద్ధుడగు

నట్టి ఘనుం డొకదిష్టుడైతనున్

వలచి యొకించు కేమిడిన

వానికి మిక్కిలి మేలు చేయుగా

తెలిసి కుచేలు డొక్కకొణి

దెండడుకుల్ దనకిచ్చినన్ మహా

ఫలదుడు కృష్ణుడత్యధిక

భాగ్యము లాతనికీడె భాస్కరా!


తా. కృష్ణమూర్తికి గుచేలుడు భక్తితో చేరెడడుకులీయగా నతినికి మిక్కిలి యెక్కువయిన భాగ్యముల నొసంగినట్లె గుణముగలవాడు తనకు ప్రియుండై యుండి యే స్వల్పమాతని కిచ్చినను అతడు అధికఫలమునే యొసంగును.

9[మార్చు]

చ. అవనివిభుండు నేరుపరి

యైచరియించిన గొల్చువారలె

ట్లవగుణులైననేమి పను

లన్నియు జేకుఱు వారిచేత నే

ప్రవిమల నీతిశాలి యగు

రామునికార్యము మర్కటంబులే

తవిలియొనర్చవే? జలధి

దాటి సురారుల ద్రుంచి భాస్కరా!


తా. నీతిశాలియగు శ్రీరాముడు, అల్పములగు కపులచేతనే సముద్రము దాటుట, రాక్షసులను చంపుట మున్నగు పనులను నెరవేర్చుకొనినట్లు, నేర్పరియగు రాజల్పులగు భటులచేతనే ఘనకార్యము లొనరించుకొనగలడు.


10[మార్చు]

ఉ. ఆదరమింత లేక నరు

డాత్మబలోన్నతి మంచివారికిన్

భేదముచేయుటం దనదు

పేర్మికి గీడగు మూలమెట్లమ

ర్యాదహిరణ్యపూర్వకశి

పన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర

హ్లాదునకెగ్గుచేసి ప్రళ

యంబును బొందడె మున్ను భాస్కరా!


తా. పూర్వకాలమున దుష్టుడగు హిరణ్యకశిపుడు మంచిగుణవంతుడగు ప్రహ్లాదునిపై బగగొని చచ్చినట్లే మానవుడు జగంబునించుకయు బ్రేమలేక బలములేక యోగ్యుని బాధించినచో దప్పకుండ మృతినొందగలడు.

11[మార్చు]

ఉ. ఆరయ నెంత నేరుపరి

యై చరియించిన వానిదాపునన్

గౌరవమొప్ప గూర్చు నుప

కారి మనుష్యుడు లేక మేలుచే

కూరదదెట్లు? హత్తుగడ

గూడునె చూడ బదాఱువన్నె బం

గారములోననైన వెలి

గారము కూడకయున్న భాస్కరా!


తా. పదునాఱువన్నె బంగారము అయినప్పటికిని టంకణమును వెలిగారమును బెట్టకున్నచో నదుకుకొనని రీతిగా మనుష్యుడు తానెంత తెలివితేటలు కలవాడైనను వానియొద్ద మర్యాదను కలుగజేయు నుపకారి లేకున్న మంచి కలుగనేరదు.


12[మార్చు]

ఉ. ఈక్షితి నర్థకాంక్ష మది

నెప్పుడు వాయక లోకులెల్ల సం

రక్షకుడైన సత్ప్రభుని

రాకల గోరుదు రెందు జంద్రి

కా, పేక్షజలంగి చంద్రుడుద

యించువిధంబునకై చకోర

పుం, బక్షులు చూడవేయెదు ర

పారముదంబునుబూని భాస్కరా!


తా. వెన్నెలనుగోరి చకోరపక్షులు మిక్కిలి యానందును జెందును, చంద్రు డెప్పుడుదయించుకో యని కనిపెట్టుకొనియుండు విధముగా, మనుష్యులు ద్రవ్యమందాసచే ప్రభువురాకకై నిరీక్షించుచుందురు.

13[మార్చు]

ఉ. ఈ జగమందు దామనుజు

డెంత మహాత్మకుడైన దైవ

మా తేజముతప్ప జూచునెడ

ద్రిమ్మరికోల్పడు నెట్ల

నన్మహా, రాజకుమారుడైన రఘు

రాముడుగాల్నడగా

యలాకులున్, భోజనమై తగన్వనికి

బోయిచరింపడె మున్ను భాస్కరా!


తా. రామచంద్రుడు కాలినడకతో నడవికేగి, ఆకుల, నలముల నాహారముగ జేసికొని సంచరింపవలసి వచ్చినట్లే, మనుష్యుడు తానెంతటి గొప్పవాడయినను దైవవశమున సర్వమును బోగొట్టుకొని దేశములు పట్టుకొని తిరుగు చుండును.

14[మార్చు]

చ. ఉరుకరుణాయుతుండు సమ

యోచితమాత్మదలంచి

యుగ్రవా, క్పరుషత జూపినన్ ఫలము

గల్గుట తథ్యము

గాదె యంబుందం, బుఱిమినయంతనే కురియ

కుండునె వర్షములోక రక్షణ, స్థిరతర పౌరుషంబున న

శేష జనంబు లెఱుంగ భాస్కరా!


తా. మేఘము ప్రారంభమున నురుములచే ప్రజలను భయపెట్టును. తరువాత ప్రజలను వర్షమున నానందపరుచునట్లే, దయావంతుడు సమయానుసారముగా నొకకఠినపు బలుకు బలికినను దరువాత దప్పక మేలును గలిగించును.


15[మార్చు]

చ. ఉరుగుణవంతు డొడ్లుదన

కొండపకారము సేయునప్పుడుం

బరహితమే యొనర్చు నొక

పట్టుననైనను గీడు జేయగా

నెఱుగడు నిక్కమే కదయ

దెట్లనగవ్వము బట్టి యెంతయున్

దరువగ జొచ్చినం బెరుగు

తాలిమి నీయదె? వెన్న భాస్కరా!


తా. మనుష్యులు తన్ను గవ్వమున మథించుచున్నను వారికేమియు గీడుసేయక పెరుగు జనులకు దనయందున్న వెన్న నొసంగుచున్నట్లే, సద్గుణములు కలవాడు తనకు బరులు కీడు సేయుచున్నను తాఅ నితరులకు మేలే యొనర్చును గాని కీడు నొనర్పడు.

16[మార్చు]

చ. ఉరుబలశాలినంచు దను

నొల్లని యన్యపతివ్రతాంగనా

సురతము గోరెనేని కడ

సుమ్మదిభూతికి బ్రాణహానియౌ

శిరములుగూల రాఘవుని

చే దశకంఠుడు ద్రుంగిపోవడే

యెఱుగక సీతకాసపడి

యిష్టుల బృత్యుల గూడి భాస్కరా!


తా. క్రొవ్వుచే గ్రిందుమీదెఱుగక రావణుడు సీతను గోరి బంధుభట సమేతుండై యుద్ధమున జచ్చెను. కాబట్టి మనుష్యుడు నేను బలము కలవాడనని కావరమున దనయం దిష్టములేని స్త్రీని గవయ గోరిన నైశ్వర్యహానియు బ్రాణహానియు గలుగును.

17[మార్చు]

ఉ. ఊరకవచ్చు బాటుపడ

కుండిననైన ఫలంబదృష్ట మే, పా

రగ గల్గువానికి బ్ర

యాసము నొందిన దేవదానవుల్, వా

రలటుండగా నడుమ

వచ్చిన శౌరికి గల్గెగాదె శృం, గార

పుబ్రోవు లక్ష్మియును

గౌస్తుభరత్నము రెండు భాస్కరా!


తా. అహోరాత్రములు శ్రమపడుచుండునట్టి దేవతలు రాక్షసులు నుండగా వారికి గాకుండ సముద్ర మథన సమయమున జనించిన లక్ష్మియు గౌస్తుభమును కష్టపడకుండ నడుమనేతెంచిన విష్ణుముర్తికి దొరికిన విధముగా మహాదృష్టవంతునకు శ్రమపడ నక్కరలేకయే ఫలప్రాప్తి యగుచుండును.

18[మార్చు]

ఉ. ఊరక సజ్జనుం డొదిగి

యుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక యప

కారముసేయుట వానివిద్యగా

చీరలు నూరుటంకములు

సేసెడివైనను బెట్టెనుండగా

జేరి చినింగిపో గొఱుకు

చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!


తా. వస్త్రములు నూఱు మొహరీలు విలువ గలవియైనను బెట్టెలో బడియున్నప్పటికిని దనకేమియు బ్రయోజనము లేకపోయినను చిమ్మటయా బట్టలను ముక్కలు ముక్కలుగా గొఱికివేయుచుండు విధముగా, ఎవరి జోలికింబోక యుత్తము డొకచో నణగియున్నను దుర్మార్గుడు తనకేమి లాభము లేకున్నను హేతువు లేకుండ నాయుత్తమున కపకృతి సేయుచుండును.

19[మార్చు]

ఉ. ఎట్టుగ బాటుపడ్డనొక

యించుక ప్రాప్తము లేక వస్తువుల్

పట్టుపడంగ నేరవు; ని

బద్ధి సురావళి గూడి రాక్షసుల్

గట్టు పెకల్చి పాల్కడలి

గవ్వము చేసి మథించిరంతయున్

వెట్టియెకాక యేమనుభ

వించిరి వారమృతంబు? భాస్కరా!


తా. అసురులు సురలతో స్నేహముచేసి మందరాద్రిని బెకలించి తెచ్చిదానింగవ్వముగాజేసి క్షీరసాగరమును శ్రమపడి మథించినను రాక్షసుల కించుకయు నమృతము చిక్కినదికాదు. కాబట్టి మనుష్యుడెంతటి యాయాసమునకు బాల్పడినను దాననుభవించుటకు యోగ్యమగు భాగ్యము లేని తఱి తన కష్టమునకు దగిన లాభము గాంచనేరడు.

20[మార్చు]

చ. ఎడపక దుర్జనుండొరుల

కెంతయుగీ డొనరించుగానియే

యెడలను మేలుసేయడొక

యించుకయైనను జీడపుర్వుదా

జెడ, దిను నెంతకాక పుడి

సెండుజలంబిడి పెంపనేర్చునే

పొడవగుచున్న పుష్పఫల

భూరుహ మొక్కటినైన భాస్కరా!


తా. చక్కగా బెరుగుచున్న ఫలవృక్షములను జీడపురుగు కొఱికి తినుచుండును గాని చేరెడు నీళ్ళుపోసి ఒక వృక్షమునైన బెంచలేనట్లే, దుర్మార్గుడు పరులకు జాల కీడుసేయ నేర్చునే గాని యెవ్వరికిని మేలు సేయ నేరడు.

21[మార్చు]

ఉ. ఎడ్డె మనుష్యుడే మెఱుగు

నెన్ని దినంబులు గూడి యుండినన్

దొడ్డ గుణాఢ్యునందుగల

తోరపువర్తనలెల్ల బ్రజ్ఞబే

ర్పడ్డ వివేకరీతి రుచి

పాకము నాలుకగ కెఱుంగునే

తెడ్డది కూరలో గలయ

ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!


తా. చక్కగా బచనము చేయబడిన కూరయొక్క రుచి నాలుక తెలిసికొనును గాని, ఎప్పుడును యుడుకుచున్నప్పుడు నుడికిన తర్వాతను గూరలోనుండు తెడ్డు ఆ కూర రుచి యెఱుగని యట్లే, గుణవంతుని యందలి యుత్తమ వర్తనములు జ్ఞానవంతుడు తెలిసికొన గలుగును గాని వానితో నెన్ని దినములు కలిసియున్నను మూఢుడు తెలిసికొనలేడు.


22[మార్చు]

ఉ. ఎప్పుడదృష్ట తామహిమ

యించుక పాటిలునప్పు డింపుసొం

పొప్పుచునుండుగాకయది

యొప్పని పిమ్మట రూపుమాయు

గా, నిప్పున నంటియున్న యతి

నిర్మలినాగ్ని గురు ప్రకాశముల్

దప్పిననట్టి బొగ్గునకు

దానలుపెంతయు బుట్టు భాస్కరా!


తా. బొగ్గు నిప్పుయొక్క ప్రకాశము కలిగినప్పుడు వెలిగెడి యయ్యగ్ని కాంతి పోయిన వెంటనే మిగుల నల్లని దగుచున్నట్లే, భాగ్యమున్నంత కాలము మనుష్యుడు ప్రభ గలిగి యుండును గానీ అది లేకుండిన మిగుల మాఱురూపముల గాంచును.


23[మార్చు]

ఉ. ఏగతి బాటుపడ్డ గల

దే భువి నల్పునకున్ సమగ్రతా

భోగము భాగ్యరేఖగల

పుణ్యునకుంబలె భూరిసత్త్వసం

యోగమదేభకుంభయుగ

ళోత్థిత మాంసము నక్కకూనకే

లాగు ఘటించు సింహముద

లంచిన జేకుఱుగాక భాస్కరా!


తా. మదగజ కుంభస్థలముల యందుండు మాంసమును సింహము గోరిన యెడల సంప్రాప్తించును గాని, ఎంత కష్టపడినను నక్కపిల్లకు జేకూరని విధముగా భగ్యవంతునకు పూర్ణమైన సుఖము దొరకునుగాని యెంత శ్రమపడినను అల్పునకు దొరుక నేరదు.

24[మార్చు]

ఉ. ఏడననర్హుడుండు నట

కేగు ననర్హుడునర్హుడున్నచో

జూడగనొల్లడెట్లన న

శుద్ధగుణస్థితి నీగపూయముం

గూడినపుంటిపై నిలువ

గోరినయట్టులు నిల్వనేర్చునే

సూడిదవెట్టువెన్నుదుటి

చొక్కపు గస్తురిమీద భాస్కరా!


తా. మక్షికము సువాసనతో నిండిన కస్తూరిబొట్టు మీద వ్రాలక దుర్వాసనతో నిండిన చీముపట్టిన పుంటిమీదనే వ్రాలునట్లు, చెడ్డవాడు మంచివానియొద్ద కేగనేరక చెడ్డవానియొద్దకే పోవుచుండును.

25[మార్చు]

ఉ. ఏల సమస్త విద్యల నొ

కించుక భాగ్యము గల్గియుండినన్

జాలు ననేక మార్గముల

సన్నుతికెక్క; నదెట్లొ కోయనన్

రాలకు నేడ విద్యలు తి

రంబుగ దేవరరూపుచేసినన్

వ్రాలి నమస్కరించి ప్రస

వంబులువెట్టరె మీద భాస్కరా!


తా. శిలలు విద్యలు నేర్వకున్నను వాని భాగ్యవశమున దేవతా రూపముగాంచి యెల్లరచే నమస్కరింపబడి పూజింపబడు చున్నట్లె, మనుష్యులు అదృష్టవంతులయినచో బలుదెఱంగులం నితింపబడుదురు గాని విద్యలనేర్చినందువలన గాదు.

26[మార్చు]

ఉ. ఒక్కడెచాలు నిశ్చల బ

లోన్నతుడెంతటి కార్యమైనదా

జక్కనొనర్ప, గౌరవు ల

సంఖ్యులు పట్టిన ధేనుకోటులం

జిక్కగనీక తత్ప్రబల

సేన ననేక శిలీముఖంబులన్

మొక్కపడంగజేసితుద

ముట్టడెయొక్క కిరీటి భాస్కరా!


తా. కౌరవులు చాలమంది కూడి విరటుని యావులమందలను దోలుకొని పోవుచుండగా అర్జునుడొక్కడే వారినందఱ జయించి గోగణమును మరలించుకొని యేతెంచిన విధంబున నైసర్గిక బలముగల గొప్పవాడెట్టి గొప్పపనినైన నిర్వహింప గలడు.

27[మార్చు]

ఉ. కట్టడదప్పి తాము చెడు

కార్యము జేయుచునుండిరేని

దో, బుట్టినవారి నైనవిడి

పోవుటకార్యము; దౌర్మదాంధ్య

ముం, దొట్టిన రావణాసురుని

తో నెడబాసి విభీషణాఖ్యుడా

పట్టున రాముజేరి చివ

పట్టముగట్టుకొనండె భాస్కరా!


తా. మదాంధుడై రావణాసురుడు చెడు పనిని చేయుటచే విభీషణుడు అన్నను వదలిపెట్టి రామునకు హితుడై లంకకధిపతియైనట్లే, పాడుపనులు చేసినచో దనసోదరుడైనను విడిచిపోయిన తప్పక లాభము కలుగును.

28[మార్చు]

ఉ. కట్టడయైనయట్టి నిజ

కర్మము చుట్టుచువచ్చి యేగతిం

బెట్టునొ పెట్టినట్లనుభ

వింపకతీరదు కాళ్ళుమీదుగా

గిట్టక వ్రేలుడంచు దల

క్రిందుగగట్టిరెయెవ్వరైననా

చెట్టున గబ్బిలంబులకు

జేరిన కర్మము గాక భాస్కరా!


తా. తలక్రిందు పక్షులు ఇతరులు తమ్ము తలక్రిందుగా చెట్టునకు వ్రేలాడగట్టకున్నను తమ పూర్వజన్మ కర్మముచే నావిధముగా వ్రేలుచున్నట్లే, దైవవశమున మానవుడట్లు నడువక తప్పదు.


29[మార్చు]

ఉ. కట్టడలేని కాలమున

గాదు శుభంబొరు లెంతవారు చే

పట్టిననైన మర్త్యునకు

భాగ్యము రాదనుటెల్ల గల్ల కా

దెట్టని పల్కినన్ దశర

థేశ వసిష్ఠులు రామమూర్తికిన్

బట్టము కట్టగోరి రది

పాయక చేకుఱెనోటు భాస్కరా!


తా. దశరథ మహారాజును, వసిష్ఠ మహర్షియు శ్రీరామునకు పట్టాభిషేకము జేయ నెంత యత్నపడినను జరుగనట్లే, మానవునకు అదృష్టకాలము ప్రాప్తము కాకుండ జయము కలుగదు. ఎంత భాగ్యవంతుడు పట్టు పట్టినను సంపదలు రావు.

30[మార్చు]

ఉ. కానక చేర బోల దతి

కర్ముడు నమ్మిక లెన్నిచేసినం

దానది నమ్మివానికడ

డాయగ బోయిన హానివచ్చు; న

చ్చోనదియెట్లనంగొఱకు

చూపుచునొడ్డినబోనుమేలుగా

బోనని కానకాసపడి

పోవుచు గూలదె కొక్కు భాస్కరా!


తా. తనకు దిండినిజూపుచు నొడ్డిన బోనును బోనని యెఱుగక పందికొక్కు ఆశించిపోయి యందు జిక్కుకొని చచ్చునట్లుగా నెన్ని నమ్మకములు చేసినను పాపాత్ముని చెంతకు బోగూడదు. పోయిన దప్పక ముప్పు గలుగును.


31[మార్చు]

ఉ. కాని ప్రయోజనంబు సమ

కట్టదు తాభువి నెంతవిద్యవా

డైనను దొడ్డరాజుకొడు

కైన నదెట్లు? మహేశుపట్టి వి

ద్యానిధిసర్వవిద్యలకు

దానె గురుండు వినాయకుండుదా

నేనుగురీతినుండియున

దేమిటికాడడు పెండ్లి? భాస్కరా!


తా. శివునకు పుత్రుడును, సర్వ విద్యల కునికి పట్టును, ఎల్లరికి గురువును, ఏనుగంత బలమున్న వాడునై యుండియు, వినాయకుడు పెండ్లిగాకుండ నున్నట్లే, మనుష్యుడు తానెంత పండితుడైనను రాజాధిరాజు కుమారుడైనను దైవము తిన్నగా జూడనిచో గార్యముము నెరవేర్చు కొనజాలడు.


32[మార్చు]

ఉ. కామిత వస్తు సంపదలు గల్గు

ఫలంబొరు లాసపడ్డచో

నేమియు బెట్టడేని సిరి

యేటికి నిష్ఫలమున్నబోయినన్

బ్రామికపడ్డ లోకులకు

బండగనేమది యెండిపోవగా

నేమిఫలంబు చేదువిడ

దెన్నటికైన ముసిండి భాస్కరా!


తా. ఎప్పుడును ముసిండిచెట్టు చేదును వదలకుండు నప్పుడా చెట్టుపండిన నెండిన నాశచే నా చెట్టును గనిపెట్టుకొనియున్న మనుజుల కేమియు లాభములేనట్లే, భాగ్యవంతుడు తన్నాశ్రయించి యున్న మనుజుల కెంతమాత్రము బెట్టని కాలమందు వాని సంపద యున్నను లేకున్నను నొకటియే.


33[మార్చు]

ఉ. కారణమైన కర్మములు

కాక దిగంబడ వెన్ని గొందులం

దూఱిననెంత వారలకు

దొల్లి పరీక్షితు శాపభీతుడై

వారధి నొప్పునుప్పరిగ

పైబదిలంబుగడాగి యుండినం

గ్రూరభుజంగదంతహతి

గూలడెలోకులెఱుంగ భాస్కరా!


తా. ముని యిడిన శాపభీతిచే పరీక్షిత్తు నడిసముద్రములో మేడను నిర్మించుకొనియున్నను బాముచే మరణము జెందవలసినవాడైనట్లె, యెంత గొప్పవారైనను, ఎందు దాగియున్నను దామనుభవింపవలసిన కర్మమనుభవింపక తీరదు.

34[మార్చు]

చ. కులమున నక్కడక్కడన

కుంఠిత ధార్మికుడొక్కడొక్కడే

కలిగెడుగాక పెందఱుచు

గల్గగనేరరు, చెట్టుచెట్టునన్

గలుగగ నేర్చునే గొడుగు

కామలు చూడగ నాడనాడనిం

పలరగ నొక్కొటొక్కటి న

యంబున జేకుఱుగాక భాస్కరా!


తా. గొడుగునకు గామగానమర్చుకొనదగిన కర్రలు తిన్ననివి యెక్కడనో యొక్క చెట్టున నొక కొన్ని యుండునుగాని ప్రతి వృక్షమున నన్నియు వంకరలేనివి దొరకనట్లే, మంచి ధర్మాత్ములు యెక్కడనో యొక్కొక వంశమందొక్కొకడే పుట్టుచుండును గాని యెక్కువగా నుండరు.

35[మార్చు]

ఉ. క్రూరమనస్కులౌ పతుల

గొల్చి వసించిన మంచివారికిన్

వారిగుణంబె పట్టిచెడు

వర్తన వాటిలు, మాధురీజలో

దారలు గౌతమీముఖ మ

హానదు లంబుధిగూడినంతనే

క్షారము జెందవే మొదలి

కట్టడలన్నియుదప్పి భాస్కరా!


తా. మధురములగు నుదకములతో నొప్పుచున్న మహానదులన్నియు సాగరమునను బడినంతలోనే మొదటగల రుచిని వీడి యుప్పదనమును వహించినట్లే, కఠినుడగు ప్రభువును సేవించుచు నుత్తములుగూడ దమ సద్గుణములను విడిచి వాని గుణములను బూని దుర్మార్గవర్తనులగుదురు.


36[మార్చు]

ఉ. గిట్టుటకేడ గట్టడ లి

ఖించిన నచ్చటగానియొండుచో

బుట్టదుచావు; జానువుల

పుస్కలమాడిచి కాశి జావ

గా, ల్గట్టిన శూద్రకున్ భ్రమల

గప్పుచు దద్విధి గుఱ్ఱ

మౌచునా, పట్టునగొంచు

మఱ్ఱికడ బ్రాణముదీసె గదయ్య భాస్కరా!


తా. కాశీక్షేత్రమున మృతినొంద నిశ్చయించుకొని శూద్రకుడను మహారాజు దన మోకాలి చిప్పల నూడదీసుకొని యచ్చట గదలక యుండగా నా కాశీపురాధీశ్వరుడొక గుఱ్ఱమునునొగి యది యెవ్వరిని యెక్కనీయక బాధించు సమయమున నీ శూద్రక మహారాజు నన్ను దానిపైకెక్కించిన నేను సవారి చేయుదునన నట్లచేసిరి, అంత నాగుఱ్ఱ్ము వానిని వీపుననిడికొనిపోయి యొకచోనున్న యొక మఱ్ఱిచెట్టునకు బెట్టి కొట్టగా మృతినొందినట్లు, ఎచ్చట జచ్చుటకై విధి నుదుట వాయునో యందే జచ్చుంగాని వేఱొక తావున మృతినొందడు.


37[మార్చు]

ఉ. ఘనబలసత్త్వమచ్చుపడ

గల్గినవానికి హాని లేనిచో

దనదగు సత్త్వమే చెఱుచు

దన్ను; నదెట్లన? నీరులావుగా

గనువసియించినన్ జెఱువు

కట్టకు సత్త్వము చాలకున్నచో

గనుమలు పెట్టినట్టనడి

గండి తెగంబడకున్నె భాస్కరా!


తా. తటాకమున నీరెక్కువగా నున్నపుడు తటాకపు గట్టునకు బలము లేకున్న మధ్య గండిపడిపోవునట్లే, తనకధిక బలమున్నప్పుడు ఇతరుల గీడు సంభవింపకున్నను దన సత్తువయే తన్ను బాడుచేయును.

38[మార్చు]

చ. ఘనుడగునట్టివాడు నిజ

కార్యసముద్ధరణార్థమై మహిం

బనివడి యల్పమానవుని

బ్రార్థనజేయుట తప్పుగాదుగా,

యనఘతగృష్ణజన్మమున నా

వసుదేవుడు మీదటెత్తుగా

గనుగొని గానివాడకడ

కాళ్ళకు మ్రొక్కడెనాడు భాస్కరా!


తా. కృష్ణుడు జన్మించగానే యతనిని గంసునివలన బాధలేకుండ జేయ వ్రేపల్లెకు దీసికొనపోవనెంచి కావలివారికిం దెలియకుండబోవుచు దా నొనరించు పని కంతరాయము గలుగుకుండుటకయి గాడిద కాళ్ళకు వసుదేవుడు మ్రొక్కినట్లే, ప్రపంచమున మనుష్యుడు తన పని నెఱవేర్చుకొనుటకొక యల్పుని బ్రార్థించినను దానివలన దోషములేదు.


39[మార్చు]

చ. ఘనుడొకవేళ గీడ్పడిన

గ్రమ్మఱనాతని లేమినాపగా

గనుగొననొక్క సత్ప్రభువు

గాననరాధములో పరెందఱుం

బెనుబెఱు వెండినట్టితఱి

బెల్లున మేఘుడుగాన నీటితో

దనుప దుషారముల్ శత శ

తంబులు చాలునటయ్య భాస్కరా!


తా. గొప్ప తటాకము ఎండిపోయిన సమయమున మఱల నిండింప దలచిన మబ్బే తగును గాని మంచుకణములెన్నైనను గాలనట్లే, ఘనునకు బేదఱికము తటస్థించినచో వానిని నివారింప నొక మహారాజు తగును గాని యల్పమానవులు వేయిమందయిన జేయ సమర్థులుగారు.


40[మార్చు]

ఉ. చంద్రకళావతంసుకృప

చాలనినాడు మహాత్ముడైనదా

సాంద్రవిభూతి బాసియొక

జాతి విహీనుని గొల్చి యుంటయో

గీంద్రనుతాంఘ్రి పద్మమను

హీనతనొందుట కాదుగా హరి

శ్చంద్రుడు వీరబాహుని ని

జంబుగ గొల్వడెనాడు భాస్కరా!


తా. హరిశ్చంద్ర మహారాజు చక్రవర్తియైనను భగవత్కృప లేకుండుటచే మాలవాడగు వీరబాహుని సేవించినట్లే, యీశ్వరుని కరుణలేని సమయమున నెంతటి ఘనుడయినను ఐశ్వర్యములు వదలి యొక యల్పుని సేవించుచుండుట సత్యము.


41[మార్చు]

ఉ. చక్కదలంపగా విధివ

శంబున నల్పునిచేతనైన దా

చిక్కియవస్థలం బొరలు

జెప్పగరాని మహాబలాఢ్యుడున్

మిక్కిలి సత్త్వసంపదల

మీఱిన గంధగజంబు మావటీ

డెక్కియదల్చికొట్టికుది

యించిననుండదెయోర్చి భాస్కరా!


తా. మిక్కిలి సత్తువగల మదించిన యేనుగు మావటీడు తనమీద నెక్కినను, అదలించి యంకుశమున బొడిచినను; వంగజేసినను నన్నిటి నోర్చుకొనునట్లే యెంత బల్లిదుడయినను దైవవశమున హీనునిచే జిక్కి కీడుం బొందుచుండును.


42[మార్చు]

చ. చదువది యెంతగల్గిన ర

సజ్ఞత యించుకచాలకున్న నా

చదువు నిరర్థకంబు గుణ

సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం

బదనుగ మంచికూర నల

పాకముచేసిన నైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచి

పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!


తా. కూర నెంత చక్కగా వండినప్పటికి దానియందుప్పు లేకయుండిన రుచ్యముగా నుండదు. దానినేరును మెచ్చుకొననట్లు మానవుడెంతటి విద్వాంసుడైననౌ రసమును గ్రహింపలేకున్న వాని పాండిత్యము నిష్ప్రయోజన మగుటయే గాక యెట్టి గుణవంతులు నాతనిని నుతింపరు.


43[మార్చు]

ఉ. చాలబవిత్ర వంశమున

సంజనితుం డగునేనియెట్టి దు

శ్శీలునినైన దత్కుల వి

శేషముచే నొక పుణ్యుడెంతయుం

దాలిమి నుద్ధరించును సు

ధా నిధిబుట్టగ గాదె శంభుడా

హాలహలావలంబు గళ

మందు ధరించుట పూని భాస్కరా!


తా. ఎక్కువ భయమును గలుగ జేయునది యైనను శివుడు హాలాహలమును నగ్నిహోత్రమును పాలకడలిలో బుట్టినదను కారణమున దానిని దన కంఠమందు బెట్టుకొనినట్లే, యెంతదుష్ట స్వభావము కలవాడైనను యోగ్యమయిన వంశమున బుట్టుటచే నా వంశమందలి ఘనతచే వాని నెవ్వడయిన పుణ్యవంతుడు తప్పకుండ ప్రేమించి కాపాడును.


44[మార్చు]

ఉ. చేరిబలాధికుండెఱిగి

చెప్పిన కార్యము చేయకుండినన్

బారముముట్టలేడొక నె

పంబున దాజెడునెట్టి ధన్యుడున్

బోరక పాండు పుత్రులకు

భూస్థలి భాగము పెట్టుమన్న కం

నారిని గాకుచేసి చెడ

డాయెనె కౌరవభర్త భాస్కరా!


తా. దుర్యోధనుని యొద్ద కరిగి కృష్ణుడు పాండవులకు రాజ్యమున బాలు పెట్టుమని యెంతయో జెప్ప నాతని మాటలను లెక్కసేయక దుర్యోధనుడు పాడయినట్లే, బలశాలి తనకడకేతించి చెప్పినపని యొనర్పనిచో నెంతవాడును తనపనిని నెఱవేర్చుకొనజాలక శీఘ్రకాలమున నాశనము నొందును.


45[మార్చు]

ఉ. చేసిన దుష్టచేష్ట నది

చెప్పక నేర్పున గప్పి పుచ్చి తా

మూసినయంతటన్ బయలు

ముట్టక యుండదదెట్లు రాగిపై

బూసిన బంగరుం జెదరి

పోవగడంగిననాడు నాటికిన్

దాసినరాగి గానబడ

దా జనులెల్ల రెఱుంగ భాస్కరా!


తా. తామ్రము మీద బూతపెట్టిన బంగారము హరించిపోయిన తోడనే యందున్న రాగి యెల్లరికి నగపడుచున్నట్లు, దుర్మార్గుడు తా నొనర్చిన దుష్కృత కార్యము నిపుణతతో గప్పి పెట్టినప్పటికి నయ్యది యెల్లరకు దెలియకుండదు.


46[మార్చు]

వనరులు[మార్చు]


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.