పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/పూర్ణి

వికీసోర్స్ నుండి


తెభా-4-974-చ.
సవచో విలాస! గుణసాగర! సాగర మేఖలా మహీ
ణ ధురంధరప్రకట వ్య భుజాభుజగేంద్ర! రాజశే
! ఖర దూషణప్రముఖ గాఢ తమఃపటలప్రచండభా
స్క! కఱకంఠ కార్ముక విఖండన ఖేలన! భక్తపాలనా!

టీక:- సరసవచోవిలాస = రామచంద్ర {సరస వచో విలాసుడు - సరస (మనోహర మైన) వచస్ (పలుకలతో) విలాసుడు (శోభిల్లువాడు), రామ}; గుణసాగర = రామచంద్ర {గుణ సాగరుడు - సుగుణములకు సాగరుడు (సముద్రము వంటివాడు), రాముడు}; సాగర మేఖలా మహీభరణ ధురంధర = రామచంద్ర {సాగర మేఖలా మహీ భరణ ధురంధురుడు - సాగర (సముద్రములే) మేఖలా (సరిహద్దులుగా గల) మహీ (భూమండలమును) భరణ (పాలించుటఅను) ధురంధరుడు (భారము వహించు వాడు), రాముడు}; ప్రకటభవ్య భుజా భుజగేంద్ర = రామచంద్ర {ప్రకట భవ్య భుజా భుజగేంద్రుడు - ప్రకట (ప్రసిద్ధమైన) భవ్య (శుభమైన) భుజ (భుజము లనెడి) భుజగేంద్రుడు (గొప్ప సర్పములు గలవాడు), రాముడు}; రాజశేఖర = రామచంద్ర {రాజ శేఖరుడు - రాజులలో (శ్రేష్ఠమైనవాడు), రాముడు}; ఖరదూషణప్రముఖగాఢతమఃపటలప్రచండభాస్కర = రామచంద్ర {ఖర దూషణ ప్రముఖ గాఢ తమఃపటల ప్రచండభాస్కర - ఖర (వాడియైన, ఖర అనెడి రాక్షసుడు) దూషణ (దూషించదగినది, దూషణుడు అనెడి రాక్షసుడు) ప్రముఖ (మొదలగు) గాఢ (గాఢమైన) తమః (చీకట్ల) పటల (తెరలకు) ప్రచండ (భయంకరమైన) భాస్కర (సూర్యుని వంటివాడు), రాముడు}; కఱకంఠ కార్ముక విఖండన ఖేలన = రామచంద్ర {కఱకంఠ కార్ముక విఖండన ఖేలనుడు - కఱకంఠ (శివుని) కార్ముక (ధనుస్సును) విఖండన (విఱుచుట అనెడి) ఖేలన (క్రీడ గలవాడు), రాముడు}; భక్తపాలనా = రామచంద్ర {భక్తపాలనుడు - భక్త (భక్తులను) పాలన (పరిపాలించెడివాడు), రాముడు}.
భావము:- రసవంతమైన వాగ్విలాసం కలవాడా! గుణసముద్రా! సముద్రం ఒడ్డాణంగా కల భూమి భారాన్ని మోయడంలో సమర్థమైన శేషుని వంటి భుజాలు గలవాడా! రాజ చూడామణీ! ఖర దూషణులు అనే గాఢాంధకారానికి ప్రచండ భాస్కరుడా! శివుని ధనువును విరిచినవాడా! భక్తులను పాలించేవాడా!

తెభా-4-975-క.
విదళిత సారంగా!
సదయాపాంగ! భక్త లధితరంగా!
దురితధ్వాంత పతంగా!
జనకసుతానుషంగ! ననిధి భంగా!

టీక:- శరవిదళితసారంగా = రామచంద్ర {శరవిదళితసారంగుడు - శర (బాణముచే) విదళిత (మిక్కిలిగా బేధింపబడిన) సారంగుడు (లేడిగలవాడు), రాముడు}; సరసదయాపాంగ = రామచంద్ర {సరసదయాపాంగుడు - సరస (చక్కటి) దయా (దయతోకూడిన) అపాంగుడు (కటాక్షముగలవాడు), రాముడు}; భక్తజలధితరంగా = రామచంద్ర {భక్త జలధి తరంగుడు - భక్త (భక్తులు అనెడి) జలధి (సముద్రపు) తరంగుడు (కెరటములు గలవాడు), రాముడు}; దురితధ్వాంతపతంగా = రామచంద్ర {దురిత ధ్వాంత పతంగుడు - దురిత (పాపములు అనెడి) ధ్వాంత (చీకటికి) పతంగుడు (సూర్యుని వంటివాడు), రాముడు}; వరజనకసుతానుషంగ = రామచంద్ర {వర జనకసు తానుషంగుడు - వర (ఉత్తమురాలైన) జనకసుత (జానకి యందు) అనుషంగుడు (ప్రేమ గలవాడు), రాముడు}; వననిధిభంగా = రామచంద్ర {వననిధిభంగుడు - వననిధి (సముద్రమునకు) భంగుడు (గర్వభంగము చేసినవాడు), రాముడు}.
భావము:- మృగరూపంలో ఉన్న మారీచుని బాణంతో ఖండించినవాడా! ప్రసన్నమైన దయ గలవాడా! భక్తుల హృదయాలనే సముద్రంలో భక్తి తరంగాలను పొంగి పొరలించేవాడా! పాపమనే అంధకారాన్ని అణచడంలో సూర్యుని వంటివాడా! శ్రీ సీతాభిరామా! సముద్రుని అహంకారాన్ని అణచివేసినవాడా!

తెభా-4-976-మాలి.
సువిమత విదారీ! సుందరీ శంబరారీ!
సవినుత సూరీ! ర్వలోకోపకారీ!
నిరుపమగుణ హారీ! నిర్మలానందకారీ!
గురుసమర విహారీ! ఘోరదైత్యప్రహారీ!

టీక:- సురవిమతవిదారీ = రామచంద్ర {సురవిమత విదారుడు - సుర (దేవతలకి) విమత (శత్రువులైన వారిని) విదారుడు (సంహరించినవాడు), రాముడు}; సుందరీశంబరారీ = రామచంద్ర {సుందరీ శంబరారుడు - సుందరీ (అందమైన వారికి) శంబరారుడు (శంబరాసురుని శత్రువు యైన మన్మథుడు వంటివాడు), రాముడు}; సరసవినుతగుణసూరీ = రామచంద్ర {సరస వినుత గుణ సూరి - సరస (రసస్ఫూర్తితో) వినుత (స్తుతించెడి) గుణ (సుగుణములు గల) సూరి (పండితులు గలవాడు), రాముడు}; సర్వలోకోపకారీ = రామచంద్ర {సర్వ లోకోపకారి - సర్వ (సమస్తమైన) లోక (లోకములకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), రాముడు}; నిరుపమగుణహారీ = రామచంద్ర {నిరుపమ గుణహారి - నిరుపమ (సాటిలేని) గుణ (సుగుణము లనెడి) హారి (దండను ధరించినవాడు), రాముడు}; నిర్మలానందకారీ = రామచంద్ర {నిర్మలానందకారుడు - నిర్మల (స్వచ్ఛమైన) ఆనంద (ఆనందమును) కారుడు (కలిగించెడివాడు), రాముడు}; గురుసమరవిహారీ = రామచంద్ర {గురుసమరవిహారుడు - గురు (గొప్ప) సమర (యుద్ధమున) విహారుడు (వీరవిహారము సలిపెడి వాడు), రాముడు}; ఘోరదైత్యప్రహారీ = రామచంద్ర {ఘోరదైత్యప్రహారి - ఘోర (భయంకర మైన) దైత్య (రాక్షసులను) ప్రహారి( సంహరించినవాడు), రాముడు}.
భావము:- దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించినవాడా! సుందరీమణులకు మన్మథుడా! విద్వాంసులు కొనియాడేవాడా! స్వచ్ఛమైన ఆనందాన్ని అందించేవాడా! మహా రణరంగంలో విహరించేవాడా! భయంకర రాక్షసులను సంహరించినవాడా!

తెభా-4-977-గ.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను మహా పురాణంబునందు స్వాయంభువ మనువునకు నాకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్ర, తోత్తానపాదులు జన్మించుటయు, నందు నాకూతిని రుచిప్రజాపతికి నిచ్చుటయు, నా రుచిప్రజాపతికి నాకూతిదేవి యందు శ్రీ విష్ణుమూర్త్యంశజుండైన యజ్ఞుండును, లక్ష్మీ కళాంశజ యగు దక్షిణ యను కన్యకయు నుద్భవించుటయు, మనుపుత్రి యైన దేవహూతినిఁ గర్దమున కిచ్చుటయుఁ, బ్రసూతిం దక్షప్రజాపతి కిచ్చుటయుఁ, బ్రసూతి దక్షుల వలనం బ్రజాపరంపరలు గలుగుటయు, మఱియుం గర్దమప్రజాపతి పుత్రికాసముదయంబును క్షత్త్ర బ్రహ్మర్షుల కిచ్చుటయుఁ, గర్దమ పుత్రి యైన కళవలన మరీచికిఁ గశ్యపుం డను పుత్రుండును బూర్ణిమ యను కూఁతునుం బుట్టుటయును, బూర్ణిమవలన గంగయు విరజుం డనెడు కుమారుండును జన్మించుటయుఁ, గశ్యపప్రజాపతివలన నయిన ప్రజాపరంపరలచే ముల్లోకంబు లాపూర్ణంబు లగుటయు, అత్రిమహాముని తపంబును, నతనికి హరి హర బ్రహ్మలు ప్రత్యక్షం బగుటయు, అనసూయా పాతివ్రత్య మాహాత్మ్యంబువలన ననసూయాత్రులకుం ద్రిమూర్తుల కళాంశజు లయిన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును, దక్షాత్మజల జన్మంబును, భృగువువలన ఖ్యాతి యను నంగనకు శ్రీమహాలక్ష్మి జన్మించుటయును, భృగు పౌత్రుం డయిన మార్కండేయ జన్మంబును, ధర్మునకు మూర్తివలన నరనారాయణులు సంభవించుటయును, సత్త్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుటయును, దక్షాధ్వర ధ్వంసంబును, బ్రహ్మచేఁ బ్రార్థితుండై శివుండు దక్షాదుల ననుగ్రహించుటయును, దక్షాది కృత శ్రీహరిస్తవంబును, శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా ననుగ్రహించుటయును, సతీదేవి హిమవంతునకు జనించి హరునకు బ్రాపించుటయు, నుత్తానపాదుని వృత్తాంతంబును, ధ్రువోపాఖ్యానంబును, ధ్రువుండు దండ్రిచేత నవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకుం జని తపంబు చేయుటయును, హరి ప్రసన్నుండై యతని మనోరథంబు లిచ్చుటయును, నతండు మరలఁ బురంబునకు వచ్చుటయుఁ, గుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును, ధ్రువుండు యజ్ఞంబులు చేయుచు రాజ్యభోగంబులం దనిసి తనయు నుల్కలునిం బట్టంబుగట్టి హరి యనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుటయు, నుల్కలుండు వత్సరుం డను తన సుతునిఁ బట్టంబు గట్టి హరిం జేరుటయు, వత్సరుని వంశపరంపరయు, నందు నంగుని సుతుండయిన వేను కళేబరంబున లక్ష్మీనారాయణుల యంశంబున నర్చియుఁ బృథుండును జన్మించుటయుఁ, బృథుండు భూమిం గామధేనువు రీతి నఖిల వస్తువులుం బిదుక నియమించి సమస్థలిం జేసి యింద్రుండు వశవర్తియై యుండ బహుయజ్ఞంబులు చేసిన నతనికి హరి ప్రత్యక్షంబగుటయు, నధ్యాత్మ ప్రబోధంబును, నింద్రునివలనఁ బాషండ సంభవంబును, నింద్రుని జయించిన విజితాశ్వుని నతని తమ్ములను బృథివీపాలనంబునకు నిలిపి పృథుండు నర్చియుం బరమపదప్రాప్తు లగుటయు, వసిష్ఠుశాపంబునఁ ద్రేతాగ్నులు విజితాశ్వునికిఁ దనయులై జనియించుటయుఁ, బృథుని పౌత్రుండయిన ప్రాచీనబర్హి రాజ్యంబును నతని యజ్ఞంబు లసంఖ్యాతంబులైన నారదుండు మాన్పందలంచి పురంజను కథ నధ్యాత్మ ప్రపంచంబుగాఁ దెలుపుటయుఁ, బ్రాచీనబర్హి సుతులయిన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవం బుపదేశించుటయుఁ, బ్రచేతసుల తపంబునకు మెచ్చి హరి బ్రత్యక్షంబగుటయు, వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబున శివవిద్వేష ప్రయుక్త శాపంబునం బుత్రుండై జనియించుటయును, బ్రచేతసులు ముక్తికిం జనుటయును, విదురుండు మైత్రేయుని వీడ్కొని హస్తిపురంబు కరుగుటయు నను కథలు గల చతుర్థస్కంధము సమాప్తము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శ్రీ; పరమేశ్వర = పరమశివుని; కరుణా = కృపవలన; కలిత = జన్మించిన; కవితా = కవిత్వమురచించుటలో; విచిత్ర = విశేషమైన చిత్రములు కలిగిన; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్ర = కుమారుడైన; సహజ = సహజసిద్ధమైన; పాండిత్య = పాండిత్యము కలిగిన; పోతనామాత్య = పోతన అనెడి శ్రేష్ఠునిచేత; ప్రణీతంబున్ = సంస్కరింపబడినది; ఐన = అయిన; శ్రీ = శ్రీ; మహాభాగవతంబు = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లోని; స్వాయంభువ = స్వాయంభువ యనెడి; మనువున్ = మనువున; కున్ = కు; ఆకూతి = ఆకూతి; దేవహూతి = దేవహూతి; ప్రసూతి = ప్రసూతి; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తానపాదులు = ఉత్తానపాదుడు; జన్మించుటయున్ = పుట్టుట; అందున్ = వారిలో; ఆకూతినిన్ = ఆకూతిని; రుచి = యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; ఇచ్చుటయున్ = వివాహముచేయుట; ఆ = ఆ; రుచి = రుచి యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; ఆకూతిదేవి = ఆకూతి; అందున్ = అందు; శ్రీ = శ్రీ; విష్ణుమూర్తి = హరి యొక్క; అంశజుండు = అంశతో జన్మించినవాడు; ఐన = అయిన; యజ్ఞుండునున్ = యజ్ఞుడు; లక్ష్మీ = లక్ష్మీదేవి యొక్క; కళాంశజ = కళతో జన్మించిన ఆమె; అగు = అయిన; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకయునున్ = ఆడుబిడ్డ; ఉద్భవించుటయున్ = పుట్టుట; మను = మనువు యొక్క; పుత్రి = కుమార్తె; ఐన = అయిన; దేవహూతిని = దేవహూతిని; కర్దమ = కర్దముని; కిన్ = కి; ఇచ్చుటయున్ = వివాహముచేయుట; ప్రసూతిన్ = ప్రసూతిని; దక్ష = దక్షుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; ఇచ్చుటయున్ = వివాహముచేయుట; ప్రసూతి = ప్రసూతి; దక్షుల = ధక్షులు; వలనన్ = వలన; ప్రజా = సంతాన; పరంపరలు = వరసలు; కలుగుటయున్ = పుట్టుట; మఱియున్ = ఇంకను; కర్దమ = కర్దముడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; పుత్రికా = కుమార్తెల; సముదయంబునున్ = సమూహమును; క్షత్ర = క్షత్రియ; బ్రహ్మ = బ్రాహ్మణ; ఋషుల్ = ఋషుల; కిన్ = కి; ఇచ్చుటయున్ = ఇచ్చుట; కర్దమ = కర్దముని; పుత్రి = కుమార్తె; ఐన = అయిన; కళ = కళ; వలనన్ = వలన; మరీచి = మరీచి; కిన్ = కి; కశ్యపుండు = కశ్యపుడు; అను = అనెడి; పుత్రుండు = కుమారుడు; పూర్ణిమ = పూర్ణిమ; అను = అనెడి; కూతునున్ = కుమార్తె; పుట్టుటయునున్ = జన్మించుట; పూర్ణిమ = పూర్ణిమ; వలనన్ = వలన; గంగయున్ = గంగ; విరజుండు = విరజుడు; అనెడు = అనెడి; కుమారుండునున్ = పుత్రుడు; జన్మించుటయున్ = పుట్టుట; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; వలనన్ = వలన; అయిన = కలిగిన; ప్రజా = సంతాన; పరంపరలు = వరసలు; చేన్ = చేత; ముల్లోకంబులున్ = ముల్లోకములు; ఆపూర్ణంబులున్ = నిండినవి; అగుటయున్ = అగుట; అత్రి = అత్రి యనెడి; మహా = గొప్ప; ముని = ముని; తపంబునున్ = తపస్సు; అతని = అతని; కిన్ = కి; హరి = విష్ణువు; హర = శివుడు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ప్రత్యక్షము = ప్రత్యక్షము; అగుటయున్ = అగుట; అనసూయా = అనసూయ యొక్క; పాతివ్రత్య = పాతివ్రత్యపు; మహాత్మ్యంబు = మహత్యము; వలనన్ = వలన; అనసూయ = అనసూయ; అత్రుల్ = అత్రిల; కున్ = కు; త్రిమూర్తుల = త్రిమూర్తుల యొక్క; కళ = కళలోని; అంశజులు = భాగముతో పుట్టిన వారు; అయిన = ఐన; చంద్ర = చంద్రుడు; దత్తాత్రేయ = దత్తాత్రేయుడు; దుర్వాసుల = దూర్వాసుల యొక్క; జన్మంబునున్ = జన్మించుట; దక్ష = దక్షుని యొక్క; ఆత్మజల = కుమార్తెల; జన్మంబునున్ = పుట్టుక; భృగువు = భృగువు; వలనన్ = వలన; ఖ్యాతి = కీర్తి; అను = అనెడి; అంగన = స్త్రీ; కు = కి; శ్రీ = శ్రీ; మహాలక్ష్మి = మహాలక్ష్మి; జన్మించుటయున్ = పుట్టుట; భృగు = భృగువు యొక్క; పౌత్రుండు = మనుమడు; అయిన = అయిన; మార్కండేయ = మార్కండేయుని; జన్మంబునున్ = పుట్టుక; ధర్మున్ = ధర్ముని; కున్ = కి; మూర్తి = మూర్తి; వలనన్ = వలన; నరనారాయణులు = నరనారాయణులు; సంభవించుటయును = కలుగుట; సత్రయాగంబున్ = సత్రయాగము; అందున్ = లో; దక్షుండు = దక్షుడు; శివుని = పరమశివుని; నిందించుటయున్ = నిందించుట; దక్షా = దక్షుని యొక్క; అధ్వర = యజ్ఞ; ధ్వంసంబును = ధ్వంసము; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేన్ = చేత; ప్రార్థితుండు = ప్రార్థింపబడినవాడు; ఐ = అయ్యి; శివుండు = శివుడు; దక్ష = దక్షుడు; ఆదులనున్ = మొదలగువారి యెడ; అనుగ్రహించుటయును = దయచూపుట; దక్ష = దక్షుడు; ఆది = మొదలగువారిచే; కృత = చేయబడిన; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; స్తవంబునున్ = స్తోత్రము; శ్రీహరి = విష్ణుమూర్తి; ప్రసన్నుండు = ప్రసన్నమైనవాడు; ఐ = అయ్యి; దక్షుని = దక్షుని యొక్క; యజ్ఞంబున్ = యజ్ఞమును; సఫలంబున్ = సార్థకము; కాన్ = అగునట్లు; అనుగ్రహించుటయును = అనుగ్రహించుట; సతీదేవి = పార్వతీదేవి; హిమవంతున్ = హిమవంతుడి; కున్ = కి; జనించి = పుట్టి; హరున్ = మహేశ్వరున; ప్రాపించుటయున్ = పొందుట; ఉత్తానపాదునిన్ = ఉత్తానపాదుని యొక్క; వృత్తాంతంబునున్ = వృత్తాంతము; ధ్రువోపాఖ్యానంబును = ధ్రువోపాఖ్యానము; ధ్రువుండున్ = ధ్రువుడు; తండ్రి = తండ్రి; చేతన్ = చే; అవమానితుడు = అవమానింపబడినవాడు; ఐ = అయ్యి; నారద = నారదుని యొక్క; ఉపదేశంబునన్ = ఉపదేశము వలన; మధువనంబున్ = మధువనమున; కున్ = కి; చని = వెళ్ళి; తపంబున్ = తపస్సు; చేయుటయును = చేయుట; హరి = నారాయణుడు; ప్రసన్నుండు = ప్రసన్నమైనవాడు; ఐ = అయ్యి; అతని = అతని యొక్క; మనోరథంబున్ = కోరికలను; ఇచ్చుటయునున్ = తీర్చుట; అతండు = అతడు; మరలన్ = మళ్ళీ; పురంబున్ = పురమున; కున్ = కు; వచ్చుటయున్ = వచ్చుట; కుబేర = కుబేరుని యొక్క; అనుచరులు = అనుచరులు; ఐన = అయిన; యక్షులు = యక్షుల; తోడి = తోటి; యుద్ధంబును = యుద్ధము; ధ్రువుండున్ = ధ్రువుడు; యజ్ఞంబులున్ = యజ్ఞములు; చేయుచున్ = ఆచరించుతూ; రాజ్య = రాజ్య; భోగంబులన్ = భోగములందు; తనిసి = తృప్తి చెంది; తనయున్ = పుత్రుని; ఉల్కలునిన్ = ఉల్కలునికి; పట్టంబున్ = రాజ్యమును; కట్టి = కట్టబెట్టి; హరి = నారాయణుని; అనుగ్రహంబునన్ = అనుగ్రహము వలన; ధ్రువ = ధ్రువ; క్షితినిన్ = పదమునందు; నిలుచుటయును = పొందుట; ఉల్కలుండు = ఉల్కలుడు; వత్సరుండును = వత్సరుడు; అను = అనెడి; తన = తన యొక్క; సుతునిన్ = కుమారునికి; పట్టంబున్ = రాజ్యమును; కట్టి = కట్టబెట్టి; హరిన్ = నారాయణుని; చేరుటయున్ = చేరుట; వత్సరుని = వత్సరుని యొక్క; వంశ = వంశము; పరంపరయున్ = వరుస; అందున్ = దానిలో; అంగుని = అంగుని యొక్క; సుతుండున్ = కుమారుడు; అయిన = అయిన; వేను = వేనుని యొక్క; కళేబరంబునన్ = శవమునుండి; లక్ష్మీ = లక్ష్మీదేవి; నారాయణుల = నారాయణుల యొక్క; అంశంబునన్ = అంశతో జన్మించిన; అర్చియున్ = అర్చి; పృథుండునున్ = పృథుడు; జన్మించుటయున్ = పుట్టుట; పృథుండున్ = పృథుడు; భూమిన్ = భూమిని; కామధేనువు = కామధేనువు; రీతిన్ = వలె; అఖిల = సమస్తమైన; వస్తువులున్ = వస్తువులను; పితుకన్ = పిండబడునట్లు; నియమించి = నియమించి; సమ = సమతలమగు; స్థలిన్ = స్థలముగా; చేసి = చేసి; ఇంద్రుండు = ఇంద్రుడు; వశవర్తి = అనుకూలముగా వర్తించువాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; బహు = అనేకమైన; యజ్ఞంబులున్ = యజ్ఞములను; చేసిన = చేయగా; అతని = అతని; కిన్ = కి; హరి = నారాయణుడు; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; అగుటయున్ = అగుట; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; ప్రబోధంబును = ప్రబోధము; ఇంద్రుని = ఇంద్రుని; వలనన్ = వలన; పాషండ = పాషండ స్వరూపములు; సంభవంబును = పుట్టుట; ఇంద్రుని = ఇంద్రుని; జయించిన = జయించిన; విజితాశ్వుని = విజితాశ్వుని; అతని = అతని యొక్క; తమ్ములను = తమ్ముళ్ళను; పృథవీ = భూమిని; పాలనంబున్ = పరిపాలించుట; కున్ = కు; నిలిపి = నియమించి; పృథుండు = పృథువు; అర్చియున్ = అర్చి; పరమపద = మోక్షమును; ప్రాప్తులు = పొందినవారు; అగుటయున్ = అగుట; వసిష్టు = వసిష్టుని; శాపంబునన్ = శాపము వలన; త్రేతాగ్నులు = త్రేతాగ్నులు; విజితాశ్వుని = విజితాశ్వుని; కిన్ = కి; తనయులు = పుత్రులు; ఐ = అయ్యి; జనియించుటయున్ = పుట్టుట; పృథునిన్ = పృథువుని యొక్క; పౌత్రుండు = మనుమడు; అయిన = ఐన; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; రాజ్యంబునున్ = రాజ్యపాలన; అతని = అతని యొక్క; యజ్ఞంబుల్ = యాగములు; అసంఖ్యాతంబులున్ = లెక్కకు మిక్కిలినవి; ఐన = అయిన; నారదుండున్ = నారదుడు; మాన్పన్ = మానిపించవలెనని; తలంచి = భావించి; పురంజనున్ = పురంజనుడి; కథన్ = కథను; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; ప్రపంచంబుగాన్ = విస్తరణగా; తెలుపుటయున్ = తెలుపుట; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; సుతులు = పుత్రులు; అయిన = ఐన; ప్రచేతసులు = ప్రచేతసులు; పదువుర = పదిమంది (10); కున్ = కి; శ్రీ = శ్రీ; మహాదేవుండు = పరమశివుడు; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; ఐ = అయ్యి; హరి = విష్ణు; స్తవంబున్ = స్తోత్రమును; ఉపదేశించుటయున్ = ఉపదేశించుట; ప్రచేతసుల = ప్రచేతసుల యొక్క; తపంబున్ = తపస్సున; కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని; హరి = విష్ణువు; ప్రత్యక్షంబు = ప్రత్యక్షము; అగుటయున్ = అగుట; వారి = వారి; కిన్ = కి; మారిష = మారిష; వలనన్ = వలన; దక్షుండు = దక్షుడు; పూర్వ = ఇంతకు ముందు; కాలంబునన్ = కాలమునందు; శివ = పరమశివునిపై; విద్వేష = మిక్కిలి ద్వేషము వలన; ప్రయుక్త = ప్రయోగింపబడిన; శాపంబునన్ = శాపము వలన; పుత్రుండు = కుమారుడు; ఐ = అయ్యి; జనియించుటయును = పుట్టుట; ప్రచేతసులు = ప్రచేతసులు; ముక్తి = మోక్షమును; కున్ = కు; చనుటయును = వెళ్ళుట; విదురుండు = విదురుడు; మైత్రేయుని = మైత్రేయుని; వీడ్కొని = వీడ్కోలుతీసుకొని; హస్తిపురంబున్ = హస్తినాపురమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుట; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగిన; చతుర్థ = నాలుగవ (4); స్కంధము = స్కంధము; సమాప్తము = సంపూర్ణము.
భావము:- ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో స్వాయంభువ మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు జన్మించడం, వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేయడం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి వల్ల శ్రీ విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు, లక్ష్మీదేవి యొక్క కళ అంశతో దక్షిణ అనే కన్య జన్మించడం, మనువు కుమార్తె అయిన దేవహూతిని కర్దమునకు ఇవ్వడం, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇవ్వడం, ప్రసూతి దక్షుల వల్ల ప్రజాసంతతులు కలగడం, కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను రాజులకు, బ్రహ్మర్షులకు ఇవ్వడం, కర్దముని కూతురైన కళ వల్ల మరీచికి కశ్యపుడనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు జన్మించడం, పూర్ణిమకు గంగ అనే కూతురు, విరజుడనే కుమారుడు కలగడం, కశ్యప ప్రజాపతివల్ల వృద్ధి పొందిన ప్రజలచేత ముల్లోకాలు నిండడం, అత్రి మహాముని తపస్సు చేయడం, అతనికి హరి హర బ్రహ్మలు ప్రత్యక్షం కావడం, అనసూయ యొక్క పాతివ్రత్య మహిమచేత అనసూయ, అత్రి మునులకు త్రిమూర్తుల అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసులు జన్మించడం, దక్షునకు కుమార్తెలు జన్మించడం, భృగువు వలన ఖ్యాతి అనే స్త్రీకి శ్రీమహాలక్ష్మి జన్మించడం, భృగువు మనుమడైన మార్కండేయుడు జన్మించడం, ధర్మునికి మూర్తి వలన నర నారాయణులు జన్మించడం, సత్త్రయాగంలో దక్షుడు శివుని నిందించడం, దక్షయజ్ఞ ధ్వంసం, బ్రహ్మ ప్రార్థింపగా శివుడు దక్షుడు మొదలైన వారిని అనుగ్రహించడం, దక్షుడు మొదలైన వారు చేసిన శ్రీహరి స్తవం, శ్రీహరి ప్రసన్నుడై దక్షని యజ్ఞం సఫలమయ్యే విధంగా అనుగ్రహించడం, సతీదేవి హిమవంతునికి జన్మించి శివునికి దక్కడము, ఉత్తానపాదుని వృత్తాంతం, ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు తండ్రిచేత అవమానింపబడి నారదుని ఉపదేశంతో మధువనానికి వెళ్ళి తపస్సు చేయడం, హరి ప్రసన్నుడై అతని కోరికలు తీర్చడం, అతడు తిరిగి నగరానికి రావడం, కుబేరుని అనుచరులైన యక్షులతో యుద్ధం, ధ్రువుడు యజ్ఞాలు చేస్తూ రాజ్య సుఖాలను అనుభవించి తృప్తిపడి తన కుమారుడు ఉల్కనుని పట్టాభిషేకం చేసి విష్ణువు దయతో ధ్రువక్షితిలో నిలవడం, ఉల్కలుడు వత్సరుడు అనే తన కొడుకుకు పట్టం కట్టి విష్ణువును చేరడం, వత్సరుని వంశ పరంపర, ఆ వంశంలో అంగుని కొడుకైన వేనిని కళేబరం నుండి లక్ష్మీనారాయణుల అంశలతో అర్చి, పృథుడు జన్మించడం, పృథుడు భూమిని కామధేనువు వలె అన్ని వస్తువులను పిదుకడానికి నియోగించి దానిని సమస్థలిగా చేసి ఇంద్రునికి లొంగి, ఎన్నో యజ్ఞాలను చేయగా హరి ప్రత్యక్షం కావడం, అధ్యాత్మ బోధ, ఇంద్రుని వలన పాషండుని పుట్టుక, ఇంద్రుని ఓడించిన విజితాశ్వునికి అతని తమ్ములకు రాజ్యపాలన అప్పగించి పృధువు, అర్చి పరమపదాన్ని పొందడం, విజితాశ్వునికి వసిష్ఠుని శాపం వలన త్రేతాగ్నులు కొడుకులై జన్మించడం, పృథుని మనుమడైన ప్రాచీనబర్హి రాజ్యంలో యజ్ఞాలు లెక్కలేనన్ని కాగా నారదుడు వాటిని మాన్పించడానికి పురంజనుని కథను అధ్యాత్మ ప్రవచనంగా చెప్పడం, ప్రాచీనబర్హి కొడుకులైన ప్రచేతసులు పదిమందికి శివుడు ప్రత్యక్షమై హరిస్తుతి చేయడం, ప్రచేతసుల తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షం కావడం, వారికి మారిష వలన పూర్వం శివద్వేషం కారణంగా శాపాన్ని పొందిన దక్షుడు కుమారుడై జన్మించడం, ప్రచేతసులు ముక్తిని పొందడం, విదురుడు మైత్రేయుని వీడ్కొని హస్తినాపురానికి వెళ్ళడం అనే కథలున్న చతుర్థ స్కంధం.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!