కురాన్ భావామృతం/అన్-నమల్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

27. నమల్‌ (చీమలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 93)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
తా-సీన్‌. ఇవి ఖుర్‌ఆన్‌ సూక్తులు, విషయస్పష్టత కలిగిన గ్రంథంలోని విషయాలు. ఇవి విశ్వసించేవారికి సన్మార్గం చూపి, శుభవార్త అందజేస్తాయి. ఆ విశ్వాసులు నమాజ్‌ వ్యవస్థ నెలగొల్పే, జకాత్‌ నెరవేర్చే, పరలోకంపై నమ్మకముంచే (స్వభావంకల) వారయి ఉంటారు. పరలోకాన్ని విశ్వసించనివారికి మేము వారి చేష్టల్ని మనోహరమైనవిగా చేశాం. అందువల్ల వారు దారితప్పి తిరుగుతున్నారు. వారే ఘోరమైన శిక్షకు గురయ్యే వారు. పరలోకంలో అందరికన్నా ఎక్కువ నష్టపోయేవారు కూడా వారే. (1-5)
ముహమ్మద్‌ (సల్లం)! ఈ ఖుర్‌ఆన్‌ నీకు మహా వివేకవంతుడు, జ్ఞానసంపన్నుడైన శక్తిస్వరూపుని నుండి లభిస్తున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. (6)
(మూసా వృత్తాంతం విన్పించు.) అప్పుడు మూసా తన కుటుంబీకులతో “నాకేదో నిప్పులాంటి వస్తువు కన్పిస్తోంది. ఉండండి, అక్కడికెళ్ళి ఏదైనా సమాచారం తీసుకు వస్తాను లేదా చలికాచుకోవడానికి నిప్పు కొరివినైనా తీసుకొస్తాను” అని అన్నాడు. (7)
అయితే మూసా అక్కడకు చేరుకోగానే ఈ విధంగా ఓ అదృశ్యవాణి విన్పించింది. “ఈ అగ్నిలో ఉన్నవాడు శుభకరుడు, ఈ అగ్ని పరిసరాల్లో ఉన్నవాడు కూడా శుభకరుడే. సర్వలోక ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు. మూసా! నేను దేవుడ్ని (మాట్లాడుతున్నాను). నేను మహాశక్తి సంపన్నుడను, అత్యంత వివేకవంతుడ్ని. నీ చేతికర్ర క్రింద పడవేయి.”
మూసా తన చేతికర్ర (క్రింద పడవేశాడు. అది) పాములా (మారి) మెలికలు తిరిగిపోవడం చూడగానే పరుగు లంకించుకున్నాడు. వెనక్కి తిరిగైనా చూడలేదు.
మూసా! భయపడకు. నాముందు దైవప్రవక్తలు భయపడరు, తప్పుచేసినవారు తప్ప. తప్పుచేసినవాడు ఆ తరువాత తప్పు సరిదిద్దుకొని మంచి పనులు చేస్తుంటే అలాంటివాడ్ని నేను క్షమిస్తాను. నేను ఎంతో దయామయుడ్ని. కాస్త నీ చేతిని నీచొక్కా క్రింద చంకలో పెట్టి తీయి; అది ఎలాంటి బాధ కలిగించకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. ఇవి తొమ్మిది సూచనల్లోని (రెండు) సూచనలు. వీటిని తీసుకొని నీవు ఫిరౌన్‌ దగ్గరకు, అతనిజాతి ప్రజల దగ్గరకు వెళ్ళు. వారు పరమదుర్మార్గులు.” (8-12)
(మూసా ఫిరౌన్‌ దగ్గరికెళ్ళి ఈ మహిమలు ప్రదర్శించాడు.) కాని వారి ముందుకు స్పష్టమైన మా సూచనలు వచ్చినప్పటికీ, (మాశక్తి గుర్తించడానికి బదులు) “ఇది పూర్తిగా మంత్రజాలం” అన్నారు. వారి అంతరాత్మలు మా మహిమల వైపు మొగ్గాయి. కాని వారు మరీ అన్యాయంగా (అధికార)గర్వంతో విర్రవీగుతూ వాటిని తిరస్కరించారు. చూడు, ఈ దుర్మార్గులకు (ఆతర్వాత) ఎలాంటి దుర్గతి పట్టిందో! (13-14)
మేము దావూద్‌కు, సులైమాన్‌కు దివ్యజ్ఞానం ప్రసాదించాం. (అందుకు) వారు కృతజ్ఞులై) “దేవుడు మాకు విశ్వాసులైన అనేకమంది దాసులకన్నా ఎక్కువ ఔన్నత్యం, ఆధిక్యతలు ప్రసాదించాడు. ఆయనకు మేమెంతో రుణపడి ఉన్నాం” అన్నారు. (15)
సులైమాన్‌, దావూద్‌ (ప్రవక్త)కు వారసుడయ్యాడు. అతను జనంతో మాట్లాడుతూ “ప్రజలారా! మేము పక్షుల భాష నేర్చుకున్నాం. మాకు అన్ని విధాల వస్తువులు సమ కూరాయి. ఇదంతా పూర్తిగా దైవానుగ్రహం” అన్నాడు. (16)
సులైమాన్‌ కోసం మానవులు, భూతాలు, పక్షుల సైన్యాలు సమకూర్చబడ్డాయి. అవన్నీ క్రమశిక్షణలో ఉంచబడుతుండేవి. (ఓసారి అతను వారితో ప్రయాణం చేస్తూ) చివరికి వారంతా ఓ చీమలలోయలోకి ప్రవేశించారు. అప్పుడు ఒక చీమ (వారినిచూసి) “చీమల్లారా! (తొందరగా) మీరు మీపుట్టల్లోకి దూరండి. లేకుంటే సులైమాన్‌, అతని సైనికులు తమకు తెలియకుండానే మనల్ని తొక్కి నలిపేస్తారు” అన్నది. (17-18)
దాని మాటలు విని సులైమాన్‌ చిరునవ్వు నవ్వాడు. (తరువాత మాపట్ల కృతజ్ఞతా భావంతో) “ప్రభూ! నీవు నాకు, నా తల్లిదండ్రులకు చేసిన మేలుకు నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞుణ్ణయి ఉంటూ, నీకు నచ్చిన సత్కార్యాలు ఆచరించేలా నన్ను అదుపులో పెట్టు. దయతో నన్ను నీ పుణ్యదాసుల జాబితాలో చేర్చు” అని ప్రార్థించాడు. (19)
సులైమాన్‌ (మరోసారి) పక్షుల స్థితిగతులు సమీక్షిస్తూ “ఏమిటీ, ఫలానా వడ్రంగి పిట్ట కన్పించడం లేదు? ఎక్కడికైనా పోయిందా? అది నా దగ్గరకొచ్చి సరైన కారణం చెప్పాలి. లేకుంటే నేను దాన్ని కఠినంగా శిక్షిస్తాను లేదా కోసివేస్తాను” అన్నాడు. (20-21)
ఆతర్వాత కాస్సేపటికి ఆ పక్షి వచ్చి “నేను మీకు తెలియని ఓ విషయం గురించి వార్త తెచ్చాను. సబా(రాజ్యం) గురించి నమ్మకమైన సమాచారం తెచ్చాను. నేనక్కడ ఓ స్త్రీని చూశాను. ఆమె ఆజాతికి రాణిగా పాలన చేస్తోంది. ఆమెకు అన్నిరకాల సంపదలు ప్రసాదించబడ్డాయి. ఆమె సింహాసనం ఎంతో అద్భుతంగా ఉంది. కాని ఆమె, ఆమెజాతి ప్రజలు దేవుడ్ని వదలి సూర్యుడి ముందు సాష్టాంగపడుతున్నారు” అని చెప్పింది.
షైతాన్‌ వారి చేష్టల్ని వారికి మనోహరమైనవిగా చేసి, వారిని రుజుమార్గం నుండి తప్పించాడు. అందుకే వారు సన్మార్గం పొందలేక పోయారు. భూమ్యాకాశాలలోని నిగూఢ రహస్యాల్ని సైతం వెలికి తీయగల దేవునికి సాష్టాంగపడటం లేదు. ఆ శక్తిస్వరూపుడు సర్వం ఎరిగినవాడు. మీరు దాచే, బహిర్గతం చేసే విషయాలన్నీ ఆయనకు తెలుసు. ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయన మహో న్నత సింహాసనానికి అధిపతి. (విశ్వసామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి.) (22-26)
“సరే. నీవు నిజం చెప్పావో లేక అబద్ధాలమారివో మేము ఇప్పుడే కనుక్కుంటాం. నాయీ లేఖ తీసికెళ్ళి వారిముందు పడవెయ్యి. తరువాత పక్కకు వెళ్ళి దీనిపై వారి ప్రతిస్పందన ఏమిటో చూడు” అన్నాడు సులైమాన్‌. (27-28)
(దాని ప్రకారం వడ్రంగిపిట్ట లేఖ తీసికెళ్ళి సబారాణి ముందు విసిరింది.) సబా రాణి (దాన్ని చదివి) ఇలా అన్నది: “సభాసదులారా! నా దగ్గరకు అతి ముఖ్యమైన ఒక ఉత్తరం విసిరేయబడింది. ఇది సులైమాన్‌ దగ్గర్నుండి వచ్చింది. కరుణామయుడు, కృపాసాగరుడైన అల్లాహ్‌ పేరుతో ప్రారంభించబడింది. ఇందులో. ‘నా పట్ల తిరుగుబాటు వైఖరికి పాల్పడకుండా తక్షణమే విధేయురాలివై నావద్దకు వచ్చెయ్యి’ అని ఉంది.”
ఆమె (లేఖ సారాంశం చెప్పి) “ప్రజానాయకులారా! ఈ వ్యవహారంలో నాకేదైనా సలహా ఇవ్వండి. ఏవిషయంలోనూ నేను మిమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోను” అన్నది. దానికి వారు “మేము శక్తిమంతులం, గొప్ప సమరయోధులం. ఏం నిర్ణయం తీసుకోవాలో మీరే ఆలోచించి ఆజ్ఞాపించండి” అన్నారు. (29-33)
“రాజులు ఏదైనా రాజ్యంలో జొరబడితే దాన్ని సర్వనాశనం చేస్తారు. ఆ రాజ్యం లోని గౌరవనీయుల్ని పరాభవం చేస్తారు. వారు (మనల్ని) ఇలాగే చేస్తారు. అందువల్ల నేను వారి దగ్గరకు ఒక కానుక పంపిస్తాను. దానికి మన రాయబారి ఏం సమాధానం తీసుకొస్తాడో చూద్దాం” అన్నది రాణి. (34-35)
రాయబారి సులైమాన్‌ దగ్గరకు చేరుకున్నాడు. (ఆయనకు కానుక సమర్పించాడు.) అప్పుడు సులైమాన్‌ ఇలా అన్నాడు: “మీరు నాకు సిరిసంపదలతో సహాయం చేయ దలచుకున్నారా? దేవుడు మీకిచ్చిన దానికంటే ఎంతోఎక్కువ నాకు ప్రసాదించాడు. మీ కానుక మీకే చెల్లు. నిన్ను పంపినవారి దగ్గరకు తిరిగివెళ్ళిపో. మేము వారిపైకి బ్రహ్మాండ మైన సైన్యం తీసుకొస్తాం. వారెట్టి పరిస్థితిలోనూ దీన్ని ఎదిరించలేరు. మేము వారిని అక్కడ్నుంచి పరాభవంపాల్జేసి వెళ్ళగొడ్తాం. వారిక తుచ్ఛులుగా ఉండిపోతారు.” (36-37)
(రాయబారి వెళ్ళిపోయిన తరువాత) సులైమాన్‌ (తన అధికారులను ఉద్దేశించి) “సభాసదులారా! వారు లొంగిపోయి నా దగ్గరకు రాకముందే ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు మీలో ఎవరు తీసుకు రాగలుగుతారు?” అని అడిగాడు. (38)
దానికి జిన్నుల (భూతాల)లో ఒక దృఢకాయుడు లేచి “మీరు మీస్థానం నుండి లేవకముందే నేను దాన్ని మీముందు తెచ్చిపెడ్తాను. నాకాశక్తి ఉంది. పైగా నేను నమ్మక స్తుడ్ని కూడా” అన్నాడు. అయితే (విశేష) గ్రంథజ్ఞానం కలిగిన ఒకతను అందుకొని “మీరు కళ్ళుమూసి తెరిచేలోగానే నేను దాన్ని తీసుకొస్తాను” అన్నాడు. అనడం ఏమిటి, మరుక్షణమే ఆ సింహాసనం సులైమాన్‌ ముందు ప్రత్యక్షమయింది.
సులైమాన్‌ దాన్ని చూసి “ఇది నాప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞత చూపుతానా లేక అవిశ్వాసవైఖరితో కృతఘ్నుడైపోతానా అని నన్ను పరీక్షించడానికే ఆయన ఇలా చేశాడు. ఎవరైనా కృతజ్ఞత చూపుతున్నాడంటే అది అతనికే లాభదాయకమవుతుంది. కృతఘ్నుడైపోతే (అది అతనికే చేటు). నాప్రభువు నిరపేక్షాపరుడు దేన్నీ ఖాతరుచేయని వాడు, గొప్ప అనుగ్రహమూర్తి కూడా” అని అన్నాడు. (39-40)
ఆ తర్వాత సులైమాన్‌ (తన అధికారులతో) “ఆమె సింహాసనాన్ని తీసికెళ్ళి ఆమె ముందు పెట్టండి. (దీన్ని చూసి) ఆమె సరైన నిర్ణయానికి వస్తుందో లేక మార్గవిహీను ల్లోనే పడిఉంటుందో చూద్దాం” అన్నాడు. సబారాణి వచ్చాక “నీ సింహాసనం ఇలాగే ఉంటుందా?” అనడిగాడతను. దానికామె “ఇది అచ్చం అలాగే ఉంది. మేము ముందే (మీ సామర్ధ్యం) తెలుసుకున్నాం. మేము పూర్తిగా విధేయులయ్యాం” అన్నది. (41-42)
ఆమె అవిశ్వాసజాతికి చెందిన స్త్రీ. అంచేత ఆమె నిజదేవుడ్ని వదలి మిధ్యాదైవాల్ని పూజిస్తుండేది. ఈ అలవాటే ఆమెను (సత్యాన్ని విశ్వసించనీయకుండా) నిరోధించింది#
రాజమహల్‌లో ప్రవేశించమని ఆమెకు చెప్పాడు. (లోపల ప్రవేశించగానే) ఆమెకు అక్కడ ఒక నీటికొలను ఉన్నట్లు కన్పించింది. అందువల్ల ఆమె అందులోకి దిగి నడవ డానికి తన ముంగాళ్ళ మీది వస్త్రం పైకెత్తి పట్టుకుంది. అప్పుడు సులైమాన్‌ “ఇది గాజుతో నిర్మించిన నున్నటి నేల” అన్నాడు. దాంతో ఆమె (సత్యాన్ని గ్రహించి) “ప్రభూ! నేను ఆత్మద్రోహానికి పాల్పడ్డాను. ఇప్పుడు నేను సులైమాన్‌తో పాటు సర్వలోక ప్రభువుకు విధేయురాలినయి (ముస్లింనయి) పోయాను” అని అరిచింది. (43-44)
మేము సమూద్‌జాతి ప్రజల దగ్గరకు వారిసోదరుడు సాలిహ్‌ని పంపాము, దేవుడ్ని ఆరాధించాలన్న సందేశాన్నిచ్చి. (సాలిహ్‌ తన సందేశప్రచారం ప్రారంభించిన) వెంటనే వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం ఘర్షించుకోసాగారు. (45)
సాలిహ్‌ (ధర్మబోధ చేస్తూ) “నా జాతిప్రజలారా! మేలును వదలి మీరు కీడు కోసం ఎందుకు తొందరపడుతున్నారు? పాపక్షమాపణ కోసం దేవుడ్ని ఎందుకు వేడుకోరు? (దేవుడ్ని వేడుకుంటే) ఆయన మిమ్మల్ని కరుణించవచ్చు కదా?” అన్నాడు. (46)
దానికి వారు “నీవు, నీఅనుచరులు మాపాలిట దుశ్శకునాలుగా తయారయ్యారు” అన్నారు. సాలిహ్‌ దానికి సమాధానమిస్తూ “మీ దుశ్శకునాలు దేవుని చేతిలో ఉన్నాయి. మీరసలు (దేవుని చేత) పరీక్షించబడుతున్నారు” అన్నాడు. (47)
ఆ పట్టణంలో తొమ్మిది మంది ముఠానాయకులు ఉన్నారు. వారు దేశంలో అలజడులు రేపుతుంటారు. (సమాజ)సంస్కరణకు సంబంధించి ఒక్క పనీ చేయరు#
(ఒకరోజు) వారు పరస్పరం కూడబలుక్కుంటూ ఇలా అన్నారు: “మనం సాలిహ్‌ని, అతని కుటుంబసభ్యుల్ని ఓ రాత్రివేళ చంపేస్తామని దేవుని పేరుతో ప్రమాణం చేద్దాం. ఆ తరువాత అతని సంరక్షకునితో ‘అతని కుటుంబహత్య సమయంలో మేమక్కడ లేనేలేం, మేము నిజమే చెబుతున్నాం’ అని అందాము.” (48-49)
ఈవిధంగా వారొక పన్నాగం పన్నారు. ఇటు మేము కూడా వారికి తెలియకుండా ఓ పన్నాగం పన్నాము. ఇకచూడు, వారి పన్నాగం పర్యవసానం ఏమైందో. మేము వారిని, వారిజాతిని పూర్తిగా తుడిచిపెట్టాం. వారు చేసిన దౌర్జాన్యాలకు ఫలితంగా వారి ఇళ్ళు ఖాళీగా పడిఉన్నాయి. విజ్ఞులకు ఈ ఘటనలో గొప్ప సూచన ఉంది. సత్యాన్ని విశ్వ సించి భయభక్తుల వైఖరి అవలంబించినవారిని మేము రక్షించాం. (50-53)
మేము లూత్‌ని కూడా పంపాము. గుర్తుకు తెచ్చుకో. అప్పుడతను తన జాతితో ఇలా అన్నాడు: “మీరు తెలిసి కూడా బహిరంగంగా ఈపాడు పని చేస్తున్నారా? మీరు లైంగికానందం కోసం స్త్రీలను వదలి పురుషుల వెంట పడ్డారా? (ఎంత సిగ్గుచేటు!) మీరసలు (గతంలో ఎవరూ చేయని) బుద్ధిలేని పని చేస్తున్నారు.” (54-55)
కాని అతని జాతిప్రజలు (అతడ్ని బెదిరిస్తూ) “లూత్‌ కుటుంబాన్ని మన పట్టణం నుంచి బహిష్కరించండి. వీరు (మన మధ్య) పరమ పవిత్రులుగా ఉండగోరుతున్నారు” అని అన్నారు. అంతకుమించి వారి దగ్గర మరెలాంటి సమాధానం లేదు. (56)
చివరికి మేము అతడ్ని, అతని కుటుంబాన్ని రక్షించాం అతని భార్యను తప్ప. ఆమె వెనుకుండిపోవాలని ముందే నిర్ణయించాం. తరువాత మేము వారిపై (శిలా)వర్షం కురిపించాం. అది భయపెట్టబడినవారిపై వచ్చిపడిన మహాదారుణ వృష్టి. (57-58)
ముహమ్మద్‌ (సల్లం)! ఇలా చెప్పు: “సకల విధాల ప్రశంసలు దేవునికే శోభిస్తాయి. ఆయన ఎన్నుకున్న దైవదాసులకు శాంతి కలుగుగాక!”
(నిజ దేవుడైన) అల్లాహ్‌ శ్రేష్ఠుడా లేక వీరాయనకు సాటికల్పించిన దైవాలు శ్రేష్ఠమై నవా? సరే, భూమ్యాకాశాల్ని ఎవరు సృష్టించారు? మీకోసం ఆకాశం నుండి వర్షం కురిపించి, తద్వారా మీకు సాధ్యంకాని మనోహరమైన తోటలను పండిస్తున్నదెవరు? ఆ దేవుడే గాక (ఈ పనులలో ఆయనకు సహాయపడేందుకు) మరొక దేవుడెవరైనా ఉన్నాడా? (లేడు.) కాని వీరే సన్మార్గం వదలి (దుర్మార్గంలో పడి)పోతున్నారు. (59-60)
భూమిని నివాసయోగ్యంగా చేసిందెవరు? అందులో నదుల్ని పారజేసి, (కొండల) మేకుల్ని పాతిందెవరు? రెండు జలనిధుల మధ్య అడ్డంకిని పెట్టిందెవరు? అల్లాహ్‌తో పాటు మరో దేవుడున్నాడా? లేడు. అసలు వారిలో చాలామంది అజ్ఞానులే ఉన్నారు#
కష్టాలలో ఉన్నవాడు మొరపెట్టుకుంటున్నప్పుడు అతని మొర ఆలకించేదెవరు? చివరికి అతని కష్టాలు కడతేర్చుతున్నదెవరు? భూలోకంలో మిమ్మల్ని ప్రతినిధిగా చేసిం దెవరు? అల్లాహ్‌తోపాటు మరో దేవుడున్నాడా (ఈ పనులు చేయడానికి)? మీరసలు (ఈ విషయాల్ని గురించి) చాలా తక్కువగా యోచిస్తారు. (61-62)
నేలమీద, సముద్రం మీద కటికచీకటిలో (సైతం) మీకు దారి చూపిస్తున్నదెవరు? ఎవరు తన కారుణ్యానికి (వర్షానికి) ముందుగా శుభవార్త తెచ్చే (చల్లటి) గాలులను పంపిస్తున్నది? అల్లాహ్‌తో పాటు మరో దేవుడున్నాడా (ఈ పనులు చేయడానికి)? వీరు చేస్తున్న సృష్టిపూజకు అల్లాహ్‌ ఎంతో అతీతుడు, మహోన్నతుడు. (63)
ప్రాణులను తొలిసారిగా సృజిస్తున్నది, తర్వాత వాటిని పునరుత్పత్తి చేస్తున్నదెవరు? భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధి ప్రసాదిస్తున్నదెవరు? అల్లాహ్‌తో పాటు మరో దేవుడు కూడా ఉన్నాడా (ఈ పనులు చేయగలిగేవాడు)? వారినడుగు ‘మీ అభిప్రాయం నిజమైతే వీటికి (తగిన) ఆధారాలేమిటో చూపండ’ని. (64)
చెప్పు:“భూమ్యాకాశాల్లో దేవునికి తప్ప మరెవరికీ అగోచర విషయాలు తెలియవు. వారికి (మరణానంతరం) తాము ఎప్పుడు లేపబడతామో కూడా తెలియదు. (65)
వీరికసలు పరలోకానికి సంబంధించిన జ్ఞానమే లేదు. అంచేత దాన్ని గురించి వీరు అనుమానంలో పడివున్నారు. ఆ విషయంలో వీరు అంధులై పోయారు. (66)
పైగా ఈ తిరస్కారులు ఏమంటున్నారో చూడు: “మేము, మా తాతముత్తాతలు (చనిపోయి) మట్టిలో కలసిపోయిన తరువాత సమాధుల నుంచి మమ్మల్ని తిరిగి (బ్రతికించి) లేపటం సాధ్యమేనా? ఇలాంటి విషయాలు మాకూ విన్పించబడ్డాయి; గతంలో మా తాత ముత్తాతలకూ విన్పించబడ్డాయి. ఇవన్నీ మేము పూర్వం నుంచీ వింటూ వస్తున్న పుక్కిటి పురాణాలు మాత్రమే” అని అంటున్నారు. (67-68)
“కాస్త ప్రపంచం తిరిగి చూడండి, దుర్మార్గులకు ఏం గతి పట్టిందో!” అని చెప్పు. ప్రవక్తా! నీవు వారి గురించి విచారించకు. వారి దుష్టపన్నాగాలకు బాధపడకు. (69-70)
“నీవు చెప్పేది నిజమైతే ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుంది?” అని అడుగు తున్నారు వారు. “మీరు ఏ శిక్ష కోసం తొందరపెడ్తున్నారో అందులో కొంత భాగం మీకు అతి చేరువలోకి వచ్చిందేమో!” అని చెప్పు వారికి. (71-72)
మానవుల పట్ల నీ ప్రభువు అమిత దయాళువు. కాని చాలామంది (ఆయనకు) కృతజ్ఞత చూపరు. వారి హృదయాల్లో దాగిఉన్నదేమిటో, వారు బయటికి వ్యక్తంచేస్తున్న దేమిటో నీ ప్రభువుకు బాగా తెలుసు. భూమ్యాకాశాల్లో ఉన్న రహస్యాలన్నీ (ఆయన దగ్గర) ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదు చేయబడి ఉన్నాయి. (73-75)
ఈ ఖుర్‌ఆన్‌ ఇస్రాయీల్‌ సంతతి ప్రజలకు వారు పరస్పరం విభేదిస్తున్న అనేక విషయాలకు సంబంధించిన నిజానిజాలేమిటో తెలియజేస్తోంది. విశ్వాసుల పాలిట ఇది మార్గదర్శక గ్రంథం, (దైవ)కారుణ్యం. (76-77)
నిస్సందేహంగా నీ ప్రభువు తన ఆజ్ఞతో వారి గురించి కూడా తీర్పు చేస్తాడు. ఆయన మహా శక్తిసంపన్నుడు, సర్వం ఎరిగినవాడు. (78)
కనుక ముహమ్మద్‌ (స)! దేవుడ్ని నమ్ముకొని ఆయన మీదనే ఆధారపడు. నిస్సందేహంగా నీవు పూర్తిగా సత్యపథంలో ఉన్నావు. నీవు మృతప్రాయులకు (ఏ మంచి విషయం) విన్పించలేవు. వెన్నుజూపి పారిపోయే బధిరులక్కూడా నీమాట విన్పించలేవు. అలాగే అంధులకు దారిచూపి వారినీ మార్గభ్రష్టత్వం నుండి కాపాడలేవు. మా సూక్తులు విశ్వసించి విధేయులయ్యేవారికి మాత్రమే నీవు నీమాట విన్పించగలవు. (79-81)
(ప్రళయం గురించి) మా వాగ్దానం నెరవేరే సమయం వచ్చినప్పుడు మేము వారి కోసం భూమి నుండి ఒక (వింత) జంతువుని బయటికి తీస్తాము. అది (దేవుని ప్రతినిధిగా) వారితో మాట్లాడుతూ “ప్రజలు మాసూక్తులు విశ్వసించేవారు కాదు” అంటుంది. (82)
ప్రతి సమాజం నుండి మా సూక్తులు తిరస్కరించినవారి గుంపునొక దాన్ని ఓరోజు చుట్టుముట్టి తెస్తాం. తర్వాత వారిని తరగతుల వారిగా విభజిస్తాం. ఇలా అందరూ వచ్చిన తర్వాత “మీరు నా సూక్తుల్ని గురించి ఆలోచించకుండానే (మొండిగా) తిరస్క రించారా? లేకుంటే మరేం చేస్తుండేవారు?” అని ప్రశ్నిస్తాడు (దేవుడు). వారు చేసిన అన్యాయం వల్ల శిక్ష గురించిన (మా)వాగ్దానం నెరవేరుతుంది. అప్పుడు వారు నోరు మెదపలేరు. మేము వారికోసం రాత్రిని విశ్రాంతి సమయంగా, పగటిని వెల్తురు సమయంగా చేశాము. దీన్ని వారు గమనించ లేదా? విశ్వసించేవారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. (83-86)
ఆరోజు (ప్రళయ) శంఖారావంతో భూమ్యాకాశాల్లోని సమస్త జీవరాసులు బెదిరి పోతాయి. కాని దేవుడు కాపాడదలచుకున్న వారు బెదిరిపోరు. (తరువాత) అందరూ వినమ్రులై ఆయన సన్నిధిలో హాజరవుతారు. ఈరోజు నీవు పర్వతాలను చూసి దృఢంగా పాతుకుపోయి ఉన్నాయని భావిస్తున్నావు. కాని ఆ సమయంలో ఇవి మేఘల్లా ఎగురుతాయి. ఇది దేవుని మహత్తు. ఆయన ప్రతి వస్తువునీ తగిన విధంగా పటిష్ఠ పరిచాడు. మీరు చేస్తున్న పనులను గురించి ఆయనకు బాగా తెలుసు. (87-88)
పుణ్యకార్యాలు తెచ్చినవారికి అంతకన్నా మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాంటి వారు ఆరోజు సంభవించే బీభత్సం నుండి సురక్షితంగా ఉంటారు. పాపకార్యాలు తెచ్చిన వారిని బోర్లా పడవేసి నరకాగ్నిలో విసిరేయడం జరుగుతుంది. చేసుకున్నవారికి చేసు కున్నంత. అంతకంటే మీరు మరో ప్రతిఫలం ఆశించగలరా? (89-90)
ప్రవక్తా! వారికిలా చెప్పు:“నేనీ నగర ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞయింది. ఆయన ఈ నగరాన్ని (ఎలాంటి రక్తపాతం జరగనివ్వకుండా) నిషిద్ధ ప్రాంతంగా చేశాడు. (సృష్టిలోని) ప్రతి వస్తువూ ఆయనదే. నేను (విశ్వప్రభువుకు) విధేయుణ్ణయి (ముస్లింనై) ఉంటూ, ఈ ఖుర్‌ఆన్‌ని (ప్రజలకు) విన్పించాలని ఆజ్ఞయింది.”
కనుక ఎవరైనా సన్మార్గం అవలంబిస్తే, తన శ్రేయస్సు కోసమే అవలంబిస్తాడు. దారితప్పినవారితో నీవు హెచ్చరించేవాడివి మాత్రమేనని చెప్పు.“సకల ప్రశంసలు దేవునికే శోభిస్తాయి. త్వరలోనే ఆయన మీకు తన సూచనలు చూపుతాడు. మీరు వాటిని గుర్తిస్తా ర”ని కూడా చెప్పు. మీ కర్మలపట్ల దేవుడు ఏమాత్రం అజాగ్రత్తగా లేడు. (91-93)