ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము.

శాలివాహనశకము.

అనేకశకములు మనదేశములో వాడబడుచున్నవి. వింధ్యకు నుత్తరభాగమున విక్రమార్కశకమును దక్షిణ భాగమున (దక్షిణాపథమున) శాలివాహన శకమును వాడబడుచున్నవి. ఈ శకముల కీ పేరు లెట్లుగలిగెనని శంక పుట్టిపండితులు విశేషముగా జర్చించిరి. విక్రమార్కుని శకము క్రీ.పూ 57వ సంవత్సరముతో ప్రారంభమైనది గాని విక్రమార్కుడా కాలమున లేడు. శాలివాహనశకము క్రీ.త 78 వ సంవత్సరముతో బ్రారంభమైనిది గాని మొదటి శాలివాహనుడా కాలమున లేడు. అందుచేత నీ శకములకు వీరిపేరులెట్లు ముడి పెట్టబడినవని సంశయము కలుగుచున్నది. అనేక హిందూరాజులుతమతమ శకములను స్థాపించిరి కాని యవియన్నియును నంతరించినవి. గుప్తశకము, వల్లభిశకము, శ్రీహర్షశకము మొదలగునవి యన్నియు నంతరించి పోయినవి. ఒక కవి యారుశకముల నొక చాటు ధార పద్యములో బేర్కొనియున్నాడు.[1] మొదటిది యుధిష్టరశకము. ఇది యిప్పుడు వాడుకలో లేదు. రెండవది విక్రమార్కశకము వింధ్యకు నుత్తరమునను మూడవది శాలివాహనశకము వింధ్యకు దక్షిణమునను వ్యవహారములోనున్నవి యిదివరకె దెలిసియుంటిమి. ఉజ్జయినీ పురాధీశ్వరుండయిన విక్రమాదిత్యుడు క్రీ.పూ 57వ సంవత్సరమున శకనులు (Indo scythians) నోడించి శకారియని బిరుదము వహించి క్రీస్తుశకము 78వ సంవత్సరమున శాలివాహనునితో యుద్ధము చేసి హతుడయ్యెననియు జెప్పుదురు. ఇది చాలా విరుద్ధమైన షయము. ఇట్టి విరుద్ధవిషయమును గూర్చి పండితులు చర్చించుట వింత విషయముకాదు. డాక్టరు భావుదాజీ గారుజనరల్ కన్నిహ్యామ్ గారితో నేకీభవించి శాలివాహనశకము గోతమిపుత్రునికి ముడిపెట్టిరి.[2] గాని తుదకు జష్టిన్ న్యూటన్ గారితో నేకీభవించి నహపానునకు ముడివెట్టిరి.[3] ఆ కాలమునందు గోతమిపుత్రుడు ప్రాముఖ్యుడని డాక్టరు ఫర్యూసన్ గారు తలంచినవారయినను వారి కాలనిర్ణయపద్ధతిని బట్టి గోతమిపుత్రుడు నాలుగవ శతాబ్దాములోనికి బోవలసివచ్చినది. అయినను తరువాత వారు శకనులను జయించుటకును శకమునకును సంబంధమేమియు లేదనియు, శకరాజగు కనిష్కుని పట్టాభిషేకముతో బ్రారంభమైనదని చెప్పుచు విక్రమార్కశకము నంతకుబూర్వమునగాక నవీనకాలమునకు దెచ్చిపెట్టిరి.[4] [5] డాక్టరు ఓల్డెన్ బర్గు గారికి కడపటి యభిప్రాయము ఫర్యూసన్ గారి యభిప్రాయమునకు సరిపోవుచున్నది. సి. కన్నిహ్యామ్ గారు ఫర్యూసను గారి యభిప్రాయముతో [6] [7]నేకీభవించుచు ఘూర్జర క్షాత్రవులు శకనులయిన పక్షముననేగాని లేనియడల శకనులకును శాలివాహనశకమునకు సంబంధమేమియులేదని నుడువుచున్నారు.[8] కన్యాకుబ్జరాజగు శ్రీహర్షుడు విక్రమార్కశకమును రూపుమాసి తనశకమును స్థాపించెనని చెప్పదురు గాని యది విశ్వసింపదగినది కాదు. ఇంతకును క్రీ.శ.811 వ సంవత్సరమునకు బూర్వము విక్రమార్కశకసంవత్సరము తేదియు నేనియు దృష్టాంతమునకై శాసనములయందు గానరావు.[9] ద్రావిడ సాంప్రదాయములు ప్రతిష్టానపురాధీశ్వరుడయిన శాలివాహనునితోనే జనించినదని సూచించుచున్న వని చెప్పెడు కర్నల్ మెకంజీ గారి యభిప్రాయముతో కర్నల్ విల్ఫర్డుగారేకీభవించుచున్నారు. [10] మరికొందరాతడింక శ్రామణుడనియు, అతడు జైనుడు గాని బౌధ్దుడు గానియై యుండవచ్చుననియు, ఆతడు తనదేశశత్రువుల నెదుర్కొనుటకై గోదావరి నుండి యుత్తరమునకుబోయి యుండెననియు వర్ణించుచున్నారు.[11] జైనగ్రంథకర్త లాలి డొక మహావిద్వాంసుడనియు, గ్రంథకర్త యనియు సాధారణముగా వర్ణించియున్నారు. పదునొకండవ శతాబ్దమునకు బూర్వమున నుండెడి తామ్రశాసనము లన్నిటిలోను శకనృపకాలమని కన్పట్టుచున్న దనియు, బాదామి యను ప్రదేశము నందలి యొక శాసనములో శకరాజుయొక్క పట్టాభిషేకము మొదలుకొని ప్రారంభమైన కాలమని (శకకాలము) వ్రాయబడి యున్నదనియు, ఆ శకశబ్దమే తరువాత మరియొక యర్థమున వాడబడుచున్నదనియు, మొదటిదానిని మరచిపోయిరనియు, తరువాత వారీశకము నెవ్వరిదో యొక గొప్పరాజునకు ముడి పెట్టవలసివచ్చి శాలివాహనశకమని శాలివాహనుని పేరుతో ముడిపెట్టివాడుచున్నారే గాని శబ్దార్థప్రకారము చూచిన పక్షమున నందర్థము లేదనియు, రెండు రాజకుటుంబముల గలసిన పేరుగా నున్నదనియు డాక్టరు భాండార్కరుగారు నుడువుచున్నారు. [12]

ఎవరివాదమెట్లున్నను శాలివాహన శకమెవ్వని పేరుతో ముడివెట్టినను, మొదటినుండి గాకపోయినను కొన్ని శతాబ్దముల క్రిందటనుండి యైనను వ్యవహారములోనికి వచ్చినది గనుక మన మీ శకమును శిరసావహింపవలసిన దనుటకు సందియము లేదు. ఇది మొదటి సౌరాష్ట్రమాళవ దేశపు క్షా త్రపులచే బ్రారంభిపబడినెది గాని యాక్షాత్రపుల రాజ్య మంతరించిన వెనుక విద్వాంసుడై ప్రజారంజకుడై పరిపాలనము చేసిన హాలశాతవాహనునితో ముడివెట్టబడినది. అతడాకాలపువాడనుట సత్యము. కాబట్టి హాలశాతవాహనునితో శాలివాహనశకము ప్రారంభమైనదని మనము విశ్వసింపవచ్చును. కొదువవిషయములతో మనకు నిమిత్తములేదు. కాని శాలివాహనవంశజుడగుట చేత నీ హాలశాతవాహనుని శాలివాహను డవవచ్చును గాని యితడు మాత్రము మొదటిశాలివాహనుడు గాడని జ్ఞప్తియందుంచుకొనవలయును.

అమరావతీ స్తూపము బయల్పడుట.

హిందూ ద్వీపకల్పము యొక్క పశ్చిమభాగమున నున్న సాంచి స్తూపము వలె గాక(The Tope at Sanchi) అమరావతీస్తూపము సంపూర్ణముగా నాశము చేయబడుటవలన [13] భూమిలో బాతుకొనిపోయి మంటిదిబ్బలచే కప్పబడి సామాన్యదృష్టికి గానరాక మరుగుపడి యుండుటచేత అస్సీరియా మంటిదిబ్బలలో బాతుకొనిపోయి మంటిదిబ్బలచే గప్పబడి మరుగుపడియుండిన బోతా లేయార్డులవలెనె యూరుపేరు లేక యుండెను. అదృష్టవశముచేత వర్షము గురిసినప్పు డేరాతిపలకయైన బయల్పడెనేని అచ్చటి నివాసస్థుకేద్వారబంధము క్రిందనో వేసికొనుట గాని యేసున్నము కొరకు కాల్చివేయుటగాని తటస్థమగుచుండెను. అందువలన కట్టడము యొక్క నడిమిభాగము నిలిచియుండలేదు. కర్నల్ మేకంజీదొరగారు క్రీ.శ.1797 వ సంవత్సరము లో జిల్లాలో సంచారము చేయునపు డీయమరావతీస్తూపము వారిదృష్టి నాకర్షించినది. అంతకు రెండుమూడుసంవత్సరములకు బూర్వము చింతపల్లి రాజుగారగు శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు బహాదూర్ గా రాస్థలమునందుండిన అమరేశ్వరాలయముయొక్క మహాత్మ్యముచే నాకర్షింపబడి యచ్చటనొకపురమున నిర్మించి తనకు రాజధానిగ జేసికొనవలయునని నిశ్చయించి తన నూతన రాజధానీనగరమున రాజభవనము నొకదాని గట్టుటకై తాళ్లు కావలసి దీపాలదిన్నెయును మంటిదిబ్బను మరికొన్ని సమీపమునందలి దిబ్బలను త్రవ్వ నారంభించెను. తన చే గట్టబడుచున్న అమరావతికి బడమట ఒక మైలు దూరమున నున్న ధరణికోట యొక్క పురాతనపు గోడలనుగూడ విడియగొట్ట నారంభించి వానింగూడ నుపయోగపరచుకొనుచుండెను. ప్రాచీనము లయిన రాతిపలకలు విగ్రహములు మొదలగు ననేకములు నాశము చేయబడి గొనిపోబడినవి. దేవాలయములకును భవనములకును పెద్దపెద్ద రాళ్లు పెక్కులు రాజాగారిచే గొనిపోబడినవి కాని విగ్రహములు చిత్రింపబడిన రాతిపలక లనేకము లింకను మంటిదిబ్బలలో బూడ్చుకొని పోయి యున్నవి. తరువాత నివి కర్నలు మెకంజీగారి దృష్టి నాకర్షింపగా వారు దీని వృత్తాంతము నంతను వ్రాసి "ది ఏషియాటిక్ సొసయిటీ ఆఫ్ బెంగాల్" అను సంఘమునకు (The Asiatic Society of Bengal) బంపించిరి. [14] అటుపిమ్మట మరికొంతకాలమున కనగా 1812 న సంవత్సరమున వారు మరల నా స్థలమునకు విచ్చేసిరి. అప్పటికి వారు "సర్వియర్ జనరల్ ఆఫ్ మెడ్రాస్" అను నుద్యోగపదవికి వచ్చిన వారగుటచేత దీపాలదిన్నెలోపల నుండిన చైత్యమును బయలుదీయుటకు దమ స్వాధీనములో నుండిన సాధనముల నన్నిటిని రెండు సంవత్సరముల వరకు నుపయోగపరచు చుండిరి. దీపాలదిన్నెకు "హిల్ ఆఫ్ లైట్సు"(Hill Of Lights) అని పేరు పెట్టిరి.

అమరావతి చైత్యము యొక్క ప్లానులును, చుట్టునుండి ప్రదేశములయొక్క పటములును, రాతి పలకలపై జిత్రింపబడిన 80 విగ్రహముల యొక్క పటములును మిక్కిలి జాగరూకతతో వ్రాయించుటయె వీరి కృషి యొక్క ఫలితముగా నున్నది. ఈ పటములును వీరికి సహాయకారులుగా నుండి హామిల్టను, న్యూమాన్ బర్కు అనువారు మిక్కిలి యందము గాను, రూపభేదము లేకయుండ సరిపోవునట్లుగను వ్రాసియుండిరి. ఆ పటములయొక్క ప్రతినొకదానిని పైజెప్పిన "ది ఏషియాటిక్ సొసయిటీ ఆఫ్ బెంగాల్" అనుసంఘమునకును రెండవప్రతి మద్రాసులో నుంచుటకును మూడవప్రతి ఇంగ్లాండులోని డైరెక్టర్లకును బంపించిరి. మూడవప్రతిని డైరెక్టర్ల పుస్తక భాండాగారమున నిప్పటికిని జూడవచ్చును. వీనివివరమును వర్ణించుచు వ్రాసిన చరిత్ర మేదియును బంపబడనందునను అచ్చటి వారు దీని నవగాహాము చేసికొని గ్రహించుట గష్టముగ నుండుట చేతను వీనినిగూర్చి యెవరను నాలోచింపనైరి. 1837వ సంవత్సరమున వానిలోని రెండు శాసనములను ప్రిన్సెప్ గారి పత్రికయందు భాషాంతరీకరించి ప్రచురించుటతక్క మరేపనియును జరిగియుండలేదు. అయినను అదృష్టవశము చేత సర్ వాల్టరు ఎలియట్ దొరగారు1840 వ సంవత్సరమున గుంటూరులో కమీషనర్ గా నుండుట తటస్థించెను. ఆయనగారు కర్నల్ మెకంజిగారు పూనిన పనిని తామవలంబించి పనిచేయుటకు నిశ్చయించుకొనిరి. ఆయనగా రదివఱకు ద్రవ్వి యుండని ప్రదేశమును త్రవ్వించి సొగసుగా విగ్రహములు చెక్కబడిన ఱాతిపలకల నెన్నిటినో పోగుచేసి చెన్నపురికి బంపగా నయ్యవి పదునాలుగు సంవత్సరముల వఱకు వానకు నాని యెండకు వెండి తుదకు 1852 వ సంవత్సరమున నింగ్లాండునకు గొనిపోబడినవి. దురదృష్ణవశము చేత నయ్యవి హిందూదేశములో సిపాయీల కలహము ప్రారంభమయిన కాలమనగా ప్రాతదయిన "ఈస్టుఇండియా కంపెనీ" అంతరించి " న్యూ యిండియా కవున్సిల్" ఏర్పడుటకు నడుమ బంపబడిన వగుట చేత వానికి స్వాగతమిచ్చి యాదరించువారు లేకపోయినందున ఫైఫ్‌హావుసు(Fife House) యొక్క కోచిహవుసు(Coach House) లో ద్రోసివేయబడినవి. పనికిమాలిన చెత్తలో గొంతకాల మణగి మణగి యుండి 1867వ సంవత్సరమున డాక్టరు ఫర్యూసను గారి పాలబడుట తటస్థించెను. ఆయనగారు డాక్టరు ఫోర్బోస్, వాట్సన్ మొదలగు వారియొక్కయు, వారియుద్యోగస్థుల యొక్కయు సహాయముతో వాని నన్నిటిని బయులునకు దెప్పించి తేజోలేఖనము (photograph) గావించిరి. ఆ సాధనములతో ఫర్యూసన్ గారు అమరావతీ స్తూపమునువశము జేసికొనుటకు గృషి చేసిరి. అటువంటి పురాతన చైతన్యములయొక్కయు, నూతన చైత్యములయొక్కయు జ్ఞానమాయన కలిగియున్నను ఇందు విజయముగాంచక పోయియుందురు. కాని యాకట్టడముల యొక్క తేజోలేఖనములలోనే కట్టడములోని భాగములయొక్క ప్రతిరూపములు సరిగా జిత్రింపబడినవి గానవచ్చుటచేత వారికి గట్టడముయొక్క ప్రతిరూపము గన్నులకు బొడగట్టినది. వీనిసహాయము చేత విగ్రహములు గల ఏఱాతిపలక లేభాగమునం దుండినవో తెలిసికొన గలిగిరి. అమరావతీస్తూపము యొక్క స్థల నిర్దేశ మీ క్రిందిపటమువలన మీకు సులభముగా బోధపడగలదు.
అది కృష్ణానదీ ముఖద్వారమునకు నెగువున నఱువది డెబ్బది మైళ్ల దూరమున మునియేఱు సంగమించు స్థానమున కెదురుగ గృష్ణానదికి గుడిప్రక్కను దక్షిణపుటొడ్డున గట్టబడి యున్నది. ప్రాతపట్టణమగు ధరణికోటకు దూర్పుగా నరమైలు దూరమున కూచితిప్పయను మఱియొక మంటిదిబ్బ గలదు. అది యింకను బరిశోధింపబడవలసి యున్నది. దక్షిణమున నక్క దేవరదిన్నె యను మఱియొక మంటిదిబ్బ కలదు గాని యది త్రవ్వబడి యందు బూడ్చుకొని పోయి యుండినవస్తువులు నూతననగరనిర్మాణమునందు నుపయోగింపబడినవి. ఈయమరావతీ స్తూపమును ఇచ్చటి పురాతనశిలలు మొదలగువానిని భూమిలో నుండి పెళ్లగించి కాపాడుటకై దొరతనము వారి ప్రయత్నములు నేటివఱకును జరుగుచునే యున్నవి, పురాతనపు గట్టడములు పురాతనపు బనిముట్లు పురాతనపు శిలలు మొదలగున వెన్నియో బయలుపడినవి. ఇంకను గొన్ని బయలుపడుచున్నవి. ఇంకను మఱికొన్ని బయలుపడవచ్చును. ఈ‌విషయమున ప్రాచీన వస్తు పరిశోధనాధికారిగ నుండిన (ఆర్క్యలాజికల్ సర్వే డిపార్టుమెంటునకు స్యూపరింటెండుంటు) రీ దొరగారు 1902వ సాంవత్సరిక వృత్తాంతమునందు వ్రాసిన వాక్యములను దెలుపుట యుక్తము. [15] "1902-07(?)సంవత్సరములన జేసినపని గతసంవత్సరము జేయగా మిగిలిన పనిని ప్రారంభించుటయే యై యుండును. అందు ముఖ్యముగా నుత్తరద్వారమువద్దను పశ్చిమద్వారము వద్దను ప్రారంభింప బడియెను. అసలు మంటిదిబ్బపైన మన్ను పరిమాణము లెక్కింప నలవి కాని యంతయత్యధికముగా నిలిచి యుండుటచేత ఈ ద్వారములకడ దాగోబా (చైత్యము) లను కనుగొనునంతటి దూరమువఱకు త్రవ్వికను కొనిపోయి యుండలేదు. అయినను ఫలితములు రంజింప జేయునవిగా నున్నవి. ఇటుకగోడలును చలువఱాళ్ల గ్రాదికంబములయొక్క భాగములును బయలుపడినవి. ఇవిమాత్రమే గాక సంపూర్ణములయిన ప్రత్యేక విగ్రహములును, తునకలయిపోయిన విగ్రహములును పెక్కులు బయలుపడినవి. సొగసుగా జిత్రింపబడిన యొక నల్లని చిన్నఱాతి విగ్రహమును, శాసనములును, చలువఱాతిపలకలును నిడుపాటి ఱాతితొట్లును, ఱాతికంబములును మనుష్యవిగ్రహములును, స్తంభములయొక్క పీఠములును, నాణెములును, పూసలును మఱియునొక యిత్తడిగొలుసు, మేకులు, చీరణములు (కాసెయులులు) కత్తులు, ఒక గంటము, ఒక తాపియు(గోడమొదలగువానికి సున్నము వేయు పనిముట్టు) చక్కగ పోతపోయబడిన యొక మట్టికూజాయు, పెక్కుమంటి సెమ్మెలు, మంటితాంబాళము, మంటిగొట్టములు, మంటిచట్టములు, మంటిమూకుళ్లు మొదలగు వస్తువులును, మనుష్యుల దంతములు, మనుష్యుల బొమికలును గానుపించినవి. ఈ ద్వారముల కడగానిపించిన గోడలు వెలుపలి మంటిదిబ్బలవఱకును వ్యాపించి యుండుటచేత దాగోబాలుండిన యెడల బయలుపడు వఱకు త్రవ్వించవలసిన పనినిలిచియున్నది."

ధాన్యకటకనగరము.

భరతఖండమునందలి పురాతన పట్టణములలో పాటలీపుత్త్రమునకు దరువాత ధాన్యకటకనగరమే విశేషప్రఖ్యాతి గాంచినదిగా నున్నది. ఇది క్రీస్తుశకమునకు బూర్వము నాగరాజులకును క్రీస్తుశకమునకు దరువాత శాలివాహనులకును రాజధానినగరముగానుండి యాంధ్ర సామ్రాజ్యమునకంతకు బహుశతాబ్దములకాలము మేటికిరీటమా ప్రకాశించియుండెను. ఈ మహానగరము పదునెనిమిది శతాబ్దములక్రిందట బొందిన మహోన్నతవైభవమంతయు నాగరికతాప్రశస్తి గాంచిన పాశ్చాత్యపండితమండలి నేడు ధరణికోటమంటిదిబ్బలలో గాంటి యచ్చెరువందుచు వేనోళ్ల బొగడుచుండుటనకు జూచుచుండునపుడాంధ్రదేశమున జన్మించిన యేదేశభక్తుని హృదయమున కానందజనకముగా నుండ కుండును? ఈ పురాతనాంధ్రనగరములో బ్రాచీనాంధ్రులచారిత్రము గూడ బయలుపడి యాంధ్ర జాతీయాభివృద్ధికి దోడ్పడుచున్నది.

ఈధాన్యకటకమునే కొందఱు ధన్యకటకమనియు, ధనకటకమనియు గూడ వాడుచువచ్చిరి. మొదటిపేరు ధాన్యకటకమే గాని మఱియొకటికాదు. ఇది 12, 13, 14 శతాబ్దములలో ధాన్యవతీపురమనుపేరను బిలువంబడు చుండెనని శాసనములు కూడ రూఢిఫఱచుచున్నవి. శాలివాహనశకము 1293 వ సంవత్సరమున కు సరియైన క్రీస్తుశకము 1391 వ సంవత్సరమున అమరావతీ గ్రామమునందలి యమరేశ్వరాలయములలోని యొక శాసనములో శ్రీ ధాన్యవతీపురమని తెలుప బడినది. మఱియును కృష్ణామండలములో నూజివీడు తాలూకా లోని యెనమదల గ్రామములో నొక ఱాతిబండపైనుండు శాసనములో గూడ ధాన్యవతీపురమనియె చెప్పబడినది. [16] ఈ ధాన్యకటకమను శబ్దము టిబెట్ దేశ గ్రంథములలో " ద్పల్ -ల్దాస్ -బ్రాస్-స్ప్రూయిన్‌సు"(Dpal-Idan-brasspruius) అని భాషాంతరీకరింప బడినది. అనగా ధాన్యరాశు లధికముగా గలపట్టణమని యర్థమట. ఈ పట్టణమునందే గొప్ప చైత్యమున్నదని యాదేశ చరిత్రమును వ్రాసిన తారానాథుడు నుడువుచున్నాడు. ఈపై వృత్తాంతములను బట్టి ధాన్యకటకమను పేరు నిజమైన పేరుగా గన్పట్లుచున్నదనుటకు సందియములేదు. చీనాదేశపుయాత్రికుడగు హౌనుత్సాంగు ధాన్యకటకమును వర్ణించిచెప్పిన విషయములనుబట్టి ధాన్యకటక నగరముండిన ప్రదేశము ధరణికోటయగునా కాదాయని పాశ్చాత్యపండితులలో గొందఱు విశేషముగా జర్చించిరి. ధాన్యకటకము ధరణికోట కాదనియు, విజయవాడ (Bezwada) యనియు వాదించిన వారిలో రాబర్టు స్యూయలు గారు ప్రాముఖ్యతను గాంచియున్నారు. వీరు హౌనుత్సాంగు చేసిన వర్ణన నాధారపఱచుకొనియో వాదించుచున్నారనుటకు సందియుము లేదు గాని సంగతి సందర్భములన్నిటిని చక్కగ నాలోచించి చూచిన పక్షమున విజయవాడ గాక ధరణికోటయే ధాన్యకటకనగరమని చెప్పుటకు ప్రబలహేతువులు కలవని పెక్కండ్రు చరిత్రకారులు తలంచుచున్నారు. హౌనుత్సాంగు ధాన్యకటకమునకు దూర్పున బూర్వశైల సంఘారామమును పశ్చిమమున నపరశైల సంఘారామమును గలవని పేర్కొనియున్నాడనియు అయ్యవి పర్వతములకు జేరియున్నవని చెప్పియున్నాడనియు, అపూర్వశైల సంఘారామమె బెజవాడకు దూర్పుననున్న కొండపైనున్నదనియు, అపర శైల సంఘారామము బెజవాడకు బడమటనున్న కొండపై నున్నదనియు, ధాన్యకటకమునకు దక్షిణముననున్న కొండగుహలలో భావవివేకస్వామి తపస్సు చేసికొనుచున్నాడని యాయాత్రికుడు వచించియున్నానడనియు, అదియె బెజవాడకు దక్షిణ భాగమునందుండిన ఉండవిల్లి కొండ యనియు అపరశైల సంఘారామము అమరావతీ స్తూపమె యైనయెడల నచ్చట కొండలేవియు లేకుండుటకు గారణమేమియనియు, చుట్టును గొండలేవియును లేక వట్టిబయలులో నుండుటచేత నయ్యది ధాన్యకటకము కాదనియు, కొన్ని నెలలు నివాసము చేసియుండిన హోనుత్సాంగు వర్ణించిన వర్ణనలకు బెజవాడ మాత్రమె సరిపోయియుండుటచేత ధాన్యకటకనగరము తప్పక బెజవాడయే యగునని తమయభిప్రాయమని స్యూయలు గారు కంఠోక్తిగ జెప్పియున్నారు. [17] అయినను భరతఖండము నందలి బౌద్ధుల స్తూపములను, బౌద్ధులగుహలను, పర్వతములలో డొలువంబడిన పురాతన దేవాలయములను బరిశోధించి వానింగూర్చి గ్రంథములను వ్రాసిన డాక్టరు ఫర్యూసను గారు స్యూయలుగారి వాదము నొప్పుకొనక ఖండించి ధరణికోటయే ధాన్యకటకమని సిద్ధాంతీకరించి యున్నారు. వీరివాదమె విశ్వసనీయ మైనదిగ గన్పట్టుచున్నది. చీనాయాత్రికుని వ్రాత సందిగ్ధముగ నున్నదనియు, వారు కండ్లతో జూచి వ్రాసియుండిరో వినికిడినిబట్టి వ్రాసియుండిరో నిజము తెలియరాదనియు, అపరశైల సంఘారామమును గూర్చి వర్ణించిన వర్ణన అమరావతీస్తూపమునకు సరిపోవుచున్నది గాని బెజవాడ కొండలమీది గుహలకువర్తించుచుండలేదనియు, ఉండవల్లి కొండగుహలు పౌరాణిక సంబంధమైనవిగాని పురాతన బౌద్ధమత సంబంధమైన గుహలు కావనియు, అందలి యనంతశయనుని దేవాలయము నవీనమైనది గాని మిక్కిలి పురాతనమైనది కాదనియు, హిందూదేశమునందుండిన బౌద్ధవిహారము లన్నిటితో బోల్చి చూచినపుడు బెజవాడగుహలు భేదించినవిగా నున్నవనియు అమరావతీస్తూప మట్లుగాక సార్వవిధముల చేతను తక్కినవానింబోలియున్నదనియును, ఇంతియగాక హిందూదేశమునందలి స్తూపములలో బ్రధానమైనదిగా నుండి దేశస్థులకు దిగ్భ్రమగొల్పెడి సమీ ప స్తూపమును విడిచి యే విధము చేతను మనోహరముగానుండని బెజవాడ గుహలను వర్ణించియుండెనని చెప్పుట పొసగియుండలేదనియు, అమరావతీ స్తూపములోని విగ్రహములను బోలు నొక్క విగ్రహమైన ఒక్క శాసనమైన గంటికి గానరాదనియు, ఏడవశతాబ్దమునందుండి వ్రాసిన వ్రాతలో బొరపాటు లుండవచ్చుననియు, హౌనుత్సాంగు వాక్యములను భాషాంతరీకరించిన బీల్ గారి భాషాంతరీకరణమునకు ను జ్యూలియును గారి భాషాంతరీకరణమునకును భేదమున్నదనియు మొదలగు విషయముల నెన్నిటినో చర్చించి స్యూయలుగారి వాదమును బూర్వపక్షము చేసియున్నారు.[18]

ధాన్యకటకమును బాలించిన యాంధ్రరాజుల పేరులను, ధాన్యకటకమును పేరును అమరావతీస్తూపములో గానవచ్చినవి, ఆంధ్రుల శాసనములు మాత్రమె కాక వారితరువాత పాలనము చేసిన యాంధ్ర పల్లవుల శాసనములగూడ అమరావతియందు గానుపించినవి. ధాన్యకటక నగరములోని బుద్ధుని చైత్యమును సందర్శించి బుద్ధునికి నమస్కరించుటకై వచ్చితినని చెప్పి పల్లవరాజగు సింహవర్మయొక శాసన మొక స్తంభము పైని వ్రాయించెను. ఆ స్తంభముకూడ అమరావతి లోని మంటిదిబ్బలో నుండి పైకిదీయబడినది. నవీనులు కూడ ధాన్యకటకము ధరణికోటయనియే భావించుచుండిరికాని బెజవాడయని భావించుచుండలేదు. కాబట్టి హౌనుత్సాంగు వ్రాసిన వ్రాతయని చెప్పెడి పరస్పర విరుద్ధములయిన కొన్ని వాక్యములను బట్టి బెజవాడయే ధాన్యకటకమని భావించుట భ్రమకాని వేఱొండుకాదు.

- - - -

  1. j. R A. S. B, vol viiip. 118
  2. Ibid vol viii p
  3. Ibid p. 233 (3)
  4. J.R. A. S. n s vol. iv p. 127
  5. Indian Antiquary vol x
  6. J.R. A. S. n s vol. iv p. 127
  7. Indian Antiquary vol x
  8. Arch,Rep vol v, p.20
  9. J.R.A.S Bombay Branch vol ii p. 371
  10. Asiatic Researches vols ix, x
  11. Taylor's Cat Rais vol 111 page-42.
  12. Early History of the Deckhan. pp. 29-30
  13. అయిదవశతాబ్దమునందుండిన నాతాపిపురాధీశ్వరుండును పశ్చిమ చాళుక్యరాజు నగు మొదటి పులకేశివల్లభునిచే అమరావతీ స్తూపము నాశము చేయబడినదని యొక శాసనముబట్టి తెలియుచున్నది.
  14. See Asiatic Researches vol IX page. 272
  15. The Annual Progress Report of the Archeological Survey Department, Southern Circle for the Year 1906-07, p.2.
  16. See. Mr. Mackenzie's Kistna District Manual.
  17. Mr. Sewell's Dhanyakacheka.
  18. గ్రంథ విస్తర భీతిచేత వీరి చర్చలను సంపూర్ణముగ దెలుపజాలక సంగ్రహములుగా వారి భావములను మాత్రము దెలిపితిమి.