ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవప్రకరణము.

శాతవాహనవంశము.

శ్రీముఖశాతవాహనుడు.

- - -

(క్రీ పూ. 73 మొదలుకొని 50 వఱకు)

ఏదీవి నే డాంగ్లేయనాగరికతన జన్మభూమియై భూమండలములోని యేబదికోట్ల ప్రజల మాయురైశ్వర్యభారమును భారమని యెంచక పోషింపగంకణముగట్టుకొని తల్లిశిశువునుంబోలె గర్భమునధరించి, సూర్యుడస్తమింపని రాష్ట్రమునకు మూలవిరాట్టుగనున్నదో, అట్టితెలిదీవి (బ్రిటన్)లోని యాదిమప్రజలయిన బ్రిటనులు రెండువేల సంవత్సరములక్రిందట కొండకోయలరీతి ననాగరికులైనను స్వేచ్ఛగానుండి స్వపరిపాలనము జేసి కొనుచుండ యూరోపుఖండముయొక్క ప్రాగ్దేశముల నప్రతిమాన ప్రతాపమునుజూపుచు దిగ్విజయయాత్రలుసలుపుచు కీర్తికాముడై విహరించుచు బ్రిటనులస్వాతంత్ర్య మపహరింతునని భుజష్పాలనము సేయుచు వారిజన్మభూమిని మ్రింగివేయుదనని ఉవ్విళ్లూరచునుండిన "జూలియస్ సీజర్" అను రోమనుచక్రవర్తివలెగాక ఆకాలమునందే జంబూద్వీపముమధ్యను, కృష్ణా గోదాలరీనదులకును పూర్వ పశ్చిమసముద్రములకును నడుమ యశోభరితమై విస్తరిల్లుచుండిన యాంధ్రరాజ్యమున కభిషిక్తుండయిన శ్రీముఖశాతవాహనుడు, భరతఖండమునకు శిరోభూషణముగా నుండిన మగధరాజ్యము తొంటిప్రాభవమును బోగొట్టుకొని యవన శకపహ్లవాదిశాత్రవులచే జుట్టుకొనబడి యంతఃకలహములచే జీవకళను గోల్పోయి, విపద్దశనొంది యుండుటను జూచి, యుపేక్షించిన దనరాజ్యమునకెక్కడ ప్రమాదముగలుగునో యని మగధరాజ్యముపై దాడివెడిలి, రాజునంతఃపురవాసునిగ జేసి నిరంకుశాధికారమును నెఱపుచుండిన బ్రాహ్మణమంత్రియగు సుశర్మను జంపి మగ ధరాజ్యమునాక్రమించుకొని, దేశమునందలి యల్లరుల మాన్పి, రాజప్రతినిధినినొక్కని నియమించి, తన రాజధానియగు ధాన్యకటకమునకు మరలివచ్చెను. ఇందునుగూర్చి చరిత్రకారులు భిన్నాభిప్రాయములు గలిగి యుండుటచేత నీ యంశమును సహేతుకముగా సమర్ధింపకున్న పక్షమున నీ వాక్యము గొందఱకు బరిహాసపాత్రముగా దోచవచ్చును. కాణ్వాయనుడను సుశర్మను జంపి మగధరాజ్యము నాక్రమించినవాడు శ్రీశుకుడని మత్స్యపురాణమును, శ్రీప్రకుడని విష్ణుపురాణమును బ్రహ్మాండపురాణమును, సింధుకుడని వాయుపురాణమును, పేరు చెప్పక వృషలుండని మాత్రము భాగవతపురాణమును బేర్కొని శ్రీముఖుని పేరెత్తకయుండుటచేతను, ప్రాచీన హిందూదేశ చరిత్రమును వ్రాసిననవిన్సెంటు.ఎ.స్మిత్తు గారు సుశర్మను జంపినవాడు శ్రీముఖుడుగాక కుంతల శాతకర్ణి గాని, శాత శాతకర్ణిగాని, పులమాయిగానియై యుందురనియు, క్రీస్తునకుబూర్వము 27వ సంవత్సరమున కాణ్వవంశ మంతరించియుండెనని యొప్పుకొన వచ్చునని మగధరాజ్యమును బాలించిన శుంగరాజులలో గడపటివారు పేరునకు మాత్రము రాజులుగానుండి పీష్వాలచేతులలోని మహారాష్ట్ర రాజులవలె బ్రాహ్మణ మంత్రులచేతులలో బొమ్మలవలెనున్న మాట వాస్తవమేయైనను శుంగరాజులలో బదియవవాడగు దేవభూతి కాణ్వాయన బ్రాహ్మణుడగు వాసుదేవునిచే జంపబడియెనని పురాణములయందును బాణకవి విరచితమగు నార్ష చరిత్రమునందును స్పష్టముగ జెప్పబడియున్నందున శుంగవంశముతో కాణ్వవంశము సమకాలీనమని చెప్పెడి డాక్టరు భాండార్కరుగారి వాదము [1] గ్రాహ్యముకాదనియు వ్రాసియుండుటచేతను శ్రీముఖునిగూర్చి కొంచెము చర్చింపవలసియున్నది. పురాణములలోని యాంధ్రరాజుల నామములును శాసనములలోని నామములును భేదములేక సరిపోయినవగుటచేతను పురాణములలో బ్రాచీనపురాణమయిన మత్స్య పురాణము శ్రీశుకుడని చెప్పియుండుటచేతను, దేవనాగరలిపిలో శకార మకారములకు నీషణ్మాత్రమే భేదము గలిగియుండుటచేత లేఖకులు శ్రీముఖు డనుటకు శ్రీశుకుడని, భ్రమప్రమాదదోషమున వ్రాసియుండవచ్చునని భాండార్కర్ పండితుడు చెప్పినమాట యుక్తియుక్తముగనుండుటచేతను శ్రీశుకుడే శ్రీముఖుడని చెప్పినందువలన బ్రత్యవాయమేమియు లేదు. కాణ్వుని జంపినవాడు పురాణములలో జెప్పబడిన పురులుగలవారిని శ్రీముఖునిగూడ స్మిత్తు గారు నిరాకరించి మఱిముగ్గురి పేరులుచెప్పి వారిలో నెవ్వడో యొకడై యుండునని తలంచినను శ్రీశుకుడే శ్రీముఖుడని యొప్పుకొనియున్నారు. [2] సుశర్మను జంపినవాడు శ్రీశుకుడని పురాణములుద్ఘోషింపుచుండగా గాదనిచెప్పుటకును, తాము పేర్కొనిన ముగ్గురిలో నొకడై యుండునని చెప్పుటకును, స్మిత్తుగారు హేతువులను గనబఱచియుండలేదు. ఇంతియగాక యాంధ్రభృత్యవంశములో శ్రీముఖుడు మొదటివాడని కూడ చెప్పిరి. పురాణములలో బేర్కొనబడినవారిలో నీతడు మొదటివాడనియే మేమును అంగీకరింతుముగాని యీతనికి బూర్వమాంధ్రరాజులు లేరిన యూహించి చెప్పెడు మాటలు మాత్రము విశ్వసింపదగినవికావు. శుంగవంశజులు క్రీ.పూ.185వ సంవత్సరము మొదలుకొని 112 సంవత్సరములనగా 73వ సంవత్సరము వఱకు బరిపాలించిరని చరిత్రకారులందఱు నంగీకరించిరి. పురాణములలో గాణ్వాయనులయిన నలుగురు బ్రాహ్మణపాలకులకు జెప్పిన 45 సంవత్సరములకు శుంగవంశజులకు జెప్పిన 112 సంవత్సరములలో నిమిడియున్నవని భాండార్కర్ గారు చెప్పినదానిని స్మిత్తుగా రాక్షేపించియున్నారు గాని కొంచెము విమర్శదృష్టితో జూచిన పక్షమున భాండార్కరుగారూహించినదే సహేతుకముగాగన్పట్టుచున్నది. ఎందుకన "చత్వారః శృంగభృత్యస్తే నృపాః కాణ్వాయనాద్విజాః" యని కాణ్వాయనద్విజులను శృంగభృత్యులనియు "కాణ్వాయస్థ (నంత) తో భృత్యః సుశర్మాణం ప్రసహ్యతం, శృంగాణాం చైవయచ్చేషంక్షపయిత్వా బలంతదా" యని కాణ్వాయనులను మాత్రమేగాక శృంగవంశజుల శేషించిన యధికారమును గూడ [సింధుకుడను పేరుగల యాంధ్రభృత్యుడు (శ్రీముఖుడు)] పెఱికివేసెనని వాయుపురాణమునందు చెప్పియుండుటచేత శృంగవంశజులు బలహీనులయినందున కాణ్వాయన ద్విజు లిటీవలినవీన కాలమునందలి పీష్వాలవలె బేరునకు శుంగరాజుల గద్దెపై నుంచి సర్వాధికారమును దాముపూని పరిపాలించుచుండిరనియూహించినది యుక్తియుక్తముగానె గన్పట్టుచున్నదిగాని యాక్షేపణీయముగగన్పట్టదు. ఇంతియగాక కాణ్వాయనులు బ్రాహ్మణులగుటచేత వారు కేవలము రాజ్యాధిపత్యము వహించి పాలించిరని చెప్పుట యప్పటి కాచార విరుద్ధముగ గన్పట్టుచున్నది. మఱియు పురాణములయందిట్లు చెప్పినది యీ కాణ్వ వంశమునుగూర్చియేకాని మఱియే వంశమును గూర్చియు జెప్పియుండకపోవుటచేత తప్పక శ్రీముఖుడు క్రీ.పూ.23వ సంవత్సరముననే మగధ రాజ్యమును జయించెననుట హేతుయుక్తముగగన్పట్టుచున్నది. మఱియును శ్రీముఖుడు కల్పిత పురుషుడుగాడు. వీని పేరుగల శాసనములు రెండుగానంబడుచున్నవి. అందొకటి రాజధానీ నగరమగు ధాన్యకటకములోని స్తూపములోను [3] (అమరావతీస్తూపము) రెండవది పశ్చిమాంధ్రదేశము (మహారాష్ట్రము) లోని నానాఘట్టములోని యొక్క గుహలోను గలవు. [4] అమరావతీ స్తూపములోని శాసనమిట్లున్నది. "Rano Siri-Sivamaka Sadasapaniyagliarlkasaha"అనగా సిరిసివమకరాజు యొక్క వాణీయశాలకు నధికారిగానున్న వానిదాన మనియర్థము. జున్నారునుండి కొంకణమునకు బోవుబాటమీద నుండు నానాఘట్టముయొక్క శిరోభాగమునందు బాటసారులు విశ్రాంతికై తొలువబడిన యొక గుహలో గోడపైన ఆఱువిగ్రహములు చెక్కబడి వానిపైన పేరులు వ్రాయబడియున్నవి. ఆ విగ్రహములిప్పుడు చాలవఱకు శిధిలములైయున్నవిగాని పేరులు మాత్రము నిలిచియున్నవి. ఈ గుహలోనే వేదశ్రీయను రాజుయొక్క శాసనమున్నది. "1. రాయసిముక సాతవాహనో; 2. దేవినాయనికాయ రాణ్ణోచసిరి సాతకానీనో; 3.కుమారోభాయా; 4.మహారాణిగా నాకాయిరో; 5. కుమారోహాకుసిరి; 6.కుమారోసాతవాహనో;"వీనిలో మొదట బేర్కొనబడిన రాయసిముక యను పేరును అమరావతీస్తూపములోని "రాణోసిరిసివమక" యను పేరును నొక్కని పేరులేయై యుండవచ్చునని డాక్టరు హల్ ట్ జ్ గారు చెప్పినది సముచితముగానున్నది. సిముక, సినమక శబ్దములు శ్రీముఖ శబ్దము యొక్క ప్రాకృతరూపములగాని వేఱొండుగావు. కాబట్టి యీ పై నుదాహరించిన ప్రమాణములను బట్టి యాంధ్రభృత్యవంశమునందు శ్రీముఖుడను రాజుగలడనియు, అతడు ధాన్యకటకమును రాజధానిగ జేసికొని యాంధ్రదేశమును బాలించుచుండెననియు, అతడే మగధదేశముపై దండెత్తి కాణ్వాయనులను శుంగులను జయించి రాజ్యమును గైకొనియెననియు నిస్సంశయముగా విస్పష్టముగా జెప్పవచ్చును. ఇంకొక విశేషముగలదు. శ్రీముఖశాతవాహనుండని చెప్పబడియుండుటచేత నితడు తప్పక శాతవాహన వంశజుడని చెప్పకయె చెప్పుచున్నది. మొదటి శాతవాహనునకును ఈ శ్రీముఖ శాతవాహనునకును నడుమ రాజులెందఱో కొందఱుండియుండక తీఱదని శ్రీముఖశాతవాహనుడను పేరే వేనోళ్ళ ఘోషించుచున్నది. కనుకనితడు శాతవాహన వంశమునకు మూలపురుషుడు కాడు. పూర్వప్రకరణము నందు మేము సూచించినట్లుగా సాతవాహనుడే శాతవాహన వంశమునకు మూలపురుషుడై యున్నాడు. శ్రీముఖుడు 23 సంవత్సరముల పరిపాలనము చేసియున్నట్లు వాయుమత్స్యపురాణములలో బేర్కొనబడియుండెనుగావున క్రీ.పూ.50వ సంవత్సరము వరకును బరిపాలనము చేసియుండవచ్చును.

కృష్ణశాతవాహనుడు.

(క్రీ.పూ. 50 మొదలుకొని 40 వఱకు.)

శ్రీముఖుని తరువాత రాజ్యాధిపత్యము వహించినవాడు కృష్ణుడని పురాణములన్నియు భిన్నాభిప్రాయములు లేక యైక కంఠ్యముగా బేర్కొనుచున్న వి. ఇతడు పది సంవత్సరములు మాత్రమే రాజ్యము చేసెనని వాయుపురాణమును 18 సంవత్సరములని మత్స్యపురాణమును చెప్పుచున్నవి. వీని పేరుదాహరించిన శాసనమొకటి నాసికపట్టణ సమీపమునందలి యొక చిన్న గుహలో గన్పట్టుచున్నది. శాతవాహన వంశజుడయిన కృష్ణుడను రాజుయొక్క సైన్యాధికారులలో నొకనిచే నా గుహ త్రవ్వించబడినదని యందు వ్రాయబడియుండెను. [5] కాని యితడు శాతవాహన రాజకుటుంబములో జేరిన యొక సామాన్యుడేగాని రాజుగాడనియు, ఇతనికి రాజబిరుదావళులేవియును లేవనియు, ఈ కృష్ణుడే పురాణములలో నాంధ్రభృత్య వంశములో రెండవవాడుగా బేర్కొనబడిన కృష్ణుడే యని యనేకు లభిప్రాయ పడుచున్నారుగాని కేవలము పొరబాటనియు, ఎందుకన నప్పటికి నాంధ్రులు దక్షిణాపథమునకు వచ్చియుండలేదనియు దక్షిణ హిందూదేశపు నాణెముల చరిత్రమును వ్రాసిన సర్ వాల్టరు ఎల్లియాట్ గారు వ్రాయుచున్నారు. [6] వీరివాద మెంత మాత్రమును విశ్వసింపదగినదికాదు.

క్రీస్తుకు బూర్వము మూడుశతాబ్దముల క్రిందట ద్రావిడులాంధ్రులని కాళింగులని యిరు తెగలుగానేర్పడి గంగానదీ ముఖద్వారమున నివసించుచుండి యశోకుని కాలమునందు రాజును గలిగియుండు దొరతనమునకు వశులై మౌర్యరాజుల యనంతరము సంభవించిన రాజ్యకల్లోలమును బురస్కరించుకొని మగధ రాజ్యమునాక్రమించుకొనియు శకనులను విదేశరాజులతోడ పోరుపడలేక మొదటి శతాబ్దమున నాకాలమునందలి యాచారముబట్టి యాంధ్రులును, కాళింగులును స్వకుటుంబసపరివార సమేతముగా సముద్రతీరము వెంబడిని దక్షిణమునకు వచ్చిరనియు, వారిలో కాళింగులు గోదావరి నదికి నుత్తర భాగమున నిలిచియుండిరనియు, ఆంధ్రులు "పరికాడ్ ఆంధారి" యను చిల్కసరస్సుయొక్క యొడ్డులను గొంతకాలముండి తరువాత బయలుదేఱి వచ్చి కృష్ణాతీరమున నాంధ్రరాజ్యమును స్థా పించి ధాన్యకటకమును రాజధానికగ జేసికొని బహుకాలము పాలించిరనియు, వీరు గంగాతీరమున బ్రప్రథమమున నివసించిన ప్రదేశము "మాల్భూమి (మాలభూమి)" నుండి వచ్చిన వారగుటచేతనే పంచమజాతివారికి మాలలను పేరు నిలిచియున్నదనియు, ఆంధ్రభృత్యరాజులలో గోతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లియగు గోతమియు, గోతమి పుత్ర శాతకర్ణి భార్యయగు వాసిష్ఠయు సుప్రసిద్ధులయిన రాణులు గావున వారిపట్ల గల గౌరవాతిశయముచేత గోదావరి మండలములోని గోదావరి నది యొక్క ముఖ్యములయిన రెండు శాఖలకు గౌతమియనియు, వాసిష్ఠయనియు వారి పేరులే పెట్టబడెనవనియు, అశోకుని కాలమునందు వీరు గంగాతీరమున నుండుటచేత నా కాలమునాటి లిపి వీరికి దెలిసియే యున్నదిగనుక వీరిచ్చటికి వచ్చినపుడు వీరి శాసనములయందాలిపినే వాడుచు వచ్చిరని శాసనములు దెలుపుచున్నవనియు వ్రాసియున్నారు. వీరి వాదము భ్రమైకమూలమైనదిగాని సహేతుకమైనది కాదు. అశోకుని కాలమునకు బూర్వమె కాళింగులు మహానదికిని గోదావరికి నడుమనుండు దేశమున నున్నవారుగాని గంగానదీ ముఖద్వార ప్రదేశముననున్నట్లు ప్రమాణము గానరాదు. అశోకుడు క్రీ.పూ.261వ సంవత్సరమున గాళింగులను జయించి వారి దేశము నాక్రమించియు గాళింగులకు దాను గలిగించిన క్షోభమునకు పశ్చాత్తప్తుడై కాళింగులయెడలను, సరిహద్దుల నుండెడు తదితర జాతుయెడలను సౌహార్ధ్ర భావము గలిగియుండి మహామాత్రులనంబడెడు రాజకీయాధికారులు వర్తింపవలసిన విధులను గుఱించి భువనేశ్వరమునకు సమీపమున "ధౌళి"యను ప్రదేశమునందును, గంజామునకు బడమట జౌగడాయను ప్రదేశమునందును శాసనములను వ్రాయించెను. [7] గంగానదీ ముఖద్వారమునందే కాళింగులుండిన యెడల నచ్చోటనే యా శాసనములను వ్రాయించియుండును. ఈ యొక్క యంశమే కాళింగులచ్చట లేరని వేనోళ్ళ జాటగలదు. మఱియును క్రీ.పూ.రెండవ శతాబ్ద మధ్యముననుండిన ఖారవేలుడు వ్రాయించిన హాతిగంఫాగుహలోని శాసనమున నాంధ్రరాజగు శాతకర్ణిని పశ్చిమదేశమునందు బెట్టియుండుటగూడ నాంధ్రులు గాని, కాళింగులుగాని గంగానదీ ముఖద్వారప్రదేశమున నుండలేదని ధ్రువపఱచుచున్నది. ఆంధ్రదేశము కళింగదేశమునకు బశ్చిమమునను దక్షిణమునను వ్యాపించియుండుట చేత నాంధ్రరాజగు శాతకర్ణిని పశ్చిమదేశమునందు బెట్టినది యుచితముగానేయున్నది. ఆంధ్రులు మాల్భూమి (Malbhunii in Midnapur District)నుండి వచ్చినవారనుటకు మాలల పేరు దృష్టాంతముగా జూపినది వింతగా గన్పట్టకమానదు. కర్నలు విల్ఫర్డు గారు కర్ణశబ్దమును గైకొని క్రీస్తు శకము పండ్రెడవ శతాబ్దమునందుండిన శ్రీకర్ణదేవుడు మొదలుగా గల కాలదుర్య రాజులకును అంతకుబూర్వము పండ్రెడు శతాబ్దముల క్రిందటనున్న యాంధ్ర శాతకర్ణులకును ముడివెట్టి వృధాయాసము పడినరీతిని వీరును మాల శబ్దమును మాల్భూమికి ముడిపెట్టుచుండిరి. మాలలు మాలవర్తులను వారిని వాయు మత్స్య పురాణములు మధ్య దేశమునందలి జాతులలో జేర్చియున్నవనియు, మార్కండేయ పురాణముయొక్క వ్రాతప్రతిలో మాలదాసులును, గవరవర్తులును తూర్పుజాతులలో నుదాహరింపబడినను అచ్చు ప్రతిలో మాత్రము మానదాసులనియు, మానవర్తికులనియు సవరింపబడియుండెననియు, విల్ఫర్డు గారు మాల మిడ్నపూరు(మిధునపురము)లోని మాల్భూమికి సంబంధించినట్లుగా జెప్పుచున్నారుగాని మాల్భూమి మేఘదూతలో సూచించిన ప్రకారము చటీష్ఘరులో నున్నదని నేను తలంచుచున్నాని ఎచ్.ఎచ్.విల్సనుగారు వ్రాయుచున్నారు. [8] తెలుగు పరయాల క న్వయించెడి మాలశబ్దముయొక్క వ్యుత్పత్తి సందిగ్ధముగా నున్నదనియు, అఱవములో నలుపునకు మాలశబ్దముపయోగింపబడుచున్నది గాని తెలుగులో నుపయోగింపబడుచుండ లేదనియు, మాలలనియెడి యనాగరిక జాతి వారిని పురాణములు పేర్కొనుచున్నవిగాని వారినివాసస్థానము సందిగ్ధముగా నున్నదనియు, పురాణములలో బేర్కొనబడిన పేరు రాజమహలు గొండలలో నివసించెడు నాదిమవాసులయిన మాలరులను, గొండుజాతులకన్వయించుననియు, దానిని తెలుగు పరయాలకు ముడివెట్టుట సాహసమని బిషప్ కాల్దువెల్లు దొరగారు వ్రాసియున్నారు.[9] కాబట్టి యిదియును వారి వాదమున కంత ప్రయోజనకారి కాదు. ఆంధ్రరాణులగు గోతమియొక్కయు, వాసిష్టయొక్కయు పేరులు గోదావరి యొక్క రెండు శాఖలకు బెట్టబడినవని వాదముకొఱకు నొప్పుకొన్నను ఆంధ్రులు గంగాతీరస్థులని యా విషయమెట్లు సమర్థింపగలరో యెన్ని విధములచేత జూచినను మాకు గోచరము గాకయున్నది. ఆంధ్రులు గంగాతీరస్థులనుట వట్టి భ్రమకాని బలమైన సాక్ష్యముగాన్పింపదు. విల్ఫర్డు గారు చెప్పినట్లుగ ఎనిమిది శతాబ్దములుగాని, ఎల్లియాట్ గారు చెప్పినట్లుగ మూడుశతాబ్దములు గాని యాంధ్రులు గంగాతీరము నందుండినయెడల నొక్క శాసనమైన గానరాదా? ఒక్క కట్టడమైన గానరాదా? ఒక్క నాణమైనా గానరాదా? ఏదియును గానరాదు. ఇంక నాంధ్రదేశము నందన్నచో యచ్చట జూచినను బౌద్ధులయిన యాంధ్రరాజులు పరిపాలించిన చిహ్నములే గాన్పించుచున్నవి. ఎచ్చటజూచినను శిథిలములయిన బౌద్ధాశ్రమగుహలును, స్తూపములనియెడి బౌద్ధాలయములును, వానిలో నాంధ్రరాజుల శాసనములును, ఆంధ్రరాజుల బంగారు వెండి సీస నాణెములును గాన్పించుచున్నవను మాటవారెఱుంగనిది గాదు. ఆంధ్రరాజు లలో రెండవవాడుగా బేర్కొనబడిన కృష్ణునిపేరుదాహరించిన శాసనము నాసిక పట్టణ సమీపమునందలి గుహలో గన్పడినప్పుడును, ఆతడు శాతవాహన వంశములోని వాడని చెప్పినప్పుడును, అతనికి బూర్వుడగు శ్రీముఖునిపేరు గూడ శాసనములలో గూడ గన్పడినప్పుడును, ఏల యొప్పుకొనరాదు? ఒప్పుకొన్న పక్షమున నాంధ్రులు గంగాతీరమునుండి ప్రథమ శతాబ్దమున వచ్చిరని చెప్పిన తమ వాదమునకు భంగమును కలిగించునది గాన వారేలయొప్పుకొందురు? శాసనములోనుదాహరింపబడిన కృష్ణరాజు శాతవాహన వంశజుడేయైన యెడల గడపటివారిలో వాడయి యుండునుగాని మొదటి కృష్ణుడు మాత్రము కాజాలాడట? ఇదియంతయును తమ వాదమును నిలువబెట్టుకొనుటకై చెప్పెడు మాటలు గావున వానిని విశ్వసింపరాదని మా యభిప్రాయము.

శ్రీ శాతకర్ణి.

(క్రీ.పూ. 40 మొదలుకొని క్రీ.త.16 వఱకు.)

కృష్ణుని తరువాత శ్రీ శాతకర్ణి రాజ్యాభిషిక్తుడయ్యెనని వాయువిష్ణుభాగవత పురాణములు పేర్కొనుచున్నవిగాని మత్స్యపురాణము మాత్రము కృష్ణుని తరువాత శ్రీమల్లకర్ణియు, పూర్ణోత్సంగుడును, స్కంద స్తంబియునను ముగ్గురురాజులను పేర్కొనుచున్నది. శ్రీశాతకర్ణి తరువాత విష్ణుపురాణము పూర్ణోత్సంగుని మాత్రము పేర్కొనుచున్నది. శాతకర్ణుని శాంతకర్ణునిగను, పూర్ణోత్సంగుని పౌర్ణమాస్యునిగను మార్చి భాగవత పురాణము శాంతకర్ణుని తరువాత పౌర్ణమాస్యుని బెట్టుచున్నది. ఈ నాల్గయిదు పురాణములును పేరులను తికమకలుచేసి యిచ్చవచ్చినట్లు వాడియుండుటచేత కాలనిర్ణయము చేయుట సాధ్యముకాదు. రాజుల పేరులను యువరాజుల పేరులను రాజప్రతినిధుల పేరులను విచ్చలవిడిగా వాడియుండుటచేత నిజముగా రాజులుగానున్న వారెవ్వరో చెప్పుటకు శాసనములు దక్క వేఱుగ నాధారము గాన్పింపదు. కాబట్టి శాసనములతో సరిపోవు వారి పేరులు మాత్రమె రాజులుగా బరిగణింపబడుచున్నవి. కాబట్టి మల్లకర్ణి, పూర్ణోత్సంగుడు, స్కందస్తంబినిగూర్చి చరిత్రాంశములేవియు వినరావు. వారల శాసనములుగాని నాణెములుగాని గానరావు. కాబట్టి కృష్ణుని తరువాత రాజ్యాధిపత్యమును వహించి ప్రసిద్ధిగాంచినవాడు శ్రీశాతకర్ణియనువాడు. ఇతడేబది యాఱు సంవత్సరములు పరిపాలనముచేసెనని పురాణములలో పేర్కొనబడియెను. పైనుదాహరించిన నానాఘట్టము గుహలోని యాఱు విగ్రహములలో నీ శాతకర్ణియొక్కయు, ఈతని పట్టపురాణి యొక్కయు విగ్రహములు రెండు గలవు. వానిపైన "దేవినాయని కాయా రాణోచసిరిసాతకానీనో" యని వ్రాయబడియుండుటచేత నందలి శ్రీశాతకర్ణి యితడేయనియు, ఇతని పట్టపురాణి వాయనికాదేవి యనియు వేద్యమగుచున్నది. ఇతనికి బూర్వుడగుటచేతనే శ్రీముఖుని విగ్రహమును వాని పేరును ముందు జిత్రింపబడిన తరువాత తన దేవియొక్కయు తనయొక్కయు విగ్రహములను జిత్రింపించెను. తరువాత కుమార భాయా యనువానిని విగ్రహముండెను. ఇతడు రాజునకు జ్యేష్ఠపుత్రుడై యుండలయును. తరువాత మహారాష్ట్ర నాయకుని విగ్రహముండెను. ఇతడు ప్రధాన సైన్యాధ్యక్షుడై యుండవలయును. తరువాత కుమారహాకు శ్రీయొక్కయు, కుమార సాతవాహనునియొక్కయు విగ్రహములుండెను. వీరు శాతకర్ణియొక్క కడపటి కొడుకులయి యుండవలయును లేక మనమలై యుండవలయును. ఎవ్వరయినను మహారాష్ట్ర నాయకుడు దక్క యందఱును శాతవాహన వంశములో జేరిన యొక్క రాజకుటుంబములోనివారనుటకు లేశమాత్రమును సందియములేదు. శాతవాహన వంశజులయిన యాంధ్రరాజులు శాతకర్ణియను పేరును పలువురు వహించి యుండుటచేత గూడ కొంత చిక్కునకు గారణమగుచున్నది. శాతకర్ణియను శాతవాహన వంశవృక్షమునందు బల్మఱు గన్పట్టు చుండుటచేత విన్సెంటుస్మిత్తుగారు శాతకర్ణి వంశమని తలంచుట భ్రమకాని వేఱొండుగాదు. ఇంగ్లాండు దేశమునందు రాజ్యము చేసిన రాజులలో హెన్రీ, చార్లెసు, జార్జి, ఎడ్వర్డు పేరులు గలవారెందరు లేరు? మొదటి హెన్రీ , మొదటి చార్లెసు, మొదటి జార్జి, మొదటి ఎడ్వర్డు అని వరు ససంఖ్యతో చరిత్రములందు వారలను బ్రశంసింపుచు వ్రాయుచుండుటలేదా? ఒక దేశపు రాజులలో నొక పేరునే పెక్కండ్రు వహించినంత మాత్రముచేత నా రాజులవంశమును హెన్రీవంశముగాని చార్లెసు వంశమని కాని, జార్జి వంశముని కాని, ఎడ్వర్డు వంశముగాని చెప్పుచుండుట లేదు. అట్లే యిచ్చటను శాతకర్ణియను పేరుగల వారు పెక్కండ్రు పరిపాలించినను గౌరవార్థముగ శాతకర్ణియను పేరును తమ నామముల కడను కొందఱు ధరించినను మొదటి శాతకర్ణి రెండవ శాతకర్ణి మూడవ శాతకర్ణియను చెప్పుకొనవలయునే గాని శాతవాహన వంశమన్నట్లు శాతకర్ణి వంశమని తలంపరాదు. [10] శాతకర్ణియను పేరు పురాణాది సంస్కృత గ్రంథములంగానంబడుచున్నను శతకర్ణియను పేరు సరియైనదయినట్లుగా గన్పట్టుచున్నది. గోతమి పుత్ర శాతకర్ణికి సమకాలీనుడగు "చెంకుడ్డువాన్ చేర" యను చేరరాజునకు సోదరుడగు "ఇల్లంకొ ఆడికాల్" " నూఱువార్ కన్నార్" అని పేరిడియున్నాడు. [11] అనగా నూఱుగురు కర్ణులని యర్థము. అట్లయిన యెడల నయ్యది శతకర్ణియను పేరునకు సరిపోవుచున్నది గాని శాతకర్ణియను పేరునకు సరిపోవుచుండలేదు. సమకాలీనుడగు కవివ్రాసిన "శతకర్ణి" యను పేరును ద్రోసివేయుటకు నాంధ్రరాజులకు బహుకాలమునకు వెనుకబుట్టిన పురాణములలో శాతకర్ణియని వ్రాయబడియుండుట యొక్కటియే యాధారముగానున్నది కాని వేఱొండుగానరాదు. శతకర్ణుడనగా నూఱు కర్ణములు గలవాడు. అనగా రాజ్యాంగ విషయములను నూఱుచెవులతో వినుచు దక్షతతో బరిపాలించువాడని అర్థము. క్రీస్తుశకారంభముననుండిన యీ శాతకర్ణియె ఖారవేలునకు మగధరాజుతోనైన యుద్ధమునందు తోడ్పడినవాడని చెప్పివిన్సెంటు స్మిత్తుగారు వీనిని నూటయేబది సంవత్సరములు వెనుకకు దీసికొనిపోయి విడిచిపెట్టిరి. అట్లుచేయుటకు గారణము గలదు. ఆంధ్రభృత్య వంశపురాజు లశోకుని కాలమునుండి పరిపాలించుచున్న వారని విశ్వసించెడు వారిలో విన్సెంటు స్మిత్తుగారొకరు. ఆంధ్రరాజులు ముప్పదుండ్రు 456 సంవత్సరములు మగధరాజ్యమును పరిపాలించిరని మత్స్యవిష్ణుపురాణములలో జెప్పినవాక్యములను, కాణ్వాయనుల యనంతర మాంధ్రరాజులు మాగధమును స్వాధీనము చేసికొనిరని చెప్పినవాక్యములను, క్రమమైనవని విశ్వసించిన వారగుటచేతను, పురాణములలో జెప్పబడిన కాలములనుబట్టి కాణ్వాయనుడగు సుశర్మ చంపబడినది క్రీ.పూ.23వ సంవత్సరమని విశ్వసించినవారగుటచేతను, అశోకుని కాలమునుండి రాజులను సరిపెట్టవలసివచ్చి పురాణములలో జెప్పిన ప్రకారము శ్రీముఖుడు సుశర్మను జంపినది మాత్రమొప్పుకొనక శ్రీముఖుని నశోకుని కాలమునాటికి గొనిపోయి ఈ శాతకర్ణుని ఖారవేలుని కాలమునబెట్టి సుశర్మను జంపుటకు కుంతల శాతకర్ణి, శాతశాతకర్ణి, పులమాయి, వీరిలోనొక్కని నుత్తరవాదిగ జేసి విడిచిపెట్టిరి. పురాణములలో శ్రీశుకుడనియు, శ్రీప్రకుడనియు సింధుకుడనియు వేఱ్వేఱునామములతో బిలువబడిన శ్రీముఖుడు కాణ్వాయనులను నిర్మూలము చేసినవాడని పురాణములన్నియు స్పష్టముగా జెప్పుచుండగా నిరాకరించుటకు హేతువునుజూపలేదు. కాబట్టి స్మిత్తుగారు పురాణములలో నుదాహరింపబడిన శ్రీశాతకర్ణిని ఖారవేలునికి దోడ్పడిన శాతకర్ణికి ముడిపెట్టుటగాని శ్రీముఖుని నశోకుని కాలమునాటికి గొనిపోవుటగాని కాణ్వాయనుల నాశనమున, కుంతల శాతకర్ణి మొదలగు వారియందారోపించుటగాని యుక్తియుక్తముగ గన్పట్టుచుండలేదు. కాన్వాయనుల యనంతరము దేశమును బాలించిన యాంధ్రరాజులను మాత్రమే పురాణములు పేర్కొనుచున్నవి కాని యంతకు బూర్వమాంధ్ర దేశమును బాలించిన రాజులను పురాణములు పేర్కొనియుండలేదు. సుచంద్రుడు విష్ణువు, దీపకర్ణి సాతవాహనుడు, శాతకర్ణియను రాజులు పురాణముల లోని యాంధ్రభృత్య వంశమునకు బూర్వులని కొన్ని గాథలనుబట్టి నిర్ధారణ చేసియుంటిమి. వీరిలో గడపట చెప్పిన శాతకర్ణియె ఖారవేలునకు దోడ్పడినవాడని మా యభిప్రాయము. పురాణములలో జెప్పబడిన యాంధ్రరాజులకు బూర్వమాంధ్ర రాజులనేకులాంధ్రదేశమును బాలించిరని మాకుగల పూర్ణ విశ్వాసమును భట్టిప్రోలు శాసనములుగూడ బలపఱచుచున్నవి.

కుంభీరకరాజు.

కృష్ణామండలములో భట్టిప్రోలను గ్రామముగలదు. అచ్చట బుద్ధునిస్తూపమొకటియున్నది. వానిలో బది శాసనములు గానుపించుచున్నవి. ఈ శాసనములలో నొక రాజుయొక్కయు, అనేక గోష్ఠులయొక్కయు, బౌద్ధభిక్షువులు యొక్కయు నామములు దెలుపబడియున్నవి. కుంభీరకుడను రాజొకడొక బౌద్ధసంఘమునకు నాయకుడుగానుండి బుద్ధాలయమునకు నొక యద్దముల పెట్టెను నొక ఱాతిపెట్టెను దానము చేసినట్లుగ నాఱవ శిలాశాసనమునందును కుంభీరకుడను రాజుయొక్క ప్రేరేపణ చేత బూజనీయుడగు అర్హదత్తునిచే తయారుచేయబడి చిత్రములు చెక్కబడిన బరణియొకటియు, పెట్టెయొకటియు దానము చేయబడినట్లుగ దొమ్మిదవ శిలాశాసనమునందును బేర్కొనబడియుండెను. [12] ఈ శాసనములోని లిపి యశోకుని శాసనములలోని లిపినిబోలి ప్రాచీనమైనదిగాగన్పట్టుచున్నది. వీనిలోనుదాహరింపబడిన కుంభీరకుడను రాజాప్రాంతమున బరిపాలనము చేయువాడై యుండవలయును. ఈ పేరు పురాణములలో గానరాదు. ఈ శాసనములను జక్కగా బరిశోధించిన డాక్టరు బూలరుగారు క్రీస్తు శకమునకు రెండు వందల యేండ్లకు బూర్వముననెగాని తరువాత వ్రాయబడియుండనని నొక్కి వక్కాణించుచున్నారు. కనుక నీ శాసనములలో నుదాహరింపబడిన రాజు కుంభీరకుడనువాడును గోష్ఠులవారును కుటుంబములవారును, బౌద్ధభిక్షువులును అశోకునికి గొంచెమీవలనో ఆవలనో యుండియుందురు. ఈ కుంభీరకుడు గొప్పవాడయినను గాకపోయినను రాజుగా బేర్కొనబడియుండుటచేత నాంధ్రదేశమునంతయుగాని కొంతవఱకుగాని పరిపాలించుచున్న వాడనుట స్పష్టము. కాబట్టి యిట్టి రాజుల పేరులనేకములు పురాణ కర్తలకు దెలియకుండెననుట స్పష్టము. విన్సెంటు స్మిత్తు గారు శ్రీముఖుని మొదటివానిగా జెప్పుటకు బైన జర్చించిన విషయములన్నియు బాధించుచున్నవి. ఈ విషయమున స్మిత్తుగారు త్రొక్కినత్రోవ యనుసరింపదగినది కాదని మా యభిప్రాయము. ఈ పైనుడువబడిన శాతకర్ణి మిక్కిలి ప్రజ్ఞావంతుడును పరాక్రమవంతుడునగుటచేత నేబదియాఱు సంవత్సరములు నిరాఘాటముగ బరిపాలనము చేసియున్నవాడు.

ఆప్లవుడు.

(క్రీ.త. 16 మొదలు 28 వఱకు)

శాతకర్ణి తరువాత నీపేరు గన్పట్టుచున్నది కాని యీతని చారిత్రము దెలియరాదు. ఆపీతకుడని మత్స్యపురాణమును, ఇవిలకుడని విష్ణుపురాణమును, హివిలకుడని భాగవత పురాణమును పేర్కొనుచున్నవి. శాతకర్ణికిని వీనికి నడుమ లంబోదరుడను రాజు పేరు మత్స్యవిష్ణు భాగవత పురాణముల యందు గాన్పించుచున్నది.

కుంతలశాతకర్ణి.

ఈ రాజును మత్స్యపురాణము మాత్రము పేర్కొనియున్నది. వాత్స్యాయనుని కామసూత్రములలో కుంతల శాతకర్ణ శాతవాహనుడు మహాదేవియను మలయావతితోడి కామక్రీడలలో కత్తెరలజంటతో నామెను జంపెనని చెప్పబడియున్నది. ఒక ప్రతిలో మాత్రము మలయావతియని వ్రాయక గణికయని వ్రాయబడియుండెను. గణికయనగా వారకాంత. వారకాంత మహాదేవి కాబోదు. కుంతలశాతకర్ణి కారోపించెడు నీ విషయము కల్పితమైనదగును గాని సత్యమై యుండదు. ఈ కుంతల శాతకర్ణికి బూర్వమునందును తరువాత మేఘస్వా తి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్రస్వాతికర్ణుడు, అను రాజులను మత్స్యపురాణము పేర్కొనుచున్నది. వీరిలో మేఘస్వాతిని మాత్రము విష్ణుభాగవత పురాణములు పేర్కొనుచున్నవి. ఈ రాజులను గూర్చిన శాసనములు గాని చరిత్రముగాని యేవియు గానరావు.

పులమావి.

(క్రీ. త.28 మొదలుకొని 52 వఱకు.)

వీని పేరును వాయు మత్స్య విష్ణు పురాణములు పేర్కొనుచున్నవిగాని భాగవత పురాణము మాత్రము అటమానుడని పేర్కొనుచున్నది. ఈతని చారిత్రమును దెలియదు. పులమావి పేరు మహారాష్ట్రాంధ్ర దేశములలోని కొన్ని శాసనములలో గంపట్టుచున్నదిగాని తరువాత నించుమించుగా నూఱేండ్లకు రాజ్యభారమును వహించి ప్రసిద్ధుడయిన పులమావి యొక్క పేరుగా గన్పట్టుచున్నది. ఈ మొదటి పులమావి చరిత్రమును దెలియరాదు. వీని తరువాత రాజ్యపాలనము చేసినది నెమికృష్ణుడని వాయుపురాణమును "గౌరికృష్ణుడు లేక నౌరికృష్ణుడు" అని మత్స్యపురాణమును, అరిష్ఠకర్మయని విష్ణుపురాణమును, అనిష్ఠకర్మహాలేయుండని భాగవత పురాణమును బేర్కొనుచున్నవి.

హాలశాతవాహనుడు.

(క్రీ. త. మొదలుకొని వఱకును.)

ఈ హాలుడను వాడు విక్రమాదిత్యుని వలెను, భోజమహారాజు వలెను, శ్రీకృష్ణదేవరాయని వలెను ప్రతాపముతోబాటు విద్యాసంపత్తియు బ్రకాశింప దనకీర్తిని భరతఖండము నాల్గుదెసల బఱపినవాడు. ఇతడు విద్వాంసుడగుటంజేసి కవులను పండితులను నాదరించుచువచ్చెను. దేశభాషల యందభిమానము గలిగి గ్రంథములను రచించుయు, రచింపజేసియు, దేశభాషాభివృద్ధి గావించినట్లు గంపట్టుచున్నది. ఇతడు యువరాజుగానుండి ప్రతిష్ఠాన పురముననున్న కాలమున బ్రాచీన మహారాష్ట్ర భాషలో సప్తసతియను నీతిశృంగార కావ్యమును రచించి వన్నెగాంచెను. తన హర్షచరిత్రమునందు బాణకవి శాలివాహన విరచితమైన యీ సప్తశతిని పొగడియున్నాడు. కావ్యప్రకాశికలోను, సరస్వతీ కంఠాభరణములోను, ధనికకృత దశరూపక వ్యాఖ్యానములోను సప్తశతినుండి పద్యములుదాహరింప బడినవి. హేమచంద్రుడు తన దేశకోశమునందు శాలివాహనుడు, హాలుడు, సాలనుడు, కుంతలుడు నాలుగునొక్కని పేరులేయని చెప్పియున్నాడు. శాలివాహన శబ్దము శాతవాహన శబ్దముయొక్క ప్రాకృత రూపమని తన వ్యాకరణమునందు జెప్పియున్నాడు. శాలివాహనుడనగా నితడేయని యిటీవలి వారెందఱో దుర్భ్రమగొనియున్నారు. పైశాచీ భాషలో బృహత్కథను కాతంత్రవ్యాకరణమును రచించిన గుణాఢ్యుడీమంత్రియని చెప్పుచున్నారు గాని యది యెంతమాత్రమును విశ్వసింపదగినదికాదు. సప్తశతిమాత్ర మీ హాలుడు రచించినట్లుగ నా గ్రంథములోనే యున్నది. ఈతని కాలమునందు రాజ్యమంతయు నెమ్మదిగనుండుటచేత నీతడు తన కాలమునంతను విద్యావ్యాసంగమునందే గడిపి సుప్రసిద్ధిని వహించినవాడు గానున్నాడు.

ఆంధ్రరాజ్యకల్లోలము.

హాలుని తరువాత "మాండలకుడు, పురీకసేనుడు, సుందరశాతకర్ణుడు, చకోర శాతకర్ణుడు" అనువారు క్రమముగా నొకరి తరువాత నొకరు రాజ్యమును పరిపాలించిరిగాని యవనపహ్లవశకును లనుమ్లేచ్ఛుల గుంపులువచ్చి దేశముపైబడి యల్లకల్లోలముగావించిన హేతువుచేత వీరి పాలనము శోభించినదికాదు. అశోకుని తరువాత యవనులు (Indo Bactrians) హిందూదేశముపై దండెత్తివచ్చి సింధుకాశ్మీర పాంచాలములజయించి పరిపాలింపసాగిరి కాని కొంతకాలమునకు పహ్లవరాజులు (పార్థియన్ రాజులు) దండెత్తి వచ్చి యవన రాజులను బాఱదోలి యమునాతీరమునందలి మధురా నగరమును తక్షశిలా నగరము రాజధానులుగ జేసికొని పరిపాలించిరి. తరువాత శకనులువచ్చి వారలను జయించి దేశమాక్రమించుకొనిరి. ఈ శకరాజులలో కనిష్కుడు మహాక్షాత్రవంతుడు. ఇతడు బహుదేశములను జయించెను. ఇతడు పురుషపురమును (Modern Peshawar) రాజధానిగ జేసికొని తూర్పున బాటలీపుత్రము వఱకును, పశ్చిమమున హీరతు పట్టణము వఱకును గల దేశమును బాలించుటయెగాక బుద్ధధర్మము నవలంబించి బౌద్ధమత వ్యాపనము గావించి మిక్కిలి ప్రఖ్యాతి గాంచినవాడు. ఇతని కాలముననే శకయవనపహ్లవాదులు సింధుదేశమునుండి దిగువలకు వచ్చి ఘూర్జరము లేక సౌరాష్ట్రము (గుజరాథ్) మాళవము రెండు దేశములలోను స్థిరవాసము లేర్పరచుకొనుటయెగాక యాంధ్రదేశమునందును జొఱబడి కాపురములు గుదుర్చుకొనిరి. భూమకుడను క్షాత్రపుడు సురాష్ట్రమునందును, చస్తనుడను క్షాత్రవుడు మాళవదేశమునందును రాజ్యములను స్థాపించి కనిష్కునకు లోబడి పరిపాలనము సేయుచుండిరి. వీరు పహ్లవులుగా గన్పట్టుచుండిరి. సత్రాపు (Satraps) లను పేరు పారసీకరాజులకు గలదు. ఇంతియగాక వీరి పేరులు యవనుల పేరులంబోలి యుండనందున పహ్లవులుగానే భావింపబడుచున్నారు. అయినను దరువాత వచ్చినవారు హిందువుల సంస్కృత నామములను బెట్టుకొని హిందువుల మతములను హిందువుల యాచారముల నవలంబించి మతాచార విషయములయందు హిందువులకంటెను బట్టుదలతో వ్యవహరించిరి. ఆ కారణముచేత నీ మ్లేచ్ఛ జాతుల వారెల్లరును హిందూజాతులలో మగ్నులైపోయిరి. ఇట్లు విదేశస్థులయిన యవనపహ్లవశకునులు తండోప తండములుగా దేశములో జొఱబడి దేశస్థులగుటచేత నాంధ్రరాజులకు బరిపాలనము కష్టసాధ్యముగ నుండెను. మాండలకుడు మొదలగు రాజులు మ్లేచ్ఛులతో బోరాడి యదరంగములవలె వచ్చుచుండెడి మ్లేచ్ఛసమూహములను నిలుపజాలకపోయిరి. కొంతకాలమాంధ్రదేశముయొక్క పశ్చిమ భాగము (ఇప్పటి మహారాష్ట్రదేశము) అరాజకమైయుండెను. పూర్వభాగమున గూడ పహ్లవులు జొఱబడి రాజధాని సమీపమున జేరి తొందరలు కలిగించుచున్నను శివస్వాతియను రాజు రాజ్యభారమును పూనిన తరువాత నల్లరులనడంచి పరిపాలింపసాగెను గాని పశ్చిమభాగమున మాత్రము తన యధికారమును ప్రతాపమును జూపి యరాజకత్వమునుబాపి వశపఱచుకొని పరిపాలించుటకు సావకాశము చిక్కకపోయెను.

క్షహరాటాసహపానా.

కనిష్కుని మరణానంతరము ఘూర్జరమును బరిపాలించుచున్న క్షహరాటానహపానుడనువాడు స్వతంత్రుడై మహాక్షాత్రపుఁడను బిరుదును వహించి యాంధ్రులను మహారాష్ట్ర దేశమునుండి పాఱఁదోలి యాభాగమునంతయు స్వాధీనము చేసికొని తన యల్లుఁడగు ఋషభదత్తుని రాజప్రతినిధిగఁజేసి నిరంకుశముగ బరిపాలింపసాగెను. ఈ రాజులు దేశమున స్థిరపడిన తరువాత నార్యహిందువులయొక్క బోధనలచే స్వమతాచార సాంప్రదాయములను విడిచిపెట్టి హిందూనామములను హిందూమతాచారములనవలంబించి బ్రాహ్మణులను మంత్రులనుగా నియమించుకొనుచువచ్చిరి. ఆర్యబ్రాహ్మణులు క్షాత్రపులను మ్లేచ్ఛరాజుల సహాయముతో బ్రాహ్మణమతమును వ్యాపింపజేయుచు బౌద్ధులకు బ్రతిస్పర్థులుగ నున్నను అప్పటికింకను బౌద్ధులును బ్రాహ్మణులును నొండొరుల బలద్విరోధులుగ నెంచుకొనక సహనముతో నుండిరి. ఆయముడను బ్రాహ్మణుడు క్షహరాటాసహపానుననకు మంత్రిగానుండెను. ఋషభదత్తుడు సేనాధ్యక్షుడుగానుండెను. దక్షమిత్రయను దనకొమార్తెను ఋషభదత్తునికిచ్చి వివాహముచేసి వానికి సైన్యాధిపత్యముపట్టముగట్టెను. నాసిక పట్టణములోని గుహలలోవ్రాయబడిన శాసనముల వలన నీ క్షాత్రపుల చారిత్రముకొంత బోధపడుచున్నది. ఒక గుహలో నాలుగు శాసనములున్నవి. వానిలో మొదటి శాసనములో గోవర్ధనములోని త్రిరాస్మి శిఖరము మీద నీ గుహయును చెఱువులును దినికుని పుత్రుడును క్షహరాటసహపానుని జామాతయు పరోపకారియునైన ఋషభదత్తుని ప్రేరేపణచే నిర్మింపబడెనని చెప్పబడినది.[13]

ఋషభదత్తుని ధర్మకార్యములు.

మఱియు ఋషభదత్తుని ధర్మకార్యములీ క్రిందివి పేర్కొనబడియుండెను. ఋషభదత్తుడు బ్రాహ్మణులకు మూడులక్షల గోదానములు చేసెను; యాత్రికుల కనుకూలముగ నుండునట్లు వారణాన్యనదికి మెట్లవరుసను (సోపానములను) గట్టించెను; దేవాలయులకు బ్రాహ్మణులకు పదునాఱుగ్రామములు దానముచేసెను; ప్రతి సంవత్సరము లక్ష బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను; ప్రభాసపట్టణమున (సోమనాథపట్టణము) బ్రాహ్మణు లెనమండుగురకు తన సొంతసొమ్ము వెచ్చఁబెట్టి వివాహములను గావించెను; భరుకచ్చము (Bharoch) నందు చతురస్రములను, గృహములను, విశ్రాంతిప్రదేశములను నిర్మించెను; మాళవములోని దశపురమునందును, గోవర్థనము నందును, శూర్పరాగమునందును (The modern supara near Bassein) ఆరామముల నిర్మించి బావులను చెఱువులను త్రవ్వించెను; ఠాణా సూరతులకు నడుమనుండు ఇవా, పారదా, దమనా, తాపీ, కరవేణా, దాహనుకానదులలో రేవుపడవలను బెట్టించెను. ఈ నదుల కిరుప్రక్కలను బాటసారులకొఱకు విశ్రాంతి గృహములను చలివేంద్రలను (పానీయశాలలు) గట్టించెను; నామంగోల గ్రామములోని పిండితకావాడ, గోవర్ధనము, సువర్ణముఖము, శూర్పరాగము రామతీర్థములలోను చారణులకొఱకును , పరిషత్తుల కొఱకును (Vedic schools of Brahmans) కొన్ని ధర్మకార్యము లాచరించెను; మలయలచే ముట్టడింపబడి చెఱబెట్టబడిన యుత్తమభద్రులను క్షత్రియజాతి నాయకుని విడిపించుటకై తన ప్రభువు నాజ్ఞప్తిని శిరసావహించి యొక సంవత్సరమున వర్షకాలములో దండయాత్ర వెడలెను; ఋషభదత్తుని రణభేరీధ్వని వినంబడినతోడనే మలయలు వెన్నిచ్చి పారిపోయిరి. ఉత్తమభద్రులకు మలయలు వశులగునట్లు చేసెను; అక్కడనుండి ఋషభదత్తుడు పుష్కరిణికిబోయి స్నానాదికృత్యములు గావించి బ్రాహ్మణులకు మూడువేల గోవులను నొక గ్రామమును దానముచేసెను.”

ఈ పై శాసనమునుబట్టి యీ ఋషభదత్తుడు బ్రాహ్మణ మతాభిమానమును, బ్రాహ్మణ భక్తియు గలవాడని తేటపడుచున్నను బౌద్ధ మతమును గాని, బౌద్ధులనుగాని తిరస్కరించి యుండలేదు. రెండవ శాసనములో బౌద్ధభిక్షువులకు జేసిన ధర్మకార్యములుదాహరింపబడినవి. ఋషభదత్తుడు శకనృపకాలము 42వ సంవత్సరమున నాల్గుదెసలనుండి వచ్చెడి బౌద్ధసన్న్యాసులయుప యోగార్థమై గుహావిహారమును (Cave monastery) వారలకు సమర్పించెను; సంవత్సరమునకు నూరు కర్షపణములు వడ్డిరాగల రెండువేల కర్షపణములను గోవర్ధనములోని నేతగాండ్ర కూటమికడ నుంచెను; వర్షకాలములో తాను నిర్మించిన విహారములో నివసించెడు నిరువది బౌద్ధమతాచార్యులకొక్కొక్కనికి నొక్క దుప్పటమును వడ్డి సొమ్ములోనుండి కొనియీయవలసినదిగా నాజ్ఞచేసెను; ఈ సొమ్ములోనుండియే యితర వస్తువులనుగూడ వారలకు గొని యీయవలయును; ఈ యాజ్ఞలు గోవర్ధనములోని పౌరసభవారిచే (Corporation) తీరుమానింపబడి విహారముయొక్క తలుపుమీద లిఖింపబడినవి; శకనృపకాలము 40, 41 సంవత్సరములలో విశేషధనమును బ్రాహ్మణులకును దేవతలకును దానముచేసెను" [14] మూడవ శాసనములో ఋషభదత్తుని భార్య దక్షమిత్రయొక్క ధర్మకార్యమొకటి యుదాహరింపబడినది గాని యా శాసనము మిక్కిలి చిన్నది. [15] నాలుగవ శాసనము చాలవఱకు శిధిలమైపోయినదిగాని యదియును ఋషభదత్తుని ధర్మకార్యములను ప్రశంసించుచున్నది. [16]

బొంబాయి రాజధానిలో కార్లి గుహలో నొక బౌద్ధాలయముగలదు; అందొక శాసనముగలదు; వానిలో వాలురాకాపర్వత విహారములోని బౌద్ధభిక్షువుల పోషణార్థము కొఱకు కార్జిక గ్రామమును వారలకు దానము చేసినట్లుగ వ్రాయబడియున్నది.[17] నాసిక శాసములలోని మొదటిదానిలో బేర్కొనబడిన ధర్మకార్యములవంటివాని వృత్తాంతము గూడ వ్రాయబడియున్నది. [18] జున్నారులోని యొక శాసనములో మహాక్షాత్రపుడు క్షహరాటాసహపానాయొక్క బ్రాహ్మణమంత్రియగు "ఆయమ" యనువాడు చెఱువునొకదాని త్రవ్వించుటకును సభాభవన మొకదాని నిర్మించుటకును ప్రేరకుడయ్యెనని వ్రాయబడియున్నది. ఈ తడు ఐత్సగోత్రుడని చెప్పుటచేత బ్రాహ్మణుడుగ బరిగణింపబడెనని భాండార్కురుగారు వ్రాసియున్నారు.

కాలనిర్ణయము.

ఋషభదత్తుని శాసనములలో గొన్న 40, 41, 42 సంవత్సములలో వ్రాయబడినవనియు, సహపానుని మంత్రియగు ఆయమునియొక్క శాసనము 46వ సంవత్సరమున వ్రాయబడినదనియు, చెప్పియుండుటచేత నీ సంవత్సరములు శకనృపకాలమునకు సంబంధించినవిగ గన్పట్టుచున్నవి గనుక క్రీ.శ.124వ సంవత్సర ప్రాంతమున క్షహరాటాసహపానా యను మహాక్షాత్రవుడు మహారాష్ట్ర దేశమును బాలించుచుండెనని చెప్పవచ్చును.

శివస్వాతికర్ణుడు.

(క్రీ.శ.109 మొదలుకొని క్రీ.శ.130 వఱకు.)

పశ్చిమాంధ్రదేశమున (మహారాష్ట్రమును) పైజెప్పిన సహపానుడు రాజ్యము చేయుచున్న కాలమునందు శివస్వాతియను శాతవాహనుడు పూర్వాంధ్రదేశమును బరిపాలించుచుండెనని స్పష్టముగ జెప్పవచ్చును. బహు శతాబ్దములనుండి యాంధ్రరాజుల సంరక్షణము క్రిందనుండి పరరాజుల వలన గాని పరదేశీయుల వలనగాని బాధింపబడక కష్టములెట్టివో యెఱుంగకయుండిన యాంధ్రులనడుమ వేషభాషమతాదులచే వేఱుపడి భరతఖండముయొక్క తీక్ష్ణతరమైన యుష్ణస్థితికి దూరగులై దేహదార్ఢ్యమును బాహుబల సంపన్నతయు, పౌరుషమునుగల జాతులవారగు యవశకపహ్లవాదులు మిడతల దండులవలె తండోపతండములుగా వచ్చి నివసించియుండుటచేత గొంతకాలము దేశమున కలవరము గలిగియున్నప్పుడు శివస్వాతి తన భుజపరాక్రమముచేత మ్లేచ్ఛజాతులవలన స్వదేశస్థులకు నే యుపద్రవమును గలుగకుండ గాపాడి రాజ్యపాలనము చేసినది శ్లాఘాపాత్రముగా నుండెనుగాని తనకు బూర్వమునందుండిన మాండలకుడు మొదలగు రాజులు పశ్చిమాంధ్రదేశమును క్షాత్రవులకు గోల్పోవుటచే శాతవాహన వంశమునకు గలిగిన యపకీర్తిని బాపుకొనలేక పోయినది యొక కొఱతగానె గన్పట్టుచుండెను. అయినను శివస్వాతి తన చేతనైనది యేమొ చేసియుండెను గాని కేవలము భీరువువలె నుండియుండలేదు. పైజెప్పిన విదేశరాజులు హిందూమతాచారముల నవలంబించి నాగరికులై పరిపాలింప సామర్థ్యము గలిగియుండుటకు విశేషకాలము పట్టకపోయినను స్వజాతిజనులు హిందూమతాచారముల నవలంబించి హిందువులలో గలిసిపోవుటకు విశేషకాలము పట్టకపోదు. అట్టి సమ్మేళన కాలమున దేశమున గలవరము జనించుట సహజమెగాని వింతకాదు. ఈ మ్లేచ్ఛజాతుల వారు హిందువులనడుమ గొంత కాలము నివసించియుండి క్రమముగా గొందఱు జైనమతమును, కొందఱు బౌద్ధమతమును విశేషసంఖ్యగలవారు శైవమతావలంబకులైరి గాని వారి దేహములందు మ్లేచ్ఛరక్తము ప్రవహించుచుండుటచేత నప్పటప్పట ఆంధ్రరాజులకు నధికశ్రమ కలుగ జేయుచునేయుండిరి.

శైవమత విజృంభణము.

శైవమతము మొదటననార్యులలో నుద్భవించి యార్యులచే నంగీకరింపబడి సంస్కరింపబడిన తరువాత కొంతకాలము వఱకు బౌద్ధమతముతో సమానగౌరవమును గాంచుచు విశేషజనానురాగమును సంపాదించి వర్థిల్లుచుండెను. ఆర్యులకనార్యులకు శైవమతము నడుమబ్రవేశించి సంబంధ బాంధవ్యముల గలుపుచుండెను. ఆర్యులు శైవమతము నాదరించుటచేత ననార్యులనేకులందు ముఖ్యముగా నాంధ్రద్రావిడులు శైవమతావలంబనము చేసి తన్మూలమున నార్యాచారముల గొంతవఱకు నవలంబించుచు నార్యులకు వశులై వర్తించుచుండిరి. ఆర్యులు శైవులను వశపఱచుకొని బౌద్ధులపై బురికొల్పి బౌద్ధులధికారుమును దేశమున దొలగింప సర్వవిధముల బాటుపడుచుండిరి. బ్రాహ్మణప్రేరితులై శైవమతాచార్యులనేకులు దేశమునడుమ నివసించుచుండిన యవనశకపహ్లవాదిమ్లేచ్ఛజాతులను శైవమతావలంబకులనుగాజేసి తమలో గలుపుకొనుచుండిరి. ఆర్యులభాషావాఙ్మయము దేశమున వ్యాపించుచుండెను. నాటనుండియు శైవము వీరశైవమగుచు జైనబౌద్ధమతములకు ప్రతిస్పర్థిగనుండెను. ఆర్యులు కేవలము శైవులలో గలియకపోయినను వారి దేవతల నార్యదేవతలను గానంగీకరించి పూజించుచుండుటచేతను అట్లుబుద్ధదేవుని పూజింపకుండుట చేతను శైవులు సాధారణముగా బ్రాహ్మణ పక్షపాతులై యుండుచువచ్చిరి. ఆంధ్ర రాజధానీ నగరమగు ధాన్యకటకమునకు దక్షిణభాగమున జైనబౌద్ధశైవమతములవలంబించిన పహ్లవాదులు వేనవేలు నివసించుచు గ్రమముగా నాంధ్రులలోగలసిపోయి యాంధ్రపహ్లవు లనంబడుచుండిరి. ఈ యాంధ్రపహ్లవులే పల్లవులైరి. ఈపల్లవులు నివసించుప్రదేశమే పల్లవనాడను పేరంబిలునంబడు చుండెను. ఈ పల్లవనాడే నేడు పల్నాడని పిలువంబడుచు గుంటూరుమండలములో నున్నది.

  1. Mr.V.A.Smith's Early History of India, pp.193-194.
  2. Ibid. p.193
  3. J.Burgess- The Buddhist sutpas of Amaravathi and Jaggayyapeta p.61.
  4. J.R.A.S. Vol.IV, p.287, Jour Bom. branch Roy. As. soc Vol.XII p.404 and Vol.XIII, p.310, 312.
  5. No.6, Nasik Inscriptions Vol.VII Jour B.B.R.A.S. and p.338 Tran's, Oriental Congress 187.
  6. Sir Walter Elliots Numismata Orientalia , p.13
  7. Indian Antiquary Vol.V. The Kalinga Edicts, pp.82-102; Dr.Buhler's Translations in Burgess's Amaravati, pp.125-131; Rulers of India Series - Asoka. pp.134-138. Mr.Smith's Early History of India, p.156. See also the map of the Empire of Asoka in the same book.
  8. Vish Pur vol ii, pp.156-166; See Prof H.H.Wilson's Essays Analitical sc vol.II, p.329, note on verse 99 of the Translation of Meghaduta.
  9. Comparative Grammar of Dravidian Languages, p.549
  10. Dr. R.G.Bhandarkar's article, June, 1909. The Indian Review Vol.X. no.6;
  11. The Tamils :- Eighteen Hundred years ago.
  12. Epigraphia Inica Vol.II, p.326-329. Bhattiprolu Inscriptions by Dr.G.Buhler. C.I.E.
  13. No.17, Nasik Inscriptions Vol.VII., Jour. B.B.R.A.S. and p.338. Trans oriental Congress. 1874.
  14. Nos 18 and 16. Nasic Inscription; Ibid.
  15. 1st part of No.16, Ibid;
  16. No.14, Ibid.
  17. No.13, Karli Inscriptions Arch snrv w, Ind No.10
  18. No.25 Junnar inscriptions, Ibid.
---